రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 12, 2024

1403 : రివ్యూ

 

డియర్ రీడర్స్, ఈ రోజునుంచి రెగ్యులర్ గా ఆర్టికల్స్ వెలువడుతాయి.
రచన- దర్శకత్వం : ఐశ్వర్యా రజనీకాంత్
తారాగణం : రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, నీరోషా, జీవిత, లివింగ్ స్టన్, తంబి రామయ్య తదితరులు
కథ : విష్ణు రంగసామి, సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : విష్ణు రంగసామి
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్, నిర్మాత : సుభాస్కరన్ అల్లిరాజా
విడుదల : ఫిబ్రవరి 9, 2024
***

        సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ తర్వాత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా లాల్ సలాం’. దీనికి రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో ఆసక్తి రెట్టింపయింది. అయితే ఇందులో రజనీ అతిధి పాత్ర పోషించారని తెలియడంతో, విడుదలకి ముందు సరైన ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో దీని ప్రభావం ఓపెనింగ్స్ మీద పడింది. అయినా మత సామరస్యం గురించి తీసిన ఈ సినిమా మణిరత్నం తీసిన బొంబాయి లా వుంటుందేమో చూద్దామని ఆసక్తి పెంచుకుని వెళ్తే జరిగేదేమిటి? ఇందులో మతం ఎక్కడుందని వెతుక్కోవడమా? జాతర ఎక్కువైందని విసుక్కోవడమా? కాంతారా దగ్గర్నుంచి ఈ మధ్య సినిమాల్లో జాతరలు ఎక్కువైపోయాయి. అయినా ఈ మతం-కమ్ -జాతర జాయింటు సినిమా ఒకే టికెట్టు మీద చూసే అదృష్టానికి మార్కులేసి చూస్తే ఎలా వుందంటే...

కథ

1990 లలో కసుమూరు అనే గ్రామంలో గురుమూర్తి అలియాస్ గురు (విష్ణు విశాల్), షంసుద్దీన్ అలియాస్ షంసు (విక్రాంత్) అనే చిన్నప్పుడే శత్రుత్వాలతో విడిపోయిన స్నేహితులు. గురు తండ్రి (ఫిలిప్ లివింగ్ స్టన్), షంసు తండ్రి, వూరి పెద్ద మొయిద్దీన్ భాయ్ అలియాస్ భాయ్ (రజనీకాంత్) మంచి స్నేహితులు. గురు తండ్రి చనిపోవడంతో అతడి కుటుంబాన్ని భాయ్ ఆదుకున్నాడు. గురు తల్లి (జీవిత) భాయ్ ని అన్నలా భావిస్తుంది. క్రికెట్ లో ఆసక్తి వున్న గురు- షంసు ఇద్దరూ ఎప్పుడూ ఘర్షణ పడుతూంటారు. పక్కూరి ప్రత్యర్ధి వీళ్ళిద్దరి మధ్య, అవసరమైతే వూళ్ళో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలనే పథకంతో వుంటాడు. ఇందుకు కొడుకుని ప్రయోగిస్తే వాడి చెయ్యి విరగ్గొట్టి గురు జైలుకి పోతాడు.
       
ఇలావుండగా
, భాయ్ ముంబాయికి షిఫ్ట్ అయి అక్కడ బిజినెస్ చేపడతాడు. ఇటు వూళ్ళో జాతర వుంటుంది. జాతరలో రధం ఊరేగింపులో పక్కూరి ప్రత్యర్ధి కొడుకు వూడి పడి తన వూరి రధాన్ని తను లాక్కుపోతాడు. గురు మీద కోపంతోనే ఇలా చేశాడని గురుని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. గురు కొత్త రధంతో తిరిగి రావాలని సంకల్పిస్తాడు.
        
ఇంతలో షంసు రంజీ ట్రోఫీలో సెలెక్టు కావడంతో వూళ్ళో క్రికెట్ కి ఏర్పాట్లు జరుగుతాయి. పక్కూరి ప్రత్యర్ధి పన్నిన కుట్రలో భాగంగా వూళ్ళో రెండు మత వర్గాలు త్రీ స్టార్ టీంగా- ఎంసిసి టీంగా విడిపోతాయి. ఆ క్రికెట్ లో ఘర్షణ చెలారేగి గురు షంసు చేయిని నరికేస్తాడు.
       
ఇప్పుడు భాయ్ ఏం చేశాడు
? గురు మీద కక్ష గట్టాడా? చేయి కోల్పోయిన కొడుకుకి ఏం న్యాయం చేశాడు? దీంతో మత గొడవలు పెరిగాయా? జాతరలో రధం సమస్య ఏమైంది? జాతరకీ, ఉర్సుకీ సంబంధమేమిటి? క్రికెట్ కీ మతాలకీ సంబంధమేమిటి? ఇవన్నీ పరిష్కరిస్తూ భాయ్ ఇచ్చిన సందేశమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

