రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

1402 : రివ్యూ

రచన- దర్శకత్వం: దుష్యంత్ కె

తారాగణం : : సుహస్, శరణ్యా ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : వాజిద్ బేగ్, కూర్పు : పవన్ కళ్యాణ్
బ్యానర్స్: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్
సమర్పణ: బన్నీ వాసు, వెంకటేష్ మహా
నిర్మాత
లు: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి
విడుదల : ఫిబ్రవరి2, 2024


***

        త సంవత్సరం రైటర్ పద్మభూషన్ అనే హిట్ లో నటించిన హీరో సుహాస్, ఈసారి గ్రామీణ నేపథ్యంలో మూస ఫార్ములాకి దూరంగా వాస్తవిక సినిమాతో వచ్చాడు. దీనికి దుష్యంత్ కె కొత్త దర్శకుడు. అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ టైటిల్.  గత నెల సంక్రాంతి సినిమాల తర్వాత ఈ నెల ఆరంభంలో విడుదలైన ఈ తాజా సినిమా కథాకమామీషు చూద్దాం...

కథ
2007 లో అంబాజీపేట దగ్గర్లో ఓ గ్రామం. అక్కడ తండ్రితో కలిసి సెలూన్ నడుపుకునే మల్లి (సుహాస్) బాబాయ్ అని పిలుచుకునే ఓనర్ కి చెందిన బ్యాండు మేళంలో పనిచేస్తూంటాడు. అతడికి తల్లి దండ్రులతోబాటు గ్రామంలోనే టీచరైన అక్క పద్మ(శరణ్యా ప్రదీప్) వుంటుంది. ఇదే గ్రామ పెద్ద వెంకట్ (నితిన్ ప్రసన్న) వూళ్ళో భారీ వడ్డీలకి అప్పులిస్తూ దోపిడీ చేస్తూంటాడు. పద్మకి ఇతనే టీచరుద్యోగం ఇప్పించాడు. ఈమెకి వెంకట్ తో ముడి పెట్టి గ్రామంలో చెవులు కొరుక్కుంటూ వుంటారు. ఇతడికి గ్రామంలోనే చదివే లక్ష్మి (శివానీ నాగారం) అనే చెల్లెలుంటుంది. ఈమె, మల్లి ప్రేమించుకుంటూ వుంటారు. ఇలా వుండగా, వెంకట్ తమ్ముడితో మల్లికి, పద్మకి గొడవలవుతూ వుంటాయి.
        
ఒకరోజు వెంకట్ కి చెల్లెలితో మల్లికున్న వ్యవహారం తెలిసి పగతో రగిలిపోతాడు. దీంతో పద్మ బట్టలు లాగేసి పరాభవిస్తాడు. మల్లిని పట్టుకుని గుండు గీసేస్తాడు.

దీంతో మల్లీ పద్మా ఇద్దరూ వెంకట్ మీద పోరాటానికి దిగుతారు. ఈ పోరాటం ఎన్ని మలుపులు తిరిగి ఏ ముగింపుకి దారి తీసిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

గ్రామంలో వర్గ విభేదాల పాత కథే. పై వర్గం, కింది వర్గం ఘర్షణలతో ఈ మద్య సినిమాలు వస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ లో కూడా ఇదే చూశాం. ముగింపు తెలంగాణ దొరల సినిమాలు, తర్వాత గ్రామ ప్రెసిడెంట్ సినిమాలు ఏ ముగింపుతో వుంటాయో అదే ఇందులో వుంటుంది. పై వర్గం మీద హింసతో కింది వర్గం తిరుగుబాటు, పై చేయి వగైరా. చివరికి ఇందులో గ్రామ పెద్దకి వేసిన శిక్ష, ఇలా పీడించే వాళ్ళకి చేసిన హెచ్చరికా వాస్తవ దూరంగా వుంటాయి. గ్రామ పెద్ద అంటే కింది నుంచీ పైదాకా విస్తరించిన ఒక పూర్తి బలమైన వ్యవస్థ.  అలాటి వ్యవస్థని పక్కనబెట్టి సినిమాటిక్ పరిష్కారం చూపించారు. తమిళనాడులో మొన్న దేశాధ్యక్షురాలికి కేంద్ర ఆర్ధికమంత్రి మీద ఫిర్యాదు చేస్తూ కింది వర్గానికి చెందిన ఉన్నతాధికారి లేఖ రాస్తే, అతడికేం గతి పట్టిందో తెలిసిందే. ఎల్లుండి రిటైర్ అవబోతాడనగా సస్పెండ్ అయిపోయి, పెన్షన్ గిన్షన్ గాలికెగిరిపోయి వీధిన పడ్డాడు. ఇంత అనుభవంలో ఇతను ప్రోటోకాల్ అన్న విషయమే మర్చిపోయి ఆవేశపడ్డాడు.
        
