దర్శకత్వం : అని కన్నెగంటి
తారాగణం : సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాధ్, ప్రవీణ్, మధునందన్ తదితరులు
కథ, కథనం : ఆల్ఫోన్స్ పుతిరేన్, సంగీతం : సాయికార్తీక్, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్
బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి.
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర
విడుదల : 23 మార్చి, 2016
***
తారాగణం : సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాధ్, ప్రవీణ్, మధునందన్ తదితరులు
కథ, కథనం : ఆల్ఫోన్స్ పుతిరేన్, సంగీతం : సాయికార్తీక్, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్
బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి.
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర
విడుదల : 23 మార్చి, 2016
***
తెలుగులో ఈతరం దర్శకులు కూడా సొంత ప్రతిభే లేనట్టు రీమేకులకి తమ కష్టాన్ని కుదించు కోవడం / అలవాటు చేసుకోవడం మొదటి తప్పయితే, ఇలాగైనా సత్తా చూపి విజయం సాధించాలన్న నేర్పు కనబర్చకపోవడం రెండో తప్పు. గతవారం ‘తుంటరి’ పేరుతో రీమేక్ చేసిన తమిళ హిట్ కి ఓ యువదర్శకుడు ఎంత న్యాయం చేయగలిగాడో, అసలు రీమేకే చేయకూడని తమిళ - మలయాళ రెండు భాషాల్లో హిట్టయిందని చెప్పుకుంటున్న ఇంకో సినిమాని ‘రన్’ పేరుతో రీమేక్ చేసి ఈవారం అంతే దురన్యాయం చేశాడు ‘అని కన్నెగంటి’ అనే మరో యువదర్శకుడు. కొత్తగా టైటిల్ నే పెట్టుకోలేనప్పుడు రీమేక్ అనే వడ్డించిన విస్తరి కూడా అనవసరమే. అయితే ఈ ప్రయత్నంలో అసలు ట్రాజడీ ఏమిటంటే, ఇది రీమేక్ చేయకూడని ఇండీ ఫిలిం అని తెలుసుకో లేకపోవడమే!
రెండో తరం హీరోలతో అప్పటి దర్శకులు- పరుచూరి
బ్రదర్స్ రాస్తున్నంతా కాలమూ హీరోయిజాల్ని నిలబెట్టారు. మూడోతరం హీరోలతో తరం మారిన
అనేకమంది దర్శకులు స్క్రీన్ ప్లే పట్ల- పాత్ర చిత్రణల పట్లా కనీస ప్రాథమిక నియమాలే
తెలీక, ఈ హీరోలని చాలా నష్టపర్చారు.
ఇప్పుడు సందీప్ కిషన్ లాంటి నాల్గో తరం హీరోల కెరీర్స్ తోనూ కొత్తగా వస్తున్న ఈతరం
దర్శకులూ ఆడుకుంటున్నారు, ఏది తీయవచ్చో, ఏది తీయకూడదో తెలీక! లేకపోతే సందీప్ కిషన్ వెళ్లి వెళ్లి ఒక ఇండీ
ఫిలింలో నటించడమేమిటి!
నిర్మాణ సంస్థల దేముంది, ఫాంలో వున్న హీరో దగ్గర దర్శకుడు కథ ఓకే చేయించుకుని వచ్చేస్తే అన్నీ ఓకేగానే కన్పిస్తాయి. ఇంకే మార్కెట్ సరళులతో పనిలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి.వారికి కూడా మనం మార్కెట్ కి ఏమిస్తున్నామన్నది కాకుండా, ఎవరితో ఇస్తున్నామనేదే ముఖ్యమనీ భావించుకోవాల్సి వస్తోంది.
