రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 20, 2021

1039 : రివ్యూ


 దర్శకత్వం : రమేష్ రాపర్తి 
తారాగణం : అనసూయా భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనికా రెడ్డి, వివా హర్ష, అనీష్ కురువిల్లా, అన్నపూర్ణమ్మ తదితరులు
కథ : రమేష్ రాపర్తి, నియీ అఖిన్ మోలయాన్  ఛాయాగ్రహణం : ఆర్ సురేష్
బ్యానర్ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు :  మాగుంట శరత్ చంద్రా రెడ్డి, బొమ్మిరెడ్డి తారకా నాథ్
విడుదల : ఆహా, మే  7, 2021

***

        కోవిడ్ -2 తో తిరిగి థియేటర్ల ప్రదర్శనలు నిలిచి పోవడంతో సినిమాలకి ఓటీటీల అవసరం తప్పడం లేదు. ఓటీటీ సీను ఇప్పుడు మారింది. బడ్జెట్ కూడా చేతికి రానంతగా రైట్స్ నిర్ణయిస్తున్నారని వినికిడి. నాణ్యత లేని సినిమాలు తీసి ఓటీటీలతో లాభపడ్డమే దీనికి కారణం. ఒకప్పుడు శాటిలైట్ సినిమాలతో ఇదే చేసి బహిష్కృతులయ్యారు. గుణాత్మకంగా మేకర్లలో మార్పు వస్తేగానీ మంచి రోజులు వచ్చేలా లేవు.

      ఈ క్రమంలో కోవిడ్ రెండో విడత తాకిడిలో మొదటి ఓటీటీ విడుదలగా థాంక్యూ బ్రదర్ ప్రేక్షకుల ముందు కొచ్చింది. అయితే గత సంవత్సరం ఇదే పరిస్థితుల్లో లేనంతగా భయం నీడన ఇప్పుడు మనుషులు జీవిస్తున్నారు. రెండో విడత తీవ్రత అలా వుంది. వాతావరణంలో ధైర్యాన్ని నింపే వైబ్రేషన్స్ లేవు. ధైర్యాన్ని నింపే, లేదా భయాన్ని మరిపించే వైబ్రేషన్స్ తో కూడిన కంటెంట్ నివ్వడం ఇప్పుడు సినిమాల కవసరం. థాంక్యూ బ్రదర్ ఈ పని చేయగల్గీ చేయలేకపోయింది.  దీన్ని నైజీరియన్ మూవీ ఎలివేటర్ బేబీ (2019) కి రీమేక్ గా తీసినట్టు తెలుస్తోంది. రమేష్ రాపర్తి కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించింది. విరాజ్ అశ్విన్ ఇంకో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను గత సంవత్సరం మనసా నమః అనే షార్ట్ ఫిలిం లో నటించి పరిచయమయ్యాడు. 

        కథలో వీళ్ళిద్దరూ అపరిచితులు. ప్రియ (అనసూయ) గర్భవతి. భర్త చనిపోయాడు. అతను పని చేసిన కంపెనీ నుంచి చెక్కు తీసుకోవడానికి ఓ అపార్ట్ మెంటు కొస్తుంది. అభి (విరాజ్) బాగా డబ్బున్న ఆవారా బ్యాచి. అదే అపార్ట్ మెంటుకి ఒక పని మీద వస్తాడు. ఇద్దరూ పని ముగించుకుని వెళ్తూ లిఫ్ట్ లోకి ప్రవేశిస్తారు. ఆ లిఫ్ట్ మధ్యలో పాడయి ఆగిపోతుంది. ఆమెకి నొప్పులు ప్రారంభమై ఏం చేయాలో అర్ధంగాదు. ఇప్పుడేమిటన్నది మిగతా కథ.

***

    ఈ నైజీరియన్ కథని తెలుగుకి మార్చినప్పుడు అలవాటు చొప్పున అదే మూసకి పాల్పడ్డారు. పాడిందే పాడరా అన్నట్టు... ఔటాఫ్ బాక్స్ ఐడియాలకి కూడా మూస టెంప్లెట్లు వాడేస్తే ఏం చేస్తాం. కాలం, కాలంతో బాటు ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులూ గమనించే ఆసక్తి లేక, ఇలా పాత నమూనాలే చూపిస్తూ కూర్చోవడం.


        ఇద్దరు అపరిచితుల్ని లిఫ్ట్ లో ఇరికించిన ఈ కథకి ఫ్లాష్ బ్యాక్స్ తో పూర్వరంగం ఏర్పాటు చేశారు. ఫస్టాఫ్ మొత్తం ఈ మూస ఫ్లాష్ బ్యాక్స్ సహన పరీక్ష పెడతాయి. పైగా ఇది హీరో కథయినట్టు, కొత్త హీరోకి అనసూయకి మించి 40 నిమిషాల ఫ్లాష్ బ్యాక్! ఈ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి చనిపోయిన హీరో, రెండో పెళ్ళి చేసుకున్న తల్లి మాట వినక, ఫ్రెండ్స్ తో తాగుడు పార్టీలతో ఆవారాగా గడుపుతాడు. బాగా డబ్బున్న వాడే అయినప్పటికీ ఏ పనీ చేయకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది. తల్లి వొత్తిడి కూడా పెరిగేసరికి, ఇక ఏదైనా పని చూసుకోవాలని ఒక ప్రపోజల్ తో తండ్రి పాత మిత్రుడ్ని కలవడానికి అపార్ట్ మెంట్ కెళ్తాడు. ఎన్నోసినిమాల్లో చూసి చూసి వున్న ఆవారా హీరో ఫస్టాఫే ఇక్కడా దర్శనమిస్తుంది. ఇంతకన్నా విషయం లేదు ఫస్టాఫ్ లో. ఫస్టాఫ్ స్క్రిప్టంతా బడ్జెట్ వృధా అని తెలిసిపోతోంది.

        మరో వైపు కాసేపే అనసూయ ఫ్లాష్ బ్యాక్. ఈమెది దిగువ మధ్య తరగతి కుటుంబం. భర్త వుంటాడు. తల్లి వుంటుంది. కంపెనీలో పని చేస్తున్న భర్త చనిపోతాడు. తను గర్భవతి. భర్త తాలూకు డబ్బులు తీసుకోవడానికి హీరో వెళ్ళిన అపార్ట్ మెంట్ కే  వెళ్తుంది. ఇద్దరూ అక్కడ లిఫ్ట్ ఆగిపోయి అందులో ఇరుక్కుంటారు.

***

        ఈ కథని నాన్ లీనియర్ గా ఫ్లాష్ బ్యాక్స్ చేసి చెప్పడంతోనే కొంపమునిగింది. దర్శకుడు ఓపెనింగ్ బ్యాంగ్ గా బావుంటుందనుకుని ఫీలైనట్టు, లిఫ్ట్ లో ఇరుక్కునే సీను ముందే చూపించేస్తూ సినిమా ప్రారంభించాడు. కథాక్రమంలో డెవలప్ అయి దాని సమయంలో అది రావాల్సిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఓపెనింగ్ వేయడంతో, ఇప్పుడే కథేమిటో తెలిసిపోయింది! ఇలా ప్రారంభంలోనే  లిఫ్ట్ సీను వేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతో ముందేం జరుగుతుందో కథ తెలిసిపోవడమేగాక, ఈ సీను తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వల్ల  ఏ సస్పెన్సూ కూడా లేకుండా పోయింది. ఇంటర్వెల్లో వేయాల్సిన లిఫ్ట్ సీను అనాలోచింతంగా సినిమా ఓపెనింగ్ లో వేసేస్తూ ఘోరమైన పొరపాటు చేసి - సినిమా మొత్తాన్నీ నీరు గార్చేశాడు.

