రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 11, 2022

1146 : రివ్యూ!



రచన -దర్శకత్వం : కె. రాధాకృష్ణ కుమార్
తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతిబాబు, మురళీ శర్మ, సత్యరాజ్, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్దికుమార్ తదితరులు
పాటలు : కృష్ణకాంత్
, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, నేపథ్య సంగీతం : తమన్, ఛాయా
గ్రహణం : మనోజ్
పరమహంస, కళ : రవీందర్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, శబ్ద గ్రహణం : రసూల్ పోకుట్టి
బ్యానర్స్ : యూవీ
క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్, టీ-సిరీస్,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీదా ఉప్పలపాటి
నిడివి : 2 గంటల 16 నిమిషాలు
విడుదల
: మార్చి 11, 2022
***
          మాస్ యాక్షన్ ఇమేజితో ప్రస్తుతం డిమాండ్ లో వున్న పానిండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ అనే రోమాంటిక్ డ్రామాతో క్లాస్ టచ్ ఇవ్వడానికి విచ్చేశాడు. 2015 లో యూవీ క్రియెషన్స్ బ్యానర్ లో గోపీచంద్ తో జిల్ తీసి దర్శకుడిగా పరిచయమైన రాధా కృష్ణకుమార్ తో ప్రభాస్ ఈ ప్రయత్నం చేశాడు. అంతర్జాతీయ స్థాయి గల మేకింగ్ తో  అసక్తి రేపుతూ వచ్చిన ఈ భారీ బడ్జెట్ మెగా మూవీ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. తెలుగు సినిమా స్థాయిని తన గ్లోబల్ ఇమేజితో ప్రపంచం ముందుకు తీసికెళ్తున్న ప్రభాస్, రాధేశ్యామ్ ని ఆ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడా? ఇంకా రానున్న తన పానిండియా మూవీస్ పట్ల ప్రేక్షకుల క్రేజ్ మరింత పెరిగేలా చేయగలిగాడా? తెలుసుకుందాం...  

కథ

అల్ట్రా స్టయిలిష్ గా విక్రమాదిత్య (ప్రభాస్), పరమహంస (కృష్ణంరాజు) అనే గురువు దగ్గర హస్త సాముద్రికం నేర్చుకుంటూ వుంటాడు. అక్కడ్నుంచి ఉన్నట్టుండి ఇటలీ వెళ్ళిపోతాడు. అక్కడ సాముద్రికం ప్రాక్టీసు చేస్తూ పేరు తెచ్చుకుంటాడు. తనకి పెళ్ళి రేఖ లేదన్న విషయం తెలుసు. అలాటిది ఓ రోజు డాక్టర్ ప్రేరణ (పూజాహెగ్డేయ) అనే స్టన్నింగ్ బ్యూటీని చూసి ప్రేమలో పడిపోతాడు. అక్కడ్నుంచి రైల్లో, బస్సులో ప్రేమాయణం సాగిస్తూంటాడు. ఇంతలో ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరతాడు. అక్కడ డాక్టర్ ప్రేరణని ఇంకా గాఢంగా ప్రేమిస్తాడు. అతడి ప్రయత్నాలు ఫలించి ఇప్పుడామె ప్రేమించడం మొదడుతుంది. అయితే ఆమె ఆరోగ్యం బావుండదు. రెండు నెలలకి మించి బ్రతకదని డాక్టర్లు చెప్తారు. ఆమె చేయి చూసిన విక్రమాదిత్య నూరేళ్ళూ బ్రతుకుతుందని చెప్తాడు. ఎవరు నిజం? డాక్టర్లా, విక్రమాదిత్యా? సైన్సా, సాముద్రికమా? పెళ్ళి రేఖ లేని విక్రమాదిత్య విధితో ఎలా పొరాడి ప్రేమని నిజం చేసుకున్నాడు? ఇవి తెలుసుకోవడం గురించి మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ
ఐర్లాండ్ కి చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కుడు కైరో (Cheiro) - (విలియం జాన్ వార్నర్, 1866-1936) ప్రేరణతో ఈ కథ చేసుకున్నానన్నాడు దర్శకుడు రాధా కృష్ణ కుమార్. ప్రముఖ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ దగ్గర కథ తీసుకుని, దాని మీద 18 ఏళ్ళూ వర్క్ చేసి నాల్గేళ్ళూ సినిమా నిర్మాణం చేశానన్నాడు. అంటే ఒక కాసాబ్లాంకా’, సన్ ఫ్లవర్’, టైటానిక్’, ఇంకా నికోలస్ స్పార్క్స్ నవలల ఆధారంగా తెరకెక్కే అద్భుత హైకాన్సెప్ట్ ప్రేమకథల స్థాయిలో మనోజ్ఞ ప్రేమ కావ్యంగా ఈ కథ తెరకెక్కి వుండాలన్న మాట. పబ్లిసిటీ విజువల్స్, ట్రైలర్స్ చూస్తే కూడా ఇదే సదభిప్రాయాని కొస్తాం. 

        హస్తసాముద్రికం- విధి- జీవితం అనే త్రికోణీయ చట్రంలో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే మిథికల్ ఫాంటసీగా సమ్మోహనకర కాల్పనిక జగత్తు సృష్టించి వుండాలి. క్లాసిక్ టైటిల్, పానిండియా మార్కెట్, భారీగా 350 కోట్ల బడ్జెట్, ప్రభాస్ గ్లోబల్ ఇమేజి ఇవి కూడా కథని 3 కి పైగా రేటింగ్ తో వూహించుకునేలా చేస్తాయి. 2.25 రేటింగ్ తో సరిపుచ్చుకునే పరిపూర్ణ వైఫల్యాన్ని ఎవరూహిస్తారు గనుక. అసలు ఈ కథ చేయి చూస్తే అందులో జీవన రేఖే లేదని తెలుసుకోకుండా 18+ నాల్గేళ్ళూ ఇంత కఠోరంగా పరిశ్రమిస్తారని ఎవరనుకుంటారు గనుక.

