రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 2, 2021

1100 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను
తారాగణం : నందమూరి బాలకృష్ణ
, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్, సుబ్బరాజు షామ్నా కాసిం తదితరులు
మాటలు : ఎం. రత్నం
, సంగీతం : ఎస్ తమన్, ఛాయాగ్రహణం : సి రామ్ ప్రసాద్
బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్
నిర్మాత : మిర్యాల రవీంద్ర రెడ్డి
విడుదల : డిసెంబర్ 2
, 2021


***

        ట సింహం నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను ఇద్దరిదీ బ్లాక్ బస్టర్స్ కాంబినేషన్. 2010 లో సింహా’, 2014 లో లెజెండ్ అనే రెండు బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత 2021 ముగింపులో  అఖండ తో హ్యాట్రిక్ చేద్దామని విచ్చేశారు. 2019 లో కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో రూలర్ బాలకృష్ణకి చేదు అనుభవాన్నిచ్చింది. బోయపాటికి 2016 లో అల్లు అర్జున్ తో సరైనోడు అనే హిట్ తర్వాత, 2017 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో  జయ జానకి నాయక’, 2019 లో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ రెండూ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, అఖండ తో అఖండ విజయాన్ని సాధించేందుకు విచ్చేశారు. ఇందులో బాలకృష్ణ అఘోరా గెటప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ గెటప్ తో అఖండగా టైటిల్ రోల్లో నటసింహం ని చూసేందుకు బాక్సాఫీసుల్ని కిటకిటలాడించారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. మరి ఈ ప్రతిష్టాత్మక సినిమా అంతా బావుందా? చూద్దాం...

కథ

అనంతపురంలో మురళీ కృష్ణ (బాలకృష్ణ) ప్రకృతిని, సమాజాన్నీ కాపాడాలన్న తపనతో ఫ్యాక్షన్ని రూపుమాపి, పాఠశాలలూ ఆస్పత్రులూ నెలకొల్పి ప్రజాసేవ చేసే రైతుగా వుంటాడు. ఒక పీఠాధిపతిని చంపి ఆ స్థానంలోకి శక్తి స్వరూపానంద అనే దుష్ట స్వామి వస్తాడు. ఇతడితో మైనింగ్ మాఫియా వరదరాజులు (శ్రీకాంత్) కి సంబంధాలుంటాయి.  

       ఇలావుండగా కొత్త కలెక్టర్ గా శరణ్యా బాచుపల్లి (ప్రగ్యా జైస్వాల్) వస్తుంది. మురళీ కృష్ణ చేస్తున్నసామాజిక కార్యక్రమాలు చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అటు వరదరాజులు అక్రమ కాపర్ మైన్స్ లో యురేనియం గనులు బయటపడ్డంతో,  దాంతో అతడి కుట్ర వల్ల అనేక మంది పిల్లలు రోగాల పాలై మురళీ కృష్ణ ఆస్పత్రిలో చేరతారు. మురళీ కృష్ణ కూతురు కూడా ప్రమాదంలో పడుతుంది. వరదరాజులు కుట్రతో ఆస్పత్రి పేలిపోయి, మురళీ కృష్ణ అరెస్టవుతాడు. శరణ్య సస్పెండ్ అవుతుంది. ప్రాణాపాయంలో వున్న కూతుర్ని శరణ్యా బెంగుళూరు తీసుకుపోతూంటే వరదరాజులు దాడి చేయిస్తాడు. ఇలా మురళీకృష్ణ కుటుంబమూ, ప్రజలూ అల్లకల్లోలమైపోతూంటే ఆపద్భాంధవుడుగా దిగుతాడు అఖండ. పుట్టగానే చనిపోయిన ఇతను శివుడి అంశ పోసుకుని బతికాడు. ఉత్తర దేశంలో అఘోరాగా మారాడు. 

        ఇప్పుడు ఎవరీ అఖండ? ఇతడికీ, మురళీ కృష్ణకీ సంబంధమేమిటి? శివోపాసకుడైన అఖండ శక్తి ముందు దుష్టస్వామి, వరదరాజులు ఏమయ్యారు? యురేనియంతో కకావికలమైన ప్రకృతినీ ప్రజల్నీ కాపాడి సమస్థితిని నెలకొల్పాడా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రకృతిని పాడు చేయవద్దన్న నీతితో కథ ప్రారంభించారు. ప్రకృతి మీదా పసివాళ్ళ మీదా చెయ్యేస్తే శివుడూరుకో డన్నారు. ఇందుకు లయకారుడైన శివుడి అంశని అఖండ అనే అఘోరా పాత్రలో ప్రతిష్టించి పోరాటానికి దింపారు. సింపుల్ గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ హై కాన్సెప్ట్ కథ. ప్రకృతి వినాశక శక్తులు వర్సెస్ అఖండ అనే శైవ సాధువు స్పిరిచ్యువల్ యాక్షన్ జానర్ కథగా ఐడియా బావుంది. ఈ ఐడియాని బోయపాటి తన రెగ్యులర్ ఫ్యాక్షన్ తరహా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గా మార్చేసి ప్రకృతి- దైవం- మనం అన్న సున్నిత బంధాన్ని ఫీల్ కాకుండా చేశారు. భారీ యాక్షన్ హంగామా కింద నలిగి కథ కనిపించకుండా పోయేట్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కథని కాలుష్య భరిత జాతరగా మార్చేశారు.

        కథ పోగా మిగిలింది బాలకృష్ణ అఖండ క్యారక్టర్. ఉత్తర దేశంలో వుండే అఘోరాలని అఖండ పాత్రకి రిఫరెన్సుగా తీసుకున్నారు. నగ్నంగా శ్మశానాల్లో క్షుద్ర తపస్సులు చేసే,  అనాగరిక ఆచారాలతో వుండే, భీతి గొలిపే అఘోరా మోడల్ కి, అఖండ అనే పేరిచ్చి, పుణ్యస్నానాలు- జప తపాలు చేసే నీటైన డిజైనర్ అఘోరాగా మార్చి బాలకృష్ణతో చూపించారు. దీన్ని అభ్యంతర పెట్టాల్సిన పని లేకపోయినా, ఈ క్యారక్టర్ తో అనుకున్న కథే చూపించకుండా మాయం చేయడం అభ్యంతర కరమైనది. స్టార్ సినిమాల్లో వినూత్నంగా ఎత్తుకున్న పాయింటే మర్చిపోయి సినిమా తీసేయడం మామూలే. బద్రినాథ్ లో కూడా దేవాలయాల మీద టెర్రరిస్టుల దాడినుంచి పరిరక్షణ పాయింటుతో కథ ఎత్తుకుని, పారిపోయిన లవర్స్ వర్సెస్ ఫ్యాక్షన్ యాక్షన్ కథ చూపించారు.

నటనలు –సాంకేతికాలు

నట సింహమే, సందేహం లేదు. బాలకృష్ణ తప్ప ఇంత రౌద్ర ప్రతాప పాత్ర ఎవరూ చేయలేరు. సినిమాని కూర్చుని చూడగలమంటే బాలకృష్ణ గురించే చూడాలి. రెండు పాత్రల్లో స్టార్ పవర్ తో సాంతం కమ్మేశారు. అయితే సమస్యేమిటంటే, సరైన విలన్ లేడు. ఈ పాత్రతో బాలకృష్ణ  ముందు అమ్రిష్ పురిని వూహించుకుంటే బ్యాలెన్సింగా వుంటుంది. ఇద్దరి రౌద్రం, అరుపులు మ్యాచ్ అవుతాయి. ఇంకో సమస్యేమిటంటే, పోరాట దృశ్యాలు నిడివి పెరిగి పోయి, దాంతో సినిమా నిడీవీ కూడా భారీగా పెరిగిపోయీ భారంగా మారడం. ఫ్యాన్స్ వరకూ ఓకే. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్షవుతారు.

        రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు బలంగా వున్నాయి. ఆస్తి కాదు, ఆలోచనలున్న వాడు గొప్ప వాడు లాంటి డైలాగులు. ప్రగ్యా జైస్వాల్ తో వెకిలి రోమాన్స్ లేకుండా, అసలు రోమాన్సే  లేకుండా- ఆమె పెళ్ళిని ప్రపోజ్ చేయగానే చేసుకోవడంతో నీటుగా కనిపిస్తుంది. రోమాన్స్ ప్రగ్యా జైస్వాల్ ఒక్కతే ఫీలై, కొన్ని చిలిపి చేష్టలు చేసుకుంటుంది.

        అఖండ పాత్రకి సెంటిమెంటల్ కోణాన్ని కల్పించే విషయంలో అశ్రద్ధ చేశారు. బోయపాటి ట్రేడ్ మార్కు యాక్షన్ హంగామాలో చితికి పోయిన సెన్సిటివిటీస్ లో ఇదొకటి. తల్లితో మదర్ సెంటి మెంటు సీను తల్లి ఒక్కతే ఫీలై సీను పొడిపొడిగా వెళ్ళి పోతుంది. బాలకృష్ణ మురళీ కృష్ణ పాత్ర కూతురితో కూడా అఖండగా తన సీన్లు పొడిపొడిగానే వుంటాయి. ప్రకృతి జోలికీ, పసి వాళ్ళ జోలికీ రావద్దన్న మాట ప్రకారమే ఈ పసిపిల్లతో సెంటిమెంటల్ సీన్లు - సెంటిమెంటల్ ట్రావెల్ కథలో వుండాల్సింది - భజరంగీ భాయిజాన్ లోలాగా. స్టార్ సినిమా హార్డ్ కోర్ యాక్షన్ గా మాత్రమే వుండొచ్చా? అయితే కుటుంబ ప్రేక్షకుల్ని ఎలా ఆశిస్తారు? బాల కృష్ణ మీద చిత్రీకరించిన పాటలు - ఒకటి ప్రగ్యాతో గ్రూప్ డాన్సు పాట-  అతి లేకుండా నీటుగా వున్నాయి.

