రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 13, 2017

          
     హ  అంతా ఓకే అనుకుని కీ బోర్డు మీద మీరు ఫైనల్ గా సేవ్ కొడతారు. టేబుల్ మీద అటు పక్క వున్న మగ్గులో పొగలు గక్కుతున్న కాఫీని ఇంకోసారి సిప్ చేసి, వర్డ్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తారు. ఆ వర్డ్ డాక్యుమెంట్ లో మీరు ఇప్పుడిప్పుడే ఫినిష్ చేసిన బ్లాక్ బస్టర్ స్క్రిప్టు వుంది. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఫీలవుతారు. గర్వంగానూ ఫీలవుతారు. ఎందుకంటే- ఒక స్క్రిప్టు ని పట్టుబట్టి ఫినిష్  చేయడమంత  గొప్ప పని లేదు! అయితే ఒకటే సమస్య- మీరా స్క్రిప్టుని ప్రేమించకపోవడం, ఇంకా వరస్ట్ గా మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం!
          షాకింగ్ గా వుందా? వుండొచ్చు. వుంటుంది కూడా. రైటర్ గా మీతో మీరే ప్రేమలో పడితే, టాలెంట్ పరంగా మీరొక పెద్ద కొండనే ఢీకొంటారు. ఆ కొండని ఒక్క అంగుళం కూడా కదిలించుకుని దాటలేరు. మీరు అట్టడుక్కి  జారుకుంటే తప్ప-మీ ఇగో కిందనుంచి మీరు కూర్చోబెట్టిన  పీఠాన్ని లాగేస్తే తప్ప!

         రైటర్స్ తో  వచ్చిన చిక్కేమిటంటే, వాళ్ళు సక్సెస్ ని ఫేమ్ గా చూస్తారు. ఫేమ్ కోసం రాస్తారు. రాయడం కోసం రాయరు. వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ నిండా ప్రపంచంలో తాము పొందబోయే పేరుప్రఖ్యాతుల వాసనలతో నింపేస్తారు. తాము రాసింది పబ్లిక్ లోకి వెళ్ళాలని గాక, రాసిందాంతో తామే పబ్లిక్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాలనుకుంటారు. తమ పేరే కన్పించాలి, తాము రాసింది ఎలా వున్నా ఫర్వాలేదన్న పటాటోపంతో ప్రవర్తిస్తారు.  


          అప్పుడేం జరుగుతుంది? ఇలా మీ గురించి  మీరు ఫీలైపోతే, మీరు రాసిందాంట్లో మీరే కన్పిస్తారు; మీ ఇగోయే కన్పిస్తుంది; పేరుతెచ్చుకోవాలన్న మీ యావే కన్పిస్తుంది. ఒక కంపెనీ తన ఉత్పత్తులకి ప్రజల్లో పేరురావాలన్న సంకల్పంతో నాణ్యమైన ఉత్పత్తిని చేస్తుంది, ఉత్పత్తిని వదిలేసి కంపెనీకే పేరురావాలని ప్రాకులాడదు.
          మీరలా కాదు, మీరు మీకే పేరు రావాలనుకుని రాస్తారు, రాసిందాని నాణ్యత పట్టించుకోరు. రాసిందాన్ని ఎప్పుడూ నిష్పాక్షికంగా సరిచూసుకోవాలని కూడా ప్రయత్నించరు. మీ ఇగో మిమ్మల్ని మీరింతగా ప్రేమించుకునేట్టు మాయ చేస్తుంది. మీ ఇగో మీకిచ్చిన  కాన్ఫిడెన్స్ మీద ఈగని కూడా వలనివ్వదు. ఇగోయే మీరు, మీరే ఇగో అన్నట్టుగా మీరుంటారు.
          ఇలా గాలికొట్టి ఉబ్బించుకున్న కాన్ఫిడెన్స్ తో మీరు స్క్రిప్టు ని సబ్మిట్ చేస్తారు. ఇగో చేసే ఇంకో మాయ ఏమిటంటే అది అవతలివారికి కూడా ఇగో వుంటుందన్న స్పృహ మీకు కలగనివ్వదు. మీ స్క్రిప్టు చదివే అవతలి వ్యక్తి  అందులో మీ ‘రైటింగ్ పవర్’ ని చూసి పడిపోతాడనుకుంటారు. కానీ అతడికీ ఇగో వుంటుందనీ, ఆ ఇగోతో అతనూ రియాక్ట్ అవుతాడనీ అనుకోరు. మీ రైటింగ్ పవర్ లో మీ ఇగోని చూసిన అతను కూడా వెంటనే తన ఇగోతో దాన్ని తిప్పికొట్టేస్తాడు.
రెండు ఇగోలూ ఒక ఒరలో ఇమడవు. అవతలి వ్యక్తికి ఇగో లేకుండా మీరు చేయలేరు. ఎంతో కొంత అతడి ఇగోని సంతృప్తిపర్చడమే మీరు చేయగలరు. అతడి ఇగోని  సంతృప్తిపర్చాలంటే మీరు రాసిం దాంట్లో మీ ఇగో కన్పించకూడదు, వినయపూర్వక రాతే కన్పించాలి. ఆ రాతలో ఆ రాతద్వారా ఆ కంపెనీకి వచ్చే లాభాలే కన్పించాలి, మీ పేరుప్రఖ్యాతులు కాదు. కంపెనీకి మీ ఇగో నచ్చి  నడిబజార్లో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అమ్మాలనుకోదు, మీరు రాసింది నచ్చితే దాన్ని అమ్మాలనుకుంటుంది.
రాసిందాంట్లో అంతా మీ ఇగోయే నిండిపోయి వుంటే, దాన్ని రిజెక్ట్ చేస్తుంది, డీఫేమ్ చేస్తుంది, డస్ట్ బిన్ లో పడేస్తుంది. అప్పుడేమవుతుంది? ఇతరుల్నిఇంప్రెస్ చేయడంలో మీరు ఇలా ఫెయిలవడంతో మీ ఇగో స్థానంలో మిమ్మల్ని అవమానభారం, నిరాశానిస్పృహలు, విరక్తి, వైరాగ్యం, పిరికితనం ఇవన్నీ చుట్టుముడతాయి. మీ ఇగో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్తుందన్న మాట.
అందుకని ఏంచేయాలి? మీతో మీరు ప్రేమలో పడకండి, మీ రాతతో ప్రేమలో పడండి. మీ రాతపట్ల కమిట్ మెంట్, నిజాయితీ ఉట్టి పడేట్టు రాయండి. ఆ రాత ద్వారా మీరేదో సాధించాలన్న ఆశలు పెట్టుకున్నట్టు గాక, మీ రాత ఏం సాధించగలతో ద్యోతకమయ్యేట్టు రాయండి. అప్పుడు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ మిమ్మల్ని దెబ్బ తీయదు, ఇంకోచోట సబ్మిట్ చేసుకుంటారు.  రిజెక్షన్స్ మిమ్మల్ని బాధించవు, అదికాక పోతే ఇంకోటి రాయడానికి సిద్ధమవుతారు. రాసిందే శాశ్వతమని భావించరు, ఇంప్రూవ్ మెంట్ ఎప్పటికీ వుంటుందని కరెక్షన్స్ చేస్తూంటారు. ఎన్ని కరెక్షన్స్ తో ఎంత పర్ఫెక్షన్ మీరు సాధిస్తూంటే, అంత ఒప్పించడానికి మీరు దగ్గరవుతూంటారు. మార్కెట్లో డబ్బే మాటాడుతుందని గుర్తు పెట్టుకోండి, రాత కాదు.
అంటే మీకంటూ ఏమీ ఆశించకుండా రాయాలా? అవునంతే, ఆశించకూడదు. అది రాస్తే మీకింత పేరొస్తుందని రాయకూడదు, అది రాస్తే మీకింత డబ్బొస్తుందని రాయకూడదు, అది రాస్తే మరెన్నో  ఆఫర్స్ వస్తాయనీ రాయకూడదు. వస్తాయీ అన్నది వూహ, వూహలు చేయకూడదు. వూహించడంటే భవిష్యత్తులో వుండడమే. కానీ మీరు వర్తమానంలో వుండాలి. మీరు భవిష్యత్తుని కలలు గంటూంటే, అది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికీ, ఆ ప్రేమతో మిమ్మల్ని మీరేదో వూహించుకోవడానికీ, పగటి కలలు కనడానికీ, ఫలితంగా ఇగో వచ్చి ఆక్రమించడానికీ, ఆ ఇగోయే మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోవడానికీ, ఆ సెల్ఫ్ లవ్ తో వర్తమానంలో మిమ్మల్ని నడిపించడానికీ దారి తీస్తుంది. మీ చేతిలో వున్న పనిని సరిగా జరగనివ్వదు, డిస్టర్బ్ చేస్తూంటుంది.
ఏదో రావాలని, ఏదో కావాలని మీరు వూహాజనితమైన భవిష్యత్తులోకి వెళ్ళిపోయే కంటే, వాస్తవికమైన వర్తమానాన్ని నమ్ముకుంటేనే పనిని నమ్ముకున్నట్టు. వర్తమానంలో దృష్టి పెట్టి మీరు సరిగా రాయకపోతే మిమ్మల్ని  మీరెలా నమ్ముకోగలరు. అందుకని పనిని నమ్ముకోవాలి, మిమ్మల్ని కాదు. పనివల్లే మీమీద మీకు నమ్మకం ఏర్పడుతుంది, వూహలవల్ల కాదు. పనిని నమ్ముకున్నప్పుడే  మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా వుంటారు. ఎందుకంటే వాస్తవంలో లేదా వర్తమానంలో- ఈ క్షణంలో- మీరు చేయాల్సిన పనే మీ ముందుంటుంది. ఆపని తనని ప్రేమించమంటుంది. అందుకని మీ రాతపనిని మాత్రమే మీరు ప్రేమించాలి, అది నిర్దుష్టంగా వుంటే, అదే మీ భవిష్యత్తుని కావలసినంత గొప్పగా తీర్చిదిద్దుతుంది. సరైన వస్తువు నివ్వకుండా మీరే వస్తువూ పొందలేరు, భవిష్యత్తు బంగారమవ్వాలంటే వస్తువే సమాధానం! ఇగోని భవిష్యత్తు వికర్షిస్తుంది, ఒకవేళ ఆకర్షిస్తే  అది తాత్కాలికమే.
-ఏజెన్సీస్ 

