విషయం 5. షీలాని ఇంటరాగేట్
చేస్తాడు విక్రం. ఆ లెటర్ తనే రాశానని ఒప్పుకుంటుంది. కాలనీలో ప్రీతి తప్ప తనతో
ఎవ్వరూ మాట్లాడరనీ, ప్రీతి మిస్సయ్యాక లోన్లీగా ఫీలయ్యాననీ. ఇలా లెటర్ రాస్తే
కాలనీలో అటెన్షన్ గెయిన్ చేయవచ్చనుకున్నాననీ అంటుంది. ఇది నమ్మడు విక్రం. వెంటనే పాలీగ్రాఫ్
టెస్ట్ ఎనౌన్స్ చేస్తాడు. ఇందుకు ఆమె ఒప్పుకునేలా మాట్లాడి సంతకం తీసుకుంటాడు. ఆ ప్రశ్నలు
ఇలా వేస్తాడు : నీ పేరు షీలానా? నీ ఏజ్ ముప్ఫైనా? విజయ్ నీ మాజీ భర్తనా? షీలా నీకు
ప్రీతి తెల్సా? షీలా నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేశావా? నీకు నేహా తెల్సా? నేహా
ఇంకా బతికేవుందా?....ఇలా ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నల్లో ప్రీతి తనకి తెలుసనీ, కానీ తను
కిడ్నాప్ చేయలేదనీ అంటుంది. చివరి రెండు ప్రశ్నలకి నేహా ఎవరో తెలియదని అంటుంది. తన
గురించి అడిగిన మిగిలిన ప్రశ్నలకి అవుననే చెప్తుంది. ఈమె నిజాలే చెప్పిందని
టెక్నీషియన్ నిర్ధారిస్తాడు. కానీ హార్ట్ బీట్ ని, బ్రీతింగ్ నీ కంట్రోల్ చేసుకుని
టెస్టు ని చీట్ చేయవచ్చని విక్రం తేల్చి, నార్కో ఎనాలిస్ టెస్ట్ ఎనౌన్స్ చేస్తాడు.
వివరణ: మొత్తానికి ఇది ఫేక్ లెటర్
తో నడుస్తున్న కథగా తేలిపోయింది. ఫేక్ లెటర్ తో
ఇంటర్వెల్లే గాక, సెకండాఫ్ మరో పది నిమిషాలూ ఫేక్ లెటర్ తోనే, షీలా అనే సబ్
ప్లాట్ పాత్రతోనే ఇంతసేపు గడిచిపోయింది. ఇప్పుడామె అది ఫేక్ లెటర్ అంటూ అందుకు
కారణాలు చెప్పాక, ఆమెని డిస్మిస్ చేసి నిఘాలో పెడితే సరిపోయే దానికి, ఇక్కడితో ఆమె
ట్రాక్ ముగిస్తే ఐపోయేదానికి- ఇంకా సాగలాగడం. వెంటనే పాలీగ్రాఫ్ టెస్ట్ అంటూ
ఓవరాక్షన్ చేయడం. ఇక్కడ ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది అనవసర తతంగం.
షీలా పాత్ర గురించి - ఇల్లు కాలి ఒకరేడుస్తూంటే
చలి కాచుకున్నట్టుందని గత వ్యాసంలో ఎందుకన్నామంటే ఇందుకే. కాలనీలో తనతో మాట్లాడే,
వున్న ఒక్క ఫ్రెండ్ ప్రీతి కిడ్నాపైన సీరియస్ వాతావరణంలో, కాలనీ వాళ్ళ అటెన్షన్
కోసం అలా లెటర్ రాశాననడం ఫ్రెండ్ ట్రాజడీ లోంచి కూడా లాభం పొందాలనుకోవడమే. నిజంగా
ఆమె ఇలా చేస్తుందా? చెయ్యదు. ప్రీతి కిడ్నాపయ్యిందంటే ఆమె పేరెంట్స్ సహా కాలనీ
వాళ్ళు వచ్చి తన మీద పడతారు. పట్టుకుని పోలీసులకి అప్పజెప్తారు. ఇదీ నార్మల్
ప్రాసెస్. ఆమె ఇక ఉత్తరాలెలా రాస్తూ కూర్చుంటుంది. కాబట్టి పాత్రచిత్రణలు చూసుకోకుండా
సీన్లు రాసుకుంటే ఇలాగే వుంటుంది కథ. ఇతర
సినిమాల్లోనే పాత్ర చిత్రణలు లాజికల్ గా వుండాలి, ఇలాటి ఇన్వెస్టిగేటివ్ సినిమాల్లో
ఇంకా లాజికల్ గా వుండాలి.
