రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, January 12, 2016

బయోపిక్ తో లక్!





కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రాం గోపాల్ వర్మ

తారాగణం : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పారుల్ యాదవ్, యజ్ఞా శెట్టి తదితరులు

సంగీతం : రవి శంకర్, నేపధ్యసంగీతం : శాండీ, సత్య, కాశ్యప్
ఛాయాగ్రహణం : రమ్మీ ,
 కూర్పు: అన్వర్ అలీ, మేకప్ : వికాస్ గైక్వాడ్, యాక్షన్ : అలన్ అమీన్, బ్యానర్ : జెడ్ 3 పిక్చర్స్
నిర్మాతలు : బి.వి. మంజు నాథ్, బి. ఎస్. సుధీంద్ర, ఇ. శివప్రకాష్
విడుదల : జనవరి 7, 2016
***
మధ్య తెలుగులో అల్లాటప్పా సినిమాలు తీస్తూ అల్లరి పాలవుతున్న రాం గోపాల్ వర్మ, కన్నడ వెళ్లి కంటెంట్ వున్న సినిమా తీసి నిరూపించుకునే పని చేశాడు వీరప్పన్ కథతో. ఈ మాత్రం కంటెంట్ తెలుగులో కన్పించలేదా అంటే, ‘రక్త చరిత్ర’ తర్వాత కన్పించలేదు. నడుస్తున్న చరిత్రతో ‘శివ’ లాంటిది తీసే ఆలోచన చేయలేక, కన్నడలో గతించిన వీరప్పన్ చరిత్రలో ఆ కంటెంట్ అంతా కన్పించి, బ్యాంగ్ ఇద్దామని అటెళ్ళిపోయాడు. అట్నుంచీ విజయఢంకా మోగించాడు దేశవ్యాప్తంగా విన్పించేట్టుగా.  
‘కిల్లింగ్ వీరప్పన్’ ని ఒక వ్యక్తి జీవిత చరిత్రని  ఎలా తెరకెక్కించాలన్నదానికి ఇంకో గైడ్ లా అందించాడు వర్మ. ఆల్రెడీ రిచర్డ్ అటెన్ బరో అందించిన గైడ్ లా ‘ గాంధీ’ వుండనే వుంది. దీన్నుంచి ఏమీ నేర్చుకోక దర్శకుడు గుణశేఖర్  ‘రుద్రమ దేవి’ తీసి రుద్రమదేవి చరిత్రని గజిబిజి చేశాడు. వీరప్పన్ ని తీసుకుని వర్మ బయోపిక్ (జీవిత చరిత్ర) చిత్రణకి ఎలా న్యాయం చేయవచ్చో తీసి చూపించాడు. జీవిత చరిత్ర తీయడమంటే మహాభారతంలా చాంతాడంత తీసుకుంటూ పోవడం కాదు. మహాభారతాన్ని కూడా ఎక్కడికక్కడ విడగొట్టి ఒక్కో కథగా- ఒక్కో పాత్ర కథగా - తీసిన సినిమాలు ఇందుకే వచ్చాయి. ఒక సినిమా తీసి భావి దర్శకులకి నేర్చుకోవడానికి ఏమీ ఇవ్వని సీనియర్ దర్శకుడు ఉన్నా లేనట్టే అన్పించుకుంటాడు. నేనున్నానూ అని నిరూపించాడు వర్మ  వీరప్పన్ తో.
వివరంగా తెలుసుకునేందుకు ముందు కథలోకి వెళ్దాం...


కథ
    ఇరవై ఏళ్లుగా దొరక్కుండా కర్నాటక- తమిళనాడు సరిహద్దుల్లో సత్యమంగళం  అడవుల్లో గడగడ లాడిస్తున్న అడవిదొంగ వీరప్పన్ ని పట్టుకునే ఆపరేషన్ కకూన్ పేరుతో  పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంఘర్షణ ఇది. అడ్డొచ్చిన 184 మందిని చంపి ( ఇందులో సగానికి సగం మంది పోలీసులే) కొన్ని వందల ఏనుగుల్నివాటి  దంతాలకోసం వధిస్తూ, మరోపక్క చందనపు చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తూఇంకో పక్క కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కూడా కిడ్నాప్ చేసి  పెను సవాలుగా మారిన వీరప్పన్ ( సందీప్ భరద్వాజ్)  తనని ట్రాప్ చేయడానికి వస్తున్న పోలీసు దళాన్ని ఇన్ఫార్మర్ సహా హతమార్చడం తో ఈ కథ ప్రారంభమవుతుంది. పోలీసులు పన్నే మరికొన్ని పథకాల్ని కూడా తిప్పికొట్టి వాళ్ళని హతమార్చడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ  ( శివరాజ్ కుమార్ పోషించిన ఈ పాత్రకి పేరు పెట్టలేదు, నిజజీవితంలో  టాస్క్ ఫోర్స్ ఎస్పీ సెంతమరై కణ్ణన్ ఈ పాత్రకి ఆధారం) ఇక కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. వీరప్పన్ ని అడవిలో వేటాడి పట్టుకోలేమని, అతణ్ణి అడవిలోంచి బయటికి రప్పిస్తేనే పట్టుకోగలమని పై అధికారిని ఒప్పించి ఆ దిశగా ప్లాన్ చేస్తాడు.

సమీప గ్రామంలో శ్రేయ ( పారుల్ యాదవ్) అనే అమ్మాయిని ప్రోత్సహించి ఇన్ఫార్మర్ గా మార్చుకుంటాడు. ఆమె ఇంట్లోకి వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ( యజ్ఞా శెట్టి ) అద్దెకి దిగేలా చేసి శ్రేయ చేత ఆమెని వాచ్ చేయిస్తూంటాడు. ముత్తులక్ష్మిని కల్సుకోవాలని వీరప్పన్ నుంచి రహస్య సమాచారం అందినప్పుడు,  ఆ కలుసుకునే రహస్య ప్రదేశాన్ని ఒక ఫాం హౌస్ లో ఏర్పాటు చేస్తుంది శ్రేయ. ఆమెని నమ్మిన ముత్తులక్ష్మి అలాగే వీరప్పన్ ని అక్కడికి రమ్మనమని  కబురుపెడుతుంది ఇన్ఫార్మర్ ద్వారా. ఎస్పీ టీం అంతా మరు వేషాల్లో ఫాం వర్కర్స్ లా వచ్చి  పనులు చేసుకుంటూ వుంటారు. కానీ ఈ టీం లోనే  వీరప్పన్ తొత్తు ఒకడు వుండడం వల్ల  అసలు విషయం వీరప్పన్ కి తెలిసిపోయి వచ్చేసి ఫాం హౌస్  మీద దాడి చేస్తాడు.  మారు వేషాల్లో వున్న పోలీసుల్ని హతమారుస్తాడు. 

ఎస్పీ, వీరప్పన్ ముఖా ముఖీ తలపడతారు. కాల్పులు జరిపి వీరప్పన్ అడవిలోకి తప్పించుకుంటాడు. ఇంత ప్లానూ ఇలా బెడిసి కొట్టినందుకు నీరుగారిపోతాడు ఎస్పీ.

ఇప్పుడేం చేయాలి? వీరప్పన్ కి ఇంకెలా వలపన్నాలి? అసలీ అడవిలోంచి బయటికి రప్పించే ప్లాన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా? వీరప్పన్ పసిగట్టేస్తాడా? వీణ్ణి ఇంకెలా పట్టుకోవాలి? ..అన్నవి ఎస్పీ ఎదుటవున్న సవాళ్లు.

