Dear Readers!
Yesterday glitches in net connectivity caused delay in publishing the review. The desktop gone bongs! The inconvenience
is deeply regretted.
రచన –దర్శకత్వం : మిస్కిన్
తారాగణం : విశాల్, అనూ ఇమ్మాన్యుయేల్, అండ్రియా జెర్మియా ప్రసన్న, వినయ్, భాగ్యరాజ్, సిమ్రాన్, వినయ్ రాయ్ తదితరులు
సంగీతం: అరోల్ కొరెల్లీ, ఛాయాగ్రహణం : కార్తీక్
బ్యానర్ : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాత : విశాల్
విడుదల : నవంబర్ 10, 2017
***
తమిళ స్టార్ విశాల్ మాస్
సినిమాలంటూ తెలుగులో అంతరించిన అవే రక్తపాతాల యాక్షన్ సినిమాల్లో నటిస్తూ, క్రమంగా
తెలుగులో ఫాలోయింగ్ కోల్పోతూ వచ్చాడు. కార్తీకున్న ఓపెనింగ్స్ కూడా తనకి రావడం
తగ్గిపోయింది. అయినా వొరవడిని మార్చుకునే ఆలోచన చేయకుండా అపజయాలకి అలవాటు
పడిపోయాడు. తమిళంలో తనదగ్గరికి వచ్చే దర్శకులు కూడా అదే అరవ మాస్ –కొండకచో వూరమాస్
నీ అంటగడుతూ విశాల్ వైశాల్యాన్ని కుదించి వేశారు. తను విస్తరించాలంటే అలాటి
దర్శకుల్ని వదిలించుకోవాలి. ఎనిమిదేళ్లుగా విశాల్ తో పనిచేయాలని ఎదురుచూస్తున్న
దర్శకుడు మిస్కిన్ బరి అవతలే వుండిపోవాల్సివచ్చింది. చివరికెలాగో విశాల్ ని ‘తుప్పరి వాలన్’ (తెలుగు అర్ధం
పత్తేదారు, ఇంగ్లీషులో డిటెక్టివ్) కి ఒప్పించాడు. తుప్పరివాలన్ గా తనని
చూసుకున్న విశాల్ కి కొత్త ఉత్సాహం వచ్చిందేమో, తనే నిర్మాణం చేపడుతూ నటించాడు.
ఫలితం? సత్ఫలితమా, దుష్ఫలితమా? ఓసారి చూద్దాం...
కథ
ఒక పిడుగుపాటుతో ఆమె (సిమ్రాన్) భర్తనీ, కొడుకునీ కోల్పోతుంది. సినిమా కెళ్ళిన
ఒక పోలీసు అధికారి చీమ కుట్టినట్టయి
తర్వాత చనిపోతాడు. నగరంలో అద్వైత భూషణ్ అలియాస్ ఆది (విశాల్) అనే ప్రైవేట్
డిటెక్టివ్ సరైన కేసులు రావడం లేదని బాధపడుతూంటాడు. వెంట ప్రసన్న అనే అసిస్టెంట్ వుంటాడు.
ఒక పదేళ్ళ పిల్లవాడు వచ్చి తనకుక్క పిల్లని చంపిన వాణ్ణి పట్టుకోవాలని బుల్లెట్ చూపించి ఏడుస్తాడు. ఆది ఫీలై కేసు చేపడతాడు. పోలీసు వర్గాల్లో
తనకున్న సంబంధాలతో ఆ బుల్లెట్ ని పరీక్షిస్తే, అది పవర్ఫుల్ రివాల్వర్ నుంచి వెలువడిందనీ, దాంతో షూట్ చేస్తే బుల్లెట్ కుక్క పిల్ల శరీరంలోనే వుండిపోయే అవకాశం లేదనీ,
అవతలకి దూసుకెళ్లి పోతుందనీ తేలుతుంది. బుల్లెట్ మీదున్న స్ట్రయేషన్స్ ని బట్టి చూస్తే ఇది రికోషెట్ బుల్లెట్ అనీ, అంటే కుక్క పిల్లకి
తగలడానికి ముందు ఏ గోడకో తగిలి, పరావర్తనం చెంది కుక్క పిల్లకి తగిలి వుండాలనీ,
అందువల్ల వేగం తగ్గి కుక్కపిల్ల శరీరంలో వుండిపోయిందనీ చెప్తారు పోలీసులు.
