రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, October 3, 2016
సాంకేతికం :
ఒకప్పుడు కంప్యూటర్లతో డిజైన్ చేసిన సినిమా పోస్టర్లంటే అంత దూరం పారిపోయేది తెలుగు సినిమా రంగం. తర్వాత అదే డిజిటల్ డిజైన్లని రుచి మరిగాక కావాలీ- ఇంకా కావాలీ అంటూ వెంట పడసాగింది తెలుగు సినిమా ప్రపంచం. దేశంలోనే కాదు, విదేశాలలోనూ ఏ సినిమాకీ వుండనన్ని పోస్టర్ డిజైన్లు ఒక్క తెలుగు సినిమాలకే వుండడం కూడా టాలీవుడ్ సాధించిన ఒక రికార్డు.
ఎందుకిలా? ఎందుకంటే, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచీ,
నిర్మాతల తాపత్రయమూ కారణమని రాంరెడ్డి అలియాస్ రాము సమాధానం. రవితేజ నటించిన ‘వీర’
తో దర్శకుడిగా మారిన రమేష్ వర్మ స్థాపించిన సుప్రసిద్ధ కిరణ్ యాడ్స్ వ్యవహారాలు
చూసుకుంటున్న ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ పి. రాము నిజానికి మాన్యువల్ తరం నుంచి వచ్చిన
కళాకారుడు. నల్లగొండ జిల్లా వెలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన
తండ్రికి గల చిత్రలేఖనం హాబీని చూసి తనూ కుంచె పట్టిన రాము, ప్రఖ్యాత పబ్లిసిటీ
డిజైనర్ గంగాధర్ కుమారుడు శంకర్ దగ్గర శిష్యరికం చేసి, తన కళకి మరింత పదును పెట్టుకుని వచ్చి కిరణ్ యాడ్స్ లో చేరిపోయారు.
అప్పుడదంతా
కంప్యూటర్స్ ప్రపంచం. 1998లో ఓ కంప్యూటర్ మీదే స్వతంత్రంగా తన మొదటి సినిమా
పోస్టర్ డిజైన్ చేశారు రాము. ఆ సినిమా పేరు ‘బావగారూ బావున్నారా?’. అప్పటినుంచీ కొన్ని వందల స్టార్ సినిమాలకి పోస్టర్స్ వేస్తూ
వస్తున్నారు.
అసలు
కంప్యూటర్ పోస్టర్స్ డిజైనింగ్ ని దక్షిణాదిన పరిచయం చేసింది రమేష్ వర్మే. పూర్తిగా
మాన్యువల్ కి అలవాటైన ఆ కాలంలో నిర్మాతలు కంప్యూటర్ పోస్టర్లని అస్సలు ఒప్పుకునే
వాళ్ళు కాదు. అలాటిది నెమ్మదిగా వాటిని అలవాటు చేశారు వర్మ. అలాగే స్టిల్ ఫోటోగ్రఫీ
లోనూ డిజిటల్ కెమెరాని ప్రవేశ పెట్టింది తనే. వినైల్ బోర్డుల్ని పరిచయం చేసింది
కూడా తనే. ఇంతే కాదు, బొటాబొటీగా సంపాదించుకుంటూ, పెద్దగా గుర్తింపు కూడా పొందని పబ్లిసిటీ
ఆర్టిస్టులకి చీఫ్ టెక్నీషియన్ గా
గుర్తింపు తీసుకొచ్చి అత్యధిక పారితోషికం (5 లక్షలు) పొందిన ఘనత కూడా ఈయనదే.
స్టూడియోలో రాము తన కుంచె పనిని (లోగోలు
వేసే పనిని) అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి పూర్తిగా ఫోటోషాప్ కి అంకితమైపోయారు. బయటి
ఆర్టిస్టులు రూపొందించిన లోగోలని మెరుగు పరచి సెలక్షన్ కోసం నిర్మాతలకి పంపిస్తారు. అయితే ఇప్పుడు శతదినోత్సవాల
సినిమాల్లేని కాలంలో, పోస్టర్ డిజైనింగ్
స్టూడియోల దగ్గర నుంచీ ప్రింటింగ్ ప్రెస్సుల వరకూ పనీపాటలు తగ్గిపోలేదా అంటే, పనీపాటలు ఇంకా బాగా పెరిగాయన్నారు రాము. రెండు మూడు
వారాల్లోనే వసూళ్లు రాబట్టుకునే వ్యూహంతో వందలాది థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు
పబ్లిసిటీ వ్యయం భారీగా పెరిగిందన్నారు.
ఇదివరకు ఇరవై లక్షల రూపాయలు సరిపోతే, ఇప్పుడు ముప్పయి కోట్ల సినిమాకి 3 కోట్ల రూపాయలు
పబ్లిసిటీకి ఖర్చవుతొందన్నారు. ఈ లెక్కన పబ్లిసిటీ రంగం అభివృద్ధి పథంలోనే వుందని వివరించారు.
పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికేట్ల ముద్రణ
ఎందుకు మానేశారని అడిగితే, విడుదలకి చాలా ముందే
పోస్టర్లు తయారై పోతాయి గనుక, విడుదలకి రెండ్రోజుల ముందు సినిమా సె న్సారైనప్పుడు U,
U/A, A మొదలైన రేటింగ్స్ ని ముద్రించడం ఎలా
కుదురుతుందన్నారు. బాలీవుడ్లో నెల రోజుల ముందే
సెన్సారవడం వల్ల అక్కడ పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికెట్లు ముద్రించడం కుదురుతోందన్నారు
రాము.
ఒక పోస్టర్ని సృష్టించాలంటే రాముకి ఒక్కోసారి
అరగంటే పట్టొచ్చు, ఒక్కోసారి రోజంతా కూడా పట్టొచ్చు. సమయం ఎంత పట్టినా క్వాలిటీ మీద
దృష్టి పెడతారు. షూటింగ్ స్పాట్స్ లో స్టిల్స్ తీసి అందించే స్టిల్ ఫోటోగ్రాఫర్లు తమ స్టిల్స్ ఎలా వచ్చినా అవి
రాము చేతిలో క్వాలిటీని సంతరించుకుంటాయన్న నమ్మకంతో వుంటారు. లోగోలని రాము అవుట్ సోర్సింగ్
ఇవ్వడానికి కారణం నల్గురి నుంచి వైవిధ్యం వస్తుందనే. అదే తనే వేస్తె మొనాటనీ వుండొచ్చు.
మరి ఆ మొనాటనీ పోస్టర్ డిజైనింగ్ తో వుండదా అని ప్రశ్నిస్తే, ఈ రంగంలో టాప్ పొజిషన్లో
వుండాలంటే అనుక్షణం కొత్తదనం కోసం పాటుపడాల్సిందే
నన్నారు రాము.
-సికిందర్
(జులై 2011 ఆంధ్రజ్యోతి)
(జులై 2011 ఆంధ్రజ్యోతి)
Friday, September 30, 2016
రివ్యూ!
రచన - దర్శకత్వం: సంతోష్
శ్రీన్‌వాస్
తారాగణం: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, మురళీశర్మ, రావు రమేష్, పోసాని
కృష్ణమురళి, హేమ, ప్రియ, ప్రభాస్
శ్రీను తదితరులు.
మాటలు: అబ్బూరి రవి సంగీతం: జిబ్రాన్ చాయా గ్రహణం: సమీర్‌రెడ్డి,
నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర
విడుదల : సెప్టెంబర్ 30, 2016
***
మాటలు: అబ్బూరి రవి సంగీతం: జిబ్రాన్ చాయా గ్రహణం: సమీర్‌రెడ్డి,
నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర
విడుదల : సెప్టెంబర్ 30, 2016
***
కైనెటిక్ స్టార్ రామ్ మళ్ళీ తన మాస్ మసాలా వ్యామోహంతో ఆ వర్గ ప్రేక్షకులకోసం ‘హైపర్’ అంటూ వచ్చేశాడు. రామ్ తో ‘కందిరీగ’ తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సారి రామ్ తో తండ్రీ కొడుకుల అనుబంధంతో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చనుకున్నాడు. ఇద్దరూ కలిసి మాస్ కోసం ఏమేమో చేసుకుంటూ పోయారు. ఇన్ని చేసినా ఎంత నిబద్ధతతో చేశారో ఈ కింద చూద్దాం.
కథ
బీటెక్
చదివిన సూరి (రామ్) ఫ్రెండ్స్ తో ఆవారాగా తిరుగుతూంటాడు. వెనకనుంచి ఓ అమ్మాయి( రాశీ
ఖన్నా) నడుం చూసి ఆమె ప్రేమలో పడిపోయి, అమ్మాయిల బ్యాక్ లు చూస్తూ ఆమెకోసం వెతుకుతూంటాడు.
ఇతడికి తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే ఇ తడి మాటల్లోనే ‘పిచ్చ ప్రేమ’. ఆ
ప్రేమతో తండ్రి కోసం ఏమైనా చేస్తాడు. భవంతుల నిర్మాణాలకి అనుమతులిచ్చే శాఖలో పనిచేస్తూంటాడు తండ్రి. తండ్రి తో బాటు ఓ తల్లీ చెల్లెలూ వుంటారు
సూరికి. ఓ రోజు తండ్రిని ఓ రోడ్డు ప్రమాదం నుంచి కాపాడతాడు గజ (మురళీ శర్మ) అనే
గూండా. దీంతో సూరి గజ వెంటపడి వాడికోసం ఏ పనైనా చేసేస్తూంటాడు. సూరీ గజా ఇద్దరూ ఫ్రెండ్స్
అవుతారు. ఇప్పుడు మంత్రి రాజప్ప ( రావురమేష్)
కట్టబోయే ఓ పెద్ద కాంప్లెక్స్ నిర్మాణపు ఫైలు తండ్రి దగ్గరి కొస్తుంది. అది సక్రమంగా
లేదని సంతకం పెట్టనంటాడు సూరి తండ్రి. రాజప్ప గజకి పురమాయించి వెళ్ళిపోతాడు. నారాయణ
మూర్తి సూరి తండ్రి అని తెలియక బెదిరిస్తూంటాడు గజ. తర్వాత తెలుసుకుని చేతులెత్తేస్తే,
మళ్ళీ మంత్రి రాజప్ప రంగంలోకి దిగుతాడు. వీళ్ళ కుట్ర తెలిసిపోయిన సూరి, రాజప్ప చేతే అతడి రాజీనామా లేఖ మీద సంతకం పెట్టిస్తానని
ఛాలెంజి చేస్తాడు. ఈ ఛాలెంజిగా సాగేదే మిగతా కథ.
