రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 23, 2016

రివ్యూ!

రచన – దర్శకత్వం : సత్య ప్రభాస్ పినిశెట్టి


తారాగణం : ఆది పినిశెట్టి,  నిక్కీ గల్రానీ, రిచా పల్లోడ్, ప్రగతి, మిథున్ చక్రవర్తి, హరీష్ ఉత్తమన్, నాజర్, పశుపతి తదితరులు.
సంగీతం : ప్రసన్-  ప్రవీణ్ – శ్యామ్ , ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం
బ్యానర్ : ఆదర్శ చిత్రాలయా ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : రవిరాజా పినిశెట్టి
విడుదల : 19   ఫిబ్రవరి 2016

***

2006 లో ఒక విచిత్రం ద్వారా తేజ పరిచయం చేసిన ప్రసిద్ధ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడు ఆది పినిశెట్టి ఆతర్వాత ఓ పది  సినిమాలతో తమిళ హీరోగా స్థిరపడ్డాడు. రవిరాజా పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ దర్శకుడుగా మారాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో (హీరో- దర్శకుడు- నిర్మాత)  2015 లో యాగావరాయినం నా కాక్కాఅనే తమిళ థ్రిల్లర్ విడుదలయ్యింది. తమిళంలో అంత ఆశాజనకంగా ఫలితాలు సాధించని దీన్ని తెలుగులోకి మలుపుగా డబ్ చేసి ఈ నెల 19 న విడుదల చేశారు. చెన్నై లో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా దీన్ని నిర్మించామంటున్న దర్శకుడు సత్యప్రభాస్ చిత్రీకరణలో తనదంటూ  ఒక శైలిని ఏర్పాటు చేసుకుని దీన్నెలా రూపొందించాడో  ఈ కింద చూద్దాం

 కథేమిటి
      సగా అనే సతీష్ గణేష్ ( ఆది), శివ ( శ్రీ కార్తీక్), రాజేష్ ( శ్యాం కుమార్), కిషోర్ ( సిద్ధార్థ్ గోపీనాథ్) ముగ్గురూ బీకాం ఫైనల్ కొచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే, తన ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లలోని మొదటి అక్షరాలతో ఎస్ ఆర్ కేఅని సగా  పచ్చబొట్టు పొడి పించుకునేంత.  కాబట్టి పరీక్షలు రాసేస్తే రేపట్నుంచీ తండ్రులు వేరే బాధ్యతలు అప్పజెప్పేస్తారని పరీక్షలు ఎగ్గొట్టి ఇంకో ఆర్నెల్లు కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటారు. సగా కి తల్లి దండ్రులు (ప్రగతి, ఆడుకాలం నరేన్), ఓ అక్కా (అనితా అయ్యర్) వుంటారు. ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదని తండ్రి మందలిస్తున్నా సగా వినకుండా వాళ్ళతో తిరుగుతూంటాడు. అతడికి లాస్య ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి పరిచయమై తన దూకుడు స్వభావంతో ముప్పు తిప్పలు పెడుతూంటుందిపెళ్లి వరకూ లాక్కెళ్ళి వెళ్ళిపోతుంది

          ఈలోగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలొస్తాయి. ఒక రెస్టారెంట్ కెళ్తారు. అక్కడ (ప్రియ)  రిచా పల్లోడ్, సూర్య (శ్రవణ్) అనే లవర్స్ తో సగా ఫ్రెండ్స్ గొడవ పడతారు. ఆ గొడవ అక్కడే తన్నులాటకి దారి తీసి పోలీసుల్ని రప్పిస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ముంబాయి డాన్ ముదలియార్ ( మిథున్ చక్రవర్తి ) కుమార్తె. ఇది తెలుసుకున్న సగా భయపడిపోయి జరిగినదానికి ముదలియార్ కి క్షమాపణ చెప్పుకునేందుకు ముంబాయి బయల్దేరతాడు... ఇక ముంబాయిలో ముదలియార్ తో ఏం జరిగిందీ, అక్కడ్నించీ  ముదలియార్ ఉక్కు హస్తాల్లో ఇరుక్కుని సగా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇరుక్కున్న హత్యా నేరంలోంచి ఫ్రెండ్స్ ని కాపాడుకుంటూ ఎలా బయట పడ్డాడూ అన్నవి మిగతా కథ

ఎవరెలా చేశారు
     మొదటి మార్కులు మాత్రం ఆదికీ, హీరోయిన్ నిక్కీకీ పడతాయి. ప్రధాన కథలో  నిక్కీకి పెద్దగా పాత్ర లేకపోయినా దానికి ముందు నడిచే ప్రేమ ట్రాకులో  ఆమె హైలైట్ అవుతుంది. ‘కుమారి 21 ఎఫ్ లో హెబ్బా పటేల్ హార్డ్ కోర్ పాత్ర ప్రవర్తనకి పాలిష్ చేసిన నేటివ్ వెర్షన్ గా  నిక్కీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ క్యారక్టరైజేషన్ గనుక ఈమెకి లేకపోయి వుంటే ఫస్టాఫ్ అంతా ఆక్రమించుకున్న లవ్ ట్రాక్ రిస్కులో పడి వుండేది. లవ్ ట్రాకుల్లో ఈ రోజుల్లో  కావలసింది లవ్ కాదు, క్రేజీగా వుండే లవర్స్ ప్రవర్తనలే. అది నిక్కీ పాత్రతో వర్కౌట్ అయ్యింది. ఆమె మంచి ఎక్స్ ప్రెజషన్స్ ఇవ్వగలదు, నవ్వించ గలదు.

          ఆది నటిస్తున్నా నన్న స్పృహ లేకుండా పాత్రలో లీనమైపోతాడుఅతడిలో సందర్భానికి తగ్గ భావప్రకటనా సామర్ధ్యం వుంది. పాత్రపరంగా దాని దైన్యాన్ని ప్రదర్శించే దృశ్యాల్లో, ముఖ్యంగా డాన్ మిథున్ చక్రవర్తిని బతిమాలుకునే దృశ్యాల్లో గుర్తుండిపోయే నటనని ప్రదర్శించాడు. క్లయిమాక్స్ లో బుద్ధి తెచ్చుకుని ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయే హృదయవిదారక దృశ్యంలో కూడా ఇంతే. తప్పకుండా ఆది ఇలాటి సెమి రియలిస్టిక్ పాత్రలకి  న్యాయం చేయగలడు

          డాన్ గా మిథున్ చక్రవర్తి, హీరో తల్లిగా ప్రగతి లకి మంచి పాత్రలే దొరికాయి. ఎక్కువగా పరిస్థితిని ఆకళింపు జేసుకునే ముఖకవళికలు, తక్కువ మాటలు కఠినంగా మాటాడే  స్వభావం ఈ రెండూ మిథున్ క్యారక్టర్ ని నిలబెట్టాయి- నిలబడేలా ఆయన చేశాడు. తెలుగు సినిమాల్లో ఏవో   అంటీ ముట్టని తల్లి పాత్రలు చేయిస్తూ తెలుగు దర్శకులు ప్రగతిని ఎంత వృధా చేసుకున్నారో ఈ సినిమాలో తల్లి పాత్రలో ఆమెని చూస్తే  తెలుస్తుంది

          సంగీతానికి పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. మ్యూజికల్ థ్రిల్లర్స్ అనేవి పూర్వకాలంలో గడిచిపోయిన సంగతులు. ఇప్పట్లో ఆశించరాదు. కెమెరా వర్క్ మాత్రం ఉన్నతంగా వుంది. ఇది దర్శకుడి విజన్ వల్ల సాధ్య పడింది. ఒక కథని ఏవిజన్ లో,  ఎలాటి మూడ్ ని క్రియేట్ చేస్తూ చూపాలా  అన్న దృక్పథం దృశ్య మాధ్యమానికి చాలా అవసరమే అయినట్టు, ఆ కథని కూడా  ఏ విజన్ లో పెట్టి నడపాలా అన్నదానిపై కూడా అవగాహన అవసరం. దర్శకుడు సత్య ప్రభాస్ కి  మొదటిది వుండి,  రెండోది లేకుండా పోయింది.

