రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, May 10, 2020

941 : సందేహాలు -సమాధానాలు


Q: నేనొక కథ తయారు చేసుకున్నాను. త్వరలో ఒక హీరోకి పంపించబోతున్నాను. ఇప్పుడు కథలు వినడం లేదు, తెప్పించుకుని చదువుతున్నారని మీకు తెలుసుకదా. అయితే మొన్న మీ పాత ఆర్టికల్ చదివితే అందులో కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ వుండాలని వుంది. నా కర్ధం గాలేదు. సినిమా అనేదే యూత్ అప్పీల్ తో తీస్తాం కదా? కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ ఏమిటి? ఇది వివరిస్తే, అది బావుందనుకుంటే, ఆ విధంగా నా కథలో కాన్ఫ్లిక్ట్ లో జోడించుకుంటాను. ఆ తర్వాతే హీరోకి పంపిస్తాను. వీలైనంత త్వరగా సమాధానమిస్తారని ఆశిస్తాను.
కాశీనాథ్ (పేరుమార్పు), దర్శకుడు

A: ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ ని జోడిస్తే మీ కథే మారిపోవచ్చు. కథకి పాయింటు కాన్ఫ్లిక్ట్ నుంచే పుడుతుంది కదా? హీరోహీరోయిన్లు విడిపోయే కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా కలుస్తారనేదే పాయింటు. అపార్ధాలతో విడిపోతే, ఆ అపార్ధాలు తొలగిపోతే తిరిగి ఏ కమవుతారని ఆ పాయింటు అంతరార్ధం. ఈ అంతరార్ధంలో యూత్ అప్పీల్ వుందా అనేది  చూడాలి. ఈ అపార్ధాలు తొలగిపోయి కలుసుకునే పాయింటు చూసి చూసి విసుగెత్తి పోయుంటారు ప్రేక్షకులు. అంటే ఇందులో యూత్ అప్పీల్ అనేది ఇక లేదన్న మాట. ఆఁ... చేసుకుంటే చేసుకున్నావ్ లే అపార్ధం, నేనింకోదాన్ని చూసుకుని సెటిలైపోతా - అని హీరో అన్నాడంటే ఇది యూత్ అప్పీల్. యూత్ అప్పీల్ అంటే ఎక్సైట్ మెంట్. హీరో ప్రకటనలో ఎక్సైట్ మెంటుంది. కర్నూల్లో కబడ్డీ ఆడేందుకు వెళ్ళిన మహేష్ బాబు (ఒక్కడు) అక్కడ్నుంచి ప్రమాదంలో వున్న భూమికని లేపుకు వచ్చే కాన్ఫ్లిక్ట్ లో ఎక్సైట్ మెంట్. యూత్ అప్పీల్. అదే మహేష్ బాబు ఏడు తరాల బంధువుల్ని వెతికే కాన్ఫ్లిక్ట్ (బ్రహ్మోత్సవం) ఎక్సైట్ మెంట్ కాదు, యూత్ అప్పీల్ లేదు. ఏడుతరాల బంధువుల అమ్మాయిల్ని వెతికితే, అది ఈలల్తో దద్దరిల్లిపోయే కాన్ఫ్లిక్ట్, యూత్ అప్పీల్. ఇలా మీ కథ కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ వుందేమో చూడండి. లేకపోతే కథనే మార్చి యూత్ అప్పీల్ని కూర్చాల్సి రావొచ్చు. ఈ సమయంలో కథని మార్చడం కుదరకపోతే అలాగే వదిలెయ్యండి. ఐడియా అనుకున్నప్పుడే అన్నీ నిర్ణయించుకుంటే ఇలాటి సమస్యలు ఎదురుకావు.

Q: నా పేరు వి.డి, అసోసియేట్ డైరెక్టర్. నావి కొన్ని సందేహాలు. 1. యుద్ధాలతో డైరెక్ట్ గా సంబంధం ఉన్న మిగతా దేశాల సినిమాలతో పోలిస్తే మన దగ్గర యుద్ధాల బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయడం కొంచెం కష్టమే. నార్త్ లో అయితే పాకిస్తాన్ తో వచ్చిన యుద్ధాల నేపథ్యంలో సినిమాను తీసుకోగలరు. ఎందుకంటే ఉత్తర భారతదేశం వారు యుద్ధాలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. అదే సౌత్ ఇండియాకు వచ్చేసరికి యుద్ధాల బ్యాక్ డ్రాప్ లో మనం సినిమాలు తీయడం కుదరదు. ఇలా ఒక గొప్ప కథా నేపధ్యాన్ని మనం మిస్ అవుతున్నాం కదా, దీనికి ప్రత్యామ్నాయంగా వేరే కథా నేపథ్యన్ని ఏమైనా సూచించగలరు.
        2. లుకా చుప్పి’ లో లాగా మన దగ్గర ఉన్న టౌన్స్ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటి కథలు చెప్పచ్చో సలహాలు సూచనలు చెప్పండి.
       
3. థ్రిల్లర్ కథలను చిన్న  బడ్జెట్ లో చెప్పేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  అలాగే థ్రిల్లర్ అంటే ఎంత సేపు అవే సీరియల్ కిల్లర్ లేదా పోలీస్ డిటెక్టివ్ కథలు కాకుండా కొత్తగా ఏం చేయాలి అనేది సలహాలు సూచనలు చెప్పండి.
       
4. చివరగా కొత్త దర్శకులు తమ తొలి ప్రయత్నంగా ప్రయోగం చేయడానికి ఏవైనా కొత్త జానర్స్ కానీ, అలాంటి టైపు సినిమాల గురించి కానీ చెప్పండి.
వీడీ, అసోసియేట్
A: ఇండో - పాక్ యుద్ధాల్లో పాల్గొన్న తెలుగు సైనిక వీరులున్నారు- హవల్దార్ వీరచక్ర పోత రాజు, కెప్టెన్ మనోజ్ శర్మ, గ్రూప్ కెప్టెన్ నచికేత మొదలైన వారు (1965 ఇండో - పాక్ యుద్ధంలో పాక్ యుద్ధ విమానాన్ని గన్ తో కూల్చేసిన హవల్దార్ పోతరాజు వీరచక్ర అవార్డు నందుకుంటున్న దృశ్యం పక్క పటంలో చూడొచ్చు). యుద్ధ సినిమాకి తెలుగు నేటివిటీకి ఇంత కంటే ఏం కావాలి. వీళ్ళ బయోపిక్స్ తీయొచ్చు. 2015 లో దర్శకుడు క్రిష్ ‘కంచె’ తీసినప్పుడు అది రెండో ప్రపంచ యుద్ధంలో నిజంగా పాల్గొన్న తెలుగు సైనికుల కథ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించ లేదంటే వాళ్ళ ఖర్మ. ‘ఘాజీ’ లాంటి నేటివిటీ లేని యుద్ధ సినిమాని మళ్ళీ బాగానే చూశారు. తెలుగు యుద్ధ నేపథ్య సినిమాలకి నేటివిటీ అడ్డొచ్చే మాట నిజమే. దీనికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ‘ఆర్ ఆర్ ఆర్’, ‘విరాటపర్వం’ లాంటి స్థానిక పోరాట కథలు తీసుకోవడమే. దేశ విభజన నేపథ్యంలో 2019 లో కరణ్ జోహార్ తీసిన ‘కళంక్’ చూసినప్పుడు, అలాంటిది హైదరాబాద్ నిజాం రాజరిక కుటుంబాల్లో దేశ్ ముఖ్ హీరో పాత్రని కల్పించి ఒక పీరియెడ్ మూవీ తీయొచ్చన్న ఆలోచన రావచ్చు. తెలుగు సినిమాలకి నేపథ్యాలతో స్వేచ్ఛ అంతగా లేదు. యుద్ధ కథలకి ప్రత్యామ్నాయం స్థానిక పోరాట కథలే. 