ఎలావుంది కథ
ఇడ్లీ
బండీవాడు రోజూ ఇడ్లీలే వేస్తూంటే జనాలు తినడం లేదూ? అలాగే ఇడ్లీలూ సినిమాలూ
ఒకటేనని భావించుకుని చూసేసే మొహం మొత్తని జనాలకోసం అన్నట్టు వుంది ఈ రొడ్ద
కొట్టుడు రొటీన్ కథ. టాలీవుడ్ ని ‘ఇడ్లీవుడ్’ గా వుంచేస్తూ తన వంతు కూడా కృషిచేస్తున్న
స్టైలిష్ కైనెటిక్ స్టార్ రామ్ ని అభినందిస్తూ, కలకాలం తను ఇలాగే కొనసాగాలని
కోరుకోవాలన్నంత ‘పిచ్చపిచ్చ’ గా వుందీ కథ. ఇందులో ‘హైపర్’ గా ఏముందో వెతుక్కోలేనంత
భారీ ప్యాకేజీతో వుందీ కథ. ఈ ప్యాకేజీలో స్టోరీ పాయింటు వచ్చేసి ‘జనతా గ్యారేజ్’
మున్సిపల్ ఆఫీసు సీనుగానూ, హీరో వచ్చేసి విలన్ ని ప్రేమించే ‘జక్కన్న’ టైపు
క్యారక్టర్ గానూ, ఇక క్లయిమాక్స్ వచ్చేసి
టీవీ ఛానెల్స్ తో ‘రేసుగుర్రం’ మార్కు క్లయిమాక్స్ గానూ వుండేసి- చూసిందే చూడమని- పనిలోపనిగా -
ప్రభుత్వోద్యోగులకి ఓ ప్రభోదాత్మక సందేశమిచ్చే సెమీ- నారాయణమూర్తి కథలాగానూ వుంది.
ఎవరెలా చేశారు
కైనెటిక్
స్టార్ రామ్ 4 - జి కాలంలో ఇంకా 2- జి సినిమాల దగ్గరే ఆగిపోవడం చాలా ఆశ్చర్యం
కల్గించే విషయం. సినిమాలెప్పుడూ ఇంకా 1-జి,
2- జిలు గానే వుంటాయను కోవడం విచారకరం. సరే, ఈ పాతచింతకాయ మూస మాస్ కథనైనా, పాత్రనైనా, కాస్త చూడబుల్ గా
ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా ఆలోచించకపోవడం అన్నిటికన్నా విషాదం. చాలా సింపుల్ గా,
అదే సమయంలో బలంగానూ చెప్పే అవకాశమున్న కథని, పాత్రనీ ఏమేమో చేసి ఏదేదో చేసి బుర్ర తినేస్తే ఎలా? తండ్రిని
పిచ్చగా ప్రేమించడమనే పాయింటు తనకి ఆకర్షణీయంగా
కన్పించినంత మాత్రాన మిగతా అంశాలూ ఆకర్షణీయంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం లేదా?
ఇంతా చేసి క్లయిమాక్స్ ని ప్రారంభించింది కూడా ఒక హీరో
పాత్రగా తను కాకపోతే ఎలా? హీరోయిన్ తో
చాలా బోరు కొట్టే ప్రేమలో పడేసే సీన్లు రొటీన్ ఇడ్లీ కల్చర్ లో భాగమే అనుకుందాం, ఆ
ఇడ్లీలో మినపప్పు కూడా వేయరా? ఇలా 5-జి
ఇడ్లీలు తయారు చేద్దామనుకుంటున్నారా?
హీరోయిన్ రాశీ ఖన్నా ని ఆ పాత్రలో చూస్తే చాలా జాలేస్తుంది. ముందు అమాయకంగా వుండే తను తర్వాత రామ్ కంటే హైపర్ గా మారిపోతుంది. సడెన్ గా ఈ మార్పు ఒవర్ యాక్షన్ లాగా వుంటుంది. కానీ మాస్ కోసం ఈ సినిమా కాబట్టి ఎలా వున్నా అదే వరమని చూసేస్తారు తప్పదు.
తండ్రి పాత్ర సత్య రాజ్ ది ఏకపక్ష వ్యవహారమే. తనని అంత ప్రేమించి, తన కోసం అంత చేసే కొడుక్కి ఏమీ ఇచ్చినట్టు కన్పించడు. తండ్రీ కొడుకుల అనుబంధం- మధ్యలో విలన్ తో సమస్య- ఆ సమస్యని తీర్చడం అని సింపుల్ గా ఉండాల్సిన పాయింటులోకి ఎన్నెన్నో విషయాలు, ఉపకథలూ, ఒకడి మీద ఇంకో విలన్ పాత్రలూ పెట్టేసి గందరగోళం సృష్టించడంతో సత్యరాజ్- రామ్ ల బాండింగ్ గల్లంతయి పోయింది. కనీసం వాళ్ళిద్దరి మీద ఒక పాట పెట్టినప్పుడే కదా ఆ అనుబంధమైనా బలంగా నాటుకునేది. తండ్రీ కొడుకుల మీద పాట ప్రేక్షకులు ఒప్పుకోరనా?
ఒకటో విలన్ గా మురళీ శర్మ, రెండో కృష్ణుడు రెండో విలన్ గా, మంత్రిగా రావురమేష్, రెండో నంబర్ మంత్రి గా జయప్రకాష్ రెడ్డి, ముఖ్యమంత్రిగా విశ్వనాథ్, ఇంకా సత్యరాజ్ పైన ఒకటో నంబర్ ఆఫీసర్ గా సాయాజీ షిండే తదితరుల సోపానక్రమం క్రమంగా బలహీనపడి పోతుంది కథలో.
మలయాళ సంగీత దర్శకుడు జిబ్రాన్ తెలుగుపాటలు కుదరలేదు- ఒక్క చివరి టైటిల్ సాంగ్ తప్ప. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం హైపర్ గా ఏమీ లేదు. ‘హైపర్’ టైటిల్ కి తగ్గట్టుగా స్టయిలిష్ గా ఏమీ తీయలేదు.
చివరికేమిటి?
‘కందిరీగ’
తో సెకండాఫ్ సిండ్రోమ్ ని అంత బాగా అధిగమించగల్గిన
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత ‘రభస’
తో, మళ్ళీ ఇప్పుడు ‘హైపర్’ తో స్క్రీన్ ప్లే
స్ట్రక్చర్ అనేదొకటుంటుందని పూర్తిగా మర్చిపోయినట్టుంది. తూర్పుకి తిరిగి రోడ్డు వేసుకుంటూ పోతూంటే బెజవాడకి రూటు అదే పడుతుందన్నట్టు, ఏమేమో సీన్లు వేసుకుంటూ
పోయారు. అనవసర సీన్లు వేసుకుంటూ పోయారు. బలహీనంగా, హీరోని పాసివ్ గా మార్చేసే సీన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమర్చుకుంటూ పోయారు- ఈ
అమరికలో మాటల రచయిత పాత్ర కూడా ఉందేమో తెలీదు. ఈ కథ మొత్తాన్నీ పరిశీలిస్తే
హీరో కిడ్నాపయ్యే సీను ప్లాట్ పాయింట్ వన్ గా పెట్టుకోవాలి. అంటే హీరో తండ్రి మీద విలన్
వొత్తిడి తెచ్చే క్రమమంతా ఈ లోపే అరగంటలో ముగిసిపోవాలి. ఆ తర్వాత హీరో కాబోయే బావని
కిడ్నాప్ చేసి- హీరోని తండ్రి నుంచి విడగొట్టే మెయిన్ విలన్ అయిన మంత్రి కుట్ర తో ఇంటర్వెల్
రావాలి. ఈ టైమింగ్స్ తో ఈ రెండు మూలస్థంభాల ఆధారంగా ఈ మొత్తం కథా నడిపివుంటే- కేవలం సంతకం చుట్టూ కథ అని కాకుండా,
సంతకం చెయ్యని కారణంగా భౌతికంగా ఇంకేదో భారీ నష్టం కూడా చూపించి వుంటే - ఇడ్లీ కథయినా చూడబుల్ గా వుండేది!
-సికిందర్
http://www.cinemabazaar.in
Monday, September 26, 2016
స్పెషల్ ఆర్టికల్ :
ముంబాయిలో మకాం వేసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న, పాడుతున్న పాకిస్తాన్ కళాకారులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే మెడబట్టి గెంటేస్తామనీ గత శుక్రవారం అల్టిమేటం ఇచ్చిన మహారాష్ట్ర
నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్), మొన్న సోమవారం పాకిస్తాన్ కళాకారులు దేశం విడిచి
వెళ్లిపోయారని ప్రకటించింది. ఇంకెవరైనా ముంబాయిలో తలదాచుకుంటే వేటాడతామని కూడా
హెచ్చరించింది. మహారాష్ట్రలో బిజెపితో అధికారాన్ని పంచుకుంటున్న శివసేన తానులో
ముక్కే అయిన, వేరు కుంపటి పెట్టుకున్న రాజ్ థాకరే నాయకత్వం లోని పార్టీ ఎన్ఎంఎస్. దీని
సినీ కార్మికుల విభాగం చిత్రపట్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ ఈ బహిష్కరణల
పర్వానికి తెర తీశారు. కారణం ఉరీ ఘటన. 19 మంది భారత సైనికుల్ని హతమార్చిన పాక్ ఉగ్రవాదుల
ఘాతుకం. అయితే ఇప్పుడు పాక్ కళాకారులు దేశం విడిచి వెళ్లి పోయారని ఎంఎన్ఎస్ నేతలు
ఇచ్చుకుంటున్న ప్రకటనలే తప్ప, ప్రభుత్వ
ధృవీకరణ లేవీ లేవు.