చివరికేమిటి
     అంతా బాగానే వుంది గానీ,  యదార్ధ సంఘటన అని చెప్పుకున్న ఈ కథలో  ఆ యాదార్ధ్యం కేంద్ర బిందువు కాకుండా పోయే, ప్రధానాకర్షణ కూడా కాకుండా పోయే కథనమే యమపాశం లా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే పనిగట్టుకుని ఏవో తోచిన కథన టెక్నిక్కులు ప్రదర్శిస్తే గానీ మనస్సూరుకోని నేటి దర్శకులని చూస్తున్నాం.  ఈవారం మలుపుతో బాటే విడుదలైన నీరజఅనే హిందీ హైజాక్ డ్రామాలో ఏ  టెక్నిక్ బిల్డప్పులు లేకుండానే, ఫ్లాష్ బ్యాకులే కాకుండా, ఇంటర్ కట్స్ తో కలిపి అంత అర్ధవంతమైన ఎఫెక్టివ్ డ్రామాగా  తీశారు. ‘మలుపు దర్శకుడు మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో చేయరాని హాని చేసుకున్నాడు. ఈ ఫ్లాష్ బ్యాకుల వల్ల ఫస్టాఫ్ అంతా గడిచిపోయినా కథేమిటో, దేనికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియకుండా పోయింది. సెకండాఫ్ తర్వాత పది  నిమిషాలకి గానీ అసలు కథేమిటో తెలిసి- ఫ్లాష్ బ్యాకుల హడావిడి తగ్గి,  సూటి కథనం నడవదు. ఈ దృష్ట్యా అసలు ఫస్టాఫ్ అవసరమే లేదు. ఫస్టాఫ్ వరకూ సినిమా తీయకున్నా నష్టమేమీ లేదు- సెకండాఫ్ లోనే కథా  ప్రారంభం, దాని ముగింపులున్నాయి కాబట్టి

          దృశ్యపరంగా ఏ విజన్ లో  కథ చూపాలన్న అవగాహన వున్నట్టు, ఏ విజన్ లో కథ చెప్పాలన్న దానిపై  విషయపరిజ్ఞానం లోపించడం వల్ల ఇదొక బలహీన థ్రిల్లర్ గా తయారయ్యింది

          క్లైమాక్స్ అనేక ములుపు తిరుగుతూంటుంది. ఇదంతా భరించాలంటే మొదట ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాకులతో అంత భారం మోపి వుండకూడదు. క్లయిమాక్స్ లో ఇరవై నిమిషాలు కోర్టులో భారీ డైలగులతో బరువైన సన్నివేశాలుంటాయి కాబట్టి,  అదంతా ప్రేక్షకులకి బోరు కొట్టకుండా తట్టుకోవడానికి,  దాసరి నారాయణరావు బొబ్బిలిపులి లో ఫస్టాఫ్ నుంచే క్లయిమాక్స్ వరకూ జరిగే కథని సీనుకొక్క డైలాగు చొప్పున మాత్రమే ఉండేట్టు తేలికపాటి  కథనం చేశారు. ‘మలుపులో ఈ టెక్నిక్ లేకపోగా, క్లైమాక్స్ లో అనేక ట్విస్టులకి తోడు మితిమీరిన హింస అదనపు భారమైపోయింది. ముగింపు దృశ్యం హృదయవిదారకంగా వున్నా- ఈ ముగింపుతో ఏం  చెప్పదలిచాడు దర్శకుడు? అనవసరంగా గొడవలు పెట్టుకుంటే అనుభవిస్తారనేనా? అలాగే అన్పిస్తుంది ముగింపు సందేశం

           కానీ అనవసరంగా భయపడితే అనుభవిస్తారనే సందేశం కూడా కథ మధ్య లోనే వెళ్ళింది. ఎలాగంటే, తెలీక డాన్ కూతురితో గొడవపడ్డారు, అంత మాత్రానా ఏదో జరిగిపోతుందని భయపడిపోయి అతడికి క్షమాపణ చెప్పుకోవడానికి  ముంబాయి దాకా పరిగెత్తడ మెందుకు?  కథలోనే ఇంకో మాట అనిపించారు :  తప్పు చేయనప్పుడు భయపడనవసరం లేదని. మరి ఎందుకు అంతగా భయపడడం? యదార్ధ సంఘటన అంటున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఎవరో అలాగే అర్ధం పర్ధం లేకుండా  ప్రవర్తించి ఉండవచ్చు. అయితే ప్రేక్షకులు తీసుకోవాల్సిన సందేశాల్లో ఈ వైరుధ్యాల్ని తొలగించి వుండాల్సింది.తప్పే  చేయనప్పుడు మీరు భయపడితే, ఆ చేయని తప్పే మిమ్మల్ని వెంటాడి మీరు అనుభవించేలా చేస్తుందనే  సందేశం వచ్చేలా చూసుకోవాల్సింది

          అలాగే ఈ కథలో ఇంకో సందేశం కూడా ఉత్పన్న మవుతోంది- వీళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నుకున్నమార్గం పరీక్షలు ఎగ్గొట్టడం. ఇది అక్రమమే. ఇలా అక్రమంగా  ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అందుకు ఇలా అనుభవించారనే అర్ధం కూడా వస్తోందా?

          నిజజీవితంలో జరిగే సంఘటనలకి అర్ధం పర్ధం వుండదు. ఎవరి జీవితమూ బిగినింగ్- మిడిల్- ఎండ్ అన్న స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో క్రమపద్ధతిలో సాగదు. కానీ జీవితాన్ని సినిమా చేసేటప్పు సంఘటనల్ని ఒక అర్ధవంతమైన క్రమంలో  కూర్చి స్ట్రక్చర్లో పెట్టాల్సి వుంటుంది...


      కే  కథని ఒకే  పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో చూపించిన ఏ సినిమా బాగుపడింది లేదు. ఈ మధ్యే హిందీ ‘కట్టీ బట్టీ’ కూడా ఈ విషయం నిరూపించింది. ఒకే కథని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో చూపిస్తే ఆ కథకి ఏ కథా లక్షణాలూ వుండవు. ‘కంచె’ లో చూపించినట్టుగా రెండు వేర్వేరు కథల్ని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో చూపించ వచ్చు. అలాగే ఒకే సంఘటన గురించి వేర్వేరు వ్యక్తులు కథనాలు చెప్తున్నప్పుడు ( రోషోమన్) మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ వర్కౌట్ అవుతాయి. కానీ ఒకే కథ ఒకే పాత్ర దృక్కోణంలో  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ గా పనికిరాదు. ఈ తేడాలు  తెలుసుకోకపోతే  ‘మలుపు’ లాంటి ప్రమాదాలు  మరిన్ని తప్పవు.

మామూలుగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు కాకుండా, ఒకే  పెద్ద ఫ్లాష్ బ్యాక్ వేయడమంటేనే నడుస్తున్న కథని వెనక్కి తిప్పడమే. మళ్ళీ గంటో అరగంటో  గడిచాక ఆపిన చోటుకొచ్చి మళ్ళీ  ముందుకు  నడపడమే. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కథ బలంగా వుంటే ఫర్వాలేదు, లేదా నడుస్తున్న అసలు కథ మీద ప్రేక్షకులకి ఫోకస్ చెదిరిపోతుంది. అలాటిది మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులేస్తే తడవతడవకీ ఎన్ని సార్లు నడుస్తున్న కథ వెనక్కి వెళ్తుంది! ఈ సందర్భంలో ఆడియెన్స్ ఫోకస్ చెదరడం కాదు- అదెప్పుడో చచ్చూరుకుంటుంది ఓపికతో సహా – ఏకంగా దర్శకుడి ఫోకస్సే చెల్లా చెదురై పోతుంది. స్ట్రక్చర్ గల్లంతై పోతుంది. సీక్వెన్సులు ముక్కలవుతాయి. ప్లాట్ పాయింట్స్ సెకండాఫ్ లోనే ఏర్పడతాయి. క్యారక్టర్ గ్రోత్ మటాషై పోతుంది. టెన్షన్ తెల్లారిపోతుంది. సస్పెన్స్ అయిపు లేకుండా పోతుంది. టెంపో సెలవు తీసుకుంటుంది...ఇవన్నీ ‘మలుపు’ లో ఫస్టాఫ్ అంతా కనిపించే లోపాలే. 

        ఒకసారి మలుపు’  కథని సూటిగా ‘ప్రధాన సంఘటన’కి  ముందు, ప్రధాన ‘సంఘటనకి తర్వాత’ గా చూస్తే, అదిలా వుంటుంది : నల్గురు ఫ్రెండ్స్ పరీక్షలు ఎగ్గొట్టి చదువు పేరుతో  ఇంకో ఆర్నెల్లు ఎంజాయ్ చేద్దామని పథకం వేస్తారు. ఆ ప్రకారం ఎంజాయ్ చేస్తూంటారు. హీరోకి హీరోయిన్ పరిచయమవుతుంది.  అది ప్రేమగా మారుతుంది. హీరో అక్క పెళ్లి సంబంధం చూడ్డం,  ఆ పెళ్లి ఏర్పాట్లలో వుండడం జరుగుతుంది. రేపు న్యూ ఇయర్ అనగా ఇంట్లో వాళ్ళందరూ వూరెళ్తారు

          (ప్రధాన సంఘటన) :  ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి హీరోయిన్ తో రెస్టారెంట్ కి బయల్దేరతాడు హీరో. అప్పటికే  రెస్టారెంట్ లో హీరో ఫ్రెండ్స్ లో ఒకడు ఒకమ్మాయిని ఫోటో తీస్తాడు. ఆమె అభ్యంతరం చెప్తుంది. అయినా మళ్ళీ ఫోటో తీస్తాడు తాగిన మైకంలో. ఆమె బాయ్ ఫ్రెండ్ కి చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ కీ  హీరో ఫ్రెండ్ కీ గొడవై కొట్టుకుంటారు. హీరో వచ్చి చూసి బాయ్ ఫ్రెండ్ నే బాదుతాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేయబోతే, హీరో ఫ్రెండ్స్ లో ఒకడు పోలీసు కమీషనర్ కొడుకూ, ఇంకొకడు ఎంపీ కొడుకూ అని తెలుస్తుంది. వీళ్ళని వదిలేసి బాయ్ ఫ్రెండ్ నే  పట్టుకుపోతారు. ఆ అమ్మాయిని ఎక్కువ మాటాడితే బ్రోతల్ కేసు పెడతానని ఇన్స్ పెక్టర్ అవమానిస్తాడు. పోలీసు  కమీషనర్ కి ఆ అమ్మాయి అన్న నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ముంబాయి డాన్ ముదలియార్ కూతురని తెలిసి కంగారు పడతాడు. వాళ్ళు చంపడానికి వచ్చేస్తారని ఫ్రెండ్స్ నల్గుర్నీ అజ్ఞాతంలోకి పంపేస్తాడు కమీషనర్. కానీ అక్క పెళ్లి పనులుండడంతో  హీరో అజ్ఞాతంలోకి వెళ్ళడు. ముదలియార్ గ్యాంగ్ వచ్చేసి హీరో మీద ఎటాక్ చేస్తారు. ముదలియార్ స్థానిక ఏజెంటు  హీరోని కాపాడి, పరిస్థితి తెలుసుకుని, వెళ్లి సారీ చెప్పుకోమంటాడు ముదలియార్ కి. ముదలియార్ అర్ధం జేసుకుని క్షమిస్తాడని భరోసా ఇస్తాడు. హీరో పిస్తోలు తీసుకుని ముంబాయి బయల్దేరతాడు.


           (ఈ ‘ప్రధాన సంఘటన’ కి తర్వాత) : పిస్తోలు తీసుకుని హీరో ముంబాయి చేరుకున్న సమయంలోనే ముదలియార్ మీద హత్యా యత్నం జరుగుతుంది. ముదలియార్ ని చూడ్డానికి తరలివచ్చిన జనంతో కలిసి హీరో కూడా చూస్తాడు. తర్వాత ముదలియార్ అసిస్టెంట్ ని కలిసి తనని చెన్నైలో స్థానిక ఏజెంటు  పంపాడని చెప్తాడు. ముదలియార్ మీద హత్యా యత్నం చేసింది వీడేనని వాళ్ళు కొడతారు. తను ఎందుకొచ్చిందీ ముదలియార్ కి చెప్పుకుంటాడు  హీరో.  అది విన్న ముదలియార్, అరెస్టయిన బాయ్ ఫ్రెండ్ ని తన కూతురు  విడిపించుకుందనీ, కానీ ఆ రాత్రి నుంచీ వాళ్ళిద్దరూ కన్పించకుండా పోయారనీ అంటాడు. దీనికి మీరే కారణమని, ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పమని హింసిస్తాడు. చెప్పక పోతే హీరో కుటుంబం బతికి ఉండదని వార్నింగిస్తాడు. రేపు పదింటికల్లా ఫ్రెండ్స్ ని తీసుకుని రావాలని గడువు పెడతాడు.

        చెన్నై తిరిగి వచ్చి ఫ్రెండ్స్ ని వెతికి పట్టుకుంటాడు హీరో. దాక్కుని వున్నవాళ్ళు విషయం తెలిసి బెదిరిపోతారు. హీరో మీద మ ఎటాక్ జరుగుతుంది. అతను తప్పించుకుంటాడు. కానీ ముదలియార్ చెన్నై ఏజెంట్ గాయపడతాడు. ఈ ఎటాక్ అప్పుడే ముదలియార్ చేయించడానికి వీల్లేదనీ, తన ఫ్రెండ్స్ తండ్రులే తమ కొడుకుల్ని కాపాడుకోవడానికి కమీషనర్  సాయంతో తనని చంపించడానికి  ప్రయత్నిస్తున్నారనీ అనుమానిస్తాడు హీరో. దీంతో ఫ్రెండ్స్ దాక్కుని వున్న చోటు గురించి ముదలియార్ కి సమాచారం ఇచ్చేస్తాడు. గాయపడ్డ చెన్నై ఏజెంట్ వున్న హాస్పిటల్ కెళ్తే కొత్త విషయం తెలుస్తుంది హీరోకి. అతడి మీద దాడి చేసిన వాడి చేతి మీద పచ్చ బొట్టు వుందని. అలాటి పచ్చబొట్టు తను ముదలియార్ కూతురి బాయ్ ఫ్రెండ్ చేతి మీద చూసినట్టు గుర్తు కొస్తుంది హీరోకి. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ కెళ్తాడు హీరో.  ఆ ఫ్లాట్ లో మంచుతో గడ్డ కట్టుకు పోయిన బాయ్ ఫ్రెండ్ శవం కన్పిస్తుంది. అక్కడే ఆ బాయ్ ఫ్రెండ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ హీరో మీద ఎటాక్ చేస్తుంది. ఈమె సైకో. ఈ బాయ్ ఫ్రెండ్ ముదలియార్ కూతురితో తిరగడం సహించలేక ఇద్దర్నీ చంపేసింది. ముదలియార్ కూతురి శవం బీచికి కొట్టుకొస్తుంది. ఇక ముదలియార్ హీరో సహా ఫ్రెండ్ ముగ్గుర్నీ చంపెయ్యమని ఆదేశాలిస్తాడు.