        పై అధికారి ఎస్టీ ఎఫ్ చీఫ్ ( నిజజీవితంలో ఎడిజిపి కె. విజయకుమార్ పాత్రని శ్రీధర్ పోషించాడు) కి ఏమని సమాధానం చెప్పుకోవాలి?
ఎలావుంది కథ 
న్నడ, హిందీ నటులతో ఇది డబ్బింగే  అయినా, ఈ నాన్ స్టాప్ అడ్వెంచర్- థ్రిల్లర్  ని చూడ్డం  మొదలెడితే  డబ్బింగ్ అనే సంగతే మర్చిపోతారు తెలుగు ప్రేక్షకులు. పైగా అంతో ఇంతో వీరప్పన్ గురించి తెలిసే వుంటుంది కాబట్టి, ఈ ఆసక్తికి  నేటివిటీ అడ్డురాదు. మామూలు కాల్పనిక కథల్ని డబ్బింగ్ చేస్తే వుండే నేటివిటీ సంబంధమైన అడ్డు, సమాజంలో ఒక వ్యక్తి జీవితం గురించి సినిమా తీసినప్పుడు,  ఆ వ్యక్తి ఏ ప్రాంతీయుడైనా  పాపులర్ అయివుంటే,  ప్రాంతీయతకి అతీతమైపోతుంది ఆ డబ్బింగ్. ఇదే ‘కిల్లింగ్ వీరప్పన్’ కి కలిసివచ్చిన అంశం. మామూలుగానైతే ఈ మధ్య తెలుగులో ఐస్ క్రీమ్ సినిమాలు తీస్తున్న వర్మ  తీసిన మరో సినిమాని ఎవరూ పట్టించుకోరు. కానీ ముందు కన్నడ ఒరిజినల్ విడుదలై అక్కడ మార్మోగడంతో తెలుగు ప్రేక్షకుల ఆసక్తి అలాకూడా పెరిగి,  అస్పృశ్యుడైన వర్మని సత్పురుషుడుగా నమ్మగలిగారు. వర్మ ఇంకో కల్పిత కథతో పైత్యం (సినిమా)  తీసివుంటే ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. వీరప్పన్ జీవిత కథతో తీయడంవల్ల- వీరప్పన్ కోసం మళ్ళీ వర్మ సినిమా చూసేందుకు ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. కనుక వీరప్పన్ వర్మకి పునర్జన్మనిచ్చినట్టే తన కథనంతా ధారబోసి.

ఎవరెలా చేశారు
       వీరప్పన్ కిడ్నాప్ చేసిన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడు, కన్నడ హీరో  శివరాజ్ కుమార్ ని ఈ సినిమాలో చూస్తే, నిజంగా తన తండ్రిని  కిడ్నాప్ చేసిన వీరప్పన్ మీద మాంచి కసితో నటించాడని ఆ ముఖకవళికలు చూస్తేనే  అర్ధమైపోతుంది. నిజజీవితంలో అలాటి బాధ అనుభవిస్తేనే అంత సహజంగా ఆ కసిని ప్రదర్శించగల్గుతారు. సినిమాలోనైనా అలాటి వీరప్పన్ ని చంపి కసి తీర్చుకునే అవకాశం రావడం ఒక గమ్మత్తయిన దైవలీల. కళ- జీవితం రెండిటి మధ్య విభజన రేఖ ఇలా చెరిగిపోయింది. ఇక మనం కళ, జీవితం రెండూ ఒకటేనని నమ్మితీరాలి! ఈ సినిమా బాక్సాఫీస్ అప్పీల్ కి ఇది కూడా కలిసివచ్చింది.  శివరాజ్ కుమార్ స్థానంలో మరొక నటుడు ఉండుంటే ప్రేక్షకులు ఈ సినిమాని ‘ఓన్’ చేసుకునే తీరు, ఆ ఫలితాలు  వేరేగా వుండేవి.
సందీప్ భరద్వాజ్ ....వీరప్పన్ గా....
        క్లోజప్స్ వర్మ ఆస్తి. శివరాజ్ కుమార్ భావోద్వేగాల్ని ఆ క్లోజప్స్ కళతో ప్రేక్షకుల మెదళ్ళలోకి బలంగా దిగ్గొట్టి వదిలాడు వర్మ. ఇక వెంటాడే ఫేస్ అయిపోయింది శివరాజ్ కుమార్ ముఖాకృతి ఎంత వద్దన్నా. వీరప్పన్ ని చుట్టుముట్టి సిబ్బంది చంపుతూంటే దూరంగా కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ తాపీగా తిలకించే శివరాజ్ కుమార్ సంతృప్తి ఒక పతాక స్థాయి నటన. పాత్రని నిలబెట్ట గల్గితేనే సినిమా నిలబడుతుందని ఇందుమూలం గా ఫిలిం మేకర్లకి ఒక సూచన. 

        వీరప్పన్ పాత్రని  పోషించిన సందీప్ భరద్వాజ్ కూడా ఏమీ తీసిపోలేదు. ఎలాగైతే అమ్జాద్ ఖాన్ తొలి సినిమా ‘షోలే’ తో బందిపోటు గబ్బర్ సింగ్ పాత్రని అజరామరం చేశాడో, అలా తన తొలి సినిమాతో వీరప్పన్ కి ప్రాణం పోశాడు సందీప్ భరద్వాజ్ అనే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్టూడెంట్. మళ్ళీ ఆ క్లోజప్స్, ఆ కళ్ళల్లో కాంతి, చిన్నపిల్లాడి సంతోషం,  కర్కోటకుడి కౄరావేశం.. ఇవన్నీ వెంటాడే శూలాలై పోతాయి చూసేవాళ్ళకి. ఎందరో  విలన్లు వచ్చిపోతున్నారు- వాళ్ళు అరుస్తారు గానీ ఒక శక్తిగా మెరవరు. సందీప్ భరద్వాజ్ మాట నిదానం, చూపు చురకత్తి. అమ్జాద్ ఖాన్ కి కూడా ఇలాటి విషం స్రవించే కళ్ళు వుండవు.




       మరో ఇద్దరు గుర్తుండిపోయే నటులు పారుల్ యాదవ్ ( పారుల్ అంటే హిందీలో సుందరమైనది అట), యజ్ఞా శెట్టిలు. నాకులాగే నీక్కూడా స్వార్ధం వుంటుంది, ఆ స్వార్ధకోసం ఈ పనికి ఒప్పుకో-  అని ఎస్పీ పాత్ర అంటే, కేవలం ఓ అడ్వెంచర్ చేసి చూద్దామనే స్వార్ధం కోసమే పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిపోయే పాత్ర ఇది. వర్మ ఈ పాత్రని  నిర్లక్ష్యం చేయకుండా, సెకండాఫ్ లో తర్వాత్తర్వాత అంతగా పనిలేకపోయినా, ఒక సామాన్యమైన అమ్మాయిగా పోలీస్ యాక్షన్ ని అర్ధంచేసుకోవడానికి ఆయా సన్నివేశాల్లో ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన క్లోజప్స్ వేసి నిలబెట్టడం ఇంకో యెత్తు ఈ సినిమాకి. ఆమె చేతిలో రివాల్వర్ వుంటుంది. తప్పించుకుంటున్న వీరప్పన్ పక్కనించే పోతూంటాడు. మొట్టమొదటిసారిగా వీరప్పన్ ని ప్రత్యక్షంగా చూస్తున్న షాక్ తో చంపలేక చేష్టలుడిగి  ఆమె చూస్తూంటే ఆమెని చూసుకుంటూ పక్కనించే వెళ్ళిపోతాడు వీరప్పన్. కాల్పులు జరుపుకుంటున్న రెండు వర్గాల మధ్య క్రాస్ ఫైర్ లో అప్పుడప్పుడు పౌరులు చిక్కుకుంటూంటారు. అలాకూడా వుందామె పరిస్థితి. దివంగత విఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్  వేసే ప్రతీ కార్టూన్ లో  ధోతీ కట్టుకుని  కామన్ మాన్ ఉంటాడు- సమాజంలో జరిగే ఆయా వైపరీత్యాల్ని పొంచి వుండి విభ్రమంగా చూసే క్యారక్టర్. అలాటి క్యారక్టరే సెకండాఫ్ లో కంటిన్యూ అయ్యే పారుల్ పోషించిన పాత్ర. 
         