        ఈ రోమాంటిక్ డ్రామా జానర్ కథలో అతడికి పెళ్ళి రేఖ లేదు, ఆమె ప్రాణాలతో వుండదు. ఇది బాక్సాఫీసుకి పనికొచ్చే ఫార్ములా అయిన విధి అనుకుంటే, ఈ విధితో కాన్ఫ్లిక్ట్ ని నిర్వహించడంలో హీరోహీరోయిన్లకంటే ప్రేక్షకుల్ని ఎక్కువ బాధపెట్టారు. విధి రాతని మన చేతల ద్వారా జయించవచ్చని చెప్పాలనుకున్నప్పుడు చేతలకంటే బాధలెక్కువ వున్నాయి. భారంగా పరిణమించిన కథతో బోరు ఎక్కువైంది. కథకి జీవన రేఖే లేనప్పుడు ఆత్మ కూడా లేదు. ఆత్మలేని ప్రేమని దృశ్య వైభవాలతో అలంకరించాలనుకున్నారు. మృత కళేబరానికి అలంకరణలు చేస్తే అమృత పానీయం తాగినట్టు నవ్వుతుందా కళేబరం? ఇలా కటువుగా చెప్పక తప్పడం లేదు బాధాకరమే అయినా.
 
నటనలు -సాంకేతికాలు


ప్రభాస్ తన వైరల్ ఇమేజిని పణంగా పెట్టి హస్తసాముద్రికుడి, ప్రేమికుడి సాఫ్ట్ రోల్ లో క్లాస్ గా కనిపించేందుకు చేసిన ప్రయత్నం నూటికి నూరుపాళ్ళూ విజయవంతమైంది. ఏ మాత్రం మాస్ షేడ్స్ లేని పాత్రతో చేసిన సాహసం బాగానే ఫలించింది. కానీ ఎంత సాఫ్ట్ గా, క్లాస్ గా వున్నా, పాత్ర పరంగా నటిస్తున్న కథలో సమస్యని ఎదురోకోవాల్సి వచ్చినప్పుడు, హీరోయిజాన్నే ఆశిస్తారు ప్రేక్షకులు. క్లాస్ కదాని పాసివ్ గా వుంటే ఒప్పుకోరు. ఇదే జరిగింది క్యారక్టరైజేషన్ తో.  
   
        మరొకటేమిటంటే, లవర్ బాయ్ క్యారక్టర్ లో ఫీల్ లేకపోవడం. హీరోయిన్ పూజా హెగ్డేతో నటించిన దృశ్యాల్లో రోమాంటిక్ రసాయనం అదృశ్యమవడం. పాటల్లో సైతం ఇద్దరి మధ్య ప్రణయ రసాలూరక పోవడం. కనీసం మామిడి పళ్ళయినా ప్రభాస్- పూజా చీకుతూంటే, అహనా పెళ్ళంట లో కోడిని వేలాడదీసి అది చూస్తూ, చికెన్ తింటున్న ఫీలింగు అనుభవించిన కోట శ్రీనివాసరావు లాగా - ఆ మామిడి పళ్ళని లొట్టలేసుకుని మనమే చీకుతున్నట్టుగా రసానందం పొందే వాళ్ళం. 300 రూపాయల టికెట్ కి కనీసం ఇది కూడా ఆశించడం తప్పు కాదేమో.

        పూజా హెగ్డే దేవకన్యలా ఫాంటసీ ప్రపంచాన్ని పరివ్యాప్తం చేసింది. కంటికే విందు. క్యారక్టర్ లో విషయం లేదు. ఇక భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతిబాబు, మురళీ శర్మ, సత్యరాజ్, సచిన్ ఖెడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, రిద్దికుమార్ ఇలా చాలామంది అద్భుత తారాగణం కొలువు దీరారు కానీ, ఈ సినిమాలో వాళ్ళకి కొలువు లేవీ లేవు. సీన్లోకి రావడం, మన కేమైనా పనుందా అని చూడడం, వెళ్ళి పోవడం. ఆనాటి మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ అయితే, ప్రభాస్ తల్లిగా మేకప్ కూడా సరిగ్గా వేసుకోలేని అర్ధం పర్ధం లేని పాత్ర.

        ఏమాట కామాటే చెప్పుకోవాలి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపర్చిన పాటల్లో ఆత్మ వుండి  వినాలన్పించేలా వున్నాయి. సోల్ ఫుల్ మ్యూజిక్. అలాగే తమన్ నేపథ్య సంగీతం కూడా సోల్ ఫుల్ గా దృశ్యాలకి బలం చేకూర్చే ప్రయత్నం చేసింది. కానీ దృశ్యాల్లో విషయం లేకపోతే ఎంత మంచి పాటలైనా, నేపథ్య సంగీతమైనా సినిమానెలా నిలబెడతాయి.

        అలాగే మనోజ్ పరమ హంస (ఛాయాగ్రహణం), రవీందర్ (కళ), కోటగిరి వెంకటేశ్వర రావు (కూర్పు), రసూల్ పోకుట్టి (శబ్ద గ్రహణం) మొదలైన సాంకేతికులందరూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కనబర్చారు. దర్శకుడి స్క్రిప్టే వీళ్ళ శ్రమని వృధా చేసింది. 

చివరికేమిటి

హీరోయిన్ క్యాన్సర్ కథ చూపించడం కోసం 1970 ల నాటి నేపథ్యం ఏర్పాటు చేశారు. క్యాన్సర్ క్యాన్సరే, ఆ నేపథ్యంలో చూపించినా క్యాన్సర్ నయమయ్యే ఈ రోజుల్లో ఎవరు కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ వరకూ కథ ప్రారంభం కాక వివిధ పాత్రల పరిచయాలకే సరిపోయింది. ప్రభాస్, పూజాలు తప్పితే ఇంకే పాత్రకీ అర్ధం వుండదు. ఇంటర్వెల్ కి పూజా క్యాన్సర్ తో, ప్రభాస్ జోస్యంతో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేయడం వరకూ బాగానే వుంది. అయితే ప్రతీ తెలుగు సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేశాక, సెకండాఫ్ ఏం కథ చేసుకోవాలో తెలీక, సినిమా మొత్తాన్నీ నేలకేసి కొట్టి వెళ్ళి పోతున్నట్టు- ఇదే వైఖరిని ఇక్కడా విజయవంతంగా ప్రదర్శించారు.

