జనవరి 26 గణతంత్ర దినోత్సవ
ఆనందోత్సాహాల మధ్య గాంధీ విషాదాన్ని వైరల్ చేస్తూ, దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ 'గాంధీ గాడ్సే - ఏక్ యుద్ధ్' విడుదల చేశాడు. పని గట్టుకుని ఇదే రోజు విడుదల చేయడంలో
తనకున్న ఏదో కమిట్ మెంట్ ని సినిమాతో కూడా చూపలేకపోయాడు. ఆయన చూపిందేమిటో, మనం చూసిందేమిటో
మహాత్ముడికే తెలియాలి. ఇందులో గాంధీగా దీపక్ అంతానీ,
గాడ్సేగా చిన్మయ్ మాండ్లేకర్ నటించారు. ఛాయాగ్రహణం రిషీ పంజాబీ, సంగీతం ఏఆర్ రెహ్మాన్ సమకూర్చారు. నిర్మాత మనీలా సంతోషీ. నిడివి 110
నిమిషాలు. ఈ సినిమాతో సంతోషీ భావజాల మేంటో తెలుసుకుందాం...
కథ
దేశ విభజన, దాంతో
మతకల్లోలాలు, హిందువుల హత్యలూ ఇవన్నీ చూసిన నాథూరాం గాడ్సే
దీనికి కారణం గాంధీయేనని నిర్ణయించుకుంటాడు. 1948 జనవరి 30 న గాంధీ మీద కాల్పులు జరుపుతాడు. గాంధీ బ్రతుకుతాడు. ఇక కాంగ్రెస్‌తో
తన సంబంధాలని తెంచుకుని, గ్రామాల్ని స్వావలంబన
దిశగా ప్రేరేపించడానికి గ్రామ స్వరాజ్ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఇంతలో సమాజం గాడ్సే పాల్పడ్డ
చర్యని సమర్ధిస్తూ, గాంధీకి
వ్యతిరేకంగా ప్రజల మనోభావాల్ని మల్చేందుకు ప్రయత్నాలు
ప్రారంభిస్తుంది. గాంధీ జోక్యం
చేసుకుని అరెస్టయి పోతాడు. గాడ్సే వున్న జైల్లోనే గాంధీ బందీ అవుతాడు. దీంతో
ముఖాముఖీ అయిన ఇద్దరి మధ్యా భావజాలాల సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ సంఘర్షణ ఏ ముగింపుకి
చేరిందన్నది కథ.
ఇది అస్ఘర్ వజహత్ రాసిన Godse@Gandhi.com అనే హిందీ నాటకానికి దర్శకుడు
రాజ్ కుమార్ సంతోషీ చిత్రానువాదం. నాటకం పీడీఎఫ్ నెట్ లో వుంది. పుస్తకం అమెజాన్
లో వుంది. నాటకం మొదటి సీనులో ఆసుపత్రిలో కోలుకుంటున్న గాంధీ దగ్గరికి నెహ్రూ
వచ్చినప్పుడు, గాడ్సే వివరాలు తెలుసుకుని, గాడ్సేని
కలవాలనుకుంటున్నట్టు చెప్తాడు గాంధీ. నెహ్రూ కంగారుపడి, ‘అతను మిమ్మల్ని చంపాలనుకున్నాడు’ అంటాడు. ‘అందుకే కలవాలనుకుంటున్నాను’ అంటాడు గాంధీ. ‘ఇది వింటే దేశం మొత్తం ఆందోళన చెందుతుంది’ అంటాడు
నెహ్రూ. ‘మనిషి దేవుడి ఉత్కృష్ట సృష్టి. వాళ్ళు అర్ధం
జేసుకోవడానికి సమయం పడుతుంది, నేను వెళ్తాను’ అని కచ్చితంగా చెప్పేస్తాడు గాంధీ.