ఎలా వుంది కథ

1971 లో గుల్జార్ దర్శకత్వం వహించిన మేరే అప్నే (నావాళ్ళు) విడుదలైంది. ఇందులో శత్రుఘ్న సిన్హా, వినోద్ ఖన్నా ప్రత్యర్ధులుగా, మీనా కుమారి ఆ ఇద్దరి మధ్య శాంతికి ప్రయత్నించే వృద్ధురాలైన వితంతువుగా నటించారు. వ్యవస్థకి వ్యతిరేకంగా రెండు యువజన సంఘాల ఆధిపత్య పోరు ఈ సినిమా. ఈ ఘర్షణల్లో తుపాకీ తూటాకి శాంతి దూత మీనాకుమారి నెలకొరుగుతుంది. ఎదుటి వర్గాన్ని నాశనం చేయబోతే వెనుక నీ వాళ్ళు కూడా నాశనమవుతారని చెప్తుందీ కథ. సూటిగా, బలంగా వుంటుందీ కథ. ఇంకా అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్లు యాంగ్రీ యంగ్ మాన్ గా కోపాన్ని ఒంటరిగా చూపించకముందే, గుల్జార్ సామూహిక కోపాన్ని చాలా ప్రశంసనీయ శైలిలో చిత్రీకరించాడు. యువ మనస్సు జీవిత ఆదర్శాలని సాధించలేనప్పుడు, అందుబాటులో వున్న కుటుంబ నిర్మాణంలో జీవించలేనప్పుడు, లేదా అటువంటి వ్యవస్థలో తన భావాల్ని వ్యక్తపరచలేనప్పుడు, అది ఆ నిర్మాణం వెలుపల ప్రమాదకర తావుల్ని వెతుక్కుంటుందని సందేశం. ఇది ఈ నాటికీ రిలవెంట్ సందేశం.
        
'లాల్ సలాం లో ఆ ప్రమాదకర తావు మతోన్మాదం కావచ్చు.  మత సినిమాలో లాల్ సలాం టైటిల్ కి అర్ధమేమిటో కూడా చెప్పకుండా వదిలేశారు. మతాన్ని నమ్మితే మనసులో వుంచుకో, మానవత్వాన్ని నమ్మితే అందరితో పంచుకో  అని రజనీ చేత చెప్పించారు. ఇక్కడ కూడా టైటిల్ జస్టిఫై కాలేదు. చివర్లో సలామాలేకూం- అస్సలామాలేకూం  అర్ధం చెప్పించారు. ఇప్పుడు కూడా టైటిల్ జస్టిఫై కాలేదు. కులం వుంటే, మతం వుంటే ఇంటి దగ్గర వుంచుకో. బయటికొస్తే సామాజికం- లాల్ సలాం అని అర్ధమయ్యేలా చెప్పించలేక పోయారు, ఈ సినిమా ద్వారా తీసుకున్నది వామపక్ష స్టాండ్ అయినప్పటికీ.
       
మత కథ కూడా సూటిగా
, బలంగా చెప్పలేకపోయారు. పైగా ఒక వొరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు మత కథ, జాతర కథ రెండూ జొప్పించి అసలేం చెప్తున్నారో అర్ధంగాకుండా చేశారు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ పూర్తయినా కథ దేనిగురించో స్పష్టత వుండదు. ఒకటి రెండు సార్లు హీరోలిద్దరి ఘర్షణ, ఆ తర్వాత చిన్న హీరో అదృశ్యమై పెద్ద హీరోతో తల్లి తగాదాలు, పక్కూరి ప్రత్యర్ధి కొడుకుతో ఘర్షణలు, క్రికెట్ ని అభిమానించే కొడుకుని రజనీ ప్రేమించడం, వూరి పెద్దగా పెదరాయుడు టైపులో కాకపోయినా ఓ మోస్తరుగా రజనీ నిర్ణయాలు చెప్పడం- ఇలా ముస్లిం వేషధారులు తిరుగుతున్నా మత కథ చిహ్నాలు కూడా లేకుండా, బ్యాక్ గ్రౌండ్ లో అన్ని సన్నివేశాలకీ ఏఆర్ రెహ్మాన్ డప్పు మేళాలతో ఒకే టైపు సంగీతం వస్తూంటే-ఈ జాతర సంగీతం ఎందుకొస్తోందాని ఆలోచిస్తూంటే, చివరికి 50 నిమిషాలకి వూళ్ళో జాతర, జాతర పాట!
       
పాట అవగానే
, పక్కూరి ప్రత్యర్ధి కొడుకు  రధం లాక్కు వెళ్ళిపోవడంతో, పెద్ద హీరో వూళ్ళోంచి బహిష్కరణకి గురవడంతో కథేమిటో అర్ధంగాకుండా ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ ప్రారంభమైతే జాతర కథకే కొనసాగింపు. ఇక్కడ పెద్ద హీరో కొత్త రధం తీసుకురావాలని సంకల్పించడంతో, ఇప్పుడు జాతర కథ అర్ధమై కొంత సేపు సాగుతుంది. అరగంట గడవగానే ప్లేటు ఫిరాయించి మత కథగా మారుతుంది. ఇప్పుడు ముంబాయిలో వున్న రజనీ, కొడుక్కి రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యాడని చెప్పడం. రజనీ ఫస్టాఫ్ మధ్యలో ముంబాయి వెళ్ళి బిజినెస్ పెట్టడం జాతర కథకి అడ్డున్నాడనేమో. ఇక ఇప్పుడు వూళ్ళో క్రికెట్ తో మత కథ, దాని పరిణామాలు, చిన్న హీరో చెయ్యి పెద్ద హీరో నరకడం!
       