        ఎప్పుడెప్పుడు క్లయిమాక్స్ కెళ్ళిపోయి ఆ నౌకాయానం, దాంతో సునామీ భీభత్సం చూపాలన్నట్టు ఇక కథని పట్టించుకోలేదు. విషయం లేక, తగిన సీన్లూ లేక, స్లో అయిపోయింది సెకండాఫ్ సినిమా నడక. ఆ తర్వాత ఎమోషనల్ గా కనెక్ట్ కాని, ఎమోషన్లే లేని ప్రేమ కథని నౌక ఎక్కించి, ఎంత సునామీ సృష్టించినా ఒడ్డున పడలేదు సినిమా.   చివరికి టైటానిక్ అమర ప్రేమ చూపిద్దామనుకున్న ప్రయత్నం కూడా పారక, మనల్ని ప్రకృతి వైపరీత్య బాధితుల్ని చేసి వదిలారు. ప్రభాస్ కి ఒకటే మెసేజ్- ఇలా కంటెంట్ లేని లోకల్ సినిమాలే తను కూడా నటిస్తూ, పానిండియా పేరుతో ప్రేక్షకుల్ని తేలికగా తీసుకోకుండా, ఇప్పుడే జాగ్రత్త పడాలని ఈ మల్టీ బిలియన్ బడ్జెట్ మెగా హంగామా చెబుతోంది.

—సికిందర్   
(స్క్రీన్ ప్లే సంగతులు ఆదివారం)

Thursday, March 10, 2022

1145 : రివ్యూ !


రచన- దర్శకత్వం : పాండి రాజ్
తారాగణం ; సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్
, సత్యరాజ్, రాజ్ కిరణ్
సంగీతం: డి ఈమాన్
, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు
బ్యానర్ : సాన్ పిక్చర్స్
నిర్మాత : కళానిధి మారన్
విడుదల : మార్చి 10
, 2022
***

            టీటీలో రెండు వరుస హిట్లతో తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సూర్య, దాదాపు మూడేళ్ళ తర్వాత థియేటర్స్ కి తిరిగొచ్చాడు. లాక్ డౌన్ లో సురారై పోట్రు’, జైభీమ్ లతో ఓటీటీలో ఘన విజయం సాధించాక, ఈవారం థియేటర్ విడుదలగా ఈటీ (ఎవరికీ తలవంచడు) ని ప్రేక్షకులకి అందించాడు. దీనికి పాండిరాజ్ దర్శకుడు. ఫిబ్రవరి 25 న భీమ్లానాయక్ విడుదలకి ముందు రోజు తెలుగులో వలిమై విడుదలై ఫ్లాపయింది. తమిళంలో ఈ పోటీ లేకపోవడంతో హిట్టయ్యింది. తిరిగి ఇప్పుడు మార్చి 11 న రాధేశ్యామ్ విడుదలకి ముందు రోజు ఈటీ తెలుగు విడుదల కావడం వలిమై ఫలితాన్నేచవి చూస్తుందా? ఎందుకంటే దాదాపు శూన్యంగా వున్న అడ్వాన్సు బుకింగ్స్ చూస్తేనే తెలుస్తోంది. ఒక్క తమిళంలో రిలీజ్ చేసి వుంటే సమస్య వుండేది కాదు. పైగా హిందీ సహా ఇంకా ఇతర భాషల్లో పానిండియా రిలీజ్ చేసి ‘రాధేశ్యామ్’ మేనియా ముందు సవాలుగా నిలిచారు. ఇంతా చేస్తే సినిమాలో ఏమైనా విషయముందా? ఈ విషయం చూద్దాం...

కథ

కృష్ణమోహన్ (సూర్య) ఓ లాయర్. చిన్నప్పుడే అక్కని కోల్పోవడంతో ప్రతీ అమ్మాయినీ సొంత చెల్లెలిగా చూసుకుంటాడు (మరి హీరోయిన్ తో ఎందుకు ప్రేమలో పడ్డాడో?). ఆ చెల్లెళ్ళ సంక్షేమమే తన ధ్యేయంగా జీవిస్తూంటాడు. పక్కన ఇంకో ఊరు వుంటుంది. ఈ వూరుకీ, కృష్ణమోహన్ వాళ్ళ వూరికీ పడదు. ఈ పరిస్థితుల్లో ఆ వూరి అమ్మాయి ఆధీర (ప్రియాంకా అరుళ్ మోహన్) నే ప్రేమిస్తాడు. ఈ ప్రేమ సాగుతూ సాగుతూ వుండగా, వూళ్ళో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలెడతారు. దీంతో కృష్ణమోహన్ దీని మీద దృష్టి పెడతాడు. అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుం
టున్నారు? దీని వెనుక ఎవరున్నారు? ఈ రహస్యం తెలుసుకుని నేరస్థుల్ని శిక్షించడానికి పూనుకుంటాడు.

ఎలావుంది కథ

ఆడవాళ్ళు తమ మీద అఘాయిత్యం జరిగితే సిగ్గుపడాల్సిన అవసరం లేదనీ, సిగ్గు పడాల్సిది అఘాయిత్యాలకి పాల్పడే మగాళ్ళేనని చెప్పే కథ. ఈ రోజుల్లో చాలా అవసరమైన కథ. ఇంతవరకే ఈ స్టోరీలైన్ అందం చందం. కథా కథనాలకి ఈ స్టోరీ లైన్ తో సంబంధం వుండదు. తమిళ స్టార్ సూర్య ఈ స్టోరీ లైన్ వినే సింగిల్ సిట్టింగ్ లో, నాకు ఇలాటి కథే కావాలని ఓకే చేసిన కథ. ఇది గర్వకారణంగా దర్శకుడు చెప్పుకునే విషయం. టూ స్టార్ రేటింగ్ కథని ఓకే చేయడానికి సింగిల్ సిట్టింగ్ చాలు. పానిండియా రిలీజ్ కి టూ స్టార్ రేటింగ్ సినిమా చాలు.