        2. అగథా క్రిస్టీ ఏనాడో చెప్పింది - న్యూయార్కే ఒక క్రైం స్టోరీ, ఇంకా న్యూయార్క్ లో నేపథ్యంలో క్రైం స్టోరీలు రాసేదేమిటని. ఆమె క్రైం స్టోరీలు గ్రామీణ నేపథ్యంలో వుంటాయి. ఎక్కడో హైదరాబాద్ లో జరిగేలాంటి సంఘటనలు మెట్ పల్లిలో జరుగుతూంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. హిందీలో ఇలాగే చేస్తున్నారు. యువతీ యువకులు నగర సంస్కృతిలో పాల్పడుతున్న కొత్త పోకడల్ని పట్టణ నేపథ్యాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో పెట్టి తీస్తున్నారు. దీనివల్ల షాక్ వేల్యూ వుంటుంది. దీంతో ఇవి హిట్టవువుతున్నాయి. ‘లుకా చుప్పీ’ (దాగుడు మూతలు) ఇలాంటిదే. ఇంకా మన్మర్జియా, డ్రీం గర్ల్, బరేలీకీ బర్ఫీ, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ మొదలైనవి కూడా ఇంతే. సినిమాల్లో నగరాలకి పరిమితం చేసిన సహజీవనాల్ని, స్వలింగ సంపర్కాల్ని ఇక పట్టణాల్లో చూపించే కొత్త ఒరవడి ప్రారంభించారు. ఈ ఆధునిక జీవన శైలుల్నే కాదు, ఆర్ధిక ఆరాటాల్ని కూడా చిన్న టౌన్లో చూపించారు ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ లో. చిక్కడపల్లిలో వుండే మధ్యతరగతి కుర్రాళ్ళు, బంజారా హిల్స్ లో సంపన్న జీవితాలకి ఎగబ్రాకాలని ఆరాటపడ్డారనుకుందాం, దానికోసం ఏం చేస్తారన్నదే చిక్కడపల్లిలో సంచలనం సృష్టించే కథ. అవే కథల్ని బ్యాక్ డ్రాప్స్ మార్చేస్తే నేటి కథలవుతాయి. పాత సినిమాల్లో నగర కథలేమేం వున్నాయో వెతికితే వాటిని పట్టణాలకి, పల్లెలకీ దించి అలజడి సృష్టించవచ్చు కొన్నాళ్ళు. ఏదైనా కొన్నాళ్ళు వుండేదే. ఆ కొన్నాళ్ళ తర్వాత ఇంకో కొన్నాళ్ళు ఇంకో ఆవిష్కరణ. కొన్నాళ్ళు కొన్నాళ్ళుగా కొలుచుకుంటూ సాగేదే సినిమా. ఒకటే పట్టుకుని ఎన్నాళ్ళో కూర్చుంటే బుద్ధి చెప్తుంది అదే సినిమా.

       
3.  థ్రిల్లర్ కథల్ని చిన్నబడ్జెట్లో లో చెప్పేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ‘హిట్’ లో చూశారుగా ఎన్ని అజాగ్రత్తలు తీసుకోవాలో. ‘హిట్’ వ్యాస పరంపరకి ముందు క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల వ్యాస పరంపర సాగింది. అవొకసారి చదవండి. థ్రిల్లర్ అంటే ఎంత సేపూ  అవే సీరియల్ కిల్లర్ లేదా పోలీస్ డిటెక్టివ్ కథలు కాకుండా కొత్తగా ఏం చేయాలంటే ఏమీ లేదు, ప్రస్తుత ప్రపంచమెలా వుందో అలా చేయాలి. సోషల్ మీడియా నుంచీ సోషల్ లైఫ్ వరకూ ప్రపంచం పరమ వయొలెంట్ గా వుంది. దీన్నే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకీ అంటిస్తున్నారు. అంటే ఇందులోకి దూకి మనమూ ఎంజాయ్ చేయాలనీ కాదు. ఒడ్డున వుంటూ ఆట గమనించాలి. ఆ ఆటకి తగ్గ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలి. ఎంటర్ టైన్మెంట్ తోనే కళ్ళు తెరిపించాలి. 

        ఈవారం ఒక దర్శకుడు ఒక లో బడ్జెట్ థ్రిల్లర్ కథ సినాప్సిస్ పంపారు. అది చదివాక దీన్ని తిరగేసి తీస్తే బావుంటుందని చెప్పాం. వెంటనే ఆయన ఈ సవరణ లోని పాయింటుని పసిగట్టారు. ఏదైనా తిరగేస్తేనే కొత్తగా మారుతుంది. ‘హిట్’ వుంది. ఇందులో కథ ఇన్వెస్టిగేటర్ పాయింటాఫ్ వ్యూలో అతడి కథగా నడుస్తుంది. ఇలాకాక కిల్లర్ పాయింటాఫ్ వ్యూలో వాడి కథగా నడిస్తే? ఇంకా ఈ
వయొలెంట్ ప్రపంచంలో క్రైం సినిమాల్ని పాజిటివ్ పాయింటాఫ్ వ్యూలో చూపిస్తే లెక్క చెయ్యరు. నెగెటివ్ పాయింటాఫ్ వ్యూలో చూపించాల్సిందే. పోలీస్ మైండ్ కాదు, క్రిమినల్ మైండ్ ఓపెన్ చేయాల్సిందే. పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తూంటే, క్రిమినల్ కౌంటర్ ఇన్వెస్టిగేషన్ చేసే కథలు. క్రిమినలే ఒక పెద్ద ఆర్టిస్టు అన్నారు, పోలీసు కేవలం క్రిటిక్. వయొలెంట్ ప్రపంచంలో క్రిటిక్ కి స్థానం లేని మాట నిజమే, మరి ఆర్టిస్టు గెలుపు కూడా ఎలాంటి గెలుపు? ఫిలిం నోయర్ జానర్ క్రైం సినిమాల్ని పదేపదే కర్మ సిద్ధాంతంతో ఎందుకు తీసేవాళ్ళు? మనిషి ఎంత వయొలెంట్ గా మారినా, అతను ఆత్మికంగా పురాణాలతో కనెక్ట్ అయి వుంటాడు కాబట్టి.  ఏమీ చేయనవసరం లేదు, క్రైం మీద ఇంటర్నెట్ లో ప్రముఖులు చెప్పిన కోట్స్ చాలా వుంటాయి. ఆ సుభాషితాలు చదువుతూ వుంటే సబ్జెక్టు మీద పరిజ్ఞానం విశాలమవుతుంది, పట్టు లభిస్తుంది. వంద కేజీలు తెలుసుకుంటే ఒక కేజీ కథ వస్తుందని గమనించాలి. ఏమీ తెలుసుకోకుండా సినిమాలు చూసి కాపీ కొడితే సన్నాసులుగా మారడమే. 

        4. ఇక
 కొత్త దర్శకులు తొలి ప్రయత్నంగా ప్రయోగం చేయడానికి రియాలిస్టిక్ ఫిక్షన్ అనే తెలుగులో ప్రయత్నించని జానర్ వుంది. ‘ఏ వుమన్ అండర్ ది ఇన్ ఫ్లూయెన్స్’, ‘బాయ్ హుడ్’, ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ లాంటివి. వీటిని స్టడీ చేసి ఇలాటివి తీయొచ్చు. అలాగే రోమాంటిక్ సస్పెన్స్ వుంది. ‘వైల్డ్ థింగ్స్’, ‘సీ ఆఫ్ లవ్’ లాంటివి. కొత్తగా ఏం ప్రయత్నించినా మార్కెట్ యాస్పెక్ట్స్ రెండే - రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్. రోమాంటిక్ డ్రామా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా, ఇంకేదైనా వీటి చుట్టూ వుండడం విజ్ఞత. 

Q: సీరియస్ పాత్రలు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎలా రాయాలో వివరిస్తారా? దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఇస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది.
ఏపీ, ఏడీ 

A: అమితాబ్ బచ్చన్ ‘దీవార్’, శోభన్ బాబు ‘మల్లెపువ్వు’ లాంటివి తీసుకోవచ్చు పరిశీలనకి. సీరియస్ పాత్రలు రకరకాలు. ‘మిలి’ లో లోపల బాధ దాచుకుని పైకి నవ్వుతూ వుండే జయాబాధురీ పాత్ర,  ‘అంతులేని కథ’ లో కుటుంబ భారమంతా మోయాల్సి వస్తోందన్న కసితో జయప్రద పాత్ర,  ‘శంకరాభరణం’ లో లౌకిక తత్వానికి నిలబడే సోమయాజులు పాత్ర, ‘పెదరాయుడు’ లో కుటుంబ విలువలకి ప్రాణమిచ్చే మోహన్ బాబు పాత్ర... హిట్టయిన సీరియస్ పాత్రలకి బోరుకొట్టకుండా ఏఏ క్యారక్టర్ ఎలిమెంట్స్ జతపడ్డాయో గమనిస్తే ఆ ఎలిమెంట్స్ ని  వాడుకుంటూ బోరుకొట్టని సీరియస్ పాత్రల్ని తయారు చేసుకోవచ్చు. ‘గ్లాడియేటర్’ లో రసెల్ క్రొవ్, ‘మాట్రిక్స్’ లో కీనూ రీవ్స్, ‘ఇట్సె వండర్ఫుల్ లైఫ్’ లో జేమ్స్ స్టీవార్ట్ లాంటి పాత్రలు. కథేమిటి, ఆ కథలో పాత్రేమిటి అనే దాన్నిబట్టి సీరియస్ పాత్రలొస్తాయే తప్ప, విడిగా చెప్పడం కష్టం. అయితే ముందు అలాటి పాత్ర అనుకుంటేనే దాన్ని అనుసరించి పాత్రచిత్రణా కథా వస్తాయి. నిజజీవితంలో కొందర్ని రిఫరెన్స్ గా తీసుకున్నా సరిపోతుంది. ఎప్పుడు నవ్వుతారో తెలీని చంద్రబాబు నాయుడిని తీసుకోవచ్చు. ఎప్పుడు మాట్లాడతారో తెలీని మన్మోహన్  సింగ్ ని తీసుకోవచ్చు. పక్కన కమెడియన్ పెట్టి ఎత్తి పొడుస్తూంటే కూడా సీరియస్ పాత్రలు బోరు కొట్టవు. సీరియస్ పాత్రల్ని వూహించాలంటే కామెడీ పాత్రల్ని రిఫరెన్స్ గా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. రాజేంద్ర ప్రసాద్ కామెడీల్ని తీసుకుని, ఆయా కామెడీ సన్నివేశాల్లో రాజేంద్ర ప్రసాద్ ని సీరియస్ గా మార్చుకుని ఆలోచించవచ్చు. 

