సస్పెన్సుకి తల వుండి తోక లేకపోతే తెనాలి రామకృష్ణుడి మేక తోక పద్యంలా తికమకగా
వుంటుంది. మేకని తలతో మొదలు పెట్టి మెడ, కడుపు, కాళ్ళు అంటూ తోక కొస్తాం. అంటే తల
స్టార్టింగ్ పాయింట్, తోక ఎండ్ పార్టు. మేకని చూసే నార్మల్ పధ్ధతి ఇది. ఇలా తల
నుంచి కాక, తోక నుంచి మొదలు పెడితే మొత్తం మేక శరీర భాగాలు తోకకి ఎండ్ పార్టులవుతాయి.
అంటే తోకకి తోకలవుతాయి. తోకే లేకపోతే తల ఏమవుతుంది? సస్పెన్సు కీ అదే అవుతుంది. ఇక సస్పెన్సుకి ఇద్దరు విడి విడి
విలన్లుంటే తలా తోకా రెండూ వుండవు!
మురుగ దాస్ కూడా
రజనీ కాంత్ తో తలాతోకా లేని పనే చేశాడు. ‘దర్బార్’ లో ఇద్దరు విడి విడి విలన్స్ ని
పెట్టాడు. రజనీ
కాంత్ డ్రగ్ దందా మూలాలు వెతుకుతున్నప్పుడు, ఇతనే విలన్ అని మనం సెటిలై ఫాలో అయ్యే ఒక విలన్ తెరపైకొస్తాడు. రజనీ అతడి కొడుకు దొరికితే వాణ్ణి చంపేసి ఆ విలన్ కి షాకిస్తాడు. అప్పుడు రజనీకి తెలియని
ఇంకో విలన్ వచ్చి ఉన్న విలన్ని చంపేస్తాడు.
చంపడమేగాక, రజనీ మీద దాడి చేసి అతడి కూతుర్నీ చంపేస్తాడు. సెకండాఫ్ లో ఈ కొత్త
విలనెవరో తెలియక రజనీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇలా హీరోగా రజనీ
ముగించాల్సిన కథలో విలన్ పాత్రని రెండో విలన్ చంపి ముగించి, సూపర్ స్టార్ గా రజనీ
పాత్రకి దక్కాల్సిన క్రెడిట్, బాక్సాఫీసు అప్పీల్, ఫ్యాన్స్ చప్పట్లూ వగైరా
మార్కెట్ యాస్పెక్ట్స్ ని అప్పనంగా తను కొట్టేసి సినిమాకి నష్టం చేశాడు. రజనీ
పాసివ్ క్యారక్టర్ గా వెలవెల బోయాడు. ఇలా కథని రెండో విలన్ ముగించాక అతడితో ఇంకో
కథ ప్రారంభమవడంతో, అసలు కథ తెగిపోతూ స్క్రీన్ ప్లే నిట్టని లువునా ఫ్రాక్చర్ అయి - సెకండాఫ్ సిండ్రోం, మిడిల్
మటాష్ వంటి అనారోగ్యాలు సినిమాకి పట్టుకున్నాయి.
ఇద్దరు
విలన్లతో ఇలావుంటే, ఇక ‘సాహో’ లో
లెక్కలేనంత మంది విలన్లు. వాళ్ళ లెక్కలేనన్ని విలనిజాలు. వాళ్ళందరూ ఒకే కథగా, ఒకే
ఎజెండాతో వుంటే, హీరో ప్రభాస్ కి ఓ ఏకీకృత గోల్ ఏర్పడి, ఉమ్మడి శత్రువుల్ని మూకుమ్మడిగా
చంపుతూ కథకో అర్థాన్నీ, బలాన్నీ సమకూర్చి పెట్టేవాడు. హాలీవుడ్ ఫాంటసీ -సైన్స్
ఫిక్షన్ సినిమాల్లో మల్టిపుల్ విలన్సే వుంటారు. ఇవి ఎక్కువగా కామిక్ బుక్స్ సిరీస్
ఆధారంగా తీసినవై వుంటాయి కాబట్టి. ఈ మల్టిపుల్ విలన్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి
వుంటారు. లేదా ఒక మెయిన్ విలన్ వుంటూ మిగిలిన వాళ్ళు ఆ విలన్ కి ఏజెంట్లుగా
వుంటారు. వీళ్ళందరికీ హీరోతో ఒకే సమస్యతో సంబంధం - పోరాటం వుంటుంది.
