రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జనవరి 2020, ఆదివారం

910 : సందేహాలు - సమాధానాలు


       Q : ఈ సంక్రాంతి సినిమాల రివ్యూస్ రాస్తున్నారా? వాటి మీద విశ్లేషణలేమైనా వస్తాయా? మీరు రెగ్యులర్ గా రివ్యూలు రాస్తున్నారు కాబట్టి అడిగాను.
రవి,అసిస్టెంట్
A : సంక్రాంతి సినిమాల రివ్యూలేమయ్యాయని కొందరు మెసేజిలు పంపారు. వెరీ సారీ. జనవరి 2 న ఈ బ్లాగు పుట్టిన రోజన్న విషయం కూడా గుర్తులేదు. బ్లాగు జనవరి 2, 2014 న ప్రారంభమయింది. ఇక చాలా పని భారం వల్ల సంక్రాంతి సినిమాలు చూడాలన్న ధ్యాసే లేదు. అయినా స్టార్ సినిమాలంటే ఫ్యామిలీల కోసమని అటుతిప్పి ఇటుతిప్పి అలాగే తీస్తారన్న విషయం తెలిసిందే. ఇంకా విశ్లేషణలు రాయడానికేముంటుంది. వాటిలోంచి మీరు నేర్చుకునేదేముంటుంది. మారకుండా అలాగే వుండే టెంప్లెట్ సినిమాలకి రాసిందే రాయడం, మీరు చదివిందే చదవడం. ఈ ఒకే టైపు విశ్లేషణలతో బ్లాగు నిండిపోయి వెరైటీ లేకుండా పోయింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాం. నేర్చుకోదగ్గవి వస్తే రాద్దాం. సరదాకి రివ్యూలు రాయడం మానేద్దాం. సరదాకి చదవడం మీరూ మానేయండి. మామూలుగా వెబ్ సైట్స్ లో వచ్చే రివ్యూలు చదివేస్తే మీకు సరిపోతుంది, ఆ సినిమాలకి ఆపాటి సమాచారం చాలు. ‘కొత్త డైరెక్టర్ కహానీ’ శీర్షికన కొత్త దర్శకుల చిన్న సినిమాలకి విశ్లేషణలు రాసినా ఆయా కొత్త దర్శకులు తప్పొప్పులు తెలుసుకుని, ముందుకు సాగగలరన్న ఆశైనా ఆ విశ్లేషణలు రాయడానికి పురిగొల్పుతోంది. అందుకని అవి రాస్తున్నాం. ఇక రెగ్యులర్ రివ్యూల గురించి : ఆ మధ్య రెగ్యులర్ గా రివ్యూలు ఒక వెబ్ సైట్ కోసం రాయాల్సి వచ్చింది, ఆ వెబ్సైట్ ఈ మధ్య ఆగిపోతే చేసేదేముంది. 

Q : ప్రధాన పాత్ర తను నిర్ణయాలు తీసుకోకుండా, పక్కన వున్న పాత్ర చెప్పినట్టు తన గోల్ కోసం ప్రయత్నించడం కరెక్టేనా? ఇలా మనకు ఓల్డ్ మూవీస్ లో వుంటుంది. అంటే మెయిన్ క్యారక్టర్ అలా చేస్తే అది యాక్టివ్ క్యారక్టరా, పాసివ్ క్యారక్టరా?
రవి, అసిస్టెంట్
A : మీరు చెప్పిన ఓల్డ్ మూవీస్ సహా ఇలాటి చిత్రణలు ఎవైనా వుంటే ఒక రూపంలో అవి మోనోమిథ్ స్ట్రక్చర్లో చేసిన కథలై వుంటాయి, ఇంకో రూపంలో గాథలై వుంటాయి, మరింకో రూపంలో పూర్తి స్థాయి పాసివ్ పాత్ర కథలై వుంటాయి. మోనోమిథ్ అంటే పురాణాల ఆధారంగా జోసెఫ్ క్యాంప్ బెల్ చెప్పిన ఆనాటి స్ట్రక్చర్. అరిస్టాటిల్ తర్వాత హాలీవుడ్ అనుసరించిన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో మొత్తం కథా ప్రయాణంలో ప్రధాన పాత్రకి 12 మజిలీలు, అంటే దశలు వుంటాయి. ఈ కథలు నిదానంగా, తీరుబడిగా నడుస్తాయి. ఆ కాలానికి అవి సరిపోయాయి. ఈ స్ట్రక్చర్ ని దర్శకుడు దేవకట్టా నేటి తెలుగు సినిమాకి అనుసరించే ప్రయత్నం చేశారు. మోనోమిథ్ లో బిగినింగ్ విభాగంలో ‘రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’ అనే మూడో దశ వస్తుంది. అంటే గోల్ తీసుకోవడానికి ప్రధాన పాత్ర తిరస్కరించడం. దీంతో ఒక ‘మెంటర్’ క్యారక్టర్ వచ్చి నచ్చజెప్పే నాల్గో దశ వస్తుంది. దీని తర్వాత ప్రధాన పాత్ర గోల్ తీసుకునే ఐదో దశ, అంటే ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, బిగినింగ్ విభాగం ముగిసి -  మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. పైన చెప్పుకున్నట్టు ఇవి తీరుబడిగా సాగే కథలు.


