రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, డిసెంబర్ 2019, మంగళవారం

895 : రివ్యూ!


రచన -  దర్శకత్వం : కె. రవికిరణ్
తారాగణం :
 కిరణ్ అబ్బవరం, రహస్యా గోరక్, రాజ్ కుమార్, యజుర్వేద్, స్నేహ మాధురీ శర్మ, దివ్యా నర్ని తదితరులు
సంగీతం : జై క్రిష్ , ఛాయాగ్రహణం : సి. విద్యాసాగర్
నిర్మాత
: జి. మనో వికాస్
విడుదల : నవంబర్ 29, 2019
        సినిమాల్లో కెల్లా సులువైన సినిమా ప్రేమ సినిమా. తెలుగులో ఇది తీయాలంటే ఏమీ చేయనవసరం లేదు, ఉన్నదే మరోసారి శుభ్రం చేసి చూపిస్తే చాలు. చూసిందే చూసే తెలుగింటి ప్రేక్షకులు కాచుకుని వుంటారు. కాకపోతే దాని వెనుక పేరున్న నిర్మాతో, పంపిణీ దారో వుంటే ఇంకా ఆకర్షిస్తుంది. ఈ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న బడ్జెట్ ప్రేమ సినిమాకి ఇలాగే హైప్ వచ్చింది. బిజినెస్ జరగని చిన్న సినిమాలకి సురేష్ ప్రొడక్షన్స్ అండగా వుంటోంది. ఇది కొత్త దర్శకుడు రవి కిరణ్, కొత్త నిర్మాత మనోవికాస్ ల అదృష్టం. ఇద్దరికీ సినిమా ఎలా ఎంత సహజంగా తీయాలో మంచి టేస్టు వుంది. కావాల్సిందల్లా ఇప్పటి ప్రేక్షకుల టేస్టుకి దగ్గరగా వుండే సమకాలీన సబ్జెక్టు. ఇది లేకపోతే లాభంలేదని బయ్యర్లకి కూడా స్పృహ వచ్చేస్తోంది. అసలే మార్కెట్ కోల్పోయిన రోమాంటిక్ కామెడీలు తప్ప మరేమీ కన్పించక ఇంకేదో కావాలని వేచి చూస్తున్నారు. వీళ్ళని దాటుకుని వచ్చేసింది ‘రాజావారు రాణిగారు’. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కథ

       2010 గోదావరి జిల్లా రామాపురం. ఇంటర్ చదివే రాజా (కిరణ్ అబ్బవరం) రాణి (రహస్యా గోరక్) ని ప్రేమిస్తూంటాడు. ఈ విషయం ఆమెకి చెప్పలేడు. ఆమె తండ్రి రేషన్ డీలర్. తల్లి వుండదు. ఆమె సున్నితంగా, నెమ్మదిగా వుంటుంది. ఎంసెట్ పాసయి పై చదువుకి అమ్మమ్మ వాళ్ళ వూరెళ్ళి పోతుంది. దీంతో రాజా డీలా పడిపోతాడు. ఇక్కడే డిగ్రీ చదువుతూ చౌదరి (రాజ్ కుమార్), నాయుడు (యజుర్వేద్) అనే ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూంటాడు. రాణి ఏ వూరెళ్ళిందో తెలుసుకునే ప్రయతంలో వుంటాడు. మూడున్నరేళ్ళు చూసి చూసి, తాము రాణిని రప్పిస్తే రాజా మనసులోని మాట ఆమెకి చెప్పాలని ఫ్రెండ్స్ మాట తీసుకుని, రాణి తండ్రికి యాక్సిడెంట్ జరిపిస్తారు. ఇక రాణి వచ్చేస్తుంది. వచ్చిన రాణికి రాజా మనసులో మాట చెప్పాడా? ఇంకేం అవరోధాలు వచ్చాయి? వీటిని అధిగమించడానికి ఫ్రెండ్స్ ఎలా సహాయపడ్డారు? ఇదీ మిగతా కథ.