అసలు ఎన్ఎంఎస్ పార్టీ హెచ్చరిక జారీ చేసిన వెంటనే ముంబాయి పోలీసులు ఆ పార్టీకి నోటీసు లిచ్చారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇలాటి హెచ్చరికలు చేస్తే సహజంగానే చట్టం వూరుకోదు. పైగా భారత ప్రభుత్వం జారీ చేసిన వీసాలున్న విదేశీయులెవరూ భయపడనవసరం లేదనీ, కోరితే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని కూడా ముంబాయి పోలీసులు ప్రకటించారు. కానీ పాక్ కళాకారులెవరూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు లేదు- ఎన్ఎంఎస్ చెబుతున్న దాని ప్రకారం దేశం విడిచి వెళ్ళిపోయారు.
పాకిస్తాన్ నుంచి వచ్చి బాలీవుడ్ లో కొనసాగుతున్న పాక్ నటుల్లో, గాయకుల్లో ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్, అలీ జాఫర్, అలీ అజ్మత్, ఆతిఫ్ అస్లం, షఫ్ఖత్ అమానత్ అలీ ఖాన్, రాహత్ ఫతే అలీ ఖాన్, సల్మాన్ అహ్మద్ మొదలైన వారు ప్రస్తుతం వున్నారు.
ఎన్ఎంఎస్ కాదుగానీ, ఆమధ్య ఏకంగా శివసేన పార్టీయే ప్రసిద్ధ పాకిస్తానీ ఘజల్ గాయకుడు గులాం అలీని ముంబాయిలో ప్రోగ్రాం పెట్టనీయకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ నటులు, క్రికెటర్లు ఎవరైనా సరే మహారాష్ట్ర గడ్డ మీద అడుగు పెట్టనీయబోమని హెచ్చరించింది. ఈ రెండు పార్టీలూ మరాఠాల ఆత్మగౌరవ ఎజెండాతోనే అతివాదంతో అల్లరి చేస్తూంటాయి. ముంబాయిలో మహారాష్ట్రీయులకి ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని తమిళుల మీద, బీహారీల మీద, ఇతర ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళ మీదా దాడులు చేసిన ఈ పార్టీలు టెర్రరిజం అనేసరికి పాక్ కళాకారుల మీద పడతాయి. 2008 లో తమ సొంత ముంబాయిలోనే జరిగిన అంతటి టెర్రర్ మారణహోమంలో కూడా ఈ పార్టీలు నోరెత్త లేదు, పత్తా లేవు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా మహా రాష్ట్ర సెంటి మెంట్లని రెచ్చగొడుతూ ఈ పార్టీలు అడపదపా వివాదాలు సృష్టిస్తూంటాయి.
ప్రస్తుత
వివాదంలో కేంద్రబిందువుగా వున్న ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ అనే పాక్ హీరో
హీరోయిన్లలో (వీళ్ళు పాక్ టీవీ సీరియల్స్ నుంచి ఏకంగా బాలీవుడ్ స్టార్స్ గా
ప్రమోటయిపోయారు) ఫవాద్ ఖాన్ ఆదివారమే రహస్యంగా పాకిస్తాన్ వెళ్లిపోయాడని వార్త లొచ్చాయి.
మళ్ళీ ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా లేవట. ఫవాద్ ఖాన్ నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’
(ఈ మనసు కష్టమైనది) దీపావళికి
విడుదలవుతోంది. ఇందులో తను అతిథి పాత్ర మాత్రమే పోషించాడు. హీరో హీరోయిన్లుగా
రణబీర్ కపూర్- ఐశ్వర్యా రాయ్ లు నటించారు. గతంలో ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘ఖూబ్
సూరత్’, ‘కపూర్ అండ్ సన్స్’ లతో మనదేశంలో పాపులారిటీ సంపాదించుకుని 2.5 కోట్ల
రూపాయల పారితోషికం డిమాండ్ చేసే స్టార్ గా ఎదిగాడు. బుల్లితెర హీరోగా జీ – జిందగీ ఛానెల్ ప్రసారం చేసిన అనేక
పాకిస్తానీ సీరియల్స్ ద్వారా మన దేశంలో ఇంటింటికీ తెలిశాడు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు
ఎపిసోడ్ కి రెండు లక్షలు తీసుకునే వాడు.
ఇక
షారుఖ్ ఖాన్ నటిస్తున్న
‘రయీస్’ (సంపన్నుడు)లో మాహిరా
ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె కిదే తొలి బాలీవుడ్ అవకాశం. ఇది జనవరి 26న విడుదల
కాబోతోంది. పాకిస్తానీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు ఈమె ఎపిసోడ్ కి మూడు లక్షలు తీసుకునేది. ‘రయీస్’ కి ఎంతిస్తున్నారో వెల్లడి
కావడం లేదు. ఈ రెండు భారీ సినిమాల విడుదలలని అడ్డుకుంటామని కూడా హెచ్చరించింది ఎంఎన్ఎస్
పార్టీ. కానీ ఈ బెదిరింపుల్ని మాహిరా ఖాన్ సీరియస్ గా
తీసుకున్నట్టు లేదు. పాకిస్తాన్ నుంచి ఒక తుంటరి, ‘నువ్వింకా ఇండియా చేతి లాఠీ దెబ్బలు తిననట్టుంది’ అని ట్వీట్ చేస్తే, దీనికి మాహిరా- ‘మీ అమ్మ చేతిలో నీ వీపు పగిలి
వుంటే ఇలాటి వెధవ వాగుడు వాగవురా’ అని ఇలాటి విపత్కర పరిస్థితిలో కూడా కామెడీ
చేసింది. ఈమె ఇంకా స్వదేశం వెళ్ళిపోకుండా ముంబాయిలోనే దాక్కుందేమోనన్న
అనుమానాలున్నాయి. ఈమె ట్వీట్ కి ఎంఎన్ఎస్ రెస్పాన్స్ కూడా లేదు. వాళ్ళకీ వాళ్ళమ్మ
గుర్తొచ్చిందేమో.
ఫవాద్
నిర్మాత కరణ్ జోహార్ని ప్రశ్నిస్తూ- ‘సినిమాలో బుక్ చేసుకోవడానికి మీకు ఫవాద్ ఖాన్
ఒక్కడే కన్పించాడా? షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ లలాంటి గొప్ప నటులు కనిపించనే లేదా?’ అని
ఆగ్రహం వ్యక్తం చేశాడు సంగీత్ సోమ్! సమస్య షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ల అవకాశాల
గురించా, లేకపోతే ప్రాణాలు కోల్పోయిన సైనికుల గురించా? ఏ అంశాన్ని పట్టుకుని
నిలదీయాల్సి వుంటుంది? ఇలా ఒక స్పష్టత లేని, ఐక్యత లేని నేతల నోటి దూలతోనే అసలు
సమస్య.
ఉరీని పురస్కరించుకుని మన నాయకులూ, మేధావులు ఏకత్రాటి పై లేరు. ఇదే పాకిస్తాన్లో అయితే ఐఎస్సైలు, సైనికులు, టెర్రరిస్టులు, నాయకులు, మేధావులూ - ఇంత గుంపూ గీత గీసుకుని ఒకే గొంతుకతో ఇండియా మీద విరుచుకు పడతారు! ప్రతీరాత్రి మన ఛానెల్స్ లో ఉరీ మీద మన నేతల, మేధావుల ఐక్యత లేని కీచులాటల్ని పాకిస్తాన్ లో కూర్చుని అక్కడి ఐఎస్సై- సైనిక క్యాంపులు, టెర్రర్ శిబిరాలూ వినోదిస్తూనే వుంటాయి. వాళ్ళక్కావాల్సింది ఇదే - ఈ అనైక్యతే!
బాలీవుడ్ వర్సెస్ లాలీవుడ్
ఎంఎన్ఎస్ రాద్ధాంతం మీద బాలీవుడ్ కూడా డివైడ్ టాక్ తో వుంది. కళలకి
రాజకీయాల్ని దూరంగా వుంచాలని కొందరంటే, పాక్ కళాకారుల్ని తరిమి కొట్టాలని
మరికొందరు ఆగ్రహించారు. కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్ళే మన నెత్తి మీదికి పాక్ కళాకారులని తెచ్చి
పెడుతున్నారని, వీళ్ళే అసలు ద్రోహులనీ గాయకుడు అభిజిత్ తీవ్రంగా విరుచుకుపడితే,
మరో గాయకుడు కైలాస్ ఖేర్, పాక్ కళాకారులు
ద్వేషాన్ని వెదజల్లనంత వరకూ వాళ్ళని
బహిష్కరించాల్సిన అవసరం లేదని సమర్ధించారు. ఎంఎన్ ఎస్ ఇంకో అడుగు ముందుకేసి
తప్పుడు ఆరోపణ చేసింది. మన సినిమాల్ని పాకిస్తాన్ లో ఆడనియ్యరు గానీ, పాకిస్తాన్
వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారని ఆరోపిస్తే, నిర్మాత వాసూ భగ్నానీ దీన్ని
ఖండించారు. ‘భజరంగీ భాయిజాన్’ లాంటి మన
సినిమాలు పాకిస్తాన్లో విరగబడి ఆడుతున్నాయనీ, కాబట్టి బాలీవుడ్ కి పాక్ కళాకారులు వస్తే అభ్యంతరం ఎందుకనీ -
సమస్యంతా టెర్రరిజంతోనే అనీ సమాధాన మిచ్చారు.
