రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 8, 2022

1208 : రివ్యూ!


దర్శకత్వం : వంశీధర్ గౌడ్, పి. లక్ష్మీనారాయణ
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సివిఎల్ నరసింహారావు, ప్రభాస్ శ్రీను, మహేష్ ఆచంట, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ తదితరులు.
రచన : అనుదీప్ కెవి, సంగీతం: రధన్, ఛాయాగ్రహణం : ప్రశాంత్ అంకిరెడ్డి
నిర్మాతలు: శ్రీజ ఏడిద, శ్రీరామ్ ఏడిద
బ్యానర్ : పూర్ణోదయ పిక్చర్స్, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్, మిత్రవింద మూవీస్
విడుదల : సెప్టెంబర్ 2, 2022
***

        సూపర్ హిట్ కామెడీ  జాతిరత్నాలు టీం మరోసారి నవ్వించేందుకు  ఫస్ట్ డే ఫస్ట్ షో అనే మరో కామెడీతో వచ్చారు. రెండు చిన్న సినిమాల్లో నటించిన  శ్రీకాంత్ రెడ్డి హీరో. సోషల్ మీడియా స్టార్ గా కోట్లు సంపాదిస్తున్న18 ఏళ్ళ సంచితా బసు హీరోయిన్.   వంశీధర్ గౌడ్, పి. లక్ష్మీనారాయణ జంట దర్శకులుగా చేస్తున్న తొలి ప్రయత్నం.  జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఇచ్చిన కథతో ఈ కామెడీ తీశారు. శంక‌రాభ‌ర‌ణం, సీతాకోక చిలుక‌, స్వ‌యం కృషి, సితార‌, సాగ‌ర సంగ‌మం లాంటి క్లాసిక్స్ నిర్మించిన పూర్ణోదయ పిక్చర్స్ సంస్థ 30 తర్వాత ఏళ్ళ రీ ఎంట్రీ ఇస్తూ, సంస్థ అధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా ఈ కామెడీ తెరకెక్కింది. జాతిరత్నాలు ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ నిర్మిస్తే, అదే టీం నుంచి వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో కి కూడా ప్రముఖ నిర్మాతే లభించడం టీంకున్న గుడ్ విల్ ని తెలుపుతుంది. మరి ఇంతా చేసి ఈ రెండో కామెడీతో అంతే నవ్వించారా, ఎక్కువ నవ్వించారా, అసలు నవ్వించలేదా? ఇది తెలుసుకుందాం.

కథ

2001 లో శీను (శ్రీకాంత్ రెడ్డి) కాలేజీ స్టూడెంట్. పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తాడు. ఏ పవన్ సినిమా  విడుదలైనా మొదటి రోజు మొదటి ఆట చూసేస్తాడు. థియేటర్లో, వూళ్ళో బ్యానర్లు కట్టి హడావిడి చేస్తాడు. ఎంతగానో ఎదురు చూసిన పవన్ కొత్త సినిమా ఖుషీ విడుదలవుతూంటే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం జనంలో పడతాడు. క్లాస్ మేట్ లయ (సంచితా బసు) అని వుంటుంది. ఆమెని ఇష్టపడుతూంటాడు. తను కూడా పవన్ ఫ్యానే అని, ఎలాగైనా టికెట్ కావాలని ఆమె అడుగుతుంది. ఆమె మీద ఇష్టంతో  శీను ఎలాగైనా టికెట్లు సంపాదించాలని కదనరంగంలోకి దూకుతాడు.   

అలా దూకిన శీను టికెట్లు సంపాదించాడా లేదా? దీని కోసం ఎలాటి సాహసాలు చేశాడు? ఇద్దరూ కలిసి సినిమా చూశారా? లయతో ఇష్టం ప్రేమగా మారిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

2000 నుంచి ఓ అయిదారేళ్ళ పాటు  చిత్రం, నువ్వే కావాలి మొదలైన లైటర్ వీన్ ప్రేమ సినిమాల పేరుతో కుప్పతెప్పలుగా వచ్చి పడ్డ యూత్ సినిమాలు ఎలా వుండేవో, అదే కాలంలో ఈ కథని స్థాపించిన సినిమా కూడా నాటి సినిమాల్లాగే వుంది. నాటి సినిమాల స్పెషాలిటీ ఏమిటంటే, లైటర్ వీన్ అని కథ ఎక్కడో క్లయిమాక్స్ లో వుండేది. అంతసేపూ కథలేకుండా లవర్స్ తో పైపై కామెడీలే. క్లయిమాక్స్ దగ్గర్లో కాస్తంత కథ పుట్టి, ప్రేమికులు సమస్యలో పడి, ఓ అయిదు పది నిమిషాలు బాధపడి, ఆ సమస్య తీరిపోయి సుఖాంతమవడం ఈ సినిమాల ధోరణి. అందువల్ల ఇవి మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే లయ్యాయి.      

