ఆ హోటల్ కే వచ్చిన ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగిని అదితీ రావత్ (డయానా పేంటీ) సుమైర్ డ్రగ్స్ బ్యాగుతో రావడాన్ని చూసి, ఆ బ్యాగుని కొట్టేసి పై అధికారి సమీర్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) ని పిలుస్తుంది. ఇద్దరూ సుమైర్ మీద కన్నేసి వుంచుతారు. బ్యాగు పోగొట్టుకున్నట్టు తెలుసుకున్న సుమైర్ ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం హమీద్ షేక్ (సంజయ్ కపూర్) అనే ఇంకో స్మగ్లర్ వచ్చి సికిందర్ చౌదరి గొంతు మీద కూర్చుంటాడు.
డ్రగ్స్ వున్న బ్యాగుని పోగొట్టుకున్న సుమైర్ మైదా పిండి ప్యాకెట్స్ తీసికెళ్ళి సికిందర్ చౌదరికి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- ఇక సుమైర్ ని పట్టుకోవడానికి సికిందర్ చౌదరి గ్యాంగ్స్ వెంట పడతారు. మరోవైపు సమీర్, అదితీలు వెంటబడతారు. ఈ రెండు గ్రూపులకి దొరక్కుండా, స్టార్ హోటల్లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని ఎన్సీబీ అధికారి సుమైర్ ఆజాద్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.
కమల్ హాసన్ కి కొడుకు కోసం ఫిజికల్ యాక్షన్, మాజీ భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా రక్తి కట్టిస్తే, షాహిద్ కపూర్ కి ఈ రెండు షేడ్స్ లేక ఉపరితలంలోనే వుండిపోయాడు. కమల్ హాసన్ థ్రిల్లర్ కలర్ఫుల్ గా వుండడానికి పాపులర్ స్టార్స్ నటించడం ఇంకో కారణం. కమల్ కి యాంటీగా నార్కోటిక్స్ ఉద్యోగినిగా స్టార్ హీరోయిన్ త్రిష నటించడం, ఆమెతో కమల్ చేసే ఫైట్ ఒక ఎట్రాక్షన్ కావడం కలిసొచ్చాయి. హిందీలో ఎవరికీ తెలియని డయానా పేంటీతో ఈ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. కమల్ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ బలం వుంటే, హిందీలో రోణిత్ రాయ్ అనే పెద్దగా పేరు లేని పాత ఆర్టిస్టుతో విలన్ పాత్ర మామూలుగా వుంది. ఇంకో విలన్ గా ఒకప్పటి హీరో సంజయ్ కపూర్ ది ఓవరాక్షన్.
ఈ కథని కోవిడ్ -2 మహమ్మారి ముగిసిన సమయంలో స్థాపించారు. కోవిడ్-1, 2 లతో ఎంతో మంది చనిపోయి, మరెంతో మంది ఉపాధి కోల్పోయి నేరాల వైపు మళ్ళారని చెబుతూ కథ ప్రారంభించారు. నేరాల వైపు ఏ సామాన్యులు మళ్ళారో చూపించకుండా, డ్రగ్ స్మగ్లర్స్ అనే ప్రొఫెషనల్స్ తో కథ ప్రారంభిస్తే- ఆ డ్రగ్ స్మగ్లర్స్ కొత్తగా నేరాలకి పాల్పడేదేముంటుంది - అది వాళ్ళ నిత్య కార్యక్రమమే.
ఇక కోవిడ్ జాగ్రత్తలంటూ ప్రారంభ దృశ్యాల్లో మాస్కూలు వేసుకుని తిరగడం చూపించి, ఆ తర్వాత మర్చిపోయాడు దర్శకుడు. ఈ మాత్రం దానికి కోవిడ్ బిల్డప్ ఎందుకో అర్థంగాదు. ఆ హోటల్లో దాగుడు మూతలప్పుడు మాస్కు లేసుకుని వుంటే, ఎవరు ఎవరో తెలియక కన్ఫ్యూజన్ తో చాలా కామెడీగా యాక్షన్ వుండేది.
ఎన్సీబీ ఉద్యోగినిగా వేసిన డయానా పేంటీ ఫార్ములా సినిమా పాత్రే. పై అధికారి పక్కన కరివే పాకు పాత్ర. వెబ్ సిరీస్ లో స్త్రీ పాత్రలు- హీరోయిన్ పాత్రలూ ఎంత శక్తిమంతంగా వుంటున్నాయో గుర్తిస్తున్నట్టు లేదు సినిమా దర్శకులు.
రిచ్ విలన్ గా రోణిత్ రాయ్, అతడి పక్క వాద్యంగా సంజయ్ కపూర్ పాత విలన్లుగా వుంటారు. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చి దిద్దాడు దర్శకుడు. ప్రారంభంలో ఔట్ డోర్ యాక్షన్ సీన్స్ బావున్నాయి. అయితే ఈ మేకింగ్ క్వాలిటీ అంతా పాపులర్ నటీనటులతో వుండుంటే సినిమా పై లెవెల్లో వుండేది. ఇంకోటేమిటంటే, ఎప్పుడో 2011 నాటి కాలపు ఫ్రెంచి థ్రిల్లర్ ని ఇప్పుడు రీమేక్ చేయడం విజ్ఞత అన్పించుకోదు. ఫ్రెంచి థ్రిల్లర్ ఫ్రెష్ గా వున్నప్పుడు, అప్పుడప్పుడే 2015 లో కమల్ హాసన్ రీమేక్ చేయడం వేరే విషయం.