స్క్రీన్ ప్లే సంగతులు అతి శ్రమ పెట్టకూడదు. అత్యంత శ్రమ పెట్టిందీ ‘హిట్ -ది ఫస్ట్ కేస్’.... దీని క్రియేటివ్ యాస్పెక్ట్ లో ఐదు మేజర్ సమస్యలున్నాయి. 1. కథా మర్యాద తప్పడం, 2. జానర్ మర్యాదని అతిగా ప్రదర్శించడం, 3. ఎన్నెన్నో క్లూస్ తో ప్రేక్షకుల జ్ఞాపక శక్తికి అతిగా
పరీక్ష పెట్టడం,4. పాసివ్
పాత్ర, 5.ఎండ్ సస్పెన్స్ కథ నడపడం. ఈ జానర్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటేనే లాజిక్ తో కూడుకున్నది. ఫార్ములా సినిమాల్లో పోలీసు దర్యాప్తులో లాజిక్ ని వదిలేసి సినిమాటిక్ లిబర్టీ అంటూ వెళ్లి పోవచ్చేమో గానీ, ఇలాటి పోలీస్ ప్రోసీజురల్ జానర్ లో కుదరదు. ఇది పక్కా
ప్రొఫెషనల్ గా వుండాల్సిందే. ఇటీవలే ఇలాటి క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల గురించి సవివరంగా పేర్కొంటూ ఆరు వ్యాసాలిచ్చాం గమనించే వుంటారు.ఈ వ్యాసాలిచ్చాక వచ్చిన ఈ మొదటి పోలీస్ థ్రిల్లర్ ‘హిట్’
గురించి ఇలా రాయాల్సివచ్చింది. అసలు రాయాల్సింది ‘ఏజెంట్ రాఘవ్ - క్రైం బ్రాంచ్’
అనే వొక పక్కా హిందీ టీవీ క్రైం ఎపిసోడ్ గురించి. సరే, ‘ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్’ అని పోలీస్ ప్రోసీజురల్ అయిన ‘16 డి’ తమిళ డబ్బింగ్ కి ట్యాగ్ లైన్ గా వుంటుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతీదీ లాజికల్ గా వుండాల్సిందే. నిజ జీవితంలో పోలీస్ డిటెక్టివ్ అనే అతను, లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) - సినిమాని సినిమాగా చూడాలన్న వితండ వాదంతో లాజిక్ లేని ఇన్వెస్టిగేషన్ చేస్తే కోర్టులో శృంగభంగమవుతుంది. సినిమాని సినిమాగా చూడాలి యువరానర్ అని వాదిస్తే, కథని
కథలాగా చూసి కేసు రాసుకురామ్మంటాడు జడ్జి. నేర ఘటనని నేర ఘటన లాగా చూస్తేనే ఇన్వెస్టిగేషన్ నిర్దుష్టంగా చేసి కోర్టులో దోషుల్ని శిక్షింప జేయగలడు ఆఫీసర్. ఐనా కూడా ఎంత ఇన్వెస్టిగేషన్ సినిమా అయితే మాత్రం, ఇంత భూతద్దంలో చూడాలా అనుకుంటే చేసేదేం లేదు. బుద్ధిపూర్వకంగా మెదడుకి పరీక్ష పెట్టే ఉద్దేశంతో, పజిల్స్ తో సాగే ఈ ‘హిట్’ లో పజిల్స్ ని పరిశీలించాల్సిందే...ఈ వ్యాసం ఉద్దేశం
సినిమాని తక్కువ చేయడం కాదు, ఇన్నేసి పొరపాట్లు మళ్ళీ ఇంకెవరైనా చేయకుండా వుండాలన్నసదుద్దేశమే.
అయినా ఇదంతా కాదు, మేం తీసేది మేం తీస్తామంటే అదీ ఓకే, నో ప్రాబ్లం.
ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో
ఎండ్ సస్పెన్స్ గా వున్న ఈ కథలో, ప్లస్ లు మైనస్ ల గురించి ఇలా చెప్పుకుంటున్నామంటే,
వీటిని సరిదిద్దుకుంటే ఈ ఎండ్ సస్పెన్స్ కథ ఓకే అయిపోతుందని కాదు. ముమ్మాటికీ
కాదు. పోలీస్ థ్రిల్లర్ జానర్ మర్యాదల గురించి గత వ్యాసాల్లో చెప్పుకున్న విధంగా,
ఎండ్ సస్పెన్స్ ఈ జానర్ కథ కాదు. ప్రైవేట్ డిటెక్టివ్ కథ వుతుంది, అదీ ప్రింట్
మీడియా కథవుతుంది. విజువల్ మీడియాగా పోలీస్ డిటెక్టివ్ కథకి సీన్ టు సీన్
సస్పెన్స్ వుండాల్సిందే. కనుక ‘హిట్’ అనే ఈ ఎండ్ సస్పెన్స్ కథైనా ఎన్ని లోపాలతో,
ఎన్ని దీపాలతో వుందని మాత్రమే ఇక్కడ తెలుసుకోవడం. ఈ లోపాలు సరిదిద్దుకుని ఎండ్
సస్పెన్స్ సినిమాలు ఇంకా తీయమని కాదు. ఎండ్ సస్పెన్స్ సినిమాలన్నీ గత ఇరవై ఏళ్లుగా
ఫ్లాపయ్యాయి. ఈ విషయం కొన్ని వందల రివ్యూలలో విన్నవించుకుంటున్నాఅలాగే
తీస్తున్నారు. బేసిక్ నాలెడ్జి ప్రాబ్లం.
