రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 3, 2023

1375 : రివ్యూ

 

దర్శకత్వం: తరుణ్ భాస్కర్
తారాగణం : బ్రహ్మనందం, తరుణ్ భాస్కర్, చైతన్యా రావు, జీవన్ కుమార్, రాగ్ మయూర్
రఘురామ్రవీంద్ర విజయ్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : ఏజే ఆరోన్
నిర్మాతలు: సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్
విడుదల : నవంబర్ 3, 2023
***

        పెళ్ళిచూపులు’, ఈ నగరానికి ఏమైంది సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ మహానటి’, సీతారామం’, స్కైలాబ్ వంటి కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు నటించాడు. తిరిగి ఇప్పుడు హీరోగా నటిస్తూ కీడా కోలా అనే క్రైమ్ కామెడీకి దర్శకత్వం వహించాడు. ఏమిటీ క్రైమ్ కామెడీ, ఇదేమైనా డిఫరెంట్ గా వుందా, లేక వచ్చిపోయే మరో రొటీన్ వ్యవహారంగా వుందా తెలుసుకుందాం...

కథ

    వరదరాజులు (బ్రహ్మానందం), అతడి మనవడు వాస్తు (చైతన్యా రావు), వీళ్ళ లాయర్ లంచం (రాగ్ మయూర్) ఓ కేసులో కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఒకరోజు వరదరాజులు కోసం కోలా బాటిల్‌ తెస్తే అందులో బొద్దింక వుంటుంది. దీంతో కంపెనీ మీద కేసు వేసి 5 కోట్లు నష్టపరిహారం కొట్టేయాలని ప్లాను వేస్తారు. అదే సమయంలో హత్య కేసులో పదేళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి వస్తాడు నాయుడు (తరుణ్ భాస్కర్). ఇతడి తమ్ముడు జీవన్ నాయుడు ( జీవన్) ఒక కార్పొరేటర్ చేసిన అవమానాన్ని భరించలేక తనూ కార్పొరేటర్ అవ్వాలన్న కసితో వుంటాడు. దీనికి కోటి రూపాయలు కావాలి. దీనికొక ప్లాను వేస్తారు అన్నదమ్ములు. ఆ ప్లాను ప్రకారం కోలా కంపెనీలో పని చేస్తున్న నాయుడు బాటిల్లో బొద్దింక వేస్తాడు. ఆ కోలా కీడా (కీడా అంటే పురుగు) ని అడ్డం పెట్టుకుని కంపెనీ నుంచి కోటి రూపాయలు లాగాలనుకుంటారు. కానీ ఆ బాటిల్ వరద రాజులు దగ్గరుంది. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

బాటిల్ కోసం నాయుడు వరదరాజులుని పట్టుకుంటే ఏం జరిగింది
? కోటి కాదు ఐదు కోట్లు పంచుకోవచ్చని ఒప్పందం కుదిరాక జాయింటుగా ఈ రెండు గ్రూపులు చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? కంపెనీ సీఈఓ (రవీంద్ర విజయ్) ఆడుకున్న కౌంటర్ గేమ్ ఏమిటి? ఈ గేమ్ లో షాట్స్ (రఘురామ్) అనే కిల్లర్ పోషించిన పాత్రేమిటి? ప్రాణాల మీదికి తెచ్చుకుని కాల్పుల్లో చచ్చిందెవరు, బతికిందెవరు? బాటిల్ ఏమైంది? అది ఎవరి ప్రాణాలు కాపాడింది?  చివరికి డబ్బుంటే స్వేచ్ఛ వుంటుందని నమ్మిన వరదరాజులి నత్తి మనవడు నేర్చుకున్న జీవిత సత్యం ఏమిటి? ఇవన్నీ సెకండాఫ్ లో తెలుసుకోవచ్చు.

ఎలావుంది కథ

    డబ్బు చుట్టూ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు పాల్పడే చర్యలతో కూడిన క్రైమ్ కామెడీ కథ ఇది. బ్రోచేవారెవరురా’, భలే మంచి రోజు లాంటి క్రైమ్ కామెడీల కోవకి ఇది చెందుతుంది. అయితే దర్శకత్వపు శైలి హాలీవుడ్ దర్శకుడు గై రిచీని పోలి వుంటుంది. సంగీతంలో పాప్ సంగీత మెలాగో, క్రైమ్ కామెడీల్లో గై రిచీది అలాటి పాప్ కల్చర్ స్టయిల్.  తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దీన్ని వాడుతూంటాడు. ఇదే కీడా కోలా ని తెలుగులో వస్తున్న రొటీన్ క్రైమ్ కామెడీల నుంచి వేర్పరుస్తుంది. నమ్మడానికి వీల్లేని అసంబద్ధ కథ, మెంటల్ పాత్రలు, మైండ్ లెస్ కామెడీ- ఫిలిమ్ నోయర్ జానర్ తరహా క్రిమినల్స్ వాడేలాటి మాటలు, బ్యాక్ గ్రౌండ్ లో క్రేజీ పాటలతో సాగే కథనం వగైరా క్రియేటివిటీలతో ఓ రెండు గంటల బోరు కొట్టని కాలక్షేపం.

నటనలు- సాంకేతికాలు

    నాయుడు పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్ నటనలో ఇంకో మెట్టు పైకెక్కాడు. పాత్రచిత్రణే ఈ క్రైమ్ కామెడీకి బలం. అతడి నడక, ముఖకవళికలు, తీసుకునే నిర్ణయాలు, పాల్పడే చర్యలు- ఇవన్నీ సీరియస్ గా వుంటూనే ఫన్నీగా వుంటాయి. ఈ సినిమాలో ఆడ పాత్రల్లేవు. చైనా నుంచి వచ్చిన ఒక నిలువెత్తు బార్బీ డాల్ వుంటుంది. దాంతో ప్రేమలో పడతాడు. చివర్లో గుండు దెబ్బ తిని నీట మునుగుతున్నప్పుడు టైటానిక్ లో హీరోహీరోయిన్ల అమర ప్రేమలాగా బార్బీ చేతి వేలికి తన చేతి వేలు తగిలే సరికి ప్రాణాలు లేచొచ్చేస్తాయి. అర్ధం లేని కామెడీలకి ఇలాటి ఫన్నీ ఇన్నోవేటివ్- క్రియేటివ్ సీన్స్ ఎన్నో వాడాడు. దర్శకుడుగా, నటుడుగా యూత్ కి కావాల్సిన ఓ కొత్త అనుభూతినంతా ఇచ్చాడు.
       