ఇప్పుడు ‘పెంగ్విన్’ తో వచ్చిన సమస్య కూడా ఇలా మల్టిపుల్
విలన్ సిండ్రోమే:ఇద్దరు విలన్లు వుండడం. ఇద్దరు విలన్లతో కథలు నిలబడవని కాదు, ఇద్దరూ ఒకటవ కృష్ణుడు, రెండో కృష్ణుడు బాపతుగా ఒకరు
పోయాక ఇంకొకరు వస్తేనే సమస్యంతా. ఇద్దరూ ఒకే గోల్ తో
ఒకే సమయంలో ఒకే గ్యాంగ్ గా, సిండికేట్ గా ఆపరేట్ చేస్తే
సమస్య రాదు. వాళ్ళు ఒకే కథతో ఉమ్మడి శత్రువులుగా ఒకే టార్గెట్ గా హీరోకి వుంటారు
కాబట్టి. ఇలాకాక ‘పెంగ్విన్’ లోలాగా హీరోయిన్ కీర్తీ సురేష్ ని ఒక ఇబ్బంది పెట్టి తను
కాదని ఒక విలన్ వెళ్ళిపోతే, ‘దర్బార్’ లో రజనీ కాంత్ లా ఆమె ఇంకో విలన్ని
వెతుక్కోవడంతో - ఈ విడివిడి విలన్ల రాక
పోకలు విడివిడి కథలయ్యాయి. దీంతో ఆమూలాగ్రం ఎడతెగని ఒకే ధారగా ప్రవహించాల్సిన ఒకే
కథ, మధ్యలో ఒక పాయగా విడిపోయి సస్పెన్సు, సినిమా అన్నీ వీగిపోయాయి.
2
నెట్ లో ఒక
విషయం గురించి సెర్చి చేస్తూంటే ‘జస్ట్ వాట్ కైండ్ ఆఫ్ మదర్ ఆర్యూ?’ అన్న నవల తగిలింది.
బ్రిటిష్ రచయిత్రి పౌలా డాలీ తొలి థ్రిల్లర్ నవల. 2014 లో అచ్చయింది. బాగా పేరు
తెచ్చి పెట్టింది. ఏమిటా అని సినాప్సిస్ చదివితే, ‘పెంగ్విన్’ పోలికలే కన్పించాయి.
లీసాకి ముగ్గురు పిల్లలు. లేక్ డిస్ట్రిక్ట్ లో వుంటుంది. తన పిల్లలతో బాటు
పొరిగింటి పిల్ల లుసిండాని తీసుకుని షికారు వెళ్తుంది. లుసిండా తప్పిపోతుంది.
దీంతో ‘నువ్వెలాంటి తల్లివి?’ అని అందరూ నిందిస్తారు. ఆమెని బాధ్యురాల్ని చేసి
వెలి వేస్తారు. ఇంతలో తన రెండో కూతురు కూడా అదృశ్య మవుతుంది. దీంతో మరింత కలకలం
లేస్తుంది. ఇంతలో దయనీయ స్థితిలో లుసిండా తిరిగి వస్తుంది. ఈ స్థితికి మళ్ళీ
నిందలు మోస్తుంది లీసా. ఇక అసలేం జరిగిందో తెలుసుకుని తన వల్ల జరిగిన తప్పుని
సరిదిద్దడానికీ, కూతుర్ని వెతకడానికీ సమకడ్తుంది. ఈ క్రమంలో తెలుసుకుంటున్న
నిజాలతో షాకింగ్ డొమెస్టిక్ డ్రామాలు, మనుషుల అసలు స్వరూపాలూ భయంకరంగా వెల్లడై,
ఎడతెగని సస్పెన్స్ థ్రిల్లర్ కి దారితీస్తాయి...