ఈ సినిమాని మెదడుకి ఎంతో పదునుబెట్టి
చూసివుంటారు. అలాగే ఈ స్క్రీన్ ప్లే సంగతుల వ్యాసాలూ అంతే శ్రమకోర్చి చదవడానికి
సిద్ధపడాలని చెప్పేందుకు చింతించక తప్పడం లేదు.
ఈ వ్యాసంలో ఫస్టాఫ్ లో – మొదట బిగినింగ్ విభాగం వరకూ చూద్దాం. కథనంలో ఎక్కడేం జరుగుతూ ఎలా ముందుకు సాగిందో పరిశీలిద్దాం. ఇక్కడ
ఇస్తున్న అంకెలు సీన్ నెంబర్లు కావు. ముందుగా బిగినింగ్ విభాగపు బిజినెస్. ఇది విక్రం పానిక్ ఎటాక్ తో ప్రారంభమవుతుంది. తర్వాత తన మానసిక సమస్యకి మెడికల్ సలహా కాదని ఇలాగే డ్యూటీ చేస్తానంటాడు.
1. విక్రం ఒక హత్యా స్థలంలో కలుపు మొక్కల లాజిక్ తో శవం ఆచూకీ కనుగొంటాడు. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేటర్ గా విక్రం స్కిల్స్ ఏమిటో మనకి పరిచయమవుతుంది.
2. తర్వాత రివాల్వర్ తో కాల్చుకుని ఒకతను ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలానికెళ్తే, అక్కడ డ్యూటీలో వున్నఇన్వెస్టిగేటర్ అభిలాష్ అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య గొడవలున్నట్టు అర్ధమవుతుంది. మృతుడు
రివాల్వర్ తో కాల్చుకుంటూ సెల్ లో రికార్డు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నట్టు
చెప్తాడు అభిలాష్. మరి సెల్ ఎలా ఆఫ్ చేశాడని అడుగుతాడు విక్రం. కాబట్టి ఇంకో వ్యక్తి
రికార్డు చేసి వుండాలనీ, ఇది బలవంతంగా
చేయించిన ఆత్మహత్యనీ తేలుస్తాడు విక్రం. అసలు చేతులకి గ్లవ్స్ తొడుక్కోకుండా, సెల్
ని ఎందుకు ముట్టుకున్నావని నిలదీస్తాడు అభిలాష్ ని. ఇలా విక్రం స్కిల్స్ మనకి
ఇంకోసారి తెలుస్తాయి.
3. తర్వాత విక్రం
ఫోరెన్సిక్ లాబ్ కి వెళ్తాడు. అక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ నేహా అతడి గర్ల్
ఫ్రెండ్ గా పరిచయమవుతుంది. అతడి మెంటల్ కండిషన్ గురించి ఆమె తీవ్రంగానే మాట్లాడి, ఇక
లీవ్ పెట్టి రెస్టు తీసుకోకపోతే, తనని చూడ్డం మానెయ్యమని చెప్పేస్తుంది. అక్కడే
లాబ్ ఇంచార్జి షిండే పరిచయమవుతాడు. విక్రం కొలీగ్ రోహిత్ ఫ్లాట్లో, అతడి భార్య స్వప్న
పరిచయమవుతుంది.
4. ఆ తర్వాత టీవీ
వాయిసోవర్ వస్తూంటుంది...నగరంలో కొత్తగా ఏర్పాటయిన ‘హిట్’ శాఖ వల్ల హత్యలు
తగ్గినట్టు, ఇక మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కూడా చేపడతారనీ ప్రకటన...
5. ‘హిట్’ (హొమిసైడ్
ఇంటర్వెన్షన్ టీమ్) కార్యాలయంలో చీఫ్ విశ్వనాథ్ పరిచయమవుతాడు. ఇతడ్నివిక్రం కలిసి,
ఆరు నెలల లీవ్ లెటర్ ఇస్తాడు. లెటర్ లో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని రాశాడు
కాబట్టి, వెంటనే లీవ్ మంజూరు చేస్తాడు విశ్వనాథ్.
6. ప్రీతి అనే స్టూడెంట్ ఫ్రెండ్స్ ని కలవడానికి కారులో బయల్దేరుతుంది. ఔటర్
రింగ్ రోడ్డు మీద కారు పాడయి ఒకపక్క నాపుకుని చూస్తూంటే, అటుగా వస్తున్న ఎస్సై ఇబ్రహీం
కారాపి దిగి విషయం కనుక్కుంటాడు. తను రావిర్యాల గేటెడ్ కమ్యూనిటీలో వుంటాననీ, కారు
పాడయిందనీ అంటుంది ప్రీతి. తన కార్లో డ్రాప్ చేస్తానని అతనంటే ఒప్పుకోదు. ఎవరికైనా
కాల్ చేశావా అంటే, సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయాననీ, దాని కోసం ఇంటికి తిరిగి వెళ్తూంటేనే
కారు పాడయిందనీ అంటుంది. అతను తన సెల్ లో
మాట్లాడిస్తాడు. తండ్రితో మాట్లాడి తను ఎక్కడుందో చెప్తుంది. ఎస్సై ఇబ్రహీం
వెళ్ళిపోతాడు.
