రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 25, 2017

553 : సందేహాలు - సమాధానాలు



Q : మీ రివ్యూలు అనాలసిస్ లు బావుంటాయి. మీరు ప్రతి రివ్యూనీ  త్రీ ఏక్ట్ స్ట్రక్చర్ తో కంపేర్ చేస్తుంటారు. కానీ చిరంజీవి గారి ‘ఖైదీ’  మిడిల్ - బిగినింగ్ - ఎండ్ స్ట్రక్చర్ లో వుంటుంది కదా. విశ్రాంతి సమయానికే కథ మొత్తం ప్రేక్షకుడికి తెలిసి పోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మిగిలింది హీరో విలన్స్ ని ఎలాగూ చంపుతాడు అనే ప్రేక్షకుడికి తెలిసిన విషయమే కదా. రజనీ కాంత్ ‘బాషా’ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి  దీనికి వున్న డిఫరెన్స్ ఏంటి? మీరు అనాలసిస్ రాస్తే చదవాలని వుంది. ఇది నా రిక్వస్ట్.
                                                                                              - ఉమా మహేష్ రెడ్డి


A : కథలకి వుండేది త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఒక్కటే. దాన్ని బిగినింగ్ – మిడిల్- ఎండ్ అనే వరసక్రమం అంటున్నాం.  అందుకని దేన్నైనా దీంతోనే రివ్యూ చేయాలి. ‘ఖైదీ’ లో వున్నది ఇదే స్ట్రక్చర్ వరసక్రమం మారింది. మీరన్న మిడిల్ - బిగినింగ్ – ఎండ్ లుగా. ఇది కథకుడి క్రియేటివిటీ, స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ లో ఒక వరసలో (లీనియర్ గా) వుండే బిగినింగ్ – మిడిల్- ఎండ్ విభాగాల్నే, అటూ ఇటూ మార్చడం (నాన్ లీనియర్ గా) కథకుడి క్రియేటివిటీ. దీన్ని బాగా అర్ధం జేసుకోవాలి. స్ట్రక్చర్ తో చేసే క్రియేటివిటీ మాత్రమే. ఇది ఫ్లాష్ బ్యాక్ తో కథ చెప్పడం తప్ప మరోటి కాదు. మిడిల్ తో కథ ప్రారంభించి, బిగినింగ్ కి వెళ్ళడమంటే, ఆ బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడమే.



          స్ట్రక్చర్ తో ఎప్పుడూ సమస్య వుండదు. దాంతో క్రియేటివిటీకి పాల్పడితేనే సమస్యలు ఎదురవుతాయి. మీరన్న విశ్రాంతి సమయానికే కథ మొత్తం ప్రేక్షకుడికి తెలిసి పోవడం లాంటిది. ఒకప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనంగా వున్నప్పుడు స్ట్రక్చర్ తో ఏం చేసుకున్నా సమస్య కాలేదు. ‘గుండెలు తీసిన మొనగాడు’ లో లాగా ఎండ్ సస్పెన్స్ చేసినా, ‘అంతస్తులు’ లో లాగా సెకండాఫ్ సిండ్రోం సృష్టించినా సమస్య కాలేదు. ఆ రోజుల్లో కథల నాణ్యత ఒక్కటే ప్రేక్షకులు పట్టించుకునే వారు, అదెలా చెప్పారనేది కాదు. కేవలం కథ నాణ్యంగా లేకపోతేనే తిప్పి కొట్టే వాళ్ళు. అయినా 90 లవరకూ కూడా అత్యధికశాతం సినిమాలు స్ట్రక్చర్ లోనే వుంటూ వచ్చేని.  ఫ్లాష్ బ్యాక్ సినిమాలు చాలా తక్కువ.

          తరాలు మారి,  వినోద సాధనాలు పెరిగి, వాటి రకరకాల ఫటాఫట్  పాప్ కార్న్ కంటెంట్స్ కి దృష్టి చెదరగొట్టుకుని, సినిమాల్లో కథల నాణ్యతని పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు. హీరోయిజాల మీద పడ్డారు. హీరోయిజాలకే రేటింగులూ టీఆర్పీలు ఇస్తూ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టారు. సినిమాలు నాణ్యంగా రాకుండా చెడగొడుతున్నది ఇతర దృశ్య మాధ్యమాలే. కాబట్టి ఓపిగ్గా రెండున్నర గంటలు కథ చూస్తూ కూర్చునే మానసిక స్థితి ఎవరికీ లేదు. చూపించే ఫటాఫట్ కథల్నైనా కన్ఫ్యూజ్ చేస్తూ  చెప్తే అసలే భరించలేరు. అందుకే ఒకప్పుడు వర్కౌట్ అయిన ఫ్లాష్ బ్యాకులు, ఎండ్ సస్పెన్సులు, సెకండాఫ్ సిండ్రోములు మొదలైన వాటికి  కాలం తీరింది. 

          ఇప్పుడు స్ట్రక్చర్ తో క్రియేటివిటీ కి పాల్పడుతూ ఒక ఫ్లాష్ బ్యాకుతో, అనేక ఫ్లాష్ బ్యాకులతో ఎక్కువ సినిమాలు వస్తున్నాయంటే, రెండే కారణాలని చెప్తారు మేధావులు :  కథలో సరుకు లేకపోవడం, అదో గొప్ప ఫ్యాషన్ గా ఫీలైపోవడం. తేటగా శుభ్రంగా బిగినింగ్- మిడిల్ – ఎండ్ క్రమంలో (స్ట్రక్చర్ లో) కథ చెప్పినంత హాయైన పని మరొకటి లేదు. రాం గోపాల్ వర్మ కథతో ఎప్పుడైనా గిమ్మిక్కులు చేశారా? ఫ్లాష్ బ్యాకులు చూపించారా? ‘శివ’ దగ్గర్నుంచీ చక్కగా బిగింగ్ మొదలెట్టుకుని,  మిడిల్ లో సంఘర్షణ జరుపుకుని,  ఎండ్ తో కథని కొలిక్కి తెచ్చి ముగిస్తూనే వున్నారు కదా? ఆయనకి లేని పైత్యం ఇతర్లకి ఎందుకు? ఆయన కథలు ఇప్పుడు బావుండకపోవచ్చు.  అయినా ఆయన కథలు చెప్పడం సార్వజనీన స్ట్రక్చర్ లోనే వుంటుందెప్పుడూ. బాగాలేవని తెలిసిన కథల్ని కూడా గిమ్మిక్కులు చేసి మెప్పించాలని చూడలేదు. 

          ఇంకా ‘ఖైదీ’ లాగానో, ‘బాషా’ లాగానో స్ట్రక్చర్ తో క్రియేటివిటీ ప్రదర్శించుకోవాలనుకుంటే తప్పకుండా ప్రదర్శించుకోవచ్చు. ఫ్యాక్షన్ సినిమాలన్నీ ‘బాషా’ ని అనుసరించి వచ్చినవే. అయితే ఇలా ఒక ఫ్లాష్ బ్యాక్ తో, లేదా అనేక  ఫ్యాష్ బ్యాకులతో కథలు చెప్పాలంటే పాటించాల్సిన కొన్ని సున్నితమైన టెక్నిక్స్ వున్నాయి. ఒకటే ‘ఖైదీ’, ‘బాషా’ మంత్రం లేదు. ఈ టెక్నిక్స్ అందరికీ అర్ధం గావు. హాలీవుడ్ సినిమాలు చూపించినా ఒప్పుకోరు. హాలీవుడ్ సినిమాల్లోంచి సులభంగా కథలు కొట్టేయాలి, కష్ట పెట్టే టెక్నిక్స్ ని కాదు. కాబట్టి అవే ఖైదీలూ బాషాలూ అలాగే చేసుకోనియ్యాలి. ‘గరుడవేగ’ అలా చేసిందే.

 Q : ‘గరుడవేగ’  స్క్రీన్ ప్లే సంగతుల్లో ఫ్లాష్ బ్యాక్ లో అసలు కథ సెకండాఫ్ లో అరగంటకి చూపించడం కరెక్ట్ కాదని మీరన్నారు. మీరే పేర్కొన్న స్పైడర్, సింగం -3, వివేకం మొదలైన చిత్రాల్లో,  అసలు కథ ఫస్టాఫ్ లోనే ఓపెన్ చేసినా అవి ఫ్లాపయ్యాయి కదా? దీనికేం చెప్తారు?   
 జిఏఆర్ (కెనెడా)
 (పూర్తి పేరు వెల్లడించ వద్దన్నారు)

A : ‘గరుడవేగ’ స్క్రీన్ ప్లే సంగతులు మొదటి వ్యాసంలో స్పష్టం చేశాం దీన్ని. మీరన్న సినిమాలు ఫ్లాపవడానికి కారణం కథ ఫస్టాఫ్ లో మొదలవడం కాదు. వేరే క్రియేటివ్ కారణాలున్నాయి. ఇంకోసారి ఆ వ్యాసం చూడండి. స్ట్రక్చర్ (బిగినింగ్ –మిడిల్ –ఎండ్) వల్ల సినిమాలు ఫ్లాప్ కావు. స్ట్రక్చర్ తో క్రియేటివిటీ ప్రదర్శిద్దామని స్ట్రక్చర్ ని చెదరగొట్టినప్పుడే ఫ్లాపవుతాయి.  ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో (మిడిల్ –బిగినింగ్- ఎండ్)  కథ చెప్పడం స్ట్రక్చర్ ని చెడగొట్టడం కాదు. కేవలం విభాగాల్ని అటూఇటూ మార్చడమే. స్ట్రక్చర్ ని  చెదరగొట్టడం ఎప్పుడవుతుందంటే, ఒక విభాగం స్పేస్ లోకి ఇంకో విభాగాన్ని చొరబెట్టడం వల్ల అవుతుంది. కింది పటంలో స్ట్రక్చర్ ని చూడండి :



          ఇందులో బిగినింగ్, ఎండ్ లు చెరి  25 శాతముంటే, మిడిల్ ఇంటర్వెల్ కి ఇటూ అటూ కలుపుకుని 50 శాతముంది. ఇందులో ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమయ్యే చోట,  ప్లాట్ పాయింట్ -1 వుంది. ఇక్కడ కథ మొదలవుతుంది. అప్పుడు కథ స్ట్రక్చర్ లో వున్నట్టు. ఇప్పుడు ఈ కింది పటం  చూడండి : 


          ఇందులో బిగినింగ్ విభాగం దాని 25 శాతం స్పేస్ ని అతిక్రమిస్తూ ఇంటర్వెల్ ని కూడా దాటిపోయి,  మిడిల్ స్పేస్ ని అవతల ఎండ్ లోకి నెట్టేస్తూ ప్లాట్ పాయింట్ -2 వరకూ, 75 శాతం దాకా ఆక్రమించింది. అంటే కథ ఇక్కడ ప్రారంభమవుతుందన్నమాట. ఆ కథకి  పాతిక శాతమే స్పేస్ వుంటుందన్నమాట. స్క్రీన్ ప్లేలో బిగినింగ్ అంటే కథకి ఉపోద్ఘాతమే, కథ కాదు. కాబట్టి ఇక్కడ 75 శాతం వరకూ  ఉపోద్ఘాతమే చూసి,  అప్పుడు ఓ పాతిక శాతం మాత్రమే కథ చూస్తామన్న మాట. ‘గరుడవేగ ‘ లో ఇదీ జరిగింది.