అంటే
ఎవరో మతి మాలిన వాడు కావాలని కుక్క పిల్లని చంపలేదనీ, ఇంకెవరి మీదికో రివాల్వర్ ని ప్రయోగించి వుండాలనీ అర్ధం జేసుకుని ఆది ఆ
స్పాట్ లో గాలిస్తే, ఒక వూడిపోయిన దంతం దొరుకుంతుంది. దాంతో దర్యాప్తు చేస్తూ పోతే ఒక
పుస్తకం దగ్గరికి దారి తీస్తుంది. ఆ పుస్తకం పిడిగుపాట్ల గురించి సైన్సు పుస్తకం. దరిమిలా
ఇంకో ప్రమాదవశాత్తూ మరణం అది కళ్ళముందే జరుగుతుంది. ఇది ప్రమాదం కాదనీ, లాఫింగ్
గ్యాస్ తో చంపారనీ తెలుసుకుని అప్రమత్తమ వుతాడు. మొదట పిడుగుపాటుతో చనిపోయిన
వ్యక్తీ, తర్వాత చీమకుట్టినట్టయి చనిపోయిన పోలీసు అధికారీ, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో
చనిపోయిన అతనూ, ఒకే హంతకుడు తెలివిగా జరిపించిన మరణాలని తేలుతుంది ఆదికి. ఎవరీ హంతకుడు? ఎందుకు
చంపుతున్నాడు? ఇంకెందర్ని చంపుతాడు? వాణ్ణి ఎలా పట్టుకోవాలి? ఇవీ ఆది ముందున్న
ప్రశ్నలు.
ఎలావుంది కథ
అచ్చమైన
డిటెక్టివ్ కథ. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కథలు
చదివి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు దర్శకుడు. హీరో పాత్రని ని షెర్లాక్
హోమ్స్ ని దృష్టిలో పెట్టుకునీ, అతడి అసిస్టెంట్ పాత్రని షెర్లాక్ నేస్తం డాక్టర్ వాట్సన్ ని దృష్టిలో
పెట్టుకునీ తీర్చి దిద్దానన్నాడు. కానీ అలా అన్పించదు. పూర్తిగా ఒకప్పటి ఎడ్గార్
వాలెస్, జాన్ క్రీసీ నవలల్లోని వాతావరణంతో, ఆ సరళిలో వుండే కథనంతో, పాత్రల
చిత్రణతో కన్పిస్తుందీ కథ. అదే సమయంలో హాంకాంగ్ మూవీ ‘యాక్సిడెంట్’ (2014) లోని కథ ఇందులో కన్పిస్తుంది.
అందులో ఒక గ్యాంగ్ కాంట్రాక్టు హత్యల్ని ప్రమాదాలుగానో, సహజ మరణాలుగానో సృష్టిస్తూ
వుంటుంది. అందులో ఒకటి, పిడుగుపాటుని సృష్టించి
చంపడం. అయితే ఇది పూర్తిగా మాఫియా బాపతు యాక్షన్ జానర్ కథ.
దీన్ని ఎడ్గార్ వాలెస్,
జాన్ క్రీసీ ల సరళిలో అచ్చమైన డిటెక్టివ్ జానర్ లోకి మార్చడంలోని దర్శకుడి సృజనాత్మకత మాత్రమే ఆకర్షిస్తుంది, కథ
ఐడియాకి హాంకాంగ్ మూవీ స్ఫూర్తి అనేది
అప్రస్తుతమైపోతుంది. కథనే వున్నదున్నట్టు,
హాంకాంగ్ మూవీలోంచి సంగ్రహించి తీసి వుంటే
అదివేరు; వాలెస్, క్రీసీల డిటెక్టివ్ జానర్లోకి మార్చడం పూర్తిగా వేరు. హాలీవుడ్
లో కొన్ని ఫిలిం నోయర్, నియో నోయర్ మూవీస్
ని 1930 లనాటి డషెల్ హమెట్ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల ప్రభావంతో తీసినట్టు,
ప్రస్తుత దర్శకుడు అలాటి సాంప్రదాయాన్ని ఫాలో అవడంతో ఇదొక విశిష్ట రూపాన్ని పొందింది.
