రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 27, 2023

1295 : స్పెషల్ న్యూస్!


 

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య’, వీరసింహా రెడ్డి వసూళ్ళ తుఫాను బాలీవుడ్ వర్గాల్ని విస్మయపర్చి- ఇలాటి వరద తామెప్పుడు చూస్తామాని అసూయ చెందిన వెంటనే పఠాన్ ఆ కరువు తీర్చేసింది. థియేటర్లు క్రిక్కిరిసిపోయాయి. మూతబడ్డ థియేటర్లు తెర్చుకుని కళకళలాడాయి. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 215 కోట్లు కలెక్షన్లు వచ్చిపడ్డాయి. దేశవ్యాప్తంగా మొదటి రోజు 55 కోట్లు, రెండో రోజు 69 కోట్లు (గోదీ మీడియా టైమ్స్ నౌ ప్రకారం) కలిపి 124 కోట్లతో అన్ని రికార్డుల్ని చెరిపేసి మెగా బ్లాక్‌బస్టర్ గా ఘన విజయాన్ని చాటింది.

వాల్తేరు వీరయ్య అయినా, వీరసింహా రెడ్డి అయినా, పఠాన్ అయినా ఒకటే గుర్తు చేస్తున్నాయి - సినిమా ఆత్మ మల్టీప్లెక్సులతోనే లేదనీ , అల్పాదాయ వర్గాల సింగిల్ స్క్రీన్ థియేటర్లతోనూ వుందనీ. రెండూ కలిస్తేనే సినిమాలకి మనుగడనీ. రెండూ కలిసేలా  సినిమాలు తీస్తేనే భవిష్యత్తు. గత రెండేళ్ళుగా బాలీవుడ్ చాలా కష్టాల్లో కూరుకుపోయిందనేది తెలిసిందే. చాలా పెద్ద బ్యానర్ సినిమాలకి  ప్రేక్షకులు లేకపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అదే సమయంలో అనేక థియేటర్లకి తాళాలు కూడా పడ్డాయి. కానీ షారుఖ్ ఖాన్ పఠాన్ ఈ మూతపడిన థియేటర్లకి అనూహ్యంగా వ్యాపారం తెచ్చిపెట్టింది. 
     
పఠాన్ విడుదలతో ఉత్తరాదిలోని 25 సింగిల్ స్క్రీన్ థియేటర్లు తిరిగి తెర్చుకున్నాయి. రాజస్థాన్ లో 7, మధ్యప్రదేశ్ లో 3, గోవాలో 1, ముంబయిలో 1, ఛత్తీస్ ఘర్ లో 1, ఉత్తరాఖండ్ లో 1... వీటన్నిటినీ తలదన్నేలా కరుడుగట్టిన మత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 11 సింగిల్ స్క్రీన్ థియేటర్ల తలుపులు బార్లా తెర్చుకున్నాయి. మాకు అచ్చే దిన్ (మంచి రోజులు) వచ్చాయని  సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సంబరాలు ఎన్నాళ్ళు? ఇలాటి సినిమాలు రెగ్యులర్ గా వస్తూండాలిగా. అమీర్ ఖాన్ చూస్తే ఎవరికీ పట్టని లాల్ సింగ్ చద్దా అని గడ్డం సవరించుకుంటూ క్లాస్ సినిమా తీస్తాడు. అక్షయ్ కుమార్ చూస్తే కాషాయ జెండా ఎగరేస్తూ ఎజెండా సినిమాలు తీస్తాడు.
    
మంచి కంటెంట్ లేకపోవడంతో చాలా థియేటర్లు చాలా కాలం క్రితం మూబడ్డాయనీ, పఠాన్ సింగిల్ స్క్రీన్ సినిమాల ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి రప్పించే పెద్ద ఎంటర్‌టైనర్ కావడంతో థియేటర్లు తిరిగి తెరచుకున్నాయనీ ఉత్తరప్రదేశ్ కి చెందిన  ఒక ఎగ్జిబిటర్ అభిప్రాయపడ్డాడు. ఇదే కోవలో మాస్ ఎంటర్ టైనర్లు మార్చిలో అజయ్ దేవగణ్ భోలా’, ఏప్రెల్ లో సల్మాన్ ఖాన్ - వెంకటేష్ ల కిసీ కా భాయ్ -కిసీ కి జాన్ రాబోతున్నాయనీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
        
ఇవి కేవలం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఎక్కువ మంది ప్రేక్షకులకి సంబంధించిన సినిమాలు. సింగిల్ స్క్రీన్స్ కి సహాయం చేస్తాయి. మొత్తం బాక్సాఫీసు  వసూళ్ళకి దోహదపడతాయి అని ఇంకో ఎగ్జిబిటర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సర్కస్, లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, షంషేరా ఇవేవీ సింగిల్ స్క్రీన్ సినిమాలు కావన్నాడు.
        
గణాంకాల ప్రకారం 15-20 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు గత రెండేళ్ళలో మూతపడ్డాయి. దేశంలో సింగిల్ స్క్రీన్‌ల సంఖ్య 2018-19 లో సుమారు 8,500 నుంచి  2022 లో సుమారు 6,200కి పడిపోయాయి. సింగిల్ స్క్రీన్‌లు సగటున మొత్తం దేశపు బాక్సాఫీసు వ్యాపారానికి 35 శాతం దోహదం చేస్తాయి.  మిగిలిన 65 శాతం మల్టీప్లెక్సుల  నుంచి వస్తున్నాయి. 