        అసలు పాత్ర సీరియస్ గా ఎందుకుంటోందీ? ప్రాథమికంగా ఈ మూలాలు అవసరం. స్వాభావికంగానే తనలో తాను గడిపే మనిషి కావడం, స్వాభావికంగానే నవ్వడం చేతగాని వ్యక్తి కావడం, చాలా చిన్న వయసునుంచే సుఖాలకి దూరంగా బాధ్యతల బరువు మోయడం, జీవితపు ఏదో మజిలీలో దెబ్బతినడం, ప్రేమలో ఏదో సందర్భంలో గాయపడడం, ‘అమర దీపం’ లో కృష్ణం రాజులాగా అపార్ధాలకి గురికావడం (ఆ పైన ఆత్మ హత్య చేసుకోవడం), ‘నేరము శిక్ష’ లో కృష్ణలాగా ఇంకొకర్ని నష్టపర్చడంతో స్వయం శిక్ష విధించుకోవడం, ఏదో అన్యాయానికి బలైతే తిరుగుబాటు చేయడం, పగ దీర్చుకోవడం లాంటివి. బోరు కొట్టకుండా వుండాలంటే ముఖ్యంగా యాక్టివ్ పాత్రయి వుండాలి.

సికిందర్

Saturday, May 9, 2020

940: స్క్రీన్ ప్లే సంగతులు


     విషయం 6. షీలా కి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలంటాడు విక్రం. పర్మిషన్స్ కి చాలా టైం పట్టేస్తుందంటాడు రోహిత్. జడ్జి లక్ష్మణ రావు దగ్గరి కెళ్ళి ప్రీతి కేసు ఎక్స్ ప్లెయిన్ చేసి, పర్సనల్ హెల్ప్ అడిగానని చెప్పమంటాడు విక్రం. షీలా రెండో కారు మీద ఎవిడెన్స్ ట్రేస్ చేయించమంటాడు. దీని తర్వాత నేహా గుర్తొచ్చి ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు. తర్వాత షీలా మీద నార్కో టెస్ట్ మొదలెడతాడు. ప్రీతిని నువ్వు కిడ్నాప్ చేశావా? - అనడిగితే, ఆమె నేహా అంటూ కలవరిస్తుంది. అంతే, బరస్ట్ అయిపోతాడు. చెప్పు చెప్పూ నేహా గురించి చెప్పమని నానా రభస చేస్తాడు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి కల్లోలం సృష్టిస్తాడు. రోహిత్ బయటికి లాక్కెళ్ళి పోతాడు. ఇలా చేస్తే బావుండదని హెచ్చరించి వెళ్ళిపోతాడు టెక్నీషియన్. 

        వివరణ: ఈ టెస్టు షీలాకా, విక్రంకా? టెస్టులో షీలాయేమో బాగానే వుంది , విక్రం పిచ్చెత్తిపోయాడు ఆమె నేహా పేరెత్తే సరికి. ఇంజెక్షన్ వల్ల హిప్నాటిక్ ట్రాన్స్ లో వున్న షీలాతో ఇలాగే బిహేవ్ చేస్తాడా? ఈ బిహేవియర్లోంచి కథకుడేం ఆశించాడు? విక్రం ఇంతకి ముందే నేహాతో ప్రేమ ఫ్లాష్ బ్యాకేసుకుని ఫీలైపోయి వచ్చాడు కాబట్టి, ఇప్పుడు నేహా పేరు వినేసరికి అతడిలో గూడుకట్టుకున్న ప్రేమ తాలూకు ప్రగాఢమైన విషాదం అగ్నిపర్వతంలా బద్ధలవడం చూసి - అయ్యోపాపం, అయ్యో రామా, ఎంత కష్టం వచ్చిందిరా నాయనా - అని ప్రేక్షకులు కూడా తల్లడిల్లి పోవాలనుకున్నాడా? ఇది ప్రేమ గురించి సీనా? నార్కో టెస్టు సీనా? ప్రేక్షకులకేం కావాలి? 


     చెప్పు చెప్పూ అని మీద పడితే నేహా గురించి షీలా మాత్రమేం చెప్తుంది? అసలు ఈ టెస్టునంతా తప్పించుకోవడానికే అలా తెలివిగా నేహా పేరు కలవరించిందేమో? ఆమె అనుకున్నట్టే ఆమె ట్రాప్ లో విక్రం పడి, నేహా గురించి నానా రభస చేసి టెస్టు చెడగొట్టుకుని వెళ్ళిపోయాడేమో. వెల్ డన్ షీలా, నువ్విలాగే ఆడుకో! ఈ ఆటలో నువ్వే షైనింగ్ స్టార్ వి. అసలు నేహా ఏమైందో నేహా చేసిన ‘సూది ఇన్వెస్టిగేషన్’ బయటికి లాగితే తెలిసిపోయేదానికి, షీలా మీద పడి వేధించడమేమిటి? 

        అసలీ టెస్టుకి కూడా షీలా ఒప్పుకుందా? విక్రం రోహిత్ ని జడ్జి లక్ష్మణరావు దగ్గరికి పంపితే, ఆయన షీలా పరోక్షంలో టెస్టుకి రాసిచ్చేసి ‘పర్సనల్ హెల్ప్’ చేసేశాడా? ఐతే జడ్జి సహా విక్రం జైలుకి పోతాడు. ఈ నార్కో టెస్టులో కూడా షీలా లాయర్ లేడు. ప్రశ్నావళి లేదు. అసలు అంత క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రీతి కేసుని ఫాలో అవకుండా వుండదు షీలా. అప్పుడు - మీకు దూదీ సూదీ దొరికాక నన్నెందుకు వేధిస్తారని ఎదురు తిరగాలి. ఆ దూదీ సూదీ ఏం చేశారు? అవి మాయం చేసి అమాయకుల్ని ఇరికించే కుట్ర చేస్తున్నారా? - అని ప్రశ్నించాలి. గెస్ట్ హౌస్ దగ్గర శవమే దొరక్కపోతే గెస్ట్ హౌస్ కెళ్ళినట్టు ఆధారాల కోసం నా కారుని చెక్ చేయడమేమిటి? నా బ్లూ కారు చెకింగ్ కి ఆర్డరేశారుగా, అదేమైంది? ఆ కారు సర్వీసింగ్ కిచ్చి వాష్ చేయించి పారేశాను. క్లూస్ నాశనం చేశాను కాబట్టి నేనే కిడ్నాపర్ అని కేసు పెట్టరే? ఏదిపడితే అది ఆధారాలు పోగేసుకోవడమేనా వాటి ఎనాలిసిస్ కూడా చేసుకునేదేమైనా వుందా? మీరు బోలెడన్ని సాక్ష్యాధారాలు సేకరించడమే గానీ అవి కథ కుపయోగపడవా? మరి కథ దేనికి?

      ముందు హోం వర్క్ చేసుకోండి సార్. అసలు గెస్ట్ హౌస్ నిర్వాహకుల్ని ప్రశ్నించారా? నా పిచ్చి లెటర్ పట్టుకుని ఇంత  ఫూలిష్ గా ప్రవర్తిస్తున్నారే, నేను గెస్ట్ హౌస్ వైపు వెళ్ళానేమో నా గూగుల్ మ్యాప్ టైంలైన్ చెక్ చేసుకోండి. ప్రీతి ఎక్కిన ఆ బ్లూ కారు నాదే అయితే, నా కారులో ప్రీతి తొంగి ఎందుకు మాట్లాడుతుంది? నా క్లోజ్ ఫ్రెండ్ గా కారెక్కి కూర్చుంటుంది. ఆమెమీద నాకు దూదీ సూదీ వాడే అవసరమే రాదు. నవ్వుతూ తీసికెళ్ళి గొంతు కోసేసేదాన్ని. ఆమెని చంపేసేంత ఉద్రిక్త పరిస్థితే వుంటే, మాకు చెడి వుంటే, ఆమె నా కారు వైపు వస్తుందా? తొంగి చూస్తుందా? నాతో మాట్లాడుతుందా? ఆమె బాయ్ ఫ్రెండ్ అజయ్ వున్నాడని తెలుసా? కాలేజీలో మీరు ప్రశ్నించారు కూడా. ఇంటర్వెల్ లో మీరు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి వచ్చాడు కూడా. వాణ్ణెందుకు పట్టుకోరు మీరు? ఏం సార్ మీరు... ఆ పని చెయ్యక, తమాషా లెటర్ పట్టుకుని చనిపోయింది ప్రీతియా, నేహానా అని ఒకటే ఓవరాక్షన్ చేస్తూ ఫేక్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరింత వీక్ మైండెడ్ అనుకోలేదు. నన్ను బొమ్మలేసే ఆర్టిస్టుగా మీరు చూశారు. ప్రీతి కిడ్నాప్ కేసులో నా అవసరం మీకు రాకపోదు. నేనేమిటో అప్పుడు మీరే తెలుసుకుంటారు... అంటూ షీలా లాంగ్ లెక్చరివ్వడం కాదు, మనకి ఇలాగే  అన్పిస్తుంది ఆమె పరిస్థితి చూస్తూంటే. 