        ఇలా కాకుండా, ఎలివేటర్ బేబీ లో లీనియర్ గానే కథ చెప్పాడు. దీనివల్ల ముందేం జరుగుతుందో తెలీదు. డిజాస్టర్ జానర్ మూవీ కథనం ఇలాగే వుంటుంది. లీనియర్ గా హీరో కథ, హీరోయిన్ కథా చూపించుకుంటూ వెళ్ళి, లిఫ్ట్ లో ఇరికించి అప్పుడు ఇంటర్వెల్  బ్యాంగ్ ఇచ్చాడు. దీని నిడివి గంటన్నర కూడా లేదు కాబట్టి, తెలుగులో చూపించిన హీరో హీరోయిన్ల పూర్వరంగమే ఇందులో ఎక్కువ నస పెట్టకుండా చప్పున ముగిసిపోతుంది.

***

   ఇక లిఫ్ట్ లో ఇరుక్కున్నాక సెకండాఫ్ మరీ బలహీనంగా వుంది. ఆమె నొప్పుల బాధ, అతడి మొండి తనం. ఈ కథకి అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర కాదని ఎందుకనో నిర్ణయించారు. బాక్సాఫీసు అప్పీల్ గురించి ఆలోచించకుండా కొత్త వాడైన విరాజ్ అశ్వినే కథానాయకుడనుకున్నారు. అందుకే ఫస్టాఫ్ లో 40 నిమిషాల పాటూ అతడితో వృధా ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఆవారాగా, మానవత్వం లేకుండా వున్న అతను మారడం గురించిన కథ అనుకున్నారు కాబట్టి, అతనే కథానాయకుడయ్యాడు. ఒక మొండివాడు, ఆవారా మంచివాడుగా ఎలా మారాడన్నది ఈ కథతో చెప్పాలనుకున్న అతి పురాతన మూస విషయం. ఇది ఈ రోజుల్లో వర్కౌటయ్యే ఐడియాయేనా? అతను మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. సెల్ ఫోన్ చేతిలో వున్న నేటి యూత్ ప్రోయాక్టివ్ కథ కావాలి గాని. ఇలా ఇరుక్కున్న పరిస్థితిలో మాతృత్వం ప్రమాదంలో వుందని హీరో రెస్పాండ్ అయి ఒక్క మెసేజ్ కొడితే, పోలోమని వందమంది యూత్ మాతృత్వం కోసం వచ్చేసి లిఫ్ట్ లోంచి కాపాడతారు. ఇంత స్పష్టంగా అపాయంలో మాతృత్వం కనపడుతోంటే, ఇంకెవరో హీరో మారడం గురించి కథేమిటి బాక్సాఫీసు వ్యతిరేకంగా? హీరో మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. అతగాడి సొంత జీవితం ఎవరికవసరం.

        గత సంవత్సరం లాక్ డౌన్ లో ఢిల్లీ శివారులో హోటల్ నడవక ముసలాయన ఒకాయన వాపోతూంటే, వీడియో తీసి పోస్ట్ చేశాడొక యూత్. అంతే, అది వైరల్ అయి నిమిషాల్లో వందలాది  యూత్ ఎక్కడెక్కడ్నించో వచ్చేసి, కోలాహలంగా హోటల్లో ఉన్నదంతా తినేసి, గల్లా పెట్టె పట్టనంత డబ్బులు వేసి వెళ్ళారు. యూత్ నెట్వర్క్ ని తక్కువ అంచనా వేయకూడదు. యూత్ తో ఇన్స్పైర్ అయి కథ చేయాలి. సాయం చేయడానికి సెల్ ఫోన్ యూత్ ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటున్న కాలమిది. ఇందుకు దాహరణలు కోకొల్లలు.

        ఈ లిఫ్ట్ కథ కి లాక్ డౌన్ కాలాన్ని నేపథ్యంగా పెట్టారు. అందువల్ల ఆపరేటర్, మెకానిక్ ఎవరూ అందుబాటులో లేనట్టు చూపించారు. ఒకరంటే ఒకరికి పడని ఆ రెండు పాత్రల మధ్య అనవసర ఘర్షణ, అనవసర క్యారక్టర్ ఎనాలిసిస్ లు చూపించారు. ఇదికాదు కావాల్సింది. కావాల్సింది భయాన్ని పోగొట్టే డిజాస్టర్ మేనేజ్ మెంట్. హీరో కొన్ని కాల్స్ చేసి వుంటే, నొప్పులు పడుతున్న ఆమె కోసం  అంబులెన్స్ వస్తుంది, డాక్టర్లు వస్తారు, వైద్య సిబ్బంది, పోలీసులూ వస్తారు, యూత్ సరే, వాళ్ళ హీరోయిజం ఎలాగూ వుంటుంది. ఇలా లాక్ డౌన్లో అందరూ మనతో వుంటారని ధైర్యం చెప్పే నేటి ఆశాజనక కథ కావాలిగానీ, ఎవరో హీరో మంచివాడుగా మారి చివరికి చిటికెడు సాయం చేసిపోయే కాలం చెల్లిన కథ ఎవరిక్కావాలి.

***

        ఎలివేటర్ బేబీ' లో పాలనా వ్యవస్థ మీద విమర్శలు గుప్పించడం వుంటుంది. లిఫ్ట్ కథకి వీటితో సంబంధమేమిటాని సినిమా మీద ఒక నైజేరియన్ రివ్యూ చదివితే విషయం అర్ధమైంది. నైజేరియూలో పాలనా వ్యవస్థ ఎలా వుంటుందో ఆ రివ్యూకర్త రాసుకొచ్చాడు. అక్కడ ఏ శాఖా ఏదీ పట్టించుకోదు. రోడ్లు, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు  అడ్డగోలుగా వుంటాయి. ఏ శాఖ వాడూ దేన్నీపట్టించుకోడు. రిపేరుకు రమ్మంటే ఏడాది కొస్తాడు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడో టిఫిను తింటూ వుంటాడు. కరెంటు పోతే, పోతే పోయిందను కుంటాడు. ప్రజలకి నానా ఇక్కట్లు, టెన్షన్. ఇలాటి పాలనా యంత్రాంగం వల్లే కథలో లిఫ్ట్ లో ఇరుక్కుని నానా పాట్లు పడ్డారన్న మాట. నైజేరియన్ లిఫ్ట్ కథకి ఇదీ నేపథ్యం. సహజ నేపథ్యం. అందుకని లిఫ్ట్ లో ఇందుకు తగ్గట్టు టెన్షన్ తో కూడిన వ్యవస్థ బాధిత డ్రామా. నైజేరియన్ దర్శకులు అక్కడి పాలనా యంత్రాంగం ప్రస్తావన లేకుండా సినిమాలు తీయలేరని రివ్యూలో రాసుకొచ్చాడు.