ఎలా వుంది కథ
        రోమాంటిక్ డ్రామా జానర్. గత రెండు దశాబ్దాలుగా వస్తున్న ప్రేమ సినిమాల దర్శకులకి తెలిసింది రెండే రెండు టెంప్లెట్స్. హీరో లేదా హీరోయిన్ ప్రేమ చెప్పలేకపోవడం, లేదా ఇద్దరూ అపార్ధాలతో విడిపోవడం. వందల ప్రేమ సినిమాలు ఈ రెండే అరిగిపోయిన, మూస ఫార్ములా స్టేటస్ కి చేరిపోయిన పాయింట్లతో పదేపదే వస్తున్నాయి. హిందీలో మన్మర్జియా, బరేలీ కీ బర్ఫీ, లుక్కా చుప్పీ లాంటి ప్రేమ సినిమాలు సమకాలీన ప్రేమ జీవితాలతో యువతని ఉర్రూత లూగిస్తున్నాయి. ప్రేమ సినిమాలు ఉర్రూత లూగించడం సమకాలీనంగా, కొత్త ఐడియాలతో ఫ్రెష్ గా వున్నప్పుడే జరుగుతుంది. తాజాగా ఇదే వారం విడుదలైన ‘ఏ సాలీ ఆషికీ’  కూడా ఇలాంటిదే. 

         ‘రాజావారు రాణిగారు’ కాలీన స్పృహకి సంబంధించి ఒక సమర్ధన చేశారు థీమాటికల్ గా. ఏమంటే ఈ ప్రేమ కథని ఈ కాలంలో కాకుండా, 2010 లో జరిగినట్టుగా చూపిస్తున్నట్టు సమర్ధన కనబడుతోంది. ఈమధ్య  ‘రణరంగం’ లో 1990 ల నాటి ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ ఇచ్చారు. ‘గద్దల కొండ గణేష్’ లో కూడా ఇదే ఇచ్చారు. ఇవి ఈ తరం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయా? పోనీ కిందటి తరం ప్రేక్షకులు వచ్చి చూశారా?

        క్వాక్ జీ యంగ్ తీసిన ‘ది క్లాసిక్’ కొరియన్ మూవీ పాత తరం తల్లి ప్రేమ కథతో, కొత్త తరం కూతురి ప్రేమ కథతో టూ ఇన్ వన్ గా వుంటుంది. తల్లీ కూతుళ్ళుగా ఒకే హీరోయిన్ నటించింది. దీన్ని రెండు తరాల ప్రేక్షకులూ ఉమ్మడిగా చూసి సక్సెస్ చేశారు (ఇదే బ్లాగులో సుదీర్ఘ విశ్లేషణ చేశాం). రెండు కాలాల ప్రేక్షకుల్ని ఆకర్షించడమన్నది ఇక్కడ మార్కెట్ యాస్పెక్ట్. మార్కెట్ యాస్పెక్ట్ పట్టించుకోకుండా క్రియేటివ్ యాస్పెక్ట్ తో ఏళ్ల తరబడి అదే సరుకు సరాఫరా చేయడం సినిమా వ్యాపారం అన్పించుకోదు. మార్కెట్ యాస్పెక్ట్ అంగీకరించి తీరాల్సిన పచ్చి వాస్తవం. క్రియేటివ్ యాస్పెక్ట్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వుండాల్సిన వొట్టి వూహ.    

         ప్రస్తుత ప్రేమ కథలో రాజా, పైన చెప్పకున్న రెండు పాయింట్లలో ఒక పాయింటైన ‘ప్రేమ చెప్పుకోలేక పోవడం’ అనే పాత్రచిత్రణతో, ప్రేమిస్తున్నాడని రాణీ తెలుసుకోకపోవడమనే పాత్ర చిత్రణతో - ఇద్దరి ప్రేమ కథకి ఒక ప్రతిష్టంభన ఏర్పడి, ఎటూ కదలని కథనంతో జడప్రాయంగా వుండి పోయింది. 