        ముదలియార్ ముందే ఈ చంపే కార్యక్రమం మొదలవుతుంది. దోషులు తాముకాదని ఎంత చెప్పుకున్నా ముదలియార్ విన్పించుకోడు. అసలు దీనికంతటికీ తనే బాధ్యుడనీ, వాళ్ళని వదిలేసి తనని చంపెయ్యమనీ బతిమాలుకుంటాడు ఫోటోలు తీసి గొడవకి కారణమైన  ఫ్రెండ్. ముదలియార్ చలిస్తాడు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చుకోవడానికి సిద్ధపడ్డారంటే,   వీళ్ళు తన కూతుర్ని చంపివుండరని తీర్మానించుకుంటాడు. 

బ్రతుకుజీవుడా అని హీరో, అతడి ఫ్రెండ్స్ కుంటుకుంటూ వెళ్లిపోతూంటే కథ ముగుస్తుంది. 

విషయం వెతుక్కోవాలి

లా ప్రారంభ ముగింపుల్ని వరసక్రమంలో చెప్పుకుంటూ పోతే ఇందులో ఏం తగ్గిందని? టెంపో, థ్రిల్, సస్పెన్స్  వంటివి ఏమైనా తగ్గాయా? ముందు పాత్రల పరిచయం,  తర్వాత ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత  ప్రధాన సంఘటన, దీని తర్వాత దాని పరిణామాలు...ఈ వరసలో ఆసక్తి కరంగానే వుంది కథనం పైన చెప్పుకున్నట్టు. దీన్ని ముక్కలు ముక్కలుగా  చేసి, ఫ్లాష్ బ్యాకులతో  ప్రారంభ ముగింపుల వరసని మార్చేస్తూ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? 

                 
సినిమా ప్రారంభం ఇలా వుంటుంది...డిసెంబర్ 31 రాత్రి ఒక ఫ్లాట్ లో ఒక యువతి ఎమర్జెన్సీ కాల్ చేస్తూ తనని చంపకుండా కాపాడమని సాయం అడుగుతూంటుంది...
        హీరో ముంబాయిలో దిగుతాడు...
        కథ నాలుగు నెలలు వెనక్కి వెళ్తుంది హీరో దృక్కోణంలో...
        ఫ్లాష్ బ్యాక్- ఇక్కడ కాలేజీ దగ్గర హీరోలు పరీక్షలు ఎగ్గొట్టి ఆర్నెల్లు ఎంజాయ్ చేయడం గురించి మాటాడు కుంటారు.
        ఇక వాళ్ళ ఎంజాయ్ మెంట్, హీరో కుటుంబ పరిచయం వగైరా జరుగుతాయి. మళ్ళీ ప్రస్తుత కథ ముంబాయిలో చూపిస్తారు. రాత్రి పూట హీరో అనుమానాస్పదం గా సంచరిస్తూంటే పోలీసులు ఆపుతారు.
        మళ్ళీ ఫ్లాష్ బ్యాక్.  పూర్వ కథ కంటిన్యూ. హీరోకి హీరోయిన్ పరిచయం వగైరా.
        మళ్ళీ ముంబాయిలో హీరోతో ప్రస్తుత కథ... 

        ఇలా పూర్వ  కథ పూర్తయ్యేవరకూ. ముంబాయి, చెన్నై ల మధ్య రెండు కాలాలకి సంబంధించిన సీన్లు వచ్చి పోతూంటాయి. ఇలా  అసలు కథ, పూర్వ కథ వంతులేసుకుని ఆల్టర్నేట్ గా ఇంటర్వెల్ వరకూ సాగడంతో..దేంట్లోనూ అసలు విషయమేమిటో బోధపడదు.  

ఇంకా సెకండాఫ్ లో పడ్డాక ఓ పది నిమిషాలు మళ్ళీ పూర్వ కథ నడిచాకనే ఆ పూర్వ కథలో భాగమైన ‘ప్రధాన సంఘటన’  అంటే పైన చెప్పిన రెస్టారెంట్ లో  జరిగిన గొడవ మొదలవుతుంది.


దీంతో ఫ్లాష్ బ్యాకుల వడ్డన ముగిసి అసలుకథ డాన్ వర్సెస్ హీరోగా సూటిగా పరుగులు తీస్తుంది. ఇక్కడ్నించీ మనం తెరిపిన పడతాం.

సెటప్స్ - పే ఆఫ్స్ 
    లా విషయమంతా సెకండాఫ్ లోనే వుంది. ఇందుకే ఫస్టాఫ్ సినిమా తీయకున్నా నష్టం లేదు. అది బడ్జెట్ కలిసివస్తూ చాలా లాభం. ఫస్టాఫ్ అంతా  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ వేస్తూ చెప్పిన సంగతేమిటి? పాత్రల పరిచయం, కుటుంబం పరిచయం, హీరోయిన్ తో లవ్, హీరో అక్క పెళ్లి పనులు..ఇవీ. వీటితో ప్రధాన సంఘటనకి ఏ సంబంధమూ లేదు, ప్రధాన సంఘటనకి ఇవేవీ దారి తీయవు- ఒక్క పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్న ఫ్రెండ్స్ నిర్ణయం తప్ప. అయితే ఈ నిర్ణయం ప్రధాన సంఘటనకి దారితీయడానికి ఒక ట్రాక్ అంటూ వేసుకోవడమే మర్చిపోయారు. 

        ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే పాయింట్లు అక్కడి కక్కడ ముక్కలే.  అంత కష్టపడి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో చూపించుకొచ్చిన రోమాన్స్, అక్క పెళ్లి వ్యవహారం సెకండాఫ్ లో ఏమయ్యాయో జాడ వుండవు.

        గొప్పగా సెటప్స్ అయితే వుంటాయి- వాటి పే ఆఫ్సే  వుండవు. కథంతా ప్రారంభమవడానికి కారణమైన ‘పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం’ అన్న సెటప్ కి కూడా పే ఆఫ్ నిర్వహణ సరీగ్గా లేదు. ఇక్కడ సెటప్ వేసి, ఎక్కడో ప్రధాన సంఘటన  చూపించి పే ఆఫ్ చేసేశారు. కానీ సెటప్ కీ దాని పే ఆఫ్ కీ మధ్య అందుకనుగుణమైన సీన్లు వుంటాయి. వాటి జాడ లేదు. ప్రధాన సంఘటన అనే సెటప్ కి మాత్రమే తదనుగుణ  పరిణామాలతో కూడిన సీన్లు దాని పే ఆఫ్ వరకూ వున్నాయి.

