రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, నవంబర్ 2017, శనివారం

552 : రివ్యూ!






రచన- దర్శకత్వం : పవన్ మల్లెల
తారాగణం : నారా రోహిత్, రెజీనా, మ్యకృష్ణ, పృథ్వీ, అజయ్, ఆదిత్యా మీనన్, రామరాజు, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి దితరులు
థః కొలుసు రాజా, సంగీతం : ణిశర్మ, ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్
బ్యానర్ : మాయా జార్ మూవీస్, స్ చంద్రిక విజరీ, మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : బి.హేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల : నవంబర్ 24, 2017
***
      నారా రోహిత్ సినిమా అంటేనే  ఏదో వెరైటీ పాత్ర అని ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. లేదు,  నేనూ మాస్ కొస్తా, ఒక మాస్ యాక్షన్ నేనూ చేస్తానంటూ వస్తాడని ఎవరూ వూహించి వుండరు. అదీ ఆరిపోయిన ఫ్యాక్షన్ దీపం వెల్గించుకుంటూ. తన మీద ఓ అంచనా, తనకంటూ గిరిగీసిన ఓ ఇమేజీ అంటూ లేనప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. అలాగే ‘బాలకృష్ణుడు’ అనే ఈ పాత మూసతో ప్రేక్షకుల మధ్య కొచ్చేశాడు. ఓల్డ్ డ్రామా మీద చాలా మక్కువున్న వాడిలా కన్పిస్తున్న దర్శకుడు పవన్ కూడా, ఓల్డ్ డ్రామాని ఈ కాలం ప్రేక్షకులు మిస్సవుతున్నట్టు భావించుకుని ఈ ఫ్యాక్షన్ కి సాహసించినట్టుంది. ఇంతకీ వీళ్ళిద్ద రేం చేశారు? పాతని పాతలాగే చూపించే చాదస్తాలకి పోయారా, లేక ఏమైనా కొత్త దనం చూపించారా, ఫ్యాక్షన్ లో కొత్తదనం చూపించడాని కేముంటుంది....ఇవన్నీ ఓ సారి పరిశీలిద్దాం.
కథ
 
       కర్నూలు జిల్లాలో రవీందర్ రెడ్డి (ఆదిత్యా మీనన్) ఫ్యాక్షన్ ని రూపుమాపాలని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడు. అతడి చెల్లెలు భానుమతి (రమ్యకృష్ణ) సహకరిస్తూంటుంది. ప్రజల్లో వీళ్ళకి వస్తున్న మంచి పేరుకి తాళలేక బసిరెడ్డి (రామరాజు) రవీందర్ రెడ్డిని అణచాలని చూసి అవమాన పడతాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో అతడి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) రవీందర్ రెడ్డిని చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. అతడి మనుషుల్ని భానుమతి చంపించేస్తుంది. ప్రతాపరెడ్డి పోలీసులకి లొంగిపోతాడు. అయినా  భానుమతి మీద పగ వదులుకోడు. భానుమతి మేనకోడలు ఆద్య (రేజీనా) హైదరాబాద్ లో వుందని తెలుసుకుని,  తన పగకి ఆమెని వాడుకోవాలనుకుంటాడు. ఆద్యకి ఆమెకి తెలియకుండా భానుమతి ఒక బాడీ గార్డుని నియమిస్తుంది. ఆ బాడీగార్డు బాలు (నారా రోహిత్) ఆద్యతో ప్రేమలో పడతాడు. ఇప్పుడు జైలు నుంచి ప్రతాపరెడ్డి విడుదలై వస్తాడు. ఇక అతడి బారి నుంచి ఆద్యని బాలు ఎలా కాపాడేడు, కాపాడే క్రమంలో ప్రతాపరెడ్డిని ఎన్ని విధాలుగా ఏడ్పించి పీడా వదిలించాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
        పైన చూస్తేనే తెలిసిపోతోంది  కథెలా వుందో. ఇంకా అదే ఫ్యాక్షనేంటంటే ఇంతే. అవే రోమాంటిక్ కామెడీలూ,  అవే దెయ్యం కామెడీలూ  కుప్పతెప్పలుగా రావడం లేదా? ఇవి తప్ప ఇంకేమైనా వస్తున్నాయా? వీటికి అందమైన కావ్యాలుగా  రివ్యూలు కూడా రాసి తరించడం లేదా? ఇలాంటప్పుడు వీటి నుంచి కాస్త ఆటవిడుపుగా అదే ఫ్యాక్షన్ చాలా కాలం తర్వాత వస్తే తప్పేముంది?  రోత పుడుతున్న అవే రోమాంటిక్ కామెడీలూ,  అవే దెయ్యం కామెడీలకంటే ఇదే నయం. ఎందుకంటే ఇది ఫుల్ కామెడీ. నవ్వించని క్షణాలు ఏవైనా వున్నాయా అని వెతుక్కోవాలి. నవ్వులాటలో పాత ఫ్యాక్షన్ పాత వాసనా మర్చిపోతాం. కథలో ముందేం జరిగిందో నాకు తెలీదు, నేనొచ్చాక  నీ (విలన్) అవసరం లేదు, ఈ కథకి నేనే హీరో - నంటూ కామెడీ హీరో అన్నాక పాత ఫ్యాక్షన్ సీనంతా మారిపోక ఏమవుతుంది. 