        ఈమెకి ముత్తు లక్ష్మి పాత్రలో యజ్ఞాశెట్టి తో బాండింగ్, ఆయా ఆహ్లాదకర సన్నివేశాల్లో నటనలూ గుర్తుండి పోయేవే. వీళ్ళిద్దరి ఎపిసోడ్లకి వర్మ కావలసినంత స్పేస్ ఇచ్చాడు. తనని నమ్మిన యజ్ఞా శెట్టి తో పారుల్ పాల్పడుతున్నది ద్రోహమే. ఒక దశలో పారుల్ ని అనుమానించిన యజ్ఞ అది క్లియరై అపరాధ భావంతో క్షమించమంటుంది. ఇది పారుల్ ని పూర్తిగా మోరల్ డైలమా లోకి నెట్టేసినా – తను చేస్తున్న అనైతికాన్ని పైకి చెప్పుకోలేని పరిస్థితి... ఈ మానవసంబంధాల్లోని మాలిన్యాలూ పాత్రలు – నటనలు ఆకట్టుకోవడానికి తోడ్పడ్డాయి.

                                                                        ***
       వెన్నెలకంటి శశాంక్ రాసిన మాటలు ( కన్నడ ఒరిజినల్ బాలాజీ కె) ఆడంబరాలు లేకుండా సహజంగా వున్నాయి. మాటలకంటే ఎక్కువగా హావభావాలతోనే సీన్లని వర్కౌట్ చేశారు. చివర్లో- ‘నువ్వు రాక్షసుడివి’ అంటాడు చీఫ్. రాక్షసుణ్ణి ( వీరప్పన్ ని ) చంపాలంటే రాక్షసుడిగా మారాల్సిందేనంటాడు ఎస్పీ. ఇది ముగింపు డైలాగు. ‘ఆపరేషన్ కకూన్’ వీరప్పన్ ని సజీవంగా పట్టుకోవడానికే  ప్రారంభించారు. కానీ సజీవంగా పట్టుకుంటే అతను  ఎవరెవరి గుట్లు బయటపెడతాడో తెలీదు కనుక చివర్లో పట్టుకునే అవకాశం వున్నా చంపేశారు. దీనికి సాక్షిగా వున్న ఒక పోలీసుని కూడా చంపేస్తాడు ఎస్పీ. ఈ నేపధ్యంలోంచి వచ్చినవే పై డైలాగులు. రాక్షసుడిగా మారడం మంచిదే. కానీ సాక్షిని చంపి తను చట్టానికి దొరక్కుండా చూసుకోవడం; అలాగే యంత్రాంగంలో, రాజకీయంలో వీరప్పన్ తో వుండే కనెక్షన్స్ రట్టు అవకుండా  కాపాడ్డం హీరోయిజం అన్పించుకోదు. ఈ రీత్యా ముగింపు డైలాగు పేలవంగా వుంది. తర్వాత అమెరికా బిన్ లాడెన్ ని చంపడంలో కూడా ఇదే నీతిని పాటించింది. 

        పాటలు షరా మామూలుగా చంపడం, నరకడం, నెత్తురు తాగడం, కట్లపాము, త్రాచుపాము, కొండచిలువ లాంటి క్షుద్ర పదాలతో నాటు గొంతుకల అరుపులతో, ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ’, ‘రౌడీ’ పాటల టైపులోనే మోటుగా వున్నాయి. వ్యక్తిగతంగా వర్మకే చంపాలనీ, రక్తం కళ్ళ జూడాలనీ మనసు తహతహ లాడుతున్నట్టుంది ఈ పాటల్లో ఘాటు చూస్తూంటే.

        పాటల సంగీతం అలా వుంచితే, ఈ మధ్య వర్మసినిమాల్లోలా మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదే గోలగా, ఫోర్సుడుగా, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టుగా వుంది. ఎఫెక్ట్స్ కూడా కథని ఫాలో అవుతున్నట్టు లేవు. చంపడానికి వీరప్పన్ గ్యాంగ్ తో అడవిలో మాటేసినప్పుడు ఒకటే హోరుగా పక్షుల కూతలు విన్పించడంలో సహజత్వం ఎక్కడుంది. అవెందుకలా నాన్ స్టాప్ గా అరిచేస్తున్నాయి. అలా అరుస్తూంటే అట్నుంచి వస్తున్న పోలీసులు ఎలర్ట్ కారా? ఇది వీరప్పన్ తెలుసుకోడా? ఇవన్నీ వదిలేద్దామనుకున్నా- మరి కాల్పుల మోతకి ఆ పక్షులేం  చేస్తున్నాయి. ఒక్క పెట్టున అవి ఎగిరిపోతున్న రెక్కల చప్పుళ్ళు  విన్పించాలిగా? ఇలా రొడ్డ కొట్టుడు ఎఫెక్ట్స్, రొడ్డ కొట్టుడు పాటలు వర్మ బాగా తీసిన సినిమాల స్థాయిని కూడా దిగజారుస్తున్నాయి.

        డ్రోన్ షాట్లు, 360 డిగ్రీ షాట్లు, పాయింటాఫ్ వ్యూ షాట్లతో సూపర్ ఫాస్ట్ కెమెరా వర్క్ బావుంది.  అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ కూడా.

        దర్శకుడగా వర్మ తిరిగి తన పాత ఫామ్ లో కొచ్చేశాడు. ఈ సినిమా చూస్తూంటే ఒకటే అర్ధమవుతుంది- కాకమ్మ కథలు కాకుండా, సమాజంలో జరిగే కథలు, వ్యక్తుల కథలు తీసినప్పుడు  పాత్రచిత్రణలు- వాటి చిత్రీకరణలు బలీయంగా వుండడం, వాటితో బలమైన ముద్ర వేయగల్గడం.  రియల్ క్యారక్టర్లలో పరకాయ ప్రవేశం చేసినంతగా తను ఫిక్షన్ క్యారక్టర్స్ లోకి దూరలేడెమో. రియల్ క్యారక్టర్స్ చిత్రీకరణ విషయంలో ‘గాడ్ ఫాదర్’ ని ఆవాహన చేసుకున్నట్టుంది.

స్క్రీన్ ప్లే సంగతులు
        స్ట్రక్చర్ ని పట్టించుకోకుండా శివాజీ గణేశన్ జోకేసిన – తెడ్డేసిన పడవ ప్రయాణపు కథా గమనంలా (ఆర్ట్ సినిమాల్లా) ఈ మధ్య వర్మ స్క్రీన్ ప్లేలు వుంటూంటే, ‘కిల్లింగ్ వీరప్పన్’ భిన్నంగా స్ట్రక్చర్ లో ( కమర్షియల్) కొచ్చేసింది. బయోపిక్ ( జీవిత చరిత్ర) ని సినిమాగా ఎలా తీయాలి, డాక్యుమెంటరీ ప్రాయమైన బయోపిక్ లని డ్రమెటిక్ చేసి  ఎలా డాక్యూ డ్రామాగా రక్తి కట్టించాలి, ఎంతవరకూ యదార్ధానికి దూరంగా సృజనాత్మక స్వేచ్ఛ  తీసుకోవాలి, ఏ వివాదాలకి దూరంగా వుండాలి లాంటి జాగ్రత్తల గురించి ఆలోచన ఈ స్క్రీన్ ప్లే వెనుక కన్పిస్తుంది. జీవితచరిత్ర చాలా రీసెర్చిని  డిమాండ్ చేస్తుంది. ఆ రీసెర్చి సారం ఒక స్క్రీన్ ప్లేలో ఒదగాలంటే మళ్ళీ  ఇది కూడా చాలా స్క్రీన్ ప్లే స్టడీస్ ని డిమాండ్ చేస్తుంది. కానీ జరుగుతున్న దేమిటంటే,  గొప్పగా జీవిత చరిత్రని ఏళ్ల తరబడి రీసెర్చి చేశామంటారు, తీరా దాన్ని రొడ్డ కొట్టుడు కమర్షియల్ మూస ఫార్ములా స్క్రీన్ ప్లే చట్రంలో ఇరికించి- ఎత్తుపల్లాల్ని(జవజీవాల్ని) చదును చేసేసే గుచ్చుకునే కంకర రోడ్డులా వేసేసి,  ‘పాన్ సింగ్ తోమర్’, ‘రుద్రమ దేవి’ ల్లాంటి ‘భ’యోపిక్ లతో జడిపించేస్తారు!