        ప్రేమ పేరుతో అమ్మాయిల్ని లొంగ దీసుకుని, అసభ్య వీడియోలు తీసే మగాళ్ళ భరతం పట్టే కథ. అలాటి మగాళ్ళని సిగ్గుపడేలా చేయాలనుకున్న కథ. అర్ధం లేని దృశ్యాలతో, బరువైన తమిళ సెంటిమెంట్లతో, అవసరం లేని హీరోయిజపు యాక్షన్ సీన్లతో, ముగింపుకి కూడా రాలేక సాగుతూ సాగుతూ సహన పరీక్ష పెట్టి- ప్రేక్షకుల్ని శిక్షించే వ్యధగా మారింది. రాకరాక ఇలాటి సినిమాతో సూర్య థియేటర్ కి రాకుండా ఓటీటీలో రిలీజ్ చేసి వుంటే సరిపోయేది.

నటనలు - సాంకేతికాలు

జైభీమ్ లోలాగా మరో లాయర్ పాత్ర సూర్య పోషించాడు. కానీ ఫస్టాఫ్ విషయం లేక, ఫ్యామిలీ సీరియల్ చూస్తున్నట్టు, లేడీస్ సెంటిమెంట్లతో లేడీస్ కి దగ్గరవాలని ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఒక్కటీ మాస్ కి కూడా బావుండవు. ఫ్యాన్స్ కి బోరుకొడతాయి. పాత సినిమాల్లోని రొటీన్ అరిగిపోయిన ప్రేమలు, అనుబంధాలు, చెల్లెలి సెంటిమెంట్లు... హీరోయిన్ తో పాత రెగ్యులర్ రోమాన్స్. సాంగ్స్. ఇంటర్వెల్ ముందువరకూ కథలోకి వెళ్ళడు. ఇంటర్వెల్ ముందు అమ్మాయిల ఆత్మహత్యలతో పాయింటు కొస్తాడు సూర్య.

        సెకండాఫ్ పూర్తిగా వరస మారిపోతుంది పాత్ర. యాక్షన్లోకి దిగిపోయి  దుర్మార్గుల్ని కొడతాడు. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ వేరే కథ అన్నట్టు క్యారక్టర్ ఎటెటో వెళ్ళి, కోర్టులో ప డతాడు జైభీమ్ లో లాయర్ లాగా. ఇక స్త్రీలతో అన్యాయాల గురించి కోర్టు సీన్లు. జైభీమ్ తర్వాత  ఇదే లాయర్ పాత్ర, ఇదే స్త్రీలతో అన్యాయం గురించి, ఇదే లాయర్ పాత్ర నటిస్తున్నాడని అన్పించలేదేమో!

        ఇక అర్ధం లేకుండా క్లయిమాక్స్ యాక్షన్ సీన్లు లాగి లాగి ఇరవై నిమిషాల పైగా బీభత్సం సృష్టిస్తాడు. సూర్య నటించిన చాలా మైండ్ లెస్ మూవీ ఇది. మొహంలో అద్భుతం గా, ఎంత ఎమోషన్స్ పలికించి ఏం లాభం- కథలో ఎమోషన్లు లేకపోతే. ఎవరికీ తలవంచడు అని తన గురించి చెప్పుకోవడం గాక, ఎవరికీ తలవంచకు అని అమ్మాయిలకి సూటి మెసేజ్ ఇవ్వలేకపోవడం దగ్గరే కథకేం న్యాయం చేశాడో తెలుస్తోంది. సూర్య చేసిన సాంగ్స్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఫ్యాన్స్  కి పరిమతమయ్యే మూవీ.

        సూర్య సాంగ్స్ కోసం, ఫైట్స్ కోసం ఈ సినిమా చేస్తే, హీరోయిన్ ప్రియాంక గ్లామర్ ప్రదర్శన కోసం, సూర్యతో రోమాన్స్ కోసం సినిమా చేసింది. సత్యరాజ్ సూర్య తండ్రి. విలన్ వినయ్ రాయ్ మూస ఫార్ములా మినిస్టర్ కొడుకు. ఇక ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వుంటాయి స్టార్ సినిమాకి. రత్నవేలు కెమెరా, ఈమాన్ సంగీతం కూడా బాగానే వుంటాయి. బాగా వుండనిది షరా మామూలుగా కథొక్కటే.   

        దర్శకుడు పాండిరాజ్ పాత మూస కథనం, అనుకున్న కథకీ చూపించిన వరసకీ పొంతన లేకపోవడం, ఫ్యామిలీ సెంటి మెంట్లూ అంటూ చీటికీ మాటికీ అడ్డుపడడం- ఆడవాళ్ళూ మీకు జోహార్లు భరించిన తర్వాత, ఎవరికీ తలవంచడు కి తల వంచుకుని వెళ్ళవచ్చు వెళ్ళాలనుకుంటే.

—సికిందర్ 

 

Wednesday, March 9, 2022

1142 : రివ్యూ!

 

వినోదయ చిత్తం (తమిళం)
దర్శకత్వం : సముద్ర కని
తారాగణం : తంబి రామయ్య, సముద్ర కని, శ్రీరంజని, సంచితా శెట్టి, యువశ్రీ లక్ష్మి, షెరీన్, దీపక్ దినకర్, హరికృష్ణన్, జయప్రకాష్ తదితరులు
రచన : శ్రీవత్సన్, విజి, సముద్ర కని, సంగీతం : సి సత్య, ఛాయాగ్రహణం : ఎన్ కె ఏకాంబరం
బ్యానర్ ; అభిరామి మీడియా వర్క్స్
నిర్మాతలు: అభిరామి రామనాథన్, నల్లమ్మై రామనాథన్
విడుదల : అక్టోబర్ 13, 2021 -జీ5