ఇలాటి ఆవేశంతోనే ఈ కథలో టీచర్ పద్మ పరాభవం, పతనం కొని తెచ్చుకుంది. టీచర్ గా ఆలోచనకన్నా ఆవేశమే ఎక్కువ, నోటి దురుసుతో బాటు. తనకి ఉద్యోగం వేయించిన గ్రామపెద్ద వెంకట్ తో అనవసర ఘర్షణ. అతను సిమెంట్ బస్తాలు స్కూల్లో పెడితే నచ్చజెప్పే పద్ధతి వుంటుంది. లెక్కచేయకుండా మాట్లాడితే, ప్రవర్తిస్తే, పైగా ఆ తమ్ముడు వెంకట్ చెల్లెల్నే ప్రేమిస్తే- వూరుకుంటాడా? గ్రామంలో అక్కకి సంబంధం అంటగట్టి గ్రామస్తులు అనుకున్నారు. వెంకట్ కి అలాటి ఆలోచనలే వుండవని, తను కింది వర్గం ఆడవాళ్ళ మీద చేయి వేసేంత అర్హత ఆ ఆడవాళ్ళకి లేదనీ వెంకట్ పాత్రని చూపించారు. అలాంటప్పుడు పనిమాలా మంట వేసింది అక్కాతమ్ముళ్ళయితే, పూర్తి సానుభూతి వాళ్ళ మీద కలిగేలా కథ చేయడం ఇందులో చూడొచ్చు. వాస్తవిక సినిమాలో వాస్తవికత ఆలోచించకుండా ఈ సినిమా చూస్తే ఇది హిట్ సినిమానే.

ఫస్టాఫ్ మల్లి- లక్ష్మిల ప్రేమకథ ప్రధానంగా సాగుతుంది. మల్లి అతడి నేస్తం, మల్లి కుటుంబం, గ్రామ పెద్ద వెంకట్ కుటుంబం పరిచయాలతో, వాళ్ళ కార్యకలాపాలతో, మల్లి నేస్తం మల్లి అక్క పద్మ మీదున్న మూగ ప్రేమతో, బ్యాండు మేళం కార్యక్రమాలతో సాగుతూ- వెంకట్ కి చెల్లెలి వ్యవహారం తెలిసిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ కి ముందు వస్త్రాపహరణతో వెంకట్ పద్మని పరాభవించడం, మల్లికి గుండు గీయడం వంటి భారీ ట్రాజడితో ఫస్టాఫ్ ముగుస్తుంది.
        
సెకండాఫ్ పరస్పరం కేసులు పెట్టుకోవడం, బ్యాండు మేళంతో మల్లి - పద్మలు వెంకట్ ఇంటి ముందు ధర్నాకి కూర్చోవడం, ఒక ఉద్యమంలా చేయబోవడం వంటి రొటీన్ బలహీన కథనంతో సాగి, వెంకట్ చెల్లెలి పెళ్ళికి పూనుకోవడంతో, పోలీస్ స్టేషన్లో తన ఛాతీ మీద ఎగిరి తన్నిన పద్మ మీద ఫైనల్ గా ప్రతీకారం తీర్చుకునే వెంకట్ పథకంతో,  క్లయిమాక్స్ కి చేరుకుంటుంది. చావుకళలన్నీ పద్మ ప్రవర్తనతో తెలిసిపోతూనే వుంటాయి.
        
