రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జులై 2024, గురువారం

1444 : హాలీవుడ్ రివ్యూ!


 

దర్శకత్వం : జార్జ్ మిల్లర్
తారాగణం : అన్యా టేలర్ జాయ్, క్రిస్ హేమ్స్ వర్త్, చార్లీ ఫ్రేజర్, ఐలా బ్రౌనీ, చార్లీజ్ థెరాన్, టాం బర్క్ తదితరులు
రచనా : జార్జ్ మిల్లర్, నికో లాథౌరిస్, సంగీతం: టామ్ హోల్కెన్‌బర్గ్, ఛాయాగ్రహణం: సైమన్:
బ్యానర్స్ :  కెనెడీ మిల్లర్ మిషెల్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్
స్ట్రీమింగ్ : జులై 4, బుక్ మై షో
***

            2015లో విడుదలైన  మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్యాక్షన్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్  ఫ్యూరియోసా: మ్యాడ్ మాక్స్ సాగా’. ఆస్ట్రేలియన్ దర్శకుడు జార్జ్ మిల్లర్ గత 45 సంవత్సరాల నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తూనే వున్నాడు. 1979 లో మొదటి  మ్యాడ్ మాక్స్’(తెలుగులో చిరంజీవితో యమకింకరుడు’), 1981 లో మ్యాడ్ మాక్స్ 2 : ది రోడ్ వారియర్’, 1985 లో మ్యాడ్ మాక్స్ : బియాండ్ థండర్ డోమ్’, 2015 లో మ్యాడ్ మాక్స్ : ఫ్యూరీ రోడ్’, ఇప్పుడు 2024 లో ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా మొదలైనవి. మెల్ గిబ్సన్ మొదటి మూడిట్లో టైటిల్ పాత్ర పోషించాడు. నాల్గవ ఫ్రాంచైజీలో టామ్ హార్డీ టైటిల్ పాత్ర పోషిస్తే, ఇప్పుడు ఐదవ ఫాంచైజీలో అన్యా టేలర్ జాయ్ పోషించింది. ఇవి ప్రధానంగా ఇకోసైడ్ (పర్యావరణ హననం) అనంతర జీవన్మరణ పోరాట రోడ్ యాక్షన్ మూవీస్. నాల్గవ భాగానికి ముందు కథ (ప్రీక్వెల్) గా వచ్చిన ఈ  అయిదవ భాగం గత మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, జులై 4 నుంచి బుక్ మై షోలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ   

పర్యావరణం హరించుకుపోయి, నీరూ తిండి గింజలు లభించక భూమి ఎడారిగా మారిన సుదూర భవిష్యత్తులోకి తొంగిచూసే కథ ఇది. మళ్ళీ మానవ నాగరికత జీరోనుంచి ప్రారంభమవుతూ, జీవన్మరణ పోరాటం చేస్తున్న సమూహాల మధ్య వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్న సమయం. అయితే ఆస్ట్రేలియాలో గ్రీన్ ప్లేస్ అనే ప్రాంతం మాత్రం క్షామాన్ని తట్టుకుని మంచి నీరుతో, పచ్చటి పొలాలతో మిగిలివుంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఆవాసాలేర్పర్చుకున్నాయి. ఇక్కడి ఫ్యూరియోసా (చైల్డ్ ఆర్టిస్టు ఐలా బ్రౌనీ), వాల్కైరీ అనే ఇద్దరు పిల్లలు అడవిలోకి వెళ్ళి  చెట్లకి కాసిన పళ్ళు కోసుకుంటున్నప్పుడు, ఫ్యూరియోసాకి దూరంగా విశ్రమించిన బైక్ రైడర్లు కనిపిస్తారు. వాళ్ళు గ్రీన్ ప్లేస్ వైపే వచ్చి కబ్జా చేస్తారని భావించిన ఫ్యూరియోసా, ధైర్యం చేసి వాళ్ళ బైకుల్లో పెట్రోలు తీసేస్తున్నప్పుడు దొరికిపోతుంది.
       