కానీ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ నాటకంలో
పై సీనులోని చివరి మాటల ప్రాధాన్యాన్ని గుర్తించి, దీనితో
సినిమా కథ నడిపించకుండా నాటకాన్నే అనుసరించడంతో, అసలేం
చెప్పాలనుకుంటున్నాడో అర్ధంగాని పదార్ధంగా తయారైంది సినిమా. గాంధీ -గాడ్సే
భావజాలాల యుద్ధంగా సినిమా తీశాడు. ఈ యుద్ధం ఎలా ముగిసిందనేది మాత్రం చెప్పడంలో
విఫలమయ్యాడు.
రెండు భిన్న దృక్కోణాలని
చిత్రిస్తున్నప్పుడు తన దృక్కోణం కూడా స్పష్టం చేసే దిశగా దృక్కోణాలు సాగాలి. కథంటే
తప్పొప్పుల జడ్జి మెంట్ అయినప్పుడు సారాన్ని జడ్జిమెంట్లోకి మళ్ళించి ముగించాలి.
గాంధీ ఒప్పా, గాడ్సే ఒప్పా అనేది అతివాదులతో ఎన్నటికీ తెగని
చర్చ. అసలు గాడ్సేకి భావజాలమేంటి? అతను టెన్త్ ఫెయిలై చదువు మానేశాడు.
మహాత్మా గాంధీ మునిమనవడు, ప్రముఖ రచయిత తుషార్
గాంధీ రాసినట్టుగా, గాడ్సే చదువు సంధ్యల్లేని వాడు. ఆవేశపరుడు. పరుషంగా
మాట్లాడతాడు. గాడ్సే కోర్టులో ఇచ్చిన వ్రాతపూర్వక వాంగ్మూలాన్ని మాయం చేశారని, దాంతో
గాడ్సే వాదం ప్రపంచానికి తెలియకుండా పోయిందనీ. ఉరి తీసే ముందు నేరస్థుడికి కూడా
చివరి కోరిక తీరుస్తారని, ఆ చివరి కోరిక తీర్చడానికే గాడ్సే
వాంగ్మూలాన్ని బయట పెడుతున్నాననీ సంతోషీ చెప్పుకున్నాడు.
కానీ తుషార్ గాంధీ అది కచ్చితంగా
గాడ్సే రాసిన వాంగ్మూలం కాదని రాశాడు. అతడికో భాషగానీ,
శైలిగానీ లేవనీ; చెత్తగా, దుర్భాషలాడుతూ, బెదిరింపుగా రాస్తాడనీ, ఆ పత్రం చాలా తెలివిగా ఉదారవాద
మనస్సుల్ని కూడా ప్రభావితం చేయడానికి గాడ్సే గురువు వినాయక్ దామోదర్ సావర్కర్
రూపొందించాడనీ, హిప్నటైజ్ చేసేలా రాసే సంపూర్ణ పాండిత్యం అతడికుందనీ తుషార్
రాశాడు.
ఇక గాడ్సే ధైర్యం
కూడా ఎలా వుందో చూస్తే, గాంధీని చంపడానికి ముందు చేసిన
హత్యాప్రయత్నంలో అతను స్వయంగా చంపడానికి వెళ్ళ లేదు. అయిదుగురు సభ్యులతో పథకం వేసి, తను దూరంగా వుండి చూస్తూ, గాడ్గే అనే సభ్యుడ్ని
చంపడానికి పంపాడు. గాడ్గే విఫలమై పోలీసులకి దొరికిపోయాడు. గాడ్సే పారిపోయాడు.
ఫైనల్ గా గాడ్సే గాంధీని చంపినప్పుడు లొంగిపోలేదు. పారిపోతూంటే పోలీసులు
పట్టుకున్నారు. భావజాలానికి నిలబడ్డ వాడైతే పారిపోడు,
లొంగిపోయి సమర్ధించుకుంటాడు. కాబట్టి అతడి భావజాలమంటూ సినిమా తీయడంలో అర్ధమేముంది. అసలతడి భావజాలమేమిటి? ఈ
సినిమాలో నెహ్రూ పాత్ర అంటాడు, ‘నాధూరామ్ గాడ్సేగా మారడానికి ఎవరికైనా కేవలం ఒక రోజు మాత్రమే
పడుతుంది, కానీ గాంధీగా మారడానికి మొత్తం జీవిత కాలం పడుతుంది’ అని. ఏమిటి గాడ్సే జీవితం? ఏమిటి
అతడి భావజాలం?
