రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 10, 2017

543 : రివ్యూ!


Dear  Readers!
Yesterday  glitches in net connectivity  caused delay in publishing the review. The desktop gone bongs! The inconvenience is deeply regretted.


        
రచన –దర్శకత్వం : మిస్కిన్
తారాగణం : విశాల్, అనూ  ఇమ్మాన్యుయేల్, అండ్రియా జెర్మియా ప్రసన్నవినయ్భాగ్యరాజ్సిమ్రాన్వినయ్ రాయ్ తదితరులు 
సంగీతంఅరోల్ కొరెల్లీ, ఛాయాగ్రహణం : కార్తీక్
బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాత : విశాల్  
విడుదల : నవంబర్ 10, 2017

***
          తమిళ స్టార్ విశాల్ మాస్ సినిమాలంటూ తెలుగులో అంతరించిన అవే రక్తపాతాల యాక్షన్ సినిమాల్లో నటిస్తూ, క్రమంగా తెలుగులో ఫాలోయింగ్ కోల్పోతూ వచ్చాడు. కార్తీకున్న ఓపెనింగ్స్ కూడా తనకి రావడం తగ్గిపోయింది. అయినా వొరవడిని మార్చుకునే ఆలోచన చేయకుండా అపజయాలకి అలవాటు పడిపోయాడు. తమిళంలో తనదగ్గరికి వచ్చే దర్శకులు కూడా అదే అరవ మాస్ –కొండకచో వూరమాస్ నీ అంటగడుతూ విశాల్ వైశాల్యాన్ని కుదించి వేశారు. తను విస్తరించాలంటే అలాటి దర్శకుల్ని వదిలించుకోవాలి. ఎనిమిదేళ్లుగా విశాల్ తో పనిచేయాలని ఎదురుచూస్తున్న దర్శకుడు మిస్కిన్ బరి అవతలే వుండిపోవాల్సివచ్చింది. చివరికెలాగో  విశాల్ ని ‘తుప్పరి వాలన్’ (తెలుగు అర్ధం పత్తేదారు, ఇంగ్లీషులో డిటెక్టివ్)  కి ఒప్పించాడు. తుప్పరివాలన్ గా తనని చూసుకున్న విశాల్ కి కొత్త ఉత్సాహం వచ్చిందేమో, తనే నిర్మాణం చేపడుతూ నటించాడు. ఫలితం? సత్ఫలితమా, దుష్ఫలితమా? ఓసారి చూద్దాం...

కథ 
        ఒక పిడుగుపాటుతో ఆమె (సిమ్రాన్) భర్తనీ, కొడుకునీ కోల్పోతుంది. సినిమా కెళ్ళిన ఒక  పోలీసు అధికారి చీమ కుట్టినట్టయి తర్వాత చనిపోతాడు. నగరంలో అద్వైత భూషణ్ అలియాస్ ఆది (విశాల్) అనే ప్రైవేట్ డిటెక్టివ్ సరైన కేసులు రావడం లేదని బాధపడుతూంటాడు. వెంట ప్రసన్న అనే అసిస్టెంట్ వుంటాడు. ఒక పదేళ్ళ పిల్లవాడు వచ్చి తనకుక్క పిల్లని చంపిన వాణ్ణి  పట్టుకోవాలని బుల్లెట్ చూపించి ఏడుస్తాడు.  ఆది ఫీలై కేసు చేపడతాడు. పోలీసు వర్గాల్లో తనకున్న సంబంధాలతో ఆ బుల్లెట్ ని పరీక్షిస్తే,  అది పవర్ఫుల్ రివాల్వర్ నుంచి వెలువడిందనీ, దాంతో షూట్ చేస్తే బుల్లెట్ కుక్క పిల్ల శరీరంలోనే వుండిపోయే అవకాశం లేదనీ, అవతలకి దూసుకెళ్లి పోతుందనీ తేలుతుంది. బుల్లెట్ మీదున్న స్ట్రయేషన్స్ ని బట్టి చూస్తే  ఇది రికోషెట్ బుల్లెట్ అనీ, అంటే కుక్క పిల్లకి తగలడానికి ముందు ఏ గోడకో తగిలి, పరావర్తనం చెంది కుక్క పిల్లకి తగిలి వుండాలనీ, అందువల్ల వేగం తగ్గి కుక్కపిల్ల శరీరంలో వుండిపోయిందనీ చెప్తారు పోలీసులు. 

          అంటే ఎవరో మతి మాలిన వాడు కావాలని కుక్క పిల్లని చంపలేదనీ,  ఇంకెవరి మీదికో రివాల్వర్ ని  ప్రయోగించి వుండాలనీ అర్ధం జేసుకుని ఆది ఆ స్పాట్ లో గాలిస్తే,  ఒక వూడిపోయిన దంతం  దొరుకుంతుంది. దాంతో దర్యాప్తు చేస్తూ పోతే ఒక పుస్తకం దగ్గరికి దారి తీస్తుంది. ఆ పుస్తకం పిడిగుపాట్ల గురించి సైన్సు పుస్తకం. దరిమిలా ఇంకో ప్రమాదవశాత్తూ మరణం అది కళ్ళముందే జరుగుతుంది. ఇది ప్రమాదం కాదనీ, లాఫింగ్ గ్యాస్ తో చంపారనీ తెలుసుకుని అప్రమత్తమ వుతాడు. మొదట పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తీ, తర్వాత చీమకుట్టినట్టయి చనిపోయిన పోలీసు అధికారీ, ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో  చనిపోయిన అతనూ,  ఒకే హంతకుడు  తెలివిగా జరిపించిన మరణాలని  తేలుతుంది ఆదికి. ఎవరీ హంతకుడు? ఎందుకు చంపుతున్నాడు? ఇంకెందర్ని చంపుతాడు? వాణ్ణి ఎలా పట్టుకోవాలి? ఇవీ ఆది ముందున్న ప్రశ్నలు. 

ఎలావుంది కథ 
       అచ్చమైన డిటెక్టివ్ కథ. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కథలు చదివి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు దర్శకుడు. హీరో పాత్రని ని షెర్లాక్ హోమ్స్ ని దృష్టిలో పెట్టుకునీ, అతడి అసిస్టెంట్ పాత్రని  షెర్లాక్ నేస్తం డాక్టర్ వాట్సన్ ని దృష్టిలో పెట్టుకునీ తీర్చి దిద్దానన్నాడు. కానీ అలా అన్పించదు. పూర్తిగా ఒకప్పటి ఎడ్గార్ వాలెస్, జాన్ క్రీసీ  నవలల్లోని వాతావరణంతో, ఆ సరళిలో వుండే కథనంతో, పాత్రల చిత్రణతో కన్పిస్తుందీ కథ. అదే సమయంలో హాంకాంగ్ మూవీ ‘యాక్సిడెంట్’ (2014) లోని కథ ఇందులో కన్పిస్తుంది. అందులో ఒక గ్యాంగ్ కాంట్రాక్టు హత్యల్ని ప్రమాదాలుగానో, సహజ మరణాలుగానో సృష్టిస్తూ వుంటుంది. అందులో ఒకటి,  పిడుగుపాటుని సృష్టించి చంపడం. అయితే ఇది పూర్తిగా మాఫియా బాపతు యాక్షన్ జానర్ కథ. 

          దీన్ని ఎడ్గార్ వాలెస్, జాన్ క్రీసీ  ల సరళిలో అచ్చమైన డిటెక్టివ్ జానర్ లోకి మార్చడంలోని  దర్శకుడి సృజనాత్మకత మాత్రమే ఆకర్షిస్తుంది, కథ ఐడియాకి  హాంకాంగ్ మూవీ స్ఫూర్తి అనేది అప్రస్తుతమైపోతుంది. కథనే  వున్నదున్నట్టు, హాంకాంగ్ మూవీలోంచి సంగ్రహించి తీసి వుంటే  అదివేరు; వాలెస్, క్రీసీల డిటెక్టివ్ జానర్లోకి మార్చడం పూర్తిగా వేరు. హాలీవుడ్ లో కొన్ని ఫిలిం నోయర్, నియో నోయర్  మూవీస్ ని 1930 లనాటి డషెల్ హమెట్ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల ప్రభావంతో తీసినట్టు, ప్రస్తుత దర్శకుడు అలాటి సాంప్రదాయాన్ని ఫాలో అవడంతో ఇదొక విశిష్ట రూపాన్ని పొందింది. 

ఎవరెలా చేశారు 
         విశాల్ కి  పాత్ర, దీంతో నటన విభిన్నమైనవి. విచిత్రంగా బిహేవ్ చేస్తూ, ఎప్పుడేమని అరుస్తాడో,  సడెన్ గా ఎప్పుడేం చేస్తాడో అర్ధంగాని పాత్ర. మళ్ళీ తన లోకంలో తానుండిపోతూ ప్రపంచాన్ని పట్టించుకోడు. ఒకవైపు కేసుల్లేక బాధపడతాడు. మరోవైపు బ్లాంక్ చెక్ ఇస్తాను, పారిపోయిన నా కూతుర్ని వెతికి పెట్టమని ఒకడొస్తే లేచి బయటి కెళ్ళి పోతాడు. ఎందుకంటే, ఆ కూతురు ఇంటికి రాకపోతేనే స్వేచ్ఛగా వుంటుందని. మళ్ళీ పదేళ్ళ పిల్లాడు కుక్క పిల్లని చంపారని వస్తే, కరిగిపోయి కేసు తీసుకుంటాడు. ఈ కేసు రాను రాను పెద్దదైపోయి పైసా రాకపోయినా పాటుపడతాడు. 

          షెర్లాక్ హోమ్స్  కి వ్యక్తిత్వ లోపాలుండవు. అపరిమిత వూహాశక్తి గలవాడు, కుశాగ్ర బుద్ధి. ఓ చిన్న విషయం వెనుక ఏఏ కారణాలుండవచ్చో పేజీలకి పేజీలు చెప్పేస్తాడు. విశాల్ పాత్రకి షెర్లాక్ హోమ్స్ నుంచి ఈ టాలెంట్ ని  మాత్రమే తీసుకున్నారు. ఉదాహరణకి హీరోయిన్
ని చూసి - నీ పేరెంట్స్ చనిపోయారు. నువ్వు నీ మేనమామ దగ్గర వుంటున్నావు, మేనమామకి ఇస్త్రీ షాపుంది, నువ్వు వేసుకున్న డ్రెస్ నీది కాదు... ఇలా చూడగానే అనేస్తూంటాడు. ఇదే ధోరణి అనేక సందర్భాల్లో కొనసాగి పాత కాలపు డిటెక్టివ్ పాత్రల్ని గుర్తుకు తెస్తాడు. ఇంత కుశాగ్రబుద్ధి అతనెలా అయ్యాడో, అసలీ వృత్తిలోకి ఎలా వచ్చాడో పాత్ర పరిచయం వుండదు. 

        1968 లో విడుదలైన ‘ది డిటెక్టివ్’ అనే ఫ్రాంక్ సినాట్రా నటించి
న థ్రిల్లర్ లో, పాత్ర కూడా చాలా రఫ్ గానూ, పోలీసు భాష మాట్లాడుతూ మొండిగానూ వుంటుంది. కేసుతీసు
కునే వరకే సెంటిమెంటు, తర్వాత ఏ సెంటిమెం
టూ లేకుండా దర్యాప్తులో వ్యక్తులతో వ్యవహరిస్తాడు. అచ్చం ఈ కోవలోనే విశాల్ పాత్ర వుంది తప్ప, షెర్లాక్ హోమ్స్ తో సంబంధంలేదు. 

          ఒక స్టార్ కిది చిన్నస్థాయి కథ. కానీ ఒక స్టార్ చిన్న స్థాయి కథలో నటించడం వల్ల దాన్ని ఏ స్థాయికి తీసికెళ్ళ గలడో, నటుడిగా తాను కూడా స్థాయికి చేరుకోగలడో నిరూపించాడు  విశాల్.  ఇందులో మూడు యాక్షన్ సీన్లున్నాయి. పాడుబడ్డ గృహంలో రఫ్ గ్యాంగుతో, రెస్టారెంట్ లో చైనీస్ గ్యాంగ్ తో, క్లయిమాక్స్ లో విలన్ తో- ఇవన్నీకొత్తగానూ,  కళాత్మకంగానూ  వుండడం ఒక ప్రత్యేకత. అయితే డిటెక్టివ్ గా వేషధారణ సరీగ్గా కుదర్లేదు. ఐతే ఈ పాత్రతో మాస్ హీరో కాస్తా క్లాస్ హీరో అయ్యాడు. 

       కొత్త హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో జేబుదొంగగా నటించింది. ఆ పని మాన్పించి తన ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుంటాడు హీరో. ఆమె మీద ఎప్పుడు అరుస్తాడో తెలీక భయంభయంగా గడిపే పాత్ర. చివరికి అతను ప్రేమలో పడినా, ఆ ప్రేమ ఆమెకి దక్కదు.

