రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, September 25, 2016

రివ్యూ:










రచన – దర్శకత్వం : ప్రభు సాలమన్

తారాగణం: ధనుష్‌, కీర్తీ సురేష్‌, గణేష్‌ వెంకట్రామన్‌, హరీష్‌ ఉత్తమన్‌, రాధా రవి, తంబిరామయ్య తదితరులు
సంగీతం: డి, ఇమాన్,  ఛాయాగ్రహణం: వెట్రివేల్‌ మహేంద్రన్‌
బ్యానర్‌:  ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌
నిర్మాతలు : ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి
విడుదల: సెప్టెంబరు 22, 2016
***

          కొలవరివాలా ధనుష్ తో తమిళ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు బెడిసికొ డుతున్నాయి. వేలురాజ్ అనే రియలిస్టిక్ సినిమాల దర్శకుడు గత సంవత్సరం ధనుష్ ని నిలువునా మాస్ క్యారక్టర్ లోకి దింపి ‘మాస్’ అంటూ తీస్తే అది తెగ ఆర్ట్ ఫిలిమే అయింది. ఇప్పుడు ఇంకో ప్రేమ కథల దర్శకుడు ప్రభు సాలమన్ ధనుష్ ని ‘టైటానిక్’ లెవెల్ కి నిలువునా లేపి ‘రైల్’ అంటూ తీస్తే ఇది నాటు ఫిలిమే అయింది. ధనుష్ ఇంకో రెండు సినిమాలు షూటింగుల్లో వున్నాయి. అవేమవుతాయో మరి. ‘మాస్’ కి  సీక్వెల్ గా ఇంకోటి కూడా ఎనౌన్స్ చేశారు. ఈ మూడు సినిమాల రాకని వచ్చే సంవత్సరం తెలుగు ప్రేక్షకులు ధైర్యంగా కాచుకోవాలి తప్పదు! 

          ప్రేమ కథల స్పెషలిస్టు ప్రభు సాలమాన్ ‘రైల్’ అంటూ తీసిన ఈ డిజాస్టర్ జానర్ మూవీ ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే డిజాస్టర్ జానర్ మూవీ లాగే,  ప్రేమ కథని చెప్పలేక పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులే  కాదు, ప్రేమ కథలు కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్యలు చేసుకోగలవన్న కొత్త సత్యాన్ని పాతాళం లోంచి తవ్వి తీసి చూపెట్టింది.
        టైటానిక్ లో పేద చిత్రకారుడు  డీ కాప్రియో ఓడలో ప్రయాణిస్తున్న దొరసాని విన్ స్లెట్ ని ప్రేమిస్తే, క్యాటరింగ్ బాయ్ ధనుష్ వచ్చేసి రైల్లో ప్రయాణిస్తున్న దొరసాని సేవకురాలు కీర్తీ సురేష్ తో అడ్జెస్ట్ అయిపోయాడు. దర్శకుడు ప్రభు సాలమన్ కిది నచ్చలేదు. అందుకని ఇద్దరి ప్రేమ కథనీ నుజ్జు చేసి, వీడియో గేమ్ లా రైలాట ఆడుకోవడంలో పడిపోయాడు.
        ఇలా దర్శకుడి వ్యసనం  ప్రేక్షకుల వ్యసనం అవుతుందా?

కథ 
      క్యాటరింగ్  బాయ్ బల్లి శివాజీ (ధనుష్  పాత్ర పేరు తమిళంలో పూచియప్పన్, ఈ తెలుగు డబ్బింగ్ లో ఇతర పాత్రలు బల్లీ  అనే పిలుస్తాయి) ఒక చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకుని చక్కగా జీవితం గడపాలని కలలు గంటూంటాడు. తోటి క్యాటరింగ్ బాయ్ (కరుణా కరణ్) తన కవితలతో ఆటలు పట్టిస్తూంటాడు. క్యాటరింగ్ మేనేజర్ చంద్రకాంత్ ( తంబి రామయ్య) కి కూడా ఎవర్నైనా ప్రేమించాలని ఉబలాటంగా వుంటుంది. ఇలా ప్రయాణిస్తున్న ఢిల్లీ- చెన్నై  దురంతో ఎక్స్ ప్రెస్ ట్రైను లో సినిమా హీరోయిన్ శిరీష కూడా ప్రయాణిస్తోందని తెలుస్తుంది. ఆమెకి క్యాటరింగ్ చేయడానికి పోటీలు పడతారు. చివరికి కూపే లోకి ఆహార పదార్ధాలతో బల్లి వెళ్లి- ఆ హీరోయిన్ మేకప్ టచప్ గర్ల్ సరోజ(కీర్తీ సురేష్) అని వుంటుంది- చూడగానే ఆమెని ప్రేమించడం మొదలెడతాడు. ఆమె అస్సలు ఒప్పుకోదు. కానీ ఆమెకి పాటలిష్టమని గ్రహించి, ఫోన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రితో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు బల్లి. దీంతో ఆమె బల్లిలా అతుక్కుని - తనకి సింగర్ ని అవ్వాలని వుందని చెప్పి, సిరివెన్నెలకి తనని పరిచయం చేసి రెహమాన్ దగ్గరికి వెళ్ళేలా చూడమని వెంటపడ్డం మొదలెడుతుంది. 

        ఇలా సాగుతూండగా ఓ  స్టేషన్ లో కేంద్ర మంత్రి (రాధారవి) ఈ రైలెక్కుతాడు. ఈ రోజుల్లో ఏ మంత్రి  రైలెక్కుతాడు, ఏ హీరోయిన్ రైల్లో ప్రయాణిస్తుంది. మంత్రి వెంట ఇద్దరు ఎన్ ఎస్ జీ కమాండోలుంటారు.  వాళ్ళల్లో నందకుమార్ ( హరీష్ ఉత్తమన్) అనే కమాండో  ఏదో మానసిక సమస్యతో కర్కశంగా వుంటాడు. ఇతను చిన్న విషయానికే బల్లితో శత్రుత్వం పెంచుకుంటాడు. ఇంకో స్టేషన్లో  కొందరు దొంగలు ఎక్కుతారు. ఇలా పోతూ పోతూ ట్రైను అసిస్టెంట్ డ్రైవర్ సీనియర్ డ్రైవర్ తో గొడవపడి ట్రైను మిస్సవుతాడు. వెళ్తున్న రైల్లో సీనియర్ డ్రైవర్ గుండె పోటుతో చచ్చి పోతాడు. స్పీడందుకుని ఎక్కడా ఆగకుండా దూసుకు పోతూంటుంది ట్రైను. దీన్నాపేదెవరు, ఎలా ఆపారు, బల్లి- సరోజలు ఏమయ్యారు, వాళ్ళ ప్రేమ ఏమయ్యింది మొదలైనవి తెలుసుకోవాలంటే ఈ ‘రైల్’ ఎక్కాల్సిందే. 

ఎలావుంది కథ 
      2010 లో డెంజిల్ వాషింగ్టన్ నటించిన ‘అన్ స్టాపబుల్’ నుంచి స్ఫూర్తి పొంది నట్టుంది ఈ కథ. అది గూడ్స్ రైలైతే ఇది ప్రయాణీకుల రైలు. అది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా కథయితే, ఇది ఆ కథలోంచి పాయింటు ఎత్తుకున్న కల్పిత కథ. దీనికి ప్రేమ కథ అల్లారు. సాధారణంగా ఇలాటి డిజాస్టర్ జానర్ కథల్ని ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిలో చెప్తారు : ప్రేమ కథనే ప్రధానంగా చెప్పాలనుకుంటే ఇతర పాత్రల జీవితాల- కథల- ఉపకథల జోలికెళ్ళకుండా- ‘టైటానిక్’ లోలాగా,  కేవలం ఆ ప్రేమ జంట ఏమవుతుందన్న దానిమీదే ఫోకస్ చేసి కథ నడిపిస్తారు. అప్పుడది ప్రమాదం నేపధ్యంలో ప్రమాదంలో పడ్డ ప్రేమ కథగా –అదే ప్రధాన కథగా సాగుతుంది. 

