రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 20, 2021

1039 : రివ్యూ


 దర్శకత్వం : రమేష్ రాపర్తి 
తారాగణం : అనసూయా భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనికా రెడ్డి, వివా హర్ష, అనీష్ కురువిల్లా, అన్నపూర్ణమ్మ తదితరులు
కథ : రమేష్ రాపర్తి, నియీ అఖిన్ మోలయాన్  ఛాయాగ్రహణం : ఆర్ సురేష్
బ్యానర్ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు :  మాగుంట శరత్ చంద్రా రెడ్డి, బొమ్మిరెడ్డి తారకా నాథ్
విడుదల : ఆహా, మే  7, 2021

***

        కోవిడ్ -2 తో తిరిగి థియేటర్ల ప్రదర్శనలు నిలిచి పోవడంతో సినిమాలకి ఓటీటీల అవసరం తప్పడం లేదు. ఓటీటీ సీను ఇప్పుడు మారింది. బడ్జెట్ కూడా చేతికి రానంతగా రైట్స్ నిర్ణయిస్తున్నారని వినికిడి. నాణ్యత లేని సినిమాలు తీసి ఓటీటీలతో లాభపడ్డమే దీనికి కారణం. ఒకప్పుడు శాటిలైట్ సినిమాలతో ఇదే చేసి బహిష్కృతులయ్యారు. గుణాత్మకంగా మేకర్లలో మార్పు వస్తేగానీ మంచి రోజులు వచ్చేలా లేవు.

      ఈ క్రమంలో కోవిడ్ రెండో విడత తాకిడిలో మొదటి ఓటీటీ విడుదలగా థాంక్యూ బ్రదర్ ప్రేక్షకుల ముందు కొచ్చింది. అయితే గత సంవత్సరం ఇదే పరిస్థితుల్లో లేనంతగా భయం నీడన ఇప్పుడు మనుషులు జీవిస్తున్నారు. రెండో విడత తీవ్రత అలా వుంది. వాతావరణంలో ధైర్యాన్ని నింపే వైబ్రేషన్స్ లేవు. ధైర్యాన్ని నింపే, లేదా భయాన్ని మరిపించే వైబ్రేషన్స్ తో కూడిన కంటెంట్ నివ్వడం ఇప్పుడు సినిమాల కవసరం. థాంక్యూ బ్రదర్ ఈ పని చేయగల్గీ చేయలేకపోయింది.  దీన్ని నైజీరియన్ మూవీ ఎలివేటర్ బేబీ (2019) కి రీమేక్ గా తీసినట్టు తెలుస్తోంది. రమేష్ రాపర్తి కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించింది. విరాజ్ అశ్విన్ ఇంకో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను గత సంవత్సరం మనసా నమః అనే షార్ట్ ఫిలిం లో నటించి పరిచయమయ్యాడు. 

        కథలో వీళ్ళిద్దరూ అపరిచితులు. ప్రియ (అనసూయ) గర్భవతి. భర్త చనిపోయాడు. అతను పని చేసిన కంపెనీ నుంచి చెక్కు తీసుకోవడానికి ఓ అపార్ట్ మెంటు కొస్తుంది. అభి (విరాజ్) బాగా డబ్బున్న ఆవారా బ్యాచి. అదే అపార్ట్ మెంటుకి ఒక పని మీద వస్తాడు. ఇద్దరూ పని ముగించుకుని వెళ్తూ లిఫ్ట్ లోకి ప్రవేశిస్తారు. ఆ లిఫ్ట్ మధ్యలో పాడయి ఆగిపోతుంది. ఆమెకి నొప్పులు ప్రారంభమై ఏం చేయాలో అర్ధంగాదు. ఇప్పుడేమిటన్నది మిగతా కథ.

***

    ఈ నైజీరియన్ కథని తెలుగుకి మార్చినప్పుడు అలవాటు చొప్పున అదే మూసకి పాల్పడ్డారు. పాడిందే పాడరా అన్నట్టు... ఔటాఫ్ బాక్స్ ఐడియాలకి కూడా మూస టెంప్లెట్లు వాడేస్తే ఏం చేస్తాం. కాలం, కాలంతో బాటు ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులూ గమనించే ఆసక్తి లేక, ఇలా పాత నమూనాలే చూపిస్తూ కూర్చోవడం.


