రచన -దర్శకత్వం
: శ్రీ హర్ష కొనుగంటి
టీనటులు: ఆశిష్ రెడ్డి, అనుపమా
పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్
కూరపాటి, శ్రీకాంత్ అయ్యంగార్
తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం:
మదీ
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్,
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
***
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Sunday, January 16, 2022
1119 : రివూ!
అగ్రనిర్మాత
దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశీష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన ‘రౌడీ
బాయ్స్’ సంక్రాంతి సినిమాల సందడిలో ఒకటిగా విడుదలైంది. నాగ్ -
చైతూ ల ‘బంగార్రాజు’, కృష్ణ మనవడు
అశోక్ గల్లా ‘హీరో’, చిరంజీవి అల్లుడు
కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చీ’ మూడూ ఇతర
సంక్రాంతి సందడి సినిమాలు. టాలీవుడ్ బిగ్ స్టార్స్ ప్రభాస్,
ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు
ముందుకొచ్చి ‘రౌడీ బాయ్స్’ ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు, రికమెండ్
చేశారు, మంచి ఎంటర్ టైనర్ గా ప్రామీస్ చేశారు. అత్యధిక థియేటర్లలో
అట్టహాసంగా విడుదలైంది. ఆశీష్ రెడ్డికి ప్రత్యర్థిగా నిర్మాత లగడపాటి శ్రీధర్
కొడుకు సహిదేవ్ విక్రమ్ కూడా ఈ మూవీతో పరిచయమయ్యాడు. గ్లామర్ ఒలకబోయడానికి హీరోయిన్
గా అనుపమా పరమేశ్వరన్ జాయినైంది. దేవీశ్రీ ప్రసాద్ తొమ్మిది పాటలూ మోసుకుంటూ వచ్చి
సినిమా స్పేస్ ని తన స్వరాలతో ఆక్రమించేశాడు. 2018 లో ‘హుషారు’ అనే స్లీపర్ హిట్ తీసి మంచి క్రియేటివిటీ గల మేకర్ అన్పించుకున్న హర్ష కొనుగంటి - హైఫైగా ఈ ఇన్స్టాగ్రామ్ జనరేషన్
కాలేజ్ రోమాన్స్ - యాక్షన్ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. మరి
ఆకర్షణీయమైన ఇన్ని హంగులతో ఇది ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ‘ప్రేమదేశం’ అయ్యిందా? తెలుసుకుందాం.
ఇంట్లో ఎవరి మాటా వినని అక్షయ్ (ఆశీష్ రెడ్డి)
రాక్ స్టార్ గా మారాలనుకుంటాడు. ఇంట్లో తిట్లు పడలేక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు.
ఆ కాలేజీకి ఎదురుగా మెడికల్ కాలేజీ వుంటుంది. మెడికల్ కాలేజీలో చేరుతుంది కావ్య (అనుపమా
పరమేశ్వరన్). చూడగానే రెండేళ్ళు పెద్దదైన ఆమెని ప్రేమిస్తాడు అక్షయ్. ఈ రెండు కాలేజీల
స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్నవిషయాలకి గ్యాంగ్
వార్స్ జరుగుతూంటాయి. మెడికల్ కాలేజీ స్టూడెంట్ లీడర్ విక్రమ్ (సహిదేవ్ విక్రమ్) కావ్యాని
ప్రేమిస్తూంటాడు. కావ్యాని అక్షయ్ ప్రేమించడం చూసి అతడి మీద దాడులు ప్రారంభిస్తాడు.
కావ్యా గురించి రెండు కాలేజీల మధ్య గ్యాంగ్
వార్స్ లో తీవ్రంగా గాయపడ్డ అక్షయ్ తో, లివ్ ఇన్ రిలేషన్ షిప్ కి సిద్ధపడుతుంది కావ్య. దీని
తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
ఇది ఈ కాలపు ‘ప్రేమ
దేశం’ కాదు, ‘ప్రేమసాగరం’ కాదు. ముక్కోణ ప్రేమ కథ లివ్ ఇన్ రిలేషన్ షిప్ తో చూపించారు. కాలేజీ గ్యాంగ్
వార్స్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే రెండు అంశాల వల్ల కథ కొత్తగా
మారిందేమీ లేదు. ‘జార్జి రెడ్డి’ మూవీలో
లాగా కాలేజీ గ్యాంగ్ వార్స్ లో విషయం లేదు. పైగా సిల్లీగా వున్నాయి. లివ్ ఇన్ రిలేషన్
షిప్ లోనూ విషయం లేదు. ఫస్టాఫ్ గ్యాంగ్ వార్స్, సెకండాఫ్ లివ్
ఇన్ రిలేషన్ షిప్ గా కథని రెండుగా విభజించి చూపించారు. కానీ గ్యాంగ్ వార్స్ ప్రభావం
లివ్ ఇన్ రిలేషన్ షిప్ పైనో, లేదా లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రభావం
గ్యాంగ్ వార్స్ పైనో వుండేట్టు రెండు అంశాల్నీ కలిపెయ్యక రెండు ముక్కలుగా చూపించి సరిపెట్టేశారు.
కాలేజీల మద్య గ్యాంగ్ వార్స్ కాదు, రెండు కాలేజీలూ కలిసిపోయి
చేసే ‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’ అవసరమని చెప్పేట్టుగా
కొత్త రాడికల్ కథని సృష్టించ లేకపోయారు. బహుశా
కాలేజీల మధ్య 'లివ్ ఇన్ రిలేషన్ షిప్', యువతీ యువకుల లివ్ ఇన్ రిలేషన్
షిప్ సంస్కృతి నుంచి దృష్టిని మళ్ళించే విప్లవాత్మక అంశమవుతుందేమో... క్రేజీ థాట్స్
రాకపోతే ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వైరల్ సినిమాలు
తీయలేరు.
ఆశీష్ రెడ్డి పరిచయ సినిమా కేవలం అతడి
డాన్సింగ్, యాక్షన్ స్కిల్స్ కోసం తీసినట్టుంది. నటనలో ‘హృదయం’ లేదు. డాన్స్ అండ్ యాక్షన్ తో మాత్రం గొప్ప మ్యూజికల్
యాక్షన్ హీరో అవుతాడు. హీరోయిన్ తో రోమాంటిక్ సీన్లలో కూడా నటనని ఇంప్రూవ్ చేసుకోవాల్సి
వుంది. రోమాంటిక్ సీన్లు స్క్రిప్టులోనే నిర్జీవంగా వున్నాయన్నది వేరే విషయం. కానీ
ఆశీష్ క్యారక్టర్ ఫన్నీ రోమాంటిక్ యాక్షన్
హీరోగా వుండుంటే ఎంటర్ టైన్మెంట్ వుండేది. యాక్షన్లో కామెడీని మిక్స్ చేసినప్పుడే క్యారక్టర్
కలర్ఫుల్ గా వుంటుంది. ఇంటి దగ్గర పేరెంట్స్ తో చేసేది ఉత్త డైలాగ్ కామెడీయే. ఆవారా
కొడుకు ఇంట్లో పేరెంట్స్ తో చేసే రొటీన్ డైలాగ్
కామెడీ.