రెండో చెప్పుకోదగ్గ పాత్రలో వరదరాజులి మనవడుగా చైతన్యా రావు నటన. నత్తిని ఓ కొత్త పోకడతో నటించి దృశ్యాల్ని నిలబెట్టాడు. ఎన్ని సంబంధాలు చూసినా ఇతడి పెళ్ళి కాదు. చైనా డాల్ ఇతడి దగ్గరే వుంటుంది. దీంతో కూడా సంబంధాలు రావు. ఇంకో మ్యాడ్ క్యారక్టర్ జీవన్ నాయుడు పాత్రలో జీవన్ నటన ఇంకో ఫన్. లాయర్ గా రాగ్ మయూర్
, తరుణ్ భాస్కర్ మెంటల్ అనుచరుడుగా విష్ణు ఓయీ ప్రతీ సీనులో వుండే ఫన్నీ క్యారక్టర్లు. కిల్లర్ షాట్స్ గా రఘురామ్, సీఈఓ విలన్ గా రవీంద్ర విజయ్ క్రూరత్వాలు ఓపక్క. ఇక వరదరాజులుగా బ్రహ్మానందం వీల్ చైర్ కి పరిమితమై ఏంట్రా ఈ జీవితమని గడిపే ఇంకో ఫన్నీ పాత్ర.
        సాంకేతికంగా ఏజే ఆరోస్ కెమెరా వర్క్ ఇంకో కళాత్మక విలువ. ఔట్ డోర్, ఇండోర్ లొకేషన్స్ పాత్రలుండే ఇరుకు లొకాలిటీల్ని ఎక్కువగా ప్రొజెక్టు చేస్తాయి. వివేక్ సాగర్ సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ కథని ముందుకు నడిపిస్తూంటాయి.
       
స్క్రీన్ ప్లే చూస్తే ఇంటర్వెల్ ఇంకా ఏమీ జరక్కుండానే అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. కారణం ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ గంట అంతా నడిచేది పాత్రల పరిచయా లతో
, సమస్యకి దారితీసే పరిస్థితులతో మాత్రమే. అంటే బాటిల్ ని కలిగివున్న బ్రహ్మానందం దగ్గరికి తరుణ్ భాస్కర్ వచ్చి పట్టుకోవడంతోనే ఇంటర్వెల్ వస్తుంది. అంటే కథ తాలూకు సమస్య, దాంతో గోల్ ఏర్పాటు కాకుండానే – కథ ప్రారంభం కాకుండానే- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇలా ప్లాట్ పాయింట్ వన్ తో ఇంటర్వెల్ వేయడం రూల్స్ కి విరుద్ధమే అయినా రూల్స్ ని కూడా బ్రేక్ చేయాలనుకున్నట్టుంది దర్శకుడు. ఈ సినిమాకి కాబట్టి ఇది సరిపోయింది. మొత్తానికి కీడా కోలా లాజిక్ లేని కథని కలర్ఫుల్ పాత్రచిత్రణల వల్ల, గైరిచీ మేకింగ్ శైలి వల్లా తేలికగా తీసుకుని ఎంజాయ్ చేయదగ్గ ఆధునిక క్రైమ్ కామెడీగా  ఫర్వాలేదనిపించుకునే విధంగా తెరకెక్కిందని చెప్పొచ్చు! 

—సికిందర్


Thursday, November 2, 2023

1374 : రివ్యూ

 


దర్శకత్వం :  శ్యామ్ బెనెగల్
తారాగణం: ఆరిఫిన్ షువో, నుస్రత్ ఇమ్రోస్ తిషా, తౌకిర్ అహ్మద్, నుస్రత్ ఫరియా, దీపక్ అంటానీ, రజిత్ కపూర్ తదితరులు
రచన : అతుల్ తివారీ, షమా జైదీ, సంగీతం : శంతనూ మోయిత్రా, ఛాయాగ్రహణం : ఆకాష్ దీప్ పాండే
బ్యానర్స్ : బంగ్లాదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
విడుదల : అక్టోబర్ 27, 2023
***

          దాదాపు 14 ఏళ్ళ తర్వాత 88 ఏళ్ళ విఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ సినిమా వెండి తెరని పావనం చేసింది. ఈసారి బృహత్ ప్రణాళికతో ఇండో- బంగ్లా ప్రభుత్వాల సంయుక్త నిర్మాణంలో బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జీవిత చరిత్రని తలపెట్టారు.  2008 లోనే పొయెట్ ఆఫ్ పాలిటిక్స్ పేరుతో బయోపిక్ తీయాలని వేరే నిర్మాతలు అనుకున్నారు. దీనికి శ్యామ్ బెనెగల్  దర్శకత్వం వహిస్తారని , అమితాబ్ బచ్చన్ ముజిబుర్ రెహ్మాన్ గా నటిస్తారనీ  ప్రచారం జరిగింది. 2010 లో హాలీవుడ్ లో ఇంకో ప్రతిపాదన తెరపై కొచ్చింది. చివరికి 2021 లో ఇండో- బంగ్లా సంయుక్త నిర్మాణంలో శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైంది. నిర్మాణం పూర్తి చేసుకుని అక్టోబర్ 13న బంగ్లాదేశ్ లో విడుదలై విజయం సాధించాక, అక్టోబర్ 27 న ఇండియాలో విడుదలైంది. ఈ నేపథ్యంలో బాల్యం నుంచీ మరణం వరకూ ముజిబుర్ రెహ్మాన్ జీవితాన్ని చిత్రించిన ఈ బయోపిక్ ఎలా వుందో తెలుసుకుందాం...