ఇప్పుడు రజనీ  వూళ్ళోకి తిరిగి రావడం. చిన్నప్పట్నుంచీ హీరోలిద్దరూ శత్రువులుగా వున్నా వూరి పెద్దగా వాళ్ళని మార్చేందుకు ప్రయత్నించని రజనీ ఇప్పుడేం చేస్తాడు. పాత్రచిత్రణ ఇలా దెబ్బతిన్నాక
, ఇక చేసేదంతా ఫార్ములా ప్రకారమే. చివరికి నీ మతం, నా మతం అని కాదు. రక్తం ఒకటే. మనం అన్నదమ్ములుగా బ్రతకాలి, మృగాలుగా మారకూడదు అని పేలవమైన డైలాగులు.  
        
'ఇది మా వూరు. అప్పుడే మిమ్మల్ని ఆ దేశానికి తరిమేసి వుంటే ఇలా వుండేది కాదు అని గ్రామస్తుస్థులు అంటే, ముస్లిం దేశభక్తి గురించి, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తామని, ఇండియన్లమనీ రొటీన్ డైలాగులు.
       
ఈ కథ పూర్తవగానే కొత్త రధంతో జాతర కథ క్లయిమాక్స్
. ఇది సినిమాలో రెండో క్లయిమాక్స్. కొత్త రధంతో మళ్ళీ మత ఘర్షణలు, చివరికి జాతరనీ, ఉర్సునీ భాయ్ భాయ్ చేస్తూ సుఖాంతం!
       
ఇలా దేని ప్రభావం ఫీలవకుండా రెండు కథలు జొప్పించి దర్శకురాలు ఏం తీసిందో అర్ధం గాకుండా చేయడం. కొత్తదనం లేకుండా పాత కాలపు సీన్లు. మత పాయింటుతో రెండు మూడు చోట్ల ధైర్యాన్నే ప్రదర్శించింది. వూళ్ళో ఇండియన్ టీమ్
, పాకిస్తాన్ టీమ్ అని చెప్పి. కానీ బాక్సాఫీసు అప్పీలుతో బాటు, యూత్  అప్పీల్ వుండే  క్రికెట్ ఒకదాన్నే తీసుకుని, దీన్నుంచి కూడా రాజకీయ శక్తులు మత ఘర్షణలు సృష్టించి పోలరైజ్ చేయగలవని హెచ్చరించి వుంటే సమకాలీన సినిమాగా వుండేది- రజనీని రిస్కులో పడే కోచ్ గానో, అంపైర్ గానో చూపించి! 

నటనలు -సాంకేతికాలు

జైలర్ లో ఇమేజిని పక్కన పెట్టి నటించిన రజనీకీ ఇందులో రజనీకీ పొలికే లేదు. ఇమేజిని పక్కన బెట్టడం వరకూ బాగానే వుంది కానీ, ఈ వాస్తవిక పాత్రలో డెప్త్, బలం కనిపించవు. భావోద్వేగం వుండదు. ఒకవేళ కమర్షియల్ గా విజృంభించి నటించినా సినిమాని కాపాడేంత విషయం సినిమాలో లేదు. డైలాగుల్లో కూడా పస లేదు. జవాన్ లో షారుఖ్ ఖాన్ చివర్లో పదినిమిషాలు ఓటర్లు ఏం చెయ్యాలో చెప్పే పవర్ఫుల్ డైలాగులకి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు ప్రేక్షకులు.
       
రజనీ భార్యగా మాజీ హీరోయిన్ నీరోషా నటించింది. విష్ణు విశాల్ తల్లిగా జీవిత ఎప్పుడూ లౌడ్ గా ఏడుస్తూనే వుండే విషాద పాత్ర. హీరోలుగా విష్ణు విశాల్
, విక్రాంత్ ల శతృత్వం ఫ్లాట్ గా వుంటుంది. ఎప్పుడో చిన్నప్పట్నుంచీ శత్రువులని పరోక్షంగా చెప్పకుండా, ఇప్పుడు నడుస్తున్న కథలో ఫ్రెండ్స్ గా చూపించి, శత్రువులుగా మార్చి వుంటే డైనమిక్స్ తో థ్రిల్ చేసేది ప్రత్యక్ష శతృత్వం. ఇక మిగతా పాత్రల్లో నటీనటులు  చాలా మందే వున్నారు.
        
ఏఆర్ రెహమాన్ సంగీతం సెకండాఫ్ లో కూడా జాతర సంగీతమే. మత సంగీతం ఎక్కడా విన్పించదు. ఉర్సులో కూడా సూఫీ సంగీతం వుండదు. పాటలు ప్రశ్నార్ధకంగా వున్నాయి. ఇక దీనికి ఛాయాగ్రహణం సమకూర్చిన విష్ణు రంగ సామియే కథ కూడా అందించాడు. ఈ కథకి ఇతడితోనే కలిసి ఐశ్వర్య స్క్రీన్ ప్లే రాసింది- ఇది స్క్రీన్ ప్లే అనుకుంటే! సాంకేతికంగా సినిమాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నా స్క్రీన్ ప్లే రచనలో అభివృద్ధి చెందకుండా అద్భుతంగా హాస్యాస్పదంగా తయారవుతున్నారు దర్శకులు.
—సికిందర్

Friday, February 2, 2024

1402 : రివ్యూ

రచన- దర్శకత్వం: దుష్యంత్ కె

తారాగణం : : సుహస్, శరణ్యా ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : వాజిద్ బేగ్, కూర్పు : పవన్ కళ్యాణ్
బ్యానర్స్: జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్
సమర్పణ: బన్నీ వాసు, వెంకటేష్ మహా
నిర్మాత
లు: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి
విడుదల : ఫిబ్రవరి2, 2024


***

        త సంవత్సరం రైటర్ పద్మభూషన్ అనే హిట్ లో నటించిన హీరో సుహాస్, ఈసారి గ్రామీణ నేపథ్యంలో మూస ఫార్ములాకి దూరంగా వాస్తవిక సినిమాతో వచ్చాడు. దీనికి దుష్యంత్ కె కొత్త దర్శకుడు. అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ టైటిల్.  గత నెల సంక్రాంతి సినిమాల తర్వాత ఈ నెల ఆరంభంలో విడుదలైన ఈ తాజా సినిమా కథాకమామీషు చూద్దాం...

