రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 1, 2017



   ప్రపంచంలో ఏపరిణామాలుసంభవించినా, నోట్లురద్దు చేసుకున్నా, మోడీ సరిగ్గా ప్రకటన చేయకపోయినా, అసలు తిండే దొరక్క పోయినా, ప్రపంచమే కొట్టుకు పోయినా, సినిమాల కుండే గ్లామర్ చెక్కు చెదరదు. కేవలం వాటికుండే గ్లామర్ తోనే అవి సర్వకాల సర్వా  వస్థల్లోనూ  నిక్షేపంగా వుంటాయి. అశేష ప్రజాకర్షణని  పొందుతూంటాయి.  అలాటిది  కలెక్షన్లు సాధించడంలో అవి వెనకబడుతున్నాయంటే, వాటి గ్లామర్ తగ్గి కాదు, ప్రజాకర్షణ సన్నగిల్లీ కాదు- సినిమాలు తీయడం వ్యాపారాత్మక కళే అయితే అందులో కళ శాతం కునారిల్లడం వల్ల.  కేవలం కళే  గ్లామర్ ని కాపాడుతుంది, జనాకర్షణకి నోచుకుంటుంది. తనలో కళే లేకపోతే ఏ నటుడూ సూపర్ స్టార్ గా గ్లామర్ పొందలేడు, ప్రజాకర్షణ నోచుకోలేడు. ఇతర వ్యాపారాల్లో ఒక వస్తువు అమ్మాలంటే డిస్కౌంటో, వేరే ఆఫర్లో ఇచ్చి వినియోగదార్లని ఆకర్షించుకునే ఒరవడి నడుస్తోంది. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లే ఆ వస్తువుకి గ్లామర్ నీ ఆకర్షణనీ పెంచి, విరివిగా అమ్ముడుపోయేలా చేస్తూంటాయి. సినిమాలకి ఇలాటి డిస్కౌంట్లు అఫర్లూ ఇచ్చినంత మాత్రాన వాటి కలెక్షన్లు పెరగవు. కళే సినిమాలకి  గ్లామర్. కళే డిస్కౌంటూ, ఆఫరూ ఏదైనా. అలాంటిది 2016 లో కూడా టాలీవుడ్ పరిస్థితి  9.27 శాతం విజయాల దగ్గరే ఆగిపోయిందంటే, చేస్తున్న వ్యాపారంలో వేయాల్సిన కళని కూడా వేయకుండా  సరఫరా చేయడం వల్లే.   వ్యాపారం కోసం 167 సినిమాలూ తీశారు. డబ్బింగులు ఇంకో 54+10 వున్నాయి. మొత్తం కలిపి 231 సినిమాలు. 167 తెలుగు సినిమాల్లో ‘ఏ’ స్టార్ సినిమాలు 10, ‘బి’ స్టార్ సినిమాలు  42, చిన్న చిన్న సినిమాలు  115 వున్నాయి. ఈ మొత్తంలో విజయాలు సాధించినవి 18. తీసిన 167 సినిమాల్లో 18 విజయాలంటే 9.27 శాతం సక్సెస్ రేటు. తీసిన 167 లో 149 ఫ్లాపయి 9.27 శాతం సక్సెస్ రేటుతో మిగలడం కొత్తేమీ కాదు. ప్రతీసంవత్సరం చూస్తున్నదే. అచంచల సినిమా గ్లామర్ కి తగినంత కళ అనే కళ్ళాపిని జల్లకపోవడం వల్లే అప్రతిహతంగా ఇదే పరిస్థితి దాపురిస్తోంది. 

         సంక్రాంతితో ప్రారంభించుకుని రావడానికి నాగార్జున ( +సోగ్గాడే చిన్నినాయనా, -ఊపిరి), బాలకృష్ణ ( - డిక్టేటర్), వెంకటేష్ ( -బాబు బంగారం), పవన్ కల్యాణ్  (-సర్దార్ గబ్బర్ సింగ్), మహేష్ బాబు (- బ్రహ్మోత్సవం), ఎన్టీఆర్ ( +నాన్నకు ప్రేమతో, +జనతా గ్యారేజ్), అల్లు అర్జున్ ( +సరైనోడు), రాం చరణ్ (+ధృవ) 10  బిగ్ కమర్షియల్స్ తో అట్టహాసంగా వచ్చారు.  ఈ ‘ఏ’ స్టార్ కేటగిరీలో వున్న రవితేజ మాత్రం డుమ్మా కొట్టారు. వచ్చినవాళ్ళు ఈ 10 సినిమాల ప్లస్- మైనస్ ల ఆటలో ఐదు మాత్రమే ప్లస్ లిచ్చి మిగిలిన అయిదూ మైనస్ చేసుకున్నారు. నాగార్జునకి సోగ్గాడే చిన్నినాయనా కళ్ళాపి జల్లుకుని రియల్ హిట్టయితే, ఊపిరి ఇరవై కోట్లు లాస్ అని ఇప్పటికీ నిర్మాత పివిపి చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ డిక్టేటర్, వెంకటేష్ బాబుబంగారం కళ్ళాపి మానేసి పాతనే కళాసి పనితో మెరిపించి అమ్మాలని చూశారు. ఇక ఈ యేడు ఫ్లాపులివ్వడంలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవంల సంచలనాత్మక అట్టర్ ఫ్లాపుల దెబ్బతో హిట్టయిన సినిమాల్ని కూడా మర్చిపోయారు ప్రేక్షకులు. ఏ స్టార్ సినిమాలు హిట్టాయ్యాయీ అని తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ సరైనోడు, రాం చరణ్ ధృవ హిట్లు అని చెప్పుకుంటున్నా- అది మార్నింగ్ ఆట మాట మాత్రం  కాదు. అల్లు అరవింద్ నెట్ వర్క్ లో అవి ఆడగా ఆడగా గట్టెక్కిన సినిమాలు. ఇక మిగిలిన ‘ఏ’ స్టార్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కూడా ఆడగా ఆడగా గట్టెక్కిన హిట్టే, జనతా గ్యారేజ్ మాత్రం రియల్ హిట్. ఈ సంవత్సరం వచ్చిన ‘ఏ’ స్టార్లు ఎనిమిది మంది  పది సినిమాలిచ్చినా, యాభై శాతం మాత్రమే విజయాలతో  వున్నారు. ఎంతో టైం తీసుకుని, ఏంతో  ప్లానింగ్ తో తీసినా జరిగిన లోపమేమిటో- రాజకీయ పార్టీలు ఎన్నికల విశ్లేషణ చేసుకున్నట్టు-  పరిశీలించుకుని సరిదిద్దుకునే సాంప్రదాయానికి స్టార్లు దూరం. కళ్ళాపి వర్సెస్ కళాసి ఫైటింగ్ కంటిన్యూ అవుతూ వుంటుంది. కళాసీ పనే వెలవెల బోతూంటుంది.
                                       
           ***
       
‘బి’ స్టార్లు తమ గ్లామర్ తో ఏకంగా 42 సినిమాల్ని మోసుకొచ్చారు. ఎన్ని వందలు మోసుకొచ్చినా తట్టుకునే  జేబు సత్తా ప్రేక్షకుల కుంది. మోసుకొచ్చిందేమిటన్నదే బాక్సాఫీసు ప్రశ్న. కళ్యాణ్ రాం (-ఇజం), నాగచైతన్య (+ప్రేమమ్, -సాహసం శ్వాసగా...) రామ్  (+నేనూ శైలజ, -హైపర్), నితిన్ (+అ ఆ), నాని (+కృష్ణ గాడి  ప్రేమగాథ, +జంటిల్ మన్, -మజ్నూ), నిఖిల్ (+ఎక్కడికి పోతావు చిన్నవాడా), సాయ ధరమ్ తేజ్ (+సుప్రీం, -తిక్క), మంచు విష్ణు (-ఆడోరకం-ఈడోరకం), మంచు మనోజ్ (-శౌర్య, -ఎటాక్), శర్వానంద్ (+ ఎక్స్ ప్రెస్ రాజా) , సందీప్ కిషన్ (-రన్, -ఒక్క అమ్మాయి తప్ప) , రాజ్ తరుణ్ (-సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, -ఆడో రకం-ఈడో రకం), ఆది (-గరం, - చుట్టాలబ్బాయి), నాగ శౌర్య (-కళ్యాణ వైభోగమే, - ఒక మనసు, - అబ్బాయితో అమ్మాయి, + జ్యో అచ్యుతానంద), అల్లు శిరీష్ (+ శ్రీరస్తు శుభమస్తు) ... ఇకపోతే,  సూపర్ స్పీడ్ రికార్డ్ స్టార్ నారా రోహిత్ వదిలిన ఆరు యాక్షన్ తూణీరాలు (-తుంటరి, -సావిత్రి, - రాజా చెయ్యి వేస్తే, -శంకర, - +జ్యో అచ్యుతానంద, +అప్పట్లో ఒకడుండే వాడు), సుమంత్ అశ్విన్ (- రైట్  రైట్), అక్కినేని ఫ్యామిలీ సుమంత్ (-నరుడా డోనరుడా), సుశాంత్ (-ఆటాడిస్తా రా) , బెల్లంకొండ శ్రీనివాస్ (-స్పీడున్నోడు), కామెడీ డిపార్ట్ మెంట్ లో- అల్లరి నరేష్ (-సెల్ఫీ రాజా, -ఇంట్లో దెయ్యం నాకేం భయం), సునీల్ (-కృష్ణాష్టమి, -జక్కన్న, -ఈడు గోల్ ఎహే), శ్రీనివాస రెడ్డి (-జయమ్ము నిశ్చయమ్మురా), సప్తగిరి (-సప్తగిరి ఎక్స్ ప్రెస్) ... ఈ 42 లో 11 మాత్రమే  హిట్టయ్యాయి.

