రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

రచన - దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌
తారాగణం: రామ్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, మురళీశర్మ, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, హేమ, ప్రియ, ప్రభాస్‌ శ్రీను తదితరులు.
మాటలు: అబ్బూరి రవి సంగీతం: జిబ్రాన్‌ చాయా గ్రహణం: సమీర్‌రెడ్డి,
నిర్మాణ సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌సుంకర
విడుదల : సెప్టెంబర్ 30, 2016
***


         
కైనెటిక్ స్టార్ రామ్ మళ్ళీ తన మాస్ మసాలా వ్యామోహంతో ఆ వర్గ ప్రేక్షకులకోసం ‘హైపర్’ అంటూ వచ్చేశాడు. రామ్ తో ‘కందిరీగ’  తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సారి రామ్ తో తండ్రీ కొడుకుల అనుబంధంతో  మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చనుకున్నాడు. ఇద్దరూ కలిసి మాస్ కోసం ఏమేమో చేసుకుంటూ పోయారు. ఇన్ని చేసినా  ఎంత నిబద్ధతతో చేశారో ఈ  కింద చూద్దాం. 

కథ 

        బీటెక్ చదివిన సూరి (రామ్) ఫ్రెండ్స్ తో ఆవారాగా తిరుగుతూంటాడు. వెనకనుంచి ఓ అమ్మాయి( రాశీ ఖన్నా) నడుం చూసి ఆమె ప్రేమలో పడిపోయి, అమ్మాయిల బ్యాక్ లు చూస్తూ ఆమెకోసం వెతుకుతూంటాడు. ఇతడికి తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే ఇ తడి మాటల్లోనే ‘పిచ్చ ప్రేమ’. ఆ ప్రేమతో తండ్రి కోసం ఏమైనా చేస్తాడు. భవంతుల నిర్మాణాలకి  అనుమతులిచ్చే శాఖలో పనిచేస్తూంటాడు తండ్రి.  తండ్రి తో బాటు ఓ తల్లీ చెల్లెలూ వుంటారు సూరికి. ఓ రోజు తండ్రిని ఓ రోడ్డు ప్రమాదం నుంచి కాపాడతాడు గజ (మురళీ శర్మ) అనే గూండా. దీంతో సూరి గజ వెంటపడి వాడికోసం ఏ పనైనా  చేసేస్తూంటాడు. సూరీ గజా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మంత్రి రాజప్ప  ( రావురమేష్) కట్టబోయే ఓ పెద్ద కాంప్లెక్స్ నిర్మాణపు  ఫైలు తండ్రి దగ్గరి కొస్తుంది. అది సక్రమంగా లేదని సంతకం పెట్టనంటాడు సూరి తండ్రి. రాజప్ప గజకి పురమాయించి వెళ్ళిపోతాడు. నారాయణ మూర్తి సూరి తండ్రి అని తెలియక బెదిరిస్తూంటాడు గజ. తర్వాత తెలుసుకుని చేతులెత్తేస్తే, మళ్ళీ మంత్రి రాజప్ప రంగంలోకి దిగుతాడు. వీళ్ళ కుట్ర తెలిసిపోయిన సూరి,  రాజప్ప చేతే అతడి రాజీనామా లేఖ మీద సంతకం పెట్టిస్తానని ఛాలెంజి చేస్తాడు. ఈ ఛాలెంజిగా  సాగేదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
        ఇడ్లీ బండీవాడు రోజూ ఇడ్లీలే వేస్తూంటే జనాలు తినడం లేదూ? అలాగే ఇడ్లీలూ సినిమాలూ ఒకటేనని భావించుకుని చూసేసే మొహం మొత్తని జనాలకోసం అన్నట్టు వుంది ఈ రొడ్ద కొట్టుడు రొటీన్ కథ. టాలీవుడ్ ని ‘ఇడ్లీవుడ్’ గా వుంచేస్తూ తన వంతు కూడా కృషిచేస్తున్న స్టైలిష్ కైనెటిక్ స్టార్ రామ్ ని అభినందిస్తూ, కలకాలం తను ఇలాగే కొనసాగాలని కోరుకోవాలన్నంత ‘పిచ్చపిచ్చ’ గా వుందీ కథ. ఇందులో ‘హైపర్’ గా ఏముందో వెతుక్కోలేనంత భారీ ప్యాకేజీతో వుందీ కథ. ఈ ప్యాకేజీలో స్టోరీ పాయింటు వచ్చేసి ‘జనతా గ్యారేజ్’ మున్సిపల్ ఆఫీసు సీనుగానూ, హీరో వచ్చేసి విలన్ ని ప్రేమించే ‘జక్కన్న’ టైపు క్యారక్టర్ గానూ, ఇక  క్లయిమాక్స్ వచ్చేసి టీవీ ఛానెల్స్ తో ‘రేసుగుర్రం’ మార్కు క్లయిమాక్స్ గానూ వుండేసి-  చూసిందే చూడమని- పనిలోపనిగా - ప్రభుత్వోద్యోగులకి ఓ ప్రభోదాత్మక సందేశమిచ్చే  సెమీ- నారాయణమూర్తి కథలాగానూ వుంది. 