కథ
2007 లో అంబాజీపేట దగ్గర్లో ఓ గ్రామం. అక్కడ తండ్రితో కలిసి సెలూన్ నడుపుకునే మల్లి (సుహాస్) బాబాయ్ అని పిలుచుకునే ఓనర్ కి చెందిన బ్యాండు మేళంలో పనిచేస్తూంటాడు. అతడికి తల్లి దండ్రులతోబాటు గ్రామంలోనే టీచరైన అక్క పద్మ(శరణ్యా ప్రదీప్) వుంటుంది. ఇదే గ్రామ పెద్ద వెంకట్ (నితిన్ ప్రసన్న) వూళ్ళో భారీ వడ్డీలకి అప్పులిస్తూ దోపిడీ చేస్తూంటాడు. పద్మకి ఇతనే టీచరుద్యోగం ఇప్పించాడు. ఈమెకి వెంకట్ తో ముడి పెట్టి గ్రామంలో చెవులు కొరుక్కుంటూ వుంటారు. ఇతడికి గ్రామంలోనే చదివే లక్ష్మి (శివానీ నాగారం) అనే చెల్లెలుంటుంది. ఈమె, మల్లి ప్రేమించుకుంటూ వుంటారు. ఇలా వుండగా, వెంకట్ తమ్ముడితో మల్లికి, పద్మకి గొడవలవుతూ వుంటాయి.
        
ఒకరోజు వెంకట్ కి చెల్లెలితో మల్లికున్న వ్యవహారం తెలిసి పగతో రగిలిపోతాడు. దీంతో పద్మ బట్టలు లాగేసి పరాభవిస్తాడు. మల్లిని పట్టుకుని గుండు గీసేస్తాడు.

దీంతో మల్లీ పద్మా ఇద్దరూ వెంకట్ మీద పోరాటానికి దిగుతారు. ఈ పోరాటం ఎన్ని మలుపులు తిరిగి ఏ ముగింపుకి దారి తీసిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

గ్రామంలో వర్గ విభేదాల పాత కథే. పై వర్గం, కింది వర్గం ఘర్షణలతో ఈ మద్య సినిమాలు వస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ లో కూడా ఇదే చూశాం. ముగింపు తెలంగాణ దొరల సినిమాలు, తర్వాత గ్రామ ప్రెసిడెంట్ సినిమాలు ఏ ముగింపుతో వుంటాయో అదే ఇందులో వుంటుంది. పై వర్గం మీద హింసతో కింది వర్గం తిరుగుబాటు, పై చేయి వగైరా. చివరికి ఇందులో గ్రామ పెద్దకి వేసిన శిక్ష, ఇలా పీడించే వాళ్ళకి చేసిన హెచ్చరికా వాస్తవ దూరంగా వుంటాయి. గ్రామ పెద్ద అంటే కింది నుంచీ పైదాకా విస్తరించిన ఒక పూర్తి బలమైన వ్యవస్థ.  అలాటి వ్యవస్థని పక్కనబెట్టి సినిమాటిక్ పరిష్కారం చూపించారు. తమిళనాడులో మొన్న దేశాధ్యక్షురాలికి కేంద్ర ఆర్ధికమంత్రి మీద ఫిర్యాదు చేస్తూ కింది వర్గానికి చెందిన ఉన్నతాధికారి లేఖ రాస్తే, అతడికేం గతి పట్టిందో తెలిసిందే. ఎల్లుండి రిటైర్ అవబోతాడనగా సస్పెండ్ అయిపోయి, పెన్షన్ గిన్షన్ గాలికెగిరిపోయి వీధిన పడ్డాడు. ఇంత అనుభవంలో ఇతను ప్రోటోకాల్ అన్న విషయమే మర్చిపోయి ఆవేశపడ్డాడు.
        
ఇలాటి ఆవేశంతోనే ఈ కథలో టీచర్ పద్మ పరాభవం, పతనం కొని తెచ్చుకుంది. టీచర్ గా ఆలోచనకన్నా ఆవేశమే ఎక్కువ, నోటి దురుసుతో బాటు. తనకి ఉద్యోగం వేయించిన గ్రామపెద్ద వెంకట్ తో అనవసర ఘర్షణ. అతను సిమెంట్ బస్తాలు స్కూల్లో పెడితే నచ్చజెప్పే పద్ధతి వుంటుంది. లెక్కచేయకుండా మాట్లాడితే, ప్రవర్తిస్తే, పైగా ఆ తమ్ముడు వెంకట్ చెల్లెల్నే ప్రేమిస్తే- వూరుకుంటాడా? గ్రామంలో అక్కకి సంబంధం అంటగట్టి గ్రామస్తులు అనుకున్నారు. వెంకట్ కి అలాటి ఆలోచనలే వుండవని, తను కింది వర్గం ఆడవాళ్ళ మీద చేయి వేసేంత అర్హత ఆ ఆడవాళ్ళకి లేదనీ వెంకట్ పాత్రని చూపించారు. అలాంటప్పుడు పనిమాలా మంట వేసింది అక్కాతమ్ముళ్ళయితే, పూర్తి సానుభూతి వాళ్ళ మీద కలిగేలా కథ చేయడం ఇందులో చూడొచ్చు. వాస్తవిక సినిమాలో వాస్తవికత ఆలోచించకుండా ఈ సినిమా చూస్తే ఇది హిట్ సినిమానే.