వాటికి స్థానం లేదు
      మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ ముంబాయి చేరిన హీరో దృక్కోణంలో వచ్చేవే. అతనెందుకు, ఏది, ఎలా గుర్తుచేసుకుంటున్నాడు? అతను ముంబాయి డాన్ ని కలవడానికి వెళ్ళిన అర్జెంటు పనికీ తను నడిపిన రొమాన్సు తో, అక్క పెళ్లి వ్యవహారాలతో సంబంధమేమిటి? అవెందుకు గురుకొచ్చి ఫ్లాష్ బ్యాకు లేసుకుంటున్నాడు? సరదాకా? సరదా సమయమా అది? మన ప్రాణాల మీదికేదో సమస్య వచ్చి, ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కి పరిగెడుతున్నప్పుడు,  సరదా పుట్టి  ప్రేమ వ్యవహారాలు గుర్తు చేసుకుంటామా? ఆ సమయంలో సరదాలు పుడతాయా, ప్రాణాల మీది కొచ్చిన సమస్య వేధిస్తూంటుందా? ఆ సమస్య తాలూకు సంఘటన మెదులుతూంటుందా? How the  mind works?

        చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాకులు అసందర్భంగా, పరిస్థితితో  సంబంధం లేని విషయాలతో ఆషామాషీగా  ప్రారంభమవుతూంటాయి. కానీ ‘ఖైదీ’ లో చిరంజీవి ఎంతటి విపత్కర పరిస్థితిలోనూ తన కేం జరిగిందో చెప్పడు. పోలీసులు కొట్టినా చెప్పడు. సినిమా ప్రారంభమయిన అరగంటకి,  సుమలత మోరల్ డైలెమా లో పడసినప్పుడే ఇక తప్పదనుకుని తన కథ చెప్పుకోవడం మొదలెడతాడు...సూటిగా తను ఇలా అయిపోవడానికి కారణమైన ప్రేమ కథే! సరదాపడి ఇంకేదో సోదితో ఫ్లాష్ బ్యాక్ కాదు. Mind ఇలా work చేస్తుంది..

        ‘కంచె’  లో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న హీరోకి అసలలా యుద్ధానికి రావడానికి కారణమే తన ప్రియురాలు కాబట్టి, ఆమెకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ కి వెళ్తాడు. Mind ఇలా work చేస్తుంది..

        అలాగే ‘మలుపు’ లోనూ  అత్యవసర పరిస్థితిలో  హీరోకి ఆ ప్రధాన సంఘటన తాలూకు విషయాలే గుర్తుకు రావడం కాకతాళీయ న్యాయం. That’s how mind works! 

        ‘ఖైదీ’ లో పోలీస్ స్టేషన్లో చిరంజీవిని హింసిస్తున్నప్పుడు రెండు మాంటేజెస్ పడతాయి. వెనుకనుంచి పోలీసు మెడకి లాఠీ పెట్టి వొత్తుతున్నప్పుడు వూళ్ళో తనని బండికి కట్టి పైకి లేపిన ఫ్లాష్ కట్, మళ్ళీ చిడతల  అప్పారావు మంగలి కత్తితో గాయపర్చినప్పుడు, వూళ్ళో రావుగోపాలరావు మంగలి కత్తితో మీదికొస్తున్న ఫ్లాష్ కట్. రెండూ తనకి జరిగిన అన్యాయం తాలూకు మ్యాచింగ్ దృశ్యాలే. That’s how mind works!

        ఈ ఫ్లాష్ కట్స్ వేసి చిరంజీవి గతం తెలుసుకోవాలన్న ఆసక్తిని చాలా పెంచారు రచయితలు  పరుచూరి బ్రదర్స్, దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి. అలా ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్టు ఇక్కడ్నించే విజువల్ శాంపిల్స్ తో  దానికి లీడ్ వేశారు.

        ‘మలుపు’లో కూడా హీరోకి ఆ ప్రధాన సంఘటన తాలూకు విజువల్ శాంపిల్సే పడ్డం మళ్ళీ కాకతాళీయ న్యాయం.

        అంటే ఏ  మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ అయితే చూపించుకొచ్చారో అదంతా ప్రధాన సంఘటనకి దారి తీసే  సంఘటనల కూర్పుగానే వుండాలి తప్ప-  ఇంకేదో ప్రేమకథ కాదు, అక్క పెళ్లి కథా కాదు.

        అంటే ఈ రెండిటికీ ఫస్టాఫ్ కథలో స్థానం ఉండకూడదన్న మాట. ఫస్టాఫ్ కథ ఎత్తుగడకి -(‘పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం’ అన్నసెటప్ కి ) న్యాయంగా పే ఆఫ్ జరిగే దిశగా సదానికి సంబంధించిన న్నివేశాల కూర్పు అన్నమాట! ఇదెలాగో తర్వాత చూద్దాం.

లీనియర్  కోణంలోనే ప్రాణం 

    సలు మొట్ట మొదట మనం చూసిందాని ప్రకారం కథా క్రమం బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే లీనియర్ కోణంలో సజావుగానే వుంది.  ప్రధాన సంఘటనకి ముందు కథ, తర్వాత ప్రధాన సంఘటన, ఆ ప్రధాన సంఘటనకి తర్వాతి కథ..బిగినింగ్- మిడిల్- ఎండ్ స్ట్రక్చర్ లోనే వున్నాయి. 

        ప్రధాన సంఘటనకి ముందు కథ బిగినింగ్ విభాగ మనుకుంటే, ప్రధాన సంఘటన అంటే రెస్టారెంట్ లో జరిగిన గొడవ  మొదటి మూలస్థంభం ( ప్లాట్ పాయింట్ -1) అవుతుంది.  ఇక్కడ్నించీ  హీరో తన ఫ్రెండ్స్ గురించి ముదలియార్ కి హీరో సమాచారం ఇచ్చేయ్యడం వరకూ మిడిల్ విభాగం అవుతుంది. అక్కడ్నించీ ముగిపు వరకూ ఎండ్ విభాగం.

        ముంబాయి సీన్లతో కలుపుకుని ఫ్లాష్ బ్యాకులుగా వస్తున్న బిగినింగ్ విభాగాన్నే చూసినా అది ఇంటర్వెల్ పైగానే సాగింది. ప్రధానసంఘటన ( ప్లాట్ పాయింట్ -1) ఇంకో పది  నిమిషాల తర్వాత వచ్చింది. అంటే ఇంటర్వెల్ లోపు రావాల్సిన ప్రధానసంఘటన ( ప్లాట్ పాయింట్ -1)  రాకుండా స్ట్రక్చర్ చెదిరిపోయింది. ఒకేఒక్క  కథని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో చూపిస్తే జరిగే ప్రమాదమే ఇది.  ఇలా ‘కట్టీ బట్టీ’ లో క్లయిమాక్స్ లో తప్ప ప్లాట్ పాయింట్ -1  అనే బాధిత ప్రాణి రాదు. అప్పటివరకూ ప్రేక్షకులు కథేమిటో అంతుచిక్కక బోరు కొట్టించుకునీ కొట్టించుకునీ ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతారు. విచిత్రమేమిటే, ఇలాటి సినిమాలు తీస్తున్న  దర్శకులకి అసలేం  బోరు కొట్టదు. ఈ కథన టెక్నిక్కే బావుందని చూసుకుని సంతోషిస్తారు. అంటే  సదరు దర్శకులకి  సగటు ప్రేక్షకుడి పద్ధతిలో కూడా సినిమా చూడ్డం రాదనుకోవాలా?