         తెలుగు రీమేక్ కథకి ఈ నేపథ్యం వుండే అవకాశం లేదు. మన పాలనా యంత్రాంగం లంచాలతో దివ్యంగానే నడుస్తూ వుంటుంది. దీనికి లాక్ డౌన్ నేపథ్యంతో చెక్  పెట్టి, బైటి సాయాన్ని మూసేసి కథ నడిపారు. ఇది బెడిసికొట్టింది. సెల్ ఫోన్ చేతిలో వున్న హీరో అలా వూరికే కూర్చోడు. లాక్ డౌన్ అంటే పరస్పరం సహించుకోవడమని ఉజ్వలమైన కథ నడిపించగలడు యూత్ నెట్వర్క్ తో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ.  

***

      ఈ కథ డిజాస్టర్ జానర్ మూవీ కథగా వుండాల్సింది. టవరింగ్ ఇన్ఫెర్నో, ది డే ఆఫ్టర్ టుమారో, ఇండిపెండెన్స్ డే, ట్విస్టర్, కంటేజియన్... ఇలా ఏ డిజాస్టర్ మూవీ తీసుకున్నా ఒకే టెంప్లెట్లో వుంటాయి. ఈ టెంప్లెట్ ని మార్చి ఇంకో విధంగా చేయలేరు. ముందుగా పాత్రల ప్రశాంత జీవితాలు, వాటి కలలు, ప్రమాద సూచనలు, ప్రమాదం, కలల భగ్నం, ప్రాణాల కోసం ప్రమాదంతో పోరాటం, విజయం, తిరిగి ప్రశాంతత... ఈ జానర్ బీట్స్ తోనే వుంటాయి.


        అనసూయ పాత్ర కథగా చేసి ఆమె జీవితం చూపించుకొస్తూ, గర్భంలో వున్న బిడ్డ కోసం కోవిడ్ బారిన పడకుండా ఆమె జాగ్రత్తలు చూపిస్తూ, లాక్ డౌన్ టైమ్ లో తప్పనిసరై హాస్పిటల్ కెళ్ళి లిఫ్ట్ లో ఇరుక్కుని బయటపడే ప్రమాద సూచనలు చూపిస్తూ, ఇంకో చోట హీరోతో భౌతిక దూరం గురించి గొడవపడడం చూపిస్తూ, హీరో ఎవరో చెప్పకుండా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చూపిస్తూ, అపార్ట్ మెంట్లో ఆమెనీ హీరోనీ లిఫ్ట్ లో ఇరికించి, ఇప్పుడేమిటి?’ అన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో పైన చెప్పుకున్న డిజాస్టర్ మేనేజిమెంట్ రియలిస్టిక్ కథగా  నడపకుండా, ఉపయోగం లేని మూస కథ చేశారు. హీరో ఎవరనేది, అతడి సమస్యలేమిటన్నది చివర్లో చెప్పవచ్చు. దేర్ విల్ బి బ్లడ్ హాలీవుడ్ మూవీలో హీరో ఎవరనేది ఏ తగిన సమయంలో (టైమింగ్), దేంతో ముడిపెట్టి చెబితే కథకి కిక్ వస్తుందో, ఆ తగిన సమయం సెకండాఫ్ లో వరకూ చెప్పలేదు. దీంతో సెకండాఫ్ లో ఇంకో కొత్త కథా లోకం ఆవిష్కృతమైంది. లక్షల మంది కోసం తీసే సినిమా కథ అనేది బహుళ కోణాల్లో ఆలోచించాల్సిన డైనమిక్స్ తో కూడిన కాసుల రూపం.

సికిందర్

 

Monday, May 17, 2021

1038 : రివ్యూ


 రచన - దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
తారాగణం: సందీప్ వారణాసి, వికాస్ వశిష్ట, రాగ్ మయూర్, సింధు, సిరివెన్నెల తదితరులు
సంగీతం : ఎస్. శిరీష్, ప్రవీణ్ రెడ్డి, ఛాయాగ్రహణం : అపూర్వ సాలిగ్రాం, సాగర్
బ్యానర్ డి 2 ఆర్ ఇండీ
నిర్మాతలు: రాజ్ నిడుమోరు, కృష్ణ డికె
విడుదల:  మే 14, 2021, నెట్ ఫ్లిక్స్
***

         ఇండీ ఫిలిం గా సినిమాబండి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇండీ ఫిలిమ్స్ తో కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తున్న డి 2 ఆర్ ఇండీ సంస్థ అధినేతలు దీన్ని నిర్మించారు. సహజత్వానికి దగ్గరగా సినిమాని తీసికెళ్ళాలన్న అభిరుచి సినిమా బండి ఆద్యంతం కన్పిస్తుంది. ఇటీవల కంబాలపల్లి కథలు తో ఇదే చూశాం. ఓటీటీలో క్వాలిటీ సినిమాలకి ఢోకాలేదని ఇప్పుడు  సినిమా బండి తో నిరూపించే ప్రయత్నం. అయితే  సినిమా బండి కంటెంట్ కి సంబంధించినంత వరకూ దాదా సాహెబ్ ఫాల్కే లాంటి ప్రయత్నం. కానీ ఈ కొత్త దర్శకుడి ఈ ప్రయత్నంలో కామన్ సెన్సుతో కూడిన వాస్తవికత కూడా వుండాల్సింది. కామన్ సెన్స్ లేకుండా కమర్షియల్ సినిమా కూడా రాణించదు. సెల్ ఫోన్లతో వూరూరా షార్ట్ ఫిలిమ్సే తీసేయడం అందరికీ తెలిసిన విషయమై పోయాక, వీడియో కెమెరాని అదేదో దివినుంచి వూడిపడిన దివ్యవరంగా ఆశ్చర్యపడి, దాంతో సినిమా తీయాలన్న అమాయకత్వాన్ని ప్రదర్శించడం ఈ కథలో కన్విన్సింగ్ వుందా ఆలోచించాల్సిన విషయం.

        మేకింగ్ సంగతి తర్వాత, ముందు రైటింగ్ ఎంత ముఖ్యమో ఇప్పుడు కూడా మైథిలీ ఇండీ ఫిలిం గమక్ ఘర్, నాగమీస్ ఇండీ ఫిలిం నానా -ఏ టేల్ ఆఫ్ అజ్ నిరూపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తున్నాయి. ఇంటలిజెంట్ రైటింగే ఇండీ ఫిలిమ్స్ కి ప్రాణం. సినిమా బండి లాంటిదే కన్నడలో తీసిన పల్లెటూరి ఫన్నీ కథ తిధి, కొత్త దర్శకుడి ఇంటలిజెంట్ రైటింగ్ తో, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ స్క్రీన్ ప్లేతో, 20 వరకూ జాతీయ, అవార్డులతో పేరుకి పేరూ డబ్బుకి డబ్బూ సంపాదించుకుంది. దేశంలో 30 కి పైగా ప్రాంతీయ భాషల్లో ఇండీ ఫిలిమ్స్ తీస్తూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని నాకర్షిస్తున్నారు. ఒక్క తెలుగులోనే తెలుగు మూస సినిమాల ప్రభావం నుంచి బయటికి రాలేక, ఇండీ ఫిలిమ్స్ మార్కెట్ యాస్పెక్ట్ ని లోకల్ గానే  తక్కువ చేసి చూస్తున్నారు. సినిమా బండి కథలో దొరకాల్సింది ఎవరో మర్చిపోయిన ఓ వీడియో కెమెరా కాకుండా, ఎవరో పారేసుకున్న ఆస్కార్ అవార్డు ఫారిన్ లాంగ్వేజీ మూవీ స్థాయి స్క్రిప్టూ, ఆ స్క్రిప్టుతో అమాయక జనం సినిమా తీసేయాలనుకునే వైరల్ ఐడియా అయివుండాల్సింది! వైరల్ ఐడియాల నిచ్చే హయ్యర్ ఇంటలిజెన్స్ ఇలాటి  లో - బడ్జెట్ ఇండీ ఫిలిమ్స్ వీక్షణాసక్తిని శిఖర స్థాయికి పెంచుతాయని గుర్తుంచుకోవాలి. ఇందుకు తెలుగు ఇండీ మేకర్లు ఫారిన్ సినిమాలు మానేసి, ముందు వివిధ ప్రాంతీయ సినిమాలు చూసి వాస్తవ జీవితాల్ని పరిశీలించాల్సిన  అవసరం చాలా వుంది. 