        ఒక సింపుల్ గా చెప్పాల్సిన కథని గజిబిజి చేశాడు కథకుడు. ఎక్కడికక్కడ కథనంలో, సీన్స్ లో లాజిక్ అనే పదార్ధమే పెట్టుకోవడం లేదు. నార్కో టెస్టు పెట్టాలని అప్పుడు పాలీగ్రాఫ్ టెస్టులో కేసు గురించి ఏమీ తేల్చలేదు. ఇప్పుడు నార్కో టెస్టులో ఏం తేల్చాలో కూడా స్పష్టత లేదు. ‘నువ్వు లెటర్ పబ్లిసిటీ కోసం రాయలేదు, నిజమేనా? అని కంట్రోల్ క్వశ్చన్ అడగాల్సింది ఇక్కడా అడగలేదు. అడిగితే పబ్లిసిటీ కోసమే రాశానని హిప్నాటిక్ ట్రాన్స్ లో మనసులో వున్నదే  బయట పెట్టేస్తుంది. అలా జరక్కూడదు. జరిగితే ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అవుతుంది. అందుకని ఈ సీను అర్ధాంతరంగా ముగించెయ్యడం కోసం, దీనికి ముందు విక్రం ప్రేమ ఫ్లాష్ బ్యాకు లీడ్ గా వేసి, ఈ సీనులో షీలా చేత అసందర్భంగా నేహా అంటూ పలికించి, ప్రేమ డ్రామా వైపు తిప్పేశాడు సీనుని. కథకుడి అంతరంగమిలా వుంటే కథేం బాగుపడుతుంది. 
        విషయం 7. విక్రం ని కేబిన్లోకి తీసికెళ్ళి, తలుపు పెట్టి చెడామడా తిడతాడు చీఫ్. నాకు చెప్పకుండా నార్కో టెస్ట్ పెడతావా? ఇంకోసారి చెప్పకుండా ఇలా చేస్తే పాతేస్తా- అని అరుస్తాడు. బయటికొచ్చిన విక్రంతో రోహిత్ అంటాడు, తను చూసిన బ్లూ కారు, షీలా కారు ఒకటి కాదని ఇబ్రహీం చెప్పాడని. మళ్ళీ ఫోరెన్సిక్స్ నుంచి కాల్ వచ్చిందనీ, షీలా బ్లూ కారులో ప్రీతికి సంబంధించిన ట్రేస్ ఎవిడెన్స్ ఏదీ దొరకలేదనీ అంటాడు. ఇంతలోనే ఫోరెన్సిక్స్ నుంచి ఇంకో కాల్ వస్తుంది రోహిత్ కి. విక్రం వైపు చూసి, గెస్ట్ హౌస్ వెనుక కుళ్ళిపోయిన శవం దొరికిందనీ అంటాడు (ప్లాట్ పాయింట్ టూ). 
       వివరణ: విక్రంని కేబిన్లో తలుపు పెట్టి బాగానే వాయించాడు చీఫ్. చెప్పకుండా నార్కో టెస్టు పెట్టాడని. ఇంకోసారి చెప్పకుండా ఇలా చేస్తే పాతేస్తానని. చెప్తే మాత్రం పీకేదేముంది చీఫ్. అసలు కేసేమిటో, కేసులో ఏం జరుగుతోందో తెలుసుకునే పాపాన పోయాడా? అప్పుడప్పుడు ఫుల్ యూనీఫాంలో వరండాలో ఎదురుపడి, యూనిఫాంలో లేని, సిగరెట్ దమ్ముకొడుతున్న విక్రంని డిప్లమటిగ్గా విష్ చేసి, హేపీగా వెళ్లి పోవడమేగా? టెస్టు పెట్టాడని కాక, టెస్టులో లవ్ డ్రామా మిక్స్ చేశాడని తిడితే ఒక అందం చందం. నేహా కావాల్రా నీకూ? నిన్నటి దాకా నీ చెల్లెలి ఫ్లాష్ బ్యాకుని భరించా. ఇప్పుడు నేహాతో ఫ్రెష్ టీజరా? పాతేస్తా నేహా సునేహా అన్నావంటే! - అని కౌంటర్ ఇచ్చుకుని వుంటే బావుండేది. ఈ ‘హిట్’ ఇంటి కొట్లాటలేమిటో మనకి అర్ధం గావన్నది వేరే విషయం.

        ఇక తను చూసిన బ్లూ కారు, షీలా బ్లూ కారు ఒకటి కాదని ఇబ్రహీం చెప్పాడని రోహిత్ చెప్పడం. ఇబ్రహీం అప్పుడు కారులో పోతూ, ఓఆర్ఆర్ అవతలి లేనులో అంత దూరం లో ఆగివున్న బ్లూ కారులో ఏం తేడా గమనించగల్గాడని ఒకటి కాదని చెప్పాడు? ప్రీతి కేసులో అనుమానించి అతణ్ణి సస్పెండ్ చేశారు. అనుమానంతోనే విక్రం అతడి ఇంటికెళ్ళి ఆధారాలు సేకరించుకుని వచ్చాడు. నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేసిన కారు ఇదేనా అని అతన్నే అడిగితే కాదనే చెప్తాడు. ఇలా అన్నాడని రోహిత్ అనేసరికి విక్రం ఏమీ అనలేక పోయాడు. అసలు ఇబ్రహీం దగ్గర ఏంతో టెక్నిక్ తో సేకరించుకొచ్చిన అతడి వేలిముద్రలు, డీఎన్ఏ ఏమయ్యాయి? అవికూడా కథకుపయోగ పడలేదా?  
      ఇక షీలా బ్లూ కారులో ప్రీతికి సంబంధించిన ట్రేస్ ఎవిడెన్స్ ఏదీ దొరకలేదనీ కూడా రోహిత్ అనడం. ఈ విక్రం, రోహిత్ లు ప్రేక్షకుల్ని ఏమనుకుంటున్నారు? షీలా ఆ కారుని సర్వీసింగ్ కి ఇచ్చానని అంటే ఇంకా దాని మీద టెస్టింగ్ ఏమిటి? ఇంతలోనే మరొక కాల్. వెంటవెంటనే లాబ్ నుంచి కాల్స్. ఈసారి - గెస్ట్ హౌస్ వెనుక కుళ్ళిపోయిన శవం దొరికిందనీ లాబ్ వాళ్ళు చెప్పడం. లాబ్ వాళ్ళకి శవం దొరకడమేమిటి, పోలీసులకి దొరకాలి గానీ...

         ఇంకా ఈ శవం నేహాదై వుంటుందని అనుమానం వస్తుందా? రాదు, ప్రీతిదే ఆ శవమని చెప్పేస్తాం ఇంతసేపూ కథనం చూశాక. అంటే శవం ప్రీతిదా, నేహాదా అన్న ప్రతిపాదిత సస్పెన్స్ ఈ కథనంలో ఎప్పుడో ఆవిరై పోయిందన్న మాట.
 
        ప్లాట్ పాయింట్ వన్ లో కిడ్నాపైన ప్రీతి, ప్లాట్ పాయింట్ టూలో శవమై దొరకడంతో ఈ మిడిల్ కథనం పూర్తయ్యింది. ఈ మిడిల్ కథనమంతా ఎలా వుందో మొత్తం చూశాం. ఇంటర్వెల్లో ప్రారంభమైన షీలా ఫేక్ లెటర్ తో డ్రామా ప్లాట్ పాయింట్ టూ వరకూ ఇరవై నిమిషాలూ సాగింది. ఈ డ్రామాలో, మొత్తం మిడిల్ లో వున్న ఉచితానుచితాలూ పాత్రౌచిత్యాలూ అన్నీ చూశాం. విశ్లేషణ రాయడానికి ఇంత చిక్కుల మేళంగా వున్న కథ ఇదే. గందరగోళపు  సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ కథ. ఇక సోమవారం క్లయిమాక్స్ ఏమిటో చూద్దాం.
సికిందర్