కథ
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంజయ్ అలియాస్ సంజు ( సందీప్ కిషన్) పని చేస్తున్న అమెరికన్ కంపెనీ మూతబడ్డంతో రోడ్డున పడతాడు. అక్క పెళ్లికి కి కట్నం తాలూకు ఇంకో లక్ష బావకి బాకీ ఉంటాడు. ఆ వొత్తిడి పెరిగి వడ్డీ రాజా (బాబీ సింహా) దగ్గర అప్పు చేస్తాడు. దీనికి ఒక మిత్రుడు (ప్రవీణ్) హామీగా ఉంటాడు. మూడు నెలలు గడువు. వడ్డీ రాజా ఒక లోన్ షార్క్. పెట్టిన గడువుకి గంటలస్యమైనా ఇంట్లో ఆడవాళ్ళని బందీలుగా పెట్టుకుంటాడు. ఇది వీలుగాక పోతే తన్ని వసూలు చేసుకుంటాడు. అదీ కుదరకపోతే చంపి పారేస్తాడు.
ఆ రోజు రానే వస్తుంది సంజుకి. ఈ మూడు నెలలూ అప్పు కట్టలేక పోయాడు. ఇప్పుడు హామీవున్న మిత్రుడికే ప్రాబ్లం. మరో వైపు చిన్నప్పట్నుంచీ ప్రేమించుకుంటున్న అమూల్య (అనీషా ఆంబ్రోస్ ) తో సమస్య వుంది. ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఇద్దరూ లేచిపోవాలనుకుంటారు ఇదే రోజు. ఓ చోట ఆమెని వెయిట్ చేయమని చెప్పి, తను డబ్బు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఎలాగో ఆ మిత్రుడే లక్ష ఇచ్చి ఆదుకుంటాడు. ఆ డబ్బుతో వడ్డీ రాజా దగ్గరికి వెళ్తూంటే దొంగ కొట్టేస్తాడు. అటు వెయిట్ చేస్తున్న ఇంకో దొంగ అమూల్య గొలుసు కొట్టేస్తాడు. ఇటు డబ్బు పోగొట్టుకున్న సంజూ ఇరకాటంలో పడతాడు. అటు అమూల్య తండ్రి సంజు మీద కిడ్నాప్ కేసు పెడతాడు. ఇటు వడ్డీ రాజ పెట్టిన గడువు సాయంత్రం ఐదు కల్లా సంజు లక్ష సంపాదించాలి. ఇదీ విషయం. ఈ గడువు కల్లా సంజయ్ డబ్బు సమస్య, ప్రేమ సమస్య ఎలా తీరాయన్నదే మిగతా కథ.
ఎలా వుంది కథ
‘స్వామీ రారా’ తెలుగులో రోడ్ మూవీస్ కి ఒక ఒరవడిని సృష్టించడంతో, ఇదే దారిలో ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘భలే మంచి రోజు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అనేవి వస్తున్నాయి. అదేపనిగా వస్తూంటే చూడ్డం కష్టమే. ‘రన్’ కూడా వచ్చింది, ఒక రోజులో ముగిసే కథతో. ఇక్కడ మిగతా వాటికీ దీనికీ ఒక స్పష్టమైన తేడా వుంది. అదేమిటో చెప్పమంటే టాలీవుడ్ లో ఒకరిద్దరు కూడా చెప్పగల్గడం మహా కష్టమే.
‘రన్’
ని రోడ్ మూవీ అనీ, థ్రిల్లర్ అనీ ఇంకేదో అనీ ఈజీగా చెప్పేయవచ్చు. గానీ మూలంలో ఇది ఇండీ ఫిలిం కి
రీమేక్. ట్రాజడీ ఏమిటంటే, తెలిసి ఎవ్వరూ ఇండీ ఫిలింని రిమేక్ చెయ్యరు!