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ చాలా గ్లామరస్
గా, క్లాస్ గా వుంది మెడికోగా. ‘ప్రేమ దేశం’ లో టబూ అంత గ్రేస్ తో మాత్రం కాదు. ఇక ఆమె పాత్రలో మాత్రం రెగ్యులర్ ఫార్ములా
లవర్ తప్ప, కొత్తగా కట్టిపడేసే, కదిలించే
ఫీలింగులు లేవు. ప్రతినాయకుడుగా సహిదేవ్ విక్రమ్ బావున్నాడు. విషయముంది. సరైన విధంగా
వినియోగించుకుంటే నాలుగు కాలాల పాటు అమ్మాయిల గుండెల్లో గుబులు రేకెత్తిస్తాడు. ఇదే
స్వాంకీ గెటప్ తో కొనసాగితే.
దర్శకుడి కథ కన్నా చాలా చాలా భారం దేవీశ్రీ
ప్రసాద్ మీదేసుకుని తొమ్మిది పాటలూ పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. మ్యూజికల్ గా ఈ సినిమా
కూర్చోబెడితే మంచిదే. ‘ప్రేమసాగరం’, ప్రేమ
దేశం’ లలో విషయం క్రేజ్ సృష్టించి మ్యూజికల్ గా హిట్టయ్యాయి.
‘హుషారు’ తో ‘విషయం’ కనబర్చిన దర్శకుడు
హర్ష ఈ రెండో సినిమా దర్శకత్వంతో చాలా మెట్లు కిందికి దిగిపోయాడు. స్క్రిప్టు, దాంతో దర్శకత్వం చాలా తీసికట్టుగా వున్నాయి. ఓపెనింగ్ సీను ఒక మెడికల్ కాలేజీ
అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజీ ముందు నిలబడి వుంటే టీజ్ చేస్తారు ఇంజనీరింగ్ స్టూడెంట్లు.
ఆమె పరుగెట్టుకుని ఎదురుగా మెడికల్ కాలేజీలోకి వెళ్ళిపోయి స్టూడెంట్స్ కి చెప్తుంది.
ఆమె ఇంజనీరింగ్ కాలేజీ ముందునుంచి పరుగెత్తుతున్నప్పప్పుడు పగలు. ఎదురుగా వున్న మెడికల్
కాలేజీలోకి దూరే సరికి రాత్రి. ఇదెలా సాధ్యం? పగలు పరిగెట్టడం
మొదలెట్టి రాత్రికి చేరుకుందా ఎదురుగా తన కాలేజీకి? లేకపోతే దర్శకుడేమైనా
సింబాలిక్ గా చెప్తున్నాడా? ఫస్టాఫ్ కథ పగటి పూటలా క్లియర్ గా
వుంటుందనీ, సెకండాఫ్ కథ అంధకారంలో దారి తెలియక గందరగోళంగా వుంటుందనీ
క్లూ ఇస్తున్నాడా?
—సికిందర్
1118 : రివ్యూ!
రచన - దర్శకత్వం : పులి వాసు
తారాగణం : : కళ్యాణ్ దేవ్, రచితా
రామ్, రాజేంద్ర ప్రసాద్ నరేష్, ప్రగతి, పోసాని కృష్ణ మురళి
సంగీతం: తమన్, ఛాయాగ్రహణం : సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
నిర్మాత: రిజ్వాన్
విడుదల : జనవరి 14, 2022
***
మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ 2018 లో ‘విజేత’ అనే
విఫల యత్నంతో ఎంట్రీ ఇచ్చాక ఇప్పుడు ‘సూపర్ మచ్చి’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మధ్యలో నాల్గేళ్ళు గడిచిపోయాయి. కన్నడ హీరోయిన్
రచితా రామ్ తో కలిసి ఈ ప్రేమకథ నటించాడు. దీనికి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు
పులి వాసు ఈ సినిమా అస్సలు నిరాశపర్చదని భరోసా ఇచ్చాడు. అంటే పెద్దగా ప్రమోషన్
లేకుండానే విడుదలైన ఈ కళ్యాణ్ దేవ్ మలి ప్రయత్నం సక్సెస్ అన్నట్టేనా? దర్శకుడిచ్చిన భరోసాతో చూడొచ్చా? చూడాలో వద్దో చూద్దాం...
కథ
రాజు (కళ్యాణ్ దేవ్) ఆవారాగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ బార్‌లో
పాటలు పాడుతూంటాడు. ఇతణ్ణి ప్రేమిస్తూ మీనాక్షి
(రచిత రామ్) అనే అమ్మాయి వెంట పడుతూంటుంది. ఈమె ఇన్ఫోసిస్ లో టెకీ. లక్షన్నర రూపాయల జీతం. ఇలాటి అమ్మాయి ప్రేమిస్తున్నా రాజు
తిరస్కరిస్తాడు. ఆమె వదిలి పెట్టదు. ఈమెని
వదిలించుకోవడానికొక కండిషన్ పెడతాడు.
ఒక
రాత్రి తనతో గడిపితే ఆమె ప్రేమని అంగీకరించి పెళ్ళి చేసుకుంటానని అంటాడు. దీనికీ ఆమె ఒప్పుకుంటుంది. అసలు ఆవారా రాజుని
మీనాక్షి ఎందుకు ప్రేమించింది? రాజు
కంటే ముందు ఆమె
ఎవర్ని ప్రేమించింది? చివరికి
రాజుకే
చేరువైందా? ఆ రెండో అతన్నే
కోరుకుందా? ఆమె ఇలా
ప్రవర్తించడానికి ఆమె తండ్రి చనిపోతూ చెప్పిన మాటేమిటి? ...ఇవి తెలుసుకోవాలంటే మిగతా
సినిమా
చూడాలి.
1976 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రెండో
సినిమాగా ‘జ్యోతి’ అనే లో- బడ్జెట్ విడుదలైంది. ఇందులో జయసుధ, మురళీ మోహన్, గుమ్మడి నటించారు. రచయిత్రి సి. ఆనంద రామం ‘మమతల కోవెల’ నవలకాధారం. సత్యానంద్ చిత్రానువాదం. సూపర్ హిట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా. క్రాంతి కుమార్
నిర్మాత. ఇందులో
ఉత్తమ నటనకి జయసుధ, గుమ్మడిలకి ఫిలిమ్
ఫేర్ అవార్డులొచ్చాయి. ఈ సినిమాలో జయసుధ తండ్రి వయసున్న గుమ్మడి దగ్గరి కొచ్చి తనని
పెళ్ళి చేసుకోమని అభ్యర్ధిస్తుంది. పెళ్ళి చేసుకుంటుంది కూడా. ప్రేమించిన మురళీ
మోహన్ని కాకుండా గుమ్మడి నెందుకు పెళ్ళి చేసుకుంది? ఇదీ సస్పెన్సు.