ఫస్టాఫ్ మల్లి- లక్ష్మిల ప్రేమకథ ప్రధానంగా సాగుతుంది. మల్లి అతడి నేస్తం, మల్లి కుటుంబం, గ్రామ పెద్ద వెంకట్ కుటుంబం పరిచయాలతో, వాళ్ళ కార్యకలాపాలతో, మల్లి నేస్తం మల్లి అక్క పద్మ మీదున్న మూగ ప్రేమతో, బ్యాండు మేళం కార్యక్రమాలతో సాగుతూ- వెంకట్ కి చెల్లెలి వ్యవహారం తెలిసిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ కి ముందు వస్త్రాపహరణతో వెంకట్ పద్మని పరాభవించడం, మల్లికి గుండు గీయడం వంటి భారీ ట్రాజడితో ఫస్టాఫ్ ముగుస్తుంది.
        
సెకండాఫ్ పరస్పరం కేసులు పెట్టుకోవడం, బ్యాండు మేళంతో మల్లి - పద్మలు వెంకట్ ఇంటి ముందు ధర్నాకి కూర్చోవడం, ఒక ఉద్యమంలా చేయబోవడం వంటి రొటీన్ బలహీన కథనంతో సాగి, వెంకట్ చెల్లెలి పెళ్ళికి పూనుకోవడంతో, పోలీస్ స్టేషన్లో తన ఛాతీ మీద ఎగిరి తన్నిన పద్మ మీద ఫైనల్ గా ప్రతీకారం తీర్చుకునే వెంకట్ పథకంతో,  క్లయిమాక్స్ కి చేరుకుంటుంది. చావుకళలన్నీ పద్మ ప్రవర్తనతో తెలిసిపోతూనే వుంటాయి.
        
తెలిసిన గ్రామ కక్షల పాత కథే ఇది. కాకపోతే వాస్తవికత, పాత్రచిత్రణలు పట్టించుకోకుండా పైపైన చూసేస్తే అంతా బావుంటుంది.

నటనలు-సాంకేతికాలు

కమర్షియల్ మసాలా పాత్రలకి వ్యతిరేకంగా తనదో పంథాని ఏర్పర్చుకున్న హీరో సుహాస్ కిది అవార్డు సినిమా కావొచ్చు. వాస్తవిక సినిమా పాత్రని సహజత్వంతో బాగా నటించాడు. అక్క పరాభవం నుంచి పుట్టే భావోద్వేగాల ప్రదర్శనని చివరి దాకా అదుపుతప్పి ఓవరాక్షన్ కి పోకుండా నేర్పు కనబర్చాడు. హీరోయిన్ శివానీతో ఫస్టాఫ్ లో రోమాన్స్ మాత్రం ఒక బలహీన ఎపిసోడ్. వెంకట్ తో తన అక్కకి ముడిపెట్టి వూరంతా అనుకుంటూ వుంటే, ఆ వెంకట్ చెల్లెలితో తాను ప్రేమాయణం సాగిస్తాడు. పట్ట పగలు ఆమెని సెలూన్ కి రప్పించి తలుపేసుకుంటూ వుంటే ఎవరూ చూడరు. ఆ టైంలో రోడ్డు ఖాళీ చేయిస్తున్నట్టున్నాడు డైరెక్టరు.
        
రాజశేఖర్ పిచ్చోడైన గుండు పాత్రతో నటించిన మలయాళం రీమేక్ శేషు (2002) ని గుర్తుచేసేలా సెకండాఫ్ గుండు పాత్రతో సుహాస్ బాగానే నటించాడు గానీ, అసలా విలన్ వెంకట్ తన గుండు గొరిగెయ్యడం తన కులవృత్తికే ఘోర అవమానంగా తీసుకోవడం మర్చిపోయాడు. 
       
ఈ గొడవలన్నీ చూసి హీరోయిన్ శివానీ సెకండాఫ్ ప్రారంభంలోనే లవ్ ట్రాక్ నుంచీ
, కథలొంచీ తప్పుకునే, వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయే పాత్ర. ఆమె ప్రేమ బలం ఇంతే. అసలు అక్కకి జరిగిన అవమానానికి వెంకట్ మీద అంత పగబట్టిన సుహాస్, అతడి చెల్లెల్ని ఎందుకు వదులుకుని కన్నీరు కారుస్తాడో అర్ధంగాదు. విలేజి గర్ల్ గా శివానీ కూడా బాగా నటించింది.
        
ఇక రెబెల్ లాంటి టీచర్ పద్మ పాత్రలో శరణ్యా ప్రదీప్ సుహాస్ కి సమాన నిడివిగల ప్రాధాన్యమున్న పాత్ర. ఆత్మగౌరవ పోరాటం చేసే పాత్రలో సుహాస్ కి పోటీనిస్తూ నటించింది. ఇంత పాత్రకి ముగింపులో కథకుడి  జెండర్ వివక్ష కనిపిస్తుంది. అలాగే గ్రామ పెద్ద వెంకట్ పాత్రలో నితిన్ ప్రసన్న ప్రభావం చూపిస్తాడు. అయితే తన మానాన తానుంటూ వుంటే అతడ్ని పాపం రొచ్చులోకి లాగి డెమనైజ్ చేసేశాడు దర్శకుడు.
       