        20 మంది ‘బి’ స్టార్లలో- రామ్, నితిన్, నాగచైతన్య, నాని, శర్వానంద్, నిఖిల్,  నారా రోహిత్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్- 9 మంది మాత్రమే ఈ సంవత్సరం సక్సెస్ లిచ్చారు. కల్యాణ్ రామ్, మంచు విష్ణు, మంచు మనోజ్, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, ఆది, నాగశౌర్య, సుమంత్ అశ్విన్, సుమంత్, సుశాంత్, బెల్లంకొండ శ్రీనివాస్ 11 మందీ ప్లాపులిచ్చారు. సక్సెస్ లిచ్చిన వాళ్ళల్లో నాని రెండు హిట్లతో వుంటే; రామ్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ లు ఒక్కో ఫ్లాప్ కూడా ఇచ్చారు. నారారోహిత్ అయితే ఒక సక్సెస్ ఇచ్చి 5 ఫ్లాపులతో రికార్డు సాధించాడు. 

        పూర్తిగా ఫ్లాపయిన ‘బి’ స్టార్స్ లో కల్యాణ్ రామ్ ది భారీ ఆర్ధిక నష్టం పూరీ దర్శకత్వంలో ‘ఇజం’ తో. ఆ తర్వాత దూసుకొస్తున్న రాజ్ తరుణ్ కి రెండూ బ్రేకులే పడ్డాయి. సందీప్ కిషన్ డిటో. మంచు బ్రదర్స్ లో మనోజ్ రెండు సార్లు, విష్ణు ఒకసారీ బోల్తా పడ్డారు. ఆదికి రెండుకి రెండూ సున్నాగా మిగిలాయి. నాగశౌర్య మూడుకి మూడూ ఫ్లాపులిచాడు ( నాగశౌర్య- నారా రోహిత్ లు కలిసి జాయింటుగా ‘జ్యో అచ్యుతానంద’ తో సక్సెస్ అయ్యారు). సుమంత్ అశ్విన్, సుమంత్, సుశాంత్, బెల్లంకొండ శ్రీనివాస్ లు ఈ సంవత్సరం కూడా ఎంత ప్రయత్నించినా ఫలితమంటూ  లేకుండా పోయింది, వుండదు కూడా.  

        కామెడీ డిపార్ట్ మెంట్ లో అందరూ అపహాస్యం పాలయ్యారు. ఫ్లాపులతో తమ తమ  రొటీన్స్ ని కొనసాగించుకుంటూ అల్లరి నరేష్ రెండు, సునీల్ మూడూ ఫ్లాపులిచ్చి బిజీ అయ్యారు. కొత్త ఎంట్రీలుగా శ్రీనివాస రెడ్డి, సప్తగిరిలు వచ్చి తలో చెయ్యీ  వేశారు. కమెడియన్ల 7 కామెడీలూ కామెడీలై పోయాయి. వీళ్ళంతా ఒక చోట సమావేశమై అర్ధవంతమైన చర్చలు జరుపుకోకుంటే తెలుగు కామెడీలే రద్దయిన నోట్లై పోతాయి. 

        ఈ సంవత్సరం కొత్త హీరోయిన్ గా మెగా ఫ్యామిలీ నుంచి ‘ఒకమనసుతో’ నిహారిక వచ్చి ఆకట్టుకోలేక పోయింది. శ్రీవిష్ణు (అప్పట్లో ఒకడుండేవాడు), విజయ్ దేవరకొండ (పెళ్లిచూపులు), సందీప్ కుమార్ (వంగావీటి ) ఈ ముగ్గురే ఈ సంవత్సరం అనామక స్థాయినుంచి ‘బి’ స్టార్లుగా నియామక స్థాయికి చేరారు. కొత్తగా వచ్చిన శ్రీకాంత్ తనయుడు  రోషన్ ని నందినీ కాన్వెంట్ అనే వీణ సినిమా దెబ్బతీసింది.
                                                     
***
       
క విడుదలైన మొత్తం చిన్న చిన్న సినిమాలు 115 లో క్షణం, పెళ్లి చూపులు రెండే హిట్టయ్యాయి. చిన్న సినిమాలు ఏమాత్రం కళనీ, ట్రెండ్ నీ, జానర్ మర్యాదనీ  పట్టించుకోవడం లేదనీ మనకెప్పుడో తెలుసు. అయినా ఇలాగే తీస్తుంటారు. వీటిలో 60, 70 సినిమాల పేర్లు కూడా విని వుండరు ప్రేక్షకులు, ఎప్పుడు ఎక్కడ విడుదలయ్యాయో కూడా తెలీదు. ఈ కొత్త కొత్త దర్శకులు,నిర్మాతలు సరదా తెర్చుకోవడానికే తప్ప సినిమాలు తీయడానికి కాదు. సినిమాలు తీస్తే 115లో 113 ఎందుకు గల్లంతవుతాయి. అవి సినిమాలు కాదు, సరదాలు. ఇక ఈ కొత్త సంవత్సరం కూడా ఈ సరదాలు ఇంకా  తీర్చుకుని ఇంకో 150 తీసి అవతల పడేసే బోర విరుచుకు తిరిగే అవకాశం మోడీ ఇవ్వడం లేదు. బ్లాక్ మనీ సరదాలు అయిపోయాయ్, వైట్ మనీతో దురద తీర్చుకోవాలి. అది కూడా పన్నులు కట్టి తీ ర్చుకోవాలి. దురద లెక్కలు కూడా చూపించాలి. ఫేస్ బుక్ లో ఎవరే హంగామాలు చేసుకుని,  ఫారిన్ టూర్లేసుకుని పోస్టులు చేస్తున్నారో కనిపెట్టే సాఫ్ట్ వేర్ ని సిద్ధం చేసింది ఆదాయపన్ను శాఖ.
                                                      
***
 
       ఫ్లాపైన చిన్న సినిమాలు అన్నీ ఈ బాపతే అని కాదు. వీటిలో కమిట్ మెంట్ తో ఇద్దరు ప్రముఖులు తీసిన మనమంతా(చంద్ర శేఖర్ యేలేటి), మన వూరి రామాయణం (ప్రకాష్ రాజ్) వున్నాయి. ఇంకో కొత్త దర్శకుడు అనుదీప్ తీసిన పిట్ట గోడ వుంది.  అలాగే ప్రవీణ్ సత్తారు తీసిన గుంటూరు టాకీస్,  ఆర్పీ పట్నాయక్ తీసిన మనలో ఒక్కడు వున్నాయి. రొటీన్ కి భిన్నంగా తీసిన ఇవెందుకు ప్రేక్షకులకి నచ్చలేదో, ఇలాటిదే ‘అప్పట్లో ఒకడుండే వాడు’ ఎందుకునచ్చుతోందో పరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది.
                                                     
***
       
బ్బింగులు ఐదు హిట్టయ్యాయి- బిచ్చగాడు, మన్యం పులి, దంగల్, బాజీరావ్ మస్తానీ, ధోనీ.  మొత్తం డబ్బింగులు తమిళ, మలయాళ, కన్నడ 54 విడుదలైతే 49 ఫ్లాపయ్యాయి. వీటిలో రజనీకాంత్ కబాలీ కూడా వుంది. సూర్య నటించిన 24, విజయ్ నటించిన పోలీస్ పూర్తిగా ఫ్లాప్స్ అనలేం గానీ హిట్స్ కావు. అలాగే ధనుష్ నటించిన రెండూ- మాస్, రైల్, విశాల్ నటించిన రెండూ-రాయుడు, ఒక్కడొచ్చాడు; విక్రం నటించిన ఇంకొక్కడు- ఫ్లాపయ్యాయి. ‘బిచ్చగాడు’ ఆంథోనీ కూడా బేతాళుడు తో ఫెయిలయ్యాడు. బిచ్చగాడుతో తో బాటు మోహన్ లాల్ నటించిన మన్యం పులి రెండే తెలుగు ప్రేక్షకులకి నచ్చాయి. వీటితో బాటు హిందీ డబ్బింగులు- దంగల్, బాజీరావ్ మస్తానీ, ధోనీ లు విడుదలై ఫర్వాలేదన్పించే బిజినెస్ చేసుకున్నాయి. ఇక ఈ 54 కాక ఇంకో  10 హాలీవుడ్  డబ్బింగ్స్ విడుదలయ్యాయి.
                                               
***
      
మొత్తం తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి 231 సినిమాలు విడుదలయ్యాయి. అంటే వారానికి 4.44 సినిమాలు, రోజుకి 0.63 సినిమా విడుదలయ్యాయి. 231 లో ప్రేక్షకులు 21 మాత్రమే హిట్ చేశారు. అంటే పూర్తిగా మనసిచ్చి ప్రేక్షకులు నెలకి 1.75 సినిమా, వారానికి 0.43 సినిమా, రోజుకి 0.062 సినిమా చొప్పున మాత్రమే హిట్ సినిమాలు చూశారు. ప్రతిరోజూ 0.63 కొత్త సినిమా భారం ప్రేక్షకుల మీద మోపుతోంటే వాళ్ళు, సెలెక్టు చేసుకుని 0.062 మాత్రమే చూస్తున్నారు. భూమికీ ఆకాశానికీ మధ్య వున్నంత తేడా. 1500 కోట్ల విలువైన టాలీవుడ్ లో ఎంత వృధా శ్రమ జరుగుతోందో దీని బట్టి తెలుస్తోంది.
                2016 లో దర్శకుల పనితీరు గురించివచ్చే వారం తెలుసుకుందాం.

-సికిందర్
http://www.cinemabazaar.in


       


       






Saturday, December 31, 2016

Year ending Review!








రచన -దర్శకత్వం : సాగర్ కె. చంద్ర

తారాగణం: శ్రీవిష్ణు, నారా రోహిత్‌, తాన్యా హోప్‌, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సత్యప్రకాష్‌, సత్యదేవ్‌, రవివర్మ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: నవీన్‌ యాదవ్‌
బ్యానర్‌
: అరన్‌ మీడియా వర్క్స్‌
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
విడుదల : 30 డిసెంబర్, 2016
***
        మొత్తం మీద తెలుగు సినిమా ఒక కొత్త చరిత్ర రాసుకుంది. నానాటికీ దిగదుడుపుగా తయారవుతున్న చిన్న సినిమాల ప్రతిష్టా సత్తా రాబడీ రుచి అసలేమిటో చూపించింది. చిన్న సినిమాలకి కంటెంట్ –డిఫరెంట్ మేకింగ్ ఈ రెండే పెట్టుబడి అంటే వినకుండా పెద్ద సినిమాల్ని చూసి పగటి వేషాలేస్తున్న చిన్న సినిమాలకి  గట్టి జవాబే చెప్పింది. ఈ సంవత్సరం యాభై ఒక్క  చిన్న సినిమాలు విడుదలైతే, రెండు తప్ప అన్నీ ఫ్లాపులు మూటగట్టుకున్నవే. ఇప్పుడు ‘అప్పట్లో ఒకడుండే  వాడు’ ఈ సంవత్సరానికి సైన్ అవుట్ చేస్తూ,  కొత్త సంవత్సరంలో సైన్ ఇన్ చేసే చిన్న సినిమాలకి సవాలు విసురుతోంది- కంటెంట్ వైపా? కుంటినడకల వైపా? రెండో వైపే వుంటే-  They will be declared OUT LAWS!