        ప్రగ్యా జైస్వాల్ స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకునే కలెక్టర్ పాత్రలో వుంటుంది. కల్లు సీను కోసం ఆమెని తెలంగాణా వ్యక్తిగా మార్చేశారు. తర్వాత మామూలుగానే మాట్లాడుతుంది. సస్పెండ్ అయ్యాక తల్లి పాత్రలో వుండి పోతుంది. ప్రగ్యా జైస్వాల్ చీరలు తప్ప మరో కాస్ట్యూమ్ లేకుండా హోమ్లీ లుక్ తో ఆడియెన్స్ కి కన్నులపండువ.

        ఇక జగపతి బాబు, శ్రీకాంత్. జగపతి బాబు మంచి సాధువు, శ్రీకాత చెడ్డ మాఫియా. ఇద్దరూ పాత్రలు మార్చుకుని వుంటే బావుండేది. శ్రీకాంత్  కరుడు గట్టిన విలన్ గా పవర్ఫుల్లే. బాలకృష్ణకి సరిపోయేంత కాదు.

        సి. రాంప్రసాద్ మరోసారి విజువల్ క్వాలిటీ చూపించాడు కెమెరా వర్క్ తో. డార్క్ సీన్లు కూడా వ్యూహాత్మక లైటింగుతో డిటెయిల్డ్ గా విజువలైజ్ చేశాడు, బాలకృష్ణ ఆభరణ, ఆయుధ సంపత్తిని  హైలైట్ చేయడంతో బాటు. ఈ మూవీలో కళా దర్శకత్వానికి చాలా పనుంది. ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం విజువల్స్ కి రిచ్ నెస్ ని తీసుకొచ్చింది. అలాగే స్టంట్ విభాగానికీ చాలా పనుంది. రామ్ లక్ష్మణ్ లు, స్టన్ శివ సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ క్లాస్. అయితే తెలుగు టీవీ సీరియల్లాగా ఎంతకీ ముగియకపోవడమే పదే పదే వచ్చే యాక్షన్ దృశ్యాల ప్రత్యేకత. దీని విషయంలో ఎడిటర్లు కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మిరాజులు కూడా చేతులెత్తేశారు.

        బోయపాటి దర్శకత్వ బలానికే లోటూ లేదు. కథా బలం లేదు. రత్నం డైలాగుల బలం చెప్పుకోదగ్గది. ఉన్న కథకి బలమైన, క్వాలిటీ డైలాగులు రాశాడు. బాలకృష్ణ నోటి వెంట ఈ డైలాగులు వినసొంపుగా వుంటాయి. బాలకృష్ణ - బోయపాటిల హిట్ కాంబినేషన్ అఖండ పాత్రకి గుర్తుంటుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదన్నట్టు నడిపించి, ఇంటర్వెల్ ముందు అఖండకి భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇప్పించాక- సెకండాఫ్ లో కథని కూడా పట్టించుకోవాల్సింది. లాక్ డౌన్ ఎత్తేశాక విడుదలవుతూన్న సినిమాల్లో వరుసగా సెకండాఫ్ కే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని బాలకృష్ణ మాస్ పవర్ ఎంత వరకు అధిగమిస్తుందో చూడాలి.

—సికిందర్

 

 


Wednesday, December 1, 2021

1099 : లోకల్ క్లాసిక్స్

ఒళివు దివసతే కలి (మలయాళం)

 

(ఈ మధ్య తమిళంలో కర్ణణ్’, జై భీమ్ అనే దళిత / ఆదివాసీ సినిమాలు సృష్టించిన సంచలనానికి పూర్వం, మలయాళం నుంచి 2015 లో మరింత వికృత కోణమేమిటో చూద్దాం...)

              అచ్చయి ప్రాచుర్యంలో వున్న సాహిత్యాన్ని సినిమాగా చెక్కడం సినిమాని రీమేక్ చేయడం కన్నా కష్టమే. నవలని అలా వుంచుదాం, అదెలాగూ దృశ్యాల దొంతరగా వుంటుంది. మూడు నాల్గు దృశ్యాలతో వుండే ఓ కథని రెండు గంటల సినిమాగా మల్చాలంటే నాటక రచన తెలిసి వుండక తప్పదు. అందులోని వస్తు స్థల కాలాల ఐక్యతని సినిమాకి సాధించకతప్పదు. మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ 59 పేజీల ఒక ప్రసిద్ధ కథని, కథ చెడకుండా, 144 నిమిషాల సినిమాగా ఎలా మార్చాడంటే, ఎలా మార్చాడో అతడికే తెలీదు. స్క్రిప్టే రాసుకోకుండా ఒక వూహకందని సృజనాత్మకతని ప్రదర్శించాడు. అయితే దృశ్య మాధ్యమమైన ఏ సినిమా నిలబడాలన్నా సింపుల్ గా పాత్ర ఉద్దేశం -సంఘర్షణ- పరిష్కారం అనే మూడంకాల నిర్మాణంలోకి రావాల్సిందే కాబట్టి, ఒక చిన్న కథలోని విషయాన్ని వస్తు స్థల కాలాల ఐక్యత సాధిస్తూ, ఈ చట్రంలోకి తీసుకొస్తే పని పూర్తయినట్టే. ఈ పనికి సనల్ కుమార్ కి ఒక జాతీయ అవార్డు, ఇంకో మూడు అంతర్జాతీయ అవార్డులూ దక్కాయి.     


  అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ జీవితమంటే కేవలం బెంగాల్ నుంచి బెంగాలీ సినిమాలు, ఉత్తరాది నుంచి హిందీ సమాంతర సినిమాలే. తెలుగు సినిమాలంటే తమిళనాడులో కూడా తెలీని తెలుగు మసాలాలే కాబట్టి, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంట్రీ లేదు. భారత దేశంలో తెలుగు జీవితం కూడా ఇలా వుందని తెలుపుకుని గౌరవం పొందే ఛాన్సు లేదు. మలయాళ దర్శకులు మలయాళ జీవితాల్ని ఎప్పుట్నుంచో అంతర్జాతీయులకి గౌరవప్రదంగా పరిచయం చేసుకుంటున్నారు. 2001 నుంచి ఇండిపెండెంట్ ఫిలిమ్ మేకర్ సనల్ కుమార్ విడవకుండా పదే పదే పరిచయం చేస్తున్నాడు. ఈ క్రమంలో 15 అంతర్జాతీయ, జాతీయ అవార్డుల గ్రహీతగా ఘనత సాధించాడు. 2015 లో ఇందులో ఒళివు దివసతే కలి (ఇంగ్లీషు టైటిల్ : ఏన్ ఆఫ్ డే గేమ్’) ఒక భాగం. దీన్ని రాజ్యాంగమేమిటి, ప్రజలు చేస్తున్నదేమిటీ ప్రశ్నించే ఆందోళనకర విషయంతో తెరకెక్కించాడు...

కథ

కేరళలో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది. ఐదుగురు మధ్య వయస్కులైన మిత్రులు పోలింగ్ రోజున సెలవుని ఎక్కడికైనా వెళ్ళి గడుపుదామని నిర్ణయించుకుంటారు. ఎక్కడో అడవి మధ్య గెస్ట్ హౌస్ కి వెళ్తారు. ధర్మన్ నంబూద్రి (నిసార్ అహ్మద్), తిరుమణి (గిరీష్ నాయర్), వినయన్ (ప్రదీప్ కుమార్), నారాయణన్ (రెజూ పిళ్ళై), దాసన్ (బైజీ నెట్టో) - అనే ఈ అయిదుగురూ వంటగత్తె గీతూ (అభిజా శ్రీకళ) కి వంట పని అప్పజెప్పి, షికారు వెళ్ళి మద్యం తాగుతూ కుంటలో చేపలు పట్టి, కొలనులో ఈతకొట్టి, అల్లరల్లరి చేసుకుని వస్తారు.  

        వస్తూ దారిలో పనస చెట్టు కన్పిస్తే, దాసన్ ని చెట్టెక్కించి పనస కోయిస్తారు. గెస్ట్ హౌస్ కి రాగానే తెచ్చుకున్న కోడి పారిపోతూంటే, దాని మీద పడి పట్టుకుని దాసన్ కిచ్చి  కోయమంటారు. దాసన్ కోయలేనని అంటే, మోటు మనసోడివి నువ్వే కోయగలవని బలవంతంగా కోయిస్తారు.

        గీతూ ఆ కోడి కూర వండుతూంటే, అయిదుగురూ మద్యం మొదలెట్టి కబుర్లాడు కుంటారు. దాసన్ తప్ప మిగిలిన నల్గురూ తలా ఓసారి గీతూని లొంగదీయాలని ప్రయత్నించి విఫలమవుతారు. ధర్మన్ ఇంకోసారి ప్రయత్నిస్తే చెంప ఛెళ్ళు మన్పిస్తుంది గీతూ. కూర వండి పడేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది.