ఒకమ్మాయి భవిష్యత్తుని పణంగా పెట్టి
ఆల్టర్నేట్ ప్రేమని వెతుక్కుందంటే దాని వెనుక కదిలించే కారణం వుండొచ్చు. ఇదే ‘జ్యోతి’ ని చిరస్మరణీయం చేసింది. ఇదే పాయింటు ‘సూపర్ మచ్చి’ కి కాపీ చేశారో లేక కాకతాళీయమో గానీ, ఈ పాయింటుతో తలపెట్టిన కథాకథనాలు సింగిల్ స్టార్ రేటింగుకి తీసిపోకుండా
వున్నాయి. పైగా టైటిల్ కీ సినిమాకీ సంబంధం లేదు.
తండ్రి చెప్పిన మాట అనే పైన
చెప్పుకున్న పాయింటుతో ఇది మీనాక్షి పాత్ర ప్రధానంగా వుండాల్సిన కథ. అంటే ఆమె
కేంద్రంగా ఆమె చుట్టూ అల్లాల్సిన కథవ్వాలి. కానీ ఏ విజన్ లో పెట్టుకుని ఈ కథని అల్లారో
గానీ, మీనాక్షీ మీద కాసేపు- రాజు మీద కాసేపూ విజన్ మారుతూ, ఎవరి కథ ఫాలో అవాలో అర్ధం గాకుండా తయారైంది. చదువు సంధ్యల్లేని, ఒక ఆవారాని ఒక పెద్ద ఉద్యోగం చేసే అమ్మాయి ఒక కారణంతో ప్రేమించడమే ఒక పాయింటైతే, మళ్ళీ ఆ ఆవారా రాజు ఆమెని తిరస్కరించడానికో కారణముందని అతడికి ఇంకో
పాయింటు కల్పించడంతో ఈ రెండు పాయింట్ల మధ్య రెంటికీ చెడ్డ రేవడి అయింది కథ.
మళ్ళీ
సెకండాఫ్ లో ఇద్దరూ వేరే ఇద్దర్నీ ప్రేమించే కథనం అదనపు కన్ఫ్యూజన్. ఆమె తనకి ఏ
మాత్రం సరితూగని రాజుని ప్రేమించడానికి చనిపోతూ తండ్రి చెప్పిన మాటే కారణమైతే, దాని కోసం రాజుతో ఒక రాత్రి గడపడానికైనా సిద్ధపడితే, రాజు ఆమె ఎందుకిలా చేస్తోందని ఆలోచించకుండా, తన
వెంట పడుతున్న ఆమె అసలు కథ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా- ఒక రాత్రి గడపడం గురించి
ప్లేటు ఫిరాయించి నీతులు చెప్పడం వుంటుంది.
హీరోయిన్ కి హిడెన్ ట్రూత్ అనే ప్లాట్
డివైస్ ని పెట్టుకుని సృష్టించే ఇలాటి సమస్యాత్మక కథకో ప్రయోజన ముండాల్సింది లేదు.
హిడెన్ ట్రూత్ తో ఈ పరిస్థితి ఎదురైన హీరోయిన్ ఇక ఏం చేయాలన్న ప్రశ్న ప్రధానంగా బలంగా, ఆలోచనాత్మకంగా, ప్రాక్టికల్ గా వుండాల్సిన కథ.
కళ్యాణ్ దేవ్ ఈ రెండో సినిమాతో కూడా
స్కిల్స్ పెంచుకుని నటించలేదు. ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేశాడు.
ఫైట్లు, డాన్సులు మాత్రం బాగా చేయగలడని నిరూపించుకున్నాడు. ఇలాటి బరువైన
రోమాంటిక్ డ్రామాలు గాకుండా తేలికపాటి లవ్
- యాక్షన్లు చేసుకుంటే సరిపోతుందేమో. మొదటి సినిమా ‘విజేత’ లో కూడా తండ్రీ కొడుకుల బరువైన కథతో తనకి ఎమోషన్లు వర్కౌట్ కాని
నిదర్శనముంది. పోతే తను నటించిన ఈ రెండు సినిమాల్లో కూడా ఆవారా పాత్రే తీసుకున్నాడు.
ఇలా ఒకే టైపు సినిమాలు, అవీ లో- గ్రేడ్ సినిమాలు చేయడం ఇంకో ప్రత్యేకతగా
కన్పిస్తోంది.
ఇక కన్నడ హీరోయిన్ రచితా రామ్
టాలెంటెడ్ నటియే. ఈ క్లిష్ట పాత్రని నటించగల సామర్ధ్యం వుంది. కానీ కథే గందర గోళంగా
వుంటే క్లిష్ట పాత్ర ప్రేక్షకుల పాలిట దుష్ట పాత్రయి పోతుంది. క్లిష్ట పాత్ర కథా
కథనాలూ, నటనా ఎలా వుంటాయో దర్శకుడూ హీరోయినూ కలిసి ‘జ్యోతి’ లో జయసుధని చూసి వుండాల్సింది.
హీరోయిన్ తండ్రి పాత్రలో రాజేంద్ర
ప్రసాద్, హీరో తల్లిదండ్రుల పాత్రల్లో నరేష్, ప్రగతి నటించారు. ప్రొడక్షన్ విలువలు మాత్రం బావున్నాయి. తమన్ సంగీతం సినిమా
స్థాయికి తగ్గట్టుంది.
గత నెల హిందీలో ‘అట్రంగీ రే’ విడుదలైంది.
ధనుష్, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్
నటించిన రోమాంటిక్ కామెడీ. ఇందులో సారా ఇతరులెప్పుడూ చూడని మెజీషియన్ అక్షయ్ ని
ప్రేమిస్తూ పదేపదే అతడి కోసం ఇంట్లోంచి పారిపోతూంటుంది. ఇలా కాదని ఒక రోజు ఆమె
బంధువులు దారిని పోతున్న మెడికో ధనుష్ ని కిడ్నాప్ చేసి సారాతో పెళ్ళి
జరిపించస్తారు. బీహారులో ఇలాటి కిడ్నాప్ పెళ్ళిళ్ళు మామూలే. అవతల తనకి పెళ్ళి
నిశ్చయమై వుంటే ఈ కిడ్నాప్ పెళ్ళితో ధనుష్ పిచ్చెత్తి పోతాడు. సారా మాత్రం
మెజీషియన్నే కలవరిస్తూంటుంది. ఒక రోజు అతను గుర్రం మీద వస్తూంటే ఎదురు
పరిగెడుతుంది. అక్కడ గుర్రముండదు, మెజీషియనూ వుండడు. అదంతా ఆమె
వూహే అన్నమాట. వూహాల్లో మెజీషియన్ని
సృష్టించుకుని ప్రేమించుకుంటోంది. ఆమెది మెంటల్ కండిషన్. కథకి సెంట్రల్
క్యారక్టర్. ఆమెకి సమస్య వున్నట్టు ధనుష్ కింకో సమస్య వుండదు. ఆమె సమస్యని
పరిష్కరించడమే ధనుష్ సమస్య. ఇక్కడ్నుంచీ సమస్యని పరిష్కరించే బాటలో ఈ కథ ఎంత గందర
గోళంగా, బోరుగా తయారై 1.5 రేటింగ్ సంపాదించుకుందో తెలిసిందే.