Sunday, February 12, 2017

రివ్యూ!






రచన- దర్శకత్వం : హరి

తారాగణం : సూర్య, అనూష్కా,  శృతీ హాసన్, సూరి, రాధిక, ఠాకూర్ అనూప్ సింగ్, సుమన్, శరత్ బాబు, శరత్సక్సేనా, నీతూ చంద్ర దితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : హారిస్ జయరాజ్, కెమెరా  : ప్రియన్, ఎడిటింగ్ : వీటీ విజయన్, టీఎస్ జే, స్టంట్స్ : అన్బరీవ్, కణల్ కన్నన్
బ్యానర్ : స్టూడియో గ్రీన్, సురక్ష్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలుః జ్ఞానవేల్ రాజా, ల్కాపురం శివకుమార్
విడుదల : ఫిబ్రవరి 9, 2017
***

        ‘సింగంఇంకా గర్జిస్తోంది. బాక్సాఫీసు మీద పంజా దెబ్బ ఇంకా విసురుతోంది. మొత్తం సినిమాల టర్నోవర్ లో తన  నర సింహ భాగం వాటా లాగేస్తూ  నమిలేస్తోంది. సింగం-1, 2 లతో ఎప్పుడో తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని,  సింగం -3 కి  స్టయిల్ గా SIII గా లోగో అదీ  పెట్టుకుని స్పీడు పెంచి గాండ్రిస్తోంది... సింగం ఎప్పుడూ సింగమే, రెండు నెలలుగా విడుదల ఎన్నిసార్లు వాయిదాలు పడ్డా, ఆఖరికి విడుదల రోజు మార్నింగ్ షోకి మొహం చాటేసినా అది మృగరాజే. అది జూలు విదిలిస్తే దాని మీద జోకులన్నీ బలాదూరే. సింగం మీద జోకులేస్తే అది జనం మీద పడి జేబులు బరాబర్ గా కొట్టేస్తుంది!


          సింగం కోసమే పుట్టాడు సూర్య. సూర్య కోసమే సింగం పుడుతూంటుంది. సింగం సూర్య, సూర్య సింగం ఎలా పిలచినా పలికేది బాలీవుడ్ దాకా హౌస్ ఫుల్ బాక్సాఫీసులే. దేశంలో పడ కేసిన  పక్కా నాన్ వెజ్ మసాలా యాక్షన్ లన్నీ లేచి సిగ్గుపడాల్సిందే. ఇక భాషలో సింగం తీసినా భాషలో  టైటిలే అక్కర్లేకుండా సింగమే ఒన్స్ ఫరాల్  టైటిల్  అవ్వాల్సిందే.


       
ఏమిటీ ఈసారి సింగం ప్రత్యేకత? ఒక సింగంని మించి ఇంకో సింగంగా తనతో తానే పోటీ పడే సింగం సీక్వెల్స్- ఫ్రాంఛైజెస్ మూడోసారీ పోలీస్ స్టోరీని ఇంకెంత వైవిధ్యంగా చూపించింది? మొదటి సింగంతో లోకల్ పోలీసుగా పుట్టిన సింగం ఇప్పుడు లెవెల్ పోలీసుగా విజృంభించాడు?  మొదటి సింగంతో లోకల్ సమస్యని పరిష్కరించిన సింగం, ఇప్పుడు స్థాయి సమస్యతో పోరాడేడు? అసలు సింగం ఏం చేశాడు? చూద్దాం...

