నేచురల్ స్టార్ నాని
నిర్మాతగా, కొత్త దర్శకుడు శైలేష్ కొలను మేకింగ్ లో, విశ్వక్ సేన్ హీరోగా, ‘హిట్ - ది ఫస్ట్ కేస్’ అనే పోలీస్
డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్ తీశారు. ఫిబ్రవరిలో విడుదలైంది. ఏప్రెల్ లో అమెజాన్ లో
విడుదలైంది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు, మణి కందన్ ఛాయాగ్రాహకుడు, బీహెచ్ గేరీ
కూర్పు. విశ్వక్ సేన్ ఇందులో పోలీసాఫీసర్ గా నటిస్తే, భానుచందర్ అతడి సీనియర్ గా,
రుహానీ శర్మ ఫోరెన్సిక్ సైంటిఫిక్
ఆఫీసర్ గా నటించారు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ,
చైతన్య, శ్రీనాథ్, రవివర్మ, బ్రహ్మాజీ, సాహితీ, నవీనా రెడ్డి, రవిరాజా మొదలైన వారు
నటించారు. దీని సీక్వెల్ ‘సెకెండ్ కేస్’ గా 2021 లో రాబోతున్నట్టు చివర
అక్షరాలేశారు. ఈలోగా ‘ఫస్ట్ కేస్’ ఎలావుందో చూద్దాం. ముందుగా కథేమిటో చూద్దాం... ఈ
ఎండ్ సస్పెన్స్ కథ సస్పెన్స్ లీకయ్యేలా మొత్తం చెప్పుకు పోకపోతే, స్క్రీన్ ప్లే
సంగతులు సాధ్యం కాదు. కనుక ఈ మూవీ చూడాలనుకుంటున్న వారు ఈ ఆర్టికల్ ని పక్కకు
పెట్టడం మంచిది. లేదంటే అమెజాన్ లో చూసేసి ఆర్టికల్ ని చేపట్టొచ్చు.
విక్రం కొత్తగా ఏర్పాటైన ‘హిట్’ అనే ‘హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్’ లో పోలీసాఫీసర్. రోహిత్ (చైతన్య) అతడి కొలీగ్. అభిలాష్ (శ్రీనాథ్) ఇంకో టీం మెంబర్. విశ్వనాథ్ (భానుచందర్) టీం చీఫ్. విక్రంకి వెంటాడే గతం వుంటుంది. దాంతో అతను మానసికంగా ఇబ్బంది పడుతూ వుంటాడు. అదేమిటో గర్ల్ ఫ్రెండ్ నేహా (రుహానీ శర్మ) కి చెప్పడు. లీవ్ పెట్టి కొంతకాలం రెస్టు తీసుకోమం
టుంది. విన్పించుకోడు. అయితే తనతో మాట్లాడవద్దని వెళ్లి పోతుంది. ఆమె ఫోరెన్సిక్ ల్యాబ్ లో సైంటిఫిక్ ఆఫీసర్ గా పని చేస్తూంటుంది.
ప్రీతి (సాహితి) అనే స్టూడెంట్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో పేరెంట్స్ తో వుంటుంది. ఒక రోజామె ఫ్రెండ్స్ ని కలవాలని కారులో బయల్దేరుతుంది. ఆ తర్వాత కన్పించదు. ఆమె పేరెంట్స్ పోలీస్ కంప్లయింట్ ఇస్తారు. ఈ సందర్భంగా ఎస్సై ఇబ్రహీం (మురళీ శర్మ) తో ఘర్షణ పడతారు. దీంతో ప్రీతి అదృశ్యంలో ఇబ్రహీం హస్తముందని అనుమానించి అతణ్ణి సస్పెండ్ చేస్తాడు చీఫ్.
అటు
లీవ్ లో వున్న విక్రంకి నేహా కన్పించడం లేదని తెలిసి వచ్చేస్తాడు. ఈ కేసు
తనకిమ్మంటే ఇవ్వడు చీఫ్. గర్ల్ ఫ్రెండ్ కేసు కాబట్టి ఇతను ఇంటలిజెన్స్ తో కాకుండా
ఎమోషన్ తో డీల్ చేస్తాడని, ఇంకో టీం మెంబర్ అభిలాష్ కిస్తాడు. అభిలాష్ కీ విక్రంకీ
పడదు. బద్ధ శత్రువుల్లా వుంటారు. ఇక నేహా మిస్సింగ్ కేసులో విక్రంని అనుమానిస్తాడు
అభిలాష్.