 లాంగ్ ఫ్లాష్ బ్యాక్  

   కథని  మిడిల్- బిగినింగ్ - ఎండ్ ( 2 - 1 - 3) అనే ఒకే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో పెట్టి చూసినా- హీరో ముంబాయిలో  దిగుతాడు, ముదలియార్ మీద ఎటాక్ జరుగుతుంది, పోలీసులనుంచి హీరో తప్పించుకుంటాడు,  అప్పడేదో లీడ్ తో ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టామనుకుందాం... అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో హీరో రోమాన్సు, అక్క పెళ్లి ప్రయత్నాలూ బిగినింగ్ విభాగమంతా చూపించుకొచ్చి, అరగంట నలభై నిమిషాలో బిగినింగ్ ని ముగించి ప్లాట్ పాయింట్ -1 వేస్తూ, రెస్టారెంట్ సంఘటన సృష్టించామనుకుందాం...ఈ సంఘటన తర్వాత తను ముంబాయి వెళ్లేందుకు దారి తీసిన సీన్లు కూడా వేసేస్తూ మిడిల్  విభాగంలో కొచ్చా మనుకుందాం...ముంబాయికి వచ్చాక ముదలియార్ మీద జరిగిన ఎటాక్ తాలూకు సీన్ల దగ్గర ఫ్లాష్ బ్యాక్ ని ముగించేసి- అక్కడ హీరో  ముదలియార్ ని కలిసి జరిగింది చెప్పుకోవడం కాడ్నించీ ఏకబిగిన అతను ఫ్రెండ్స్ గురించి సమాచార మిచ్చేవరకూ మిగతా మిడిల్ ని పూర్తి చేసేసి- అక్కడ్నించీ యధాతధంగా ఎండ్ విభాగాన్ని ప్రారంభించి ముగింపు వరకూ వెళ్ళామనుకుందాం...

        చిరంజీవి ‘ఖైదీ’లో వున్నది ఈ స్ట్రక్చరే గా? 

సీదా కథనంతోనే లైఫ్
 అయితే ఈ కథని ఏ  ఫ్లాష్ బ్యాకుల అవసరమే లేకుండా స్ట్రెయిట్ నేరేషన్ లో 1-2- 3 సాంప్రదాయ పద్ధతిలో చెప్పడమే న్యాయమని మొట్ట మొదట ప్రారంభ ముగింపులు ఒక వరస క్రమంలో రాసుకుని చూసుకున్న కథనమే  చెప్తోంది. లీనియర్ కోణంలోనే  ప్రాణం. 

        మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులకి ఇదేం ‘కంచె’ లాగా రెండు కథానికల కథ కాదు.

‘కంచె’ లో Concentric Circles (CC) గా కలిసి వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ లో వస్తూ  వుండే పూర్వ ప్రేమ కథకీ, ప్రస్తుత యుద్ధ కథకీ కలిపి ఒకే కథాంశం కేంద్ర బిందువై వుంటుంది. ఆ  కథాంశం జాతి రక్తం. ప్రేమ కథలో కులాల సంఘర్షణ, యుద్ధ కథలో జాతుల సంఘర్షణ. అక్కడా ఇక్కడా హీరోకి జాతిరక్తమనే  మౌఢ్యంతో పోరాటం. అక్కడ తను కులీనుడు కాదని ప్రేమని దూరం చేశారు, ఇక్కడ తమ ఆర్యన్ జాతి రక్తం కలుషితమయిందని యూదు పసి దాన్ని చంపడానికి నాజీలు వెంటపడ్డారు. ఈ రెండూ ఒకే కథాంశం చుట్టూ నడవడంతో CC గా ఏర్పడ్డాయి. లోపలి వృత్తం పూర్వ కథతో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్, వెలుపలి వృత్తం ప్రస్తుత ప్రధాన కథ.

        ‘మలుపు’ కి ఇంత సీను లేదు. వుంటే Concentration  చెదిరిపోయే Circles మాత్రమే వున్నాయి- రోమాన్సుతో, అక్కపెళ్ళి వ్యవహారంతో. కాబట్టి ఎలాటి టెక్నిక్కులకీ పాల్పడకుండా సీదా సాదా సాఫీ కథనంతోనే దీనికి లైఫ్ వుంది. అప్రస్తుతమైన బ్యాక్ స్టోరీ పేరు చెప్పి అడుగడుగునా బ్రేకు లేసుకోవడంలో యాక్సిడెంట్ లే వున్నాయి. 



ఇదిగో ఎత్తుగడతో విధానం

      
థ ఎత్తుగడ- పరీక్షలెగ్గొట్టి ఇంకో ఆర్నెల్లు ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం.
        దీని కొనసాగింపు-  అలా ఎంజాయ్ చేస్తున్నారు, హీరోయిన్ పరిచయమైంది, ఆమెతో నల్గురూ పోటీలు పడ్డారు, హీరోనే సెలెక్టు చేసుకుంది, కలిసి తిరుగుతున్నారు, ఇంకొటేదో జరిగి పేరెంట్స్ కి దొరికిపోయారు, మరింకేదో జరిగి అసలు పరీక్షలే  రాయకుండా డీ బార్ అయిపోయారు, అయినా లెక్క చేయకుండా  ఎంజాయ్ చేస్తూంటే హీరోయిన్ పెళ్లి ప్రస్తావన తెచ్చింది, ఇది  పెళ్లి ఎపిసోడ్ కాదన్నారు, హీరోయిన్ కి వొళ్ళు మండి  వీళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కావాలనే పరీక్ష లెగ్గొట్టారని అసలు సంగతి పేరెంట్స్ కి చెప్పేసింది, వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేశారు,  డబ్బుల్లేక తిప్పలు పడుతున్నారు, పేరెంట్స్ డబ్బుతో ఆర్నెల్లు మజా అనుకుంటే  మూన్నాళ్ళకే బికారులయ్యారు, అప్పులు చేసి మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వచ్చింది, అప్పుకూడా పుట్టక జేబులు కొట్టి హీరోయిన్ తో రెస్టారెంట్ కెళ్ళారు. అక్కడ ముంబాయి డాన్ కూతుర్ని చూసి- ఎవరీ కోతి పిల్ల అని -ఫేస్ బుక్కులో పెడదామని ఫోటోలు తీసింది తగిన మైకంలో హీరోయిన్, గొడవ య్యింది, కొట్టుకున్నారు, హీరోతో బాటు ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ తప్పుని కవర్ చేస్తూ తమ మీదేసుకున్నారు, పోలీసులు వచ్చారు, ప్రముఖుల కొడుకులని వీళ్ళని వదిలేసి డాన్ కూతురి బాయ్ ఫ్రెండ్ ని  పట్టుకెళ్ళారు...

        ఎత్తుగడ అనే సెటప్ అడుగడుగునా సస్పెన్స్ తో, థ్రిల్ తో ఇలా పే ఆఫ్ అయింది. ఈ ట్రాక్ ఇలాగే వుండాలని కాదు, ఉదాహరణకి మాత్రమే ఇది. ప్రధాన సంఘటనకి ఎవరో ఫ్రెండ్ కాకుండా హీరోయినే  ఎందుకు కారణమవ్వాలంటే, సినిమాకథకి హీరోయిన్ వల్ల వచ్చే Feminine Appeal  మంచి  ప్లస్ అవుతుంది కాబట్టి. అక్కడినించీ కథ హీరోయిన్ చేసిన తప్పు తమ మీదేసుకుని ఫ్రెండ్స్ పడే కష్టాలతో వేడెక్కితే బావుంటుంది కాబట్టి. అమ్మాయి క్షేమం కోరి కష్టాలూ త్యాగాలూ అనేవి ఎప్పుడూ బాక్సాఫీసు అప్పీలుండే  కథలే.

        ఇప్పుడు హీరోయిన్ క్షేమం కోసం ముంబాయి వెళ్లి డాన్ కాళ్ళ మీద పడ్డా, ఏడ్చి మొత్తుకున్నా అర్ధం పర్ధం వుంటుంది. ఎమోషన్ వుంటుంది. అక్కడ పిస్తోలు పట్టుకుని తిరిగితే ఎమోషన్ వుండదు. పిస్తోలేందుకు పట్టుకెళ్ళాడు హీరో? అర్ధం లేని బిల్డప్ కోసం పెడితే అది డాన్ ని కాల్చి చంపడానికని అర్ధం రావడం లేదా? నిజాయితీగా తప్పు ఒప్పుకోవడానికి వెళ్తూ ఆయుధం చేబట్టడం అతడి సిన్సియారిటీ నే ప్రశ్నించడం లేదా? అదే పిస్తోలుతో డాన్ కాల్చి పారేస్తే?