***

        మిళంలో సముద్రకని దర్శకత్వం వహించిన వినోదయ చిత్తం (వింత కోరిక) తెలుగులో పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ లతో రీమేక్ కి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు. ఇది తమిళంలో ఓటీటీలో విడుదలైన గంటన్నర ప్రయోగాత్మక సినిమా. ఏమిటి ఇంత పొట్టి సినిమా ప్రత్యేకత? పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ తో రీమేక్ చేసేంత విశేషం ఇందులో ఏముంది? ఇందులో వున్న సానుకూల ప్రతికూలత లేమిటి? తమిళ మలయాళ స్మాల్ బడ్జెట్ సబ్జెక్టులు తెలుగులో స్టార్స్ కి సూటవుతాయా? ఈ సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ

        చెన్నైలోని ఓ ఎమెన్సీ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వుంటాడు పరశురామ్ (తంబి రామయ్య).  ఇక త్వరత్వరగా జనరల్ మేనేజరై పోవాలని ఆరాట పడుతూంటాడు. భార్య ఈశ్వరి (శ్రీరంజని), కుమార్తెలు వీణ (సంచితా శెట్టి), గాయత్రి (యువశ్రీ లక్ష్మి), అమెరికాలో పనిచేసే కుమారుడు అరుణ్ (దీపక్ దినకర్) వుంటారు. ఆధిపత్య భావజాలంతో హల్చల్ చేసే పరశురామ్ కంపెనీలో, ఇంట్లో ప్రతీదీ తన ఇష్ట ప్రకారమే జరిగి తీరాలని శాసిస్తాడు. తన నిర్ణయాల్ని ఇతరుల మీద రుద్దుతాడు. ప్రతీపనీ అనుకున్న టైంకి చేస్తాడు. ఇలా ఆ రోజు 25 వ పెళ్ళి రోజు వుంటుంది. సాయంత్రం వచ్చేస్తానని చెప్పి కంపెనీకి వెళ్ళిపోతాడు. అట్నుంచి కంపెనీ పని మీద కోయంబత్తూరు వెళ్ళాల్సి వచ్చి, కోయంబత్తూరు వెళ్ళి వస్తూ ప్రమాదానికి గురై చనిపోతాడు.

       చనిపోయిన వాడు లేచి కూర్చుంటాడు. భయం భయంగా చూస్తాడు. అంధకారంలో వుంటాడు. ఎవరో వ్యక్తి తన వైపు వస్తూ, తనని కాలం (సముద్రకని) గా పరిచయం చేసుకుంటాడు. పరశురామ్‌ కి భూమ్మీద కాలం తీరిందని, ఇక పరలోక ప్రయాణానికి పదమంటాడు. పరశురామ్ కంగాడి పడి, అప్పుడే పరలోకానికి పంపొద్దనీ వేడుకుంటాడు. తను చేయాల్సిన పనులు ఇంకా మిగిలున్నాయనీ, తను లేకపోతే పనులాగి పోతాయనీ,  కనుక పనులు పూర్తి చేయడానికి ఇంకొంత సమయం ఇమ్మనీ ప్రాధేయపడతాడు. కాలం అంగీకరిస్తాడు. పనులు పూర్తి చేసుకోవడానికి మూడు నెలల సమయమిచ్చి, తను వెంట వుండి చూస్తానని వచ్చి పరశురామ్ ఇంట్లో మకాం వేస్తాడు. ఇక పనులు పూర్తి చేసుకోమంటాడు.

      ఏమిటా పరశురామ్ పూర్తి చేయాల్సిన పనులు? కాలం నిఘా కింద వాటిని పూర్తి చేయగల్గాడా? అందులో ఎలాటి ఇబ్బందులు పడ్డాడు? ఈ క్రమంలో తన గురించి, జనన మరణాల గురించీ ఏం తెలుసుకున్నాడు? చివరికి కాలం ఇచ్చిన తీర్పేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఫిలాసఫికల్ ఫాంటసీ జానర్ కథ. కథ అనేకన్నా ఇది గాథ. గాథ అనడంలోనే సినిమాకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాథలు సినిమాలకి పనికిరావని ఎన్నో ఉదాహరణలు చూశాం. ఈ గాథ లోకంలో అన్నీ మన వల్లే జరుగుతున్నాయనీ, మనం లేకపోతే ప్రపంచమే ఆగిపోతుందనీ అహం పెంచుకుని ప్రవర్తించే మనుషులకి ప్రతీక. మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీ, ప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీ, మన కోసం కాలం ఆగదనీ, కనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ. అదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీ, జనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీ, మరణాన్ని చూసి భయపడకూడదనీ, చెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ. గాథకి ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ ఫ్రెండ్లీగా బాగానే వుంది. కానీ గాథ కమర్షియల్ సినిమా ఫ్రెండ్లీ కాదు.

        మనం చూసిన కాలం మనతో వుండదు. ఇంకో కాలం వచ్చేసి మనల్ని వెనక్కి నెట్టేసి ముందు కెళ్ళి పోతుంది. ఈ గాథలో ప్రధాన పాత్ర పరశురామ్ తను చూసిన కాలంతోనే వ్యక్తుల్ని లెక్కగట్టి, వాళ్ళని అక్కడే కట్టేసి, తను అనుకున్నట్టు జరగాలనే, బాసిజం వెలగబెట్టే వ్యక్తి. ఫిలాసఫికల్ గా చూస్తే అతను వ్యక్తుల్ని శాసించడం లేదు, కాలాన్నే శాసిస్తున్నాడు. అందుకని కాలం కల్పించుకుని అతడి కాలం ముగించేసింది.

     పాపులర్ మూవీ బ్రూస్ ఆల్ మైటీ లో జిమ్ కేరీ స్వలాభం కోసం చేసే కొన్ని పనులు ఎదురు తన్ని, టీవీ రిపోర్టర్ ఉద్యోగంలోంచి డిస్మిస్ అవుతాడు. అప్పుడు వొళ్ళు మండిపోయి అసలు డిస్మిస్ చెయ్యాల్సింది నిన్నేరా! అని దేవుణ్ణి తిట్టి పోస్తాడు. ఆ  దేవుడు ప్రత్యక్షమై, తన పవర్స్ అన్నీ జిమ్ కేరీ కిచ్చేసి - ఇక పనులు పూర్తి చేసుకో  పొమ్మంటాడు. ఇది గాథ కాదు, కథ.