        లేదంటే ప్రమాదాన్నే ప్రధాన కథగా నడిపించే పద్ధతిని అవలంబిస్తారు. అప్పుడిం దులో ఏ పాత్రకీ ఒక కథంటూ వుండదు. అన్ని పాత్రల కథా ఒక్కటే- ప్రమాదం- ఆ ప్రమాదంలోంచి బయటపడేందుకు ప్రయత్నించడం అయివుంటుంది, అంతే.  హాలీవుడ్ లో పేరెన్నిక గన్న ‘పాసిడాన్ అడ్వెంచర్’, ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’  ఇలాంటివి. హిందీలో కూడా  ‘బర్నింగ్ ట్రైన్’ అని వచ్చింది. 

        ప్రభు సాలమన్ ఈ రెండు విడి విడి పద్ధతుల్ని కలిపేసి గందరగోళం సృష్టించాడు. ప్రమాద కథ నేపధ్యంలో ప్రేమ కథని సృష్టించిన వాడు దాంతో సరిపెట్ట కుండా- దీని తర్వాత మళ్ళీ సినిమాలు తీసే ఛాన్సు దక్కక పోవచ్చు అన్నట్టు- లేనిపోని పాత్రలన్నిటి ఉపకథలు కూడా కలిపేసి – ‘టైటానిక్’ లో ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’  కూడా చూపించినట్టు అనితరసాధ్య సృష్టి చేశాడు. 

        ఒక కథ అనుకున్నప్పుడు  ఇలాటి కథతో ఇతర సినిమా లెలా వచ్చాయని రీసెర్చి చేసి తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. రీసెర్చిని పాయింట్లు కాపీ కొట్టడం కోసమే చేస్తే ఎలా? ప్రయాణీకులు లేని గూడ్స్ రైలు కథ చూసి, దానికి ప్రయాణీకుల్ని జోడించి, తన కథగా మార్చుకుంటున్నప్పుడు - ప్రయాణీకుల కథల్లో కూడా పైన చెప్పుకున్నట్టు రెండు వెరైటీలు వేచి చూస్తూంటాయని కూడా తెలుసుకోవాలి. పాపం ప్రభు సాలలమన్ కోసం అంతగా వేచి చూస్తున్న రెండు వెరైటీలు లబోదిబోమన్నాయి-  ఆయన  అత్యాశకి పోయి రెండిటినీ చెరబట్టేసరికి. అవి బై వన్- గెట్ వన్ గా ఛస్తే వుండవు!

ఎవరెలా చేశారు 
      నకి మామగారు రజనీకాంత్ లాంటి ‘రోబో’ ఒక్కటి కూడా దొరకలేదని అలిగినట్టు- ఈ ‘రైలు’ కన్పించగానే దీన్నే  రోబోగా ఫీలైపోయి ఎక్కేసి వీరంగం వేశాడు ధనుష్. ఇప్పుడు తనకీ చెప్పుకోవడానికి ఒక ధనుష్ రోబో అంటూ దక్కింది. 100-120 స్పీడుతో వెళ్ళే రైలు టాపు పైన హీరోయిన్ తో డాన్సులూ, దొంగలతో ఫైట్లూ- రైలు తగలబడుతున్నా కూడా  టాపు మీద ఆనంద విహారాలూ చేస్తాడు. ‘దిల్సే’ లోకూడా మణిరత్నం ట్రైను టాపు మీద ఛయ్య ఛయ్యా పాట పెట్టారు. కానీ ఆ ట్రైను స్లోగా పోతూంటుంది పాట కోసమే అన్నట్టు. ధనుష్ ఫిజిక్ కి ఆ ఎత్తున దూసుకుపోయే రైలు మీద క్లయిమాక్స్ వరకూ అదే పనిగా అన్ని విన్యాసాలు ఎలా సాధ్యమో  ప్రభువుకే తెలియాలి. బల్లి కాబట్టి జారిపోయే, ఎగిరిపోయే లక్షణాలు లేవేమో? 

        రైలు లోపల ప్రేమిస్తున్నప్పుడు, కేటరింగ్ బాయ్ గా సర్వ్ చేస్తున్నప్పుడూ  నవ్విస్తూ బాగానే వుంటాడు. కోపిష్టి కమాండోని ఆటలు పట్టిస్తూ కూడా బాగానే ఎంటర్ టైన్ చేస్తాడు. ఇంటర్వెల్ కి అరగంట ముందు దారితప్పడం మొదలెడతాడు కథతో బాటు (ఇంటర్వెల్ గంటన్నరకి పడుతుంది!). ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభమయ్యాక 18  నిమిషాల వరకూ కన్పించడు! ఒక హీరో ఇంత సేపు తెరమీద కన్పించకపోవడం ఇదే మొదటి సారేమో! ఆ తర్వాత వచ్చి ఏం చెయ్యాలో తెలీక టాపు మీదే వుండిపోతాడు. 

        హీరోయిన్ కీర్తీ సురేష్ చూడ్డానికి సింపుల్ గా బావుంది. ఆ పాత్రలో నటన కూడా ఫర్వాలేదు. పాడ రాకపోయినా, కనీసం గాత్ర శుద్ధి లేకపోయినా, సింగర్ నవుతానన్న నమ్మకంతో తన పేరు చిత్రా ఘోషల్ గా మార్చుకుని పాడతానని హీరోని భయపెట్టే సీన్లొక్కటే ఆమెకి రాణించాయి- రైలుకి ప్రమాదం మొదలయ్యాక ఆ పాటా లేదు, ప్రేమా లేదు. 

        కమెడియన్ తంబి రామయ్య , 2010లో ప్రభు సాలమన్ తీసిన ‘మైనా’ (ప్రేమఖైదీ) అనే హిట్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాగా అలరించాడు. అది ఈసారి ఓవరాక్టింగ్ వల్ల మిస్సయ్యింది. ఇంకో కమెడియన్ కరుణా కరణ్ ఫర్వాలేదు గానీ, కమాండోగా నటించిన మలయాళీ నటుడు హరీష్ ఉత్తమన్ కే సరైన పాత్రలేక వూరికే చచ్చిపోతాడు.

         సంగీత దర్శకుడు ఇమాన్ మెలోడీ పాట లివ్వడానికి ప్రయత్నించాడు-  ఈ గందరగోళపు సినిమాలో ఇవే కాసేపు రిలీఫ్ నిస్తాయేమో. మహేంద్రన్ ఛాయాగ్రహణం చెప్పుకో దగ్గది. సీజీ వర్క్స్ లో చెన్నై సెంట్రల్ ధ్వంసమయ్యే  దృశ్యం మాత్రం హైలైట్. 

చివరికేమిటి?
      ‘మైనా’, ‘కుమ్కీ’ లాంటి అద్భుత సినిమాలు తీసిన ప్రభు సాలమన్ ఆ తర్వాత టెక్నాలజీ మీద మోజు పెంచుకుని ప్రేమ కథలని డిజాస్టర్ మూవీస్ జోన్ లోకి తోసేశాడు. 2014 లో సునామీ నేపధ్యంలో సీజీ టెక్నాలజీని వాడుకుని ‘కాయల్’ అనే ప్రేమ కథ తీసి, మళ్ళీ ఇప్పుడు అదే  ఒరవడిలో ‘రైల్’ అనే ప్రేమ కథ తీశాడు. ఈ ప్రమాద నేపధ్యాలతో కథ చెప్పడంలో తన సహజ శక్తిని కోల్పోయాడు. మూసఫార్ములాకి మళ్లిపోయాడు. అతుకుల బొంతలా తీయడం మొదలెట్టాడు బిగ్ బడ్జెట్స్ కెళ్ళి. 