        జీవితచరిత్రని మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ఘట్టం తీసుకుని కూడా చేయవచ్చు. కిల్లింగ్ వీరప్పన్ లో ఇదే జరిగింది. జీవితంలో అతణ్ణి  చంపే  చివరి ఘట్టాన్నే సినిమాకి తీసుకున్నారు. అందుకే కిల్లింగ్ వీరప్పన్ అని టైటిల్ అయింది. ఇందుకే వీరప్పన్ అసలెవరు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎందుకు ఎలా అడవిదొంగగా మారాడు, అప్పుడేమేం చేశాడు- లాంటి వివరాలన్నీ దీనికి అవసరం లేదు. అది వేరే సినిమాగా తీయొచ్చు. అందువల్ల ఇది సమగ్రంగా లేదని భావించడం సరికాదు. అతడి జీవిత చరిత్రని కంపార్ట్ మెంటలైజ్ చేసి, అందులో అతణ్ణి పట్టుకునే క్రమాన్ని మాత్రమే చెప్పదలిచారు.  వీరప్పన్ ని పట్టుకోవడానికి ఎప్పుడో 1991 లోనే  తమిళనాడు- కర్ణాటక పోలీసులతో స్పెషల్  టాస్క్ ఫోర్స్ ఏర్పటయినా, అప్పట్నించీ ‘కిల్లింగ్ వీరప్పన్’ కథ చెప్పుకురాలేదు. దీన్ని మళ్ళీ సబ్- కంపార్ట్ మెంటలైజ్ చేశారు: కేవలం అంతిమంగా అతణ్ణి పట్టుకోవడానికి- లేదా చంపడానికి – పదినెలల క్రితం 2004 లో ప్రారంభించిన ‘ఆపరేషన్ కకూన్’ సాధకబాధకాల్ని మాత్రమే తీసుకున్నారు. ఇదీ రీసర్చి సారం. ఇక దీని పైనే కథనాన్ని ఫోకస్ చేస్తూ స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ వేశారు.

        ఏమిటా ఫౌండేషన్? మనం గతంలో రెండుమూడు సందర్భాల్లో  చెప్పుకున్నట్టు- ‘గాంధీ’ కి అటెన్ బరో వేసిన ఫౌండేషనే ఇలాటి సమయాల్లో అవసరపడుతోంది- అది  తెలుగులో ‘హేపీ డేస్’ లాంటి ఫిక్షన్ కైనా, హిందీలో  గాంధీ మై ఫాదర్ లాంటి మరో బయోపిక్ కైనా. మొత్తం మహాత్మా గాంధీ జీవితంలో కేవలం మూడు  ప్రధాన ఘట్టల్నే ‘గాంధీ’ స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ గా అటెన్ బరో తీసుకున్నట్టు- వీరప్పన్ జీవితాన్ని కంపార్ట్ మెంటలైజ్ చేసి, మళ్ళీ ఒక కంపార్ట్ మెంట్ ని సబ్ కంపార్ట్ మెంటలైజ్ చేస్తే తేలిన సారంలో, వర్మ కూడా మూడే ఘట్టాల్ని ఫౌండేషన్ గా తీసుకున్నాడు : 1. లేడీ ఇన్ఫార్మర్ తో వీరప్పన్ ని పట్టుకునే ప్రయత్నం, 2. ప్రముఖుల్ని కిడ్నాప్ చేయాలనీ వీరప్పన్ అనుకున్నప్పుడు అవసరమైన దుండగుల స్థానంలో పోలీస్ ఏజెంట్లని పంపే ప్రయత్నం, 3. వీరప్పన్ ఎల్ టీ టీ ఈ నేత ప్రభాకరన్ ని కలుసుకోవాలని ఉబాలట పడినప్పుడు,  వాహనంగా పోలీస్ ఏజెంట్ డ్రైవర్ గా వున్న అంబులెన్స్ ని పంపే ఘట్టం..



          మూడు ఘట్టాలనీ త్రీ యాక్ట్ (బిగినింగ్-మిడిల్-ఎండ్) స్ట్రక్చర్లో ఎలా సర్దాలి? నిజానికి ఈ మూడూ మిడిల్, ఎండ్ విభాగాల్లో మాత్రమే సర్దుకున్నాయి. బిగినింగ్ విభాగమంతా  వీరప్పన్ ఎదురుదాడుల్లో పోలీసులు మరణించడం, ఫ్లాష్ కట్స్ లో క్లుప్తంగా అతడి బ్యాక్ గ్రౌండ్ చూపించడం వగైరా వున్నాయి. సుమారు అరగంట తర్వాత బిగినింగ్  ముగుస్తూ- ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఇక వ్యూహం మార్చాలన్న ఎస్పీ ఆలోచనతో- వీరప్పన్ ని అడవిలోంచి బయటికి రప్పించాలని నిర్ణయించడంతో, మిడిల్ మొదలవుతుంది.   
ఈ మిడిల్ ప్రారంభంలోనే గ్రామంలో శ్రేయ అనే అమ్మాయిని ఎస్పీ తన ఇన్ఫార్మర్ గా నియమించుకోవడం, ఆమె ఇంట్లోకి ముత్తులక్ష్మి అద్దెకి దిగేలా చూడడం, ఆమె మీద కన్నేసి వుంచడం- ఇదంతా ఎస్పీ తనముందున్న సమస్యతో మిడిల్ బిజినెస్ ప్రకారం చేస్తున్న స్ట్రగుల్లో భాగంగానే.

ఇది ఫాం హౌస్ కి వీరప్పన్ ని రప్పించేందుకు దారితీసి- అక్కడ ఎలర్ట్ అయిన వీరప్పన్ ఎటాక్ చేయడంతో, ఇంటర్వెల్ దగ్గర  ఆ ప్లానంతా విఫలమవడం- ఎస్పీ స్ట్రగుల్ లో భాగంగా చోటు చేసుకోవాల్సిన బిజినెస్ లో - ప్రత్యర్ధితో సాగుతున్న ఈ యాక్షన్ రియాక్షన్ ల పర్వంలో  గట్టి ఎదురు దెబ్బ తగలాలన్న సూత్రాన్ని అమలు చేయడమే.

ఇంటర్వెల్ తర్వాత మిడిల్ కంటిన్యూ అవుతూ- ఎస్పీ మరో ఎత్తుగడ వేయడం- అది వీరప్పన్ గతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసినప్పుడు, డిమాండ్ చేసిన డబ్బులో తనకేం మిగల్లేదన్న అసంతృప్తితో- రజనీ కాంత్ సహా మరికొందరు రాజకీయ నాయకుల్ని  కిడ్నాప్ చేయదలచి- అందుకవసరమైన గ్యాంగ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు- ఎస్పీ తన  ఏజెంట్లని పంపి ట్రాప్ చేయాలనుకోవడం- ఇది కూడా పసిగట్టిన వీరప్పన్ భారీ ఎత్తున నష్టం కలగజేయడం, ఎస్పీ సన్నిహిత పోలీసు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగి మిడిల్ ముగుస్తుంది.

