రచన -దర్శకత్వం
: శాంటో మోహన వీరంకి
తారాగణం : రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ తదితరులు
సంగీతం : స్వీకార్ అగస్తి, ఛాయాగ్రహణం
: శ్రీరాజ్ రవీంద్రన్
నిర్మాతలు :నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
విడుదల : మార్చి 18, 2022
***
ఏడేళ్ళ క్రితం ‘కుమారి 21 ఎఫ్’ విజయం తర్వాత 14 వరస
పరాజయా లెదుర్కొన్న రాజ్ తరుణ్, గాయపడిన లేడిలా మరోసారి
సక్సెస్ పులి ఎదుట నిల్చున్నాడు. స్టాండ్ అప్ రాజ్ తరుణ్ - అంటూ ధైర్యం తెచ్చుకుని
పులితో 15 వసారి తలపడ్డాడు. హీరోలకీ
బాక్సాఫీసుకీ మధ్య ఈ కాపలా పులి శనిలా దాపురించింది. దీన్ని జయించిన వాడు
దాని కిష్టమైన ఆహారాన్ని వేసి లొంగదీసుకుంటున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా
జయించాలంటే పులి ఇష్టపడ్డ ఫుడ్డు వేయాలి. వేశాడా? పులిని
దాటుకుని బాక్సాఫీసులోకి వెళ్ళాడా? స్టాండప్ కమెడియన్ గా ఏం
చేశాడు? ఇవి చూద్దాం...
వైజాగ్ లో రాహుల్ (రాజ్ తరుణ్) ఒక స్టాండప్ కమెడియన్. తండ్రి ప్రకాష్ (మురళీ శర్మ), తల్లి ఇందుమతి (ఇంద్రజ) వుంటారు. వీళ్ళకి కొన్ని గొడవలొచ్చి
విడిపోతారు. రాహుల్ తల్లితో వుంటూ ఎక్కడా సరిగ్గా ఉద్యోగం చేయలేక స్టాండప్
కామెడీలు చేస్తూ వుంటాడు. తల్లి అభ్యంతరం చెప్తుంది. ఇంతలో హైదరాబాద్ లో ఉద్యోగం
వస్తుంది. అక్కడ ఉద్యోగం మాత్రమే చేస్తానని మాటిచ్చి హైదారాబాద్ వస్తాడు.
ఉద్యోగంలో చేరాక అక్కడ శ్రేయ (వర్షా బొల్లెమ్మ) అతడ్ని ప్రేమిస్తుంది.
తల్లిదండ్రులు విడిపోవడం చూశాక అతను ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద నమ్మకం కోల్పోతాడు.
సహజీవనం చేద్దామంటుంది. ఒప్పుకుంటాడు. ఇప్పుడు సహజీవనం చేస్తూంటే అతను ప్రేమ విలువ, పెళ్ళి విలువ ఎలా గుర్తించాడనేది మిగతా కథ.
ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద
నమ్మకం లేని వాడు వాటి విలువని ఎలా గుర్తించాడనే ఎన్నోసార్లు సినిమాలుగా తీసిన పాత
కథే. రెబెల్ కథ కాదు, రాడికల్ కథ కాదు. తల్లిదండ్రుల కారణంగా
ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద వైముఖ్యమున్న వాడు ప్రేమకోసం ఎలా నిలబడ్డాడనేది
చూపించదల్చుకున్నారు. పాయింటు చెప్తేనే రొటీన్ చట్రంలో వుందన్పిస్తున్నప్పుడు, కొత్త కథ చేయాల్సింది చేయలేదు. పాయింటుకి సహజీవనం కోణం కలిపినా పాత కథే.
సహజీవనాలన్నీ సరాసరి వెళ్ళి పెళ్ళి సముద్రంలో కలుస్తాయన్నది సినిమాల్లో తెలిసిందే.
కానీ ఇలా ఏవో విలువల్ని గుర్తించాల్సింది అతను కాదు, అతనలా
తయారవడానికి ఏ విలువల్ని వదులుకున్నారో తెలుసుకోవాల్సింది పేరెంట్స్. ఇలాటి
పేరెంట్స్ కి క్లాసు పీకే కథవ్వాలి తప్ప అతనేదో గుర్తించడం కాదు. ప్రేమతో పెళ్ళితో
అతను రెబల్ గానే, రాడికల్ గానే నిర్ణయాలు తీసుకుని సోకాల్డ్
సొసైటీకి హెచ్చరికలు పంపిస్తే, దారికొస్తారు విడిపోవాలనుకుంటున్న, లేదా విడిపోయిన పేరెంట్స్. పెళ్ళిని పేరెంట్స్ గౌరవించనప్పుడు పిల్లలెందుకు
గౌరవించాలి? ఉపయోగపడే ఇలాటి ప్రశ్నతో చేయాల్సిన ఆధునిక కథ.