ఇది కాదు విషయం- ఇందులో సెంట్రల్ క్యారక్టర్ గా హీరోయిన్ వున్నప్పుడు సమస్య ఆమెకే వుంది.
ఈమె సమస్యని పరిష్కరించడమే హీరో సమస్య. ఈ కాన్షస్ - సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేనే ‘సూపర్ మచ్చి’ లో లోపించింది. ఇద్దరికీ వేర్వేరు సమస్యలు
పెట్టడం వల్ల.
ఫస్టాఫ్ సాంతం రాజు ఆవారాతనం, మీనాక్షీ ప్రేమిస్తూ వెంటపడడం తప్ప కథనంలో మార్పు రాదు, ప్లాట్ పాయింట్ రాదు. ఎందుకు ఆమె రాజు లాంటి ఆవారాని లొంగదీయడానికి పడకెక్కడానికి
సైతం సిద్ధపడిందో చెప్పకుండా సెకండాఫ్ లో వరకూ నాన్చారు. ‘అట్రంగీ
రే’ లో ఆమెకి మెజీషియన్ తో ప్రేమ కల్పననే ప్లాట్ పాయింట్ ఫస్టాఫ్
లోనే వచ్చేసి కథ ప్రారంభమైపోతుంది.
సెకండాఫ్ లో మళ్ళీ ఇద్దరి వేర్వేరు ప్రేమలు
టార్చరే. కథేమిటో అర్ధం గాకుండా, పాత్రలేమిటో అర్ధంగాకుండా చేస్తూ
అది సస్పెన్సు పోషణ అనుకుంటే - ఎండ్ సస్పెన్సూ, మిడిల్ మాటాషులతో
ఫిష్ మార్కెట్టే అవుతుంది తప్ప సూపర్ మచ్చీ అవదు.
—సికిందర్
Friday, January 14, 2022
1117 : రివ్యూ
కథ - దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
తారాగణం : నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి, రావు రమేష్, నాగబాబు, వెన్నెల కిశోర్, ఝాన్సీ, బ్రహ్మాజీ తదితరులు
స్క్రీన్ ప్లే : సత్యానంద్, సంగీతం : అనూప్ రుబెన్స్, ఛాయాగ్రహణం : యువరాజ్
విడుదల : జనవరి 14, 2022
***
2016 సంక్రాంతికి కళ్యాణ్ కృష్ణ
దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సంక్రాంతికి దీని సీక్వెల్ గా ‘బంగార్రాజు’ విడుదల చేశారు. ఈ సారి నాగార్జునతో బాటు
నాగ చైతన్య నటిస్తూ చిన బంగార్రాజు పాత్ర పోషించాడు. ఈ సీక్వెల్ తండ్రీ కొడుకుల వల్ల
ఇంకెంత ప్రీమియం వినోదంగా మారిందో చప్పున చూసేద్దాం...
కథ
‘సోగ్గాడే చిన్ని నాయనా’ లోని బంగార్రాజు (నాగార్జున) కొడుకు డాక్టర్ రామ్మోహన్ (నాగార్జున)
ఇప్పుడు కొడుకుని కని, భార్య చనిపోయి, కొడుకుని తల్లి సత్యమ్మ (రమ్యకృష్ణ)
కప్పగించి తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. మనవడికి భర్త పేరే వచ్చేలా చిన బంగార్రాజు
అని పేరు పెట్టుకున్న సత్యమ్మ అల్లారు ముద్దుగా పెంచుతూ చనిపోయి, స్వర్గంలో వున్న భర్త బంగార్రాజుని చేరుకుంటుంది. వూళ్ళో సర్పంచ్ (రావురమేష్)
కూతురు నాగలక్ష్మి (కీర్తీ శెట్టి) తో క్షణం పడని మనవడు చిన బంగార్రాజుని స్వర్గం
నుంచి చూసి, మనవణ్ణీ నాగలక్ష్మినీ ఎలాగైనా కలిపి పెళ్ళి చేసి
రమ్మని బంగార్రాజుకి చెప్పి పంపిస్తుంది సత్యమ్మ. భూమ్మీద మనవడు చిన బంగార్రాజు
(నాగ చైతన్య) శరీరంలోకి ప్రవేశించిన బంగార్రాజు ఆత్మ, ఇప్పుడా
ఇద్దరి ప్రేమని ఎలా చక్కబర్చి పెళ్ళి చేసిందనేది, మనవణ్ణి
చంపాలని జరుగుతున్న కుట్రని ఎలా ఎదుర్కొందన్నదీ మిగతా కథ.
నాటి సంక్రాంతి విలేజి వినోదం ‘సోగ్గాడే
చిన్ని నాయనా’ లోలాగే సోషియో ఫాంటసీ కమర్షియల్ కథ. దర్శకుడు
కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కి తనది కాని కథని (మూల కథ
పి రామ్మోహన్, స్క్రీన్ ప్లే సత్యానంద్) ఓన్ చేసుకుని, ఒక విజయవంతమైన వినోదాన్ని అందించగల్గిన వాడు, 2017
లో రెండో సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ని సొంత కథతో తీసి ఫ్లాప్ చేశాడు. ఎలాగైతే ఈ రెండో సినిమాకి ప్రాణంలేని
కథ చేశాడో, ఇప్పుడు మూడో సినిమా ‘బంగార్రాజు’ కీ ప్రాణం లేని సొంత కథే చేశాడు.
ప్రాణమే లేకపోతే బంగార్రాజు ఆత్మ ఎక్కడుంటుంది. మనవడు చిన బంగార్రాజు
శరీరంలోకి తాత బంగార్రాజు దూరినంత మాత్రాన ఏం జరుగుతుంది కథకి శరీరం లేక పోయాక.
రెండో సినిమా కథలో కొత్తదనం లేనట్టే మూడో సినిమాలోనూ లేదు.
రెండో సినిమా లాగే మూడో సినిమా పాత కథని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు పాత్ర చిత్రణలు
సహా. రెండో సినిమాలో ఫస్టాఫ్ లో విషయం లేనట్టే, మూడో సినిమాలోనూ లేదు.
రెండో సినిమాలో సెకండాఫ్ ముప్పావు గంట సేపూ కథని పక్కకి తప్పించి, వెన్నెల
కిషోర్ పెళ్ళి తంతే సాగించినట్టు, మూడో సినిమాలో నాగ చైతన్య- కీర్తీ శెట్టిల విషయం
లేని ప్రేమని సాగదీశాడు.