కథ 
      మంగళూరులో ఓ  పోలీస్ కమీషనర్ హత్య జరిగి  ఎంతకీ కేసు తెమలక పోవడంతో  ఆంధ్రప్రదేశ్ లో గట్టి  పోలీసాఫీసర్ నరసింహం (సూర్య) మాత్రమే దీన్ని  పరిష్కరించగలడని, కేంద్రం ఒక ఆలోచన చేస్తుంది. ఒక రాష్ట్ర పోలీస్ అధికారిని ఇంకో రాష్ట్రం పంపాలంటే వయా సిబిఐయే మార్గమని చర్చించుకుని, నరసింహంని  సిబిఐ లోకి రిక్రూట్ చేసుకుని, అక్కడ్నించి మంగళూరు పంపుతుంది సీబీఐ డిసిపి గా కేంద్ర ప్రభుత్వం. కమీషనర్ ని చంపిన హంతకుల్ని పట్టుకోవడానికి అక్కడికి చేరుకున్న నరసింహం, అక్కడి  మధుసూదన్ రెడ్డి (శరత్ సక్సేనా)  అనే మాఫియాని అనుమానిస్తాడు. అతడిమీద పకడ్బందీ సాక్ష్యాధారాల్ని సంపాదించడం కోసం అతడితోనే చేతులుకలిపి నటిస్తూంటాడు. 

          విద్య (శృతీ హాసన్) అనే జర్నలిస్టు నరసింహంని పరిచయం చేసుకుని వెంట పడుతూంటుంది. కావ్య (అనూష్కా) అనే ఇంకో అమ్మాయి నరసింహంని రహస్యంగా కలుస్తూంటుంది. నరసింహం మధుసూదన రెడ్డితో చేతులు కలపడాన్ని కనిపెట్టి వార్తగా రాసేస్తుంది విద్య. దీంతో నరసింహంకి  చాలా చెడ్డ పేరొచ్చేస్తుంది. ఇది రూపుమాపుకోవడానికి వెంటనే మధుసూదన రెడ్డీ, అతడి గ్యాంగు మీదా చర్యలు తీసుకోవడం మొదలెడతాడు. దరిమిలా  కమీషనర్ హత్య వెనుక కేంద్ర మంత్రి (సుమన్), ఆస్ట్రేలియాలో వుంటున్న అతడి కొడుకూ విఠల్ (ఠాకూర్ అనూప్ సింగ్) వున్నారని తెలుస్తుంది. 

          వీళ్ళంతా కలిసి అసలెందుకు కమీషనర్ ని చంపారు? అసలు వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఏమిటి? వీళ్ళని నరసింహం ఎలా పట్టుకున్నాడు? మరోవైపు వ్యక్తిగతంగా విద్యతో ఎదుర్కొన్న సమస్య లేంటి? అతణ్ణి  కలుస్తున్న కావ్య ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సింగం  నోట్లో డబ్బులు పెట్టాల్సిందే.  

ఎలావుంది కథ?
     ఈ మూడో సింగం కాన్వాస్ ని పెంచిందీ కథ. ఈసారి సింగంని యూనివర్సల్ పోలీసుగా ప్రమోట్  చేస్తూ  అంతర్జాతీయ సమస్యని సింగంకి అప్పగించిందీ కథ. సమస్త జీవులకీ, పర్యావరణానికీ ప్రాణాంతకమైన, భూమిలో కలిసిపోయే గుణం లేని బయోమెడికల్ వ్యర్ధాలు, ఈ- వ్యర్ధాలూ  ప్రత్యేక ప్లాంట్లతో నిర్వీర్యం చేయకుండా, ఆసియా దేశాలకి తరలించి డంప్ చేస్తున్న అంతర్జాతీయ పరిశ్రమల కుట్రని భగ్నం చేస్తుందీ కథ. తమిళ సినిమా కథ అంతర్జాతీయ సమస్యల్ని ఎత్తుకోవడానికి బాక్సాఫీసు భయాలు పెట్టుకుని వెనుకాడదు. స్మార్ట్ ఫోన్లు మాస్ ప్రేక్షకుల చేతికి సైతం వచ్చేశాక తమిళ సినిమా కథలకి రెక్కలొచ్చేస్తున్నాయి. నిజానికి పాత చింతకాయ పంజరాల్లో బందీలై  వుంటున్నది తెలుగు రచయితలే- ప్రేక్షకులు కాదు. స్మార్ట్ ఫోన్లతో, షార్ట్ ఫిల్ములతో ప్రేక్షకులు ఆ పంజరాల్లోంచి ఎప్పుడో బంధ విముక్తు లైపోయారు.  తెలుగు ‘జనతా గ్యారేజ్’ బ్రహ్మాండంగా జాతీయంగా పర్యావరణ సమస్యని ఎత్తుకుని, భయపడి పాత మూస ఫార్ములా మాఫియా కమ్ కుటుంబ కథ పంజరంలో సర్దుకుని సేఫ్టీ ఫీలైనట్టు గాక- సింగం అంతర్జాతీయ డంప్ దుష్పరిణామాల్ని కూడా సామాజిక దృష్టాంతా లుగా చూపిస్తుంది. ఈ డంప్ చుట్టే కథ సాగుతుంది తప్ప, ప్లేటు ఫిరాయించి రెగ్యులర్ లోకల్ మూస మాఫియా డెన్నుల్లో రొటీన్ గా తన్నుకు చావదు. 

ఎవరెలా చేశారు 
       ‘సింగ నరసింహం’ సూర్య సినిమా సాంతం సింగిల్ హేండెడ్ గా తానేఅయి గర్జించాడు, గాండ్రించాడు, బాదేడు, తన్నేడు, చీల్చాడు, చెండాడేడు, వెంటాడేడు, వేటాడేడు, వేటు మీద వేటు వేశాడు, కాల్చాడు, కూల్చాడు, భస్మీపటలం చేశాడు- క్షణం కూడా కుదురుగా లేడు. భగభగమండే సూర్య నరసింగ సింగమతను. మోడర్నైజ్ చేసిన- నూతన కల్పన చేసిన మాస్ సినిమా అంటే ఏంటో రుచి చూపించాడతను. మొదటి సింగం నుంచీ మూడో సింగం వరకూ అదే మెరుపు వేగం నటన, అవే తూటాల్లాంటి మాటలు. అలాగని ఈ పాత్ర  హైపర్  యాక్టివ్ పాత్రకాదు. ఓవరాక్షన్ నటనా కాదు. హైపర్ యాక్టివ్ పాత్ర   కిక్ -2 లో రవితేజ విఫలమైన పాత్ర  లాంటింది. హైపర్ యాక్టివ్ నెస్  ఇమేజి పెంచే నటనే కాదు. హైపర్ యాక్టివ్ నెస్ ని చిన్న పిల్లల చేష్టగా డయాగ్నసిస్   చేస్తారు- ఈ రకం మానసిక రుగ్మతతో కూడిన ప్రవర్తన చిన్నపిల్లల్లో వుంటుంది. సూర్యది హై పవర్ యాక్షన్. సూపర్ యాక్టివ్ క్యారక్టర్. అతడి మోహంలో, కళ్ళల్లో, కదలికల్లో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న భావోద్వేగ ప్రకటన, బాడీ లాంగ్వేజ్ లుండవు. అంత బీభత్సంలోనూ  అతి సునాయాసంగా సహజంగా సింపుల్ గా రౌద్ర రసమంతా పలికించేస్తాడు. ఒక కాకలు తీరిన పౌరాణిక నటుడికే సాధ్యమయ్యే నటకౌశలమిది. సినిమా సాంతం ఇంత ఎనర్జీ ఎక్కడ్నించీ పోగేసుకొచ్చాడో తెలీదు. ఇదంతా చూస్తే, ఇంతా చేస్తే గానీ ఒక మసాలా యాక్షన్ సినిమాని ఇవాళ్టి  ఎదిగిన ప్రేక్షకుల దర్బారులో ఒక స్టార్ దిగ్విజయంగా నిలబెట్టలేడేమో నన్న అనుమానం  వేస్తుంది. సూర్య కాక ఇంకెవరూ ఇంత కాక పుట్టించలేరు. 