టెక్నికల్ గా
, రూరల్ సంగీతం పరంగా, నేటివిటీ పరంగా, కథకి తగ్గ విలువలతో వుంది సినిమా. మూడు నాల్గు చోట్ల బలమైన డైలాగులున్నాయి. కొత్త దర్శకుడు నటుల్ని గాకుండా పాత్రల్ని చూపించడంలో, నటనల్ని రాబట్టుకోవడంతో మంచి ప్రతిభ కనబర్చాడు.

—సికిందర్ 
 

Monday, January 15, 2024

1401 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : శైలేశ్ కొలను
తారాగణం : వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, సారా పలేకర్, జయప్రకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ముఖేష్ ఋషి తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం : మణికంఠన్
బ్యానర్ : నీహారిక ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : వెంకట్ బోయినపల్లి
విడుదల : జనవరి 13, 2024
***

        వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ ని  ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి సంక్రాంతి సినిమాల రిలోకి దింపారు. ఈ బరిలోకి దింపిన మహేష్ బాబు గుంటూరు కారం ఎలాటి ఫలితాన్ని నమోదు చేసిందో తెలిసిందే. హనుమాన్ ఎలా దూసుకెళ్తోందో చూస్తున్నదే. ఇప్పుడు మరోస్టార్ సినిమా సైంధవ్ సంగతేమిటి? మహేష్ బాబుని ఫాలో అయిందా? నాగార్జునతో ఇంకో స్టార్ సినిమా కూడా హనుమాన్ తో పోటీపడ బోతోంది. ఎవరొచ్చినా హనుమాన్ తో పోటీ పడాల్సిందేనా? సైంధవ్ వచ్చేసి హనుమాన్ ని చిత్తు చిత్తు చేసిందా? ఈ అమూల్య విషయాలు తెలుసుకుందాం...

కథ

సైంధవ్ (వెంకటేష్)  చంద్రప్రస్థ అనే కల్పిత నగరం పోర్టులో క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తూంటాడు. అతడికి గాయత్రి (సారా పలేకర్) అనే కూతురు. భార్య వుండదు. పక్కింట్లో మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) కి భర్త వుండడు. గొడవపడి వచ్చేసింది. ఆమె సైంధవ్ కి, గాయత్రికి సన్నిహితంగా వుంటుంది. సైంధవ్ గతంలో మిత్రా (ముఖేష్ ఋషి) అనే డ్రగ్ మాఫియా దగ్గర పనిచేసి మానేశాడు.
       
ఇలా వుండగా
, ఒకరోజు గాయత్రి  జబ్బు పడుతుంది. అది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధి. దాని చికిత్సకి 17 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అవసరం. దీనికోసం సైంధవ్ వెళ్ళి మిత్రాని కలుస్తాడు. మిత్రా తన ప్రత్యర్ధి వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధీఖ్) ని చంపమని షరతు పెడతాడు. సైంధవ్ ఏం చేశాడు? కూతుర్ని కాపాడుకోవడం కోసం వికాస్ మలిక్ ని చంపాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది కథ కాదు, వధ. తీసుకున్న ముఖ్యమైన పాయింటుని ఇష్టమొచ్చినట్టు వధించి వడ్డించిన వ్యధ. వెంకటేష్ కి కమల్ హాసన్ నటించిన పానిండియా హిట్ విక్రమ్ లాంటి యాక్షన్ సినిమా చేయాలని కోరిక. దర్శకుడికి ఆ యాక్షన్ లో ఒక ఇంజెక్షన్ ని చొరబెట్టాలని ఆరాటం. దాంతో హైదరాబాద్ లో పిల్లాడికి ఇదే SMA వ్యాధి చికిత్సకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ. 16 కోట్లు సేకరించి, అమెరికా నుంచి తెప్పించి ఇంజెక్షన్ తో బతికించిన హ్యూమన్ డ్రామాతో కూడిన నిజ సంఘటనకి ఇన్స్ ఫైర్ అయి, ఈ కథ చేస్తూ మాఫియా గొడవలకి ఎక్కువ, పిల్ల వ్యాధి హ్యూమన్ డ్రామాకి తక్కువా అన్నట్టు సినిమా చుట్టేసి, సంక్రాంతి పోటీల్లో వెంకటేష్ ని గల్లంతు చేశారు.

వ్యాధుల మీద సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఒక సామాన్యుడి కూతురికి అత్యంత ఖరీదైన వ్యాధి అనే ఈ కథ ప్రపంచ సినిమాల్లోనే మొదటిసారిగా అంది వచ్చిన అరుదైన అవకాశం. దీన్ని ధ్వంసం చేసుకున్నాడు. హైదరాబాద్ ఉదంతంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు సహా ప్రజలు స్పందించి 16 కోట్లు సేకరించి పెట్టిన హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలోని
తాదాత్మ్యం, కరుణ, సానుభూతి, ప్రేరణ, ప్రేమ, భయాలూ ఆనందాలూ, తీరా తెప్పించిన ఇంజెక్షన్ తో ఫలిస్తుందా లేదా అన్న ఉత్కంఠ- హై డ్రామా- ఈ సినిమా సక్సెస్ దినుసులన్నీ వదిలేసి మాఫియాల మరణహోమాలతో అసలు పిల్ల వ్యాధి అన్న సమస్యకే చోటు లేకుండా చేశాడు.
       