        ఇద్దరు అపరిచితుల్ని లిఫ్ట్ లో ఇరికించిన ఈ కథకి ఫ్లాష్ బ్యాక్స్ తో పూర్వరంగం ఏర్పాటు చేశారు. ఫస్టాఫ్ మొత్తం ఈ మూస ఫ్లాష్ బ్యాక్స్ సహన పరీక్ష పెడతాయి. పైగా ఇది హీరో కథయినట్టు, కొత్త హీరోకి అనసూయకి మించి 40 నిమిషాల ఫ్లాష్ బ్యాక్! ఈ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి చనిపోయిన హీరో, రెండో పెళ్ళి చేసుకున్న తల్లి మాట వినక, ఫ్రెండ్స్ తో తాగుడు పార్టీలతో ఆవారాగా గడుపుతాడు. బాగా డబ్బున్న వాడే అయినప్పటికీ ఏ పనీ చేయకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది. తల్లి వొత్తిడి కూడా పెరిగేసరికి, ఇక ఏదైనా పని చూసుకోవాలని ఒక ప్రపోజల్ తో తండ్రి పాత మిత్రుడ్ని కలవడానికి అపార్ట్ మెంట్ కెళ్తాడు. ఎన్నోసినిమాల్లో చూసి చూసి వున్న ఆవారా హీరో ఫస్టాఫే ఇక్కడా దర్శనమిస్తుంది. ఇంతకన్నా విషయం లేదు ఫస్టాఫ్ లో. ఫస్టాఫ్ స్క్రిప్టంతా బడ్జెట్ వృధా అని తెలిసిపోతోంది.

        మరో వైపు కాసేపే అనసూయ ఫ్లాష్ బ్యాక్. ఈమెది దిగువ మధ్య తరగతి కుటుంబం. భర్త వుంటాడు. తల్లి వుంటుంది. కంపెనీలో పని చేస్తున్న భర్త చనిపోతాడు. తను గర్భవతి. భర్త తాలూకు డబ్బులు తీసుకోవడానికి హీరో వెళ్ళిన అపార్ట్ మెంట్ కే  వెళ్తుంది. ఇద్దరూ అక్కడ లిఫ్ట్ ఆగిపోయి అందులో ఇరుక్కుంటారు.

***

        ఈ కథని నాన్ లీనియర్ గా ఫ్లాష్ బ్యాక్స్ చేసి చెప్పడంతోనే కొంపమునిగింది. దర్శకుడు ఓపెనింగ్ బ్యాంగ్ గా బావుంటుందనుకుని ఫీలైనట్టు, లిఫ్ట్ లో ఇరుక్కునే సీను ముందే చూపించేస్తూ సినిమా ప్రారంభించాడు. కథాక్రమంలో డెవలప్ అయి దాని సమయంలో అది రావాల్సిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఓపెనింగ్ వేయడంతో, ఇప్పుడే కథేమిటో తెలిసిపోయింది! ఇలా ప్రారంభంలోనే  లిఫ్ట్ సీను వేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతో ముందేం జరుగుతుందో కథ తెలిసిపోవడమేగాక, ఈ సీను తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వల్ల  ఏ సస్పెన్సూ కూడా లేకుండా పోయింది. ఇంటర్వెల్లో వేయాల్సిన లిఫ్ట్ సీను అనాలోచింతంగా సినిమా ఓపెనింగ్ లో వేసేస్తూ ఘోరమైన పొరపాటు చేసి - సినిమా మొత్తాన్నీ నీరు గార్చేశాడు.

        ఇలా కాకుండా, ఎలివేటర్ బేబీ లో లీనియర్ గానే కథ చెప్పాడు. దీనివల్ల ముందేం జరుగుతుందో తెలీదు. డిజాస్టర్ జానర్ మూవీ కథనం ఇలాగే వుంటుంది. లీనియర్ గా హీరో కథ, హీరోయిన్ కథా చూపించుకుంటూ వెళ్ళి, లిఫ్ట్ లో ఇరికించి అప్పుడు ఇంటర్వెల్  బ్యాంగ్ ఇచ్చాడు. దీని నిడివి గంటన్నర కూడా లేదు కాబట్టి, తెలుగులో చూపించిన హీరో హీరోయిన్ల పూర్వరంగమే ఇందులో ఎక్కువ నస పెట్టకుండా చప్పున ముగిసిపోతుంది.

