రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 13, 2016

నాటి సినిమా!


సినిమా దర్శకుడు భావుకత గల రచయిత కూడా అయినపుడు (సినిమా రచయిత కాదు) అతడి సినిమాలు పర్సనల్ డైరీలవుతాయి. వెంటనే  అర్ధంగాక పోస్ట్ ప్రొడక్షన్లోనే  గొడవలైపోతాయి. అతను ‘గాడ్ ఫాదర్’ తీసివున్న కపోలా అయితేనో, ‘సిరిసిరిమువ్వ’ తీసివున్న విశ్వనాథ్ అయితేనో ఫర్వాలేదు.  కపోలా, విశ్వనాథ్ లు కమర్షియల్ గా నిరూపించుకున్నాకే ‘యూత్ వితవుట్ యూత్’, ‘శంకరాభరణం’ లాంటి పర్సనల్ సినిమాలు తీసి డిస్ట్రిబ్యూటర్లని ఒప్పించుకోగల్గారు. కానీ లేడికి  లేచిందే పరుగన్నట్టు, ఓ భావుకత గల కొత్త దర్శకుడు రంగ ప్రవేశం చేసింది లగాయతు అదేపనిగా పర్సనల్ సినిమాలే తీస్తూ పోతే దీన్నేమనాలి?


        ది లేడి కాబట్టి పచ్చని ప్రకృతిలో తిరుగాడుతుంది. గోదావరీ పరివాహక ప్రాంతాల్లో తచ్చాడుతుంది. అడవుల్లో చెట్లే దారి  చూపుతాయన్నట్టు, జీవితాలకి అంతటి మట్టి వాసనల కథలే  మార్గం చూపుతాయి. అలాటి కమ్మటి నేటివ్ వాసనల కథలు సినిమాలకి అవసరపడతాయనుకున్న లేడి, ఫార్ములా పులి చంపిన లేడి నెత్తురై పోకుండా, కీకారణ్యం  లాంటి మూస మాస్ మసాలాల క్రియేషన్ల  మధ్య, తనదైన ఓ ప్రత్యేక ముద్రతో కూడిన బాణీని విన్పిస్తూ యావత్ప్రజానీకాన్నీ మంత్రముగ్ధుల్ని చేయడం సామాన్య విషయమా? 

         చాలామంది సాహితీపరులు సినిమా దర్శకులుగా కన్పిస్తారు. వాళ్ళు సినిమా దర్శకత్వానికి సరిపోరనే అభిప్రాయాన్నే కల్గించారు. ఒక జర్నలిస్టుగా మారిన రచయితని యుద్ధ రంగానికి పంపిస్తే, అతను యుద్ధ వార్తలు  రాయకుండా ఆ చుట్టూ ప్రకృతి అందాలని  అద్భుతంగా వర్ణిస్తూ పోయాడట. ఇలాకాక, చాప కింద నీరు లాంటి ఇలాటి చాపల్యాన్ని ఈదేసిన గజఈత గాడు కూడా అయ్యింది పైన చెప్పుకున్న లేడీ. లేకపోతే  అచ్చులో కథలు రాసుకునే వాడికి జన్మకి సినిమా డైరెక్షన్ అబ్బే పరిస్థితి లేదా రోజుల్లో.


        ఇలా వంశీ అనే హైలీ ఇండివిడ్యువలిస్టిక్ డైరక్టర్ గురించి ఇంత చాలు.  తీసిన మొట్ట మొదటి ‘సితార’ తోనే తను బాపు, విశ్వనాథ్ ల సరసన చేరిపోయాడు. ముత్యాలముగ్గు (1975), శంకరాభరణం (1980),  మేఘసందేశం (1982), సితార (1984) ... ఈ నాల్గూ ఒకే అచ్చులో పోసిన కళా ఖండాలుగా కన్పిస్తాయి. వీటిలో కామన్ గా కన్పించేది ఒక్కటే : అతి తక్కువ సంభాషణలు! అసలు డైలాగు లేవీ అని ఫైనాన్షియర్లు గొడవ పడేంతగా, దృశ్యానికో  పోలియో చుక్క లాంటి  ఏకవాక్య సంభాషణ మాత్రమే వీటి ప్రత్యేకత! ప్రేక్షకులు హారతులు పట్టిన ఈ విజయవంతమైన కమర్షియలార్టు పంథాకి  ఎవరు మొదట  బీజం వేసి,  ఎవరెవరు పెంచి పోషిస్తూ పోయారో పై నాల్గు సినిమాల విడుదల  క్రమాన్ని చూస్తే  తెలిసిపోతుంది.

        ‘మహల్లో కోకిల’ అని వంశీయే రాసిన నవల ‘సితార’ గా తెర కెక్కింది. ‘శంకరాభరణం’ , ‘సాగర సంగమం’ లాంటి రెండు ఘన విజయాలు సాధించి వున్న ఏడిద నాగేశ్వరరావు దీని నిర్మాత.  తమిళ రీమేకుగా వంశీ మొదటి సినిమా ‘మంచు పల్లకి’  హిట్ అవలేదు. రెండో సినిమా ‘సితార’ తో నిర్మాత చేసింది సాహసమే. ఈ సినిమా చారడేసి కళ్ళ భానుప్రియని పరిచయం చేసింది. అప్పటికామెకి పచ్చి కొబ్బెర లాంటి పదిహేడేళ్లే.  అప్పటికే మంచి డాన్సర్ కూడా అయిన ఆమె నృత్యాలతో  ‘సితార’  విక్షణాసక్తత బాగా పెరిగింది. తెర వెనుక ఇళయరాజా హిట్ బాణీలు కన్పించని దేవుడిలా అభయహస్తమిచ్చాయి.


          మరో కన్పించని మాంత్రికుడు ఛాయాగ్రాహకుడు ఎంవీ రఘు. గ్రామీణ అందాల్ని చూపించడంలో దిట్ట. అక్కడే తచ్చాడే వంశీలాంటి దర్శకుడ్ని ఈయన కాపేసి పట్టుకుంటే ఇక చెప్పనక్కర్లేదు- వెండి తెరమీద సినిమా రీళ్ళు తిరగవు, రంగులరాట్నం తిరుగుతుంది.

        రాచరికపు పంజరంలో బందీ అయిపోయిన అందాల బొమ్మ జీవితాన్ని ‘సితార’ చూపిస్తుంది. ఆస్తులూ  పరువు ప్రతిష్టలూ సమకూరడానికి  ఏయే న్యాయమైన కారణాలైతే తోడ్పడ్డాయో, వాటిని గౌరవించుకోకపోతే, ఆ కారణాలూ తొలగిపోయి ఆస్తులూ పరువు ప్రతిష్టలూ మంట గలిసిపోతాయని ఒక సూక్తి.  ఇలాంటి దుర్గతే సూడో జమీందారు చందర్ ( శరత్ బాబు) ది. ఇతడి జమీందారు తండ్రి విలాసాలు మరిగి ఆస్తులు గుల్ల చేశాడు. దుర్భర దారిద్ర్యాన్ని కొడుక్కి మిగిల్చిపోతూ, ఆస్తి పాస్తులు ఇక లేవన్న విషయం బయటి ప్రపంచానికి తెలీనివ్వకూడదని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనీ మాట తీసుకుని స్వర్గానికో ఇంకెక్కడికో  వెళ్ళిపోయాడు. లోన చిరిగిన చొక్కా,  పైన వంశ హోదా వెలగబెడుతూ కోటూ -  ఇదీ చందర్ డబుల్ యాక్షన్ జీవితం. తగాదాల్లో వున్న  పొలం మీద ఎలాగో కేసు గెల్చుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం పూర్వవైభవం కల్పించుకుందామని లాయర్ (జెవి సోమయాజులు) తో కలిసి ఎంత ప్రయత్నించినా పప్పులుడకడం లేదు. 

        ఇలాటి చందర్ కి ఓ చెల్లెలు కోకిల (భానుప్రియ) అని. బంగళాలో ఈమెని బందీ చేసి వుంచాడు. ఏమంటే, ‘పరదాలు, ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయం’  అంటూ గొప్పలు. ‘ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా?’  అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాంప్రదాయం పట్ల  గౌరవమే వుంటే  హింసే అన్పించదనీ, అయినా ఒంటరిగా వుంచకుండా వాళ్ళ కాలక్షేపం కోసం నాట్యం, సంగీతం నేర్పిస్తామనీ, కోకిల కూడా వాటితో కాలక్షేపం చేస్తోందనీ సమర్ధన. ఆమె ఏదో స్వేచ్ఛ అంటూ సాంప్రదాయాన్ని కాల దన్నుకోదని ప్రగాఢ విశ్వాసం  కూడా చందర్ కి.

      గృహ నిర్బంధంలో వున్న కోకిలకి రాజు  (సుమన్) దగ్గరవుతాడు. వూళ్ళో జరుగుతున్న  జాతరకి పగటి వేషగాళ్ళ బృందంతో వచ్చిన కళా కారుడితను. ఇతడి ఆటా పాటా కోకిలలోని  నాట్యకళాకారిణిని  తట్టి లేపుతాయి. ఇక నాట్య విన్యాసాలే నాట్య విన్యాసాలు. విరహ గీతాలే గీతాలు ప్రేమలో. చందర్ కిది తెలిసిపోయి  రాజుని చంపించేసి, తండ్రి  మాట నిలబెట్టలేకపోయానని ఆత్మ హత్య చేసుకుంటాడు. 

        ఈ జరిగిందంతా దేవదాసు ( శుభలేఖ సుధాకర్) కి చెప్పుకొస్తుంది కోకిల. ఇతనొక ఫోటోగ్రాఫర్. ఇలా తన ఆశ్రయం పొందిన  కోకిలని సినిమా హీరోయిన్ ని చేస్తాడు. ఇంతలో తన గతమంతా పేపర్లకెక్కి బెంబెలెత్తిపోతుంది కోకిల. ఏ వంశ గుట్టు కాపాడతానని తను అన్న కిచ్చిన మాట ఇలా అయ్యిందో, ఇక దీనికి ఒకే ఒక్క  పరిష్కార మార్గంగా  వయసుమళ్ళిన  డాక్టర్ (ప్రభాకర రెడ్డి) ని తన తో పెళ్ళికి ఒప్పిస్తుంది. ఇది కూడా బెడిసి కొట్టి తను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, చనిపోయాడనుకున్న రాజు బయల్దేరి వస్తూంటాడు. 

        ముందు కోకిలగా, తర్వాత సితారగా రెండు విభిన్న పాత్రల్లో కన్పించే భాను ప్రియ కిది తెలుగులో అడుగు పెడుతూనే సూపర్ హిట్ ఎంట్రీ. తను తెలుగే అయినా దీనికి ముందు  ఒక తమిళం చేసింది. మాస్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న సుమన్ కిది ఒక జ్ఞాపిక లాంటిది. సినిమాలో భానుప్రియ జ్ఞాపికగా ఇచ్చే పళ్ళెం పట్టుకుని తన బృందాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయే సీను ఒక్కటి చాలు సుమన్ హావభావ ప్రకటనా సామర్థ్యానికి. 

        వంశీ విజువల్ సెన్స్ కి శృంఖలాల్లే

వనడానికి ఓ మూడు సీన్లు చూస్తే చాలు-  1. పంజరాల్లో చిలుకలు తల్లడిల్లే షాట్లు, 2. ఎగిరే చిలుకని పట్టుకుందుకు సుమన్- భాను ప్రియల రాపాడే చేతుల శృంగారభరిత విజువల్స్, 3. హాలు నిండా వాద్య పరికరాల మధ్య సుమన్- భానుప్రియలతో వుండే ఒక సన్నివేశం ...ఇక పాటల చిత్రీకరణ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చాలా సూపర్ హిట్  పాటలే ఇప్పటికీ. 


