―ఎపి, ఏడీ
A : ‘జాన్ విక్’ అనేది రివెంజి సినిమా. యాక్షన్ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇది రివెంజి కథ అని ఫీలైతే పెప్ వుండదని రివెంజి కోణాన్ని మరుగుపర్చి యాక్షన్ కథ నడిపే విధానమొకటుంది. రివెంజి కోణాన్ని మెల్లగా ఎప్పుడో ప్రేక్షకులు షాక్ తినేలా వెల్లడిస్తారు. ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ (2016) అనే ‘సెవెన్ సమురాయ్’ రెండో రీమేక్ లో దీన్ని గమనిస్తాం. ఈ విషయం ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ రివ్యూలో రాశాం కూడా. ఇలాటి స్క్రీన్ ప్లే టిప్స్ కాపీ పేస్ట్ చేసుకుని డేటా బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటే, మళ్ళీ డౌట్ వచ్చి అడిగే అవసరం రాదు.
‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో కౌబాయ్ డెంజిల్ వాషింగ్టన్, ఆ గ్రామానికి బందిపోటు విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి తన గ్రూపుతో వస్తాడు. ఇలా సినిమా సాంతం పోరాడుతూనే వుంటే పాత్ర నమ్మశక్యంగా అన్పించదు. తనది కాని ఏదో వూరుని కాపాడే అవసరం తనకెందుకని? ఎందుకో చిట్ట చివర్లో వెల్లడిస్తాడు. ఆ బందిపోటు విలన్ని చంపుతూ, ‘రేయ్, నా చిన్నప్పుడు మా అమ్మనీ, నా ఇద్దరు చెల్లెళ్ళనీ చంపావ్ గుర్తుందా?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి మనం కూడా షాకవుతాం విలన్తో పాటు. విలన్తో అతడికి పాతపగ వుందని మనకి అప్పటివరకూ తెలియకుండా దాచారు. తెలిస్తే రివెంజి కథ అని తెలిసిపోయి ఇంటరెస్టు పోయేది. ఇలా చిట్ట చివరికి వెల్లడించాక, వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా ఎలివేటయ్యే పాత్ర చిత్రణా పరమైన హంగు చేకూరింది. అంటే తనలో ఇంత బాధని దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి మొదటి ప్రాధాన్యం పర సుఖమే తప్ప స్వసుఖం కాదు. తన పగదీర్చుకోవడానికే గ్రామంకోసం పోరాడినట్టు అన్పించదు. పగలేకపోతే వచ్చే వాడు కాదని కూడా అన్పించదు. పగ గురించే అయితే విలన్ ఎక్కడున్నాడో అక్కడి కెళ్ళి చంపేసి పోతాడుగా? ఇలా కాకుండా స్వకార్యం, స్వామి కార్యం రెండూ చక్కబెట్టదల్చుకున్నాడు.
దీని
దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా. డెంజిల్ వాషింగ్టన్ తోనే 2018 లో ‘ఈక్వలైజర్ 2’ తీశాడు. ఈ
యాక్షన్ మూవీలో కూడా ముగింపులో వాషింగ్టన్ ని, ఎంత మరపురాని మానవీయ కోణంతో ఎలివేట్
చేశాడంటే, ఇలాటిది మన తెలుగు స్టార్లతో ఇక ముందు కూడా చూడలేనంత. మానవీయ కోణం
యూనివర్సల్ నాడి. ఇది డెంజిల్ వాషింగ్టన్ కోసం ఫుఖ్వా పట్టుకున్నాడు.