దీంతో ఫ్యూరియోసాని
తమ నాయకుడు డిమెంటస్ (క్రిస్ హేమ్స్ వర్త్) కి బహుమతిగా అందించాలని తీసికెళ్ళిపోతూంటే ఆమె తల్లి మేరీ (చార్లీ ఫ్రేజర్) వెంబడిస్తుంది. డిమెంటస్‌ స్థావరంలో ఫ్యూరియోసాని  గ్రీన్ ప్లేస్ లొకేషన్‌  చెప్పమని బాధిస్తున్నప్పుడు మేరీ ఎటాక్ చేసి తీసికెళ్ళి పోతుంది. డిమెంటస్ ఆమెని వెంబడించి దారుణంగా ఫ్యూరియోసా కళ్ళముందే చంపేస్తాడు. దీనికి ముందు ఫ్యూరియోసాకి మేరీ ఎలాటి నిస్సారవంతమైన భూమిలోనైనా మొలకెత్తే విత్తనాన్ని ఇస్తుంది.
       
బాల్యంలో ఈ అనుభవంతో ఫ్యూరియోసా తన తల్లిని చంపిన డిమెంటస్ మీద ప్రతీకారంతో పెరుగుతుంది. రాజ్యాలు మారుతూ మగపిల్లవాడి వేషంలో ఎదిగి
, 15 సంవత్సరాల తర్వాత ధైర్యసాహసాలున్న యువతి (అన్యా టేలర్ జాయ్) గా డిమెంటస్ మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలెడుతుంది.

రెండున్నర గంటల ఇన్నోవేటివ్ యాక్షన్!

సూటిగా చెప్పుకుంటే ఇది తల్లిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకునే కథ. దీని బ్యాక్ డ్రాప్ భవిష్యత్తులోకి తీసికెళ్ళి చూపించే, మృతప్రాయంగా మిగిలిన పర్యావరణంతో  ఏడారులుగా మారిన భూభాగాలపై తిండి కోసం, నీటి కోసం జరిగే యుద్ధాలతో విస్తృత కథ. డిమెంటస్ రాజ్యం ఒకటి, సిటాడెల్ రాజ్యం ఒకటి, వీళ్ళకి గ్రీన్ ప్లేస్ ఎక్కడుందో లొకేషన్ కావాలి. అది చెప్పదు ఫ్యూరోసియా. ఆమె తల్లి ఎలాటి ఎడారిలోనైనా మొలకెత్తే విత్తనం ఒకటి ఇస్తుంది. డిమెంటస్ ని చంపి పగ దీర్చుకున్నాక, ఆ విత్తనంతో  ముగింపు సీను పోయెటిక్ గా వుంటుంది...
        
ఇందులో దాదాపు ఫస్టాఫ్ ఫ్యూరియోసా  బాల్యం గురించే వుంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఎదిగిన ఫ్యూరియోసా పాత్రలో అన్యా టేలర్ జాయ్ వస్తుంది. అక్కడ్నుంచి పగదీర్చుకునే ఆమె కథ మొదలవుతుంది. ఇలా దాదాపు ఫస్టాఫ్ వరకూ ప్రధాన పాత్ర బాల్యాన్నే చూపడం ఈ సినిమాలోనే చూస్తాం. ఇదొక కొత్త ప్రయోగమేమో.
       
ఈ కథ ఐదు చాప్టర్లుగా వుంటుంది.
ప్రతి ఒక్కటి మునుపటి దానికన్నా దిట్టంగా వుంటుంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్, సౌండ్ అన్నీ వినూత్నంగా వుంటాయి. యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవల్లో వుంటాయి. వార్ రిగ్ చేజ్ సీను, మోటరైజ్డ్ పారాషూట్‌లతో దాడి చేసేవారిని తప్పించుకునే థ్రిల్లింగ్ రైడర్ సీన్లు జలదరింపజేస్తాయి. యాక్షన్ ఆర్టిస్టులు గాలిలో  డ్యాన్స్ చేస్తూ, ఉత్కంఠరేపే ఖచ్చితత్వంతో, టైమింగ్ తో దూసుకుపోతున్న ట్రక్కుని క్రాస్ చేస్తున్నప్పుడు కలిగే థ్రిల్ మాటల్లో చెప్పలేం. అధ్యంతం  ఎడారి రోడ్ల మీద చిత్ర విచిత్ర విడిభాగాలు కూడేసి నిర్మించుకున్న వాహనాల ఛేజింగులే ఈ సినిమా. మొదట్నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలంటే వాహనాల ఛేజింగులే. ఈ ఛేజింగుల్ని  సినిమా సినిమాకీ కొత్త అయిడియాలతో సృష్టించడం జార్జ్ మిల్లర్ మేధకి అద్దం పడతుంది. 
       