టీవీలో పోలింగ్ విశేషాలు పెట్టుకుని, కూర నంజుకుని పూటుగా తాగుతూ పిచ్చాప్పాటీ మొదలెడతారు. ఎన్నికల గురించి ఒక్క దాసన్ కే ఆసక్తి వుంటుంది. మిగిలిన బృందానికి చెత్తలా తోస్తుంది. ఓటు కూడా వేసి రాలేదు. చర్చపెట్టుకుని, భార్యలు సహా ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడతారు. శృంగారంలో స్త్రీ కింద, పురుషుడు పైన వుండే ఏర్పాటులోనే, మగాడు జయించేవాడని అర్ధం జేసుకోవాలని సూత్రీకరణ చేస్తారు. దాసన్ మౌనంగా వింటూ వుంటాడు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ మీదికి మళ్ళుతుంది. ధర్మన్ కి ఎమర్జెన్సీ గొప్ప విషయంగా తోస్తే, వినయన్ కి మండిపోయి గొడవపడతాడు. ఇది ఘర్షణ కిందికి మారి, విందు నుంచి ఇంటికెళ్ళి పోతూంటే, కురుస్తున్న వర్షంలో ఈడ్చుకొస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో దాసన్ ని నల్లోడా అని పిలుస్తూంటారు. వాతావరణాన్ని తేలికబర్చడానికి పాట పాడమంటారు. నేను పుడితే నలుపు, పెరిగితే నలుపు, ఎండలో నలుపు, రోగంలో నలుపు, చావులో నలుపు- మీరు పుడితే గులాబీ వర్ణం, పెరిగితే శ్వేత వర్ణం, రోగంలో నీలి వర్ణం, మరణంలో గోధుమ వర్ణం - మీకు ఇన్ని రంగులు మారుతున్నాయి, నన్ను నల్లోడు అంటారా - అని విరుచుకుపడి పాడతాడు.

        నల్గురూ బయటికెళ్ళిపోయి మొహాలు అటు తిప్పుకుని నిలబతారు. దాసన్ వెళ్ళి సారీ చెప్తాడు. ఇలా కాదని, చిన్నప్పుడు ఆడుకున్న పోలీసు - దొంగాట ఆడుకుందామంటారు. ఆట మొదలెడతారు. ఈ ఆటలో తాగిన మత్తులో ఏం చేసేశారో, వాళ్ళ అసలు స్వరూపాలేమిటో అన్నీ బయటపడి వూహించని మలుపు తీసుకోవడం మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే పేరుతో ఉన్ని ఆర్ రాసిన ప్రసిద్ధ మలయాళ కథకి ఇది చిత్రానువాదం. కథాపుస్తకం అమెజాన్లో అమ్మకానికుంది. సినిమా యూట్యూబ్ లో ఉచితంగా వుంది. వ్యవస్థలు కాదు, ముందు పౌరులే ఎలా రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారో దృష్టికి తెచ్చే కథ.   

సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్గాల్లో కులమెలా పని చేస్తుందో వివరించే కథ. కులం చెప్పకు, కులం అడక్కు, కానీ చేసేది కులం మర్చిపోకుండా చెయ్-  అన్న అంతరార్థం పెల్లుబికే  కథ. రాజ్యాంగ నీడలో శిక్ష నుంచి తప్పించుకునే వాళ్ళెవరో, తప్పించుకోలేక శిక్ష ననుభవించే వాళ్ళెవరో, నిర్మొహమాటంగా కళ్ళముందుంచే పోలీసు- దొంగాట ముసుగులో దళితుడితో ఆడుకునే వికృత ఆట. ముగింపుతో జీవిత కాల షాకిచ్చే కథ. ఇంతకంటే చెబితే షాక్ వేల్యూ పోతుంది.

నటనలు- సాంకేతికాలు
  ఇందులో నటించిన వాళ్ళందరూ నాటక నటులేనటిస్తున్నట్టు వుండరు, ప్రవర్తిస్తున్నట్టు వుంటారు. మాటలు వాళ్ళ వాళ్ళ ఫ్లోలో వచ్చేస్తూంటాయి. ఎవరి ముఖ భా వాలూ కనపడవు. క్లోజప్స్ వుండవు. కెమెరా థీమ్ కి లోబడి పనిచేస్తూంటుంది. ఎక్కడా క్లోజప్ షాట్స్ పాత్రలకీ, మరి దేనికీ వుండవు. కెమెరా రాజ్యాంగం పాత్రలో వుంటుంది. రాజ్యాంగ దృష్టికి అందరూ సమానమే. ఎవరూ ఎక్కువ కాదు కోజప్స్ వేసుకోవడానికి. కెమెరా కదలికలు కూడా వుండవు. రాజ్యాంగం తటస్థం కాబట్టి. మిడ్ షాట్స్ తో కెమెరా తటస్థంగా, స్టాటిక్ గా వుండిపోతూంటుంది. తటస్థ ఫ్రేముల్లోకి పాత్రల వ్యవహారాలు, సన్నివేశ పరిస్థితీ నిశబ్దంగా గమనిస్తూంటుంది కెమెరా. ఒక సీన్లో వీళ్ళ వ్యవహారాన్ని కెమెరా ఆరు నిమిషాలపాటు కదలకుండా గమనిస్తూ వుండిపోతుంది. పతాక సన్నివేశమంతా ఒకే మిడ్ షాట్ లో  గమనిస్తుంది కెమెరా.  

జరగాల్సిన దారుణం జరిగిపోయాక, దిక్కుతోచనట్టు అడవిలో తిరుగాడుతుంది కెమెరా. తిరిగి తిరిగి వచ్చి దారుణాన్ని దీనంగా చూస్తూ నిలబడుతుంది కెమెరా అనే రాజ్యాంగం....కానీ కదిలేదెవరు, కదిలించే దెవర్నీ, మారేదెవరూ ఇదీ సమాధానం దొరకని ప్రశ్న. దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఆందోళన.

 —సికిందర్

 

       




Tuesday, November 30, 2021

1098 : స్పెషల్ ఆర్టికల్


 కోవిడ్ - 1, 2 లాక్ డౌన్లలో కేరళలో ఉప్పొంగిన ఓటీటీ బూమ్ తగ్గుముఖం పడుతోందా? చిన్న సినిమాల విషయంలో నిజమే. ప్రేక్షకుల్లో వచ్చిన మార్పు ఇందుకు కారణం. కోవిడ్  లాక్ డౌన్స్ లో కేరళ సినిమా థియేటర్లు మరోసారి మూతపడడంతో అందరి దృష్టి ఆన్‌లైన్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ వైపు మళ్ళింది. వాస్తవానికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ సంస్థలతో బాటు, దాదాపు ఎనిమిది ఇతర మూవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్స్ కేరళలో ప్రారంభమయ్యాయి. చిన్న సినిమాలైనా క్వాలిటీతో సినిమా లందిస్తూ, దేశంలో ఇతర ప్రాంతాలకీ మలయాళ సినిమాలు విస్తరించడానికి ఈ ప్లాట్ ఫామ్స్ తోడ్పడ్డాయి.

        
    కానీ రాను రాను ప్రధాన ఓటీటీల్లో  ప్రీమియర్ అవుతున్న కొత్త మలయాళ చిన్న సినిమాల సంఖ్య తగ్గు ముఖం పట్టేసింది. కారణం పాపులర్ తారలు నటించే భారీ రీచ్ వుండే సినిమాల వైపే ఓటీటీలు మొగ్గు చూపడం. మరో వైపు చిన్న సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసుకుందామంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళడం మానేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఓటీటీల్లో వస్తాయి కదాని. ఇలా ఇటు థియేటర్లకి ప్రేక్షకులు రాక, అటు ఓటీటీలూ సినిమాలు తీసుకోక అడకత్తెరలో పోక చెక్కలా తయారవుతోంది చిన్న సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి!

        చిన్న సినిమాల పట్ల ఓటీటీలకి ఆసక్తి లేదు. వుంటే కఠిన నిబంధనలు పెడుతున్నారు. ‘పే-పర్-వ్యూ’ పద్ధతిన కంటెంట్‌ని స్క్రీన్ చేస్తామంటున్నారు. దీనికి నిమిషాల/గంటల లెక్కలు కడుతున్నారు. ఒక ప్రేక్షకుడు ఒక సినిమాపై ఆసక్తితో క్లిక్ చేసి, స్ట్రీమ్ చేయడం ప్రారంభించి, 10 నిమిషాల తర్వాత మనసు మార్చుకుని, దాన్ని మూసేసి, లేదా మార్చేసి, వేరే సినిమా క్లిక్ చేస్తే, చెల్లింపు ఆ కొద్ది నిమిషాలకి మాత్రమే వుంటుందనేది ఈ కొత్త పద్ధతి. దీంతో లభించే ఆదాయంలో భారీ కోత పడుతుంది. దీంతో నిర్మాతలకి ఏం చేయాలో తోచడం లేదు.