రివెంజి కథ రిస్కీ బిజినెస్సే. దీని విషయంలో ప్రేక్షకులు రెండాకులు ఎక్కువే చదివి వుంటారు. దర్శకుడు మూడో నాల్గో ఆకులు ఎక్కువ చదువుకుని ముందుండక పోతే అడకత్తెరలో పోక అయిపోతాడు. ఫుఖ్వా పదాకులు ఎక్కువే స్టడీ చేశాడు. అందుకే ‘ఈక్వలైజర్ 2’ రొటీన్ రివెంజి కథతో ప్రేక్షకుల మీద పగదీర్చుకో గల్గాడు. ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందు హత్య జరుగుతుంది. ఇక వాషింగ్టన్ దీనికి పగ దీర్చుకుంటాడు కదా, ఇంతే ఈ సినిమా కథా అని తెలిసిపోతుంది. ప్రేక్షకులకి ఇలా తెలిసిపోయాక ఇంకేం కథ నడుపుతామని, ఫుఖ్వా ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకే క్లయిమాక్స్ కి తెరతీశాడు. డెంజిల్ వాషింగ్టన్ మాఫియా కిల్లర్స్ ని పిల్చి, ‘ఇక మీరు చావుకి సిద్ధపడండ్రా’ అని మీట నొక్కడంతో, మొదలయి పోతుంది 40 నిమిషాల ఊపిరి సలపని సుదీర్ఘ యాక్షన్ క్లయిమాక్స్. రివెంజి సినిమా ఫీలింగ్ చెల్లాచెదురై ప్రేక్షకులు స్టన్ అయిపోతారు.
గమనించాల్సిందేమిటంటే, అకిరా కురసావా తీసిన జపనీస్ ‘సెవెన్ సమురాయ్’ (1954) లోనూ, దీని మొదటి హాలీవుడ్ రీమేక్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ (1960) లోనూ రివెంజి కోణం లేదు. హీరోకి బ్యాక్ స్టోరీ (ఫ్లాష్ బ్యాక్) ఇవ్వలేదు. రెండో రీమేక్ లో దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా బ్యాక్ స్టోరీ ఇస్తూ రివెంజి కోణాన్ని కల్పించాడు. అది కూడా ‘జాన్ విక్’ లో మీరన్నట్టు సింగిల్ డైలాగు టెక్నిక్ తో. ఈ సింగిల్ డైలాగుకి సపోర్టుగా విజువల్స్ వేయలేదు. మనమైతే వేసేస్తాం. హీరో కుటుంబాన్ని విలన్ తనివిదీరా చంపుతున్న కట్ షాట్స్ మనసుదీరా వేసేసి ఆనందిస్తాం. ఈ ఆనందం వృధాగా పది లక్షల బడ్జెట్ ని మింగేసిందన్న తెలివి లేకుండా. మన తెలివే మనకానందం కనుక.
ఉద్దేశమేమిటంటే, క్రియేటివ్ యాస్పెక్ట్ లో క్రాఫ్ట్ ని, టెక్నిక్ నీ కాపాడ్డమే. వేస్తే సింగిల్ డైలాగు ఒక్కటే వెయ్యాలి, ఇంపాక్ట్ వుంటుంది. లేదా విజువల్స్ ఒక్కటే వెయ్యాలి. ఇంపాక్ట్ వుండదు. రెండూ కలిపి వేస్తే ఇంపాక్ట్ అస్సలుండదు. సింగిల్ డైలాగ్ ఈజ్ సుప్రీమ్. మళ్ళీ డైలాగు పొడిగించ కూడదు, విలన్ తో కూడా ఇంకేమీ అన్పించకూడదు. యాక్షన్ తో సీను ఫినిష్ చేసేయాలి. సింగిల్ డైలాగ్ తర్వాత యాక్షనే. ఇంకేమీ వుండకూడదు.
ఒక ఇంపాక్ట్ నిచ్చే సింగిల్ డైలాగుతో సూచన ప్రాయంగా ఇచ్చిన హీరో బ్యాక్ స్టోరీ (ఫ్లాష్ బ్యాక్) చాలు. మిగతాదంతా ప్రేక్షకుల ఇమాజినేషన్ కి వదిలెయ్యాలి. విలన్ హీరో కుటుంబాన్ని చంపేశాడా? పాపం ఆ తల్లి ఎలా వుండేదో... చెల్లెళ్ళు ఎలా వుండే వాళ్ళో... బలై పోయారు...అని ఇమాజిన్ చేసుకోవడంలో వుండే బలం, ఫీల్ ఎదురుగా దృశ్యం కనబడితే తేలిపోతాయి.
