పానిండియా సినిమా అనేది ఇక అరిగిపోయిన ట్రెండ్ గా మారిపోయి, ఆస్కార్ లెవెల్ సరికొత్త నినాదంగా
ముందుకు రానుందా? ఇక ఆస్కార్ అవార్డుల్ని టార్గెట్ చేస్తూ భారీ సినిమాలు నిర్మిస్తారా? నిర్మిస్తూనే ఈ మేరకు ముందే ప్రకటన కూడా చేస్తారా? తమిళంలో పా. రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న భారీ చారిత్రక ప్రతిష్టాత్మకం ‘తంగలాన్’ విషయంలో ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఇది నిర్మాణం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకి
సిద్ధమవుతోంది. షూటింగు సమయంలో గాయపడిన విక్రమ్ కోలుకుని తిరిగి షూటింగులో పాల్గొన్నాడు.
ఇటీవల విక్రమ్ బర్త్ డే కి విడుదల చేసిన ‘తంగలాన్’ మేకింగ్ వీడియో ఫ్యాన్స్ కి అదిరిపోయింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కెఇ జ్ఞానవేల్ రాజా పాన్
ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అయితే, జ్ఞానవేల్ భాగస్వామి ధనంజయన్ 2023-24 ఆస్కార్ రేసులోకి `తంగలాన్`ని తీసుకెళ్ళాలని ప్లాన్
చేస్తున్నట్టు యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం పెద్ద వార్తయింది. ఆస్కారే కాదు మరో 8 అంతర్జాతీయ అవార్డుల్ని కూడా
దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నట్టు ఇంటర్వ్యూ సారాంశం.
ఇలా ప్రతిష్టాత్మక అవార్డుల
కోసం సినిమా నిర్మిస్తున్నట్టు ఇంతకి ముందెవరూ ప్రకటించలేదు. కానీ ‘ఆర్
ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రస్థానంతో తమిళ ఆత్మగౌరవం
మేల్కొన్నట్టుంది...మనం కూడా ఆస్కార్ మీద ఓ
చేయేద్దామని ‘తంగలాన్’ తలపెట్టినట్టుంది. ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు నిర్మించిన మణిరత్నం కూడా ఆస్కార్ కి పంపే ఆలోచన చేయలేదు. ‘తంగలాన్’ ని కోలార్ గోల్డ్
మైన్స్ (కేజీఎఫ్) లో పనిచేసే బడుగు
వర్గాలు బ్రిటిష్ పాలన దౌర్జన్యాలని ఎదుర్కొనే
కథాంశం తో పా. రంజిత్ రూపొందిస్తున్నాడు. ఇందులో విక్రమ్ తో బాటు పశుపతి, మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు తదితరులు నటిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాష్ కుమార్. అయితే ఇప్పుడు ప్రశ్నేమిటంటే
‘తంగలాన్’ నిజంగా
ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశముందా?
ఆస్కార్ ట్విస్టు కూడా చూడాలి!
ఐతే ఇక్కడొక ట్విస్టు వుంది. 2024
నుంచి ఆస్కార్ పోటీలకి కొత్త నిబంధనలు అమల్లోకొస్తున్నాయి. దీని ప్రకారం ఒక భారతీయ సినిమా ఆస్కార్ ఉత్తమ చలన చిత్రంగా ఎన్నటికీ నామినేట్ అయ్యే అవకాశముండదు.
ప్రజాస్వామ్యంలో తక్కువ ప్రాతినిధ్యం గల జాతి, లేదా జాతి సమూహం నుంచి కనీసం ఒక ప్రధాన నటుడు / నటి వుండాలన్నది ఒక
నిబంధన. కాబట్టి, భారతీయులందరినీ ఒకే గాటన కట్టి, ‘తక్కువ ప్రాతినిధ్యం గల సమూహం' గా ఆస్కార్ అకాడమీ నిర్ణయించేంత వరకు భారతీయ సినిమాలు
నామినేట్ అయ్యే అవకాశముండదు.
2024 ఆస్కార్ అవార్డుల వేడుకకి
ఇంకా
తొమ్మిది నెలల సమయం వుంది. వేడుక వచ్చే ఏడాది మార్చి 10 న జరగనుంది.
ఈ
సంవత్సరం నుంచి ఆస్కార్ ఉత్తమ చలన చిత్రం అవార్డుకి
నామినేట్
కావాలంటే, ఆస్కార్‌లని
నిర్వహించే
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్దేశించిన కింది నాలుగు
షరతుల్లో కనీసం రెండింటిని ఒక చలన చిత్రం సంతృప్తి పరచాలి.