        బిగ్ బడ్జెట్ సినిమా అంటే బోలెడుమంది నటులతో భారీ కథ అని కాదు. బిగ్ బడ్జెట్ సినిమా అంటే భారీహంగులతో కూడిన సింపుల్ కథ. ‘భారతీయుడు’ నుంచీ ‘సింహా’ వరకూ ఇలాగే వుంటాయి. ప్రభు సాలమన్ నడుస్తున్న రైల్లో నడుస్తున్న ప్రేమ కథ మీద దృష్టి పెట్టకుండా- ఫస్టాఫ్ గంటన్నర పాటు సహనాన్ని పరీక్షిస్తాడు. లవ్ ట్రాక్ నడుస్తూండగా దీనికి ట్విస్ట్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూంటే, గంట సేపటికి కేంద్ర మంత్రి ఎంటరై, అతడి కమాండో తో ప్రేమకథకి ఏదో పాయింటు ఎస్టాభ్లిష్ అవుతుందని ఆశిస్తాం, ఇంతే కదా? లేకపోతే విలన్లా కొత్త పాత్ర రావడమెందుకు? అది జరగదు. అంతలో మంత్రిని ఎవరో కాల్చి చంపుతారు. పోనీ ఇదే కథవుతుందేమో అనుకుంటాం. ఇదీ జరగదు. గన్ పోయిందని కమాండో కంగారు పడుతూంటాడు. మంత్రి పిల్చి ఆ గన్  మోహన పడేసి, ఎక్కడ పడితే అక్కడ పారేసుకోకని తిడతాడు- అంటే మంత్రి హత్య జరగడం కమాండో ఇమాజినేషన్ అన్న మాట! ఈ సమయంలో ప్రేక్షకుల్ని ఇలా చీట్ చేస్తారా? దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎలా చెప్పాలనుకుంటున్నాడు?

        ఇంతలో రైల్లో టెర్రరిస్టులా ఒక అనుమానాస్పద వ్యక్తి ఎక్కుతాడు. సరే, వీడితో ట్విస్ట్ వస్తుందనుకుంటాం- ఇదీ జరగదు. సెకండాఫ్ లో వీడితో పాటు వున్న దొంగలు దోపిడీకి పాల్పడతారట. హీరోకీ కమాండోకీ కొట్లాట వచ్చి హీరోని ఒక కూపేలో బంధించేస్తాడు కమాండో. హీరో బందీ అయిపోతే కథ నెవరు నడుపుతారు. అప్పుడు ఒక బర్రె కథకి ట్విస్టు ఇచ్చి ఇంటర్వెల్ నిస్తుంది. బర్రె గుద్దుకుని రైలాగి పోవడంతో, ఇంకో పెద్ద గొడవ మొదలవుతుంది- తాగుబోతు అసిస్టెంట్ డ్రైవర్ సీనియర్ తో గొడవ పెట్టుకుంటాడు. జీడిపాకంలా వీళ్ళ గొడవే సాగుతూంటుంది. సాగిసాగి చివరికి అసిస్టెంటూ గార్డూ గల్లా గల్లా పట్టుకుని కుస్తీ పట్లు పడుతూంటే, వాళ్ళని వదిలి పారేసి సీనియర్ డ్రైవర్ రైలుని లాగించేస్తాడు.  కొంత దూరంలో ఎవరూ ఆపకుండానే తన గుండాగిపోయి చచ్చిపోతాడు. ఇక రైలూ, రైలుతో బాటు కథా, కథతో బాటూ మనమూ ఇంటర్వెల్ అనే ఘోరమైన గోతిలో పడతాం! 

        సింపుల్ గా తాగుబోతు అసిస్టెంట్ తాగి పడిపోయాడు, డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో పోయాడు- దిక్కుమాలిన కథకి రైలు దైవాధీనమైంది అంటే సరిపోదా? ఈ బర్రె లేంటి, కుస్తీ పోటీ లేంటి, బూతు లేంటీ, పావు గంట సేపు బుర్ర తినెయ్యడ మేంటీ, హీరోగారు షాట్ గ్యాప్ లో కారవాన్ లో కూర్చున్నట్టు- కూపేలో బందీ అయిపోయి సినిమాని గాలికి వదిలెయ్యడ మేంటీ?

        సెకండాఫ్ 18 నిమిషాలవరకూ హీరో గారు కన్పించనే  కన్పించరు. కన్పించాక కూపే  లోంచి బయటపడి-  రైలు ఎందుకిలా పోతోందో తెలుసుకోడు. అసలు ఫీల్ కాడు. టాపెక్కి పాటలూ ఫైట్లూ వేసుకుంటాడు. పొలోమని ఇంకిన్ని పాత్రలు సబ్ ప్లాట్స్ వేసుకుని  వచ్చేస్తాయి.రైలాపడానికి హీరో కాకుండా రకరకాల రైల్వే అధికారులు, పోలీసు అధికారులు, ఎన్ ఎస్ జీ  కమాండోలు, రాపిడ్ యాక్షన్  ఫోర్స్ వాళ్ళూ, మీడియా వాళ్ళూ  దిగిపోయి కథని పంచేసుకుని ఇష్టా రాజ్యం చేస్తారు, అందరిదీ ఒకటే కంగారు- రైలుని టెర్రరిస్టులు హైజాక్ చేశారని లాజిక్ లేని ప్రహసనాలకి  హాస్యాస్పదంగా తెర తీస్తారు. ఒక ఛానెల్ యాంకర్ రెండేసి సీన్ల కోసారి రాజకీయ నేతల్ని కూర్చో బెట్టుకుని చర్చ మొదలెడతాడు ఈ హైజాక్ మీద. లైవ్ ఇస్తూ రెచ్చిపోతాడు. అంత స్పీడుతో పోతున్న రైల్లో ఏం జరుగుతోందో కార్లో వెంటాడుతూ రిపోర్టర్ లైవ్ ఇస్తోందట!  రైలు కట్ట పక్కనే చెన్నై దాకా సాఫీగా రోడ్డు వేశారేమో రైలుని వెంటాడ్డానికి... 

        డ్రైవర్ చనిపోయి రైలుకీ పరిస్థితి వచ్చిందని చివరి దృశ్యాల్లోనే  హీరో తెలుసుకుంటాడు! అంతటి అమోఘమైన పాసివ్ పాత్ర. ఇలా ధనుష్- ప్రభు సాలమన్ లు రకరకాల పాత్రల ఉపకథలతో ప్రేమ కథని ఇంటర్వెల్ లోపే చంపేసి, ధనుష్ బల్లి పాత్రని కూడా బలి చేసి, రైలుతో రోబోటాడుకుని  వదిలేశారు!
       


-సికిందర్
http://www.cinemabazaar.in 




Friday, September 23, 2016

రివ్యూ:












రచన-  దర్శకత్వం: విరించి వర్మ

తారాగణం: నాని, అనూ ఇమ్మాన్యుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, సత్య, పోసాని కృష్ణమురళి, రాజ్‌ తరుణ్‌ తదితరులు
సంగీతం: గోపి సుందర్‌ ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
బ్యానర్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కెవా మూవీస్‌
నిర్మాతలు: పి. కిరణ్, గీత గోళ్ల
విడుదల : సెప్టెంబరు 23, 2016
***

        4-జి హీరోగా ‘నేచురల్ స్టార్’ అన్పించుకుంటున్న నాని  అన్నేచురల్ గా ఏ పనీ చెయ్యడనే నమ్మకం వుంటుంది- బయ్యర్లకీ, ప్రేక్షకులకీ. ఆ నమ్మకంతో వచ్చిన సినిమాని  కళ్ళకద్దుకుని కొంటారు, చూస్తారు. ఒక ‘భలే భలే మగాడివోయ్’ కామెడీ నటించాం కదా, ఇంకో ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ అనే యాక్షన్ అందించాం కదా, మరింకో ‘జంటిల్ మన్’ అనే థ్రిల్లర్  కూడా ఇచ్చాం కదా- ఈసారి ఓ పరమ  లైటర్ వీన్ లవ్ స్టోరీ ఇచ్చి చూద్దాం ఏమంటారో- అని ‘మజ్నూ’ గా మారిపోయి వచ్చేశాడు నాని ఇద్దరు లైలాల్ని వెంటేసుకుని. ఇద్దరు లైలాల మజ్నూ అంటేనే ముక్కోణ ప్రేమ కథకి ఇదేదో ఆధునిక నమూనా  యేమోనని  కొత్త ఆశ చిగురిస్తుంది మనలాంటి ఆశాజీవులకి. మనం జీవిస్తేనే బయ్యర్లకి కాస్త వూపిరి అందుతుంది- మనం జీవించామో లేదో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం....