-సికిందర్



 

 

 

 

 

 

 

 

 

 

 




షార్ట్ రివ్యూ!




స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వాసూ వర్మ 

తారాగణం: సునీల్‌, నిక్కీ గల్రానీ, డింపుల్‌ చోపడే, ఆశుశుతోష్‌ రాణా, అజయ్‌, తులసి, ముఖేష్‌ రిషి, పవిత్రా లోకేష్‌, బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, వైవా హర్ష తదితరులు
కథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సంగీతం: దినేష్‌, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు’ 
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, నిర్మాత: రాజు

విడుదల : ఫిబ్రవరి 19, 2016


రేళ్ళ క్రితం తెలుగు సినిమా హీరోల సరసన తనుకూడా చేరిపోయిన స్టార్ కమెడియన్ సునీల్, ‘కమెడియన్ ముదిరితే గ్యారంటీగా హీరో అవుతాడు’ అనుకుంటున్న కొత్త ఇమేజి మేకోవర్ కోసం ఇంకా స్ట్రగుల్ చేయాల్సే వస్తోంది. పెద్ద పెద్ద స్టార్లే కామెడీలు చెయ్యందే సినిమాల్ని వదలనప్పుడు కమెడియన్లంతా కంగారుపడిపోతోంటే, తన లాంటి స్టార్ కమెడియన్  హీరోనై పోవాలనుకోవడం అప్పటికి ముందు జాగ్రత్త చర్యే.  కానీ తను వేసిన ప్లానుకి కౌంటర్ గా హీరోలే   ‘హీరో ముదిరితే సెంట్ పర్సెంట్ గ్యారంటీగా కమెడియన్ అవుతాడు’ అన్న ఐడియాలజీని ఆల్రెడీ డెవలప్ చేసుకుని సాగిపోతూంటే, తగుదునమ్మా అని ఇటొచ్చి తను ఇంకా సీరియస్ ఎమోషనల్ పాత్రలతో హీరోగా ఏదో  సాధించాలనుకోవడం తప్పటడుగే. రెండేళ్ళ విరామం తర్వాత ‘కృష్ణాష్టమి’ కి  ఇంత  కష్టపడి యమ సీరియస్ పాత్రలో ఫైట్లూ అవీ చేసేస్తూ పదేళ్ళ క్రితం అయిపోయిన ఆటే మళ్ళీ ఆడుకుంటూంటే ట్రెండ్ ఎలా ఒప్పుకుంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. ఉట్టి కొట్టాల్సిన ఈ కృష్ణాష్టమి ఆటకి సపోర్టుగా ఇతర స్టార్ల పాత్రలూ, వాళ్ళు నటించేసిన సీన్లే వాడుకుంటే,  హిట్టు కొట్టడం కూడా కనా కష్టమేనని తేలుతోంది.   


         స్టార్ నిర్మాత దిల్ రాజు స్టార్లతోనే  బ్యాలెన్స్ తప్పడం జరగాల్సిన పని కాదు. స్టార్లు వస్తూంటారు పోతూంటారు, ఓ వ్యవస్థగా స్థిరంగా నిలబడాల్సిన  పని స్టార్ ప్రొడ్యూసర్ గా తనది. ఏ  మీడియాలోనూ స్థిరత్వం అనేది లేదు, రోజురోజుకీ మారిపోయే స్వరూపాలే తప్ప. ఇంకా దిల్ రాజు తనకి అలవాటయిన పాత మూస కుటుంబ కథలే తెలుగు ప్రేక్షకులకి శిరోధార్యం అనుకోవడం తన స్థిరత్వం చేజారిపోతూండడానికి కారణం. యశ్ చోప్రా ఫిలిమ్స్ ఈ జాడ్యం వదిలించుకున్నారు. కరణ్ జోహార్ కూడా వదిలించుకుని ముందుకెళ్తున్నాడు. దిల్ రాజు వదలకపోవడం వ్యూహాత్మక తప్పిదంన్నర తప్పిదం. 

        2009 లో ‘శివ’ లాంటి ‘జోష్’ తీసి  దెబ్బతిని, 2016 లో అంకె చూసుకుని జేమ్స్ బాండ్ 116 లా తిరిగి వచ్చిన దర్శకుడు వాసూవర్మ,  ‘కృష్ణాష్టమి’ ని ఎన్నో దిల్ రాజు తీసిన, ఇతరులూ తీసిన  సినిమాల చద్దన్నంలా తయారు చేసి వడ్డించడం చాలా కామెడీ. ఈసారి కమెడియన్ సునీల్ సినిమాలో కామెడీ అనేది లేకపోయినా ఆ లోటుని సినిమా చుట్టూ జరిగిన  చాలా కామెడీలు తీరుస్తాయి- వదిలేద్దాం.

        ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని కమెడియన్ గా ఎస్టాబ్లిష్ అయిన సునీల్, ఆరేళ్లుగా అయిదు సినిమాలు నటిస్తున్నా హీరోగా తన భవితవ్యం ఏమిటో తనేకే తెలీని సందిగ్ధావస్థ లో వుండడం త్రిశంకు స్వర్గం లాంటిదే.

        ‘కృష్ణాష్టమి’ తో ప్రేక్షకుల్ని కూడా త్రిశంకు స్వర్గంలో పడెయ్యడం పరాకాష్టకి చేర్చింది. చూసిందే చూడమంటున్న ఈ సినిమాలో అసలేముందో ఇక చూద్దాం...

ఎన్నారై ఇన్ ట్రబుల్ !
         ఎన్నారై కృష్ణ వరప్రసాద్ (సునీల్) కి అందరు ఎన్నారై హీరో పాత్రల్లాగే ఇండియా అంటే చచ్చే ప్రేమ. ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలంటే చాలా ప్రాణం. అమెరికా వదిలి ఇండియా వచ్చేసి తన గ్రామంలో సెటిలవ్వాలని తాపత్రయం. ఈ తాపత్రయానికి ఇండియాలో  వుండే పెదనాన్న ( ముఖేష్ రిషి) పెద్ద అడ్డంకి. పద్దెనిమిదేళ్ళ నుంచీ ఇండియా రానియ్యడం లేదు. పైగా ఇప్పుడు అమెరికాలోనే  పిల్లని చూసి పెళ్లి  కూడా చేసేద్దామనుకుంటున్నాడు. ఇది  భరించలేక ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రభాస్ లా అమెరికాలో వీడియో గేమ్  డిజైనర్ గా ఉంటున్నకృష్ణ, ఫ్రెండ్ గిరి ( సప్తగిరి) ని వెంట బెట్టుకుని చెప్పా పెట్టకుండా ఇండియా బయల్దేరతాడు. ‘ఇష్క్’ లో నితిన్ కి జరిగినట్టు కనెక్టింగ్ ఫ్లైట్ (యూరోప్ లో ) ఆలస్యం కావడంతో మూడ్రోజులూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు ‘ఇష్క్’ లోనే  నితిన్ రోమాన్స్ కి నిత్యా మీనన్ దొరికినట్టు కృష్ణకి పల్లవి ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి దొరుకుతుంది. ఈమె పవనిజం లాగా తన పల్లవిజం అనే ఫిలాసఫీ చెబుతూ బెలూన్లతో జనాలకి కౌన్సెలింగ్ చేస్తూ తిరుగుతూంటుంది  ‘బాద్షా’ లో కాజల్  క్యారక్టర్ లాగా.

