రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 8, 2022

1127 : రివ్యూ!


 

రచనదర్శకత్వం: తు.పా. శరవణన్
తారాగణం
 : విశాల్డింపుల్ హయతీరవీనా రాజ్తులసియోగిబాబుమారిముత్తుబాబూరాజ్ఇలంగో కుమారవేల్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా ఛాయాగ్రహణం : కావిన్ రాజ్
నిర్మాత: విశాల్
విడుదల : ఫిబ్రవరి
 4, 2022
***

          తెలుగులో ఓ మోస్తరు మాస్ ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ విశాల్ గత సంవత్సరం నటించిన చక్ర’, ఎనిమీ తలుగులో విడుదలయ్యాయి. ఏమంత ఆదరణ పొందలేదు. తిరిగి ఈ సంవత్సరం తాజాగా ఈవారం సామాన్యుడు (తమిళంలో వీరమే వాగాయి సోదుమ్ ) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వరసగా యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్న విశాల్ ఇంకో యాక్షన్ మూవీతో వచ్చాడు. ఈసారి యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర పోషిస్తూ. శరవణన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతూ. విజయవాడకి చెందిన తెలుగు అమ్మాయి డింపుల్ హయతీ హీరోయిన్. ఈమె తెలుగులో  గల్ఫ్’, యురేకా’, దేవీ2 లలో నటించింది. హిందీలో ఒక మూవీలో నటించాక తిరిగి తెలుగులో ఖిలాడీ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు విశాల్- శరవణన్- డింపుల్ ల కాంబినేషన్ లో సామాన్యుడు ఎలా వుంది? అసామాన్యంగా వుందా? ప్రేక్షకుల సహనానికి అసందర్భంగా వుందా? ఈ విషయాలు తెలుసుకుందాం...

కథ

    పోరస్ ( విశాల్) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువకుడు. అతడికి పోలీస్ ఇన్స్ పెక్టర్ అవ్వాలని ఆశయం.  తండ్రి(మారిముత్తు) పోలీసే. తల్లి (తులసి)చెల్లెలు ద్వారకా (రవీనా రవి) వుంటారు.  ద్వారక  కాలేజీకి వెళ్తూ వుంటుంది. పోరస్ తన చుట్టూ జరిగే అన్యాయాల్ని సహించలేక పోతాడు. ఈ క్రమంలో హద్దు మీరిప్రవర్తిస్తూంటాడు. ఇలా చేస్తే రేపు పోలీసు ఉద్యోగం రావడం కష్టమని తండ్రి వారిస్తూంటాడు. ఇలావుండగా ద్వారకాని ఒకడు టీజ్ చేస్తూంటే పోరస్ వాణ్ని కొడతాడు. ఈ నేపథ్యంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల జనం పడే ఇబ్బందుల గురించి పోరాటం చేస్తూంటాడు ఒక సామాజిక కార్యకర్త (ఇలాంగో కుమరవేల్). ఇది ఆ ఫ్యాక్టరీ యజమాని నీలకంఠం(బాబూరాజ్) కి కోపం తెప్పిస్తుంది. దీంతో ఆ సామాజిక కార్యకర్తని హత్య చేస్తాడు నీలకంఠం. ఇది కళ్ళారా చూసిన ద్వారకా కూడా హత్యకి గురవుతుంది. దీంతో చెల్లెలి హంతకుల్ని పట్టుకోవడానికి ఒక సామాన్యుడుగా పోరస్ ఎలా ప్రయత్నించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    మధ్య తరగతి ప్రజలు తమ క్షేమం తాము చూసుకుని, చుట్టూ జరిగే వాటికి స్పందించక పోతే, వారూ అలాటి పరిస్థితుల్లో చిక్కుకుంటారనీ, అప్పుడు కాపాడే వాళ్ళెవరూ వుండరనీ ఈ కథ ద్వారా చెప్ప దల్చాడు దర్శకుడు. కాన్సెప్ట్ బాగానే వున్నా దానికి కథా రూపమివ్వడంలో విఫల విన్యాసాలు చేశాడు. ఇది వరకు సినిమాల్లో వచ్చిన పాత రొటీన్ మూస కథా కథనాలు, సన్నివేశాలు ఏర్చి కూర్చి తీర్చి దిద్దాడు. కుర్చీల్లో ప్రేక్షకులు కుర్చీల్లోనే పడుకునేట్టు. మలయాళం నుంచి, తమిళం నుంచీ కొత్త టాలెంట్స్ కొత్తదనం తీసుకు రావడాన్ని చూసే వాళ్ళం. ఈ మధ్య వరసగా కొత్త టాలెంట్స్ పాత చింతకాయ లేరుకుని వస్తున్నారు. చెల్లెలి హంతకులపై పగ దీర్చుకునే లాంటి పాత చింతకాయ రివెంజీ డ్రామా సినిమాలు ఇంకా చూపిస్తూ గర్వకారణంగా ఫీలవుతున్నారు.

