స్క్రీన్ ప్లే – దర్శకత్వం :
వాసూ వర్మ
తారాగణం: సునీల్, నిక్కీ గల్రానీ, డింపుల్
చోపడే, ఆశుశుతోష్ రాణా, అజయ్,
తులసి, ముఖేష్ రిషి, పవిత్రా
లోకేష్, బ్రహ్మానందం, సప్తగిరి,
పృధ్వీ, వైవా హర్ష తదితరులు
కథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సంగీతం: దినేష్, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు’
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,
నిర్మాత: రాజు
విడుదల : ఫిబ్రవరి 19, 2016
స్టార్
నిర్మాత దిల్ రాజు స్టార్లతోనే బ్యాలెన్స్
తప్పడం జరగాల్సిన పని కాదు. స్టార్లు వస్తూంటారు పోతూంటారు, ఓ వ్యవస్థగా స్థిరంగా నిలబడాల్సిన
పని స్టార్ ప్రొడ్యూసర్ గా తనది. ఏ మీడియాలోనూ స్థిరత్వం అనేది లేదు, రోజురోజుకీ
మారిపోయే స్వరూపాలే తప్ప. ఇంకా దిల్ రాజు తనకి అలవాటయిన పాత మూస కుటుంబ కథలే
తెలుగు ప్రేక్షకులకి శిరోధార్యం అనుకోవడం తన స్థిరత్వం చేజారిపోతూండడానికి కారణం. యశ్
చోప్రా ఫిలిమ్స్ ఈ జాడ్యం వదిలించుకున్నారు. కరణ్ జోహార్ కూడా వదిలించుకుని ముందుకెళ్తున్నాడు.
దిల్ రాజు వదలకపోవడం వ్యూహాత్మక తప్పిదంన్నర తప్పిదం.
2009 లో ‘శివ’ లాంటి ‘జోష్’ తీసి దెబ్బతిని, 2016 లో అంకె చూసుకుని జేమ్స్ బాండ్ 116 లా తిరిగి వచ్చిన దర్శకుడు వాసూవర్మ, ‘కృష్ణాష్టమి’ ని ఎన్నో దిల్ రాజు తీసిన, ఇతరులూ తీసిన సినిమాల చద్దన్నంలా తయారు చేసి వడ్డించడం చాలా కామెడీ. ఈసారి కమెడియన్ సునీల్ సినిమాలో కామెడీ అనేది లేకపోయినా ఆ లోటుని సినిమా చుట్టూ జరిగిన చాలా కామెడీలు తీరుస్తాయి- వదిలేద్దాం.
ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని కమెడియన్ గా ఎస్టాబ్లిష్ అయిన సునీల్, ఆరేళ్లుగా అయిదు సినిమాలు నటిస్తున్నా హీరోగా తన భవితవ్యం ఏమిటో తనేకే తెలీని సందిగ్ధావస్థ లో వుండడం త్రిశంకు స్వర్గం లాంటిదే.
‘కృష్ణాష్టమి’ తో ప్రేక్షకుల్ని కూడా త్రిశంకు స్వర్గంలో పడెయ్యడం పరాకాష్టకి చేర్చింది. చూసిందే చూడమంటున్న ఈ సినిమాలో అసలేముందో ఇక చూద్దాం...
ఎన్నారై ఇన్ ట్రబుల్ !
ఎన్నారై కృష్ణ వరప్రసాద్ (సునీల్) కి అందరు
ఎన్నారై హీరో పాత్రల్లాగే ఇండియా అంటే చచ్చే ప్రేమ. ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలంటే
చాలా ప్రాణం. అమెరికా వదిలి ఇండియా వచ్చేసి తన గ్రామంలో సెటిలవ్వాలని తాపత్రయం. ఈ
తాపత్రయానికి ఇండియాలో వుండే పెదనాన్న (
ముఖేష్ రిషి) పెద్ద అడ్డంకి. పద్దెనిమిదేళ్ళ నుంచీ ఇండియా రానియ్యడం లేదు. పైగా
ఇప్పుడు అమెరికాలోనే పిల్లని చూసి పెళ్లి కూడా చేసేద్దామనుకుంటున్నాడు. ఇది భరించలేక ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రభాస్ లా అమెరికాలో
వీడియో గేమ్ డిజైనర్ గా ఉంటున్నకృష్ణ,
ఫ్రెండ్ గిరి ( సప్తగిరి) ని వెంట బెట్టుకుని చెప్పా పెట్టకుండా ఇండియా బయల్దేరతాడు.