          డిటెక్టివ్ అసిస్టెంట్ పాత్రలో ప్రసన్న కన్పిస్తాడు. కానీ దీనికి డాక్టర్ వాట్సన్ పాత్రతో సంబంధం లేదు. విలన్ గా  నటించిన వినయ్ రాయ్ విలనీ అంతా వాలెస్, క్రీజీ ల శైలిలో వుంటుంది. డెవిల్స్ గ్యాంగ్ అనే పేరుకూడా వాలెస్, క్రీసీల నవలల్లో కన్పించే పేరులాంటిదే. ఈ గ్యాంగ్ ఇంకా సాహిత్యంలో, సినిమాల్లో మాఫియా రాక ముందటి చిత్రణ. నీటుగా, కూల్ గా వుంటూ ఎక్కువ మాట్లాడుకోరు. ఆధునిక పద్ధతుల్లో, ఒక్కోసారి సైన్సు నుపయోగించీ సైలెంట్ గా నేరాలు చేస్తూంటారు. 
\
       వినయ్ ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ టెర్రిఫిక్ గా నటించాడు. అతడి అసిస్టెంట్ పాత్రలో ఆండ్రియా జెర్మియా డిటో. గ్యాంగ్ మెంబర్ గా భాగ్యరాజా ఓకే. సినిమా ప్రారంభ సీన్లో, మళ్ళీ ఫస్టాఫ్ ముగింపు సీన్లో కన్పించే సిమ్రాన్ కూడా టెర్రిఫిక్ గా వుంది. 

          కెమెరా వర్క్, బిజిఎం, సెట్స్ డిజైనింగ్, ఎన్నుకున్న లొకేషన్స్, నైట్ సీన్స్ సమస్తం కళాత్మకంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. కథకి  తగ్గ స్టయిల్ నీ, మూడ్ నీ క్రియేట్ చేయ డం వేరే కసరత్తు. దీనికి రిఫరెన్స్ అయినా వుండాలి, సొంత నైపుణ్య మైనా వుండాలి. 

చివరికేమిటి 
      ‘పిశాచి’ దర్శకుడు మిస్కిన్ ఈ ‘డిటెక్టివ్’ తీశాడు. కార్తీక్ సుబ్బరాజు లాగే తనదీ ప్రత్యేక విజన్, దానికి రిఫరెన్సులు. నిజానికి మాఫియా పాత్రలు, కథలు అలవాటయ్యాక, అంతకి ముందటి ఇంటలెక్చువల్ థ్రిల్లర్స్ ని  కోల్పోయాం. మర్డర్స్ అంటే కాల్చో, నరికో చంపే సంస్కృతిలోకి సినిమాలు మారేక, మెదడుకి పదునుబెట్టే నేరాల ప్రక్రియల్ని చిత్రీకరించడం  అరుదై పోయింది. నేర ప్రపంచం ఇంకా చాలా వుంది. సినిమాలు ఒకే  హింసని,  రక్తపాతాన్నీ  పట్టుకుని వుంటున్నాయి. డిటెక్టివ్ లో ద్విపార్శ్వ దర్శన మౌతుంది. చంపడంలో హింస వుంటే వుండొచ్చు, ఆ చంపే విధానం మీదే మన దృష్టంతా కేంద్రీకృతమవుతుంది – హింస కంటే, దాని విధానమే కట్టి పడేస్తుంది. పిడుగుపాటుని సృష్టించి చంపడం, రైసిన్ తో చీమ కుట్టినట్టు చేసి చంపడం, లాఫింగ్ గ్యాస్ తో నవ్వించీ నవ్వించీ రోడ్డు ప్రమాదం జరిపించి చంపడం లాంటి నేరాలు ఆలోచనలో పడేస్తాయి.  

          ఈ డిటెక్టివ్ కథ దాని జానర్ మర్యాదని గౌరవిస్తూ పూర్తిగా లాజిక్ కి పట్టం గడుతుంది. లాజిక్ లేని చిత్రీకరణ ఎక్కడా కన్పించదు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో కూడుకుని వుంటుంది. పోలీసులు, డిటెక్టివ్ లు లాజికల్ గానే అలోచించి,  లాజికల్ గానే పని చేసుకుపోతారు. చాలా సినిమాల్లో చూపించినట్టు లాజిక్ ని ఎగేసి పనిచేస్తే ఉద్యోగాలు పోతాయి. ఈ మూవీలో ఒక్క డైలాగు మిస్ చేసుకున్నా, ఒక్క సీను సరిగా చూడకపోయినా, ఆ తర్వాత అర్ధంగాని ప్రమాదం వుంటుంది. డ్రమెటిక్ కంటిన్యుటీ కోల్పోతాం.

          ఓ పది నిమిషాల్లో పిల్లాడి కేసుతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేసేస్తారు. దీనికి ముందు హీరోకి తెలియని రెండు ప్రమాదవశాత్తూ జరిగిన మరణాల్ని చూపిస్తారు. పిల్లాడి కేసుతో హీరో మిడిల్ విభాగంలో ప్రవేశించి సమస్య (కేసు)తో సంఘర్షిస్తూ, గోల్ కోసం (కుక్కపిల్లని చంపిందెవరు?) ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నప్పుడు ఒక సందేహం వస్తుంది  - ఈ కథ ఎండ్ సస్పెన్స్ కథగా మారుతుందా అని. డిటెక్టివ్ కథలు నవలా రూపంలో ఇలాగే  వుంటాయి. చిట్ట చివరికి గానీ డిటెక్టివ్ కి, పాఠకులకీ హంతకుడు తెలియడు. ఇలా సినిమాలో కొనసాగితే ప్రేక్షకులు అంత సేపూ భరించలేరు. విలన్ కీ   హీరోకీ మధ్య పోరాటం మొదలవాల్సిందే. అదీ ఇంటర్వెల్ లోపు. 

       సస్పెన్స్ లో రెండు ప్రశ్నలుంటాయి : ఎవరు? ఎందుకు? అని. ఈ రెండూ దాచిపెట్టి కథ నడిపిస్తే ఎండ్ సస్పెన్స్ అవుతుంది. అంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎండ్ లో మాత్రమే తెలుస్తాయన్న  మాట. అంతవరకూ పాత్రతో ఏక పక్ష కథనమే వుంటూ భరించలేరు.  ప్రస్తుత  డిటెక్టివ్ కి ఇదే జరుగుతోందా అన్నసందేహం వస్తుంది. పరిశోధన చేస్తున్నాడు. గంట గడుస్తున్నా హంతకుడెవరో, ఎందుకు చంపుతున్నాడో తెలీడం లేదు. నవలలా సినిమా వుండబోతే విశాల్ అట్టర్ ఫ్లాప్!

          కానీ అదే 60 వ నిమిషంలో, ఇంటర్వెల్ లోపు  సినిమా రూపమే అంటూ స్పష్ట మైపోతుంది. విలన్,  అతడి గ్యాంగ్ ఓపెనైపోతారు. విలన్ కరెంటు రంపంతో ఒక శవాన్ని కోస్తూంటాడు కూడా. దీంతో మనలోని సగటు ప్రేక్షకుడి బుద్ధి సంతృప్తి పడుతుంది. ఎవరు? అనేది తెలిసిపోయింది. ఇక ఎందుకు? (ఎందుకు హత్యలు చేస్తున్నాడు) అన్నది రివీల్ అవ్వాలి. దీన్ని చివరి వరకూ ఆపినా నష్టం లేదు. రెండు ప్రశ్నలూ ఆపెస్తేనే  ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఒకటి ఓపెన్ చేసేసి నడిపిస్తే సీన్ టు సీన్ సస్పెన్స్ అవుతుంది. ఈ విలన్ అప్పుడే హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకి తెలిస్తే, హీరో ఎలా తెలుసుకుంటాడా అన్న సస్పన్స్ తో కూడిన కథనం ముందుకు లాక్కెళ్తుంది. 

          పది నిమిషల తర్వాత,  ఇంటర్వెల్ కొచ్చేసరికి హీరో ప్రారంభంలో మొదటి రెండు మరణాల రహస్యం తెలుసుకుంటాడు. ఇదే సమయంలో విల తన పార్టనర్ మీద ఇంకో దడి జరిపిస్తాడు. ఫస్టాఫ్ లో రెండు మరణాల మిస్టరీ ఇంటర్వెల్ కల్లా తేల్చేయడం మంచి కథనం. అదే సమయంలో ఇంటర్వెల్ మళ్ళీ విలన్ చేసే ఇంకో ఎటాక్ తో కథ తెగిపోకుండా, సెకండాఫ్ కి సన్నద్ధం చేయడం. 

          సాధారణంగా ఇటువంటి సినిమాల్లో మొదటి రెండు మరణాల రహ్యసం, అ మాటకొస్తే మొత్తం కథలో జరిగిన సంఘటనల వివరణ కార్యకారణ సంబంధం సహా వివరిస్తూ ముగింపులో బోలెడు చెప్తాడు హీరో. ఇది నవలా పద్దతి. సినిమాలో మళ్ళీ ఆడియెన్స్ మొదట్నించీ అన్నీ గుర్తు చేసుకుంటూ హీరో ఇచ్చే వివరణలతో కనెక్ట్ అవడం బోరుకొట్టే బిజినెస్. అందుకని ఎప్పటికప్పుడు తేల్చెయ్యాలి. అందుకే ఫస్టాఫ్ మరణాల రహస్యాన్ని ఫస్టాఫ్ లోనే ఇంటర్వెల్ లో విప్పేశారు.

          సెకండాఫ్ కథ ఎజెండా విలన్ తన బిజినెస్ కి అడ్డుగా వున్నాడని హీరోని చంపే ప్రయత్నాలు చేయడం. హీరో తప్పించుకుంటే అసిస్టెంట్ ని, అసిస్టెంట్ బయటపడితే, హీరోయిన్ ని...ఇలా యాక్షన్ లోకి దిగుతుంది కథ. క్లయిమాక్స్ లో హీరో విలన్ల ముఖాముఖీ. ఇంతే మూడంకాల స్ట్రక్చర్.  

          అన్ని కోణాల్లో సమగ్రంగా వుండే థ్రిల్లర్స్ తీయడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైనా కూడా ఇంకేవో చాపల్యాలతో చెడగొడతారు. ప్రొఫెషనల్ పాత్రలకి ప్రొఫెషనలిజంతో కూడిన కథ చేస్తేనే ఆ పాత్రలకీ, థ్రిల్లర్ కీ న్యాయం చేసినట్టు; తద్వారా  బాక్సాఫీసు దగ్గర బావుకున్నట్టు.

-సికిందర్

          





Thursday, November 9, 2017

542 : రివ్యూ!





రచన – దర్శకత్వం : అట్లీ
తారాగణం: విజయ్ ( త్రిపతరాభినయం)  మంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, డివేలు, ఎస్జెసూర్య, త్యరాజ్, వడివేలు  దితరులు
సంగీతం: ఏఆర్‌.రెహమాన్. ఛాయాగ్రణం: జి.కె.విష్ణు
బ్యానర్స్
: తెన్నాండాళ్ స్టూడియోస్ లిమిటెడ్, నార్త్స్టార్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: ఎన్‌.రామస్వామి, హేమరుక్మిణి
విడుదల : నవంబర్ 9 2017
***
         
నెలరోజులుగా విడదల వాయిదాలు పడుతూ చివరికి విడుదలైన విజయ్ – అట్లీ ల కాంబినేషన్ లో ఈ తెలుగు డబ్బింగ్ రెండో ఎంట్రీ. గత సంవత్సరం ఇద్దరూ ‘పోలీస్’ అనే థ్రిల్లర్ తో వచ్చారు. ఈ సారి సామాజిక సమస్య తీసుకుని వస్తూ, వివాదం కూడా రేపారు. దీంతో తెలుగు డబ్బింగ్ లో వివాద కారణమైన జీఎస్టీ మీద విసుర్లు సెన్సారై పోయాయి. అయితే ఆ విసుర్లేమిటో మనకి తెలిసిందే గనుక, మిగతా విషయం ఎలావుందో చూద్దాం...