       నారా రోహిత్ ఏ పోటీలూ వాతలూ పెట్టుకోకుండా తన మానాన తాను ఐదారు సినిమాలు వినమ్రంగా చేసుకుపోయే డిఫరెంట్ మైండ్ సెట్ వున్న వాడు. తన మైండ్ సెట్ తో వచ్చే దర్శకులకి ద్వారాలు తెరిచే వాడు. టాలీవుడ్ లో ఒక్కడైనా ఇలా వున్నందుకు అధునాతనం వైపు చూసే దర్శకులకి అదృష్టమే. ‘అయ్యారే’ అనే కామెడీ తీసిన దర్శకుడు సాగర్ చంద్ర ఒకేసారి రియలిస్టిక్ సినిమావైపు మరలడం విజ్ఞతే. చిన్న సినిమాల కథలు పెద్ద సినిమాల్లోంచి పుట్టవు- చుట్టూ వున్న ప్రపంచంలోంచి పుడతాయి. అలాటి ఒక స్థానిక ప్రపంచాన్ని తన బడ్జెట్ సినిమాలో ఆవిష్కరించాడు-  ఈ ఆవిష్కరణతో తెలుగు సినిమానే చూస్తున్నామా అన్నంత ఆశ్చర్య చకితుల్ని చేస్తూ. 

      ‘అప్పట్లో ఒకడుండే వాడు’  సర్ప్రైజ్ గిఫ్ట్ శ్రీ విష్ణు కూడా. థియేటర్లో - టాప్ యాక్షన్, టాప్ యాక్షన్- అని ప్రేక్షులు అరిచేంత. ఇలాటి అతి సామాన్య క్యారెక్టర్లు బజార్లో  చాలా మంది కన్పిస్తూంటారు. యంగ్ హీరోలు మాస్ పాత్రలు వేయలా? అయితే ఇలా శ్రీ విష్ణులా  కన్పిస్తే చాలు, ప్రేక్షకుల్ని బతికించిన వాళ్ళవుతారు. అపురూపమైన నోట్లతో టికెట్లు కొంటున్న ప్రేక్షకుల్ని ఎలా కదలకుండా కూర్చోబెట్టి సినిమా చూపించవచ్చో- కడుపు నిండా తృప్తితో పంపవచ్చో ఈ మీడియం రేంజి ప్రయోగాన్ని చూస్తే చాలు. 

          1990 లలో అప్పటి రాష్ట్రంలో నక్సలిజం సమస్యగానే వుంది. కేంద్ర ప్రభుత్వమేమో ఇందిరా గాంధీ సోషలిజం నుంచి  గ్లోబలైజేషన్ వైపు పయనిస్తోంది  పీవీ నరసింహారావు- మన్మోహన్ సింగ్ ల లెక్కపత్రాలతో. ఇది నక్సల్ ఉద్యమానికి చేటు అని అప్పటి నక్సలైట్లు గ్రహించారో లేదో గానీ,  ఈ సినిమాలో దర్శకుడు నక్సల్స్  నుద్దేశించి ఇన్స్ పెక్టర్ చేత ఈ తెలివైన ప్రశ్నే వేయిస్తాడు- గ్లోబలైజేషన్ లో నక్సలిజం ఏంటని. 

          నక్సల్ కూంబింగ్ ఆపరేషన్స్ స్పెషల్ పార్టీ ఇన్స్ పెక్టర్ అయిన ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) ఒక వితండవాది. యుద్ధంలో కెళ్తే  రూల్స్ వుండవంటాడు. అంతమాత్రాన అవినీతి పరుడైన ఎన్ కౌంటర్ స్పెషలిస్టు కాదు, తన రూల్స్ తో నకిలీ ఎన్ కౌంటర్లని కూడా సమర్ధించుకునే నిజాయితీ పరుడైన ఎన్ కౌంటర్ స్పెషలిస్టు. పరాయి సొత్తుని తాకడం ‘హరామ్’ అనుకుంటాడు. అలాటి ఇతడి కన్ను క్రికెట్ లో ఎదగాలనుకుంటున్న రాజు (శ్రీ విష్ణు) మీద పడుతుంది. కారణం,  ఇతడి అక్క నక్సల్ దళంలో వుంది. ఈ నక్సల్ దళం ఒక పోలీస్ ఉన్నతాధికారిని హతమార్చింది. ఇంతియాజ్ అడవిలో కెళ్ళి ఎన్ కౌంటర్ చేయబోతే పారిపోయిందామె. ఆమె గురించిన సమాచారం కోసం  ఏమీ తెలీని అమాయకుడు, క్రికెట్ లో పేరు సంపాదించుకుని, ప్రభుత్వోద్యోగంలో కుదిరి, ప్రేమిస్తున్న నిత్య ( తాన్యా హాప్) అనే అమ్మాయిని శుభ్రంగా పెళ్లి చేసుకుని, హాయిగా స్థిర పడాలని కలలు గంటున్న రాజు మీద తన పోలీసు డేగ కన్నేస్తాడు ఇంతియాజ్. బాగా టార్చర్ చేస్తాడు. 

          ఇలా ప్రారంభమయ్యే  వీళ్ళిద్దరి వైరం అనేక మలుపులు తిరుగుతుంది. రాజు జీవితంకూడా నాశనమై హత్యా నేరం మీద పడి,  తనే ఒక పెద్ద రౌడీగా హైద్రాబాద్ ని కంట్రోల్ చేసే స్థాయికి  ఎదుగుతాడు...పోలీస్- క్రిమినల్ ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు గెలవాలి. పోలీస్ పాత్ర ఓడిపోయే అవకాశం లేని ఎడ్జ్ దర్శకుడు ఇచ్చాడు- అడ్డగోలు తనం  వ్యక్తే  అయినా నిజాయితీ పరుడంటూ. అప్పుడు క్రిమినల్ అంతమవ్వాలి. రాజు ఎలా అంతమయ్యాడు- అతడి కథ ఎలా ముగిసిందన్నది ఇంకా పవర్ఫుల్ క్లయిమాక్స్. ఈ ముగింపు సినిమాకి అతి పెద్ద ఎస్సెట్. 

        రాజు పాత్ర కల్పిత క్రిమినల్ పాత్రేమోగానీ, చూస్తూంటే మాత్రం అప్పట్లో కూకట్ పల్లిలో మకాం వేసి బెదిరింపులు, భూదందాలూ చేసిన నక్సల్ సమ్మయ్య గుర్తుకొస్తాడు. సమ్మయ్య శ్రీలంక పారిపోయి అక్కడి విమానాశ్రయంలో చనిపోయాడు. రాజు పాత్రని కూడా ఇంకో పాత్ర మలేషియా వెళ్లి పొమ్మంటుంది!  

          దర్శకుడు రెండు విషయాల్లో తప్ప మిగతా అంతా సహజత్వానికే చోటిచ్చాడు. క్రిమినల్ హీరో, హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం, ఆమె ఆందోళనతో గడపడం, పెళ్లి రోజు అనే ఒక సందర్భం, పాట ఇవన్నీ – చాలాచాలా ఫార్ములా సినిమాల్లో వచ్చేసినవే. కథాకాలం 90 లలోనే అయినా,  ఈ ‘పెళ్లి రోజు- దాని పాట’ అనే పాత చాదస్తం ఫార్ములా బదులు ఇంకేదో చేసి వుండాల్సింది. అలాగే ముస్లిం అని తెలియడానికన్నట్టు ఇన్స్ పెక్టర్  ఇంతియాజ్ అలీ పాత్ర ఆహార్యం కూడా  ముస్లిం పాత్రల్ని అలా ఎస్టాబ్లిష్ చేయడం నేర్చుకున్న మూస ఫార్ములా సినిమాల రొడ్డ కొట్టుడు పోకడే. పైజమా, జుబ్బా తగిలిస్తే పాత్ర ముస్లిం అయిపోతుందన్నట్టు యూనిఫాంలో లేనప్పుడు నారా రోహిత్ ని ఇలా చూపించడం ఓల్డ్ లుక్ నిచ్చింది-70 లనాటి షేర్ ఖాన్ పాత్ర దిగివచ్చినట్టూ. నారాకి క్యాజువల్ డ్రెస్సింగ్ ఇస్తే పాత్ర తాలూకు కాఠిన్యం  బాగా ఎలివేట్ అయ్యేది. చీటికీ మాటికీ ఓ డిజైనర్ పైజమా జుబ్బా  వేయడం వలన పాత్ర చిత్రణ దెబ్బ తినిపోయింది కూడా. అతను నిజాయితీ పరుడే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాడు.  ఇది పైకే చెప్పుకుంటున్నాడు. అలాంటప్పుడు - నేనెంత సాత్వికుణ్నో చూడండి- అన్నట్టు పైజమా జుబ్బా వేసుకు తిరగడం అతి అన్పిస్తుంది. అది అలాటి పోలీస్ మెంటాలిటీ కాదు. 

          శ్రీ విష్ణు పాత్ర కూడా సెకండాఫ్ లో చెప్పిన పని చెయ్యలేదు. తను పవర్ఫుల్ క్రిమినల్ గా  ఎదిగి, ఇన్స్ పెక్టర్ సస్పెండై మూడు నెలల్లో తిరిగి వస్తాననప్పుడు – నీ మీద ఇంకా కేసులేస్తూ తిప్పుతానన్న శ్రీవిష్ణు రాజు పాత్ర,  ఆ ఊసే ఎత్తకుండా వుంటాడు.  తను ఆ పని చేస్తూ వుంటే మళ్ళీ ఇన్స్ పెక్టర్ డ్యూటీలో కొచ్చి తన పని పట్టేవాడు కాదుగా? అలా తిరిగి వచ్చిన ఇన్స్ పెక్టర్ ముందు తను పిల్లిలా  అయిపోయేవాడు కాదుగా?