స్వర్గం నుంచి వచ్చిన బంగార్రాజు
ఆత్మ తన మహిమతో ప్రేమకి ఒక క్రేజీ ఫార్ములా ప్రయెగించి సంచలనం రేపకుండా- ప్రేమికుల్ని
ముప్పుతిప్పలు పెట్టకుండా- తను ఆత్మ అనే విషయాన్నే మర్చిపోతే ఇంకేం కథ. ఫాంటసీ
జానర్ అన్నాక మానవాతీత శక్తుల వినియోగంలేని వినోద కాలక్షేప మెలా సాధ్యం.
‘సోగ్గాడే
చిన్ని నాయనా’ లో బంగార్రాజు కొడుకు పాత్ర, భార్యతో వూళ్ళోకి రావడంతో వుంటుంది. ఈ ప్రారంభమే ఇద్దరూ విడాకులు
నిర్ణయించుకుని వచ్చారన్న ఎమోషనల్ హుక్ తో వుంటుంది. ఈ ఎమోషనల్ హుక్ మొత్తం కథనంతా
బలంగా నడిపిస్తూంటుంది. విడాకుల నిర్ణయానికి కారణం కొడుకు తన పనే తప్ప, ఇంకో పని పట్టకుండా భార్యని నిర్లక్ష్యం చేయడం. ఇతనిలా తయారవడానికి తల్లి
సత్యమ్మే కారణం. చనిపోయిన భర్త బంగార్రాజు మన్మధ వేషాలేస్తూ తలనొప్పిగా
తయారయ్యాడని, కొడుకు కూడా అలా తయారవకూడదని, ఆడగాలి సోకకుండా కట్టుదిట్టంగా పెంచింది కొడుకుని. దీంతో కొడుకు మన్మధ
బాణం లేని మొండి మొగుడుగా తయారయ్యాడు. ఇలా ఇక్కడున్న వొక ఎమోషనల్ సెటప్ ఈ సీక్వెల్
కి కొరవడింది. చైతూ- కీర్తీల మధ్య కీచులాటలొక సమస్యా? అది
తీర్చే కథ వో కథా? కథే కాక పోయినా వున్న దాన్నిబంగార్రాజు
స్పెషల్ పవర్స్ తో ఫన్నీ రోమాంటిక్ ఫాంటసీ చేయొచ్చు. ఇదీ లేకపోవడంతో సంక్రాంతికి
వినోదం సోసోగా తయారైంది.
బంగార్రాజు సీనియర్ గా నాగార్జున ఆరేళ్ళ
క్రితం సోగ్గాడులాగే అందం తగ్గకుండా గ్లామరస్ గా వున్నాడు. స్వర్గంలో రంభా ఊర్వశీ
మేనకలతో రోమాంటిక్ సాంగ్ రోస్ట్ చేశాడు. కథలోకి వస్తే బంగార్రాజు జూనియర్లోకి దూరి
చేసిన కామెడీ మాత్రం పాతగానే వుంది పేలకుండా. జూనియర్లోకి దూరి ఫైట్లు చేసే
రెగ్యులర్ టెంప్లెట్ సీన్లూ వున్నాయి. మార్వెల్ స్టూడియోస్ సూపర్ మాన్ సినిమాలు
కొత్తకొత్తగా వూపేస్తున్న కాలంలో, నాగ్ ఆత్మ పాత్ర ఇన్నోవేటివ్ గా కొత్త
విన్యాసాలతో నెక్స్ట్ లెవెల్ కెళ్ళాల్సింది. ఉన్న స్థాయిలోనే వుండిపోయింది. స్వర్గ
దృశ్యాలకి, టెంపుల్ సీన్సుకీ వెచ్చించిన సీజీ వర్క్ అసలు
నాగ్ క్యారక్టర్ విషయంలో విస్మరించారు.
చిన బంగార్రాజుగా నాగచైతన్య
ఎప్పటిలాగే హుషారుగా నటించాడు. పాత్రగా సాగడానికి ఎమోషనల్ గోల్ లేకపోవడంతో, కథలో కూడా ఎమోషనల్ త్రెడ్డే లేకపోవడంతో, కీర్తీ
శెట్టితో పైపైన సాగే రోమాన్స్ కి పరిమితమైపోయాడు. హిట్స్ సాంగ్స్ తో మాత్రం
అలరించగల్గాడు. నాగ్ - చైతూలు కలిసి కన్పించే సీన్లు వెండితెరని వెలిగించేసినా
కథలో విషయం లేకపోవడం వల్ల కేవలం మోడలింగ్ చేస్తున్నట్టే,
లేదా క్యాట్ వాకింగ్ చేస్తున్నట్టే వున్నారు. క్లయిమాక్స్ మాత్రం కొంత విషయం కనపడి
ఇద్దరూ కాస్త ఫర్వాలేదన్పించుకున్నారు.
లేటెస్ట్ గ్లామరామృతం హీరోయిన్
కీర్తీ శెట్టి సర్పంచ్ గా మారే పాత్ర చిత్రణకి, ఆ కామెడీకి
రెండు మూడు చోట్ల మాత్రమే నవ్వొస్తుంది. ఆమె పాత్రని సరిగా డెవలప్ చేయకుండా
టెంప్లెట్ హీరోయిన్ స్థాయిలో వదిలేశారు. రమ్యకృష్ణ ఎక్కువ గ్లామరస్ గా వుంది వెండి
తెరకి. ఆత్మగా ఆమె కూడా వచ్చి కొన్ని పనులు చేస్తుంది. ఇక హీరోయిన్ తండ్రిగా
రావురమేష్ సైడ్ క్యారక్టర్ గానే మిగిలిపోయారు. సహాయ పాత్రల్లో ఇతరులందరూ హంగామా
చేస్తారు కథ లేకపోయినా.
యువరాజ్ ఛాయాగ్రహణంలో అతిగా డీఐ
చేసిన గ్రామీణ విజువల్స్ కన్పిస్తాయి. పాటల దృశ్యాల్ని అత్యంత రంగులమయం చేసి, పాటల కోసమే సినిమా చూడాలన్నట్టుగా చేశారు. ‘హమ్
దిల్ దే చుకే సనమ్’ పాటల చిత్రీకరణ గుర్తొచ్చేలా. అనూప్
రూబెన్స్ ఆరుకి ఆరు పాటలూ హిట్ చేశాడు. ఇతర సాంకేతిక విలువలన్నీ బావున్నాయి.
‘సోగ్గాడే
చిన్ని నాయనా’ ఇప్పుడు తీసి ‘బంగార్రాజు’ గతంలోనే తీసి వుంటే ఆరోహణ క్రమం కనపడేది. సీక్వెల్ అన్నాక ప్రీక్వెల్ ని మించిన స్థాయిలో వుండాలి.