ఒక
పోలీస్ స్టేషన్ కెళ్ళి ఫైలు అందిస్తే ఇది కాదు, వేరే ఫైల్ అంటే వెనక్కి బయల్దేరతాడు
ఇబ్రహీం. వెనక్కి వస్తూంటే అదే స్పాట్ లో ప్రీతి ఆగి వున్న ఒక బ్లూ కార్లోకి తొంగి
మాట్లాడుతూ కన్పిస్తుంది. ఇబ్రహీం తన పోలీస్ స్టేషన్ కెళ్ళిపోయి వేరే ఫైలుతో తిరిగి
వస్తూంటే, ఇప్పుడు అక్కడాగి వున్న ప్రీతి కారు ముందు ఇంకో కారు వుంటుంది. ఇప్పుడు అక్కడ
ప్రీతి తండ్రి మోహన్ వుంటాడు. ఇక్కడ ప్రీతి లేదంటాడు. ఇంటికి చేరుకుందేమో
కనుక్కోమంటాడు ఇబ్రహీం. కనుక్కుంటే రాలేదని చెప్తుంది ప్రీతి తల్లి లక్ష్మి.
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయిందేమో, ఒకవేళ రాత్రికి రాకపోతే తనకి కంప్లెయింట్ చేయమంటాడు
ఇబ్రహీం.
7. ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రీతి రాలేదని అంటాడు
మోహన్. ‘నాకెందుకు కాల్ చేయలేదు?’ అంటాడు ఇబ్రహీం. మోహన్ సీరియస్ అయిపోతూ, ‘చెప్తే
అర్ధం గాదా నీకూ?నిన్ననే సీరియస్ గా తీసుకుని వుంటే...నా కూతురితో చివరిగా మాటాడింది
నువ్వే. అసలెందుకు తనని రోడ్డు మీద వదిలేసి వచ్చావ్?’ అని దురుసుగా మాట్లాడతాడు. ఇబ్రహీం
కూడా సీరియస్ అయిపోయి ధూంధాం చేస్తాడు. కంప్లెయింట్
ఇచ్చి వెళ్ళమంటాడు.
ఈ పోలీస్ స్టేషన్ సీను 25నిమిషాల
కొచ్చే ప్లాట్ పాయింట్ -1 సీను. దీంతో బిగినింగ్ విభాగం ముగిసింది.
బిగినింగ్ విభాగం వివరణ :
ఈ బిగినింగ్ సీన్స్ లో జరగాల్సిన బిజినెస్ చూద్దాం. కథా నేపథ్య
రంగం ఏర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితేసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ
అనే నాల్గు టూల్స్ తో...1. కథా నేపథ్య రంగ ఏర్పాటులో హిట్ శాఖనీ, పోరెన్సిక్స్
శాఖనీ, ప్రీతి అదృశ్యాన్నీ పరిచయం చేసి, వీటి కేంద్రంగా కథ నడవబోతున్నట్టు సూచనలిచ్చారు,
2. పాత్రల పరిచయాల్లో ఈ కథలో దోషులుగా పట్టుబడ బోయే విక్రం కొలీగ్ రోహిత్, అతడి
భార్య స్వప్నలని పాజిటివ్ గా పరిచయం చేస్తూ, తురుపు ముక్కల్లా చేతిలో
వుంచుకున్నాడు కథకుడు. దూరదృష్టితో ఇది మంచి ఆలోచన. ఇక ‘హిట్’ ఇన్వెస్టిగేటర్
విక్రం, చీఫ్ విశ్వనాథ్, ఇంకో కొలీగ్ అభిలాష్ తో బాటు, ఫోరెన్సిక్స్ లో విక్రం
గర్ల్ ఫ్రెండ్ గా నేహానీ పరిచయం చేశారు. ఫోరెన్సిక్స్ ఇంచార్జిగా షిండేని పరిచయం
చేశారు. మరో పక్క ప్రీతి పేరెంట్స్ తో బాటు, ఎస్సై ఇబ్రహీంనీ పరిచయం చేశారు. ఈ
పాత్రలన్నీ బిగినింగ్ విభాగం నుంచే కథని నడిపే పాత్రలు.
3.
సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని, ప్రీతి ఫ్రెండ్స్ ని కలవడానికి బయల్దేరడం
దగ్గర్నుంచీ ఎత్తుకున్నారు, 4. సమస్య ఏర్పాటుని, ప్రీతి పేరెంట్స్ ప్రీతి
మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడంతో చేశారు.
బిగినింగ్
విభాగం మరింత వివరణ :
1. కథకి నేపథ్య రంగాన్నిఏర్పాటు చేస్తూ, ‘హిట్’ అనే హొమిసైడ్
ఇంటర్వెన్షన్ టీమ్ ని, ఫోరెన్సిక్ లాబ్ నీ చూపిస్తూ వీటి చుట్టూ కథ వుండబోతుందని తెలియజెప్పారు.
హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ హత్య కేసుల్ని విచారించే బృందమన్నారు. హొమిసైడ్ అంటే
హత్య. ఈ బృందం వల్ల నగరంలో హత్యలు తగ్గాయని పరిచయ వాక్యాలు చెప్పారు. ఈ బృందం ఇలా
సక్సెస్ అయిన దృష్ట్యా ఇకపైన మిస్సింగ్, కిడ్నాప్ వంటి కేసుల్ని కూడా చేపడుతుందనీ ప్రకటించారు.
ఈ విధంగా ప్రీతి మిస్సింగ్ కేసుని
చేపట్టినట్టు చూపించారు. ఇలా ఇది మిస్సింగ్ కేసు పరంగా ‘హిట్’ చేపట్టిన ఫస్ట్ కేస్
అయినట్టు ప్రతిపాదించారు. టైటిల్ కి న్యాయం చేశామనుకున్నారు.
హత్యలు
వంటి మేజర్ క్రైమ్స్ కోసం ఏర్పాటయిన ఈ ప్రత్యేక హైటెక్ శాఖ, ప్రొటోకాల్ తప్పి
మిస్సింగులు, కిడ్నాపుల కేసులూ పట్టించుకుంటూ విలువైన ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుందా?