***

   ఇక లిఫ్ట్ లో ఇరుక్కున్నాక సెకండాఫ్ మరీ బలహీనంగా వుంది. ఆమె నొప్పుల బాధ, అతడి మొండి తనం. ఈ కథకి అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర కాదని ఎందుకనో నిర్ణయించారు. బాక్సాఫీసు అప్పీల్ గురించి ఆలోచించకుండా కొత్త వాడైన విరాజ్ అశ్వినే కథానాయకుడనుకున్నారు. అందుకే ఫస్టాఫ్ లో 40 నిమిషాల పాటూ అతడితో వృధా ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఆవారాగా, మానవత్వం లేకుండా వున్న అతను మారడం గురించిన కథ అనుకున్నారు కాబట్టి, అతనే కథానాయకుడయ్యాడు. ఒక మొండివాడు, ఆవారా మంచివాడుగా ఎలా మారాడన్నది ఈ కథతో చెప్పాలనుకున్న అతి పురాతన మూస విషయం. ఇది ఈ రోజుల్లో వర్కౌటయ్యే ఐడియాయేనా? అతను మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. సెల్ ఫోన్ చేతిలో వున్న నేటి యూత్ ప్రోయాక్టివ్ కథ కావాలి గాని. ఇలా ఇరుక్కున్న పరిస్థితిలో మాతృత్వం ప్రమాదంలో వుందని హీరో రెస్పాండ్ అయి ఒక్క మెసేజ్ కొడితే, పోలోమని వందమంది యూత్ మాతృత్వం కోసం వచ్చేసి లిఫ్ట్ లోంచి కాపాడతారు. ఇంత స్పష్టంగా అపాయంలో మాతృత్వం కనపడుతోంటే, ఇంకెవరో హీరో మారడం గురించి కథేమిటి బాక్సాఫీసు వ్యతిరేకంగా? హీరో మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. అతగాడి సొంత జీవితం ఎవరికవసరం.

        గత సంవత్సరం లాక్ డౌన్ లో ఢిల్లీ శివారులో హోటల్ నడవక ముసలాయన ఒకాయన వాపోతూంటే, వీడియో తీసి పోస్ట్ చేశాడొక యూత్. అంతే, అది వైరల్ అయి నిమిషాల్లో వందలాది  యూత్ ఎక్కడెక్కడ్నించో వచ్చేసి, కోలాహలంగా హోటల్లో ఉన్నదంతా తినేసి, గల్లా పెట్టె పట్టనంత డబ్బులు వేసి వెళ్ళారు. యూత్ నెట్వర్క్ ని తక్కువ అంచనా వేయకూడదు. యూత్ తో ఇన్స్పైర్ అయి కథ చేయాలి. సాయం చేయడానికి సెల్ ఫోన్ యూత్ ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటున్న కాలమిది. ఇందుకు దాహరణలు కోకొల్లలు.

        ఈ లిఫ్ట్ కథ కి లాక్ డౌన్ కాలాన్ని నేపథ్యంగా పెట్టారు. అందువల్ల ఆపరేటర్, మెకానిక్ ఎవరూ అందుబాటులో లేనట్టు చూపించారు. ఒకరంటే ఒకరికి పడని ఆ రెండు పాత్రల మధ్య అనవసర ఘర్షణ, అనవసర క్యారక్టర్ ఎనాలిసిస్ లు చూపించారు. ఇదికాదు కావాల్సింది. కావాల్సింది భయాన్ని పోగొట్టే డిజాస్టర్ మేనేజ్ మెంట్. హీరో కొన్ని కాల్స్ చేసి వుంటే, నొప్పులు పడుతున్న ఆమె కోసం  అంబులెన్స్ వస్తుంది, డాక్టర్లు వస్తారు, వైద్య సిబ్బంది, పోలీసులూ వస్తారు, యూత్ సరే, వాళ్ళ హీరోయిజం ఎలాగూ వుంటుంది. ఇలా లాక్ డౌన్లో అందరూ మనతో వుంటారని ధైర్యం చెప్పే నేటి ఆశాజనక కథ కావాలిగానీ, ఎవరో హీరో మంచివాడుగా మారి చివరికి చిటికెడు సాయం చేసిపోయే కాలం చెల్లిన కథ ఎవరిక్కావాలి.