రాను రాను ఇవి బోరుకొట్టి, ఐదేళ్ళ తర్వాత ట్రెండ్ పరిసమాప్తమైనా, కొన్ని పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఇలాగే తీస్తూ అట్టర్ ఫ్లాపయ్యారు. 2015 లో రవితేజతో బెంగాల్ టైగర్ కూడా ఇలాగే తీసి అట్టర్ ఫ్లాపయ్యారు. 

ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో తో ఇదే సమస్య.  కేవలం హీరోయిన్ కోసం హీరో టికెట్లు సంపాదించే లైటర్ వీన్ కథ. దీన్ని 2001 లో చూసేవాళ్ళేమో గానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్ కి సరిపోతుంది. అయితే కథలేని కథల్ని రెండు గంటల సినిమాగా సాగదీసే విధానం కూడా వుంది. ఈ సినిమా కథకుడు ఈ జానర్ ని రీసెర్చి చేయలేదు. చేసి వుంటే హాలీవుడ్ లో ఇలాటి పలచని కథల్ని  ఆద్యంతం సంక్లిష్టం చేసి నిలబెడతారని తెలిసేది. అదే చిక్కటి కథల్ని హాలీవుడ్ రచయితలు తేలికపాటు చేస్తారు. కానీ తెలుగులో ఇంకా పలచని కథని పలచగానే తీసి పదేపదే దెబ్బ తింటున్నారు.   

అసలు కథ వుందా అన్పించే సక్సెస్ అయిన హాలీవుడ్ సినిమాలు- కాఫీ అండ్ సిగరెట్స్, ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్, లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, ది స్ట్రెయిట్ స్టోరీ, బిఫోర్ సన్సెట్...ఇలా చాలా వున్నాయి.

ఫస్ట్ డే ఫస్ట్ షో లో  కేవలం టికెట్లు పొందే విషయం లేని కథనే  చివరంటా సాగదీయడంతో, టికెట్ల కోసమే చివరంటా కామెడీలు చేయడంతో, కథ అంతసేపు నిలబడడం కష్టమైపోయింది. టికెట్ల కోసం ప్రారంభమైన కథ ఇంకేదో సమస్య తర్వాత సమస్యగా, సంక్లిష్ట మవుతూ పోయే హాలీవుడ్ స్కీముని అనుసరించి వుంటే ఇలా జరిగేది కాదు. ఎంత సేపూ టికెట్ల గోలతో ప్రేమ కథని కూడా సరిగా చూపించలేదు. టికెట్ల కథతో కూడా నమ్మకం లేనట్టు - ఇక పవనే కాపాడాలన్నట్టు పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డారు. ఎప్పుడు చూసినా పవన్ మీద డైలాగులు, పోస్టర్లూ ఇవే కన్పిస్తాయి పవర్ స్టార్ ని  ప్రమోట్ చేయడానికి సినిమా తీసినట్టు!

కామెడీ కూడా కాసేపటికి విషయం లేక ఆవిరైపోయింది. అర్ధం పర్ధం లేని గోల కామెడీతో నింపేశారు. శవం సీను, టపాసులు విసిరే సీను నవ్వించకపోగా కోపం తెప్పిస్తాయి. ఎలాపడితే అలా చూపిస్తే ప్రేక్షకులు నవ్వుతారనుకున్నారేమో. క్రియేటివిటీ పూర్తిగా కొరవడి వెటకారంగా తయారైంది టికెట్ల కోసం కామెడీ.

లాజిక్ లేని మైండ్ లెస్ కామెడీలు తీయొచ్చు. అయితే దానికి విచిత్ర మనస్తత్వాలున్న పాత్రలుండాలి. హిందీలో రోహిత్ శెట్టి గోల్ మాల్ సిరీస్ సినిమాలు స్టార్స్ తో నాలుగు తీశాడు. కరీనా కపూర్, అజయ్ దేవగణ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పడే లవి విచిత్ర క్యారెక్టర్లు. వీళ్ళ మైండ్ లెస్ కామెడీలు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే వుంటాయి. సిరీస్ లో నాల్గూ హిట్టయ్యాయి. ఇంకోటి రాబోతోంది.  

జాతిరత్నాలు దర్శకుడు రాసిన ఈ కథలో ఒకసారి చూసి భరించగల కామెడీ కూడా లేదు. కథ అసలే లేదు. కాస్త నవ్వించేది వెన్నెల కిషోర్ కామెడీయే. 