 Q : ఇప్పుడు ఏదైనా ఒక కథను టెంప్లెట్ స్క్రీన్ ప్లే గా రాయాల్సిన గత్యంతరం ఏర్పడితే – ‘ఖైదీ’ స్ట్రక్చర్ స్లాట్ లో పెడితే,  తరవాత ఏంటని ప్రేక్షకుడికి తెల్సి పోతుంది. బిగినింగ్ ని చివరిదాకా లాగితే ఎండ్ సస్పెన్సో, లేక పోతే కథేంటో చెప్పకుండా ఇంకా ఎంతసేపు రా బాబూ అని ప్రేక్షకుడు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధిగమించే మార్గం ఏది?
                                                                                                                                     - ఉమా మహేష్ రెడ్డి  
                                                                                                      

 A :   స్క్రీన్ ప్లేనే వుంటుందండీ, టెంప్లెట్ స్క్రీన్ ప్లే వుండదు. అది బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అనే, మనిషి మెదడు కథల్ని రిసీవ్ చేసుకునే వరుస విభాగాలతో, యూనివర్సల్ స్ట్రక్చర్ గా ఏర్పడి, కాలపరీక్షకి తట్టుకుని నిలబడుతోంది. టెంప్లెట్ అనేది వున్న స్ట్రక్చర్ లోపల కథనానికి క్రియేటివ్  వెర్రితల.  వెరసి ‘టెంప్లెట్ సినిమా’ అవుతుంది. పూరీ జగన్నాథ్ సినిమాల్లాగా. అంటే, ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్ -  ఇక సెకండాఫ్ లో హీరోయిన్ కట్ అయిపోయి, విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపూ ఇంతే. కొన్ని పోపు డబ్బాలు వరసగా పెట్టుకుని (బ్యాంకాక్ బీచిలో) వాటిలో అవే దినుసుల్ని నటీనటుల్ని మారుస్తూ వరసగా వేసుకుంటూ పోవడమన్న మాట. ఇది కథనానికి వర్తించే క్రియేటివిటీ. స్ట్రక్చర్ అలాగే వుంటుంది.  ఇక మీప్రశ్నలో చివరి భాగం - దీన్ని అధిగమించే మార్గం ఏది? అనేదానికి -  అధిగమించే మార్గాలు 'శివ' దగ్గరే వాటి మానాన వాటిని వదిలేసి దారితప్పి తిరుగుతున్నాం. ‘శివ’ని చూసి తెలుసుకోండి. శివ = సిడ్ ఫీల్డ్. ఇంతకన్నా ఏం కావాలి.


 సికిందర్

552 : రివ్యూ!






రచన- దర్శకత్వం : పవన్ మల్లెల
తారాగణం : నారా రోహిత్, రెజీనా, మ్యకృష్ణ, పృథ్వీ, అజయ్, ఆదిత్యా మీనన్, రామరాజు, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి దితరులు
థః కొలుసు రాజా, సంగీతం : ణిశర్మ, ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్
బ్యానర్ : మాయా జార్ మూవీస్, స్ చంద్రిక విజరీ, మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : బి.హేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల : నవంబర్ 24, 2017
***
      నారా రోహిత్ సినిమా అంటేనే  ఏదో వెరైటీ పాత్ర అని ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. లేదు,  నేనూ మాస్ కొస్తా, ఒక మాస్ యాక్షన్ నేనూ చేస్తానంటూ వస్తాడని ఎవరూ వూహించి వుండరు. అదీ ఆరిపోయిన ఫ్యాక్షన్ దీపం వెల్గించుకుంటూ. తన మీద ఓ అంచనా, తనకంటూ గిరిగీసిన ఓ ఇమేజీ అంటూ లేనప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. అలాగే ‘బాలకృష్ణుడు’ అనే ఈ పాత మూసతో ప్రేక్షకుల మధ్య కొచ్చేశాడు. ఓల్డ్ డ్రామా మీద చాలా మక్కువున్న వాడిలా కన్పిస్తున్న దర్శకుడు పవన్ కూడా, ఓల్డ్ డ్రామాని ఈ కాలం ప్రేక్షకులు మిస్సవుతున్నట్టు భావించుకుని ఈ ఫ్యాక్షన్ కి సాహసించినట్టుంది. ఇంతకీ వీళ్ళిద్ద రేం చేశారు? పాతని పాతలాగే చూపించే చాదస్తాలకి పోయారా, లేక ఏమైనా కొత్త దనం చూపించారా, ఫ్యాక్షన్ లో కొత్తదనం చూపించడాని కేముంటుంది....ఇవన్నీ ఓ సారి పరిశీలిద్దాం.
కథ
 
       కర్నూలు జిల్లాలో రవీందర్ రెడ్డి (ఆదిత్యా మీనన్) ఫ్యాక్షన్ ని రూపుమాపాలని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడు. అతడి చెల్లెలు భానుమతి (రమ్యకృష్ణ) సహకరిస్తూంటుంది. ప్రజల్లో వీళ్ళకి వస్తున్న మంచి పేరుకి తాళలేక బసిరెడ్డి (రామరాజు) రవీందర్ రెడ్డిని అణచాలని చూసి అవమాన పడతాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో అతడి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) రవీందర్ రెడ్డిని చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. అతడి మనుషుల్ని భానుమతి చంపించేస్తుంది. ప్రతాపరెడ్డి పోలీసులకి లొంగిపోతాడు. అయినా  భానుమతి మీద పగ వదులుకోడు. భానుమతి మేనకోడలు ఆద్య (రేజీనా) హైదరాబాద్ లో వుందని తెలుసుకుని,  తన పగకి ఆమెని వాడుకోవాలనుకుంటాడు. ఆద్యకి ఆమెకి తెలియకుండా భానుమతి ఒక బాడీ గార్డుని నియమిస్తుంది. ఆ బాడీగార్డు బాలు (నారా రోహిత్) ఆద్యతో ప్రేమలో పడతాడు. ఇప్పుడు జైలు నుంచి ప్రతాపరెడ్డి విడుదలై వస్తాడు. ఇక అతడి బారి నుంచి ఆద్యని బాలు ఎలా కాపాడేడు, కాపాడే క్రమంలో ప్రతాపరెడ్డిని ఎన్ని విధాలుగా ఏడ్పించి పీడా వదిలించాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
        పైన చూస్తేనే తెలిసిపోతోంది  కథెలా వుందో. ఇంకా అదే ఫ్యాక్షనేంటంటే ఇంతే. అవే రోమాంటిక్ కామెడీలూ,  అవే దెయ్యం కామెడీలూ  కుప్పతెప్పలుగా రావడం లేదా? ఇవి తప్ప ఇంకేమైనా వస్తున్నాయా? వీటికి అందమైన కావ్యాలుగా  రివ్యూలు కూడా రాసి తరించడం లేదా? ఇలాంటప్పుడు వీటి నుంచి కాస్త ఆటవిడుపుగా అదే ఫ్యాక్షన్ చాలా కాలం తర్వాత వస్తే తప్పేముంది?  రోత పుడుతున్న అవే రోమాంటిక్ కామెడీలూ,  అవే దెయ్యం కామెడీలకంటే ఇదే నయం. ఎందుకంటే ఇది ఫుల్ కామెడీ. నవ్వించని క్షణాలు ఏవైనా వున్నాయా అని వెతుక్కోవాలి. నవ్వులాటలో పాత ఫ్యాక్షన్ పాత వాసనా మర్చిపోతాం. కథలో ముందేం జరిగిందో నాకు తెలీదు, నేనొచ్చాక  నీ (విలన్) అవసరం లేదు, ఈ కథకి నేనే హీరో - నంటూ కామెడీ హీరో అన్నాక పాత ఫ్యాక్షన్ సీనంతా మారిపోక ఏమవుతుంది. 

ఎవరెలా చేశారు
      కెరీర్ తో కొత్త ప్రయోగాలు చేసే నారారోహిత్ కి ఒక మసాలా యాక్షన్ చేయాలన్పించి అందుకు ఫ్యాక్షన్ ని ఎంచుకున్నాడు. దాదాపు హీరోలందరూ ఫ్యాక్షన్ చేసేశారు. ఆలస్యంగా వచ్చిన తను కూడా ఓ ఫ్యాక్షన్ చేయకపోతే వెనుకబడి పోతాడు. దేశం చిన్న చూపు చూస్తుంది. అందుకని కాల యంత్రంలో వెనక్కి ప్రయాణించాడు. బరువు తగ్గి,  సిక్స్ ప్యాక్ తో సిద్ధమై డాన్సులకి , ఫైట్లకి వొళ్ళు కదలకపోయినా కెమెరాని కదిలించుకుంటూ యాక్షన్ కామెడీ పాత్ర లాగించేశాడు. పాత్ర ఫ్యాక్షన్ కుటుంబంలో లేకపోవడం కామెడీకి తోడ్పడింది. ఫ్యాక్షన్ కుటుంబంలో వుండుంటే  అదే పాత టెంప్లెట్ ఫ్యాక్షన్ గా హింసా రక్తపాతాలతో ఎరుపెక్కి ఏవగింపు కల్గించేది.  అనేక  కామెడీ ట్విస్టులిస్తూ పాత్ర సాగడంతో బోరు కొట్టించే ప్రమాదాన్ని తప్పించుకుంది. తన పాత్రే ఈ సినిమా. ఆ  పాత్ర పాత మసాలా యాక్షన్ కి వినోదాన్ని జోడించింది. ఈ వినోదం విలన్ ఇంట్లో హీరో చేరి చేసే టెంప్లెట్ వినోదంగా  గాక,  సాంతం ఔట్ డోర్ ప్రయాణంలోనే సాగడం అడ్వెంచరస్ కామిక్ థ్రిల్లర్ గా మారడానికి వీలిచ్చింది. పాత్రకి తను  రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వున్నానని అస్సలు తెలియకపోవడమే తన ధోరణిలో పూర్తిగా వేరే  రూటులో వేరే కథ నడపుతూ నవ్వించడానికి తోడ్పడింది. రోహిత్ చేసిన కొన్ని ప్రయోగాలకన్నా ఇదే నయం. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా, బి సి సెంటర్లలో మాస్ కి దగ్గరవుతాడు కనీసం.