కథ

    షేక్ ముజిబుర్ రెహ్మాన్ (అరిఫిన్ షువూ) భార్య రేణూ (నుస్రత్ ఇమ్రోజ్ తీషా) దృక్కోణం నుంచి ఈ కథ సాగుతుంది. ముజీబ్ బాల్యం, రాజకీయాల్లో తొలి అడుగులు, పాకిస్తాన్ చారిత్రక నేపథ్యం, తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) పైన పాక్ పాలకుల భాషా వివక్ష, బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తానీయులు తక్కువ జాతి ముస్లిములుగా పరిగణించడం, ఢాకాకు చెందిన  రాజకీయ నాయకుడు హసన్ షాహిద్ సుహ్రావర్ది (అహ్మద్ తౌకీర్) ముజిబుర్ రెహ్మాన్ (ఆరిఫిన్ షువో) తో కలిసి అవామీ లీగ్ పార్టీ ఏర్పాటు చేయడం, ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, పాక్ పాలకుల అరాచకాలు, ముజీబ్ ముక్తి వాహిని పేరిట గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి పాక్ సైన్యం మీద దాడులు చేయడం. ఈ పోరాటంలో కోటి మంది శరణార్ధులుగా ఇండియాలో చొరబడడం... ఇలా 1971 లో ఇండో - పాక్ యుద్ధానికి దారితీసే పరిస్థితులన్నీ కలిసి వచ్చి,  యుద్ధంలో ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ ని ఓడించి రెండు ముక్కలు చేయడం, దొరికిన ఒక ముక్క పట్టుకుని పాక్ పాలకులు దీనంగా చూస్తూంటే, తూర్పు పాకిస్తాన్ ముజిబుర్ రెహ్మాన్ ప్రధానిగా బంగ్లాదేశ్ గా ఘనంగా అవతరించడం, ఆ తర్వాత 1975 లో సైనిక తిరుగుబాటులో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబం సహా హతమవడంతో ముగుస్తుంది (ఈ సమయంలో ముజిబుర్ కుమార్తె, ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా విదేశాల్లో వున్నారు). ఇదీ ఈ బయోపిక్ కథ.

ఎలావుంది కథ

    ఈ మధ్య ఒక రాజకీయ పరిశీలకుడు మన దేశాన్ని మతదేశంగా మార్చి ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే వేషం, ఒకే జాతిగా ప్రజల మీద రుద్దితే నిలబడదని విశ్లేషించాడు. ఇది నిజమే అన్నట్టు ముజీబ్ బయోపిక్ చూస్తే అర్ధమవుతుంది. భిన్న జాతి, సంస్కృతి, భాష వున్న తూర్పు పాకిస్తాన్ ని, పశ్చిమ పాకిస్తాన్ తో కలిపి మతదేశంగా ఏర్పాటు చేసి, వాళ్ళ మీద ఉర్దూ భాష రుద్దితే జరిగిన రాద్ధాంతమే యుద్ధంతో ప్రత్యేక దేశంగా ఏర్పడడం. ఇండియాలో ఇలాటి యుద్ధాలు ఎన్ని జరుగుతాయో చెప్పలేం.
        
బంగ్లాదేశ్‌ ని మతపరమైన ప్రాతిపదికన ఏర్పాటు చేయలేదు. కానీ ఆనాడు జిన్నా బెంగాలీ భాషకి ఉర్దూకి వున్నంత ప్రాముఖ్యాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. ఉపఖండ చరిత్రకి సంబంధించిన ఈ వివరాల గురించి తెలియని వారికి, శ్యామ్ బెనెగల్ తీసిన ఈ బయోపిక్ లైవ్ డెమో లాగా వుంటుంది. ముగింపు షాకింగ్ గా వుంటుంది.
       
అయితే నిడివి రెండు గంటల 45 నిమిషాలు మరీ ఎక్కువ. సెకండాఫ్ లో చాలా చోట్ల విసుగు పుట్టిస్తుంది.
 తివారీ - జైదీ చేసిన రచన తగిన భావోద్వేగాల్ని ప్రేరేపిస్తుంది. డ్రామా కూడా ఆసక్తికరంగా వున్నప్పటికీ, పొరుగు దేశానికి సంబంధించిన కథ కావడంతో ఇక్కడ మన ప్రేక్షకులకి బంగ్లాదేశ్ సినిమా కొత్త. ప్రధాన పాత్రలు తప్పితే ఇతర పాత్రలతో, నటులతో కనెక్ట్ కావడం కష్టం. చిన్నప్పటినుంచీ ముజిబుర్ రెహ్మాన్ కుటుంబ పరివారంలో ఎంతమంది వుంటారో లెక్కబెట్టడం కూడా కష్టమే.
        
ఒక ఏరియల్ షాట్, దానికి సమయానుకూలమైన పాట, ఆ పాటకి విజయంతో ప్రస్ఫుటమయ్యే ముజీబ్ మానసిక స్థితి- వీటిని క్యాప్చర్ చేసే మొదటి సన్నివేశమే బెనెగల్ చిత్రీకరణ నైపుణ్యం పట్టు సడలలేదని తెలుపుతుంది.

నటనలు- సాంకేతికాలు

    షేక్ ముజిబుర్ రెహ్మాన్‌గా ఆరిఫిన్ షువూ పూర్తిగా సరిపోయాడు. హావభావాలు, శరీర భాష, సంభాషణ ముజీబ్ సరీగ్గా బ్యాలెన్స్ అయ్యాయి. అతడిభార్య రేణూగా నుస్రత్ ఇమ్రోస్ తీషా చాలా సహజంగానూ, సుహ్రావర్దిగా తౌకీర్ అహ్మద్ హుసేన్ అద్భుతంగానూ నటించారు. ముజీబ్ కుమార్తె హసీనాగా నుస్రత్ ఫరియా నటించింది. పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోగా రజిత్ కపూర్, మహాత్మా గాంధీగా దీపక్ అంటానీ, ముజీబ్ హంతకుడు నూర్ చౌదరిగా  రోహన్ రాయ్ నటించారు.
       