        ఇంత కళాఖండంలోనూ  లోపాలూ లేకపోలేదు. లోపాలతోనే కళాఖండాలకి  అందం వస్తుందేమో. ఇందులో భానుప్రియ పాత్ర ఎంతకీ ఎదగదేమిటి? సుమన్ ఆమె చెర విడిపించాక ఆమె పూర్తి స్వేచ్ఛా జీవియే. ఇంకా తన స్వేచ్ఛని హరించిన వంశప్రతిష్ట గురించి ప్రాకులాట ఎందుకు? తన అన్న సుమన్ ని చంపించాడని  తెలిసీ అన్నంటే సెంటి మెంట్లు ఎందుకు? బాధపడాల్సింది చనిపోయాడనుకున్న సుమన్ గురించి కాదా? అంతలోనే ముక్కలైన అతడితో తన ప్రేమ గురించి కాదా? ఇంకా అన్న గురించీ, సాంప్రదాయాల గురించీ ఆలోచిస్తే ముందు కెళ్ళిపోయిన పాత్ర ఎలా ఎదుగుతుంది? ఎదగ వద్దన్న ఫ్యూడలిజాన్ని బోధిస్తున్నట్టా ఈ పాత్రతో? 

        ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చీటీ రాసి ప్రభాకర రెడ్డికి పంపడమెందుకు? తనని కాపాడేందుకా? అలా చీటీ రాసి ఆత్మహత్యా యత్నం ఒక నాటకంగా పాత్ర దిగజారి పోలేదా? (ఈ వ్యాసం చదివి వంశీ తర్వాత లోపాలు ఒప్పుకున్నారు). క్లయిమాక్స్ బలహీనంగా తేలిపోవడానికి శరత్ బాబు ఆత్మహత్య చేసుకునే దగ్గర కథ  బలహీన పడడమే కారణం. హాలీవుడ్ ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇందుకే అన్నాడేమో- కథ ఎలా చెప్పాలో మర్చిపోతున్నారు. కథలకి మిడిల్, ఎండ్ లు ఏమాత్రం వుండడం లేదు, ఎంత సేపూ బిగినింగే .. ఈ బిగినింగ్ కూడా ఎంత సేపటికీ ముగియదు..అని!

         అసలు బిగినింగ్, మిడిల్, ఎండ్ అంటే ఏమిటో తెలిస్తేగా అవి వుండడానికి. ఈ చిన్న విషయం  వంశీకి తెలీదనుకోలేం. నవలని సినిమాగా మారుస్తున్నప్పుడు ఆ  నవలా కథనమే స్క్రిప్టులో జొరబడినట్టుంది. కానీ కెరీర్ కొత్త లోనే ఇంత సాహసమూ సృజ నాత్మకతా  ప్రదర్శించినందుకు వంశీని అభినందిద్దాం. వంశీ మరో ‘సితార’ లాంటిది తీయడు, తీయలేడు కూడా- పర్సనల్ డైరీ అనేది ఒక్కటే వుంటుంది కాబట్టి.

పట్టపగలే చుక్కలు!

          వాళ్ళందరికీ ‘సితార’ ని చూసి పట్టపగలే చుక్కలు కన్పించాయి... వాళ్ళందరూ-  నిర్మాత, దర్శకుడు, ఫైనాన్షియర్లూ- ప్రివ్యూ థియేటర్లో కొలువుదీరారు ‘సితార’ చూద్దామని. ఇంకా రీ రికార్డింగ్ మిగిలి వుంది. ముందు డబుల్ పాజిటివ్ పోస్ట్ ప్రివ్యూ చూద్దామనుకున్నారు. అంతాకలిసి చూశారు. ఇదేం సినిమా? డైలాగులేవీ? ఆ కళ్ళు, చేతులు, కాళ్ళూ చూపించడమేమిటి మాటిమాటికీ? ఆ నీడలేంటి?  ఆ పడవ లేంటి? ఐపోయింది! పనైపోయింది! పూర్ణోదయా వారి పని గోవిందా! పదండి వెళ్లి పోదాం,  చెక్కేద్దాం- అనేసి ఫైనాన్షియర్లు చెక్కేశారు. వంశీ బొమ్మలా నిలబడిపోయాడు. 

        రీరికార్డింగ్ మొదలైంది. ఇళయరాజాని చూస్తూంటే వంశీకి ఒకటే గుబులుగా వుంది.  ఈయన కూడా పారిపోతే?  అలా చేయలేదు ఇళయరాజా.  సినిమా సాంతం చూసి నె మ్మదిగా లేచారు. వంశీ దగ్గరి కొచ్చారు. ‘భలే బ్యూటిఫుల్ కాన్వాస్ ఇచ్చావయ్యా! థాంక్యూ...ఎవ్విరీ మినట్ ఈ పిక్చర్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా!’ అనేసరికి  వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు!

        12 కేంద్రాల్లో వంద రోజులాడింది సినిమా. మంచి మ్యూజికల్ హిట్. పైగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు, ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి మరో జాతీయ అవార్డు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎస్వీ రామనాథన్ కి మరింకో జాతీయ అవార్డు సంపాదించి పెట్టింది ‘సితార’.



-సికిందర్
(“సాక్షి” –నవంబర్ 2009)
           


Tuesday, July 12, 2016

సాంకేతికం!

Add caption
     ఇవ్వాళ్ళ  ఫ్యాషన్ టెక్నాలజీ క్యాట్ వాక్ లతో వొయ్యారాలు పోతూ ఎలక్ట్రానిక్  మీడియాని కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. అది దానికదే ఒక కొత్త పరిశ్రమగా మనగల్గితే మంచిదే. కానీ సినిమా రంగంలో కూడా జొరబడి కాస్ట్యూమర్ల వృత్తినే ప్రశ్నార్ధకం చేయడం ప్రారంభమైంది. ఫ్యాషన్ డిజైనర్  కోర్సులు చేసి నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, దివినుంచి దిగివచ్చిన అద్భుత వ్యక్తులుగా కన్పించి అంతలోనే అదృశ్య మైపోతున్నారు. ఈ కాస్తా హనీమూన్ చాలు కాస్ట్యూమర్లకి చుక్కలు చూపించడానికి. ఇలా ప్రాక్టికల్ అనుభవం లేకుండా డిజైన్లు  సజెస్ట్ చేసే కన్సల్టెంట్స్ లా చెలామణి కావడం ఫ్యాషన్ డిజైనర్ల వృత్తికే కాకుండా, కాస్ట్యూమర్ల  భృతికీ మంచిది కాదనే వాళ్ళూ వున్నారు. అలాటి వాళ్ళల్లో పిల్లా రవికుమార్ ఒకరు. ఈయన ఇంకో గమ్మత్తు చెప్పారు -

      ‘హీరోలకి పబ్స్ లో పరిచయమై స్నేహాలు పెంచుకుంటున్న కొందరు హఠాత్తుగా ఓ రోజున ఆ హీరోలకే కాస్ట్యూమర్లుగా అవతారమెత్తేస్తున్నారు. దీనికి వాళ్ళు స్టైలిష్ గా పెట్టుకున్న పేరు ‘స్టయిలిస్ట్’ అని!” 

        దట్సిట్. అంటే కాస్ట్యూమర్లూ కనుమరుగవుతున్నారు, ఫ్యాషన్ డిజైనర్లూ అదృశ్యమవుతున్నారు... ఇక స్టయిలిస్ట్ ల కాలం వచ్చేసిందన్న మాట!

        అసలు చరిత్రలో మొట్ట మొదటి కాస్ట్యూమర్ ఎవరని అడిగితే -  సినిమా,  దానికంటే ముందు నాటకం, దానికీ ముందు నాట్యమూ ఉండేవన్నారు. అయితే నాట్యం దగ్గర్నుంచే మొట్ట మొదటి కాస్ట్యూమర్  పుట్టాడా అంటే కాదన్నారు రవికుమార్.  కొంత తర్జన భర్జన జరిగాక, మరింకా పూర్వ కాలంలో తోలుబొమ్మలాటల దగ్గర తొలి కాస్ట్యూమర్  పుట్టాడన్నారు. రిఫరెన్సులు కూడా లేని నాటి పురాతన కాలంలో పురాణ పాత్రలకి  పకడ్బందీగా వూహించి ఆహార్యం నిర్ణయించినవాడే చరిత్రలో మొట్ట మొదటి కాస్ట్యూమర్ అని తేల్చారు రవికుమార్! 

        అలాగే తెలుగు కాస్ట్యూమర్లు  పిఠాపురం నుంచే వెళ్ళారని ఇంకో రహస్యం విప్పారు. అప్పట్లో పిఠాపురం రాజావారు మద్రాసు సినిమా కంపెనీలకి దర్జీలని - అంటే- టైలర్స్ ని వెంట బెట్టు కెళ్ళి ‘వీడు కుడతాడు, వీణ్ణి కాస్ట్యూమర్ గా పెట్టుకో!’  -  అని హుకూం జారీ చేసే వారన్నారు రవికుమార్. 

        రవికుమార్ పిఠాపురం వాసియే. అయితే రాజా వారితో ఏ సంబంధమూ లేదు. రాజావారి హయాం తర్వాత 1995 లో హైదరాబాద్ చేరుకుని ‘మేజర్ చంద్ర కాంత్’ కి కాస్ట్యూమ్స్  అసిస్టెంట్ గా పనిచేశారు. రెండేళ్ళు తిరిగేసరి కల్లా 1997 లో ‘ప్రేమించుకుందాం రా’ కి కాస్ట్యూమర్ గా ప్రమోటయి, హీరో వెంకటేష్ కి పర్సనల్ కాస్ట్యూమర్  గా ఎనిమిదేళ్ళూ  కొనసాగారు. ‘మనసంతా నువ్వే’ నుంచీ  ఎంఎస్ రాజు అన్ని సినిమాలకీ, ‘ఆర్య’ నుంచీ దిల్ రాజు అన్ని సినిమాలకీ, పూరీ జగన్నాథ్ తో అనేక సినిమాలకీ పని చేస్తూ వస్తున్నారు.  

        అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయనీ బాధ పడ్డారు. స్టార్లు బ్రాండ్ల మీద  మోజు పెంచుకుని విదేశాలనుంచి కాస్ట్యూమ్స్ తెప్పించుకోవడం, ఇద్దరు ముగ్గురు ప్రముఖ దర్శకుల భార్యలు కాస్ట్యూమ్స్ డిజైనర్లుగా రంగ ప్రవేశం చేయడం, దీనికి తోడు  కొత్తగా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు చేసిన ఔత్సాహికుల సందడీ, మళ్ళీ వీటికి తోడూ పాటలకి ప్యాకేజీ  పద్ధతీ, వచ్చేసి చాలా స్ట్రగుల్ చేస్తున్నామన్నారు.

        ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ లాంటి వారికి పాటల ప్యాకేజీ ఇవ్వడంతో, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే రూపొందిస్తున్నారని అన్నారు రవికుమార్.

        ‘మన కల్చర్ వేరే కల్చర్ చేతుల్లోకి వెళ్లిపోయాక జరుగుతున్న పరిణామాలివి. మన కల్చర్ లో వుంటే ట్రేడిషనల్ గా మన కాస్ట్యూమ్స్ వుంటాయి. శేఖర్ కమ్ముల, వంశీ లాంటి దర్శకులు ట్రేడిషన్ ని  కాపాడుతున్నారనాలి’ అని అభిప్రాయపడ్డారు.

