―ఆస్కార్ వైల్డ్
పై కొటేషన్ తో క్యారెక్టర్ గ్రోత్ అధ్యాయం ప్రారంభిస్తాడు లాజోస్ ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి రాసినా సినిమాలకి కూడా ఉపయోగపడుతుందని గత వ్యాసంలో చెప్పుకున్నాం. అయితే నాటకాలంటే ఇప్పుడు సినిమా వాళ్లకి పడదు. అదేదో లో - కేటగిరీ యాక్టివిటీ అనుకుంటారు. ఆఫ్టరాల్ నాటకాలేమిటి, నాటకాలకంటే సినిమాలు గొప్పని, మేం సినిమా వాళ్ళం చాలా గొప్పోళ్ళమని స్టయిల్ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తూంటారు. సినిమాలు పుట్టిందే నాటక కళ లోంచి. ఈ విషయం తెలీక బ్రేక్ డాన్సులు. ఇదిప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సివస్తోందంటే, ఈ పుస్తకంలో అనేక నాటకాల్లోంచి తీసుకున్న ఉదాహరణలున్నాయి. ఇవి చూసి ఛీ యాక్ థూ అనుకుంటారేమోనని...
వాంతి చేసుకున్నా విషయం మారదు. అందుకని విషయం లోకెళ్దాం.
ఏగ్రీ ఇలా అంటాడు – “మీరు ఏ మాధ్యమం కోసం రాసినా, మీ పాత్రలు మీకు క్షుణ్ణంగా తెలిసి వుండాలి. ఈ రోజు వున్న విధంగానే కాదు, కొన్నేళ్ళ తర్వాత కూడా మీ పాత్రలెలా వుంటాయో మీకు తెలిసి వుండాలి. మానవ జాతి సహా ప్రకృతిలో ప్రతీదీ మార్పుకు లోనవుతుంది. పదేళ్ళ క్రితం ధైర్యశాలిగా వున్న వ్యక్తి ఈ రోజు పిరికిపందగా వుండొచ్చు. కారణాలనేకం. వయస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితి వగైరా.
“మీకు తెలిసిన వ్యక్తెవరో ఇన్నేళ్ళలో అస్సలు మార్పుకు లోనవలేదని మీకన్పిస్తూండవచ్చు. కానీ అలాటి వ్యక్తెవరూ వుండే అవకాశంలేదు. మనిషి తన రాజకీయ, మత విశ్వాసాలని చెక్కు చెదరకుండా ఏళ్ల తరబడీ కాపాడుకుంటూ రావొచ్చు. కానీ సూక్ష్మ పరిశీలనలో వాటిపట్ల అతడి నిబద్ధత బలంగానో బలహీనంగానో మారడాన్ని గమనించ గలం. రాళ్ళు రప్పలు కూడా మార్పుకు లోనవుతాయి. వాటి క్రమానుగత విచ్ఛిన్నం అగోచరంగా వున్నప్పటికీ. సూర్యుడు, సౌర వ్యవస్థ, విశ్వం సైతం. దేశాలు పుడతాయి, కౌమారంలోకి ప్రవేశిస్తాయి, యౌవనాన్ని సంతరించుకుంటాయి, వృద్ధాప్యంలోకి అడుగెడతాయి, మరణిస్తాయి. హింసాత్మకంగానో, నైమిత్తికంగానో.
“మరి ఈ సమస్త పరిణామ తాటస్థ్యంలో మనిషొక్కడే మారకుండా ఎలా వుంటాడు? ఎలా వుంటాడంటే బ్యాడ్ రైటింగ్ వల్ల వుంటాడు. పాత్రలు ప్రకృతి సూత్రాల్నిధిక్కరించే సామ్రాజ్యం ఒకే ఒక్కటి వుంటుంది - అది బ్యాడ్ రైటింగ్ సామ్రాజ్యం. కథానికలో, నవల్లో, నాటకంలో మొదట్లో ఎలా వున్న పాత్ర ముగింపులో అలాగే వుందంటే ఆ కథానిక, నవల, నాటకం చాలా బ్యాడ్ అన్నమాట ( ‘రణరంగం’ లో ఎలా మొదలైన హీరో అలాగే (అ) శుభం వేసుకోడాన్నిగమనించాం - వ్యాసకర్త).