          ఇక ఈ వారం ఇంకో ప్రత్యేకాకర్షణ – ఒకటి కాదు రెండు సినిమాల్లో- అనూష్కా!  సింగంతో బాటు ఓం నమో వెంకటేశాయలో ఆమె ఇంకెంతో లావెక్కి ప్రత్యేకాకర్షణగా నంబర్ వన్ గా నిలిచింది. ఇలాగే  లవులావుమని కంటిన్యూ అయితే బాక్సాఫీసుల్ని రీక్యాలిబరేట్ చేయాల్సి వస్తుందేమో ఆమె క్షేమంగా పట్టేట్టు.

          శృతీ హాసన్ ఫేస్ లో కూడా మార్పు క్లోజప్స్ లో బయటపడుతోంది. అందం హీరోయిన్ల పక్షపాతి అనే మాటని ఆమె నిలబెట్టుకోకపోతే అవకాశాలకి ఎసరొచ్చే ప్రమాదముంది. 

          ఈ సూపర్ ఫాస్ట్ గా పరుగులెత్తే సీన్లతో కూడిన యాక్షన్ లో సమస్యేమిటంటే - సూర్యకి, కమెడియన్ సూరికీ తప్ప- ఇంకెవరికీ కాస్తాగి పాత్రల్ని నటించేంత  స్పేస్ లేకపోవడం. ఈ రొంబ యాక్షన్లో కాస్త కామెడీతో రిలీఫ్ వుండాలన్నట్టు,  అప్పుడప్పుడు యాక్షన్ ని ఆపుతూ సూరి  వచ్చేసి, తన నాటు కామెడీతో కొంత  స్పేస్ ని సొంతం చేసుకుంటూంటాడు. వీళ్ళిద్దరికీ తప్ప- హీరోయిన్లూ విలన్లూ ఇంకెవరూ సరిగా రిజిస్టర్ కానంత మెరుపు  వేగంతో  సీన్లు - సీన్లు కావివి మైక్రో సీన్లు - వెళ్లి పోతూంటాయి. మొత్తం కలిపి నలభైకి పైగా ఆర్టిస్టులు డెకొరేషన్ బల్బుల్లా క్షణక్షణం వెలుగుతూ ఆరిపోతూ వుంటారు.

          తెరవెనుక హీరోలు స్టంట్ కో- ఆర్డినేటర్లు అన్బరీవ్
, కణల్ కన్నన్ లు. వీళ్ళతో పనిలేని సీనే దాదాపు లేదు. ఇన్నేసి యాక్షన్ సీన్లలో రిపిటీషన్ బారిన పడకుండా దేనికదిగా పోరాటాల్ని సృష్టించారు. ఏర్ పోర్టులో, రైల్వే స్టేషన్లో, హైవేలమీదా, నడిబజార్లలో, భవనాల్లో, అరణ్యాల్లో  ఎక్కడపడితే అక్కడ - కథా కథనాల వేగంతో పోటీ పడుతూ- కళ్ళు తిప్పుకోనివ్వని హైపర్ యాక్షన్ సీన్స్ ని సృష్టించారు. ఈ సీన్స్ లో  సింగం ని హైలైట్ చేసేలా చాలా లౌడ్ గా (మాస్ గా) ఆర్ ఆర్ ఒక్కటే సెకండాఫ్ వచ్చేసరికి చెవులు తట్టుకోలేని పరిస్థితి తెస్తుంది. మిరపకాయల పొగ బెట్టినట్టు ఇంత ఘాటు మసాలా అవసరం లేదేమో ఎంత మాస్ యాక్షన్ కైనా! 

          హారిస్ జయరాజ్ పాటల కోసం తన వంతు కృషి చేస్తే, లొకేషన్స్ పరంగా వీటి కోరియోగ్రఫీ రిలీఫ్ కూడా ఇచ్చేట్టు వుంది. ఈ యాక్షన్ కథకి పాటలు అడ్డుపడలేదు- వూపిరి సలపనివ్వని ఇంత  స్పీడ్ భారీ యాక్షన్ నుంచి కొన్ని నిమిషాలు  లెటజ్ చిల్ గా ఉపశమనం కల్గిస్తాయి. 

          ప్రియన్ కెమెరా వర్క్ కూడా అతి కష్టమైనది. కెమెరా స్పీడుగా పరిగెడుతూనే వుం టుందెప్పుడూ. 360 డిగ్రీ కెమెరాలు కూడా యదేచ్ఛగా వాడేశారు. జూమ్ ఇన్-  జూమ్ బ్యాక్ లేకుండా దాదాపు  షాట్స్ లేవు. కానీ  ఒకటీ  రెండు సెకన్ల నిడివితో  ఒక మైక్రో షాటే ఒక సీనుగా వుంటున్నప్పుడు, కంటిన్యూటీ చెడకుండా వీటిని క్యాప్చర్ చేస్తూ పోవడం ఎంత కష్టమో వూహించుకోవాల్సిందే. మాట్ డామన్ నటించిన బోర్న్ ఐడెంటిటీ సీక్వెల్స్ లో ‘బోర్న్ సుప్రమసీ’ (2004) లోనైతే,  సగటున ఒక్కో షాట్  నిడివి 1.9 సెకన్లు మాత్రమే. ఈ విజువల్ అప్రోచ్ ఎడిటింగ్ కీ, ఆర్ ఆర్ కీ, డీఐకీ అన్నిటికీ పెద్ద సవాలుగా మారింది- ఈ వేగం చూడలేక ప్రేక్షకుల కంటికీ ఇబ్బందై  విమర్శల పాలయ్యింది. ఇలా కళ కోసం టెక్నాలజీ గా కాక, టెక్నాలజీ కోసం కళ గా దుర్వినియోగమవడానికి దగ్గరగానే వుంది సింగం కూడా. కాకపోతే ఇక్కడ మైక్రో షాట్స్ ఎక్కువ లేవు- మైక్రో సీన్స్ వున్నాయి. 

          విజయన్
, జేలకి కూడా ఎడిటింగ్ లో  ఇది సవాలే. మైక్రో సీన్లతో,  వాటి ఇంటర్ కట్స్ తో, ఫ్లాష్ బ్యాక్స్ తో, స్పీడుతో  షాట్స్ ని ఏర్చి కూర్చి ఒక దృశ్యమాలికని  ఇంద్రధనుస్సులా చేయడం మామూలు కష్టం కాదు. 

          ఇంకా గ్రాఫిక్స్ సహా అన్ని టెక్నికల్ విభాగాలూ అత్యన్నతంగా పనిచేశాయి. వీటన్నిటినీ, వీళ్ళందర్నీ డామినేట్ చేస్తూ క్షణ క్షణం తెరమీద విచ్చలవిడిగా వెదజల్లుతున్న నిర్మాతల డబ్బు కట్టలే కనిపిస్తూంటాయి.