        ప్రధానంగా స్టార్ల కాస్ట్యూమ్స్  ప్రేక్షకుల దృష్టి నాకర్షిం చాలంటే  వాళ్ళు పోషించే క్యారక్టర్లు బావుండాలన్నారు రవికుమార్. ‘ఆరెంజ్’ లో రాం చరణ్ అంత  మంచి దుస్తులు ధరించినా ఆ పాత్ర బావుండక పోవడం వల్ల  ప్రేక్షకులు ఆ కాస్ట్యూమ్స్ నీ పట్టించుకో లేదన్నారు. ‘బృందావనం’ లో కాజల్ అగర్వాల్ పోషించిన సాంప్రదాయ పాత్రకి కుట్టిన హాఫ్ శారీలు  మంచి క్రేజ్ సృష్టించాయన్నారు. రిఫరెన్స్ లేకుండా కాస్ట్యూమ్స్ తయారు చేయలేమనీ, రిఫరెన్సుల్ని మోడిఫై చేసి మల్చుకుంటామనీ కొన్ని నమూనాల్ని లాప్ టాప్ లో చూపించారు. 

        కాస్ట్యూమ్స్ పాత్రల  బయోడేటాయేనని వివరిస్తూ, ‘బొమ్మరిల్లు’ లో పాత్రలకి తగ్గట్టుగా అతి లేకుండా తాను డిజైన్ చేసిన సింపుల్ దుస్తుల గురించి సభల్లో కూడా గొప్పగా చెప్పుకున్నారని సంతోష పడ్డారు. 

        మరి ఆ సభల్లో మీ పేరు కూడా ప్రస్తావించే వాళ్ళా అనడిగినప్పుడు- లేదన్నారు బాధగా. దటీజ్ ది  ప్రాబ్లం. కాస్ట్యూమర్లు, మేకప్ మాన్ లులాంటి కళాకారుల్ని కూడా సభలు పెట్టి ఎందుకు సన్మానించరని  అడిగితే, విషాదంగా నవ్వి వూరుకున్నారు రవికుమార్. 

        ఇక దర్శకుడుగా మారబోతున్నాడు తను. ఈ సడెన్ టర్నింగ్ ఎందు కిచ్చుకున్నారంటే, అసలు 1995 లో వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని- పరిస్థితుల కారణంగా ఇలా అయిపోయానన్నారు. లాప్ టాప్ లో ఇంగ్లీషులో సిద్ధం చేసుకున్న స్క్రిప్టు, నోటు పుస్తకాల్లో మంచి చేతి వ్రాతతో ఇంగ్లీషులోనే రాసుకున్న నోట్సూ చూపించారు. ఇక్కడ ఒకటి అర్ధమైంది. ఎవరైనా ఆసక్తి పెంచుకున్న రంగంలో ఢక్కా మొక్కీలు ఎన్నైనా తింటూ అలాగే కొనసాగగల్గితే, విద్యార్హతలతో సంబంధం లేకుండా భాష లొచ్చేస్తాయేమో నన్పిస్తుంది టెన్త్  వరకే చదివిన రవికుమార్ ని చూస్తే!

-సికిందర్
(ఏప్రెల్ 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక)









Monday, July 11, 2016

సాంకేతికం!

మీ బోరింగ్ మూవీని హిచ్ కాక్ థ్రిల్లర్ లా మార్చడమెలా’  అని దర్శకుడు జెఫ్రీ మైకేల్ బేస్ కొన్ని టిప్స్ ఇచ్చారు. సినిమా తీయడంలో హిచ్ కాక్ సూక్ష్మ దృష్టిని ఆవిష్కరించే ఈ టిప్స్ తెలుగు దర్శకులకి మార్గ దర్శకాలు కావొచ్చు. థ్రిల్లర్స్ అనే కాకుండా అన్ని జానర్స్ కీ అన్వయించుకోగల ఈ టిప్స్ ని ఓ సారి చదువుకుంటే అసలు సినిమా అంటే ఏమిటో, ప్రేక్షకులు దాన్నెలా దర్శిస్తారో ఒక సైకలాజికల్ అవగాహన కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే హిచ్ కాక్ ఎప్పుడూ తన కళని తాను  ప్రేమించుకుంటూ, ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా, తనలోకంలో తానుండిపోయే సబ్జెక్టివ్ పోకడలకి చోటివ్వలేదు. కెమెరాని కూడా ఆయన ప్రేక్షకుడిగా మార్చి  దాని వెంట ప్రేక్షకులని తిప్పుకునే, ప్రేక్షక లోకంలోంచి చిత్రీకరణని చూసే, ప్రేక్షకులని ప్రేమించడం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకునే  ఆబ్జెక్టివ్ ధోరణులకి అవకాశమిచ్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే, తెర మీది దృశ్యాల్ని  ప్రేక్షకులు నిజంగా తమ చుట్టూ జరుగుతున్న సంఘటనల్లాగే భ్రమిస్తూ తదనుగుణ స్పందనలతో నీరాజనాలు పట్టడమన్న మాట. నీరాజనాలందుకోని కళ కూడా ఓ కళేనా అనే మౌలిక ప్రశ్న వేసుకుంటే, ఎవరు పడితే వాళ్ళు దర్శకులై పోయే తొందరపాటు తగ్గుతుంది. మరి అలా నీరాజనాలందుకో గల్గాలంటే, సాంకేతికంగా ఏం చేయాలనేది తెలుసుకోవాలి...ఈ కింద తెలుసుకుందాం...



          జెఫ్రీ మైకేల్ బేస్ ఇలా అంటున్నారు... తాము రాసుకున్న కథ హీనంగా వుందనీ,
దీన్నెవరూ చూడరనీ డిప్రెషన్ కీ,
బాధకీ లోనయ్యే  అశేష దర్శకులకోసం ఈ పేజీ రాస్తున్నాను

...మీరు దుఖించడం మాని విషయం
 మీద దృష్టిపెట్టండి.
ఇక్కడ నేను రాస్తున్నది మీ వృత్తిని కాపాడొచ్చు. 

1. అది ప్రేక్షకుల మైండ్.
      మీ స్క్రీన్ ప్లేలో ప్రతీదీ ప్రేక్షకుల కోసమన్నట్టుగా మార్చెయ్యండి. ఏ  సీనుతో  అయినా ప్రేక్షకుల్ని ఎలా ప్రభావితం చేయవచ్చన్న ఒక్క అంశం మీదే దృష్టిపెట్టి మేధో మధనం చేయండి. మీఋ రాసుకున్న  పేజీల్లోని కంటెంట్ తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడండి, వాళ్లకి ముకుతాడు వేసి లాక్కెళ్లేలా సీన్లని మార్చుకోండి. ఇందుకు సాధనాలుగా పాత్రల్ని ఉపయోగించుకోండి. ప్రేక్షకులకి పాత్రలు కొసరి కొసరి వడ్డిస్తూంటే ఇంకా ఇంకా కావాలని వాళ్ళు వెంటపడి వచ్చేలా చిత్రించండి. 

        చీకటి గుయ్యారాలైన సినిమా హాళ్ళకి  ప్రేక్షకులు  ఎందుకు విరగబడి వచ్చి గంటలతరబడి కూర్చుండి పోతారో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కి బాగా తెలుసు. వాళ్ళు ఫన్ కోసం వస్తారు. జనం రంగుల రాట్నమెక్కి  అది గిర్రున తిప్పేస్తున్నా భయపడకుండా  ఎలా సేఫ్ గా ఫీలవుతారో, సినిమా కొచ్చిన ప్రేక్షకులకి కూడా తాము అలా సేఫ్ గా వుంటామని తెలుసు. ఒక సినిమా దర్శకుడిగా మీరు వాళ్ళ పైన ఎడా పెడా అస్త్రాల్ని విసరాలి, కొండ చివరకి తీసికెళ్ళి తోసేయ్యాలి, లేదా ఒక డేంజరస్ లవ్ స్టోరీలోకి దిగలాగాలి. ఏం జరిగినా తమ కేమీ కాదని వాళ్లకి తెలుసు. అంతా అయిపోయాక గేట్లలోంచి బయటి కెళ్ళి,  తమ జీవితాల్ని తాము నార్మల్ గా గడుపుకోగలమన్న నమ్మకంతో వాళ్ళుంటారు. వాళ్లకి ఎంత ఎక్కువ ఫన్ ని ఇవ్వగల్గితే  అన్ని ఎక్కువ సార్లు రిపీట్ ఆడియెన్స్ గా మీ సినిమా కొస్తారు.


2. ఎమోషన్ ని ఫ్రేమ్ చేయండి      ఎమోషన్ - అంటే భావోద్వేగాలు ( భయం, హాస్యం, ఆశ్చర్యం, విషాదం, క్రోధం, విసుగు మొదలైనవి) అన్నవి ప్రతీ ఒక్క సీనుకీ అల్టిమేట్ గోల్స్. వీటి చిత్రీకరణకి కెమెరాని ఎక్కడ పెట్టాలనే దానికి మొట్ట మొదటి ప్రాధాన్యం ఆ నిర్ణీత సమయంలో ఏ ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీలవ్వాలో తెలుసుకోవడాని కివ్వాలి. ఎమోషన్ నేరుగా నటుల కళ్ళ లోంచి  వస్తుంది. కెమెరాని దగ్గరగా లేదా దూరంగా వుంచడం ద్వారా ఆ ఎమోషన్ ని కంట్రోలు చేయవచ్చు.  క్లోజప్ లో అయితే స్క్రీన్ సాంతం  ఎమోషన్ తో నిండిపోతుంది. కెమెరాని  వైడ్ యాంగిల్ లోకి తీసికెళ్తే ఎమోషన్ పలచన బారిపోతుంది. అదే సడెన్ గా వైడ్ యాంగిల్ ని  కట్ చేసి క్లోజప్ వేస్తే ఆ ఎమోషన్ ప్రేక్షకులకి సంభ్రమాశ్చర్యాలకి లోను జేస్తుంది. కొన్ని సమయాల్లో నటుడి టాప్ నుంచి స్ట్రేంజ్  యాంగిల్లో  చూపిస్తే ఆ సీను చెబుతున్న అర్ధానికి బలం బాగా పెరుగుతుంది. హిచ్ కాక్  ఒక్కో సీను ప్లాన్ చేయడానికి ఈ సామీప్యతా సిద్ధాంతాన్ని అనుసరించే వారు. ప్రేక్షకులు ఉద్వేగానికి లోనవుతున్నప్పుడో , లేదా రిలాక్స్ అవుతున్నప్పుడో ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడంలో భాగమే ఈ వైవిధ్యాలు. హిచ్ కాక్ దీన్ని సంగీతకారుడు బాణీలు కూర్చడంతో పోల్చారు. సంగీత కారుడు వాద్యపరికరాలని మీటితే, సినిమా దర్శకుడు ప్రేక్షకుల్ని మీటుతాడన్నమాట.

3. కెమెరా కెమెరాయే కాదు

   నిషి లాగా కెమెరా, ఏదో అనుమానంతో గదిలో శోదిస్తున్నట్టు తిరుగాడుతూ వుండాలి. కథని పొరలు పొరలుగా విప్పి చూడ్డంలో  ప్రేక్షకులు తామూ  ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఫీలయ్యేలా ఇది చేస్తుంది. సీన్లని రూమ్ లో పాన్ చేస్తూ,  క్లోజప్ లో ఆయా  వస్తు సామాగ్రిని ఎస్టాబ్లిష్ చేస్తూ  ప్రారంభించవచ్చు. ఇది మూకీ సినిమాల కాలంలో హిచ్ కాక్  దర్శకత్వ తీరు. సౌండ్ సౌకర్యం లేని ఆ రోజుల్లో బొమ్మలతో  కథని చెప్పే పద్ధతుల్ని దర్శకులు అవలంబించారు. 1930 లలో ఎప్పుడైతే మూకీలు అంతరించి శబ్దంతో టాకీలు ప్రారంభంయ్యాయో,  మూకీల నాటి కథ చెప్పే టెక్నిక్ దెబ్బ తినిపోయిందని ఒకసారి హిచ్ కాక్ అన్నారు.  అకస్మాత్తుగా సినిమాలు డైలాగు ఆధారిత  ప్రొడక్షన్లుగా మారిపోయి మాటలతో కథ చెప్పడం ప్రారంభించాయి బొమ్మలతో కాక. నాటకాల్లాగా సినిమాలు నటుల డైలాగుల మీద ఆధారపడడం మొదలెట్టాయి. బొమ్మలతో కథ చెప్పడం పూర్తిగా  మరుగున పడిపోయింది. 