మిడిల్ ముగింపులో ( ప్లాట్ పాయింట్- 2) హీరోకి తీవ్ర  నష్టం జరిగి కోలుకోలేని పరిస్థితి ఎదురవడమనే సూత్ర పాలనే జరిగిందిక్కడ. దీని తర్వాత ఎండ్ విభాగం ప్రారంభిస్తూ వెళ్ళేది క్లయిమాక్ కే.   అలా సన్నిహిత పోలీసు ప్రాణాలు కోల్పోవడంతో ఎస్పీ కి సంకల్ప బలం పెరుగుతుంది. అవతల వీరప్పన్ శ్రీలంకలో ఎల్ టీ టీ ఈ నాయకుడు ప్రభాకరన్ వీరత్వం గురించి విని ఉప్పొంగిపోయి- అతణ్ణి కలుసుకోవలనుకుంటున్న ప్పుడు- ఎస్పీ తన ఏజెంట్ ద్వారా మాయోపాయంతో వీరప్పన్ ని ముఠా సహా అంబులెన్స్ లో అడవిలోంచి బయటికి రప్పిస్తూ గ్రామం మధ్యలో ఎన్ కౌంటర్  చేయడమనే ఎండ్ బిజినెస్ తో ముగింపు.
***
మూడు ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్లో కావలసినంత బిగువు, సస్పెన్స్, టెంపో, థ్రిల్ వగైరా..ఇందులో మళ్ళీ పాత్రల్నీ సంఘటనల్నీ సంఘర్షణల్నీ బాధల్నీ బలంగా ఎష్టాబ్లిష్ చేస్తూనే..

కావాల్సిందల్లా ఒక నిజ వ్యక్తి జీవితంలో ఒక బాక్సాఫీస్ సెల్లింగ్ పాయింటు వున్న భాగాన్ని మాత్రమే తీసుకుని, మళ్ళీ వెనక్కి చూడకుండా అక్కడ  స్పష్టమైన గీత గీసి- ఆ  భాగం వరకూ   స్ట్రక్చర్ లో కూర్చే నేర్పే.

        ‘కిల్లింగ్ వీరప్పన్’ స్క్రీన్ ప్లే ఇలాటి కథలకి ఒక గైడ్. గతంలో ‘శివ’ తో త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే కి వర్మే ఇచ్చిన గైడ్ కి లాగే.

-సికిందర్                                               










    









Sunday, January 3, 2016

ప్రేమ'నిప్పు'ణులు!









దర్శకత్వం : రమేష్ వర్మ

తారాగణం : నాగ శౌర్య, పలక్  లల్వానీ, రావు రమేష్, బ్రహ్మానందం, ‘మౌనరాగం’ మోహన్, తులసి, ప్రగతి తదితరులు
సంగీతం : ఇళయరాజా, ఛాయాగ్రహణం : శ్యాం కె నాయుడు
బ్యానర్ : జె. జె .  ప్రొడక్షన్స్, కిరణ్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట
విడుదల : జనవరి 1, 2016


నిమిది సినిమాల వయసుగల నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ అనే రెండు హిట్స్ మాత్రమే ఇవ్వగలిగి, ఆరు ఫ్లాప్స్ తో విజయవంతంగా కొనసాగడం రికార్డు. ఆరు ఫ్లాప్స్ జాబితాలో నూతన సంవత్సరారంభంలో  ‘అబ్బాయితో అమ్మాయి’ ని కూడా నూతనంగా చేర్చి, వినూత్నంగా  విన్యాసం చేయడం ఒక ప్రత్యేకత. కచ్చితంగా తన ఓటు బ్యాంకు ( అంటే ఆడియెన్స్ ) ఎవరో, ఫ్యాన్స్ ఎవరో టార్గెట్ లేకుండా నటించుకుపోవడం ఒకెత్తు.  ఏ ప్రాతిపదికన ఏ వర్గం ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకుంటునట్టో  ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీ. ప్రస్తుత ప్రయత్నం కూడా అలాటిదే- దీన్ని  యూత్ ని టార్గెట్ చేసిన ఆధునిక ప్రేమ కథ  అనాలా, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం చేసిన మెలోడ్రామా అనాలా అంతుచిక్కని పజిల్. తన కెరీర్ ని ప్లాన్ చేస్తున్నదెవరో గానీ దాన్ని సర్వనాశనం చేసిగానీ నిద్రపోయేట్టు  లేరు.  

ర్శకుడు రమేష్ వర్మ కూడా అమాయక ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుని ఈ క్రియేటివ్ వ్యాపకానికి పూనుకున్నట్టో పదివాక్యాల్లో రాయమని టెస్ట్ పెట్టి పదిలక్షలు బహుమతి  ప్రకటిస్తే, తను కూడా  టెస్టు రాసినా  ఆ బహుమతి  గెల్చుకోలేడని నిర్భయంగా బెట్ కట్టొచ్చు. నాగశౌర్యని నామరూపాల్లేకుండా చేయడానికి రమేష్ వర్మ సహా ఆరుగురు దర్శకులు జరిపిన అవిరళకృషి ఎంతైనా ప్రశంసనీయమైనది. అవార్డుకి అర్హమైనది. 

        ఇప్పుడు దేశంలో అత్యంత దిగువస్థాయి  ప్రేమకథలు తీసే  నైపుణ్యంగల దర్శకులెవరా అంటే దిక్సూచి తెలుగు దర్శకులవైపే చూపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో ప్రేమ కథల ఎక్స్ పర్ట్.  వాళ్లకి తెలిసినంతగా యువ ప్రేమికుల మనస్తత్వాలు, ప్రవర్తనలూ, సమస్యలూ, ఈ గ్లోబల్ యుగంలో వాళ్ళు  పడే సంఘర్షణా మరొకరికి అస్సలు తెలీవు. ఈ ఒక్కొక్క దర్శకుడిలో ఒక్కో  బాలచందర్, ఒక్కో  భారతీ రాజా, ఒక్కో  భాగ్యరాజా తొంగి చూస్తూంటారు  మరి.


వీళ్ళ స్వైరకల్పనల ప్రపంచానికి ఇంకో ప్రపంచం పక్కనే వుంది. అది షార్ట్ ఫిలిమ్స్ లోకం. అక్కడ అసలైన నేటి యూత్ అనుభవాలు కనిపిస్తాయి. వాళ్ళ ఆలోచనలు, స్వభా వాలు, వాస్తవిక సమస్యలూ  తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళ లోకం దశాబ్దం క్రితం కంటే ఎంత మారిపోయిందో కళ్ళకి కడతాయి. వాటి ముందు టాలీవుడ్ ప్రేమసినిమాలు ఇంకా పాతచింతకాయ దశలో ఉండిపోయిన సరుకులా వెలవెలబోతాయి. వేకప్ టాలీవుడ్ యూత్ ఫిలిం మేకర్స్! మీరిలా యూత్ కి కనెక్ట్ కాలేని అవగాహన లోపించిన ప్రేమ సబ్జెక్టులతో కాలక్షేపం చేయలేరు.

ఫేస్ బుక్కయ్యింది!
      అతను- ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్స్. మారు  పేర్లతో ఆన్ లైన్ స్నేహం చేస్తూంటారు. ఇద్దరూ కలుసుకున్నా ఆ ఫ్రెండ్స్ తామే అని గుర్తు పట్టుకోరు. ప్రేమలో పడతారు. ఓనాడు ఈమే తన ఫేస్ బుక్ ఫ్రెండ్ అని అతను తెలుసుకుంటాడు. కానీ తన సంగతి చెప్పకుండా దాస్తాడు. ఒకరోజు ఆమె పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ పడక ఎక్కుతారు. పేరెంట్స్ పట్టుకుని ఇద్దర్నీ వెళ్ళగొడతారు. ఆమెని హీరో తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఆమె పేరెంట్స్ అతణ్ణి దువ్వడం ప్రారంభిస్తారు ఆమెతో బాగా లవ్ లో పడేట్టు...ఆమె తన కష్టాల్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ కి పోస్ట్ చేయడం ప్రారంభిస్తుంది...అతనెందుకు తనే ఆ ఫేస్ బుక్ ఫ్రెండ్ అన్న విషయం దాస్తున్నాడు, ఆమె పోస్టింగ్స్ కి ఏమని సమాధానాలిస్తున్నాడు, ఈ దాగుడుమూతలు ఎప్పుడు బయట  పడ్డాయి, అప్పుడేం జరిగిందీ..అనే వాటికి మిగతా సినిమా చూసి తెలుసుకోవాలి. 