అప్పుడు ‘బంగార్రాజు’ తీసి ఇప్పుడు ‘సోగ్గాడే’ తీస్తే కథల్నేమీ మార్చాల్సిన అవసరం రాదు.
అప్పట్లో అంచనాలుండేవి కాదు కాబట్టి బంగార్రాజూ హిట్టయ్యేది,
ఇప్పుడు అంచనాలుంటాయి కాబట్టి వాటిని అందుకుంటూ సోగ్గాడూ హిట్టయ్యేది.
బంగార్రాజు సెకండాఫ్ కెళ్ళడానికి
ఫస్టాఫ్ లో కారణం లేదు. ప్రేమకథలో విషయం లేదు, ఇంటర్వెల్లో
హీరోయిన్ విడిపోయే సన్నివేశమూ సరిగా లేదు. ఫస్టాఫ్ ముప్పావు గంట వరకూ చాలా
విషయాలుంటాయి గానీ దేంతోనూ భావోద్వేగాలు పుట్టవు. చిన బంగార్రాజు పుట్టుక, గుడిని విలన్లు దోచే ప్రయత్నం, చిన బంగార్రాజు పెంపకం, స్కూల్లో చిన్న హీరోయిన్ తో తగువులాటలు, స్వర్గంలో
పెద్ద బంగార్రాజు సరసాలు, చిన బంగార్రాజు పెద్దవాడై హీరోయిన్
వెంట పడ్డం, మధ్యలో గుడి కింద వజ్రాల గనులతో విలన్ కుట్ర …
ఇలా యాభై నిమిషాలు గడిచిపోయాక- స్వర్గం నుంచి బంగార్రాజు ఆత్మ వచ్చి
చిన బంగార్రాజులోకి దూరడంతో కథ ప్రారంభమవుతుంది.
ఓ అరగంట ఇంటర్వెల్ వరకూ బంగార్రాజు ఆత్మతో
కామెడీలయ్యాక, చిన బంగార్రాజుతో హీరోయిన్ విడిపోవడం, గుడి కింద గనులు దోచాలంటే అడ్డున్న చిన బంగార్రాజుని విలన్ చంపాలనుకోవడంతో
ఇంటర్వెల్. ఇలా ఫస్టాఫ్ లో ప్రధాన కథ సరిగా లేక, విలన్ తో ఉప
కథ రొటీన్ గా వున్నాక, సెకండాఫ్ ఫస్టాఫ్ లాగే ఇంకా కథని వెతుక్కుంటూ
వుండి పోయింది. దీన్ని మరిపించడానికన్నట్టు చాలా మాస్ కామెడీలు చేశారు. చివరి కెలాగో క్లయిమాక్స్
కొచ్చి, సగటు ప్రేక్షకులకి సరిపోయే ఎమోషనల్ ముగింపుని మాత్రం
ఇచ్చారు.
—సికిందర్
Thursday, January 13, 2022
1116 : స్క్రీన్ ప్లే సంగతులు
కథలో తగినంత
సంఘర్షణ లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు పాత్రకి మరిన్ని బాహ్య లేదా అంతర్గత అడ్డంకుల్ని జోడించడం చేస్తే,
పాత్ర లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కువ
సంఘర్షించేలా చేస్తుంది. తగినంత సంఘర్షణ లేకపోతే పాత్ర వెంటనే దాని లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది కథని
బలహీనం చేస్తుంది. కథలో పాత్ర లక్ష్యం కోసమే
సంఘర్షిస్తుంది. అంటే సంఘర్షణ
అనేది లక్ష్యాన్ని కథగా మారుస్తుందని అర్ధం జేసుకోగలం.
అయితే మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్న కథ అలాంటిది కాకపోతే? మన కథకి సంఘర్షణని జోడించడం మనస్కరిచక పోతే ఏం చేస్తాం? ఇక్కడ కథల గురించి మనకుండే అవగాహనని విస్తరించుకుని చూడాలి. విభిన్న కథా కథనాల నిర్మాణాలేమిటో తెలుసుకోవాలి. మనం పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినట్లయితే, కథల్లో సమస్యని పరిష్కరించడాన్నేకథ లంటారన్న అభిప్రాయంతో పెరిగి వుంటాం. సమస్యని పరిష్కరించడమే కథ ఐనట్లయితే, ఆ సమస్య పాత్రకి లక్ష్యాన్ని, లాభ నష్టాల్ని, సంఘర్షణనీ కల్పిస్తుంది. ఇలా సమస్యని పరిష్కరించడమే పాత్ర కర్తవ్యమవుతుంది.
అయితే మన కలవాటైన ఈ నాటకీయ ఉత్థన పతనాల (డ్రమెటిక్ ఆర్క్) కథన శైలి అన్ని కథలకీ, ముఖ్యంగా పాశ్చాత్యేతర సంస్కృతులకి వర్తించదు. మరీ ముఖ్యంగా, మనం అలవాటు పడినట్టు, విభిన్న కథా నిర్మాణాలతో కూడిన కథలు సంఘర్షణపై ఆధారపడవు. అలాగని సంఘర్షణ లేదు కాబట్టి వీటిని కథలుగా పరిగణించ వీల్లేదని కాదు. సంఘర్షణ లేకపోవడమే వీటిని వైవిధ్య కథలుగా మార్చేస్తుంది. దీన్నుంచి మనం నేర్చుకోవాలి.
సంఘర్షణ రహిత
లేదా స్వల్ప సంఘర్షణల కథా నిర్మాణాలు :
సంఘర్షణని విస్మరించే, లేదా స్వల్ప సంఘర్షణకి భిన్నమార్గాల్నవలంబించే
కథా నిర్మాణాలు చూద్దాం : 1) కిషోటెన్‌కేట్సు:
ఈ నాలుగు అంకాల కథా నిర్మాణం (ఫోర్
యాక్ట్స్ స్ట్రక్చర్) చైనీస్, కొరియన్, జపనీస్ కథల్లో కన్పిస్తుంది.
శతాబ్దాల నాటి కథనాల నుంచి ఆధునిక మాంగా, నింటెండో వీడియో గేమ్‌ల వరకూ దీన్ని చూడొచ్చు, 2) రోబ్లెటో:
సాంప్రదాయ నికరాగ్వాన్ కథా శైలి. ఇందులో పాత్ర ప్రయాణ మార్గాలు
అనేకం వుండి, పునరావృత మవుతూ వుంటాయి, 3) డైసీ-చైన్ ప్లాట్ : ఒక కేంద్రీయ పాత్రంటూ లేకుండా, ఒక కథా వస్తువుని లేదా ఆలోచనని అనుసరించే నిర్మాణం, 4) ఫ్యాన్ ఫిక్షన్ “ఫ్లఫ్”:
పాత్ర ఇంటరాక్షన్స్
(పరస్పర చర్యల) పై దృష్టి పెట్టే సంఘర్షణా రహిత నిర్మాణం, 5) ఓరల్ స్టోరీ టెల్లింగ్ : సంఘర్షణని కాకుండా నైతిక సందేశాన్ని నొక్కి చెప్పే నిర్మాణం, 6) రషోమన్-స్టైల్ ప్లాట్ : విభిన్న దృక్కోణాల నుంచి పునరావృతమయ్యే సంఘటనలతో కూడిన నిర్మాణం.