కీర్తి
సురేష్ పాత్ర రిథమ్ కథ కూడా దీనికి దగ్గరగా వుంటుంది. కాకపోతే ఫస్టాఫ్ వరకే. నీలగిరి
ఘాట్స్ లో వుండే రిథమ్ రెండేళ్ళ కొడుకు అజయ్ (ఉమర్) ని పోగొట్టుకుంటుంది. దీనికి
భర్త రఘు (లింగా) ఆమెని నిందించి విడాకులు తీసుకుంటాడు. మూడేళ్ళ తర్వాత ఆమె గౌతం (రంగరాజ్)
ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏడు నెలల గర్భవతిగా వుంటుంది. కానీ ఆరేళ్ళ క్రితం అదృశ్యమైన
కొడుకు అజయ్ కోసమే తల్లడిల్లుతూ వుంటుంది. పోలీసులు ఇక చనిపోయినట్టే నని
చేతులెత్తేస్తారు. ఇంతలో అనుకోకుండా ఎనిమిదేళ్ళ అజయ్ (అద్వైత్) తిరిగొస్తాడు. కానీ
మానసికంగా దెబ్బ తిని వుంటాడు. ఏం జరిగిందో, తనని ఎవరు తీసికెళ్లారో డాక్టర్
డేవిడ్ (మాథి) ఎంత ప్రయత్నించినా చెప్పడు.
కొడుకుని ఇలా ఎవరు చేశారో తెలుసుకోవాలని పూనుకుంటుంది రిథమ్. ఇంతలో అంజన (ఐశ్వర్య)
అనే ఇంకో అమ్మాయి అదృశ్యమవుతుంది. ఈమె జాడ కూడా దొరకదు. ఇంతేగాక ఇంటికి
తిరిగొచ్చిన అజయ్ కోసం కిడ్నాపర్ మళ్ళీ ప్రయత్నిస్తూంటాడు. ఇతను చార్లీ చాప్లిన్
మాస్కులో వుంటాడు. ఎవరితను? ఎందుకు చిన్న పిల్లల్ని అపహరిస్తున్నాడు? మళ్ళీ
ఇప్పుడు రిథమ్ కొడుకుని కాపాడుకుంటూ కిడ్నాపర్ ని పట్టుకో గల్గిందా? అంజన ఏమైంది?
రిథమ్ తెలుసుకున్న అసలు నిజమేంటి? ఇదీ మిగతా కథ.
3
రాట్ససన్, అంజాం
పాథిరా, ఫోరెన్సిక్, సైకో, పొన్మంగళ్ వందాళ్, ఇప్పుడు పెంగ్విన్ ...ఇలా వరుసగా
సీరియల్ కిల్లర్ సినిమాలు తమిళ మలయాళాల నుంచి వస్తున్నాయి. వీటిలో రాట్ససన్, పొన్మంగళ్ వందాళ్, పెంగ్విన్
మూడూ చిన్న పిల్లల కిల్లర్స్ కథలతో వచ్చాయి. అయితే ‘పెంగ్విన్’ తో సమస్య ఏమిటంటే,
దీన్ని ఒక విలన్ తో సీరియల్ కిల్లర్ కథలా నడిపించి చీట్ చేయడం. ఒక విలన్ తో సీరియల్
కిల్లర్ కథలా నడిపిస్తూ దాన్ని క్యాన్సిల్ చేసి, ఇంకో విలన్ తో రిథమ్ చిన్నప్పటి
వేరే కథగా కొత్త ఖాతా తెరవడం. ఇటీవల తెలుగులో వచ్చిన ‘హిట్’ లో చిన్నప్పుడు ఇద్దరు
స్నేహితురాండ్ర మధ్య జరిగే పరిణామాలతో ఎండ్ సస్పెన్స్ ఎలా వుందో చూశాం కదా? అలాటి ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఈ కాలంలో ఇంకా
వద్దన్నా సినిమా కథకి ఎండ్ సస్పెన్స్ చేస్తే చేశారు, దోషి (విలన్) ఎవరో తేల్చడానికి
రెండున్నర గంటలూ ఓపికని పరీక్షించి, చివరికా విలనెవరో విప్పి చెప్పే ఎండ్
సస్పెన్సేదో కథని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్తూ హై రేంజిలో బ్లాస్ట్ అయ్యేలా చూడాలిగా?
ఇలా చేయడం ఎవరికైనా దాదాపూ అసాధ్యమే. అందుకే ఎండ్ సస్పెన్స్ క్లయిమాక్సులు మెట్టు దిగి నేలబారు విషయాలతో
తేలిపోతున్నాయి.