కథ 
      డాక్టర్ భార్గవ్ (విజయ్) ఓ అయిదు రూపాయల డాక్టర్. వైద్యం చవకగా అందించాలన్న తన తండ్రి ఆశయాన్నిఆచరిస్తూ, వైద్యుల అవినీతి మీద పోరాటం చేస్తూంటాడు. విజయ్ (విజయ్ -2) ఒక మెజీషియన్. ఇతను కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. భార్గవ్ తారా (సమంత) అనే యాంకర్ ని ప్రేమిస్తూంటే, విజయ్ పల్లవి (కాజల్) అనే డాక్టర్ ని ప్రేమిస్తూంటాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు. డానీ (ఎస్ జే సూర్య),   అర్జున్ (హరీష్ పరాడే) అనే ఇద్దర్లు చెడ్డ డాక్టర్లు వుంటారు. వీళ్ళ మీద పగదీర్చుకోవడానికి అన్నదమ్ములిద్దరూ స్థానాలు  మార్చుకుంటూ పోలీస్ అధికారి (సత్య రాజ్)  ని ముప్పుతిప్పలు పెడుతూంటారు. అసలు గతంలో ఏం జరిగింది,  అందులో చెడ్డ డాక్టర్ల పాత్రేమిటి, వీళ్ళ మీద అన్నదమ్ములు పగ ఎలా తీర్చుకోగలిగారు...అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       పూర్తిగా మాస్. సామాజిక సమస్యలతో శంకర్ తీసే సినిమాల తీరు తెన్నులకి ఇంకాస్తా దట్టించిన మసాలా. కాకపోతే వైద్య రంగంలో అవినీతి మీద పోరాటం. దీన్ని కథానాయకుల కుటుంబానికి జరిగిన అన్యాయం నేపధ్యంగా చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల మీద గతంలో సినిమా లొచ్చాయి. కొత్తగా మళ్ళీ చెప్పడానికి సింగపూర్ ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్యం డిమాండ్ ని ముందుకు తెచ్చారు. సింగపూర్ లో ఏడు శాతం జీఎస్టీకి ఉచిత వైద్యమే గానీ, ఉచిత విద్య, ఉచిత గృహాలు, ఉచిత విద్యుత్, ఫించన్లు, రుణమాఫీలు, సబ్సిడీలు, రేషన్లు, ఆడపిల్లకి నిలువు బంగారాలు, పెళ్లి పిల్లకి షాదీ ముబారక్ లు, సబ్ ప్లాన్లు, కలర్ టీవీలు, లాప్ టాప్ లు  వంటి సవాలక్ష తాయిలాలతో ఓటు బ్యాంకులు తెరవడం లేదు. ప్రభుత్వం కూడా జీఎస్టీ మీద తగిన సమాచారంతో తమిళ వెర్షన్ రేపిన వివాదాన్ని ఎదుర్కోక సినిమా గొంతు నొక్కాలని చూసింది. నొక్కితే సినిమా చెప్పిందే నిజమనుకుంటారు ప్రజలు. తమిళ డైలాగుల్లో జీఎస్టీని అలాగే వుంచి, తెలుగులో తీసేస్తే, దేశవ్యాప్తంగా ఒకే జీఎస్టీని అమలు చేస్తున్నామని కూడా ఎలా చెప్పుకుంటారో తెలీదు. తెలుగులో జీఎస్టీ డైలాగులు మ్యూట్ చేసినా, మఫ్టీలో వున్న ‘గోరఖ్ పూర్’ పరోక్ష ప్రస్తావన జోలికి పోలేదు. అంబులెన్స్ ఇవ్వక  పేదలు మైళ్ళకి మైళ్ళు ఆస్పత్రుల  నుంచి శవాల్ని మోసుకు వెళ్తున్నఉదంతాల ప్రస్తావనకీ తెలుగులో కూడా కత్తెర పడలేదు. అలాగే మందిరం కాదు, మందిరం కట్టే స్థలంలో ఆస్పత్రి కట్టాలని ఆస్పత్రిని కట్టి చూపించే దృశ్యాల పట్ల కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. ఉచిత వైద్యం గురించి ఈ కథ ఇచ్చే సందేశం ఆలోచనాత్మకమే గానీ ఆచరణాత్మకం కాదు. ఐతే ఈ కాన్సెప్ట్ నంతా గజిబిజిగానో, నామమాత్రంగానో సినిమాకి వాడేసుకుని వదిలిపారెయ్యడంగా గాక, ఆద్యంతం సీరియస్ గానే పట్టించుకోవడం కమర్షియల్ కథకి సంతోషం కల్గించే విషయం.

ఎవరెలా చేశారు 
      మూడు పాత్రల్లో విజయ్ చేయాల్సిన మాస్ కమర్షియల్ హంగామా అంతా చేశాడు. డాక్టర్ గా, మెజీషియన్ గా, ఫ్లాష్ బ్యాక్ లో మల్లయుద్ధ వీరుడిగా ప్రేక్షకులకి ఏమేం కావాలో అవన్నీ అందించే
శాడు. గ్రామీణ వాతావరణంలో ఫ్లాష్ బ్యాక్ గ్రూప్ సాంగ్ లో విన్యాసాల్ని తారాస్థాయికి తీసికెళ్ళాడు. ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ అంతంతమాత్రమే. కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మూడో హీరోయిన్ నిత్యా మీనన్ తో రోమాన్స్ భిన్నం. దాని నిడివి కూడా ఎక్కువ. అయితే అన్నదమ్ముల పాత్రల్లో అన్నెవరో తమ్ముడెవరో గుర్తించడానికి  పెద్ద తేడా చూపలేదు. ఇద్దరూ చేసే ఫైట్స్ థ్రిల్లింగ్ గానే వున్నాయి. 

          హీరోయిన్లు కాజల్, సమంతా లకి పెద్దగా పాత్రల్లేవు. డాక్టర్ గా కాజల్ వైద్యమే చేయదు. యాంకర్ గా సమంత హీరోతో ఒక ఇంటర్వ్యూ చేసి చేతులు దులుపుకుంటుంది. నిత్యా మీనన్ ది మాత్రం వూళ్ళో భర్త (విజయ్ – 3) తో కలిసి పోరాటం చేసి,  మరణించే హోమ్లీగా వుండే  బరువైన పాత్ర. కమెడియన్ వడివేలు విజయ్ -1 తో వుండి, సీక్రెట్ ఆపరేషన్స్ లో సహకరిస్తూంటాడు. పోలీస్ అధికారిగా సత్య రాజ్ ది వేళాకోళం పాత్ర. ఇక విలన్ గా ఎస్ జే దూర్య మరోసారి ఖతర్నాక్ గా వుంటాడు. చివర్లో హీరోల చేతుల్లో తన్నులు తిన్నాక, అతను కనబర్చే పరిస్థితి, చూసే చూపులు అతడికే చెల్లు.

          మరోసారి అట్లీ తనబ్రాండ్ వెలుగు నీడల ఛాయాగ్రహణంతో రిచ్ మూడ్ తో చిత్రీకరణ చేశాడు ఈ కథని. కెమెరా మాన్ విష్ణు తీసిన కొన్ని షాట్స్ అనితరసాధ్యమైనవి. వూళ్ళో అగ్నిప్రమాద దృశ్యాల చిత్రణకి డౌన్ ప్లే చేసిన కలర్స్ తో క్లాసిక్ లుక్ తీసుకొచ్చాడు.

          ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం చాలా హోరుగా వుంది. ఒక థీమ్ లేదు. పాటలు కూడా ఒక్క ముక్క అర్ధం కావు. ఒక్క ముక్క అర్ధం గాక పోయినా ఫ్లాష్ బ్యాక్ గ్రామీణ గ్రూప్ సాంగొక్కటే  చెప్పుదగ్గ ట్యూనుతో వుంది. 

చివరికేమిటి 
        చెప్పుకోదగ్గది ఫ్లాస్ బ్యాక్ క్రియేషన్. సెకండాఫ్ లో సుదీర్ఘంగా సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పడంలో ఒక సృజనాత్మక ప్రయోగం. స్పష్టమైన బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో, సీన్లకి స్మూత్ ట్రాన్సిషన్స్ తో, ఫ్యామిలీ – పొలిటికల్ డ్రామాల కలబోతతో,  నీటుగా కన్పించే ఒక ఆల్బం లాంటిదనొచ్చు. ప్రారంభంలో ఒక సంబరాల పాటలోనే చాలా కథ చెప్పేస్తారు, కోరియోగ్రఫీ- మాంటేజెస్ ల జుగల్ బందీతో. మిగతా కథంతా ఒకెత్తు, ఈ ప్లాష్ బ్యాక్ అంతా ఇంకో అద్భుత లోకంలోకి తీసుకెళ్లడం ఒకెత్తు. ట్రాజడీతో ముగిసే ఈ ఫ్లాష్ బ్యాక్ కి మాస్టర్ స్ట్రోక్ లా, చీకట్లో  చెత్త కుప్పలో పారేసిన పసికందు ఆకాశంలోకి లేపే చెయ్యి వొక హెచ్చరిక.

          సుదీర్ఘమైన ఈ ఫ్లాష్ బ్యాక్ వల్లే సినిమా నిడివి పెరిగింది. అయినా ఈ ఫ్లాష్ బ్యాక్ బోరు కొట్టదు. దీని తర్వాత క్లయిమాక్స్ పన్నెండు నిమిషాల్లోనే పవర్ఫుల్ గా ముగిసిపోతుంది. 

          చెప్పొచ్చేదేమంటే, పచ్చి కమర్షియల్ మాస్ అయినా మీనింగ్ ఫుల్ గా తీయాలని. స్టార్ లకి ఇంకా మాసులు తీయడానికి కథల్లేవు. అవే మాసులు చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. జరుగుతున్న ఉదంతాలని మాస్ కి కలిపి  కొత్త వాసనలు చూపించడానికి మనస్కరిస్తే, ఈ ‘మెర్సల్’ లా మెరవొచ్చు .

సికిందర్
https://www.cinemabazaar.in






`


Wednesday, November 8, 2017

541 : స్క్రీన్ ప్లే సంగతులు





          మధ్య తెలుగు తమిళ భాషల్లో స్పైడర్, లై, సింగం -3, వివేకం అనే నాల్గు పోలీస్ – స్పై ఆపరేషన్లతో కూడిన థ్రిల్లర్లు వచ్చాయి. తెలుగులో తాజాగా వచ్చిన గరుడ వేగ తో కలుపుకుంటే ఐదు. ఈ ఐదింటిలో మొదటి నాల్గూ ఆకట్టుకోలేకపోయాయి. వివేకంతో గరుడ వేగకి దగ్గరి సంబంధముంది. అయితే వివేకంలో లేని ఏకసూత్రత గరుడ వేగలో కన్పిస్తుంది. అలాగే స్పైడర్ లో లేని హీరోయిజం గరుడ వేగ లో కన్పిస్తుంది. సింగం 3 లో కన్పించే టెక్నాలజీ దుర్వినియోగం గరుడ వేగలో కన్పించదు. లైలో మిస్సయిన సెంట్రల్ పాయింటు లోపం గరుడ వేగలో వుండదు. జాతీయ అంతర్జాతీయ సమస్యలపైన ఒక హై కాన్సెప్ట్ మూవీ తీయాలంటే – సింపుల్ గా ఒక సెంట్రల్ పాయింటు, దాంతో హీరోయిజమూ దానికి ఏకసూత్రతా వుండి, టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా వుంటే చాలని ఇందుమూలంగా తెలుసుకోవచ్చు. 

         
థ్రిల్లర్ కి కథనంలో వేగం ముఖ్యమనేది తెలిసిందే. ఏక సూత్రత వల్ల ఈ వేగం  వస్తుంది. గరుడవేగ  థ్రిల్లింగ్ కథనానికి ఏకసూత్రతే ఆధారం.  అయితే ఇదీ ఓ సమస్య బారిన పడింది. ఏకసూత్రతకి  సెకండాఫ్ సిండ్రోమ్ ఎదురయింది. ఫలితంగా ఫస్టాఫ్ స్పీడుని సెకండాఫ్ అందుకోలేకపోయింది. ఇదెలాగో చూద్దాం. ఈ వారం ‘ఇత్తెఫాఖ్’  అనే హిందీ థ్రిల్లర్ విడుదలైన సందర్భంగా, నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ సమస్య గురించే చెప్పుకొచ్చారు. థ్రిల్లర్ జానర్ ని హాలీవుడ్ బాగా ప్రోత్సహిస్తూంటే,   బాలీవుడ్ ఎందుకని వెనుకబడి పోతోందన్న ప్రశ్నకి జోహార్ జవాబు :  మనం కథలు చెప్పే తీరే వేరు కావడం,  మనం తీసేవి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కావడం,  థ్రిల్లర్ జానర్ ని దూరం పెట్టేలా చేస్తున్నాయి. మనం పాటలూ డాన్సులూ పెడతాం. సినిమాల్ని మ్యూజిక్ తో కలిపి చూసేందుకు అలవాటు పడ్డాం. ఇది థ్రిల్లర్ తో పొసగదు. థ్రిల్లర్ కి వూపిరి సలపని స్పీడు అవసరం. కనుక మన కల్చర్లో  పాటలూ డాన్సులూ కామెడీలూ ఫ్యామిలీ డ్రామాలూ మొదలైన కమర్షియల్ హంగులు త్యాగం చేసి ఈ రియల్ ఫార్మాట్ తో థ్రిల్లర్స్ ని తీయలేం గనుక వాటిని తక్కువగా  తీస్తూంటాం. మా ఇత్తెఫాఖ్ దర్శకుడు స్క్రిప్టు రాసుకొచ్చినప్పుడు ఇంటర్వెల్ రాయలేదు. థ్రిల్లర్ కి ఇంటర్వెల్ తో వచ్చే సమస్యేమిటంటే, అది సెకండాఫ్ ని బలహీన పర్చేస్తుంది. ఇంటర్వెల్ వరకూ కథని పైపైకి తీసి కెళ్ళి టెన్షన్ తో అపుతాం, ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ అదే  ఆపిన పాయింటు నుంచి టెన్షన్ ని ఎత్తుకుని కథని ఇంకా పైపైకి తీసి కెళ్ళాల్సి వుంటుంది. ఇది చేయలేకే మన సినిమాలు చాలా వరకూ సెకండాఫ్ సిండ్రోమ్ నెదుర్కొంటున్నాయి. ఇంటర్వెల్ కారణంగానే  పదింట ఎనిమిది సినిమాల సెకండాఫులు తేలిపోతున్నాయి. ప్రపంచంలో ఏ సినిమా స్కూలు కూడా ఇంటర్వెల్ ని ఎలా హేండిల్ చేయాలో చెప్పలేవు. మనమే కథల్ని మధ్యకి ఆపి ఇంటర్వెల్ వేసుకుంటున్నాం. ఆతర్వాత ఆపిన కథని లేపలేక చేతులెత్తేస్తున్నాం...