సినిమా మొదలు పెడితే ఎడతెరిపిలేని
, మనం ఫాలోకాలేని ఏవేవో మాఫియాల గొడవలే. ఎక్కడో ఇంటర్వెల్ ముందు కూతురికి ఖరీదైన వ్యాధి సమస్యతో పాయింటు కొచ్చి, మళ్ళీ సెకండాఫ్ లో మాఫియాల గొడవలే. కుటుంబ సెంటిమెంట్ల సినిమాలెక్కువ చేసిన వెంకటేష్ కైనా కూతురి కథ గల్లంతయిందని తెలియలేదా? కూతురి చికిత్స డబ్బులకోసం హత్యలు చేయడమేమిటి? ఆ కూతురు పెద్దదై తనప్రాణాలు ఎలా కాపాడాడో తెలుసుకుని అసహ్యించుకోదా? సినిమా కథకి నైతిక ప్రశ్నలు అవసరం లేదా?
       
ఇంకో విషయం ఏమిటంటే
, కూతురి కథని మింగేస్తూ మాఫియాల గొడవలుండగా, మరో 300 మంది పిల్లలకి ఇదే వ్యాధిని తీసుకొచ్చి కూతురి కథని పూర్తిగా భూస్థాపితం చేసే శారు! సూపర్ ఫైన్ మెంటల్ కథ ఇది.
       
దీంతో కమల్ హాసన్
విక్రమ్ నేకాదు, రజనీకాంత్ జైలర్ లాగా, విజయ్ లియో లాగా కూడా తీసి, 75 వ సినిమాకి కనీవినీ ఎరుగని హిట్ కొడుతున్నామని ఫీలైపోయారు.
       
ఇక దీనికి ఎవరెలా నటించారో
, సాంకేతికులు ఎవరెలా పనిచేశారో చెప్పుకోవడం హాస్యాస్పదంగా వుంటుంది. అసలు విషయానికొస్తే, ఇదే నిర్మాతకి వెంకటేష్ కోసం సింగిల్ సిటింగ్ లో ఒక కథ ఓకే చేయించుకున్నాడు ఒక అసోసియేట్. ఆ కథ వెంకటేష్ కి సూటయ్యే ఫన్నీ విలేజి యాక్షన్ థ్రిల్లర్. నిర్మాత దాన్ని పక్కన పెట్టి సైంధవ్ తీశాడు. లేకపోతే నానితో శ్యామ్ సింఘరాయ్ హిట్ తీసిన నిర్మాతకి ఈ సంక్రాంతికి ఇంత బ్యాడ్ గా వుండేది కాదు, హనుమాన్ ఎదురుగా నిలబడి!
—సికిందర్

Saturday, January 13, 2024

1400 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
తారాగణం : తేజ సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రకని, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం : అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర
బ్యానర్ : ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత : నిరంజన్ రెడ్డి
విడుదల : జనవరి 12, 2024
***

        ల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఫాంటసీ కథతో హనుమాన్ తీశాడు. మధ్యతరహా సినిమాగా యువహీరో తేజ సజ్జా తో తీసిన దీన్ని సంక్రాంతి పెద్ద సినిమాల పోటీలో విడుదల చేయడం ఒక సాహసం. అయితే ఈ సాహసం ఫలించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో విజయవంతగా ప్రదర్శనలకి నోచుకుంటోంది. దీని విశేషాలేమిటో చూద్దాం...

కథ
1998 లో ఓ మహానగరంలో మైకేల్ అనే దుష్ట బాలుడు సూపర్ మాన్ అవ్వాలని ప్రయత్నిస్తూంటాడు. సూపర్ మాన్ శక్తుల్ని మంచికోసం ఉపయోగించాలని తల్లిదండ్రులు ఉద్బోధిస్తే వాళ్ళని చంపేస్తాడు. ప్రస్తుతానికొస్తే, అంజనాద్రి అనే మారు మూల గ్రామం. అక్కడ హనుమంతు (తేజ సజ్జా) అనే చిల్లర దొంగ. ఇతను అక్క అంజమ్మ (వరలక్ష్మీ  శరత్ కుమార్) పెంపకంలో పెరిగాడు. మీనాక్షి (అమృతా అయ్యర్) ని ప్రేమించాడు. ఆమె మెడిసిన్ చదువుకుని వచ్చింది. గ్రామంలో గజపతి (రాజ్ దీపక్ శెట్టి) అనే పాలెగాడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ పీడిస్తూంటాడు. ఇతడ్ని ఎదిరించిన మీనాక్షి ప్రమాదంలో పడుతుంది. ఈమెని కాపాడబోయిన హనుమంతు నదిలో పడిపోతాడు. నదిలో ఒక హనుమతుడి అంశగల రుధిరమణి దొరుకుతుంది. దాంతో అతడికి సూపర్ హీరో శక్తులు వచ్చేస్తాయి. ఆ శక్తులతో గజపతిని ఎదిరిస్తూ వుంటే, రుధిరమణిని చేజిక్కించుకుని సూపర్ మాన్ అవుదామని మైకేల్ (వినయ్ రాయ్) వచ్చేసి దాడులు మొదలెడతాడు.
       