4. డైలాగులెందుకు 
      సీనులో కనీసం ఒక పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఇంకేదో చేస్తూండాలి- ఎదుటి పాత్రలు గమనించని విధంగా కళ్ళు అటూ ఇటూ తిప్పి చూస్తూంటే, అప్పుడా పాత్ర ఏదో విషయం దాస్తున్నట్టు అన్పించి దాని నిగూఢ లోకంలోకి  ఎంటరై పోతారు ప్రేక్షకులు. మనుషులు తమ మనసులో మాట ఇతరులకి అంత సులభంగా వ్యక్తం చెయ్యరని హిచ్ కాక్  అంటారు. పైకి ఏదో మాట్లాడుతున్నా వాళ్ళ కళ్ళు ఇంకేదో చెప్తూంటాయి- దీనితో కనెక్ట్ చేసేయాలి ప్రేక్షకుల్ని. పాత్రలు ఏం మాట్లాడుతున్నాయో దాని మీద సీను ఫోకస్ పెట్టకూడదు. అసలు ఏంతో అవసరమనుకుంటే తప్ప డైలాగుల జోలికి పోకూడదు. ‘మనం పేజీల్ని నింపాల్సిన అవసరమే లేదు, థియేటర్లో  దీర్ఘ చతురస్రాకారంలో  ఒక వెండితెర వుంటుంది - దాన్ని బొమ్మల కదలికలతో’ నింపాలి’  అని హిచ్ కాకే అన్నారు.

5. పాయింటాఫ్ వ్యూ ఎడిటింగ్

     జిమ్మీ స్టీవార్ట్ కుక్కని చూస్తాడు, స్మైల్ ఇస్తాడు. జిమ్మీ స్టీవార్ట్ డ్రెస్ చేంజ్ చేసుకునున్న ఆవిణ్ణి చూస్తాడు, స్మైల్ ఇస్తాడు. ఈ రెండు స్మైల్స్ ఒకలాగే వున్నా వాటి అర్ధాలు పూర్తిగా వేర్వేరుగా వుంటాయి.  డైలాగులతో వివరించకుండా పాత్ర మనుసులో  ఒక ఐడియా పుట్టించడాన్ని పాయింటాఫ్  వ్యూ షాట్ సీక్వెన్స్ ద్వారా సాధించవచ్చు. దీన్ని సబ్జెక్టివ్  సినిమా అని అంటారు. నటుడి కళ్ళని చిత్రీకరించి, అవి చూసేందుకు ఓ దృశ్యాన్ని కలపడం...
        -నటుడి క్లోజప్ తో మొదలెట్టండి.
        -కట్ టు- నటుడు దేన్ని చూస్తున్నాడో దాని షాట్ చూపించండి.
        -కట్ బ్యాక్ టు- నటుడి రియాక్షన్ షాట్ చూపించండి.
        -వీటిని  అవసరమైనన్ని సార్లు రిపీట్ చేయండి.
        టెన్షన్ ని బిల్డప్ చేయడానికి ఎడిటింగ్ లో వీలైనన్ని సార్లు నటుణ్ణీ, దృశ్యాన్నీ  మార్చి మార్చి ఎడిట్ చేయండి. ప్రేక్షకులకి బోరు కొట్టదు. ఇది చాలా శక్తివంతమైన సినిమా రూపం, నటన కంటే కూడా. ఇంకో మెట్టు పైకి తీసి కెళ్తూ - ఆ నటుణ్ణి చూస్తున్న దృశ్యం కేసి నడిపించండి. ట్రాకింగ్ షాట్ తో  ఇది చూపిస్తే, అప్పుడు ప్రేక్షకులు ఆ నటుడి పర్సనల్ విషయమేదో షేర్ చేసుకోబోతున్నమని  నమ్ముతారు. దీన్ని హిచ్ కాక్  ప్యూర్ సినిమా అన్నారు.  


6. మాంటేజ్
 తో కంట్రోల్

        యాక్షన్ ని కొన్ని క్లోజప్స్ సిరీస్ గా విభజించండి. ఈ బేసిక్ టెక్నిక్ ని నిర్లక్ష్యం చేయకండి. ఇది ఫైట్ సీక్వెన్స్ లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి ఎడాపెడా షాట్లు వేయడం లాంటిది కాదు. జాగ్రత్తగా అరచేతి క్లోజప్, పూర్తి చెయ్యి క్లోజప్, ముఖం క్లోజప్, గన్ కింద పడిపోతున్న క్లోజప్ మొదలైనవి తీసుకుని, విషయం చెప్పడానికి తగువిధంగా వాటిని పేర్చండి. ఈ విధానంలో సంఘటనా క్రమంలోని వివిధ భాగాల్ని చూపుతూ టైం మీద కూడా కంట్రోల్ ని సాధించవచ్చు. అలాగే కొన్ని భాగాల్ని దాచిపెట్టి ప్రేక్షకుల్ని ఎక్కువ ఎంగేజ్ చేయవచ్చు కూడా. దీన్ని వెండి తెర మీంచి ప్రేక్షకుల మనస్సుల్లోకి భయాన్ని బదిలీ చేయడంగా గా హిచ్ కాక్  పేర్కొన్నారు. దీని కుదాహరణ ఆయన తీసిన ‘సైకో’. ఇందులో ప్రసిద్ధిపొందిన బాత్రూం మర్డర్ సీన్ లో, హింసని మరుగు పరచడానికి హిచ్ కాక్ మాంటేజ్ విధానాన్ని అనుసరించారు. హీరోయిన్ కి కత్తి తగలడం మన కెక్కడా కన్పించదు. క్విక్ ఎడిటింగ్ తో హింస జరిగిపోతోందన్న భావాన్ని క్రియేట్ చేశారు- దీంతో తెర మీద కనిపించని హత్య,  ప్రేక్షకుల మనస్సులో జరిగిపోతూంటుంది – వాళ్ళూ
హించుకుని గజగజలాడి పోతారు (ఆడియెన్స్ కనెక్ట్ గురించి ఇంత గొప్ప రహస్యం చెప్పిన హిచ్ కాక్ కి చేతులు జోడించి నమస్కరిద్దాం- సి.) !!


        బేసిక్ రూల్ : ఎప్పుడైనా ఏదైనా ముఖ్య సంఘటన జరుగుతున్నప్పుడు దాన్ని క్లోజప్ లో చూపించండి. ప్రేక్షకులు తప్పనిసరిగా చూసేలా దాన్ని హైలైట్ చేయండి. 


7. కథ సింపుల్ గా చెప్పండి


      మీ కథ కన్ఫ్యూజింగ్ గా వుంటే, లేదా  కథలో చాలా  విషయాల్ని కలుపుకుని  జ్ఞాపకం ఉంచుకోవాల్సిన  భారం మోపితే, మీ కథలో సస్పెన్స్ ని ఎన్నడూ మీరు నిర్వహించ లేరు. హిచ్ కాక్  చాలా సింపుల్ గా, ప్రేక్షకులు సులభంగా ఫాలో అయ్యేలా లీనియర్ కథలు (అంటే ఫ్లాష్ బ్యాకులు వుండని కథలు)  తో సినిమాలు తీశారు. మీ స్క్రీన్ ప్లేలో సంఘటనా క్రమం ఒకదాని తర్వాత ఒకటిగా క్రమపద్ధతిలో వేగంగా, వీలైనంత ఎక్కువ డ్రమెటిక్ ఎఫెక్ట్ ని సాధించేలా తీర్చి దిద్దుకోండి. మీ స్క్రీన్ ప్లేలో కలుపు మొక్కల్ని ఏరి పారేసి సరళీకరించుకోండి. చెత్తనంతా తొలగించుకుని క్రిస్ప్ గా తయారు చేసుకోండి. ప్రతీ సీనులో ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశమొకటి వుండేలా చూసుకోండి.


8. మూస పాత్రలకి నో 
        ప్రేక్షకులు  ఏం ఊహిస్తారో దానికి విరుద్ధంగా  మీ పాత్రల్ని ప్రవేశపెట్టండి. పల్లెటూరి అమ్మాయిల్ని స్మార్ట్ గర్ల్స్ గా చూపించండి. క్యూబాకి చెందిన వాడికి ఫ్రెంచి యాస పెట్టండి. క్రిమినల్స్ ని రిచ్ ఫెలోస్ గా,  సక్సెస్ ఫుల్ వ్యక్తులుగా చూపండి. మళ్ళీ  వీళ్ళ ప్రవర్తనే  దీనికి విరుద్ధంగా వుండేలా చెయ్యండి. అంటే  ఒక క్రిమినల్ రిచ్ గా వుంటే, ఆ రిచ్ క్రిమినల్ రిచ్ మనుషుల్లాగా వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా, మీన మేషాలు లెక్కించే వెధవలా  పాత్ర చిత్రణ చేయండి. దీనివల్ల పాత్రలు మూస ఫార్ములా పాత్రల సంకెళ్ళు తెంపుకుని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా  వాస్తవికంగా కన్పిస్తూ ప్రేక్షకుల్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తాయి. హిచ్ కాక్ క్రిమినల్స్ ని  బాగా డబ్బున్న అప్పర్ క్లాస్ పెద్ద మనుషులుగా చూపించే వారు.  దీంతో వీళ్ళ మీద ఎవరికీ అనుమానం వచ్చే అవకాశం వుండదు. హిచ్ కాక్ సినిమాల్లో పోలీసులూ పోలీటీషియన్లూ  వెర్రి వెంగళప్పల్లా వుంటారు. అమాయకులు నిందితులై పోతారు. విలన్లు తప్పించుకునే వేషాలేస్తారు. కథనంలో ప్రతీ చోటా ఇలాటి పాత్రలు ఆశ్చర్య చకితుల్ని చేస్తూంటాయి మనల్ని.  


9. హాస్యంతో టెన్షన్      
                                   కథ చెప్పాలంటే హాస్యం తప్పనిసరి అని  హిచ్ కాక్ భావించే వారు. మీ హీరో మీద మీరే  ప్రాక్టికల్ జోకు ప్లే చేస్తున్నట్టు భావించుకోండి. దాంతో చాలా ఇబ్బందికర పరిస్థితిలో అతణ్ణి ఇరికించండి. అది టెన్షన్ ని సృష్టిస్తుంది. హిచ్ కాక్ తీసిన ‘మార్నీ’ అనే థ్రిల్లర్ లో టిప్పీ హెడ్రెన్ ఆఫీసులో డబ్బు దొంగిలించి జారుకోబోతూ, పక్క రూంలో పని మనిషి వున్నట్టు గమనించి ఆగిపోతుంది. ఆ పని మనిషి గనుక చూస్తే తను దొరికిపోవడం ఖాయం. ఎటూ తోచక టిప్పీ అలా నిలబడిపోయి వుంటే, వంగి వంగి ఫ్లోర్ ని తుడుస్తూ పని మనిషి ముందు ముందుకు వచ్చేస్తూంటుంది. ఈ సన్నివేశంలో పుట్టే నవ్వే విపరీతమైన  టెన్షన్ ని కూడా పుట్టిస్తుంది! 

