రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, June 23, 2020

953


      ఒక ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ షో’ లో సల్మాన్ ఖాన్ డైలాగులకి కొత్తర్ధం చెప్పాడు. డైలాగు అంటే ఏమిటి? రైటర్ రాసిందేనా? కాదు. రైటర్ చేసేది ప్రేక్షకుల కోసం ఇన్ఫర్మేషన్ అడగడం, ఆ ఇన్ఫర్మేషన్ తెలియపర్చడం మాత్రమే. ‘షోలే’ లో ‘కిత్నే ఆద్మీ థే?’ (వాళ్ళెంత మంది?) అని సల్మాన్ నాన్న సలీం ఖాన్ రాశారు. ఇది డైలాగు కాదు. వూళ్ళో ప్రత్యర్ధులు ఎంత మంది వున్నారో తెలుసుకోవడానికి రాసిన ప్రశ్న. ఇది గబ్బర్ సింగ్ నోట పలికినప్పుడు డైలాగుగా మారింది. గబ్బర్ సింగ్ పలికే తీరు వల్ల ప్రశ్న డైలాగుగా మారి అంత పాపులర్ అయింది...

        సల్మాన్ సూక్ష్మ దృష్టి రైటర్స్ కళ్ళు తెరిపిస్తాయి బహుశా. నటుల నోట పలికేవరకూ రాసింది డైలాగు అవదు. కాబట్టి నటులే డైలాగు కర్తలు. వాళ్ళ ఉచ్ఛారణ వల్లే రైటర్ రాసింది డైలాగులవుతాయి. ఆ క్రెడిట్ నటులకే పోతుంది. అంతవరకూ అవి ఇన్ఫర్మేషన్ ఇచ్చే రాతలే. అసలు సినిమా స్క్రిప్టు అంటేనే ఓ పేద్ద ఇన్ఫర్మేషన్ తో కూడిన బొత్తి అన్నారుగా? స్క్రీన్ ప్లేలని సినిమా తీయడానికి పనికొచ్చే బ్లూ ప్రింట్స్ అన్నారుగా? వాటిని సాహిత్య రచనలాగా ఓ కళ అనలేదుగా? ఆ బ్లూప్రింట్ ని తెరకెక్కించే విధానమే కళ అవుతుందని అన్నారుగా? కాబట్టి కథ -స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం అని వేసుకుని మురిసిపోనవసరం లేదు. రచన- దర్శకత్వం అంటే సరిపోతుంది. స్క్రీన్ ప్లే కి స్క్రీన్ ప్లే పదం ఎత్తేసి బ్లూ ప్రింట్ అంటే ఇంకా బావుంటుంది...

     ‘లా రాయడానికి ఏడడుగులు వ్యాసానికి సంబంధించి ఒకరు ఒక ప్రశ్న వేశారు. ఈ వ్యాసం ఎసైన్ మెంట్ రైటర్స్ గురించి వుంది. ఎసైన్ మెంట్ రైటర్స్ అంటే ఘోస్ట్ రైటర్సే కదా అని ఆయన ప్రశ్న. దీనికి కాదు అని జవాబు వస్తుంది. రైటర్లు వున్న కాలంలో కొందర్ని ఘోస్ట్ రైటర్స్ అన్నారు. రైటర్లే లేని ఈ కాలంలో ఎసైన్ మెంట్ రైటర్స్ అంటారు. ఇరవై ఏళ్ల క్రితం దర్శకులకి కథలిచ్చే రైటర్లు వుండే వాళ్ళు. వాళ్ళ పేరు పడేది. ఇదే సమయంలో పేరేయమని అడగకుండా కథలకి రాసి పెట్టే వాళ్ళని ఘోస్ట్ రైటర్లు అన్నారు. తర్వాత దర్శకులే కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అనే రైటర్ డైరెక్టర్లు గా ప్రారంభమయ్యాక, కథలిచ్చే రైటర్ అనేవాడు చచ్చూరు కున్నాడు. అలా రైటర్లే లేకుండా పోయాక ఘోస్ట్ రైటర్లు వుండే అవకాశం లేదు. వ్యాసంలో  పేర్కొన్న తీరులో ఎసైన్ మెంట్ రైటర్లనే కొత్త జాతి చెలామణి లోకొచ్చింది. ఏదో ప్రొఫెషనల్ గా చేస్తున్నామని అనుకోవడమే తప్ప, ఇది కూడా ఏమంత మంచి జీవితం కాదు.

సికిందర్