హీరోయిన్ ఫ్యూరియోసా పాత్రలో అన్యా టేలర్
, జాయ్, విలన్ డిమెంటస్ పాత్రలో  క్రిస్ హెమ్స్ వర్త్ గుర్తుండిపోయే కొన్ని దృశ్యాలకి నటననంతా ధారబోశారు.  ఇతర పాత్రల్లో ప్రతిఒక్కరూ, సైన్యాల పాత్రల్లో జూనియర్ ఆర్టిస్టులూ ఈ మంటలు చిమ్మే మెగా యాక్షన్ సాగా లో ప్రాణాలకి తెగించి చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
       
దూసుకెళ్తున్న వార్ రిగ్ మీద దాడి చేసే యాక్షన్ సీనుని 200 మంది ఫైటర్లతో 78 రోజులు షూట్ చేసినట్టు దర్శకుడు జార్జ్ మిల్లర్ చెప్పాడు. ఇలాటి షూటింగ్ విశేషాలెన్నో వున్నాయి. ఇది రెండున్నర గంటల ఇన్నోవేట్ (నూతన కల్పన) చేసిన హైపర్ యాక్షన్ మూవీ.
45 ఏళ్ళుగా మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తున్న ఆస్ట్రేలియన్ జార్జి మిల్లర్ దర్శకుడిగా ఔట్ డేటెడ్ అయిపోకుండా, ఇప్పుడొస్తున్న హాలీవుడ్ సినిమాలకి తీసిపోకుండా తీశాడు. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మాక్స్ సాగా తప్పక చూడాల్సిన ఫ్యూచరిస్టిక్ సినిమాల్లో ఒకటి.

—సికిందర్

1, జులై 2024, సోమవారం

1443 : మలయాళం రివ్యూ!

 

దర్శకత్వం : విపిన్ దాస్
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్
రచనా : దీపూ ప్రదీప్, సంగీతం : అంకిత్ మీనన్, ఛాయాగ్రహణం : నీరజ్ రేవీ
బ్యానర్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్,4 ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు :  సుప్రియా మీనన్, ముఖేష్ మెహతా, సీవీ పార్థసారథి
విడుదల : జూన్ 28, 2024 (అమెజాన్ ప్రైమ్)
***

        టీవల పెద్ద హిట్టయిన ఆడుజీవితం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మూడు హిట్టయిన సినిమాల దర్శకుడు, నటుడు  బేసిల్ జోసెఫ్ జోడీగా నటించిన గురువాయూరంబాల నడాయిల్ (గురువాయూర్ ఆలయం) మలయాళ మూవీ, 2024 మేలో విడుదలై ఈ సంవత్సరం హిట్టయిన 8 మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ సహా. దీని దర్శకుడు విపిన్ దాస్ మూడు హిట్లు తీసి, నాల్గవ హిట్ తో ముందుకొచ్చాడు. పెళ్ళి చుట్టూ ఓ కామెడీ తీసి హిట్ చేసిన ఈ దర్శకుడి కళ ఏమిటో తెలుసుకుందాం...

కథ
గురువాయూర్ కి చెందిన వినూ రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్) దుబాయిలో ఉద్యోగం చేస్తూంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్) తో నిశ్చితార్థం జరుగుతుంది. జంషద్ పూర్ లో అంజలి అన్న ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఉద్యోగం చేస్తూంటాడు. అతడితో వినూకి సన్నిహిత పరిచయమేర్పడుతుంది. వినూ పూర్వం పార్వతి (నిఖిలా విమల్) ని ప్రేమించి విఫలమయ్యాడు. ఆమె మోసం చేసిందని కోపం పెంచుకుని ముందుకు సాగలేక పోతూంటాడు. గతాన్ని మర్చిపొమ్మని వినూకి ఆనంద్ నచ్చజెప్తాడు. ఆనంద్ కి కూడా ఓ సమస్య వుంటుంది. భార్య పార్వతికి ఒక ప్రేమలేఖ రావడంతో గొడవపడి పుట్టింటికి పంపేశాడు. ఇది తెలుసుకుని వినూ ఆనంద్ కి నచ్చజెప్పి పార్వతిని తెచ్చుకునేలా చేస్తాడు.
       