        హిచ్ కాక్  వయసుమళ్ళిన స్త్రీ పాత్రల అమాయకత్వంతో చాలా హాస్యాన్ని నూరిపోసే వారు. ఆ వయసుమళ్ళిన స్త్రీ పాత్రలది ఎంత అమాయకత్వమంటే, ఎంచక్కా  నేరం చేస్తున్న వాడికే  ఓ చెయ్యేసి సాయపడతారు

10. ఇంటర్ కట్స్ తో టెన్షన్ 
      పరస్పరం సంబంధం లేని రెండు సంఘటనల్ని ఒకేసారి ఇంటర్ కట్స్ లో చూపిస్తూ టెన్షన్  పుట్టించండి. ప్రేక్షకుల దృష్టి ఒకదాని మూవ్ మెంట్ పైనే కేంద్రీకృతమయ్యేట్టు చూడండి. దీని పైనుంచి  దృష్టి చెదిరేట్టు  రెండో దాని మూవ్ మెంట్స్ ని ఇంటర్ కట్స్ వేస్తూ పోండి. సాధారణంగా రెండో సంఘటన ఇంటర్ కట్స్ కామెడీతో కూడుకుని వుంటాయి.  దీనికి కథాపరమైన మొదటి సంఘటన ఇంటర్ కట్స్ తో ఏ సంబంధమూ వుండదు.  ‘మాన్ హూ న్యూ టూ మచ్’ లో  హోటల్ గదిలోకి అనుకోని అతిధులు వచ్చినప్పుడు జిమ్మీ స్టీవార్ట్, డొరిస్ డే లు టెన్షన్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ వుంటారు. జోకులేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చే ఆ అనుకోని అతిధులతో ఈ సీన్లో రెండు పరస్పర విరుద్ధ ఇంటర్ కట్స్ బిజినెస్ లు జరుగుతూంటాయి : ఒకటి సీరియస్ పరిస్థితితో, రెండోది కామెడీ తో. ‘స్పెల్ బౌండ్’ లో ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ తలుపు కింద నుంచి వచ్చిన ఒక నోట్ తన కాళ్ళ కింద వున్నట్టు గమనిస్తుంది. ఆమె వంగి దాన్ని అందుకోబోతూండగా, ఆమె ఫ్రెండ్ లోపలి కొచ్చి కన్పించకుండా పోయిన గ్రెగరీ పేక్ గురించి మాట్లాడుతూంటుంది. ఇద్దరి కాళ్ళూ ఆ నోట్ మీదే వుంటాయి. ఆ నోట్ గ్రెగరీ పేక్ పంపిందే అని వాళ్ళు తెలుసుకోరు! చివరికేమిటంటే-- ప్రేక్షకులు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల మీదే  ఎక్కువ దృష్టి పెడతారు.

        (స్క్రీన్ ప్లేలో, ఆ తర్వాత డైలాగ్ వెర్షన్ లో ఇలా గ్రాఫికల్ గా రాసుకుంటేనే  రచయితకీ, దర్శకుడికీ వెండి తెర మీద జరిగే బిజినెస్ పట్ల ఒక స్పష్టత వుంటుంది షూట్ చేయడానికి. హిచ్ కాక్ రచయితతో కలిసి కూర్చునే ఇలా గ్రాఫికల్  గా  స్క్రిప్టు తయారుచేసుకునే వారు. మనలాగా రచయితని వెళ్ళ గొట్టి,  దర్శకుడిగా అది తన హక్కు అన్నట్టు ఇష్టానుసారం రాసుకోలేదు హిచ్ కాక్. మన దగ్గర లాగా రచయిత చేతులు కట్టుకుని తలూపే బాసిజం కూడా ప్రదర్శించే వారు కాదు హిచ్ కాక్. సెట్ లో ఏది ఎలా జరగాలో టేబుల్ పైనే పూర్తి చేసేవారు. అందుకే స్క్రిప్టు పూర్తవగానే 90 శాతం సినిమా పూర్తయ్యిందనే వారు, తీయడం 10 శాతం పనే అన్నట్టుగా. చివరి శ్వాస వరకూ ఈ పద్ధతిని దాటి పోలేదు  - సి.) 


11. సస్పెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ 
      సస్పెన్స్ కి ఇన్ఫర్మేషన్ చాలా అవసరమని హిచ్ కాక్ ఉవాచ. తెరమీద నటీనటులు చూడనిది ప్రేక్షకులకి చూపడమన్న మాట. కనుక తెరమీద నటీనటులకి ఏదయినా ప్రమాదం జరగబోతూంటే, దాన్ని సీను ప్రారంభంలోనే ప్రేక్షకులకి చూపించెయ్యండి. ఆ తర్వాత మామూలుగా సీను నడపండి. మధ్య మద్యలో ప్రమాద సూచనల్ని చూపిస్తూ పోతున్నప్పుడు సస్పెన్స్ పెరుగుతుంది. ఆ సస్పెన్స్ సదరు నటీనటులు ఫీలవ కూడదనే విషయం  గుర్తు పెట్టుకోండి. ‘ఫ్యామిలీ ప్లాట్’ లో కారు బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అవుతోందని నటీనటుల కంటే  ముందు ప్రేక్షకులకి చూపించేస్తారు. ‘సైకో’ లో విపరీత పోకడలున్న తల్లి గురించి ప్రేక్షకులకి తెలియజేస్తారు- విచారణ జరుపుతున్న డిటెక్టివ్ కి ఈ సమాచారం వుండదు. అప్పుడు ఆ ఇంట్లోకి డిటెక్టివ్ అడుగు పెట్టినప్పుడు విపరీతమైన సస్పెన్స్ ఏర్పడుతుంది- హిచ్ కాక్ మొత్తం  కెరీర్ లో ఇది అత్యంత సస్పెన్స్ తో కూడుకున్న సీనుగా ప్రఖ్యాతి  చెందింది. రియల్ సస్పెన్స్ ని పిండాలంటే  మొదట ఆడియెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలన్నది హిచ్ కాక్ పధ్ధతి.


12. సర్ ప్రైజ్ ట్విస్టు



     ప్రేక్షకుల్ని సస్పెన్సుతో కట్టి పడేశాక వాళ్ళూహించే ముగింపు ఇవ్వకండి. బాంబుతో సస్పెన్స్ సృష్టిస్తే ఆ బాంబు పేలకూడదు.  ప్రేక్షకులు ఊహించుకున్తున్నట్టే దగ్గరిదాకా తీసికెళ్ళి తలకిందులు చేయండి – ఇది సర్ ప్రైజ్ ట్విస్టు.


                                                                ***సమాప్తం***


Saturday, July 9, 2016

రివ్యూ






రచన – దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్

తారాగణం ; సల్మాన్ ఖాన్, అనూష్కా శర్మ, అనంత్ శర్మ,
రణదీప్ హూడా, అమిత్ సాద్ తదితరులు
సంగీతం : విశాల్ -  శేఖర్, ఛాయాగ్రహణం : ఆర్టర్ జురావ్ స్కీ
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత :  ఆదిత్య చోప్రా
విడుదల : 6 జులై 2016

***
       స్పోర్ట్స్ డ్రామా తీసుకుని సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ ఫ్యాన్స్ కి  పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. కిందటిసారి ‘భజరంగీ భాయిజాన్’ అనే ఎంటర్ టైనర్ తో ఫ్యాన్స్ నే కాకుండా ఇతర అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించగల్గిన సల్మాన్, ఈ సారి సీరియస్ డ్రామాని మిళితం చేసిన బలమైన  -సారీ!  - బరువైన కమర్షియల్ ని అందించాడు. పహిల్వాన్ గా ప్రారంభమై మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యోధుడిగా ఎదిగే క్రమాన్ని యమ సీరియస్ గా చూపించుకొచ్చాడు. ఈ క్రమంలో రెండు అంశాలు ప్రతిబంధకాలుగా మారాయి : ఒకటి, నార్మల్ హిందీ భాష  కాకుండా హర్యాన్వీ యాసతో సినిమా నిండి వుండడం; రెండు, ఎక్కడా ఎమోషన్ అనేది క్యారీ కాక పోవడం. గత  ఆగస్టులో విడుదలైన  అక్షయ్ కుమార్ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘బ్రదర్స్’ ని గుర్తుకు తెచ్చే ‘సుల్తాన్’  సెకండాఫ్ అంతా కూడా  ‘బ్రదర్స్’  లాగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్ తో నిండిపోయి ఒక స్పోర్ట్స్ చానెల్ చూస్తున్నట్టు వుంటుంది. ఐతే ఈ ఈవెంట్ లో ‘బ్రదర్స్’ లో వున్నంత జీవం ‘సుల్తాన్’ లో లోపించడం ప్రత్యేకత.

     ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ అనే సూపర్ హిట్ రోమాంటిక్ కామెడీ తీసిన చోప్రా క్యాంపు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, ‘సుల్తాన్’ లాంటి ఆలిండియా – ఓవర్సీస్ హిందీ కమర్షియల్ సినిమాని కూడా ఒక ప్రాంతానికి వర్తింపజేసి అక్కడి వాతావరణంతో, యాసతో, పాటలతో, డ్రామాతో ప్రాంతీయ సినిమాలా అన్పించేలా తీయడమనేది మాత్రం నార్మల్ హిందీ సినిమాలు చూసేవాళ్ళకి  కాస్త ఇబ్బంది పెట్టే వ్యవహారమే. పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా వున్న ‘సుల్తాన్’ ఫ్యామిలీస్ కంటే కూడా ఫక్తు మాస్ కమర్షియల్ అంశాలతో యూత్ ని ఎక్కువ ఆకర్షిస్తూ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. 

        ఇంతకీ దీని కథా కమామిషు ఏమిటి?

కథ
      ఢిల్లీకి చెందిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ సంస్థ ప్రతినిధి ఆకాష్ ఒబెరాయ్ ( అమిత్ సాధ్) త్వరలో జరగనున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో  పోటీకి పెట్టాల్సిన ఫైటర్  గురించి అన్వేషిస్తూ హర్యానాలోని ఒక గ్రామానికొస్తాడు. అక్కడ తన క్కావలసిన మాజీ రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్ సుల్తాన్ (సల్మాన్ ఖాన్) ని కలుసుకుంటాడు. కానీ  సుల్తాన్ తనకి అసక్తిలేదని ఆ ఆఫర్ ని తిరస్కరిస్తాడు.  అక్కడి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఒక బ్లడ్ బ్యాంకు స్థాపించడానికి విరాళాలు సేకరించే పని కూడా పెట్టుకున్న సుల్తాన్ గతం గురించి అతడి మిత్రుడు గోవింద్ ( అనంత్ శర్మ) ఆకాష్ ఒబెరాయ్ కి చెప్పడం ప్రారంభిస్తాడు. 

        ఎనిమిదేళ్ళ క్రితం గ్రామంలో కేబుల్ టీవీ నిర్వహిస్తూ మిత్రులతో హుషారుగా తిరిగే సుల్తాన్ ఆ వూళ్ళో  కుస్తీ పోటీలకి శిక్షణ నిచ్చే బర్కత్ (కుముద్ మిశ్రా) కూతురు  ఆర్ఫా (అనూష్కా శర్మ) తో ప్రేమలో పడతాడు. ఆమెకీ ప్రేమలూ గీమలూ నచ్చవు. రెజ్లింగ్ లో వరల్డ్ ఛాంపియన్ అన్పించుకునే లక్ష్యంతో, ఒలంపిక్స్ కి వెళ్లాలని  కృషి చేస్తూంటుంది. ఒక లక్ష్యం  లేకుండా తిరిగే సుల్తాన్ ని అవమానిస్తుంది. దీంతో తనూ ఆమె తండ్రి దగ్గరే  కుస్తీ నేర్చుకుని నేషనల్ ఛాంపియన్ వరకూ ఎదుగుతాడు. అతణ్ణి పెళ్లి  చేసుకుంటుంది ఆర్ఫా. గర్భవతవుతుంది. ఆమెకి నెలలు నిండిన సమయంలో వరల్డ్ ఛాంపియన్ కెళ్తాడు సుల్తాన్. అక్కడ  గెలుస్తున్న సమయంలో ఇక్కడ కొడుకు పుట్టి చనిపోతాడు. అరుదైన ‘ఓ-పాజిటివ్’ బ్లడ్ గ్రూపుతో పుట్టిన కొడుకు రక్తం దొరక్క రక్త హీనతతో చనిపోతాడు. సుల్తాన్ ది ఆ బ్లడ్ గ్రూపే. దీంతో తను దగ్గరుండి కొడుకుని రక్షించుకోలేక పోయాననే తీవ్ర క్షోభకి లోనవుతాడు. కొడుకుని బతికించుకోలేకపోయిన తను కూడా  మొహం చూపించలేనని దూరమవుతుంది ఆర్ఫా. ఇక సుల్తాన్ తన కొడుకు లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని వాడి పేర బ్లడ్ బ్యాంకు స్థాపించే లక్ష్యం తో, క్రీడా రంగాన్ని వదిలేసి, ఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు...  