నటనలు – సాంకేతికాలు

హీరోగా నటించిన శ్రీకాంత్ రెడ్డి నటనకి ఇంకా కొత్త. ఇప్పుడే టైమింగ్ తో కూడిన కామెడీ నటించడం కష్టం. పూర్తి స్థాయి కామెడీ సినిమాని హీరోగా తను నిలబెట్టలేడు. ఇంకా చాలా టైమ్ పడుతుంది. అంతవరకూ ఇతర సినిమాలు చేసుకోవడమే. హీరోయిన్ సంచిత సోషల్ మీడియాలో టాప్ వీడియోలు చేసింది గానీ, ఇక్కడ నటించడానికి సరైన పాత్రలేక, వున్న పాత్ర కూడా నిడివి తక్కువ కావడంతో కంటికి ఆనలేదు. ఇందాక చెప్పుకున్నట్టు వెన్నెల కిషోర్ తన అనుభవంతో కొన్ని సీన్లు నిలబెట్టాడు. ఇంకా చాలా మంది కమెడియన్లూ, సహాయ నటులూ వున్నారు గానీ, విషయమే లేకపోతే ఏం నటిస్తారు.

ఇకపోతే రధన్ సంగీతంలో పాటలు బావున్నాయి. వాటి చిత్రీకరణ బావుంది. శ్రీకాంత్ ఛాయాగ్రహణం బావుంది. జంట దర్శకులు దర్శకత్వం గురించి ఇంకా చాలా నేర్చుకోవాల్సి వుంది. ఫస్ట్ కథ చేసుకుంటే, తర్వాత షో వేయవచ్చు. ముందు షో వేసేస్తే, తర్వాత దానికదే కథ వచ్చేస్తుందని అనుకున్నట్టుంది. ఫస్ట్ డేనే లేకుండా పోయింది. ఏమైనా ధైర్యం చేసి ఈ కొత్త టాలెంట్స్ చేతిలో బడ్జెట్ పెట్టి, సినిమా తీసిన ప్రముఖ నిర్మాణ సంస్థని అభినందించాలి.

—సికిందర్

 

Tuesday, September 6, 2022

1207 : సందేహాలు- సమాధానాలు

 

Q : గరుడ గమన వృషభ వాహన సినిమా లో ఉపయోగించిన స్లో మోషన్ షాట్స్ గురించి విశ్లేషణ ఇవ్వగలరా?
—జయసింహా, రచయిత
A : అది కన్నడలో నటుడు, దర్శకుడు రాజ్ బి శెట్టి తీసిన గొప్ప గ్యాంగ్ స్టర్ సినిమా. సినిమాలో దృశ్య భాష (విజువల్ లాంగ్వేజ్) ని కొత్త కోణంలో ఆవిష్కరించాడు. స్లోమో (స్లోమోషన్) షాట్స్ ని కథనంలో సబ్ టెక్స్ట్ (ఉపవచనం) చెప్పడానికి వాడుకున్నాడు. డైలాగుల్లో పాత్ర పైకి చెప్పే మాట వొకటి వుంటుంది, చెప్పకుండా వదిలేసే అంతర్లీన భావం ఒకటుంటుంది. ఇదే సబ్ టెక్స్ట్. దీన్ని కథనానికి దృశ్య భాషగా ఉపయోగించాడు. ఏమిటా దృశ్యభాష అంటే కాలాన్ని చెప్పడం. అంటే ఇక్కడ వెండితెర మీద బొమ్మ మామూలుగా కదులుతున్నప్పుడు అది కాలంతో పాటు వున్నట్టు. కదలికలు నెమ్మదించినప్పుడు, లేదా నిలిచిపోయినప్పుడు, కాలవేగం తగ్గినట్టు లేదా ఆగినట్టు.


ఈ వయోలెంట్ గ్యాంగ్ స్టర్ కథలో పాత్రలకి కాలంతో బాటు పరిగెత్తకండి, పతనమైపోతారు, మీ దుర్మార్గాలు తగ్గించండి - లేకపోతే కాలమే మిమ్మల్ని ఆపేస్తుందనీ చెప్పడం. కాలం ఆగడమంటే చావు అన్నమాట. ఈ సినిమా నిండా స్లోమో తో బాటు, ఫ్రీజ్ షాట్స్ కూడా వున్నాయి. ఒక చావుని చూపించే ముందు ఏ పాత్రయితే ఆ చావు గురించి చెబుతోందో, లేదా తెలుసుకోబోతోందో, అప్పుడా పాత్ర మీద ఫ్రీజ్ షాట్ పడుతుంది. ఆ షాట్ ఫోటోగ్రాఫ్ లా నిశ్చలంగా వుంటుంది. తిరిగి మోషన్లో కొస్తే, ఓ శవం రివీల్ అవుతుంది. కాలాన్ని ఆపి చెప్పడమంటే చావు గురించి చెప్పడ మన్న మాట. ఫ్రీజ్ షాట్స్ ఇలా కథనం చేస్తూంటాయి. కథనాన్ని వినడమో, చూడడమో కంటే ఫీలవడంలో ఎక్కువ ఫీల్ వుంటుంది.  