          ఇంకో కీలకమైన చోట కూడా దర్శకుడు కాంప్రమైజ్ అయ్యాడు. దీంతో హీరోయిన్ పాత్ర కిల్ అయ్యింది. భర్త రాజు ఎన్ కౌంటర్ అయ్యాడని తెలిసీ ఆమె రైలెక్కి ఎలా వెళ్ళిపోతుంది?  భర్త మృత దేహం కోసం వెళ్తే తనని కూడా పట్టుకుంటారనా?  లేక  ఆమె వెళ్లి భర్త డెడ్ బాడీ క్లెయించేస్తే  అనుకున్న క్లయిమాక్సే వుండదనా? నిజమే,  ఒక భార్యగా భర్త శవాన్ని వదిలేసి వెళ్ళిపోదు ఆమె-  కానీ శవాన్ని తీసుకుంటే కథకి ఆ ‘పవర్ఫుల్’ ముగింపు రాదు! క్యాచ్ -22 సిట్యుయేషన్ లో పడ్డాడు దర్శకుడు. దీన్ని సహేతుకంగా పరిష్కరించుకుని అనుకున్న విధంగానే కథని ‘పవర్ఫుల్’ గా – ఇంతవరకూ ఏ తెలుగు సినిమాల్లోనూ రాని విధంగా ముగించి వుండాల్సింది.

          సినిమాకి నేపధ్య సంగీతం చాలా బలాన్నిచ్చింది. అలాగే కెమెరా వర్క్ కథ డిమాండ్ చేస్తున్న మూడ్ ని బాగా క్రియేట్  చేసింది. బలహీనంగా మారింది యాక్షన్ డిపార్ట్ మెంటే. ఏ యాక్షన్ సీనూ పవర్ఫుల్ గా లేదని చెప్పడానికి విచారించాల్సి వస్తోంది- పోలీస్ ఉన్నతాధికారి మీద నక్సల్స్ ఎటాక్ చేసి చంపడం, ఇన్స్ పెక్టర్ అడవిలో  ఎన్ కౌంటర్ చేయడం, శాంతి దూతల ముందు సన్నివేశంలో కాల్పులూ – ఇలా ఏది తీసుకున్నా పేలవంగా వున్నాయి. పాత్రలు ఈ యాక్షన్ దృశ్యాల్లో సరైన యాక్షన్ లోవుండక- కొన్ని చోట్ల నిలబడి చూస్తూ గుళ్ళ దెబ్బలు తింటాయి. ఇక ఎక్కడా పిస్తోలు పేలినా, రైఫిల్ పేలినా, ఎల్ ఎంజీ  దడ దడ మన్నా వాటి  సౌండ్ ఇంపాక్టే వుండదు- బాణసంచా కాల్చుకుంటున్నట్టు నీరసంగా వుంటుంది. ఓకే ఒక్క చోట క్లయిమాక్స్ కి ముందు – నారా రోహిత్ శ్రీవిష్ణు మీద కాల్చినట్టు స్క్రీన్ బ్లాంక్  చేసి షాట్ విన్పించినప్పుడు- అది హాలీవుడ్ రేంజిలో మార్మోగింది! ఇదే అన్ని చోట్లా వుండాల్సింది.  ఇదసలే షాక్ వేల్యూ వున్న కొత్త తరహా కథ. 

          ఇలాటి టెక్నికల్, రైటింగ్ లోపాలు కూడా లేకుండా చూసుకుంటే ఎవరూ వేలెత్తి చూపడానికి వీలుండదు- ఇది దర్శకుడి క్వాలిటీతో  కూడుకున్న ప్రొఫెషనల్ రైటింగ్ తో బాటు,  ప్రొఫెషనల్ మేకింగ్ కూడా కాబట్టి. ఇదలా వుంచితే,   ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ ఒక మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది ‘అప్పట్లో ఒకడుండే వాడు’- చిన్న సినిమాలకి ఒక ట్రెండ్ ని సెట్ చేస్తూ. ఇక
OUT LAWS ఉండకూడదని ఆశిస్తూ!

-సికిందర్
http://www.cinemabazaar.in


         



         



Friday, December 30, 2016

రివ్యూ!




రచన- దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి

తారాగణం : అల్లరి నరేష్, కృతిక, మౌర్యానీ, ప్రగతి, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పోసాని, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతి రావు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
మాటలు : డిమాండ్ రత్నబాబు, సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

విడుదల : 30 డిసెంబర్, 2016
***

       అల్లరి నరేష్ కి ఒక హిట్ లభించి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2012 లో  ‘సుడిగాడు’ తర్వాత నటించిన పదికి పది  సినిమాలూ పరాజయాల పాలయ్యాయి. ఇప్పుడు పదకొండోది వీటి పక్కన చేరుతోంది. తనకి ఫ్లాపులు పెద్ద లెక్కలేనట్టుంది, కానీ తన సినిమాలు చూడలేక ప్రేక్షకులు పైకి చెప్పుకోలేని ఇబ్బందిపడుతున్నారు. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే  వుంటున్నాయి. ఎప్పుడో కోడి కూసింది, ఇప్పుడే తెల్లారిందన్నట్టు తను కూడా ఓ హార్రర్ కామెడీ చేయలేదు గనుక, ఈ ‘ఇంట్లో దెయ్యం’ ఇప్పుడు చేసినట్టు ప్రకటించాడు. ఇంకేం మిగిలింది  దెయ్యం కామెడీల్లో తను చూపించడానికి. ఏమీ మిగల్లేదు గనుకే ఈ దెయ్యం కామెడీ ఇంత అల్లరై పోయింది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా కాని  సినిమా ఎందుకు తీసినట్టో అస్సలు అర్ధంగాదు. ఇంకేం తోచక టెక్నీషియన్లకి పని కల్పించడానికి ఈ సినిమాకి శ్రీకారం చుట్టినట్టుంది- ప్రేక్షకులకి గట్టి కారం ఘాటు కొట్టేలా!

     కామెడీలు తీసే దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి  ఈసారి మరీ కామెడీ అయిపోయాడు. తన మార్కు ఓల్డ్ కామెడీకి ఇక కాలం చెల్లినట్టేనని తెలుసుకోవడం లేదు. హిందీలో ఇలాగే కామెడీలు తీస్తూ వున్న డేవిడ్ ధావన్ కనుమరుగైపోయి అయిదేళ్ళ తర్వాత సల్మాన్- కత్రినా- గోవిందాలతో ‘పార్టనర్’ అనే సూపర్ హిట్ తో తిరిగి వచ్చి ఆశ్చర్య పర్చా డు. కాలాన్ని బట్టి తనూ మారాలనుకుని, ట్రెండీ టేకింగ్ తో యూత్ ఫుల్ కామెడీ తీశాడు. నాగేశ్వర రెడ్డి నుంచి కాలం దీన్నే డిమాండ్ చేస్తోంది. 

       కథలేకుండా కూడా పాతబడిన సరుకుని తిరగ మోతేసి సినిమాగా తీసేయవచ్చని నిరూపించ దల్చారు. హీరో (నరేష్), అతడి ఫ్రెండ్స్ (షకలక, చమ్మక్) లు బ్యాండు మేళం బ్యాచీ. రోడ్డు మీద ఒకమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు హీరో. ఆ హీరోయిన్ (కృతిక) వంద సినిమాల్లో వచ్చేసిన  చల్లారిపోయిన క్యారక్టర్నేతిరిగి పోషిస్తూ అనాధా శ్రమం నడుపుతుంటుంది! పైగా పుణ్యం కోసం రోజుకో ఆలయాని కెళ్ళి ప్రార్ధనలు చేసే పిచ్చితో ఇంకా పాతకాలం  హీరోయిన్లాగే  వుంటుంది! ఈమె వెంట పడుతున్న హీరోకి ఒకరోజు అనాధాశ్రమంలో ఓ పిల్లకి వంద సినిమాల్లో చూపించినట్టుగా గుండె చిల్లుపడి, ఆపరేషన్ కి డబ్బు అవసరం వుంటుంది!  ఆ డబ్బు అప్పుతెచ్చి హీరోగారు ఆపరేషన్ జయప్రదం చేసేసరికి ఫార్ములా ప్రకారం హీరోయిన్ ప్రేమలో పడిపోయి పాటేసుకుంటుంది!

        ఓ బంగాళా వుంటుంది. ఓ పెద్ద మనిషి (రాజేంద్ర ప్రసాద్) కూతురు పెళ్లి చేయడానికి ఆ బంగాళా కొనుక్కుని పరివారంతో దిగుతాడు. ఆ ఇంట్లోనే దెయ్యం వుంటుంది. అందర్నీ ఈడ్చి కొట్టేసరికి మంత్రగాళ్ళ కోసం చూస్తే హీరో తగులుతాడు. హీరో గారు పాత సుబ్బారావులా ఆపరేషన్ కోసం చేసిన అప్పు తీర్చాల్సి వుంది కాబట్టి, పది లక్షలు మాట్లాడుకుని మంత్రగాడి వేషం లో ఫ్రెండ్స్ తో వస్తాడు. ఆ దెయ్యం వీళ్ళందర్నీ కూడా ఈడ్చి కొట్టేసరికి దాన్ని హీరో గారు గుర్తు పట్టి- స్వప్నా! అని గట్టిగా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం దర్శకుణ్ణి ఉద్దేశించి ఓ అరుపు అరుస్తాడు. వెంటనే దర్శకుడు వూడిపడి, ఈ ట్రాష్ ని   ఇంకా పొడిగిస్తే బావుండదని ఠకీల్మని ఇంటర్వెల్  వేసి తప్పుకుంటాడు. గుంటూరు పల్నాడు ఏరియా నాటకం ఒక అంకం పూర్తయ్యింది. 