     ఆ గాథా ఈ కథా రెండూ మనిషి సూపీరియారిటీ కాంప్లెక్స్ గురించే. అయితే జిమ్ కేరీతో వినోద విలువలతో కాన్సెప్ట్ ని హాస్యభరితంగా, కథగా చూపిస్తే; పరశురామ్ తో వినోద విలువలకి వీడ్కోలు చెప్పి విషాద భరిత గాథ చేశారు. కారణం, ఇది ఇదే పేరుతో శ్రీవత్సన్ రాసిన తమిళ నాటకం  ఆధారంగా తీశారు. ఇందుకే గంటన్నర వుంది. నాటకం గాథగా వుంటే నష్టమేం లేదు. సినిమా కోసం నాటకాన్ని మార్చలేదని  సమాచారం. ఇక్కడే తప్పులో కాలేశారు ఈ గాథని కథగా మార్చకుండా.

        జిమ్ కేరీతో కథని - అదీ వినోదాత్మకంగా తీస్తే, 81 మిలియన్ డాలర్లకి 484 మిలియన్ డాలర్ల కనకవర్షం కురిసింది. ఈ తమిళ గాథతో ఈ సినిమా ఓటీటీ కిచ్చేసి సేఫ్ అయ్యారు. ఓటీటీకి గాథా కథా, పోట్టీ పొడుగూ ఏమీ వుండవు. ఒకసారి చందాకట్టేసి ఏడాది పాటు సినిమాలు చూస్తూ వుండే ప్రేక్షకుల వాషింగ్ మెషీన్ లో వేసి తీస్తే అన్నీ ఒకటే.

     ఇది థియేటర్ మెటీరీయల్ కాదని ఓటీటీలో చూస్తూంటేనే తెలిసిపోతుంది. దేవుడు- కాలం లాంటి ఫిలాసఫికల్ ఫాంటసీ కాన్సెప్టులు నాటకానికి సీరియస్ గా, గాథగా వుంటే సరిపోవచ్చు గానీ, సినిమాకి హాలీవుడ్ ప్రకారం హీరోయిక్ ఫాంటసీ కథగా వుండాల్సిందే. ఫిలాసఫీ పనికి రాదని కాదు. ఈ ఫిలాసఫికల్ ఫాంటసీని బ్రూస్ ఆల్ మైటీ లాగా ఫన్నీగా, కామెడీగా, కథగా తీయాల్సిందే. ఏ సీరియస్ కాన్సెప్ట్ అయినా షుగర్ కోటింగ్ వేసిన తియ్యటి క్యాప్సూల్ లా వుండాల్సిందే కమర్షియల్ సినిమాకి. మార్కెట్ యాస్పెక్ట్ కి. ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటీ అని మొదటి ప్రశ్న వేసుకోకుండా తీస్తే మనుగడ ఏమంత బావుండదు.

ఇంకా విషయం చూద్దాం

    పరశురామ్ కాలమిచ్చిన మూడు నెలల గడువుతో బతికొచ్చాక, కంపెనీలో తనని క్రాస్ చేసి జ్యూనియర్ జీఎం ఐపోవడం చూస్తాడు. కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. ఇంట్లో భార్య ఈశ్వరికి పార్కిన్సన్స్ వ్యాధి బయటపడి ఆస్పత్రి పాలవుతుంది. చికిత్సకి అమెరికా తీసికెళ్ళాలంటే చాలా డబ్బు అవసరం. ఇక స్నేహితుడి కొడుక్కిచ్చి పెద్ద కుమార్తె వీణ పెళ్ళి చేద్దామంటే, ఆమె కులం కాని వాణ్ణి ప్రేమించి వెళ్ళిపోతుంది. తండ్రి పరువు కోసం అక్క కాదనుకున్న సంబంధం చేసుకోవడానికి చిన్న కూతురు గాయత్రి సిద్ధపడుతుంది. పై చదువులకి తను అమెరికా వెళ్ళే ప్రయత్నాలు మానేసి. ఇంతలో అమెరికా నుంచి కొడుకు అరుణ్ అమెరికన్ భార్య (షెరీన్) ని వెంటబెట్టు కొస్తాడు. మరింతలో ఇటు గాయత్రి భర్త ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకోవడంతో గొడవై తండ్రి దగ్గరి కొచ్చేస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు చుట్టు ముడతాయి.

        ఇలా ప్రతీ సమస్యకీ ఠారెత్తి పోతాడు, ఏడుస్తాడు. ఏం చెయ్యాలో తోచదు. తనతో సంబంధం లేకుండా, తను నిర్ణయించకుండా అన్నీ జరిగిపోతున్నాయి. సమస్యలతో రాజీ పడిపోతాడు. ఈ లోకానికి తనతో పనే లేదు. లోకం కంటే ఉన్నతుడని భావించుకున్న తనకి కనువిప్పయ్యింది. లోకంతో కలిసి, దాని అభీష్టాల్ని కూడా మన్నిస్తూ బ్రతకాలని తెలుసుకుంటాడు. మారిన మనిషవుతాడు.

        అయినా కాలం ఇంకో రెండు పాపాలు చేశావని గుర్తు చేస్తాడు. ఇప్పుడు కంపెనీలో ఈ స్థాయికి ఎదిగావంటే ఆనాడు చేసిన పాపమే కారణమని గుర్తు చేస్తాడు. పాతికేళ్ళ క్రితం మరొకరు చేరాల్సిన ఉద్యోగంలో మాయ చేసి తను చేరిపోయాడు పరశురామ్. అలాగే భార్య ఈశ్వరి తెచ్చే లక్ష కట్నం, ఓ స్కూటరు కోసం ప్రేమించిన ఇంకో అమ్మాయిని వదిలించుకున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికీ నిష్కృతి చేసుకుంటాడు.

        ఇప్పుడు కంపెనీ జీఎం కన్నా ఉన్నతమైన ఎండీ పోస్టులో కూర్చోబెడుతుంది. కుటుంబం అందరితో కలిసి హాయిగా గడుపుతాడు. మూడు నెలల గడువు తీరి కాలం ముందు నించుంటాడు. ఆయువు తీరిన అతడ్ని కాలం స్వర్గానికి తీసుకెళ్ళి పోతాడు.