సినిమా ప్రారంభంలో శివ (రాజ్ బి శెట్టి)  పోలీస్ స్టేషన్ కొచ్చి మాట్లాడి వెళ్తున్నప్పుడు, స్లోమోలో వుంటాడు. సినిమాలో ఇదే మొదటి స్లోమో. ఎందుకీ స్లోమో వేశాడో అర్ధం గాదు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో ఒకడ్ని కొట్టి పడేశాక, కాలరేగరేసి స్లోమోలో స్టయిలుగా నటుడుచుకుంటూ పోతూ సిగరెట్ విసిరేస్తే, మాస్ మ్యూజిక్  తో బ్యాక్ గ్రౌండ్ లో ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడతాయి. ఈ స్లోమో హీరోయిజం కోసం.


కానీ పోలీస్ స్టేషన్లో శివకిలాటి యాక్షన్ సీనేం లేదు. మరెందుకు స్లోమో? తర్వాత్తర్వాత కథనంలో మరిన్ని స్లోమోలు వస్తూంటే అప్పుడర్ధమవుతుంది- స్లోమోలు కాలానికి సింబాలిజాలని. హింసతో చెలరేగుతున్న పాత్రల్ని స్లోమోతో కాల వేగాన్ని తగ్గి స్తూ, వెనక్కి లాగే ప్రయత్నమన్నమాట. హింసని వ్యతిరేకించాలని అంతర్లీన సందేశమన్న మాట! గొప్ప క్రియేషన్.

Q : ఈ మధ్య యూట్యూబ్ లో భలే అమ్మాయిలు అనే పాత సినిమా చూసాను. ఎన్టీఆర్, సావిత్రి హీరో హీరోయిన్లు. కాని కధ అంతా నడిపించేది రేలంగి. ఎన్టీఆర్ తెర మీద కనిపించేది కూడ తక్కువే. ఇంకా జగ్గయ్య ఎక్కువ కనపడతాడు. ఈ సినిమా కి రేలంగినే హీరో అనాలా?
—బోనగిరి అప్పారావు, ఇంజనీర్
A : పాత సినిమాలు కొన్ని ఇప్పుడు చూస్తే ఇలాగే అన్పిస్తాయి. భలే అమ్మాయిలు (1957) టైటిల్ ప్రకారం సావిత్రి, గిరిజలు ఏమీ చేయకుండా, హీరోగా ఎన్టీఆర్ కూడా ఏమీ చేయకుండా, వీళ్ళ కథ రేలంగి చక్కబెట్టుకు రావడం చూస్తే, రేలంగి కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ కావడం చూస్తే, ఆ రోజుల్లో సరిపోయింది. ఆ రోజుల్లో తెరమీద కదిలే బొమ్మల్ని చూడ్డమే మహా అద్భుతం. ఆ అద్భుతం ముందు మిగిలినవి ప్రధానమే కాదు. పైగా మొత్తం 12 పాటలతో నింపేస్తే, ఎవరికెంత కథ పడింది, ఎవరెంత నిడివి నటించారు కొలతలు ఎలా తెలుస్తాయి?

అప్పట్లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లలిత కళా తోరణం ఓపెన్ ఏర్ థియేటర్లో శనివారం పాత సినిమా వేసే వాళ్ళు. ఏమిటా అని వెళ్తే అంతస్తులు (1965) వేస్తున్నారు. అక్కినేని, భానుమతి, కృష్ణకుమారి నటీనటులు. సూపర్ హిట్ పాటలు. కానీ ఇంటర్వెల్ కి కొంత ముందు గమ్మత్తు జరిగింది. హఠాత్తుగా కథ మారిపోయింది. సస్పెన్సుతో నడుస్తున్న కథ నిను వీడని నీడను నేనే హార్రర్ సాంగ్ తర్వాత అక్కినేని, కృష్ణ కుమారిల కథ ఎటో వెళ్ళిపోయి- ఇంకేదో సినిమా చూస్తున్నట్టు  దులపర బుల్లోడా పాటతో భానుమతి స్టోరీ మొదలైపోయింది.