విభిన్న నిర్వచనం :
మనం పాశ్చాత్య-సంస్కృతి దృక్కోణంలో కథ
చెప్పడంలో కూరుకుపోయి వుంటే, సంఘర్షణ
లేని కథల్ని
బోరుగానే ఫీలవుతాం. వాటినసలు కథలుగానే పరిగణించం. సరే,
అయితే అసలు కథని కథగా మారుస్తున్న దేమిటో అర్థం చేసుకోవడానికి వెనక్కి వెళ్దాం. నేను నా బ్లాగులో తరచుగా వివరిస్తున్నట్టుగా, అన్ని రకాల కథలూ 'మార్పు' ఆధారంగానే
నిర్మాణాలు జరిగాయి. చాలా
పాశ్చాత్య-శైలి కథా కథనాలు సంఘర్షణ ప్రభావిత 'మార్పు' పై
ఆధారపడి వుంటాయి. 'మార్పు'
అంటే పాత్ర మారడం, పరివర్తన చెందడం. ఇందులో కథానాయకుడు బాహ్య లేదా అంతర్గత సంఘర్షణల్ని అధిగమించడం లేదా, వాటి
నుంచి నేర్చుకోవడం (లేదా అధిగమించడంలో లేదా
నేర్చుకోవడంలో విఫలమవడం) వుంటుంది.
ఇలా పాత్ర సంబంధిత మార్పుతో కూడిన
కథలకి మనం అలవాటు పడ్డాం. దీనికి వ్యతిరేకంగా పైన చెప్పుకున్న ఆరు పాశ్చాత్యేతర
నిర్మాణాలున్నాయి. ఇవి పాత్ర మార్పు పై కాకుండా పఠితలో మార్పుపై దృష్టి
పెడతాయి. ఉదాహరణకి, రషోమన్-శైలి కథలు ఒకే సంఘటనకి వివిధ పాత్రలు చెప్పే భిన్న భాష్యాల్ని ప్రేక్షకుల ముందు పెడతాయి. వాటిలో
ఏది యదార్థమో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఫ్యాన్‌ఫిక్ "ఫ్లఫ్" కథల్లో, పాఠకులు
తమ అభిమాన
పాత్రలు చెప్పే, చేసే, ఆలోచించే, ప్రవర్తించే
లేదా విభిన్న పరిస్థితులలో ప్రతిస్పందించే తీరుని తీసుకుని,
వాటికి విస్తరించిన తమ వూహా కల్పనని జోడిస్తారు.
ఇక కిషోటెన్‌కేట్సులో, కథలోని
మూడో
అంకంలో వూహించని ట్విస్టు వస్తుంది. ఈ ట్విస్టు ప్రేక్షకులు కథని చూసే
దృక్కోణాన్ని మార్చేస్తుంది. సాధారణ
‘ప్లాట్ ట్విస్ట్’ కంటే పాఠకుల దృక్పథాన్ని మార్చడం
గురించి ట్విస్ట్ ఎక్కువగా వుంటుంది. అందుకని మొదటి రెండంకాలతో సంబంధం లేకుండా ఈ ట్విస్ట్ వుంటుంది.
ఈ ఉదాహరణ చూడండి... ‘మై నైబర్ టోటోరో’ అనే జపనీస్ యానిమేషన్ లో
సంఘర్షణ లేదు, ప్రత్యర్థి లేడు. ఇద్దరమ్మాయిల
తల్లి అనారోగ్యంతో వుంటుంది. ఈ అనారోగ్యం కథలో సాధించాల్సిన సమస్య
కాదు. కేవలం ఒక పరిస్థితి. ఆమె ఆరోగ్యం మెరుగుపడడం అనేది అమ్మాయిల చర్యలతో సంబంధం లేనిది. ఆ అమ్మాయిల పని మ్యాజికల్ పవర్స్ తో వున్న పొరుగు వ్యక్తి గురించి
తెలుసుకోవడం గురించే. అతడ్ని స్నేహితుడిగా చేసుకోవడం గురించే. ఆ స్నేహితుడితో కలిసి ప్రపంచాన్ని రక్షించడమో, లేదా దురుసు మనుషుల నుంచి ఈ ప్రత్యేక స్నేహితుడిని రక్షించడమో కాదు. అలాంటిదేమీ లేదు. కేవలం
స్నేహం చేయడమే.
—జామీ గోల్డ్
Tuesday, January 11, 2022
1115 : స్క్రీన్ ప్లే సంగతులు
తెలుగు సినిమా
ప్రేక్షకుల్లో కోవిడ్ వల్ల కన్పిస్తున్న మార్పేమిటంటే, రెగ్యులర్
ఫార్ములా కథలకి తోడు భిన్న కథా శైలుల్ని ఆదరించే ఆధునికత్వాన్నికూడా అలవర్చుకోవడం. కోవిడ్ ఓటీటీని వెంట బెట్టుకొచ్చి ఇంటింటా అంటించింది. దాంతో ప్రపంచంలో ఎక్కడి
ఏ భాషా సినిమాల్నైనా చూసే అవకాశంతో సినిమా చూసే దృక్పథాన్నే మార్చేసుకున్నారు. అన్ని
సినిమాలూ మెయిన్ స్ట్రీమ్ సినిమాలే అనే లౌకికతత్వాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. ఓటీటీకి
పూర్వం వరల్డ్ సినిమాలున్నాయి. కానీ వాటికి అలవాటు పడలేదు, వాటిని
మన టేస్టుకి సరిపడని పరాయి సినిమాలన్నట్టుగానే చూశారు. ఇప్పుడలా
కాదు, తెలుగు సినిమాల్ని సైతం ఎలాటి కథా శైలులతో నైనా చూసేందుకు ముందుకొస్తున్నారు.
సింప్లీకరించి చెప్పుకోవాలంటే
త్రీ యాక్ట్ స్ట్రక్చరే ఇక సినిమాల కుండనవసరం లేదు. ప్రేక్షకులిస్తున్న అనుమతితో కథ
ఎలా చెప్పుకుంటూ పోవాలన్నా పోవచ్చు. ప్రేక్షకులు అనుమతి నివ్వని కాలంలో ఇలా తీసిన సినిమాలే
ఎక్కువున్నాయి. అవి ఫ్లాపవడం చూసి స్ట్రక్చర్ లేక ఫ్లాపవుతున్నాయని అనేసుకున్నాం. స్ట్రక్చర్
లేకుండా చేసి, మేకర్లు మరి తామనుకుంటున్న క్రియేటివిటీ ఏమిటో చెప్పడం లేదు, దానికైనా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆ క్రియేటివిటీ ఏమిటో తెలిస్తే గ్యారంటీ నివ్వగలరు.