శంత
నూ మోయిత్రా సంగీతం, అతుల్ తివారీ సాహిత్యం సినిమా మూడ్‌కి అనుగుణంగా వున్నాయి. ఆకాష్‌దీప్ పాండే ఛాయాగ్రహణం క్లాస్ గా వుంది. షామ్ కౌశల్ యాక్షన్, స్టంట్ సీన్స్ రియలిస్టిక్ గా వున్నాయి. శుక్రాచార్య ఘోష్, విష్ణు నిషాద్,  నితీష్ రాయ్ ల కళా దర్శకత్వం, అసీమ్ సిన్హా ఎడిటింగ్ తో బాటు హిందీ డబ్బింగ్ బావుంది.

—సికిందర్



Wednesday, November 1, 2023

1373 : రివ్యూ

రచన- దర్శకత్వం : విధూ వినోద్ చోప్రా
తారాగణం : విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా తదితరులు
కథ : అనురాగ్ పాఠక్, సంగీతం :  శంతనూ మోయిత్రా, ఛాయాగ్రహణం : రంగరాజన్ రామభద్రన్
బ్యానర్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు : విధూ వినోద్ చోప్రా, యోగేశ్ ఈశ్వర్
విడుదల : అక్టోబర్ 27, 2023
***

        మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే, త్రీ ఇడియెట్స్ వంటి ప్రసిద్ధ సినిమాల నిర్మాత, 1942-ఏ లవ్ స్టోరీ, పరిందా, మిషన్ కాశ్మీర్ ల వంటి హిట్ సినిమాల దర్శకుడూ విధూ వినోద్ చోప్రా, తాజాగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ‘12th ఫెయిల్ - విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ తీసిన రియలిస్టిక్ సినిమా. ఇందులో ఇటీవల పేరు తెచ్చుకుంటున్న చిన్న సినిమాల హీరో విక్రాంత్ మాస్సే హీరో. మేధా శంకర్ కొత్త హీరోయిన్. ఇలా విద్యపై విద్యార్థులకి ఈ రియలిస్టిక్ సినిమా ద్వారా చూపించిన చదువుల ప్రపంచం ఎలా వుందో చూద్దాం...

కథ

    1997 లో మనోజ్ శర్మ (విక్రాంత్ మాస్సే) మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయ ప్రాంతంలో నివసిస్తూంటాడు. నిజాయితీగల తండ్రి రామ్‌వీర్ శర్మ (హరీష్ ఖన్నా), ప్రేమగల తల్లి పుష్ప (గీతా అగర్వాల్), సోదరుడు కమలేష్ (రాహుల్ కుమార్), సోదరి రజని (పెర్రీ ఛబ్రా), అమ్మమ్మ (సరితా జోషి) లతో కూడిన దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అతడిది.
       
మనోజ్ కి ఐపీఎస్ అధికారి అవ్వాలని కలలుంటాయి. కానీ
12వ తరగతి పరీక్షల్లో ఫెయిలవుతాడు. ఎందుకంటే బోర్డ్ పరీక్షల్లో ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేయించకుండా డీఎస్పీ దుష్యంత్ సింగ్ (ప్రియాంశూ ఛటర్జీ) అడ్డుకున్నాడు. నువ్వు ఐపీఎస్ కావాలంటే ఇలాటి అడ్డమార్గాలు  తొక్కకూడదని డీఎస్పీ మందలించాడు కూడా. తర్వాతి సంవత్సరం థర్డ్ క్లాసులో పాసవుతాడు. ఇక అమ్మమ్మ పొదుపు చేసిన పెన్షన్ డబ్బులు తీసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షలకి ప్రిపేర్ కావడానికి ఢిల్లీకి చేరుకుంటాడు. అతడికి పట్టుదల వుంటుందిగానీ, అందుకు తగ్గ అధ్యయన నైపుణ్యాలు వుండవు. పైగా హిందీ మీడియం చదివాడు. ఉన్నత చదువులపై సరైన అవగాహన  కూడా లేదు. యూపీఎస్సీ, ఐపీఎస్ ప్రొఫైల్ లాంటివి వుంటాయని కూడా తెలియదు. పైగా ఆర్ధిక అసమానతలు, కులతత్వం పొటమరించి వున్నాయి. ఈ నేపథ్యంలో గురువు (అంశుమాన్ పుష్కర్), స్నేహితులతో బాటు, స్నేహితురాలు శ్రద్ధా జోషి (మేధా శంకర్) సహాయంతో సంఘర్షించి తన ఐపీఎస్ కలని ఎలా సాకారం చేసుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ  

    ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్  అధికారి శ్రద్ధా జోషి నిజ జీవిత వృత్తాంతంతో ప్రేరణ పొంది రాసిన ‘12th ఫెయిల్ అన్న నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. నవలా రచయిత అనురాగ్ పాఠక్. బందిపోట్లకి పేరు బడ్డ చాలా వెనుకబడిన చంబల్ గ్రామంనుంచి ఒక హిందీ మీడియం సగటు విద్యార్థి పోలీసు శాఖలోని ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం ఈ కథ చెప్తుంది. 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన మనోజ్‌పై జీవితం, సమాజం, ప్రేమ, స్నేహం విసిరే సవాళ్ళ కథ ఇది.
       
ఇందులో నీతి ఏమిటంటే- ఆర్ధిక అసమానతలు
, అవినీతి, కుల రాజకీయాలున్నప్పటికీ, ఇప్పటికీ మెరిటోక్రాటిక్ (ప్రతిభా స్వామ్యం) మార్గాల ద్వారా యూపీఎస్సీలో విజయం సాధించవచ్చనీ చెప్పడం. ఇంకో సందేశం ఏమిటంటే, మోసగాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందరని - ఈ వ్యవస్థలో ఇప్పటికీ చాలా పక్షపాతాలు అలా పాతుకుపోయి వున్నాయనీ- ఇవి మనోజ్ లాంటి కుర్రాళ్ళ జీవితాల్ని కష్టతరం చేస్తున్నాయనీ స్పష్టం చేయడం.  
        