         కథా ప్రయోజనం విషయానికొస్తే, దశాబ్దకాలపు వెనకటి ఈ రొటీన్ రిపీట్ ఫార్ములా కథలోంచి ఈకాలం ప్రేమికులు తెలుసుకోవాల్సిందేమీ కన్పించడం లేదు. ఏళ్ల తరబడి ప్రేమని వ్యక్తం చేయలేకపోయే పాత్రతో ప్రాక్టికాలిటీ ఏముంటుంది. సినిమా అంటే ఆచరణ చూపడం. ఈ హీరోహీరోయిన్ల స్థాయి కూడా కామన్ సెన్సు లోపించి ప్రేక్షకులకంటే తక్కువ స్థాయిలో వుంది. 

       కథా ప్రయోజనమలా వుంచి వినోదాత్మక విలువ చూసినా ఫస్టాఫ్ వరకే ఎంటర్టైనర్. సెకండాఫ్ లో కెళ్తే సీరియస్ మూడ్. రోమాంటిక్ డ్రామా కాబట్టి సీరియస్ అని సరిపెట్టుకున్నా, ఆ సీరియస్ డ్రామా కూడా చలనంలో వుండక, పైన చెప్పుకున్నట్టు జడప్రాయంగా మిగిలింది. రెండుగంటలా పది నిమిషాల తక్కువ నిడివి ఒక్కటే కాస్త ఉపశమనం.  


        కాకపోతే కథకి ఎంచుకున్న నేపధ్యం ఆకర్షణీయంగా వుంది. కథ టెంప్లెట్ లో వుండిపోయి వాస్తవికత లేకపోయినా, నేపథ్య వాతావరణం రియలిస్టిక్ గా వుంది. దీనికి విరుద్ధంగా సత్యజిత్ రే తీసిన ‘నాయక్’ రియలిస్టిక్ కథ వచ్చేసి కమర్షియల్ స్ట్రక్చర్ తో వుంటుంది. ఇందుకే ఈ ఆర్ట్ సినిమా అంత బలంగా వుంది. దర్శకుడు రవికిరణ్ గోదావరి జిల్లా గ్రామీణ వాతావరణాన్ని, మనుషుల్ని, జీవితాల్ని, భాషనీ ఎలాటి కమర్షియల్ హంగులూ కృత్రిమత్వం  లేకుండా స్పటికస్వచ్ఛతతో చూపించడం వల్ల కథేమో గానీ ఈ నేపథ్యాన్ని- రూరల్ టూరిజాన్ని అనుభవిస్తూ ఎంత సేపైనా కూర్చోవచ్చు. ఈ టూరిజంలో చూపించిన ప్రతిభ రోమాంటిసిజంలో కనబర్చలేకపోయాడు. తన టేస్టు టూరిజానికే పరిమితమైంది. 

ఎవరెలా చేశారు
        హీరో హీరోయిన్లతో బాటు ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళు కొత్త వాళ్ళే. హీరోయిన్ రహస్య ప్రారంభ దృశ్యాల్లో కాసేపు కన్పించి వూరెళ్ళి పోతుంది (కథలో). ఇక సెకండాఫ్ లోనే తిరిగి వచ్చేది. ఫస్టాఫ్ లో ఈమె లేని ముప్పావు గంటా హీరో ఒక్కడే కన్పిస్తాడు. రహస్య తక్కువ మాట్లేడే, సున్నితమైన, నెమ్మదిగల పాత్రలో నటించడానికి పెద్దగా అవకాశం రాలేదు. సీన్లలోకి రావడం, వెళ్ళడం, లేవడం, కూర్చోడం లాంటి భౌతిక కదలికలే తప్ప - కథ ప్రకారం మానసిక స్పందనలు వుండని పాత్ర కావడం చేత, ఒక షో పీస్ లా వుండిపోతుంది. చిట్ట చివర్లోనే మనసువిప్పి తన కథంతా చెప్పుకున్నప్పుడు కాస్త నటించే అవకాశం లభిస్తుంది. ఈ నటించే అవకాశం లభించినప్పుడు విచిత్రంగా భౌతిక కదలికల్లేక, మనసొక్కటే మాట్లాడుతుంది. దర్శకుడి పొరపాటువల్ల ఇక్కడ పాత్ర ప్రదర్శించాల్సిన బాడీ లాంగ్వేజీ  కొరవడింది. ఇన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న ప్రేమని వెళ్ళబోసుకుంటున్నప్పుడైనా - హగ్ చేసుకోమ్మా, కాస్త కాళ్ళూ చేతులూ ఆడించి బలంగా హగ్ చేసుకుని భారమంతా దించేసుకో - ఈ సినిమాకి ఇప్పుడైనా మాంచి కిక్ తీసుకురా! - అనాలన్పిస్తుంది. చిట్ట చివరికైనా హగ్ చేసుకోని ప్రేమికులతో సగటు ప్రేక్షకుడి కంటికి ఎలాటి ప్రేమ సినిమా! అంతసేపూ వియోగంతో చేసిన సెటప్, చివరికి సంయోగంలో సరీగ్గా పే ఆఫ్ కాలేదు. తగిన డ్రామా కొరవడిన పెళుసు ముగింపుగా తేలింది. 


