Q : గత వారం Q&A లో ‘ఖైదీ’ కి సంబంధించిన సందేహంలో నా వైపు నుంచి కొంత
అస్పష్టత వుంది. దీన్ని ఇలా క్లియర్ చేస్తాను: కథలో హీరోని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించామో అదే లక్ష్యంతో ముగింపు వుండాలా? ‘ఖైదీ’ – కథని లీనియర్ గా చెప్తే > ప్రారంభం – హీరోయిన్ ప్రేమని సాధించుకోవడం, కలెక్టర్ అవడం, ముగింపు – పగతీర్చుకోవడం. నాన్ లీనియర్ గా ఇప్పుడున్నది > ప్రారంభం – విలన్ ని చంపాలనుకోవడం, ముగింపు – విలన్ ని చంపడం.‘ఒక్కడు’ > ప్రారంభం – కబడ్డీ పోటీల్లో గెలవడం, హీరోయిన్ని రక్షించడం.
ముగింపు – కబడ్డీ పోటీల్లో గెలవడం, హీరోయిన్ని రక్షించడం....
హీరో పాత్ర ప్రారంభ ముగింపు లక్ష్యాలు వ్యతిరేకంగా వుండకూడదా?హీరో పాత్రని ఏ లక్ష్యంతో ప్రారంభించామో, అదే లక్ష్యంతో వుండాలని, అందుకే ‘ఖైదీ’ కథని నాన్ లీనియర్ గా చెప్పాల్సి వచ్చిందన్నారు పరుచూరి గోపాల కృష్ణ. ‘శివ’ లో హీరో చదువుకోవడాకి కాలేజీకి వచ్చాడు.
చివర్లో విలన్ ని చంపాడు.
ఇది ప్రారంభ ముగింపు లక్ష్యాలకి వ్యతిరేకమే కదా?
―పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు
A : ‘కథలో హీరోని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించామో అదే లక్ష్యంతో ముగింపు వుండాలా?’ అన్నారు మీరు. ఏ కథలోనైనా హీరోని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభిస్తారో, ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడంతోనే ముగింపు నిస్తారనేది జనరల్ నాలెడ్జియే కదా? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర
హీరోకి లక్ష్యం ఏర్పడుతుంది, ఆ లక్ష్యం కోసం సంఘర్షిస్తాడు, ఆ సంఘర్షణలో పైచేయి
సాధించి లక్ష్యాన్ని పూర్తి చేసి ముగిస్తాడు - ఇదేకదా కథంటే?
ముందుగా
కన్ఫ్యూజన్ తొలగించుకోవాల్సింది, ఏ సినిమా ప్రారంభమూ ఎప్పుడూ కథా ప్రారంభం కాదనేది. సినిమా ప్రారంభం వేరు,
కథా ప్రారంభం వేరు. సినిమా ప్రారంభమై కొంత సేపు నడిచాక, వచ్చే ప్లాట్ పాయింట్ వన్ మలుపులో, హీరోకి లక్ష్యం ఏర్పడ్డాకే, అక్కడ్నించీ మాత్రమే కథ ప్రారంభమవుతున్నట్టు
లెక్క. ఇది కూడా జనరల్ నాలెడ్జియే.
ఇలాగే
‘ఖైదీ’ లో పరుచూరి బ్రదర్స్ చూపించిన ప్రారంభం
కథా ప్రారంభం కాదు, అది సినిమా ప్రారంభం మాత్రమే. కాకపోతే లీనియర్ గా బిగినింగ్
విభాగాన్ని అందుకోలేదు, మిడిల్ విభాగాన్ని అందుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో
నాన్ లీనియర్ గా ప్రారంభించారు సినిమాని, కథని కాదు. కథెప్పుడూ పరిశుభ్రంగా లీనియర్ గానే వుంటుంది. సినిమా ప్రారంభం ఆసక్తి రేపాలనుకున్నా,
ఒక్కోసారి లీనియర్ గా ప్రారంభిస్తే బలహీనంగా వుంటుందనుకున్నా, అంక విభాగాల్ని అటూ
ఇటూ మార్చేయవచ్చు. అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ లని, మిడిల్ బిగినింగ్ ఎండ్ లుగా మార్చేయవచ్చు. ఇది
కూడా జనరల్ నాలెడ్జియే.