1. చలన
చిత్రంలో
తప్పనిసరిగా కనీసం ఒక ప్రధాన నటుడు
/ నటి లేదా
ముఖ్యమైన సహాయ నటులు, తక్కువ ప్రాతినిధ్యం గల
సమూహం నుంచి-
అంటే
మహిళలు, మైనారిటీలు, LGBTQ+ కమ్యూనిటీ, వికలాంగులుల
నుంచి వుండాలి.
2. చలనచిత్ర సృజనాత్మక బృందం
తప్పనిసరిగా తక్కువ ప్రాతినిధ్యం గల సమూహాల నుంచి వారి కనీస సంఖ్య లేదా శాతాన్ని
కలిగి ఉండాలి. స్టూడియో ఫ్లోర్‌లోని సిబ్బంది నుంచి
నాయకత్వ
స్థానాల వరకు - నిర్మాత, దర్శకుడు, రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ మొదలైన వారంతా
ఈ పరిధిలోకి వస్తారు.
3. చలన చిత్రాన్ని
పంపిణీ చేసే, లేదా
ఫైనాన్సింగ్ చేసే కంపెనీ తప్పని సరిగా తక్కువ ప్రాతినిధ్యం గల
సమూహాలకి
చెందిన వారికి అప్రెంటిస్‌షిప్‌లు
లేదా ఇంటర్న్ షిప్ చెల్లించి వుండాలి.
4. స్టూడియో లేదా చలనచిత్ర సంస్థలు మార్కెటింగ్, ప్రచారం లేదా పంపిణీ బృందాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా
మహిళల్ని, తక్కువ ప్రాతినిధ్యం గల జాతికి చెందిన వారిని, లేదా జాతి సమూహానికి చెందిన వారిని కలిగి వుండాలి.
ఇలా 4 కొత్త
నిబంధనల్ని ముందుకి తెచ్చింది అకాడెమీ. హాలీవుడ్ అలవాటుగా దైహిక జాత్యాహంకారంతో బాధపడుతోందనే
అభిప్రాయముంది. దీన్ని తొలగించడానికే ప్రధానంగా నల్ల జాతికి చెందిన వారిని
దృష్టిలో వుంచుకుని ఈ కొత్త నిబంధనల్ని ప్రకటించింది అకాడెమీ. దీన్ని విదేశీ
సినిమాలన్నిటికీ వర్తింప జేసింది. అయితే అకాడమీ నిర్దేశించిన కొత్త ప్రమాణాలు స్పష్టంగా దాని గత పాపాలకి
ప్రాయశ్చిత్తం
చేసే ప్రయత్నమని, అందుకే
ఉద్యోగ రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడుతోందనీ
పరిశీలకులు చెప్తున్నారు.
కళలు ఎప్పుడూ సమాన అవకాశాల రంగమని, వాస్తవానికి కళలు
అన్యాయమైన ప్రపంచమనీ, కానీ సృజనాత్మక ఆలోచనల పరిధిని పరిమితం
చేయడానికి చట్టాలు చేయడం వల్ల అది మరింత అన్యాయమై పోతుందనీ; చరిత్ర అంతా చెబుతున్నట్లుగా, కళల శ్రేష్ఠతని అరికట్టడంలో మాత్రమే నిబంధనలు విజయం సాధిస్తాయనీ చెబుతూ, ఉద్యోగ రిజర్వేషన్లని
విమర్శిస్తున్నారు.
కనుక పై నిబంధనల్ని బట్టి చూస్తే, భారతీయులందరినీ ఒకే గాటన కట్టి, అణగారిన
వర్గంగా ఆస్కార్ అకాడమీ
నిర్ణయించేంత వరకు, భారతీయ సినిమాలు నామినేట్ అయ్యే అవకాశముండదని
తేల్చేస్తున్నారు. ‘తంగలాన్’ సహ నిర్మాత ఇది తెలిసే ఆస్కార్ ప్రకటన
చేశారో లేదో గానీ, సినిమాలో బ్రిటిష్ వారిపై పోరాడుతున్నది
అణగారిన వర్గాలకి చెందిన వారుగానే కనపడుతున్నారు మరి- నటీనటుల జాతుల సంగతి పక్కన
పెడితే!
ఈ నేపథ్యంలో ఇక ఆస్కార్ లెవెల్
ఆలోచనలు మానుకుని, పానిండియా తోనే సరిపెట్టు కుంటారేమో
చూడాలి!
—సికిందర్