        రెండో అంకం జోలికి వెళ్ళనవసరం లేదు. కానీ ఈ రెండో అంకంలో హీరో పాత లవర్ డాక్టర్ (!) స్వప్న (మౌర్యానీ) ఫ్లాష్ బ్యాక్ కూడా ‘నందినీ నర్సింగ్ హోం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ల్లో లాగే వుంటుంది పనిలోపనిగా. పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్ ఓ టూవీలర్ దొరికించుకుని దాని మీద వస్తూ యాక్సిడెంట్ లో హరీమనడం, ఇది తెలియని హీరో డుమ్మా కొట్టింది దొంగ నాయాల్ది అనుకుని కోపంతో వెళ్ళిపోవడం! అల్లరి నరేష్ కి హార్రర్ కామెడీలో నటించే కోరికతో పాటు,  రెండు సినిమాల్లో వచ్చేసిన ఈ క్లాసిక్ సీన్లో  నటించే అవకాశం కూడా బోనస్ గా దక్కింది!

      ఎప్పుడైతే దెయ్యం ఎంటరయ్యిందో, అల్లరి నరేష్ క్యారక్టర్ కుదేలైపోయింది- ఇక దెయ్యానిదే పాత కథ- పాత భయపెట్టడాలూ చంపడాలూ. దెయ్యానికి భయపడితే అదే కామెడీ, అవే ప్రాస పంచ్ లు, ఎవరికీ నటించాల్సిన అవసరం రాలేదు- రాజకీయనాయకుడు కూడా సభల్లో ప్రసంగించే టప్పుడు నటిస్తాడు. ఇదొక సినిమా అని తెలిసికూడా నటీనటులెవరూ నటించలేదు. డైలాగులతో నోటికి పని చెప్పేసి వెళ్ళిపోవడమే. బ్రహ్మానందం చప్పగా వచ్చి ఇంకా తన సరుకు ఐపోలేదంటాడు. జయప్రకాష్ రెడ్డి అవే తన బ్రాండ్ భారీ  అరుపులతో దెయ్యానికి భయపడే సీన్లేసుకుని వెళ్ళిపోతాడు. పాటలు కూడా పూర్తిగా ఎందుకని సగం సగంలో కత్తిరించేశారు. పరమ బ్యాడ్ రైటింగ్ కి నిదర్శనంగా వున్న దీనికి స్క్రీన్ ప్లే అని వేసుకోవడం ఘోరం. 

        కనీసం అల్లరి నరేష్ అప్పటి రాజేంద్ర ప్రసాద్ ని కాపీ కొట్టి  నటించినా  నటనలో మెరుగవుతాడు- లేకపోతే  ఇలాగే  మొక్కుబడిగా స్క్రీన్ మీద కన్పించి వెళ్లి పోతూంటాడు. ఇక తన  తర్వాతి కోరికేమిటో, అదెలా తీర్చుకో బోతున్నాడో ఉత్కంఠతో ఎదురు చూద్దాం!


- సికిందర్
http://www.cinemabazaar.in
 




Wednesday, December 28, 2016

దర్శకత్వం : నీతేష్ తివారీ
తారాగణం : అమీర్ ఖాన్, సాక్షీ తన్వర్, ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ భట్నాగర్, అపర్శక్తి ఖురానా, రిత్విక్ సహోర్, గిరీష్ కులకర్ణి, రోహిత్ శంకర్వర్,
రచన : నీతేష్ తివారీ, పీయూష్ గుప్తా, శ్రేయాస్ జైన్, నిఖిల్ మహరోత్రా
సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : సేతు శ్రీరామ్
బ్యానర్లు :  : వాల్ట్ డిస్నీ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్
 విడుదల : 23 డిసెంబర్, 2016

***
      సూపర్ స్టార్లు స్పోర్ట్స్ సినిమాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఖాన్లు ముగ్గురూ స్పోర్ట్స్ సినిమాలు తలా ఒకటి చేశారు- షారుఖ్ ‘చక్ దే ఇండియా’, సల్మాన్ ‘సుల్తాన్’ ల తర్వాత ఇప్పుడు అమీర్ ‘దంగల్’ తో వచ్చాడు. మధ్యలో అక్షయ్ కుమార్ ‘బ్రదర్స్’ తో వచ్చినా అది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ గురించి. ‘చక్ దే ఇండియా’,  ‘దంగల్’ ల ప్రత్యేకత ఏమిటంటే ఇవి క్రీడారంగం వైపు  అమ్మాయిల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తీసినవి. కానీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మహిళా ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ మీద తీసిన  ‘దంగల్’ (మల్లయుద్ధం- కుస్తీ పోటీ) అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల్నే ఎక్కువ ఉత్సాహపరుస్తున్నట్టు కన్పిస్తోంది.  సోషల్ మీడియాలో, పత్రికల వెబ్ సైట్స్ లో కూడా పురుష పుంగవులే యుద్ధ ప్రాతిపదికన  కామెంట్లు చేస్తూ కనపడుతున్నారు. వాళ్ళతో భారతమాత పుత్రికలు పోటీ పడ్డం లేదు. 70 కోట్ల సినిమా మాత్రం మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్ ని దాటిపోయింది.




       ‘దంగల్’ కేవలం కుస్తీ పట్లని థ్రిల్లింగ్ గా –యాక్షన్ ఓరియెంటెడ్ గా చూపించి సొమ్ము చేసుకుంటున్న తెలివి తక్కువ మూవీ కాదు. క్రీడలో ఇది ఇగోల పాలబడ్డ భావోద్వేగాల సమరం కూడా. క్రీడలో ఇది సాంప్రదాయానికీ ఆధునికత్వానికీ మధ్య ఎడతెగని సంవాదం కూడా.  ఈ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామాకి ఇవే అసలైన బలాలు.

కథ 
         ర్యానా భివానీ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే సగటు ప్రభుత్వోద్యోగి మాహావీర్ సింగ్ ఫోఘాట్ (అమీర్ ఖాన్) పూర్వం కుస్తీలో జాతీయ స్థాయి వరకే ఎదిగి, అంతర్జాతీయ ఖ్యాతికి సాగాలన్న కోరిక తీరకుండా మిగిలిపోయాడు. ఆర్ధిక ఇబ్బందులు ఆ  కల నెరవేర్చుకోకుండా చేసి ప్రభుత్వోద్యోగంలో స్థిరపడేలా చేశాయి. కొడుకు పుడితే వాడి ద్వారానైనా ఆ  కల నెరవేర్చుకుందామనుకుంటే, వరుసగా నల్గురు ఆడ పిల్లలే పుట్టారు. ఇక చేసేది లేక కలల్ని చంపేసుకుని వున్న జీవితంతోనే  రాజీ పడిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు గీతా కుమారి (జైరా వసీమ్), బబితా కుమారి ( సుహానీ భట్నాగర్) లు కాస్త ఎదిగి వచ్చారు. స్కూలు కెళ్తున్న వాళ్ళిద్దరూ ఒక రోజు ఇద్దరు అబ్బాయిల్ని యమ పీకుడు పీకారు. దీంతో మహావీర్ కళ్ళు తెర్చుకున్నాయి. తన కూతుళ్ళ రక్తంలోనూ   కుస్తీ కళే పొంగి ప్రవహిస్తోందని  గ్రహించి వెంటనే వాళ్ళకి శిక్షణ నివ్వడం ప్రారంభించాడు. ఆడుకునే వయస్సులో ఈ ట్రైనింగేమిటా అని-

విసుక్కుంటూ అయిష్టంగానే వాళ్ళు కఠిన శిక్షణ పొందసాగారు. తండ్రంటే అయిష్టం పెంచుకున్న దశలో ఓ పెళ్ళిలో వాళ్లకి జ్ఞానోదయమైంది. ఇక రెట్టించిన ఉత్సాహంతో పూర్తి  శిక్షణ పొంది టౌన్లో జరిగే కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. అక్కడ ఒక్కో కుస్తీ కుర్రాణ్ణీ  యమపట్లు పట్టి మట్టి కరిపించడం చూసి నివ్వెర పోయారందరూ. మహావీర్ కి విశ్వాసం బాగా పెరిగింది. పెద్ద కూతురు గీతా (ఇప్పుడు ఫాతిమా సనా షేక్) పాటియాలా జ్యూనియర్ ఇంటర్నేషనల్ గెల్చి- కామన్వెల్త్ గేమ్స్ లో ప్రవేశం పొందేందుకు స్పోర్ట్స్ అకాడెమీలో ప్రత్యేక శిక్షణకి చేరింది. ఇక్కడ్నించీ గీతా జీవితంలో, మనసులో ఎలాటి మార్పులు చెలరేగి- తండ్రితో సంబంధాలూ చెదిరి, చెల్లెలు బాబితా తోనూ (ఇప్పుడు సాన్యా మల్హోత్రా) ఎడం పెరిగి, తల్లి శోభ (సాక్షీ తన్వర్) తోనూ, చిన్నప్పట్నించీ శిక్షణలో సహాయపడ్డ చిన్నాన్న కొడుకు (చిన్నప్పుడు రుత్విక్ సహోర్, ఇప్పుడు అపర్శక్తి ఖురానా)  లతోనూ సంబంధాలు అంటీ ముట్టనట్టు మారిన క్రమంలో, భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారై  - ఎలా కామన్వెల్త్ గెల్చి వరల్డ్ ఛాంపియన్ అయ్యిందన్నది మిగతా కథ. 