ఎవరెలా చేశారు
విశాల్
కి పాత్ర, దీంతో నటన విభిన్నమైనవి. విచిత్రంగా
బిహేవ్ చేస్తూ, ఎప్పుడేమని అరుస్తాడో, సడెన్ గా ఎప్పుడేం చేస్తాడో అర్ధంగాని పాత్ర.
మళ్ళీ తన లోకంలో తానుండిపోతూ ప్రపంచాన్ని పట్టించుకోడు. ఒకవైపు కేసుల్లేక
బాధపడతాడు. మరోవైపు బ్లాంక్ చెక్ ఇస్తాను, పారిపోయిన నా కూతుర్ని వెతికి పెట్టమని
ఒకడొస్తే లేచి బయటి కెళ్ళి పోతాడు. ఎందుకంటే, ఆ కూతురు ఇంటికి రాకపోతేనే స్వేచ్ఛగా
వుంటుందని. మళ్ళీ పదేళ్ళ పిల్లాడు కుక్క పిల్లని చంపారని వస్తే, కరిగిపోయి కేసు
తీసుకుంటాడు. ఈ కేసు రాను రాను పెద్దదైపోయి పైసా రాకపోయినా పాటుపడతాడు.
షెర్లాక్
హోమ్స్ కి వ్యక్తిత్వ లోపాలుండవు. అపరిమిత
వూహాశక్తి గలవాడు, కుశాగ్ర బుద్ధి. ఓ చిన్న విషయం వెనుక ఏఏ కారణాలుండవచ్చో పేజీలకి
పేజీలు చెప్పేస్తాడు. విశాల్ పాత్రకి షెర్లాక్ హోమ్స్ నుంచి ఈ టాలెంట్ ని మాత్రమే తీసుకున్నారు. ఉదాహరణకి హీరోయిన్ ని
చూసి - నీ పేరెంట్స్
చనిపోయారు. నువ్వు
నీ మేనమామ దగ్గర వుంటున్నావు, మేనమామకి
ఇస్త్రీ షాపుంది, నువ్వు
వేసుకున్న డ్రెస్ నీది కాదు... ఇలా చూడగానే అనేస్తూంటాడు. ఇదే
ధోరణి అనేక సందర్భాల్లో కొనసాగి పాత కాలపు డిటెక్టివ్ పాత్రల్ని గుర్తుకు
తెస్తాడు. ఇంత కుశాగ్రబుద్ధి అతనెలా అయ్యాడో, అసలీ వృత్తిలోకి ఎలా వచ్చాడో పాత్ర
పరిచయం వుండదు.
1968 లో విడుదలైన ‘ది డిటెక్టివ్’ అనే ఫ్రాంక్ సినాట్రా నటించి
న
థ్రిల్లర్ లో, పాత్ర కూడా చాలా రఫ్ గానూ, పోలీసు భాష మాట్లాడుతూ మొండిగానూ
వుంటుంది. కేసుతీసు
కునే వరకే సెంటిమెంటు, తర్వాత ఏ సెంటిమెంటూ లేకుండా దర్యాప్తులో వ్యక్తులతో
వ్యవహరిస్తాడు. అచ్చం ఈ కోవలోనే విశాల్ పాత్ర వుంది తప్ప, షెర్లాక్ హోమ్స్ తో
సంబంధంలేదు.