ఇలా పరస్పరం ఇద్దరి సమస్యలు తీర్చుకున్నాక
, వినూ పెళ్ళికి బయల్దేరి వచ్చి ఆనంద్ ని కలుస్తాడు. కలిస్తే అతడి భార్య మరెవరో కాదు, తనని మోసం చేసిన పార్వతే. ఈ మోసగత్తె కుటుంబంతో పెళ్ళి వద్దనుకుని ఫ్రెండ్స్ సహాయంతో తన పెళ్ళి చెడగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో అంజలికి దొరికిపోయి విషయం చెప్పేస్తాడు. అంజలి అతడ్ని పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్తుంది. రాజీ పడతాడు.

ఇంతలో పెళ్ళి చెడగొట్టడానికి ముందు ఒప్పుకోని వినూ ఫ్రెండ్ ఒకడు, ఇప్పుడు ఆనంద్ దగ్గరికెళ్ళి- మీ ఆవిడకి వినూ మాజీ ప్రియుడని చెప్పేస్తాడు. దీంతో అసలే కోపిష్టి అయిన ఆనంద్ అతడ్నీ, వినూనీ పట్టుకుని చిత్తుగా తన్ని పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు.
       
వినూ ఎదురు తిరిగి అనుకున్న ముహూర్తానికి గురువాయూర్ ఆలయంలో నీ చెల్లెలికి తాళి కట్టేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఎలా కడ్తావో చూస్తానని ఆనంద్ ఎదురు ఛాలెంజీ చేస్తాడు. ఇప్పుడేం జరిగింది
? ఇప్పుడు తన చెల్లెలితో వినూ పెళ్ళిని చెడగొట్టడానికి ఆనంద్ ఏఏ విఫల యత్నాలు చేశాడు? ఇంకా వినూ పాత విరోధులు ఒకరొకరే ముందుకొచ్చి పెళ్ళిని చెడగొట్టడానికి ఏఏ పథకాలేశారు? ఎప్పుడో గతంలో ఫ్రెండ్ శరవణన్ (యూగిబాబు) శోభనం రాత్రి పాల గ్లాసులో గొడ్డు కారం వేసి పెళ్ళి చెడగొట్టిన వినూ జీవితంలోకి ఆ శరవణన్ కక్ష గట్టుకుని పెళ్ళికి వచ్చి ఏం చేశాడు? గురువాయూర్ ఆలయంలో రసాభాస ఎలా జరిగింది? డ్రోన్ వచ్చి తాళినెలా ఎగరేసుకుపోయింది? అప్పుడేం జరిగింది? ఆనంద్ భార్యకి ప్రేమ లేఖ రాసిందెవరు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

 వెడ్డింగ్ కామెడీ కథ ఇది. ఇందులో ప్రేమలు, డ్యూయెట్లు, ప్రేమలో సమస్యలు వగైరా వుండవు. అందుకని ఇది రోమాంటిక్ కామెడీ గానీ, రోమాంటిక్ డ్రామా గానీ కాదు. నేరుగా పెళ్ళి కథ మాత్రమే చెప్పదలిచాడు. కాబట్టి ఇందులో రోమాంటిక్ కామెడీ లేదా రోమాంటిక్ డ్రామా తాలూకు సీన్లని జొరబడనీయలేదు. వాటిని ఫిల్టర్ చేసి స్పష్టంగా వెడ్డింగ్ కామెడీ జా నర్ మర్యాదకి ఏం ఎలిమెంట్స్ కావాలో అవి మాత్రమే ప్రయోగించాడు. ఇది ప్రధానంగా పెళ్ళికి అటూ ఇటూ జట్టు కట్టిన శక్తులు సృష్టించే కాన్ఫ్లిక్ట్ చుట్టూ తిరిగే కథ. అందుకని ఈ కాన్ఫ్లిక్టే హైలైట్ అయ్యేలా రెండు మూడు వేర్వేరు సీన్లని కలిపి ఇంటర్  కట్స్ లో చూపిస్తూ థ్రిల్ నీ, స్పీడునీ, కామెడీనీ పెంచుతూ పోయాడు. దీంతో పాటు కథనంలో డైనమిక్స్ ని ప్రయోగించాడు. ఒక సీన్లో అనుకూలంగా జరిగితే వెంటనే తర్వాతి సీన్లో వ్యతిరేకంగా జరిగే డైనమిక్స్. ఈ ఇంటర్ కట్స్ తో బాటు డైనమిక్స్ వల్ల కథనంనిత్యం చలనంలో వుంటూ, ఫైర్ అవుతూ వుంటుంది. దీంతో ఈ రెండుంపావు గంటల వెడ్డింగ్ కామెడీ మంచి వినోద కాలక్షేపంలా తయారయ్యింది.
       