        సిడ్ ఫీల్డ్ వచ్చి, కథల్ని వేగవంతం చేస్తూ మోనోమిథ్ లోని 12 దశల్నీ కేవలం 5 కి కుదించాడు. ఇందులో రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్, మెంటర్ దశలు కూడా వుండవు. సిడ్ ఫీల్డ్ పారడైమ్ లో తానుగా ఫీలై నేరుగా తన గోల్ తనే తీసుకుంటుంది ప్రధాన పాత్ర. సిడ్ ఫీల్డ్ పంథాలో ఆమూలాగ్రం వున్న ‘శివ’ లో సైకిలు చైను తో నాగార్జున జేడీని చెడుగుడు ఆడే ప్లాట్ పాయింట్ వన్ లాంటిదన్న మాట. తానేం చేయాలో ఇతరులు చెప్తే విని చేసే వాడు హీరో ఎలా అవుతాడు, పాసివ్ పాత్రవుతాడు, అడ్డా కూలీ అవుతాడు. ఇతరులేం చేయాలో చెప్పేవాడు హీరో అవుతాడు, యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు, ముఠా మేస్త్రీ అవుతాడు.
        ఈ మధ్య సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ లో కొంత వరకూ మోనోమిథ్ చేశారు. పైన చెప్పిన మూడవ, నాల్గవ దశలుంటాయి. నిజానికి సల్మాన్ ఖాన్ ది ప్రొఫెషనల్ స్పై పాత్ర. ప్రొఫెషనల్ పాత్రలకి పర్సనల్ గోల్స్ వుండవు, ప్రొఫెషనల్ గోల్సే వుంటాయి. కాల్ వస్తే నసపెట్ట కుండా వెళ్లి గోల్ తీసుకుని కార్య క్షేత్రంలోకి దూకెయ్యడమే. జేమ్స్ బాండ్ పాత్రలు కూడా ఇవే. ఇక్కడ ఎవరో గోల్ ఇచ్చారు కాబట్టి పాసివ్ పాత్రలవవు. ప్రొఫెషనల్ గా గోల్ తీసుకోకుండా నస పెడితేనే పాసివ్ పాత్రలవుతాయి. ఒకరికి చేస్తున్న కార్పొరేట్ థ్రిల్లర్ కథలో ప్రొఫెషనల్ అయిన హీరో, ఇలాగే గోల్ తీసుకునేట్టు చిత్రించాం. ముందు సమాచారం లేకుండా, ఎకాఎకీన వచ్చి పడ్డ ఆఫర్ తో, నస పెట్ట కుండా స్పాట్ లో గోల్ తీసుకోవడం.
        ఇక గోల్ తీసుకున్నాకా సాగే మిడిల్ కథనంలో, ఎట్టి పరిస్థితిలో హీరో ఆ గోల్ కోసం ఇతరులు చెప్పినట్టు నడుచుకోకుండా రైటర్ జాగ్రత్త పడాలి. ఏ కథైనా కథానాయకుడికి అది తన కథే. అందుకని తన కథని చచ్చీ చెడీ తనే సొంతంగా నడుపుకోవాలి కథానాయకుడన్నాక. తనకి ఇతర పాత్రలు ఐడియాలిస్తూ నడిపిస్తే అది కథ కాదు, గాథయిపోతుంది. అది యాక్టివ్ పాత్రవదు, పాసివ్ పాత్రయిపోతుంది. యాక్టివ్ పాత్రగా గోల్ తీసుకుని, తర్వాత పాసివ్ పాత్ర అయిపోయే కథనాల బారిని పడకుండా రైటర్ అనుక్షణం అప్రమత్తంగా తన మీద తనే నిఘా వేసి ఉండాల్సి వుంటుంది. ఎందుకంటే తన ఆలోచనల్లోంచే కథనం వస్తుంది గనుక. గోల్ తీసుకుని ముఠా మేస్త్రీగా బయల్దేరిన హీరో మహాశయుణ్ణి, అడ్డా కూలీ చేసే ప్రతికూల ఆలోచనలు చేయకుండా, రైటర్ తన బుద్ధిని సీసీ కెమెరాల నిఘాలో వుంచాలన్న మాట. కథంటే క్యారక్టర్స్ మైండే తప్ప, రైటర్స్ మైండ్ కానే కాదు.
        ఇటీవల జేమ్స్ కెమెరాన్ తీసిన హీరోయిన్ ఓరియెంటెడ్ ‘అలీటా’ అనే సైన్స్ ఫిక్షన్ మోనోమిథ్ స్ట్రక్చరే. హాలీవుడ్ ఏనాడో వదిలేసిన మోనోమిథ్ స్ట్రక్చర్ ని ఇప్పుడెందుకు ఆశ్రయించినట్టు. ఈ స్ట్రక్చర్ లో స్క్రీన్ ప్లే గజిబిజి కూడా అయింది. అలీటా ఏం చేస్తోందో, గోల్ ఏమిటో అర్ధంగాదు, ఎవరి కోసం అడ్డాకూలీగా చేస్తోందో అంతుపట్టదు. గోల్ కోసమే పోరాడుతున్నట్టు కన్పిస్తుంది గానీ, అవి అడుగడుగునా మారిపోయే మల్టీపుల్ గోల్స్. కాసేపు అదంటుంది, కాసేపు ఇదంటుంది. యాక్షన్ మాత్రం జోరుగా చేసుకుంటూ పోతుంది. జస్ట్ పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్. బోలెడు యాక్షన్ లో వున్నట్టే కన్పిస్తుంది గానీ, అది యాక్షన్ కాదు, ఒకరి యాక్షన్స్ కి తన వివిధ రియాక్షన్స్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో ఇలాంటిదే పాసివ్ రియాక్టివ్  క్యారక్టర్.
        ఇలా కథని, పాత్రనీ దెబ్బతీసే చాలా ప్రమాదాలు పొంచి వుంటాయి. విరుగుడు ఒక్కటే : రైటర్ సొంత ఆలోచనలు చేయకుండా, ప్రతీ అడుగులో పాత్రలు ఆ క్షణానికి ఏమాలో
చిస్తూ  వుంటాయో, అది పట్టుకుని కథనం చెయ్యడమే. పాత్రలకోసం బయటి నుంచి రైటర్ ఆలోచిస్తే పాసివ్ పాత్రలు పుడుతాయి. కథని రైటరో, డైరెక్టరో సృష్టించడు. పాత్రలే వాటి అనుభవాల్లోంచి, ఆలోచనల్లోంచి సృష్టించుకుంటూ పోతాయి. కథా రచనలో ఇది ప్రాథమిక సూత్రం. ఇదింకా తెలీక పాసివ్ పాత్రలతో ఫ్లాపులు తీస్తున్నారు. తెలుగులో పాసివ్ పాత్రల ఫ్లాపులే ఎక్కువ.