కథ 
      భీమవరం కుర్రాడు ఆదిత్య (నాని) కి హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో  జాబ్ వస్తుంది. దీంతో  ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని వస్తూంటే  కిరణ్మయి (అనూ ఇమ్మాన్యుయేల్‌) అనే అమ్మాయి బైక్ తో యాక్సిడెంట్ చేస్తుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడి జాబ్ లో జాయినవడం మానేస్తాడు. ఆమెని ఫాలో అవుతూ ఆమె చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయి ప్రేమించడం మొదలెడతాడు. కొంత బెట్టు చేసి ఆమె కూడా ప్రేమిస్తుంది. అప్పుడామెకి తన కోసం జాబ్ మానుకున్నాడని తెలిసి వెళ్లి జాబ్ లో చేరమంటుంది. చేరనంటాడు. అతడితో మాటలు మానేస్తుంది. అతడికీ వొళ్ళు మండి గుడ్ బై కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. 

        హైదరాబాద్ లో దర్శకుడు రాజమౌళికి అసిస్టెంట్ గా చేరతాడు. ఒకరోజు ఆదిత్య తన ఫ్రెండ్ (సత్య) గర్ల్ ఫ్రెండ్ ని చూసి మనసు పారేసుకుంటే,  ఆ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ ని ఆదిత్యకి త్యాగం చేస్తాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ సుమ (ప్రియాశ్రీ) ఆదిత్యతో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడ్డాక భీమవరం నుంచి కిరణ్మయి వస్తుంది. చూస్తే ఆమే సుమా కజిన్స్. ఆమె రావడంతో ఇరుకున పడతాడు ఆదిత్య. దీంతో ఇకపైన ఏం జరిగిందనేది మిగతా కథ.  

ఎలా వుంది కథ 
      లక్ష సార్లు చూసేసిన కథలా లేదూ? రోజులు మారినా ప్రేమ కథల తీరు మారుతోందన్పిస్తోందా, లేదు కదూ? ఓ  క్రేజ్ వున్న హీరో దొరికితే చాలు, కాలం చెల్లిన అవే ప్రేమకథలని ఈజీగా పెట్టి లాగించెయ్య వచ్చన్న ధోరణికి ఇది నిలువుటద్దంలా కన్పిస్తుంది. ప్రేక్షకులకి  కథని అమ్మడంగా గాక, హీరో క్రేజ్ ని సొమ్ము చేసుకోడంగా సాగుతోంది. అబ్బాయి ఒకమ్మాయిని ప్రేమించాడు, విడిపోయాడు, మరో అమ్మాయిని ప్రేమించాడు, మళ్ళీ మొదటి అమ్మాయి వస్తే రెండో అమ్మాయిని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు- అయినా మొదటి అమ్మాయి మనసు మార్చుకోకుండా వేరే పెళ్లి చేసుకుంటూంటే, మూటా ముల్లె సర్దుకుని రైల్వే స్టేషన్ కెళ్ళి పోయాడు, రెండో అమ్మాయి పెళ్లి పీటలమీద మొదటి అమ్మాయి మనసు మార్చితే, పెళ్లి బట్టల్లోనే  మొదటి అమ్మాయి పెళ్ళికి ఎగనామం పెట్టి- కన్నవాళ్ళ పరువు నిలువునా తీసి-   తన 'అద్భుత- మిడిల్ మటాష్  ప్రేమ' కోసం రైల్వే స్టేషన్ కి పరుగెత్తింది... అంటూ రైల్వే స్టేషన్ లో ముగిసే ఈ ముక్కోణపు ప్రేమ కథ ఇంకానా! ఇంకా ఇంకానా!! ముందుగా దర్శకులు అర్ధంజేసుకోవాల్సిం దేమిటంటే,  ఇంకా ఏవో ఊకదంపుడు లైటర్ వీన్ ప్రేమకథలంటూ ప్రేక్షకుల ప్రాణం తీయకుండా, అంతగా ఫక్తు అద్భుత ప్రేమలే తీయాలని ఉబాలాటంగా వుంటే, అన్ని కోణాల్లో బలమైన కథలతో, సంగీత సాహిత్యాలతో, తిరుగులేని కమర్షియాలిటీతో,   ‘గీతాంజలి’ లా తీసి ప్రేక్షకుల్ని కదిలించగల్గే ఛాలెంజిని స్వీకరించాలి.

ఎవరెలా చేశారు
        హీరో నాని ఈ సబ్జెక్టుని ఎంచుకునే ముందు తెలుగు సినిమా ప్రేమ కథల మూస ధోరణిని తెలుసుకున్నట్టు లేదు. ఎందరో  చిన్నా పెద్దా,  కొత్తా పాతా హీరోలు ఎప్పుడో చేసేసిన సబ్జెక్టుని ఇప్పుడింత  పనిగట్టుకుని తను నటించాడంటేనే ఆ స్పృహ మీద అనుమానమేస్తోంది. ‘భలేభలే మగాడివోయ్’ లాంటి వినూత్న రోమాంటిక్ కామెడీ ప్రేమ కథ కాదు- ప్రేమకథ కాకుండా, ప్రేమ కోసం మతిమరుపు  అనే తన లోపాన్ని జయించే క్యారక్టరైజేషన్ గాబట్టే అట్టర్ ఫ్లాప్ రొటీన్ మూస ప్రేమల బారి నుంచి బయటడి,  అది అంత హిట్టవగల్గింది. మతిమరుపే  కథనంగా నడిచి ఎంటర్ టెయిన్ చేసింది. గత రివ్యూలలో కొన్ని సార్లు చెప్పుకున్నట్టు- ఒఠ్ఠి ప్రేమ కథలకి ఎప్పుడో కాలం చెల్లి, ప్రేమని నేపధ్యంగా పెట్టుకుని- ఇంకేదో పాయింటుతో  కథనం చేసిన సినిమాలే హిట్టవుతూ వస్తున్నాయి- ‘భలేభలే మగాడివోయ్’ సహా. ఈ రహస్యం తెలుసుకోకుండా, ఒక 4-జి హీరోగా నాని ఇంకా 2- లేబర్ ప్రేమలే నటిస్తానంటే మనమేమంటాం!!

        ఈ సినిమాలో నాని నేచురల్ స్టార్ అనే తన బిరుదుకి తగ్గకుండా నటించాడు. ఇందులో అనుమానం లేదు- నటించిన పాత్రతోనే పేచీ. ఇంకోసారి ఇలాటి టీనేజీ అపరిపక్వ ప్రేమ పాత్రలు నటించకుండా వుంటే మేలు. హిందీలో అనురాగ్ కశ్యప్ ‘దేవదాసు’ ని  ‘దేవ్ –డి’ గా మార్చి పాత కథని ఆధునికంగా ఎలా చెప్పి హిట్ చేశాడో మనకి తెలుసు. అలాగే మధ్య యుగాల ‘మజ్ను’ తో మరుపురాని 4-జీ లవ్ పాత్ర చేయవచ్చు. ఇకముందు నాని ఈ కోవలో ఆలోచించాల్సి వుంది. 