చివరికేమిటి 
       దర్శకుడు హరి సింగం సిరీస్ కి ఒక విజువల్ సెన్స్ ని  ఏర్పాటు  చేసుకుని అదే పాటిస్తూ వస్తున్నాడు. ఈ విజువల్ సెన్స్ తో ప్రస్తుత కథకి కథనాన్నీపాత్రల్నీ వాయువేగం పట్టిస్తూ ఎక్కడా ప్రేక్షకులకి ఆలోచించే అవకాశమివ్వకుండా చూశాడు. ఒక సీను మీద పూర్తిగా దృష్టి సారించే లోపే ఆ సీను మారిపోయే క్రమం చివరివరకూ కన్పిస్తుంది. ఒక నార్మల్ సీనులో ఎం టీవీ తరహా  మైక్రో షాట్లు వుండేవి ఒకప్పుడు. ఇప్పుడు మైక్రో షాట్ల స్థానంలో  మైక్రో సీన్లని ప్రవేశపెట్టాడు  దర్శకుడు. ఎన్నెని సీన్లు, ఎక్కడెక్కడి సీన్లు- క్షణంలో ఇక్కడ ఓపెన్ అయితే క్షణంలో స్వీడెన్ లో వుంటాయి; క్షణంలో హైవే మీద వుంటే,  క్షణంలో ఏర్ పోర్టులోవుంటాయి. ఒక సీను మీద ప్రేక్షకులు ధ్యాస నిలిపే సమయం ( అటెన్షన్ స్పాన్) బాగా తగ్గిపోయిన నేపధ్యంలో ‘టర్మినేటర్’ లాంటి సీజీ విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా కథ చెప్పే విధానమే మారిపోయిందని చెప్పాడు ఒకప్పుడు సిడ్  ఫీల్డ్. సీజీల  సంగతేమోగానీ, సింగం మైక్రో షాట్స్ తో హంగామా చేస్తోంది. ఈ టెక్నిక్ తో  కథనీ పాత్రల్నీ పట్టుకోగల్గే మాటలా వుంచి, అసలు మెదడు ఎంత అలసిపోతుందో ఆలోచించాలి. కచ్చితంగా రెండో సారి ఇలాటి సినిమా చూడలేరు ప్రేక్షకులు. 

          అయితే ఈ సీన్ల సందడి మీద కూడా దర్శకుడి కమాండ్ ఏలాంటిదంటే- ఇంత హంగామాలోనూ, ఎన్నెన్నో సీన్లతో  ఇంత స్పీడులోనూ,  ఎక్కడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కన్పించడు. గందరగోళం చేస్తున్నట్టు, నవ్వులపాలవుతున్నట్టూ అన్పించడు. దేశ విదేశాల్లో విలన్లతో ప్రధాన కథని పరుగులెత్తిస్తూనే, అందులోనే ఒక హీరోయిన్ తో హీరో ప్రేమ కథ, ఇంకో హీరోయిన్ తో పెళ్లికథ, పెళ్లి అనంతర కథ, అత్తగారింటి కథ, అత్తగారి అస్తమయ కథా; ఇంకా డ్యూయెట్లూ, వూర మాస్ కామెడీలూ....ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడేయాలో మాస్టర్ షెఫ్ లా స్పీడుగా వేసుకుంటూ పోయాడు. అయితే అంతే స్పీడుతో ఆరగించాల్సివచ్చే ప్రేక్షకాతిధుల సంగతి అలోచించినట్టు లేదు. 

          కథతో కూడా జానర్ మర్యాద తప్పలేదు. అయితే కాన్సెప్ట్ ని అలా చెప్పి వదిలేశాడు తప్పితే,  దాన్ని ప్రధానం చేయలేదు; దాంతోనే  కథ ముగించే ఆలోచన చేయలేదు ఇలాటి చాలా సినిమాలకి లాగే. నాన్ బయో డీగ్రే డబుల్ వేస్ట్స్ తో అంతర్జాతీయ కుట్ర ఇక్కడ స్థానికంగా  ఎంతమంది స్కూలు పిల్లల్ని బలిగొందో – ఆ దయనీయమైన ట్రాక్ ని కొనసాగిస్తూ, బాధిత కుటుంబాల సమక్షంలో విలన్స్  ని శిక్షించినప్పుడే కదా - తామెంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ విలన్స్ కి తెలిసివచ్చేది. బిన్ లాడెన్ ని శిక్షిస్తే అతడి బాధితుల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని ఎందుకు సలహా ఇచ్చి వుంటాడు హాలీవుడ్ రచయిత సీఐఏకి? అది సినిమా బుద్ధి కాబట్టి. అలా వుంటేనే సినిమా బావుంటుంది కాబట్టి. ఒకప్పుడు సినిమా కథల్లో విలన్ బాధితులు హీరో వెంట వుండేవాళ్ళు  కాన్సెప్ట్ ని మోస్తూ. సమాజ బాధని సింగం తానొక్కడి  ఎమోషన్ గా ఒప్పించలేడు తనూ బాదితుడైతే తప్ప. బాధితుడు కాని హీరో బాధితులు తోడయినప్పుడే  వాళ్ళ ఎమోషన్ తో కలుపుకుని తనూ జ్వలించగలడు.  సహాయ పాత్రలు అవుట్ డేటెడ్ కాలేవు, ఎందుకంటే అవి ఎప్పుడూ వుండే ఎమోషన్స్ కాబట్టి. ఒక్కో ఎమోషన్ కి ఒక్కో ప్రతీకలైన తల్లి- చెల్లి- తండ్రి- తాత- పెద్దమనిషి- స్నేహితుడు- హాస్యగాడు- మాయగాడు మొదలైన  అనేక పాత్రల్లో చాలా పాత్రలు (ఎమోషన్లు) మాయమైపోయినట్టు, లేదా నామమాత్రమైనట్టు- సామాజిక కుట్రల బాధితులు కూడా మాయమైపోయి- స్టార్ ఒక్కడే మిగులుతున్నాడు సెకండ్ హేండ్ లేదా పరోక్ష ఎమోషన్ ని  ప్రకటిస్తూ.

          ‘ది మాగ్నిఫిషెంట్  సెవెన్’ లో కౌబాయ్ హీరో డెంజిల్ వాషింగ్టన్ వూరి ప్రజలని కాపాడ్డానికి  పోరాటాలు చేస్తాడు. ప్రజలు కోరినంత మాత్రాన ఎక్కడ్నించో వచ్చి పోరాడాల్సిన ఎమోషనల్ కనెక్ట్ తనకి లేదు. కానీ చివర్లో విలన్ని చంపుతూ- ఆనాడు నా తల్లినీ చెల్లినీ చంపింది నువ్వే కదరా?-  అని జస్టిఫై చేసుకుంటాడు తన ఎమోషనల్ కనెక్ట్ ని!