        ఆధునికంగా ప్రారంభించి సెంటిమెంటల్ – మెలోడ్రామా లోకి దింపిన ఈ ‘ప్రేమకథ’ కథనంలో ఎక్కడో ట్రాకు తప్పింది, పాత్రచిత్రణల్లో అంతటా విఫలమైంది. మొదట ప్రేమలో ఆధునికత్వంలోనూ లాజిక్ లేదు. ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ లో లాజిక్ కి అందని ఎన్నో టెక్నికల్ లోపాలు. మెలో డ్రామాలోకి తిరిగేటప్పటికి  భరించలేని బోరు, సహనపరీక్ష. రోమాంటిక్ కామెడీలో ఫన్ కే ఎక్కువ ప్రాధాన్యముంటుంది. అందువల్లే ‘ప్యార్ కా పంచనామా’ అనే న్యూ ఏజ్ రోమాంటిక్ కామెడీ యూత్ నాడీని పట్టుకోగల్గి అంత హిట్టయ్యింది. ఎప్పుడైతే ఒక రోమాంటిక్ అడ్వెంచర్ కి సిద్ధపడిన హీరోయిన్నిఅలాగే కొనసాగనివ్వకుండా, పాత సినిమాల్లోని ‘పవిత్రమైన హీరోయిన్’ పాత్రకి  లాగా ఆమెని గిల్టీ ఫీలింగ్ తో కుదేస్తారో, అప్పుడా ఫన్ అంతాపోయి యూత్ అప్పీల్ నాశనమవుతుంది.

        ఇలాటి అర్ధంలేని సినిమాల్లో నటిస్తూ  నాగశౌర్య తన టాలెంట్ ని వృధా చేసుకుంటున్నాడు. ముందు తను నిబద్ధుడై ఉండాల్సిన టార్గెట్  ఆడియెన్స్ ఎవరో నిర్ణయించుకుని, వాళ్లకి కావలసిన సినిమాల్ని వాళ్ళ పద్ధతుల్లో అందించ గల్గినప్పుడే తను ప్రత్యేకంగా ప్రకాశించ గల్గుతాడు. లేకపోతే మాస్ సినిమాల మయమైపోయిన  తెలుగు చలన చిత్ర జగత్తులో తనలాంటి సాఫ్ట్ హీరో ఉనికి ప్రమాదంలో పడుతుంది.

ఇళయరాజా, శ్యాం కె నాయుడు, గౌతం రాజుల వంటి హేమీ హేమీలైన తెరవెనుక నిపుణులు మాత్రం ఏం చేయగలరు- దర్శకుడి  చేతిలో వున్నది దిగువస్థాయి కంటెంట్ అయినప్పుడు? బ్రహ్మానందం, పృథ్వీ, మౌనరాగం మోహన్, రావురమేష్ ల వంటి అగ్రతారాగణం వుండి మాత్రం ఏం చేస్తారు- చేయడానికి విషయం లేనప్పుడు?

తెలుగులో ఇంకెలాటి ప్రేమకథలు సమర్ధవంతంగా తీయగల్గుతారు? సక్సెస్ ఫుల్ రోమాంటిక్ కామెడీలు తీయలేరు, రోమాంటిక్ థ్రిల్లర్స్ తీయలేరు, ఎమోషనల్ ప్రేమలు అసలే తీయలేరు. కానీ తీస్తే కాలంతో, ప్రేక్షకులతో  సంబంధంలేని పాతమూస చాదస్త ప్రేమలు మాత్రం తీస్తారు. ఒకసారి సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘బాజీరావు మస్తానీ’ చూస్తే, చాదస్తాలకి దూరంగా ఇవ్వాళ్ళ ప్రేక్షకులకి- మాస్ కి కూడా – కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ప్రేమకథ ఎలా అర్ధవంతంగా, సున్నితంగా, ఏడ్పులూ పెడబొబ్బలకి దూరంగా, సింపుల్ గా తీయవచ్చో తెలుసుకోగల్గుతారు.

లేని పక్షంలో ప్రేమ కథల నిపుణులమనుకుని ఇంకా తీసే ఇలాటి సినిమాలకి హీరోలూ  ప్రేక్షకులూ బలైపోతారు.  

-సికిందర్ 

Saturday, January 2, 2016

అన్నిటికీ జిందాతిలిస్మాత్!



రచన- దర్శకత్వం : కిషోర్ తిరుమల

తారాగణం : రామ్, కీర్తీ సురేష్, ధన్యా బాలకృష్ణ, సత్యరాజ్, విజయ కుమార్, ప్రదీప్ రావత్, నరేష్, ప్రిన్స్. చైతన్య కృష్ణ, రోహిణి తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, కూర్పు : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : శ్రీస్రవంతి మూవీస్, నిర్మాత ; స్రవంతి రవికిషోర్
విడుదల జనవరి 1,  2016
***


మాస్ సినిమాలతో ఆశ నిరాశల మధ్య కొట్టు మిట్టాడుతున్న హీరో రామ్, ఈసారి  ప్రేమకథని ప్రయత్నించాడు. సక్సెస్ కోసం ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరయ్యేందుకు కుటుంబ కథ నేపధ్యంగా సాగే ప్రేమకథతో ముందుకు వచ్చాడు. గతంలో ‘సెకెండ్ హేండ్’ తీ సిన దర్శకుడు కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. ప్రసిద్ధ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మాత. రామ్ కి మాస్ సినిమాలు రొటీన్ అన్పించడం సహజమే, ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం. అయితే ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్ -  కమ్ – యూత్ లవ్ స్టోరీ కూడా అలాటి రొటీన్ బారిన పడకుండా ఏదైనా కొత్తదనంతో ఉందా లేదా తెలుసుకోవాలంటే రివ్యూ లో కెళ్లాల్సిందే


కథేమిటి  
     హరి ( రామ్ ) చిన్నప్పట్నించీ ప్రేమకోసం అమ్మాయిలని ప్రయత్నించే ఒక రొటీన్ ఆవారా. ఎవర్ని ప్రేమించబోయినా అమ్మాయిలు సారీ చెప్పేస్తూంటారు. కారణమేమిటో తెలీదు, లోపమేమిటో తెలీదు. ఓ శుభముహూర్తాన అస్సలు ప్రేమించనే కూడదని నిర్ణయించుకుంటాడు. అలాంటప్పుడు శైలజ ( కీర్తీ సురేష్ ) పరిచయమౌతుంది. ఈమెని ప్రయత్నించడానికి ధైర్యం చాలదు, ఈమె కూడా నో చెప్పేస్తుందేమోనన్న భయంకొద్దీ.  ఇంకో ఆమె ఫ్రెండ్ (ధన్యా బాలకృష్ణ) కి ఓ హెల్ప్ చేసి శైలజకి దగ్గరవుతాడు. ఈ క్రమంలో శైలజ తన చిన్ననాటి ఫ్రెండే  అని తెలుసుకుంటాడు. ఈ సంగతి ఆమె కూడా తెలుసుకుంటుంది. అప్పుడు ధైర్యంతో ప్రేమని  వ్యక్తం చేస్తాడు. ఆమె వెంటనే నో చెప్పేస్తుంది. హరి కథ మళ్ళీ మొదటి కొచ్చేస్తుంది. అసలామె ఎందుకు నో చెప్పింది, ఆమె ప్రేమని పొందడం కోసం హరి ఏం చేశాడు...అన్నవి ఇక్కడ సందేహాలు. మిగతా కథలో ఈ సందేహాలు తీరాతాయో లేదో ఎవరికివారు చూసి తెలుసుకోవాల్సిందే.