ఇక
సెకండాఫ్ లో రిథమ్ కి సీరియల్ కిల్లర్ దొరుకుతాడు. అతను డాక్టర్ డేవిడ్. చిన్న పిల్లల
అవయవాల కోసం అపహరిస్తూంటాడు. ఆ శవాల మధ్య అంజన వుంటుంది. అంజనని కాపాడి డాక్టర్ ని
పోలీసులకి అప్పగిస్తుంది రిథమ్. అయితే ఆమె కొడుకుని తను అపహరించ లేదంటాడు. అదెవరో
నువ్వే తెలుసుకొమ్మని పరీక్ష పెడతాడు. ఇంకో అరగంటలో సెకండాఫ్ ముగుస్తుందనగా,
కొలిక్కొచ్చిందనుకుంటున్న కథ కాస్తా క్యాన్సిల్ అయి, ఇంకో కథ ముందుకొస్తుంది. స్క్రీన్
ప్లే ఇలా ఫ్రాక్చర్ అయి, సెకండాఫ్ సిండ్రోంలో పడుతుంది. ఈ మొదలయ్యే రెండో కథ రిథమ్
చిన్నప్పటి కథ.
ఐతే
ఫస్టాఫ్ అంతా తెలియని విలన్ తో, ఇది మేకర్లకి ప్రియమైన పనికిరాని ఎండ్ సస్పెన్స్
కథ అని తెలిసిపోతూనే వుంటుంది. కానీ సెకండాఫ్ చివరి వరకూ ఆగకుండా, సగంలోనే ఆ విలన్
డాక్టరని తేలడంతో - హమ్మయ్యా ఎండ్ సస్పెన్స్ ప్రమాదం తప్పిందనుకుంటాం. ఇక్కడే ఈ సైకో
డాక్టర్ ఫేక్ విలన్ అని తెలియడంతో, మళ్ళీ
ఎండ్ సస్పెన్స్ కథే మొదలు!
డాక్టర్ పాత్రతో ట్రాక్ ఆడియెన్స్
ని చీట్ చేయడమే. సైకో డాక్టర్ పాత్రని ఇన్వెస్టిగేషన్ లో తగిలిన ఒక తప్పుడు లీడ్
గా చూపించి వదిలెయ్యకుండా, అతడికో బ్యాక్ డ్రాప్, కథా, సుదీర్ఘ ఇంటరాగేషన్, హీరోయిన్
తో డ్రామా, బిల్డప్పులతో ఇతనే విలన్ అన్పించేలా చేశారు. ఇతను కాదంటూ డ్రామామీద
నీళ్ళు చల్లారు.
‘ప్రిజనర్స్’ లో ఆడపిల్లల కిడ్నాపర్
ని పట్టుకునే ప్రయత్నం చేసే పోలీసు అధికారి ఒకడ్ని ఫాలో అయి, వాడి ఇంట్లో శవాల గుట్టని
చూస్తాడు. రెండు మాటల్లో వీడు కిడ్నాపర్ కాదని, వేరే సైకో అని సిబ్బందికి
అప్పజెప్పేస్తాడు. ఇది ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఇంకా పాకాన పడని
ఇన్వెస్టిగేషన్ ప్రారంభదశలో, ఇదింకో తప్పుడు లీడ్ గా కన్విన్స్ చేస్తుంది. కానీ
‘పెంగ్విన్’ సెకండాఫ్ లో పాకాన పడ్డాక, తప్పుడు లీడే నిజమైన లీడ్ అన్పించేలా ఇంత డ్రామా
చేశారు. దీంతో కథ తెగిపోయి ఇద్దరు విడి విడి విలన్లు ఏర్పడ్డారు కథా నియమాలకి
విరుద్ధంగా. ఇప్పుడు సైకో డాక్టర్, చివర్లో ఫ్రెండ్ భావన.
