తెలుగు సినిమా
స్క్రీన్ ప్లే
ఐడియా నుంచీ
డైలాగ్ వెర్షన్ దాకా!
స్ట్రక్చర్, అంటే ఇక్కడ కథా నిర్మాణమనే అర్ధంలో,
రకరకాల వాదాలమధ్య నలుగుతోంది. సినిమా కథకి
స్ట్రక్చర్ అనేదే అవసరం లేదనీ, మనసుకు నచ్చిన విధంగా రాసుకు పోతే చాలనీ,
స్ట్రక్చర్ సృజనాత్మక స్వేచ్చ ని హరించి వేస్తుందనీ అనే వాళ్ళూ; లేదు త్రీ
యాక్ట్స్ స్ట్రక్చర్ ఉండాల్సిం దేననీ, అప్పుడే కథ చెదిరిపోకుండా ఒక చట్రంలో
ఉంటుందనీ చెప్పేవాళ్ళూ వున్నారు. అలాగే త్రీ యాక్ట్స్ కాకుండా ఎనిమిది యాక్ట్స్ వరకూ
ఎన్నైనా వుండవచ్చనీ పుస్తకాలు రాసేవాళ్ళూ వున్నారు. ఇది హాలీవుడ్ లో సంగతి.
హాలీవుడ్ మాత్రం ఇవేవీ పట్టకుండా, తన
ధోరణిలో త్రీ యాక్ట్స్ తో సినిమాలు తీసుకుంటూ పోతోంది. హాలీవుడ్ తీసేది ప్రధాన
స్రవంతి కమర్షియల్ సినిమాలు. దానికి నప్పే నిర్మాణం త్రీ యాక్ట్స్ అని ఎప్పుడో
కనిపెట్టింది. ప్రొఫెసర్ విలియం ఫ్రోగ్ లాంటి నిర్మాణం అవసరం లేదని వాదించే పండితుల
నిజాయితీని శంకించాల్సిందే. ఎందుకంటే, పూర్వం లేని ఈ వాదం ఎనభైల నుంచి మొదలైంది.
అది సిల్ ఫీల్డ్ అనే కొత్త పండితుడు తెరపైకి వచ్చి, కథకి త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్
గురించీ, అది ఉండాల్సిన పధ్ధతి గురించీ కచ్చితంగా కొలతలేసి చెప్పడంతో,
ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక, వర్ధమాన సినిమా రచయితల్లో, దర్శకుల్లో ఆయన విపరీతంగా
పాపులర్ అయ్యాడు.
దీనికి ఓర్వలేనట్టు కొందరు పాత స్కూలు
పండితులు వాళ్ళ స్క్రీన్ ప్లే పాఠ్య పుస్తకాల్లో
త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ ని చెండాడుతూ, పరోక్షంగా కొత్త స్కూలు పండితుడు సిడ్
ఫీల్డ్ ని తూలనాడుతూ అక్కసు వెళ్ళ గక్కుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే అంటే అదేదో
బ్రహ్మ పదార్ధంలా అన్పించే దాన్ని, సిడ్ ఫీల్డ్ పదేళ్ళ పిల్లలకి కూడా అర్ధమయ్యే
భాషలో నేలకి దించి, సరళీకరించి మరీ పాఠాలు చెప్పుకొచ్చాడు. అతడి ప్రభావం తెలుగు
సినిమా రంగంలోనూ నవతరంపై చాలా వుంది.
ఇంతకీ స్ట్రక్చర్ అవసరం లేదని చెప్పే
వాళ్ళు కూడా ప్రచారం చేసేది ఇంకో రూపం లో త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ నే! ఫస్ట్
యాక్ట్- సెకండ్ యాక్ట్- థర్డ్ యాక్ట్ బదులుగా, బిగినింగ్- మిడిల్- ఎండ్
అంటున్నారు. అంటే ఇది కూడా ఒక స్ట్రక్చరే కదా? మరి స్ట్రక్చర్ ని తూలనాడడ మేమిటి? అంటే
సిడ్ ఫీల్డ్ సృజనాత్మక స్వేచ్ఛ ని హరించేలా కొలతలేసి చెప్తున్నాడు, మేమలా చెప్పడం
లేదని సమర్ధించుకుంటారు, అంతే. సిడ్ ఫీల్డ్ ఏం చెప్తున్నాడు? ఈ కింది పటం ఒక సారి
చూడండి:
స్క్రీన్ ప్లే ని 120 పేజీలుగా నిర్ణయించి, యాక్ట్ -1
ముప్ఫై పేజీ లుండాలనీ, యాక్ట్ -2 అరవై పేజీ లుండాలనీ, యాక్ట్-3 మరో ముప్ఫై పేజీ
లుండాలనీ చెప్పాడు. 60వ పేజీ దగ్గర ఇంటర్వెల్ పడాలనీ, ఇంటర్వెల్ కి దారి తీసే పించ్- 1 అనే ఘట్టం 45 వ పేజీ లో పడాలనీ, అలాగే
క్లైమాక్స్ అంటే యాక్ట్ -3 ని ప్రేరేపించే పించ్ - 2 అనే ఘట్టం 75వ పేజీలో పడాలనీ సూచించాడు.