ఒక దర్శకుడు ముచ్చటపడి తను రాసుకునే సొంత డైరీ లాంటిది ‘ఇండీ ఫిలిం’ అనే ఇండిపెండెంట్ ఫిలిం. ఇండిపెండెంట్ అనడంలోనే అర్ధమవుతోంది- స్ట్రక్చర్, క్యారక్టరైజేషన్స్ వంటి ఏ సినిమా నియమావళికీ తను బద్ధుడు కాదనీ, ‘నా సినిమా నా ఇష్టం’ అనే ఆవేశంతో తీసి పడేస్తాడనీ. హిందీలో ఇది నిత్య కార్యక్రమమైపోయింది. కనుక ఇండీ ఫిలిమ్స్ ని మామూలు కమర్షియల్ సినిమాల దృష్టితో చూడరు, చూస్తే ఎంజాయ్ చేయలేరు. అలాగే జ్ఞానమున్న ఏ రివ్యూ రైటరూ వీటిమీద విరుచుకుపడడు. దీన్ని దీనిలాగే చూడ్డానికి తిప్పలు పడి మైండ్ సెట్ ని మార్చుకుంటాడు.
ఇక్కడ సోది అనుకోకుంటే మరి కొన్ని చెప్పుకోవాలి. షార్ట్ ఫిలింని పొడిగిస్తే ఇండీ ఫిలిం( అసలు ఫిలిం ఎక్కడుందిప్పుడు అంతా డిజిటలే! ఫిలిం ఉన్నంత కాలం ఆ ఖర్చుకి, ప్రాసెసింగ్ కీ జడిసి ఇండీ ఫిలిం అనే పైత్యం పుట్టలేదు- డిజిటల్ రాగానే అడ్డమైన కోరికలూ పుట్టుకొస్తున్నాయి). మల్టీప్లెక్సుల పుణ్యమాని కమర్షియల్ సినిమాల నుంచి కొద్దిగా పక్కకు జరిగి, క్రాసోవర్ (కమర్షియల్ + ఆర్టు) సినిమాలనేవి ఒక విప్లవం బాలీవుడ్ వరకూ. డిజిటల్ విప్లవంతో క్రాసోవర్స్ నుంచి ఇంకా ముందుకుసాగి వేషం కడుతున్నవే ఇండీ ఫిలిమ్స్.
ఒకటి
గమనిస్తే, ఆల్ఫోన్స్ పుతిరేన్ అనే షార్ట్
ఫిలిం మేకర్ మూడేళ్ళ క్రితం తొలిసారిగా సినిమాకి
సంకల్పించి, ఏకకాలంలో తమిళ - మలయాళ ద్విభాషా చిత్రంగా ‘నేరమ్’ (అంటే ‘కాలం’) అనే ఇండీ ఫిలిం తీశాడు. బడ్జెట్ కేవలం కోటిన్నర,
ద్విభాషా చిత్రం కాబట్టి. ఒక భాషలోనే తీస్తే ఇండీ ఫిలిమ్స్ ని చాలా తక్కువ ఖర్చుతో
తీస్తారు. ఈ రెండు భాషల్లో 18 కోట్లు వసూలు
చేసింది.
చెన్నై లోని మండవిల్లీ లో తను గడిపిన రోజులనాటి అందమైన సొంత డైరీలాంటి సంగతుల్ని అదే మండవిల్లీ నేటివిటీలో తన ఫీలింగ్స్ తో తను ఇండీ ఫిలింగా తీసుకున్నాడు. తమిళ, మళయాళ ప్రేక్షకులకి నచ్చింది. దీన్ని తనే హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు.
ఇండీ ఫిలిమ్స్ ని ఒరిజినల్ దర్శకుడు అదే ఎఫెక్ట్ తో సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసుకోగలడు. అందుకే తమిళ మలయాళ భాషల్లో హిట్టయింది.
ఇదే దర్శకుడు ‘ప్రేమమ్’ అని మరో హిట్ తీశాడు. దీన్ని ఇండీ ఫిలిమ్స్ నుంచి పక్కకు జరిగి, పూర్తి వినోదాత్మకమైన క్రాసోవర్ గా తీశాడు. దీన్నే తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ‘నేరమ్’ ని గతేడాది ‘టైం బారా వెయిట్’ అంటూ మరాఠీలో రీమేక్ చేశాడు రాహుల్ భటంకర్ అని వేరే కొత్తదర్శకుడు. ఇతను పాల్పడిన దుశ్చర్య ఏమిటంటే, ఆ ఒరిజినల్ ఇండీ ఫిలింలో వున్న బోరునంతా తీసేసి, వేగంగా పరుగెత్తే పక్కా థ్రిల్లర్ గా తీశాడు. హిట్టయ్యింది.