          రెజీనాదీ హాస్య పాత్రే, ఏదో పాటల్లో కన్పించి పోయే గ్లామర్ డాల్ గా కాకుండా, ఆద్యంతం దాదాపు ప్రతీ సీనులో సీనుకి తగ్గ తంటాలు పడుతూ వుంటుంది. హీరో తన బాడీ గార్డు అని తెలీక పోవడమనే సస్పెన్స్ ఆమె పాత్రని ఆసక్తికరంగా మార్చింది. దుర్యోధనుడిగా ఆమె ద్రౌపది చీర లాగే కామెడీ 

          మూడో కీలక పాత్ర- ప్రకృతి ప్రేమికుడు పృథ్వీది. ఇంటర్వెల్ కి ముందునుంచీ హీరోకి తగిలి,  ఇక హీరో వెంటే వుండాల్సిన ఖర్మతో- విషయం తెలీక లేనిపోని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ సృష్టించే పాత్రలో,  మరోసారి తను పరువు నిలబెట్టుకున్నాడు. 

          రమ్యకృష్ణ  ఫ్యాక్షన్ మార్కు పగతో వుండే సీరియస్ పాత్ర. ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకం ట్రూపు వాడిగా శ్రీనివాసరెడ్డి, పది పెళ్ళిళ్ళు చేస్తేగానీ పెళ్లి కాదని జ్యోతిష్కుడు చెప్పడంతో,  ఆ పనిలో వుండి నానా తన్నులు తినే పాత్రలో వెన్నెల కిషోర్, ఇంకో ఇద్దరు  కమెడియన్లు రఘుబాబు, తాగుబోతు రమేష్ లు ఎంటర్ టైన్ చేస్తారు. ఇవి మూస పాత్రలే.  అయితే మూస  రోమాంటిక్ కామెడీల్లో, దెయ్యం కామెడీల్లో హీరోహీరోయిన్ల కంటే, కమెడియన్ల కంటే బెటర్. విలన్ గా అజయ్ తన విలనీతో, అయోమయంతో బాగానే చేశాడు. 

          మణిశర్మ పాటలు ఓ మాదిరి. క్యాచీ ట్యూన్స్ మాత్రం లేవు. విజయ కుమార్ ఛాయాగ్రహణం రొటీనే. ఇతర సాంకేతిక విలువలు మామూలుగా వున్నాయి.

చివరికేమిటి 
      దర్శకుడు పవన్ ప్రథమ ప్రయత్నం అనుభవమున్న దర్శకుడిలాగా వుంది. అయితే ఇలా పాత సినిమాలే మళ్ళీ తీయకుండా వుండ గల్గాలి. సీన్లని వేగంగా పరిగెత్తించ గల నేర్పే ఈ పాతని మరిపించగల్గింది. కథలో ప్రతీ పది నిమిషాలకోసారి ట్విస్ట్ ఇస్తూ కథనం చేయడం వల్ల పాత కథే సరే చూద్దామనే పరిస్థితి కల్పించింది. విలన్ ఫ్యాక్షనిస్టు  అని తెలీక హీరో పట్టేసుకుని పది  కోట్లు సంపాదించుకునే ట్రాకే ఈ యాక్షన్ కామెడీని కాపాడింది. ఫస్టాఫ్ – సెకండాఫ్ రెండూ కథలో కొత్త విషయాలు బయట పెడుతూ పరుగులెత్తడంతో –రొటీనే అయినా ఈ యాక్షన్ కామెడీని  కదలకుండా చూస్తూ కూర్చునేలా చేశాయి. ఎండిపోయిన రోమాంటిక్ కామెడీలనీ, దెయ్యం కామెడీలనీ వెక్కిరిస్తూ,  ఎండిపోయిన ఫ్యాక్షన్ ని నేనూ వున్నానంటూ ‘బాలకృష్ణుడు’  ఓ సెటైర్ వేసింది...

-సికిందర్
www.cinemabazaar.in










Thursday, November 23, 2017

551 : సెకండాఫ్ సంగతులు

    సెకండాఫ్ మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాగానే  ఈ సినిమా కథకి  ‘ఉపోద్ఘాతం’’ చెప్పే  (ఇంకా కథ మొదలవనే లేదు) టీవీ ఛానెళ్ళ ప్రసారాల ప్రహసనం మొదలై, ఫస్టాఫ్ మోడర్నిటీని ఇదెంత డిగ్నిటీ లేకుండా చేసి, ఏకసూత్రతని నీరుగార్చిందో గత వ్యాసంలో తెలుసుకున్నాం.  దీని తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకుడు ప్రతాప రెడ్డి  వస్తాడు. ఇతను ఇది రూలింగ్ పార్టీ చేసిన రాజకీయ కుట్రంటూ చిందులేస్తాడు. ముందు ఫస్టాఫ్ లో చూపిస్తూ వచ్చిందంతా మత కోణంలో  స్వతంత్రంగా టెర్రరిస్టులతో బాంబు దాడి కుట్రలా అన్పిస్తే, ఇదిప్పుడు రూలింగ్ పార్టీ చేసిన రాజకీయ కుట్ర కలరిచ్చుకుంది. రూలింగ్ పార్టీ టెర్రరిస్టులతో రాజకీయ కుట్ర చేయడమేమిటి. ఇదే సందేహం ఫస్టాఫ్ లో ఒక పాత్రకి వస్తుంది – టెర్రరిస్టు రాజకీయ కుట్రలో పాల్గొనడమేమిటని. చివరికి  దీనికి మతకోణంతో  మేనేజ్ చేశారు.  

         ఒక సినిమా కథ ఏ పాయింటు మీదా నిలబడక ఇలా అరగంటకో పాయింటు చొప్పున మారిపోతూ వుంటుందా?  టెర్రరిజంలోంచి రాజకీయంలోకి, రాజకీయంలోంచి మైనింగ్ మాఫియాలోకి? వేర్వేరు జానర్ల లోకి? వేర్వేరు ఒక్కో బుల్లి కథా అన్పించేలా కొన్ని ఎపిసోడ్లుగా నడుస్తూ వుండే  కథనంతో – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య లాంటివి చూశాం గానీ, ఇలా కాదు. వీటిలో కథని దాచిపెట్టి  మభ్య పెట్టడం వుండదు. దేనికది విడివిడి ఎపిసోడ్లతో పొరపాటు చేశారని తెలిసిపోతూనే వుంటుంది. ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో  డాక్యుమెంటరీలు తీస్తారు. సినిమాకి కొన్ని  బేసిక్స్ వుంటాయి : కథ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఉచ్చులో పడకుండా చూసుకోవడం, మిడిల్ మటాష్ అవకుండా చూసుకోవడం, కథ గాథ అవకుండా చూసుకోవడం, కథ సెకండాఫ్ సిండ్రోమ్ కాకుండా చూసుకోవడం, కథ ఎండ్ సస్పెన్స్ కాకుండా చూసుకోవడం, కథని కథకుడు నడపకుండా చూసుకోవడం, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ విబేధించకుండా జాగ్రత్త పడడం...ఇలా...

          స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ సినిమాల కొచ్చి ఎలా తిరగబెడుతుందంటే,  తడవకో పాయింటు వచ్చి పడుతోంటే, ఒకే పెద్ద కథలా అన్పించక, చిన్న చిన్న కథల సంపుటి అన్పించేలా అసంతృప్తికరంగా తయారవుతుంది – ఇదే దర్శకుడి ‘చందమామ కథలు’ లాగా. ఐతే ‘గరుడ వేగ’ ని ఉద్దేశపూర్వకంగా ‘చందమామ కథలు’ లాగా తయారు చేశారనుకోలేం - వీలైనంత ఎక్కువ సేపు కథని దాచిపెట్టే ప్రయత్నంలో (ఎందుకో?) వేరే కథనాలతో కాలక్షేపం చేస్తూపోయారు. ఆ ప్రయత్నం ‘చందమామ కథలు’  లాగా చిన్న చిన్న కథల సంపుటిలా మారిపోయింది. చిన్న చిన్న కథల సినిమాలు తెలుగులో ఆడవు. ఒకే పెద్ద కథ వుండాలి. నవలలు రాజ్యమేలిన కాలంలో నవలలే అమ్ముడయ్యేవి గానీ, కథానికల సంపుటాలు వేస్తే నిల్వ వుండేవి. తెలుగు పాఠక – ప్రేక్షక లోకం అభిరుచికి సినిమాల విషయం కూడా ఇంతే. 