దీన్ని
నివారించాలంటే ఏం చేసి వుండాలి? ఒకే కన్పించని విలన్ తో ఎండ్ సస్పెన్స్ కథ ఎండ్
సస్పెన్స్ కథలా అన్పించకుండా చేసే టెక్నిక్స్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ నుంచీ
‘ధువా’ వరకూ వున్నాయి. ‘రాట్ససన్’ (తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’)
కూడా వుంది. చిన్నచిన్న ఆడపిల్లల్ని చంపే ఈ సైకో కిల్లర్
కథ. పూర్తిగా చూస్తేగానీ ఇది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలీకుండా గుట్టుగా
వుంటుంది. ఇందులో ఫస్టాఫ్ మధ్యలోనే మధ్యలో టీచర్ పాత్ర మీదికి దృష్టి మళ్ళించి
అతనే కిల్లర్ అన్నట్టుగా కథ నడుపుతారు. దీంతో విలన్ రూపంలో అతనే కన్పించి ఎలా
దొరుకుతాడా అనే సీన్ టు సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. ఇంటర్వెల్లో ఇతను కాదని
తేల్చేస్తారు. మళ్ళీ కొత్త లీడ్స్ తో కొత్త ఇన్వెస్టిగేషన్. ఈ ఇన్వెస్టిగేషన్ తో
చివర్లో అసలు సీరియల్ కిల్లర్ని వెల్లడి చేస్తారు. ఇప్పుడు మాత్రమే చూసిందంతా ఎండ్
సస్పెన్స్ మిస్టరీ అని తేల్చి, ఫ్లాప్ కి దొరక్కుండా బయటపడేలా చేశారు. అంటే టీచర్
రూపంలో బిల్డప్ లేని కరివేపాకు పాత్రతో ఫస్టాఫ్ ని భర్తీ చేస్తూ, కవరింగ్ లెటర్
కథనం చేశారన్న మాట. ‘పెంగ్విన్’ లో ఈ టెక్నిక్ వాడుకోక పెంగ్విన్ లని
చిన్నబుచ్చారు.
4
ఇక రెండో
కథగా మొదలయ్యే రిథమ్ చిన్నప్పటి కథ. రిథమ్
తన ఫ్రెండ్ భావన (నిత్య కృప) మీద అనుమానం వచ్చి పట్టుకుంటే, ఆమె చెప్పుకొస్తుంది
చిన్నప్పటి కథ. రిథమ్ చదువులో ఫస్ట్. ఆమెతో పోలుస్తూ తనని వేధించారు పేరెంట్స్. ఆమెలా
తను చదవాలి, ఆమెలా తను ఎదగాలి... ఈ టార్చర్ భరించలేక రిథమ్ మీద పగ పెంచుకుంది. తన
అర్హతలతో తనకి సొంత ఐడెంటిటీ లేకుండా చేసిన రిథంకి బుద్ధి చెప్పాలనుకుని కొడుకుని
కిడ్నాప్ చేసి బంధించింది. ఇలా ఈ ఆరేళ్ళూ రిథమ్ కడుపుకోత చూస్తూ ఆనందం అనుభవించింది
తను.
‘హిట్’
లో కూడా చిన్నప్పుడు అనాధాశ్రయంలో తన చెల్లెలి అవకాశం హీరోయిన్ కి పోవడంతో, పెద్దయ్యాక
హీరోయిన్ని కిడ్నాప్ చేసి చంపుతుంది హీరోయిన్ ఫ్రెండ్. చిన్నప్పుడు విలన్ తో ఏదైనా
జరిగితే, పెద్దయాక అతణ్ణి గుర్తు పట్టి రివెంజి తీర్చుకోవడం జనం మెచ్చిన ఒక
బాక్సాఫీసు ఫార్ములా. చిన్నప్పుడు తోటి చిన్నపిల్ల వల్ల ఆమెకి తెలీకుండా ఏదో
జరిగిపోతే, దానికి పెద్దయ్యాక పగదీర్చుకోవడం జనం మెచ్చని ఫార్ములా కాని ఫార్ములా.
పిల్లలు తోటి పిల్లలతో ఇంకా అగరు. అప్పటి కప్పుడు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు.
జాకెట్లు చింపేసుకుంటారు. అయిపోతుంది ఆరణాల పగ. ఆరణాల పగతో ఐదుకోట్ల మెగా సినిమా తీయనవసరం
లేదు. చిన్నప్పుడు పిల్లలకి ప్రేమలు గుర్తుంటాయి గానీ, పగలు గుర్తుండవు.
5
అసలు రిథమ్
పాత్ర గోల్ ఏమిటి? తన కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవాలని గోల్
పెట్టుకుంటుంది. ఇది అవసరం లేదు. ఆరేళ్లుగా పోలీసులు సహా ఎవరూ తెలుసుకోలేని విషయం
ఇప్పుడనవసరం. కొడుకు తిరిగి వచ్చిందే చాలు. రెండో భర్తతో ఏడు నెలల గర్భంతో వుంది.
కడుపులో బిడ్డ, దొరికిన బిడ్డ ఇద్దరూ చాలు. ముందు కొడుకు ఆరోగ్యం బాగు చేసుకుంటే
అతనే తర్వాత ఎప్పుడో చెప్తాడు ఎవరు కిడ్నాప్ చేశారో. ఈ తెలుసుకునే బాధ్యత ఈ
పెండింగ్ కేసులో పోలీసులకే ఎక్కువ.