ఎలావుంది కథ
      ముందు చెప్పుకున్నట్టు ఇది బయోపిక్. నిజకథ. కలల్ని చంపేసుకున్న ఔత్సాహిక కుస్తీ క్రీడాకారుడు, ఒలింపిక్స్ లో సీనియర్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతా అయిన మహావీర్ సింగ్ ఫోఘాట్ జీవిత కథ ఇది. గీతా బాబితా రీతూ సంగీతా కూతుళ్ళు నల్గుర్నీ, తమ్ముడి కొడుకు వినేష్ – కూతురు ప్రియాంకాలనీ- ఈ ఆరుగురు కుటుంబ సభ్యుల్నీ  అత్యంత శ్రమకోర్చుకుని ఒకే క్రీడ-  కుస్తీపోటీల్లో విజేతలుగా  ప్రపంచానికందించిన ఘనత అతడిది.  2010 కామన్వెల్త్ గేమ్స్ లో గీత వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన తొలి భారత కుస్తీ క్రీడా కారిణి అయి, మళ్ళీ ఒలింపిక్స్ కి క్వాలిఫై అయిన తొలి భారత కుస్తీ క్రీడాకారిణి కూడా అయింది. బబిత 2012 ప్రపంచ కుస్తీ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాన్నీ, 2014 కామన్వెల్త్ లో బంగారు పతకాన్నీ గెల్చింది. రీతూ నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడలిస్ట్ అయితే, సంగీతా జ్యూనియర్ ఇంటర్నేషనల్ లో మెడల్ సాధించింది. ఇక వినీష్ కూడా కామన్వెల్త్ లో గోల్డ్ మెడలిస్ట్. ప్రియాంకా జ్యూనియర్ ఇంటర్నేషనల్లో మెడలిస్టు. ఇలా తను సాధించలేకపోయిన విజయాల్ని తన పిల్లల ద్వారా నెరవేర్చుకున్నాడు మహావీర్. 


           2012 లో డిస్నీ క్రియేటివ్ టీమ్ మెంబర్ దివ్యారావ్ పత్రికలో మహావీర్ గురించి చదివి, ఇది గొప్ప సినిమా అవుతుందని భావించి, సిద్ధార్థ రాయ్ కపూర్ కి చెప్పారు. సిద్ధార్థ రాయ్ కపూర్ ఈ కథ రాసి దర్శకత్వం వహించే బాధ్యతని నీతేష్ తివారీ కి అప్పగించారు. అప్పటికి నితేష్ తివారీ ‘చిల్లర్ పార్టీ’, ‘భూత్ నాథ్ రిటర్న్స్’ అనే రెండు సాధారణ సినిమాల దర్శకుడు. 2013 లో అమీర్ ఖాన్ కి కథ చెప్పాడు. 2015 లో షూటింగ్ ప్రారంభమయ్యింది.

          సినిమాకి ప్రధానంగా గీతా కథనే తీసుకున్నారు. సబ్ ప్లాట్ లో సమాంతరంగా ఎదిగివస్తున్న బబితని చూపించారు. దేశం కోసం నిజమయిన రణ రంగాలు రెండే వుంటాయి : ఒకటి యుద్ధ రంగం, రెండు క్రీడా రంగం. దేశభక్తి పెల్లుబికేది ఈ రెండు రంగాల్లోనే. వీటి పుణ్యాన ఇతరులు అర్జెంటుగా దేశభక్తిని పులుముకుని విర్రవీగిపోతారు. లేనిపోని ఉద్రిక్తతల్ని సృష్టిస్తారు. ఈ కథ గీతా కుమారి కథలా అన్పించినా కథా సారధి మహావీర్ పాత్రే. మహావీర్ పాత్ర లక్ష్యానికి సాధనంగా గీతా కుమారి పాత్ర. వీళ్ళిద్దరి సంఘర్షణ లోంచి అమ్మాయిల్లో క్రీడాస్ఫూర్తిని రగిలించడం, అంతర్లీనంగా దేశభక్తిని ప్రవహింప జేయడం. ఇంకొకటి, క్రికెట్ తప్ప మరే దేశీయ క్రీడలపట్లా ఆసక్తి చూపని జనబాహుళ్యంలోకి కుస్తీ ని తీసికెళ్ళి ప్రకాశింప జేయడం – 
‘బహుత్ హోగీ  పెహల్వానీ, అబ్ దంగల్ హోగా’  అని షురూ చేస్తూ!

ఎవరెలా చేశారు      ఇక్కడ ఎవరి పాత్రనీ డిజైనర్ చరిత్రలా చేయలేదు. డిజైనర్  చరిత్ర అంటే షారుఖ్ ‘అశోకా’ లో లాంటిది. అది కృతకమైనది సీజీ సపోర్టుతో. ‘దంగల్’ లో కరుడుగట్టిన పర్ఫెక్ష నిస్టు అమీర్ ఊబ కాయం సహా ఏదీ కృతకమైనది కాదు. కుస్తీ పట్లు కూడా రియల్లే. బాలనటులు, హీరోయిన్లు సహా అమీర్ - కుస్తీలో శిక్షణ తీసుకునే నటించారు. వాటినీ  హైడెఫినేషన్ స్లో-మో తో కలుషితం చేయలేదు.  ప్రారంభంలో కొద్ది సేపు అమీర్ యుక్తవయసు మహావీర్ గా కన్పించినా, ఆ తర్వాతంతా పాతిక కేజీలు వొళ్ళు పెంచి వయసు మీరిన మహావీర్ పాత్రనే పోషించాడు, బాన కడుపుతో ఇమేజి ఏమైపోతుందన్న భయం లేకుండా. పాత్రకి ఎలాటి కమర్షియల్ బిల్డప్పులూ ఇవ్వలేదు- ‘సుల్తాన్’ లో ఇలాటి పాత్రకి సల్మాన్ కి లా. కూతుళ్ళకి శిక్షణ ఇచ్చినంత సేపూ లీడ్ యాక్టర్ లా వుండి, ఆ తర్వాత ఎదిగిన పెద్ద కూతురు పాత్ర కథకి మిగతా స్క్రీన్ టైంని ఇచ్చేసి నేపధ్యంలో వుంటాడు. ఎక్కడా హీరోయిజాన్ని ప్రదర్శించే పని చేయకపోవడం అమీర్ చేసిన మంచి పని. అయితే సినిమాటిక్ అనుభవం కోసం ఫోఘాట్ ల నిజ జీవితాలతో  కొంత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోక తప్పలేదు. వాళ్ళ జీవితాలు పూర్తిగా ఇలాగే వుండి వుంటాయా అంటే వుండవు, సినిమా కోసం వున్నాయి.    



         అమీర్ గత సినిమాల్లో హీరోగా నటించాడు, ఈ సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్టుకి ఒదిగాడు.  కోడి రామ్మూర్తి సాంప్రదాయ -దేశవాళీ కుస్తీ వేరు, స్పోర్ట్స్ అకాడెమీ కుస్తీ వేరు. కోడి పందాలు కోడి పందాలే, వాటిని  ఇంకేదో ఆధునిక టెక్నిక్ లతో నేర్పాల్సిన పనుండదు. అమీర్ పాత్ర గొడవ ఇదే. ఏఏ పట్లు ఎలా పడితే 1-2-3-(4 వుండదు)- 5 పాయింట్లు వస్తాయో దేశవాళీగా అతడికి బాగా తెలుసు. దీని ముందు విదేశాల నుంచి రుద్దుతున్న టెక్నిక్కులు బలాదూరు అని నమ్ముతాడు గనుకనే- ఇది కూతురితోనూ, ఆమె కోచ్ తోనూ  భావజాలాల సంఘర్షణకి దారి  తీసి, తీవ్ర అవమానానికీ మానసిక క్షోభకీ  గురవుతాడు. ఇండియన్నెస్ కి పట్టం గట్టడానికే కంకణం కట్టుకున్న పాత్రగా ఎదుగుతాడు. అర్ధవంతమైన సినిమాల్లో ఎక్కడ శంకరా భరణం శంకర శాస్త్రి వుంటే అక్కడ అది సూపర్ హిట్టవుతుంది. 


       ఫాతిమా కూడా తన పాత్ర అనుభవించే ఒడిదుడుకుల్ని నేర్పుగా ప్రదర్శించింది. మూలాల్ని మర్చిపోయి ఎక్కడికో వెళ్లిపోవాలన్న ఉడుకురక్తం పాత్ర ఆమెది. ఒకసారి  ఇంటి పెంపకం నుంచి బయటి  ప్రపంచంలోకి స్వతంత్రులై వెళ్ళాక, ఇంటి పెంపకం చాదస్తంగా అన్పిస్తుంది. కని పెంచి ప్రయోజకులుగా పంపిన కన్న వాళ్ళు పాతసరుకులా అన్పిస్తారు. ఎదుగుదలకి కొత్త ప్రపంచంలోనే  అసలు హంగులున్నాయని అనుకుంటారు. ఏ స్పోర్ట్స్ అకాడెమీ లో చేరేందుకు  ఆమె తండ్రి నేర్పిన విద్య తోడ్పడిందో, అదిప్పుడు వుత్త  నాన్సెన్స్ గా అన్పిస్తుంది. నీ కిటుకులు ఇప్పుడు పనికి రావు నాన్నా- ఇక్కడ చాలా ప్రోగ్రెస్ వుందనే మాటలతో అతణ్ణి కించ పర్చి, తీరా నేర్చుకున్న ఆధునిక టెక్నిక్కులతో, ప్రతీ ఇంటర్నేషనల్లోనూ  ఓడిపోతూంటుంది. వూళ్ళో వున్నప్పటి కంటే వేషభాషలు, యాటిట్యూడ్, పాయిజ్ గీయిజ్  సర్వం మారిపోయి- ఫారినర్ లా తయారవుతుంది. కానీ కుస్తీలో పుటుక్కున ఓడిపోతోంది...ఏం చేయాలి... ఇప్పుడు తండ్రి తప్ప దిక్కులేదు...

         తండ్రితో ఇగోలకి పోతే  ఇంతే సంగతులు. ఈ తెచ్చిపెట్టుకున్న మానసిక సంఘర్షణతో కూడిన పాత్రని, దర్శకుడి సమర్ధత పుణ్యమాని సజీవంగా నిలబెట్టింది ఫాతిమా అనాలి. చెల్లెలి పాత్రలో తండ్రి పక్షం వహించే సాన్యా పాత్ర అక్కకంటే పరిణతితో వ్యవహరించే పాత్ర.  అక్క తర్వాత తనూ స్పోర్ట్స్ అకాడెమీలో చేరి అక్కని మార్చాలని ప్రయత్నిస్తుంది. ఈమె కూడా సినిమాకి ఆకర్షణే. అలాగే ఫస్టాఫ్ లో బాలనటులు జైరా, సుహానీలు చాలా వినోదాన్ని పండిస్తారు వాళ్ళ పాత్రలతో. వీళ్ళ కజిన్ గా చిన్నప్పుడు రిత్విక్ సహోర్, పెద్దయ్యాక అపర్శక్తి ఖురనాలు కామెడిక్ అండర్ కరెంట్లు.
తల్లిపాత్రలో సాక్షీ తన్వర్ కూడా ఉత్తమ నటీమణే.