***

      కొత్త దర్శకుడు, అతడి రచయితలూ విషయ పరంగా వాస్తవికతకి దూరంగా వున్నా, దృశ్యపరమైన వాస్తవికతని మాత్రం పోషించారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో వీరబాబు (వికాస్ వశిష్ట) అనే ఆటోడ్రైవర్ వుంటాడు. అతడికి ఓ రోజు ఆటోలో ఎవరో మర్చిపోయిన ఎస్ ఎల్ ఆర్ కెమెరా దొరుకుతుంది. అర్ధంగాక దాన్ని విచిత్రంగా చూసి భార్యకి చూపిస్తే, ఆమే ఆశ్చర్యంగా చూస్తుంది. వూళ్ళో ఒక పెళ్ళిళ్ళ  ఫోటోగ్రాఫర్ గణపతి (సందీప్ వారణాసి) వుంటే అతడికి చూపిస్తాడు. అతనూ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోలేక పోతాడు. దాన్ని పదివేలకి అమ్మేసి ఆటో ఫైనాన్స్ తీర్చేయాలనుకుంటాడు వీరబాబు. కానీ టీవీలో చిన్న సినిమాల సక్సెస్ గురించి చూసి, ఆ కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించాలని నిశ్చయించుకుంటాడు. గణపతిని కెమెరామాన్ గా నియమించుకుంటాడు. సినిమా తీయడానికి ఒక ముసలి తాత (ముని వెంకటప్ప) రాసిన కథ దొరుకుతుంది. ఈ కథకి హీరోగా బార్బర్ మరిడయ్య (రాగ్ మయూర్) దొరుకుతాడు. హీరోయిన్ గా స్టూడెంట్ దివ్య (త్రిషారా) ని సెలెక్టు చేసుకుంటాడు. ఇక షూటింగ్ ప్రారంభిస్తాడు. ఈ షూటింగ్ మధ్యలో హీరోయిన్ దివ్య ఒకడితో లేచిపోతుంది...ఇప్పుడేం చేయాలో అర్ధం గాక ఇరకాటంలో పడతాడు వీరబాబు...

***
   ఈ కథలో ఇంకా ఆటోలో కెమెరా మర్చిపోయిన సిటీ గర్ల్ సింధు గా సింధూ శ్రీనివాస మూర్తి వుంటుంది. కథకి ఈమే ముగింపు నిస్తుంది. ఈమె క్యారక్టర్ ఎలా వున్నా, నటన బావుంది. ఆటో డ్రైవర్ వీరబాబు భార్య గంగోత్రిగా సిరివెన్నెల యలమందల నటించింది. వీరబాబు ఆటో నడపకుండా సినిమా తీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఈమె, తర్వాత అర్ధం జేసుకుని సహకరిస్తుంది. వీరబాబు సినిమా మధ్యలో ఆగిపోయాక, ఈమెతో ఒక దృశ్యం మౌన భాష్యం చెబుతుంది. ఇంట్లో వీర బాబు చూస్తూండగా అతడి షర్టు వేసుకుని, తలకి తువ్వాల చుట్టుకుని, ఆమె బయటికెళ్ళే  మాటలు లేని మూకీ దృశ్యం ఆమె కూలి పనికి వెళ్లడానికి సిధ్ధ పడిందని చెప్పకనే చెప్తుంది. ఈ దృశ్యం సినిమా మొత్తం మీద గుర్తుండి పోయే టాప్ సింబాలిక్ దృశ్యం. కానీ ఉండాల్సిన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే అర్ధరహితం.

        మొదటి హీరోయిన్ లేచిపోయాక రెండో హీరోయిన్ గా కూరగాయలమ్మే మంగ (వై జి ఉమ) వుంటుంది. ఈమెది కూడా బలమైన స్త్రీ పాత్రే. షూటింగ్ గ్యాప్ లో అక్కడే బుట్ట పెట్టుకుని కూరగాయ లమ్ముతుంది. సొంత జీవితంతో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇలాగే లేచిపోయిన మొదటి హీరోయిన్ గా త్రిషారా కి ప్రియుడితో లేచిపోయి సొంత జీవితం చూసుకోవడమే ముఖ్యం. ఇలా ఈ పల్లెటూరి స్త్రీ పాత్రలు ఒక వ్యక్తిత్వంతో కన్పిస్తాయి.

        కథ రాసిన ముసలి తాతగా ముని వెంకటప్పకి మాటలుండవు. షూటింగు ఎలా  జరుగుతోందో గమనిస్తూ వుంటాడు. ఈ తాత క్యారక్టర్ తీరు కన్నడ తిధి లో తాత క్యారక్టర్ లా వుంటుంది. కథ వేరు. తాత రాసిన ప్రేమ కథ పేరు తాత రాసిన టైటానిక్ అని చివర్లో రివీల్ చేయడం బావుంది. దీన్నే సినిమా టైటిల్ గా పెట్టి వుండాల్సింది. 

     ఆటో డ్రైవర్ గా, సినిమా దర్శకుడుగా వీరబాబుగా వికాస్ వశిష్టది పూర్తిగా అమాయకత్వంతో కూడిన పాత్రే, నటనే. ఎంత బాగా పాత్రలో లీనమైపోయినా ఆ అమాయకత్వం ఒప్పించేలా వుండదు. ఇలా సినిమా తీసి కోట్లు గడించాలన్న అన్ రియలిస్టిక్ గోల్ ని వూళ్ళో అందరూ నమ్మడం ఇంకో ఇబ్బంది పెట్టే విషయం. ఆ కోట్ల డబ్బుతో(!) వూళ్ళో రోడ్డు, కరెంటు, నీటి సౌకర్యాలు కల్పించాలన్న కలలు మరీ చోద్యంగా వుంటాయి.

        అతడి నైతిక విలువలు కూడా ప్రశ్నార్ధకమే. ఎక్కడో ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు దుర్బుద్ధితో వుంటారేమో గానీ, సర్వసాధారణంగా తమ ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువుల్ని వీలుంటే వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడమో, లేకపోతే పోలీసులకి అప్పజెప్పడమో చేస్తారు. వీర బాబు ఇవేమీ చెయ్యక, దాన్ని అమ్మేసి ఆటో మీద అప్పు తీర్చేయాలనుకుంటాడు. తర్వాత దాంతో సినిమా తీసి కోట్లు గడించాలనుకుంటాడు. ఆ కెమెరాలో దాని ఓనర్ సింధు తాలూకు వీడియోల్లో ఆమె కన్పిస్తున్నా గుర్తు పట్టనట్టే వుంటాడు. చివరికి ఆమె వెతుక్కుంటూ వచ్చాక సారీ కూడా చెప్పడు. ఇలా ఈ ప్రధాన పాత్ర చిత్రణ విలువలు లేకుండా దుర్బుద్ధితో కన్పిస్తుంది.