ఇక ఈ అధ్యాయంలో అక్కడక్కడా కొన్ని ముఖ్యమైన అంశాల్ని టిప్స్ గా మార్చుకుని చూద్దాం...
1. కాన్ఫ్లిక్ట్ తోనే పాత్రేమిటో బయటపడుతుంది. కాన్ఫ్లిక్ట్ పాత్ర తీసుకున్ననిర్ణయం ఫలితంగా పుడుతుంది. నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, కథకి ఏర్పాటు చేసిన పాయింటు కారణంగా తీసుకోవాల్సి వస్తుంది. పాత్ర నిర్ణయం తప్పకుండా ఎదుటి పాత్ర ఇంకో నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ ఎదుటి పాత్ర ప్రత్యర్ధి పాత్ర. ఇలా ఒకరి నిర్ణయం ఇంకొకరి ప్రతి నిర్ణయానికి దారితీస్తూ కథ ముందుకు నడుస్తుంది. ఈ పరంపర కథకి తీసుకున్న పాయింటుని ప్రూవ్ చేసే అంతిమ మజిలీ దాకా సాగుతుంది.
2. ఏ గొప్ప నాటకాలని చూసినా, కాన్ఫ్లిక్ట్ వల్ల పాత్రలకి సంభవించే నిరంతర మార్పు, అభివృద్ధి గమనించవచ్చు. షేక్స్ పియర్ ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’, మోలియర్ ‘టర్టఫ్’ మొదలైనవి. ‘ఒథెల్లో’ ప్రేమతో ప్రారంభమవుతుంది, అసూయ, హత్య, ఆత్మహత్యలతో ముగుస్తుంది. ‘హెడ్డా గబ్లర్’ ఇగోతో ప్రారంభమవుతుంది, ఆత్మహత్యతో ముగుస్తుంది. ‘మాక్బెత్’ ఆశయంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘ఎక్స్ కర్సన్’ కలల్నినిజం చేసుకోవడానికి మొదలై, నిజాలు తెలుసుకోవడంతో ముగుస్తుంది. ‘హామ్లెట్’ అనుమానంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘కెరీర్’ నిరాశతో మొదలై విజయంతో ముగుస్తుంది. ‘డెడ్ ఎండ్’ పేదరికంతో మొదలై నేరంతో ముగుస్తుంది...
3. బలహీన పాత్ర ఉద్దేశించిన కాన్ఫ్లిక్ట్ ని కొనసాగించలేదు. పోటీల్లేక పోతే ఆటల్లేవు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే కథ లేదు. కౌంటర్ పాయింటు లేకపోతే సమతుల్యం లేదు. బలహీన పాత్రతో మొదలుపెడితో కాన్ఫ్లిక్ట్ తో బలమైన పాత్రగా మార్చాలి. బలమైన పాత్రని కాన్ఫ్లిక్ట్ తో బలహీనపడ్డ పాత్రగా మార్చవచ్చు. ఐతే బలహీనపడ్డప్పటికీ ఆ అవమానాన్ని భరించగల్గే స్టామినాతో పాత్ర వుండాలి.
4. ఒక ఉదాహరణ : ఓనీల్ రాసిన ‘మౌర్నింగ్ బికమ్స్ ఎలెక్ట్రా’ నాటకం (1947 లో హాలీవుడ్ మూవీగా వచ్చింది). ఇందులో కథానాయకుడు బ్రాంట్ కీ, కథానాయిక లెవీనియాకీ మధ్య సన్నివేశం. బ్రాంట్ పనిమనిషికీ, సంపన్నుడైన మానన్ అనే అతడికీ పుట్టిన అక్రమసంతానం. కులం చెడ్డ వాడు. తల్లి తననెక్కడో దూరంగా తీసికెళ్ళి పెంచింది. ఇప్పుడతను తిరిగొచ్చేశాడు మారుపేరు పెట్టుకుని. తల్లితోబాటు తనూ పొందిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇప్పుడతను కెప్టెన్. లెవీనియా తల్లితో సంబంధం పెట్టుకుని, ఇది కప్పి పుచ్చడానికి లెవీనియాతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఐతే బ్రాంట్ తో జాగ్రత్త అని లెవీనియా ఇంట్లో పనివాడు ఆమెని హెచ్చరించాడు.