          సింగం లో స్పీడుతో బాటు  మైక్రో సీన్ల కారణంగా ఒక్క సీనూ  గుర్తుకురాని విధంగా తేలిపోయిన మాట నిజమే- చూస్తున్నంత సేపే థ్రిల్ తప్ప ఎమోషన్ తో కట్టిపడేసేది లేదు, గుర్తుండేదీ లేదు. జస్ట్ కిక్ స్టార్ట్ పవర్ డ్రింక్ తాగిన చందాన వుంటుంది. ఎమోషన్ అనేది కాన్సెప్ట్ లో వుంది. ఆ నిజమైన ఎమోషన్ బాధిత పాత్రల్ని కలుపుకుని వస్తుంది- సినిమాకి ఆత్మ అనేది కాన్సెప్ట్ ని ఎమోషనల్ గా డ్రైవ్ చేసినప్పుడే ఏర్పడుతుంది. ఈ కథాత్మని కూడా జత చేసివుంటే సింగం ఇంకా సజీవమయ్యేది. 

          సింహం ఒంటరిగా పోరాడేటప్పుడుకంటే కూడా, తన పిల్లల్ని వెంటేసుకుని పోరాడుతూంటే ఆ డ్రామా బాగా గుర్తుండిపోతుంది!

-సికిందర్ 




         
         
         
 


Friday, February 10, 2017

rరివ్యూ!


స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె. రాఘవేంద్ర రావు


తారాగణం : నాగార్జున అక్కినేని, సౌరభ్ రాజ్, అనూష్కా, ప్రగ్యా జైస్వాల్, సుధ, విమలారామన్, అస్మిత, జగపతి బాబు, సాయికుమార్, రావురమేష్, తనికెళ్ళ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్,  బ్రహ్మానందం, ఆదిత్యా మీనన్, రఘుబాబు, పృథ్వీ రాజ్ తదితరులు 

కథ- మాటలు: జేకే భారవి, సంగీతం : ఎంఎం కీరవాణి,  ఛాయాగ్రహణం : ఎస్. గోపాలరెడ్డి బ్యానర్ : ఏఎంఆర్ సాయికృపా ఎంటర్ టైన్మెంట్స్ 
నిర్మాత : ఎ. మహేష్ రెడ్డి 
విడుదల : ఫిబ్రవరి 10, 2017
***

       వివిధ దేవుళ్ళకి ప్రణమిల్లి పరమ భక్తుడిగా నటిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలీని ఉత్తరాది భక్తుడు హాథీరాం భావాజీ పాత్ర పోషించారు. ఏడుకొండలవాడికి అపర భక్తుడైన హాథీరాం జీవిత కథలో ఒక సంఘటనే  సినిమా తీయడానికి ఆకర్షించి వుంటుంది బహుశా. భక్తి సినిమాలవైపు మళ్ళిన దర్శకుడు కె.  రాఘవేంద్రరావు మరోసారి  తన టీముతో ఈ కొత్త ప్రయత్నానికి పూనుకున్నారు. భక్తి  సినిమాలకి వీళ్ళిద్దరి రెగ్యులర్  కాంబినేషన్ లో ‘ఓం నమో వెంకటేశాయ’ తీరుతెన్నులేమిటో ఈ కింద చూద్దాం...

కథ
          రాం అనే కుర్రాడికి  దేవుణ్ణి చూడాలన్న కోరిక పుడుతుంది. దేవుణ్ణి చూడ్డం కాదు, దేవుడు ప్రత్యక్షమైతే గుర్తుపట్టగల్గాలని ఉపదేశించి ఓంకార మంత్రం నేర్పడం మొదలెడతాడు అనుభవానంద స్వామి (సాయి కుమార్). ఆ మంత్రాన్ని పఠిస్తూనే పెద్దవాడైన రాం (నాగార్జున) వటపత్రసాయి రూపంలో వచ్చిన ఏడుకొండల వాణ్ణి గుర్తుపట్టక, తన తపస్సుని భగ్నం చేసినందుకు కోపగించుకుని ఇంటి కెళ్ళి పోతాడు. అక్కడ తల్లిదండ్రులు (తనికెళ్ళ, సుధ) పెళ్లి చేస్తామంటే ఒప్పుకుంటాడు. కానీ మనసు మార్చుకుని కాబోయే పెళ్లి కూతురు (ప్రగ్యా జైస్వాల్) కి చెప్పేసి  దేవుడి  అన్వేషణలో వెళ్ళిపోతాడు. అసలు వటపత్రశాయి రూపంలో వచ్చింది ఏడుకొండల వాడేనని అనుభవానందస్వామి చెప్పి, పాచికలాట నేర్పి పంపుతాడు. 

          కానీ ఏడుకొండలపైకి చేరుకున్న రాంకి,  వెంకటేశ్వరస్వామి దర్శనం దొరకదు. ఆలయ భటులు నెట్టిపారేస్తారు. అలాగే ఎండలో వానలో ఆలయం ముందు కూర్చుంటాడు. ఆలయంలో చాలా అక్రమాలు జరుగుతూంటాయి ధర్మాధికారి గోవిందరాజులు (రావు రమేష్) ఆధిపత్యంలో. ఆలయంలో పనిచేసే కృష్ణమ్మ (అనూష్కా)  సహకారంతో రాం ఆలయానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలక్కుండా చూసుకుంటూంటాడు. రాం తమకి పోటీగా తయారయ్యాడని గోవిందరాజులు కక్షకట్టి దాడులు జరిపిస్తాడు. రాజు (సంపత్ రాజ్)  కి ఫిర్యాదు చేస్తాడు. ఆ రాజు రాం భక్తినీ నిజాయితీనీ  గమనించి, వరదరాజులుని పదవిలోంచి తొలగించి, రాంని ధర్మాధికారిగా నియమించడంతో- అప్పుడు రాం దైవదర్శనం చేసుకోగల్గుతాడు. అప్పుడు ఏడుకొండలవాడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు- ఓ రాత్రి కలలోనే  పాచికలాట ఆడడానికొస్తాడు.

          ఇలా రాంతో ఏడుకొండలవాడు స్నేహం పెంచుకుని తరచూ పాచికలాటలో ఓడిపోతూంటాడు. చివరికి పందెంలో సర్వం పోగొట్టుకుంతాడు. దీంతో ఏడుకొండలవాడి నగలన్నీ పోయాయని గొడవరేగుతుంది. రాజు సమక్షంలో ఆభరణాలన్నీ రాం ఆశ్రమంలోనే దొరుకుతాయి-  ఒక దోషిలా నిలబడ్డ రాం ఇప్పుడేం సంజాయిషీ చెప్పుకున్నాడు? దీన్ని రాజు నమ్మాడా? నమ్మకపోతే ఏం పరీక్షపెట్టాడు? ఈ పరీక్ష రాం ఎలా నెగ్గాడు? తను బాలాజీ అని పిలుచుకునే ఏడుకొండలవాడు వచ్చి రాంని ఆదుకున్నాడా? ఆదుకుంటే రాం తీర్చుకున్న రుణం ఎలాటిది? తన అఖండ భక్తిని ఏ కోరరాని కోరిక కోరి నిరూపించుకున్నాడు? - వగైరా తెలుసుకోవాలంటే మిగిలిన కథ చూడాల్సిందే.