     పరిశుభ్రంగా,  సీదా సాదాగా కథ చెబితే ఏమవుతుంది? మంచి కథవ్వాలంటే, సినిమాలకి ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే, కథకి క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ ముఖ్యం కదా?  హాలీవుడ్ సినిమాల ప్రభావంతో  ఇలాటి హై కాన్సెప్ట్ తో కూడిన భారీ  యాక్షన్ సినిమాలు  తీస్తున్నప్పుడు, హాలీవుడ్ లోంచి ఏం తెలుసుకుంటున్నట్టు? హై కాన్సెప్ట్ కథల్లో వుండే బిగ్ ఇష్యూస్ తో లైనాఫ్ యాక్షన్ సింపుల్ గా, క్లీన్ గా వుంటే బలంగా వుంటుందని కదా? ఇందుకు వ్యతిరేకంగా, అదే లో- కాన్సెప్ట్ కథల్లో వుండే  చిన్న పాయింటుకి  లైనాఫ్ యాక్షన్ సంక్లిష్టంగా వుంటే బలంగా వుంటుందని కదా? ఇవి బేసిక్సు. అసలు  బేసిక్స్ ఏమిటో లిస్టు ముందు పెట్టుకుని సినిమా కథకి శ్రీకారం చుట్టకపోతే,  ఆ కథ తుగ్లక్ పాలనలాగే  వుంటుంది.

          పైగా ఈ రాజకీయ పాత్ర పవర్ఫుల్ పాత్ర కాదు. పోసాని రూపంలో ఒక  కామెడీ పాత్ర. ఫస్టాఫ్ హై ఓల్టేజి యాక్షన్ అంతా ఈ కామెడీ పాత్ర రాకతో నేలపాలు. ఒక కామెడీ పాత్రని  చంపడానికి అట్టహాసంగా అంత బాంబు దాడి కుట్రంతా అవసరమా. లాల్చీ పైజమా వేసుకుని పాత మూస నేతలా కన్పించగానే సినిమాలో పెప్ అంతా పోయింది. జానర్ మర్యాద ప్రకారం ఫుల్ హవాతో, ఒక బలమైన హై ప్రొఫైల్ పొలిటీషియన్ కదా కావాల్సిం దిక్కడ?

          ఈ ప్రతాపరెడ్డి కూడా ఏమారోపిస్తున్నాడు? రాజకీయ కుట్ర అంటున్నాడు. అసలు తనకి  మైనింగ్ మాఫియాతో సంబంధమున్న విషయం మనకి సస్పెన్స్ లో వుంచారు (ఎందుకో?). అలాంటప్పుడు ఈ బాంబు దాడి కుట్ర మాఫియా విలనే చేసి వుంటాడని ప్రతాపరెడ్డికి అన్పించదా? ఒకవేళ మాఫియాతో  సంబంధాలు కప్పి పుచ్చడానికే  ఈ ఆరోపణ చేసి వుంటే, తర్వాతైనా మాఫియాని నిలదీయాలనుకోడా?  అంతా తికమక. ప్రేక్షకులు  ఉదారంగా, ఎంతో ఔదార్యంతో, సినిమా భక్తితో అరమోడ్పు కనులతో వివశులై, దైవ సమానులైన మేకర్లు అందించే  సినిమాలు చూస్తారు గనుక, ఏదో  పైపైన పాలిష్ చేసి చూపించేస్తే సరిపోతుందనేమో ఇలా! 

          ఇతడితో కామెడీ సీన్లు నడుస్తూండగానే, ఎక్కడో టీవీ చూస్తున్న విలన్ కొద్ది క్షణాలు కన్పించి కట్ అయిపోతాడు. రోబో చెయ్యితో, ఇంకేదో మాయ కన్నుతో హైఫైగా అట్టహాసంగానే  వుంటాడు. మళ్ళీ ఇతనెవరు?  టెర్రరిస్టు నాయకుడిలా లేడే? అంటే  మొదలెట్టబోయే  అసలు మాఫియా కథకి మనం చూడబోయే అసలు విలన్ అన్నమాట. ఫస్టాఫ్ గంటంపావు, సెకండాఫ్ ఇప్పటిదాకా ఇంకో పావుగంట – మొత్తంకలిపి గంటన్నర సేపు విలనే కన్పించకపోతే ఎలాటి బిగ్ కమర్షియల్ యాక్షన్ కథ? కథని ఎండ్ సస్పెన్స్ చేస్తే, దాంతో ముడిపడి వుండే  విలన్ కూడా ఎండ్ లోనే కన్పిస్తాడు. మార్కెట్ యాస్పెక్ట్ తో ముడిపడని  ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ అవసరమా? 

          ఇక  సెకండాఫ్ ఇదే మొదటి ఎపిసోడ్ లో సుల్తాన్ బజార్ లో మళ్ళీ రషీద్ సుల్తాన్ అనే టెర్రరిస్టుతో ఇంకేవో  డీలింగులు!  ఇప్పుడు సెకండాఫ్ లో కూడా ఇరవై నిముషాలు గడిచిపోతున్నా కథేంటో వూహకందదు. అంటే ఫస్టాఫ్ లో ప్రారంభించిన బిగినింగ్ విభాగం ఇంటర్వెల్ ని కూడా దాటేసి,  సెకండాఫ్ లో ఇంకా ముగియడం లేదు. ఇలా కథకి స్ట్రక్చర్ అంతా చెదిరిపోయింది. ఈ బిగినింగ్ ఎప్పుడు ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఇంకె ప్పుడొస్తుంది? వచ్చాక మిడిలెంత కుంచించుకు పోయి వుంటుంది? అప్పుడు మొత్తం సినిమాలో అసలు  ‘విషయం’ ఏ మేరకు సోసోగా వుంటుంది?

ఇంటరాగేషన్ ఇంటికి!
        ఇదే మొదటి ఎపిసోడ్ లో  ఇంటర్వెల్లో పట్టుబడ్డ నిరంజన్ ఇంటరాగేషన్ విషయం. ఇంటర్వెల్లో సాహసించి హీరో పట్టుకున్న నిందితుణ్ణి ఇంటరాగేషన్ ఎవరు చేస్తారని మనం వూహిస్తాం? అదే హీరో చేస్తాడని కదా. అలా జరగదు.  హీరో అసిస్టెంట్స్ చేస్తూంటారు. ఫస్టాఫ్ లో అంత భారీ ప్రమాదకర కుట్ర చూపించాక, ఇప్పుడు దాని విలువ తనే తగ్గించుకుంటూ కథకుడు, ఇంటరాగేషన్ ని అసిస్టెంట్స్ కి అప్పగించి  హీరోని దూరం పెట్టేశాడు. 

          ఫస్టాఫ్ అంతా ఏమేం కథానికలు చూపించినా,  హీరో కి ఒక క్యారక్టర్ ఆర్క్ అంటూ ఏర్పడిందనీ, దాంతో టైం అండ్ టెన్షన్  గ్రాఫ్ ఏర్పాటయ్యిందనీ  గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఈ రెండూ ఇంటర్వెల్ కొచ్చే టప్పటికి రాంగ్ ఇంటర్వెల్ బారినపడి సంతృప్త స్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకున్నాం. ఇంటర్వెల్లో కథనాపేశారు. మళ్ళీ వెంటనే కథని ఎత్తుకోవాలంటే ఏదో చేసి హీరోనే గతి. ఎందుకంటే హీరో క్యారక్టర్ ఆర్క్ ఏర్పడక పోతే ఏదీ వుండదు. హీరో క్యారక్టర్ ఆర్క్ ఏదో చేస్తూ పోతేనే ఏర్పడుతుంది. క్యారక్టర్ ఆర్క్ లేకుండా టైం అండ్ టెన్షన్  గ్రాఫ్ ఎలా ఏర్పడుతుంది? కనుక  చల్లారిన అన్నమే వడ్డించడం మొదలెట్టారిలా.

          సెకండాఫ్ ప్రారంభమయ్యాక టీవీ ఛానెళ్ళతో, రాజకీయ నాయకుడితో పతనమైన ఈ గ్రాఫ్ ని హీరో చేత ఇంటరాగేషన్ చేయించైనా మళ్ళీ లేపాలనుకోలేదు. ఈ మొదటి ఎపిసోడ్ అంతా  హీరోకి ప్రాధాన్యమే లేదు. నిందితుణ్ణి పట్టుకున్న హీరో ముందుగా  వాడి సంగతి చూస్తాడు ఎక్కడైనా. ఇక్కడ హీరో కన్పించకుండా పోయి, నిందితుడైన నిరంజన్ని హీరో అసిస్టెంట్స్ టార్చర్ చేస్తూంటారు! ఎందుకీ మైనర్ క్యారక్టర్స్ తో పసలేని చిత్రీకరణ? తెలుసుకుందాం దీని వెనుక కథకుడి ఉద్దేశం. అప్పుడొక కన్నింగ్ లాయర్ వస్తాడు. ఇక మనకి అర్ధమై పోతుంది, ఇక్కడ హీరో ఎందుకని లేకుండా చేశాడో కథకుడు. 

          హీరో వుంటే ఈ కన్నింగ్ లాయర్ రాలేడు. నిందితుడితో డీల్ కుదుర్చుకుని చక్కా పోలేడు. అందుకని  కథకుడాశిస్తున్న కథా సౌలభ్యం కోసం హీరో బహిష్కృతుడయ్యాడు. 

          హీరో గనుక ఇంత ముఖ్యమైన ఇంటరాగేషన్ సీనులో వుంటే, ఎవరో లాయర్ వచ్చాడని లేచి బయటి కెళ్ళిపోడు. లాయర్ని పొమ్మంటాడు. లాయర్ లోపలి కెలా వచ్చాడని అసిస్టెంట్స్ మీద కేకలేస్తాడు. ఎన్ఐఏ  ఆఫీసు అంటే పోలీసు ఠాణా కాదుగా. అదీ ఇంటరాగేషన్  రూములోకి ఎవరో వచ్చేసి డిస్టర్బ్ చేస్తే వూరుకుంటారా? ఇప్పుడు ఇలా వచ్చేసి నిరంజన్ తన  క్లయంట్ అనీ, క్లయింట్ తో మాట్లాడే అధికారం తనకుందనీ అంటాడు. ఎలా ఎప్పుడయ్యాడు  క్లయంట్ ? పేపర్స్ ఏవీ? అసిస్టెంట్స్ అడగరు. లేచి బయటికెళ్ళి పోతారు చక్కగా  – ఓహ్ గాడ్! ఎన్ఐఏ !!