    కెమెరా కోసం ఆమె పోలీసుల చుట్టూ, వూళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని వచ్చిన ఆమె, కారు వదిలేసి ఆటో ఎందుకు ఎక్కిందో తెలీదు. ఆటో ఎక్కినట్టు కూడా ఆమెకి గుర్తుండదు.

        హీరోగా రాగ్ మయూర్ ఫన్నీగా నటించాడు. కెమెరామాన్ గా సందీప్ వారణాసి ఒక్క బండి కాడె మీద కూర్చుని క్రేన్ షాట్ తీయడం తప్ప, వేరే స్కిల్స్ కెమెరాతో ప్రదర్శించడు. అసిస్టెంట్ గా బాలనటుడు రాంచరణ్ ఎంట్రీ ఫన్నీ.

        శిరీష్, ప్రవీణ్ రెడ్డి ల సంగీతంలో వ్యంగ్యంగా చేసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ బావున్నాయి. అపూర్వ సాలిగ్రాం, సాగర్ ల ఛాయాగ్రహణం సహజత్వంతో కూడుకుని వుంది. కమర్షియల్ సినిమాల్లో చూపించని అసలైన గ్రామీణులు, వాళ్ళ జీవితాలూ ఎలా వుంటాయో కేరాఫ్ కంచర పాలెం’, కంబాలపల్లి కథలు’, ఇప్పుడు సినిమా బండి తెర కెక్కించడం మంచి పరిణామమే.

***

      రైటింగ్ సైడ్ కొత్త టాలెంట్ కన్పిస్తుంది. స్క్రీన్ ప్లే ప్రవీణ్ కండ్రేగుల, వసంత్ మరింగంటి, కృష్ణ ప్రత్యూష అయితే; మాటలు వసంత్ మరింగంటి. పోతే నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె లు కూడా దర్శకులే కాబట్టి, రచయితలే కాబట్టి, స్క్రిప్టులో వాళ్ళ ఆలోచనలు కూడా వుండి వుంటాయి. ఇది ఇంటలిజెంట్ స్క్రిప్టు కాకపోయినా మూసలో పడని క్వాలిటీ రైటింగ్ గా మాత్రం కన్పిస్తోంది కొన్ని లోపాలతో. ఇది దృశ్యాల వరకూ. ఇక కన్సెప్ట్ పరంగా చూస్తే ఇండీ ఫిలిం డిమాండ్ చేసే ఇంటలిజెన్స్ కనిపించడం లేదు.

        ముందుగా చెప్పుకున్నట్టు ఈ కథ సెల్ ఫోన్లు లేని కాలంలో నైతే వీడియో కెమెరాతో సినిమా తీసే ఆలోచనకి అద్భుతంగా వుండేది. సెల్ ఫోన్లు వచ్చాక ఎవరుపడితే వాళ్ళు షార్ట్ ఫిలిమ్సే తీసేస్తున్నాక, సినిమాకున్న గ్లామర్ పలచ బడ్డాక, ఈ కాలంలో వీడియో కెమెరా అద్భుతమని సినిమా తీయాలనుకోవడంలో సమకాలీనత లేదు. కంబాలపల్లి కథలు లో కంప్యూటర్ తో 2005 నాటి పీరియడ్ కథగా తీసినప్పుడు దానికి కాలీన స్పృహ వుంది. అప్పుడప్పుడే గ్రామాల్లోకి కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు వస్తున్నాయి కాబట్టి ఆ క్రేజ్ పాత్రల్లో కనిపించడంలో సహజత్వముంది. సినిమా బండి లో పాత్రలకి వీడియో కెమెరాతో ఈ కాలంలో అంత వండర్ అనుకోవడం కాన్సెప్ట్ కి వైరల్ ఐడియా మాత్రం కాదు. ఒక పాసివ్ ఐడియా మాత్రమే. వైరల్ ఐడియా కావాలంటే పైనే చెప్పుకున్నట్టు, ఈ అమాయక పాత్రలకి ఎవరో పారేసుకున్న ఆస్కార్ లెవెల్ స్క్రిప్టు  దొరకడమే!  కోతికి కొబ్బరి కాయ దొరకాలి గానీ జామకాయ కాదు.

        వీడియో కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించి వూరుని బాగుచేయాలన్న హీరో గోల్ లో కూడా బలం, వాస్తవికత లేవు. ఇది కంబాలపల్లి కథలు లో రెండు కోట్ల ఫేక్ లాటరీతో కథలాంటి టెంప్లెట్ ఫార్ములా. జానర్ మర్యాద కాదు.

        స్క్రీన్ ప్లే మాత్రం త్రీయాక్ట్స్ ప్రమాణాలతో వుంది. ఫస్టాఫ్ లో మొదటి పావుగంటలో దొరికిన కెమెరాతో సినిమా తీయాలనుకునే గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సెకండావ్ చివర్లో అదే కెమెరా ధ్వంసమయ్యే ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. పరస్పర విరుద్ధంగా ఇవి మంచి డైనమిక్స్ తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని నిలబెట్టాయి. ఇలాటి డైనమిక్సే హీరోయిన్ లేచిపోయి షూటింగు ఆగిపోవడం, తర్వాత షూటింగులో హీరో ఎక్కిన రైలు భువనేశ్వర్ దాకా వెళ్లిపోవడం మొదలైనవి. గోల్ కి అవరోధాలు కల్పించే ప్రత్యర్ధి పాత్ర లేకపోవడం షూటింగులోనే ఆటంకాలేర్పడ్డం మిడిల్ యాక్షన్ - రియాక్షన్ బిజినెస్ ని పోషించాయి. కథ హాస్యప్రధానంగా వున్నా, ఆటంకాలేర్పడ్డప్పుడు ఈ హాస్య ధోరణి వుండదు. డబ్బు సంపాదించడం గోల్ కాబట్టి శాడ్ మూడ్ లోకి జారుకోవడం. ఇదంతా సరైన కాన్సెప్ట్ లేకపోవడం వల్లే.  

        ఒక సరదాగానో, వ్యామోహంగానో, ఫాషన్ తోనో సినిమా తీయడం వరకే గోల్ గా కాన్సెప్ట్ వుండి వుంటే ఈ కథతో అంత ఇబ్బంది వుండేది కాదు. సినిమాతో కోట్లు గడించి బాగుపడాలన్న గోల్ వల్ల కథ కామన్సెన్సుని, వాస్తవికతనీ, అమాయక పాత్రల ఇన్నోసెన్స్ నీ కోల్పోయింది. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 2009 లో తీసిన, ఆస్కార్ ఎంట్రీ సంపాదించిన, మరాఠీ క్లాసిక్ హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ లో ఫాల్కే పాత్రకి ఆర్ధిక ఇబ్బందులున్నా సినిమా తీసి డబ్బు సంపాదించాలన్న కోరిక మాత్రం అస్సలు వుండదు. కేవలం తెర మీద బ్రిటిష్ వాళ్ళు వేసిన సినిమా చూసి, ఆ కదిలే బొమ్మలకి వండరై పోయి, అలాటిది తనూ తీయాలని కేవలం వ్యామోహం పెంచుకుంటాడు.  
   