రాజ్ తరుణ్ ఎంత
నటించినా బాక్సాఫీసు దగ్గర పులి ఆవురావురని చూస్తోంది. దానికి మాంచి పౌష్టిక విలువలతో కూడిన దిట్టమైన స్క్రిప్టుని పడెయ్యాలి. స్క్రిప్టాకలితో పులి బాక్సాఫీసు ముందు
బైఠాయించిందని తెలుసుకోనంత కాలం ఇంతే. తనకి నటన వచ్చినంతగా కథలు రావడం లేదు.
అల్లరి నరేష్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు రాజ్ తరుణ్ నటించడానికి
ఎన్నుకున్న కథలోనే కాదు, పాత్రలోనూ బలం లేదు. తన పాత్రే కాదు, అన్నిపాత్రలూ బలహీనపాత్రలే. పాత్రలు ఇంక డానికి తగిన కథలేదు, కథ ఇంకడానికి తగిన పాత్రచిత్రణ ల్లేవు. కథ అల్లడం,
పాత్రచిత్రణలు చేయడం ఈ కొత్త దర్శకుడి పరిధిలో లేవు. సినిమా అంటే పైపై స్టయిలిష్
మేకింగే అనుకుంటే ‘రాధేశ్యామ్’ కూడా
నిలబడలేదు. ఈ హెచ్చరికని స్మాల్ మేకర్స్ తీసుకోకపోతే ప్రేక్షకులు ఇచ్చింది
తీసుకోరు.
పాత్రపరంగా రాజ్ తరుణ్ పాత్రకి
కన్ఫ్యూజన్ సృష్టిస్తే అది ప్రేక్షకుల పాలిట కన్ఫ్యూజన్ గా మారింది. దీన్ని
వివరించాలంటే ఇక్కడ చోటు చాలదు. స్టాండప్ కమెడియన్ గా తను పేల్చిన జోకులు ఫస్టాఫ్ లో
పేలలేదు, సెకండాఫ్ లో పేలాయి. ఈ స్టాండప్ కమెడియన్ పాత్ర ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో పూజా హెగ్డే
చేసిందే. ఈమెది కూడా రాజ్ తరుణ్ పాత్రలాంటిదే- పేరెంట్స్ తో.
ఇక హీరోయిన్ హర్షా బొల్లమ్మ పాత్ర
హీరో ప్రేమించకపోతే, తనే సహజీవనం ప్రతిపాదించడం ఇంకో విఫల
కథా పథకం. ఈ పని చేయాల్సింది హీరో రాజ్ తరుణ్. పెళ్ళిగిళ్ళి జాంతానై, సహజీవనానికి ఒప్పుకో, లేకపోతే తప్పుకో - అంటే అది
క్యారక్టర్ లోంచి పుట్టిన కథనమవుతుంది. యాక్టివ్ పాత్రవుతుంది. లేకపోతే పాత్ర కోసం
దర్శకుడు పుట్టించిన పాసివ్ పాత్ర కథనమవుతుంది. ఇలా హీరోయిన్ గా హర్ష కూడా తనకిచ్చిన
బలహీన పాత్ర తీసుకుని, వచ్చిన నటన చేసింది.
మిగిలిన పాత్రల్లో పాత్రధారులు
అనుభవమున్న వాళ్ళే. పాత్రలు సహకరించలేదు నటించడానికి. ఇక విషయం లేని సినిమాలు సాంకేతికంగా ఎంత
బావుంటాయో అంత బావుంది సాంకేతికుల పనితనం ఛాయాగ్రహణం సహా. వీళ్ళకి కూడా రాజ్ తరుణ్ కొరతే-
తగిన కథ! పోతే, పాటలు లేకపోతేనే బావుండేలా వుంది. ఈ పాటలతో ఒనగూడిన
అదనపు విలువేమీ లేదు. కొత్త దర్శకుడు స్టయిలిష్ మేకర్ గా కొనసాగ దల్చుకుంటే కథా
బలం కోరుకునే స్క్రిప్టులు కాకుండా, కథతో పనిలేని మైండ్ లెస్ కామెడీలు ప్రయత్నిస్తే సరిపోవచ్చు.
—సికిందర్