ఫైవ్ పర్సెంట్ డెవలప్ మెంట్!
స్క్రిప్టు రాయడం ఎలా మొదలెట్టాలి? దానికి కావలసిన టూల్స్
ఏమిటి? అనుభవమున్న రచయితలూ/ దర్శకులైతే నేరుగా వన్ లైన్ ఆర్డర్ తో పేపర్ వర్క్
లోకి దిగిపోతారు. కొత్తవాళ్లకి వన్ లైన్ ఆర్డర్ అనే టూల్ కంటే ముందుండే రెండు టూల్స్
తో అనుభవం అవసరం. ఈ రెండు టూల్సూ అనుభవజ్ఞులకి అవసరం లేదని కాదు. అవసరమే, కాకపోతే
వాళ్ళ అనుభవంతో మెంటల్ వర్క్ చేసుకుంటారు. కొత్త వాళ్ళయితే వాటిని కూడా పేపర్
వర్క్ చేసుకోక తప్పదు. ఏమిటా మొదటి రెండు టూల్స్ ? మొదటిది అయిడియా ఐతే, రెండోది
సినాప్సిస్.
ఈ రెండిటి మీదా అవగాహన, పట్టు
సాధిస్తే, తర్వాతి స్టోరీ డెవలప్ మెంట్ టూల్స్ అయిన వన్ లైన్ ఆర్డర్, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్
లోని బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు,
చివరిగా డైలాగ్ వెర్షన్ లు వరుసగా
వస్తాయి.
ఇప్పుడీ మొత్తం ప్రక్రియని చిత్రపటంలో చూస్తే ఇలా వుంటుంది :
ఇప్పుడీ మొత్తం ప్రక్రియని చిత్రపటంలో చూస్తే ఇలా వుంటుంది :
1.ఐడియా
2.సినాప్సిస్
3.వన్ లైన్ ఆర్డర్
(స్క్రీన్ ప్లే స్ట్రక్చర్)
4. బిగినింగ్
5. మిడిల్
6. ఎండ్
7. డైలాగ్ వెర్షన్
2.సినాప్సిస్
3.వన్ లైన్ ఆర్డర్
(స్క్రీన్ ప్లే స్ట్రక్చర్)
4. బిగినింగ్
5. మిడిల్
6. ఎండ్
7. డైలాగ్ వెర్షన్
ఈ ఏడు
టూల్సూ పూర్తిగా అవసరమా అంటే, హాలీవుడ్ లో
నైతే అవసరం. తెలుగులో నైతే అవసరం లేదు. హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే అంటే డైలాగ్
వెర్షన్ సహా పూర్తయిన స్క్రిప్టే. కాబట్టి అక్కడ ఓ రచయిత సినిమాకి కథ ఇవ్వాలంటే, డైలాగ్ వెర్షన్ సహా తనే రాసుకుని, ఆ పూర్తి
స్థాయి స్క్రిప్టు ఇవ్వాల్సిందే. అంటే అతను డైలాగులు కూడా రాయగలిగి వుండాలి. అక్కడ
స్క్రీన్ ప్లేకి అర్ధం : సినిమా తీయడానికి సరిపడా డైలాగులు, వర్ణనలు, పాత్రలు, సెట్స్ తో కూడిన స్క్రిప్టు అని. అక్కడ కొత్త రచయితైనా ఇలా
స్క్రీన్ ప్లేనే ఇవ్వాలి. అదొక వేళ నచ్చి ఏ స్టూడియో అయినా, లేదా నిర్మాతైనా కొంటే,
ఆ తర్వాత ఏవైనా మార్పు చేర్పులుంటే, ఆ రచయిత
తోనో, లేదా వేరే రచయితల తోనో చేయించుకుంటారు. ఐతే స్క్రీన్ ప్లే అనే క్రెడిట్ ని
మాత్రం ఆ రచయితకే ఇస్తారు. ఇది అక్కడి సత్సంప్రదాయం.
తెలుగులో ఇలా కుదరదు. డైలాగ్ వెర్షన్ తో పూర్తి స్థాయి తనే స్క్రిప్టు రాసుకుని వెళ్లి చూపిస్తే ఇతనెవడో కొత్త మొహం అనుకుంటారు. ఇలాటి వాళ్ళు లేరని కాదు. ఇలాగే రాసుకుని, ఇంకా పాటలు కూడా వాటిలో జొప్పించి, ఆ మొత్తం దస్త్రమంతా పట్టుకుని తిరిగే వాళ్ళూ అప్పుడప్పుడూ కన్పిస్తూంటారు.