ఒక
స్టార్ కిది చిన్నస్థాయి కథ. కానీ ఒక స్టార్ చిన్న స్థాయి కథలో నటించడం వల్ల
దాన్ని ఏ స్థాయికి తీసికెళ్ళ గలడో, నటుడిగా తాను కూడా స్థాయికి చేరుకోగలడో
నిరూపించాడు విశాల్. ఇందులో మూడు యాక్షన్ సీన్లున్నాయి. పాడుబడ్డ
గృహంలో రఫ్ గ్యాంగుతో, రెస్టారెంట్ లో చైనీస్ గ్యాంగ్ తో, క్లయిమాక్స్ లో విలన్
తో- ఇవన్నీకొత్తగానూ, కళాత్మకంగానూ వుండడం ఒక ప్రత్యేకత. అయితే డిటెక్టివ్ గా
వేషధారణ సరీగ్గా కుదర్లేదు. ఐతే ఈ పాత్రతో మాస్ హీరో కాస్తా క్లాస్ హీరో అయ్యాడు.
కొత్త
హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో జేబుదొంగగా నటించింది. ఆ పని మాన్పించి తన
ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుంటాడు హీరో. ఆమె మీద ఎప్పుడు అరుస్తాడో తెలీక భయంభయంగా
గడిపే పాత్ర. చివరికి అతను ప్రేమలో పడినా, ఆ ప్రేమ ఆమెకి దక్కదు.
డిటెక్టివ్
అసిస్టెంట్ పాత్రలో ప్రసన్న కన్పిస్తాడు. కానీ దీనికి డాక్టర్ వాట్సన్ పాత్రతో సంబంధం
లేదు. విలన్ గా నటించిన వినయ్ రాయ్ విలనీ
అంతా వాలెస్, క్రీజీ ల శైలిలో వుంటుంది. డెవిల్స్ గ్యాంగ్ అనే పేరుకూడా వాలెస్,
క్రీసీల నవలల్లో కన్పించే పేరులాంటిదే. ఈ గ్యాంగ్ ఇంకా సాహిత్యంలో, సినిమాల్లో
మాఫియా రాక ముందటి చిత్రణ. నీటుగా, కూల్ గా వుంటూ ఎక్కువ మాట్లాడుకోరు. ఆధునిక
పద్ధతుల్లో, ఒక్కోసారి సైన్సు నుపయోగించీ సైలెంట్ గా నేరాలు చేస్తూంటారు.
\
వినయ్ ఈ
వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ టెర్రిఫిక్ గా నటించాడు. అతడి అసిస్టెంట్ పాత్రలో ఆండ్రియా జెర్మియా డిటో. గ్యాంగ్ మెంబర్ గా భాగ్యరాజా ఓకే. సినిమా ప్రారంభ సీన్లో,
మళ్ళీ ఫస్టాఫ్ ముగింపు సీన్లో కన్పించే సిమ్రాన్ కూడా టెర్రిఫిక్ గా వుంది.
కెమెరా
వర్క్, బిజిఎం, సెట్స్ డిజైనింగ్, ఎన్నుకున్న లొకేషన్స్, నైట్ సీన్స్ సమస్తం కళాత్మకంగా,
ఆలోచనాత్మకంగా వున్నాయి. కథకి తగ్గ స్టయిల్ నీ, మూడ్ నీ క్రియేట్ చేయ డం వేరే
కసరత్తు. దీనికి రిఫరెన్స్ అయినా వుండాలి, సొంత నైపుణ్య మైనా వుండాలి.
చివరికేమిటి
‘పిశాచి’
దర్శకుడు మిస్కిన్ ఈ ‘డిటెక్టివ్’ తీశాడు. కార్తీక్ సుబ్బరాజు లాగే తనదీ ప్రత్యేక
విజన్, దానికి రిఫరెన్సులు. నిజానికి మాఫియా పాత్రలు, కథలు అలవాటయ్యాక, అంతకి
ముందటి ఇంటలెక్చువల్ థ్రిల్లర్స్ ని
కోల్పోయాం. మర్డర్స్ అంటే కాల్చో, నరికో చంపే సంస్కృతిలోకి సినిమాలు మారేక,
మెదడుకి పదునుబెట్టే నేరాల ప్రక్రియల్ని చిత్రీకరించడం అరుదై పోయింది. నేర ప్రపంచం ఇంకా చాలా వుంది.