        ఇదిలా వుంటే పాపులర్  హీరోలతో పెద్ద బ్యానర్లు నిర్మించే పెద్ద సినిమాల ప్రసార హక్కుల్ని ఓటీటీలు పోటీలు పడడం కొత్త ట్రెండ్‌గా మారింది. మలయాళ స్టార్ మోహన్‌ లాల్ తో 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న మరక్కర్ అనే సినిమా హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో 60-70 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

        అమెజాన్ ప్రైమ్ ఇలా కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంలో ఆశ్చర్యం లేదు.  స్టార్ సినిమాల్ని స్ట్రీమింగ్ చేస్తే సబ్ స్క్రైబర్లు పెరుగుతారని వ్యూహం. అదే చిన్న సినిమాలకి సబ్ స్క్రైబర్లు ఏమీ పెరగడం లేదు. దీంతో ఓటీటీలు స్టార్ సినిమాలవైపు పరుగులు తీయడం మొదలు పెట్టాయి. మోహన్ లాల్ నటించిన ‘లూసివర్’ ని అమెజాన్ స్ట్రీమింగ్ చేసినప్పుడు భారీ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు చేరినట్టు సంస్థ వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన తమిళ స్టార్ సూర్య నటించిన ‘జై భీమ్’ చూడడానికి కొత్త సబ్‌స్క్రైబర్‌లు పెరిగారు.

        ఈ పరిణామాల్లో చిన్న సినిమాలు కనీసం థియేటర్లలో నైనా ఆకర్షించాలంటే క్వాలిటీ కంటెంట్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు నిపుణులు. ఇక్ఫాయ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో వెల్లడైన అంశాలే ఇందుకు నిదర్శనం. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలని నిర్ణయించుకునే ముందు సినిమా కంటెంట్‌ పై సానుకూల సమీక్షల కోసం చూస్తున్నారని పరిశోధన వెల్లడించింది. సినిమా కంటెంట్‌ పై రివ్యూలు యావరేజ్ లేదా బ్యాడ్‌గా వుంటే, థియేటర్లలో చూడకూడదని భావిస్తున్నారు. కంటెంటే ప్రధానాంశంగా మారింది.

        ఓటీటీల్లో ఒక భాష కాదు, వందలాది భాషల దేశ దేశాల సినిమాలు విడుదలవుతున్నాయి. చాలా వరకూ ఇవి డిజిటల్ మహా సముద్రంలో మరుగున పడిపోతున్నాయి. వీటిని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆన్ లైన్లో రికమెండేషన్ ఇంజిన్లు వున్నాయి. ఇవి ప్రేక్షకుల అభిరుచుల ప్రకారం ఎంపిక చేసిన సినిమాల్ని దృష్టికి తెస్తున్నాయి. ఆన్ లైన్లో సెర్చింగ్, స్క్రోలింగ్ చేయడం తప్ప వ్యూయింగ్ చేయని జనరేషన్, రికమెండేషన్ ఇంజిన్లు సూచించే సినిమాలని కూడా చూడాలని ఆసక్తి కనబర్చడం లేదు.

        ఆన్ లైన్లో వ్యూయింగ్ ఆప్షన్లు అసంఖ్యాకంగా పెరిగిపోవడంతో, ప్రేక్షకులు వాటితో పోటీ పడి సమయమంతా సినిమాలకి వెచ్చించలేని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే ఓటీటీలకి అర్ధంగావడం లేదు. భాష, జానర్, నటులు, దర్శకులు వంటి ప్రేక్షకుల అభిరుచుల్ని బట్టి రికమెండేషన్ ఇంజిన్లు సినిమాల్ని ప్రేక్షకుల దృష్టికి తెస్తాయి. ఇందుకోసం 35 పై బడిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి పది భాషల్లో, 1, 50,000 సినిమాలు, 30,000 షోలు ప్రేక్షకుల ముందుంచుతున్నాయి. ఇంత భారీ కంటెంట్ బజార్లో చిన్న సినిమాలు ఎవరి దృష్టిలో పడతాయి. ఈ పరిస్థితి మలయాళ సినిమా రంగానికి సంకటంగా మారింది.

        ఇటు తెలుగులో చిన్న సినిమాల పరిస్థితీ ఇంతే. నవంబర్ లో 26 సినిమాలు థియేటర్లలో విడుదలైతే అన్నీ ఫ్లాపయ్యాయి. కాస్త గుర్తింపు వున్న రాజ్ తరుణ్, ఆనంద్ దేవరకొండ సినిమాలకి కూడా ప్రేక్షకుల్లేరు. ఓటీటీల్లో చూద్దామనే ఉదాసీనతే. ఓటీటీ దాకా ఎన్ని చిన్న సినిమాలు వెళ్తాయో చెప్పలేని పరిస్థితి. వెళ్తే అక్కడా రెవెన్యూ నమ్మకం లేదు. చిన్న సినిమాలని థియేటర్లలోనే ఆడించుకోవాలంటే అద్భుత కంటెంట్ ని ఆవిష్కరిస్తూ వుండాలి. జీరో కంటెంట్ తో కునారిల్లుతున్న చిన్న సినిమాలు మ్యాజికల్ కంటెంట్ కి ఎదగడమనేది కలలోని మాటే!

***

Monday, November 29, 2021

1097 : టిప్స్

   వెంకటేష్, మీనా, వాళ్ళిద్దరి కూతుళ్ళుగా నటించిన కృతిక, ఎస్తర్ ల దృశ్యం 1’, దృశ్యం 2 లు చూస్తే మూడు థ్రిల్లర్ నవలలు గుర్తుకొస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత థ్రిల్లర్ మాస్టర్ జేమ్స్ హేడ్లీ ఛేజ్ రాసిన నవలలు- ఏన్ ఏస్ అప్ మై స్లీవ్ (1971), ది జోకర్ ఇన్ ది ప్యాక్ (1975), ఐ హోల్డ్ ది ఫోర్ ఏసెస్ (1977) ... ఈ మూడు నవలల్లో హెల్గా రాల్ఫ్ అనే మల్టీ మిలియనీర్ నడివయసావిడ, ఆమె ప్రత్యర్ధి మాజీ లవర్ జాక్ ఆర్చర్ వుంటారు. మొదటి నవల్లో లైంగిక కోర్కెలు ఎక్కువున్న హెల్గా, ఆమె మల్టీ మిలియనీర్ భర్త హెర్మన్ రాల్ఫ్, ఆమె లవర్ జాక్ అర్చర్ పరిచయ మవుతారు.

        ర్చర్ ప్లాను ప్రకారమే హెర్మన్ ని పెళ్ళి చేసుకుంటుంది హెల్గా. రాల్ఫ్ దగ్గరున్న సంపదని కొట్టేసే ప్లాను. కానీ ఆమె మనసు మార్చుకుని ఎదురు తిరుగుతుంది. ఆర్చర్ కి మండిపోయి ఆమెని రకరకాలుగా ఇరికించి సంపద కొట్టేయాలని చూస్తాడు. అతడికంటే తెలివైన ఆమె ఎక్కడా దొరకదు. చివరికి ఓడిపోయిన ఆర్చర్ రెండో నవల్లో తిరిగి వచ్చి ఆమె లైంగిక కోర్కెలకి ఒక కుర్రాణ్ణి ఎరగా వేసి ఇంకో ప్లాను అమలు చేస్తాడు. అక్కడా ఆమె దొరక్క ఓడిపోతాడు. మూడో నవల్లో ఇంకో ప్లాను... ఇలా మొదటి నవల, దాని రెండు సీక్వెల్స్ ఊపిరిబిగబట్టి చదివింపజేసే సస్పెన్స్ తో, థ్రిల్స్ తో వుంటాయి... హెల్గా రాల్ఫ్ క్లాసిక్ పాత్ర  దృశ్యం 1’, దృశ్యం 2 లలో అదే హత్య కేసులో పోలీసులకి దొరక్కుండా పథకా లేసే వెంకటేష్ పాత్ర లాంటిదే. ఇక్కడ పోలీసులైతే, నవలల్లో జాక్ ఆర్చర్ ప్రత్యర్ధి.

        ఇక మలయాళంలో దృశ్యం 3 కూడా తయారవుతోంది. ఒకే నట వర్గంతో ఇంత ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఈ మధ్యకాలంలో రాలేదు. చెప్పొచ్చేదేమంటే, పై మూడు ఛేజ్ నవల్స్ ని తెలుగులో ట్రయాలజీగా తీయొచ్చు. 
 