        ఇంటిల్లిపాదీ ఆ సినిమా తీయడంలో పాలు పంచుకుంటారు. చాలా హాస్య పాత్రలు, హాస్యమైన సన్నివేశాలు. కష్టాలు కూడా హాస్యమే. ఎక్కడా శాడ్ మూడ్ వుండదు. దేశంలో మొట్ట మొదటి సినిమా తీయడానికది ఏ సౌకర్యాలూ లేని కాలం, నటులు కూడా దొరకని కాలం. అలాటి కాలంలో సినిమా పట్ల కేవలం - కేవలం వ్యామోహంతో - సర్వం అమ్ముకుని, 1913 లో రాజా హరిశ్చంద్ర తీసి చరితార్ధుడయ్యాడు దాదా ఫాల్కే. వీరబాబులో ఈ వ్యామోహం లోపించి స్వార్ధం చోటు చేసుకోవడంతో మేకర్స్ తలపోసిన కాన్సెప్ట్ విఫలమైంది.

సికిందర్  

 

Tuesday, May 11, 2021

     అప్పట్లో ఆంధ్రభూమి వెన్నెల్లో రివ్యూలు చూసి విజయవాడ నుంచి ఉత్తరం రాసి వచ్చేశాడు. అప్పట్నుంచీ సినిమాలే జీవితంగా బ్రతికాడు. నవతరంగం వెబ్ సైట్ కి సమీక్షలు రాసేవాడు. సినిమా జ్ఞానాన్ని బాగా పెంచుకున్నాడు. అంతలో అదృశ్యమై పోయాడు. పదేళ్ళ తర్వాత పిడుగురాళ్ళ నుంచి ఫోన్ చేసి, నిర్మాత దొరికాడని, కథ చేసి పెట్టాలని కోరాడు. మళ్ళీ అదృశ్యమైపోయాడు. గత జనవరిలో విజయవాడ నుంచి ఫోన్ చేసి, ఫిబ్రవరిలో విజయవాడలో ఫిలిం స్కూలు పెడుతున్నానని, వచ్చి క్లాసు చెప్పాలని కోరాడు. ఆ ఫిలిం స్కూలు కోసం ఎదురు చూస్తూంటే శాశ్వతంగా అదృశ్యమైపోయాడుపదేళ్ళుగా బాధిస్తున్న కిడ్నీ సమస్య చివరికి ప్రాణాల్ని కోరింది. ఆదిత్య చౌదరి ముల్పూరి కోరికల్ని మాత్రం అలాగే వదిలేసి  తీసికెళ్ళిపోయింది.... 
సికిందర్ 








 


Thursday, May 6, 2021

1037 : రివ్యూ

ఒన్ (మలయాళం)
దర్శకత్వం: సంతోష్ విశ్వనాథ్
తారాగణం :  మమ్ముట్టి, మాథ్యీవ్ థామస్, గాయత్రీ అరుణ్, సలీం కుమార్, మురళీ గోపి, జోజు జార్జ్ తదితరులు
రచన : బాబీ - సంజయ్, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : వైదీ సోమసుందరం
బ్యానర్ : ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్
నిర్మాత : ఆర్ శ్రీ లక్ష్మి
విడుదల మార్చి 26, 2021
***

       దేశంలో  అనేక సమస్యలుంటాయి. సినిమాల్లో   సమస్యలకి సినిమాటిక్ గా పరిష్కారాలు చూపించడం దగ్గరే ఆగి పోతే సరిపోతుందా? సమస్యల పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించే కొత్త ఆలోచనకి తెర తీయకూడదా? కళ్ళ ముందున్న సమస్యని కాక, దాంతో రేపటి కలని చూడగల్గినప్పుడు సినిమాల్ని కొత్త రూపంలో అందించే అవకాశం లభిస్తుంది. లేదంటే ఇలాగే సమస్యల్ని పరిష్కరించే అదే టెంప్లెట్ తో, ప్రయోజనం లేని అవే సోకాల్డ్ కథలతో, రొటీన్ సినిమాలు తీసుకుంటూ అనుద్పాదకంగా గడపాల్సిందే.

          లయాళంలో మమ్ముట్టి నటించిన ఒన్ కోవకే చెందేలా తీశాడు దర్శకుడు సంతోష్ విశ్వనాథ్. తెలుగులో నాంది లో సెక్షన్ 211 చట్టం గురించిన కథని ఎలా చెప్పాల్సిన కథ చెప్పకుండా తీశారో, అలా ఒన్ లో రైట్ టూ రీకాల్ చట్టంతో చేశాడు దర్శకుడు. ప్రజలు తామెన్నుకున్న ప్రజా ప్రతినిధి పనితీరు నచ్చకపోతే, వెనక్కి పిలిచే 'రైట్ టు రీకాల్'‌ చట్టం ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందకుండానే వుంది. పొందదు కూడా. దీని మీద మమ్ముట్టితో రాజకీయ డ్రామాగా తీశారు. ఇదిలా వుంది...

        సనల్ (మాథ్యీవ్ థామస్) ఒక స్టూడెంట్. ఇతడి అక్క సీనా (గాయత్రీ అరుణ్) పార్కింగ్ లాట్ లో వర్కర్. వీళ్ళ తండ్రి దాసప్పన్ (సలీం కుమార్) హోటల్లో వెయిటర్. ఇతను ఒక రోజు అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఆస్పత్రికి సనల్ వెళ్తే అప్పుడే ముఖ్యమంతి కడక్కల్ చంద్రన్ (మమ్ముట్టి) ఆరోగ్య పరీక్షల కోసం రావడంతో, పోలీసులు సనల్ ని పక్కకు తోసేస్తారు. కొడతారు.

       రమ్య (ఇషానీ కృష్ణ) తోటి స్టూడెంట్. ఈమె ఈ సంఘటన గురించి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టమని చెప్తుంది. ఫేక్ ఎక్కౌంట్ సృష్టించి సీఎం కి వ్యతిరేకంగా పోస్టు పెడతాడు సనల్. ఆస్పత్రికి సీఎం రాకపోకల వల్ల తను దౌర్జన్యానికి గురయ్యానని సీఎం ని విమర్శిస్తూ రాస్తాడు. ఇది వైరల్ అవుతుంది. దీంతో ప్రతిపక్ష నాయకుడు జయనందన్ (మురళీ గోపీ) పౌరులకి ఇబ్బంది కల్గించిన సీఎం చర్యకి వ్యతిరేకంగా ఆందోళనకి దిగుతాడు. పోలీసులు సనల్ ని పట్టుకుని సీఎం చంద్రన్ ముందు హాజరు పరుస్తారు. సీఎం సనల్ కి సారీ చెప్తాడు. తనకి ఇలాటి యూతే కావాలని చెప్పి, ఒక టాస్క్ అప్పజెప్తాడు. అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల గురించి ప్రజలేమనుకుంటున్నారో సర్వే చేసి, రిపోర్టు అందించమంటాడు. తన ధ్యేయం రైట్ టు రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడమని వెల్లడిస్తాడు...