Q : ‘సరిలేరు నీకెవ్వరు’ నానా పటేకర్ ‘ప్రహార్’ కి కాపీ అనడం ఎంతవరకు నిజం? నేను ఇప్పుడే ‘ప్రహార్’ చూశాను. అలా అన్పించలేదు.
టీవీఎస్, అసోషియేట్

A : నానా పటేకర్ దర్శకత్వంలో నానా పటేకర్ ప్రధాన పాత్రగా, మాధురీ దీక్షిత్, డింపుల్ కపాడియాలు ఇతర పాత్రలుగా, 1991 లో నిర్మించిన ‘ప్రహార్’ (అంటే ఎటాక్) ఒక టెంప్లెట్ కథ. అంటే ఆర్మీలో పనిచేసే హీరో స్వస్థలానికి వచ్చి అంతర్గత శత్రువుల్నినిర్మూలించే టైపు కథ. అక్కినేని నాగేశ్వరరావు ‘జై జవాన్’ (1970), ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ 1982), చిరంజీవి ‘యుద్ధభూమి’ (1988) కూడా ఈ టెంప్లెట్ సినిమాలే. టెంప్లెట్ ఒకటేగానీ కథలు వేర్వేరు. అయితే ‘ప్రహార్’ రియలిస్టిక్ గా తీశారు. ఇప్పుడీ టెంప్లెట్ పాతబడిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ కాపీ కాదు గానీ టెంప్లెట్ పాతది. వరస సినిమాలతో మహేష్ బాబు టెంప్లెట్ స్టార్ అయిపోయాడు ఏం చేస్తాం.

Q : ఈ మధ్య తమిళంలో వచ్చిన ‘వెళ్ళాయ్ పూక్కల్’ లో వివేక్ ది ప్రధాన పాత్ర. ఇందులో ఒక పాత్ర చైల్డ్ హుడ్ ఎపిసోడ్ మొత్తం వేరే పాత్ర గురించి చెప్తున్నట్టు ప్రెజెంట్ కథలో సమాంతరంగా నడిపారు. చివర్లో అది ఇదివరకే జరిగిపోయిన ఫ్లాష్ బ్యాక్ అని రివీల్ చేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చైల్డ్ హుడ్ కథే ప్రెజెంట్ కథలో వున్నపాత్ర కథ. అంటే చిన్నప్పుడామె అలా వుంది కాబట్టే ఇప్పుడిలా ఉందని చెప్పడం కోసం. ఈ తరహా స్క్రీన్ ప్లే ఎక్కడా చూడలేదు. మీకేమైనా తెలిసి వుంటే దీని గురించి వివరించండి.
రవి, అసిస్టెంట్

A : మనకి తెలిసి ఎక్కడా ఎదురుపడలేదు గానీ, మీరు చెప్తూంటే ఒకటి గుర్తుకొస్తోంది : మూడు నాల్గేళ్ళ క్రితం అల్లరి నరేష్ కోసం ఒక అసోసియేట్ కి చేసిన కథలో ఇలాటి ప్రయోగమే అప్రయత్నంగా చేశాం. అప్పట్లో ‘అవుట్ లుక్’ మేగజైన్ లో ఒక రాజకీయనాయకుడి చాలా పూర్వపు అవినీతి లీలలు ఒక కథలాగా వచ్చాయి. అది ఇంటరెస్టింగ్ గా అన్పించి మన కథలో అప్పుడప్పుడు వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ గా పెట్టాం. బ్లాక్ అండ్ వైట్ లో వచ్చే ఇవి ఫ్లాష్ బ్యాక్స్ అని తెలుస్తూనే వుంటుంది గానీ, ఎవరి ఫ్లాష్ బ్యాక్సో చెప్పకుండా సస్పెన్స్ తో రన్ చేశాం. చివరికా ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ తెచ్చి విలన్ మహాశయుడికి అంటగట్టి, వాడి బండారమే బయటపడి చిందులేసేలా చేశాం. దురదృష్ట వశాత్తూ ఆ అసోసియేట్ చనిపోయాడు.
        ‘వెళ్ళాయ్ పూక్కల్’ కథ వీకీపీడియాలో చదివితే మీరన్న ఫ్లాష్ బ్యాక్స్ విధానముంది. అయితే దీని గురించి రివ్యూల్లో తమిళ సైట్స్ ఏవీ హైలైట్ చేయలేదు. నిజానికి ఇదొక వినూత్న ప్రయోగం. తెలుగులో ఎవరికైనా నచ్చితే క్రియేట్ చేసుకోవచ్చు.