ఫాంటసీ గాథా రహస్యం  
    ఇది గాథ కాబట్టి పరశురామ్ పాసివ్ పాత్రగా వున్నాడు. ఏ సమస్యతోనూ సంఘర్షించడు, పై చేయి సాధించడు. ఏడ్చి రాజీ పడతాడు. ఇవన్నీ కాలం సమక్షంలో జరుగుతున్నా కాలాన్ని ప్రశ్నించడు, ఎదురు తిరగడు. కాలాన్ని తన ప్రత్యర్ధిగా, శత్రువుగా భావించి - కాలానికి అతీతుడన్న తన సహజసిద్ధ భావంతో పోరాటం చెయ్యడు. గాథ అన్నాక అందులో కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? ప్రత్యర్ధి పాత్రే ముంటుంది? పాత్రకి అనుభవాలే వుంటాయి. సమస్యలతో అనుభవించీ అనుభవించీ ఓటమి చెందడమే వుంటుంది. ఇదే పరశురామ్ పని. ఇందుకే ఇలాటి సినిమాలు ఫ్లాపవుతాయి.

        ఓ పాత్ర- దానికి ఒకే ప్రధాన సమస్యతో సంఘర్షణ- చివరికి పరిష్కారమనే స్ట్రక్చర్ గల కథగా గాక- స్ట్రక్చర్ వుండని గాథ కాబట్టి- ఒక సమస్య రావడం, అది ముగియడం, ఇంకో సమస్య రావడం, అది కూడా ముగియడం, మళ్ళీ ఇంకో సమస్య ... ఒక్కో సమస్య ముగియగానే కాలం దానికి నీతి చెప్పడం... ఇలా వివిధ సమస్యల ఎపిసోడిక్ - డాక్యుమెంటరీ కథనం ఇక్కడ ప్రత్యక్షమైంది. కమర్షియల్ సినిమా అంటే ఎపిసోడ్లు కాదుగా? డాక్యుమెంటరీ కూడా కాదు. ఒకే సమస్యతో సంఘర్షించే ఒకే కథ!

     ‘బ్రూస్ ఆల్ మైటీ లో ఉద్యోగం పోగొట్టుకున్న జిమ్ కేరీకి వొళ్ళు మండింది కాబట్టే యాక్టివ్ పాత్రగా దేవుణ్ణి తిట్టాడు. అలా ఓ కథ పుట్టింది. ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య వాద ప్రతివాదాలు పుట్టకపోతే కథ పుట్టదు. చనిపోయిన పరశురామ్ పాసివ్ పాత్రగా కాలాన్ని బతిమాలుకున్నాడు కాబట్టి  కాలం దయదల్చి గడువిస్తే చాలనుకున్నాడు. అలాగే కాలం ఒప్పుకున్నాడు. దీంతో ఇక్కడ సంవాదం పుట్టలేదు, దాంతో ప్రత్యర్థి పుట్టలేదుఇలా ఎంతో అహం భావియైన తను ప్రాణాలు పోగానే - అసలు నా ప్రాణాలెందుకు తీశావని మౌలిక పాయింటు లేవదీసి కాలాన్ని తిట్టి ఎదురు తిరగకపోవడం ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో కథగా నడవడానికి ఏర్పడిన పెద్ద లోపం.

    తిట్టించి, కాలానికీ పరశురామ్ కీ మధ్య కాన్ఫ్లిక్ట్ పుట్టించడానికి ఎందుకు సందేహించాడు కథకుడు? సెంటి మెంట్ కాదనా? భక్త
తుకారాం లో అక్కినేని నాగేశ్వరరావు పాటలో, చేసిన మేలును మరిచే వాడా నువ్వా దేవుడివి... నువ్వొక వ్యర్థుడివి, నీకొక పేరూ లేదు, రూపం లేదు, నీతీ లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు.. అని చెడామడా దేవుణ్ణి తిట్టలేదా? (మనలో వున్న సబ్ కాన్షస్ ని మైండ్ ని తెలుసుకోకుండా బయటెక్కడో దేవుడున్నాడనుకుని దేవుడ్ని తిట్టడం జనాలకి నచ్చుతుంది. బాక్సాఫీసు ఫార్ములా).


        మరి ఈ గాథలో కాలం ఏం చేస్తూంటాడు? ఏమీ లేదు, బ్యాక్ గ్రౌండ్ లో వుంటూ పరశురామ్ తినే ఒక్కో ఎదురు దెబ్బకి ఒక్కో నీతి చెప్పడమే. ఇతను కూడా పాసివే. పాసివ్ పాసివ్ రాసుకుంటే పైసలేం రాలతాయి. జోగీ జోగీ రాసుకుంటే బూడిదైనా రాలుతుంది గాని. దాదాపు సగం సినిమా కాలం ఒకే డ్రెస్సులో అలాగే వుంటాడు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ గుర్తొచ్చినట్టు గబగబా డ్రెస్సులు మార్చేస్తూ వుంటాడు. కంటిన్యూటీ ప్రాబ్లమో, కాస్ట్యూమర్ పారిపోయాడో.

        నిజానికి పరశురామ్ పనులు పూర్తి చేయాలని గడువు తీసుకుని చేసిందేమీ లేదు. ఇది చెప్పాలనుకున్న పాయింటుకి లోబడిన పాత్ర చిత్రణే. తన వల్లే అన్నీ జరుగుతాయని నమ్మే వాడికి తన వెనుక చాలా జరిగిపోతాయని చెప్పడమే పాయింటు. ఇద్దరు కూతుళ్ళతో అలాగే జరిగింది, కొడుకుతో అలాగే జరిగింది. అయితే పెద్ద కూతురు ప్రేమించిన వాడితో వెళ్ళి పోవడానికీ, కొడుకు అమెరికన్ భార్యతో రావడానికీ తనకి తెలియకుండా భార్య ప్రోత్సాహముందని చివర్లో తెలుసుకుంటాడు. బావుంది. మరి ఆ భార్యని పార్కిన్సన్స్ వ్యాధితో ఎందుకు శిక్షించింది కాలం? ఆమె చేసింది తప్పనా?