ఇంతలో విక్రంకి ప్రీతి మిస్సింగ్ కేసు
గురించి తెలుస్తుంది. ప్రీతీ, నేహా ఇద్దరి మిస్సింగ్ కేసులకీ ఏదో సంబంధముందని
అనుమానించి, ప్రీతి కేసు తనకిమ్మని కోరతాడు విక్రం. నువ్వు డీల్ చేస్తానంటే
అంతకంటే కావాల్సిం దేముందని, కేసు చూస్తున్న శ్రీనివాస్ (రవివర్మ) నుంచి తప్పించి,
విక్రం కిచ్చేస్తాడు చీఫ్.
విక్రం దర్యాప్తులో ప్రీతి ఒక అనాధ అనీ; మోహన్, లక్ష్మీ (రంగధాం, రూపలక్ష్మి) లు ఆమె పెంపుడు తల్లిదండ్రులనీ తెలుస్తుంది. సరస్వతి (కల్పలత) అనే ఆవిడ నడిపే అనాధాశ్రయం నుంచీ మోహన్ తమ్ముడు శివ (శ్రీ హర్ష), మరదలు ప్రియ (సత్య కృష్ణన్), ప్రీతిని దత్తత తీసుకుని యూఎస్ వెళ్ళారనీ, అక్కడ వాళ్ళిద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో, ప్రీతిని తెచ్చుకుని మోహన్ లక్ష్మీలు పెంచుకున్నారనీ తెలుస్తుంది.
దర్యాప్తు చివరి దశలో అసలు విషయం తెలుస్తుంది... చిన్నప్పుడు ప్రీతి అనాధాశ్రయంలో వున్నప్పుడు, ఆమెతో బాటు స్వప్న, స్వప్న చెల్లెలు అలేఖ్యా వుండే వాళ్ళు. అలేఖ్యకి గుండె జబ్బుండేది. మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ ఒకర్ని దత్తత తీసుకోవడానికి వచ్చినప్పుడు, అలేఖ్యకి ఈ అవకాశమిస్తే గుండె జబ్బు నయం చేస్తారని ప్రీతికి నచ్చజెప్పింది స్వప్న. కానీ ప్రీతి దీన్ని పెడచెవిని బెట్టి తను దత్తత వెళ్లిపోవడంతో, ఆ తర్వాత చెల్లెలు చనిపోవడంతో, ప్రీతి మీద పగ బట్టింది స్వప్న.
అలా పగ పెంచుకున్నస్వప్న(నవీనా రెడ్డి), ఇప్పుడు ప్రీతిని కిడ్నాప్ చేయించి చంపేసింది. ఒక సాక్ష్యాధారం నేహా దగ్గరికి రావడంతో, వాటినామె వెల్లడించకుండా ఆమెని కూడా కిడ్నాప్ చేయించి బంధించింది. ఇలా చేసిన స్వప్న, విక్రం కొలీగ్ రోహిత్ భార్యే. ఇదంతా రోహిత్ కి తెలిసే, అతడి సహకారంతోనే జరిగింది...ఇదీ కథ.
ప్రేక్షకులకి అవగాహన
అద్భుత చిత్రీకరణ చేశాడు కొత్త దర్శకుడు
శైలేష్. హిట్ టీము చేసే దర్యాప్తు, ఫోరెన్సిక్ లాబ్ పాత్ర మొదలైనవి క్రైం కేసుల్లో
ప్రేక్షకులకి తెలియని ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగేలా చిత్రీకరించాడు. కథనంలో
వేగం, సంభాషణల్లో క్లుప్తత, సాంకేతిక హంగుల్లో నాణ్యత కనబర్చాడు. వివేక్ సాగర్
హెవీ బీట్స్ వేయకుండా, సీన్లని పరుగులెత్తించే ఇన్సిడెంటల్ మ్యూజిక్ నిచ్చాడు. మణి కందన్ కెమెరా వర్క్ థ్రిల్లర్ కి తగ్గ
లైటింగ్ ని – కాంట్రాస్ట్ ని బేస్ చేసుకుని వుంది. బీహెచ్ గేరీ కూర్పు స్మాష్ కట్
టెక్నిక్ తో వుంది. సీన్లు అలాగే రాసి వుంటారు. పాత్రలు ఇంకేదో
అనబోతున్నారకునేంతలో కట్ అయిపోతుంది. అవినాష్ కళాదర్శకత్వం పాప్ కల్చర్ తో వుంది.
ప్రశాంతి తిపిరినేని వస్త్రాలంకరణ స్టైలిష్ పంథానే గానీ, పోలీస్ టీంకి పోలీస్
యూనీఫారాలు కూడా వుండేలా చూడాల్సింది. ఇక చివర్లో నబా ఫైట్స్ చీకట్లో, వర్షంలో
రియలిస్టిక్కే.