ఈ టెక్నిక్ నే ‘జాన్ విక్’ లో దర్శకుడు చాడ్ స్టహెల్ స్కీ పాటించాడు. అతడి ఇంటర్వూ చూశారా? ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’ లో క్లింట్ ఈస్ట్ వుడ్ హీరో పాత్ర. దీనికి చాలా బ్యాక్ స్టోరీ వుంటుంది. కానీ ఎక్కడా అదేమిటో చెప్పరు. ప్రేక్షకుల ఇమాజినేషన్ కి వదిలేశాడు దర్శకుడు సెర్జియో లియోన్. ‘We’re big fans of leaving it to your imagination’ అన్నాడు ఈ మూవీతో ఇన్స్పైర్ అయిన చాడ్. ‘జాన్ విక్’ లో కొసరి కొసరి అక్కడక్కడా ఇతర పాత్రల డైలాగుల ద్వారా, వేరే కట్ షాట్స్ ద్వారా బ్యాక్ స్టోరీ వేస్తూ పోయాడు స్టార్ కినూ రీవ్స్ పాత్రకి.
ప్రారంభ సీను చూశారా? గాయాల పాలైన కినూ రీవ్స్ పరుగెత్తుకుంటూ వచ్చి, దాక్కుని, సెల్ ఫోన్ తీసి, భార్య వున్న వీడియో చూసుకుంటాడు. ఇదొక్కటి చాలు ఎంతో చెప్పేయడానికి బ్యాక్ స్టోరీ గురించి. ‘ఖైదీ’ లో చూశారా? ప్రారంభ సీనులో పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో రంగ నాథ్, అనుమానాస్పదంగా కన్పిస్తున్న చిరంజీవిని ఆపి దబాయిస్తున్నప్పుడు, చిరంజీవి దగ్గర కత్తి బయట పడుతుంది. ఇదొక్కటి చాలు బ్యాక్ స్టోరీ గురించి ఎంతో చెప్పేయడానికి. ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నాడు సిడ్ ఫీల్డ్.
‘జాన్ విక్’ టెక్నిక్ సబ్ కాన్షస్ కి కనెక్ట్ చేసే టెక్నిక్ కావచ్చు. హీరో గురించి, ‘వాడెవడో తెల్సా? వాడు కాంట్రాక్ట్ కిల్లర్’ అని ఒక పాత్ర ఇంకో పాత్రకి చెబుతూంటే, హీరో మనకి చాలా గుంభనంగా కన్పిస్తాడు. గుంభనంగా అన్పించేది మన సబ్ కాన్షస్ తో కనెక్ట్ అవుతుంది. ఇక రకరకాలుగా వూహించుకుంటూ (ఇమాజినేషన్) మనముండిపోతాం. పాత్ర బలంగా, అయస్కాంతంలా పట్టేస్తుంది.
ఈ టెక్నిక్ తెలుగుకి ఎలా వుంటుందని ఒక దర్శకుడికి ఫోన్ చేశాం. ఈ టెక్నిక్ - వస్తాడు, ఇక వస్తాడు, వచ్చేస్తున్నాడు...అని చెప్పిస్తూ నాందీ ప్రస్తావనా మాత్రంగా బావుటుందే తప్ప - వచ్చాక పాత కథ వుంటే, అది పూర్తి ఫ్లాష్ బ్యాక్ వేసి చూపించక పోతే ప్రేక్షకులు అల్లరి చేస్తారన్నారు.
ఇంకేం చేస్తాం. ప్రేక్షకులు
కాలంతో బాటు మారి, కొత్త డిక్లరేషన్ ఇస్తే తప్ప కొత్త టెక్నిక్కులు చెల్లెలా లేవు.
ఈ బ్యాక్ స్టోరీనే ‘సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అన్నాడు సిడ్ ఫీల్డ్. ఇందుకు కొన్ని మంచి
ఉదాహరణ లిచ్చాడు : హౌ టు మేక్ ఏన్ అమెరికన్ క్వల్ట్, థెల్మా అండ్ లూయిస్, డెత్ ఆఫ్
ఏ సేల్స్ మాన్, షాషంక్ రిడెంప్షన్, ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్, ది లాంగ్ కిస్
గుడ్ నైట్...