మిస్సయిన, కిడ్నాపయిన వ్యక్తులు హత్యకి గురయితే అప్పుడు రంగ ప్రవేశం చేయవచ్చేమో. మరిప్పుడేం
చేయాలి? హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ స్థాపనోద్దేశాన్ని పరిరక్షించాలంటే, ప్లాట్
పాయింట్ వన్ కల్లా ప్రీతి మర్డరవాలి. ఆ మర్డర్ కేసుతోనే ‘హిట్’ రంగంలోకి దిగాలి.
కేవలం
ప్రీతి మిస్సింగ్ అని చెప్పడం వల్ల ప్లాట్ పాయింట్ వన్ బలహీనంగా తయారైంది. ఎప్పుడైతే
ఫస్ట్ యాక్ట్ ఇలా బలహీనంగా వుంటుందో, అప్పుడు సెకండాఫ్ లో థర్డ్ యాక్ట్ కూడా కుదరక
బలహీనమవుతుందని జనరల్ రూలు స్క్రీన్ ప్లే రచనలో. మొత్తం కథకి డీఎన్ఏ అంతా ప్లాట్
పాయింట్ వన్ లోనే వుంటుంది. డీఎన్ఏ పుచ్చిపోయిందా, ఇక చచ్చిపోవడమే కథ.
ప్రీతి
ఎలాగూ మిస్సయిన రాత్రే మర్డర్ అయిందని తర్వాత ఎండ్ విభాగం కథనంలో కథకుడు మిస్టరీ
విప్పాడు కాబట్టి, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఆమె అలా మర్డరై వుండచ్చన్న అనుమానాలు
సృష్టించాల్సి వుంటుంది. ఎస్సై ఇబ్రహీం మర్నాడు ఆ స్పాట్ కొచ్చి ప్రీతి కారు చెక్
చేస్తున్నప్పుడు, అతనొక విషయం పూర్తిగా మర్చిపోయాడు. ప్రీతి కారు ముందు బ్లూ కారు
ఆగి వున్నట్టూ, అందులోకి తొంగి చూస్తూ ప్రీతి మాట్లాడుతున్నట్టూ క్రితం సాయంత్రం
తను చూసి వున్నాడు గనుక, ఆ బ్లూ కారు వుండిన స్పాట్ ని వెంటనే చెక్ చేయాలి. చెక్
చేసి వుంటే అక్కడ దూదీ, విరిగిన సిరంజీ అప్పుడే దొరికేవి. ఎస్సై ఇబ్రహీం అనవసరంగా వీటిని
మిస్ చేసుకున్నాడు. ఫలితంగా అర్ధం లేకుండా సస్పెండ్ అయ్యాడు. తర్వాత ఈ స్పాట్ లోనే
కదా ఫోరెన్సిక్ కి ఆ దూదీ, విరిగిన సిరంజీ లభించినట్టు మిడిల్ కథనంలో వెల్లడించాడు
కథకుడు?
ఇబ్రహీం మూసి వున్న
ప్రీతి కారు అద్దాల్లోంచి లోపలికి తొంగి చూస్తాడు. అప్పుడు సీట్లో ఆమె హేండ్
బ్యాగు చూసి డోర్ తెరిపించే ప్రయత్నం చేస్తాడనుకుంటాం. అదేమీ చేయకుండా, కారుని సీజ్
చేయకుండా వెళ్ళిపోతాడు. కనీసం వీడియో కూడా తీయించడు. వీడియో లేకుండా ప్రీతి కారక్కడ
వదిలేసిందని స్థల సాక్ష్యం ఏముంటుంది కోర్టులో? ఇక్కడే కాదు, ఈ సినిమాలో ఎక్కడా, ఏ
నేరస్థలంలోనూ వీడియోగ్రఫీయే వుండదు. కనీసం ఫోటోగ్రఫీ కూడా వుండదు.
ఇబ్రహీం
కారు డోర్ తీయించి బ్యాగు సీజ్ చేసి వుంటే, డాగ్ స్క్వాడ్ ని పిలిపించి, బ్యాగుని
చూపించి వుంటే, ఆ డాగ్సే ఆమె వాసన పట్టుకుని ఎటు వెళ్లిందో పరుగెత్తేవి. ఆఫ్
కోర్స్, ఆమె ఎక్కడ వాహనం ఎక్కేస్తే అక్కడివరకూ వెళ్లి ఆగిపోతాయి. ఆమె పక్కనే ఆగిన
బ్లూ కారెక్కి వెళ్లిందో లేదో, ఇప్పుడే అనుమాన నివృత్తి అయ్యేది. అసలు ఓఆర్ ఆర్
మీద రాత్రంతా అలా వదిలేసి వున్న ప్రీతి కారుని పెట్రోలింగ్ పోలీసులు కూడా చూసి వూరుకోలేరు.
ఇదంతా
అలా వుంచి, ఇబ్రహీం ప్రీతి ఇంట్లో వదిలేసి పోయిన ఆమె సెల్ ఫోన్ చెక్ చేసి కూడా
వుండాల్సింది. ఎవరైనా మొట్టమొదట ఆ పనే చేస్తారు. ఫ్రెండ్స్ ని కలవడానికి బయల్దేరిన
ఆమె రాకపోవడంతో ఫ్రెండ్ ఆమె సెల్ కి కాల్స్ చేసే వుంటారు. రాత్రంతా ఆమె పేరెంట్స్
ఎక్కడ వెతికారో తెలీదు. ఇంకా చీకటి పడ కుండానే ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తూండాలి.