          ఒకవేళ పేపర్స్ చూపించినా ఇలా వచ్చేయడానికి ఇదేం  పోలీస్ స్టేషన్ కాదు. టెర్రర్ కేసులో నిందితుణ్ణి కోర్టుకి అప్పగించాకే లాయర్ బెయిల్ కి మాత్రమే వేయగలదనేది కామన్ సెన్సు. ఆ బెయిల్ రావడానికి ఏళ్ళు పడుతుంది.  లేకపోతే  అసలు బెయిలే రాకపోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి  వస్తోందంటే, ఎన్ఐఏ గురించి చాలా రీసెర్చ్ చేశామన్నందుకు. సృజనాత్మక స్వేచ్ఛ అనే అధికారంతో ఇతర వ్యవస్థల అపసవ్య చిత్రణలు  అయిపోయాయి, ఇక ఎన్ఐఏ దొరికింది!  సృజనాత్మక  స్వేచ్ఛే ముఖ్యమనుకుంటే  రీసెర్చి దేనికి? సృజనాత్మక స్వేచ్ఛకి కూడా సమయ సందర్భాలుంటాయి.  ఎక్కడబడితే అక్కడ, ఎలాబడితే అలా వాడలేరు. ఫాల్స్ డ్రామా సృష్టించి ఆకట్టుకోలేరు.  

          నిరంజన్ దగ్గరున్న చిప్ కోసం పదికోట్లకి ఒప్పందం చేసుకుని, విదేశాలకి జంపయ్యేలా చూస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోతాడు కన్నింగ్ లాయర్. ఎన్ఐఏ ఆఫీసులో ఎన్ఐఏ కేసుని నీరుగార్చే ఇంత కుట్ర! అయినా హీరో ఏమీ చెయ్యడు! నిరంజన్ దగ్గర చిప్ వుందని హీరోకే తెలీదు! అసలు నిరంజన్ అయ్యర్ అనే వాడు  వేరేమత టెర్రరిస్టు ఎలా అయ్యాడో తెలుసుకోడు, మనకి చెప్పడు. ఈ ఎన్ఐఏ ఆఫీసులో లాయర్ కుట్ర అనే అనాలోచిత రచన, దీని తర్వాతి రెండో ఎపిసోడ్ లో హీరో పాత్ర ఇంకెంత దెబ్బతినడానికి కారణమయిందో చూద్దాం.
                                                         
రెండో ఎపిసోడ్ - సీనస్ ఇంటరప్టస్
      ఇక రెండో ఎపిసోడ్ లో నిరంజన్ ని నాగపూర్ జైలుకి తరలించే ప్రహసనం, ఆగిపోయిన ఇంటరాగేషన్ సంగతి పూర్తి చేయకుండానే, ఇంకో విషయంలోకి జంప్. ఫస్టాఫ్ ఓపెనింగ్ టీజర్ దగ్గర్నుంచీ కన్పిస్తున్న ఇతనెవరో ఇప్పటికైనా మనకి తెలియజేసి, టెంపోని – స్టోరీ డైనమిక్స్ నీ  ఇంకా పైస్థాయికి ఎగబ్రాకించాలన్న ఆలోచన లేకుండా! ఇంకా ఇతనెవరో తెలియని చప్పిడి కథనమే అందిస్తున్నారు మనకి. ఎప్పుడో ఆకలి చచ్చిపోయాక ఇతనెవరో చెప్తే ఎంత, చెప్పక పోతే ఎంత. సెటప్ కీ, దాని పేఆఫ్ కీ మధ్య ఒక పక్వానికొచ్చే వ్యవధి వుంటుంది. ఆ వ్యవధి దాటితే  పేఆఫ్ కుళ్ళిపోతుంది. 

          మొన్న ‘డిటెక్టివ్’ లో ఓపెనింగ్ టీజర్ గా చూపించిన పిడుగుపాటు మృతి అనే సెటప్ ని, ఇంటర్వెల్ కల్లా అదెలా జరిగిందో చెప్పేసి పే ఆఫ్ చేశారు. ఇంకెప్పుడో సెకండాఫ్ లో చెబితే పే ఆఫ్ అవదు, బూమరాంగ్ అవుతుంది. ఒక ఓపెనింగ్ బ్యాంగ్ తో మొదలయ్యే తెలుగు సినిమాలు కూడా ఇంటర్వెల్ కల్లా ఆ బ్యాంగ్ కి అర్ధం చేప్పేసి కథతో ముందు కెళ్ళిపోతాయి. ఇలా ఓపనింగ్ టీజర్ లో సుదీర్ఘంగా అవసరంలేని యాక్షన్ అంతా చేసిన మైనర్ పాత్ర నిరంజన్ సెటప్ ని, ఇంటర్వెల్లో దొరికిపోయినప్పుడు అప్పుడే అతనెవరో రివీల్ చేస్తేనే మనుగడలో వున్న ఓపెనింగ్ టీజర్ బతికి పే ఆఫ్ అయ్యేది. దానికక్కడి వరకే సారవంతమైన భూమి, ఆ తర్వాత ఫలదీకరణ చెందదు. ఇంటర్వెల్ తర్వాత దానికి బతుకు లేదు. ఇది గమనించకుండా,  ఇంకా సెకండాఫ్ లోవరకూ పే ఆఫ్ ని లాగితే ఇక అది అప్రస్తుతమైపోతుంది. అప్పుడు పే ఆఫ్ చేసినా ఒకటే,  చేయకపోయినా ఒకటే. 

          వెనుక ఎపిసోడ్ లో ఇంటరాగేషన్  సీనుకి సెటప్ – పేఆఫ్స్ కూడా ఎలావున్నాయో చూడండి : ఆ సీను కేవలం పక్కదారి పట్టిస్తూ లాయర్ హంగామా కోసమేనన్నట్టుంది. సీను సెటప్ ఒకటైతే, పే ఆఫ్ మరొకటి! సీను సెటప్ నే  గనుక గౌరవించి, ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఒక  క్వాలిటీ సీనే  అందించాలనుకుంటే, ఆ  సోకాల్డ్ ఇంటరాగేషన్ ఇలా మొదలవ్వాలి – ఎవర్నువ్వు? వేరే మత టెర్రరిస్టులతో నువ్వెందుకు కలిశావ్? ముందు నీ సంగతేంటో చెప్పు! – అని ప్రేక్షకుల సెన్సాఫ్ అర్జెన్సీ ని దృష్టిలో పెట్టుకుని మొదలవ్వాలి. ప్రేక్షకుల సెన్సాఫ్ అర్జెన్సీ కూడా బేసిక్స్ లో భాగమే. సీను ఇలా మొదలెట్టకుండా (సెటప్ ) – నిన్నూ... నించోబెట్టి, వంగదీసి, కింద నుంచీ - అంటూ అసభ్యంగా ఇంకేదో వైద్య పరిభాషతో ఇంటలెక్చువల్ లుక్ ఇచ్చుకుంటూ, శాడిస్టులుగా ఎమోషనలై పోతూంటారు హీరోగారి అసిస్టెంట్స్ ఎందుకో! ఫాల్స్ బిల్డప్. 

          ఇది హాఫ్ వేలో ఓపెన్ అయిన సీనా అంటే కాదు. ఇప్పుడే మొదలైంది. హాఫ్ వేలో వుంటే, ఆల్రెడీ అతగాణ్ణి అడుగుతున్నారనీ, అతను చెప్పడం లేదనీ అనేలా డైలాగుల  రూపం వుండేది. అలాలేదు. సరీగ్గా ఇప్పుడు లాయర్ వచ్చేశాక,  ఇంకా మొదలెట్టని ‘ఇంటరాగేషన్’ ని బుద్ధిగా ఆపేసి వెళ్ళిపోతారు అసిస్టెంట్స్ . ఈ ఇంటరాగేషన్ తో మొదలెట్టిన సీనుకి పేఆఫ్ లాయర్ కుట్రతో వుంది. సెటప్ (ఇంటరాగేషన్) ఒకటైతే, ఇంకో పాత్ర గొడవతో (కుట్రతో) పే ఆఫ్ మరొకటి! దీంతో ఈ సీను – ఇందులోని డ్రామా వీగి పోయి సీనస్ ఇంటరప్టస్ అయింది. ఈ కింద చూడండి :

          Now, I had been aware of this problem before, but I never had a name for it. But this was such a clear example of the problem that I labeled it Sceneus Interruptus. Leaving the scene too early simply means the purpose of the scene is unsatisfied, unfulfilled. It does not accomplish its dramatic function and therefore leaves a gaping hole in the action. And when that happens, something is definitely missing ― From ‘The Definitive Guide To Screenwriting’ ― Syd Field )

          ఇదన్న మాట. అంటే ఇంటరాగేషన్ ఉద్దేశంగా వున్నసీను తెగిపోయింది, ఇంకో విషయం వచ్చి సీన్ని హైజాక్ చేసింది . ఈ సీనులో నిరంజన్ ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో మనం వుంటే, ఇలా కాకుండా దీన్నాపేసి ఇదే సీనులో అతను ఇంకో కుట్రకి తెరతీస్తే జరిగేదేమిటి? మనం థ్రిల్ ఫీల్ కాం. ఎందుకంటే ఇప్పటికైనా ఆసలతనెవరో తెలిస్తేనే కదా అతడి తాజా  కుట్రకి ఇంకింత మనం టెన్షన్ పడేది? ఇలా ఒక పాయింటుతో మొదలెట్టిన  సీనుని ఇంకో పాయింటుతో భంగపర్చితే ఏర్పడే సమస్యకి ఒకటే వుంది – రెండు పాయింట్లనీ మనుగడలో వుంచే ముచ్చట. తర్వాత ఆ ఇంటరాగేషన్ పాయింటూ రన్ అవ్వాలి, ఈ కుట్ర పాయింటూ రన్ అయ్యేట్టు వుండాలి. 

           ఇదెలాగంటే, మొదట మొదలెట్టిన ఇంటరాగేషన్ అనే పాయింటుని ఒక క్లిఫ్ హేంగర్ మూమెంట్ కి చేర్చి సస్పెన్సు లో ఆపాలి. అప్పుడు లాయర్ ని పిలిపించుకుని అతడి కుట్రేదో అతణ్ణి  చేసుకోనివ్వాలి ( అంటే ఇలా లాయర్ రావడాన్ని మనం ఒప్పుకుంటున్నట్టు కాదు. ఈ వున్న సీనైనా  ఎలా వుండాలో,  ఇలాటి సీనస్ ఇంటరప్టస్ లకి విరుగుడేమిటో తెలుసుకుంటున్నామంతే ).