అసలొక విధంగా చెప్పాలంటే, బాలీవుడ్ సినిమాలు లాలీవుడ్ ( పాకిస్తాన్ సినిమా పరిశ్రమ) ని కుదేలు చేశాయి. అయితే విచిత్రంగా బాలీవుడ్ సినిమాల మీద- అంటే బాలీవుడ్ సినిమాలు ప్రదర్శించే అక్కడి థియేటర్ల మీద టెర్రరిస్టులు దాడులు చేయడం లేదు. సైనిక, ప్రభుత్వ, ఇతర రాజకీయ, మేధావి వర్గాలు కూడా వీటి జోలికి పోవడం లేదు. ఎఫ్ ఎం రేడియోల్లో హిందీ పాటలు మార్మోగుతున్నా- మా సంస్కృతీ చట్టు బండలూ అని గొడవ చేయడం లేదు. వాళ్ళ సంస్కృతి ఇండియా మీద తుపాకులతో దాడులు చేయడమే కాబోలు (వాళ్ళ విదేశాంగ విధానం టెర్రరిజమే). అంతేగానీ ఇండియన్ సినిమాల్నీ పాటలనీ పట్టించుకుని, మన ఎంఎన్ఎస్ లాగా వాటిని నిషేధించేంత తీరికా, సాంస్కృతికాభిమానమూ వాళ్ళ బుర్రలకి లేదు. కేవలం అక్కడి నిర్మాతలే, పంపిణీదారులే బాలీవుడ్ సినిమాల ధాటికి లాలీవుడ్ నాశనమవు తోందని అరణ్య రోదన చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం లాలీవుడ్ చక్కగా అభివృద్ధి చెందుతోందని ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్లో ‘భజరంగీ భాయిజాన్’ తో పాటూ విడుదలై హిట్టయిన ‘బిన్ రోయే’ (దుఃఖపడకుండా) అనే మాహిరా ఖాన్ నటించిన రోమాంటిక్ డ్రామా ‘భజరంగీ భాయిజాన్’ తో పాటే ఇండియాలో 60 థియేటర్లలో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. అంతే, మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ పార్టీకి మంచి మేత దొరికినట్టయింది. దాన్ని నంజుకు తిని విడుదల కాకుండా ఆపేసింది. తర్వాత పశ్చిమ బెంగాల్లో విడుదల చేసి సొమ్ములు చేసుకున్నారు పంపిణీ దార్లు. ఇలా ఎన్ని పాక్ సినిమాలు ఇండియాలో విడుదల అవుతున్నాయి? పాకిస్తాన్లో బాలీవుడ్ సినిమాలు ఆడించుకుని ఎందరెందరు బాలీవుడ్ నిర్మాతలు లాభపడుతున్నారు? ఆ పాపపు పాక్ సొమ్ము తినొద్దని ఎందుకని ఎంఎన్ఎస్ అడ్డు పడ్డం లేదు? బాలీవుడ్ లో పాక్ కళాకారులు స్థానిక కళాకారుల పొట్టలే కొడుతూండ వచ్చు గాక, మన సినిమాలు వెళ్లి వాళ్ళ లాలీవుడ్ నే నాశనం చేస్తున్నాయిగా? అక్కడి కళాకారులూ కార్మికుల పొట్ట లేమైపోవాలి. ఎవరి పొట్ట ఏ రేంజిలో ఎవరు కొడుతున్నారు? ఇంత జరుగుతున్నా అక్కడి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడమే లేదుగా?
400 సినిమాలకి పైగా నటించిన అక్కడి నటుడు- దర్శకుడు గులాం మొహియుద్దీన్ భారీ బడ్జెట్లతో తీసే వందలాది బాలీవుడ్ సినిమాలతో తమ సినిమా పరిశ్రమ నాశన మయ్యిందని అవేదన వ్యక్తం చేశారు. అసలే అతి చిన్నమార్కెట్ గల తాము బాలీవుడ్ అంతటి భారీ బడ్జెట్లతో తీసి ప్రేక్షకుల్ని ఆకట్టుకో లేమనీ, ప్రేక్షకులు టెక్నికల్ గానూ ఉన్నతమైన బాలీవుడ్ సినిమాల వెంటే పడుతున్నారనీ విచారం వ్యక్తం చేశారు. పైగా ఒకప్పుడు పాకిస్తాన్ లో 650 థియేటర్లుంటే ఇప్పుడు 140 కి పడిపోయాయనీ, 1980 లలో వంద సినిమాలు తీసే వాళ్ళు కాస్తా ఇప్పుడు 20 కూడా తీయడం లేదనీ వాపోయారు.
ఆరేళ్ళ క్రితం పాకిస్తాన్ సాంస్కృతిక - టూరిజం శాఖ చైర్ పర్సన్ నిలోఫర్
భక్తియార్ గోవాలో ఒక చలన చిత్రోత్సవానికి హాజరైనప్పుడు- బాలీవుడ్ తో సంబంధాల్ని
పెంచుకుంటే లాలీవుడ్ చక్కబడుతుందనీ, ఇండియన్ సినిమాలు అత్యంత అభివృద్ధి చెందాయనీ, ఇండియన్
ఫిలిం మేకర్లు తమతో కలిసి పనిచేస్తే బావుంటుందనీ, తమ నటులకీ దర్శకులకీ బాలీవుడ్ లో
తగిన శిక్షణ నిప్పిస్తే ఇంకా బావుంటుందనీ అన్నప్పుడు- పాకిస్తాన్ సినిమా ఓనర్స్
సంఘం కార్యదర్శి ఖైసర్ ఖాన్ ఇంతెత్తున లేచారు. ఇలాటి ఒప్పందాలు చేసుకుంటే
పాకిస్తాన్ నుంచి టాలెంట్ అంతా బాలీవుడ్ కి తరలిపోతుందనీ, అక్కడి పారితోషికాలకి
వాళ్ళు అలవాటు పడితే తిరిగి ఇటువైపు చూడరనీ, ఇప్పటికే ఇక్కడ స్టూడియోలన్నీ
మూతబడ్డాయనీ విమర్శించారు.
ఇదీ
పాకిస్తాన్ పరిస్థితి. అక్కడెవరూ కోరుకుని పాక్ కళాకారుల్ని బాలీవుడ్ మీదికి తోసెయ్యడం
లేదు. పాక్ కళాకారులకి కూడా సిఫార్సులు చేయించుకుని బాలీవుడ్ ఛాన్సులు కొట్టేసే
అవకాశమే లేదు. బాలీవుడ్ నిర్మాతలే టాలెంట్ హంట్ చేసి వాళ్ళని పట్టుకొస్తున్నారు. 2003 లో ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ ఈ
లాలీవుడ్ కళాకారుల వలసకి తెరలేపారు. ఆ
సంవత్సరం ఆయన ఒక ఫిలిం ఫెస్టివల్లో
పాల్గొనడానికి కరాచీ వెళ్ళినప్పుడు- ఆతిఫ్ అస్లం అనే గాయకుణ్ణీ, మీరా అనే నాయకినీ
పట్టుకొచ్చేశారు. దాంతో మొదలయ్యింది ఇతర నిర్మాతలూ ఈ దారి పట్టడం. 2005 – 16 మధ్య
కళ్ళు తిరిగే సంఖ్యలో పాక్ కళాకారులు వచ్చి పడ్డారు. తాజాగా ‘హేపీ భాగ్ జాయేగీ’ లో
నటించిన మోమల్ షేక్ సహా మావరా లోకెన్, లైలాఖాన్, సారా లారెన్, హుమైమా మాలిక్,
సోనియా జహాన్, మీషా షఫీ, మోమ్మల్ దోబారా, హుమాయున్ సయీద్, సనా నవాజ్, ఇమ్రాన్
అబ్బాస్, ఆదీల్ చౌదరి, మీకల్ జుల్ఫీకర్, షెహరోజ్ సబ్జ్వారీ, అలీ ఖాన్, రషీద్ నాజ్,
జావేద్ షేక్, సల్మాన్ షాహిద్, వీణా మాలిక్ ...అలీజాఫర్, ఫవాద్ ఖాన్, మాహిరా
ఖాన్...ఇంకో ఆరుగురు గాయకులూ!
ఇలా ఇంతమంది వచ్చి పడుతున్నందుకు మొదటినుంచీ శివ సేన, ఎంఎన్ఎస్ పార్టీలు చేస్తున్న ఆందోళన సబబైనదే. కానీ ఈ సమస్యని ఇప్పుడు ముందుకు లాగడం సందర్భం కాదు. అలాగే మరాఠా ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న ఈ పార్టీలు కేవలం మరాఠీలకే బాలీవుడ్ అవకాశాలివ్వాలనీ కోరడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళ కిస్తే ఈ పార్టీలకి అభ్యంతరం ఏమీ వుండదు. ఈ కోవలో చూస్తే, బాలీవుడ్ నిర్మాతల పాక్ పైత్యాన్ని ఖండించాల్సిందే.
గత పదేళ్లుగా ఈ ట్రెండ్ అప్రతిహతంగా సాగుతూన్నా
నిజానికి ఇంకా పూర్వమే పాక్ కళాకారులకి
అవకాశాలిచ్చిన సందర్భాలున్నాయి. అది 80 లలో. అప్పట్లో బీఆర్ చోప్రా తీసిన సూపర్
హిట్ ‘నిఖా’లో పాక్ నటి- గాయని సల్మా ఆఘా నటించి, సూపర్ హిట్ పాటలు పాడుకుంది. బాలీవుడ్
కౌబాయ్ ఫిరోజ్ ఖాన్ తీసిన ‘ఖుర్బానీ’ అనే హిట్ లో ‘ఆప్ జైసా కోయీ మేరే జిందగీ మేఁ
ఆయే’ సోలో పాట దేశంలో ఎలా మార్మోగిందో తెలిసిందే. దాన్నిపాడి ప్రపంచవ్యాప్తంగా
పాపులరయ్యింది పాక్ పాప్ సింగర్ నాజియా హుస్సేనే.
సుభాష్ ఘాయ్ తీసిన మరో సూపర్ హిట్ ‘హీరో’ లో ‘లంబీ జుదాయీ’ (తీరని వియోగం) అనే బాగా
హిట్టయిన పాట పాడింది పాక్ జానపద గాయని రేష్మా. రణధీర్ కపూర్ తీసిన ‘హెన్నా’
(గోరింటాకు) లో పాక్ నటి జేబా భక్తియార్ హీరోయిన్ గా నటించింది. ఇలా
అతికొద్ది సినిమాలే 80 లలో పాక్ కళాకారులతో వచ్చాయి. 90 లో అనితా ఆయూబ్, సోమీ అలీ,
తలత్ హుస్సేన్, మొహిసిన్ అలీ, నదీం అనే హీరో హీరోయిన్లు వచ్చారు. 2005 నుంచే మహేష్
భట్ చలవతో చిలుకల్లా వచ్చి వాలడం మొదలెట్టారు. ఇది స్థానిక కళాకారులకి కచ్చితంగా
దెబ్బే.