తెలియక పోవడం వల్లే గల్లా పెట్టెలు గల్లంతవుతున్నాయి.
ఈ వ్యాసం రాస్తున్నప్పుడే ఒక కథ డెవలప్
అవుతోంది. మేకర్ తెచ్చిన కథ కొత్తగా వుంది. అందులో కాన్ఫ్లిక్ట్ వుంది కానీ ప్రత్యర్ధి
పాత్ర చివరి వరకూ అదృశ్యంగా వుండడంతో, కథనం బోలుగా వుంది. కాసేపు
రెగ్యులర్ స్ట్రక్చర్ ని పక్కన పెట్టి, పాత్రకి సబ్ ప్లాట్ గా
ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని కల్పిస్తూ ప్రత్యర్థి లేని లోటుని పూడ్చాలనుకుంటే, అది మేకర్ కిష్టం లేదు. ఎందుకంటే ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కోసం సృష్టించే సమస్య పాత్ర మర్యాదని దెబ్బతీస్తుందని మేకర్ అభ్యంతరం.
సమస్య లేకుండా సంఘర్షణ లేదు. ఏ సమస్య తీసుకున్నా అది పాత్ర మర్యాదనే దెబ్బతీస్తోంది.
మర్యాద దెబ్బతినకుండా సమస్య ఎలా? సమస్య లేకుండా సంఘర్షణ ఎలా? ఎక్కడుంది దీనికి కిటుకు? కథ పెండింగులో పడింది.
జెమీ గోల్డ్ |
ఒక రోజు కథల్లో సమస్యల గురించి సెర్చి చేస్తూంటే, 'కాసాబ్లాంకా', 'ఇండియానా జోన్స్', 'పల్ప్ ఫిక్షన్', 'మ్యాట్రిక్స్' లలో ప్రయోగించిన
ప్లాట్ డివైసులున్నాయి. దీన్ని మెక్ గఫిన్ ప్లాట్ డివైస్ అంటారు. ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్
కనిపెట్టాడు. ఒక సమస్య చుట్టూ సంఘర్షిస్తూంటాయి పాత్రలు. ఆ సమస్య పాత్రలకే తెలుసు, ప్రేక్షకులకి చెప్పరు. చెప్తే తేలిపోతుంది. 'కాసాబ్లాంకా' లో లెటర్స్ అనే ప్లాట్ డివైస్ వుంటుంది. ఆ లెటర్స్ లో ఏముందో చెప్పరు. 'పల్ప్ ఫిక్షన్'లో బ్రీఫ్ కేసు ప్లాట్ డివైసుగా వుంటుంది.
ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పరు.
ఈ మెక్ గఫిన్ ప్లాట్ డివైసుని మన మేకర్
కథలోకి తెచ్చేస్తే సమస్య తీరిపోయింది. సమస్య దేని గురించో చెప్పకుండా, పాత్ర మర్యాద దెబ్బ తీయకుండా, సబ్ ప్లాట్ ప్రత్యర్ధితో
ప్రత్యక్ష సంఘర్షణతో కథ నీటుగా వచ్చేసింది. పనిలో పనిగా అసలు అదృశ్య ప్రత్యర్ధితో ప్రచ్ఛన్న
పోరాటం (కోల్డ్ వార్) కూడా తళుక్కున మెరిసి సమగ్ర కథ వచ్చేసింది...
ఇదే సమయంలో ఇంకో కథ. ఇది రెగ్యులర్ రొటీన్
టెంప్లెట్ కథ. మనం చంద్రుడి ఒక వైపే చూస్తాం, అవతలి వైపు ఏముందో
తెలియదు. టెంప్లెట్ సినిమాలు కూడా ఒకవైపే చూపిస్తూ బోరు కొట్టేస్తున్నాయి. రెండో వైపు
ఎందుకు చూపించరు. ఈ కథకి ఇదే చేసి ఇంటర్వెల్లో అట్టు తిరగేసినట్టు తిరగేస్తే రెండోవైపు
కొత్త కథ కన్పించింది... ఇంకో మేకర్ టెంప్లెట్ కథనే పెద్ద కంపెనీల్లో చెప్తూ సెకండాఫ్
రిజెక్ట్ అవుతున్నాడు. ఇంటర్వెల్లో రివర్స్ చెయ్, సెకండాఫ్ కొత్తగా
వస్తుందన్నాం. రివర్స్ చేయడానికి ఒక ప్లాట్ డివైస్ ఇచ్చేశాం. మేకర్ స్టామినా పెరిగింది...
మన దగ్గరే సినినాప్సిస్ లో ఒక పెద్ద
కథ వుంది. సెకండాఫ్ లో కెళ్లినా 'కమర్షియల్ హీరోయిజం' కనిపించడం లేదని మేకర్ ఫిర్యాదు. దీని ఇంటర్వెల్ విజువల్ బ్యాంగ్ తో వుంది.
అది కూడా హీరోయిజమే. దీనికో డైలాగు వేసి వర్బల్ బ్యాంగ్ ఇవ్వడంతో సెకండాఫ్ కూడా కొత్త
కథగా మారిపోయింది ఆ డైలాగు పట్టుకుని.
ఇదంతా ఏమిటంటే స్ట్రక్చర్ కి ప్రత్యామ్నాయ
ప్రయత్నాలు. కథల్లో సమస్యా, దాంతో సంఘర్షణా వుంటాయి. వీటిని స్ట్రక్చర్
లో సరైన తీరులో వాడకపోవడం వల్ల మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు వచ్చి ఫ్లాపవుతున్నాయి.
అసలు సంఘర్షణే లేని గాథలు కూడా తయారై ఫ్లాపవుతున్నాయి. ఇంకేవో లైటర్ వీన్ సినిమా లనుకుంటూ
కూడా వచ్చి ఫ్లాపవుతున్నాయి. ఇవన్నీ సమస్య- సంఘర్షణ పరికరాల వాడకంలో బోల్తాపడుతున్నవే.
ఇప్పుడు సినిమాల తీరు మారింది. వివిధ కథాకథనాల శైలులు సమస్య- సంఘర్షణ పరికరాల్ని భిన్నంగా
నిర్వచిస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ శైలులేమిటో తెలుసుకుంటే
స్ట్రక్చరేతర క్రియేటివ్ స్కూలు మేకర్స్ తీసే 'ఇండిపెండెంట్' కమర్షియల్ సినిమాలైనా నాణ్యత పెంచుకుంటాయి. ఈ శైలుల గురించి వివరిస్తూ రచయిత్రి
జెమీ గోల్డ్ రాసిన వ్యాసం రేపు మీకందుతుంది. చదివి అర్ధం జేసుకుని పాటించగలరు.
—సికిందర్
Subscribe to:
Posts (Atom)