ఈ లెక్కలు ఎలా చెప్పగలిగాడు? పూర్వం ఈజిప్షియన్
నిర్మాత ఫువాద్ సైద్ నడిపే ‘సినీ మొబైల్’ అనే సినిమా కంపెనీలో తను స్క్రిప్టులు
చదివే ఉద్యోగం చేస్తున్నప్పుడు, వందలాది
స్క్రీన్ ప్లేల్ని పరిశీలనగా చదివే వాడు సిడ్ ఫీల్డ్. కొత్తా పాతా రచయితలెందరో
అసంఖ్యాకంగా పంపుతున్న ఆ స్క్రీన్ ప్లేల్లో కామన్ గా ఒకే ‘స్ట్రక్చర్’ కన్పించేది.
అందులో పాతిక ముప్ఫై పేజీలకల్లా మొదటి
మలుపు వచ్చేది, 50-60 పేజీల మధ్య ఇంటర్వెల్ వచ్చేది, 90-100 పేజీల మధ్య క్లైమాక్స్
మొదలయ్యేది.
|
సిడ్
ఫీల్డ్ (1935 – 2013)
|
బహుశా ఇంకే పండితుడూ ఈ పరిశీలన
చేయలేదు. ఈ పరిశీలనే సిడ్ ఫీల్డ్ థియరీకి
ఆధారమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో వేలాది రచయితలూ ఇలా ఒకే స్ట్రక్చర్ లో
వ్రాసి పంపుతున్నారంటే- అలా రాయమని వాళ్లకి ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పనవసరం లేదు-
అది సహజంగా ప్రాచీన మౌఖిక కథల కాలం నుంచీ సబ్ కాన్షస్ లో అనువంశికంగా- అంటే
జెనెటికల్ గా అచ్చొత్తి ఉన్నదే.
హాలీవుడ్ స్క్రీన్ ప్లే నిబంధనల
ప్రకారం, స్క్రీన్ ప్లేల్ని 12 పాయింట్ కొరియర్ ఫాంట్ లో
టైపు చేయవలసి వుంటుంది. అలా టైపు చేసిన స్క్రీన్
ప్లేలో ఒక పేజీ మేటర్ తెరమీద ఒక నిమిషం పాటు వస్తుంది. తన పరీశీలనని పట్టుకుని
సిడ్ ఫీల్డ్ హాలీవుడ్ సినిమాలని చూస్తే, ఆ
రచయితలు పంపుతున్న స్క్రీన్ ప్లేల్లో పేజీల లెక్క సినిమాల నడకతో సరిపోతోంది.
ఇంచుమించు పాతిక ముప్ఫై నిమిషాలకి( పాతిక ముప్ఫై పేజీలకి) మొదటి మలుపు వచ్చేస్తోంది.
అలాగే మిగతావీ. అంటే స్క్రిప్టులూ సినిమాలూ లెక్కతో ఉంటున్నాయి.
మన స్క్రీన్ ప్లేలకి ఇలా..
ఇది భారతీయ సినిమాలకి వర్తించదు. ఎందుకంటే,
హాలీవుడ్ సినిమాలు అనుకున్నపాయింటు మీదే కథ సూటిగా నడుస్తూ, ఇంకే కామెడీ ట్రాకులు,
పాటలు, ఐదారు ఫైట్లు, ఇంకేవో ఉప కథలూ (సబ్ ప్లాట్స్) అనే హంగులతో వుండవు కాబట్టి,
వాటి కథలకి ఆ స్ట్రక్చర్ లెక్కలు నప్పుతాయి. భారతీయ సినిమాలు షడ్రసోపేతంగా ఉండాలనే
భరతముని నాటక సూత్రాల మీద ఆధారపడి తయారవుతాయి కాబట్టి, కథ ప్రారంభించాక కమెడియన్లు కామెడీ చేయడం, హీరో హీరోయిన్లు ఒకటి
రెండు పాటలు పాడుకోవడం, హీరో కనీసం ఒక ఫైట్ చేసే సరికల్లా సిడ్ ఫీల్డ్ లెక్కలో
అరగంట గడిచిపోయి, ఇంటర్వెల్లో మొదటి మలుపు వస్తుంది. ఇలాటి సినిమాలదే మెజారిటీ
సంఖ్య.