‘ఇష్క్’ లో నితిన్ కి జరిగినట్టు కనెక్టింగ్ ఫ్లైట్ (యూరోప్ లో ) ఆలస్యం కావడంతో
మూడ్రోజులూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు ‘ఇష్క్’ లోనే నితిన్ రోమాన్స్ కి నిత్యా మీనన్ దొరికినట్టు
కృష్ణకి పల్లవి ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి దొరుకుతుంది. ఈమె పవనిజం లాగా తన
పల్లవిజం అనే ఫిలాసఫీ చెబుతూ బెలూన్లతో జనాలకి కౌన్సెలింగ్ చేస్తూ తిరుగుతూంటుంది ‘బాద్షా’ లో కాజల్ క్యారక్టర్ లాగా.
ఈమెని
ప్రేమలో పడెయ్యడానికి ‘1- నేనొక్కడినే’ లో
భ్రాంతులకి లోనయ్యే మానసిక వ్యాధి
పీడితుడైన మహేష్ బాబు ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కృష్ణ అలా నటిస్తూంటాడు. ఈమెని
ప్రేమలో పడెయ్యడం పూర్తయ్యాకా ఫ్లైట్ టైమవుతుంది.
ఈ జనవరి- ఫిబ్రవరీల్లోనే వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘స్పీడున్నోడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ల్లాగే రొటీన్ గా మళ్ళీ రాయలసీమకే కథని లాక్కెళ్తూ చిత్తూరులో దిగుతాడు కృష్ణవరప్రసాద్ తన ఫ్రెండ్ తో కలిసి. ఈ ప్రయాణంలో ‘సంతోషం’ లో నాగార్జునలా ఓ పి ల్లాణ్ణి వెంటేసుకుని డాక్టర్ అజయ్ ( అజయ్) తగుల్తాడు. వెంటనే ఇతడి మీద ఫ్యాక్షన్ ఎటాక్ జరగడంతో కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇతణ్ణి హాస్పిటల్లో పడేసి పిల్లాడితో వాళ్ళింటికి వెళ్తాడు కృష్ణ. ఆ ఇల్లు రెడ్డి (ఆశుతోష్ రాణా) అనే ఫ్యాక్షనిస్టుది. కోమాలో వున్న డాక్టర్ అజయ్ ఇతడి అల్లుడే.
గతంలో చచ్చిపోయిన పెద్ద కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళికొడుకు అజయ్ ని ఈ రెడ్డి చూడలేదు కాబట్టి, కృష్ణే తన అల్లుడనుకుని మర్యాదలు చేస్తూంటాడు. ఇక్కడ అజయ్ మరదలు ( డింపుల్ చోపడే) బావగారనుకుని హద్దులు మీరి కృష్ణని కవ్విస్తూంటుంది. ఈమెతో కృష్ణకి పెళ్లి కూడా అనుకునేస్తారు. అప్పుడు అసలు సంగతి కృష్ణకి తెలుస్తుంది. తనే అనుకుని అజయ్ మీద హత్యాయత్నం చేశారని, నిజానికి తనని చంపడానికే ఈ ఇంట్లోంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఈ ఇంట్లోనే ‘మర్యాదరామన్న’ లో హీరోలా ( ఇదీ సునీలే!) తానుంటున్నాడనీ.. ఇపుడేం చెయ్యాలి?
చేయడానికి చాలా సినిమా బిట్లున్నాయి. ఒక్కోటి తీసి వాడుకోవడమే. ‘రెడీ’, ‘బృందావనం’, ‘మిర్చీ’, ‘అతడు’ ఇలా సెకండాఫ్ లో కూడా చూసేసిన సినిమాల కత్తిరింపులే మనకి చూపించి సంతోష పెడతారు.