కథెలా వుంది

       ట్రెండీ లవ్ స్టోరీ మాత్రం కాదు.  పాతకాలపు హీరోయిన్ పాత్రతో, ఆమె కుటుంబంతో ఆమెకి వుండే సమస్యలతో ఇదొక పూర్తి స్థాయి శాడ్ సెంటిమెంటల్ డ్రామా. ఇలాటి కథలతో పాత సినిమాలు చాలావున్నాయి. తనని కాదన్న హీరోయిన్ని, ఆమె ఇంట్లో మారుపేరుతో హీరో చేరి-  ఆమె కుటుంబ సమస్యలు తీర్చడం, అందరిచేతా మంచివాడన్పించుకుని  ఆమెకి దగ్గరవడమూ..చూసి చూసి ఉన్నదే.  అయినా చూసిందే చూడాలనుకుంటే ఫస్టాఫ్ కి కనెక్ట్ అయ్యేంతగా సెకండాఫ్ కి కనెక్ట్ అవడం యూత్ మాటేమో గానీ, కుటుంబ ప్రేక్షకులకి కష్టం కాకపోవచ్చు.

ఎవరెలా చేశారు?
     రామ్ రక్షించాడు. ఓవరాక్షన్ చేసే లవర్ బాయ్ గా  విపరీత చేష్టలు చేసే పాత్రలు వేసిన తనకి ఇది పూర్తిగా లైటర్ వీన్  క్యారక్టర్. సాత్విక పాత్ర. నామమాత్రంగా నైనా విలన్ వుండాలన్నట్టు పెట్టిన విలన్ గ్యాంగ్ తో కొన్ని యాక్షన్ సీన్లు, రెండు బీట్ సాంగులూ, కొన్ని డైలాగుల విసుర్లూ  మొదలైన గిమ్మిక్కులతో ప్రేక్షకుల నుంచి కేరింతలు రాబట్టుకుని కమర్షియల్ గా తనవరకూ లోపం లేకుండా చూసుకున్నాడు. కానీ తన పాత్రని మొత్తంగా చూస్తే అది ఇదివరకు ఇతర హీరోలు చేసేసిన పాత రొటీనే. కొత్తదనపు సువాసనలు గుబాళించ లేదు. 

        మళయాళ హీరోయిన్ కీర్తీ సురేష్ పాత్రే అణిగి మణిగి ఉండే పాత్ర కాబట్టి,  ఆమెనుంచి ఒక హీరోయిన్ తో ఉండాల్సిన  అల్లరి, చిలిపితనం, కవ్వింపూ లాంటి యూత్ అప్పీల్ కి అవసరమైన మసాలా దినుసులకి ప్రేక్షకులు నోచుకోలేరు. అసలే డైలాగులు తక్కువ అనుకుంటే,  సెకండాఫ్ లో మరీ మూగబోయి సీరియస్ గా కన్పిస్తుంది.  స్వభావం కొద్దీ ఆమె పాత్ర హీరోకి పోటా పోటీగా లేకపోవడంతో- రోమాంటిక్ అప్పీల్ కూడా మిస్సయ్యింది. 


        మిగతా పాత్రల్లో హీరోయిన్  తండ్రిగా సత్యరాజ్ ది పిల్లల భవిష్యత్తు కోసం ఊళ్ళు పట్టుకు తిరిగి సంపాదించాలనుకునే  – కుటుంబానికి దూరమైన విషాద పాత్ర. తగిన అవగాహనతో  దీన్ని పోషించాడు. ప్రత్యేకంగా ఇందులో కమెడియన్ లెవరూ లేకపోవడం ప్రత్యేకత. ఈ లోటుని భగ్న ప్రేమికుడి పాత్రలో పచ్చి విలన్ వేషాలు వేసే ప్రదీప్ రావత్ తీర్చడం ఒక వెరైటీ. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం,  సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు మొదలైనవన్నీ స్రవంతి స్టాండర్డ్ తోనే వున్నాయి. 


స్క్రీన్ ప్లే సంగతులు 
      ర్శకుడు కిశోర్ తిరుమల కుటుంబ కథకి కూడా ఏమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించకుండా ఇదివరకు వచ్చిన అనేక సినిమాలనే ఫాలో అయ్యాడు. దీంతో అవుట్ డేటెడ్ గా కన్పిస్తుంది. ఫస్టాఫ్ హీరో ప్రేమ పాట్లతో ఎలాగో నెట్టుకొచ్చినా- హీరోయిన్ ‘నో’ చెప్పాక- సెకండాఫ్ నుంచీ కుటుంబ కథగా మారిపోయే- వాళ్ళ ఒక్కొకరి సమస్య తీర్చే, మరమ్మత్తు చేసే రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. ఈ కోవలో సస్పెన్స్, ముందేం  జరుగుతుందన్న ఆత్రుత కరువై పోయాయి. హీరోయిన్ కుటుంబంలో తీర్చాల్సిన అసలు సమస్య వుండగా, దాన్ని వదిలేసి ఇంకేదో చేయడమనే ట్రాక్ వల్ల ఇది దర్శకుడు ఇష్టపడ్డ పాత బాట పట్టింది.  ఎప్పుడైనా ఒకే ఒక్క బలమైన సమస్య- దాన్ని ముప్పుతిప్పలు పడి హీరో పరిష్కరించే బలమైన ట్రాకు వుంటేనే అది కథలా వుంటుంది. హీరో ఎక్కడా సమస్యల్లో ఇరుక్కోకపోవడం, ఎవరినుంచీ ప్రతిఘటన కూడా లేకపోవడం, పేలవమైన ఏకపక్ష కథనంగా మార్చేసింది. ఏ కథలోనైనా సమస్య ని పరిష్కరించేటప్పుడు హీరోకి సమస్యలు కూడా ఎదురవుతాయి- అనేక చిక్కుల్లో పడిపోతాడు- ఈ ప్రాథమిక కథాలక్షణాల జోలికి పోకుండా- స్క్రీన్ ప్లే అనేది అసాధ్యం. సాధ్యమనుకుంటే అది అసంపూర్ణం. సూత్రప్రాయంగా ‘నేను  శైలజ’ దీన్ని అధిగమించి వుండాల్సింది.  


       ఫస్టాఫ్ లో కూడా  ఎందరో  అమ్మాయిల చేత ‘నో’ అన్పించుకునే హీరో,  హీరోయిన్ పరిచయమయ్యాక,  అదే ఫోబియాతో ప్రవర్తించడం కూడా ఇంకా పాత మూసే చిత్రణే. ప్రేమని  వ్యక్తం చేస్తే ఆమె ఎక్కడ  కాదంటుందోనన్న ఊహాజనిత  భయంతో ప్రవర్తించే హీరో పాత్రని ఎప్పుడో 2000 లో  ‘నువ్వేకావాలి’  అప్పట్నించీ చూస్తూనే ఉన్నాం. ఈ దశాబ్దంన్నర కాలం తర్వాత కూడా ఇంకా  రామ్ లాంటి క్రేజ్ వున్న హీరో కూడా అదే పాత్రచిత్రణలో పాసివ్ గా, ఇమ్మెచ్యూర్డ్ గా ఇరుక్కోవాలా? 