ఇలా కొన్ని పాత సినిమాలుంటాయి. వీటిని ఆనాటి నటీనటుల కోసం, పాటల కోసం, ఆ కాలంలో మనుషులెలా వుండేవాళ్ళో తెలుసుకోవడం కోసం చూడాలే తప్ప. విశ్లేషించ కూడదు. విశ్లేషించుకోవడానికి వేరే పాత సినిమాలు చాలా వుంటాయి.

Q : టాప్ గన్ చూసి ఏమైనా రాస్తారని ఎదురు చూస్తున్నాను.
—విధీర్, అసోషియేట్
A : ఏమర్ధమైందో చెప్తే రాద్దాం.

—సికిందర్

Monday, September 5, 2022

1206 : రివ్యూ!


దర్శకత్వం : ఆర్. అజయ్ జ్ఞానముత్తు
తారాగణం : విక్రమ్, శ్రీనిథీ శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కెఎస్ రవికుమార్, రోషన్ మాథ్యూ
రచన : ఆర్. అజయ్ జ్ఞానముత్తు, నీలన్ కె, శేఖర్ కణ్ణ శ్రీవస్తన్, అజరుద్దీన్ అల్లావుద్దీన్, ఇన్నాసి పాండియన్, భరత్ కృష్ణమాచారి
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : హరీష్ కణ్ణన్
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల :  ఆగస్టు 31, 2022
***

వితికి చియాన్ విక్రమ్ కానుకగా  కోబ్రా విడుదలైంది. కేజీఎఫ్‌ హీరోయిన్ శ్రీనిధీ శెట్టి, క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ లతో జత కట్టి వచ్చాడు విక్రమ్. శ్రీనిధికి ఇది తమిళంలో ఎంట్రీ. ఇర్ఫాన్ కి నటనలో ఎంట్రీ. ఇంకో ఇద్దరు హీరోయిన్లు వున్నారు- మీనాక్షి, మృణాళిని. విక్రమ్ 10 వివిధ గెటప్స్ తో కనిపిస్తాడని బాగా ప్రచారం జరిగింది. వీటితో బాటు భారీ బడ్జెట్, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇవన్నీ కలిసి 5 భాషల్లో పానిండియా మూవీగా విడుదలైంది. ఇంతవరకూ గత జూన్ లో ఒకే ఒక్క తమిళ పానిండియా కమల్ హాసన్ తో విక్రమ్ మాత్రమే హిట్టయ్యింది. ఇప్పుడు ఇంత ఆర్భాటంతో కోబ్రా ఏ మేరకు పానిండియా అర్హతతో వుంది? ఫ్లాపయిన ఇతర తమిళ పానిండియాల్లాగే తమిళనాడులో ఇది తమిళులకే పరిమితమయ్యే అవకాశముందా? ఇది తెలుసుకుందాం...

కథ
మది (విక్రమ్) గణిత మేధావి. టీచర్ గా పని చేస్తూంటాడు. ఇతడ్ని భావన (శ్రీనిధి) ప్రేమిస్తూంటుంది. కానీ తీవ్రమానసిక సమస్యలతో వున్న మది పెళ్ళికి ఒప్పుకోడు. అతను ఏవేవో చిత్త భ్రాంతులకి లోనవుతూంటాడు. ఇంకో పక్క ఉన్నతస్థాయి రాజకీయ హత్యలు జరుగుతూంటాయి. కోయంబత్తూరులో ఒరిస్సా ముఖ్యమంత్రి హత్య, స్కాట్ లాండ్ లో పెళ్ళి చేసుకుంటున్న రాకుమారుడి హత్య, రష్యాలో బహిరంగ సభలో పాల్గొంటున్న రక్షణ మంత్రి హత్య. ఈ హత్యల్ని ఒకే హంతకుడు వివిధ గెటప్స్ తో చేస్తూంటాడు.

ఈ హత్యల్ని యుద్ధ ప్రాతిపదికన ఇంటర్ పోల్ కాప్ అస్లన్ ఇన్మజ్ (ఇర్ఫాన్ పఠాన్) దర్య్యాప్తు చేస్తూంటాడు. ఇతడి టీములో తెలివైన జుడిత్ శాంసన్ (మీనాక్షీ) వుంటుంది. ఈమె ఈ హత్యల్ని విశ్లేషించి ఇవి ఎవరో గణిత మేధావి ఘన కార్యాలని చెప్తుంది. ఈ హత్యలకి గురైన నేతలు రుషి (రోషన్ మాథ్యీవ్) అనే దుష్ట కార్పొరేట్ అధిపతికి వ్యతిరేకులని తెలుస్తుంది. ఆ హంతకుడు లెక్కల మాస్టారు మది అని తెలీదు. కానీ ఒక హ్యాకర్ తెలుసుకుని, వాడి నిజస్వరూపం బయటపెడతానంటాడు. దీంతో మది అప్రమత్తమవుతాడు.