సినిమాలు ఒకే హింసని, రక్తపాతాన్నీ పట్టుకుని వుంటున్నాయి. డిటెక్టివ్ లో ద్విపార్శ్వ
దర్శన మౌతుంది. చంపడంలో హింస వుంటే వుండొచ్చు, ఆ చంపే విధానం మీదే మన దృష్టంతా
కేంద్రీకృతమవుతుంది – హింస కంటే, దాని విధానమే కట్టి పడేస్తుంది. పిడుగుపాటుని
సృష్టించి చంపడం, రైసిన్ తో చీమ కుట్టినట్టు చేసి చంపడం, లాఫింగ్ గ్యాస్ తో నవ్వించీ
నవ్వించీ రోడ్డు ప్రమాదం జరిపించి చంపడం లాంటి నేరాలు ఆలోచనలో పడేస్తాయి.
ఈ
డిటెక్టివ్ కథ దాని జానర్ మర్యాదని గౌరవిస్తూ పూర్తిగా లాజిక్ కి పట్టం గడుతుంది.
లాజిక్ లేని చిత్రీకరణ ఎక్కడా కన్పించదు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో కూడుకుని
వుంటుంది. పోలీసులు, డిటెక్టివ్ లు లాజికల్ గానే అలోచించి, లాజికల్ గానే పని చేసుకుపోతారు. చాలా
సినిమాల్లో చూపించినట్టు లాజిక్ ని ఎగేసి పనిచేస్తే ఉద్యోగాలు పోతాయి. ఈ మూవీలో
ఒక్క డైలాగు మిస్ చేసుకున్నా, ఒక్క సీను సరిగా చూడకపోయినా, ఆ తర్వాత అర్ధంగాని
ప్రమాదం వుంటుంది. డ్రమెటిక్ కంటిన్యుటీ కోల్పోతాం.
ఓ
పది నిమిషాల్లో పిల్లాడి కేసుతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేసేస్తారు. దీనికి
ముందు హీరోకి తెలియని రెండు ప్రమాదవశాత్తూ జరిగిన మరణాల్ని చూపిస్తారు. పిల్లాడి కేసుతో
హీరో మిడిల్ విభాగంలో ప్రవేశించి సమస్య (కేసు)తో సంఘర్షిస్తూ, గోల్ కోసం (కుక్కపిల్లని చంపిందెవరు?)
ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నప్పుడు ఒక సందేహం వస్తుంది - ఈ కథ ఎండ్ సస్పెన్స్ కథగా మారుతుందా అని. డిటెక్టివ్
కథలు నవలా రూపంలో ఇలాగే వుంటాయి. చిట్ట
చివరికి గానీ డిటెక్టివ్ కి, పాఠకులకీ హంతకుడు తెలియడు. ఇలా సినిమాలో కొనసాగితే ప్రేక్షకులు
అంత సేపూ భరించలేరు. విలన్ కీ హీరోకీ మధ్య
పోరాటం మొదలవాల్సిందే. అదీ ఇంటర్వెల్ లోపు.
సస్పెన్స్
లో రెండు ప్రశ్నలుంటాయి : ఎవరు? ఎందుకు? అని. ఈ రెండూ దాచిపెట్టి కథ నడిపిస్తే
ఎండ్ సస్పెన్స్ అవుతుంది. అంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎండ్ లో మాత్రమే
తెలుస్తాయన్న మాట. అంతవరకూ పాత్రతో ఏక
పక్ష కథనమే వుంటూ భరించలేరు. ప్రస్తుత డిటెక్టివ్ కి ఇదే జరుగుతోందా అన్నసందేహం
వస్తుంది. పరిశోధన చేస్తున్నాడు. గంట గడుస్తున్నా హంతకుడెవరో, ఎందుకు చంపుతున్నాడో
తెలీడం లేదు. నవలలా సినిమా వుండబోతే విశాల్ అట్టర్ ఫ్లాప్!