చదువుకోండి, ఆందోళన చేయండి, సంఘటితం కండి, అవినీతి రాజకీయ నాయకులు సమాజంలోని యువత మూర్ఖులుగా వుండాలని, వాళ్ళని అణచివేసి పాలించవచ్చని భావిస్తున్నారనీ కూడా ఈ కథ వెలుగులోకి తెస్తుంది.

ఇదంతా వాస్తవిక కథా చిత్రం శైలిలో చాలా సాఫీగా, సాదాసీదాగా సాగుతుంది. మనోజ్ కి కఠోరంగా పరిశ్రమించడం తెలుసు. కానీ కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్ని ఎలా క్రాక్ చేయాలో తెలీదు. తెలియక పరీక్షతప్పిన ప్రతీసారీ బాధ పడుతూ కూర్చోక, వెంటనే  రీస్టార్ట్ బటన్ నొక్కి, మళ్ళీ పరీక్షకి సిద్ధమయ్యే అరుదైన పట్టుదలతో వుంటాడు. ఇలా నాలుగుసార్లు జరిగిన తర్వాత, అంతిమంగా ఉత్తీర్ణత సాధించే రహస్యాన్ని తెలుసుకుని, కేటాయించిన సమయంలో డజను 200-పదాల వ్యాసాలు ఎలా రాయాలో నేర్చుకుని పరీక్షని క్రాక్ చేస్తాడు!
       
నిజానికి విద్య గురించి ఇది స్పోర్ట్స్ సినిమా లాంటి థ్రిల్లింగ్ కథ. స్పోర్ట్స్ సినిమాల్లో మెడల్ కొట్టడానికి గెలుపోటముల థ్రిల్
, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కథ ఎలా సాగుతుందో, ఇదే మొదటిసారిగా ఎడ్యుకేషన్ సినిమాకి వర్తింపజేసి రూపకల్పన చేయడం ఇక్కడ ప్రత్యేకత.
        
ఇది ప్రేక్షకుల హృదయాల్ని మెలిదిప్పుతుంది. అదే సమయంలో మధ్యమధ్యలో తేలికపాటి సన్నివేశాలతో అలరిస్తుంది. కథలోని ఎమోషనల్ అండర్ కరెంట్ ఎంత బలంగా వుంటుందో, సరదా సన్నివేశాలతో డ్రామా అంత రంజింపజేస్తుంది. ప్రతీసీనూ ఒక కొత్త విషయంతో వుంటుంది- కథ గురించి గాని, పాత్ర గురించి గాని. డైలాగులు చాలా రియలిస్టిక్‌గా వున్నాయి. అనేక చోట్ల హృదయాల్ని హత్తుకునేలా వున్నాయి.

నటనలు – సాంకేతికాలు

    మనోజ్ శర్మ పాత్ర పోషణలో విక్రాంత్ మాస్సే దాదాపు నూరు శాతం మార్కులు కొట్టేశాడు. అతడి నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ – ఇవన్నీఉన్నతంగా వున్నాయి. అనుభవజ్ఞుడైన విధూ వినోద్ చోప్రా ఇలా నటింపజేశాడు. సినిమా చూసిన తర్వాత చాలా కాలం పాటు ఇది వెంటాడుతుంది. ప్రేమిక శ్రద్ధా జోషిగా మేధా శంకర్‌ కూడా అద్భుతంగా నటించింది.  యూట్యూబ్ లో ఐఏఎస్ క్లాసులు చెప్పే పాపులర్ కోచ్ డాక్టర్ వికాస్ దివ్యకీర్తి కూడా ఇందులో పాఠాలు చెప్తాడు. ఈయన ఇజ్రాయెల్- పాలస్తీనా చరిత్రమీద చేసిన ఆమూలాగ్ర ప్రసంగం యూట్యూబ్ లో ఒక రికార్డు. ఇది నాలుగున్నర గంటలపాటు ఏక బిగిన సాగే ప్రసంగం.
       
ఇందులో సహాయ పాత్రలు లెక్కలేనన్ని వున్నాయి. ఈ నటీనటులందరూ సినిమా మూడ్ ని నిలబెట్టారు.
శంతనూ మోయిత్రా సంగీతం కమర్షియల్ సినిమా సంగీతం కాదు. హిట్ కుర్ర పాటలు ఆశించకూడదు. రంగరాజన్ రామద్రన్ ఛాయాగ్రహణం, హేమంత్ వామ్ కళా దర్శకత్వం రియలిస్టిక్ సినిమా అవసరాల్ని అనుసరించి వున్నాయి.
       
మొత్తం మీద
‘12th ఫెయిల్ హృదయాల్ని హత్తుకునే ఒక సున్నిత కథా చిత్రం. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడంతో, పైగా యువతని ఆకర్షించే కమర్షియల్ అప్పీల్ లేకపోవడంతో హిందీలో ఓ మోస్తరు కలెక్షన్ల దగ్గర స్ట్రగుల్ చేస్తోంది. తలుగులో నవంబర్ 4న విడుదలవుతోంది.
—సికిందర్

 

1372 : రివ్యూ

 


దర్శకత్వం : పూజా కొల్లూరు
తారాగణం : సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్యా ప్రదీప్ తదితరులు
రచన : వెంకటేష్ మహా, సంగీతం : స్మరణ్ సాయి, ఛాయాగ్రహణం : వై. దీపక్
నిర్మాతలు : ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
విడుదల : అక్టోబర్ 27, 2023
***

        డాది కొక సినిమా నటించే చిన్న సినిమాల తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబుకి సక్సెస్ లు తక్కువే. 2014 లో హృదయ కాలేయం అనే కామెడీతో నటుడయ్యాక కాలక్షేప కామెడీలే చేసుకొస్తూ ఇప్పుడు వాస్తవిక కథా చిత్రంగా రాజకీయ సెటైర్ ప్రయ
త్నించాడు. దీనికి పూజా కొల్లూరు కొత్త దర్శకురాలు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కూడా చూసి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజెప్పే ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఎలా వుందో తెలుసుకుందాం...