          ఇలా జోహార్ చెప్పిందాంట్లోనే సమస్యకి సమాధానముంది. ఆయన చెప్పిన సమస్యకూడా అవగాహనా రాహిత్యంతో తెచ్చుకున్నదే. మనమే కథని మధ్యకి ఆపి ఇంటర్వెల్ వేసుకోవడం వల్ల సెకండాఫ్ సిండ్రోమ్ ఎదురవుతోందనడం పచ్చి నిజం. కథని ఆపుకుంటే ఇంతే  జరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర కథని ఆపుకోమని ఎవరన్నారు? స్క్రీన్ ప్లే పండితులెవరూ అనలేదుగా? వెళ్తున్న రైలింజన్ ని ఆపేస్తే మళ్ళీ స్పీడందు కోవడానికి రెండుమైళ్ళు లాగాలి. ఇంటర్వెల్లో కథని ఆపుకున్నా ఇంతే.  ఇంటర్వెల్లో కథని ఆపుకుని  సమస్యని మనమే  సృష్టించుకుంటున్నాం. దీనికి ప్రపంచంలో ఎక్కడైనా  పరిష్కారం ఎవరు చెప్పగలరు. మందులేని రోగం తెచ్చుకుని డాక్టర్ కోసం తిరిగితే డాక్టర్లేం చేయగలరు. ప్రయాణంలో వున్న మోటార్ బైకుని ఆపకురా బాబూ అనే అంటారు. ఆపితే స్పీడందు కోవడానికి కొంత టైము పడుతుంది. ఈ టైములో గేర్లు మార్చుకుంటూ తంటాలు పడాలి. ఆపిన కథతో ఇంటర్వెల్ తర్వాత కూడా కథని మార్చుకుంటూ తంటాలు పడాల్సిందే.

ప్రేక్షకుల్ని ఆపుదాం
       ఇంటర్వెల్లో కథని ఆపితే దానికి మందు లేదనే,  హాలీవుడ్ లో ఇంటర్వెల్లో కథని ఆపరు, ప్రేక్షకుల్ని ఆపుతారు. ఇందుకు రివర్స్ లో దాదాపు ఇండియన్ మేకర్లంతా – ఇంటర్వెల్లో కథని అపడంవల్ల, ఆతర్వాత కథని ఎత్తుకోలేక చతికిల బడతారు. కథని ఆపడం వేరు, ప్రేక్షకుల్ని ఆపడం వేరు. 

          మనం ఇంటర్వెల్లో కథని ఆపడమంటే, ఇంటర్వెల్ ని  కథన దృష్టితో  చూస్తున్నా మన్నమాట. దీంతో ఇంటర్వెల్ దగ్గర కథతో ఏవో గిమ్మిక్కులు చేసి, బ్యాంగులిచ్చి (ఇంటర్వెల్ బ్యాంగ్ - పెట్టిన టికెట్టు  చిల్లర డబ్బులకి ఇదొక అడ్డగోలు డిమాండ్ అయిపోయింది ), కథని ఆపి ఇంటర్వెల్ ఇస్తున్నాం.

          వాళ్ళు (హాలీవుడ్)  ఇంటర్వెల్ ని పాత్ర దృష్టితో చూసి, కథని ఆపకుండా, కేవలం కథనుంచి కాస్త రిలీఫ్ కోసం ప్రేక్షకుల్ని ఆపి ఇంటర్వెల్ ఇస్తారు. కథని ఆపడం వేరు, ప్రేక్షకుల్ని ఆపడం వేరు. మనలాగా ఇంటర్వెల్ ని కథన దృష్టితో చూసి, ఇంటర్వెల్ దగ్గర కథని ఆపేస్తే,  ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ తో సరిసమానంగా ఆపిన కథని మళ్ళీ ఎలా ఎత్తుకోవాలో అర్ధంగాక చతికిలబడుతున్నారు. ఇలాకాక ఇంటర్వెల్ ని పాత్ర దృష్టితో వాళ్ళలాగా చూసినప్పుడు, ఇంటర్వెల్ దగ్గర కూడా కథ చలనంలో వుండి, ఇంటర్వెల్ తర్వాత ఆ కథకి కొనసాగింపే వుంటుంది తప్ప, వేరే దారులు వెతుక్కోనవసరం లేదు. దీన్ని బాగా గుర్తుంచుకోవాల్సి వుంటుంది. 

          ఒకప్పుడు వాళ్ళ  సినిమాలు గంటన్నరే వుండేవి. ఈ గంటన్నర నిడివి స్క్రిప్టులో ఇంటర్వెల్ సీనంటూ ఏమీ వుండదు. కేవలం సెకండ్ యాక్ట్ లో మిడిల్ ని రెండు గా విభజించి, మధ్యకి టెన్షన్ పెంచి వదిలేస్తారు. దాన్ని బట్టి సెకండాఫ్ మిడిల్ టూ రాస్తారు. వాళ్ళ  సినిమాలకి ఇంటర్వెల్లో విశ్రాంతి అనే అక్షరాలు పడవు. ముప్పావు గంటో, ఎంతో  గడిస్తే ఆపరేటరే ఆట ఆపేసి  విశ్రాంతినిస్తాడు ప్రేక్షకులకి. అది కథకి విశ్రాంతి నివ్వడం కాదు. ఒక్కో థియేటర్లో ఒక్కో టైములో విశ్రాంతి ఇస్తూంటారు ఆపరేటర్లు.  ఇప్పటికీ ‘డంకర్క్’ లాంటి రెండు గంటల భారీ సినిమాలకి కూడా విశ్రాంతి అంటూ బ్యాంగ్ తో అక్షరాలు పడవు. ఆట నడుస్తూండగా టైము చూసుకుని,  సడెన్ గా లైట్లు వేసి ఆటాపేస్తాడు ఆపరేటర్ మహాశయుడు. వాళ్ళ  సినిమాల్లో టైటిల్స్ తో మొదలెడితే మళ్ళీ చివర్లోనే  అక్షరాలు పడతాయి - ది ఎండ్ అని. 

          నవలల్లో ఇంటర్వెల్ వుంటుందా? నవలల్లో ఎత్తుపల్లాలతో కూడిన కథనం ఒక ప్రయాణ మెలాగో, వాళ్ళ  స్క్రీన్ ప్లేల్లోనూ ఇంతే. ఈ ప్రయాణం మధ్యలో ఆగదు. ముగిసేదాకా కథ ప్రయాణంలోనే వుంటుంది. ప్రేక్షకులకి కాస్త రిలీఫ్ కోసం, కేంటీన్ వాళ్ళ  జీవనం కోసం దయతల్చి ఆపరేటర్ కాసేపు ఆపుకుంటాడు. వాళ్ళ  స్క్రీన్ ప్లేల్లో స్ట్రక్చర్ ప్రకారమే  ఎత్తుపల్లాలతో కూడిన సీన్లుంటాయి గానీ, వాటికీ నంబర్లు కూడా వేయరు. వాళ్ళ  స్క్రీన్ ప్లే లిటరరీ వర్క్. ఫుల్ స్టాప్, కామాలు; అక్షరాలకి నిర్ణీత పాయింటుతో ఫాంట్లు, స్పేసులు, మార్జిన్లు, మొదటిసారి పాత్ర ప్రవేశించినప్పుడు దాని పేరుకి పూర్తి కేపిటల్ లెటర్సూ...ఇలా అనేకానేక సాంకేతికాలు వొళ్ళు దగ్గర పెట్టుకుని పాటించాల్సిన  ప్యూర్ లిటరేచర్. లేకపోతే పరిశీలనార్హం కావు. వాళ్ళ  స్క్రీన్ ప్లే చదవడమంటే నవల చదవడం లాంటిదే.

          మనం కథని ఆపుకుని ఇంటర్వెల్ బ్యాంగంటూ ప్రత్యేక కసరత్తులు చేస్తాం. ఉన్న నవరసాలకి తోడూ ఇదింకో రసమైపోయింది. థియేటర్లోంచి ఎప్పటికప్పుడు సీన్ల తాలూకు లైవ్ అప్డేట్స్ తో కథని  బయటి ప్రపంచానికి అందించేసే గురుతర బాధ్యత మీదేసుకుని, ఒక రకంగా పైరసీకి పాల్పడే రివ్యూ రైటర్ కూడా, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని చోరీ చేసిన సమాచారాన్ని బయటికి చేరవేసేస్తాడు. ఒక పూట కూడా సినిమాని బతకనీయడు. బయట స్మార్ట్  ఫోన్లు పట్టుకుని క్షణం క్షణం లైవ్ అప్డేట్స్ కోసం ప్రాణాలుగ్గ బట్టుకుని  ఎదురుచూసే ప్రేక్షకులు – ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందట్రోయ్ - అని ఎగిరి గంతేసి టకటకా అడ్వాన్స్ బుకింగులు క్లిక్స్ చేసేస్తూంటారు. వెళ్తే గానీ తెలీదు, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక ఎండమావి అనీ, తర్వాత సెకండాఫ్ అంతా గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేని ఎడారి అనీ! రివ్యూ రైటర్ ఎండమావిని స్మగ్లింగ్ చేశాడనీ!

          ఇంటర్వెల్ అంటే కథని ఆపడంగాక కేవలం ప్రేక్షకుల్ని ఆపడంగా చెప్పుకున్నాక, సిడ్ ఫీల్డ్ ఇంకేమంటాడో చూద్దాం :  “An important scene in the middle of the script, often a reversal of fortune or revelation that changes the direction of the story.” అంటాడు. అంటే, స్క్రిప్టు మధ్యలో అదృష్టం తిరగబడ్డం, లేదా కథా గమనాన్ని మార్చే కొత్త విషయమేదో బయటపడ్డం అన్నమాట. 

          దర్శకుడు, రచయిత ఫ్రాంక్ డేనియల్ కూడా ఇలా అంటాడు : “Mid-Point or a  Major Reversal of fortune, making Main Character’s task even more difficult. May be a glimpse at the actual resolution of the picture, its mirror opposite.” అంటే అదృష్టం తీవ్రస్థాయిలో తిరగబడ్డమే. పైగా గోల్ కోసం హీరో చేసే ప్రయత్నం కనా కష్టమై  పోవడం. ముగింపు అనే దర్పణంలో చూస్తే నెగెటివ్ గా ఈ తిరగబడ్డ అదృష్టం, తన్నుకొచ్చిన అదృష్టంగా పాజిటివ్ గా కన్పించడం. 

          ఇంటర్వెల్ కి మిర్రర్ ఇమేజి సూత్రమని ఒకటుంది. దీని ప్రకారం- ఇంటర్వెల్లో హీరో దెబ్బతింటే, ముగింపులో దీని ప్రతిబింబం గెలుపుగా వుంటుంది. ఇంటర్వెల్ హీరో దెబ్బ తీస్తే, ముగింపులో దీని ప్రతిబింబం ఓటమిగా వుంటుంది. ఇంటర్వెల్లో హీరో సుడిగుండంలో పడితే ముగింపులో ఒడ్డున పడతాడు. ఇంటర్వెల్లో హీరో ఒడ్డున పడితే ముగింపులో సుడిగుండంలో మునిగిపోతాడు. పరస్పర వ్యతిరేకంగా వుంటాయి ప్రతిబింబాలు.