ఎలావుంది కథ
         
గొప్ప త్యాగంతో గానీ భక్తిరస ప్రధాన చలన చిత్రం పరిపూర్ణం కాదేమో. హాథీరాం భావాజీ చరిత్ర పూర్తిగా దొరకడంలేదని చెబుతున్నారు. కాబట్టి అధికభాగం కల్పన మీదే ఆధారపడ్డ సినిమాకథ హాథీరాం గురించి తెలుగు ప్రేక్షకులకి కొంతైనా ఒక  అవగాహన ఏర్పడేందుకు తోడ్పడుతుంది. హాథీరాం  1500 ప్రాంతాల్లో  తిరుమలకొచ్చాడని ఉన్న కొద్దిపాటి  చరిత్ర చెప్తోంది.  అంతేగాక అతను  ఉత్తరప్రదేశ్ కి చెందిన వాడని వుంది. సినిమాలో రాజస్థాన్ నుంచి వచ్చాడని అన్నారు. తిరుమలలో అతను నిర్మించిన మఠం క్రమంగా 60 గదులకి విస్తరించి, అయిదు వందల ఏళ్ళకి పైగా భక్తులకి సేవలందించి, ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకి చేరుకుని  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోందని పత్రికలు  రాశాయి. ఒక తెలియని దైవ భక్తుడి గురించి సినిమావాళ్ళు సినిమాలు తీస్తారు, ప్రభుత్వాలు అవార్డు లిస్తాయి- కానీ ఆ భక్తుడు వదిలిపెట్టి వెళ్ళిన చిహ్నాల్ని  పరిరక్షించుకునే మాటో? సినిమాతోనైనా వాటికి మోక్షం కలగదా?

         
ఇక హాథీ రాం కథకీవిప్రనారాయణసినిమా  కథకీ దగ్గరి సంబంధం వున్నా, తేడా కూడా వుంది. విప్రనారాయణలో పరస్త్రీవ్యామోహంలో పడి దారితప్పిన తన భక్తుడు  విప్రనారాయణ కి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరిస్తాడు రంగనాధ స్వామి. బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెడతాడు. నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశిస్తాడు. శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడతాడు..ఇదంతా తాను ఆడించిన ఆటేనని చెప్తాడు.

         
హాథీరాంతో స్వయంగా ఏడుకొండలవాడు పాచికలాటలాడి సర్వం కోల్పోతే, నేరం హథీరాం మీద పడుతుంది. మళ్ళీ ఏడుకొండల వాడే  వచ్చి కాపాడతాడు. రుణం హాథీరాం తీర్చుకుంటాడు. ఇంతకి మించి కథలేదు. ఇదంతా సినిమాటిక్. ఏడుకొండలవాడు హాథీరాంతో పాచికల ఆట ఆడ్డానికి కూడాతన సేవలో అలసిపోతున్న హాథీరాంకి వూరట  కోసమే. ఇంతకిమించి ఆధ్యాత్మిక విలువ లేదు

         
కానీవిప్రనారాయణలో పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొస్తాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి స్వామి భక్తుడవుతాడు. ఇదొక ఆధ్యాత్మిక ఉద్దేశంతో కూడిన సైకో థెరఫీ మనకి!

          మరొకటి, హాథీరాంని ఏడుకొండలవాడు తనకి మించిన స్థానంలో అధిష్టింప జేయబోతే, అందుకు తగనని వెళ్లిపోయే హాథీరాం- సరే, ఇంకేదైనా కోరుకో తీరుస్తానని ఏడుకొండల వాడన్నప్పుడు- ఆ ఏడుకొండల వాణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఇరకాటంలో పెట్టేస్తూ, తీర్చుకున్న ఆ కోరికతో, దేవుణ్ణి మించిన దేవుడైపోలేదా హాథీరాం?

          చరిత్ర ప్రకారం హాథీరాం చేసిన నేరానికి రాజు పెట్టే పరీక్ష, ఒక్క పూటలో ఇంటెడు చెరుకు గడల్నీ  తినెయ్యాలని. అది ఏ మనిషికీ సాధ్యం కాదు. హాథీరాం ఏడు కొండల వాణ్ణి స్మరించుకుంటూ నిద్రపోతే, ఒక ఏనుగు వచ్చి మొత్తం తినేసి పోతుంది. తెల్లారి రాజు ఇది తెలుసుకుని, తన భక్తి  బలంతో ఏనుగు రూపంలో ఏడుకొండలవాణ్ణి రప్పించుకున్న హాథీరాం ని మెచ్చి,  అప్పుడే రాం పేరుకి ముందు ‘హాథీ’ (ఏనుగు) అని చేర్చాడు. సినిమాలో ఇదే చూపించారు. అలాగే ఓ రెండిటి గురించి రెండు చోట్ల వివరించారు : వెంకన్నకి బాలాజీ అనే పేరు ఎలా వచ్చిందో,  వెంకన్న ఉత్తరీయానికి శేషవస్త్రమని పేరెలా వచ్చిందో. 

          అయితే ఈ భక్తి జానర్ సినిమా ఆధ్యాత్మిక భావంతో మనసుని కడిగేసేకంటే, ఆత్మత్యాగంతో మనసుని కదిలిస్తుంది, పాచికలతో ఆడిస్తుంది, అంతే. 

ఎవరెలా చేశారు
          భక్తి పాత్రలకి ఇక నాగార్జున పెట్టింది పేరన్నట్టు వుంటుంది హాథీరాం పాత్రాభినయం. అయితే చివరి సన్నివేశాల్లోనే  ఈ భావావేశాల్ని రగిలించడం వుంటుంది. మిగతా సన్నివేశాల్లో భక్తి  కంటే శక్తియుక్తుల ప్రదర్శనే ఎక్కువ వుంటుంది. కథనం అలా చేసినప్పుడు చేసేదేం వుండదు. ఆనాటి క్లాసిక్ భక్తి  ‘భక్త తుకారాం’ లో తన తండ్రి పాత్రలాగా ఆద్యంతమూ భక్తిలో ఓలలాడే గాన- సంగీత మాధుర్యాల జడివాన కురిపిస్తున్నట్టు వుండాల్సింది. ‘భక్త తుకారాం’ లో కూడా అడ్డుపడే నాగభూషణం, సారథి మోసకారి  పాత్రలుంటాయి. వాటికి బుద్ధి చెప్పడం మరో పాట (చిందులు వేయకురా) ద్వారానే వుంటుంది. నాగార్జున పాత్రకి ఆలయంలో కార్మిక- యాజమాన్యం తాలూకు వర్గ పోరాటం లాంటిందిగా  వుండడంతో, ఆథ్యాత్మిక కథా సంవిధానానికి దూరంగా కమర్షియల్  హీరో- విలనిజాల కింద ఆ ఎపిసోడ్స్ అడ్డుపడేవిగా వుంటాయి. ఇక ఏడుకొండల వాడితో  పాచికలాట అయితే వినోదాత్మకమే. వెరసి గాఢమైన భక్తి నటించడానికి నాగార్జునకి మిగిలింది చివరి సన్నివేశాలే. పాత్రకి ప్రణయ కోణం లేదు. ప్రగ్యా జైస్వాల్ పాత్రతో దీన్ని బాగా పూరించే వీలున్నా పొడిపొడిగా చూపించి వదిలేశారు. ఇలా నాగార్జున పాత్ర చిత్రణ సారంలో మాత్రమే గాఢత్వానికి చేరుకోవడంతో గుర్తుండి  పోయే నటనన్నది చివర్లో మాత్రమే కన్పిస్తుంది- అదీ కదిలిస్తూనే, మనసుని కడిగేస్తూ కాదు. 