        హీరో కిరణ్ అబ్బవరం ఏకపక్ష ప్రేమికుడుగా మనసు పెట్టి బాగానే నటించాడు పాత్ర ప్రకారం. ప్రేమించడమే తప్ప ఆ ప్రేమని కార్య రూపంలోకి తేలేని ఇలాటి భయస్థుడి పాత్ర గతంలో చాలా ప్రేమ సినిమాల్లో వచ్చిందే. ప్రేమించానని చెప్తే కాదంటుందేమో, కాదంటే తట్టుకోలేనెమో నన్నభయం చుట్టూ చివరంటా సాగే ఈ పాత్ర విసుగులేకుండా నటించాడు, సెకండాఫ్ వచ్చేసరికి విసుగూ తెప్పించాడు. ఇంతకీ చివర్లోనైనా ప్రేమిస్తున్నట్టు చెప్పగల్గాడా అంటే లేదు. ఆమే చెప్పుకుని ఆమే దగ్గరవ్వాలి తప్ప తను కదలడు, మెదలడు. రోమాంటిక్ పాత్ర కాకుండా రోబోలా మిగిలాడు. పాటలన్నీ తనమీదే వున్నాయి, విషాద పాటలు సహా. 

        ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ కుమార్, యజుర్వేద్ లు సున్నిత హాస్యంతో సీన్లని చైతన్యవంతం చేశారు. గోదావరి జిల్లా వాళ్ళ లాగా ఆ నేటివిటీని అలాగే మెయింటెయిన్ చేశారు. మధ్యలో ట్రయాంగులర్ ఫార్ములా ప్రకారం హీరోయిన్ బావ పాత్ర రావడం, కామెడీ కుట్ర చేసి అతణ్ణి పంపడం పాత రొటీన్ వ్యవహారమే. దర్శకుడు మొహమాటం లేకుండా ఓల్డ్ స్కూల్ డ్రామాకే కట్టుబడి యూత్ లవ్ తీశాడు. 

        టెక్నికల్ గా విజువల్స్ బావున్నాయి. కెమెరా వర్క్ గోదావరి నేటివిటీకి అద్దం పట్టింది. సంగీతం కూడా బావుందిగానీ, ఈ సినిమాని మ్యూజికల్ హిట్ చేసేంత కాదు. తక్కువ పాత్రలుండడం వల్ల, ఒకే గ్రామపు లొకేషన్ కావడం వల్ల, బడ్జెట్ చాలా ఆదా అయినట్టుంది. 
 