నిజానికి బ్యాక్ స్టోరీ స్క్రీన్ ప్లేలో ఏ విభాగం? బిగినింగ్ విభాగమే. ‘జాన్ విక్’ లో ఇమాజినేషన్ టెక్నిక్ తో వున్న బ్యాక్ స్టోరీ బిట్స్ బిగినింగ్ విభాగమే. లీనియర్ నేరేషన్ చేస్తే అక్కడ్నించే కదా ప్రారంభమయ్యేది కథ. ఈ కథ రాయడానికి ఇంకో నాల్గు హాలీవుడ్ సినిమాలు కూడా ఇన్స్పైర్ చేశాయి. అలాగే అలిస్టర్ మెక్లీన్ నవలల్లో వుండే స్టోరీ వరల్డ్, స్టీఫెన్ కింగ్ నవలల్లో వుండే సర్ప్రైజ్ చేసే హీరో క్యారక్టరైజేషన్ తోడయ్యాయి. చాలా స్టడీ చేస్తే గానీ ఈ రివెంజి మాఫియా యాక్షన్ స్క్రీన్ ప్లే తయారు కాలేదు. కాబట్టి దీనికిది బ్యాక్ స్టోరీతో యూనిక్. తెలుగులో ఎవరైనా సాహసం చేస్తే చేసి చూడొచ్చు. ప్రేక్షకులకంటే రెండాకులు ఎక్కువే చదవగల్గితే.
ఇక మీరడిగిన బిల్డ్ అప్ సీన్లు రాయడం గురించి. ఏ జానర్ కైనా క్యారక్టర్ బిల్డప్ సీ ను క్యారక్టర్ చేసే సంఘర్షణని బట్టి మిడిల్ లో వస్తుంది. ఇంట్రడక్షన్ ని బట్టి బిగినింగ్ లో వస్తుంది. క్లయిమాక్స్ ని బట్టి ఎండ్ లో వస్తుంది. క్యారక్టర్ బిల్డప్ సీన్లే కథకి బిల్డప్ సీన్లవుతాయి. filmsite అని వెబ్సైట్ వుంది. ఇందులో ఈ సీన్లన్నీ పురాతన కాలం నుంచీ ఇప్పటిదాకా పొందుపర్చి వుంటాయి. ఇంకా ఇతర రిఫరెన్సులు చాలా వుంటాయి. ఈ సైట్ ని మీ డైరీలో చేర్చుకోండి.
Q : ‘సంచిక డాట్ కాం’ లో మీరు ప్రాంతీయ సినిమాల గురించి చేస్తున్న విశ్లేషణలు ఫాలో అవుతున్నాను. వివిధ భాషల ప్రాంతీయ సినిమాల సమాచారాన్ని శ్రమ తీసుకుని అందిస్తున్నందుకు థాంక్స్. నా ప్రశ్నేమిటంటే, నేను ఇలాటి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు కాదు, మొదటి నుంచీ నా ఆలోచనలు కమర్షియల్ సినిమాలు కాదు, ఆర్ట్ సినిమాలే. అయితే తెలుగులో వీటితో ఎంతవరకు ముందుకు పోగలననే సందేహం వుంది.