          ఆలయ సేవిక పాత్రలో  అనూష్కా, ఆమెని మోహించి పశ్చాత్తాప పడే అతిధి పాత్రలో జగపతిబాబూ ఓ పాటతో కలుపుకుని కాలక్షేపం కల్గిస్తారు. అయితే జగపతి పాత్రతో ఒరిగిందేమీ లేదు. ఎందుకొచ్చి ఎందుకు పోయిందో తెలీకుండా వుంటుంది. రాజు పాత్రలో జగపతి వుంటే బలంగా వుండేది. ‘భక్త తుకారాం’ లో శివాజీ గణేశన్ రాజుగా  నటించడంతో ఎంత బలాన్నిచ్చిందో తెలిసిందే. రాజు పాత్రలో విలన్ పాత్రలేసే సంపత్ రాజ్ కుదర్లేదు. ఆల్రెడీ విలన్లుగా రావురమేష్, ఆయన బృందం వుండగా, మళ్ళీ విలన్ లా కన్పించే సంపత్ రాజ్ వల్ల రాజు పాత్రకి  వైవిధ్యం ఏమీ లేదు. 

           ఇక అనూష్కాది  కీలకపాత్రా కాదు, చేసిందేమీ లేదు. ఏడుకొండల వాడిగా సౌరభ్ జైన్ ఫర్వాలేదనే అన్పిస్తాడు- అతడిది కొలమొహం కావడం, అదీ నునులేతగా వుండడం గాంభీర్యానికి మాత్రం అడ్డుపడ్డాయి. అతడిభార్యలుగా విమలారామన్, అస్మితల్లో విమలారామన్ దేవతామూర్తి లాగే వుంటుంది. 

          కీరవాణి సంగీతంలో పన్నెండు పాటలున్నాయి. తెరమీద ఈ పాటలన్నీ బాగానే వున్నాయి- కానీ కదిలించే భక్తి పాట అనేదే కరువయ్యింది. గుర్తుండి పోయే క్యాచీ పల్లవులు వున్నప్పుడే భక్తి పాటలు రక్తి కట్టిస్తాయేమో. ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది. ఎన్నుకున్న లోకేషన్స్, వేసిన సెట్స్ కథకి తగ్గట్టుగా వున్నాయి. 

చివరికేమిటి
          జేకే భారవి కథలో భక్తి రసం కంటే యుక్తి పన్నాగాలే ఎక్కువున్నాయి- చరిత్రలో కేవలం వెంకన్నతో హాథీరాం పాచికలాట ఆడ్డమనే అంశమే ఈ కథకి కీలకం, ఆకర్షణీయం, అదేసమయంలో బాక్సాఫీసు అప్పీలున్న పాయింటు కూడా. కె. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లేలో దీనికి స్ట్రక్చర్ కూడా బాగా  కుదిరింది. ముఖ్యంగా సాయికుమార్ నాగార్జునకి పాచికలు ఇచ్చి తిరుమలకి పంపడమనే ప్రారంభం నుంచీ, నాగార్జున దగ్గర ఆ పాచికలు ఎప్పుడెప్పుడు ఉపయోగంలోకి వస్తాయా అన్న ప్లాట్ డివైస్ లుగా ఆసక్తి కల్గిస్తూ వుంటాయి. మామూలు కథల్లో ఒక ఊర్నుంచి  సర్పంచ్ రాసిచ్చిన ఉత్తరం పట్టుకుని  హీరో సిటీకి వచ్చే కథనం లాంటి దన్నమాట. కాబట్టి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడే ఈ ట్రాక్ ఈ స్క్రీన్ ప్లేకి వెన్నెముకగా నిల్చింది. పాచికలే అతడి జీవితం మొత్తాన్నీ మార్చేశాయి. సింపుల్ గా ఆద్యంతం ఈ ట్రాక్ కి సమాంతరంగా,  ఈ పాచికలతో ఏడుకొండల వాణ్ణి కలవాలన్న భక్తీ తపనలు తప్ప మరోటి లేకుండా చూసి  వుంటే- కథకి ఆథ్యాత్మిక విలువతో కూడిన మెలో డ్రామా కలిసివచ్చేది. 

          ఇంటర్వెల్ కి పది  నిమిషాల ముందు, గంటా పదినిమిషాలకి ఎట్టకేలకు నాగార్జున ధర్మాధికారిగా దైవదర్శనం చేసుకోవడంతో ప్లాట్ పాయింట్ వన్ ఇచ్చారు; దీనితర్వాత ఇంటర్వెల్ కి దేవుడితో పాచిక లాటాడే డ్రీమ్ సీన్ ఇచ్చారు. అలాగే సెకండాఫ్ లో చివరిసారి పాచికలాటలో దేవుడు ఓడిపోయి, ఆభరణాలు కోల్పోవడంతో ప్లాట్ పాయింట్ టూ ఇచ్చారు. వెంకన్నతో నాగార్జున ట్రాక్ ప్లాట్ పాయింట్స్ నీ, ఇంటర్వెల్ నీ కలుపుకునే ఏకత్రాటి పై వుంది. కానీ భక్తి సినిమాకుండే భక్తిరసానికే ఒక  ట్రాక్ లేకుండా పోయింది. దీంతో కథనం ఫ్లాట్ గా వున్నట్టు అన్పిస్తుంది.  ఆలయలంలో అక్రమాలతో విలనీ, కామెడీ ఇవేవీ అక్కడికొచ్చిన నాగ్ పాత్రతో సంబంధం లేకుండా వున్నాయి. అక్కడ నాగ్ భక్తులకి చేసే సేవలప్పుడైనా అదొక ఆధ్యాత్మిక ఉద్యమంలా ఏడుకొండలవాణ్ణి కీర్తించే బృందగానలతో వుండుంటే,  భక్తుల్ని ముందుకు నడిపించే కమిట్ మెంట్ తో చూపించి వుంటే, చివర చేసే త్యాగానికి  ఇవి కనెక్ట్ అయి ఇంకా బలన్నిచ్చేవి. అసలు ఫస్టాఫ్ అంతా నాగ్ భక్తిని మాత్రమే గ్లామరైజ్ చేసి (‘కాబిల్’ లో అంధులైన హీరో హీరోయిన్ల పాత్రల్ని గ్లామరైజ్ చేసినట్టు), సెకండాఫ్ లో పాచికలాట తో కథలోకి వెళ్లి వుంటే (‘కాబిల్’ లో రేప్ తో కథ ప్రారంభమైనట్టు) ఇదొక విలక్షణ స్క్రీన్ ప్లేతో  కూడిన ఆథ్యాత్మిక చలనచిత్రంగా భాసించేది. 

          దర్శకేంద్రుడికి  చెప్పేంత స్థాయి లేదు గానీ, జస్ట్  ఒక పరిశీలన అంతే. 

-సికిందర్