Friday, May 8, 2020

939 : స్క్రీన్ ప్లే సంగతులు


        విషయం 5. షీలాని ఇంటరాగేట్ చేస్తాడు విక్రం. ఆ లెటర్ తనే రాశానని ఒప్పుకుంటుంది. కాలనీలో ప్రీతి తప్ప తనతో ఎవ్వరూ మాట్లాడరనీ, ప్రీతి మిస్సయ్యాక లోన్లీగా ఫీలయ్యాననీ. ఇలా లెటర్ రాస్తే కాలనీలో అటెన్షన్ గెయిన్ చేయవచ్చనుకున్నాననీ అంటుంది. ఇది నమ్మడు విక్రం. వెంటనే పాలీగ్రాఫ్ టెస్ట్ ఎనౌన్స్ చేస్తాడు. ఇందుకు ఆమె ఒప్పుకునేలా మాట్లాడి సంతకం తీసుకుంటాడు. ఆ ప్రశ్నలు ఇలా వేస్తాడు : నీ పేరు షీలానా? నీ ఏజ్ ముప్ఫైనా? విజయ్ నీ మాజీ భర్తనా? షీలా నీకు ప్రీతి తెల్సా? షీలా నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేశావా? నీకు నేహా తెల్సా? నేహా ఇంకా బతికేవుందా?....ఇలా ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నల్లో ప్రీతి తనకి తెలుసనీ, కానీ తను కిడ్నాప్ చేయలేదనీ అంటుంది. చివరి రెండు ప్రశ్నలకి నేహా ఎవరో తెలియదని అంటుంది. తన గురించి అడిగిన మిగిలిన ప్రశ్నలకి అవుననే చెప్తుంది. ఈమె నిజాలే చెప్పిందని టెక్నీషియన్ నిర్ధారిస్తాడు. కానీ హార్ట్ బీట్ ని, బ్రీతింగ్ నీ కంట్రోల్ చేసుకుని టెస్టు ని చీట్ చేయవచ్చని విక్రం తేల్చి, నార్కో ఎనాలిస్ టెస్ట్ ఎనౌన్స్ చేస్తాడు.

         వివరణ: మొత్తానికి ఇది ఫేక్ లెటర్ తో నడుస్తున్న కథగా తేలిపోయింది. ఫేక్ లెటర్ తో  ఇంటర్వెల్లే గాక, సెకండాఫ్ మరో పది నిమిషాలూ ఫేక్ లెటర్ తోనే, షీలా అనే సబ్ ప్లాట్ పాత్రతోనే ఇంతసేపు గడిచిపోయింది. ఇప్పుడామె అది ఫేక్ లెటర్ అంటూ అందుకు కారణాలు చెప్పాక, ఆమెని డిస్మిస్ చేసి నిఘాలో పెడితే సరిపోయే దానికి, ఇక్కడితో ఆమె ట్రాక్ ముగిస్తే ఐపోయేదానికి- ఇంకా సాగలాగడం. వెంటనే పాలీగ్రాఫ్ టెస్ట్ అంటూ ఓవరాక్షన్ చేయడం. ఇక్కడ ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది అనవసర తతంగం.

        షీలా పాత్ర గురించి - ఇల్లు కాలి ఒకరేడుస్తూంటే చలి కాచుకున్నట్టుందని గత వ్యాసంలో ఎందుకన్నామంటే ఇందుకే. కాలనీలో తనతో మాట్లాడే, వున్న ఒక్క ఫ్రెండ్ ప్రీతి కిడ్నాపైన సీరియస్ వాతావరణంలో, కాలనీ వాళ్ళ అటెన్షన్ కోసం అలా లెటర్ రాశాననడం ఫ్రెండ్ ట్రాజడీ లోంచి కూడా లాభం పొందాలనుకోవడమే. నిజంగా ఆమె ఇలా చేస్తుందా? చెయ్యదు. ప్రీతి కిడ్నాపయ్యిందంటే ఆమె పేరెంట్స్ సహా కాలనీ వాళ్ళు వచ్చి తన మీద పడతారు. పట్టుకుని పోలీసులకి అప్పజెప్తారు. ఇదీ నార్మల్ ప్రాసెస్. ఆమె ఇక ఉత్తరాలెలా రాస్తూ కూర్చుంటుంది. కాబట్టి పాత్రచిత్రణలు చూసుకోకుండా సీన్లు రాసుకుంటే ఇలాగే  వుంటుంది కథ. ఇతర సినిమాల్లోనే పాత్ర చిత్రణలు లాజికల్ గా వుండాలి, ఇలాటి ఇన్వెస్టిగేటివ్ సినిమాల్లో ఇంకా లాజికల్ గా వుండాలి.

       దర్శకుడు ఇది ‘ఇన్ఫార్మేటివ్ థ్రిల్లర్’ అని ఇప్పటివరకూ సినిమా జానర్స్ కి సంబంధించి లేని పదాన్ని తను కనిపెట్టి ప్రస్తావించాడు కాబట్టి, ఇందులో ఇస్తున్నఇన్ఫర్మేషన్ ఎంతవరకూ నమ్మదగిందని చూడక తప్పడం లేదు. చూసినప్పుడు దర్శకుడైన కథకుడు తగిన రీసెర్చి చేయలేదనీ, చేసినా కాంప్రమైజ్ అయీ మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోయాడనీ ప్రతీ సీనులో చూస్తూనే వచ్చాం. ఇప్పుడీ సీనులో కూడా ఇదే తంతు. పాలీగ్రాఫ్ టెస్ట్, లేదా లై డిటెక్టర్ టెస్టుని కోర్టులు ఎవిడెన్స్ గా స్వీకరించవు. టెస్టులో పోలీసులు పొందిన సమాచారాన్ని వాళ్ళ దర్యాప్తులో వాడుకోవచ్చు తప్ప, దాంతో నిందితుడు నేరం ఒప్పుకున్నట్టుగా కోర్టులో ప్రవేశపెట్టలేరు. ఉదాహరణకి, టెస్టులో ప్రీతి శవం ఫలానా చోట వుందని షీలా చెప్తే, అక్కడికెళ్ళి శవాన్ని కనుగొన్న పోలీసులు, మాకు అక్కడ శవం దొరికిందని మాత్రమే కోర్టుకి చెప్పగలరు తప్ప, పాలీగ్రాఫ్ టెస్టులో షీలా చెప్పిందని చెప్పలేరు. పాలీగ్రాఫ్, నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టుల ఆధారంగా నమోదైన కేసులన్నిటినీ సుప్రీం కోర్టు కొట్టి పడేసింది. ఈ టెస్టులు ఇంటరాగేషన్ కి మరో రూపమే. ఇంటరాగేషన్ ని ఎలాగైతే ఎవిడెన్సుగా కోర్టులొప్పుకోవో, ఈ టెస్టుల్ని కూడా ఒప్పుకోవు. 

        ఐతే దర్యాప్తులో భాగంగా సమాచారం పొందడం కోసం పోలీసులు ఈ టెస్టులు నిర్వహించాలంటే  కోర్టుల అనుమతి తీసుకోక తప్పదు. నిందితుడు తను టెస్టుకి అంగీకరిస్తున్నట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పక తప్పదు. నిందితుడి లాయర్ సమక్షంలో పోలీసులు టెస్టు నిర్వహించకా తప్పదు. టెస్టుని హాస్పిటల్లో ఫోరెన్సిక్స్ నిపుణులు కండక్ట్ చేయకా తప్పదు.

       ఈ సీనులో మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా, తనే షీలాని ఒప్పించేసి, ఆమె లాయర్ లేకుండా, పాలీగ్రాప్ టెస్టు అక్రమంగా చేసేశాడు విక్రం. రెండోది, ఈ టెస్టు ఉపయోగమేమిటో షీలాకి చెప్పకపోవడం వల్ల, తను ఇచ్చే సమాచారంతో తను దోషిగా దొరికిపోయి ఎక్కడ శిక్షపడుతుందోనన్న అభిప్రాయం ఆమెకి కలిగేలా చేశాడు విక్రం. ప్రేక్షకులూ ఇలా అనుకునేలా తప్పుడు సమాచారం వెళ్ళింది. షీలాకి ఇలాటి అభిప్రాయం కల్గిస్తే, ఆమె ఆందోళనతో ఇచ్చే సమాధానాలు టెస్టుని కన్ఫ్యూజ్ చేస్తాయి కూడా. నిందితుడికి లేదా నిందితురాలికి ఇలాటి అభిప్రాయం కల్గించకుండా, ప్రశాంత చిత్తంతో వుండేలా చూస్తారు ఎగ్జామినర్లు. 