          ఎప్పుడైనా ఏ సీనైనా డల్ గా, మన్నుతిన్న పాములా ఓపెన్ అవకుండా – తగిన డైనమిక్స్ తో, 4 కె రన్ కి నేను సైతం అన్నట్టు ఓపెనవ్వాలనేది ఇంకో బేసిక్సు. సీను ఓపెనింగ్ ఈ మూడింట్లో ఒకటి డిమాండ్ చేస్తుంది – డైనమిక్ యాక్షన్ తో ఓపెనవడం, లేదా డైనమిక్ డైలాగుతో ఓపెనవడం, లేదూ ఈ రెండూ కలిసి ఓపెనవడం. ఈ మూడింట్లో ఏది బలంగా వుంటుందనేది అంతవరకూ మనకి  కలిగించిన సస్పెన్స్ మీద ఆధారపడుతుంది.

          ఉదాహరణకి,  ఈ సినిమాలోనే నిరంజన్ తో ఇంటరాగేషన్ సీను తీసుకుంటే, దీని ఎత్తుగడలో మనకి  సస్పెన్సు కల్గిస్తున్న అంశం, నిరంజన్ అసలెవరా అనేది. ఈ సస్పెన్సు ని  సినిమా ప్రారంభ సీను దగ్గర్నుంచీ భరిస్తున్నాం. ముందు దీన్ని పే ఆఫ్ చేయాలి. కాబట్టి ఈ ఇంటరాగేషన్ సీను ఎత్తుగడకి,  పవర్ పాయింటుగా  ఒక డైనమిక్ డైలాగే వుండాలి.

          అసలెవర్నువ్వు  - లాంటి డైనమిక్ డైలాగుతో ఈ సీను ఓపెనయితే మనకి వెంటనే కనెక్ట్ అవుతుంది. మనం తేరుకుంటాం. హమ్మయ్యా ఇప్పుడు సస్పెన్స్ తీరిపోతోందని తృప్తి పడతాం. అప్పుడీ సీను సూటిగా మనకి గుచ్చుకుంటుంది ఎత్తుగడలోనే. గుచ్చుకోని సీను విచ్చుకోదు.

          ఇలా కాకుండా, నిరంజన్ని కూర్చోబెట్టి  టార్చర్ చేస్తున్నట్టు ఆ సంబంధ డైలాగులతో సీను మొదలెడితే మన ‘కచ్చి’ తీరదు. ఇంకా సస్పన్స్ తెగక బోరు ఫీలవుతాం. కాబట్టి ఈ సీను ఇలా యాక్షన్ తో, అదీ పవర్ పాయింటుతో సంబంధంలేని డైలాగులతో,  ఓపెనవడం విఫల రచన. ఈ సీనుకి వెనక నిరంజన్ తో జరిగిన సీన్ల తీరుని కూడా దృష్టిలో పెట్టుకుంటే - ఫస్టాఫ్ నుంచీ ఇంతవరకూ ఏం చూస్తూ వచ్చాం – ఇతను నోరు విప్పకుండా తప్పించుకునే యాక్షన్ సీన్సే చూస్తూ వచ్చాం.

          దీనికి ద్వంద్వ న్యాయం అమలు చేస్తే, ఇప్పుడు ఈ ఇంటరాగేషన్ సీను ఓపెనింగ్ ఇలా  వుంటుంది – ఇతడితో ముందు సీన్లన్నీ డైలాగుల్లేని  యాక్షన్ తో వున్నాయి కాబట్టి,  ఇంటరాగేషన్ సీను కూడా టార్చర్ ఉద్దేశంతో డైలాగుల్లేకుండా యాక్షన్ తో మొదలవ కూడదు.  రెండూ ఒకటై పోతాయి. డైనమిక్స్ అన్పించుకోదు. ద్వంద్వాల పోషణ అవదు. అందుకని డై ...లా...గ్...తో మొదలవాలి. ఇది డైనమిక్స్. వెనక సీన్లు యాక్షన్ తో వుంటే, దాని సంబంధ సస్పెను తీర్చే ఈ సీను డైలాగ్ తో మొదలవాలి. అప్పుడే రేయింబవళ్ళలాగా, ఎండా వానల్లాగా ద్వంద్వాల  పోషణ, ఒక రసానుభూతికి అవకాశం. క్వాలిటీ సీను కోరుకుంటేనే. ప్రేక్షకులా తొక్కా అనుకుంటే  అవసరం లేదు. తొక్కతో వాళ్ళ నోట్లు నొక్కడమే పని. 

          ఆ డైనమిక్ డైలాగ్ – ఎవర్నువ్వు? – లాంటి  మన సెన్సాఫ్ అర్జెన్సీ ని తీర్చే సంభాషణే. ఆఫ్ కోర్స్, ఈ సీనుని యాక్షన్ తో కలిపి కూడా ప్రారంభించ వచ్చు. పైన చెప్పుకున్నట్టు - యాక్షన్ తో ఓపెనవడం, లేదా డైలాగుతో ఓపెనవడం, లేదూ ఈ రెండూ కలిసి ఓపెనవడం గనుక. ఇంటరాగేషన్ అంటే యాక్షన్ తప్పకుండా వుంటుంది కాబట్టి,  డైలాగ్ –యాక్షన్  రెండూ కలిసి ఓపెనవచ్చు. ఆ డైలాగ్ మాత్రం మనం ఎదురుచూస్తున్న సస్పన్స్ తీర్చే దిశగా వుండాలి. 

          ఇప్పుడు ఈ సంబంధమైన డైలాగులతో మన సస్పన్స్ తీరుస్తూ, ఇంకో సస్పెన్స్ తో వున్న అంశంతో -  ఉచ్ఛ స్థితికి తీసికెళ్ళి  సీను ఆపేస్తే- (క్లిఫ్ హేంగర్ మూమెంట్) – ఆపేసి అడ్డగోలుగానే  ఆ లాయర్ మహాశయుణ్ణి రావించి, కుట్ర జరిపించుకుంటే – రెండిటికీ న్యాయం జరిగి సీనస్ ఇంటరప్టస్ పరిష్కారమైపోతుంది.  .

          ఎలాగంటే, ఉచ్ఛ స్థితికి తీసికెళ్ళి ఆపేసిన ఇంటారాగేషన్ మాటల కంటిన్యుటీని తర్వాతి సీన్లో చూసేందుకు సిద్ధపడతాం ( పాత సస్పెన్స్ తీరిపోయి, ఫ్రెష్ గా కొత్త సస్పన్స్ తో డైనమిక్స్. సీన్లకి ఒక చైతన్యం. ప్రవహిస్తూ వుంటేనే సీన్లకి చైతన్యం, మడుగు కడితే మృతప్రాయం). ఇక కుట్ర ఎలాగూ సాగుతుంది. 

          కథకుడి ఈ సీన్లో సీనస్ ఇంటరప్టస్ పరిష్కారం కాకపోవడం వల్ల జరిగిన అనర్ధమేమిటంటే, కుట్ర ఒకటే ముందుకు సాగడం, ఇంత ముఖ్యమైన ఇంటరాగేషన్ పాయింటు ఇక్కడే గాల్లో  కలిసి పోవడం!

నో బేసిక్స్ – ఓన్లీ  మ్యాజిక్
      ఇప్పుడు తిరిగి రెండో ఎపిసోడ్ కి వద్దాం. నిరంజన్ని నాగపూర్ జైలుకి తరలించే ప్రహసనం. ఇంటరాగేషనేమిటో పూర్తి కాకుండానే. ఇతనెవరో ఇంకా మనకి చెప్పకుండానే మళ్ళీ బోలెడు యాక్షన్ జరిపించేస్తున్నారు. పాత్రతో మనం కనెక్ట్ కాని యాక్షన్ ఎలా నిలబడుతుంది. నాగపూర్ కి ఎందుకని హీరో అడిగితే,  పైనుంచి కాల్ వచ్చిందని చీఫ్ సమాధానం. అంటే ఈ ఎన్ఐఏ ని కేంద్రంలో అధికారంలో వున్న నాయకులు కొనేశారన్న మాట! తెలుగు సినిమా తల్చుకుంటే దేశాన్నే అమ్మేస్తుంది. సిబిఐ, ఐటీ, ఎసిబి, పోలీసు తదితర వ్యవస్థల్ని వాడుకోవడం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కన్పించేసరికి  ఎన్ఐఏ ని నెగెటివ్ గా చూపించడం మొదలెట్టారు. రేపు ‘రా’ ని, ఎల్లుండి సైన్యాన్ని కూడా ఇలాగే చూపిస్తారు కాబోలు. అంతర్గత యంత్రాంగాలు బోరుకొట్టినట్టున్నాయి, ఇక దేశభద్రతని కాపాడే యంత్రంగాల మీద  పడ్డారు - దేశం వైపు వుండాలని లేకుండా. చాతనైతే ఈ యంత్రాంగాల ప్రతిష్టని పెంచే  కథలు చేసుకోవాలి.

          ఇలా నాగపూర్ ట్విస్ట్ ఇచ్చి ఇంకో చిక్కులో పడ్డాడు కథకుడు. ఇలా ట్విస్ట్ ఇస్తే అప్పుడు ఎన్ఐఏ హీరో ఎం చెయ్యాలి- దీనమ్మ మమ్మల్నే దద్దమ్మల్ని చేస్తారా అని తిరగబడాలి. రాజశేఖర్ కి అంకుశం గుర్తుకు రావాలి. ఇక్కడే వుంది కథ!  ఇదే కథ!  ఇంతకి  మించిన కథ ఏముంటుంది ఈ కీలక పాయింటు  రైజ్ అయ్యాక. కథ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందా, ప్లాట్ పాయింట్ వన్ ఏదవుతుందాని ఎదురు చూసే వాళ్ళకి ఇదే  పాయింటు అన్పిస్తుంది.

          సరే, దీన్ని కూడా దాటేసి హీరో స్టయిలిష్ గా నిరంజన్ ని తీసుకుని నాగపూర్ బయల్దేరతాడు. ఇదన్నమాట వెనక చెప్పుకున్న హీరో పాత్ర దెబ్బతిని పోయే విధం. 