          అంతేగానీ, ఇంటర్వెల్లో దెబ్బ తీసిన హీరో, లేదా ఒడ్డున పడ్డ హీరో, ముగింపులో గెలవడం వుండదు, ఒడ్డున పడ్డం వుండదు. అలాగే ఇంటర్వెల్లో దెబ్బతిన్న హీరో, లేదా సుడిగుండంలో పడ్డ హీరో,  ముగింపులో ఓడిపోవడం వుండదు, సుడిగుండంలో పడ్డం వుండదు.  గరుడ వేగ ఏకసూత్రతా  పాలనకి ఇక్కడే ఎదురయ్యింది సమస్య. ఇక్కడే చికిత్స జరగాలి- ఇంటర్వెల్ ఘట్టంలో.

ఇదేం టీజర్ 
       గరుడ వేగ కథా ప్రారంభం డార్జిలింగ్ లో ఒక సుదీర్ఘ యాక్షన్ ఎపిసోడ్ తో వుంటుంది.  ఒక మైనర్ పాత్ర కంప్యూటర్ / శాటిలైట్  ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఏదో డేటాని మ్యానిపులేట్ చేస్తాడు. అతణ్ణి  ముగ్గురు మోటార్ సైకిలిస్టులు వెంటాడతారు. సినిమాకి ఓపెనింగ్ ఇమేజి లేదా టీజర్ అనేది ఆ సినిమా ఏ జానర్ లో,  ఏ ఇతివృత్తమో సంకేతాలిస్తుంది. ఇక్కడ ఈ మైనర్ పాత్ర చర్యలతో ఓపెనింగ్ ఇమేజి లేదా టీజర్ చూస్తే యాక్షన్ జానర్ లో టెర్రరిజం కథలా అన్పిస్తుంది. కానీ కాదు. తప్పుదోవ పట్టించారు. ఈ తప్పుదోవ పట్టించడం ఇంటర్వెల్ పై దాకా సాగింది. కనుక ప్రారంభమే ఈ టీజర్ ఒక స్పష్టత లేకుండా మభ్య పెట్టే టీజర్ గా  ఫెయిలైంది. ఓపెనింగ్ ఇమేజిగా టెర్రరిస్టులా అన్పిస్తున్న ఈ మైనర్ పాత్రతో యాక్షన్ ఎపిసోడ్ సాగదీసి సాగదీసి, అవే పట్టుకునే  ప్రయత్నాలని రిపీట్ చేసి రిపీట్ చేసి, సుమారు పది నిమిషాల వరకూ లాగడంలో విజ్ఞత కన్పించదు. ఈ ఎపిసోడ్  హీరో మీద వుంటే ప్రేక్షకుల్లో కలిగే ఉత్సాహం వేరు.  మైనర్ పాత్రకి ఇంత మైలేజీ ఇవ్వడంలో ఔచిత్యం కన్పించదు. ఈ మైనర్ పాత్రని విలన్ వెంటాడినా యాక్షన్  ప్రాముఖ్యాన్ని సంతరించుకునేది. ఇలా సినిమాకి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో వుండే హీరో మీద కాకుండా, విలన్ మీద కూడా కాకుండా, కేవలం మైనర్ పాత్రలతో అంత ఖర్చుతో ఓపెనింగ్ టీజర్ కి విలువేం వుంటుంది. సీను చేసేప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో వుంచుకోవాలిగా.

ఇలాగేనా ఈ ఫార్ములా 
           దీని తర్వాత, రాజశేఖర్ హీరో పాత్ర ప్రవేశిస్తుంది. అతను  భార్యతో కలిసి కౌన్సెలింగ్ చేసే అలీ ఆఫీసులో వుంటాడు. ఎన్ ఐ ఏ అధికారియైన భర్త ఇంటి పట్టున వుండడం లేదని ఆమె విడాకులకేసింది. కోర్టు  వీళ్ళిద్దరికీ కౌన్సెలింగ్ చేయమని అలీని నియమించింది. భర్తకున్న ఇబ్బందుల్ని ఆమె అస్సలు పట్టించుకోదు. చివరికి భర్తే లొంగి వస్తాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి సమయమంతా ఆమెకే  కేటాయిస్తానని మాటిస్తాడు.

        నిజానికి ఈ భార్యాభర్తల ట్రాకు కథకి అడ్డుపడే ట్రాకు. కారణం, ఇది జానర్ మర్యాదతో కలసిపోకుండా కామెడీగా వుండడం. వివేకంలో కూడా అజిత్ – కాజల్ భార్యాభర్తల మధ్య దృశ్యాలు అతి  మెలోడ్రామాతో, ఫాల్స్ డ్రామాతో  ఇబ్బంది పెట్టేలా వుంటాయి. పానకంలో పుడకలా ఈ దృశ్యాలు వచ్చినప్పుడల్లా తెలుగు థియేటర్లో  తమిళ ప్రేక్షకులే తల పట్టుకున్నారు. ఇది హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఫార్ములా. కానీ హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో యాక్షన్ లో వుండే హీరో పాత్రకి రక్తమాంసాలు అద్దడానికి ఎమోషనల్ ట్రాక్ పెడతారు. సాధారణంగా కథల్లో ఏ హీరో పాత్రకైనా అంతర్గత (ఎమోషనల్), బహిర్గత (ఫిజికల్) యాక్షన్ లుంటాయి. బహిర్గతంగా స్టోరీ గోల్ కోసం పోరాడుతూ, అంతర్గతంగావ్యక్తిగత సమస్యని ఎదుర్కొంటాడు. ‘శివ’ లో నాగార్జునకి బయట రఘువరన్ తో పోరాటం, ఇంట్లో వదినతో ఇబ్బంది లాంటిదన్నమాట. 

          ఈ ద్వంద్వాల పోషణతో పాత్రకో వ్యక్తిత్వం వస్తుంది. దాంతో సానుభూతి పొందుతుంది. అప్పుడే పాత్రని మనం పట్టించుకోగల్గుతాం. ఇలాకాకుండా, బహిర్గత సమస్యకున్న గాఢత్వం అంతర్గత సమస్యకి లేకుండా కామెడీ గా, వెటకారంగా  వుంటే, ఇదిగో ఇలా రాజశేఖర్ – పూజా పాత్రల గొడవలా జానర్ మర్యాదని దెబ్బతీస్తుంది. ఈ పాత్రల్ని మనం పట్టించుకోం. ఇలాటి సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించాలన్న ఆదుర్దా కొద్దీ ఇలా జానర్ ని కిచిడీ చేస్తారేమో. మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలిలా వుంటాయి కాబట్టే థ్రిల్లర్లు తీయలేమని  సరీగ్గానే చెప్పాడు జోహార్. హాలీవుడ్ యాక్షన్ హీరోల పాత్రలు కుటుంబంకోసం ప్రాణాలిస్తాయి. అలాటి గొప్ప పాత్రలున్న సినిమాలు  కొన్ని – డై హార్డ్ (బ్రూస్ విల్లీస్), కమెండో(ష్వార్జ్ నెగ్గర్), ట్రూ లైస్ (ష్వార్జ్ నెగ్గర్), టేకెన్ (లియాం నీసన్), లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బ్యారెల్స్ (జేసన్ ఫ్లెమింగ్) మొదలైనవి. రక్త మాంసాలతో వాళ్ళ  ద్వంద్వాల పోషణ వేరు.

          అసలు మన సినిమాల్లో హీరోకి అప్పుడే పెళ్ళీ పిల్లలూ అనే గొడవ బాక్సాఫీసు అప్పీల్ కాదనే  భయం వుండనే వుంది. హాలీవుడ్ వేరు. మన హీరో రోమాన్సు వెలగబెట్టాలి. పూర్వం ఇలాటి ఆపరేషన్స్ తో కూడిన  సినిమాల్లో హీరోయిన్ ని ప్రేమించే హీరోకి రోమాన్సే వుండేది. ఇది అప్పటి జేమ్స్ బాండ్ పాత్రనుంచి దిగుమతి అయింది. జేమ్స్ బాండ్ హీరోయిన్లతో ఆడుకునే అతిపెద్ద రోమాంటిక్ క్యారెక్టర్. ఇదే మనకి సరిపోతుంది- బాక్సాఫీస్ అప్పీల్ కీ, యూత్ అప్పీల్ కీ. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో వుండే ఫ్యామిలీ హీరోని దిగుమతి చేసుకుని పరువుతీయడంకాదు. వాళ్ళు యాక్షన్ పాత్రకి ఏ ఉద్దేశంతో ఫ్యామిలీ బాండింగ్ పెడతారో అర్ధం జేసుచేసుకోవాలి. శివ, అంకుశం చూసినా అర్ధమవుతుంది.  

          ఇక ఈ భార్యాభర్తల మధ్య భార్య ప్రోత్సహించే భావి భర్త పాత్రలో అవసరాల శ్రీనివాస్ వస్తాడు. ఈ ముగ్గురి మధ్య ఇంకో  కామెడీ. కానీ భర్త జాబ్ కి రిజైన్ చేసి తనని బాగా చూసుకుంటానని మాటిచ్చాక  భార్యకి ఇంకో ఆలోచనెందుకు? వీళ్ళ మధ్య ఇంకా ఓ ఐదేళ్ళ కొడుకు! భార్యతో భర్తకి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణిగింది? రొటీన్ పాత ఫార్ములాగా క్లయిమాక్స్ లో విలన్ భార్యని ఎత్తుకెళ్ళి బంధించినప్పుడు ఆమె పీచమణిగింది! క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాల మధ్య ఈ భార్యాభర్తల కామెడీ గొడవతో ఇది కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చిన్న ఆశ కథకుడికి. ఇంకేం, ఫ్యామిలీ వుంది, చైల్డ్ సెంటిమెంట్ వుంది, కామెడీ వుంది, యాక్షన్ వుంది, ధాబా సాంగ్ తో, వేశ్యల కోలాహలంతో  మాస్ కూడా వుంది....జోహార్ భయపడే వన్నీ వున్నాయి ఈ మేజర్ థ్రిల్లర్ లో – ఒక్క అవసరమైన రోమాన్సు తప్ప!

ఇలాగేనా విజువల్ మీడియా 
      హీరోకి భార్యతో కౌన్సెలింగ్ సీను అయిపోయాక యాక్షన్ లోకి దిగుతుంది కథ. హీరో కారుకి ఒక చిన్న యాక్సిడెంట్ తో ప్రారంభమయ్యే యాక్షన్ ఎపిసోడ్లు, ఓపెనింగ్ టీజర్ తో అభిప్రాయం కల్గించినట్టు, టెర్రరిజం కథలానే అన్పిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ముస్లిం ఉగ్రవాద పాత్రలే.  కానీ ఇది ఉగ్రవాద కథ కాదు, మైనింగ్ మాఫియా కథ. ఇది సెకండాఫ్ లో మనకి తెలుస్తుంది. ఆ మాఫియాకి వేరే సాఫిస్టికేటెడ్ గ్యాంగ్ వుంటారు. ఆ మాఫియా ఫస్టాఫ్ లో చేపట్టిన కుట్రకి ఆ గ్యాంగునే ఉపయోగించుకోవాలి. ఉగ్రవాద పాత్ర లెందు కొస్తాయి. మాఫియా  కథల్లో ఉగ్రవాదులు, ఉగ్రవాద కథలో మఫియాలూ వుంటారా? బాలీవుడ్ లో ఇలా జానర్ మర్యాద తప్పి తీశారా? అసలు ఫస్టాఫ్ అంతా ఇది టెర్రరిజం కథ అని ప్రేక్షకులకి అన్పించాలని దర్శకుడు భావించడం లోని ఉద్దేశం ఏమిటి? 

          ఒకటే కారణం. చెప్పాలనుకున్న మైనింగ్ మాఫియా కథని ఎండ్ సస్పెన్స్ కథగా చెప్పడం. సెకండాఫ్ లో ఆ మైనర్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడే  కథలోని సెంట్రల్ పాయింటు రివీల్ అవుతుంది. అంతవరకూ ఇది మైనింగ్ మాఫియా కథ అని ఆడియెన్స్ పసిగట్టకుండా సస్పెన్స్ లో వుంచాలనుకున్నారు. దీంతో మూడు జరిగాయి : కథ ఎండ్ సస్పెన్స్ బారిన పడ్డం, దీంతో విజువల్ మీడియా బేసిక్ రూలు చెడడం, ఫస్టాఫ్ లో మాఫియా పాత్రల బదులు అసహజంగా ఉగ్రవాద పాత్రల్ని చూపించడం. దీంతో ఆ మత వర్గం మీద ఏదైనా కోపం వుంటే అది కూడా తీర్చుకోవడానికి పనికొచ్చింది - ఉగ్రవాదుల్ని  వ్యానులో పడేసి టోకున కాల్చి చంపేసి ఓల్డ్ సిటీలో!  తెలియక చాలా అర్ధాలు వచ్చేలా చేసుకున్నాడు కథకుడు. 