        ఇక ప్రశ్నలు వేసే టెక్నిక్ వుంటుంది. ముందుగా చాలా జాగ్రత్తగా పదాల్ని వాడుతూ ప్రశ్నల జాబితా తయారు చేసుకుంటారు. ఎనిమిదీ, పదికి మించి ప్రశ్నలుండవు. ఈ ప్రశ్నలు ఒక సీక్వెన్స్ లో వుంటాయి. ఈ ప్రశ్నల్లో ఒకటి కంట్రోల్ క్వశ్చన్ గా వుంటుంది. విక్రం అడిగిన ప్రశ్నలు ఆషామాషీ గా వున్నాయి. పాన్ షాపులో సిగరెట్టుందా, బీడీ వుందా అని అడిగినట్టు అడిగేశాడు. లేవు పొమ్మంది షైనింగ్ స్టార్ షీలా కూడా. ఈ సీనులో ఏం తేల్చాడో అర్ధంగాదు. ఈ సీనులో కూడా తేల్చకుండా వుంటేనే, నెక్స్ట్ నార్కో ఎనాలిసి టెస్ట్ కూడా చూపించవచ్చు. తను తెలుసుకున్న పద్ధతులన్నీ చూపించుకోవాలని ఆవేశవడుతున్నాడు కథకుడు. దీనికోసం సీన్లు నాశనం చేస్తున్నాడు. చిత్రపటం - లెటర్ సీనుని లాబ్ లో ఇలాగే నాశనం చేశాడు, షీలా ఇంట్లో సీను వేయడం కోసం. కథ వెనుక కథకుడి అంతరంగమిలా వుంటే కథ బాగుపడదు. స్క్రీన్ ప్లేకీ ప్రక్షకులకీ మధ్య కథకుడు రావడం భౌతిక దూరం మధ్యలో కరోనా గాడు దూరడమే. 

        అసలు లెటర్ గురించి ఆమె నిజం చెప్పడం లేదన్న అనుమానంతో పెట్టిన టెస్టులో అడగాల్సిన కంట్రోల్ క్వశ్చన్ లెటర్ గురించే. దాని వూసే ఎత్తలేదు. దాని వూసెత్తితే ఆమె నిజమే చెప్తున్నట్టు రిజల్టు వస్తుందిగా? అప్పుడు నార్కో టెస్టు కి వెళ్ళలేడుగా? నార్కో టెస్టు కూడా చూపించుకోవాలిగా ప్రేక్షకులకి? ఇక నార్కో ఎనాలిసిస్ టెస్టు ఎనౌన్స్ చేసేశాడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా. కథకుడు వుండాల్సింది స్క్రీన్ ప్లేకీ ప్రేక్షకులకీ మధ్య కాదు. స్క్రీన్ ప్లే వెనుక కూడా కాదు. ప్రేక్షకుల వెనుక, ప్రేక్షకుల కోసం.

(రేపు నార్కో ఎనాలిసిస్ టెస్ట్)

సికిందర్

Thursday, May 7, 2020

938 : స్క్రీన్ ప్లే సంగతులు



     విషయం 4. డాక్యుమెంట్ ఎగ్జామినర్ చిత్రపటం, లెటర్ దగ్గరి పోలికలతో వున్నాయని వీడియో ప్రొజెక్షన్ లో చూపిస్తాడు. అయినా ఖచ్చితంగా చెప్పలేమని షిండే అంటాడు. విక్రం షీలా ఇంట్లో సోదాలు నిర్వహిస్తాడు. ఏమీ దొరకదు. విక్రం బయటికొస్తూంటే షీలా వాడుతున్న రెండో కారు కనబడుతుంది. అది బ్లూ సెడాన్ కారు. లోపల చెక్ చేస్తే దొరికిన లెటర్ లాంటివే శాంపిల్స్ దొరుకుతాయి. షీలాని అరెస్ట్ చేస్తాడు. ఇంటరాగేషన్లో ఆమె తనకేమీ తెలియదని చెప్తుంది. పాలీగ్రాఫ్ టెస్టుకి ఆదేశిస్తాడు విక్రం. గెస్ట్ హౌస్ మడ్ శాంపిల్స్ తో అనుమానితుల శాంపిల్స్ కలవలేదని రోహిత్ అంటాడు. ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి షీలా షూస్, కారు చెక్ చేయించమంటాడు విక్రం. ఇబ్రహీం షీలా కారుని గుర్తుపడతాడేమో చూడమంటాడు. 
    
        వివరణ : ఉత్తుత్తి లెటర్ తో ఇంకా సీన్లు నడుస్తున్నాయి. ఇంటర్వెల్ ఉత్తదే అని తేలిపోయినట్టు, ఈ లెటర్ తో నడుస్తున్న ఈ సీన్లు కూడా ఉత్తవే అని తేలే మరో నిరాశని కూడా చవి చూడబోతున్నారు ప్రేక్షకులు. మెయిన్ ప్లాట్ వదిలేసి, సబ్ ప్లాట్ క్యారక్టర్ తో ఇన్ని సీన్లు వృధా చేస్తున్నాడు కథకుడు. చిత్రపటం, లెటర్ ఒకరి చేతి వ్రాతేనని మామూలు కంటికి తెలిసిపోతూండగా, ఇంకేంటి పరిశోధన? రెండిటి స్ట్రోక్స్ ని ప్రొజెక్షన్ వేసి మాన్యువల్ కంపారిజన్ చేసి చెప్పడం. స్ట్రోక్స్ ఎక్కడ కలుస్తున్నాయి, ఎక్కడ కలవడం లేదని మార్కింగ్స్ లేకుండానే అనుకోవడం. చివరికి చిత్రపటం, లెటర్ ఒకటేనని చెప్పలేమని షిండే తీర్పు. సింపుల్ గా సాఫ్ట్ వేర్ రన్ చేస్తే ఒక్క నిమిషంలో రెండూ ఒకటేనని చెప్పేస్తుంది నూరు శాతం పాజిటివ్ మార్కింగ్స్ సహా! కానీ షిండే అలా చెప్తేనే ఈ వంకతో విక్రం షీలా ఇంటికెళ్ళే సీను రాసుకో గల్గుతాడు కథకుడు. ఆ సీను పెట్టుకోవడం కోసం ఈ సీను ఇలా చెడగొట్టడం. 

          ఇక షీలా ఇంట్లో దేనికోసం సోదాలు చేశాడో తెలీదు. షీలా అడిగితే, ప్రీతి నీతో ఎక్కువ సమయం గడుపుతుంది కదా అందుకని - అన్నాడు. కానీ ప్రీతి గురించి ఆధారాలేమైనా దొరికితే వాటిని ఆమె అదృశ్యమైన సమయంతోనే ఎలా కనెక్ట్ చేస్తాడు. ప్రీతి కనబడకుండా పోయిన సమయంలో నేను నా కూతుర్ని కలవడానికి వెళ్ళానని కథకుడు రాసిన వెనుకటి సీన్లో చెప్పాను కదయ్యా, ఇంతకీ నా ఎలిబీ చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకుని ఈ సీను పెట్టుకోవడం నీకు అవసరమా కాదా ఆలోచించు - అని షీలా కూడా అనదు పాపం. భర్త లేకపోవడం చూసి అందరిలాగే విక్రం కూడా టార్చర్ పెడుతున్నట్టున్నాడు పద్ధతైన ఇన్వెస్టిగేషన్ మానేసి. ‘చూడమ్మా, నీ పట్ల మీ గేటెడ్ కమ్యూనిటీ గుంపు ఫీలింగ్స్ తో నాకు పనిలేదు. నేను వాట్సాప్ యూనివర్సిటీ నుంచో, ఫేస్బుక్ నుంచో ప్రభావితుడ్నై రాలేదు. లేడీస్ ని ప్రొటెక్ట్ చేసే ‘హిట్’ నుంచి నేనొచ్చాను. మా ‘హిట్’ లో మా మెంటల్ కొట్లాటలేవో మాకుంటాయి. ఆ టెన్షన్ కూడా నీ మీద రుద్దను. నాకో ఫ్లాష్ బ్యాకుంది. నాకో చెల్లెలుండేది. దుర్మార్గుడు బలిగొన్నాడు. అలాటి దుర్మార్గుడిగా నీతో నేను ప్రవర్తించ లేను. మనం విన్- విన్ పొజిషన్లో మ్యాటర్ మాట్లాడుకుందామా’ - అని వుంటే, ఆమె భళ్ళున ఏడ్చేసి నిజం చేప్పేసేది. రసవిహీన ఇన్ఫర్మేషనే తప్ప మానవత్వమున్న డ్రామా లేకపోతే కష్టం. 

        ఇంత టార్గెట్ చేస్తున్న షీలా సెల్ ఫోన్ కూడా చెక్ చేయడు ప్రీతితో కాల్స్ గురించి, మెసేజెస్ గురించీ. షీలా గూగుల్ మ్యాప్ టైం లైన్ చెక్ చేస్తే ఆ రోజు ఏ సమయంలో ఎక్కడుందో కూడా తెలిసిపోతుంది. ఇంకోటేమిటంటే, తనూ ప్రీతీ కలిసి ఆన్ లైన్లో ఏదో నిర్వహిస్తున్నట్టు వెనకటి సీన్లో చెప్పింది షీలా. ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కూడా చెక్ చేయడు. అసలు షీలా ప్రీతిని కిడ్నాప్ చేయడానికీ, చంపడానికీ మోటివ్ ఏమైవుంటుందో కూడా ప్రాథమిక కోణంలో దర్యాప్తు చెయ్యడు. మోటివ్ రుజువు కాకపోతే కేసు నిలబడదని తెలుసుకోడు. 