దర్శకుడు ఇది ‘ఇన్ఫార్మేటివ్ థ్రిల్లర్’ అని ఇప్పటివరకూ సినిమా
జానర్స్ కి సంబంధించి లేని పదాన్ని తను కనిపెట్టి ప్రస్తావించాడు కాబట్టి, ఇందులో
ఇస్తున్నఇన్ఫర్మేషన్ ఎంతవరకూ నమ్మదగిందని చూడక తప్పడం లేదు. చూసినప్పుడు దర్శకుడైన
కథకుడు తగిన రీసెర్చి చేయలేదనీ, చేసినా కాంప్రమైజ్ అయీ మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ
పోయాడనీ ప్రతీ సీనులో చూస్తూనే వచ్చాం. ఇప్పుడీ సీనులో కూడా ఇదే తంతు. పాలీగ్రాఫ్
టెస్ట్, లేదా లై డిటెక్టర్ టెస్టుని కోర్టులు ఎవిడెన్స్ గా స్వీకరించవు. టెస్టులో
పోలీసులు పొందిన సమాచారాన్ని వాళ్ళ దర్యాప్తులో వాడుకోవచ్చు తప్ప, దాంతో నిందితుడు
నేరం ఒప్పుకున్నట్టుగా కోర్టులో ప్రవేశపెట్టలేరు. ఉదాహరణకి, టెస్టులో ప్రీతి శవం
ఫలానా చోట వుందని షీలా చెప్తే, అక్కడికెళ్ళి శవాన్ని కనుగొన్న పోలీసులు, మాకు అక్కడ
శవం దొరికిందని మాత్రమే కోర్టుకి చెప్పగలరు తప్ప, పాలీగ్రాఫ్ టెస్టులో షీలా చెప్పిందని
చెప్పలేరు. పాలీగ్రాఫ్, నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టుల ఆధారంగా నమోదైన కేసులన్నిటినీ
సుప్రీం కోర్టు కొట్టి పడేసింది. ఈ టెస్టులు ఇంటరాగేషన్ కి మరో రూపమే. ఇంటరాగేషన్
ని ఎలాగైతే ఎవిడెన్సుగా కోర్టులొప్పుకోవో, ఈ టెస్టుల్ని కూడా ఒప్పుకోవు.
ఐతే దర్యాప్తులో భాగంగా సమాచారం
పొందడం కోసం పోలీసులు ఈ టెస్టులు నిర్వహించాలంటే కోర్టుల అనుమతి తీసుకోక తప్పదు. నిందితుడు తను టెస్టుకి
అంగీకరిస్తున్నట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పక తప్పదు. నిందితుడి లాయర్ సమక్షంలో
పోలీసులు టెస్టు నిర్వహించకా తప్పదు. టెస్టుని హాస్పిటల్లో ఫోరెన్సిక్స్ నిపుణులు
కండక్ట్ చేయకా తప్పదు.