―ఏఎన్, ఏడీ
A : తెలుగులో ముందుకు పోవాలంటే వెనక్కి వెళ్ళాలి. కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏమీ నేర్చుకోనవసరం లేదేమో గానీ, ఆర్ట్ సినిమాలకి ప్రపంచ సినిమా శాస్త్రాల, సిద్ధాంతాల పరిచయముండాలి. ఆ భాష మీరు మాట్లాడగల్గాలి. ఇది ఫిలిం ఇనిస్టిట్యూట్స్ నుంచి డిగ్రీ పుచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. ఆర్ట్ సినిమా అంటే ఏదో తెలుగు నేటివిటీ కథ తీసేసి, తెలుగు రాష్ట్రాల్లో నాల్గు చోట్ల విడుదల చేసుకుని, అయ్యిందన్పించుకుంటే ఆ ఒక్క సినిమాతో ఆగిపోతారు. ఇతర ప్రాంతీయ భాషల సినిమాలు చూడండి, అవి అంతర్జాతీయ స్థాయికి వెళతాయి. అలా వెళ్ళగలిగితే తెలుగులో తీయండి, లేకపోతే అవసరం లేదు. ఆయా ప్రాంతీయ దర్శకుల ఇంటర్వ్యూలు చదవండి. వాళ్ళ అవుట్ లుక్, వాళ్ళ విస్తృత నాలెడ్జి తెలుస్తుంది. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. ఇలా వెనక్కెళ్ళి బోలెడు తెలుసుకున్నాక, ఫిలిం ఫెస్టివల్స్ లో ఇంటరాక్ట్ అయ్యాక, ఆ అనుభవసారంతో తీసే ప్రయత్నం చేయండి. తప్పకుండా తెలుగు సినిమా అంతర్జాతీయ అవార్డులు తీసుకొస్తుంది. ఓ ఐదేళ్ళు పదేళ్ళు టైం తీసుకోండి.
Q : మీ బ్లాగులో సినిమా న్యూస్, గాసిప్స్ వంటి లైట్ రీడింగ్ మెటీరియల్ కూడా ఇస్తే నాలాంటి పాఠకులకి బావుంటుంది కదా?
―రజనీకాంత్, పాఠకుడు
A : ఈ బ్లాగుకో థీమ్ వుంది. ఆ థీమ్ ప్రకారం పోస్టులుంటాయి. దీనికి పాఠకులున్నారు. దీన్నిలా వుండనిద్దాం.
Q : 1. ఈ కరోనా తో సినిమా రంగానికి ఎక్కువ ఇబ్బంది అంటున్నారు. భవిష్యత్తు ఏమిటి అన్నది తెలియడం లేదు. ఈ టైంలో భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ లు ఎలా ఉండాలి? ఏం ఆలోచించాలి? అంతా సెట్ అవుతుంది అని కథలు రాసుకుంటూ ఉన్నా కరోనా భయం మనసులో ఏదో మూల వుంటుంది.
2. కరోనా ఎఫెక్ట్ వలన భవిష్యత్తు లో సినిమా థియేటర్ లు తగ్గిపోయి అమెజాన్, నెట్ ప్లిక్స్ లాంటి వాటికి ఆదరణ పెరుగుతుందా? దర్శకులు కూడా అటు వైపుగా వెళ్ళడానికి ఆలోచన చేయాలి అంటారా?
3. మనం ఇప్పుడు పరిష్కారం లేని సమస్యతో పోరాడుతున్నామని అనిపిస్తుంది. సినిమానే జీవితం అనుకుని ఉన్న వారి కోసం ఏవైనా సలహాలు సూచనలు చెప్పండి.
4. అసిస్టెంట్ డైరెక్టర్ లు, రచయితల కోసం రోజూ ఇన్స్పైరింగ్ గా ఏమైనా మీ బ్లాగులో రాయండి. అది చాలా మందికి కొత్త శక్తిని ఇవ్వగలదు. నేను రాస్తే ఏం జరుగుతుంది అనుకోకండి. మీరు రాస్తే ఒక స్నేహితుడు మాకు ధైర్యం చెపుతున్నట్టు అనుకుంటాం.
5. ప్రతీ జానర్ లో ఖచ్చితంగా చూడవలసిన సినిమాల లిస్ట్ ఒకటి ఇవ్వండి. కనీసం దాని వల్లయినా ఈ సినిమా లు తప్పకుండా చూడాలి అని ఆ పనిలో ఉంటాం.
6. చివరగా కరోనా గురించి పట్టించుకోకుండా వుండడానికి ఏమైనా టిప్స్ లాంటివి ఇవ్వండి(అవి ఫన్నీ గా ఉన్నా సరే).