       ఇక షీలా ఇంట్లోనే బ్లూ సెడాన్ కారుని పట్టుకున్నాడు. షీలాకి బ్లూ సెడాన్ కారుందా? ఈ విషయం గేటెడ్ కమ్యూనిటీలో ఎవరికీ తెలీదా? పక్కనే ప్రీతి పేరెంట్స్ కి కూడా తెలీదా? ఆ రోజు ప్రీతి అదృశ్యమైన రోజున, ఆ స్పాట్ కి ప్రీతి ఫాదర్ మోహన్ వచ్చినప్పుడు, ప్రీతి బ్లూ సెడాన్ కారులో తొంగి మాట్లాడడం చూశానని ఎస్సై ఇబ్రహీం చెప్పాడే? అప్పుడు అది షీలా కారు కావచ్చని మోహన్ కి అన్పించ లేదా?

        సరే, ఈ కారు మొన్న ఇంట్లో కన్పించలేదే- అని ఇప్పుడు విక్రం అడిగితే, సర్వీసింగ్ కి ఇచ్చానని అంది షీలా. కారులోపల చెక్ చేసి అలాటివే లెటర్స్ పట్టుకుని, ఆమెని అరెస్ట్ చేసేశాడు విక్రం. లెటర్ తో లాబ్ లోనే కావాలని తేల్చకుండా వదిలేసిన విషయం, ఇప్పుడిలా తేల్చాడు. ప్రశ్నేమిటంటే, రెండు మూడు రోజులుగా తనింతగా పోలీసుల దృష్టిలో వుంటే, ఆ లెటర్స్ కారులోనే ఎందుకు వదిలేసింది? కారు సర్వీసింగ్ కి ఇచ్చి ఇవ్వాళే తెచ్చుకున్నప్పుడు, ఇవ్వాళే కార్లో తాజాగా లెటర్స్ పెట్టినట్టా?

        అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ మొదలెట్టాడు. ఎవరి శవం గురించీ తనకేమీ తెలీదని మొత్తుకుంది. వెంటనే విక్రం పాలీగ్రాఫ్ టెస్టుకి ఆదేశించేశాడు. ఏమేం ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్స్ వుంటాయో, వాటికోసం సీన్లు కల్పించి, అవన్నీ కథలో జొప్పించేయాలనుకుంటున్నాడు. షీలా అంగీకారం లేకుండా పాలీగ్రాఫ్ టెస్టు కుదరదని రోహిత్ అంటే, తను మేనేజ్ చేస్తానన్నాడు. రేపు కోర్టులో మానిప్యులేట్ చేసిన ఎవిడెన్స్ పెడతాడన్న మాట. దీనికి చీఫ్ కూడా ఒప్పుకున్నాడు. ఇక గెస్ట్ హౌస్ మడ్ శాంపిల్స్ తో అనుమానితుల శాంపిల్స్ కలవలేదని రోహిత్ అన్నాడు. అక్కడ శవమే లేకపోతే అనుమానితుల మడ్ శాంపిల్స్ దేనికి  ? ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి షీలా షూస్, కారు చెక్ చేయించమన్నాడు విక్రం. ఆమె కారు సర్వీసింగ్ కిచ్చి వాష్ చేసి పారేశాక ఇంకేం చెక్ చేస్తారు? ప్రీతి వేలిముద్రలు, నేహా వేలిముద్రలు వున్నట్టయితే అవి కూడా దొరకవు. అక్కడ శవమే లేకపోతే ఇంకా షీలా షూస్ లో ఏం చూస్తారు? చెప్పిన చోట శవమే లేదంటే అది హోక్స్ లెటరని తేలిపోవడం లేదా? ఇక ఇబ్రహీం షీలా కారుని గుర్తుపడతాడేమో చూడమన్నాడు విక్రం. మీ ఇంటి పక్కనే కారుంటే నువ్వెందుకు చెప్పలేదని ప్రీతి ఫాదర్ ని నిలదీయాలి కదా విక్రం?

(ఇంకా వుంది)

సికిందర్

Wednesday, May 6, 2020

937 : స్క్రీన్ ప్లే సంగతులు


        ఇంటర్వెల్ తర్వాత-
        విషయం 1. హాస్పిటల్ బెడ్ మీదున్న విక్రం ఫ్లాష్ బ్యాక్ చూస్తాడు. అందులో చెల్లెలు సుష్మి ఎవరో ఇద్దరు ఇంట్లోకి తొంగి చూశారంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ బిట్ తర్వాత, అభిలాష్ వచ్చి నేహా మిస్సింగ్ కేసులో విక్రం ని ప్రశ్నించాలంటాడు. విక్రం ఎదురుతిరుగుతాడు. ఇద్దరూ కొట్టుకోబోతూంటే చీఫ్ వచ్చి తిడతాడు. విక్రం ని ప్రశ్నించే పధ్ధతి ఇది కాదంటాడు. విక్రం ని వెళ్లి పొమ్మంటాడు. వెళ్తూంటే ఆపి, రోహిత్ రాజూ గెస్ట్ హౌస్ ముందు శవం కోసం సెర్చ్ పార్టీతో వున్నాడు వెళ్ళమని రహస్యంగా చెప్తాడు. విక్రం వెళ్ళిపోతాడు. చీఫ్ నేహా కేసుని అభిలాష్ నుంచి పీకి విక్రం కిస్తున్నట్టు చెప్తాడు. 

        వివరణ:  చాలా ఆశ్చర్యమేస్తుంది ఈ సీను చూస్తూంటే. ఇన్వెస్టిగేషన్ కథతో ప్రేక్షకులకి పెద్దగా ఇంటలిజెన్స్ వుండదనుకున్నట్టుంది కథకుడు. పరస్పర విరుద్ధ విషయాలు చెప్పాడు. శవం ప్రీతిదా, నేహాదా తెలుసుకోవడానికి పరుగెత్తడం మానేసి, మధ్యలో చెల్లెలి ఫ్లాష్ బ్యాకు షాకుతో హాస్పిటల్లో జాయినయ్యాడు విక్రం. హాస్పిటల్లో జాయినయిన వాడి మీద వచ్చి అభిలాష్ దౌర్జన్యం. నేహా కేసులో ప్రశ్నించాలంటూ దెబ్బలాట. ఇంకా నేహా మిస్సింగ్ కేసేమిటి లెటర్ అందితే? ఇదిప్పుడు మర్డర్ కేసు. ఇప్పుడిప్పుడే ఒక లెటర్ దొరికిందనీ, ఆ లెటర్ లో డెడ్ బాడీ గురించి వుందనీ తెలియదా అభిలాష్ కి? రెండోది, చీఫ్ వచ్చి, విక్రంకి రహస్యంగా చెప్పడమేమిటి? డెడ్ బాడీ గురించి అభిలాష్ కి తెలియకూడదనా? ఇవేం నాటకాలు. లెటర్ లో గెస్ట్ హౌస్ ముందు  డెడ్ బాడీ వుందని వుంటే, గెస్ట్ హౌస్ వెనుక రోహిత్ సెర్చ్ చేస్తున్నాడని చీఫ్ చెప్పడమేమిటి? ఇక నువ్వు కేసు మీద కంటే విక్రం మీద ఫోకస్ చేస్తున్నావని కేసు నుంచి అభిలాష్ ని తప్పించడం. కేసులివ్వడం, లాక్కోవడం ఆషామాషీగా  వుంది. కేసు మీద కంటే తన మీద ఫోకస్ చేస్తాడని విక్రం ముందే చెప్పాడు చీఫ్ కి. ఆ మాట నిజం చేస్తూ ఇప్పుడు చీఫ్ నిర్ణయం. మరి విక్రం ఎమోషనల్ గా పనికి రాడని తనే అన్నాడు. ఇప్పుడు నేహా కేసు విక్రంకే ఎందుకిస్తున్నాడు. ఈ కేసులిచ్చే, పీకే డ్రామా అవసరమా ఈ కథకి? 

       విషయం 2. రాజూ గెస్ట్ హౌస్ ముందు సెర్చ్ పార్టీ తో రోహిత్ వుంటే విక్రం వచ్చేస్తాడు. శవం ఇంకా దొరకలేదనీ, ట్రై చేస్తున్నాననీ అంటాడు రోహిత్. ‘ట్రై చేస్తున్నావా? ఇక్కడ దొరికే బాడీ ప్రీతిదో నేహాదో కూడా తెలీదు. ట్రై చేస్తే సరిపోదు,వెళ్లి ప్రెజర్ పెట్టు. నేను ఫోరెన్సిక్స్ కి వెళ్తున్నా’ అని వెళ్లి పోతూంటాడు. మళ్ళీ ఆగి, ‘మన సస్పెక్ట్ లిస్టులో వున్న వాళ్ళ షూస్, కారు టైర్స్, బైక్ టైర్స్ లో వున్న మడ్ శాంపిల్స్ తీసుకుని కంపేర్ చేయించు. మ్యాచ్ అయితే నాకు చెప్పు. వాళ్ళ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ వుంటే ఇక్కడికి వచ్చారేమో చెక్ చేసి చెప్పు’ అని వెళ్ళిపోతాడు.