ఈ
సీనులో మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా, తనే షీలాని ఒప్పించేసి, ఆమె లాయర్ లేకుండా,
పాలీగ్రాప్ టెస్టు అక్రమంగా చేసేశాడు విక్రం. రెండోది, ఈ టెస్టు ఉపయోగమేమిటో
షీలాకి చెప్పకపోవడం వల్ల, తను ఇచ్చే సమాచారంతో తను దోషిగా దొరికిపోయి ఎక్కడ శిక్షపడుతుందోనన్న
అభిప్రాయం ఆమెకి కలిగేలా చేశాడు విక్రం. ప్రేక్షకులూ ఇలా అనుకునేలా తప్పుడు
సమాచారం వెళ్ళింది. షీలాకి ఇలాటి అభిప్రాయం కల్గిస్తే, ఆమె ఆందోళనతో ఇచ్చే
సమాధానాలు టెస్టుని కన్ఫ్యూజ్ చేస్తాయి కూడా. నిందితుడికి లేదా నిందితురాలికి
ఇలాటి అభిప్రాయం కల్గించకుండా, ప్రశాంత చిత్తంతో వుండేలా చూస్తారు ఎగ్జామినర్లు.
ఇక ప్రశ్నలు వేసే టెక్నిక్ వుంటుంది. ముందుగా చాలా జాగ్రత్తగా పదాల్ని వాడుతూ ప్రశ్నల జాబితా తయారు చేసుకుంటారు. ఎనిమిదీ, పదికి మించి ప్రశ్నలుండవు. ఈ ప్రశ్నలు ఒక సీక్వెన్స్ లో వుంటాయి. ఈ ప్రశ్నల్లో ఒకటి కంట్రోల్ క్వశ్చన్ గా వుంటుంది. విక్రం అడిగిన ప్రశ్నలు ఆషామాషీ గా వున్నాయి. పాన్ షాపులో సిగరెట్టుందా, బీడీ వుందా అని అడిగినట్టు అడిగేశాడు. లేవు పొమ్మంది షైనింగ్ స్టార్ షీలా కూడా. ఈ సీనులో ఏం తేల్చాడో అర్ధంగాదు. ఈ సీనులో కూడా తేల్చకుండా వుంటేనే, నెక్స్ట్ నార్కో ఎనాలిసి టెస్ట్ కూడా చూపించవచ్చు. తను తెలుసుకున్న పద్ధతులన్నీ చూపించుకోవాలని ఆవేశవడుతున్నాడు కథకుడు. దీనికోసం సీన్లు నాశనం చేస్తున్నాడు. చిత్రపటం - లెటర్ సీనుని లాబ్ లో ఇలాగే నాశనం చేశాడు, షీలా ఇంట్లో సీను వేయడం కోసం. కథ వెనుక కథకుడి అంతరంగమిలా వుంటే కథ బాగుపడదు. స్క్రీన్ ప్లేకీ ప్రక్షకులకీ మధ్య కథకుడు రావడం భౌతిక దూరం మధ్యలో కరోనా గాడు దూరడమే.
అసలు
లెటర్ గురించి ఆమె నిజం చెప్పడం లేదన్న అనుమానంతో పెట్టిన టెస్టులో అడగాల్సిన కంట్రోల్
క్వశ్చన్ లెటర్ గురించే. దాని వూసే ఎత్తలేదు. దాని వూసెత్తితే ఆమె నిజమే చెప్తున్నట్టు
రిజల్టు వస్తుందిగా? అప్పుడు నార్కో టెస్టు కి వెళ్ళలేడుగా? నార్కో టెస్టు కూడా
చూపించుకోవాలిగా ప్రేక్షకులకి? ఇక నార్కో ఎనాలిసిస్ టెస్టు ఎనౌన్స్ చేసేశాడు
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా. కథకుడు వుండాల్సింది స్క్రీన్ ప్లేకీ ప్రేక్షకులకీ
మధ్య కాదు. స్క్రీన్ ప్లే వెనుక కూడా కాదు. ప్రేక్షకుల వెనుక, ప్రేక్షకుల కోసం.
(రేపు నార్కో ఎనాలిసిస్
టెస్ట్)
―సికిందర్