        హీరోయిన్లిద్దరూ రొటీన్ పాత్రల్లోనే కన్పిస్తారు. ఒక హీరోయిన్ ఆధునిక పాత్రలో వుంటే, రెండో హీరౌయిన్ సాంప్రదాయ పాత్రలో వుండే ఫార్ములా కొలమానాలతో మార్పు లేకుండా కన్పిస్తారు. ఇద్దరూ కజిన్స్ అయినప్పుడు ఒకలా ఎందుకుండ కూడదు? బిగ్ బడ్జెట్ ఫార్ములా సినిమాల్లో పాత్రలే నేచురల్ స్టార్ లవ్ స్టోరీలోనూ వుండాలా?

        ఇక సహాయ పాత్రాల్లో సప్తగిరి, పోసాని, సత్య, వెన్నెల కిషోర్ లు కపిస్తారు. చివర్లో అతిధి పాత్రలో 4- జి హీరో రాజ్ తరుణ్ వచ్చి అర్ధాంతరంగా మాయమైపోతాడు. 

        టెక్నికల్ గా సినిమాకి కెమెరా వర్క్ బావుంది.  విస్తరించిన భీమవరం లొకేషన్స్ ని మొదటిసారిగా చూపించిన సినిమా ఇదే. ఇంకా పాత భీమవరాన్ని కూడా చూపించి వుండాల్సింది. అలాగే పాటలూ చూస్తున్నంత సేపూ బావున్నాయి. 

చివరికేమిటి 
       సెంటి మెంట్లతో ‘ఉయ్యాల జంపాల’ అనే హిట్ తీసిన దర్శకుడు విరించి వర్మ ఈ రెండో సినిమాకి కష్టపడిందేమీ లేదని తనకీ తెలిసే వుంటుంది. ఎప్పుడో ఎందరెందరో తీసేసిన అదే పాత విషయాన్నీ, రొటీన్ సీన్స్ నీ, డబల్ రొటీన్ ఇంటర్వెల్ సీన్ నీ, పరమ రొటీన్ రైల్వే స్టేషన్ క్లయిమాక్స్ నీ పెట్టుకుని ముందు  రాసేసి- తీసేసి ఓ పని అయిందన్పించాడు తప్పితే- ఒక అప్ కమింగ్ ప్రామిజింగ్ డైరెక్టర్ గా తనదంటూ సొంతంగా క్రియేట్ చేసిందేమీ లేదంటే  లేనే లేదు. వచ్చిన కొత్త దర్శకుడు కూడా ఇడ్లీ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఇలాగే కదా వుంటుందనే ధోరణిలో సినిమాలూ తీస్తూపోవడమే విచారకరమైన విషయం. ఇలాటి రీసైక్లింగ్ కాపీ సినిమాలు తీసేవాళ్ళు ఎందరో  వున్నారింకా- ప్రత్యేకంగా విరించి వర్మ కూడా వచ్చి అదే పని చేస్తే కొత్తగా రావడమెందుకు? రచన - అని తన పేరేసుకోకుండా ‘వివిధ మిడిల్ మటాష్ యూత్ సినిమాలు’ అని వేయడం కరెక్టు. మనక్కావాల్సింది సినిమాల్లోంచి సినిమాని పుట్టించే కొత్త దర్శకుడు కాదు, నడుస్తున్న యువప్రపంచం లోంచి నవయుగపు సినిమాలు తీసే మార్గదర్శి. 

        ఇలాటి ట్రయాంగిల్ లవ్ తో సెకండాఫ్ ఏమవుతుందో ఇలాటి  సినిమాలు మాత్రమే ఎన్నోచూసి స్ఫూర్తి పొందినట్టున్న  దర్శకుడు విరించి వర్మకి స్క్రీన్ ప్లే పరంగా  తెలిసిందో  లేదో గానీ- ఒక్కటే జరుగుతుంది ఈ సినిమాలో లాగే - సెకండాఫ్ నడపడానికి విషయం లేకపోవడం! విషయమంతా ఇంటర్వెల్ కి ముందే అయిపోయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని కామెడీ చేస్తూ ఎవరైనా ఫస్టాఫ్ ఆహా ఓహో అన్పించవచ్చు- దీనికి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ వుండదు. ఆ ప్రేమల్లో సమస్యేమిటో  చెప్పాక- ఆ సమస్యతో సెకండాఫ్ కొచ్చేసరికి తెలుస్తుంది అసలు సత్తా. ఎప్పుడైతే ఉన్నత విద్య చదివిన- చదువుతున్న హీరో హీరోయిన్లు ఇలా ఉత్తుత్తి మాటలకే చిన్నపిల్లల్లా విడిపోయే లైటర్ వీన్ బోరు కథల్లో- విడిపోయాక  కలవడం కూడా అంతే చిన్న పిల్లలాటలా ఉండక ఏమవుతుంది. గత కొన్ని రివ్యూలలో చెప్పుకున్నట్టుగా- లైటర్ వీన్ కథల్లో వుండే సంఘర్షణకి కారణమయ్యే చిన్న- బలహీన పాయింటుతో ఆ తర్వాత కథనం సంక్లిష్టంగా వుండి తీరాలి. అలా సెకండాఫ్ విషయం సంక్లిష్టం కాకుండాపోవడంతో అరిగిపోయిన ఫస్టాఫ్ విషయాన్నే లాగాల్సి వచ్చింది బరువుగా. ఇంటర్వెల్లో విడిపోయారు సరే- అక్కడ్నించీ ఈ ట్రయాంగిల్ ని కొత్తగా ఎలా మార్చ వచ్చు? సెకండ్ హీరోయిన్ విడిపోయిన ఫస్ట్ హీరోయిన్ కి కజిన్ అవుతుందని  హీరో తెలుసుకుని యాక్టివ్ గా తనదైన గేమ్ ప్లే చెయ్యలేతప్ప- దర్శకుడు చేస్తున్న అదే రొటీన్ ప్లేకి, లేదా హీరోయిన్లు చేస్తున్న అదే రొటీన్ సెంటిమెంటల్  ప్లేకి- ఓ కీలుబోమ్మలా మారిపోయి అటూ ఇటూ అయి చివరికి, ‘గోవాలో ఫారిన్ సన్యాసుల్లో కలవడా’ నికి రైలెక్కడం కాదుగా హీరో చేయాల్సిన పని? గ్రాండ్ గా కథ హీరో ప్రారంభిస్తే, అతడికి చేతగాక హీరోయిన్లు ముగించడమా! ఇదేనా నాని హీరోయిజం. 

        ఈ సినిమాని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. కారణాలు రెండు : ఒకటి - నేచురల్ స్టార్ నాని ఛార్మ్,  రెండు - ప్రేక్షకులమైన మనం రోజూ తినే ఇడ్లీల్లాగే ఇలాటి సినిమాలూ రోజూ చూసేసి జీవించగలం! బయ్యర్లేం భయపడాల్సింది లేదు- కాకపోతే కొంచెం రేటెక్కువ పెట్టారు.

-సికిందర్ 
http://www.cinemabazaar.in

Tuesday, September 20, 2016

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ - 16






స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో మిడిల్ విభాగం కథ రెండు భాగాలుగా వుంటుందనేది తెలిసిందే- ఇంటర్వెల్ దగ్గర ముగిసే మిడిల్-1, ఇంటర్వెల్ కి తర్వాత ప్రారంభమయ్యే మిడిల్- 2.  క్రిందటి వ్యాసంలో మిడిల్ -1 ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకున్నాక, ఇప్పుడు మిడిల్- 2 నిర్మాణాన్ని నేర్చుకుందాం. నిర్మాణమంటే కథనమే. ఈ కథనం ఎప్పుడూ కొన్ని సీక్వెన్సులుగా వుంటుంది. ఒక్కో సీక్వెన్సులో మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే స్ట్రక్చర్ వుంటుంది. ఫస్టాఫ్ లో నాలుగు సీక్వెన్సులు, సెకండాఫ్ లో నాల్గు సీక్వెన్సులు ఉండడమే మొత్తం స్క్రీన్ ప్లే. అంటే ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో రెండు సీక్వెన్సులు, మిడిల్-1 విభాగంలో రెండు సీక్వెన్సులు, మళ్ళీ సెకండాఫ్ మిడిల్ -2 విభాగంలో రెండు సీక్వెన్సులు, చివర్లో ఎండ్ విభాగంలో రెండు సీక్వెన్సులు  మొత్తం కలిపి ఎనిమిది సీక్వెన్సులూ ఇమిడి వుంటాయన్న మాట. దీన్ని అర్ధం జేసుకుంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో- రావాలో  తెలుసుకోగలం.  అప్పుడు వన్ లైన్ ఆర్డర్ సులభంగా, పకడ్బందీగా  వేయగలం. దీన్ని అర్ధం జేసుకోక పోతే చీకట్లో తముడుకుంటున్నట్టు వుంటుంది పరిస్థితి- ఆ మేరకు కథనం కూడా!