        ‘యే దిల్ హై ముష్కిల్’ తర్వాత మరొక్కసారి  ప్రీతమ్ సంగీతస్వరాలు హుషారు తెప్పిస్తాయి. సేతు శ్రీరామ్ ఛాయాగ్రహణం అంతర్జాతీయ స్థాయికి చెందింది. వూళ్ళో లొకేషన్స్, ఇరుకు సందులు, పాతబడి పేదరికాన్ని తలపించే ఇళ్ళూ, మళ్ళీ  అటు స్పోర్ట్స్ అకాడెమీలో, ఈవెంట్స్ జరిగే స్టేడియాల్లో టేకింగ్ -దేనికా వాతావరణాన్ని క్రియేట్ చేసే క్లాసిక్ లుక్ తో వున్నాయి.

        దర్శకుడు నీతేష్ తివారీ ఆశ్చర్య పర్చే ప్రతిభతో నిజ జీవితాల్ని తెరకెక్కించాడు. అతడి రచనని, దర్శకత్వాన్నీ ఒక్క మాటలో వివరించడం కష్టం, ఎన్నో విడదీయరాని లేయర్స్ ఈ అద్భుత సృష్టికి కారణమయ్యాయి. ఇగోల పాలబడ్డ భావోద్వేగాల సమరమనుకుంటే, మళ్ళీ దీనికి హస్యరపు పూత, దీనిమీద మళ్ళీ సాంప్రదాయానికీ ఆధునికత్వానికీ మధ్య ఎడతెగని సంవాదపు లేయర్ అనుకుంటే, దీనికీ  ఇగోలతో బాటూ  హస్యరసపు పూత, ఫిజికల్ యాక్షన్ తో ఉర్రూత. ఒడుపు తెలిసిన వీటన్నిటి కలబోతతోనే సజీవ దృశ్యావిష్కరణ సాధ్యమవుతుందనేది ఇక్కడ గ్రహించాల్సిన విషయం. అమీర్ ఖానే అన్నట్టు, రకరకాల భాద్వేగాలతో కూడిన సీరియస్ సబ్జెక్టుని వినోదాద్మకంగా చెప్పే రాజూ హిరానీ సరసన నీతేష్ తివారీ ఒక్కడే చేరతాడు. జీవితం తెలీకపోతే సినిమా తీయడం తెలీదు. 



చివరికేమిటి 
        ఒక క్వాలిటీ కమర్షియల్ చూసిన అనుభవం. పాత్రలు కష్ట కాలంలోనూ హాస్యమాడే  సినిమాల్ని ఎప్పుడు చూశాం? బాలల పాత్రలు సహా ఏ పాత్రకూడా వదలకుండా హాస్యంగా మాట్లాడేవే. అది కూడా హర్యాన్వీ భాషలో. అయితే ఈ హర్యాన్వీ భాష సల్మాన్ ‘సుల్తాన్’ లోలా మరీ అతి యాసతో ఇబ్బంది పెట్టేలా వుండదు. ‘మ్హారీ ఛోరియాఁ ఛోరోఁ సే కమ్ హై కే?’ (మా అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువా?) అని హర్యాన్వీలో హిందీ ఎక్కువ పలికే డైలాగులతో వుంటుంది. ‘గంగా జమున’ లో దిలీప్ కుమార్ యూపీ  యాస మాట్లాడి మాస్ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్ళి నట్టు- (హిందీ సినిమాల్లో యూపీ యాస ఇదే మొదలు) ‘దంగల్’ కూడా యాస కారణంగా కూడా పల్లెలకీ  పట్టణాలకీ ఇంతగా ప్రాకిపోతోంది.

        పాత్రలు ఇబ్బందుల్లో వున్నప్పుడు కూడా దర్శకుడు దాన్ని ఫన్ చేసి చూపించే వ్యూహం పెట్టుకోవడం ఈ బరువైన డ్రై సబ్జెక్ట్ ని తేలికపాటి వినోదాద్మకంగా మార్చేసింది. సీరియస్ నెస్ కి సంబంధించి ఒకటుంది- ఒక పాత్ర ఏదో సమస్యలో వుంటే పక్కనున్న పాత్ర ఆ సమస్యని తను కూడా ఫీలై కన్నీళ్లు తుడవడం నిస్తేజమైన చిత్రణ. ఒకరి సమస్యని ఇంకొకరు ఎందుకు  ఫీలవ్వాలన్న ధోరణిలో హాస్యమాడితే అది చైతన్యంతో కూడుకున్న చిత్రణ. ఈ రెండో దానికే ఈలలేస్తారు  ప్రేక్షకులు. ఈ సినిమా సాంతం ప్రేక్షకుల కేరింతలే ఫన్నీ డైలాగులకి ( పేదా గొప్పా అన్నిఆర్దిక అంతస్తుల ఉత్తరాది వాళ్ళు- ముస్లిములు  ఎక్కువ వచ్చే ఆబిడ్స్ రామకృష్ణలో హౌస్ ఫుల్ ఆట చూశాడీ వ్యాసకర్త పనిగట్టుకుని). అంతే కాదు, తమ కష్టాల మీద తామే జోకులేసుకుంటాయి కూడా ఈ పాత్రలు. ‘దంగల్’ లో చివరంటా జరిగిందిదే. ఈ ఛలోక్తులతో కూడిన రియల్ డైలాగులు చాలా మేధస్సుని డిమాండ్ చేస్తాయి. హాస్యాన్ని పండించడమనేది సీరియస్ బిజినెస్ అన్నారు. అది అపార మేధస్సుతో కూడుకున్న వ్యవహారం. దర్శకుడితో బాటు  మిగిలిన ముగ్గురు రచయితలూ అపూర్వంగా దీన్ని సాధించి చూపెట్టిన జీనియస్సులు. అత్యున్నత స్థాయికి వెళ్లి ఆలోచిస్తేనే, అట్టడుగు మాస్ ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేస్తూ రాయగల్గుతారని దీన్ని బట్టి అర్ధమవుతోంది. కథ వదిలేసి సెకండాఫ్ లో కూడా ఎంటర్ టైన్మెంట్ అనే పిచ్చితనంతో పిచ్చి కామెడీలు చేసే వాళ్లకి- దీనిద్వారా కథలోంచి, పాత్రల్లోంచీ కామెడీ పుడుతూ - కథ దెబ్బతినకుండా –ఎల్లడెలా ఎలా కామెడీ ప్రవహిస్తుందో తెలుసుకుంటారు- తెలుసుకోవాలన్న జిజ్ఞాస వుంటే. 


        స్క్రీన్ ప్లే ఉండీ లేనట్టుగా వుంటుంది. ఇదీ మా స్క్రీన్ ప్లే- మేమింత మేధావులంగా మారిపోయి ఎంత బీభత్సంగా రాసి తీస్తున్నామో చూడండి - అన్నట్టుగా ఎక్కడా అన్పించదు. అసలున్నారా లేరా అన్నట్టే వుంటుంది. అంతా ఆటో పైలట్ మీద నడించి పోతున్నట్టు వుంటుంది. ఇది డ్రైవర్ లేని సెల్ఫ్ డ్రైవింగ్ గూగుల్ కారులా యాక్సిడెంట్ ఎక్కడా చెయ్యదు. ఈ సీను ఫెయిలయ్యిందనో, ఇక్కడ ఈ పాత్ర తేడా కొట్టిందనో ఎక్కడా అన్పించదు.  ప్లాట్ పాయింట్స్ అన్నీ ఒక అంకంలోంచి ఇంకో అంకంలోకి కథని మనం గమనించ లేనంత స్మూత్ ట్రాన్సిషన్స్ తో తీసికెళ్తూంటాయి. ట్రాన్సిషన్స్ కళ ఎడిటింగ్ కి సంబంధించిన వ్యవహారమే అనుకుంటాం, కానీ ఇక్కడ స్క్రిప్టింగ్ లోనే కనబడుతోంది. 



        ఇది మహావీర్ చేతిలో కథ. తన ఇద్దరమ్మాయిల్ని అస్త్రాలుగా ప్రయోగించే కథ. ఇది బూమరాంగై ఒకమ్మాయికి తనే ప్రత్యర్ధి అవుతాడు. ముందు కెళ్ళి ఆమె కోచ్ కి తనే విరోధి అవుతాడు. కథని హీరో విలన్లుగా విడగొట్టక పోతే  మజా లేదు, సంఘర్షణ లేదు, సంఘర్షణ లేకపోతే అంకాలు లేవు, అంకాలు లేకపోతే ప్లాట్ పాయింట్స్ లేవు, ప్లాట్ పాయింట్స్ లేకపోతే హోల్మోత్తంగా పాత్రలే లేవు, పాత్రల్లేక నమ్ముకున్న కథా కాకరకాయా ఒక్క కేజీ కూడా లేవు. 
        ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా  జోసెఫ్ క్యాంప్ బెల్ సూత్రాలు  అమలవుతాయంటే ( ఒకసారి పై  చిత్రపటం చూడండి) ఈ సూత్రాలతో ‘దంగల్’ స్క్రీన్ ప్లేని అనుసరిస్తూ పోతే-


Campbell's stages:
1. Ordinary World :  అమ్మాయిలతో మహావీర్ సాధారణ జీవితం
2.
Call to Adventure : అమ్మాయిలు అబ్బాయిల్ని కొట్టడంతో మహావీర్ తన కుస్తీ లక్ష్యానికి పనికొస్తారని గుర్తించడం
3. Refusal of the Call : అమ్మాయిలు తండ్రి శిక్షణ పట్ల, లక్ష్యం పట్లా అయిష్టంగా వుండడం
4. Meeting the Mentor: అమ్మాయిలు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురి మాటలకి కుస్తీ వైపు మరలడం.
5.
Crossing the Threshold : ఒకమ్మాయి హీరోయిన్ గా స్పోర్ట్స్ అకాడెమీలో చేరడం.
6. Tests, Allies, Enemies : స్పోర్ట్స్ కొత్త ప్రపంచంలో పరీక్ష లెదురై,  తన మిత్రు లెవరో(కోచ్),  విరోధులెవరో (తండ్రి) గుర్తించడం.
7.
Approach : తనదైన విధానంతో ఇంటర్నేషనల్స్ లో పాల్గొనడం.
8. Ordeal, Death & Rebirth : ఇంటర్నేషనల్స్ లో చావుదెబ్బలు తిని, తండ్రి విధానాలే కరెక్ట్ అన్న అవగాహనతో పునర్జన్మెత్తడం
9. Reward, Seizing the Sword : తండ్రి ఆశీస్షులతో సమరానికి ఖడ్గమెత్తడం
10. The Road Back : తండ్రి విరోధి అయిన కోచ్ వల్ల గోల్డ్ మెడల్ కొట్టలేని స్థితి
11. Resurrection : తండ్రిని కోచ్ మాయం చేసిన నిస్సహాయ స్థితిలో, తండ్రి తనకి చెప్పిన కిటుకులే మెదిలి పునరుత్థానం చెందడం
12. Return with Elixir: విజయోత్సాహంతో అమృత కలశమనే ఉట్టిని కొట్టడం!