―రవి, ఏడీ
A : ఇది ప్రపంచంలో అన్ని రంగాల సమస్య. వైరస్ కి మించి ఆర్ధిక సమస్య. రెండు నెలలకో మూడు నెలలకో వైరస్ భయం తీరిపోయిందిక, జనాలు థియేటర్లకి వచ్చేస్తారను కోవడానికి లేదు. ఈలోగా ఆర్ధిక పరిస్థితులు తలకిందులయ్యే అవకాశముంది. కార్మికులు, పేదలు భారీగా ఉపాధి కోల్పోయే పరిస్థితి వుంది. దీంతో మాస్ ప్రేక్షకుల్లో భారీగా కోత పడొచ్చు. అలాగే దేశంలో మధ్య తరగతి 27 శాతం. ఇందులో 14 శాతం వుండే దిగువ మధ్య తరగతి, 10 శాతం వుండే సగటు మధ్యతరగతి భారీగా ఉద్యోగాలు కోల్పోతారు. 3 శాతం వుండే ఎగువ మధ్యతరగతి బయట పడొచ్చు. యువత కూడా కష్టాల్లో పడతారు. సినిమాలకి రావడానికి డబ్బులు కాదుగదా, సినిమాలు చూసే మూడ్ వుంటుందా? రేపు లాక్ డౌన్ ఎత్తేశాక సామాన్యుడి నుంచీ సంపన్నుడి వరకూ వృత్తి వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు పరుగులు పెడతారు, ఇంట్లో కూర్చుని సినిమాలు చూసే అవకాశం వుంటుందా? ఆలోచించుకోవాలి.
కనుక దేశం ఆర్ధికంగా కోలుకునే దాకా ఏ రంగమూ ఇంతే. రంగాలు కోలుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి 15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఒక్కో పరిశ్రమకి రెండు వేల రూపాయలు చొప్పున ఏ మూలకి? ఈ రంగం కోలుకుంటుందా? ఈ రంగంలోనే 92 శాతం అసంఘటిత కార్మికులున్నారు. ఒక్క వైరస్ వేటుకి గ్లోబలైజేషన్ చరిత్ర పరిసమాప్తమయ్యేలా వుంది. చెన్నై నుంచి మనకందిన సమాచారం బట్టి అక్కడ సినిమా రంగం కోలుకోవడానికి సంవత్సరం దాకా పడుతుంది. ఎక్కడైనా ఇంతే.
ఈ పరిస్థితుల్లో సినిమా కథలు రాస్తూ కూడా కూర్చోలేరు. ఆల్రెడీ ఓకే అయివుంటే ఓకే అనుకుని రాసుకోవచ్చు. కొత్త ప్రయత్నాల కోసం రాయాలనుకోవడం వృధా. రాయనీయదు మనసు కూడా. రాస్తూంటే, ‘రేపేంటో తెలీని పరిస్థితుల్లో రాయడం వేస్టేమోరా ఆలోచించు’ అని ఓవైపు రొద పెడుతుంది మనసు. కనుక ప్రస్తుతానికి వాయిదా వేస్తే మంచిది.
థియేటర్లేమీ తగ్గిపోవు. అన్ని దృశ్య మాధ్యమాలకీ మదర్ లాంటిది సినిమా. సినిమా అంతరించిపోదు. సినిమా అంతరించిపోతే కదా థియేటర్లు అంతరించిపోవడానికి. సినిమా అనే మదర్ టెక్నాలజీ ఇంకెన్నో వంశాంకురాల్ని చూస్తుంది, ఇప్పుడు ఓటీటీ సహా. మీకవకాశాలుంటే వెబ్ సిరీస్ వైపు ఎందుకెళ్ళకూడదు? రేపు ఇతర రంగాలు మూతబడితే పోగొట్టుకున్న ఉద్యోగాలు పొందడం కష్టమే కావచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఈ లాక్ డౌన్ సమయంలోనే ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు. వాళ్ళకి ఇంకో మీడియా సంస్థల్లో అవకాశాల ప్రసక్తే లేని పరిస్థితేర్పడింది. సినిమా రంగం అలాకాదు. ఇప్పుడు మూత బడ్డ సినిమా రంగం లాక్ డౌన్ తర్వాత నెమ్మది నెమ్మదిగా తెరచుకుంటుంది. ఉపాధి ఎక్కడికీ పోదు. థియేటర్లు పుంజుకోవడానికి సమయం పట్టొచ్చు గానీ, ఈలోగా సినిమాలు తయారవుతూనే వుంటాయి, ఆగిపోయిన సినిమాలు సహా. కాకపోతే ఆర్ధిక మోడల్ మారవచ్చు. కనుక నిశ్చింతగా వుండి, ఇతర విషయాలమీద దృష్టి పెట్టండి.