అప్పుడే పేరెంట్స్ అప్రమత్తమై పోలీసులకి చెప్పేసి వుంటే రాత్రి నుంచే వేట మొదలయ్యేది.
తీరుబడిగా ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్సై ఇబ్రహీం మీద అనవసరంగా అరిచాడు.
మరొకటేమిటంటే,
ఎండ్ విభాగంలో కథకుడు రివీల్ చేసే అసలు విషయాన్ని బట్టి, ప్రీతి ఎక్కిన బ్లూ సెడాన్
కారు వాడు క్రిమినల్ లా కనిపించే మెకానిక్. వాడు కారాపితే వాడి దగ్గరికెందుకు
వెళ్లి మాట్లాడింది? తండ్రే పికప్ చేసుకోవడానికి వస్తున్నాడన్నాక? తను వున్నది
పెద్ద గోల్కొండ, రావిర్యాల టోల్ బూత్స్ కి మధ్యనే అని తండ్రికి చెప్పింది కదా? అంత
దగ్గరలో వున్నప్పుడు తండ్రి కోసం వెయిట్ చేయకుండా, ఇంకేదో కారెక్కేసి వెళ్ళిపోతే -
ఆ వచ్చిన తండ్రిని కంగారు పెట్టడం కాదా? అసలు ఎస్సై ఇబ్రహీం డ్రాప్ చేస్తాను
రమ్మన్నప్పుడు, పోలీస్ కారెక్కనని అన్న తనే, ఎవడో బ్లూ కారు వాడి దగ్గరికి ఎందుకు
వెళ్ళింది? అమ్మాయిలెవరైనా అలా ఏకాంతంలో
చిక్కుబడి పోతే కార్లాపే వాళ్ళుంటారు. వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా, అసలు ఎవరి కంటా
బడకుండా తన కార్లోనే కూర్చోకుండా, ఎందుకు రోడ్డు మీద నిలబడాలి? ఓ పక్క పోలీసులు అమ్మాయిలకి
అన్నన్ని జాగ్రత్తలు చెప్తూ ప్రచారం చేస్తూంటే, ఒక స్టూడెంట్ అయివుండి ఆ
జాగ్రత్తలు విననే లేదా? ఏ లోకంలో జీవిస్తోంది? ఇలా ఇన్ని లోపాలతో సమస్యకి దారితీసే
పరిస్థితుల కల్పనా వుంది. దీన్ని బట్టే - ఇన్ని లోపాలమయంగా - ప్లాట్ పాయింట్ వన్
దగ్గర సమస్య ఏర్పాటయింది.
పాత్ర
ఆదర్శంగా వుండాలి. ఎవరైనా చూస్తే పాత్ర నుంచి నేర్చుకునేలా వుండాలి. వాహనం ట్రబులిస్తే ఎవరి సహాయమూ తీసుకో కుండా తమకి కాల్ చేయాలని పోలీసులే అంటున్నారు. కాల్ చేయడానికి తన దగ్గర సెల్
లేదు. అలాంటప్పుడు కార్లోనే కూర్చోవాలి. ఏ పోలీస్ పెట్రోలింగ్ వాహనమో వస్తుంది.
వాళ్లకి చెప్పాలి. ఎస్సై వచ్చినప్పుడు అతడి కారెక్కననడం తప్పు. మెకానిక్ ని
పంపించమని చెప్పొచ్చు. లేదా ఇల్లు దగ్గరలోనే వుందని చెప్పి, అతడి సెల్ అడుక్కుని
మాట్లాడి, అతడికి థాంక్స్ చెప్పి కార్లోనే కూర్చుంటే సరిపోతుంది.
తర్వాత
ఆ వచ్చిన బ్లూ కారు కిడ్నాపర్ ఆమెని టార్గెట్ చేసి ప్లానింగ్ తోనే వచ్చాడు
కాబట్టి, జాగ్రత్తలు తీసుకున్న ఆమెని ఎలా కిడ్నాప్ చేశాడన్నది సీను లో జరగాలి. ఇల్లు
దగ్గరలోనే వుంది కాబట్టి ఆమె అక్కడ వెయిట్ చేయడంలో జస్టిఫికేషనుంది. దూరంగా ఎక్కడో
వుంటే వెయిట్ చేసేది కాదేమో. ఎస్సై చెప్పినట్టు వినేదేమో. పాత్ర ఆదర్శవంతంగా
వుండాలి. అన్నిజాగ్రత్తలూ తీసుకున్నా అపాయంలో పడిందంటే సానుభూతి వుంటుంది. జాగ్రత్తలే
తెలీని పాత్ర పట్ల సానుభూతి ఏర్పడదు. పైగా కథని చెడగొట్టిందని వైరాగ్యం పుడుతుంది.
ప్రీతి నీతి ప్లాట్ పాయింటు స్వాహాయై నమః.
***
2. పాత్రల పరిచయ క్రమంలో ఇన్వెస్టిగేటర్ విక్రంని మానసిక పీడితుడిగా
చిత్రించడం ఈ జానర్ మర్యాదకి ఎలా భంగకరమో క్రితం వ్యాసంలోనే చూశాం. అంతే గాకుండా,
ఈ మానసిక సమస్య అతణ్ణి పాసివ్ పాత్రగా కూడా మార్చింది. ఇక్కడ గతంలో తన చెల్లెలి
దారుణ హత్యకి పిచ్చెత్తి పోవడం కాదు కావాల్సింది, ఆ హంతకుణ్ణి పట్టుకునే ఎమోషనల్
గోల్ తో వుండడం కావాలి. అప్పుడు పాసివ్ నెస్ పోతుంది. ‘ఏజెంట్ రాఘవ్ -క్రైం బ్రాంచ్’ టీవీ ఎపిసోడ్స్
లో, రాఘవ్ కి అపారమైన స్కిల్స్ తండ్రి నుంచే వచ్చాయి. తండ్రి సైకియాట్రిస్ట్.