అయితే
ఇప్పుడు పారిపోయి వచ్చిన కొడుకు కోసం అదే చాప్లిన్ మాస్కు కిడ్నాపర్ ప్రయత్నిస్తూంటాడు.
ఇది రిథంకి గోల్ కావాలి. ఒక ప్రెగ్నెంట్ వుమన్ గా కొడుకుని కాపాడుకుంటూ కిడ్నాపర్
ని తెగించి పట్టుకునే గోల్ - ఈ గోల్ లో ఆపరేటివ్ ఎమోషన్ వుంటుంది. అంతేగానీ తాననుకున్నట్టు
కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవడంలో ఏ ఎమోషనూ లేదు, పైన చెప్పుకున్న
కారణాల వల్ల.
ఇలావుంటే, అంజన అనే ఇంకో అమ్మాయి
కిడ్నాప్ తో రిథంకి కనెక్షన్ లేదు. ఆమె గురించి ఫీల్ కాదు కూడా. డాక్టర్ని
పట్టుకున్నాక అక్కడ కాకతాళీయంగా కన్పించిన అంజనని కాపాడుతుందంతే. ఈ కథలో అంజన
పాత్ర అవసరం లేదు.
పైన
చెప్పిన నవలలో, కథానాయిక లీసా వల్ల పొరుగింటి లుసిండా కన్పించకుండా పోతే, అందరి
సూటిపోటి మాటలతో లీసా గిల్టీ ఫీలవుతుంది. ఇంతలో సొంత కూతురు కూడా కిడ్నాపై లుసిండా
తిరిగొస్తుంది. ఇప్పుడు తన కూతురు మాయమవడంతో ఇక తనేం చేయాలో డిసైడ్ చేసుకుంటుంది. ఈ
కిడ్నాపుల గుట్టు రట్టు చేసి, మొదటి అమ్మాయితో తన మీద పడ్డ నింద తొలగించుకునే బలమైన ఎమోషనల్ గోల్,
కూతుర్ని కనుగొనే ఫిజికల్ గోల్ రెండూ ఏర్పడ్డాయి. ఇలా ముందు పొరుగింటి అమ్మాయి
కిడ్నాపై తర్వాత కూతురు కిడ్నాపవడంతో, కథ ఏకత్రాటి పైనే వుంది. ‘పెంగ్విన్’ లో సొంత
కొడుకు కిడ్నాపై వచ్చాక, పొరుగు అమ్మాయి కిడ్నాప్ అవడంతో, ఈ అమ్మాయితో రిథం కేలాటి
ఎమోషనల్ కనెక్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే దీనికి తను బాధ్యురాలు కాదు, తననెవరూ
నిందించడం లేదు కూడా.
ఆఫ్ కోర్స్, మొదటి భర్త నిందించాడు.
ఆమె అజాగ్రత్త వల్లే కొడుకు కిడ్నాపయ్యాడని నిందించి, విడాకులు తీసుకుని
వెళ్ళిపోయాడు. ఈ నింద ఆరేళ్ళ పాటూ కొడుకు తనకి తాను తిరిగి వచ్చేవరకూ మోసిందే తప్ప,
ఏమీ చేయలేక పోయింది. కొడుకు రావడంతో నిందా తొలగిపోయింది, మొదటి భర్తా
క్షమించమన్నాడు.
6
ఈ కథలో ‘హిడెన్
ట్రూత్’ రిథమ్ ఫ్రెండ్ భావన చిన్నప్పటి పగ. చిన్నప్పుడు భావన తన మీద పగ ఫీలయిందని
రిథంకి తెలీదు. అయితే వర్తమాన కథలో కొడుకు తిరిగొచ్చాక, కొడుకుని ఇలా ఎవరు తయారు
చేశారో తెలుకోవాలన్న తపన రిథమ్ కి ఆమె సబ్ కాన్షస్ పరంగా కరెక్టే. అయితే కొత్త
దర్శకుడు ఇలా పలుకుతున్న ఆమె సబ్ కాన్షస్ ని పట్టుకుని, ఓపెనింగ్ ఇమేజిని కరెక్టు
చేసుకోవాలని తెలుసుకోలేదు. సినిమా
ఓపెనింగ్ ఇమేజి ఎలా వుంటుందంటే, పొగమంచు... సరస్సు... ఎల్లో హుడ్ వేసుకున్న
రెండేళ్ళ పిల్లాడు... వెంట కుక్క పిల్ల... ఇంతలో ఎల్లో గొడుగుతో చాప్లిన్ మాస్కు వేసుకున్న
కిల్లర్... పిల్లాడి గొంతు కసక్ మని కోసి సరస్సులోకి అలా అలా మాయం...