           వ్యాసం- తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -15        https://sikander-cinema
    scriptreview.blogspot.in/2016/06/15.html   లో  ‘శివఆధారంగా  మిడిల్ -1 స్ట్రక్చర్ ని తెలుసుకుంటున్నప్పుడువన్ లైన్ ఆర్డర్ లో అది రెండు  సీక్వెన్సులుగా ఎలా విభజన జరిగివుందో గమనించాం. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత మిడిల్- 2   రెండు సీక్వెన్సుల కూర్పూ ఎలా వుందో చూద్దాం. మరొక్క సారి వెనుక చెప్పుకుంది గుర్తు చేసుకుంటే, స్క్రీన్ ప్లే అంటే మొట్ట మొదట కాన్షస్సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లేనే. తర్వాతే- దీనికి లోబడే  స్క్రీన్ ప్లేలో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలుమళ్ళీ వీటిలో సీక్వెన్సులు, సీక్వెన్సుల్లో  మళ్ళీ వాటి తాలూకు బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు, దీని ప్రకారం వన్ లైన్ ఆర్డర్ లో వేసే సీన్లు, మళ్ళీ ఒక్కో సీన్లో  బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలూ అన్నమాట!

        ఇలా ఎందులో చూసినా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలే నన్నమాట- ఎందుకనీఎందుకంటే, వీటన్నిటికీ పై స్థానంలో  సర్వాంతర్యామిలా వ్యాపించి వుండే  కాన్షస్సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లే అనే జగన్నాటక సూత్రధారే కారణం! కాన్షస్ మైండ్ అనేది బిగినింగ్ విభాగమైతే, సబ్  కాన్షస్ మైండ్ మిడిల్ విభాగం, ఎండ్ వచ్చేసి రెండిటి ఇంటర్ ప్లే ఫలితంగా  మనం పొందే మోక్షం. అందుకే స్థూల స్థాయి నుంచీ సూక్ష్మ స్థాయి వరకూ ఎందులో చూసినా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు సర్దుకుని వుంటాయి. చిట్ట చివర సూక్ష్మ స్థాయిలో ఒక సీను రాస్తున్నప్పుడు దాని ప్రారంభం, అంటే బిగినింగ్ కాన్షస్ మైండ్ లక్షణాలని కలిగి వుంటుంది, ప్రారంభం తర్వాత సీనుకో  నడక వుంటుంది : నడక అంటే మిడిల్ విభాగం సబ్ కాన్షస్ మైండ్ లక్షణాలని కలిగి వుంటుంది. సీను ముగింపు-  అంటే ఎండ్ విభాగం వచ్చేసి మనం పొందే మోక్షాన్ని పోలి వుంటుంది- వుండాలి

          గత రాత్రి  ‘డోంట్ బ్రీత్చూసొచ్చాం. హర్రర్ సినిమాలతో కాన్షస్సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లే ని వివరించుకుంటే బాగా అర్ధమవుతుంది- ముగ్గురు దొంగలు ఒక అంధుడి ఇంట్లో డబ్బు కొట్టేయాలని జొరబడతారు. జొరబడే ముందు వాళ్ళ దైనందిన జీవితంలో ఆనందాలు  కాన్షస్ మైండ్ కి ప్రతీకలు.   ఇంట్లోకి జొరబడడం సబ్ కాన్షస్  మైండ్ లోకి చేరిక. హార్రర్ సినిమాల్లో చూపించే ఇలాటి గృహలన్నీ మన సబ్ కాన్షస్  మైండ్ లాంటి మిస్టీరియస్ కొంపలే.  మన సబ్ కాన్షస్  మైండే ఒక  అనంతమైన మిస్టీరియస్ కొంప. అందులో ఏమేం అంతుచిక్కని రహస్యాలుంటాయో, ఇంకెలాటి నేర్చుకోదగ్గ  జీవిత సత్యాలుంటాయో మన ఇగోకి తెలీదు. తెలుసుకుని, నేర్చుకుని బాగుపడదామని ప్రయత్నించదు. పైగా అవంటే భయం కూడా. అందుకని ఎంతసేపూ  సబ్ కాన్షస్ కి దూరంగా,  ఔటర్ రింగ్ రోడ్ లాంటి  కాన్షస్ మైండ్ లో,  హార్లీ  డేవిడ్సన్ బైక్ వేసుకుని జామ్మని ఎంజాయ్ చేయడమే దానికి కావాలి. అలా ముగ్గురు దొంగలు (ఇగో) సబ్ కాన్షస్ మైండ్ అనే చీకటి గృహంలోకి తెగించి ప్రవేశిస్తారు. అప్పుడు గబుక్కున అక్కడున్న జీవిత సత్యం అంధుడి రూపంలో మేల్కొంటుంది. వెంటాడుతుంది. దొంగతనం తప్పని ఇగో కి చెప్తుంది, దొంగతనానికి శిక్ష తప్పదనీ చంపడం మొదలెడుతుంది...  ‘అంతర్మధనాన్నితాళలేక తప్పయిపోయింది క్షమించి వదలమన్నా వదలదు అంధుడి రూపంలో వున్న దొంగతనం తప్పనే జీవిత సత్యం. ఇలా వెండితెర మీద కదిలే పాత్రలు కేవలం మన ఇగో ప్లస్ జీవిత సత్యాల ప్రతిరూపాలేమహేష్ బాబు అయినా, తమన్నా అయినా, సప్తగిరి అయినా, ప్రకాష్ రాజ్ అయినా వీటిని ప్రతిబింబించాల్సిందే- ఇంకేదో ప్రదర్శించడం కాదు.  


        ఎందుకు హర్రర్ ఇంతలా ఆడేస్తోందంటే  ఇలా ఇది ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్నిఇంటర్ ప్లేతో అంతలా పట్టేసుకుంది కాబట్టే. ‘శివకూడా ఇలాగేఇంటర్ ప్లేతో ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్ని ప్రతిబింబించింది కాబట్టే అంతలా అడేసింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది కేవలం భౌతిక పరమైనది, దానికి కెమెరాతో చిత్రీకరణ కేవలం క్రియేటివ్ కోణమే. ‘ఇంటర్ ప్లేఅనే ఆత్మే  లేకపోతే రెండూ కృతకంగానే మిగిలిపోతాయి.  

          ‘శివలో శివ మన ఇగో కాన్షస్ అయితే, మాఫియా భవానీ సబ్ కాన్షస్ లో దాగి వుండే  ఒక జీవిత సత్యం. దాన్ని ఎదుర్కొని, నశింప జేసి, జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందే తప్ప- చేతులు ముడుచుకుంటే మోక్షం లేదు. కురుక్షేత్రం ఎక్కడో జరగలేదు. అది మన అంతరంగం లోనే రోజూ జరుగుతోంది. మన కుండేవి పంచ పాండవు ల్లాంటి ఐదే పాజిటివ్ శక్తులు. మన అంతరంగంలో వుండేవి కౌరవుల్లాంటి  నూటికి నూరు నెగెటివ్ శక్తులు. ఐదే పాజిటివ్ శక్తులతో నూరు నెగెటివ్ శక్తుల పీచమణిచి మనసు స్వర్గతుల్యం  చేసుకోవడమే కురుక్షేత్రపు సూపర్ హిట్  మేజర్ థీమ్- ఫార్ములా


         
జానర్ ని బట్టి ఇంటర్ ప్లే రస పోషణ వుంటుంది. యాక్షన్  జానర్ అయితే వయొ లెంట్ గా, హార్రర్ అయితే భయపెడుతూ, థ్రిల్లర్ అయితే ఉత్సుకతని రేపుతూ, ఫ్యామిలీ అయితే సెంటిమెంట్లతో బాధిస్తూ, ప్రేమ అయితే రొమాంటిగ్గా సమ్మోహన పరుస్తూ, కామెడీ అయితే నవ్విస్తూ ఇంటర్ ప్లే సాగుతుంది.