        మధ్య తరగతి ప్రజలు తమ క్షేమం తాము చూసుకుని, చుట్టూ జరిగే వాటికి స్పందించక పోతే, వారూ అలాటి పరిస్థితుల్లో చిక్కుకుంటారనీ, అప్పుడు కాపాడే వాళ్ళెవరూ వుండరనీ - అనే కాన్సెప్టు  తీసుకున్న కొత్త దర్శకుడికి దీని విలువ తెలియలేదు. దేశంలో ఏం జరిగినా మిడిల్ క్లాస్ మౌనంగా వుంటున్న సందర్భాలు చూస్తున్నాం. మార్టిన్ నిమోలర్ రాసిన ప్రసిద్ధ జర్మన్ కవితని గుర్తుకు తెచ్చే కాన్సెప్ట్...  

        First they came for the socialists, and I did not speak out—because I was not a socialist.
        Then they came for the trade unionists, and I did not speak out— because I was not a trade unionist.
        Then they came for the Jews, and I did not speak out—because I was not a Jew.
        Then they came for me—and there was no one left to speak for me.

        And Then There Were None’  అనే అగథా క్రిస్టీ నవల ఒకటి. ఈ రెంటినీ జ్ఞప్తికి తెచ్చే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాన్ని  ఆమేరకు నడిపించకుండా పాత రొటీన్ పగా ప్రతీకారాల కథగా చేసేశాడు. కాన్సెప్ట్ ఒకటైతే కథ ఇంకొకటి. చుట్టూ జరిగే వాటికి సైలెంట్ గా వుండమనే తండ్రి, మాట వినని కొడుకు, తీరా తన కూతురే హత్యకి గురైతే కొడుకు పగదీర్చుకోవడం- ఈ చావకబారు కథనంతో కాన్సెప్టు మాయమైపోయింది. దీనికి విశాల్ నటించడమే గాక నిర్మించడం కూడా!

నటనలు సాంకేతికాలు

    నిర్మాతగా, హీరోగా ఈ సినిమా ద్వారా విశాల్ అందించించిన కొత్తదనమేమీ లేదు. పాత్రలో విషయం లేకపోగా నటనలో జీవం లేదు. ఎమోషన్స్ లేవు. యాంగ్రీ యంగ్ మాన్ గా యాక్షన్ లోకి దిగడానికి కథలో తగిన విషయం లేదు. నటన, ఫైట్స్ కృత్రిమంగానే వుంటాయి. హీరోయిన్ డింపుల్ హయతీ కూడా ఈ సినిమా ఎందుకు నటించిందో అర్ధం గాదు. ఆమె రోమాన్స్ సీన్లు చాలా చీప్ గా వున్నాయి. ఇక యోగిబాబు కామెడీ ఎక్కడా పేలలేదు.

        ఇంటర్వెల్ కి ముందు పది నిమిషాలు తప్ప  ఫస్టాఫ్ భరించడం  చాలా కష్టం. కొత్త దర్శకుడికి సీన్లు తీయడం కూడా రాలేదు. బి, సి, గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సెకండాఫ్ లో విశాల్ చెల్లెలి హత్యని ఛేదించే ట్రాక్ ఒక్కటే బావున్నా అది అవసరానికి మించి సాగతీతగా వుంటుంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో  ఒకే పాట వుంది. మత్తెక్కించే కళ్ళే…’ అనే ఈ మాంటేజ్ సాంగ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. కెవిన్ ఛాయాగ్రహణం కూడా ఫర్వా లేదు.

        మొత్తానికి విశాల్ కెరీర్ లో ఇంత దారుణమైన సినిమా రాలేదు. వరసగా ఇలాటి యాక్షన్ సినిమాలతో ఫ్లాపులు సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు వుంది.

సికిందర్