చివరికేమిటి?
       ఈ రోమాంటిక్ డ్రామా ఇద్దరు దుండగులు ఒకడ్ని కిడ్నాప్ చేసి, వాడికి ఈ ప్రేమ కథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది. ఈ దుండగులెవరు, కిడ్నాప్ చేసిందెవర్ని అన్నది సస్పెన్స్ గా పెట్టుకుని నడిపారు. ఈపాటి కథకి మంచి క్రియేటివిటీయే. నేరుగా ఇంటర్ క్లాస్ రూమ్ నుంచే హీరో ప్రేమని ప్రారంభించి హీరోయిన్ కి చెప్పాలనుకునే విఫల యత్నాలు చూపించారు. ఆమె పై చదువుకి వూరెళ్ళి పోగానే హీరో వూళ్లోనే దిగాలుగా గడపడాన్ని చూపడం ప్రారంభించారు. ఇక్కడ్నించీ ఫస్టాఫ్ ని హీరోయిన్ లేకుండానే లాక్కొచ్చారు. ఇలా ఆఫ్ బీట్ సినిమా ప్రయత్నం చేశారు కథనంతో. మొత్తం ప్రేమ కథతోనే  ఆఫ్ బీట్ ప్రయత్నం చేయాల్సింది చేయలేకపోయారు. ఇక మూగ ప్రేమికుడైన హీరో ఫ్లాట్ క్యారక్టరైజేషన్ లో మార్పు ఇంటర్వెల్ ముందు ఫ్రస్ట్రేషన్ తో ఇతరుల్ని కొట్టే సీన్లు పెట్టారు. కానీ హీరోయిన్ ఏ వూరెళ్ళిందో ఆ వూరెళ్ళి ప్రయత్నించేలా చేయకుండా మూడున్నరేళ్ళూ వూళ్ళోనే ఏడ్పిస్తూ వుంచేశారు. ఇలాటి పాత్ర హీరోయిన్ కుంటుంది. వెళ్ళిపోయిన నాథుడి కోసం ఎదురు చూస్తూ గడిపే పాత హీరోయిన్ పాత్ర. ఇక్కడ హీరోని ఆడదానిగా మార్చి చూపెట్టారు. 


        హీరోయిన్ పాసివ్ పాత్ర, హీరో కూడా పాసివ్ పాత్రయి పోతే ఇక కథ ఎలా నడుస్తుంది. ఇందుకే ఈ పాసివ్ పాత్రల కథని ఫ్రెండ్స్ నడపాల్సి వచ్చింది. హీరోయిన్ ని రప్పిస్తే ఆమెకి లవ్ చెప్పే దమ్ముందా అని అడిగి, దమ్ముందంటేనే, హీరోయిన్ ని రప్పిస్తారు ఫ్రెండ్స్- ఆమె తండ్రికి యాక్సిడెంట్ జరిపించి.  సెకండాఫ్ లో హీరోయిన్ వచ్చాక కూడా లవ్ చెప్పే ఆలోచన హీరో చెయ్యడు, ఫ్రెండ్స్ కూడా అడగరు. ఇంటర్వెల్ పాయింటు మర్చిపోయారు. మళ్ళీ హీరోయిన్ కి లవ్ చెప్పలేని ఫస్టాఫ్ దృశ్యాలే రిపీటవుతాయి. ఫస్టాఫ్ నుంచీ కథ ఎక్కడేసిన గొంగళే. పాత్రకి కాన్ఫ్లిక్ట్ లేక, కథలో చేసే పనిలేక, మూగగా ప్రేమిస్తూ ప్రేమిస్తూనే వుండిపోతాడు. ఈ మూగ ప్రేమని కూడా - మూడున్నరేళ్ళు వేరే వూళ్ళో వుండొచ్చిన ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటో, ఎవర్నేనా ప్రేమించిందో ఏం పాడో -  తెలుసుకున్నాకే ప్రేమించాలో వద్దో నిర్ణయించుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా మూగ ప్రేమ - గుడ్డి ప్రేమ - చెవిటి ప్రేమగా ప్రేమిస్తూనే వుండిపోతాడు. ఇలా కథలేక సెకండాఫ్ వృధా అయింది. 

        ఇదీ ప్రేమ సినిమాల రెండు టెంప్లెట్లలో ఒక టెంప్లెట్ కథాకమామిషూ. ఇలాగే టెంప్లెట్స్ తో ప్రేమ సినిమాలు 2119 దాకా వర్ధిల్లుగాక! ఈ టెంప్లెట్ చాలా మన్నికైనది, బాంబు పెట్టి పేల్చినా చెక్కు చెదరదు.

సికిందర్