కథ

    పడమర పాడు అనే గ్రామంలో అమాయకుడైన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టి జీవిస్తూంటాడు. అతను ఒంటరి, మర్రి చెట్టు అతడి నివాసం. గ్రామంలో ఎవరు ఏ పని చెప్పినా పెంపుడు జంతువులా చేస్తూ ఆ వచ్చే డబ్బుల్ని దాస్తూంటాడు. డబ్బులు కూడబెట్టి చెప్పుల షాపు తెరవాలని అతడి కల. ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. ఇలాకాదని, డబ్బు పోస్టాఫీసులో దాయాలని, స్నేహితుడు పోస్టాఫీసులో ఖాతా తెరిపించడానికి తీసుకుపోతాడు. కొత్త పోస్టు మాస్టర్ వసంత (శరణ్యా ప్రదీప్) ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడుగుతుంది. అవి లేవు. తల్లిదండ్రులేం పేరు పెట్టారో గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. చూస్తే చిరునవ్వుతో వున్నట్టు కన్పిస్తాడు కాబట్టికొందరు స్మైల్ అని పిలవడం మొదలెట్టారు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. అందుకని వసంత బాగా ఆలోచించిఅతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టేస్తుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకోమంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ దిక్కుమాలిన వాడికి ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో గ్రామంలో సంచలనం రేగుతుంది.
       
ఇలా వుండగా
, పంచాయితీ ఎన్నికలు దగ్గర పడతాయి. గ్రామాన్ని ఉత్తర కులం, దక్షిణ కులంగా ఆక్రమించుకుని పెత్తనాలు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములుంటారు. వీళ్ళ తల్లుల కులాలు వేర్వేరు. తండ్రి ఒక్కడే. కాబట్టి సవతులైన తల్లుల కులాల కారణంగా అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి పడక, గ్రామాన్ని కుల ఘర్షణలతో అట్టుడికిస్తూంటారు. ఉత్తరం దిక్కుకి జగ్గు (నరేష్), దక్షిణం దిక్కుకి లోకి (వెంకటేష్ మహా) కులోన్మాదులుగా పేర్గాంచి వుంటారు.
       
అయితే పంచాయితీ ఎన్నికలు రావడంతో ఓట్ల లెక్క తీస్తే
, ఇద్దరికీ సమానంగా ఓట్లు పడతాయని తెలుస్తుంది. జనాలు కులోన్మాదం పెంచుకోవడంతో ఎదుటి కులం ఓట్లు కొనలేని పరిస్థితి. అలాంటప్పుడు ఎదుటి కులం ఓట్లు తగ్గించాలంటే కొన్ని శాల్తీల్ని లేపెయ్యాలని హత్యాయత్నాలు కూడా చేస్తారు. ఇంతలో కొత్తగా ఓటు హక్కు పొంది, మార్టిన్ లూథర్ కింగ్ గా తిరుగుతున్న స్మైల్ దృష్టిలో పడతాడు. దీంతో అతడి ఓటు కొట్టేసి ఒక ఓటు మెజారిటీతో సర్పంచ్ గా గెలవచ్చని అతడ్ని పట్టుకుంటారు.
        
దీంతో మార్టిన్ వీఐపీ అయిపోతాడు. అతడి ఓటు కోసం పోటీపడుతూ అన్నదమ్ములు అతడ్ని అందలా లెక్కించడమే గాకతొక్కేస్తారు కూడా ఎవరికి వేస్తాడో చెప్పలేక పోతూంటే. ఇలా ఈ దుష్ట సోదరుల మధ్య చిక్కుకున్న మార్టిన్, తను పొందిన ఏకైక ప్రజాస్వామిక హక్కుతో ఏ నిర్ణయం తీసుకున్నాడుదీనికి ఎన్ని ప్రమాదా లేదుర్కొన్నాడు?చివరికి తన ఓటు హక్కుతో వ్యూహాత్మకంగాప్రత్యర్ధులు దిమ్మెరబోయేలా మాస్టర్ స్ట్రోక్ ఎలా ఇచ్చాడు ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    సరీగ్గా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ కీలక ఎన్నికల సినిమా విడుదలైంది. ఇలాగే సరీగ్గా 2021 ఏప్రెల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి ముందు రోజు తమిళంలో దీని మాతృక విడుదలైంది. తమిళంలో టాప్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా కి రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్. మండేలా కి జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చింది. 2021 తమిళ నాడు పోలింగ్ కి ముందు రోజు విడుదలైన మండేలా లో, ఓటుకి నోటుతాయిలంకులంమతం కాదని స్వచ్ఛంగా ఓటేస్తూప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నయా ఓటింగ్ మోడల్ చూపిస్తేఇది అక్కడ పోలింగ్ రోజున ఎంత వరకూ ప్రభావితం చేసిందో తెలీదు.
       
ఓటింగ్ పరంగా ఒక వినూత్న ఐడియాతో తమిళంలో  
మండేలా’ వాస్తవిక సినిమాని కొత్త దర్శకుడు మడోన్ అశ్విన్ ప్రయోగాత్మకంగా తీశాడు (2023 లో శివకార్తికేయన్ తో నూరు కోట్లు వసూలు చేసిన మావీరన్ తీశాడు). ఎన్నికల్లో కుల మతాలుడబ్బూ బహుమతులూ ఎరగా వేసి ఓట్లు కొల్లగొట్టుకునే కన్స్యూమరిజం రాజకీయం కొత్తదేం కాదు. ఓటర్లంటే ఫ్రీబీ (రేవడీ) లకి ఆశపడే కస్టమర్ల కింద జమకట్టి, వీరి కోసం టీవీలు, కరెంటు, లాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్కూటీలు, గ్యాస్ బండలు, నెల ఖర్చులకి డబ్బులు... ఇలా ఎన్నో బహుమతులు ఇస్తామని పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అయితే కిలో ఆవుపేడ రెండు రూపాయలకి కొంటామని కూడా  ప్రకటించింది!
       