          విజువల్ మీడియా అయిన సినిమాకి, సినిమా కొచ్చి కథని దాచకూడదన్న బేసిక్ రూలుంది. మహా అయితే ఇంటర్వెల్ దాకా దాచుకోవచ్చు. సెకండాఫ్ మధ్య వరకో, ఇంకా చివరి దాకో దాస్తామంటే విజువల్ మీడియాకి వర్కౌట్ కాదు. ఎండ్ సస్పెన్స్ పనికి రాదు. దీని గురించి ఇదివరకే చాలాసార్లు వివరించుకున్నాం. 

          ఇక ఉగ్రవాదులు ఎందుకు బాంబు దాడి చేస్తున్నారనేదానికి ఇంకో  మసిపూసి  ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించారు. ఓల్డ్ సిటీలో ప్రతాపరెడ్డి అనే రాజకీయనాయకుడు ర్యాలీ నిర్వహిస్తున్నాడు. అతణ్ణి టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. ఎందుకు? ఎందుకనే దానికి జెండాలు చూపించారు. అవి కాషాయానికీ  ఎరుపుకీ మధ్య వుంటాయి. అంటే పూర్తిగా ఇక్కడ మత కోణాన్ని చూపించి ఉగ్రవాద పాత్రల్ని  జస్టిఫై చేశారన్న మాట, మభ్య పెట్టారన్న మాట. 

          సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథలోకి వెళ్తే,  ఫస్టాఫ్ లో మభ్య పెట్టిందంతా తెలుస్తుంది. మైనింగ్ మాఫియా అనుయాయుల్లో ప్రతాపరెడ్డి కూడా ఒకడు. అతడితో తేడా వచ్చి
చంపాలనుకుంటే ఇంటికెళ్ళి ఓ గుండు పేలిస్తే చాలు. మాఫియా కథలో మతకోణంలో ఉగ్రవాదులతో  బాంబు దాడి హంగామా అంతా  ఎందుకు? అప్పుడు ఫస్టాఫ్ లో చూపించిన కథంతా డొల్ల అన్నట్టే కదా? కథని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ దగ్గర్నుంచి పెట్టుకుంటే సరిపోతుంది కదా? ఓ గంట నిడివితో తీస్తే సరిపోయే కథని, బోలెడు బడ్జెట్ ధారబోసి రెండుగంటల పైగా తీయాల్సిన అవసరం తప్పుతుంది కదా? మూలంలోకి వెళ్తే ఈ నిజాలే వుంటాయి.  

         సినిమాని సినిమాలాగా చూడాలనడం అర్ధంలేని మాట. సినిమాని సినిమాలాగా చూడ్డమంటే ఏంటో ఎవరూ చెప్పలేరు పైగా. సినిమాకి మూలమయ్యే కథని కూడా కథలాగా చూడకూడదనేనా? మరెందుకు  నూటికి తొంభై సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి?  కథ కథలాగా లేకపోవడం వల్లేనా? లేకపోతే మరెందుకు? కథని కూడా కథలాగా చూడకూడదా?  మేస్త్రీ అడ్డగోలుగా కట్టేసిపోతే ఆ ఇంటిని ఇల్లులాగా చూడవచ్చా? సినిమాలెలా తీసి చూపించినా కళ్ళప్పగించి  చూసెయ్యాలా? సినిమా నిరక్షరాస్యులమని అన్పించుకుని తిరగడం గొప్ప నాగరికతేమో! 


      
         ఒకటే వుంది -  అన్ని కళా ప్రక్రియల్లో మాస్ మీడియా ఆయిన సినిమాలకి సృజనాత్మక స్వేచ్చ తీసుకునే వీలెక్కువ. అలాగని మాసే కదాని నేలవిడిచి సాము చేస్తే చేసుకోవచ్చు. కానీ ఆ లాజిక్ ని ఎగేయడానిక్కూడా హద్దులున్నాయి. అలాగే  అసలుకే మభ్యపెట్టి ఎస్కేప్ అవచ్చులే అనుకుంటే బ్యాడ్ టేస్టు అవుతుంది. మాఫియా కథని సస్పెన్సులో వుంచాలని టెర్రరిజం కథలా నమ్మిస్తూ  నడపడం ఇలాంటిదే. 

          కాకపోతే సినిమా హిట్టయ్యింది. ఇందుకు అనుసరించిన విధానం ప్రేక్షకులని ఆలోచించనివ్వకుండా, ఫస్టాఫ్ లో ఓ ఐదు భారీ యాక్షన్ ఎపిసోడ్లని ఒకదాని వెంటొకటి శరవేగంగా నడపడం; టెన్షన్ ని పెంచుతూ కళ్ళప్పగించి చూసేలా చేయడం. ఐతే ఇంటర్వెల్ దగ్గర దొరికిపోయారు. ఇంకెంత మాత్రం మాయ చేయలేకుండా సంకెళ్ళు వేసుకున్నారు. 

          ఫస్టాఫ్ లో అసలు కథ దాచి ఇంకేదో కథతో మభ్యపెడుతున్నామని తెలియనివ్వ
కుండా చేయడానికి ఏకదాటి యాక్షన్ ఎపిసోడ్లు వేశారు.  మారుతీ దర్శకత్వంలో నానీ నటించిన ‘భలే భలే మగాడివోయ్’ లో పాత్ర  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని ఎగేస్తూ సాగిపోతుంది. అది పెద్ద హిట్టయ్యింది. దీని రహస్యం ప్రతీ పది నిమిషాలకోసారి నాని పాత్ర బ్యాంగు లిస్తూ పోవడం. ఎడ్డీ మర్ఫీ తో ‘బేవర్లీ హిల్స్ కాప్’  సిరీస్ సినిమాలు తీసిన నిర్మాత ఫువాద్ సయీద్,  ఆ సినిమాల్లో పది నిమిషాలకో బ్యాంగ్ వుండాలని పెట్టించేవాడు. అయితే కథ స్ట్రక్చర్ లోనే వుండేది.  నాని పాత్ర మాత్రం స్ట్రక్చర్ నే ఎగేస్తూ బ్యాంగులతో సక్సెస్ అయిపోయింది.

          అలాగని  సెకండాఫ్ లో అసలు కథని దాచడం కోసం ఫస్టాఫ్ లో వేరే ఫాల్స్ స్టోరీతో మభ్యపెట్ట డాలు గానీ, తప్పుదోవ పట్టించడాలూ గానీ  చేయలేదు. మొదలెట్టిన కథే ఓపెన్ గా సాంతం సాగుతుంది. గరుడవేగ ఫాస్ట్ యాక్షన్ తో ఎంత హిట్టయినా కథతో నిజాయితీ లేదు. పరిశుభ్రమైన కథనివ్వలేదు.

ఇంకా బిగినింగేనా 
        ఫస్టాఫ్ లో యాక్షన్ లోకి దిగుతూ, హీరో కారుకి ప్రమాదవశాత్తూ చిన్న యాక్సిడెంట్ చేసిన దుండగుల కోసం హీరో తన బృందంతో చేసే వేట ఎపిసోడ్ – ఒకణ్ణి అనుకోకుండా చంపెయ్యడంతో ముగుస్తుంది. అప్పుడొక ఎన్క్రిప్ట్ చేసిన సీక్రెట్ కోడ్ దొరుకుతుంది. దాన్ని హ్యాక్ చేస్తే  చార్మినార్ దగ్గర ప్లాన్ చేసిన బాంబు దాడి పథకం తెలుస్తుంది. సమయం మూడు గంటలే వుంది. ఈలోగా ఆ టెర్రరిస్టుల్ని కనిపెట్టి బాంబు దాడిని ఆపాలి, ప్రతాపరెడ్డిని కాపాడాలి. ఈ ఆపరేషన్ సమయం ముంచుకొస్తూ రకరకాల మలుపులు తిరుగుతూ ఉద్విగ్నభరితంగా  సాగుతుంది.  చివరి క్షణాల్లో  బాంబు ఎక్కడుందో కనుగొని. ఆ సమీపంలో టెర్రరిస్టుల్ని పట్టుకుని కాల్చిచంపేస్తారు. ఆ సందోహంలోంచి  పారిపోతూ కన్పిస్తాడు – సినిమా ప్రారంభంలో ఓపెనింగ్ టీజర్ లో కన్పించిన మైనర్ పాత్ర. అతణ్ణి ఛేజ్ చేసిచేసి హీరో పట్టుకోవడంతో-  ఒక విజయంతో ప్రేక్షకుల హర్షాధ్వానాల మధ్య ఇంటర్వెల్ పడుతుంది.

          ఇంతవరకూ ఇదంతా బిగినింగ్ విభాగమే. ఈ బిగినింగ్ కూడా ఇంటర్వెల్ కి పూర్తి  కాలేదు. ఎందుకంటే, కథేమిటో ఇప్పటికీ తెలీదు మనకీ, హీరోకీ. హీరో ఇంకా కథలోకి  ప్రవేశించనే లేదు. అంటే ఇంకా సెకండాఫ్ లో ఎక్కడో ఈ బిగినింగ్ ముగిసి, అప్పుడు కథేమిటో తెలిసి, ఆ హీరో చేపట్టాల్సిన అసలు సమస్యేమిటో  తెలిసి, గోల్ ఏర్పడితే గానీ ప్లాట్ పాయింట్ వన్ అనేది రాదన్నమాట. ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంట ముప్పావుగంట లోగా రావాల్సిన ప్లాట్ పాయింట్ వన్,  సాగదీసిన ఉపోద్ఘాతం (బిగినింగ్) వల్ల స్థానభ్రంశం చెందిందన్న మాట. స్ట్రక్చర్ చెదిరిపోయిందన్న మాట. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిందన్న మాట. అంతే గాకుండా, ఇదంతా ఎందుకు జరుగుతోందో హీరోకి కూడా తెలియకుండా మాఫియా కుట్ర ని దాచి పెట్టడం వల్ల,  ఎండ్ సస్పెన్స్ బాపతు విజువల్ మీడియాకి పనికి రాని కథగా తయారయ్యిందన్న మాట.

          ఫస్టాఫ్ స్ట్రక్చర్ లో వుండాల్సినవి :
          బిగినింగ్ విభాగం : 1. ఇతివృత్త పరిచయం, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు (గోల్) తో ప్లాట్ పాయింట్ వన్ రావడం.
          మిడిల్ వన్ విభాగం : 1. గోల్ కోసం సమస్యతో సంఘర్షణ, 2. వ్యతిరేక శక్తులతో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే, 3. పించ్ వన్ ఏర్పాటు : ఇంటర్వెల్ కి దారి తీసే మలుపు, 4. ఇంటర్వెల్ లో పరిస్థితి మరింత విషమించడం.
          ఇంకా వీటన్నిటి ఆధారంగా 1. ఎత్తు పల్లాల క్యారక్టర్ ఆర్క్ ఏర్పడడం, 2. దీంతో టైం అండ్ టెన్షన్ చాపం ఏర్పడ్డం.  

          ఈ మొత్తం 10 ఎలిమెంట్సూ లేవు. ఫస్టాఫ్ లో బిగినింగ్ విభాగం ఒకటే వుంది, అదికూడా స్పీల్ బెర్గ్ చెప్పినట్టు ఎంతకీ ముగియని బిగినింగ్. ఈ కాలంలో కథ చెప్పడం మర్చిపోవడం వల్ల బిగినింగే, అదికూడా ఎంతకీ ముగియని బిగినింగే కథ అనుకుంటున్నారని ఛలోక్తి విసిరాడు స్పీల్ బెర్గ్.

          ఈ బిగినింగ్ లో కూడా ఇతివృత్త మేమిటో చెప్పకుండా, ఉగ్రవాద కలరిచ్చి మభ్య పెట్టారు. పాత్రల పరిచయ విషయాని కొస్తే ఇటు వైపు హీరోతప్ప, అటు వైపు విలన్ ఉనికి ఏదీ? ఆటకి సిద్ధం చేసే బలాబలాల సమీకరణ ఏదీ? ఇతివృత్తాన్నే సెకండాఫ్ లో ఓపెన్ చేయడానికి దాచి పెట్టాక, ఇక దాని తాలూకు  సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన కూడా లేదు. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనే లేకపోయాక ఆ సమస్యా స్థాపనే లేదు, గోల్ లేదు, దీంతో ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగిసిందీ లేదు. ఇక మిడిల్ వన్ ఎక్కడ్నించి వస్తుంది ఫస్టాఫ్ లో? 