       అలాగే తండ్రి పరువు కోసం అతను చూసిన సంబంధం ఆపద్ధర్మంగా చేసుకున్న చిన్న కూతుర్నీ ఎందుకు శిక్షింది కాలం? వ్యాధితో వున్న భార్యని చికిత్సకి అమెరికాకి తీసికెళ్ళాల్సిన పనిని  ఎలా మర్చిపోయి అనుకున్న గడువుకి తనువు చాలించి వెళ్ళిపోయాడు పరశురామ్? అమెరికన్ కోడలు అమెరికాలో చికిత్స ఏర్పాటు చేసింది గనుకనా?

    ఈశ్వరిని చేసుకోవడానికి నమ్మిన ఇంకో యువతిని వదిలేసిన తను, అనారోగ్యంతో వున్న ఈశ్వరిని కూడా ఇలా వదిలేసి వెళ్ళి పోతాడా? అసలు ఈశ్వరితోనైనా తనదెలాటి ప్రేమ? 25వ పెళ్ళి రోజున తను యాక్సిడెంట్ లో చనిపోతే- కాలాన్ని అడగడానికి  పెళ్ళి రోజు గుర్తుకు రాలేదా? నా భార్య ఎదురు చూస్తోంది- నా పెళ్ళి రోజు చంపావేంటని అసలు ప్రశ్న వేయకుండా - ఇంకేవో పనులు పూర్తి చేయాలంటాడా? ఈశ్వరికి భర్త పోవడమే ఎక్కువ, అలాటిది పెళ్ళి రోజు ముస్తాబై ఎదురు చూస్తూంటే అదే సమయం చూసుకుని కాలం మహాశయుడు భర్త ప్రాణం తీశాడంటే అతడెలాంటి శాడిస్టు? (మళ్ళీ ఆమెకి పార్కిన్సన్స్ తో ఇంకో శాడిజం). ముందు కాలాన్ని నిలదీయాలి పరశురామ్ - ఈ కోలెటరల్ డ్యామేజ్ కి. ఇలా కాలంతో సంఘర్షించడానికి పుష్కలంగా రంగం సిద్ధమైవున్నా పాసివ్ గా వుండిపోయాడు పరశురామ్. రసోత్పత్తిలేని జీవచ్ఛవ సినిమా ఇచ్చాడు.

        సినిమా కథంటే రెండు పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే అనేది కామన్ సెన్సు. ఇక్కడ కర్తృత్వపు కాంపిటీషన్. అన్నీ జరిపించే కాలం తను కర్త అనుకోవడం, లేదు తన వల్లే అన్నీ జరుగుతున్నాయనుకునే పరశురామ్ తనే కర్త అనుకోవడం-  ఇద్దరూ అమీతుమీ తేల్చుకోవడానికి సిగపట్లకి దిగడం. ఇలా ఒక ప్రధాన సమస్య ఏర్పాటై, ఇతర సమస్యలు సబ్ ఫ్లాట్స్ గా ఏర్పడి- మొత్తం కలిపి ఒక కథగా రూపం తొడగాల్సిన కాన్సెప్ట్. మొదటి ప్రశ్న మార్కెట్ యాస్పెక్ట్ చూసుకున్నాక, చూసుకోవాల్సిన క్రియేటివ్ యాస్పెక్ట్.

పాత్రల పంపకం - పెంపకం

    పరశురామ్ పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్న నడి వయస్కుడు. ఈ పాత్రకి వందకి పైగా సినిమాలు నటించిన సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టు తంబి రామయ్య సరిపోయాడు. అహం, రోషం, భోళాతనం, అమాయకత్వం అన్నీ కలగలిసిన అతడి నటనే సాంతం ఈ సినిమా. కాలం పాత్రలో సముద్రకని సరిపోయినా పెద్దగా పని లేదు. తంబిరామయ్య వెంట వుంటూ మోరల్ లెసన్స్ ఇవ్వడమే. ఈ రెండు పాత్రల్లో తమిళ స్టార్స్ ఎవరినీ తీసుకోకపోవడం గమనించాలి. స్టార్ స్టేటస్ వున్న పాత్రలు కాకపోవడం చేత. గంటన్నర సినిమా కావడం చేత. నాటకం కావడం చేత కూడా కావొచ్చు. తమిళ నాటకాలనీ, సినిమాల్నీ ప్రమోట్ చేస్తూ తెలుగు రీమేకులు చేయడం జాతీయ సమైక్యతకి మంచిదే, మన సమైక్యత ఎలా వున్నా.  

వాటిలోకి పవన్ కళ్యాణులూ, సాయి ధరమ్ తేజులూ వంటి స్టార్లు వచ్చినప్పుడు పాత్రల పంపకం, పెంపకం కోళ్ళ ఫామ్ కాకూడదు. సముద్రకని గెటప్ బావుందని పవన్ సముద్రకని అయినా, ధరమ్ మనకింతే అనుకుని పెళ్ళీడు పిల్లలున్న మిడిలేజి తంబి రామయ్య అయినా - లేదూ, పాత్రలో నటించే అవకాశముందని పవన్ తంబి రామయ్య అయి, మనకి ఇది కూడా చాలనుకుని ధరమ్ సముద్రకని అయినా - మేకర్స్ ఇష్టం. బుద్ధిమంతుడు లో అక్కినేని భక్తుడై శోభన్ బాబు దేవుడయ్యాడు; అన్నమయ్య లో నాగార్జున భక్తుడై సుమన్ దేవుడయ్యాడు. చిన్నవాళ్ళే దేవుళ్ళయ్యారు. ఇలా తమిళ ఒరిజినల్ తో వున్న ఎన్నో సమస్యల్ని మేకర్స్ ఎలా పరిష్కరిస్తారో, పరిష్కరించి చివరికి తాము కథవుతారో గాథవుతారో చూడడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమానే.

సికిందర్