ఎవరెలా చేశారు
      కెరీర్ తో కొత్త ప్రయోగాలు చేసే నారారోహిత్ కి ఒక మసాలా యాక్షన్ చేయాలన్పించి అందుకు ఫ్యాక్షన్ ని ఎంచుకున్నాడు. దాదాపు హీరోలందరూ ఫ్యాక్షన్ చేసేశారు. ఆలస్యంగా వచ్చిన తను కూడా ఓ ఫ్యాక్షన్ చేయకపోతే వెనుకబడి పోతాడు. దేశం చిన్న చూపు చూస్తుంది. అందుకని కాల యంత్రంలో వెనక్కి ప్రయాణించాడు. బరువు తగ్గి,  సిక్స్ ప్యాక్ తో సిద్ధమై డాన్సులకి , ఫైట్లకి వొళ్ళు కదలకపోయినా కెమెరాని కదిలించుకుంటూ యాక్షన్ కామెడీ పాత్ర లాగించేశాడు. పాత్ర ఫ్యాక్షన్ కుటుంబంలో లేకపోవడం కామెడీకి తోడ్పడింది. ఫ్యాక్షన్ కుటుంబంలో వుండుంటే  అదే పాత టెంప్లెట్ ఫ్యాక్షన్ గా హింసా రక్తపాతాలతో ఎరుపెక్కి ఏవగింపు కల్గించేది.  అనేక  కామెడీ ట్విస్టులిస్తూ పాత్ర సాగడంతో బోరు కొట్టించే ప్రమాదాన్ని తప్పించుకుంది. తన పాత్రే ఈ సినిమా. ఆ  పాత్ర పాత మసాలా యాక్షన్ కి వినోదాన్ని జోడించింది. ఈ వినోదం విలన్ ఇంట్లో హీరో చేరి చేసే టెంప్లెట్ వినోదంగా  గాక,  సాంతం ఔట్ డోర్ ప్రయాణంలోనే సాగడం అడ్వెంచరస్ కామిక్ థ్రిల్లర్ గా మారడానికి వీలిచ్చింది. పాత్రకి తను  రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వున్నానని అస్సలు తెలియకపోవడమే తన ధోరణిలో పూర్తిగా వేరే  రూటులో వేరే కథ నడపుతూ నవ్వించడానికి తోడ్పడింది. రోహిత్ చేసిన కొన్ని ప్రయోగాలకన్నా ఇదే నయం. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా, బి సి సెంటర్లలో మాస్ కి దగ్గరవుతాడు కనీసం.