***
        ఇదీ విషయం. రైట్ టు రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడం లక్ష్యం. చివరికి పార్లమెంటులో పాస్ అయినట్టు చూపించారు. అసెంబ్లీలో కాలేదని ముగించారు. దీంతో రాజీనామా చేసిన సీఎం చంద్రన్ మళ్ళీ ఎన్నికలు గెలిచి వస్తాడు. ఈ చట్టానికి ప్రజా మద్దతుందని నిరూపిస్తూ. ఇలా ఈ కథ రైట్ టు రీకాల్ ఐడియాతో చెప్పాల్సిన కథగా  కాకుండా పోయింది. రైట్ టు రీకాల్ చట్టం ఆపరేటివ్ పార్టు చూపించక పోవవడంతో, కథగా చెలామణిలోకి రాకుండా వుండి పోయింది. చట్టమెలా మూబడిందో, కథ కూడా అలా మూలబడింది. చట్టం మూలబడ్డ విషయం ఎలాగూ తెలిసిందే, అది మళ్ళీ చూపించడమెందుకు. దర్శకుడు పత్రికలో ఓ ఉత్తరం రాసి గుర్తు చేస్తే పోయే దానికి ఇంత సినిమా తీయాల్సిన అవసరం కన్పించదు.



        చట్టం పాస్ అయినట్టో కానట్టో చూపించడం ఆసక్తికర కథవుతుందా? పాస్ అయితే మనకేంటి, కాకపోతే మనకేంటి. ఉల్లి పెసరట్టు వేస్తానన్నాడు, వేశాడు. అయితే ఏంటి. తినిపించి దాని రుచి చూపించాలి గాని. రుచి చూపించకుండా ఉల్లి పెసరట్టు వేస్తే ఎవరిక్కావాలి, వేయకపోతే ఎవరిక్కావాలి. చట్టం పాసయ్యే ఆసక్తి లేని  కథ ఎవరిక్కావాలి. ఒకవేళ పాసైతే ఆ చట్టం ఎలా అమలయ్యేదో, ఎలాటి పరిణామా లుంటాయో ఆ ఆసక్తికర కథ కావాలి గాని (The big reason so many writers fail here is that they don’t know how to develop the idea, how to dig out the gold that’s buried within it. They don’t realize that the great value of a premise is that it allows you to explore the full story, and the many forms it might take, before you actually write it John Truby). నాంది లో 211 చట్టం తో ఇలాగే చెప్పాల్సిన కథ చెప్పేలేదు. రైట్ టు రీకాల్ చట్టంతో ఒన్ లోనూ చెప్పాల్సిన కథ చెప్పలేదు. ఇదీ సృజనాత్మకంగా ఇంకా కొనసాగుతున్న సినిమా కథల పరిస్థితి. తీసుకున్న ఐడియా లో అవసరమున్న కథని గుర్తించలేని దుస్థితి. ఇలాటి ఐడియాలతో కథలనేవి పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించడంలో వుంటాయని గుర్తించక పోతే, జస్ట్ లైక్ ముందు కాలాన్ని చూపించే సైన్స్ ఫిక్షన్ కథల్లాగా వుండకపోతే, ఇక ఇంతే.


***

        తమిళ మండేలా ని ప్రజా నాయకులు అవసరం లేని ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించుకునే ఆదర్శ ఆలోచనతో తీశాడు ఆ దర్శకుడు. ఒన్ ని ఇలాటి ఆదర్శంతో తీయవచ్చు. ఇందుకు ఐడియాని రీసెర్చి చేయాలి. రైట్ టు రీకాల్ చట్టం పాసై అమల్లోకి వస్తే ఎలాటి పరిణామాలుంటాయో వివరిస్తూ ఇప్సితా మిశ్రా రాసిన ఆర్టికల్లో ఒక సినిమా తీయడానికి పనికొచ్చే పాయింట్లున్నాయి. ఈ పాయింట్లు తీసుకుని చాలా హిలేరియస్ పొలిటికల్ ఎంటర్ టైనర్ తీయవచ్చు మండేలా లాగా. కథ ఇక్కడుంది. కేవలం చట్టాన్ని పాస్ చేయించడమనే లక్ష్యంలో లేదు.


        రైట్ టు రీకాల్ ని ఉత్తరాది నాల్గైదు రాష్ట్రాల్లో పంచాయితీ స్థాయిలో చట్టం చేసి అమలు చేస్తున్నారు కూడా. పంచాయితీ స్థాయిలో సర్పంచులుంటారు కాబట్టి ఎదుర్కొలేరు. అదే ఎమ్మెల్యేలకి, ఎంపీలకీ వర్తించే మౌలిక చట్టాన్ని పాస్ చేయగలరా?  చేయలేరు. ఓటర్ల చేతిలో నోటా అనే లోటా ఒకటి తప్ప, రైట్ టు రీకాల్ కొరడా పెట్టలేరు.


        మరి స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన లింకన్ కథ చట్టాన్ని పాస్ చేయించడం గురించే కదా అనొచ్చు. అది అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ బయోపిక్. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం, 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాగా తీశాడు. బానిసత్వాన్ని నిషేధించే ఈ రాజ్యాంగ సవరణ గురించిన హైడ్రామా ఒక చరిత్ర. కథకి ఈ పరిస్థితుల చిత్రణ అవసరం. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాక ఎలా అమలయ్యిందో తెలిసిన చరిత్రే. అది చూపించనవసరం లేదు. కానీ రైట్ టు రీకాల్ చట్టం పాస్ కాలేదు, అమలే కాలేదు. అమలైతే ఎలా వుంటుందన్న ప్రేక్షకాసక్తితో చెప్పాల్సిన కథే అసలు కథవుతుంది ఐడియాకి.


***

        రైట్ టూ రీకాల్ కథ చెప్పడానికి కూడా అంత కథ లేదు. మొదటి అరగంట స్టూడెంట్ సనల్ తోనే గడిచిపోతుంది. సీఎం కి వ్యతిరేకంగా అతను పెట్టిన పోస్టుకి సంబంధించిన పరిణామాలు ఈ అరగంటని మింగేస్తాయి. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, అరెస్ట్ కాకుండా అతను లాయర్ని ఆశ్రయించడం, అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు వేధించడం, అతను వూరు విడిచి పారిపోయే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష నాయకుడి హంగామా వగైరా మొదటి అరగంట సాగుతుంది. ఆస్పత్రిలో వున్న తన తండ్రి కోసం పోతే, సీఎం వచ్చాడని అడ్డుకుని పోలీసులు కొట్టారని పోస్టు పెడితే, అదెలా నేరమవుతుందో చెప్పక పోవడంతో ఈ ఎపిసోడ్ నమ్మశక్యంగా వుండదు.

      కాకతాళీయంగా గత వారమే సుప్రీం కోర్టు పోలీసుల్ని హెచ్చరించింది. ఆక్సిజన్ కొరత నెదుర్కొంటున్న ప్రజలు ఆందోళనతో సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్టు చేయరాదని. ఈ సినిమాలో సనల్ ని అరెస్ట్ చేసే హంగామా లాజికల్ గా లేకపోగా, సీఎం పాత్ర ఔచిత్యాన్ని కూడా దెబ్బతీసింది. తన మీద పోస్టు పెట్టిన సనల్ నిజానికి తన లక్ష్యానికి కావాల్సిన యూత్ అన్పించినప్పుడు, అతన్ని ప్రశాంతంగా పిలిపించుకోవచ్చు. ఇంత టెర్రర్ దేనికి? మిస్ లీడింగ్ గా ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలన్న చిలిపి ఆలోచన కాకపోతే? ఈ సీఎం ప్రజలకి టెర్రర్ కూడా కాదు, ఫ్రెండ్లీ లీడర్.