        ఈ గతం తెలుసుకున్న ఆకాష్ ఒబెరాయ్ బ్లడ్ బ్యాంకు పెట్టాలంటే సుల్తాన్ మళ్ళీ రెజ్లింగ్ కి సిద్ధం కావాలని, చాలా  డబ్బొస్తుందనీ  ఒప్పించి తీసుకుపోతాడు...ఆ వరల్డ్ మిక్స్డ్ మార్షల్ ఈవెంట్ కోసం తిరిగి శిక్షణ పొంది,  అంతర్జాతీయ ఫైటర్స్ ని సుల్తాన్ ఎలా ఓడించాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      ముందే చెప్పుకున్నట్టు గత ఆగస్టులో విడుదలైన ‘బ్రదర్స్’ ని గుర్తుకు తెస్తుంది ఈ కథ. ‘బ్రదర్స్’  హాలీవుడ్ ‘వారియర్’  కి అధికారిక రీమేక్. అందులో సగటు ఉద్యోగి అయిన అక్షయ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన కూతురి వైద్యం కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా మారతాడు.
        ‘సుల్తాన్’ లో సల్మాన్ ఖాన్ చనిపోయిన కొడుకు పేర బ్లడ్ బ్యాంకు కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా దిగుతాడు.
        ‘బ్రదర్స్’ లో ఓపక్క క్యాన్సర్ తో యాతన పడుతున్న కూతురితో ప్రత్యక్ష బాధ మనం ఫీలవుతాం.
        ‘సుల్తాన్’ లో ఎప్పుడో చనిపోయిన కొడుకుతో అలాటి ప్రత్యక్ష బాధ ఫీలవ్వం. కనీసం ఆ పుట్టిన శిశువుని కూడా మనకెప్పుడూ చూపించలేదు.
         ‘బ్రదర్స్’  ఈవెంట్ లో సొంత తమ్ముడు( సిద్ధార్థ్ మల్హోత్రా) తో తలపడాల్సి వస్తుంది అక్షయ్ కుమార్ కి.
        ‘సుల్తాన్’ ఈవెంట్ లో ఏ సంబంధం, ఏ సెంటిమెంట్లూ లేని ఇతర ఫైటర్లతో తలపడతాడు సల్మాన్.
        ‘బ్రదర్స్’ లో చిన్నప్పుడు స్పర్ధలతో విడిపోయిన అన్నదమ్ములు. ఆ కక్షలు ఇంకా కొనసాగుతూ హై ఓల్టేజీ నేపధ్యం. 
        ‘సుల్తాన్’  లో ప్రత్యర్ధులతో గతంలో ఏ కక్షలూ, వృత్తిగత వైషమ్యాలూ లేని జీరో ఓ ల్టేజీ నేపధ్యం.
        ‘బ్రదర్స్’ లో కూతుర్ని బతికించుకోవడానికి సొంత తమ్ముడ్ని కొట్టి ఓడించాలన్న కసితో  అక్షయ్. ఇక్కడ బలమైన మెలోడ్రామా.
        ‘సుల్తాన్’ లో కొడుకు బ్లడ్ బ్యాక్ కోసం ఎట్టి పరిస్థితిలో ప్రత్యర్ధుల్ని ఓడించాలన్న కసితో  సల్మాన్. ఇక్కడ ఆ ప్రత్యర్ధులు తనకేమీ కాకపోవడంతో  మెలోడ్రామా నిల్.
        ‘బ్రదర్స్’ లో అన్న కూతురి పరిస్థితి తెలీని తమ్ముడికి  పాత కక్షల కొద్దీ అన్నమీద గెలవాలన్న పట్టుదల. ఇక్కడ హీరో ( అన్న) లక్ష్యానికి బలమైన ప్రత్యర్ధి తమ్ముడు.  దీంతో కథకి హీరోతో బాటూ విలనూ  కుదిరారు.
        ‘సుల్తాన్’ లో తనకేమీ కాని సల్మాన్  ప్రత్యర్దులకి పాతకక్షలతో గెలిచి తీరాలన్న ఎమోషన్ లేదు. ఇక్కడ హీరో (సల్మాన్) లక్ష్యానికి అడ్డుతగిలే ప్రత్యర్ధు లెవరూ లేరు. అందుకని ఈ కథలో హీరోకి విలన్లు లేరు.
        ‘బ్రదర్స్’ లో అక్షయ్ తమ్ముడ్ని కసిదీరా కొడుతున్నప్పుడు చిన్నప్పుడు అల్లారు ముద్దుగా అతణ్ణి ఎత్తుకు తిరిగిన దృశ్యాలతో మనకి గుండెలు బరువెక్కే అనుభవం.
        ‘సుల్తాన్’ లో సల్మాన్ పోరాడుతున్నప్పుడు కొడుకు ఖాళీ ఉయ్యాల దృశ్యాలతో ఎమోషన్ నిల్. తను కొడుతున్న ప్రత్యర్ధులకి కొడుకుతో ఏ కనెక్షనూ లేకపోవడం వల్ల.
         ‘బ్రదర్స్’ లో  కూతురి అవసరం కొద్దీ నడివయసులో ఫైటర్ గా దిగిన అన్నకి,  కుర్ర వయసులో వున్న తమ్ముడి తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ హోరాహోరీ.
        ‘సుల్తాన్’ లో అప్పటికి నడివయసు పాత్రగా వున్న సల్మాన్ కి, ప్రత్యర్ధులతో ఈ కాంట్రాస్ట్ లేని  మిక్స్డ్ మార్షల్  ఆర్ట్స్ జోరు.
        ‘బ్రదర్స్’ లో అన్న మీద తమ్ముడు గెలుస్తాడా, తమ్ముడి కోసం అన్న త్యాగం చేస్తాడా అన్న ఎడతెగని సస్పెన్స్.
        ‘సుల్తాన్’ లో ప్రత్యర్ధుల మీద సల్మానే  గెలుస్తూ పోతాడని ముందే తెలిసిపోయే విషయం. దీంతో సస్పెన్స్, ఉత్కంఠ, థ్రిల్, ఎమోషన్, ఇంటరెస్ట్ వగైరా నిల్.
        ‘బ్రదర్స్’ లో చివరికి తమ్ముడి భుజం విరిచేసి- ‘ఒరే ఇక చాలించరా!’ అని అన్న ఏడ్పు. అయినా పట్టువదలక  అలాగే అన్నని పడ దోసి లాక్ చేసి- ‘ఆవిడ నాక్కూడా అమ్మే కదరా?’ అన్న తమ్ముడి ఆక్రందన.
        ‘సుల్తాన్’  లో సల్మాన్ ప్రక్క టెముకలు విరిచేస్తాడు ప్రత్యర్ధి. ఆ గాయమైన చోటే కొడుతూంటే అలాగే ఫైట్ చేస్తాడు సల్మాన్ గాయం తాలూకు బాధతో మాత్రం.
        ‘బ్రదర్స్’ లో ఈవెంట్ గెలిచి, భుజం విరిగిన తమ్ముణ్ణి ఆర్తిగా పొదివి పట్టుకుని బయటికి తీసుకుపోతాడు  అక్షయ్.
         ‘సుల్తాన్’ లో ఈవెంట్ గెలిచి ఎమోషనల్ గా  భార్య దగ్గరికి వెళ్తాడు సల్మాన్.
        ‘బ్రదర్స్’  లో స్టోరీ పాయింటు ( కూతురి చికిత్స కోసం ఈవెంట్ గెలవడం) తో బాటు, కథా ప్రయోజనం కూడా నెరవేరింది. కథా ప్రయోజనం ఈ ఈవెంట్ ద్వారా తిరిగి అన్నదమ్ములు ఒకటవడం.
        ‘సుల్తాన్’ స్టోరీ పాయింటు (బ్లడ్ బ్యాంక్ కోసం ఈవెంట్ గెలవడం) తో పాటు కథా ప్రయోజనం కూడా నేరవీరింది గానీ, విడిపోయిన భార్యాభర్తలు ఒకటవడం ముందే చూపించడం తో  ముగింపులో చూపించడానికి ఏమీ లేకుండా పోయింది.
        ‘బ్రదర్స్’ లో అన్నదమ్ముల కలయిక అనే ముగింపుతో సంతృప్తిగా బయటి కొస్తాం.
        ‘సుల్తాన్’ లో భార్యాభర్తల కలయిక ముందే జరిగిపోవడంతో కేవలం ఈవెంట్ గెలవడం తాలూకు యాంత్రిక ముగింపుతో అసంతృప్తితో బయటి కొస్తాం. 

ఎవరెలా చేశారు 
      సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ లో వున్నంత స్లిమ్ గా, గ్లామరస్ గా కాక, భారీ కాయంతో ఫేస్ తో మృదుత్వం తగ్గి మోటుగా కన్పిస్తాడు. వయసు పైబడ్డం వల్ల రోమాంటిక్ సీన్స్ లో డాన్సుల్లో ఇదివరకటి పెప్, ఫన్, బాక్సాఫీసు అప్పీల్ కన్పించదు. ఆ భారీకాయం పోరాటాలకే పనికొచ్చింది. అదికూడా  సాటి ఫైటర్ల ఫాంలో వున్న శరీరాల ముందు ఎబ్బెట్టుగా కన్పిస్తాడు. పొట్ట పెరిగి కొట్టొచ్చినట్టు కన్పిస్తూంటుంది. సాటి ఫైటర్ల ప్రొఫెషనల్ కండలకీ, సల్మాన్ కండలకీ తేడా కూడా అంతే. ఫస్టాఫ్ లో ప్రేమ పేరుతో పెప్ తగ్గినా కామెడీ చేస్తూ ఎలాగో ఎంటర్ టైన్ చేసినా, సెకండాఫ్ కొచ్చేసరికి పూర్తి సీరియస్ పాత్రగా మారిపోతాడు. రిలీఫ్, ఎంటర్ టైన్ మెంట్ ఏదీ ఇవ్వడు. 

        అనూష్కా శర్మ గ్లామర్ పాత్రలో బాగానే వుందిగానీ, స్త్రీ స్వేచ్చ గురించి అంత చెప్పి  రెజ్లింగ్ లో పెద్ద లక్ష్యమే పెట్టుకున్న ఆమె పాత్ర-  పెళ్లి చేసుకోవడం, అయినా  గర్భం దాల్చకుండా జాగ్రత్త పడకపోవడం, తల్లిగా మారడం- లక్ష్యం గాలి కెగిరిపోవడం- పాత్రని చంపి కథ నడపడం కోసమన్నట్టుగా తయారయ్యింది. ఇంటర్వెల్ కే  పుట్టిన కొడుకు చనిపోయిన కాడ్నించీ తనుకూడా విషాదంగానే వుండిపోతుంది చివరివరకూ.  

        ఈ రెండే చెప్పుకోదగ్గ పాత్రలు. మిగిలిన పాత్రలకి పెద్దగా పనేమీ లేదు. రణదీప్ హూడా కూడా సల్మాన్ కి ట్రైనింగ్ ఇచ్చి తప్పుకుంటాడు. అతను  కూడా ఈవెంట్ లో సల్మాన్ కి తోడుగా వుంటే అర్ధవంతంగా వుండేది. 