ఇక ట్రెండ్ మారుతుందా?
   పఠాన్ తో బాలీవుడ్‌లో మరింత మంది నిర్మాతలు యాక్షన్ చిత్రాల్ని  రూపొందించడానికి ప్రేరణ పొందుతారనీ, పఠాన్ చాలా కాలం తర్వాత మంచి వసూళ్ళు రాబడుతున్న తొలి యాక్షన్ సినిమా అనీ, దీంతో ఖాయిలాపడిన బాలీవుడ్ కి ముందుకి వెళ్ళే మార్గం తెలిసిందనీ, ఇక బాలీవుడ్ నుంచి మరిన్ని యూనివర్సల్, మరిన్ని యాక్షన్, ఫ్రాంచైజీ సినిమాలు వస్తాయనీ తాము ఆశిస్తున్నామనీ, ఇది సింగిల్ స్క్రీన్స్ కి బాగా తోడ్పడుతుందనీ ఇంకో ఎగ్జిబిటర్ వివరించాడు.
        
పఠాన్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. ఉదయం 6 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి కూడా షోలు వేస్తున్నారు. సినిమా చూసి జనాలు డ్యాన్సులు చేయడం, ఈలలు వేయడం చివరి సారిగా ఎప్పుడు జరిగిందో గుర్తు లేదు. వీటి వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. థియేటర్ల లోపల ఈ పూనకాలు వాల్తేరు వీరయ్య’, వీర సింహారెడ్డి ల విషయంలోనూ చూశాం. దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి పూనకాలు రీలోడింగ్ అవుతోంది. దేశ నాడిని పట్టుకుంటున్న చిరంజీవి, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్- ఈ సీనియర్లు లేకపోతే సినిమాలు ఓటీటీల్లో ఇళ్ళలోనే మగ్గుతాయన్నట్టుంది పరిస్థితి.
        
సింగిల్ స్క్రీన్ థియేతర్లంటే విద్యార్ధులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు, బస్తీ ఆవారాలు, మస్తీ నిశాచరులు, ఇంకా ఎందరో అథోజగత్ సహోదరులుతో కూడిన అల్పాదాయ వర్గాలు. వీళ్ళకి చౌకలో సినిమాలని అందించేది సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కానీ వీళ్ళకి దూరంగా మల్టీప్లెక్సుల కోసం మల్టీప్లెక్స్ సినిమాలు తీస్తే కలెక్షన్స్ లో 35 శాతం కోత పెట్టుకుంటున్నట్టే వుంది పద్ధతి.

ఆర్ధికమే కాదు, సామాజికం కూడా
అయితే పఠాన్ ఆర్ధికంగా బాలీవుడ్ కి ప్రాణం పోయడమే కాదు, దేశ సామాజిక ముఖచిత్రాన్ని కూడా చూపిస్తోంది. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తూండగానే, ఇటు షారుఖ్ ఖాన్ దేశం కలిసే వుందని చూపించేశాడు. పఠాన్ విడుదలకి ముందు బాయ్ కాట్ పిలుపులతో, టీవీ చానెళ్ల డిబేట్స్ లో దుష్ప్రచారాలతో, అసాధారణమైన అడ్వాన్స్ బుకింగ్‌ల నివేదికలు ఒఠ్ఠి పీఆర్ స్టంట్‌లు తప్ప మరేమీ కాదన్న బుకాయింపులతో, సాధ్యమైనంత వరకూ దేశాన్ని విభజించి వుంచాలన్న ప్రయత్నాలతో అట్టుడికింది. పదివేల పోస్టర్లు చించేశారు. కనబడితే షారుఖ్ ని నిలువునా తగులబెట్టేస్తామన్నారు. పఠాన్ ని కొట్టేవాళ్ళు బాలీవుడ్ లో తమ వాళ్ళ పొట్టలే కొడుతున్నామని తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. బాబాలు, సాధ్వీలు రామనామ జపం మానేసి పఠాన్ ని జపించడం మొదలెట్టారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, హోమ్ మంత్రులు కూడా రచ్చ చేశారు. ఒక ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో షారుఖ్ ఎవరు?’ అన్నాడు.
        
విడుదల తర్వాత- షారుఖ్  నుంచి అర్ధరాత్రి ఫోన్ రాగానే జీహుజూర్ అయిపోయాడు ముఖ్యమంత్రి. విడుదలకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. అడ్వాన్స్ బుక్కింగులు దేశవిదేశాల్లో పోటెత్తాయి. విడుదల రోజు బాయ్ కాట్ బ్యాచులు థియేటర్ల ముందు చిందు లేశాయి. పాట్నాలో చిందులేసి వేసి లాభంలేదని, పఠాన్ సినిమా చూసి చప్పట్లు కొట్టారు. సినిమా పాటలో సెన్సారైన ఆ బికినీ అలాగే వున్నా చప్పట్లు కొట్టారు. బయటికొచ్చి ఆ వీడియో కూడా వైరల్ చేసుకున్నారు పాపం ఒకప్పటి షారుఖ్ అభిమానులు!
        
ఇవన్నీతీసి ప్రేక్షకులు పక్కన పెట్టారు. భయపడకుండా థియేటర్లలో నిండి పోయారు. బాలీవుడ్ ని బతికిస్తూ దేశం కలిసే వుందని నిరూపించారు. ఈలలూ చప్పట్లతో, డాన్సులూ పూనకాలతో చూపించారు. సోషల్ మీడియాలో ట్వీట్లతో, కామెంట్లతో, థియేటర్ల ముందు పబ్లిక్ టాక్ లతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఒక సినిమా దేశం ఎలా ఒకటిగా వుందో ఇలా విప్పి చూపిస్తూంటే, విభజన వాదులు గప్ చుప్ అయిపోయారు. అటు రాహుల్- ఇటు షారుఖ్ దీన్ని అద్వితీయంగా సాధించి చూపెట్టారు.

సికిందర్