కళకీ సరిహద్దులు
మన స్టార్లూ పాక్ సినిమా రంగాన్ని పావనం చేయకపోలేదు. నందితా
దాస్, కిరణ్ ఖేర్, నేహా ధూపియా, నసీరుద్దీన్ షా, ఓంపురి లాంటి ఆల్రెడీ బాలీవుడ్ లో
స్థిరపడ్డ వాళ్ళే కొందరు వెళ్లి నటించారు. సోనూ నిగమ్, అంకిత్ తివారీ, సుఖ్విందర్
సింగ్, శ్రేయా ఘోషల్, హర్స్ దీప్ కౌర్,
రేఖా భరద్వాజ్ లాంటి గాయనీ గాయకులూ పాక్ సినిమాల్లో పాడారు.
అలాగే ఓ రెండు సినిమాలు ఇండో- పాక్ భాగస్వామ్యంలో తీశారు. కరీనా కపూర్, సోనం కపూర్, అమృతా అరోరా, అర్జున్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా లాంటి మన స్టార్లు పాకిస్తాన్ వ్యాపార ప్రకటనల్లో కన్పిస్తున్నారు.
అతివాదులు ఆరోపిస్తున్నట్టు పాకిస్తాన్ నుంచి బాలీవుడ్ కి వన్ వే ట్రాఫిక్కే లేదు- బాలీవుడ్ నుంచి కూడా లాలీవుడ్ కి ట్రాఫిక్ వుంది. ఈ టూవే ట్రాఫిక్ లో బాగా లాభ పడుతోంది మాత్రం బాలీవుడ్డే. బాలీవుడ్ సినిమాలు, పాటలు లాలీవుడ్ ని నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. అక్కడి కళాకారులకి పనిలేకుండా చేసి వందల కోట్లు బాలీవుడ్ కి చేరుతున్నాయి. దీని ముందు పాక్ కళాకారులు బాలీవుడ్ లో దోచుకుంటున్నారని చేస్తున్న ఆరోపణలు నిలబడేవి కావు. పాక్ టీవీ నటుల్ని బాలీవుడ్ సినిమాల్లో నటింప జేసుకుని తిరిగి ఆ సినిమాల్ని పాక్ కే పంపిస్తే, తమ నటుల్ని చూసేందుకు కూడా సహజంగానే అక్కడి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. పాక్ కళాకారులకి బాలీవుడ్ లో అవకాశాలిస్తే, పాక్ లో కూడా వ్యాపారం చేసుకోవచ్చనే వ్యూహం కావచ్చు ఇది. పేరుకి టూవే ట్రాఫిక్కే గానీ, పెద్దన్నలా బాలీవుడ్ చేతిలో వున్నది పూర్తిగా వన్ వే ట్రాఫిక్కే. దీన్ని ఇండియాలో అందరూ గుర్తించి ఒకటే పరిష్కారం చెప్పాల్సి వుంటుంది : బాలీవుడ్ సినిమాలు పాక్ లో ఆడుతున్నట్టు, పాక్ సినిమాల్ని కూడా ఇండియాలో ఆడనివ్వాలి. చూసేవాళ్ళు చూస్తారు లేని వాళ్ళు లేదు. పాక్ కళాకారుల్ని బాలీవుడ్ సినిమాల్లో, బాలీవుడ్ కళాకారుల్ని పాక్ సినిమాల్లో అనుమతించ కూడదు. ఎవరి సినిమాలు వాళ్ళ కళాకారులతో వాళ్ళు తీసుకుంటూ ఇరుదేశాల్లో పోటీ పడినప్పుడే ఎలాటి ఫిర్యాదులకీ అవకాశం వుండదు. ఈ పోటీలో ఎవరి సామర్ధ్యమేమిటో వాళ్ళు తేల్చుకుంటారు.
ఐతే
ఇదంతా ఎప్పుడు? పాక్ తో మితృత్వం వున్నప్పుడు. తెల్లారి లేచింది ఏ సందులోంచి
ఇండియాలోకి జొరబడాలా, ఎక్కడ బాంబులు పేల్చలా అని ఆలోచించే దేశం పాక్ తో మిత్రుత్వం
ఎలా వుంటుంది? ఉరీ ఉదంత నేపధ్యంలో పాక్ కళాకారుల్ని వెనకేసుకొస్తున్న బాలీవుడ్ తో పాటు
రాజకీయ, మేధావి వర్గాలు- 1) కళకి సరిహద్దుల్లేవనీ, 2) కళకి రాజకీయాలతో సంబంధం కూడా
లేదనీ, 3) రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కొనసాగాలనీ, 4) పాక్ పాలకులు వేరు, ప్రజలు వేరు అనీ వాదిస్తున్నారు.
వాళ్లకి హతులైన జవాన్ల రూపాలే మెదలడం
లేదు.
1) కచ్చితంగా కళ సరిహద్దుల్ని చూడదు. కానీ ఆ సరిహద్దుల్ని పదేపదే అకృత్యాలతో ధ్వంసం చేస్తూంటే తప్పకుండా కళ సరిహద్దుల్ని నిర్ణయించుకుంటుంది. కళాకారులు ఒక దేశానికి ప్రతినిధులై వుంటారు. ఎలాటి దేశానికి ప్రతినిధు లయ్యారనేది లెక్కలోకొస్తుంది. రేపు సిరియా ఐసిస్ గుడారంలోంచి ఓ తుగ్లక్ వస్తే- కళకి సరిహద్దుల్లేవని వాణ్ణి హీరోగా చేసేయరు కదా? పాకిస్తాన్లో నాలుగు అధికార కేంద్రాలున్నాయి. ఐఎస్సై, సైన్యం, టెర్రర్, ప్రభుత్వ అధికార కేంద్రాలు. చివరిది పేరుకే అధికార కేంద్రం, పెత్తనమంతా మిగతా మూడు కేంద్రాలదే. ఈ మూడిటి దుర్గంధమే టెర్ర్రరిజం. దీంతో వాళ్ళ దేశంలోనే కాక ఇరుగు పొరుగు దేశాల్లోనూ అకృత్యాలు చేస్తున్నారు. ఇలాటి దేశానికి చెందిన కళాకారులు ఎలాటి ప్రతినిధులై వుంటారు? తస్లీమా నస్రీన్ లా ఎదిరించి పారిపోయి వచ్చివుంటే కాపాడుకోవచ్చు- కానీ తమ కెరీరే తప్ప నోరే విప్పని పాక్ కళాకారులకి ఏ ప్రోటోకాల్ తో భాయ్ భాయ్ అంటూ సంఘీభావం ప్రకటిస్తారు? సరిహద్దు మర్యాదే పాటించని తమ వాళ్ళ అకృత్యాలకి కచ్చితంగా కళ కూడా సరిహద్దు గీత గీసేస్తుంది.
2) దేశాల మధ్య శత్రుత్వం తలెత్తినప్పుడు కళకి రాజకీయాలతో సంబంధం వుంటుంది. లేకపోతే దేశభక్తి అనే మాటకే అర్ధం లేదు. కళకి రాజకీయం లేకపోతే దేశభక్తి కూడా వుండదు. అలాటి కళని కోరుకోవాలా? దేశంకంటే కళ గొప్పది కాదు. ఒకటొకటే పాక్ కి అన్ని దారులూ మూసేస్తోంది కేంద్ర బ్రభుత్వం. బాలీవుడ్ కూడా దారులు మూసేయాలని ఆదేశిస్తే ఇది రాజకీయమని ధిక్కరిస్తుందా? మామూలు పరిస్థితుల్లో అడ్డొచ్చే రాజకీయాలే ఉద్రిక్త పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలతో కూడిన రాజకీయాలవుతాయి.
3)
రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు అవసరమే. కానీ ఎప్పుడు? అవతలి
దేశానికో సంస్కృతి వున్నప్పుడు. అవతలి దేశపు సినిమా పరిశ్రమ ప్రపంచాని కేమిచ్చింది?
ఒక మొఘలే ఆజం, మదర్ ఇండియా లనిచ్చిందా? ఒక దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్
లనిచ్చిందా? ఒక సత్యజిత్ రే, సుభాష్ ఘాయ్ లనిచ్చిందా? ఒక లతా రఫీ ఆశా కిషోర్
లనిచ్చిందా? ఒక లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఏఆర్ రెహ్మాన్ లనిచ్చిందా? ఏమిచ్చింది?
మనది ఇచ్చి వాళ్ళది తెచ్చుకోవడానికి ఏమి దాచి పెట్టింది? పోనీ మనతో చేయీ చేయీ
కలిపినా ఏనాటికైనా కనీసం ఒక ‘హేపీ భాగ్
జాయేగీ’ అయినా ఇవ్వగలదా? సాంస్కృతిక మార్పిడికి అక్కడ ఒకే ఒక్కటి వుంది- అది
టెర్రరిజం.
4) పాక్ పాలకులు వేరు, ప్రజలు వేరూ కాదు. ఆ ప్రజలతోనే మనకి సమస్య వస్తోంది. టెర్రరిజానికి అందుతున్న కుర్రాళ్ళు ఎక్కడ్నించీ వస్తున్నారు? కసబ్ ఎక్కడ్నించి వచ్చాడు? పఠాన్ కోట్, ఉరీ ముష్కరులు ఎక్కడ్నుంచి వచ్చారు? ఆ ప్రజలు కని వదిలేస్తేనే కదా? పాక్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, మనం వెళ్తే చాలా ప్రేమతో చూస్తారు అనే మాటలు అర్ధం లేనివి. ఆ ప్రజలు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. టెర్రరిజానికి ప్రధాన కారకులు వాళ్ళే. పిల్లల్ని సరీగ్గా పెంచితే టెర్రరిజం వైపు ఎందుకుపోతారు?
ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ తదితర పాక్ సెలెబ్రిటీలు ఇక్కడ ఉరీ
కి వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పరంటే, సైనికుల
కుటుంబాలకి ఎందుకు సంతాపం ప్రకటించరంటే, వాళ్ళ దేశంలో అలా వుంది మరి. 2008 నుంచీ
నేటి వరకూ చూసుకుంటే, 13మంది పాక్ కళాకారుల్ని అక్కడి మతోన్మాదులు, ఉగ్రవాదులు
పొట్టన బెట్టుకున్నారు.
తాజాగా గత జూన్ లో ప్రసిద్ధ ఖవాలీ గాయకుడు అమ్జాద్ సాబ్రీని ప్రోగ్రాం ఇస్తూండగానే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక మోడల్ సంగమ్ రాణాని వురి తీసి చంపారు. టీవీ ఆర్టిస్టు మష్రత్ షాహీన్ ని షూట్ చేసి చంపారు. ఆర్టిస్టు సనా, డ్రమ్మర్ ఇబ్రహీంలని దారి కాచి చంపేశారు. గాయకురాలు గుల్నార్ ని కూడా కాల్చి చంపారు. మరో గాయకురాలు సీమా నాజ్ ని కూడా అలాగే చంపారు. ఇంకో సింగర్ ఘజలా జావేద్ ని ఆమె తండ్రితో పాటు షూట్ చేసి చంపారు. టీవీ నటి యాస్మీన్ గుల్, డాన్సర్ అఫ్సానా లని కూడా కాల్చి చంపారు. కమాల్ మెహసూద్ అనే సింగర్ కూడా తుపాకీ కాల్పులకి బలయ్యాడు. ఆయుమన్ ఉదాస్ అనే గాయకురాలు కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయింది. మరొక ప్రముఖ డాన్సర్ షాహీన్ తనని గొంతు కోసి చంపవద్దనీ, కాల్చి చంపమనీ ప్రార్ధించినా గొంతు కోసి చంపారు. ఆమె సంపాదించిన డబ్బునీ, నటించిన సీడీల్నీ ఆమె శవం మీద చెల్లా చెదురుగా పడేసి పోయారు. ఇంకో సంగీతకారుల బృందం మీద దాడి చేస్తే, వాళ్ళలో అన్వర్ గుల్ అనే హర్మోనిస్టు మరణించాడు. ఆఖరికి మోడల్, నటి ఫౌజియా అజీమ్ అలియాస్ ఖందీల్ బలూచ్ ని కూడా గత జులైలోనే హతమార్చారు.
ఇలా కళాకారుల్ని హతమారుస్తున్నప్పుడు, చేతగాక ప్రభుత్వం చూస్తున్నప్పుడూ ఎవరు ఈ ఉగ్ర మూకలకి వ్యతిరేకంగా మాట్లాడతారు? అసలిలా కళాకారుల్ని ఎందుకు చంపుతున్నారని చూస్తే, ప్రేమే సందేశంగా ప్రవర్తించే సూఫీ ఇస్లాం సంస్కృతిని ఈ కళలు ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి. వహాబీ ఇస్లాం దీన్ని గానీ, పాశ్చాత్యీకరణని గానీ ఒప్పుకోదు. ఇది కరుడుగట్టిన మతాన్ని రుద్దాలని చూస్తుంది. ప్రపంచంలో ముస్లింలందర్నీ వహాబీ సంస్కృతి కిందికి తేవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో బాగంగానే ఐసిస్ పుట్టుక. టెర్రర్రరిస్టులందరూ ఎప్పుడూ ఈ వాహాబిస్టులే. అరబ్ మూల కేంద్రంగా వీళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ పాక్ పెత్తందార్లు టెర్రరిస్టుల్ని పోషిస్తున్నారు. పాక్ ని వహాబీ దేశంగా మార్చెయ్యాలని పన్నాగాలు పన్నుతున్నారు. అందుకే సూఫీయిజానికి ప్రతీకలైన కళాకారుల మీద దాడులు. ఇండియాలో సూఫీ ఇస్లాం వుంది. కాశ్మీర్ లో కూడా మహెబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని పడగొట్టి వాహాబీస్టుల్ని అధికారంలోకి తేవాలన్న కుట్రలో భాగంగానే అక్కడ రెచ్చ గొడుతున్న అల్లర్లని బయటపడింది.
ఇప్పుడు ఫవాద్ గానీ, మాహిరా గానీ ఉరీ ఘతుకాన్ని ఖండిస్తే వాళ్ళకీ మూడుతుంది. ఇలాగని సానుభూతితో వాళ్ళని చూసీ చూడనట్టు కొనసాగనిద్దామని మనమనుకుంటే- వీళ్ళ ఘనకార్యాలు అడ్డు పడుతున్నాయి. వీళ్ళమీద జాలిపడి వదిలెయ్యడానికి వెళ్లేం తమ పనేదో తాము చేసుకునే అమాయక కళాకారులు కాదు. అన్నీ తెలిసిన ఇంటలెక్చువల్స్. పారిస్ లో ఉగ్ర దాడి జరిగినప్పుడు దాన్ని ఖండిస్తూ రెచ్చిపోయి ట్వీట్ చేశాడు ఫవాద్. అలీ జాఫర్ కూడా తన నిరసనని ట్వీట్ చేశాడు. మాహిరా కూడా, ‘నా గుండె రోదిస్తోంది, ఎలాటి ప్రపంచంలో మనం వున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. అలాటి ప్రపంచం పాకిస్తాన్ లోనే వుందని తెలీనట్టు! వీళ్ళెవరూ తమ దేశపు కళాకారులని హతమారుస్తోంటే ట్వీట్ చేయలేదు. మన దేశంలో పఠాన్ కోట్, పాంపోర్, ఉరీ ఘటనలప్పుడైతే మరీ మౌనం. మొన ఐక్యరాజ్య సమితిలో నవాజ్ షరీఫే ఉరీ ఘటనని ప్రస్తావించ లేకపోయాడు. చీటికీ మాటికీ పాకిస్తాన్లో ఆర్మీతో మంతనాలాడుతూ వాళ్ళు చెప్పిన ప్రసంగ పాఠమే చదివేశాడు - ఉరీ ఘటన అసలు జరగనట్టే! ప్రధానికే ఈ పరిస్థితి వుంటే నటులకెలాంటి పరిస్థితి వుంటుంది?
కనుక ఒకవైపు ఇలాటి పాక్ కళాకారులకి అవకాశాలిస్తూ, మన తరపున వాళ్ళు మాట్లాడ్డం లేదని కోపాలు ప్రదర్శించడమే శుద్ధ అవివేకం. అలాగని మెడబట్టి గెంటెయ్యడం, ఎక్కడున్నా వేటాడడం లాంటి అనాగరిక చర్యలకి పాల్పడితే మొట్ట మొదట సంతోషించేది పాక్ టెర్రర్- ఆర్మీ వర్గాలే. వాళ్ళు చేస్తున్న పని కూడా ఇదే- కాకపోతే హతమారుస్తున్నారు. వాళ్ళ పనులు మనం చేసిపెడితే అంతకంటే వాళ్లకి కావాల్సిందేముంది? శత్రు దేశపు వాళ్ళయినా సాటి కళాకారుల్ని మర్యాదగా చెప్పి సాగనంపాలి. వాళ్ళు లేకపోతే బాలీవుడ్ కేం నష్టం లేదు. నిజానికి వాళ్ళుంటేనే సినిమాలు చూడాలంటే నేటివిటీకి అడ్డు.
ఇప్పుడు ఈ నెలలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ తో బాటు శ్రీదేవి- ఇకపైన ఏం చేస్తారో చూడాలి. అలీ జాఫర్ తమ్ముడు దన్యాల్ జాఫర్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమా ప్రకటించింది యష్ రాజ్ సంస్థ. శ్రీదేవి తనే నిర్మాతగా నటిగా, పాకిస్తానీ సీరియల్స్ నటి సజల్ అలీని పెట్టుకుని ‘మామ్’ అనే సినిమా తీస్తున్నారు. ఒకవైపు కేంద్రప్రభుత్వం పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలా అని ప్రతిరోజూ తర్జ నభర్జనలు పడుతోంటే, మరోవైపు బాలీవుడ్ పాకిస్తాన్ కళాకారులకి ఎలా అవకాశాలు కల్పించాలా అని మల్లగుల్లాలు పడుతోంది, శభాష్!
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in
Sunday, September 25, 2016
రివ్యూ:
రచన –
దర్శకత్వం : ప్రభు సాలమన్
తారాగణం: ధనుష్, కీర్తీ
సురేష్, గణేష్
వెంకట్రామన్, హరీష్
ఉత్తమన్, రాధా
రవి, తంబిరామయ్య
తదితరులు
సంగీతం: డి,
ఇమాన్, ఛాయాగ్రహణం: వెట్రివేల్ మహేంద్రన్
బ్యానర్:
ఆదిత్య
మూవీ కార్పొరేషన్, శ్రీ
పరమేశ్వరి రగ్న పిక్చర్స్
నిర్మాతలు : ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి
విడుదల:
సెప్టెంబరు
22, 2016
***
కొలవరివాలా ధనుష్ తో తమిళ దర్శకులు చేస్తున్న
ప్రయోగాలు బెడిసికొ డుతున్నాయి. వేలురాజ్ అనే రియలిస్టిక్ సినిమాల దర్శకుడు గత
సంవత్సరం ధనుష్ ని నిలువునా మాస్ క్యారక్టర్ లోకి దింపి ‘మాస్’ అంటూ తీస్తే అది
తెగ ఆర్ట్ ఫిలిమే అయింది. ఇప్పుడు ఇంకో ప్రేమ కథల దర్శకుడు ప్రభు సాలమన్ ధనుష్ ని
‘టైటానిక్’ లెవెల్ కి నిలువునా లేపి ‘రైల్’ అంటూ తీస్తే ఇది నాటు ఫిలిమే అయింది. ధనుష్
ఇంకో రెండు సినిమాలు షూటింగుల్లో వున్నాయి. అవేమవుతాయో మరి. ‘మాస్’ కి సీక్వెల్ గా ఇంకోటి కూడా ఎనౌన్స్ చేశారు. ఈ
మూడు సినిమాల రాకని వచ్చే సంవత్సరం తెలుగు ప్రేక్షకులు ధైర్యంగా కాచుకోవాలి తప్పదు!