***


       ఈ నేపధ్యంలో  యాక్షన్ జానర్  ‘శివనిర్మాణాన్ని పెట్టుకుని  స్క్రీన్ ప్లే రచన నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పడు సెకండాఫ్ మిడిల్ – 2 లో ఇంటర్ ప్లే, సీక్వెన్సుల అమరిక, వగైరా ఎలా వున్నాయో తెలుసుకుందాం. ఇంటర్వెల్లో శివ బృందంలోని మల్లిని చంపించేస్తాడు భవానీ. దీని తర్వాత  మిడిల్- 2 వన్ లైన్ ఆర్డర్ కింది విధంగా వుంటుంది...
        51.  శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో చూడ్డం, మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
        52.  శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.
       
53.  ఇంటిదగ్గర వదిన శివ వల్లే తన కూతురు కీర్తి ప్రమాదంలో పడిందని ఆరోపిస్తే, వాళ్ళ క్షేమం కోసం శివ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం.
        54.  ఆశా శివాని తమ ఇంట్లో వుండమనడం, తన దగ్గర వుండమని చిన్నా ఆఫర్ ఇవ్వడం.
        55. 
వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
       
56.  ఫ్యాక్టరీ  యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
       
57.  కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి,  ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం.  భవానీ దగ్గరికి నానాజీ వచ్చి,  మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
58.  రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
       
59.  బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన  ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
       
60.  కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
       
61.  శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
       
62.  ఇది  భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
       
63.  భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
       
64.  ఆశా భద్రత గురించి శివ ఆందోళన చెందితే, ఆశా ప్రేమని వ్యక్తం చేయడం.
       
65.  శివ ఆశాలు ఆశా అన్న (సీఐ) కి తమ పెళ్లి గురించి చెప్పడం.
       
66.  పెళ్లయిపోయిన అర్ధంలో డ్యూయెట్.
       
67.  నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.
       
68.  పెళ్ళయ్యాక శివ తనకే  వుండాలన్న స్వార్ధం పెరిగిపోయిందని, అతను జనం కోసం తిరుగుతోంటే భరించలేక పోతున్నానని అన్నదగ్గర ఆశా బాధ పడడం.
       
69.  శివ అన్న కూతుర్ని వెంటబెట్టుకుని శివ ఇంటికి రావడం, తనకి ట్రాన్స్ ఫర్ అయ్యిందని చెప్పడం, ట్రాన్స్ ఫర్ అతడి భద్రత కోసమే తను చేయించానని తర్వాత ఆశాతో శివ అనడం.
       
70.  శివ- ఆశాల డ్యూయెట్.
       
71.  శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం,  అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.
       
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు  పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం.
       
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం.
       
74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం.
       
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
       
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం.
       
77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
       
78.  గణేష్ ని  పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.
**మిడిల్ సమాప్తం**


              51 వ సీనులో మల్లి హత్యోదంతంతో ఎత్తుకుని, 78వ సీన్లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడెయ్యడంతో 27 సీన్లతో మిడిల్-2 విభాగం ముగిసింది. మిడిల్ -2 విభాగం ముగియడమంటే ప్లాట్ పాయింట్ -2 ఏర్పడ్డమే.  మిడిల్ -1 విభాగం ఫస్టాఫ్ లో 22 వ సీన్లో క్యాంటీన్లో శివా అతడి గ్రూపూ ఎలక్షన్స్ గురించి చర్చించుకుంటూ, భవానీ మనిషి జేడీ మీద శివ పోటీ చేయాలని గ్రూపు అంటే,  కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడంతో ప్రారంభమవుతుంది. అది ప్లాట్ పాయింట్ -1.  అంటే అక్కడ్నించీ ప్రారంభమయ్యే మొత్తం మిడిల్ విభాగం సెకండాఫ్ లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడేసే 78వ సీను దగ్గర ప్లాట్ పాయింట్- 2 గా ముగుస్తుందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ -1 కీ, ప్లాట్ పాయింట్- 2 కీ మధ్య  మొత్తం మిడిల్ విభాగం నిడివి 56 సీన్లతో వుందన్న మాట.  ఇది మొత్తం స్క్రీన్ ప్లే లో 50 శాతంగా  ప్రమాణాల ప్రకారమే  వుంది. 
        
           ఇప్పుడు  మిడిల్ -2 నిర్మాణం  ఎలా జరిగిందో చూద్దాం : ఈ 27 సీన్లూ రెండు సీక్వెన్సులుగా ఏర్పడ్డాయి. మొదటి సీక్వెన్స్ టాపిక్ భవానీని చంపడంగా కాకుండా,భవానీ  లాంటి వాళ్ళని సృష్టిస్తున్న వ్యవస్థని నాశనం చేయడం; రెండో సీక్వెన్స్ టాపిక్ వచ్చేసి మల్లి హత్య కేసులో నిందితుడైన గణేష్ ని పట్టుకోవడం. ఈ రెండు టాపిక్స్ తో ఈ రెండు సీక్వెన్సులూ నడుస్తాయి. టాపిక్స్ నిర్ణయించుకుంటే సీక్వెన్సులు నడపడం సులభం. ఈ టాపిక్స్ థీమ్ తో (కాన్సెప్ట్ తో) మమేకం అవాలి. 

        ఇక్కడ రెండు సీక్వేన్సుల ప్రారంభాలకీ  52, 57 సీన్లలోనే బీజాలు పడ్డాయి.
52 వ సీన్లో శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడంతో, దీనికి మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనే మొదటి టాపిక్ తో, మొదటి సీక్వెన్స్ కి బీజం పడింది. 

        అలాగే 57 వ సీన్లో, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ భవానీతో నానాజీ  అనే మాటగా రెండో టాపిక్ తో, రెండో సీక్వెన్సుకి బీజం పడింది.

        కానీ రెండు సీక్వెన్సులూ ఈ రెండు టాపిక్స్ తో ఏకకాలంలో సమాంతరంగా నడవలేదు. అలా నడిపి వుంటే చాలా గజిబిజి అయ్యదే. ఇప్పుడు  చాలా సినిమాల్లో సీక్వెన్సుల విధానం తెలీక టాపిక్స్ ని గజిబిజి చేసి నడిపిస్తున్నారు. ‘శివ’ లో ఎత్తుకున్న మొదటి టాపిక్ తో మొదటి సీక్వెన్స్ ని ముగించాకే, రెండో టాపిక్ ని ఎత్తుకుని  రెండో సీక్వెన్స్ ని నడిపారు.

        పై వన్ లైన్ ఆర్డర్ లో మొదటి టాపిక్ కి సంబంధించిన సీన్స్ ని గమనిస్తే – 55,56,57,58,59,60,61,62,63,67,71 సీన్లలో వ్యవస్థని నాశనం చేసే మొదటి టాపిక్ తాలూకు విషయం ప్రవహిస్తుంది. మొదటి టాపిక్ ఎత్తుకున్న 52 వ సీనుతో కలుపుకుని మొత్తం 13 సీన్లుగా మొదటి సీక్వెన్స్ నడుస్తుంది. 52 వ సీనులో వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడంతో మొదలై, 71 వ సీనులో ఆ  వ్యవస్థకి మూలపురుషుడైన మాచి రాజు, భవానీ దగ్గర కొచ్చేసి క్లాసు పీకడంతో మొదటి సీక్వెన్స్ కొలిక్కొస్తుంది. 