థ్రిల్లర్
కి చాలా క్వాలిటీతో వున్న పొయెటిక్ సీన్. దర్శకుడి ఉత్తమాభిరుచి. కానీ విజువల్సే
సినిమా కాదు. విజువల్స్ కి కథాత్మ జతపడాలి. ‘ఇట్’ అనే హాలీవుడ్ మూవీలో పిల్లల
అపహర్త ఇలాటి ఒక మాస్కులోనే వుంటాడు. ఇది ఇన్స్ పిరేషనేమో. కానీ ఈ ఓపెనింగ్
ఇమేజికి కథతో, కాన్సెప్ట్ తో సంబంధంలేదు. పైగా ఇది రిథమ్ కనే ఓ పీడ కల మాత్రంగానే వుంటుంది.
కానీ దర్శకుడు స్క్రిప్టులో సరైన దృష్టి పెడితే, ఆమె సబ్ కాన్షస్ విలువ లేని ఈ కలని
ప్రసారం చేయడం కాదు, తనకే తెలియని విలువైన ఒక సమాచారం అందించడానికి
ప్రయత్నిస్తూంటుంది. ఇందుకే దర్శకుడు, ఆమె కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో
తెలుసుకోవాలనే గోల్ ని స్క్రిప్టులో అప్రయత్నంగా అక్షరీకరించాడు. దీనికి ఓపెనింగ్
ఇమేజి కూడా తోడైతే, ఈ గోలే బలమైన ఎమోషన్ గల ఆపరేటింగ్ గోల్ అయ్యేది. కొడుకుని ఇలా
ఎవరు తయారు చేశారు? - అన్న ప్రశ్నలోనే కథాత్మతో కూడిన ఓపెనింగ్ ఇమేజి దాగి వుంది.
ఆ కథాత్మ లేదా మిస్టరీ - చిన్నప్పుడు ఫ్రెండ్ భావనతో కూడిన పగ. హిడెన్ ట్రూత్. తనకి
తెలీని సమాచారం. ఈ హిడెన్ ట్రూత్ ని అందించాలని ఆమె సబ్ కాన్షస్ ప్రయత్నిస్తున్నట్టయితే,
అప్పుడు తదనుగుణ మైన ఓపెనింగ్ ఇమేజి వెండి తెరనలంకరించేది.
మాస్కు
కిల్లర్ తన రెండేళ్ళ కొడుకుని చంపినట్టు కల రావడం అయిపోయిన కథ. మాస్కు కిల్లర్ భావనకి
సంబంధించిన అస్పష్ట మయా దృశ్యాలని ఏర్పర్చడం అవ్వాల్సిన కథ. ఓపెనింగ్ ఇమేజికి అవ్వాల్సిన
కథ కావాలి, అయిపోయిన కథ కాదు. వెంటాడుతున్న ఈ అస్పష్ట ఓపెనింగ్ ఇమేజికి అర్ధమేమిటాని
హిడెన్ ట్రూత్ కి దారి తీసే ఆమె అన్వేషణ కావాలి.
2003
లో అనురాగ్ బసు దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘సాయా’ (నీడ) లో,
హీరో జాన్ అబ్రహాం కి నీళ్ళే నీళ్ళు ఎదురవుతూంటాయి. సీలింగ్ కూడా కారిపోతూ నీళ్ళు నిండి పోతూంటాయి. ఎందుకిలా జరుగుతోందో
అర్ధం గాదు. చనిపోయిన భార్య (తారా శర్మ) ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు
తెలుసుకుంటాడు. డాక్టర్ గా ఆమె ఈశాన్య రాష్ట్రంలో వైద్య బృందంలో వెళ్లినప్పుడు
వరదల్లో కొట్టుకు పోయింది. మృత దేహం కూడా లభించలేదు. గర్భవతిగానే తనువు చాలించింది.