      2. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ స్క్రిప్టు రాయిస్తున్నప్పుడు కథలో ప్రతీ బీట్ నీ క్షుణ్ణంగా వర్కౌట్ చేస్తాడు.  పాత్రలు ఎందుకున్నాయి, ఎలా వున్నాయి అనే కారణాలతో బాటు, కథని ముందుకు నడపడానికి పాత్రలు ఏం చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనే చర్యల్ని నిర్ణయిస్తాడు (కారణం -కాజ్, చర్యలు- ఎఫెక్ట్... కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ రెండే కథని ముందుకు నడిపించగలవు). ఆ తర్వాత తను చేయనవసరం లేని తక్కువ ప్రాధాన్యం గల పనిని రచయితలకి వదిలేస్తాడు. రచయితలు డైలాగులు నిపడం మొదలెడతారు. పాత్రలు ఏం మాట్లాడాలో బీట్స్ లోంచే పుడతాయి కాబట్టి ఆ తేలిక పనిని రచయితలకి వదిలేస్తాడు. పరిగెడుతున్న హీరోయిన్ని హీరో పట్టుకున్నాడనుకుందాం. హీరోయిన్ ఎక్కడికి పరిగెడుతోందో బీట్స్ లో రాసి వుంటారు కాబట్టి, హీరో ఎందుకు పట్టుకున్నాడో కూడా రాసే వుంటారు కాబట్టి, డైలాగులు వాటికవే వచ్చేస్తాయి. హీరో డబ్బుకోసం ఆమెని పట్టుకున్నాడని, హీరోయిన్ ఆ డబ్బుని విలన్ కివ్వాలని పరుగెడుతోందని రాసి వుంటే, అప్పుడు హీరో- 'డబ్బిలా ఇయ్యి!' అంటాడు. 'ఇవ్వను, వాడి కివ్వాలి!'  అంటుంది హీరోయిన్. ఇలా డైలాగులు పెరుగుతూ వుంటాయి. ఇలా డైలాగులతో కథ నడపడాన్ని ఇష్టపడడు కాబట్టి హిచ్ కాక్, పాలిష్ చేస్తారు. పరిగెడుతున్న హీరోయిన్ని హీరో పట్టుకుని పెనుగులాడి డబ్బు లాక్కుంటాడు. 'వాడికియ్యక పోతే వాడు చంపుతాడు!' అని అరుస్తుంది. ఐతే చావమన్నట్టు ఆమెని ముందుకు తోసేసి వెళ్ళిపోతాడు. కథని విజువల్ గా చెప్తే ఛాయాగ్రహణం బావుందని అంటాం. విజువల్ రైటింగ్ చేసినప్పుడే డైలాగు వెర్షన్ బావుందని అంటాం.

     
      3. మనం పుట్టక మునుపు 'దొంగ రాముడు' (1955) స్క్రీన్ ప్లే ముచ్చట్లు చూద్దాం. ఆ రోజుల్లోనే ఇంత గొప్పతనం పుట్టించారు. ఎవరు? దర్శకుడు కెవి రెడ్డి, రచయిత డివి నరసరాజు. ప్రారంభంలో చిన్న దొంగ రాముడు తల్లికి మందుల కోసం దొంగగా పట్టుబడి, తల్లి మరణించి, చెల్లెలు ఆనాథ అవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపుగా వుంటుంది. దీని తర్వాత కథ - అంటే  మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో చిన్న దొంగ రాముణ్ణి బాల నేరస్థుల కేంద్రంలో వేస్తారు. దీనికి మ్యాచింగ్ సీనుగా అటు చెల్లెలు లక్ష్మిని అనాధాశ్రమంలో చేర్పిస్తారు. వెంటనే దీని తర్వాతి సీనులో అనాధాశ్రమం నుంచి కాలేజీకి బయల్దేరుతున్న పెద్దయిన లక్ష్మి (జమున ఎంట్రీ) ని చూపిస్తారు. ఆ వెంటనే అటు బాలనేరస్థుల కేంద్రంలో కారు తుడుస్తున్న పెద్దయిన దొంగరాముణ్ణి (అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ) చూపిస్తారు. ఈ మ్యాచ్ కట్స్ తో టైం లాప్స్ అంతా చూపించేస్తారు. అంతేగానీ కాల చక్రం గిర్రున తిరిగినట్టు వలయాకారంలో చూపించే ఎలాటి ఆప్టికల్స్ లేవు. తర్వాత్తర్వాత ఆప్టికల్స్ తో ఎడిటింగ్ కాలుష్యమయ మవుతూ ఆఖరికి ఏమైందంటే, ఇప్పుడు ఆప్టికల్స్ అంటేనే  చిరాకుపడే పరిస్థితి ప్రేక్షకులకి కూడా వచ్చిందని ఇటీవల ఒక ఎడిటర్ చెప్పారు. దృశ్యాలు శుభ్రంగా, సహజంగా వుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారనీ, నటుల భావోద్వేగాల్ని ఎడిటింగ్ తో డిస్టర్బ్ చేయకుండా, పదేసి షాట్లు వేయకుండా- ఒక్క స్టడీ షాట్ తో ఏకాగ్రతని పెంచేలా వుంటే ప్రేక్షకులకి నచ్చుతోందని చెప్పుకొచ్చారు.

       4. నేను మిస్టరీలు తీయనుసస్పెన్సులే తీస్తానన్నాడు సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎందుకంటే మిస్టరీల్లో కూర్చోబెట్టే థ్రిల్ వుండదు. చివర్లోనే కథేమిటోఅసలేం జరిగిందో సస్పెన్స్ అంతా ఓపెనవుతుంది. అంతవరకూ ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడమే. ఇలా కాక సస్పెన్స్ కథలో ఇప్పుడేం జరుగుతుందోఇంకేం జరుగుతుందో నన్న అనుక్షణ యాక్షన్ లో వుంటుంది సస్పెన్స్. మిస్టరీలు జడప్రాయమైన ఎండ్ సస్పెన్స్ లైతేసస్పెన్సులు చైతన్యవంతమైన  సీన్ టు సీన్ ఉత్కంఠ రేపే సస్పెన్సులు. కాబట్టి హిచ్ కాక్ మిస్టరీలు ఎందుకు తీయనన్నాడో అసలంటూ అర్ధమైతేఎండ్ సస్పెన్స్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోరు. కానీ మన ఇండియన్ సినిమాల్లో అదేం అలవాటో గానీమర్డర్ కథ అనగానే వీరావేశంతో ఎండ్ సస్పెన్స్ మిస్టరీలు తీసెయ్యడమే. సస్పెన్స్ అంటే చిట్ట చివరి వరకూ రహస్యం దాచడమే అనుకుంటున్నారు. ఇది తప్పు.


     5. అంతంత మాత్రం కాన్ఫ్లిక్ట్ తో లైటర్ వీన్ ప్రేమలే తీయడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తున్నారే తప్ప, అవి అట్టర్ ఫ్లాపవుతున్నాయని తెలుసుకోవడం లేదు కొత్తగా విడుదలైన  అనుభవించు రాజా సహా. ఇక ఇష్టమైనట్టు తీసుకోమని చెప్పాల్సి వచ్చింది. ఈ లైటర్ వీన్ సినిమాల వీర భక్తుల్ని కాపాడేందుకు ఏం చేయొచ్చాని ఆలోచిస్తూ, బ్లాగులో పాత రివ్యూలు తిరగేస్తూంటే, మలయాళ మహేషింటే ప్రతీగారం(‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య -తెలుగు) కంటబడింది. ఇందులో ఒక పరిష్కారమేదో కనబడుతోంది. ఇది తేలికపాటి కాన్ఫ్లిక్ట్ తో వుండే కథ. ఇందులో హీరోకి తనని కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టాలని గోల్. ఇంతే, చిన్నపాటి కారణంతో కాన్ఫ్లిక్ట్. స్వల్ప కారణాన్ని పట్టుకుని కథంతా నడిపితే సిల్లీగా వుంటుంది. అందుకని కొట్టిన వాడు దుబాయ్ వెళ్ళి పోతాడు. హీరో చేసేది లేక వాడు  వచ్చాకే కొడదామని ఇతర వ్యాపకాల్లో పడిపోతాడు. ఆ ఇతర వ్యాపకాలు ఇద్దరు భామలతో ప్రేమలు, వాటి అతీగతీ, ఫోటోగ్రఫీలో తండ్రి నుంచి ఇంకాస్త జ్ఞానం, కుంగ్ ఫూ నేర్చుకోవడం, ఇతర కార్యక్రమాలు వగైరా వగైరా. ఇక కొట్టిన వాడు దుబాయి నుంచి రాగానే క్లయిమాక్స్ లో వాణ్ని కుంగ్ ఫూతో పబ్లిగ్గా కొట్టి పడేసి, పోయిన పరువు తిరిగి రాబట్టుకుంటాడు. అంటే స్వల్ప కారణంతో వున్న కాన్ఫ్లిక్ట్ పెండింగులో లేదా రిజర్వులో వుండేలా ప్రత్యర్ధిని కథలోంచి పంపేసి, హీరోకి ఇతర వ్యాపకాలు కల్పిస్తే, కథ రీఫ్రెష్ అయి వ్యాపకాలతో కొత్త కథనాలు పుట్టి కాన్ఫ్లిక్ట్ ని మరిపిస్తాయన్న మాట. అప్పుడు క్లయిమాక్స్ లో ప్రత్యర్థిని కథలోకి రీ ఎంట్రీ ఇప్పించి, హీరోతో ఫైటాఫైటీ పెట్టేస్తే సరిపోవచ్చన్న మాట. లైటర్ వీన్ ప్రేమ కథలు విడిపోయి కలుసుకోవడమే గా. విడిపోయినప్పుడు ఆ హీరోయిన్నో, హీరోనో ఎక్కడికో  పంపేసి, ఉన్న హీరోయినుకో,  హీరోకో ఇతర వ్యాపకాలు, లేదా కొత్త జీవితమేదో కల్పించి నడుపుతూ, విడిపోయిన శాల్తీని  క్లయిమాక్స్ లో లాక్కొచ్చి  పెండింగులో పెట్టిన కాన్ఫ్లిక్టు తేల్చేసి అచ్చిబుచ్చి తీర్చేస్తే సరిపోతుందన్న మాట. మూడున్నర కోట్లతో తీస్తే 38 కోట్లు వచ్చినందుకైనా ఈ మలయాళాన్ని ఫాలో అయితే ఎంతో కొంత మంగళ వాద్యాలేనన్న మాట!