తెలుగు దర్శకుడు ఇలాటి దుశ్చర్య కైనా పాల్పడకుండా, ఒరిజినల్ స్క్రీన్ ప్లేని చెడగొట్టకుండా పూర్తి నిబద్ధతతో తీశామని చెప్పుకున్నాడు (షాట్లు కూడా ఒరిజినల్లో వున్నవే కదా). అసలా ఒరిజినల్ స్క్రీన్ ప్లే కమర్షియల్ సినిమాకోసం రాసిందేనా!
ఎవరెలా చేశారు
గత మూడేళ్ళుగా ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నా మళ్ళీ ఒక్క హిట్ కూడా దక్కని నాల్గో తరం యంగ్ హీరో సందీప్ కిషన్ కి, మూడో తరం హీరోల కష్టాలే ఎదురవుతున్నాయి మ్యాటర్ కొరవడిన తన తరం దర్శకులతో కూడా!
ఇప్పటి హీరోల దురదృష్టమేమిటంటే, అప్పటి హీరోలు అప్పటి దర్శకుల చేతుల్లో సేఫ్ గా వున్నట్టు, ఇప్పటి దర్శకుల చేతుల్లో ఇప్పటి హీరోలు సేఫ్ గా వుండలేక పోతున్నారు.
మిగతా మేకింగ్ విషయాలు పక్కన పెట్టి, అసలు యాక్టివ్ (కమర్షియల్ సినిమా) – పాసివ్ ( ఆర్ట్ సినిమా) పాత్రల తేడాల గురించి మూడో తరం హీరోలతో చాలామంది దర్శకులకి వున్న అజ్ఞానాన్నే, ఇప్పుడు నాల్గో తరం హీరోలతో యువతరం దర్శకులూ కొనసాగిస్తున్నారు.
నాల్గో తరం హీరోల ఇంకో దురదృష్టం ఏమిటంటే- వీళ్ళు వివిధ స్కూల్స్ లో యాక్టింగ్ కోర్సులు నేర్చుకుంటారు. కానీ యాక్టింగ్ స్కూల్స్ కి తాము తయారు చేస్తున్న హీరోలు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాలన్న పరిశీలన లేదు. వుంటే విధిగా నటనలో భాగంగా యాక్టివ్- పాసివ్ (బకరా) పాత్రల తేడాల గురించి కూడా నేర్పి జాగ్రత్త చెప్తారు.
ఇంకా ఈ పాసివ్ డైరెక్టర్ల బ్రిగేడ్ నుంచి విముక్తి ఎప్పుడు? తెలుగు సినిమాల్ని భ్రష్టు పట్టిస్తూ దశాబ్దంన్నర కూడా దాటిపోయింది. నాల్గో తరం హీరోలు కూడా బకరాలుగా బలిపీఠం ఎక్కుతున్నారు.
సందీప్ కిషన్ కి తాను పోషిస్తున్నది బకరా పాత్ర అనీ ఎలా తెలియాలి? ఇండీఫిలిమ్స్ లో అన్నీ బకరాలే వుంటాయి. లేకపోతే విలన్ అనే వాడు పూర్తి స్థాయిలో సందీప్ కిషన్ చేతిలో చావల్సింది పోయి, ఎక్కడో ఆటో గుద్దుకుని ఛస్తే- వాడు చావాల్సింది నా చేతిలో కదా అనిపించలేదా సందీప్ కి?