ఇక కుల మత భావాలు రెచ్చగొట్టడం సపరేట్ సెక్షన్. దీనికి పార్టీలు సొంతంగా పెట్టుకునే ఖర్చుంటుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కో ర్యాలీ నిర్వహణకి పది కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రచార వ్యయం అన్ని పార్టీలకీ కలిపి లెక్కకడితే
ఈ ఖర్చుతో ఒక ఏడాది పాటు దేశ ప్రజలకి రేషన్ సరఫరా చేయ వచ్చు ప్లస్ దేశవ్యాఫంగా బడి పిల్లలకి ఏడాది పాటు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వొచ్చు ప్లస్ దేశవ్యాప్తంగా పేదలకి ఏడాది పాటు ఉపాధి హామీ పథకం నిర్వహించ వచ్చు...ఈ మూడు పథకాలకి ప్రభుత్వాల దగ్గర మాత్రం డబ్బులేదు, వుండదు.
        
కానీ ఎన్నికల కోసం పార్టీల దగ్గర మాత్రం ఈ మూడు పథకాలకి సరిపడా డబ్బుంటుంది. 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 121 దేశాల్లో ఇండియా 107 వ స్థానానికి దిగజారి ఆకలి రాజ్యంగా అలమటిస్తోంది. పార్టీలు మాత్రం అపర కుబేర పార్టీలుగా ఎదిగాయి. ప్రభుత్వం పేదదిప్రజలు నిరు పేదలుపార్టీలు మాత్రం అల్ట్రా రిచ్. ఎన్నికల్లో పార్టీల హోరాహోరీ పోరాటాలన్నీ ప్రభుత్వ ఖజానా మీద కబ్జా కోసమే తప్ప మరేం కాదు.
           
ప్రభుత్వ ఖజానా లోంచి మీరిచ్చే బహుమతులు కాదుమేం ఓటేయాలంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండని గ్రామాలు ఎదురు బేరం పెడితేర్యాలీలు జరగవు. ఆ ర్యాలీల ఖర్చుతో గ్రామాలు బాగుపడతాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత నెదుర్కొంటున్నది గ్రామీణులే. ఇదే ఈ కథలో చూపించారు. అయితే సినిమా కథ కాబట్టి గేమ్ గా చూపించి రక్తి కట్టించాలనుకున్నారు. మండేలా/మార్టిన్  దగ్గరున్న విలువైన ఓటు కోసం ప్రత్యర్ధులైన అన్నదమ్ములు దిగివచ్చి, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింతర్వాతగ్రామప్రజలు ఓటెయ్యకుండా మొండి చేయి చూపడమన్నది కాస్త అన్యాయమే. అయితే పార్టీల్ని ఇలా డబుల్ క్రాస్ చేస్తే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ప్రజా పాలన చెయ్యవేమో అనేది కూడా ఆలోచించాలి. ఇదే ఈ సినిమా రసవత్తరంగా చేస్తున్న పని.

నటనలు- సాంకేతికాలు

    యోగిబాబుతో పోల్చనవసరం లేదుగానీ సంపూర్ణేష్ బాబు చెప్పులు కుట్టే వాడిగా పాత్ర  స్వభావానికి సరిపోయాడు. తమిళంలో యోగిబాబుది క్షురకుడి పాత్ర. అయితే తమిళంలో పేరు పాత్రకి తగ్గట్టుగా వుంది. అది కులవివక్ష అనుభవించే పాత్ర కాబట్టి మండేలా పేరుపెట్టాడు తమిళ దర్శకుడు. నెల్సన్ మండేలా వర్ణవివక్ష గురించి పోరాడేడు. తెలుగులోనూ కుల వివక్ష అనుభవించే సంపూర్ణేష్ బాబు పాత్రకి మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ పోరాడింది మానవ హక్కుల గురించి. కొత్త దర్శకురాలు ఈ తేడా గమనించకుండా మార్టిన్ లూథర్ కింగ్ టైటిల్ గా కూడా పెట్టేసినట్టుంది.
       
వెర్రి బాగుల వాడు వెళ్ళి వెళ్ళి 
ఓటు హక్కుతో  ఎన్నికల్లో ప్రత్యర్ధులకి చిక్కి కింగ్ అయిపోవడంవాళ్ళ కుమ్ములాటలో తన స్థానమేమిటో క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం సంపూర్ణేష్ పాత్ర పని. ఈ రూపాంతరానికి ఆధారం పాత్రచిత్రణే. పైకి కింగ్ గా దర్జా వెలగబెట్టినా, లోలోపల అతను వాస్తవం తెలిసిన వాడే. చెప్పుల షాపు పెట్టి తండ్రి కోరికని నిజం చేయాలన్న కలలున్నప్పుడు అశాంతిని తెచ్చుకోకూడదన్న అర్ధంలో పాత్ర తీరు. అందుకే వూళ్ళో తనని ఎంత తక్కువ కులం వాడిగా చూసినాకించపర్చినాకిమ్మనక శాంతంగా కల కోసం పని చేసుకు పోతాడు.
        
కులమతప్రాంతీయ తత్వాలు భూమ్మీద మనుషులున్నంత కాలం వుండేవే. ఇవి తొక్కే స్తున్నాయని కులం కార్డోమతం కార్డోప్రాంతీయ కార్డో ప్రయోగించి వీధికెక్కితే ప్రయోజనం లేదు. అప్పుడా కార్డూ వుండదుసొంత కలలూ వుండవు. ఈ ఆటంకాల మధ్య నుంచి దారి చేసుకుంటూ కలల సాఫల్యతకి కృషి చేసుకు పోవడమే మార్గం. ఇది పాత్రగా సంపూర్ణేష్ నేర్పుతాడు. ఇందుకే అణిగి మణిగి వుండే క్యారక్టర్ గా కన్పించడం. వూళ్ళో అగ్రకులాల పట్ల ఎంత జాగ్రత్తగా వుంటాడంటేపోస్ట్ మాస్టర్ వసంత  మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెడితే, అది అగ్రకులం పేరేమోనని భయపడతాడు.
        
తన నిమ్న కుల ఆత్మ న్యూనతా భావాన్ని మర్చిపోవడానికిమర్రి చెట్టుకి పైన ఉయ్యాల కట్టుకునిఉయ్యాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో తను పైన స్వర్గంలో వున్నట్టు ఫీలవుతూకమ్మగా నిద్రపోతాడు. తన నిమ్న కుల స్థానంతో ఎంత విధేయంగా వుంటాడంటే పోస్టాఫీసు కెళ్ళి పక్క గోడ చూస్తూవెనుక గుమ్మం లేదే అనుకుంటాడు. ఇళ్ళల్లోకి వెనుక గుమ్మంలోంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడా అదే అనుకుంటాడు. 
        