        వివరణ:  షీలా రాసిన శవంలేని ఉత్తుత్తి లెటర్ మీద ఫేక్ ఇంటర్వెల్ తో బాటు ఇంత కథ. ఆ లెటర్ ఆడుకోవడానికి అదృశ్య విలన్ రాసి వుంటే అదొక అందం, అదొక కథ. పైగా ఇక్కడికొచ్చిన విక్రం క్షణం కూడా వుండడు. రోహిత్ కి చెప్పేసి వెళ్ళిపోతాడు. శవం నేహాదా, ప్రీతిదా ఇక్కడే వుండి తెలుసుకోవాలన్న అర్జెన్సీ ఫీలవడం లేదు. ప్రీతితో ఏ ఫీలింగూ లేకపోతే లేకపోయింది, గర్ల్ ఫ్రెండ్ నేహాని కూడా పట్టించుకోవడం లేదు. ఫోరెన్సిక్స్ కి వెళ్ళిపోతానని జంప్ అవుతున్నాడు. చీటికీ మాటికీ ఈ ఫోరెన్సిక్స్ గోలేంటో అర్ధం గాదు. విక్రం ని ఫోరెన్సిక్స్ కి ట్రాన్స్ ఫర్ చేసేస్తే సరి, అక్కడే పడుంటాడు. ఇంకోటేమిటంటే, శవమే దొరక్కుండా, అనుమానితుల శాంపిల్స్ తీసుకోమంటున్నాడు. శవం దొరక్కపోయినా వాళ్ళని కేసులో ఇరికించేస్తాడా? అనుమానితులు ప్రీతి కేసులో వున్న వ్యక్తులు. ఒకవేళ నేహా శవం దొరికినా వాళ్ళని ఇరికించేస్తాడా? ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమన్నట్టు శవం లేకపోయినా హంతకుణ్ణి పట్టేసుకోవాలనుకుంటున్నాడు... 

     విషయం 3. ఫోరెన్సిక్స్ లాబ్ లో విక్రం ఆ లెటర్ ని  చూపిస్తూ వుంటాడు. డాక్యుమెంట్ ఎగ్జామినర్ దాని మీద చేతి వ్రాతని పరిశీలనకి తీసుకుంటాడు. విక్రం షీలా ఇంటికి వెళ్తాడు అక్కడ రోహిత్ విక్రం కి నేహా కాల్ లిస్టు ఇస్తాడు. కాల్ లిస్టులో విక్రం కి క్లూ ఏమీ దొరకదు. ఇక బ్లూ కారుని ఓఆర్ ఆర్ మీద ఎవరూ చూడలేదని అంటాడు రోహిత్. లారీ యార్డులో టైరు గుర్తులు వాటర్ ట్యాంకర్స్ వి కావచ్చంటాడు. ఇదంతా చూసి క్లూస్ ఏమీ దొరడం లేదని విసుక్కుంటాడు విక్రం. షీలాని మరొకసారి లెటర్ ఎలా దొరికిందో చెప్పమంటాడు విక్రం. ఆమె చెప్తూంటే అతడి దృష్టి గోడకున్న చిత్రపటం మీద పడుతుంది. ఆ చిత్రపటం తనే వేశానని అంటుంది షీలా. విక్రం దాంతో లాబ్ కి వెళ్తాడు. ఈ చిత్రపటంలో వున్న స్ట్రోక్స్, లెటర్ లో వున్న స్ట్రోక్స్ ఒకటేనా పరిశీలించి చెప్పమంటాడు. 

        వివరణ: ప్రతీ వివరణా ఒక హార్రర్ ఫీలింగుతో భయపెడుతోంది. ఎన్నని తప్పులు ఎత్తి చూపడం. మొత్తానికి నేహా కాల్ లిస్టు వచ్చింది. ఈ కాల్ లిస్టు తెచ్చిన వాడు తర్వాత ప్రీతి హత్య కేసులో భార్యతో బాటు కిల్లర్ గా రివీలయ్యే విక్రం అసిస్టెంట్ రోహితే. ఈ కాల్ లిస్టు తెస్తే తనే దొరికిపోతాడని అతడికి తెలీనట్టుంది. ఎందుకంటే, నేహా అదృశ్యంలో కూడా తనే విలన్. ఫాహద్ తో కలిసి ఆమెని కిడ్నాప్ చేసేప్పుడు ఆమెతో పాటు ఆమె ఇంట్లోనే వున్నాడు. కేసు ఫైలు కోసం వెళ్లి ఆ ఫైలు చూస్తూ కూర్చున్నాడు. చూస్తూ చూస్తూ, పళ్ళ రసంలో ఆమెకి మత్తు మందు కలిపిచ్చి, ఫాహద్ తో కిడ్నాప్ చేయించేశాడు. ఇది చివర్లో కిడ్నాప్ సీను రివీలయినప్పుడు చూస్తాం. అంటే ఆ ఫైలు కోసం ఫోన్ చేసే వెళ్లుంటాడు. అప్పుడా కాల్ లిస్టులో చివరి నంబర్ తనదే అయ్యుంటుంది. వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఆ నంబర్ వుంటుంది. ఈ కాల్ లిస్టు ఇప్పుడు చెక్ చేస్తున్న విక్రం, చివరి నంబర్ వ్యక్తిని పట్టుకోకుండా, క్లూస్ ఏమీ దొరకడం లేదని విసుక్కుంటాడు. ఏంటిది విక్రం? ఒక్క చోటైనా- ఒక్కటంటే ఒక్క చోటైనా శ్రద్ధ పెట్టి ఆలోచించవా? ఈ కేసంటే నీకిష్టం లేదా?  


      అసలు ఫైలు కోసం రోహిత్ నేహా ఇంటికి వెళ్ళడమేమిటి? ఆమె ఆఫీసు ఫైలు ఇంటికెందుదుకు తెచ్చి చూపిస్తుంది? రేపు ఆఫీసుకే రమ్మంటుంది. అసలు రోహిత్ ఎవరు ప్రీతి కేసులో ఫైలు అడగడానికి? రోహిత్ విక్రం అసిస్టెంట్. ప్రీతి కేసు చూస్తున్నది శ్రీనివాస్. ఇక ఆ పళ్ళ రసం గ్లాసేమైందో, అదెందుకు లాబ్ కెళ్లలేదో విక్రం కే తెలియాలి. మరొకటేమిటంటే, రోహిత్ గానీ, ఫాహద్ గానీ గ్లవ్స్ తొడుక్కోలేదు. వాళ్ళ వేలిముద్రలు చాలా ఏర్పడి వుండాలి. ఈ కేసు చూసిన ఘనమైన అభిలాష్ ఏం చేశాడో? ‘హిట్’ పేరు నిలబెట్టాలని ఎవడికీ లేదు. ‘హొమిసైడ్ ఇల్లాజికల్ టీం’ అని బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటున్నారు. 

        ఇక లారీ యార్డులో టైర్ల గుర్తులు. నిజానికి చివర్లో రివీలయ్యే దాన్ని బట్టి, ఫాహద్ ప్రీతిని బ్లూ కారులో అపహరించాక, ఇక్కడికి తెచ్చి ఆ కారుని కార్గో ట్రక్ ఎక్కించాడు. అప్పు డా బ్లూ కారు టైర్ల గుర్తులు కూడా పడాలిగా? ట్రక్కు గుర్తులు మాత్రమే ఎందుకు చూపిస్తున్నాడు కథకుడు? 

     ఇక చిత్రపటం. లెటర్ తీసుకుని లాబ్ కి పరుగెత్తడమే దండగ. షీలా ఇంట్లో దొరికిన ఈ రెండూ ఒకటేనని కొట్టొచ్చినట్టూ కన్పించిపోతోంది మన కళ్ళకి. విక్రం లాబ్ లో కూడా కాదు, ఇంట్లో కూర్చుని కామన్ సెన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన వాడు. లాబ్ కి ఒరిజినల్ చిత్రపటం కూడా తీసికెళ్లలేదు. రహస్యంగా ఫోటో తీసి కాపీ అందించాడు. ఒరిజినల్ కావాలని టెక్నీషియన్ అంటే, ఒరిజినల్ తీసుకు రాలేనని విసుక్కున్నాడు. ఎందుకు తీసుకురాలేడు? పోలీస్ పవర్ లేదా? ఆ చిత్రపతమే తీసుకు వెళ్తూంటే షీలా లబలబలాడి అప్పుడే నిజం చెప్పేసేదిగా ఆ లెటర్ తనే రాశానని! పాత్రలతో లైవ్ డ్రామా- కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకుండా, చెత్తా చెదారం క్లూస్ తో ఫేక్ సస్పన్స్ సృష్టించడమేమిటి? ఎండ్ సస్పెన్స్ తో వచ్చే సమస్య ఇదే. ఇన్ఫర్మేషన్ పోగేసుకు వెళ్ళడమే తప్ప నో కాన్ఫ్లిక్ట్, నో డ్రామా, నో కథ.
         
(వార పత్రికల్లో సీరియల్ లాగా... ఇంకా వుంది.
సీరియల్ రాసే అదృష్టం కల్పించిన
కథకుడికి కృతజ్ఞతలు!)

సికిందర్