తండ్రి క్లయంటే తండ్రిని హత్య చేశాడు. ఆ కేసు పోలీసులు సాల్వ్ చేయలేని కేసుగా
మిగిలిపోయింది. క్రైం బ్రాంచ్ లో చేరాక రాఘవ్ కి, ఆ హంతకుణ్ణి పట్టుకోవడంగా ఇన్నర్
గోల్ వుంటుంది. అలా యాక్టివ్ పాత్రగా వుంటాడు.
పోలీస్
డిటెక్టివ్ కి విషాదకర బ్యాక్ స్టోరీ ఇస్తే రొటీన్ హీరో అయిపోతాడు. ఈ జానర్లో
పోలీస్ డిటెక్టివ్ అయినా, స్పై జానర్లో స్పై అయినా, సొంత బాధలతో వుండరు. ఒక
ప్రొఫెషనల్స్ గా ప్రపంచ బాధే తమ బాధగా వుంటారు. సోషల్ ఆర్డర్ ని స్థాపించేందుకు
శ్రమిస్తారు. ఇలా చూసినప్పుడు విక్రంకి రన్నింగ్ స్టోరీలో మిస్సైన గర్ల్ ఫ్రెండ్
నేహాతో ఎమోషనల్ ఆర్క్ ఒక్కటి వుంటే సరిపోతుంది. మిడిల్ విభాగంలో ప్రీతి కేసు
పరిశోధిస్తూ ఒక చోట అంటాడు- ప్రీతి ఎమోషనల్ గా టచ్ చేసిందని. ఆ మాట మిస్సయిన నేహా
గురించి అనాల్సింది.
ఇక ప్రారంభంలో రెండు సీన్లు ఇన్వెస్టిగేటర్
గా విక్రం స్కిల్స్ తెలియజేయడానికి ఉద్దేశించాడు కథకుడు. స్కిల్స్ అనగానే ఇటీవల ఒక
కథ డిస్కషన్స్ లో జరిగింది ప్రస్తావించక తప్పని అవసరం వస్తోంది (ఎప్పుడో
తప్పనిసరైతే తప్ప వెల్లడించడం జరగదు. అదీ పరోక్షంగానే వుంటుంది)...ఒక స్టార్ హీరో
కథ డిస్కషన్స్ లో హీరోని స్కిల్స్ తో పరిచయం చేయడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది అంతా
జరిగిపోయాక. చాలా సినిమాల్లో ఇది రొటీనే. ఈ టెంప్లెట్ అవసరమా అన్పించింది
దర్శకుడికి. నిజమే, కథలో హీరో సమర్ధుడు కాబట్టి, ఆ సమర్ధత ఎలా వుంటుందో ఓపెనింగ్
లో రెండు శాంపిల్స్ రుచి చూపించి - ఓ విజయోత్సవ గ్రూప్ సాంగేయడం ఎన్ని సినిమాల్లో
చూడ్డం లేదు విసుగ్గా?
హీరో
సమర్ధత ముందుగానే శాంపిల్స్ రుచి చూపించేస్తే, తర్వాత తెలుసుకుని ఆడియెన్స్
థ్రిల్లవుతూ వుండడానికేముంటుంది? హీరో ముందే మెచ్యూర్డ్ అని చూపించేస్తే, ఇక
మెచ్యూర్ అవడానికేముంటుంది? కథ ఓపెనింగ్ లోనే ముగిసినట్టు వుంటుంది. కథంటే
ఇమ్మెచ్యురిటీ నుంచి మెచ్యురిటీకి ప్రయాణం కదా? అదే ‘హీరోస్ జర్నీ’ కదా స్క్రీన్
ప్లే పరిభాషలో? ఒక సామాన్య జీవితం గడుపుతున్న హీరో, అసాధారణ జీవితం ఎదురయ్యేసరికి,
దాన్ని మధిస్తూ, ఆ అనుభవాల్నుంచీ నేర్చుకుంటూ, స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, సమస్యని
సాధించి- విజేత అవడం సహజ వ్యక్తిత్వ పరిణామ క్రమం కదా?
‘శివ’
లో మాఫియాగా మారే నాగార్జునకి మొదట్నుంచీ మాఫియా స్కిల్స్ తెలుసా? విద్యార్థిగా
సామాన్య జీవితం గడుపుతున్నఅతను, మాఫియాలతో తలపడి- అసాధారణ చీకటి ప్రపంచంలోకి
ఎంటరయ్యాకే కదా -స్కిల్స్ నేర్చుకుంటూ మాఫియాగా మారి కథ ముగించాడు? ఈ ఫ్రేం వర్క్
లో ఆలోచించాక, స్కిల్స్ ప్రదర్శన అవసరం లేదనిపించింది. ‘హీరోస్ జర్నీ’ అనే సహజ
ట్రీట్మెంటే స్టార్ హీరో కథకి ఓకే అయింది.
ఇన్వెస్టిగేటర్
విక్రంని ప్రత్యేకంగా స్కిల్స్ తో పరిచయం చేయడమెందుకు? స్కిల్స్ అంటూ లేకపోతే ఆ
ఉద్యోగంలో, తర్వాత ఈ సినిమాలో వుండేవాడు కాదుకదా? కథకుడు టెంప్లెట్ సీన్లు
పెట్టుకున్నాడు. ఇవెలా వున్నాయో చూస్తే... మొదటి సీను కలుపు మొక్కలతో బాగానే
వుంది. రెండో సీనులోనే కథకుడు విఫలమయ్యాడు. విక్రం స్కిల్స్ ని కిల్ చేశాడు.