గాడ్సే భావజాలమంటూ ప్రచారం చేస్తూ
గాంధీని ఎండగడుతున్న నడుస్తున్న చరిత్రకి ప్రభావితమవుతున్న ప్రజలకి ఇప్పటికైనా
గాంధీ అర్ధమయ్యేలా సినిమా తీయాల్సింది. నాటకం పై సీనులో- ‘మనిషి
దేవుడి ఉత్కృష్ట సృష్టి. వాళ్ళు అర్ధం జేసుకోవడానికి సమయం పడుతుంది, నేను వెళ్తాను’
అని గాంధీ అన్నట్టు- ప్రజలు అర్ధం
జేసుకోవడానికి ఇంకెంత సమయం పట్టాలి? ఈ పాయింటుని
కాన్సెప్టుగా చేసుకుని కథ నడిపిడి వుంటే ప్రజలకి గాంధీ అర్ధమయ్యే అవకాశం
ఇప్పటికైనా లభించేది. ఒక హంతకుడు కరెక్ట్ కాదని హతుడి పక్షాన మాట్లాడాల్సి రావడం
ప్రపంచంలో ఎక్కడా జరగదు.
గాంధీ గాడ్సే ని జైల్లో
కలుసుకున్నాక వాదోపవాదాలు చూస్తే- సినిమా అంతటా గాడ్సే అవే నాలుగు విషయాలు రిపీట్ చేస్తూంటాడు -హిందూ, హిందుత్వ, అఖండ భారత్, పాకిస్తాన్ కి 55 కోట్లు ఇవ్వడం అంటూ. గాంధీ గాడ్సేని దేశం
గురించి తన అభిప్రాయం చెప్పమంటాడు. జైలు గోడకున్న 'అఖండ భారత్' మ్యాప్ ని గాడ్సే చూపిస్తాడు. ప్రజల విశ్వాసాన్ని
పొందకుండా దేశాన్ని ఏర్పాటు చేయలేమని గాంధీ అంటాడు. నువ్వింకా ఈ దేశంలోని చాలా ప్రాంతాల్ని చూడను కూడా చూడలేదని
అంటాడు. ‘తుమ్ బినా దేఖే, బినా జానే ప్యార్ కర్తే హో?’ (నువ్వు దేన్నయినా చూడకుండానే,
తెలుసుకోకుండానే ప్రేమిస్తావా?) అని ప్రశ్నిస్తాడు.
‘నువ్వు హిందుస్థాన్ ని అల్పంగా
చూపిస్తున్నావ్. హిందూ మతాన్ని అల్పమైనదిగా చేస్తున్నావ్. నువ్వు బ్రిటిష్ వారిపై
రాయి కూడా వేయకుండా నన్ను చంపడానికొచ్చావ్’ అని గుర్తు చేస్తాడు గాంధీ. దీనికి గాడ్సే దగ్గర సమాధానముండదు.
గాడ్సే భావజాలం హిందుస్థాన్నీ, హిందూ మతాన్నీ బలహీనపరిచిందనీ, దేశాన్ని
శతాబ్దాలుగా నిర్వచించిన సమ్మిళిత సంస్కృతీ భావనకి హాని చేసిందనీ గాంధీ
అన్నప్పుడు- నడుస్తున్న చరిత్రని గుర్తు చేస్తుంది.