Randy Glasbergen - Glasbergen Cartoon Service |
ఈ లాక్ డౌన్ పీరియడ్ లో రాయడం కట్టి పెట్టి తెలుసుకోవడం మీద, నేర్చుకోవడం మీద దృష్టి పెట్టండి. అదే పనిగా సినిమాలు చూడకండి. వారానికి రెండు మూడు సెలెక్టివ్ గా చూస్తే చాలు. చూసి వదిలేయకుండా, మీకెలా అన్పించాయో రివ్యూలు రాసుకోండి సాంకేతికాలు సహా. మీ స్కిల్స్ పరీక్షించుకోండి. బాలీవుడ్ దర్శకుడు ఒనిర్ ఈ సమయంలో అసిస్టెంట్లకి టాస్క్ ఇచ్చాడు. ఇండోర్స్ లో రెండు నిమిషాల షార్ట్ మూవీస్ మొబైల్ మీద తీసి పంపమంటున్నాడు. గెలుపొందిన వారికి తన టీములో అవకాశమిస్తానంటున్నాడు. అవకాశం సంగతేమో గానీ, ముందు స్కిల్స్ పరీక్షించుకోవడానికిదో చిన్నపాటి యాక్టివిటీ కావచ్చు. ఖాళీగా వున్నాం కదాని సోషల్ మీడియాలో అదే పనిగా గడపకండి. రాజకీయ కార్యకర్తలా పోస్టులు పెట్టకండి. ఎగ్రెసివ్ మెంటాలిటీ ప్రదర్శించకండి. రేపు మీ కవకాశమిచ్చే చోట, మీ సోషల్ మీడియా బిహేవియర్ చెక్ చేస్తే, మీకవకాశం కష్టం కావొచ్చు. మీకు సినిమాలు ముఖ్యమా, లేనిపోని హైపర్ యాక్టివిటీ ముఖ్యమా ఆలోచించండి. న్యూట్రల్ గా వుండండి. సినిమా వ్యక్తిగా న్యూట్రల్ గా వుంటేనే సమగ్ర సృష్టి చేయగల్గుతారు. ఒకసారి ప్రముఖ స్టార్లు, దర్శకుల ట్వీట్లు చూడండి. అలా వుండండి. ఇన్ స్టాగ్రాంలో నీతా అంబానీని ఫాలోకండి. సంపన్నులని ఫాలోకండి. రతన్ టాటా, కుమార మంగళం బిర్లా, రాహుల్ బజాజ్, అజీమ్ ప్రేంజీ, ఆనంద్ మహీంద్రా మొదలైన సంపన్నులని ఫాలోకండి. కామెంట్లు పెట్టండి. సినిమా స్టార్లనీ ఫాలోకండి. కామెంట్లు పెట్టండి. చాలా పాజిటివ్ నెస్ వస్తుంది. పనికొచ్చే వెబ్సైట్స్, చానెల్స్ చూడండి. ఏవైనా చదవాల్సిన పుస్తకాలుంటే చదివెయ్యండి (చాలా రోజులుగా చదవలేక పోయిన జీఎస్ వరదాచారి గారి ‘ఇలాగేనా రాయడం?’ చదివేశాం మనం). హాస్య రచనలు చదవండి. నెట్ లో బోలెడు వుంటాయి. వైరస్ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లెక్కల ప్రకారం జూన్ ఫస్టున మన దేశానికి వైరస్ పీక్ దశ వస్తుంది. అక్కడ్నించీ తగ్గు ముఖం పడుతుంది. అదే పనిగా దాని గురించి ఆలోచించి, దాంతో వచ్చే ఆర్ధిక, ఆరోగ్య సమస్యల్ని కూడా బోనస్ గా వూహించుకుని, బుర్ర ఖరాబు