కాబట్టి తెలుగు సినిమా స్క్రీన్
ప్లేల్ని సిడ్ ఫీల్డ్ కొలతలతో చూడకుండా, తెలుగు నేటివిటీని దృష్టిలో పెట్టుకుని, ఏ
కథకా కథ డిమాండ్ చేసే లెక్కల్లో రచించుకోవాల్సి వుంటుంది. సిడ్ ఫీల్డ్ నుంచి మనమేం
తీసుకోవచ్చంటే, ఆ త్రీ యాక్ట్స్ లో, ఏ యాక్ట్ లో ఏ బిజినెస్ జరుగుతోందో ఔపోసన
పట్టి అమలుపరచడమే. సిడ్ ఫీల్డ్ అంతగా ఈ బిజినెస్సుల్ని విడమర్చి చెప్పిన వాళ్ళు
లేరు.
కాబట్టి యాక్ట్స్ అనే పదాన్ని తెలుగు
స్ట్రక్చర్ కి సంబంధించి మానేస్తే మంచిది. వీటిని బిగినింగ్, మిడిల్, ఎండ్
అనుకుంటే సులభంగా అర్ధమవడమే గాక, మైండ్ మీద కొలతల ఒత్తిడి వుండదు. అంటే పాత స్కూలు
పండితులకి లొంగి పోతున్నామని కాదు. పాత స్కూలు పండితులు కూడా బిగినింగ్-మిడిల్-
ఎండ్ అనే టెర్మినాలజీనీని సొంతంగా కనిపెట్టలేదు. అరిస్టాటిల్ నుంచి
అరువుదెచ్చున్నదే. క్రీస్తుపూర్వం 384 లో జన్మించిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ నాటకాలకి
సంబంధించిన స్ట్రక్చర్ కి చెప్పిన
టెర్మినాలజీయే అది. ఆయన ఆ బిగినింగ్ - మిడిల్- ఎండ్ అనే విభాగాల్లో జరిగే
బిజినెస్సుల గురించి ఏం చెప్పాడో, సరీగ్గా అదే ఇప్పటి సినిమా స్క్రీన్ ప్లేల్లోనూ
జరుగుతోంది.
ఇక ఒక్క త్రీ యాక్ట్స్ అనేమిటి,
ఎనిమిది వరకూ ఇంకా యాక్ట్స్ లో కథ చెప్పవచ్చనే మూడోరకం స్క్రీన్ ప్లే పండితుల
గురించి చెప్పుకోవాల్సి వస్తే, వీళ్ళు చేసింది వున్న మూడు యాక్టుల్లోనే, అవే
బిజినెస్సుల్ని, యాక్టుకి మూడు నాల్గు సబ్ డివిజన్లు చొప్పున విభజించి, కొత్తగా ఏదో చెప్తున్నట్టు ఫీలవుతున్నారు.
సినిమా కథలు రాసుకునే వాళ్ళని అయోమయంలో పడేస్తున్నారు. నిజానికి అన్ని యాక్ట్స్ తో
కథ ఎక్కడా వుండదు. వీళ్ళు ఎక్కడ్నించి స్ఫూర్తి పొందారంటే, నాటక రంగం నుంచే.
నాటకాలకి నాటకం నిడివిని బట్టి మూడుకి మించి పదివరకూ యాక్ట్స్ వుండడం కద్దు.
ఎందుకంటే దృశ్యం మారినప్పుడల్లా సెట్ ఛేంజి కోసం, డ్రెస్ ఛేంజి కోసం నాటకాన్ని
కాస్సేపు ఆపాల్సి వుంటుంది. ఆపినప్పుడల్లా గుర్తుకి యాక్టు అనుకుని వాటికో నెంబర్
చొప్పున ఇచ్చుకున్నారే తప్ప, కథా
నిర్మాణంతో ఆ నెంబర్ల కి – యాక్ట్సు కి ఏ సంబంధమూ లేదు. దీన్ని పట్టుకుని, ఎక్కడా
ఆగకుండా ఏకబిగిన ఇంటర్వెల్ వరకూ, ఆ తర్వాత ముగింపు వరకూ సాగే సినిమాలకి ఆపాదిస్తా
మనడం ఎంత హాస్యాస్పదం!