ఒకవేళ అనుభవజ్ఞులై వున్నా, తెలుగులో ఇలా పూర్తి స్థాయి స్క్రిప్టు (అంటే కథ-మాటలు- స్క్రీన్ ప్లే ) ఒక రచయితే ఇవ్వడం కూడా అరుదు, కష్టం కూడా. ఇది దర్శకుల మీడియా, రచయితల మీడియా కాదు. కాబట్టి పూరీ జగన్నాథ్, శేఖర్ కమ్ముల లాంటి కొంతమంది దర్శకులు పూర్తి స్థాయి స్క్రిప్టులు వాళ్ళే రాసుకుని ‘కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం’ క్రెడిట్స్ వాళ్ళే తీసుకోగలరు. చాలామంది దర్శకులు రచయితల చేత రాయించుకుని ఆ క్రెడిట్స్ తామే తీసుకుంటున్నారు. ఇంకొంతమంది దర్శకులు మాటలవరకూ మాటల రచయితకి క్రెడిట్ ఇస్తున్నారు. స్క్రీన్ ప్లేకి రచయితకి క్రెడిట్ ఇవ్వడం చాలా తక్కువ. అది ఆ దర్శకుడూ- రచయితల మధ్య అవగాహన, పని విభజనలపై ఆధారపడి అరుదుగా జరుగుతూంటుంది. కొన్ని సార్లు స్క్రీన్ ప్లే సహకారం, లేదా స్క్రీన్ ప్లే అసోషియేట్ వంటి క్రెడిట్స్ ఇస్తే ఇవ్వొచ్చు. చాలావరకూ ఈ రచయితలకి కథాసహకారం క్రెడిట్టే దక్కుతుంది. అలాగే వేరెవరో ఇచ్చిన కథతో దర్శకత్వం వహించే దర్శకులు కూడా పూర్వమున్నంత మంది ఇప్పుడు లేరు. సొంత కథతోనే దర్శకత్వానికి సిద్ధ పడుతున్నారు. సొంత కథ లేని కొత్త దర్శకుడ్నో, వర్ధమాన దర్శకుడ్నో నిర్మాతలు చిన్న చూపు చూస్తారని భయం. కాబట్టి ఫీల్డులో కథలు రాయగల్గిన రచయితలు ఎంతమంది వున్నా, వాటిని పక్కన పెట్టి, దర్శకుల కథలకి పనిచేసి వెళ్ళిపోవడమే జరుగుతోంది.
హాలీవుడ్ లో అవసరమైతే ఆ అందిన పూర్తి స్థాయి స్క్రిప్టు మీద గ్రూపు వర్క్ జరుగుతుంది. తెలుగులో- తెలుగునే కాదు మొత్తం భారతీయ భాషల్లో- ఇలాకాక, మొదటి నుంచే గ్రూపు వర్క్ లో కూర్చుంటారు. ఇదీ తేడా. హాలీవుడ్ లో రచనా రంగం వ్యవస్థీకృత రంగంగా వుంటే, ఇక్కడ అలా లేదు. దర్శకుడి దగ్గర ఒక లైను వుంటుంది. ఆ లైను ని విస్తరించడానికి అందర్నీ కూర్చో బెట్టుకుంటాడు. ఆ గ్రూపులో అసిస్టెంట్లు, అసోషియేట్లూ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కో-డైరెక్టరూ ఉండొచ్చు. వీళ్ళతో బాటు రచయితలుంటారు. ఆయా పరిస్థితుల్ని బట్టి కొన్ని చోట్ల రచయితా దర్శకుడూ ఇద్దరే ఉండొచ్చు. ఎలా వున్నా ఆ సెటప్ లో అందరూ కూర్చుని చేసేపని స్టోరీని డెవలప్ చేయడమే.
ఇక్కడే, ఈ డెవలప్ మెంట్ ప్రక్రియలో రెండే టూల్స్ వుంటాయి: వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ (అంటే స్క్రీన్ ప్లే). వీటికే గ్రూపంతా కూర్చుంటారు. వీళ్లల్లో కొందరు రచయితలు వన్ లైన్ ఆర్డర్ వేయడం లో ఎక్స్ పర్ట్ లై వుంటారు. వీళ్ళు అంతవరకూ పూర్తి చేసి వెళ్ళిపోతారు. మరికొందరు ట్రీట్ మెంట్ లోనూ ఎక్స్ పర్ట్ లై వుంటారు. వీళ్ళు అది పూర్తి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడు డైలాగ్ వెర్షన్ తతంగం మొదలవుతుంది. దీన్ని పేరున్న మాటల రచయిత కిద్దామా, లేక పోతే ఘోస్టు చేత రాయించి ఆ పేరుకూడా మనమే వేసుకుందామా, ఇంకా లేకపోతే తెలిసిన స్ట్రగుల్ చేస్తున్న మాటల రచయిత కిచ్చి అతడి పేరే వేద్దామా అని దర్శకులు ఆలోచించి నిర్ణయానికి రావొచ్చు. అప్పుడీ మాటల రచయిత, లేదా ఘోస్టులు రంగంలోకి వస్తారు. పేరున్న మాటల రచయిత చేత రాయిస్తే, వేరే రచయితల కిచ్చి వేరే వెర్షన్లు రాయించరు. దర్శకుడు ఘోస్టుల చేత రాయించు కుంటే, అప్పుడా ఆ వెర్షన్స్ అన్నిటినీ ముందేసుకుని, ఎందులో ఏ డైలాగు బావుందో అది ఏరుకుంటూ వేరే తన సొంత వెర్షన్ తయారు చేసుకుంటాడు. అది షూటింగ్ చేయడానికి సిద్ధమైన ఫైనల్ స్క్రిప్టు.