        హర్యాన్వీ హిందీ, పాటలు కూడా అలాంటివే, ఫస్టాఫ్ అంతా హర్యానా కల్చర్ తో పల్లెటూళ్లోనే, అక్కడి పల్లెటూరి పాత్రలూ...ఒక హిందీ సినిమా చూస్తున్నట్టు కాకుండా  ఏ  భోజ్ పురి లాంటి ప్రాంతీయ సినిమానో చూస్తున్నట్టు వుంటుంది. ఇక ఫైట్స్ అద్భుతంగా వున్నాయి గానీ, వాటి నేపధ్యంలో జీవం లేకపోవడంతో అవి ఫక్తు స్పోర్ట్స్ టీవీ చూస్తున్నట్టు అన్పిస్తాయి. ఇక ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఛాయాగ్రహణం భారీగానే వుండడం ఆశ్చర్య పడాల్సిన పనికాదు. 

చివరికేమిటి
    సినిమా ఎలా వున్నా సల్మాన్ కోసం చూసేసి ఓ పనయ్యిందని పించుకునే వాళ్ళు ఎలాగూ చూస్తారు, చూస్తున్నారు. వాళ్ళల్లో లేడీస్ మాత్రం వాళ్ళ భర్తలతో, పిల్లలతో ఫస్టాఫ్ లోనే వెళ్ళిపోయే దృశ్యాలు మన దగ్గర కన్పిస్తున్నాయి- నార్మల్ హిందీ భాషలో మాటలు, పాటలూ లేకపోవడం వల్లకావొచ్చు. ఇక సెకండాఫ్ లో నైతే  లేడీస్ ఆకట్టుకునే అంశాలకి దూరంగా  ఫైట్ తర్వాత భారీ ఫైట్ గా సాగడంతో – ఈ మధ్య కాలంలో మొదటి సారిగా సల్మాన్ వాళ్ళని నిరాశ పరుస్తాడు. యూత్ కి ఓకే. వాళ్ళలో ‘బ్రదర్స్’ చూసి వున్నవాళ్ళకి కూడా ఓకే.  సల్మాన్  ఎత్తి ఎత్తి కొడుతూంటే చూడాలిగానీ,  సినిమాలో అసలు సరుకు ఎవరికవసరం?

-సికిందర్
http://www.cinemabazaar.in






         

         




Monday, July 4, 2016

కామెడీ సంగతులు- 3

   హాలీవుడ్ లో ఒక పూర్తి స్థాయి కామెడీ స్క్రిప్టు రాయాలంటే  మొదటి పేజీలోనే నవ్వించగల్గాలి. మొదటి పేజీలో నవ్వించ లేదంటే స్క్రిప్టులు  చదివే స్టూడియో ఎగ్జిక్యూటివ్ దాన్ని పక్కన పెట్టేసే ప్రమాదముంది. మొదటి పేజీలోనే  నవ్వించడమంటే ఇంకా నిద్ర లేవని హీరో మీద బామ్మగారు  బిందెడు నీళ్ళు తెచ్చి గుమ్మరించడంలాంటి అరిగిపోయిన సీను కాదు. ఎప్పటికప్పటి అభిరుచులకి తగ్గట్టు తాజాగా  క్రేజీగా బుర్ర తిరిగిపోయే సరికొత్త కామిక్ ఐడియాతో వుండాలి. తెలుగులో ఇంత  అవసరం రావడంలేదు, మొదటి పేజీ నిబంధన అంటూ ఏదీ లేదు కాబట్టి. ఐతే కామెడీ అనగానే కథలు చాలా ఆషామాషీగా రాసేయడం మాత్రం జరుగుతోంది. జోకులతో నవ్వించడమే కామెడీ అన్నట్టు సాగుతోంది. కథలేని వంద జోకులకన్నా, జోకుల్లేని కథ వున్న సినిమాలు వందరెట్లు బెటర్ అన్పించుకుంటాయి.
        కామెడీ జానర్ కీ, ఇతర జానర్లకీ స్ట్రక్చర్ లో తేడా ఏమీ వుండదు. ఏ జానర్ లో  కథ కైనా స్ట్రక్చర్ ఒకటే.  అదే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు; వాటిలో వాటి తాలూకు బిజినెస్ లు, ప్లాట్ పాయింట్లు అన్నీ ఒకటే. కాకపోతే ఇవి కామెడీకి హాస్య రూపంలోకి బదిలీ అవుతాయి.  ఈ హాస్య రూపం రివర్స్ మెకానిజం వల్ల  ఏర్పడుతుంది. ఇతర కథల్లో హీరో ఫలానాది జరగాలని ప్రయత్నిస్తూంటాడు, కామెడీల్లో హీరో ఫలానాది జరక్కూడదని చెడగొడు తూంటాడు. జరిగితే తన పరువే పోవచ్చు, లేదా  నల్గురు కలిసి తనని తన్న వచ్చు. అవన్నీ  హీరోకి జరిగి తీరాలని విలన్ తెగ కౌంటర్ పథకా లేస్తూంటాడు. దొంగ పెళ్లి చేసుకున్న హీరో అది బయట పడకుండా ప్రయత్నించడం, మర్డర్ చేశాననుకుని ఫీలవుతున్న హీరో ఎక్కడ పోలీసులకి దొరికిపోతానో అని భయపడి చావడం, స్వయంవరం లో హీరోయిన్ని సొంతం చేసుకుందామని వెళ్ళిన హీరోకి అక్కడ తన గుట్టు తెలిసిన విలన్ ఎదురు పడ్డం...లాంటి ఇరకాటాలే కామెడీ కథల రివర్స్ మెకానిజపు పరికరాలు. 

        కామెడీ అంటే గందరగోళాలు సృషించే వాళ్ళకీ, ఆ గందరగోళాల  బాధితులకీ మధ్య జరిగే సంఘర్షణ. అయితే ఈ గందరగోళాలకి  మూలం అర్ధంవంతంగా, నమ్మశక్యంగా వుండాలి. ఉదాహరణకి గతవారం విడుదలైన ‘రోజులు మారాయి’ లో కథా మూలం-  హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భర్తలు  మూడ్రోజుల్లో చనిపోతారని బాబా చెప్పడం, అది నమ్మి  తమ వెంట పడుతున్న హీరోలని వదిలించుకోవడానికి హీరోయిన్లు వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అంటే హీరోలని చంపెయ్యడమే అన్న మాట. ఇది కన్విన్సింగ్ గా అన్పించదు.  ఈ కథా మూలం ఆధారంగా కామెడీని ఎంజాయ్ చేయడం కష్టం. 
      ఇందుకే  కామెడీకి సెటప్ వాస్తవికంగా వుండాలి, దాని పర్యవసానంగా పుట్టే   హాస్య ప్రహసనాలు మాత్రం  వాస్తవికంగా, లాజికల్ గా వుండ నవసరం లేదు. ఎంత మైండ్ లెస్ కామెడీగా నైనా ఉండొచ్చు ( హిందీ ‘గోల్ మాల్’ సిరీస్ సినిమాలు). కామెడీ కథ పుట్టడానికి మూలమైన సంఘర్షణ, సంఘటన లేదా ఓ కోరిక వాస్తవికంగా, లాజికల్ గా వున్నప్పుడే దాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అసంబద్ధ కామెడీ నైనా చేసి ఒప్పించ వచ్చు. సెటైర్స్ ఇలాగే  పుడతాయి. ఒక పాకెట్ సిగరెట్ల కోసం ఐదుమైళ్ళు కారేసుకుని తండ్రి వెళ్ళడం చూసిన కొడుకు, వాటర్ బాటిల్ కోసం అదే కారేసుకుని వంద మైళ్ళు వెళ్లి రెండ్రోజుల తర్వాత రావడం అబ్సర్డ్ కామెడీ. తండ్రి చేసింది దుబారా కింద కన్విన్సింగ్ గానే అన్పించుకుంటుంది, ఈ సాకుతో కొడుకు చేసింది చాలా అతి. ఇదీ  అబ్సర్డ్ కామెడీ. ఇంకా కొడుకు ఆ కారునే కుదువ బెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని బస్సెక్కి కూడా రావచ్చు. ఇంకెలాటి పిచ్చి పనులైనా చెయ్యవచ్చు, లిమిట్ లేదు. ఎందుకంటే తండ్రి దుబారా అనే మూలం కన్విన్సింగ్ గా వుంటుంది కాబట్టి. ‘అహ నా పెళ్ళంట’ లో పిసినారి కోట శ్రీనివాస రావు ఎదురుగా కోడిని వేలాడదీసుకుని, దాన్ని చూస్తూ చికెన్ కలుపుకుని తింటున్నట్టు ఫీలవుతూ అన్నం తినడం అబ్సర్డ్ కామెడీ. ఎదురుగా కోడి ఉనికి, దాన్ని తింటారనే వాస్తవమూ  లేకపోతే  ఈ కామెడీ పండదు. 

        కామెడీ  పర్ఫెక్షన్ ని కోరుకోదు. పర్ఫెక్షన్ అనేది భ్రాంతి అనుకుంటుంది. కాబట్టి ఒక కామెడీ హీరో చాలా జోకర్ పనులు చేసి చిటికెలో  అద్భుతాలు సాధిస్తాడు. ఈ మాత్రం దానికి  గొప్ప మేధావియే కానక్కర్లేదని చురక అంటిస్తాడు. చార్లీ చాప్లిన్ తర్వాత అలాటి  సైలెంట్ మూవీ కామిక్ సిరీస్ తో పాపులరైన లారెల్ అండ్ హార్డీలు ఈ కోవకి చెందుతారు. 

        కామిక్  హీరో పాసివ్ గా వుండడు, చాలా కమర్షియల్ గా యాక్టివ్ గా వుంటాడు. కథని తనే నడిపిస్తాడు. అతడికీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడుతుంది, అతడికీ ఆ గోల్ కోసం సంఘర్షణ  వుంటుంది. అతనూ ఆ గోల్ ని సాధించి తెరిపిన పడతాడు.  

       
కామెడీ జానర్ లో కి అనేక సబ్ జానర్స్ వున్నాయి. అన్నీ ప్రయత్నించ వచ్చు, లేదా ఏదో ఒకదాన్ని స్పెషలైజ్ చేస్తూ కొనసాగవచ్చు. ప్రధానంగా కామెడీలో రోమాంటిక్ కామెడీ (అహ నా పెళ్ళంట), కామెడీ డ్రామా(బృందావనం), యాక్షన్ కామెడీ (కృష్ణ) , కామిక్ థ్రిల్లర్ (స్వామి రారా), హార్రర్ కామెడీ (ప్రేమ కథా చిత్రం), ఫాంటసికల్ కామెడీ (సోగ్గాడే చిన్ని నాయనా), బ్లూ కామెడీ (ఈరోజుల్లో),  స్పూఫ్ ( సుడిగాడు), ఫార్స్  (రోజులు మారాయి),  బ్లాక్ కామెడీ (మనకి లేదు), సెటైర్ ( మనకి లేదు), పేరడీ ( మనకి లేదు), రాజకీయ కామెడీ (మనకి లేదు)...ఇలా 35 వరకూ వున్నాయి. 

        ఏది తీసుకున్నా స్ట్రక్చర్ ఒకటే.  బిగినింగ్ లో పాత్రల పరిచయం, కథా నేపధ్యం ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్-1). దీంతో బిగినింగ్ విభాగం ముగియడం అనేవి వుంటాయి. 

          ప్లాట్ పాయింట్ -1 అంటే అసలు కథా ప్రారంభమనీ, హీరోకి ఒక గోల్ ఏర్పడ్డ మనీ తెలిసిందే. ‘అహ నా పెళ్ళంట’ లో పిసినారి కోట కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే, తను కూడా పీనాసిలా మారాలని ( నటించాలని) రాజేంద్ర ప్రసాద్ నిర్ణయించుకోవడం గోల్, అసలు కథా ప్రారంభం. 