ఇంతకీ యాక్ట్ అనే పదం నాటకాల
నుంచి వచ్చింది. తెలుగు నాటకాల్లో దీన్ని
అంకం లేదా రంగం అంటారు. మొదటి అంకం, మొదటి రంగం ఇలా...ఐతే వీటిని పక్కన పెడదాం.
బిగినింగ్- మిడిల్- ఎండ్ ల భాషలోనే సాగిపోదాం.
ఐతే పాత స్కూలు పండితులు తమకు నచ్చని పదం త్రీ యాక్ట్
కి బదులు సాంప్రదాయ ‘బిగినింగ్- మిడిల్-
ఎండ్’ పదబంధంతో స్క్రీన్ ప్లే సూత్రాల్ని ప్రచారం చేయడంలో ఒక కన్పించని ప్రమాదం
పొంచి వుంది. అదేమిటంటే, కొలతల యాక్ట్స్ సృజనాత్మక స్వేచ్చని హరిస్తాయని చెబుతూ,
తమ బిగినింగ్ - మిడిల్- ఎండ్ విభాగాలకి
నిడివికి సంబంధించిన సంకెళ్ళన్ని తొలగించడం. అంటే, బిగినింగ్ ఎంత సేపైనా
సాగవచ్చు-మీ సృజనాత్మక స్వేచ్ఛ కోసం! మిడిల్ ఎంత టైమైనా పొడిగించ వచ్చు, లేదా
తగ్గించ వచ్చు – మీకు హద్దుల్లేవు! ఎండ్ మీ ఇష్టం, ఆకాశమే హద్దు!- అనే టైపులో బోధించడం.
ఇది తెలియకుండా మెజారిటీ సంఖ్యలో
తెలుగు సినిమాల్లో ఎప్పట్నించో జరిగిపోతోంది. బిగినింగ్ ని ఇంటర్వెల్ వరకూ సుదీర్ఘంగా సాగిస్తున్నారు.
దీంతో ఫస్టాఫ్ నస, వీక్, పరమబోరు, కథని పాయింటుకి తేవడానికి ఇంటర్వెల్ వరకూ
తినేశాడు - అని ఆశీర్వచనాలు అందుతున్న వైనం చూస్తూనే వున్నాం. సిడ్ ఫీల్డ్ తన
కొలతలతో ఇందుకే చెక్ పెట్టాడు. బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు వరుసగా 30
పేజీలు, 60 పేజీలు, 30 పేజీలూ వుండాలని తమ రెండు గంటల నిడివి వుండే హాలీవుడ్
సినిమాలని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు.
అంటే 1:2:1 నిష్పత్తి అన్నమాట. అంటే బిగినిగ్ పావు వంతు, ఎండ్ పావు వంతు, మధ్యలో
మిడిల్ సగభాగం ఆక్రమించాలన్న మాట మాట స్క్రీన్ ప్లేలో.
ఒక సింపుల్ లాజిక్ ఏమిటంటే, కథకి
మిడిల్ విభాగమే వెన్నెముక. ప్రేక్షకుల్ని
కూర్చోబెట్టే విషయమంతా ఇందులోనే వుంటుంది. అలాటిది సగభాగమంతా మిడిల్ కి
కేటాయించాల్సిన స్ట్రక్చర్ లో, పావు భాగం ఉండాల్సిన బిగినింగ్ నే సగభాగానికి
విస్తరిస్తే, ఆ మిడిలూ, ఆ సినిమా ఏమైపోవాలి?