తెలిసిన గ్రామ కక్షల పాత కథే ఇది. కాకపోతే వాస్తవికత, పాత్రచిత్రణలు పట్టించుకోకుండా పైపైన చూసేస్తే అంతా బావుంటుంది.

నటనలు-సాంకేతికాలు

కమర్షియల్ మసాలా పాత్రలకి వ్యతిరేకంగా తనదో పంథాని ఏర్పర్చుకున్న హీరో సుహాస్ కిది అవార్డు సినిమా కావొచ్చు. వాస్తవిక సినిమా పాత్రని సహజత్వంతో బాగా నటించాడు. అక్క పరాభవం నుంచి పుట్టే భావోద్వేగాల ప్రదర్శనని చివరి దాకా అదుపుతప్పి ఓవరాక్షన్ కి పోకుండా నేర్పు కనబర్చాడు. హీరోయిన్ శివానీతో ఫస్టాఫ్ లో రోమాన్స్ మాత్రం ఒక బలహీన ఎపిసోడ్. వెంకట్ తో తన అక్కకి ముడిపెట్టి వూరంతా అనుకుంటూ వుంటే, ఆ వెంకట్ చెల్లెలితో తాను ప్రేమాయణం సాగిస్తాడు. పట్ట పగలు ఆమెని సెలూన్ కి రప్పించి తలుపేసుకుంటూ వుంటే ఎవరూ చూడరు. ఆ టైంలో రోడ్డు ఖాళీ చేయిస్తున్నట్టున్నాడు డైరెక్టరు.
        
రాజశేఖర్ పిచ్చోడైన గుండు పాత్రతో నటించిన మలయాళం రీమేక్ శేషు (2002) ని గుర్తుచేసేలా సెకండాఫ్ గుండు పాత్రతో సుహాస్ బాగానే నటించాడు గానీ, అసలా విలన్ వెంకట్ తన గుండు గొరిగెయ్యడం తన కులవృత్తికే ఘోర అవమానంగా తీసుకోవడం మర్చిపోయాడు. 
       
ఈ గొడవలన్నీ చూసి హీరోయిన్ శివానీ సెకండాఫ్ ప్రారంభంలోనే లవ్ ట్రాక్ నుంచీ
, కథలొంచీ తప్పుకునే, వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయే పాత్ర. ఆమె ప్రేమ బలం ఇంతే. అసలు అక్కకి జరిగిన అవమానానికి వెంకట్ మీద అంత పగబట్టిన సుహాస్, అతడి చెల్లెల్ని ఎందుకు వదులుకుని కన్నీరు కారుస్తాడో అర్ధంగాదు. విలేజి గర్ల్ గా శివానీ కూడా బాగా నటించింది.
        
ఇక రెబెల్ లాంటి టీచర్ పద్మ పాత్రలో శరణ్యా ప్రదీప్ సుహాస్ కి సమాన నిడివిగల ప్రాధాన్యమున్న పాత్ర. ఆత్మగౌరవ పోరాటం చేసే పాత్రలో సుహాస్ కి పోటీనిస్తూ నటించింది. ఇంత పాత్రకి ముగింపులో కథకుడి  జెండర్ వివక్ష కనిపిస్తుంది. అలాగే గ్రామ పెద్ద వెంకట్ పాత్రలో నితిన్ ప్రసన్న ప్రభావం చూపిస్తాడు. అయితే తన మానాన తానుంటూ వుంటే అతడ్ని పాపం రొచ్చులోకి లాగి డెమనైజ్ చేసేశాడు దర్శకుడు.
       
టెక్నికల్ గా
, రూరల్ సంగీతం పరంగా, నేటివిటీ పరంగా, కథకి తగ్గ విలువలతో వుంది సినిమా. మూడు నాల్గు చోట్ల బలమైన డైలాగులున్నాయి. కొత్త దర్శకుడు నటుల్ని గాకుండా పాత్రల్ని చూపించడంలో, నటనల్ని రాబట్టుకోవడంతో మంచి ప్రతిభ కనబర్చాడు.

—సికిందర్