        ఈ గోల్ లో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ వుంటాయని తెలిసిందే. ఉన్నప్పుడే కథ బలంగా వుంటుంది. ‘ఆహ నా పెళ్ళంట’ లో పరమ పిసినారి కోట శ్రీనివాసరావు కూతురు రజనీని రాజేంద్ర ప్రసాద్ చేసుకోవడం కోటీశ్వరుడైన రాజేంద్ర ప్రసాద్ తండ్రి నూతన్ ప్రసాద్ కిష్ట ముండదు. తను కోటీశ్వరుడి  కొడుకని చెప్పుకోకుండా కోటని ఒప్పించి అతడి కూతుర్ని చేసుకోగల్గితే ఓకే అని షరతు పెడతాడు. ఇందుకో  గడువు విధిస్తాడు. ఈ గడువులోగా ఇది జరక్కపోతే తను చూసిన సంబంధం చేసుకోవాలంటాడు.  

        పదిహేనవ నిమిషంలోనే ఏర్పాటయ్యే ఈ ప్లాట్ పాయింట్ -1 నుంచి బయల్దేరే  రాజేంద్ర ప్రసాద్ కి- 1. గడువు లోగా గోల్ సాధించుకోవాలన్న కోరిక, 2. తండ్రి షరతుతో రిస్కు వున్నా తన ప్రేమనే పణంగా పెట్టడం, 3. తను పిసినారిలా నటిస్తే అది కోట కి తెలిసిపోగల పరిణామాల హెచ్చరిక, 4. తండ్రి పెట్టిన  షరతు వల్ల  పుట్టిన ఎమోషన్ అనే నాల్గు గోల్ ఎలిమెంట్సూ వున్నాయి. 

        ఈ ప్లాట్ పాయింట్ -1  సీన్ ని ఇంకా గమనిస్తే ఇది సీరియస్ గా వుండదు. తండ్రీ కొడుకుల సవాళ్ళు కామెడీగానే వుంటాయి. ఇదే ఒక ప్రేమ కథనో, ఫ్యామిలీ కథనో అయివుంటే ఈ సీను కామెడీగా ఉండకపోవచ్చు. తండ్రీ కొడుకులు సీరియస్ గా ఘర్షణ పడొచ్చు ఆ కథల జానర్ మర్యాద ప్రకారం. కామెడీకి కామెడీగానే ఈ సీను  వుండడం జానర్ మర్యాద. రసభంగం కలిగించని  రస పోషణ అంటారు దీన్ని. 

        మరొకటేమిటంటే, తండ్రీ కొడుకులు ఇంత కామెడీగా సవాళ్లు విసురుకున్నా దీని బ్యాక్ డ్రాప్ కామెడీగా కాక సీరియస్ గానే  వుంటుంది. గోల్ ని సాధించుకోవాలన్న కోరికలో సీరియస్ నెస్, ప్రేమని పణంగా పెట్టడంలో వున్నసీరియస్ నెస్, పిసినారిలా నటిస్తే అది కోట కి తెలిసిపోగల పరిణామాల హెచ్చరిక లో సీరియస్ నెస్, తండ్రి పెట్టిన  షరతు వల్ల  పుట్టిన ఎమోషన్ లోనూ  సీరియస్ నెస్...ఇలా ఈ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో కథనం మాత్రం కామెడీ గానే నడవడం! ఇంత సీరియస్ బ్యాక్ డ్రాప్ లో హీరో పాల్పడే చేష్టలు కామెడీగానే వుండడం! 

     ఈ డైమెన్షన్, ఈ ద్వంద్వాలు,  ఈ కాంట్రాస్ట్, ఈ అదృష్టం ఇంకే జానర్ కథలతోనూ సాధ్యపడదు కామెడీతో తప్ప. ఇతర జానర్ల కథల్లో ఈ బ్యాక్ డ్రాపూ సీరియస్ గానే వుంటుంది, గోల్ కోసం హీరో ప్రయత్నాలూ సీరియస్ గానే వుంటాయని గమనిస్తూంటాం. ఈ తేడా తెలుసుకుని కామెడీ స్ట్రక్చర్ చేసుకోవాలి. 

        ఇంకొకటేమిటంటే,  రోమాంటిక్ కామెడీల్లో ప్రత్యర్ధులు రెండు రకాలుగా వుంటారు : వుంటే హీరో హీరోయిన్లే పరస్పరం ప్రత్యర్ధులుగా వుండడం, లేదా ఇంకోటేదో పాత్ర ( ‘అహ నా పెళ్ళంట’ లో కోట) హీరో హీరోయిన్లు ఇద్దరికీ కలిపి విలన్ గా వుండడం. ఇతర జానర్ల కథల్లో- కామెడీ లో ఇతర సబ్ జానర్లలో సైతం-  హీరో హీరోయిన్లు ప్రత్యర్ధులుగా వుండడం అరుదు. 

        బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ -1 తో ఇలా ముగిశాక, మిడిల్ ప్రారంభమవుతుంది. కామెడీల్లో మిడిల్ అంటే కూడా సంఘర్షణే. రాజేంద్ర ప్రసాద్ కోట ఇంట్లో దిగి పిసినారి చేష్టలు చేయడం గోల్ కోసం చేసే సంఘర్షణే. కోట కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పిసినారిగా నటిస్తాడు. మిడిల్ బిజినెస్ లో క్యారక్టర్ ఆర్క్ పెరుగుతూ పోవాలి. గోల్ కోసం  అడుగడుగునా హీరో తీసుకునే రిస్క్ మీద ఈ ఆర్క్ ఆధారపడి వుంటుంది. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఆర్క్ పెరుగుతుంది. అంతేగాక హీరో పాత్ర ప్రయాణంలో ఎత్తు పల్లాలు కూడా వుంటాయి. ఇక్కడ హీరోయిన్ కి వేరే పెళ్లి సంబంధం చూడ్డం ఇలాంటిదే. అన్ని అవరోధాలూ అధిగమించి చివరికి కోటని ప్రసన్నం చేసుకుంటే, రాజేంద్ర ప్రసాద్  డబ్బున్న వాడు కాదని మెలిక పెడతాడు కోట. దీంతో మొదటి కొస్తుంది. ఇలా దారులన్నీ మూసుకు పోవడం మిడిల్ బిజినెస్ కి ముగింపని తెలిసిందే. ఇది ప్లాట్ పాయింట్-2. ఇక ఇక్కడ్నుంచీ ఎండ్ ప్రారంభం. మళ్ళీ హీరో కొత్త పరిష్కార మార్గం వెతుక్కుని మొదలవ్వాలి. అలాగే చేస్తాడు రాజేంద్ర ప్రసాద్.  కోటకి బుద్ధి చెప్పడానికి మూడు డబ్బున్నసంబంధాలు తెచ్చి గందర గోళం క్రియేట్ చేసి తన కథ సుఖాంతం చేసుకుంటాడు. 

        ఏ కామెడీ జానర్ కైనా ఇదే స్ట్రక్చర్ వుంటుంది. మిగతా జానర్లకి లాగే ఇక్కడా ప్లాట్ పాయింట్ -1 ప్రాణం. పైన వివరించుకున్నట్టు ఈ ప్లాట్ పాయింట్ -1 తో వచ్చే బ్యాక్ డ్రాప్ ఎంత సీరియస్ గా వుంటే అంత బలంగా కామెడీ వర్కౌట్ అవుతుంది. లేని పక్షంలో ఒట్టి జోకులతో కాలం గడపాల్సి వస్తుంది.  ఫాంటసికల్ కామెడీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో  చిన్న నాగార్జున- లావణ్యలు విడాకుల కోసం రావడం సీరియస్ బ్యాక్ డ్రాప్. ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ లో వినాయక విగ్రహ అపహరణ అనే బ్యాక్ డ్రాప్ కూడా సీరియస్ ఐనదే. ‘బృందావనం’ అనే ఫ్యామిలీ కామెడీలో రాజేంద్ర ప్రసాద్ తాతా నానమ్మ లైన గుమ్మడి, అంజలీదేవిల భవంతిని రమ్యకృష్ణ  తండ్రి సత్యనారాయణ చీట్ చేసి కొట్టేయడం కూడా సీరియస్ బ్యాక్ డ్రాపే. ‘సుడిగాడు’ లో అల్లరి నరేష్ పుట్టినప్పుడు జయప్రకాష్  రెడ్డి కొడుకు మీద మూత్రం పోస్తే  అతను చనిపోయి అల్లరి నరేష్ మీద జయప్రకాశ్ రెడ్డికి పగ రగలడమూ సీరియస్ బ్యాక్ డ్రాపే...కామెడీకి బాగా వర్కౌటయ్యే ఈ సీరియస్ బ్యాక్ డ్రా పుల విషయంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే : ఇక్కడ ఏర్పడే ప్లాట్ పాయింట్ -1 మాత్రం సీరియస్ గా ఉండకూడదు. పాత్రలు కామెడీ గానే ప్రవర్తించాలి- పైన ‘అహ నా పెళ్ళంట’ లో  పేర్కొన్న తండ్రీ కొడుకుల సవాళ్ళ లాగా!

        కామెడీ కథనం డైనమిక్స్ ప్రధానంగా సాగుతుంది. జూలో కంచె  దూకి పులితో సేల్ఫీ దిగి వచ్చిన అఖిలేష్ విజయగర్వంతో యూరినల్స్ కి వెళ్తే అక్కడ పులి వుండడం రివర్స్ మెకానిజంతో ఏర్పడే డైనమిక్స్. నవ్వొచ్చే విధంగా, ప్రేక్షకుల ఊహకందకుండా, ఆనందం విషాదంగా మారడం, విషాదం ఆనందంగా మారడమనే పంచ్ కామెడీ కథనానికి ప్రాణం. డైనమిక్స్ ఎప్పుడూ పాత్రల కదలికలతో, యాక్షన్ ప్రధానంగా వుంటే మంచిది. పాత్రలు కదలకుండా వున్న చోటే వుండి  డైలాగులతో కామెడీ నడపడం  అన్ని సీన్లకీ పనికి రాదు. ఇలాటి వెర్బల్ కామెడీ వల్ల  నడక మందగిస్తుంది. విజువల్ కామెడీ తో పరుగులు పెడుతుంది కథనం. సినిమా విజువల్ మీడియా అనేది గుర్తుంచుకోవాలి. సినిమా విజువల్ మీడియా  అని గుర్తు పెట్టుకుంటే చాలా సినిమాలు బాగు పడతాయి- ‘ఒక మనసు’ లాంటివి రావు. 

        ఇక కామెడీని ద్వంద్వార్ధాలతో నడపాలా వద్దా అనేది  రచయిత ఇష్టం. కానీ కామెడీ పేరుతో  సమాజంలో ఏ వొక వర్గాన్నీ కించపర్చకుండా వుంటే మంచిది.  అలాగే కామెడీ-హేళన – ఈ రెండిటి పట్ల అప్రమత్తంగా వుండకపోతే ఆత్మరక్షణలో పడక తప్పదు. రాస్తున్న కామెడీ హేళన చేసే విధంగా ఉందేమో సరిచూసుకోవాలి. లేకపోతే తనని రేపైన మహిళ తో పోల్చుకున్న సల్మాన్ ఖాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుంది. లేదా లతా మంగేష్కర్ నీ, సచిన్ టెండూల్కర్ నీ పాత్రలుగా చేసి ఘోరమైన సెటైర్లు వేసిన తన్మయ్  భట్ లాంటి చిక్కుల్లో పడక తప్పదు. ఇలాటివి డార్క్ హ్యూమర్ కింద చెల్లిపోవు. ‘అ ఆ’ లో కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన సమంతా ని డాక్టర్ ట్రీట్ చేశాక, ‘మీ కిచెన్ లోకి వాడిగా వుండే వేరే కత్తులు కొనండి’  అని కామెడీ ఏదో చేస్తే అదీ  డార్క్ హ్యూమర్ అన్పించుకుంటుంది.
(సమాప్తం)


-సికిందర్