Q : బాలీవుడ్ లో వచ్చేలాంటి ‘బాలా’, ‘డ్రీం గర్ల్’ లాంటి వెరైటీ సినిమాలు తెలుగులో ఎందుకు రావడం లేదు?
రవి, అసిస్టెంట్
A : వెరైటీ సినిమాలకి అవసరమైన వెరైటీగా ఆలోచించే  రైటర్స్ లేకపోవడం వల్ల. ఎంతసేపూ సిటింగ్స్ లో జరిగేదేమిటంటే తెలుగు సినిమాల్ని రిఫరెన్సుగా తీసుకుని కథలు డిస్కస్ చేస్తూంటారు. ఆ తెలుగు సినిమాలో ఆ సీను అలా వర్కౌట్ అయింది కాబట్టి మనకి ఈ సీను ఇలా వర్కౌట్ అవుతుందని పరాధీన మనస్తత్వంతో నమ్మకాలేర్పర్చుకుని, లేదా ధృవీకరించుకుని సంతృప్తి చెందడం, లేదా భరోసా పొందడం. సీన్లే స్వశక్తితో భిన్నంగా ఆలోచించలేనప్పుడు కథలేం ఆలోచిస్తారు. సీన్లు కూడా టెంప్లెట్ సీన్లుగానే వస్తూంటే కథలేం కొత్తగా వస్తాయి. పాత ఫార్ములాల చట్రంలోంచి సీన్లు ఇవతలకి వచ్చి కొత్తగా రూపొందాలంటే వర్తమాన ప్రపంచపు డిమాండ్స్ ని తీర్చాలి. నిన్నటికి నిన్న రాత్రి ఇలాగే ఒక సీను చర్చకొచ్చింది. ప్రాణభయంతో వున్న హీరోయిన్, రక్షణగా వున్న హీరో విడి విడి గదుల్లో వుండే సిట్యుయేషన్. ఇలా వుంటే కాపాడలేననీ, ఇద్దరం ఒకే గదిలో వుండాలనీ అతనంటే, అపార్ధం జేసుకుని ఒప్పుకోదు. తను పడుకున్న గదిలో నిద్రపట్టక భయపడుతూ వుంటుంది. ఈ సిట్యుయేషన్ ని ఎలా ముగింపుకి తేవాలి? వెంటనే చూసిన సినిమాల్లోంచి ఐడియాలు చర్చకొచ్చేశాయి : ఏదో శబ్దానికి హీరోయిన్ తలగడెత్తుకుని లగెత్తు కొచ్చేసింది...సెల్ ఫోన్ అక్కడే వదిలేశానని హీరో గది తలుపు కొట్టింది...దాహమేస్తూంటే వాటర్ బాటిల్ కోసం హీరో గదికొచ్చింది...ఇలా జోరుగా టెంప్లెట్  సీన్ల ఎగుమతి దిగుమతులు.

        రైటర్ పదేళ్ళ పాత వాడు కావొచ్చు, కానీ ఇప్పుడు పుట్టించిన పాత్ర ప్రపంచానికి కొత్త. ఇప్పుడున్న ప్రపంచ డిమాండ్స్ కి తను ప్రతీక. హీరోయిన్ ఫార్ములా హీరోయిన్ గా గాక, ఇవాళ్టి యువతిగా ఈ సిట్యుయేషన్లో ఏమాలోచిస్తుంది? లేదా ఆలోచించాలి? నేనేమిటి భయపడడం? నా భయానికి ఇంకొకరి ఆసరా దేనికి? నా భయాన్ని నా భయం దగ్గరికే వెళ్ళి తీర్చేసుకుంటాను - అనుకుని ఆ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళిపోయి హోరెత్తుతున్న సముద్రం ముందు ఎసర్టివ్ గా నిలబడుతుంది. అప్పుడు హీరో నిశ్శబ్దంగా వచ్చి, తన దగ్గరున్న రివాల్వర్ని ఆమె కిచ్చేస్తాడు...ఇదీ ఈ సిట్యుయేషన్ కి ముగింపయింది. ఇది మిడిల్లో వచ్చే సీను. మిడిల్లో సీన్లు బిగినింగ్ సీన్లు లాగా వుండవు. మిడిల్ సీన్లంటే క్యారక్టర్ గ్రోత్ లేదా యాక్షన్ కంటిన్యూటీ, ఏదో ఒకటై వుంటాయి. పై సీను హీరోయిన్ క్యారక్టర్ గ్రోత్ తో వుంది. ఇక్కడ పాత టెంప్లెట్ సీను తెచ్చి కామెడీగా పడేస్తే?  
        ఇవాళ్టి  ప్రపంచంలో పుట్టిన పాత్రకి ఇవాళ్టి పురోగతి కావాలి. రైటర్ టెంప్లెట్ ప్రపంచంలో, పాత్ర ఇవాళ్టి ప్రపంచంలో వుంటే బలయ్యేది పాత్రే. ఇలాగే వెరైటీ కథలూ బలై పోతాయి. ‘ఎంత మంచి వాడవురా’ లో వెరైటీ కథే. కానీ జరింగిందేమిటి - పాత మూస టెంప్లెట్ చట్రంలో చాదస్తం. విచిత్రమేమిటంటే, ఇవాళ్ళ కొత్తగా కథకుడైన వాడు కూడా పదేళ్ళు పాత వాడిగా, భావాలతో నడుం వంగిపోయి ఈసురోమని రాయడం. వీడున్న మానసిక ప్రపంచమే వీడి పాత్ర, వీడి కథ, తెలుగు సినిమా వధ!