అతను అర్ధంగాక వెనకడుగేస్తే, ఈ అవకాశం తీసుకునామె పని వాడిచ్చిన సలహా మేరకు బ్రాంట్ ని వెక్కిరింపుగా, అసహ్యంగా చూస్తుంది.
బ్రాంట్ స్థాణువైపోయి అంటాడు : “ఏంటది? (అని అరిచి, తన తల్లిని అవమానపరు స్తున్నట్టున్న ఆమె వెక్కిరింపుకి రెచ్చి పోతూ అంటాడు) : జాగ్రత్త! నువ్వు ఆడదానివని కూడా చూడను...నేనుండగా ఏ మానన్ గాడి వల్లా మా అమ్మకి అవమానం జరగనివ్వను-”
లెవీనియా ఇప్పుడు తనకి నిజం తెలిసిపోయిందన్న షాక్ తో అంటుంది : “ఐతే నిజమేనన్న మాట... నువ్వామె కొడుకువే నన్న మాట...”
బ్రాంట్ అతికష్టంగా కంట్రోలు చేసుకుంటూ : “ఐతే ఏంటట? గర్వంగావుంది నాకు! నాకు అవమానకరంగా వుందల్లా నా వొంట్లో ఆ మానన్ గాడి రక్తం ప్రవహించడమే. అందుకే నువ్వు నేను ముట్టుకోబోతే సహించలేక పోయావ్ కదూ, అంతేనా?”
అంటే ఇక్కడ పాత్రకి బలహీనపడే, కుంగుబాటుకి లోనయ్యే వాస్తవ పరిస్థితి ఎదురైనప్పటికీ, పాత్ర గిల్టీ ఫీలవకుండా ఎదురుతిరిగి బలం నిరూపించుకుంటోంది (తెలుగు సినిమాల్లో తప్పకుండా వుండే మన అభిమాన, ప్రీతిపాత్రమైన పాసివ్ పాత్రయితే - “లతా! ఇంత మాటన్నావా? సర్లే...ఔన్లే... కానీయ్...నాకిలా రాసిపెట్టుంది...” అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, తెగ మందు కొడతాడు. సినిమా విడుదలయ్యాక బయ్యర్లచేత హాహాకారాలు పెట్టిస్తాడు - వ్యాసకర్త).
బ్రాంట్, లెవీనియాల సంవాదం చూస్తే, వీళ్ళు కాన్ఫ్లిక్ట్ ని రక్తి కట్టిస్తూ కథని బలంగా ముందుకు తీసికెళ్ళిపోతారని నమ్మకం కలుగుతుంది.
5. ఇర్విన్ షా నాటకం ‘బరీ ది డెడ్’ (1936) లో, అమరుడైన సైనికుడి భార్య మార్తా అంటుంది : “ ఇల్లన్నాక పిల్లలుండాలి. అది పరిశుభ్రమైన అందమైన ఇల్లుగా వుండాలి. నాకెందుకు పిల్లలుండకూడదు? వాళ్ళకి లేరా? క్యాలెండర్లో పేజీ చింపిన ప్రతీసారీ వాళ్ళెవరూ తల్లడిల్లిపోరే? ఎంచక్కా ముచ్చటైన అంబులెన్సుల్లో అద్భుతమైన హాస్పిటల్స్ కెళ్ళి మెత్తటి పరుపుల మీద అందమైన పిల్లల్ని కంటున్నారే? వాళ్ళల్లో దేవుడు అంతగా ఇష్టపడుతున్నదేంటో అంతలా పిల్లల్నిచ్చేస్తున్నాడు?”
వెబ్ స్టర్ (ఒక సైనికుడు) : “వాళ్ళు మెకానిక్కుల్ని పెళ్లి చేసుకోలేదు”
మార్తా అంటుంది : “ కాదు! వాళ్ళు పద్డెనిమిదిన్నర డాలర్లతో లేరు. నువ్వున్నావ్. ఇరవై డాలర్ల పెన్షన్ కి యుద్ధంలో నీ చావుని ఆఫర్ చేస్తున్నావ్. ఆ పెన్షన్ తీసుకుని నేను పొద్దంతా బ్రెడ్ కోసం క్యూలో నించుంటా. బటర్ రుచెలా వుంటుందో మర్చేపోయా. నా బూట్లలో వాన నీళ్ళు చీకాకు పెడుతున్నాతడుస్తూ గంటల కొద్దీ ఓ ఇంత మటన్ ముక్క కోసం లైన్లో నిలబడతా. రాత్రెప్పుడో ఇంటికి పోతా. ఎవ్వరూ వుండి చావరు మాట్లాడ్డానికి. బొద్దింకని చూస్తూ అలా కూర్చుంటా గుడ్డి వెల్తుర్లో. గరవ్నమెంటోళ్లు కరెంటు పొదుపు చెయ్యాలిటగా? నాకివన్నీ అంటగట్టి నువ్వెళ్ళిపోతావ్. నాకు మాట్లాడే మనిషి లేకుండా చేసే యుద్ధం నాకెందుకు. నీ ప్రాణాలు పోగొట్టే యుద్ధం నీకెందుకు...”