          రెజీనాదీ హాస్య పాత్రే, ఏదో పాటల్లో కన్పించి పోయే గ్లామర్ డాల్ గా కాకుండా, ఆద్యంతం దాదాపు ప్రతీ సీనులో సీనుకి తగ్గ తంటాలు పడుతూ వుంటుంది. హీరో తన బాడీ గార్డు అని తెలీక పోవడమనే సస్పెన్స్ ఆమె పాత్రని ఆసక్తికరంగా మార్చింది. దుర్యోధనుడిగా ఆమె ద్రౌపది చీర లాగే కామెడీ 

          మూడో కీలక పాత్ర- ప్రకృతి ప్రేమికుడు పృథ్వీది. ఇంటర్వెల్ కి ముందునుంచీ హీరోకి తగిలి,  ఇక హీరో వెంటే వుండాల్సిన ఖర్మతో- విషయం తెలీక లేనిపోని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ సృష్టించే పాత్రలో,  మరోసారి తను పరువు నిలబెట్టుకున్నాడు. 

          రమ్యకృష్ణ  ఫ్యాక్షన్ మార్కు పగతో వుండే సీరియస్ పాత్ర. ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకం ట్రూపు వాడిగా శ్రీనివాసరెడ్డి, పది పెళ్ళిళ్ళు చేస్తేగానీ పెళ్లి కాదని జ్యోతిష్కుడు చెప్పడంతో,  ఆ పనిలో వుండి నానా తన్నులు తినే పాత్రలో వెన్నెల కిషోర్, ఇంకో ఇద్దరు  కమెడియన్లు రఘుబాబు, తాగుబోతు రమేష్ లు ఎంటర్ టైన్ చేస్తారు. ఇవి మూస పాత్రలే.  అయితే మూస  రోమాంటిక్ కామెడీల్లో, దెయ్యం కామెడీల్లో హీరోహీరోయిన్ల కంటే, కమెడియన్ల కంటే బెటర్. విలన్ గా అజయ్ తన విలనీతో, అయోమయంతో బాగానే చేశాడు. 

          మణిశర్మ పాటలు ఓ మాదిరి. క్యాచీ ట్యూన్స్ మాత్రం లేవు. విజయ కుమార్ ఛాయాగ్రహణం రొటీనే. ఇతర సాంకేతిక విలువలు మామూలుగా వున్నాయి.

చివరికేమిటి 
      దర్శకుడు పవన్ ప్రథమ ప్రయత్నం అనుభవమున్న దర్శకుడిలాగా వుంది. అయితే ఇలా పాత సినిమాలే మళ్ళీ తీయకుండా వుండ గల్గాలి. సీన్లని వేగంగా పరిగెత్తించ గల నేర్పే ఈ పాతని మరిపించగల్గింది. కథలో ప్రతీ పది నిమిషాలకోసారి ట్విస్ట్ ఇస్తూ కథనం చేయడం వల్ల పాత కథే సరే చూద్దామనే పరిస్థితి కల్పించింది. విలన్ ఫ్యాక్షనిస్టు  అని తెలీక హీరో పట్టేసుకుని పది  కోట్లు సంపాదించుకునే ట్రాకే ఈ యాక్షన్ కామెడీని కాపాడింది. ఫస్టాఫ్ – సెకండాఫ్ రెండూ కథలో కొత్త విషయాలు బయట పెడుతూ పరుగులెత్తడంతో –రొటీనే అయినా ఈ యాక్షన్ కామెడీని  కదలకుండా చూస్తూ కూర్చునేలా చేశాయి. ఎండిపోయిన రోమాంటిక్ కామెడీలనీ, దెయ్యం కామెడీలనీ వెక్కిరిస్తూ,  ఎండిపోయిన ఫ్యాక్షన్ ని నేనూ వున్నానంటూ ‘బాలకృష్ణుడు’  ఓ సెటైర్ వేసింది...

-సికిందర్
www.cinemabazaar.in