          క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ ఎలాగూ వుంటాయి- ఎందుకంటే ఫస్టాఫ్ లో చూపిస్తున్నది ఫాల్స్ స్టోరీ అయినా, దాని తాలూకు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ వున్నాయి కాబట్టి- మనంకూడా ఫాల్స్ అని తెలీక ఫాల్సుగా థ్రిల్లవుతూంటాం. ఫూల్స్ అవుతాం. 

          ఈ మొత్తం ఫస్టాఫ్ ఆటలో హీరో అరటి పండు అయిపోయాడు. ఎన్ ఐ ఏ ఆఫీసరుగా అతడికేమీ తెలీదు. ఏది ఎందుకు జరుగుతోందో ఏమీ తెలీదు. ప్రతీసారీ ఏదో జరుగుతూంటే దాన్ని పట్టుకుని యాక్షన్లోకి దిగుతున్నాడు – సరే, ఇలా చేసినా కూడా ఆ మైనింగ్ మాఫియా ఎవరో, వాళ్ళ కుట్రేమిటో ఇంటర్వెల్లో నైనా షాకింగ్ గా తనే తెలుసుకుని, ప్రేక్షకులకి కూడా ఓ షాకిచ్చి వుంటే,  కథ అక్కడే ప్రారంభమై పోయేది. గోల్ ఏర్పడేది. కనీసం ఆ ఇంటర్వెల్ కైనా ప్లాట్ పాయిట్ వన్ తో బిగినింగ్ ముగిసేది!

          ఇలా చేయలేదు సరికదా, అసలు తను పాల్గొంటున్న కథేమిటో
తనకే తెలీని అమాయకత్వంతో హీరో వుంటూ, ఇంటర్వెల్లో తను పట్టుకున్న నిరంజన్ అనే ఆ మైనర్ పాత్ర ఆపైన సెకండాఫ్ లో చెప్తేనే గానీ తెలుసుకోడు  హీరో!

          కాబట్టి పూర్తిగా ఇది పాసివ్ పాత్రయింది. భీకర యాక్షన్ చేసినంత మాత్రాన యాక్టివ్ పాత్రై పోడు. పాసివ్ - రియాక్టివ్ పాత్రవుతాడు. తనకేదో జరిగితేనే రియాక్టై తిప్పి కొడుతూ వుండేవాడు పాసివ్ – రియాక్టివ్. ఎందుకు జరుగుతోందో తెలుసుకుని, ఆ విలన్ కి తనే జరిపించే వాడు యాక్టివ్ క్యారక్టర్. అలా యుద్ధాన్ని మొదలెట్టే వాడు అసలైన హీరోయిజం గల హీరో. 

          ఈ ఫస్టాఫ్ లో చూపించిన కథాకమామీషంతా ఎలా చూపించినా అలాగే ఓకే అనేసు కుందాం కాసేపు మాస్ మెంటాలిటీతో. సర్లే,  ఇంతోటి ప్రేక్షకులకి ఇంతకంటే అద్భుత బొమ్మ చూపించే  మేధోమధన చాకిరీ అంతా ఎందుకు - ఏదో ఇంత సద్ది పడేస్తే సద్దుమణిగిపోతుంది కదా వాళ్ళ ఆకలను కుంటే – ఇది కూడా రైటే! కమర్షియల్ సినిమా అంటేనే అంత. ప్రేమలో- యుద్ధంలో- కమర్షియల్ సినిమాల్లో ఏదైనా రైటే కదా! కానీ, అలా రైట్ అనుకుని చూపిస్తూ పోయిందే ఆ తర్వాత ముందుకు సెకండాఫ్ లోకి వెళ్ళనివ్వని  అడ్డుకట్ట వేసేస్తే అప్పుడేమిటి? సెకండాఫ్ అంతా రాంగుల రంగేళీయేనా? 

          ఫస్టాఫ్ అంతా ఏకసూత్రతతో లోపాలన్నీ కప్పిపుచ్చుతూ (అవి లోపాలని కథకుడికి తెలుసో లేదో) యమ ఫాస్టుగా నడిపి శభాష్ అన్పించుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వారెవ్వా అన్పించారు. తర్వాతేమిటి? ఆ పట్టు విడవని యాక్షన్ అనే ఏకసూత్రత అంతా  ఏమైంది? సెకండాఫ్ లో అదే  ఫాస్టు కథనం ఎందుకు లేదు? ఏదేదోగా ఎందుకు మారిపోయి చతికిలబడింది కథ? ఇది తెలుసుకోవడానికి మొహమాటపడకుండా  ఇంటర్వెల్ ఘట్టాన్ని పోస్టు మార్టం చేయాలి. 

ఇంటర్వెల్ ఇరకాటం 
     ఇంటర్వెల్లో  కథని ఆపకుండా ప్రేక్షకుల్ని ఆపాలని పైన చెప్పుకున్నాం. చాలా పూర్వం ఇంటర్వెల్ తో సమస్య వస్తే, ఇదే పని చేశాం ( ఆ కథ తెరకెక్కలేదు వేరేసంగతి). లేత హీరో విలన్ తాలూకు ఇద్దర్ని లేపేసి, పారిపోయి వచ్చి ఫ్రెండ్స్ రూమ్ లో దాక్కుంటాడు. ఈ లేత హీరో ముదరడానికి సెకండాఫ్ లో ఇంకా టైముంది. అలా దాక్కుని బాస్ కి కాల్ చేస్తాడు. బాస్ వస్తున్నానంటాడు. హీరోకి ధైర్యం వస్తుంది. ఎదుటి బాస్ అయిన విలన్ కూడా బయల్దేరి వస్తూంటాడు. ఇప్పుడేం చేయాలి? బాస్ లిద్దరికీ బయటే ఘర్షణ  పెట్టి హీరోని తప్పించాలా? బాస్ వచ్చాడన్న ధైర్యంతో వున్న హీరో, ఫ్రెండ్స్ తో కలిసి  విలన్ తో కలబడాలా? విలన్ పారిపోవాలా? ఇలా ఒక విజయంతో ఇంటర్వెల్ వేయాలా?

          ఇదే...ఇంటర్వెల్లో ఇలా పైచేయి   చూపిస్తేనే  కథాగిపోతుంది. దీనికి సెకండాఫ్ లో అతుకులేసి మళ్ళీ ఇద్దరు బాస్ ల మధ్య అదే ఆధిపత్యపు కథని పునఃప్రారంభించాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ప్రారంభిస్తాం. ప్రారంభించడం బిగినింగ్ లోనే  జరిగిపోయింది. మళ్ళీ మిడిల్ టూలో ప్రారంభించడమేమిటి?  అప్పుడది మిడిల్ టూ ఎలా అవుతుంది - మళ్ళీ  బిగినింగే అవుతుంది. కథ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. 

          కాబట్టి ఈ  ఇంటర్వెల్ క్యాన్సిల్ అయింది. నడుస్తున్న మిడిల్ వన్ నుంచి ఇంటర్వెల్ తర్వాత,  కథ మళ్ళీ బిగినింగ్ లో పడకుండా,  మిడిల్ టూలోనే పడి అలాగే కంటిన్యూ అవాలంటే, చలనంలో వుండాలంటే,  ఏం చేయాలి? 

          ఒకటే చేశాం. వస్తానన్న బాస్ బయల్దేరి వస్తున్నట్టు ఆడియెన్స్ కి చూపించాం. ఎదుటి బాస్ కూడా తన హాకీ స్టిక్స్ గ్యాంగ్ తో భీకరంగా బయల్దేరి వస్తున్నట్టు ఆడియెన్స్ కి మాత్రమే చూపించాం. రూమ్ లో హీరో అండ్ ఫ్రెండ్స్ ఉద్రిక్తత చూపించాం. విలన్ కూడా బయల్దేరి వస్తున్నట్టు వీళ్ళకి తెలీదు. కానీ రాకుండా ఆగడని గట్టి నమ్మకం. బాస్ ముందే రావాలని కోరుకుంటారు. అంతలో తలుపు కొట్టిన చప్పుడవుతుంది. ఎవరు? ఎవరో తెలీదు. పలకరు. తలుపు మాత్రం కొడుతూంటారు. బాసా, విలనా? తీయాలా, వద్దా? తలుపు మోగిపోతూంటుంది. ఏమైతే అయిందని వెళ్లి గడియ తీసేస్తాడు హీరో. తీసి మెల్లగా తలుపు తెరుస్తూంటే... ఇంటర్వెల్ పడుతుంది. 

          దీంతో కథ ఆగిందా? ఇంటర్వెల్లో కథని ఆపినట్టుందా, ప్రేక్షకుల్ని ఆపినట్టుందా? సీన్ మాత్రమే మధ్యలో ఆగింది. సీనస్ ఇంటరప్టస్ టెక్నిక్ తో. ఈ సీన్లో ఏం జరుగుతుందో పూర్తిగా చూపించకుండా, ప్రేక్షకుల్ని కాస్తాగమన్నాం,  ఉత్కంఠకి లోనుజేస్తూ. తలుపు తీస్తే అవతల ఎవరొచ్చారనేది సస్పెన్స్. 

          దీని లాభం : మిడిల్ వన్ కథ సాఫీగా మిడిల్ టూ లోకి ప్రయాణిస్తుంది, తెగిపోదు. ఇంటర్వెల్ తర్వాత మధ్యలో ఆపిన ఇంటర్వెల్ సీనుని రీప్లే చేసి, పూర్తిగా చూపిస్తే,  అప్పుడా వచ్చిన పాత్రతో కథ కొనసాగుతుంది.

గరుడ కథన దృష్టి 
     ఈ వ్యాస ప్రారంభంలో ఇంటర్వెల్ ని కథన దృష్టితో చూస్తే కథాగిపోతుందనీ, అదే పాత్ర దృష్టితో చూస్తే  ప్రేక్షకుల్ని ఆపినట్టు అవుతుందనీ చెప్పుకున్నాం. ఇప్పుడు పై ఇంటర్వెల్ ని కథన దృష్టితో చూస్తే ఎలా వుంటుంది? ముందుగా కథన దృష్టి అంటే ఏమిటో తెలుసుకో
వాలి. కథన దృష్టి పాత్రని విడిచి కథనం చేసుకుంటుంది. ఎలా చేసుకుంటుంది? కథకుడు చేస్తాడు. కథకుడు కథన దృష్టితో కథనం  చేస్తే పాసివ్ పాత్ర తయారవుతుంది, పాత్రే కథనం చేసుకుంటే యాక్టివ్ పాత్ర తయారవుతుందని  చాలా సార్లు చెప్పుకున్నాం.

          కథకుడు కథనం చేయడం, లేదా కథకుడే  కథని నడపడం ఎలా జరుగుతుంది? ఎలాగంటే, సీనులో ప్రధాన పాత్ర వుంటే, ఆ ప్రధాన పాత్రని వదిలేసి, ఆ సీనులోకి వచ్చే ఇతర పాత్రలు ఏమేం చేయగలవని, వాటి దృష్టి కోణం లోంచి, వాటి అవసరాల్నుంచీ  ఆలోచించి ఆలోచించీ హమ్మయ్యా అని సీన్ని నడిపిస్తే అప్పుడది కథకుడు కథని నడపడం, లేదా కథనం చేయడం  అవుతుంది. సింపుల్ గా చెప్పుకుంటే, ఇతర పాత్రల్ని పోగేసి వాటి గురించి  ఆలోచిస్తే కథకుడు కథ నడపడం, లేదా కథన దృష్టి అవడం జరుగుతుంది. 

          పై ఇంటర్వెల్ సీనులో, హీరో దాక్కున్న రూము దగ్గరికి బాస్ లిద్దర్నీ రప్పించి, వాళ్ళ అవసరాల కొద్దీ  ఘర్షణ  జరిపించడం ఇలాటిదే. ఆ  ఘర్షణలో హీరో జొరబడ్డం కూడా ఈజీ అయిపోతుంది. బాస్ అండ చూసుకుని విలన్ తో తలబడి, అతణ్ణీ అతడి గ్యాంగ్ నీ  తరిమికొట్టి - ఓ పంచ్ డైలాగు కొట్టొచ్చు. దాంతో అది ఇంటర్వెల్ బ్యాంగ్! 

          ఇంకేముంది,  హీరో విజయం చూపించేశాక? ఇంకా సెకండాఫ్ లో చెప్పడానికి కథేముంది?  మళ్ళీ విలన్ చేత గిల్లించి కథని ఎత్తుకోవాలిగా కృత్రిమంగా?