ఇదెలాగో
చూద్దాం. రెండో శాంపిల్ సీన్లో ఒకతను రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడు. ఘటనా స్థలానికెళ్తే విక్రం
చేయాల్సిన మొదటి పని సీనాఫ్ క్రైంని చూడడం చెయ్యడు. వేరే ఏవో సెర్చి చేస్తూ గదులు
తిరుగుతూంటాడు. దర్శకుడు కూడా సీనాఫ్ క్రైం ని ఒక మాస్టర్ షాట్ తో డిటెయిల్స్
ఫ్రేములో రిజిస్టర్ చేసి మనకి చూపించడు. ఆ డిటెయిల్స్ కుర్చీలో తలవాల్చేసి వున్న
హతుడు, తలకి బుల్లెట్ గాయం, కింద రక్తపు మడుగు, కింద రివాల్వర్, బుల్లెట్ షెల్
మొదలైనవి- ఏది ఏ పొజిషన్లో వుండి, ఏం జరిగిందో అర్ధమవడానికి ఒక సింగిల్ ఫ్రేములో
రిజిస్టర్ చెయ్యడు.
హతుడు కుర్చీలో తల
వాల్చేసి కూర్చున్న షాట్, కింద రక్తం మడుగు షాట్, కిందే రివాల్వర్, బుల్లెట్ కేస్
షాట్...ఇలా విడివిడి షాట్స్ వుంటాయి. వీటిని పేర్చుకుని చూస్తే రివాల్వర్, బుల్లెట్
కేస్ హతుడి ముందు పడి వుంటాయి. హతుడి కుడివైపు రక్తం మడుగు వుంటుంది. ఒక షాట్ లో
హతుడు కుడి పైపు తల వాల్చి వుంటాడు, షర్టు మీద కుడి వైపు రక్తం వుంటుంది. ఇంకో
షాట్లో ఎడం వైపు వాల్చి వుంటాడు... ఇలా ఘటనా స్థల కంపోజిషన్ గందరగోళంగా వుంటుంది.
ఇది ఆత్మహత్య అని చెప్పడానికి హతుడు
సెల్ ఫోన్లో స్వయంగా వీడియో రికార్డింగ్ చేశాడని అభిలాష్ చెప్తూ సెల్ ఫోన్ విక్రం
కి అందిస్తాడు. అభిలాష్ చేతులకి గ్లవ్స్ వుండవు. విక్రం ఫ్యాషన్ గా ఒక చేతికే
గ్లవ్స్ తొడుక్కుంటాడు. సెల్ ఫోన్లో వీడియో చూస్తాడు. హతుడు సెల్ ఫోన్ని కొంతదూరం
ముందు పెట్టుకుని, కుర్చీలో కూర్చుని, కుడి చేత్తో రివాల్వర్ తో తల కుడి పైపు
కాల్చుకుని, రివాల్వర్ ముందుకు పడేసి, ఎడం వైపు తల వాల్చేస్తాడు (ఒక షాట్ లో తల
కుడి వైపు వాల్చాడని, షర్టు మీద కుడి వైపు రక్తం వుందనీ పైన చెప్పుకున్నాం).
ఈ విడియో చూసి, వీడియోని హతుడెలా ఆఫ్ చేశాడని
విక్రం అడుగుతాడు. కాబట్టి ఇది ఇంకెవరో వుండి చేయించిన ఆత్మహత్య అని తేల్చేస్తాడు.
ఒకవేళ ఇది చేయించిన ఆత్మహత్యే అనుకుందాం, మరి బుల్లెట్ కేస్ ముందుకు వచ్చి ఎలా
పడింది? రివాల్వర్ ఫైర్ చేసినప్పుడు, బుల్లెట్ కేస్ రివాల్వర్ని బట్టి రివాల్వర్
కి కుడి వైపో, ఎడం వైపో, వెనక్కో వెళ్లి పడుతుంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు
ఫైరింగ్ పిన్ టచ్ అయి, బుల్లెట్ నుంచి బుల్లెట్ కేస్ విడిపోయి, అలా పడిపోతుంది. బుల్లెట్
మాత్రమే ముందుకు దూసుకెళ్తుంది. బుల్లెట్ కేస్ వెళ్లి ముందుకు పడదు. బుల్లెట్ కేస్
శవం ముందు పడిందంటే అతను కాల్చుకోవడం కాదు, ఇంకెవరో ముందు నుంచి కాల్చి వుండాలి. ఇలా
రాంగ్ సీను మనకి చూపిస్తూ విక్రం చేత క్లోజ్ చేయించారు. ఇది సినిమా కాబట్టి
సినిమాగానే చూడాలంటే ఓ నమస్కారం పెట్టాలి. ఎలా పడితే అలా వాడెయ్యడానికి సినిమా అనే
మాధ్యమం మునిసిపాలిటీ డస్ట్ బిన్నేమో!
విక్రంకీ
అభిలాష్ కీ పడదని ఈ సీను మొదట్లోనే చూపించారు. ఇప్పుడు చేతులకి గ్లవ్స్ లేకుండా
హతుడి సెల్ ఫోన్ ముట్టుకున్నందుకు, విక్రం పంచ్ డైలాగు కొట్టి అభిలాష్ ని
చిన్నబుచ్చుతాడు. అంటే విక్రం స్కిల్స్ ని మనకి శాంపిల్ చూపించడానికి, అట్టహాసంగా,
ఏంతో గర్వకారణంగా చూపిస్తున్న హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం విశ్వసనీయతనే దెబ్బ
తీస్తున్నాడన్న మాట కథకుడు. అభిలాష్ సెల్ ఫోన్ని అలా హేండిల్ చేసి, వేలిముద్రల
సాక్ష్యాల్నే నాశనం చేస్తూ - కేసుని మూసీలో కలిపేశాడు.