ఎలావుంది కథ
        మది ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? ఇతడి గతమేమిటి? మానసిక సమస్యలేమిటి? తనకి ప్రమాదకరంగా వున్న హ్యాకర్ ని పట్టుకున్నాడా? హత్యలతో రిషి కేమైనా సంబంధముందా? మదికి భావనతో పెళ్ళయ్యిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కథ. కొత్తగా అన్పించే కథ (మొత్తం కాదు). గణిత మేధావి గణిత శాస్త్ర అంచనాలతో పథకాలు రచించి గొప్ప గొప్ప నేతల్ని మతిపోయే విధంగా అంతమొందించడం. అయితే వచ్చిన సమస్యేమిటంటే, విక్రమ్ పాత్రకంటే ఈ సినిమాకి పని చేసిన దర్శకుడితో బాటు ఆరుగురు రచయితలే పనిగట్టుకుని మేధావులై పోవడం. ప్రేక్షకుల మెదళ్ళపై బుసలు కొట్టడం. వీళ్ళ గణితమేమిటో, ఆల్జీబ్రా ఏమిటో, ఎక్కాలేమిటో  అస్సలు అర్ధం గాకపోవడం. ఫస్టాఫ్ ఎలాగో అర్ధమైనా, సెకండాఫ్ చూడాలంటే పాము పుట్టలో తల పెట్టడమే. అక్కడున్న కోబ్రాతో కాట్లేయించుకోవడమే.

        పైగా మూడు గంటల భారమైన సినిమా. కథ ఎలా నడపాలో, ఎలా ముగించాలో తెలీక అనేక మలుపులు, అనేక ఫ్లాష్ బ్యాకులు, ఏం చెప్తున్నారో అర్ధంగాని కన్ఫ్యూజన్. సింపుల్ గా చెప్తే అయిపోయే కథని అష్టవంకర్లు తిప్పారు. పైన చెప్పుకున్న ఫస్టాఫ్ కథ హత్యలతో, విక్రమ్ తెలివి తేటలతో చకచకా సాగిపోయినా, సెకండాఫ్ వచ్చేసరికి తలపోటు వచ్చేస్తుంది. లైగర్ సెకండాఫ్ ఎలా కుప్పకూలిందో ఇదీ అంతే. ఇదే సంవత్సరం వచ్చిన విక్రమ్ గత ఫ్లాప్ మూవీ మహాన్ ఎంత టార్చరో,కోబ్రా అంతకన్నా టార్చర్. దీన్ని శ్రీనిధీ, ఇర్ఫాన్ లని పరిచయం చేస్తూ పానిండియాగా విడుదల చేయడం ఓవరాక్షన్.


నిడివి 20 నిమిషాలు తగ్గించినా ప్రేక్షకుల కన్ఫ్యూజన్ పోవడం లేదు. కన్ఫ్యూజన్ కి క్షమాపణ చెప్పుకుంటూ, మరోసారి చూస్తే కన్ఫ్యూజన్ వుండదని, తప్పకుండా మరోసారి చూడమని దర్శకుడి వినమ్ర సలహా. ఇంకోసారి బెటర్ సినిమా తీస్తానని ప్రామీస్. ఐతే బెటర్ సినిమా చూస్తామని ప్రేక్షకుల టాటా. ఆరుగురు రచయితలు + దర్శకుడు = భయపడి బుట్టలో దాక్కున్న కోబ్రా! ఈ కథ కోబ్రాలకే అవమానం. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద దర్శకుడ్ని, ఆరుగురు రచయితల్ని శిక్షించాలి.

నటనలు- సాంకేతికాలు  

మానసిక సమస్యలతో, ఓ పది గెటప్స్ తో   కోబ్రా ఇంకో అపరిచితుడు అన్పించి వుంటుంది విక్రమ్ కి. పది గెటప్స్ తో రహస్యంగా హత్యలు చేయడం, ప్రైవేటుగా టీచరుగా పనిచేయడం, పర్సనల్ గా గతంతో బాధపడడం. ఇన్ని షేడ్స్ వున్న క్యారక్టర్ అపూర్వమే విక్రమ్ కి. వీటిలో తను ఎంత బాగా నటించినా కథకి అర్ధం పర్ధం లేక నష్టపోయాడు.