          ఇప్పుడు  చూస్తే – నిరంజన్ని నాగపూర్ జైలుకి ఎలా తరలిస్తారు? పైనుంచి కాల్ వస్తే నాగపూర్ జైలుకి తీసికెళ్ళి పోగలరా? ఆ జైలు అధికారి కోర్టు పత్రాలు అవీ లేకుండా లోపలేసుకుంటాడా? సత్రమా? గోడౌనా? ఇప్పుడాని నిరంజన్ కూడా - మీరు నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసికెళ్తున్నారు. ముందు ఇక్కడున్న మీ ఎన్ఐఏ  కోర్టులో నన్ను హాజరు పర్చండి. కోర్టు ఇక్కడ దాని పరిధిలో వున్న జైలుకి జ్యుడీషియల్ రిమాండుకి  పంపిస్తుంది. అప్పుడు ట్రాన్సిట్ పెట్టుకోండి. అప్పుడు కోర్టు అనుమతిస్తే నాగపూర్ జైలుకి నన్ను తీసికెళ్ళండి – అనాలిగా?  అంత హైటెక్ నిరంజన్ పాత్ర కూడా ఏమీ కాదా? 

          నిరంజన్ ఏమీ ఫీల్ కాడు, హీరోకి ఫీలింగే లేదు ఈ అవమానం. కారులో బయల్దేరతారు. ఒక ఎసిపి స్థాయి అధికారికి ఈ ఎస్కార్ట్ డ్యూటీయేమిటి?  ఏమో! అది కూడా రోడ్డు మార్గంలో?  ఎన్ఐఏ, సిబిఐ అధికారులు విమానాల్లో కదా తరలిస్తారు నిందితుల్ని. ఇక్కడ రోడ్డు మార్గం ఎందుకంటే, విలన్ ముఠా దాడి చేయాలి కాబట్టి. అంతా కథాసౌలభ్యమే, పాత్రచిత్రణలు అవసరం లేదు. హీరోని కథ నడపనీయడంలేదు కథకుడు, ఇతర పాత్రల చేత కథకుడే  ఎలా కథ నడిపిస్తే హీరో అలా నడుచుకుంటున్నాడు. సినిమాల్లో  లాజిక్ ఎందుకూ, మ్యాజిక్కే అనే కాడ్నించీ - బేసిక్స్ ఎందుకూ, మ్యాజిక్కే అనేకాడికొచ్చిందన్న మాట.
***
       రిలాక్సవుదాం. మెదళ్ళు  శ్రమపడిపోయి వుంటాయి. రిలాక్సయి ఎంటర్ టైన్మెంట్ చూద్దాం. ఈ సినిమాలో కామెడీ లేదనీ, ఎంటర్ టైన్మెంట్ లేదనీ ఎవరన్నారు. ఇప్పుడు చూడబోయేది  అదే. చార్లీ చాప్లిన్ చూస్తే కూడా అసూయతో చచ్చిపోయేంత! దీన్నిలాగే చెప్పుకోవాలి. ఇలా చెప్తున్నందుకు ఫీలవ్వొద్దు, హర్ట్ అవ్వొద్దు. సినిమాని సినిమాలాగా చూడాలంటారు కదా (అంటే ఏమిటో), అలాగే  ఈ కామెడీ ని కామెడీ లాగే చూసి ఎంజాయ్ చేద్దాం. ఇష్టం లేకపోతే ఈ పేరాలు వదిలేసి ముందు కెళ్ళి పోవచ్చు.
 
          రెండు కార్లు, ఒక వ్యాను నిరంజన్ ని తీసుకుని నాగపూర్ వెళ్తున్నాయా... ఇక విలన్ గారి రెండు భారీ క్రేన్లు సరదాపడి వెంటపడతాయి. వెనుకనుంచి ఓ గుద్దుగుద్దుతాయి. గుద్దుతూనే వుంటాయి. వ్యానులో కూర్చున్న ఎఐఏ హీరోగారు వెనక అద్దంలోంచి గుద్దుతున్న క్రేన్లని చూస్తూ హారిబుల్ గా ఒకటే కేకలు పెడుతూంటాడు. జేబులో పిస్తోలుంది. తీసి వెంటనే కాల్చేస్తే  దెబ్బకి చచ్చూరుకుంటారు క్రేన్ డ్రైవర్లు.  ఆ పని చెయ్యడు ఫస్టాఫ్ లో అంతటి హై ఒల్టేజ్ యాక్షన్ హీరో అయికూడా.  ఇక అరిచీ అరిచీ,  అప్పుడు కథాసౌలభ్య సుకుమారుడైన ‘కథోత్కచుడు’ అనుమతిస్తే,  చిట్టచివరికెలాగో పిస్తోలు తీసి కాలుస్తాడు! ఏమవుతుంది, ఏమీ కాదు. కథా సౌలభ్యం కదా. ఈ ‘కతో’ న్మత్తుడు ఈ  వ్యానులో వుంటే తెలుస్తుంది – తన మాన ప్రాణాలకోసం, నాలుగు కాలాలు రచనా వ్యాసంగం చేసుకోవడం కోసం -  కథా సౌలభ్యం కావాలో, కామన్ సెన్సు కావాలో!

          ఆఫ్టరాల్ ఈ క్రేన్ల స్పీడెంత, కార్ల స్పీడెంత!  రివ్వున ముందుకు దూసుకెళ్ళి
పోగలవు. వెళ్ళిపోతే ఎలా?  అనుకున్న కథా సౌలభ్య దృశ్య మాలిక ఎలా సాధ్యం? అందుకని మెల్లమెల్లగా పోతూ, ముద్దు ముద్దుగా గుద్దించుకుంటుంటాయి. అప్పుడప్పుడు పక్కకి జరుగుతాయి – కాస్త  పక్కవారగా వచ్చి కూడా గుద్దిపో నాయనా అన్నట్టు. ఆ క్రేన్లు  వాటం చూసి పక్కకొచ్చి సైడ్ బ్యాంగింగ్ చేసి, ఈ సరదా కూడా తీర్చేస్తాయి – వెహిక్యులర్ రేపింగ్!

          ఇలా గ్యాంగ్ రేప్ చేయించుకునీ చేయించుకునీ సొట్టలు పడి డస్సిపోయి బ్రిడ్జి మీదికొస్తే, క్రేను అమాంతం కారుని ఎత్తి నదిలో పడెయ్యడం. పడ్డాక ఆ నీట్లో  కొత్త గ్యాంగ్ టకటకా గన్స్ తీసి షూట్ చేయడం. కామెడీకి పరాకాష్ట! నదిలో పడ్డాక  షూట్ చేస్తారేంట్రా బాబూ, కార్లోనే చంపి నదిలో పడెయ్యక!  అంటే వాళ్ళు  ఫ్లాష్ చెప్పుకోవడానికీ, అది వినడానికీ బతికుండాలిగా. హీరో గారు నిరంజన్ తో తప్పించుకోవాలి, నిరంజన్ గారు వెన్నముద్దలా దాచిపెట్టిన కథని  ఫ్లాష్ బ్యాక్ రూపం లో హీరోకి పంచిపెట్టాలి. ఈ ఉద్దేశంతో ఈ జోకర్ గ్యాంగ్ తో కూడా మనం  కామెడీ పడాలి. 

          ఆఖరికి కథకుడి సృజనాత్మక స్వేచ్ఛకి  యాక్షన్ డైరెక్టర్లు కూడా బలై పోయారు. మైండ్ లెస్ కామెడీలు నవ్వించగలవు. సీరియస్ యాక్షన్ కూడా మైండ్ లెస్ అయితే కామెడీ అయిపోతుందని  ఇలా తెలుస్తుంది మనకి. దీని తర్వాత ఇంకో రెండు యాక్షన్ సీన్లే. ఇవి కూడా కామెడీలే. ఆఖరికి యాక్షన్  విషయంలో కూడా ఫస్టాఫ్ కీ, సెకండాఫ్ కీ ఏకసూత్రత లేకుండా పోయింది.

ఇదిగో ఎదురుచూస్తున్న కథ!
      ఇక నదిలోంచి బయటపడి నిరంజన్ చెప్పే ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ చెబుతూ ఎన్నెన్నో మనకి అర్ధంగాని శాస్త్ర సాంకేతిక విషయాల మీద లెక్చర్. మనకి ఎక్కడ బోరుకొడుతుందోనని హీరో అడ్డుతగులుతూ  సింపుల్ గా చెప్పమనడం.  అయినా నిరంజన్ మళ్ళీ అలాగే  లెక్చరివ్వడం. మనకి ఒక్కముక్కా అర్ధంగాదు. ఇదంతా ఒక్క  ముక్కలో అర్ధమయ్యేలా ఇలా తేల్చెయ్యొచ్చు : యూరేనియం పక్కనే, ప్లుటోనియం నిల్వలు బయట పడ్డాయి. దాన్ని తవ్వి ఉత్తర కొరియాకి స్మగ్లింగ్ చేస్తున్నారని!  ‘సింగం త్రీ’ లో బయాల  జికల్ వ్యర్ధాల  గురించైనా, ‘వివేకం’ లో కృత్రిమ భూకంపాల గురించైనా ఎలా చెప్పేశారు సింపుల్ గా,  కమర్షియల్ గా అర్ధమయ్యేలా!  నిరంజన్ చెబుతూంటే దానికి ఏవేవో సైంటిఫిక్ పరిశోధనల తాలూకు విజువల్స్ తో హంగామా. ఇంత కచ్ఛితత్వమంతా, ఈ టెక్నికాలిటీస్ అన్నీ  కూడా అసలు స్క్రిప్టు రచనలో కనబర్చాల్సింది. 