కాబట్టి ఆఖర్న వేరే తతంగంగా సాగే ఈ డైలాగ్ వెర్షన్ రచయితలు వేరు; వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ రచయితలు వేరు. డైలాగులు రాసే రచయితలు చాలా మందికి ట్రీట్ మెంట్ రాయడం రాదంటే నమ్మాలి. అలాగే ట్రీట్ మెంట్ (స్క్రీన్ ప్లేలో) ఎక్స్ పర్ట్ లైన రచయితలందరూ డైలాగులు రాయలేరు. ఒకవేళ రాయగల్గినా ఆ తలనొప్పి మనకెందుకని దూరంగా ఉంటారు. స్క్రీన్ ప్లే, డైలాగులు రెండింటా ఎక్స్ పర్ట్ లైన రచయితలని వేళ్ళ మీద కూడా లెక్కించలేం.
ఈ పూర్వ రంగంలో, హాలీవుడ్ లోలా కాకుండా, ట్రీట్ మెంట్ రచయితలు, మాటల రచయితలు అని విడివిడి విభాగాలు ఏర్పడ్డం వల్ల, ఉన్న రచయితలు, కొత్తగా వచ్చే రచయితలూ ఆల్ రౌండర్లు అవ్వాలనుకోనవసరం లేదు- అలా స్వాగతించే దర్శకులూ లేరు. కానీ దర్శకులకి ఈ రెండిటా పరిజ్ఞానం ఉండాల్సిన అవసరముంది. ముఖ్యంగా కొత్తగా దర్శకులవుతున్న వారి విషయంలో చాలాచాలా అవసరం. ఎందుకంటే, ఈ సంవత్సరం కొత్త దర్శకులు దాదాపు 70 మంది రంగప్రవేశం చేశారు. వాళ్ళలో 64 మంది అట్టర్ ఫ్లాపు లిచ్చారు. ప్రతీ యేటా ఇదే శాతం మెయిన్ టెయిన్ అవుతోంది. అయితే మొత్తంగా ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనట్టుగా విజయాల శాతం పదిహేనుకి పెరిగింది. పది శాతమే విజయాలుగా ఉంటున్న పరిస్థితి ఇంకో ఐదు పెంచుకుని మెరుగయ్యింది. కానీ విడిగా చూస్తే కొత్త దర్శకులు కలగజేసిన నష్టం 70 శాతం! సినిమా అంటే కనీస అవగాహన లేనివాళ్లే ఇందులో ఎక్కువ. 2015 లోనూ నిస్సందేహంగా ఇదే కొనసాగుతుంది- దీన్ని అరికట్టేదేలా? మార్గాలేమిటి? దీనికీ రచనకీ ఏదైనా సంబంధముందా? ఆలోచించుకోవాలి.
దేశమంతా ఇవ్వాళ్ళ డెవలప్ మెంట్ బాట పడుతోంది. టాలీవుడ్ కి ఈ డెవలప్ మెంట్ వద్దా? మిగతా రంగాలు ముందుకు దూసుకు పోతూంటే ఇలాగే వెనుకబడి వుంటుందా? ఏదో మహాత్మ్యం జరిగినట్టు 2014 లో ఐదు శాతం డెవలప్ మెంట్ జరిగింది - 2015 లో ఇంకో ఐదు శాతంతో విజయాల శాతం 20 కి పెరుగుతుందా? ఇందుకేం చేయాలి? జరుగుతున్న అనర్ధాల్ని దృష్టిలో పెట్టుకుని, ముందుగా స్ట్రక్చరాశ్యత ఎందుకు పెంచుకోకూడదు? ఆలోచించాలి!
ఇక మొదటి టూల్ ‘ఐడియా’ తో మొదలవుదాం...
―సికిందర్