—సికిందర్

 

Sunday, November 28, 2021

1096 : రివ్యూ


 

దర్శకత్వం : మహేష్ మంజ్రేకర్
తారాగణం : సల్మాన్ ఖాన్
, ఆయుష్ శర్మ, మహిమా మక్వానా, సచిన్ ఖెడేకర్, జీశ్శూ సేన్ గుప్తా, మహేష్ మంజ్రేకర్ తదితరులు
కథ : ప్రవీణ్ టార్డే
, స్క్రీన్ ప్లే : మహేష్ మంజ్రేకర్, అభిజిత్ దేశ్ పాండే, సిద్ధార్థ్ సాల్వి సంగీతం : రవీ బస్రూర్, ఛాయాగ్రహణం : కరణ్ రావత్
బ్యానర్ : సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్
నిర్మాత  : సల్మాన్ ఖాన్
విడుదల : నవంబర్ 26
, 2021
***

      ల్మాన్ ఖాన్ స్టార్ డమ్ ని, ఫ్యాన్స్ నీ కాసేపు పక్కన బెట్టి, బావగారు ఆయుష్ శర్మతో కలిసి అంతిమ్ = ది లాస్ట్ ట్రూత్ అనే డార్క్ - రియలిస్టిక్ మూవీలో నటించాడు. పరిమిత బాక్సాఫీసు అప్పీలుండే ఈ సినిమాని  పరిమిత బడ్జెట్లోనే తన సంస్థ ద్వారా నిర్మించి ఫలితాన్ని ప్రేక్షకులకి వదిలేశాడు. 2018 లోనే ఆయుష్ ని వెండితెరకి పరిచయం చేస్తూ లవ్ యాత్రీ అనే రోమాంటిక్ డ్రామా నిర్మిస్తే, అది నష్టాలతోనే ముగిసింది. తిరిగి ఇప్పుడు జానర్ ని మార్చి, ఆయుష్ ని పరీక్షకి పెట్టే కరుడుగట్టిన క్రిమినల్ పాత్రలో రీలాంచ్ చేశాడు. ఇలాటి సినిమాల స్పెషలిస్టు మహేష్ మంజ్రేకర్ దర్శకుడుగా రంగంలోకి దిగాడు. మరి సల్మాన్, మంజ్రేకర్ ఇద్దరూ కలిసి ఆయుష్ ని లాంచీ ఎక్కించి తీరం దాటించారా లేదా అనేది చూద్దాం...

కథ

రాహుల్యా (ఆయుష్ శర్మ) పుణె సమీపంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులతో, చెల్లెలితో నివసిస్తూంటాడు. తండ్రి దత్తా (సచిన్ ఖెడేకర్) కూతురి పెళ్ళి కోసం తక్కువ ధరకి పొలం అమ్మేస్తాడు. పొలం కొన్న షిండే అనే అతను ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటే, అక్కడ వాచ్ మాన్ గా చేరతాడు దత్తా. ఒక రోజు షిండే దత్తాతో దురుసుగా ప్రవర్తించి ఉద్యోగంలోంచి తీసేస్తాడు. దత్తా కుటుంబంతో పుణె వెళ్ళిపోయి కూరగాయల మార్కెట్ లో కూలీగా చేరతాడు. అక్కడ సాల్వీ (విజయ్ నికమ్) అనే కార్పొరేటర్ అనుచరులు మామూళ్ళ కోసం సత్య (మహేష్ మంజ్రేకర్) అనే కూలీని కొడతారు. ఇది చూసి రాహుల్యా, అతడి ఫ్రెండ్ గణ్య (రోహిత్ హల్దీకర్), సాల్వీ అనుచరుల్ని కొట్టి అరెస్టవుతారు.

        స్థానిక పోలీస్ స్టేషన్ లో రాజ్ వీర్ సింగ్ (సల్మాన్ ఖాన్) స్ట్రిక్టు ఇన్స్ పెక్టర్ గా వుంటాడు. అరెస్టయిన రాహుల్యానీ, గణ్యనీ జైలుకి పంపిస్తాడు. జైల్లోనే వున్న కార్పొరేటర్ సాల్వీ అనుచరులు రాహుల్యా, గణ్యల మీద దాడి చేస్తారు. స్థానిక గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ (ఉపేంద్ర లిమాయే) అడ్డుకుంటాడు. రాహుల్యా, గణ్యా తనకి పనికొస్తా రన్పించి బెయిలు మీద విడిపిస్తాడు.

        ఇక కార్పొరేటర్ సాల్వీకి ఎలాగైనా బుద్ధిచెప్పాలనుకున్న రాహుల్యా, అనుకోకుండా అతణ్ణి చంపేస్తాడు. దీంతో జైలు కెళ్ళిన రాహుల్యా, గణ్యలని మళ్ళీ బెయిలు మీద విడిపిస్తాడు నాన్యా భాయ్. ఇక రాహుల్యా కూరగాయల మార్కెట్లో రైతుల హక్కుల కోసం పోరాడతాడు. ఈ పోరాటంలో నాన్యా భాయ్ కూడా చేతులు కలిపి రాహుల్యాని మార్చేస్తాడు. రాహుల్యా నుపయోగించుకుని పేద రైతుల భూముల్ని చిల్లర ధరలకి కొనేసుకుంటాడు. ఇది గమనిస్తున్న సత్య, నీ తండ్రి పొలాన్ని కూడా నాన్యా, షిండేకి తక్కువ ధరకే అమ్మించాడు, అమ్మకపోతే నీ చెల్లెల్ని చెరుస్తానని బెదిరించాడనీ  చెప్పడంతో రాహుల్యాకి కనువిప్పవుతుంది. ఇప్పుడు నాన్యా ప్రత్యర్ధి అంబీర్ అనే ఎమ్మెల్యే వచ్చి, రాహుల్యాకి ఒక సూచన చేస్తాడు - నాన్యాని చంపేయమని.

        ఇదీ విషయం. ఇప్పుడు రాహుల్యా గుంటనక్క నాన్యాని చంపేశాడా? ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ ఏం చేస్తున్నాడు? పుణెకి కొత్త గ్యాంగ్ స్టర్ గా మారబోతున్న రాహుల్యాని ఆపాడా? పుణెలో గ్యాంగ్ స్టర్స్ అందర్నీ అంతమొందించడానికి అతను పన్నిన పథకమేమిటి? ఈ పథకంలో రాహుల్యా కూడా చిక్కుకున్నాడా? ఈ ఇద్దరి మధ్య పోరాటం ఏ ముగింపుకి దారి తీసింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2018 లో విడుదలైన ముల్షీ పాటర్న్ అనే మరాఠీకి రీమేక్. మహారాష్ట్రలో పట్టణ, నగర శివారు రైతులు పెట్టుబడి దార్ల వొత్తిడికి లొంగి పొలాలు అమ్ముకుని కూలీలుగా మారుతున్న పరిణామాలకి, నేర ప్రపంచపు కథ జోడించి మరాఠీ రియలిస్టిక్ గ్యాంగ్ స్టర్ గా తీశారు. దీని దర్శకుడు ప్రవీణ్ టార్డేకి మంచి పేరొచ్చింది. బాలీవుడ్ సినిమాల ప్రభావానికి దూరంగా, అలాటి వాసనలు లేని పక్కా మరాఠా నేపథ్యంతో  తెరకెక్కించాడు. అయితే మేకింగ్ మరాఠా ముద్రే అయినా, కథాకథనాలు బాలీవుడ్ గ్యాంగ్ స్టర్/మాఫియా కథల టెంప్లెట్ ని దాటి వెళ్ళక పోవడం లోపం. ఐతే ఇంకేం, ఇది మన బాలీవుడ్ కథేగా అనుకునేమో, సల్మాన్, ఆయుష్ తో కలిసి ఈ ప్రాంతీయ సినిమా రీమేక్ లో నటించి, నిర్మించేందుకు ముందుకొచ్చాడు. ఇది సల్మాన్ లెవెల్ పాత్ర కాదు, సినిమా కూడా కాదు. ఆయుష్ కి చేయూత నివ్వడానికి దీన్ని చేపట్టాడు. సల్మాన్ సోలోగా రియలిస్టిక్ లో నటించాలనుకుంటే  జై భీమ్ లో సూర్య పాత్ర లాగైనా కనీసం వుండాలి. 

        మరాఠీ నేటివిటీ తప్ప బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ టెంప్లెట్ లోనే తీసిన ముల్షీ పాటర్న్ ని బాలీవుడ్డే రీమేక్ చేయడంతో చూస్తే కొత్తగా ఏమీ వుండదు. అప్పట్లో రాంగోపాల్ వర్మ తీసిన హిందీ  కంపెనీ ముగింపు కూడా మరాఠీలో వుంది. అదే మళ్ళీ ఈ హిందీలో చూపించారు.  కాకపోతే ఈ తరహా కథలో గ్యాంగ్ స్టర్ గా ఒకే ఒక్క సినిమా అనుభవమున్న ఆయుష్ తీరం చేరాడా, మునిగాడా అన్నదే పాయింటు.