ఇప్పుడు రుధిరమణితో మంచికోసం హనుమంతు, చెడుకోసం మైకేల్ ల మధ్య పోరాటంలో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అప్పట్లో చిరంజీవి- శ్రీదేవి నటించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ కథ. హాలీవుడ్ నుంచి అదే పనిగా వస్తున్న మార్వెల్ స్టూడియోస్ కామిక్స్ సూపర్ హీరో సినిమల్లాంటి కథ. అయితే దీన్ని ఆధునిక ప్రపంచంలో, ఆధునిక పాత్రలతో, హైఫై గా  కాకుండా, నేటివిటీతో కూడిన గ్రామీణ ప్రపంచంలో, సాధారణ గ్రామీణ పాత్రలతో, దైవభక్తిని కూడా జోడించి తీయడంతో, క్లాస్ -మాస్ ప్రేక్షకులకి చేరువగా వెళ్ళగలుగుతోంది.
        
యాక్షన్ సినిమాలంటే నరుకుడు సినిమాలుగా పేరుపొందిన ఈ రోజుల్లో హింసకి దూరంగా కామెడీతో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్ గా తీయడంతో ఒక తాజాదనం చేకూరింది. పైగా మాస్- యాక్షన్ హీరోయిజం ఇమేజి వున్న నటుడ్ని తీసుకోకుండా సామాన్య యువకుడిలా కన్పించే ఏ ఈమెజీ లేని తేజ సజ్జాని తీసుకోవడం కూడా ఈ ప్రయత్నానికి ప్లస్ అయింది. ఏ ప్రత్యేకతలూ లేని ఒక సామాన్య పల్లెటూరి వాడు సూపర్ హీరోగా మారి శత్రువుల్ని ఎదుర్కొనే పరిణామ క్రమమాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఫస్టాఫ్ లో గంటకి పైగా తీసుకుంది. రుధిరమణి దొరికిన తర్వాత అతీతశక్తులతో అతను సూపర్ హీరోగా మారే ఘట్టం వచ్చేసరికి ప్రేక్షకులనుంచి కేరింతలే. ఇక్కడ్నించీ వరుసగా కేరింతలే.
       
ఈ పూర్తి స్థాయి కామెడీతో కూడిన సూపర్ హీరో అడ్వెంచర్స్ కి
, క్లయిమాక్స్ లో హిమాలయాల నుంచి సాక్షాత్తూ హనుమంతుడే రావడంతో మరోస్థాయి థ్రిల్. అయితే ఇందులో పాత వాసన వేసే మూస సన్నివేశాలు, మందకొడి కథనం, అనవసర పాత్రలు వంటి అవరోధాలూ లేకపోలేదు. సినిమా నిడివిని రెండున్నర గంటల నుంచి రెండు గంటలకి కుదించేస్తే ఈ లోపాలు తొలగి పోయేవి.

నటనలు- సాంకేతికాలు

పాత సినిమాల్లో పల్లెటూరి పాత్రల్లో సాదాసీదా చిరంజీవిలాగా తేజ సజ్జా వుండడం కనెక్టివిటీకి బాగా తోడ్పడింది. అశక్తుడైన సామాన్యుడు అతీత శక్తులతో అసామాన్యుడిగా మారడమానే ఇరు పార్శ్వాల్ని సమయోచితంగా ప్రదర్శించాడు. నటనకి కామెడీ ప్రేక్షకుల్ని ఇంకా దగ్గర చేసేలా వుంది. హీరోయిన్ తో రోమాన్స్ లో ఫీల్ లేకపోవడం, అక్క పాత్రతో సెంటిమెంట్లు లోపించడం వంటి లోపాలున్నాయి. యాక్షన్ సీన్స్, క్లయిమాక్స్ లో పతాక స్థాయి పోరాటాలూ బాగా కుదిరాయి. చిన్న హీరోకి పెద్ద హిట్ సంక్రాంతి దక్కడమన్నది రికార్డే.
       
హీరోయిన్
అమృతా అయ్యర్ కి అందచందాలు, నటించే టాలెంట్ వున్నాయి. హీరో అక్క పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్షన్ సీను కేరింతలకి ఇంకో సమయం. విలన్స్ గా రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ లు  మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి తదితరులు నవ్వించే క్యారక్టర్లు. ఇక విభీషణుడిగా వచ్చే సముద్రని  హూందాగా నటించాడు.
       
తక్కువ బడ్జెట్లోనే
టెక్నికల్‌గా బాగా తీయడం దర్శకుడిని నిర్మాతల లక్కీ ఛామ్ గా చేసే విషయం. అయితే బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని నిర్మాత ప్రకటన. వీఎఫ్ఎక్స్, సాంగ్స్, నేపథ్య సంగీతం (ముగ్గురు సంగీత దర్శకులు) వీలైనంత క్వాలిటీతో ఇచ్చారు. క్లయిమాక్స్ 15 నిమిషాల నేపథ్య సంగీతం భారీ సినిమాల స్థాయిలో వుంది.
       
కరుడుగట్టిన హింసాత్మక గెటప్స్ తో హీరోల సినిమాల్ని తీస్తున్న ఈ రోజుల్లో హింసే లేకుండా విజయవంతమైన కమర్షియల్ సినిమా తీయడం
, ఎంటర్ టైన్ చేయడం, బాక్సాఫీసులో డబ్బులు కళ్ళజూడడం మొదలైన మంచి పనులు హనుమాన్ తో సుసాధ్యం చేసి చూపించారు.

—సికిందర్