పోస్టాఫీసులోకి వెళ్తూంటే తలుపు వూడి పడుతుంది. ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. డబ్బులు జమచేసి వెళ్తూ తలుపు గట్టిదనాన్ని మళ్ళీ పరీక్షిస్తాడు. ఈ చర్యలు పాత్ర తీరు రీత్యా హాస్యం పుట్టించినావెనుక గుమ్మంముందు తలుపు ప్రస్తావనలతో  చాలా సింబాలిజం వుంది. పోస్టాఫీసుల్లో  డిపాజిట్లు రిస్కులో వున్నాయని మీడియా రిపోర్టులు వచ్చాయి కూడా.
        
ఓటరు ఐడీ కార్డు వచ్చాక అతడి క్యారక్టర్ ని మార్చేస్తారు ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు. తనని రాజాలా చూసుకోవడం చేస్తూంటే సంపూర్ణేష్  మరింత డిగ్నిటీ నటించి క్యారక్టర్ ని ఇంకో లెవెల్ కి తీసికెళ్తాడు. మళ్ళీ యధాస్థితి కొచ్చి పూర్వపు చెప్పులు కుట్టే వాడు  అయిపోతాడు. చివరికి ఓటింగ్ చేసేప్పుడు కింగ్ అయిపోతాడు. ఎక్కడా ఎదిరించకుండాఎవర్నీ ఒక్క మాట అనకుండాఓటు పవర్ తో ఓడించేస్తాడు. సంపూర్ణేష్ కి ఐడీ కార్డు వచ్చినప్పట్నుంచీముగింపు షాట్ వరకూ ఏం చేయబోతున్నాడో ఎడతెగని ఒక సస్పెన్స్ తో అతడి క్యారక్టర్ కొనసాగుతుంది.
        
ఇక పోస్ట్ మాస్టర్ వసంతతో చేతకాని ప్రేమాయణం కూడా నడుపుతాడు. ఈ రీమేక్ నటుడిగా సంపూర్ణేష్  తనని పరీక్షించుకోవడానికి కొలమానంగా ఉపయోగపడింది. ఇందులో పడికి పది మార్కులూ పొందాడు. అలాగే అన్నదమ్ములుగా నటించిన నరేష్, వెంకటేష్ లు తమ విలనీని ఎత్తుగడలతో రంజింపజేస్తూ పోయారు. తమని గెలిపించే ఓటు కోసం ప్రత్యర్ధులు ఏమేం చేస్తారో సినిమాటిక్ గా కాకుండా, రియల్ లైఫ్ లో ఏమేం ఎత్తుగడలు వేస్తారో డెటెయిలింగ్ చేస్తూ నడిపడం వల్ల కథనానికి కొత్తదనం, బలంవచ్చాయి. ఇతర సహాయ పాత్రల్లో అందరూ ఓకే.
        
అయితే టెక్నికల్ గా తమిళంలో  వున్నంత వాస్తవికతని ప్రతిబింబించ లేదు. తమిళంలో రియలిస్టిక్ జానర్ కి తగ్గ ఒక రిధమ్ఒక విజువల్ క్రాఫ్ట్  కన్పిస్తాయి. సెటైర్ గా వుండే సీన్స్ కి ఆ ఫీల్ నిస్తూసాఫ్ట్ విజువల్స్ చూపిస్తూ ఆకస్మిక కట్స్ ఇస్తాడు. ప్రత్యర్ధుల సీరియస్ సీన్లు వచ్చేసరికి డార్క్ లైటింగ్ ఉపయోగిస్తూఎమోషన్లు హైలైట్ అయ్యే క్యారక్టర్ ఫ్రేమింగ్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెటైరికల్ గాలైట్ మ్యూజిక్ తో ఇచ్చాడు. వీటి మీద పట్టు సాధించాలి కొత్త దర్శకురాలు.

చివరికేమిటి

    ‘మండేలా లాంటి ప్రయోజనాత్మకాన్ని రీమేక్ చేయాలనుకోవడం మంచి ఆలోచనే. అయితే ఇది సబ్ టైటిల్స్ తో నెట్ ఫ్లిక్స్ లో ఇదివరకే వచ్చేసి తెలుగు వాళ్ళు చూశారు. పైగా 2021 లో మండేలా థియేటర్స్ లో విడుదల కాలేదు. అప్పటి లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్ లో విడుదలై వుంటే హిట్టా ఫ్లాపా తెలిసిపోయేది. ఈ నిర్ధారణ లేకుండా తెలుగులో రీమేక్ చేశారు. ఓటీటీ సినిమాని రీమేక్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రిస్కు ఎవ్వరూ తీసుకోరు.
       
కాబట్టి తెలుగులో థియేట్రికల్ విడుదల బాక్సాఫీసు దగ్గర పరీక్షే. పోతే
, తమిళంలో
 ముగింపే ఒకే షాట్ తో మరీ ఇంటలెక్చువల్ గా వుంటుంది. దీన్ని తెలుగులో పెంచి డ్రమటైజ్ చేసి వుంటే సామాన్యులకి బాగా అర్ధమయ్యేది. జాలి పుట్టించే సున్నిత హాస్యంతో ఒక పెద్ద రాజకీయ సమస్యనేకుల సమస్యనేఎవర్నీ నొప్పించకుండా ఆలోచింప జేసే చిత్రీకరణలతో ఆశ్చర్యపర్చే ప్రతిభ కనబర్చాడు కొత్త తమిళ దర్శకుడు. కొత్త దర్శకురాలు పూజా కొల్లూరు దీని మీద ఇంకా కృషి చేయాలి.  కంటెంట్ మీద తనకెంత పట్టుందో మరీ టైటిల్ పెట్టడం దగ్గరే దొరికిపోయేలా వుండకూడదు.  

—సికిందర్