నటనలు- సాంకేతికాలు

ఆయుష్ ది ప్రధాన పాత్ర. పల్లె నుంచి ఉపాధి వెతుక్కుంటూ పుణె చేరి అక్కడ సంఘ విద్రోహక శక్తులతో తలపడి, తానే సంఘ విద్రోహక శక్తిగా మారే పాత్ర. రాహుల్యాగా ఈ పాత్రలో నటించడానికి మరాఠీ వొరిజినల్లో నటించిన రెండు సినిమాల అనుభవమున్న ఓం భూట్కార్  రిఫరెన్స్ ఎలాగూ వుంది, మంజ్రేకర్ గైడెన్స్ కూడా వుంది. ఈ రెండిటినీ పాత్రలో తనని తీర్చిదిద్దుకోవడానికి వినియోగించుకున్నాడు. కమర్షియల్ నటన కంటే రియలిస్టిక్ నటనకి ఎక్కువ స్కిల్స్ అవసరం. దీనికి ఫిజికల్ గా, ఎమోషనల్ గా పూర్తి మేకోవర్ తో - పది సినిమాల అనుభవమున్న హీరో లాగా పవర్ఫుల్ గా నటించేశాడు రియలిస్టిక్ పాత్రని. నిస్సహాయుడైన పల్లెటూరి వాసి నుంచి నగర వాసిగా, గ్యాంగ్ స్టర్ గా, పోలీసుల్ని ఎదిరించే రెబెల్ గా పాత్ర ఎదుగుదల క్రమంలో భిన్న భావోద్వేగాల ప్రదర్శన ఈజీగా చేసేశాడు. మధ్యలో హీరోయిన్ మహిమా మక్వానాతో రోమాంటిక్ యాంగిల్ కూడా. ఇలా సల్మాన్, మంజ్రేకర్ లు ఎక్కించిన లాంచీలో తీరం దాటేశాడు. ఇక బాలీవుడ్ యాక్షన్ హీరోగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకోవచ్చు. అమీర్ ఖాన్ కూడా 1985 లో ఖయామత్ సే ఖయామత్ తక్ (యుగాంతం నుంచి యుగాంతం దాకా) అనే సూపర్ హిట్ మ్యూజికల్ రోమాంటిక్ డ్రామాతో ప్రవేశించి, రెండో సినిమా రాఖ్ (బూడిద) అనే రియలిస్టిక్ లో నటించి జాతీయ అవార్డు పొందాడు. 

        మరాఠీలో ఉపేంద్ర లిమాయే నటించిన ఇన్స్ పెక్టర్ పాత్ర సల్మాన్ నటించాడు. అదే ఉపేంద్ర ఈ హిందీ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ గా నటించాడు. ఇది మరాఠీ పాత్రే. కానీ సల్మాన్ సిక్కు పాత్రగా మార్చాడు. హిందీ సినిమాల్లో సీరియస్ సిక్కు పాత్రల్ని చూసి చూసి బోరు కొట్టేసే పరిస్థితి వచ్చింది. సిక్కులు హాస్య ప్రియులు కూడా. ఒకప్పుడు హిందీ సినిమాల్లో హాస్యం గానే సిక్కు పాత్రలుండేవి. సర్దార్జీ జోకులని పుస్తకాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ జర్నలిస్టు ఖుష్వంత్ సింగ్ శాంటా-బాంటా అనే రెండు తెలివి తక్కువ సిక్కు క్యారక్టర్లని సృష్టించి, అదే పనిగా సెటైర్లు రాసేవాడు. 1980లో ఫిరోజ్ ఖాన్ సూపర్ హిట్ ఖుర్బానీ లో గబ్బర్ సింగ్ అమ్జాద్ ఖాన్, క్యారట్ నమిలే ఇన్స్ పెక్టర్ గా జంటిల్ మాన్ హాస్యంతో లాండ్ మార్క్ పాత్రగా చేసి పెట్టాడు.  అదే అమ్జాద్ ఖాన్ 1980 లోనే లవ్ స్టోరీ లో మంద బుద్ధి కానిస్టేబుల్ గా చేసిన కామెడీ మర్చిపోలేరు.

        సల్మాన్ సిక్కు ఇన్స్ పెక్టర్ కి ఇలా కాస్త కామిక్ టచ్ వుండాల్సింది. బావ బావమరుదులిద్దరూ సినిమాని యమ సీరియస్ చేసేస్తే ఎలా. ఓపెనింగ్స్ 4.5 కోట్లే వచ్చాయి. దీని ముందు జాన్ అబ్రహాం మతిమాలిన మాస్ సత్యమేవ జయతే 2 కి 3.6  కోట్లు మాత్రమే వచ్చాయిగా అని సంతోషించాలేమో.


నేనూ మహారాష్ట్ర లోనే పుట్టాను. కానీ నీలాగా గూండాని కాలేదు, గూండాలకి బాబు నయ్యాను -పోలీస్ వాలా ...నువ్వు పుణెకి కొత్త భాయ్ వి, నేను నీ కంటే ముందే హిందూస్తాన్ కే భాయ్ ని ... ఎక్కడెక్కడ సర్దారో అక్కడక్కడ గురుద్వారా, లంగర్’… ‘సర్దార్ని నేను, వాహేగురు ముందే తల వంచుతాను లాంటి ఇమేజి సెట్టింగ్ సీరియస్ మాస్ డైలాగులున్నాయి. మానభంగమైన అమ్మాయి మీద సల్మాన్ తలపాగా తీసి కప్పే మెలోడ్రామా సీనొకటి.

        పోటాపోటీగా షర్టులు విప్పి బావ బావమరుదులు కొట్టుకునే సీను ఆయుష్ సిక్స్ ప్యాక్ చూపించడానికే. ఇంకెన్ని సార్లు ఇలా సిక్స్ ప్యాక్ చూపిస్తారు? ప్యాంటు విప్పి తొడగొడితే సరైన వీరత్వమవచ్చు.  గ్యాంగ్ స్టర్స్ ని అంత మొందించడానికి సల్మాన్ పాత్ర పన్నే వ్యూహం హిందీ సినిమాల్లో ఆల్రెడీ వచ్చేసిందే. ఆయుష్ ని ప్రమోట్ చేయడానికి సల్మాన్ పాత్రని పరిమిత స్కోపుకి తగ్గించుకున్న దృశ్యం కన్పిస్తోంది.

        హీరోయిన్ మహిమా మక్వానా హిందీ గ్యాంగ్ స్టర్ / మాఫియా సినిమాల్లోని రొటీన్ టెంప్లెట్ పాత్రే. గ్యాంగ్ స్టర్ ని ప్రేమించి భంగపడే పాత్ర. రాజకీయాల్లో ప్రత్యర్ధుల కుటుంబాల్ని రచ్చకీడ్చే దుర్నీతి వున్నట్టు మాఫియాల్లో వుండదు. మనం పరస్పరం కుటుంబాల జోలికి పోవద్దని మాట్లాడుకుంటారు. ఇదే హిందీ సినిమాల్లోనూ చూస్తాం. మాఫియాలు బయట ఎన్ని అన్యాయాలు చేస్తారో, కుటుంబాల్ని అంతగా ప్రేమించే సన్నివేశాలు మాఫియా సినిమాల్లో అందుకే వుంటాయి. అయితే మాఫియాల రణ నీతితో సురక్షిత కుటుంబ జీవితాల్ని అనుభవించే మాఫియాల ఇంటి ఆడపడుచులు, తమ భర్తలకి జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు, ఎందుకని పోరాటానికి దిగరన్నది మాఫియా సినిమాల్లో హీరోయిన్ల పాత్రల్ని చూస్తే ఎదురయ్యే ప్రశ్న. ఆయుష్ కోసం మహిమా పోరాటానికి దిగి, అతడితో పాటే అంతమై వుంటే, ఆమె హీరోయిన్ పాత్రకి వాస్తవిక దృక్పథాన్ని కల్పిస్తూ, టెంప్లెట్ చెర నుంచి బైట పడేసి నట్టయ్యేది.


ఒరిజినల్లో ఇన్స్ పెక్టర్ పాత్ర పోషించిన ఉపేంద్ర లిమాయే, ఈ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ గా కన్పిస్తాడు. ఈ పాత్రని ఒరిజినల్లో దర్శకుడు ప్రవీణ్ టార్డే పోషించిన తీరు చూస్తే ఉపేంద్ర తేలిపోతాడు. అదే ఒరిజినల్లో ఉపేంద్ర పోషించిన ఇన్స్ పెక్టర్ పాత్ర చూస్తే సల్మాన్ తేలిపోతాడు. రీమేక్ అన్నాక తేలిపోవడం మామూలే.