పోతే కలర్ స్కీములో మూడ్ ని కుదించే, బ్యాక్ గ్రౌండ్ లో రన్నయ్యే, బీజ్ షేడ్ తీసేయాల్సింది. అద్భుత రసం కిందికి వచ్చే పోలీస్ క్రైం థ్రిల్లర్, ప్లెజెంట్ మూడ్ ని క్రియేట్ చేస్తూ కలర్ఫుల్ గా వుండాల్సిందే. ‘నైవ్స్ ఔట్’ లాంటి ఇటీవలి మిస్టరీలని కూడా హాలీవుడ్ లో అత్యంత కలర్ఫుల్ గా తీస్తున్నారు. పైగా ఇది (హిట్) అమ్మాయిల కథయినప్పుడు కలర్ఫుల్ గానే వుండాలి. హిందీలో వచ్చిన పోలీస్- కోర్టు రూమ్ డ్రామా ‘పింక్’ అమ్మాయి కథే. ఎంత కలర్ఫుల్ గా తీశారు టైటిలే ‘పింక్’ అని పెట్టి?
‘హిట్’ మార్కెట్ యాస్పెక్ట్ ని సరీగ్గా నిర్ణయించు కోకుండా మేకింగ్ చేశారన్పిస్తుంది. పోలీస్ క్రైం థ్రిల్లర్ కేవలం ఒక వర్గం ప్రేక్షకులకి చెందే జానర్ కాదు. ఇది అమ్మాయిల చుట్టూ కథ కూడా అయినప్పుడు - మాస్, యూత్ తో బాటు ఫ్యామిలీల్నికూడా టార్గెట్ చేస్తూ మార్కెట్ వ్యూహం పన్నినట్టు లేదు (యూత్ అంటే కూడా అబ్బాయిలే తప్ప అమ్మాయిలని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం లేదు. న్యాయంగా వెండి తెరలో సగం వాళ్ళదే. ఇలాగే చేస్తూంటే ఆ సగం చించేసుకు పోతారు కూడా).
పోస్టర్లు కూడా ఏదో వయొలెంట్ మాఫియా మూవీ అన్నట్టే నెగెటివ్ గా వున్నాయి. ‘పింక్’ మార్కెట్ యాస్పెక్ట్ కి కుటుంబాలకి కుటుంబాలే తరలి వచ్చాయి. హైదరాబాద్ లో కూడా తెలుగమ్మాయిలు తెగ చూశారు. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ దగ్గర పొందాల్సినంత బాక్సాపీసు మైలేజీని పొంద లేకపోయింది ఈ పోలీస్ థ్రిల్లర్.
నటవర్గంలో హీరో విశ్వక్ సేన్ మళ్ళీ ‘ఫలక్ నుమా’ సేన్ లాగే కన్పించాడు. క్లీన్ షేవ్ చేసుకుంటే పోలీస్ డిటెక్టివ్ లాగా వుండే వాడు. ఇంకిద్దరు టీం మెంబర్లు కూడా గడ్డాలతోనే వుంటారు. చీఫ్ గా భానుచందరేమో క్లీన్ షేవ్ చేసుకుని వుంటాడు. భానుచందరే యూనీఫాంలో వుంటాడు. మిగిలిన టీమంతా ఆయన ముందు సివిల్ డ్రెస్సుల్లో తిరుగుతూంటారు. ఒక్కసారైనా ఈ టీముని యూనీఫామ్స్ లో ప్రొఫెషనల్స్ గా చూపించకూడదా? ఈ ప్రొఫెషనల్ సినిమాలో కూడా ప్రేక్షకులేమను కుంటారోనని భయపడాలా? విశ్వక్ సేన్ ర్యాంకేమిటో కూడా చెప్పలేదు. ఇన్స్ పెక్టరయితే డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ అనీ, సబిన్స్ పెక్టరయితే డిటెక్టివ్ ఎస్సై అనీ చెప్తే ప్రేక్షకులు తెలుసుకుంటారుగా? అలాగే మిగతా టీంకీ? ఈ జానర్ మూవీలో కూడా తగిన ఐడీలు లేకుండా టెంప్లెట్ మూస పోలీసులేనా?
విశ్వక్
సేన్ పాత్రకి బాధాకర గతాన్నిచ్చారు. ఇది ‘ప్రిజనర్స్’ (2013) లో పోలీస్ డిటెక్టివ్
పాత్రనుంచి తీసుకున్నారేమో తెలీదు. కానీ ‘ప్రిజనర్స్’ పోలీస్ క్రైం థ్రిల్లర్
జానర్ కాదు. అది ఫాదర్ రివెంజి సినిమా. పోలీస్ క్రైం థ్రిల్లర్ జానర్లో పాత్రకి
గతాన్ని తల్చుకుని బాధపడే బ్యాక్ స్టోరీ వుండదు. ప్రెజెంట్ స్టోరీలోనే కుటుంబంతోనో,
ప్రేమతోనో తేలికపాటి సమస్యలుంటాయి. పోలీస్ డిటెక్టివ్ పాత్రలకి, జేమ్స్ బాండ్
లాంటి స్పై పాత్రలకీ డార్క్ మూడ్ ని క్రియేట్ చేసే ట్రాజిక్ ఫ్లాష్ బ్యాకులుండవు. ఈ
జానరే ఒక అద్భుత రసం. అంతా కలర్ఫుల్ గా మానసికోల్లాసమే. మానసిక పీడిత హీరో పాత్రకి
స్థానం లేదు.