ఎవరెలా చేశారు 
      కైనెటిక్ స్టార్ రామ్ 4 - జి కాలంలో ఇంకా 2- జి సినిమాల దగ్గరే ఆగిపోవడం చాలా ఆశ్చర్యం కల్గించే విషయం. సినిమాలెప్పుడూ ఇంకా 1-జి,  2- జిలు గానే వుంటాయను కోవడం విచారకరం. సరే, ఈ పాతచింతకాయ  మూస మాస్ కథనైనా, పాత్రనైనా, కాస్త చూడబుల్ గా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా ఆలోచించకపోవడం అన్నిటికన్నా విషాదం. చాలా సింపుల్ గా, అదే సమయంలో బలంగానూ చెప్పే అవకాశమున్న కథని, పాత్రనీ  ఏమేమో చేసి ఏదేదో చేసి బుర్ర తినేస్తే ఎలా? తండ్రిని పిచ్చగా ప్రేమించడమనే పాయింటు తనకి  ఆకర్షణీయంగా కన్పించినంత మాత్రాన మిగతా అంశాలూ ఆకర్షణీయంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం లేదా?  ఇంతా  చేసి క్లయిమాక్స్ ని ప్రారంభించింది కూడా ఒక హీరో పాత్రగా తను కాకపోతే ఎలా?  హీరోయిన్ తో చాలా బోరు కొట్టే ప్రేమలో పడేసే సీన్లు రొటీన్ ఇడ్లీ కల్చర్ లో భాగమే అనుకుందాం, ఆ ఇడ్లీలో మినపప్పు కూడా వేయరా?  ఇలా 5-జి ఇడ్లీలు తయారు చేద్దామనుకుంటున్నారా?

          హీరోయిన్ రాశీ ఖన్నా ని ఆ పాత్రలో చూస్తే చాలా జాలేస్తుంది. ముందు అమాయకంగా వుండే తను తర్వాత రామ్ కంటే హైపర్ గా మారిపోతుంది. సడెన్ గా ఈ మార్పు  ఒవర్ యాక్షన్ లాగా వుంటుంది. కానీ మాస్ కోసం ఈ సినిమా కాబట్టి ఎలా వున్నా అదే వరమని  చూసేస్తారు తప్పదు.