***


      ఇంత బ్యూటిఫుల్ గా రన్ అయిన స్క్రీన్ ప్లేని ఈ మధ్య కాలంలో చూసి వుండం. మహావీర్ అమ్మాయిలకి ఏమాత్రం కాలక్షేపం చేయనివ్వడు. కుస్తీ మీంచి వాళ్ళ దృష్టి మరలకుండా ఎప్పుడూ శిక్షణే. అలాంటిది చెప్పకుండా వాళ్ళొక పెళ్ళికి వెళ్లి ఆడి పాడేసరికి, వెళ్లి గద్దిస్తాడు. దీంతో 14 ఏళ్ల పెళ్లి కూతురు - ఏంటి మీ సమస్యని అడుగుతుంది. వాళ్ళు తండ్రి తమతో చేస్తున్నది చెప్పుకుంటారు. మీరు అదృష్టవంతులు, మీనాన్న మిమ్మల్ని నాలాగా తయారు చేయడం లేదు, నన్ను చూడండి, అప్పుడే పెళ్లి చేసుకుని ముక్కూ మొహం తెలీని మొగుడికి సేవలు చేస్తూ వుండి పోవాలనే సరికి -అమ్మాయిలకి జ్ఞానోదయమవుతుంది. బేటీ బచావో, బేటీ పడావోలో భాగంగా వాళ్ళు తండ్రి బాటలోకి వచ్చేస్తారు. 


        ఈ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ ని శారీరక పోరాటంగా, సెకండాఫ్ ని అంతకంటే బలమైన మానసిక యుద్ధంగా విభజించడం ఒక మంచి బాక్సాఫీసు వ్యూహమే.  లేకపోతే కొంత సేపయ్యాక విషయం సన్నగిల్లి చతికిలబడే  ప్రమాదముంది మొనాటనీని మోస్తూ. ఫస్టాఫ్ లో శిక్షణ పొందడమూ స్థానిక పోటీల్లో గెలవడమూ అనే ఫిజికల్ యాక్షన్ తో గడిచిపోతుంది. ఫస్టాఫ్ కిది తియ్యటి మాత్రగా అవసరం కూడా ఆడియెన్స్ ని ఊరడించడం కోసం, సెకండాఫ్  మానసిక యుద్ధం మూడ్ లోకి స్మూత్ ట్రాన్సిషన్ కోసం. ప్రారంభంలో తండ్రి అంటే పడక ఫిజికల్  యాక్షన్ తో కలిపి మానసిక యుద్ధమూ చేసినా,  అది పెళ్లి కూతురి మాటలతో తీరిపోతుంది. కానీ సెకండాఫ్ లో ఆ మానసిక యుద్ధమే బ్రహ్మ రాక్షసి అవుతుంది. ఇప్పుడు ఆధునికంగా మారిన హీరోయిన్ కి పాత విధానాల తండ్రితో ఇగో క్లాషెస్ వచ్చి, తండ్రీ  కూతుళ్ళ మధ్య మాటలు కూడా కరువయ్యే యుద్ధం మొదలవుతుంది. దీంతో సెకండాఫ్ లో కూడా గోల్డ్ మెడల్ కోసం శారీరక పోరాటమనే  మొనాటనీ, బోరూ తప్పాయి. ఈ మానసిక యుద్ధంలో ఆమె ఓడిపోయి తండ్రినే నమ్ముకున్నాక, ఆమె గెలుపు క్రెడిట్ ని తను కొట్టేయడం కోసం తండ్రీ కూతుళ్ళిద్దరికీ కనపడని విరోధిలా మారతాడు కోచ్. 

        హీరోయిన్ స్పోర్ట్స్ అకాడెమీలో చేరే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ,  మిడిల్లోపడ్డ కథ, లక్ష్యంకోసం ఎడతెగని- టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని పెంచేసే- క్యారక్టర్ ఆర్క్ ని ఓడిడుకుల పాల్జేసే, సంఘర్షణగా మిడిల్ సూత్రాలకి న్యాయం చేస్తూ- సెకండాఫ్ లో మహావీర్ ని కోచ్ బంధించే ప్లాట్ పాయింట్ టూ వరకూ సాగుతుంది. 


        నిజ జీవితంలో కోచ్ ఇలా బంధించాడా అంటే  లేదు.  కానీ బంధించకపోతే క్లయిమాక్స్ వర్కౌట్ కాదు ( తనని ఇంత దారుణంగా చూపించారని గీతా కుమారి విజయకారకుడైన కోచ్ పిఆర్ సొంధీ కోర్టు కెళ్తున్నాడు. అసలు కామన్వెల్త్ కి ఆమెకి శిక్షణ నిచ్చింది తనేగానీ ఆమె తండ్రి కాదంటున్నాడు. సినిమాలో తను విలన్  అయిపోయాడు పాపం).


        కామన్వెల్త్ ఫైనల్స్ లో గెలుపు కోసం హీరోయిన్ చేసిన పోరాటాన్ని కూడా తప్పుగా చూపించారని గీతా కుమారి ఒరిజినల్ విజువల్స్ ని బయట పెట్టారు కొందరు (వీడియో  కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి). నిజంగా గీతాకుమారి ఎదురులేకుండా పాయింట్స్ కొట్టుకుంటూ పోయింది. ఏ క్షణంలోనూ డైలమాలో పడింది లేదు. మొదలెట్టడమే టపటపా కొట్టేసుకుంటూ పోయింది. కానీ సినిమాలో ఈ వాస్తవం చూపిస్తే సినిమాలా వుండదు. ముందు ఓడిపోతున్నట్టే చూపిస్తూ చివరి క్షణంలో గెలిపిస్తేనే సీన్ నిలబడుతుంది కాబట్టి అదే చేశారు. హీరోయిన్ ఒక్క పాయింటే కొట్టి అక్కడే వుండిపోతుంది- ప్రత్యర్థి చకచకా  గెలుపు వైపు వెళ్ళిపోతూంటుంది. చూస్తే గ్యాలరీ లోంచి ఉత్సాహ పర్చే, కిటుకులు చెప్పే తండ్రి ఇప్పుడు లేడు- కోచ్ బంధించాడు. అంతులేని టెన్షన్, సస్పెన్స్. అటు బందికానా లోంచి బయట పడేందుకు తండ్రి విఫలయత్నాలు. ఇప్పుడెలా గెలుస్తుంది హీరోయిన్, ఎలా గెలుస్తుంది? ఆమెకున్న మార్గం ఇప్పుడేమిటి? అప్పుడు... తండ్రి చెప్తూ వుండిన ఒక కిటుకు మెదులుతుంది- ఈ ఏకంగా 5 పాయింట్లు వచ్చే కిటుకు చిన్నప్పుడు చిన్నాన్న కొడుకుతో చూపించబోతాడు తండ్రి- ఆ చిన్నాన్న కొడుకు భయపడి వద్దంటాడు. ఆ కిటుకు ప్రేక్షకులకి చూపించకుండా, కుతూహలం తీర్చకుండా, పెండింగులో పెట్టేశాడు దర్శకుడు. ఇపుడు హీరోయిన్ గుర్తు తెచ్చుకోవడం ద్వారా అనూహ్యంగా దాన్నిచూపించి, పే ఆఫ్ చేస్తూ కుతూహలం తీర్చే స్తాడు దర్శకుడు - ఈ టెక్నికల్ విశేషాల కథనంలో. 


        ఇంకా ఒక్క పాయింటు దగ్గరే ఆగిపోయిన హీరోయిన్, ఇక 1-2-3-పాయింట్లు వచ్చే కుస్తీ పట్లు పడుతూ ఇక కొద్ది సెకెన్లే  వున్న టైంని వేస్ట్ చెయ్యక- తెగించి ఏకంగా తండ్రి నేర్పిన 5 పాయింట్లు కొట్టే,  ప్రత్యర్ధిని అధిగమించే పట్టులో బిగించి- లేపి మట్టి కరిపిస్తుంది! గోల్డ్  మెడల్ కైవసం. చూస్తే ఇంకా తండ్రి ఇంకా లేడు. బందికానాలోనే దురదృష్టాన్ని తిట్టుకుంటూ  దీనంగా కూర్చున్న అతడి  ముఖంలో అప్పుడు ఆనందం - జాతీయ గీతం విన్పించేసరికి. 


        ఇలా ఎమోషనల్, యాక్షన్ డ్రామాలు, వీటిలో హాస్య రసమూ, భావజాలాల బేధాలు, ఇగోల సంఘర్షణా, బాలికా అభ్యున్నతీ, స్త్రీ విజయమూ, దేశభక్తీ, క్రీడా స్ఫూర్తీ,  కుటుంబ సంబంధాలూ, ఫాదర్ సెంటిమెంటూ, ఒకటని కాదు- జానర్ డిమాండ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ నంతా కూడేసి  ఫిజికల్ యాక్షన్ అనే హార్డ్ వేర్ కి అందించారు. స్మూత్ గా స్క్రీన్ ప్లే తనపని తను చేసుకుపోయింది...


       
In order to do something physical, you have to accomplish something mental; in order to accomplish something mental, you have to achieve something emotional – James Bonnet.

-సికిందర్
http://www.cinemabazaar.in