        సాంకేతికంగా జానర్ డిమాండ్ ని బట్టి  డార్క్ మూడ్ విజువల్స్ తో వుంది. కలర్ థీమ్ మాత్రం అతి డిమ్ గా కన్పిస్తుంది. కెమెరామాన్ కరణ్ రావత్ యాక్షన్ సీన్స్ కి కమర్షియల్ షాట్స్ తీయకుండా, బ్రేక్ లేకుండా తీవ్రత ఫ్లో అవడానికి నార్మల్ టేకింగ్ తీసుకున్నాడు. క్లయిమాక్స్ లో రన్నింగ్ హీరో ఛేజ్ దృశ్యాలకి నార్మల్ టేకింగ్ తో మంచి టెన్షన్ బిల్డప్ చేశాడు. అజయ్ దేవగణ్ నటించిన ప్రకాష్ ఝా అపహరణ్ (2005) లో యాక్షన్ దృశ్యాలు గుర్తొస్తాయి. కేజీఎఫ్ చాప్టర్-1 సంగీత దర్శకుడు రవీ బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు మూవీ జానర్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ వుంది. జానర్ ని బట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోరు సృష్టించడం అరుదు. తెలుగులో అన్ని సినిమాలకీ ఒకటే దరువు.

        ఇరవై ఏళ్ళుగా దర్శకుడుగా వున్న 30 సినిమాల మహేష్ మంజ్రేకర్ అవుట్ డేటెడ్ అవకుండా మేకింగ్ చేశాడు. కాకపోతే ఒరిజినల్లో వున్న అసలు కాన్సెప్ట్ ని మిస్సయ్యాడు.

చివరికేమిటి

ముల్షీ పాటర్న్ మరాఠీ ఒరిజినల్ ని రైతు ఉద్యమం లేని 2018 లో నిర్మించారు. అయినా నేటి రైతు ఉద్యమం దృష్ట్యా ఇది ఇప్పటికీ సమకాలీనంగా వుంది కాన్సెప్ట్ తో. మంజ్రేకర్ - సల్మాన్ ద్వయం నేటి సంచలన రైతు ఉద్యమకాల నేపథ్యంలో రీమేక్ విడుదల చేస్తూ ఒరిజినల్లోని కాన్సెప్ట్ నే మిస్సయ్యారు. లేకపోతే రైతు ఉద్యమం ప్రతిబింబించే బలంతో సమకాలీనంగా వుండేది. ప్రేక్షక బలాన్నీ పెంచుకునేది.

        ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ సింగ్ గా సల్మాన్ వాయిసోవర్ తో ఈ రియలిస్టిక్ ప్రారంభమవుతుంది. పట్టణ, నగర శివార్లలో బలవంతులు బొటాబోటీ ధరలకి రైతుల పొలాలు లాక్కుని బలపడుతున్నారనీ చెబుతూ, పొలాలు అమ్ముకున్న రైతులు ఆ డబ్బు నిలుపుకోలేక నగరాలకి వెళ్ళి కూలీలుగా మారుతున్నారనీ, అలాటి ఒక కుటుంబ కథే ఇదనీ స్టాంపు వేశాక- కథా నాయకుడు రాహుల్యా కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ లో ఇదంతా బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ / మాఫియా రెగ్యులర్ టెంప్లెట్ లోనే రొటీన్ గా వుంటుంది.

        అయితే ఒరిజినల్లో ఇది మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో వుంటుంది. మంజ్రేకర్ దీన్ని ఎత్తేసి లీనియర్ కథ చేశాడు. రెండిట్లో విషయం మాత్రం అదే. విషయం లేనప్పుడు కథని నిలబెట్టడానికి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో మభ్య పెట్టకూడ దంటాడు సిడ్ ఫీల్డ్. ఒరిజినల్లో మభ్య పెట్టడమే వుంది. రీమేక్ లో మంజ్రేకర్ మభ్యపెట్టకుండా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు ఎత్తేసి, సీదా కథగా సాపు చేసి ఇస్త్రీ చేసినా అదే ఫలితం. విషయ లేమితో విలవిల. ఎన్నిసార్లు ఈ టెంప్లెట్ నే చూడలేదు. మొన్న పూరీ జగన్నాథ్ తనయుడి రోమాంటిక్ లోనూ మాఫియాగా మారే క్రమం ఈ టెంప్లెట్టే.

        టెంప్లెట్ లో వరసగా ఎబిసీడీలు : ఏ - తండ్రి పొలం అమ్ముకుని దెబ్బతిన్నాక కుటుంబంతో పుణె వెళ్ళి కూరగాయల మార్కెట్లో కూలీగా తండ్రితో బాటు చేరతాడు రాహుల్యా, బి - అక్కడ కార్పొరేటర్ అనుచరులని కొట్టి జైలుకి పోతాడు రాహుల్యా, సి- జైల్లో కార్పొరేటర్ అనుచరుల్ని కొట్టి గ్యాంగ్ స్టర్ నాన్యా దృష్టిలో పడతాడు రాహుల్యా, డి- నాన్యా బెయిలు మీద విడిపిస్తే కార్పొరేటర్ ని చంపి మళ్ళీ జైలుకి పోతాడు రాహుల్యా, ఎఫ్ - మళ్ళీ నాన్యా బెయిలు మీద విడిపిస్తే నాన్యాని చంపేసి అతడి స్థానంలో గ్యాంగ్ స్టర్ అవుతాడు రాహుల్యా... ఈ టెంప్లెట్ తోనే ఫస్టాఫ్ లో గ్యాంగ్ స్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే కథ వుంటుంది. ఇతణ్ణి అదుపు చేయాలనుకుంటున్న ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ కీ, రాహుల్యాకీ  ఫైట్ సీను ఇంటర్వెల్ గా వుంటుంది.  

        ఇంకో రెండు గ్యాంగ్ స్టర్ గ్రూపులుంటాయి. ఇక ఈ మొత్తం అందర్నీ రూపు మాపడానికి రాజ్ వీర్ వాళ్ళ ఇగోలతో వాళ్ళల్లో వాళ్ళకే తంపులు పెట్టి ఆడుకునే ఆట సెకండాఫ్. ఇక్కడ కథ ఎటూ వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సీను తర్వాత కథ సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి మొరాయిస్తున్నట్టు వుంటుంది. ఇక క్లయిమాక్స్ లోనే శత్రు గ్యాంగ్ తో రాహుల్యా యాక్షన్ సీనుతో వూపందుకుని ముగుస్తుంది. ఈ ముగింపు వర్మ కంపెనీ మార్కు ముగింపు కావడంతో షాకింగ్ గా ఏమీ వుండదు. ఒక పిల్ల వాడు వచ్చేసి రాహుల్యాని అకస్మాత్తుగా కాల్చి చంపి కథ ముగించడం. 


మరాఠీ హిట్ సైరత్ ముగింపు లాగా - రక్తపు మడుగులో తల్లిదండ్రుల శవాల్ని చూసిన పిల్లవాడు రక్తపు అడుగుజాడల్ని సృష్టిస్తూ వెళ్ళిపోయే మరపురాని క్లోజింగ్ ఇమేజిలా వుంటుందనుకుని – ఇలా పిల్లవాడితో చంపించినట్టుంది మరాఠీ ముల్షీ పాటర్న్ లో.       


        మంజ్రేకర్ దాన్నే తీసుకోవడంతో ముగింపు వర్కౌట్ కాలేదు. కంపెనీ లో ఈ క్లాసిక్ ముగింపు చూడని ప్రేక్షకులకి బాగానే వుండొచ్చు. కంపెనీ కథా క్రమంలో మనం పూర్తిగా మర్చిపోయే విజయ్ రాజ్, ముగింపు చివరి క్షణంలో మెరుపులా అనూహ్యంగా ప్రత్యక్షమై, అజయ్ దేవగణ్ ని షూట్ చేసి చంపి- షాకింగ్ ముగింపు నిస్తాడు. కథా క్రమంలో విజయ్ రాజ్ ని మనం ఎక్కడో పూర్తిగా మర్చిపోయేలా చేసిన వర్మ నేర్పు వల్ల, ఈ మాస్టర్ స్ట్రోక్ సాధ్య పడింది.

ఇదలా వుంచితే, అసలు మరాఠీ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమిటి? పొలాలు అమ్ముకుని పతనమవుతున్న రైతులకి కనువిప్పు కల్గించడం. రేపు పార్లమెంటులో రద్దు కాబోతున్న మూడు రైతు చట్టాల్లో వ్యవసాయం కార్పొరేట్ల వశమై రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళే కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి సరే, చట్టాలు రాకముందు రైతులు చేస్తోందేమిటి? పొలాలు అమ్ముకుని కూలీలుగా వలస వెళ్ళడం. మరాఠీ ఒరిజినల్ ఈ వైఖరిని ఖండిస్తోంది. మంజ్రేకర్ దీన్ని టచ్ చేయకుండా ప్రాణంలేని గ్యాంగ్ స్టర్ కథ చేశాడు.

        చివరికి రాహుల్యా చనిపోయాక, తండ్రి పడీ పడీ పిచ్చినవ్వు నవ్వుతాడు. నా కొడుకు చచ్చి పోయాడు కాబట్టి ఇక గ్యాంగ్ స్టర్ గా వుండడూ - అని.  విషాదం. అయితే క్లోజింగ్ షాట్ టాప్ యాంగిల్లో, వాన జల్లు పడకుండా రాహుల్యా శవానికి జనం గొడుగులు పడుతున్నట్టు వుంటుంది. ఇలాటి కథ ఇక కోరుకో వద్దని చెప్పకుండా, గ్యాంగ్ స్టర్ ని గ్లోరిఫై చేస్తున్నట్టు వుంది గొడుగులు పట్టడం ...

(మరాఠీ ఒరిజినల్ కూడా చూడాల్సి రావడం వల్ల రివ్యూ ఆలస్యం)

—సికిందర్