ఫస్టాఫ్ వినూ పాత్ర ఇష్టం లేని తన పెళ్ళిని చెడగొట్టుకునే కథ
, సెకెండాఫ్ పెళ్ళికి సిద్ధ పడితే ఇతరులు ఆ పెళ్ళిని చెడగొట్టే కథ. ఈ రెండిటి మధ్య నలిగే వినూ కామెడీ పాట్లు. మధ్యలో తనతో విశసంగా లేదని భావిస్తున్న భార్య పార్వతితో ఆనంద్ పాట్లు. ఈ పాయింటుతో ఆనంద్- వినూల మధ్య శతృత్వం. ఈ గొడవల్లో వినూతో లేచిపోతనని పెళ్లికూతురు అంజలి బ్లాక్ మెయిల్. ఈ ప్రధాన పాత్రల చుట్టూ చేరి  రసాభాస చేసే ఇతర  పాత్రలు. ఈ పాత్రల్లో ఒక ఆడ పాత్ర కూడా వుంటే కాన్ఫ్లిక్ట్ కి యూత్ అప్పీల్ వచ్చేది.
       
క్లయిమాక్స్ గురువాయూర్ టెంపుల్ లో యాక్షన్ సీన్లు
, డ్రోన్ ఎంట్రీ, తాళి గల్లంతు వగైరా. ఆద్యంతం నవ్వించడమే పనిగా పెట్టుకున్న ఈ వెడ్డింగ్ కామెడీ ప్రియదర్శన్ కామెడీ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది.

నటనలు –సాంకేతికాలు

పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పటిలాగే హుషారుగా పాత్ర పోషించాడు. కోపిష్టి పాత్ర కావడంతో బల ప్రయోగం కూడా చేస్తాడు. ఎత్తుగడలు వేసినప్పుడు యాక్షన్ లోకొచ్చి కథని మలుపులు తిప్పుతూంటాడు. ఈ కథకి హీరో బేసిల్ జోసెఫ్. పృథ్వీరాజ్ వ్యతిరేక పాత్ర. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణతో నడుస్తూంతుంది కథ. పృత్వ్హీరాజ్ సీరియస్ పత్రాయితే జోసెఫ్ కామెడీ పాత్ర. ఈ డైనమిక్స్ కూడా బాగా పనికొచ్చాయి. జోసెఫ్ కామెడీ పాట్లు సున్నిత హాస్యంతో తెలివిగా నటించాడు.
       
పృథ్వీరాజ్ భార్యగా ఆకాశరామన్న ప్రేమ లేఖతో అపార్ధానికి గురయిన పాత్రలో నిఖిల జరుగుతున్న తతంగం సీరియస్ గా గమనిస్తూ వుంటుంది. ఎక్కువ మాట్లాడదు. జోసెఫ్ పెళ్ళి చేసుకునే అంజలి పాత్రలో అనస్వర  కేర్ ఫ్రీగా వుంటుంది. ఇక అటూ ఇటూ కుటుంబ పాత్రలు
,  వూళ్ళో మేకవన్నె పులుల్లాంటి పాత్రలూ చాలా వున్నాయి.
       
ఇక పాటలు
, లొకేషన్లు, కెమెరా వర్క్ సున్నిత కామెడీకి తగ్గట్టు సాఫ్ట్ గా కనిపిస్తాయి.       కథనానికి దర్శకుడు విపిన్ దాస్ వాడిన క్రియేటివిటీయే ఈ వెడ్డింగ్ కామెడీకి బాక్సాఫీసు బలాన్నిచ్చింది.

—సికిందర్