కానీ
అదే 60 వ నిమిషంలో, ఇంటర్వెల్ లోపు సినిమా
రూపమే అంటూ స్పష్ట మైపోతుంది. విలన్, అతడి
గ్యాంగ్ ఓపెనైపోతారు. విలన్ కరెంటు రంపంతో ఒక శవాన్ని కోస్తూంటాడు కూడా. దీంతో
మనలోని సగటు ప్రేక్షకుడి బుద్ధి సంతృప్తి పడుతుంది. ఎవరు? అనేది తెలిసిపోయింది. ఇక
ఎందుకు? (ఎందుకు హత్యలు చేస్తున్నాడు) అన్నది రివీల్ అవ్వాలి. దీన్ని చివరి వరకూ
ఆపినా నష్టం లేదు. రెండు ప్రశ్నలూ ఆపెస్తేనే ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఒకటి ఓపెన్ చేసేసి నడిపిస్తే
సీన్ టు సీన్ సస్పెన్స్ అవుతుంది. ఈ విలన్ అప్పుడే హీరోకి తెలియాల్సిన అవసరం లేదు.
ప్రేక్షకులకి తెలిస్తే, హీరో ఎలా తెలుసుకుంటాడా అన్న సస్పన్స్ తో కూడిన కథనం ముందుకు లాక్కెళ్తుంది.
పది
నిమిషల తర్వాత, ఇంటర్వెల్ కొచ్చేసరికి
హీరో ప్రారంభంలో మొదటి రెండు మరణాల రహస్యం తెలుసుకుంటాడు. ఇదే సమయంలో విల తన
పార్టనర్ మీద ఇంకో దడి జరిపిస్తాడు. ఫస్టాఫ్ లో రెండు మరణాల మిస్టరీ ఇంటర్వెల్
కల్లా తేల్చేయడం మంచి కథనం. అదే సమయంలో ఇంటర్వెల్ మళ్ళీ విలన్ చేసే ఇంకో ఎటాక్ తో
కథ తెగిపోకుండా, సెకండాఫ్ కి సన్నద్ధం చేయడం.
సాధారణంగా
ఇటువంటి సినిమాల్లో మొదటి రెండు మరణాల రహ్యసం, అ మాటకొస్తే మొత్తం కథలో జరిగిన
సంఘటనల వివరణ కార్యకారణ సంబంధం సహా వివరిస్తూ ముగింపులో బోలెడు చెప్తాడు హీరో. ఇది
నవలా పద్దతి. సినిమాలో మళ్ళీ ఆడియెన్స్ మొదట్నించీ అన్నీ గుర్తు చేసుకుంటూ హీరో
ఇచ్చే వివరణలతో కనెక్ట్ అవడం బోరుకొట్టే బిజినెస్. అందుకని ఎప్పటికప్పుడు
తేల్చెయ్యాలి. అందుకే ఫస్టాఫ్ మరణాల రహస్యాన్ని ఫస్టాఫ్ లోనే ఇంటర్వెల్ లో విప్పేశారు.
సెకండాఫ్
కథ ఎజెండా విలన్ తన బిజినెస్ కి అడ్డుగా వున్నాడని హీరోని చంపే ప్రయత్నాలు చేయడం. హీరో
తప్పించుకుంటే అసిస్టెంట్ ని, అసిస్టెంట్ బయటపడితే, హీరోయిన్ ని...ఇలా యాక్షన్ లోకి
దిగుతుంది కథ. క్లయిమాక్స్ లో హీరో విలన్ల ముఖాముఖీ. ఇంతే మూడంకాల స్ట్రక్చర్.
అన్ని
కోణాల్లో సమగ్రంగా వుండే థ్రిల్లర్స్ తీయడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైనా కూడా ఇంకేవో
చాపల్యాలతో చెడగొడతారు. ప్రొఫెషనల్ పాత్రలకి ప్రొఫెషనలిజంతో కూడిన కథ చేస్తేనే ఆ పాత్రలకీ,
థ్రిల్లర్ కీ న్యాయం చేసినట్టు; తద్వారా బాక్సాఫీసు
దగ్గర బావుకున్నట్టు.
-సికిందర్