 పైగా సెకండాఫ్ లో గతం గురించి చెప్పడానికి ఎంతకీ ముగియని పరమ బోరు ఫ్లాష్ బ్యాక్. తన మానసిక సమస్య ష్కీజో ఫ్రేనియా అని తెలుస్తుంది. అది చెప్పి వూరుకోవడమే తప్ప దాని ఆద్యంతాలేమిటో వుండవు. అలాగే తన శాడ్ క్యారక్టర్ తో శ్రీనిథితో రోమాన్స్ కూడా ఎంటర్ టైన్ చేయలేదు.

        కేజీఎఫ్ శ్రీనిథి పాత్ర తక్కువే. మధ్యతరగతి అమ్మాయి,. అతడ్ని ప్రేమించి అతడ్నే పెళ్ళి చేసుకోవాలని వుండిపోవడం. ఓ పాటలో గ్లామరస్ గా వుంది. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి నటన నేర్పించి నటింప జేశారు. ఇంటర్ పోల్ కాప్ గా ఫర్వాలేదన్పించాడు.

        సాంకేతికంగా చాలా వ్యయం చేశారు. స్కాట్ లాండ్ లో యువరాజు పెళ్ళి – హత్యా దృశ్యాలు, రష్యాలో రక్షణ మంత్రి బహిరంగసభ – హత్యా దృశ్యాలూ టాప్ క్లాస్ గా వున్నాయి. హై టెక్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ దృశ్యాలు కూడా పకడ్బందీగా వున్నాయి. కాకపోతే లాజిక్ అనేది ఎక్కడా వుండదు. ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో పాటలు హిట్ కాలేదు. నేపథ్య సంగీతం హోరెక్కువ వుంది. సన్నివేశాలే కన్ఫ్యూజన్ గా వుంటే సంగీతమెలా కుదురుతుంది.

        మొత్తానికి లైగర్ తర్వాత ఇంకో పానిండియా కోబ్రా సౌత్ సినిమాల ప్రతిష్ట మసక బార్చాయి. విక్రమ్ కూడా అపరిచితుడు లాంటి ప్రయోగాలు గాకుండా నాన్న లాంటి అర్ధవంతమైన సినిమాలు అడిగి తీయించుకుంటే గౌరవం పెరుగుతుంది.

—సికిందర్ 

 

Sunday, September 4, 2022

1205 : సండే ఆర్టికల్

సారైనా శర్వానంద్ ఒకే ఒక జీవితంతో హిట్ బాట పడతాడా? ఈ వారం 9 వ తేదీ  విడుదలవుతున్న ఒకే ఒక జీవితంకేసే ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. కారణం, ఆరు వరస ఫ్లాపుల తర్వాత శర్వానంద్ సైన్స్ ఫిక్షన్ తో రావడం. ఇదే మళ్ళీ ఇంకో పాత మూస అయితే అనుమానంగా చూసే వాళ్ళు ప్రేక్షకులు. 2017 నుంచీ పడిపడి లేచే మనసు, ‘రణరంగం, ‘జాను, ‘శ్రీకారం, ‘మహాసముద్రం, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు...ఇలా అరడజను అట్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత, ఇప్పుడు రూటు మార్చి సైన్స్ ఫిక్షన్ ప్రయత్నించడం, అదీ బ్రహ్మాస్త్రంలాంటి భారీ స్పిరిచ్యువల్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న రోజే పరీక్షకి నిలబడడం ఆసక్తి రేపే విషయమే.

కే ఒక జీవితం’, ‘బ్రహ్మాస్త్రం’ -ఒకటి సైన్స్ ఫిక్షన్ అయితే, ఇంకోటి స్పిరిచ్యువల్ థ్రిల్లర్ రెండూ ఈ వారం ప్రేక్షకులకి వెరైటీలే. వరుసగా మూడు వారాలు లైగర్, కోబ్రా, రంగరంగ వైభవం అనే ఒకదాన్ని మించిన ఒక మూస నుంచి కాస్త రిలీఫ్ నిచ్చే వెరైటీలు. అయితే ఇక్కడొకటి వుంది- ఈ రెండూ గణేష్ నిమజ్జనం రోజున విడుదలవుతున్నాయి! మండపాలు, వినాయకుడి ఊరేగింపులూ వదిలి సినిమాలకి రాగలరా ప్రేక్షకులు తొమ్మిదో తేదీన? మనకి తెలిసి నిమజ్జనం రోజున ఏ సినిమా విడుదల కాలేదు, విడుదల చెయ్యరు  చవితికి తప్ప!        