ప్రేమ కథల స్పెషలిస్టు ప్రభు సాలమాన్ ‘రైల్’ అంటూ తీసిన ఈ డిజాస్టర్ జానర్ మూవీ ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే డిజాస్టర్ జానర్ మూవీ లాగే, ప్రేమ కథని చెప్పలేక పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులే కాదు, ప్రేమ కథలు కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్యలు చేసుకోగలవన్న కొత్త సత్యాన్ని పాతాళం లోంచి తవ్వి తీసి చూపెట్టింది.
టైటానిక్ లో పేద చిత్రకారుడు డీ కాప్రియో ఓడలో ప్రయాణిస్తున్న దొరసాని విన్ స్లెట్ ని ప్రేమిస్తే, క్యాటరింగ్ బాయ్ ధనుష్ వచ్చేసి రైల్లో ప్రయాణిస్తున్న దొరసాని సేవకురాలు కీర్తీ సురేష్ తో అడ్జెస్ట్ అయిపోయాడు. దర్శకుడు ప్రభు సాలమన్ కిది నచ్చలేదు. అందుకని ఇద్దరి ప్రేమ కథనీ నుజ్జు చేసి, వీడియో గేమ్ లా రైలాట ఆడుకోవడంలో పడిపోయాడు.
ఇలా దర్శకుడి వ్యసనం ప్రేక్షకుల వ్యసనం అవుతుందా?
కథ
క్యాటరింగ్
బాయ్ బల్లి శివాజీ (ధనుష్ పాత్ర పేరు తమిళంలో పూచియప్పన్, ఈ తెలుగు
డబ్బింగ్ లో ఇతర పాత్రలు బల్లీ అనే పిలుస్తాయి)
ఒక చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకుని చక్కగా జీవితం గడపాలని కలలు గంటూంటాడు. తోటి క్యాటరింగ్
బాయ్ (కరుణా కరణ్) తన కవితలతో ఆటలు పట్టిస్తూంటాడు. క్యాటరింగ్ మేనేజర్ చంద్రకాంత్
( తంబి రామయ్య) కి కూడా ఎవర్నైనా ప్రేమించాలని ఉబలాటంగా వుంటుంది. ఇలా
ప్రయాణిస్తున్న ఢిల్లీ- చెన్నై దురంతో
ఎక్స్ ప్రెస్ ట్రైను లో సినిమా హీరోయిన్ శిరీష కూడా ప్రయాణిస్తోందని తెలుస్తుంది.
ఆమెకి క్యాటరింగ్ చేయడానికి పోటీలు పడతారు. చివరికి కూపే లోకి ఆహార పదార్ధాలతో
బల్లి వెళ్లి- ఆ హీరోయిన్ మేకప్ టచప్ గర్ల్ సరోజ(కీర్తీ సురేష్) అని వుంటుంది-
చూడగానే ఆమెని ప్రేమించడం మొదలెడతాడు. ఆమె అస్సలు ఒప్పుకోదు. కానీ ఆమెకి పాటలిష్టమని
గ్రహించి, ఫోన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రితో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు
బల్లి. దీంతో ఆమె బల్లిలా అతుక్కుని - తనకి సింగర్ ని అవ్వాలని వుందని చెప్పి,
సిరివెన్నెలకి తనని పరిచయం చేసి రెహమాన్ దగ్గరికి వెళ్ళేలా చూడమని వెంటపడ్డం
మొదలెడుతుంది.
ఇలా సాగుతూండగా ఓ స్టేషన్ లో కేంద్ర మంత్రి (రాధారవి) ఈ రైలెక్కుతాడు. ఈ రోజుల్లో ఏ మంత్రి రైలెక్కుతాడు, ఏ హీరోయిన్ రైల్లో ప్రయాణిస్తుంది. మంత్రి వెంట ఇద్దరు ఎన్ ఎస్ జీ కమాండోలుంటారు. వాళ్ళల్లో నందకుమార్ ( హరీష్ ఉత్తమన్) అనే కమాండో ఏదో మానసిక సమస్యతో కర్కశంగా వుంటాడు. ఇతను చిన్న విషయానికే బల్లితో శత్రుత్వం పెంచుకుంటాడు. ఇంకో స్టేషన్లో కొందరు దొంగలు ఎక్కుతారు. ఇలా పోతూ పోతూ ట్రైను అసిస్టెంట్ డ్రైవర్ సీనియర్ డ్రైవర్ తో గొడవపడి ట్రైను మిస్సవుతాడు. వెళ్తున్న రైల్లో సీనియర్ డ్రైవర్ గుండె పోటుతో చచ్చి పోతాడు. స్పీడందుకుని ఎక్కడా ఆగకుండా దూసుకు పోతూంటుంది ట్రైను. దీన్నాపేదెవరు, ఎలా ఆపారు, బల్లి- సరోజలు ఏమయ్యారు, వాళ్ళ ప్రేమ ఏమయ్యింది మొదలైనవి తెలుసుకోవాలంటే ఈ ‘రైల్’ ఎక్కాల్సిందే.
ఎలావుంది కథ
2010
లో డెంజిల్ వాషింగ్టన్ నటించిన ‘అన్ స్టాపబుల్’ నుంచి స్ఫూర్తి పొంది నట్టుంది ఈ
కథ. అది గూడ్స్ రైలైతే ఇది ప్రయాణీకుల రైలు. అది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా
కథయితే, ఇది ఆ కథలోంచి పాయింటు ఎత్తుకున్న కల్పిత కథ. దీనికి ప్రేమ కథ అల్లారు.
సాధారణంగా ఇలాటి డిజాస్టర్ జానర్ కథల్ని ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిలో చెప్తారు :
ప్రేమ కథనే ప్రధానంగా చెప్పాలనుకుంటే ఇతర పాత్రల జీవితాల- కథల- ఉపకథల
జోలికెళ్ళకుండా- ‘టైటానిక్’ లోలాగా, కేవలం
ఆ ప్రేమ జంట ఏమవుతుందన్న దానిమీదే ఫోకస్ చేసి కథ నడిపిస్తారు. అప్పుడది ప్రమాదం
నేపధ్యంలో ప్రమాదంలో పడ్డ ప్రేమ కథగా –అదే ప్రధాన కథగా సాగుతుంది.
లేదంటే ప్రమాదాన్నే ప్రధాన కథగా నడిపించే పద్ధతిని అవలంబిస్తారు. అప్పుడిం దులో ఏ పాత్రకీ ఒక కథంటూ వుండదు. అన్ని పాత్రల కథా ఒక్కటే- ప్రమాదం- ఆ ప్రమాదంలోంచి బయటపడేందుకు ప్రయత్నించడం అయివుంటుంది, అంతే. హాలీవుడ్ లో పేరెన్నిక గన్న ‘పాసిడాన్ అడ్వెంచర్’, ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’ ఇలాంటివి. హిందీలో కూడా ‘బర్నింగ్ ట్రైన్’ అని వచ్చింది.
ప్రభు సాలమన్ ఈ రెండు విడి విడి పద్ధతుల్ని కలిపేసి గందరగోళం సృష్టించాడు. ప్రమాద కథ నేపధ్యంలో ప్రేమ కథని సృష్టించిన వాడు దాంతో సరిపెట్ట కుండా- దీని తర్వాత మళ్ళీ సినిమాలు తీసే ఛాన్సు దక్కక పోవచ్చు అన్నట్టు- లేనిపోని పాత్రలన్నిటి ఉపకథలు కూడా కలిపేసి – ‘టైటానిక్’ లో ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’ కూడా చూపించినట్టు అనితరసాధ్య సృష్టి చేశాడు.
ఒక కథ అనుకున్నప్పుడు ఇలాటి కథతో ఇతర సినిమా లెలా వచ్చాయని రీసెర్చి చేసి తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. రీసెర్చిని పాయింట్లు కాపీ కొట్టడం కోసమే చేస్తే ఎలా? ప్రయాణీకులు లేని గూడ్స్ రైలు కథ చూసి, దానికి ప్రయాణీకుల్ని జోడించి, తన కథగా మార్చుకుంటున్నప్పుడు - ప్రయాణీకుల కథల్లో కూడా పైన చెప్పుకున్నట్టు రెండు వెరైటీలు వేచి చూస్తూంటాయని కూడా తెలుసుకోవాలి. పాపం ప్రభు సాలలమన్ కోసం అంతగా వేచి చూస్తున్న రెండు వెరైటీలు లబోదిబోమన్నాయి- ఆయన అత్యాశకి పోయి రెండిటినీ చెరబట్టేసరికి. అవి బై వన్- గెట్ వన్ గా ఛస్తే వుండవు!
ఎవరెలా చేశారు
తనకి
మామగారు రజనీకాంత్ లాంటి ‘రోబో’ ఒక్కటి కూడా దొరకలేదని అలిగినట్టు- ఈ ‘రైలు’
కన్పించగానే దీన్నే రోబోగా ఫీలైపోయి
ఎక్కేసి వీరంగం వేశాడు ధనుష్. ఇప్పుడు తనకీ చెప్పుకోవడానికి ఒక ధనుష్ రోబో అంటూ దక్కింది.
100-120 స్పీడుతో వెళ్ళే రైలు టాపు పైన హీరోయిన్ తో డాన్సులూ, దొంగలతో ఫైట్లూ-
రైలు తగలబడుతున్నా కూడా టాపు మీద ఆనంద
విహారాలూ చేస్తాడు. ‘దిల్సే’ లోకూడా మణిరత్నం ట్రైను టాపు మీద ఛయ్య ఛయ్యా పాట
పెట్టారు. కానీ ఆ ట్రైను స్లోగా పోతూంటుంది పాట కోసమే అన్నట్టు. ధనుష్ ఫిజిక్ కి ఆ
ఎత్తున దూసుకుపోయే రైలు మీద క్లయిమాక్స్ వరకూ అదే పనిగా అన్ని విన్యాసాలు ఎలా
సాధ్యమో ప్రభువుకే తెలియాలి. బల్లి
కాబట్టి జారిపోయే, ఎగిరిపోయే లక్షణాలు లేవేమో?