చేసుకోకండి. శారీరక దూరతీరాలు పాటిస్తే తర్వాత ప్రాపంచిక సుఖాలు మనవే అవుతాయి. రాత్రి పూట కళ్ళకి బయటి పని అప్పజెప్పకుండా విజువల్ మీడియా కట్టిపెట్టండి. చెవులకి లోపలి పని అప్పజెపుతూ, ఆడియో తక్కువ వాల్యూం పెట్టుకుని మీకిష్టమైన పాటలు వినండి. రాత్రి పూట వినే పాటలుంటాయి. ఇళయరాజా పాటలు వినండి. ఇంకా పాత పాటల మీద ఆసక్తి వుంటే, 1940 - 70 ల మధ్య ముప్ఫయ్యేళ్ళ చరిత్రంతా చెవుల ముందుంది. పడుకునే ముందు చార్లీ చాప్లిన్ చేష్టలు చూడండి. మన లోపలి ప్రశాంతి కోసం ఇన్ని బయటి సాధనాల మీద ఆధారపడుతున్నాం. లాక్ డౌన్ వల్ల ప్రకృతి తేట పడిందని ఆనందిస్తున్నాం. మనం మాత్రం తేట పడక నాటుగానే వుంటున్నాం. లాక్ డౌన్ కి పూర్వమెప్పట్నించో క్రిస్టఫర్ నోలన్ తేట పడి ప్రకృతిలో మమేకమై వున్నాడు. హాలీవుడ్ అగ్రదర్శకుడు క్రిస్టఫర్ నోలన్ చేతి వాచీ, జేబులో సెల్లు, ఇంట్లో టీవీ, ఆఫీసులో కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, మల్టీ మీడియా, గిల్టీ మీడియా అన్నిటికీ లాక్ డౌన్ పెట్టేసి - ప్రకృతి అంత తేట మనసుతో ప్రకృతితో వుంటూ - ఒక్కో హై ఎండ్ టెక్నాలజీ మూవీ దిమ్మదిరిగేలా తీస్తూ పోతూంటాడు... సరే, ఉదయం ఐదున్నరకి లేచి ఎక్సర్ సైజ్, వాకింగ్, జాగింగ్ లాంటివి ముప్పావు గంట చేయండి. ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. మానసికంగా బావుంటే శారీరకంగా బావుంటారు. మునగాకు దొరికితే ఉదయం పూట నీట్లో మరిగించి ఓ గ్లాసుడు పట్టించండి. దరిద్రం వదుల్తుంది. బ్రెయిన్ భేషుగ్గా వుంటుంది. ఇల్లు నీటుగా వుంచుకోండి. బయటి కెళ్ళినప్పుడు ఎవరైనా బాధల్లో కన్పిస్తే సెల్ఫీలు తీసుకోకుండా వంద రూపాయలు ఇచ్చేయండి. మనకూ వుండొచ్చు బాధలు. కానీ ఈ లాక్ డౌన్ తో మనమెవ్వరం వూహించని కొత్త పీడిత వర్గం -నయా దరిద్రనారాయణులు పరిణమించారు. తలతిప్పుకుని వెళ్లిపోలేం. చాయ్ బిస్కెట్లు, మందు సిగరెట్లు, సినిమాల ఖర్చులూ తప్పాయిగా? అందులోంచి కొంత ఇచ్చేయండి. అలాగే వీధి కుక్కలు అల్లాడుతున్నాయి. ఓ బన్ను ముక్క పడెయ్యండి, హుషారుగా వుంటాయి. ఇలా ఎక్కువై పోయిందేమో... ఇక ఆపుదాం.
చూడదగ్గ జానర్ వైజ్ సినిమాల లిస్టు కోసం మంగళవారం చూడండి.
―సికిందర్