            అయితే బ్రహ్మాస్త్రంహిందీలోనే కాదు, తెలుగు వెర్షన్ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్ట్రాంగ్ గా వున్నాయి. బాయ్ కాట్ ట్రెండింగులు ఏమాత్రం పనిచేయడం లేదు. మొన్న యాంటీ నేషనల్జావేద్ అఖ్తర్ కూడా క్లాసు పీకడంతో, జర్నలిస్టు అభిశార్ శర్మ కూడా బాయ్ కాట్ బ్యాచి టికెట్ డబ్బుల్లేని బేకార్ బ్యాచ్అని వాయించడంతో నోర్మూసు కున్నారు. పైగా వారం పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్రం టీం ప్రమోషన్లతో తెగ హడావిడి చేస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్ ల ప్రమో కార్యక్రమాల్లో రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్ లు పాల్గొంటూ తెలుగు ప్రేక్షకుల్లోకి  సినిమాని బలంగా తీసికెళ్ళి మార్కెటింగ్ చేస్తున్నారు. రణబీర్ మంచి తెలుగు కూడా మాట్లాడడంతో సంభ్రమాశ్చర్యాలతో ట్వీట్లు చేశారు నెటిజనులు.

            ఈ నేపథ్యంలో శర్వానంద్ సైన్స్ ఫిక్షన్ పరీక్షకి నిలబడింది. 4 వ తేదీ ఆదివారమింకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు.  టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ హీరోగా నటించి యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతున్నాయి. ఆడవాళ్ళూ మీకు జోహార్లుకి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించినా సినిమా ఫ్లాపయ్యింది.

            ‘శతమానం భవతి’, ‘మహానుభావుడుల  తర్వాత శర్వానంద్‌కి వరుస షాకులే  తగులుతున్నాయి. జాను, ‘శ్రీకారం సినిమాలకి  పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. ఆడవాళ్ళూ మీకు జోహార్లు’  పరాజయంతో శర్వానంద్ మూడు సినిమాల్లో ఆఫర్లు వదులుకున్నాడని వినబడింది.

            'పడి పడి లేచె మనసు', 'రణరంగం', 'జాను', ‘శ్రీకారం’, 'మహా సముద్రం' మూడేళ్ళ లోపు ఐదు ఫ్లాపులు! శర్వానంద్  ప్రతిభావంతుడే కానీ స్క్రిప్టులు అతడ్ని విఫలం చేస్తున్నాయి. లేకపోతే 'జాతి రత్నాలుముందు శ్రీకారంఎందుకు ఫ్లాపవుతుంది. ఇంకో పేలవమైన కంటెంట్ కారణంగా 'మహాసముద్రం' ఫ్లాపయ్యింది. టాప్ హీరోయిన్ రశ్మికా మందన్నతో నటించినా అరిగిపోయిన మూస ఆడవాళ్ళూ మీకు జోహార్లుహిట్ కాలేదు.      అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. శర్వానంద్ ఇకనైనా కథల విషయంలో రూటు మార్చుకుని వినూత్న సినిమాలు చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఒకే ఒక జీవితం’.  

            ఇది టైమ్ మెషీన్ లో కాలంలోకి ప్రయాణించే కథ. గతంలోకి ప్రయాణించి ఆ గతాన్ని సవరిస్తే భవిష్యత్తు ఉజ్వలమయ్యే కథ. అమల నటించిన మదర్ పాత్ర కేంద్రబిందువుగా. దీన్ని చూస్తే హాలీవుడ్  మూవీ గుర్తుకొస్తుంది. బ్యాక్ టు ది ఫ్యూచర్అనే ఆస్కార్ అవార్డు మూవీలో, చిన్న కుర్రాడు టైమ్ మెషీన్ లో గతం లోకి ప్రయాణించి, ఆ కాలంలో టీనేజర్లుగా వున్న తన తల్లి దండ్రుల్ని చూస్తాడు.

            తల్లిదండ్రులు వర్తమానంలో ఎప్పుడూ కీచులాటలతో శాంతి  లేకుండా వుంటారు. దీని కారణం  వాళ్ళ టీనేజిలో వుందని తెలుసుకుని, టీనేజర్స్ గా వాళ్ళ జీవితాల్ని సరి చేసి వర్తమానంలో కొస్తే, కీచులాటలు మాని తల్లి దండ్రులు సంతోషంగా వుంటారు. నిజానికిది సైన్స్ ఫిక్షన్ రూపంలో చెప్పిన సైకో థెరఫీ కథ. ఒకే ఒక జీవితంకూడా ఈ కోవలోనే వుండొచ్చు.

            కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ నుంచి శర్వానంద్ ఒకే ఒక జీవితంవస్తోంది. ఇందులో శర్వానంద్ సరసన రీతూవర్మ, అమల, వెన్నెల కిషోర్, అలీ, ప్రియదర్శి నటించారు. సంగీతం జెక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం సుజీత్ సారంగ్, బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు. ఇక 9  తేదీ రిజల్ట్ కోసం చూద్దాం.

***