          తండ్రి పాత్ర సత్య రాజ్ ది  ఏకపక్ష వ్యవహారమే. తనని అంత  ప్రేమించి, తన కోసం అంత చేసే కొడుక్కి ఏమీ ఇచ్చినట్టు కన్పించడు. తండ్రీ కొడుకుల అనుబంధం- మధ్యలో విలన్ తో సమస్య- ఆ సమస్యని తీర్చడం అని సింపుల్ గా ఉండాల్సిన పాయింటులోకి ఎన్నెన్నో విషయాలు, ఉపకథలూ, ఒకడి మీద ఇంకో విలన్ పాత్రలూ పెట్టేసి గందరగోళం సృష్టించడంతో సత్యరాజ్- రామ్ ల బాండింగ్ గల్లంతయి పోయింది. కనీసం వాళ్ళిద్దరి మీద ఒక పాట పెట్టినప్పుడే కదా ఆ అనుబంధమైనా బలంగా నాటుకునేది. తండ్రీ కొడుకుల మీద పాట ప్రేక్షకులు ఒప్పుకోరనా? 

          ఒకటో విలన్ గా మురళీ శర్మ, రెండో కృష్ణుడు రెండో విలన్ గా, మంత్రిగా రావురమేష్, రెండో నంబర్ మంత్రి గా జయప్రకాష్ రెడ్డి, ముఖ్యమంత్రిగా విశ్వనాథ్, ఇంకా సత్యరాజ్ పైన ఒకటో నంబర్ ఆఫీసర్ గా సాయాజీ షిండే తదితరుల సోపానక్రమం క్రమంగా బలహీనపడి పోతుంది కథలో.

          మలయాళ సంగీత దర్శకుడు జిబ్రాన్ తెలుగుపాటలు కుదరలేదు- ఒక్క చివరి టైటిల్ సాంగ్ తప్ప. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం హైపర్ గా ఏమీ లేదు. ‘హైపర్’ టైటిల్ కి తగ్గట్టుగా స్టయిలిష్ గా ఏమీ తీయలేదు.

చివరికేమిటి?
       ‘కందిరీగ’ తో సెకండాఫ్ సిండ్రోమ్ ని  అంత బాగా అధిగమించగల్గిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత  ‘రభస’ తో, మళ్ళీ ఇప్పుడు ‘హైపర్’  తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేదొకటుంటుందని పూర్తిగా మర్చిపోయినట్టుంది.  తూర్పుకి తిరిగి రోడ్డు వేసుకుంటూ పోతూంటే  బెజవాడకి  రూటు అదే పడుతుందన్నట్టు, ఏమేమో సీన్లు వేసుకుంటూ పోయారు. అనవసర సీన్లు వేసుకుంటూ పోయారు. బలహీనంగా,  హీరోని పాసివ్ గా మార్చేసే సీన్లు  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమర్చుకుంటూ పోయారు- ఈ అమరికలో మాటల  రచయిత పాత్ర  కూడా ఉందేమో తెలీదు. ఈ కథ మొత్తాన్నీ పరిశీలిస్తే హీరో కిడ్నాపయ్యే సీను ప్లాట్ పాయింట్ వన్ గా పెట్టుకోవాలి. అంటే హీరో తండ్రి మీద విలన్ వొత్తిడి తెచ్చే క్రమమంతా ఈ లోపే అరగంటలో ముగిసిపోవాలి. ఆ తర్వాత హీరో కాబోయే బావని కిడ్నాప్ చేసి- హీరోని తండ్రి నుంచి విడగొట్టే మెయిన్ విలన్ అయిన మంత్రి కుట్ర తో ఇంటర్వెల్ రావాలి. ఈ టైమింగ్స్ తో ఈ రెండు మూలస్థంభాల  ఆధారంగా ఈ మొత్తం కథా  నడిపివుంటే- కేవలం సంతకం చుట్టూ కథ అని కాకుండా, సంతకం చెయ్యని కారణంగా భౌతికంగా ఇంకేదో భారీ నష్టం కూడా చూపించి వుంటే -  ఇడ్లీ కథయినా చూడబుల్ గా వుండేది! 


-సికిందర్
http://www.cinemabazaar.in