ఇప్పుడు నీళ్ళు కురిపిస్తూ భార్య తనకి చెప్పాలని ప్రయత్నిస్తోందేమిటో తెలుకోవాలని
ఈశాన్య రాష్ట్రానికి వెళ్తాడు. తెలుసుకుంటే ఆమె సజీవంగానే గిరిజనులకి దొరికింది. పురుడు
పోయగానే చనిపోయింది. వాళ్ళే దహన సంస్కారాలు చేసి బిడ్డని పోషించుకుంటున్నారు. ఆ
బిడ్డని చూసుకుంటాడు జాన్ అబ్రహాం. ఇలా బిడ్డ దగ్గరికి తనని చేరేసేందుకు సింబాలిక్
గా వరదల్ని గుర్తుచేసే జల ధారలతో తనతో సంభాషించిందన్న మాట భార్య. ఇది సింబాలిజంతో
కూడిన వెంటాడే హిడెన్ ట్రూత్.
7
దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజ్ కొత్త దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కి అవకాశ మిచ్చి ‘పెంగ్విన్’
నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఎక్కడా సినిమాలకి పని చేయలేదు. సీరియల్స్, వెబ్
సిరీస్, షార్ట్ నూవీస్ ఏవీ తీసిన అనుభవం లేదు. నాటకరంగంలో వుంటూ సినిమా కథ
రాసుకొచ్చేసి ‘పెంగ్విన్’ తీసేశాడు. మేకర్ గా మంచి ప్రతిభ కనబర్చాడు. రైటర్ గా ఎందరో
లాగా తప్పకుండా విఫల మవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఎంతగానంటే సెకండాఫ్ భరించలేనంత. పైన
చెప్పుకున్న లోపాలతో సెకండాఫ్ నీలగిరి లోయల్లోకి వెళ్ళిపోయింది. మనమే ఎలాగో విరిగే
కొమ్మ అంచు పట్టుకుని కొన ప్రాణాలతో వేలాడుతూంటాం. ఈ సాహసానికి ఇస్తే అవార్డు మనకే
ఇవ్వాలి. ఫస్టాఫ్ కథా కథనాలు వాటి దృశ్యీకరణతో క్లాస్ గా వున్నాయి. అరగంటలో ప్లాట్ పాయింట్ వన్
వచ్చే వరకూ, రిథమ్ ఫ్లాష్ బ్యాక్స్ మధ్య ప్రస్తుత జీవితం చూపిస్తూ, కొడుకు తిరిగి
రావడంతో ప్లాట్ పాయింట్ వన్ వేసి, ఆమెకి గోల్ నిచ్చాడు. అదే సమయంలో మాస్క్ కిల్లర్
ని యాక్టివేట్ చేసి మిడిల్ కెళ్ళి పోయాడు.
అలాగే
సెకండాఫ్ లో డాక్టర్ తో ఫేక్ డ్రామా ముగించి, కొత్త అన్వేషనతో ప్లాట్ పాయింట్ టూ
నిచ్చాడు. కానీ ఇంటర్వెల్లో కొడుకు మీద వయోలెంట్ షాట్ వేశాక, ఇక సెకండాఫ్ అంతా షాట్స్
మిస్సవుతున్న ఫైరింగే చేసుకుంటూ వెళ్లి అమెజాన్ కప్పగించాడు. తమిళనాడులో బయ్యర్లు
హేపీగానే వున్నారు, లాక్ డౌన్ పుణ్యమాని దీన్నుంచి తాము తప్పించుకున్నందుకు.
విజువల్
క్వాలిటీకి కెమెరా మాన్ కార్తీక్ పళని దోహదం చేశాడు. సాంప్రదాయ షాట్స్ వల్ల టేస్ట్
ఏమిటో తెలిసింది. ఎడిటింగ్ కూడా స్మూత్ ఎడిటింగే. ఎక్కడా పాప్ కార్న్ ఎడిటింగ్
చేయలేదు. స్వరాలతో సంతోష్ నారాయణ్ కూడా కథానాయిక పేరు రిథమ్ లాగే, ఒకే రిథమ్ ని
మెయింటైన్ చేస్తూ క్లాస్ టచ్ నిచ్చాడు.
ఇక హీరోయిన్ కీర్తీ సురేష్. పూర్తి
విషాద పాత్రలో, తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ తో అవార్డుకి అర్హమైనట్టు
నటించింది...
―సికిందర్