***

        ఎలివేటర్ బేబీ' లో పాలనా వ్యవస్థ మీద విమర్శలు గుప్పించడం వుంటుంది. లిఫ్ట్ కథకి వీటితో సంబంధమేమిటాని సినిమా మీద ఒక నైజేరియన్ రివ్యూ చదివితే విషయం అర్ధమైంది. నైజేరియూలో పాలనా వ్యవస్థ ఎలా వుంటుందో ఆ రివ్యూకర్త రాసుకొచ్చాడు. అక్కడ ఏ శాఖా ఏదీ పట్టించుకోదు. రోడ్లు, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు  అడ్డగోలుగా వుంటాయి. ఏ శాఖ వాడూ దేన్నీపట్టించుకోడు. రిపేరుకు రమ్మంటే ఏడాది కొస్తాడు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడో టిఫిను తింటూ వుంటాడు. కరెంటు పోతే, పోతే పోయిందను కుంటాడు. ప్రజలకి నానా ఇక్కట్లు, టెన్షన్. ఇలాటి పాలనా యంత్రాంగం వల్లే కథలో లిఫ్ట్ లో ఇరుక్కుని నానా పాట్లు పడ్డారన్న మాట. నైజేరియన్ లిఫ్ట్ కథకి ఇదీ నేపథ్యం. సహజ నేపథ్యం. అందుకని లిఫ్ట్ లో ఇందుకు తగ్గట్టు టెన్షన్ తో కూడిన వ్యవస్థ బాధిత డ్రామా. నైజేరియన్ దర్శకులు అక్కడి పాలనా యంత్రాంగం ప్రస్తావన లేకుండా సినిమాలు తీయలేరని రివ్యూలో రాసుకొచ్చాడు.

         తెలుగు రీమేక్ కథకి ఈ నేపథ్యం వుండే అవకాశం లేదు. మన పాలనా యంత్రాంగం లంచాలతో దివ్యంగానే నడుస్తూ వుంటుంది. దీనికి లాక్ డౌన్ నేపథ్యంతో చెక్  పెట్టి, బైటి సాయాన్ని మూసేసి కథ నడిపారు. ఇది బెడిసికొట్టింది. సెల్ ఫోన్ చేతిలో వున్న హీరో అలా వూరికే కూర్చోడు. లాక్ డౌన్ అంటే పరస్పరం సహించుకోవడమని ఉజ్వలమైన కథ నడిపించగలడు యూత్ నెట్వర్క్ తో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ.  

***

      ఈ కథ డిజాస్టర్ జానర్ మూవీ కథగా వుండాల్సింది. టవరింగ్ ఇన్ఫెర్నో, ది డే ఆఫ్టర్ టుమారో, ఇండిపెండెన్స్ డే, ట్విస్టర్, కంటేజియన్... ఇలా ఏ డిజాస్టర్ మూవీ తీసుకున్నా ఒకే టెంప్లెట్లో వుంటాయి. ఈ టెంప్లెట్ ని మార్చి ఇంకో విధంగా చేయలేరు. ముందుగా పాత్రల ప్రశాంత జీవితాలు, వాటి కలలు, ప్రమాద సూచనలు, ప్రమాదం, కలల భగ్నం, ప్రాణాల కోసం ప్రమాదంతో పోరాటం, విజయం, తిరిగి ప్రశాంతత... ఈ జానర్ బీట్స్ తోనే వుంటాయి.


        అనసూయ పాత్ర కథగా చేసి ఆమె జీవితం చూపించుకొస్తూ, గర్భంలో వున్న బిడ్డ కోసం కోవిడ్ బారిన పడకుండా ఆమె జాగ్రత్తలు చూపిస్తూ, లాక్ డౌన్ టైమ్ లో తప్పనిసరై హాస్పిటల్ కెళ్ళి లిఫ్ట్ లో ఇరుక్కుని బయటపడే ప్రమాద సూచనలు చూపిస్తూ, ఇంకో చోట హీరోతో భౌతిక దూరం గురించి గొడవపడడం చూపిస్తూ, హీరో ఎవరో చెప్పకుండా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చూపిస్తూ, అపార్ట్ మెంట్లో ఆమెనీ హీరోనీ లిఫ్ట్ లో ఇరికించి, ఇప్పుడేమిటి?’ అన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో పైన చెప్పుకున్న డిజాస్టర్ మేనేజిమెంట్ రియలిస్టిక్ కథగా  నడపకుండా, ఉపయోగం లేని మూస కథ చేశారు. హీరో ఎవరనేది, అతడి సమస్యలేమిటన్నది చివర్లో చెప్పవచ్చు. దేర్ విల్ బి బ్లడ్ హాలీవుడ్ మూవీలో హీరో ఎవరనేది ఏ తగిన సమయంలో (టైమింగ్), దేంతో ముడిపెట్టి చెబితే కథకి కిక్ వస్తుందో, ఆ తగిన సమయం సెకండాఫ్ లో వరకూ చెప్పలేదు. దీంతో సెకండాఫ్ లో ఇంకో కొత్త కథా లోకం ఆవిష్కృతమైంది. లక్షల మంది కోసం తీసే సినిమా కథ అనేది బహుళ కోణాల్లో ఆలోచించాల్సిన డైనమిక్స్ తో కూడిన కాసుల రూపం.

సికిందర్