‘ఖైదీ’
లో ఇదే వుంది. సినిమా ప్రారంభంలో రావుగోపాలరావుని చంపాలన్న లక్ష్యం పెట్టుకున్న
చిరంజీవి పోలీసులకి దొరకడం, అక్కడ్నిచి తప్పించుకుని సుమలత ఇంట్లో ఆశ్రయం పొందడం,
సుమలతకి అతడి మీద అనుమానం వచ్చి అడిగితే చిరంజీవి జరిగింది చెప్పడం, ఆ జరిగిందాంట్లో చివరిజీవి ఒక వూళ్ళో వుండడం, ఆ వూరు పెద్ద
మనిషిగా రావుగోపాలరావు వుండడం, రావుగోపాల రావు కూతురు మాధవిని చిరంజీవి
ప్రేమించడం, రావు గోపాలరావు కక్షగట్టడం, ఒక సంఘటనలో చిరంజీవి అక్కని రావుగోపాల రావు
చంపేసి ఆ నేరాన్ని చిరంజీవి మీద వేసి పోలీసులకి
పట్టించడబోవడం, అక్కడ్నించీ తను పారిపోవడం వరకూ సుమలతకి జరిగింది చెప్పుకొస్తాడు చిరంజీవి.
ఇక్కడ
ఈ జరిగిందంతా ఫ్లాష్ బ్యాక్ అని తెలిసిందే. అంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో
ముందుగా వచ్చే బిగినింగ్ విభాగం. ఈ బిగినింగ్ క్లయిమాక్స్ ఏమిటంటే, చిరంజీవి అక్క హత్యానేరాన్ని
రావుగోపాలరావు చిరంజీవి మీద వేసి పోలీసులకి పట్టించబోతే చిరంజీవి పారిపోవడం. ఇది ప్లాట్
పాయింట్ వన్ ఘట్టం . ఇక్కడే చిరంజీవికి
రావుగోపాలరావుని చంపాలన్న లక్ష్యం ఏర్పడింది. అంటే కథ ప్రారంభమైంది. అంటే స్క్రీన్
ప్లే మిడిల్లో పడింది.
ఈ మిడిల్ నుంచి ఎత్తుకుని సినిమాని ప్రారంభించారు. మిడిల్ సంఘర్షణని పోలీస్
స్టేషన్లో పోరాడి పారిపోయి సుమలత ఇంట్లో చేరడం వరకూ, ఆతర్వాత సుమలత అనుమానం వచ్చి
అడిగేవరకూ కొనసాగించి ఆపారు. ఆపి, ఫ్లాష్ బ్యాక్ తో బిగినింగ్ ని అందుకున్నారు.
బిగినింగ్ చెప్పడం పూర్తయ్యాక, మిడిల్ ని ఎక్కడైతే ఆపారో, అక్కడికొచ్చి రావుగోపాలరావుమీద సుమలత కక్ష గురించి
కూడా చెప్పించి, చిరంజీవిని తిరిగి ఉద్యుక్తుణ్ణి
చేశారు. అప్పుడు మళ్ళీ పోలీసులు వెతుక్కుంటూ రావడంతో, మిడిల్ సంఘర్షణ వూపందుకుని, లక్ష్యం పూర్తి చేయడానికి
ఎండ్ కేసి పరుగులు తీసింది.
కనుక,
సినిమా ప్రారంభంలో చిరంజీవి పోలీసులకి దొరకడం, సుమలత ఇంట్లో సుమలత అడిగే వరకూ
వచ్చే సీన్లూ వగైరావన్నీ, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్
లో బిగినింగ్ విభాగంలో వచ్చే సీన్లు కావు,
మిడిల్ విభాగపు సీన్లు. అందువల్ల సినిమా
ప్రారంభాన్ని కథా ప్రారంభం అనుకోరాదు. కథాప్రారంభం జరగాలంటే దానికి ముందు వచ్చే బిగినింగ్
విభాగం ఉపోద్ఘాత మంతా చెప్పుకురావాల్సిందే
- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర లక్ష్యం ఏర్పడేవరకూ.
ఒక అనిల్ కుమార్ ఇంకో సునీల్ కుమార్ ని కొట్టడానికి బయల్దేరాడంటే, సమస్యా ప్రారంభం
అది కాదుగా? ఆ కారణం చెప్పాలి. ఆ కారణం చెప్పేదే
బిగినింగ్ విభాగపు బిజినెస్. కారణం లేకుండా కార్యం లేదు.
ఇక
లక్ష్యాల (గోల్స్) సంగతి . గోల్స్ రెండు రకాలుగా వుంటాయి : క్యారెక్టర్ గోల్, స్టోరీ
గోల్ అన్నవి. ఇవి రెండూ ఒకదానితో వొకటి లివ్
ఇన్ రిలేషన్ షిప్ లో వుంటాయి. ఎప్పుడు కలిసి వుంటాయి, ఎప్పుడు విడిపోతాయి ఆయా కథల్ని
బట్టి వుంటుంది. కథలో క్యారెక్టర్ గోల్ ఒకటే వుంటే అదే స్టోరీ గోల్ కూడా అయిపోతుంది.