        ఈ మొదటి సీక్వెన్సు  నడిచే 52- 71 సీన్ల మధ్య 57 వ సీన్లో బీజం పడేప్పుడు తప్పితే, రెండో టాపిక్ కి సంబంధించిన సీన్లు గానీ, దాని  ప్రస్తావన గానీ ఎక్కడా లే కపోవడాన్ని గమనించాలి. స్ట్రక్చర్ అంటే ఇదే. 

        ఈ మొదటి సీక్వెన్స్ స్ట్రక్చర్ చూద్దాం : 

బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి :     51.  శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో చూడ్డం, మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
       
52.  శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని  తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.      
       
55.  వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
       
56.  ఫ్యాక్టరీ  యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
       
57.  కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి,  ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం.  భవానీ దగ్గరికి నానాజీ వచ్చి,  మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.

మిడిల్ శివ మీద దాడితో అసాధారణ స్థితి- సంఘర్షణ :
       
58.  రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
       
59.  బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన  ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని  శివ అనడం.

       
60.  కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
       
61.  శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
       
62.  ఇది  భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
       
63.  భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
       
67.  నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.

ఎండ్ పరిష్కారం : 
       
71.  శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం,  అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.  

వివరణ :
         
ఈ సీక్వెన్సులో మధ్య మధ్యలో శివ- ఆశాల ప్రేమా పెళ్ళీ తాలూకు సీన్లు; అన్న, వదిన, కీర్తి తాలూకు సీన్లూ డ్యూయెట్లూ వున్నాయి. ప్రధాన కథతో సంబంధం లేకుండా ఇవి సబ్ ప్లాట్ సీన్లూ - పాటలు. ఫస్టాఫ్ నుంచి ఈ సబ్ ప్లాట్ కంటిన్యూ అవుతోంది.
***
       ఇక రెండో సీక్వెన్స్  72-78 సీన్ల మధ్య 7 సీన్లతో నడుస్తుంది. రెండో సీక్వెన్స్ నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. ఫస్టాఫ్ లో మిడిల్-1 కి రెండో సీక్వెన్స్ ని కూడా గమనిస్తే, అది 10 సీన్లతోనే వుంటుంది. కానీ మొదటి సీక్వెన్స్ 16 సీన్లతో వుంటుంది. ఫస్టాఫ్ లో రెండో సీక్వెన్స్ ఎప్పుడూ ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ -1 దగ్గర ప్రారంభమైనట్టు, సెకండాఫ్ లో కూడా రెండో సీక్వెన్స్  ప్లాట్ పాయింట్ -2 కి ప్రేరేపించే పించ్ - 2 దగ్గరే ప్రారంభమ
వుతుంది. అందుకని వీటి నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. పించ్- 1, పించ్- 2 లకి దారితీసే సీక్వెన్స్ లెప్పుడూ చప్పున ముగుస్తాయి. 

        ఇప్పుడు చూద్దాం :  మొదటి సీక్వెన్స్ లోని 57 వ సీన్లోనే రెండో సీక్వెన్స్ టాపిక్ కి బీజం పడిందని పైన గమనించాం. గణేష్ ని పట్టుకునే టాపిక్. మొదటి సీక్వెన్స్ 71 వ సీనుతో ముగిసింది. ఈ సీను ముగింపులోనే రెండో సీక్వెన్స్ ప్రారంభమయ్యింది. ఎలాగంటే డబ్బడిగిన అనుచరుణ్ణి భవానీ లాగి కొట్టాడు. ఈ లాగి కొట్టడమే గణేష్ దొరికిపోవడమనే రెండో సీక్వెన్స్ కి ‘కీ’ ఇచ్చినట్టయ్యింది.

బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి : 
       
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు  పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం. 
       
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం. 

మిడిల్ అనుచరుడి హత్యతో అసాధారణ స్థితి- సంఘర్షణ :
       
74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం. 
       
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
       
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం. 

ఎండ్ పరిష్కారం : 
       
77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
       
78.  గణేష్ ని  పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.

        ఇలా ముగిసే  మిడిల్- 2 ని మనమొకసారి పరిశీలిస్తే, ఫస్టాఫ్ లో మిడిల్-1 లో కేవలం భవానీతో సంఘర్షిస్తూ వుండిన శివ, సెకండాఫ్ మిడిల్ -2 కి వచ్చేసి, భవానీని కాదు, అంతం చేయాల్సింది భవానీలాంటి మాఫియాల్ని తయారు చేస్తున్న వ్యవస్థని అనీ  తెలుసుకుని, ఆ మేరకు తన గోల్ ని మరింత విస్తరించడంతో పాత్ర చిత్రణకి సంబంధించి క్యారక్టర్ డెవలప్ మెంట్, గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీకనపడుతున్నాయి. 

        52 వ సీన్లో - ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను-‘ అని సీఐ తో శివ అనడం పాత్ర మానసికంగా ఎదిగిందనేందుకు నిదర్శనం. ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది...’ అని ఒప్పుకోవడం ప్రేక్షకులకి ఎంతో కనెక్ట్ అవుతుంది. తప్పు చేయడంతో హీరో కూడా తమలాంటి సాధారణ మానవమాత్రుడే నన్న ఫీల్ తో ప్రేక్షకులు కరిగిపోతారు. అంతేగాక, వ్యూహం మార్చడం కోసం హీరో ఆలోచనలు ప్రేక్షకులకి తెలియాలి. ఇప్పటి సినిమాల్లో అరుపులు అరిచి నరకడమే తప్ప- ఆలోచనలు తెలిపి ప్రేక్షకుల్ని దగ్గర చేసుకునే విధానం లేదు.  భవానీ కూడా ఎంత చక్కగా తన వ్యూహం తాలూకు ఆలోచనలు ప్రేక్షకులకి తెలుపుతాడంటే- శివ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చాడని తెలిశాక - 57వ సీన్లో- ‘నానాజీ. మన బిజినెస్ లో ఎప్పుడూ ఎదుటివాడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు, ముందు మన దెబ్బ పడిపోవాలి-’ అని! ఇలా చెప్పి రెండో ఇన్నింగ్స్ దాడులు ప్రారంభిస్తాడు. 

        వీటితో జతకూడే ఆశాతో రిస్కూ పెరిగి, పరిణామాల హెచ్చరికలూ రెండింత లయ్యాయి. అదే సమయంలో మిడిల్ -1 బిజినెస్ ప్రకారం ఏ యాక్షన్- రియాక్షన్ లతో కూడిన సంఘర్షణ ప్రారంభమయ్యిందో,  అది మరింత బలపడి మిడిల్ -2 లోనూ కొనసాగడం గమనించ వచ్చు.

        ప్లాట్ పాయింట్ -2 ఎప్పుడూ కథ ముగించడానికి పరిష్కార మార్గం లభించే దృశ్యంతో వుంటుంది. అలా శివ గణేష్ ని పట్టుకుని కోర్టుకి అప్పగించడానికి పోలీసులకి సాయపడుతూ, వాణ్ణి తెచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసే దృశ్యంతో ఈ మిడిల్ విభాగం స్ట్రక్చర్ పరిసమాప్తమవుతోంది.


-సికిందర్
ఎక్సర్ సైజులు:
1. ఏదైనా సినిమా దగ్గర పెట్టుకుని చూస్తూ దాని వన్ లైన్ ఆర్డర్ రాయండి.
2. ఆ వన్ లైన్ ఆర్డర్ లో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల్ని గుర్తించండి.
3. వీటిలో సీక్వెన్సులు కనిపెట్టి, వాటిలో బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్ని గుర్తించండి.
4. ఏదైనా సినిమా చూసి దాని కథ రెండు పేరాల్లో రాయండి.

-