అసలిన్ని
‘స్కిల్స్’ చూపిస్తున్న విక్రం, ఈ ‘ఆత్మహత్య’ జరిగిన ఫ్లాట్ కి వచ్చినప్పుడు, బయట
నిలబడి గ్లవ్స్ లేని చేత్తో, అన్ ప్రొఫెషనల్ గా డోర్ ఫ్రేం మీద వేళ్ళు టకటక లాడిస్తూ,
అభిలాష్ ని చూస్తాడు. డోర్ ఫ్రేం మీద వేలి ముద్రల సాక్ష్యాల్ని కూడా కలుషితం
చేస్తూ. ‘హిట్’ అనే టీంని అడుగడుగునా ఫ్లాప్ చేస్తున్నాడు కథకుడు.
ఇక కథామర్యాదని కాపాడే - ఈ సినిమా టైటిల్ గా
ప్రకాశిస్తున్న ‘హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం’ సెటప్ ఎలావుందో చూద్దాం. దీని చీఫ్ గా
ఎడిజిపి ర్యాంకు అధికారిగా విశ్వనాథ్ ని చూపించారు ఓకే. సీఐడీ శాఖ ఈ ర్యాంకు
అధికారి చేతిలోనే వుంటుంది. అయితే ఈ అధికారి కింద ఎవరికీ డిసిప్లిన్ లేదు. చీఫ్
కెలాటి పట్టింపూ లేదు. ఎలాపడితే అలా కేసులు పంచేస్తాడు. ఒక్క కేసూ విక్రం కి
ఒరిజినల్ గా దక్కదు. ప్రారంభంలో అభిలాష్
చూస్తున్న ఆత్మహత్య కేసు దగ్గర్నుంచీ, తర్వాత శ్రీనివాస్ చూస్తున్న ప్రీతీ
మిస్సింగ్ కేసుతో బాటు, అభిలాషే చూస్తున్ననేహా మిస్సింగ్ కేసు వరకూ, ఎదైనా
వాళ్ళనుంచి చీఫ్ పీకి, లేదా విక్రం పీకించుకుని పొందే కేసులుగానే వుంటాయి. ఇలా ఎంగిలిపడిన - సెకెండ్
హేండ్ కేసులతో అతనొక నమ్మబలికిన పాసివ్ క్యారక్టర్ లా వుంటాడు. హీరో పాత్ర పట్ల కథకుడికున్న
అభిమానం అలాంటిది.
ఇక టీం స్పిరిట్ విషయనికొస్తే, విక్రంకీ
అభిలాష్ కీ పడదు. అసలుకి అభిలాష్ మొదట చూపిన ఆత్మహత్య కేసు చేపట్టి ఫీల్డులో వున్నాడు.
అక్కడికి విక్రం వస్తాడు. వస్తూంటే చీఫ్ నుంచి మెసేజ్ వస్తుంది చేరుకున్నావా అని. నేను
ఆభిలాష్ కి కాల్ చేస్తాను నువ్వెళ్ళు - అని మరో మెసేజ్ పెడతాడు చీఫ్. దీనికి కూడా జవాబుగా
ఎమోజీ పెడతాడు విక్రం, ‘నేను నీ సీనియర్ని, ఎమోజీలు పెట్టకు’ అని ఇంకో మెసేజి పెడతాడు
చెఫ్ మందలింపుగా. అయినా దీనికీ జవాబుగా ఎమోజీనే పెడతాడు విక్రం. ఇలావుంది పై అధికారితో విక్రం కేర్లెస్
తనం.
ఇప్పుడు
ఇక్కడ అభిలాష్ కి అప్పగించిన ఆత్మహత్య కేసు తను పొందేందుకు విక్రం చీఫ్ కి చెప్పుకుని,
తనని రానియ్యని అభిలాష్ కి చీఫ్ చేత ఫోన్ చేయించుకుని- వచ్చి ఈ కేసు హైజాక్ చేశాడన్న
మాట. ఇదీ టీం స్పిరిట్. పాసివ్ క్యారక్టర్ స్పిరిట్. చీఫ్ కూడా తోటి స్టాఫ్ ఆత్మస్థయిర్యాన్నిదెబ్బతీసే
ఇలాటి అన్ ప్రొఫెషనల్ నిర్ణయాలు తీసుకోకూడదని అనుకోడు.
విక్రంకీ
అభిలాష్ కీ మధ్య గొడవలేంటి? ఒక టీం అన్నాక ఒకే జట్టుగా వుంటూ క్రిమినల్స్ ఆటకట్టించి
మంచి పేరు తెచ్చుకునే ఒకే లక్ష్యంతో వుండక? ఇంకోటేమిటంటే ప్రీతిని చంపిన హంతకులు విక్రం
కొలీగ్ రోహిత్, అతడి భార్య స్వప్నాలే అని తేల్చడం! ఇంతకంటే కథా మర్యాద చెడగొట్టడం వుంటుందా?
చాలా బ్యాడ్ టేస్టు కథకుడికి! నగరానికి గర్వకారణంగా ప్రారంభించిన ‘హిట్’ డిపార్ట్ మెంట్
లోనే ఇంటి దొంగలా? ఇంకెందుకూ మూసేసి వెళ్ళిపోక!
మిడిల్
విభాగం రేపు.
―సికిందర్