ఎవరెలా చేశారు సునీల్
బిగిసుకు పోయి చేశాడు. హీరోగా నటించాలంటే తనలోంచి అది సహజంగా రావడం లేదే అన్న బెంగతో
మెగాస్టార్ లా కాస్సేపు, ప్రిన్స్ మహేష్ బాబులా కాస్సేపూ నటించుకు పోతున్నట్టు
కన్పిస్తాడే తప్ప ఈజ్ లేదు. చాలా సీన్లలో
దీన్ని గమనించ వచ్చు. పైగా నలభైల్లో పడ్డాడని కాబోలు, ఇదివరకు ‘పూలరంగడు’ లో వున్న
పంచ్ కూడా అక్కడక్కడా వున్న కామెడీలో వేయలేకపోతున్నానూ అన్నట్టు అలసటతో కన్పిస్తాడు.
సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేసినంతమాత్రానే సినిమాకి చాలదు కదా? సీరియెస్ నెస్
కితోడు, చాలా సీన్లలో పాత్ర ఉదాత్తమైనదిగా కన్పిస్తుంది. ఇది తనకి అవసరమా?
తనలోని కమెడియన్ని మర్చిపోయి, గుమ్మడిని
చూడమనడమా? పాత్ర ఏదో త్యాగం చేస్తోంది సరే, దాన్ని అంత బరువుగా చూపించడం కూడా అవసరమా?
పైగా పది సినిమాలు గుర్తొచ్చేలా బిట్స్ ని పట్టుకుని నటించేసి ఇంతే తన వల్లయ్యేదని
చాటుకుంటే ఎలా?
బిట్స్ అతికింపులని మరిపించాలంటే క్యారక్టర్ అనే మంత్రదండాన్నే ప్రయోగించాలి. ‘భలే భలే మగాడివోయ్’ లో కథకి స్ట్రక్చర్ లేకపోయినా ఆ లోపం తెలియకుండా, పదినిమిషాలకో గట్టి బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ హల్చల్ చేసే నాని పాత్ర చిత్రణే సినిమాని సూపర్ హిట్ చేసింది. సునీల్ పాత్రకూడా కథనంలో వున్నఅన్ని లోపాలనీ చిత్తు చేసి, చదును చేసి, తొక్కుకుంటూ రాచబాట వేసుకుంటూ వెళ్ళిపోయే సూపర్ ఫాస్ట్ కామిక్ సెన్స్ తో తొణికిసలాడాల్సింది. కథలో తనబాట తను బలంగా వేసుకోలేని వాడు కథానాయకుడెలా అవుతాడు.
హీరోయిన్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాకొక హీరోయిన్ చొప్పున వచ్చిపోతూంటే వాళ్ళ గురించి ఇప్పుడే చెప్పుకోనవసరం లేదు, అదృష్టవంతురాళ్లై ఇంకో రెండు సినిమాల్లో కన్పిస్తే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడదాం. చివర్లో వచ్చే బ్రహ్మానందం క్యారక్టర్, మొదట్నించీ వుండే పోసానీ, సప్తగిరిల క్యారక్టర్స్ –వీటితోనే కాస్సేపు నవ్వుకోగాల్గుతాం.
బహుశా ఛాయాగ్రాహకుడుగా ఛోటా కె. నాయుడు చేసిన ఓ విషయం లేని ఇదే. పాటలకి సంగీతం కూర్చిన దినేష్ నుంచీ ఒక్క క్యాచీ సాంగ్ కూడా రాలేదు. నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్ విలువలకి ఏ లోటూ రానివ్వకుండా డబ్బు ఖర్చుపెట్టారు. కానీ బ్యానర్ విలువ ఇలా నిలబడుతుందా?
దశాబ్దానికి పైబడి దిల్ రాజు కాంపౌండ్ లో ఉంటూ పౌరసత్వం సంపాదించుకున్న వాసూవర్మ, ప్రేక్షకుల హృదయాల్లో స్థానికత పొందాలంటే ఇలా బిట్సు దోపిడీలు చేస్తే కాదు, పురాతన శైలిలో దర్శకత్వం వహిస్తే కూడా కాదు, రాంగోపాల్ వర్మ ఒక్కడే ఎందుకుంటున్నాడు, ఇంకో వర్మని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదూ అని దీని మీదే కథ ఆలోచించడం మొదలెడితే ఒరిజినాలిటీ, నావెల్టీ అన్నీ వాటికవే వచ్చి పలకరిస్తాయి.