ఇర్విన్ షా నాటకం ‘బరీ ది డెడ్’ లో దృశ్యం. |
మార్తా : “నువ్వంతే! ముంచుకొచ్చేదాకా రాయిలా కూర్చుంటావ్. ఆల్ రైట్, ఇప్పుడు నో అను. నో అనే టైమొచ్చింది. మీ పద్డెనిమిదిన్నర డాలర్ల బెగ్గర్స్ అందరికీ చెప్పు! వాళ్ళ పెళ్ళాల కోసం, పిల్లలకోసం నో అనమను! నో అనమను! చెప్పు వాళ్ళకి, చెప్పూ!!” కేకేసి పడిపోతుంది.
ఈ పాత్రలు కూడా పోరాడే శక్తితో కదం తొక్కుతున్నాయి. ఏం చేసినా ఎదుటి వాళ్ళు తమతో తలపడేలా చేస్తాయి. గొప్ప నాటకాలు వేటిలో చూసినా, పాత్రలు తమ మధ్య వున్న సమస్యతో ఓడేదాకానో గెలిచేదాకానో చెలరేగుతూనే వుంటాయి. చెహోవ్ రాసిన పాత్రలు కూడా పాసివ్ గా వున్నా శక్తిమంతంగా వుంటాయి. ఆ పాత్రల్లో పోగుబడిన దుర్భర పరిస్థితుల ప్రాబల్యం వాటిని చెక్కుచెదరనీయవు (మన పాసివ్ మేకర్లకి పాసివ్ గా ఎంత ఏడ్పిస్తే అంత తెలుగు తుత్తి. ఈ తెలుగు తుత్తి రిలీజుకి తీరిపోతుంది. ముప్ఫై నలభై కోట్లు నేలపాలై బయ్యర్లు రాళ్ళుచ్చుకు వస్తూంటే ఇంకో సినిమాలో చూసుకుందామని వేడికోళ్ళు. ఆ ఇంకో సినిమా మళ్ళీ యాక్టివా, పాసివా మేకర్లకీ తెలీదు, బయ్యర్లకీ తెలీదు. మళ్లీ రాళ్ళూ వేడికోళ్ళూ. ఎక్కడో హాలీవుడ్ లో మూడు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ అననే అన్నాడు -సినిమా వాళ్లకి ఏమీ తెలిసి చావదని -వ్యాసకర్త).
6. న్యూయార్క్ టైమ్స్ లో ఈ ఆర్టికల్ వచ్చింది...500 హత్యల్ని అధ్యయనం చేస్తే, ఆ హత్యల వెనుక కారణాలు ఆశ్చర్య పర్చాయని మెట్రో పాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేర్కొంది... ఒక భర్త డిన్నర్ లేటు చేసిందని భార్యని కొట్టి చంపాడు. ఒక ఫ్రెండ్ పాతిక సెంట్ల తగాదాలో ఫ్రెండ్ ని చంపేశాడు. శాండ్ విచ్ దగ్గర మాటామాటా పెరిగి, రెస్టారెంట్ ఓనర్ కస్టమర్ ని కాల్చి చంపాడు. తాగుడు మానమని చెప్పిన తల్లిని ఒకడు పొడిచి చంపాడు. బాక్స్ లో ఎవరు ముందు కాయిన్ వేసి పియానో వాయించాలన్నదగ్గర గొంతు పిసికి ఒకడ్ని చంపేశాడింకొకడు.
వీళ్ళంతా పిచ్చివాళ్ళా? స్వల్ప కారణానికే ప్రాణాలు తీసేంత హంతకులుగా ఎలా మారిపోయారు?
(ఇంకా వుంది)
―సికిందర్