తను ముస్లింల సంతుష్టీకరణకి
పాల్పడినట్టు అభియోగాలు మోపినప్పుడు, తను పరిరక్షించడానికి పాటుబడ్డ విభిన్న సంస్కృతుల భారతాన్ని కూడా అర్థం చేసుకోవడానికి
దేశవ్యాప్తంగా పర్యటించమని గాడ్సే ని కోరతాడు గాంధీ.
ధైర్యం లేకపోవడాన్ని కప్పిపుచ్చడానికి అహింసా వాదాన్ని రుద్దవద్దని
గాడ్సే అంటాడు. మీ సత్యాగ్రహ నిరసనలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో కూడిన మానసిక
హింసేనని తిప్పికొడతాడు.
హిందువుల్ని ద్వేషించి, ముస్లిములని ప్రేమిస్తున్నందుకు అఖండ భారత్ విభజనకి గాంధీయే కారణమని - పసలేని అరిగిపోయిన వాదన తప్ప గాంధీకి
వ్యతిరేకంగా మరే వాదననీ సంతోషీ నిలబెట్టలేకపోయాడు.
వాస్తవానికి గాడ్సే
దృక్కోణంలో ఈ కథ చెప్పాడు. గాడ్సే తనని తాను వివరించుకోవడానికి, తన సిద్ధాంతాల్ని ప్రదర్శించుకోవడానికి -హిందుత్వాన్ని రక్షించడమనే వంకతో హత్యని సమర్థించుకునే ప్రయత్నం చేసే చిత్రణ
ఇది.
ప్రారంభంలో గాడ్సే ఇమేజీని జాతీయవాద దేశభక్తుడి స్థాయిలో చూపించడానికి, గాంధీని హిందూ వ్యతిరేక వ్యక్తిగా
పెంచి చూపడం చేస్తాడు. ‘నేను గర్వించే జాతీయవాది చేసే
పని మాత్రమే చేస్తున్నాను. మీరు హిందువులకి, హిందూ మతానికీ వ్యతిరేకం. దేశానికి స్వాతంత్ర్యం వైపు దిశానిర్దేశం చేసినందుకు
నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. కానీ మీరు ముస్లింల పక్షం వహించడం క్షమించరానిది. అందుకే మీరు చనిపోవాలి’ అని వాదిస్తాడు గాడ్సే. ఇంతకంటే కాన్వాస్ లేదు
గాడ్సే వాదానికి.
నాటకంలో చూస్తే ని గాడ్సేని
నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వుండే వ్యక్తిగా
చూపించారు. ఇది సినిమాలో చేర్చకపోవడం వల్ల గాడ్సే పాత్రకి మరింత వెయిట్ వచ్చినట్టయింది.
చివరికేమిటంటే, ఏమీ
తేల్చకుండా ముగుస్తుంది. జైల్లో గాంధీ మీద ఇంకో హత్యా ప్రయత్నం జరగడం, దాన్నుంచి గాడ్సే గాంధీని కాపాడ్డం జరిగి, ఇక మీరే
అర్ధం జేసుకోండనీ చేతులెత్తేస్తాడు సంతోషీ!
గాంధీని చదివితే, గాంధీ గాడ్సేని కలవడానికి జైలు కెళ్తాడా అనిపిస్తుంది. తన మీద హత్యా
ప్రయత్నం జరిగినప్పుడల్లా (5 సార్లు) – ‘వాళ్ళు పిల్లలు, ఈ ముసలాడిని ఎప్పటికైనా అర్ధం
జేసుకుంటారు’ అనేవాడు క్షమా గుణంతో గాంధీ. ఇప్పుడు దర్శకుడు
రాజ్ కుమార్ సంతోషీ, రచయిత అస్ఘర్ వజహత్ ప్రభృతులు గాంధీ
దగ్గరికి వెళ్ళి అడిగితే, ‘గాడ్సే
దగ్గరికి నేనెందుకు వస్తాను, వాణ్ని క్షమించాను ఫో!’ అనే అంటాడు. గాంధీని వీళ్ళు కూడా అర్ధం జేసుకోలేదు.
—సికిందర్