‘ఖైదీ’ లో వున్నది చిరంజీవి రావుగోపాలరావుని చంపాలన్న క్యారెక్టర్ గోల్ ఒకటే. వేరే
స్టోరీ గోల్ లేదు. కాబట్టి ఈ క్యారెక్టర్ గోలే స్టోరీ గోల్ కూడా అయిపోయింది.
క్యారెక్టర్ గోల్ తో బయల్దేరే హీరోకి స్టోరీ గోల్ ఎదురు కావచ్చు. అప్పుడా క్యారెక్టర్
గోల్ కంటే స్టోరీ గోల్ ప్రధానమైపోతుంది. పాత్రకి సొంత బాధ కంటే, పరుల బాధ, ప్రపంచ బాధ ఎదురైనప్పుడు అవే ప్రధానమైపోతాయి కాబట్టి.
లేకపోతే అది పాత్రే కాదు. ‘ఒక్కడు’ లో కబడ్డీ పోటీలు మహేష్ బాబు క్యారెక్టర్ గోల్.
భూమికని రక్షించాలనుకోవడం స్టోరీ గోల్ ( స్టోరీ దీని చుట్టే తిరుగుతుంది). కాబట్టి
తన కబడ్డీ గోల్ కంటే, భూమికని కాపాడే స్టోరీ గోల్ మహేష్ బాబుకు ప్రధానమైపోయింది. క్యారెక్టర్
గోల్ ఎమోషనల్ యాక్షన్ లోకి బదిలీ అయిపోయింది, స్టోరీ గోల్ వచ్చేసి ఫిజికల్ యాక్షన్
గా టార్గెట్ అయి నిల్చింది. చివరికి రెండూ పూర్తి చేశాడు.
క్యారెక్టర్
గోల్ స్టోరీ గోల్ లో కలిసిపోవడం వుంటుంది. అంటే స్టోరీ గోల్ కి సంబంధించిన సంక్షుభిత
ప్రాంగణంలోకి పాత్ర ప్రవేశం సంపాదించడానికి, క్యారెక్టర్ గోల్ ఒక వాహికగా మాత్రమే పాత్ర
వహిస్తుంది. ‘శివ’ లో చదువుకోవాలని నాగార్జున కాలేజీలో చేరడం క్యారెక్టర్ గోల్. అక్కడి
వాతావరణం దరిద్రంగా వుంది. మనకెందుకులే అనుకుని వుంటున్నప్పుడు, ఆ దరిద్రం వచ్చి తన
మీదే పడింది. దీంతో దరిద్ర కారకుడైన జేడీని కొట్టి స్టోరీ గోల్ ఎత్తుకున్నాడు నాగార్జున. ఆ తర్వాత క్యారెక్టర్
గోల్ అప్రస్తుత మైపోయింది.
లక్ష్యాలు
ఇలా దోబూచులాడుతూంటాయి. మీరన్నట్టు ప్రారంభ ముగింపు లక్ష్యాలు వ్యతిరేకాలైన
పరిస్థితేమీ వుండదు. కథలో సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండం ఏర్పడితేనే ఈ పరిస్థితి వుంటుంది. ‘సైజ్ జీరో’ లో హీరోయిన్ క్యారెక్టర్
గోల్, స్టోరీ గోల్ రెండూ కూడా బెలూన్ లా వున్న తను బరువు తగ్గడమే. కానీ సెకండాఫ్ ఎత్తుకోగానే
బరువు తగ్గించే క్లినిక్ లో ఎవరో ఫ్రెండ్ కి చికిత్స వికటించి చనిపోయిందని, అలాటి క్లినిక్స్ మీద పోరాటం మొదలెడుతుంది. అంటే
కథ తెగిపోయి వేరే కథ మొదలయ్యింది. ఈ కథ తాలూకు గోల్ సాధించింది. కానీ అసలు మొదలెట్టిన
కథ తాలూకు గోల్ (క్యారెక్టర్ – స్టోరీ గోల్స్) అలాగే వుండిపోయింది. ముగింపులో ఆమె సైజ్ జీరోకి తగ్గలేదు
సరికదా, అదే బెలూన్ లా – గుమ్మటంలా నవ్వొచ్చేలా మిగిలింది.
―సికిందర్