హీరోయిన్ తో మొదటి అరగంట లోపే – ఆ తర్వాత కన్పించకుండా పోయిన హీరోయిన్ విలన్ కారు డిక్కీలోనే బకరాలా వుండిపోయి- క్లయిమాక్స్ కూడా అయిపోయాక డిక్కీలోంచి తంతూంటేగానీ, ఆమె గుర్తుకు రాకపోతే- ఇదేమిటి హీరోయిన్ తో నాకు రోమాన్స్ ఏదీ? పాటలేవీ అని అడగాలన్పించలేదా?
పోయిన డబ్బుకోసమో, హీరోయిన్ కోసమో ప్రయత్నించకుండా, ఎప్పుడు బడితే అప్పుడు దార్లో మెట్ల మీదా, ఫుట్ పాత్ ల మీదా కూర్చుని, దేశం గురించి మనోజ్ కుమార్ బాధ పడిపోతున్నట్టు, ఏడ్పు మోహంతో అలా శూన్యంలోకి చూస్తూంటే- ఇదేమిటి, నేను యాక్షన్లో కొచ్చి కనీసం టైటిల్ ధర్మం కొద్దీ లేచి వురకాలి కదా - అని అడగాలన్పించలేదా?
నేనేం
చేయకుండానే నా సమస్యలెలా సాల్వ్ అయిపోతాయి- అదేదో “It was the best of times, it was the worst of times...”అని రాస్తూ చార్లెస్ డికెన్స్ మహా నవల
ప్రారంభించినట్టు, ‘మంచి కాలం, చెడు కాలం’ అంటూ సినిమా
ప్రారంభిస్తూ ప్రతిపాదించిన కాన్సెప్ట్ ప్రకారం- నాకు చెడు కాలం దాపురించి డబ్బులుపోతే,
మళ్ళీ మంచి కాలం కోసం నేనేమీ చెయ్యకుండా, దానికదే
వచ్చేస్తుందా మంచి కాలం? కలియుగం యాక్షన్లో వుంటే మాటలతో పని జరుగుతుందా? కర్మలతో విధిని
ఓడించవచ్చని తెలిశాకా, నా చేతులు కట్టేసి మెట్ల మీద బకరాలా కూర్చోబెట్టేసి మంచి కాలం
వస్తుందంటారా- అని నిలదీయాలన్పించలేదా?
ఇలావున్న
కథ కమర్షియల్ కాదని అనుమానమే రాలేదా?
చివరికేమిటి?
గంభీరంగా
చెప్పుకోవడాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే, చిట్టడివి లాంటిది క్రియేటివ్ లోకం. ఇందులో
దారులు కనుక్కోవడం ఎవరి తరంగాదు, జీవిత కాలం సరిపోదు. దారులు అనేకం ఉంటాయన్న స్పృహ
అయినా వుండాలి. కాక, ఈ చిట్టడివిని దాటించే దారి ఒక్కటే అనీ, అది మాకు తెలిసిన
కమర్షియల్ దారేననీ అనుకుంటే మాత్రం దారి తప్పిపోక తప్పదు. కమర్షియల్ సినిమా
ఒక్కటే, సమాంతర సినిమాలెన్నో జాతులు. ఆర్ట్ సినిమాల మీదుగా, అవాంట్ గార్డ్, ఫిలిం
నాయిర్, మ్యాజిక్ రియలిజం...ఇలా జాతోపజాతులుగా విస్తరిస్తూ వచ్చి, క్రాసోవర్ ని
కూడా దాటేసి ఇండీ ఫిలిమ్స్ దగ్గర వుంది ప్రస్తుతం. క్రియేటివ్ లోకమనే చిట్టడివిని
దాటించే ఇంకెన్ని దారులున్నాయో, ఎప్పుడెప్పుడు ఏవేవి బయట పడతాయో ఎవరికీ తెలీదు...వీటన్నిటినీ
కమర్షియల్లో కుదెయ్యొచ్చని ఆశపడి కుక్కర్
లో కుక్కి వండే ప్రతయ్నం చేస్తే మాత్రం పేలిపోతుందా కుక్కర్!
-సికిందర్
http://www.cinemabazaar.in/
http://www.cinemabazaar.in/