          నిరంజన్ దగ్గర ఈ స్మగ్లింగ్ గురించిన  రహస్యాలే వున్నాయి. దీనికోసమే చంపాలని చూస్తున్నారు గ్యాంగ్. ఈ గ్యాంగ్ వెనుక ఎందరో కేంద్ర,  రాష్ట్ర మంత్రులూ, ఐఏఎస్, ఐపీస్ అధికారులూ వున్నారట! ఉత్తర కొరియాకి అణుసరఫరా చేసి అమెరికాకి ఎసరు పెడతారన్న మాట. పాయింటేమిటంటే, ఇతర మాఫియా కుట్రలు చూపించాలంటే ఇంకొకర్ని బ్యాడ్ గా చూపించాల్సిన అవసరముండదు. అణుపదార్ధం స్మగ్లింగ్ అనే ‘కొత్త పాయింటు’ దొరికిపోవడంతో, నౌకల ద్వారా ఈ స్మగ్లింగ్ మఫియాలోక్కరే చేయలేరు కాబట్టి ప్రభుత్వ యంత్రంగాన్నంతా దీన్లోకి లాగి సత్యదూరమైన మహా స్కామ్ గా చూపించారు. దీనికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా అంటే అనుమానమనే.

          ఇదంతా ముగిసేటప్పటికి సెకండాఫ్ అరగంట గడిచిపోతుంది. అంటే సినిమా ప్రారంభమైనప్పట్నుంచీ ఒక గంటా 45 నిమిషాలన్న మాట!  ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంటా ముప్పావుగంటలో రావాల్సిన ఈ కీలక ఘట్టం, జరిగిపోతూ జరిగిపోతూ ఇక్కడ సెటిలయ్యింది. అంటే బిగినింగ్ విభాగమే  ఇంత సాగిందన్న మాట. చెప్పాల్సిన కథకి ఇంత బారుగా ఉపోద్ఘాతం చెప్పుకొచ్చారన్నమాట. ఇంతకీ కథేమిటని ఇప్పుడు తెలిసిందేమిటంటే  - మైనింగ్ మాఫియా గురించి! ఇక దీన్ని అడ్డుకుని విద్రోహుల్ని  పట్టుకునే గోల్ గురించి! ఇప్పుడు దీనికీ,  ఇంతవరకూ చెప్పుకొచ్చిన కథానికలకీ ఏమైనా సంబంధముందా? 

          ప్లాట్ పాయింట్ వన్ ఇక్కడికి వచ్చి చేరడమంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేనే కదా. ఇప్పటిదాకా కథని ఇలా దాచి పెట్టడం ఎండ్ సస్పెన్స్ కూడానూ కదా. చిరంజీవి ఖైదీ లో రాళ్ళపల్లి  అంటాడు నూతన్ ప్రసాద్ తో – అసలు విషయాన్నివూరగాయలా ఎంతసేపు వూరిస్తారు చెప్పండీ – అని. అదే ఇదన్న మాట. కథని జాడీలో వూరగాయవేసి అటకె క్కించారు. తుగ్లక్ వున్నాడు. అతను ఢిల్లీలో వున్న రాజధానిని 700 మైళ్ళ దూరంలో దేవగిరికి మార్చి దౌలతాబాద్ అని పేరుపెట్టాడు. జనమంతా అక్కడికి వెళ్ళాలన్నాడు. అక్కడ బాగా లేదని మళ్ళీ ఢిల్లీకి మార్చి,  జనమంతా మళ్ళీ ఇక్కడికి రావాలన్నాడు. ఈ వలసలతో వందలాది మంది జనం చనిపోయారు. 

          ఇలాగే ఫస్టాఫ్ లో వుండాల్సిన ప్లాట్ పాయింట్ వన్ ని,  ఎక్కడో సెకండాఫ్ లోకి తరలించడం తుగ్లక్ కథనం. అక్కడి దాకా ప్రేక్షకుల సహనం చచ్చిపోతుంది. ఢిల్లీ ఢిల్లీయే, చింతలపాలెం చింతలపాలెమే. ప్లాట్ పాయింట్ వన్ అనే ఢిల్లీని కదిలిస్తే  చింతలపాలెమే అవుతుంది కథ. ప్లాట్ పాయింట్ వన్ అనేది కథకి రాజధాని లాంటిది. ఇక్కడ్నించే కథలోకి అన్ని కార్యకలాపాలూ విస్తరిస్తాయి. ఈ రాజధానిని సెకండాఫ్ లో ఎక్కడికో తరలిస్తే కార్యకలాపాల విస్తృతి కూడా తగ్గిపోతుంది.. 

          అంటే మిడిల్ ఇప్పుడు ప్రారంభమయ్యిందన్న మాట. అసలు కథంతా నడిచేది ఈ మిడిల్లోనే. ఇప్పుడు చూడబోయేదే  కథ. ఇంతవరకూ చూసిందంతా కథతో సంబంధంలేని  ఉపోద్ఘాతం. ఇప్పుడు ఈ మిడిల్ విభాగంలో నడిచే కథకి  అరగంట కూడా నిడివి లేదు. మిడిల్లో  గంటకి  పైగా వుండాల్సిన కథకి బొటాబొటీ అరగంటే! ఈ సినిమా మొత్తం మీద మనం చూసేది అరగంట వున్న కథే!

ఇదీ హీరో గోల్ 
       ఇప్పుడు  ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాక నిరంజన్ ని తీసుకుని హీరో కాలినడకన వెళ్తూంటే, ఒక ధాబా తగుల్తుంది. ఈ ధాబా నిండా వేశ్యా లోకమే వుంటుంది. తప్పించుకున్న హీరో ఇక్కడికి చేరాడని విలన్ తెలుసుకుని మళ్ళీ ఎటాక్ చేయిస్తాడు. సన్నీ లియోన్ పాటయ్యాక గ్యాంగ్ వచ్చేసి విచ్చల విడిగా కాల్పులు జరుపుతూంటారు. ఇదింకో మైండ్ లెస్ యాక్షన్ సీను. మనకి ఇంకో కామెడీ. ఎవడైనా హీరో ఇక్కడున్నాడని తెలిస్తే, గుట్టుగా వచ్చి, ఈ గుంపులో ఎక్కడున్నాడో కనిపెట్టి,  షూట్ చేసి వెళ్ళిపోతాడు.  గ్యాంగ్ వచ్చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపితే,  హీరో తప్పించుకుని, వెనక వారగా దెబ్బతీసి కాల్చేసే ప్రమాదముంది. అంతే కదా? ఈ జ్ఞానం లేకుండా గ్యాంగ్ విరుచుకుపడి, పదుల సంఖ్యలో వున్న అమాయక వేశ్యల్ని కాల్చి పారేస్తూంటారు. హీరో తప్పించుకుని చేయాల్సిన పని మాత్రం చెయ్యడు. గ్యాంగ్ పారిపోయాక, ఇక్కడ శవాల్ని చూసి తనవల్ల జరిగిందానికి ఏ మాత్రం ఫీలవ్వడు. ఇంతకీ ఈ దాడిలో సన్నీ లియోన్ ఏమైందో మనకి తెలీదు!

          మాఫియా విలన్ కి ఫోన్ చేసి - నేనొస్తున్నా, చాతనైతే పారిపొమ్మని ఛాలెంజి చేస్తాడు. దీంతో మిడిల్ ముగిసింది. ఇది ప్లాట్ పాయింట్ టూ తో క్లయిమాక్స్ అన్న మాట. కాకపోతే ఈ ధాబా మీద ఎటాక్ కి ముందు, అటు ప్రతాపరెడ్డితో బాటు, కేంద్రం నుంచి వచ్చిన ఇంకో మంత్రితో మైండ్ లెస్ టీవీ కవరేజీ లుంటాయి. విలన్ తో మంతనాలుంటాయి. 

 ఎపిసోడ్ మూడు – కామెడీ క్లయిమాక్స్
          ఇది విలన్ పారిపోవడం గురించే వుంటుంది. అంత ప్లుటోనియం స్మగ్లింగ్ బిజినెస్ వదిలేసి,  తనకి సపోర్టుగా  వున్నరాజకీయ,  అధికార యంత్రంగాల్నీ వదిలేసి పారిపోయే ఏర్పాట్లలో వుంటాడు. ఇదేం కథో  అర్ధం గాదు. ప్లుటోనియం స్మగ్లింగ్ గురించి హీరోకీ విలన్ కీ వుండాల్సిన సంఘర్షణే వుండదు. ఇలా చేస్తే దీని పరిణామాలెలా వుంటాయో క్లాసు పీకి,  మెసేజ్ ఇచ్చేదీ వుండదు. ఎత్తుకున్న కాన్సెప్ట్ ఊసే వుండదు. హీరో బెదిరిస్తే ఎన్ఐఏ ని కంట్రోల్ చేస్తున్న రాజకీయ నాయకులేం చేస్తున్నారో తెలీదు. విలన్ తో బాటూ అందరూ ఇంత బిజినెస్ వదిలేసి గప్ చుప్. ఈ కథలో విలన్ చేసిందేమీ లేదు. కన్పించే పదినిమిషాలు ఒఠ్ఠి పాసివ్ విలన్. విలన్ భార్యని కిడ్నాప్ చేసి బంధించి, హీరోని అక్కడికి రప్పించి,  బాంబులు పెట్టేసి షిప్ లో పారిపోతాడు విలన్. ఇక ఈ పేచీలు పెట్టే కామెడీ భార్యతో హీరో గారి బోలెడు కామెడీ పాట్లు. ఎలాగో వెళ్ళిపోతున్న విలన్ షిప్ మీదికి బాంబులు పేల్చి - ఫినిష్ చేస్తాడు కథని!

          ఇదీ విషయం. ఫస్టాఫ్ ని ఎలాగో మాయ చేసినా సెకండాఫ్ లో కుదరలేదు. ఎందుకు కుదరలేదో కారణాలన్నీ పరిశీలించాం. ఈ కారణాలు గనుక సరిదిద్దుకుని వుంటే ఈ మూవీ బాక్సాఫీసు మనుగడ వారానికే ముగిసేది కాదు. ట్రేడ్ సమాచారం ప్రకారం ఒక్క నైజాం  లోనే నయం అన్పించుకుని, మిగిలిన ఏరియాల్లో నై అన్పించుకునేది కాదు. ఎంత పెద్ద బడ్జెట్లు  ధారబోసి హంగామా చేసినా, చివరికొచ్చేసి కంటెంట్ క్వాలిటీయే నిర్ణయిస్తుంది ఫలితాన్ని, హంగామాలు కాదు. దురదృష్టమేమిటంటే, కంటెంట్ తో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు.

-సికిందర్