రైలు లోపల ప్రేమిస్తున్నప్పుడు, కేటరింగ్ బాయ్ గా సర్వ్ చేస్తున్నప్పుడూ నవ్విస్తూ బాగానే వుంటాడు. కోపిష్టి కమాండోని ఆటలు పట్టిస్తూ కూడా బాగానే ఎంటర్ టైన్ చేస్తాడు. ఇంటర్వెల్ కి అరగంట ముందు దారితప్పడం మొదలెడతాడు కథతో బాటు (ఇంటర్వెల్ గంటన్నరకి పడుతుంది!). ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభమయ్యాక 18 నిమిషాల వరకూ కన్పించడు! ఒక హీరో ఇంత సేపు తెరమీద కన్పించకపోవడం ఇదే మొదటి సారేమో! ఆ తర్వాత వచ్చి ఏం చెయ్యాలో తెలీక టాపు మీదే వుండిపోతాడు.
హీరోయిన్ కీర్తీ సురేష్ చూడ్డానికి సింపుల్ గా బావుంది. ఆ పాత్రలో నటన కూడా ఫర్వాలేదు. పాడ రాకపోయినా, కనీసం గాత్ర శుద్ధి లేకపోయినా, సింగర్ నవుతానన్న నమ్మకంతో తన పేరు చిత్రా ఘోషల్ గా మార్చుకుని పాడతానని హీరోని భయపెట్టే సీన్లొక్కటే ఆమెకి రాణించాయి- రైలుకి ప్రమాదం మొదలయ్యాక ఆ పాటా లేదు, ప్రేమా లేదు.
కమెడియన్ తంబి రామయ్య , 2010లో ప్రభు సాలమన్ తీసిన ‘మైనా’ (ప్రేమఖైదీ) అనే హిట్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాగా అలరించాడు. అది ఈసారి ఓవరాక్టింగ్ వల్ల మిస్సయ్యింది. ఇంకో కమెడియన్ కరుణా కరణ్ ఫర్వాలేదు గానీ, కమాండోగా నటించిన మలయాళీ నటుడు హరీష్ ఉత్తమన్ కే సరైన పాత్రలేక వూరికే చచ్చిపోతాడు.
సంగీత దర్శకుడు ఇమాన్ మెలోడీ పాట లివ్వడానికి ప్రయత్నించాడు- ఈ గందరగోళపు సినిమాలో ఇవే కాసేపు రిలీఫ్ నిస్తాయేమో. మహేంద్రన్ ఛాయాగ్రహణం చెప్పుకో దగ్గది. సీజీ వర్క్స్ లో చెన్నై సెంట్రల్ ధ్వంసమయ్యే దృశ్యం మాత్రం హైలైట్.
చివరికేమిటి?
‘మైనా’,
‘కుమ్కీ’ లాంటి అద్భుత సినిమాలు తీసిన ప్రభు సాలమన్ ఆ తర్వాత టెక్నాలజీ మీద మోజు
పెంచుకుని ప్రేమ కథలని డిజాస్టర్ మూవీస్ జోన్ లోకి తోసేశాడు. 2014 లో సునామీ
నేపధ్యంలో సీజీ టెక్నాలజీని వాడుకుని ‘కాయల్’ అనే ప్రేమ కథ తీసి, మళ్ళీ ఇప్పుడు
అదే ఒరవడిలో ‘రైల్’ అనే ప్రేమ కథ తీశాడు.
ఈ ప్రమాద నేపధ్యాలతో కథ చెప్పడంలో తన సహజ శక్తిని కోల్పోయాడు. మూసఫార్ములాకి
మళ్లిపోయాడు. అతుకుల బొంతలా తీయడం మొదలెట్టాడు బిగ్ బడ్జెట్స్ కెళ్ళి.
బిగ్ బడ్జెట్ సినిమా అంటే బోలెడుమంది నటులతో భారీ కథ అని కాదు. బిగ్ బడ్జెట్ సినిమా అంటే భారీహంగులతో కూడిన సింపుల్ కథ. ‘భారతీయుడు’ నుంచీ ‘సింహా’ వరకూ ఇలాగే వుంటాయి. ప్రభు సాలమన్ నడుస్తున్న రైల్లో నడుస్తున్న ప్రేమ కథ మీద దృష్టి పెట్టకుండా- ఫస్టాఫ్ గంటన్నర పాటు సహనాన్ని పరీక్షిస్తాడు. లవ్ ట్రాక్ నడుస్తూండగా దీనికి ట్విస్ట్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూంటే, గంట సేపటికి కేంద్ర మంత్రి ఎంటరై, అతడి కమాండో తో ప్రేమకథకి ఏదో పాయింటు ఎస్టాభ్లిష్ అవుతుందని ఆశిస్తాం, ఇంతే కదా? లేకపోతే విలన్లా కొత్త పాత్ర రావడమెందుకు? అది జరగదు. అంతలో మంత్రిని ఎవరో కాల్చి చంపుతారు. పోనీ ఇదే కథవుతుందేమో అనుకుంటాం. ఇదీ జరగదు. గన్ పోయిందని కమాండో కంగారు పడుతూంటాడు. మంత్రి పిల్చి ఆ గన్ మోహన పడేసి, ఎక్కడ పడితే అక్కడ పారేసుకోకని తిడతాడు- అంటే మంత్రి హత్య జరగడం కమాండో ఇమాజినేషన్ అన్న మాట! ఈ సమయంలో ప్రేక్షకుల్ని ఇలా చీట్ చేస్తారా? దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎలా చెప్పాలనుకుంటున్నాడు?
ఇంతలో రైల్లో టెర్రరిస్టులా ఒక అనుమానాస్పద వ్యక్తి ఎక్కుతాడు. సరే, వీడితో ట్విస్ట్ వస్తుందనుకుంటాం- ఇదీ జరగదు. సెకండాఫ్ లో వీడితో పాటు వున్న దొంగలు దోపిడీకి పాల్పడతారట. హీరోకీ కమాండోకీ కొట్లాట వచ్చి హీరోని ఒక కూపేలో బంధించేస్తాడు కమాండో. హీరో బందీ అయిపోతే కథ నెవరు నడుపుతారు. అప్పుడు ఒక బర్రె కథకి ట్విస్టు ఇచ్చి ఇంటర్వెల్ నిస్తుంది. బర్రె గుద్దుకుని రైలాగి పోవడంతో, ఇంకో పెద్ద గొడవ మొదలవుతుంది- తాగుబోతు అసిస్టెంట్ డ్రైవర్ సీనియర్ తో గొడవ పెట్టుకుంటాడు. జీడిపాకంలా వీళ్ళ గొడవే సాగుతూంటుంది. సాగిసాగి చివరికి అసిస్టెంటూ గార్డూ గల్లా గల్లా పట్టుకుని కుస్తీ పట్లు పడుతూంటే, వాళ్ళని వదిలి పారేసి సీనియర్ డ్రైవర్ రైలుని లాగించేస్తాడు. కొంత దూరంలో ఎవరూ ఆపకుండానే తన గుండాగిపోయి చచ్చిపోతాడు. ఇక రైలూ, రైలుతో బాటు కథా, కథతో బాటూ మనమూ ఇంటర్వెల్ అనే ఘోరమైన గోతిలో పడతాం!
సింపుల్ గా తాగుబోతు అసిస్టెంట్ తాగి పడిపోయాడు, డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో పోయాడు- దిక్కుమాలిన కథకి రైలు దైవాధీనమైంది అంటే సరిపోదా? ఈ బర్రె లేంటి, కుస్తీ పోటీ లేంటి, బూతు లేంటీ, పావు గంట సేపు బుర్ర తినెయ్యడ మేంటీ, హీరోగారు షాట్ గ్యాప్ లో కారవాన్ లో కూర్చున్నట్టు- కూపేలో బందీ అయిపోయి సినిమాని గాలికి వదిలెయ్యడ మేంటీ?
సెకండాఫ్ 18 నిమిషాలవరకూ హీరో గారు కన్పించనే కన్పించరు. కన్పించాక కూపే లోంచి బయటపడి- రైలు ఎందుకిలా పోతోందో తెలుసుకోడు. అసలు ఫీల్ కాడు. టాపెక్కి పాటలూ ఫైట్లూ వేసుకుంటాడు. పొలోమని ఇంకిన్ని పాత్రలు సబ్ ప్లాట్స్ వేసుకుని వచ్చేస్తాయి.రైలాపడానికి హీరో కాకుండా రకరకాల రైల్వే అధికారులు, పోలీసు అధికారులు, ఎన్ ఎస్ జీ కమాండోలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళూ, మీడియా వాళ్ళూ దిగిపోయి కథని పంచేసుకుని ఇష్టా రాజ్యం చేస్తారు, అందరిదీ ఒకటే కంగారు- రైలుని టెర్రరిస్టులు హైజాక్ చేశారని లాజిక్ లేని ప్రహసనాలకి హాస్యాస్పదంగా తెర తీస్తారు. ఒక ఛానెల్ యాంకర్ రెండేసి సీన్ల కోసారి రాజకీయ నేతల్ని కూర్చో బెట్టుకుని చర్చ మొదలెడతాడు ఈ హైజాక్ మీద. లైవ్ ఇస్తూ రెచ్చిపోతాడు. అంత స్పీడుతో పోతున్న రైల్లో ఏం జరుగుతోందో కార్లో వెంటాడుతూ రిపోర్టర్ లైవ్ ఇస్తోందట! రైలు కట్ట పక్కనే చెన్నై దాకా సాఫీగా రోడ్డు వేశారేమో రైలుని వెంటాడ్డానికి...
డ్రైవర్ చనిపోయి రైలుకీ పరిస్థితి వచ్చిందని చివరి దృశ్యాల్లోనే హీరో తెలుసుకుంటాడు! అంతటి అమోఘమైన పాసివ్ పాత్ర. ఇలా ధనుష్- ప్రభు సాలమన్ లు రకరకాల పాత్రల ఉపకథలతో ప్రేమ కథని ఇంటర్వెల్ లోపే చంపేసి, ధనుష్ బల్లి పాత్రని కూడా బలి చేసి, రైలుతో రోబోటాడుకుని వదిలేశారు!
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in
Subscribe to:
Posts (Atom)