        ఈమెని ప్రేమలో పడెయ్యడానికి  ‘1- నేనొక్కడినే’ లో భ్రాంతులకి లోనయ్యే  మానసిక వ్యాధి పీడితుడైన మహేష్ బాబు ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కృష్ణ అలా నటిస్తూంటాడు. ఈమెని ప్రేమలో పడెయ్యడం పూర్తయ్యాకా ఫ్లైట్ టైమవుతుంది.

        ఈ జనవరి- ఫిబ్రవరీల్లోనే  వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘స్పీడున్నోడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ల్లాగే రొటీన్ గా మళ్ళీ రాయలసీమకే కథని లాక్కెళ్తూ  చిత్తూరులో దిగుతాడు కృష్ణవరప్రసాద్ తన ఫ్రెండ్ తో కలిసి. ఈ ప్రయాణంలో ‘సంతోషం’ లో నాగార్జునలా ఓ పి ల్లాణ్ణి వెంటేసుకుని డాక్టర్ అజయ్ ( అజయ్) తగుల్తాడు. వెంటనే ఇతడి మీద ఫ్యాక్షన్ ఎటాక్ జరగడంతో  కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇతణ్ణి హాస్పిటల్లో పడేసి పిల్లాడితో వాళ్ళింటికి వెళ్తాడు  కృష్ణ.  ఆ ఇల్లు రెడ్డి (ఆశుతోష్ రాణా) అనే ఫ్యాక్షనిస్టుది. కోమాలో వున్న డాక్టర్ అజయ్ ఇతడి అల్లుడే.

        గతంలో చచ్చిపోయిన పెద్ద కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళికొడుకు అజయ్ ని  ఈ రెడ్డి చూడలేదు కాబట్టి, కృష్ణే తన అల్లుడనుకుని మర్యాదలు చేస్తూంటాడు. ఇక్కడ అజయ్ మరదలు ( డింపుల్ చోపడే) బావగారనుకుని హద్దులు మీరి కృష్ణని కవ్విస్తూంటుంది. ఈమెతో కృష్ణకి పెళ్లి కూడా అనుకునేస్తారు. అప్పుడు అసలు సంగతి కృష్ణకి తెలుస్తుంది. తనే  అనుకుని అజయ్ మీద హత్యాయత్నం చేశారని, నిజానికి తనని చంపడానికే  ఈ ఇంట్లోంచి  ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఈ ఇంట్లోనే ‘మర్యాదరామన్న’ లో హీరోలా ( ఇదీ సునీలే!) తానుంటున్నాడనీ.. ఇపుడేం చెయ్యాలి?

       చేయడానికి చాలా సినిమా బిట్లున్నాయి. ఒక్కోటి తీసి వాడుకోవడమే. ‘రెడీ’, ‘బృందావనం’, ‘మిర్చీ’, ‘అతడు’ ఇలా సెకండాఫ్ లో కూడా చూసేసిన  సినిమాల కత్తిరింపులే  మనకి చూపించి సంతోష పెడతారు.

ఎవరెలా చేశారు      సునీల్ బిగిసుకు పోయి చేశాడు. హీరోగా నటించాలంటే తనలోంచి అది సహజంగా రావడం లేదే అన్న బెంగతో మెగాస్టార్ లా కాస్సేపు, ప్రిన్స్ మహేష్ బాబులా కాస్సేపూ నటించుకు పోతున్నట్టు కన్పిస్తాడే తప్ప ఈజ్ లేదు.  చాలా సీన్లలో దీన్ని గమనించ వచ్చు. పైగా నలభైల్లో పడ్డాడని కాబోలు, ఇదివరకు ‘పూలరంగడు’ లో వున్న పంచ్ కూడా అక్కడక్కడా వున్న కామెడీలో వేయలేకపోతున్నానూ అన్నట్టు అలసటతో కన్పిస్తాడు. సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేసినంతమాత్రానే సినిమాకి చాలదు కదా? సీరియెస్ నెస్ కితోడు, చాలా సీన్లలో పాత్ర ఉదాత్తమైనదిగా కన్పిస్తుంది. ఇది తనకి అవసరమా? తనలోని  కమెడియన్ని మర్చిపోయి, గుమ్మడిని చూడమనడమా? పాత్ర ఏదో త్యాగం చేస్తోంది సరే, దాన్ని అంత బరువుగా చూపించడం కూడా అవసరమా? పైగా పది సినిమాలు గుర్తొచ్చేలా బిట్స్ ని పట్టుకుని నటించేసి ఇంతే తన వల్లయ్యేదని చాటుకుంటే ఎలా? 

        బిట్స్ అతికింపులని మరిపించాలంటే క్యారక్టర్ అనే మంత్రదండాన్నే  ప్రయోగించాలి. ‘భలే భలే మగాడివోయ్’ లో  కథకి స్ట్రక్చర్ లేకపోయినా ఆ లోపం తెలియకుండా, పదినిమిషాలకో గట్టి బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ  హల్చల్ చేసే నాని పాత్ర చిత్రణే  సినిమాని సూపర్ హిట్ చేసింది. సునీల్ పాత్రకూడా కథనంలో వున్నఅన్ని లోపాలనీ చిత్తు చేసి, చదును చేసి, తొక్కుకుంటూ రాచబాట వేసుకుంటూ  వెళ్ళిపోయే సూపర్ ఫాస్ట్ కామిక్ సెన్స్ తో తొణికిసలాడాల్సింది. కథలో తనబాట తను బలంగా వేసుకోలేని వాడు కథానాయకుడెలా అవుతాడు.  

        హీరోయిన్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాకొక హీరోయిన్ చొప్పున వచ్చిపోతూంటే వాళ్ళ గురించి ఇప్పుడే చెప్పుకోనవసరం లేదు, అదృష్టవంతురాళ్లై  ఇంకో రెండు సినిమాల్లో కన్పిస్తే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడదాం. చివర్లో వచ్చే బ్రహ్మానందం క్యారక్టర్, మొదట్నించీ  వుండే పోసానీ, సప్తగిరిల క్యారక్టర్స్ –వీటితోనే కాస్సేపు నవ్వుకోగాల్గుతాం. 

        బహుశా ఛాయాగ్రాహకుడుగా ఛోటా కె. నాయుడు చేసిన ఓ విషయం లేని ఇదే. పాటలకి సంగీతం కూర్చిన దినేష్ నుంచీ  ఒక్క క్యాచీ సాంగ్ కూడా రాలేదు. నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్ విలువలకి ఏ లోటూ రానివ్వకుండా డబ్బు ఖర్చుపెట్టారు. కానీ బ్యానర్ విలువ ఇలా నిలబడుతుందా?

        దశాబ్దానికి పైబడి దిల్ రాజు కాంపౌండ్ లో ఉంటూ పౌరసత్వం సంపాదించుకున్న వాసూవర్మ, ప్రేక్షకుల హృదయాల్లో స్థానికత పొందాలంటే ఇలా బిట్సు దోపిడీలు చేస్తే కాదు, పురాతన శైలిలో దర్శకత్వం వహిస్తే కూడా కాదు, రాంగోపాల్ వర్మ ఒక్కడే ఎందుకుంటున్నాడు, ఇంకో వర్మని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదూ అని దీని మీదే కథ ఆలోచించడం మొదలెడితే ఒరిజినాలిటీ, నావెల్టీ అన్నీ వాటికవే వచ్చి పలకరిస్తాయి.


-సికిందర్
http://www.cinemabazaar.in/