తెలుగు సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయని
కాదు. మెజారిటీ సంఖ్యలో ఉంటున్నాయి. ఇటీవల విడుదలైన, వేమారెడ్డి దర్శకత్వంలో
‘చక్కిలిగింత’ అనే సినిమాలో, మొదటి పదిహేను నిమిషాల్లోనే బిగినింగ్ ముగిసిపోయి,
మిడిల్ ప్రారంభమవుతుంది. అలాగే దర్శకుడు తేజ తీసే సినిమాలు కూడా అరగంటలో బిగినింగ్
ముగిసి, మిడిల్ ప్రారంభమవుతుంది. ఇంకొందరి సినిమాల్లో ముప్పావు గంట కాలం బిగినింగ్
కి తీసుకోవడాన్ని గమనించ వచ్చు. అంటే ఇంటర్వెల్ లోపే బిగినింగ్ ముగిసి పోయి కథ
పాయింటు కొచ్చేస్తోందన్న మాట. ఇది మంచి పధ్ధతి. దీని వల్ల స్క్రీన్ ప్లే కి
వెన్నెముక వంటి దైన మిడిల్ విభాగానికి అక్కడ్నించీ ఎండ్ –అంటే క్లైమాక్స్ వరకూ గంట
గంటన్నర పాటు సింహభాగం స్పేస్ లభిస్తుంది. ఈ ఒక్కో విభాగం విశ్లేషణ ని క్షుణ్ణంగా తర్వాత తెలుసుకుందాం.
చెప్పొచ్చే దేమిటంటే, ఈ విభాగాలకి పైన చెప్పుకున్న నిష్పత్తుల్లో స్పేస్
ఇవ్వకపోతే, ఏ కమర్షియల్ సినిమా కూడా అంత కథా బలంతో వుండదు.
ఒకసారి ఈకింది పటం చూడండి:
పాత స్కూలు పండితులు చెప్పే సంకెళ్ళు లేని స్పేస్ వాదం కేవలం డబ్బులు రాని
ఆర్టు సినిమాలకి వర్తిస్తుంది. ఆర్టు సినిమాలకి స్ట్రక్చర్ లేకపోవడాన్ని గమనించ
వచ్చు. ఒకసారి కీ.శే. శివాజీ గణేశన్ ఆర్టు
సినిమాల మీద జోకేస్తూ- నదిలో పడవలో పోతున్న వాడు పోతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, అదే
కథ!- అన్నారు. అంటే ఎంతకీ బిగినింగ్ లోనే ఉంటాయన్న మాట వాటి కథలు. ఆబాలగోపాలం చూసే
కమర్షియల్ సినిమాలని కొద్దిమంది మేధావులు మాత్రం చూసే ఆర్ట్ సినిమాలుగా తీయాలని
ఎవరూ అనుకోరు. తీస్తున్నారంటే అది తెలీకే. ఈ డిసెంబర్ లోనే విడుదలైన ‘సాహెబా
సుబ్రహ్మణ్యం’ చూస్తే, ఇందులో హీరో హీరోయిన్ లు ప్రేమించుకుంటూనే వుంటారు,
ప్రేమిచుకుంటూ వుంటారు క్లైమాక్స్ వరకూ. ఆ ప్రేమలో ఇంకేమీ జరగదు. ఆర్ట్ సినిమాల
శైలిలో బిగినింగే తప్ప మిడిల్ లేని కథ అన్నమాట ఇది. అనువంశికంగా మనిషి మెదడు ఓ
ఫ్రేముగా (స్ట్రక్చర్ గా) సెట్ అయి వున్న
కథ సంవిధానాన్ని పట్టించుకోకుండా, కేవలం క్రియేటివిటీతో సింగారించడం వల్ల ఈ
పరిస్థితి!
నవతరం దర్శకులు ఇండీ (ఇండివిజ్యువల్ ) ఫిలిమ్స్
పేరుతో తీస్తున్నవి కూడా మల్టీప్లెక్స్ థియేటర్ లలో కూడా ఆడని ఇంకో రకం ఆర్ట్
సినిమాలే. వీటికి స్ట్రక్చర్ తో పనిలేదు, క్రియేటివిటీ యే పంచప్రాణాలు!
ఈ పరిస్థితి హాలీవుడ్ నవదర్శకుల్లోనూ ఉన్నట్టుంది- అందుకే సుప్రసిద్ధ దర్శకుడు
స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇలా అనివుంటాడు... ‘కథ ఎలా చెప్పాలో జనం మర్చిపోయారు. కథలకి
మిడిల్ గానీ ఎండ్ గానీ వుండడం లేదు.బిగినింగే ఉంటోంది, ఎంతకీ ముగియని బిగినింగ్!’
ఇదంతా ఎందుకంటే తెలుగు సినిమాల
స్క్రీన్ ప్లేలకి ఇకనైనా స్ట్రక్చర్ ప్రాముఖ్యత గుర్తించాలనే. ఇక ఈ స్ట్రక్చర్ ఎలా
ఉండాలో ఇకపైన వరుసగా తెలుసుకుందాం.
―సికిందర్