          ఇప్పుడు గరుడ వేగలో ఇంటర్వెల్ సీనుకొద్దాం. సినిమా ప్రారంభంలో ఓపెనింగ్ తీజర్ లో చూపించిన ‘దుష్ట’ మైనర్ పాత్రని అదే బాంబు దాడి పథకం ఎపిసోడ్ లో హీరో వెంటాడి వెంటాడి చాలా థ్రిల్లింగ్ గా పట్టేసుకుంటాడు. ఇంటర్వెల్. ఇక్కడ కథన దృష్టి ఎలా పనిచేసింది? హీరో బాంబు సమస్యని ఎదుర్కొంటున్న ఘట్టంలో,  కథకుడు ఇతర పాత్రల్ని రప్పిస్తూ తనే కథ నడిపాడు. ఆ ఇతర పాత్రల్లో ఆ మైనర్ పాత్ర, అతడి ఇద్దరు అనుచరులెవరో వుంటారు. వీళ్లిక్కడ వుండాల్సిన అవసరం లేదు. అదే మాఫియా బాంబు దాడి ప్లాన్ చేసిన చోట, అదేసమయంలో అక్కడికే మైనర్ క్యారక్టర్ ని పిలిపించుకుని డేటా తాలూకు బేరసారాలు ఎలా చేసుకుంటారు. కానీ అలా వచ్చి హీరోకి దొరికిపోవాలని కథకుడు ఆలోచించాడు. అలాగే దొరికిపోయాడు.  హీరో విజయంతో ఇక ఇంటర్వెల్ వేసేశారు. హీరో విజయం చూపించేశాక కథాగి పోయింది, లేదా అయిపోయింది. ఏకసూత్రత కూడా తెగిపోయింది.

గరుడ పాత్ర దృష్టి
        ఇప్పుడు పాత్ర దృష్టి తో ఇంటర్వెల్ చూద్దాం. ముందు ఆ పైన చెప్పుకున్న సీన్లోకి వెళ్దాం. విలన్ మనుషులు ఇద్దర్ని చంపి వచ్చి దాక్కున్నాడు లేత హీరో. ఫోన్ చేస్తే బాస్ వచ్చేస్తున్నాడు. అట్నుంచి విలన్ కూడా వచ్చేస్తున్నాడు. పాత్ర దృష్టి వాళ్ళ గురించి ఆలోచించదు. హీరో గురించే  ఆలోచిస్తుంది. సీను హీరోది, వాళ్ళది కాదు.  సీనులో ఇరకాటం హీరోది, వాళ్ళది కాదు. సీనులోంచి బయట పడే అగత్యం హీరోది, వాళ్ళది కాదు. కథలో ప్రేక్షకులు కథానాయకుణ్ణి ఫాలో అవుతారు, వాళ్ళని కాదు. కనుక హీరో పాయింటాఫ్ వ్యూతోనే సీను నడుస్తుంది. మరొకటేమిటంటే, హీరో పాయింటాఫ్ వ్యూయే ప్రేక్షకుల పాయింటాఫ్ వ్యూ! మరి కథకుడు?  కథకుడు హీరో పాత్రలో పరకాయప్రవేశం చేసి చచ్చి తీరాలి! బయట బయట పాత్రల్ని పోగేసుకుని  చెమ్మాచెక్క చారడేసి మొగ్గా అని ఆడుకుంటే కాదు!

          కనుక కథకుడు మహాశయుడు హీరో పాత్రలోకి వెళ్లి బుద్ధిగా కూర్చుని చూస్తే  ఏం జరుగుతుంది? హీరో మానసిక స్థితిని అతడి పాయింటాఫ్ వ్యూలో చూసి తరించడం జరుగుతుంది. హీరో పాయింటాఫ్ వ్యూలో పరిస్థితి ఏమిటి? బాస్ కన్నా ముందు విలన్ వచ్చేస్తే? తను ఇప్పుడే పారిపోతే? ఆ వచ్చిన బాస్ ని విలన్ చంపేస్తే?  బాస్ ని ప్రమాదంలో పడేసి తను పారిపోవడం కరెక్టా?

          పాత్రని పరిస్థితిని అనుభవించనియ్యాలి. పాత్ర పరిస్థితిని అనుభవిస్తేనే పరిస్థితి జీవకళతో తొణికిసలాడుతుంది. అప్పుడు తలుపు కొడుతూంటే, అదెవరో చెప్పకపోతే, హీరో ఇక నిర్ణయం తీసుకోవాల్సిన క్షణాలు వచ్చేశాయి. సైకలాజికల్ ప్రాసెస్ ఇలాగే వుంటుంది. సమస్యలో వున్న మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు, సమస్య తీవ్రమయ్యేసరికి ఇక నిర్ణయం తీసుకుంటాడు, దాంతో చర్యకి పూనుకుంటాడు. హీరో బయట ఎవరున్నారో తెలియని పరిస్థితిలో ఇక తలుపు తీయడానికే నిర్ణయించుకున్నాడు. విలన్ వుంటే కాల్చేస్తాడు, బాస్ వుంటే కాపాడతాడు. జూదం, తన ప్రాణాలతో జూదమాడాలి. లేదా తలుపు తీయకుండా వుంటే,  అది బాస్ అయితే విలన్, విలన్ అయితే బాస్,  వచ్చేసి వాళ్ళిద్దరూ కాల్పులు జరుపుకుంటారు. విలన్ చస్తే మంచిదే, కానీ బాస్...అందుకని వెళ్లి తలుపు తీయడానికే నిర్ణయించుకుంటాడు హీరో. ఈ హీరో మానసిక సంఘర్షణ అంతా ప్రేక్షకులకి ఎలా తెలిసి వాళ్ళుకూడా పరిస్థితిని అనుభవిస్తారని అనొచ్చు. అక్కడున్న ఫ్రెండ్స్ తో జరిగే తర్జనభర్జన రూపంలో మానసిక స్థితి తెలుస్తుంది. ఇది పాత్ర దృష్టితో సీను డ్రైవ్ చేయడం. 

          అప్పుడు హీరో తెగించి తలుపుతీస్తూ వుంటే...ఇంటర్వెల్ పడుతుంది.
          హీరో ప్రేక్షకులకి అవతలెవరున్నదీ చూపించకుండా ఆపేశాడు. కథని ఆపలేదు. ప్రేక్షకుల్ని ఆపాడు, అంతే.
         
ఇప్పుడు గరుడ వేగ ఇంటర్వెల్ ని పాత్ర దృష్టి తో చూద్దాం. ఏం చూస్తాం...హీరోకి పరిస్థితేమిటో తెలియకుండా వుంటే?  ఏదేదో ఎందుకో జరుగుతూంటే దాన్ని పట్టుకుని పోవడమే కదా ఫస్టాఫ్ అంతా హీరో చేస్తూ వచ్చింది. ఇంటర్వెల్ కి కూడా అతగాడికి పరిస్థితే మిటో తెలీదు. చూస్తే పెద్ద ఎన్ఐఏ ఏజెంట్. తను పట్టుకున్న ఆ మైనర్  పాత్ర కూడా బాంబు దాడి గ్యాంగ్ మెంబరే  అనుకుని పట్టుకున్నట్టున్నాడు. అతను మైనింగ్ రహస్యాల్ని హ్యాక్ చేసిన నిరంజన్ అయ్యర్ అనీ తెలీదు. అన్ని తగుల్తున్న సంఘటనలకి లాగే ఇతనూ కాలికి తగిల్తే పట్టేసుకున్నాడు. హీరోకి  అసలీ కథేమిటో, ఈ కథలో తన పాత్రేమిటో తెలిస్తేగా దాని తాలూకు సైకలాజికల్ ట్రాక్ ఏర్పడేది,  తద్వారా ఒక పాయింటాఫ్ వ్యూ వుండేది? కథకుడు ఏమని పరకాయ ప్రవేశం చేసి,  పాత్ర దృష్టితో ఇంటర్వెల్ అనే బిగ్ పిక్చర్ ని చూస్తాడు? కదా? 

          అందుకని ఇలా చేద్దాం. ఇలాటి హీరోని ఓడించేద్దాం. నిరంజన్ దొరకడు – జంప్ అయిపోయి సెకండాఫ్ లోకి పారిపోతాడు. అప్పుడు కథ చలనంలో వుంటుంది, ఆగిపోదు. హీరో పట్టుకున్నట్టు గెలుపు చూపిస్తేనే కథ ఆగిపోతుంది. గెలిచాక ఇంకేముంది, మొత్తం ఫస్టాఫ్ టెన్షన్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఇంటర్వెల్ కి ప్రేక్షకులు రిలాక్స్ అయిపోతారు. సెకండాఫ్ లో కథకి అతుకులేసి మళ్ళీ లేపాలి. 

          మరొక్కసారి, ఇంటర్వెల్  సూత్రాలేమిటి?
 “An important scene in the middle of the script, often a reversal of fortune or revelation that changes the direction of the story.” అని కదా చెప్పుకున్నాం పైన. అంటే, అదృష్టం తిరగబడ్డం, లేదా కథా గమనాన్ని మార్చే కొత్త విషయమేదో బయటపడ్డం అని కదా తెలుసుకున్నాం. 

          ఇంకా -  “Mid-Point or a  Major Reversal of fortune, making Main Character’s task even more difficult. May be a glimpse at the actual resolution of the picture, its mirror opposite.” అనికదా అనుకున్నాం. అంటే, అదృష్టం తీవ్రస్థాయిలో తిరగబడ్డమేననీ, పైగా గోల్ కోసం హీరో చేసే ప్రయత్నం కనా కష్టమై  పోవడమనీ,  ముగింపు అనే దర్పణంలో చూస్తే నెగెటివ్ గా ఈ తిరగబడ్డ అదృష్టం, తన్నుకొచ్చిన అదృష్టంగా పాజిటివ్ గా కన్పించడమనీ? 

          ఇంటర్వెల్ కి మిర్రర్ ఇమేజి సూత్రముందనీ, దాని  ప్రకారం- ఇంటర్వెల్లో హీరో దెబ్బతింటే, ముగింపులో దాని ప్రతిబింబం గెలుపుగా వుంటుందనీ, అదే ఇంటర్వెల్ కి హీరో దెబ్బ తీస్తే, ముగింపులో దాని ప్రతిబింబం ఓటమిగా వుంటుందనీ కదా గ్రహించాం. 

          అంటే ఇంటర్వెల్లో హీరో ఓడిపోవాలి- నిరంజన్ దొరక్కూడదు. అప్పుడు దొరికించుకుని ముగింపులో గెలుస్తాడు. మిర్రర్ ఇమేజికి న్యాయం చేస్తాడు. ఇలాకాక నిరంజన్ ని పట్టుకుని గెలిస్తే, ముగింపులో నిరంజన్ గెలిచి,  హీరో ఓడిపోవాలి. ఇది మిర్రర్ ఇమేజికి రెండో ఆప్షన్. గరుడ వేగ ఇంటర్వెల్ ప్రకారం ఇదే జరగాలి నిజానికి. 

           అందుకే  హీరోని ఇంటర్వెల్లో ఓడించేద్దాం. గెలుపుతో ఫాల్స్ బ్యాంగులు, ఫాల్స్ చప్పట్లు, సెకండాఫ్ కి ఫూలయ్యే కథనమూ వద్దు.  మరి కథాగి పోకుండా ఎలా ఓడించాలి?  
huge high – టెక్నిక్ వాడాలి. అంటే వున్న కథని నషాళానికి అంటించాలి. ఉదాహరణకి – హీరో బాస్ పాత్ర ఎన్ఐఏ చీఫ్ గా వేసిన నాజర్ వూడిపడి అయ్యర్ ని ఎత్తుకుపోవాలి.

          ఈ జరుగుతున్న అన్ని ఆపరేషన్స్ లో హీరో పట్ల నాజర్ అయిష్టంగా వుంటున్నట్టు చూపిస్తూ వచ్చిందే, అతడికి మాఫియాతో సంబంధాలున్నాయన్న సంకేతాలిస్తూ. హీరో పట్టుకోబోతున్న నిరంజన్ అయ్యర్ ని చివరి క్షణాల్లో గద్దలా వచ్చేసి వూహించని విధంగా  నాజర్ తన్నుకుపోతే ఇంటర్వెల్ అనారోగ్యమంతా తీరిపోతుంది. కథాగి పోకుండా ఇంకా పైకి లేచి, సస్పెండెడ్ యానిమేషన్ లో వుంటుంది – అప్పుడప్పడు చట్ట సభల్ని రద్దు చేయ కుండా త్రిశంకు స్థితిలో వుంచినట్టు. 

          ఇంటర్వెల్ కి రెండే రెండు, హీరో అదృష్టం తిరగబడాలి, లేదా కథా గమనాన్ని మార్చే కొత్త విషయమేదో బయటపడాలి.  ముందు కథలో ఇదే చేశాం. ఉద్రిక్త పరిస్థితిలో తలుపు తీసిన హీరోకి - సెకండాఫ్ ఓపెన్ చేస్తే- బాసూ వుండడు, విలనూ వుండడు - మూగ హీరోయిన్ వుంటుంది - కథని కొత్త మార్గం పట్టించే  సమాచారంతో.

(శనివారం సెకండాఫ్ సంగతులు)
-సికిందర్