హాలీవుడ్
మాఫియా యాక్షన్లోనో, ఇంటెల్ ఆపరేషన్స్ లోనో, ఇలాటి పోలీస్ టెంప్లెట్ పాత్రలుంటాయి.
అది కూడా మాజీ పోలీసుగా. గతంలో అతడికి వ్యక్తిగతంగా ఏదో జరిగి, జాబ్ కి రిజైన్
చేసి, బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతూ ఎక్కడో విషాదంగా బతుకుతూంటాడు. లేదా ఏదోపని
చేసుకుంటూ బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తూంటాడు- ‘ఈక్వలైజర్ 2’ లో డెంజిల్ వాషింగ్టన్ లాగా. అప్పుడు చీఫ్ నుంచి
కాల్ వస్తుంది, కొత్త ఆపరేషన్ కి రారాబాబూ అని. అలా వెళ్లి పాత బ్యాక్ స్టోరీతో
సఫరవుతూ, కొత్త శత్రువులతో తలపడుతూంటాడు. దీన్ని తెచ్చి పోలీస్ డిటెక్టివ్ విశ్వక్ సేన్ కి కట్ట బెట్టేశారేమో జానర్ మర్యాద తెలుసుకోకుండా. గతంలో ఇతడి చెల్లెల్ని ఎవరో నిలువునా తగులబెట్టారు. అదీ బాధ. ఆ పానిక్ ఎటాక్స్ తో డిస్టర్బ్ అవుతూంటాడు. ఇలాటి వ్యక్తిని ‘హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం’ (హిట్) అనే కొత్త శాఖానేర్పాటు చేస్తూ అందులోకి తీసుకుంటారా - తీసుకుని ఫస్ట్ కేస్ అప్పజెప్తారా?
ఈ గతంతో కథకి కూడా సంబంధం లేదు. ఇన్వెస్టిగేషన్ జానర్ కి అడ్డుపడుతూ అనవసరంగా డార్క్ సీన్లు. ఇంకా గర్ల్ ఫ్రెండ్ నేహా కూడా కిడ్నాప్ అవడంతో దాని తాలూకు బాధాకర మాంటేజెస్. ఇలా పాత్ర మనఃక్లేశానికి ఏకసూత్రత లేకుండా రెండు రకాల పాయింట్లు, బాధలు.
వేలి ముద్రల టెక్నీషియన్ నేహాగా రుహానీ శర్మ సోసోగా కన్పిస్తుంది. సీన్లు కూడా ఎక్కువలేవు. ‘చిలసౌ’ లో హైలైట్ అయిన నిస్సహాయ మధ్యతరగతి అమ్మాయి సంఘర్షణలాంటిది ఇక్కడ లేదు. భానుచందర్ వూరికే తిరుగుతూ వుండే పాత్ర. కేసుల్లో ఇన్వాల్వ్ అవడం వుండదు, ఏ వర్రీ వుండదు. కొత్తగా పెట్టిన శాఖకి ఫస్ట్ కేస్ పట్ల ఏ ఉత్సాహమూ వుండదు.
వేరే పోలీస్ స్టేషన్ ఎస్సై ఇబ్రహీంగా మురళీశర్మ పై అధికారితో బాటు, తోటి పోలీసులైన హీరో సహా అందరితో ఛీత్కారాలు పొందే పాత్ర, కేవలం ఆధారాలు లేని అనుమానాలతో అతణ్ణి దొంగలా ట్రీట్ చేస్తూ, ఏరా పోరా అని తిట్టడం. అతడి మతం తెలియడానికి దర్శకుడు షర్టు గుండీ తీయించి, తావీజు చూపించి మరీ తిట్టించడం. చాలా బ్యాడ్ టేస్ట్. మతమనే కాదు, ఒక ఎస్సై ని ఇలా ట్రీట్ చేయడం - అందులోనూ ఈ జానర్ లో బ్యాడ్ టేస్ట్. చివరికి ప్రాణత్యాగం చేయించి, అంతిమ యాత్ర జరపడం!
ఈ పాత్రతోనే కాదు, మొత్తం హిట్ శాఖ కథే బ్యాడ్ టేస్టు చుట్టూ కథగా చూడొచ్చు. ఇంకా పొడిగిస్తే హెవీ అవచ్చు, క్రియేటివ్ యాస్పెక్ట్ గురించి రేపు చూద్దాం...
―సికిందర్