Q : ‘బొబ్బిలి పులి’ సినిమా రివ్యూ ఇన్ఫర్మేటివ్ గా వుంది...
అశోక్ పి, అసోషియేట్  
A : అందులో ముఖ్యమైనదొకటి మిస్సయ్యింది. అప్పట్లో దీని తర్వాత రాయడానికి చూసిన ముత్యాలముగ్గు, శంకరాభరణం, మేఘ సందేశం, సితారా అనే నాల్గు సినిమాల్లో (నాల్గూ మేటి దర్శకులవే) ఒక సమాన్యాంశం కనపడింది. ఈ నాల్గు పెద్ద హిట్స్ లో డైలాగులు అతి తక్కువ  వుండడం. అప్పుడు అనుమానమొచ్చి ‘బొబ్బిలి పులి’ మళ్ళీ చూస్తే ఇందులో అదే పరిస్థితి. చిన్న చిన్న సీన్లు, ఆ సీన్లలో ఒకటీ రెండు డైలాగులే. ఎందుకిలా చేశారబ్బా అని ఆలోచిస్తే, క్లయిమాక్స్ లో తెలిసింది. ఇరవై నిమిషాల క్లయిమాక్స్ కోర్టు సీన్లో ఎన్టీఆర్ డైలాగుల భారీ తాకిడి వుంటుంది. ఇంతసేపు ప్రేక్షకులు భరించాలంటే మిగతా సీన్లలో డైలాగుల భారం వేయకుండా చూడాలి. అందుకే ఒకటీ రెండూ డైలాగులు. దీనివల్ల రెండు గంటలసేపు తేలికైన మనసుతో సీన్లు చూసిన ప్రేక్షకులకి, ముగింపు డైలాగుల సుదీర్ఘ భారీ మోత అయ్యబాబోయ్ అన్పించదు. డాక్టర్ దాసరి నారాయణ రావు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని డైలాగులతో వ్యూహాత్మకంగా పాల్పడిన క్రాఫ్ట్ ఇది.

Q : సందేహాలు - సమాధానాలు ప్రతి వారం రెగ్యులర్ గా ఇస్తే మాకు ఉపయోగ పడుతుంది.
శ్రీనివాస్ రాయి, కో డైరెక్టర్
A : ఇంకో ఇద్దరు కూడా ఇలాగే రాశారు. నిజానికి స్క్రీన్ ప్లేలకి సంబంధించిన సమస్యలపైన సందేహాలు అడిగే వాళ్ళు తక్కువ. ఎలా అడగాలో తెలియకనో, బ్లాగులో వున్నవ్యాసాలతో అన్నీ తెలిసిపోతున్నాయిగా ఇంకా సందేహాలేమిటనో, ఇంకా లేదా చదివాంగా చాలు, మళ్ళీ అడగడం దేనికనో ఇలా వుంది పరిస్థితి. ఇప్పుడు ప్రతీవారం ఇవ్వాలంటే ఏం చేయాలి? మనమే సందేహాలు రాసి, మనమే సమాధానాలివ్వాలి. ఈ డూప్లికేట్ దందా అవసరమా, ఇంకో పనికొచ్చే పని చేసుకోకుండా? సందేహాలంది నప్పుడే శీర్షిక వస్తుంది. కాకపోతే అడిగిన వాళ్లకి సమాధానాలందడానికి ఆలస్యమవచ్చు. తెలుగులో అడిగే సందేహాల్ని ఇంగ్లీషు లిపిలో  పంపకండి. మళ్ళీ వాటిని తెలుగు లిపిలోకి మార్చాలంటే గూగుల్ ట్రాన్స్ లేట్ కూడా పనికిరాదు. తెలుగులోనే టైపు చేసి పంపండి. లేదా అడిగేదేదో ఇంగ్లీషులోనే అడిగెయ్యండి. అది తెలుగులోకి ట్రాన్స్ లేట్ అవుతుంది.   

సికిందర్