***

        ఇలా సీఎం తన లక్ష్యం కోసం సనల్ ని రప్పించుకోవడం ప్లాట్ పాయిట్ వన్ అయింది. ఇక్కడ తన లక్ష్యం అయిన రైట్ టు రీకాల్ చట్టం కోసం, ఎమ్మెల్యేల గురించి ప్రజల అభిప్రాయాలు సేకరించమని, సనల్ కి సర్వే అప్పజెప్తాడు సీఎం. ఇది పాత్రల స్వభావానికి వ్యతిరేకంగా వుంది. సీఎం గా తన మీద వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వాడికే ఈ సర్వే పని ఎలా అప్పజెప్తాడు. అప్పుడు, సార్, నేనిచ్చే సర్వేలో రీకాల్ చేయాల్సిన మొదటి నాయకుడు మీరే అవుతారు అని సనల్ అనెయ్యవచ్చు ఆస్పత్రి సంఘటన దృష్ట్యా. అనకుండా ఎలా వుంటాడు. కథ కోసం అన్లేదులా వుంది. ఇలా ఇద్దరి మధ్యా ఒప్పందంతో ఈ ప్లాట్ పాయింట్ వన్ అర్ధరహితంగా వుంది. ఆస్పత్రి సీనులో సీఎం కాక వేరే నాయకుడు వుండుంటే ఈ ప్లాట్ పాయింట్ వన్ అర్ధవంతంగా వుండేదేమో.


***


       ఇలా ఏర్పాటైన ఈ రైట్ టు రీకాల్ లక్ష్యంతో తర్వాతి  కథ ఇంకెప్పుడో వుంటుంది. ఈ లోగా సంబంధం లేని ఎపిసోడ్లు 8 మొదలవుతాయి. ప్రతిపక్షం సమ్మె, సనల్ అక్క సీనా దొంగతనం కేసులో ఇరుక్కుంటే సీఎం విడిపించడం, ఫ్లై ఓవర్ కూలిపోతే సీఎం వెళ్ళి చర్య తీసుకోవడం. వేరే ఒక అవినీతి కేసులో ఒక మంత్రిని అరెస్టు చేయించడం, కాలేజీకి వెళ్ళే మార్గంలో ఒక కంపెనీ ముందు కార్మికులు ఆందోళన చేస్తూ రోడ్డు బ్లాక్ చేస్తే, సీఎం కాన్వాయ్ వదిలి ఆటో ఎక్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళి సామాన్య బార్బర్ గా (మండేలా కూడా బార్బరే) రాజకీయాల్లో తను ఎదిగిన విధం గురించి విద్యార్థుల ముందు ప్రసంగించడం, వంట వాడికి తన తండ్రి గొప్పదనం గురించి వినరించడం... ఇలా కథతో సంబంధం లేని 8 ఎపిసోడ్లు పాయింటు వదిలేసి సినిమాని ఎటో తీసికెళ్ళి పోతాయి. ఇంకా సినిమాల్లో ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బాపతు డాక్యుమెంటరీ కథనాలు తప్పవేమో.


        ఈ ఎపిసోడ్లని గమనిస్తే ఘోరమైన పాత్ర చిత్రణ బయటపడుతుంది. ఒక వైపు రైట్ టు రీకాల్ కి సర్వే అప్పజెప్పిన సీఎం, మరో వైపు ఈ ఎపిసోడ్లతో తను నీతిగల నాయకుణ్ణని ఇమేజి బిల్డప్ చేసుకుంటున్న అర్ధం కన్పిస్తోంది- సర్వేలో ప్రజలు తనకి వ్యతిరేకంగా చెప్పకూడదన్న భావంతో అన్నట్టు. రచన చేస్తున్నప్పుడు ఈ పొరపాటు తెలుసుకోకుండా ఇంత ఘోరమైన పాత్ర చిత్రణకి ఈ ఎపిసోడ్లతో తెరతీశారు దర్శకుడూ రచయితల జంట. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయాలనుకుంటారేమో – మలయాళ తప్పిదం తెలుగులో దిగుమతి ఐపోగలదు!


***
        ఈ ఎపిసోడ్ల వల్ల సనల్ కథలో కనిపించకుండా పోతాడు. మొదటి అరగంట అంతా కీలక పాత్రగా స్పేస్ తీసుకున్న వాడు అప్రధాన పాత్రాయి పోతాడు. ఎక్కడా సీఎం అప్పజెప్పిన సర్వే చేస్తున్నట్టు కూడా కనపడడు. ఎపిసోడ్లు పూర్తయ్యాక వచ్చి ఏకంగా సర్వే సబ్మిట్ చేసేస్తాడు. ఇది సెకండాఫ్ లో. సర్వే కథ, ఇలా రైట్ టు రీకాల్ కొనసాగింపు కథ చెప్పలేకే అన్నట్టు వేరే ఎపిసోడ్లతో కాలక్షేపం చేశారు. ఇక ఇప్పుడు సెకండాఫ్ లో మర్చిపోయిన ప్రధాన కథ మొదలవుతుంది. సీఎం ఒక ఎంపీతో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్ వేయించడం, అది ఇట్టే పాసవడం, పాసైన చట్టాన్ని అసెంబ్లీలో ఓటింగ్ కి పెట్టడం, ఓడిపోవడం మొదలైనవి.

      ప్రధాన కథ రైట్ టు రీకాల్ కి సంబంధించి పూర్తి స్థాయి కథ లేకపోవడం, సంఘటనలు లేక థ్రిల్, సస్పెన్స్ వంటివి లోపించడం, డైలాగులతోనే సీన్లు నడవడం, మొదలైన బలహీనతలతో రెండున్నర గంటల పాటూ చాంతాడులా సాగుతుంది.

***

        మమ్ముట్టి వైట్ డ్రెస్ లో సీఎం హూందాతనంతో బాగానే నటించాడు. కానీ ఆ హూందాతనం మాటున తప్పుడు పాత్రచిత్రణ ఇబ్బందిగా వుంటుంది చూడడానికి. సీఎం అంటే అతి భక్తి అమాయక టీనేజీ స్టూడెంట్ గా సనల్ పాత్రకి మాథ్యీవ్ థామస్ సరిపోయాడు. ప్రతిపక్ష నాయకుడుగా మురళీ గోపి మమ్ముట్టి కి దీటుగానే కన్పిస్తాడు. అయితే పూర్తి నిడివి పాత్ర కాదు. ఇక తక్కువ కంపించినా ఎక్కువ ప్రభావం చూపే నటి సనల్ అక్క పాత్రలో గాయత్రీ అరుణ్. ఈమెని తెలుగులోకి ఎవరైనా తీసుకోవచ్చు.గోపీ సుందర్ సంగీతంలో మమ్ముట్టి మీద ఒక పాట వుంటుంది. వైదీ సోమసుందరం ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వున్నాయి.


సికిందర్