రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, April 25, 2019

808 : ఫ్లాష్ బ్యాక్




ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
 యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘స్వామీరారా ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ్  కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు. 



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి. 

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ ఏం సుగంధాల్ని వెదజల్లుతుందని.  

-సికిందర్