        అసలు ఏ అమ్మాయైనా ఎందుకు తిరస్కరిస్తోందో, తన లోపమేమిటో ఆత్మ పరిశీలనే  చేసుకోడు. కాదన్న  అమ్మాయిల్ని తిట్టుకోవడమేమిటి, ఓ అమ్మాయైతే ఓ రాత్రి గడపడానికీ  సిద్ధపడిందిగా? అప్పుడు ఆమెని తను కాదన్నప్పుడు తన పరువు తీసివుంటే? అసలు తనెలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తనకెలాటి అమ్మాయి కావాలో ఎలా తెలుస్తుంది? ఇది మాస్ సినిమా కాదుగా హీరో పాత్రచిత్రణ ఆషామాషీగా ఉండడానికి? మాస్ సినిమా పాత్ర, ప్రేమ సినిమా పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పాత్ర...అన్నీ ఒకలాగే ఉంటాయా? పేరుకే  ప్రేమకథ- పాత్ర మాత్రం అదే క్లాస్- మాస్- లవ్- థ్రిల్లర్- హార్రర్ – సినిమాలన్నిటికీ  కలిపి ఒకే గాటన కట్టి చూపించే తెలుగు మూస హీరో పాత్ర! సకల రోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు- అన్ని రకాల కథలకీ ఒకే జిందా తిలిస్మాత్ హీరో పాత్ర !

        హీరోయిన్ పరిచయమైనప్పుడైనా ఆ ఫోబియాతో తన రొటీన్ కి భిన్నంగా ఇంకేమైనా చేశాడా అంటే ఏమీ లేదు. మార్పు లేకుండా ఆ ఫోబియాతో అలాగే పాసివ్ క్యారక్టర్ గానే హీరోయిన్ తోనూ కొనసాగాడు.  అలా గంటపైబడి నడిచే ఫస్టాఫ్ లో ఆసక్తిని  అంతకంతకీ పెంచే డైనమిక్స్ ఎక్కడున్నాయి? క్యారక్టర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనప్పుడు క్యారక్టర్ ఆర్క్ ఎక్కడుంది?  క్యారక్టరూ కథనమూ ప్రారంభించింది లగాయత్తూ అదే నేలబారుగా ఉండిపోయిన ఫీల్ కలగడం లేదా?  హీరోయిన్ ప్రవేశంతోనైనా హీరో క్యారక్టర్ యాక్టివ్ గా మారకపోవడంతో కథనంలో ఫన్, టెన్షన్, సస్పెన్స్ అనేవి కూడా ఏర్పడకుండా పోయాయి. ఎప్పుడైనా కథల్లో వుండే అన్ని అవలక్షణాలకీ మూలం హీరో పాత్రచిత్రణలో వైఫల్యమే. హీరో పాత్రని సమగ్రంగా చెక్కగల్గితే కథని చెక్కినట్టే. హీరో పాత్రని చెక్కకుండా కథని చెక్కలేరు. హీరో పాత్రే కథ కాబట్టి.   
       

సినిమా విడుదలకి ముందు- కొత్త కథతో, చాలా సహజత్వంతో వచ్చానని రామ్ చెప్పాడు. తన దృష్టిలో కొత్త కథకీ, సహజత్వానికీ అర్ధమేమిటి? అలాగే  సినిమా ప్రారంభం రోజునుంచి పదే పదే ఈ  సినిమాని సహజంగా తీశామని టీమ్ చెప్పుకున్నారు. నిజానికి సహజంగా తీశామని వాళ్ళు అనుకుంటున్నది ఆర్ట్ సినిమా సహజత్వమే, డబ్బులు బాగా వచ్చే కమర్షియల్ సినిమా సహజత్వం కాదు. యాక్టివ్ పాత్రతో కమర్షియల్ సినిమా సహజత్వంతో  తీయడం నూటికి ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతోంది టాలీవుడ్ లో. మిగిలినవన్నీ పాసివ్  హీరో పాత్రలతో కమర్షియల్ అనుకుని పొరబడి తీస్తున్న ఆర్ట్ సినిమాలే! ఫండమెంటల్ గా చాలా కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. అసలు కన్ఫ్యూజన్ లో వున్నామనే తెలుసుకోవడం లేదు!
ఫోబియాతో హీరో, కొంపదీసి ఈ హీరోయిన్ కూడా ‘నో’ అనేస్తుందా లేదా ముందు పసిగడదామనుకుని- ఆడియెన్స్ ఊహకందని ఒక సీక్రెట్ ఆపరేషన్ కి తెర తీశాడనుకోండి...వినూత్నంగా ఫస్టాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. యూత్ ప్రవర్తన ఇలాగే వుంటుంది, మన్ను తిన్న పాములా పడివుండరు. పదేపదే అవమానాలకన్నా, ఈసారైనా ఎస్ అంటుందా నో అంటుందా ముందు పసి గట్టడానికి ఆమెకర్ధంగాని రకరకాల ట్రిక్కులు ప్రయోగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడనుకోండి- కథనంలో  ఛేంజోవర్ వచ్చి, కొత్త ఒరవొడిలో ఫన్ ఆకాశాన్నంటేది కాదా? ఇవ్వాళ కావలసింది ప్రేక్షకులతో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగే తప్ప, వాళ్ళని ఇన్వాల్వ్ చేయని ఏకపక్ష కథనాలు కావు. 
ఈ సినిమాలో కథ మిడిల్లోకి ఎప్పుడు ప్రవేశించింది? హీరోయిన్ రాకతో ఇంటర్వెల్ లోపే ప్రవేశించింది. ఈ కథకి ఇంటర్వెల్లో హీరోయిన్ ‘నో’ అన్నప్పుడు వచ్చిన మలుపు దగ్గర్నుంచీ మిడిల్ కాదు. ఇది గమనించాలి. హీరోయిన్ రాకపూర్వం హీరో తన రొటీన్ ప్రపంచంలో వున్నాడు. హీరోయిన్ రాకతో అతడికి అసాధారణ పరిస్థితి ఏర్పడింది. అసాధారణ పరిస్థితి ఏర్పడడమే మిడిల్. ఈ  అసాధారణ పరిస్థితుల్లో ఇక ఆమెతో స్ట్రగుల్ ప్రారంభించాడు. ఇలా ఇక్కడ పుట్టి కథ ప్రారంభమయ్యిందన్న మాట.   స్ట్రగుల్  పర్యవసానమే ఈ మిడిల్ లో వచ్చే ఒక మజిలీ,  ఇంటర్వెల్లో ఆమె ‘నో’ చెప్పడం. అంతేగానీ కథ ఇంటర్వెల్ దగ్గర్నుంచీ ప్రారంభమయినట్టు అర్ధం చేసుకోరాదు. లేకపోతే  స్క్రీన్ ప్లే రేఖా గణితమే మారిపోతుంది.  మారిపోయింది కూడా-
ఎలాగంటే- కథ ఇక్కడే ప్రారంభమయ్యిందని అర్ధం జేసుకుని, దీనికి ముందు జరిగిందంతా పక్కన పెట్టేశారు. జరిగిందాన్ని అందుకుని ముందుకు పోలేదు. ఇంటర్వెల్లో ఆమె ‘నో’ అనగానే ఆ వ్యవహారం పక్కన పడేసి, సెకండాఫ్ ప్రారంభంలో ఈసారి హీరోని విధి వంచితుడైన పాసివ్ పాత్రగా మార్చేసి, మూలకూర్చో బెట్టేశారు. అదే విధి ఇంకో పాత్రద్వారా వచ్చి, భుజం తట్టి తీసికెళ్తే, అప్పుడు వేరే వూళ్ళో హీరోయిన్ ఇంటికి వెళ్లి అక్కడ మకాం వేశాడు. అప్పుడు కూడా హీరోయిన్ కి ఎలా దగ్గరవ్వాలో ఒక వ్యూహం లేదు. అన్నీ విధి నడిపించే ప్రకారం నడిచే పాసివ్  పాత్ర లక్షణాల్ని పుణికి పుచ్చుకుని, తన చేతకాని తనాన్ని ఇంకా బలీయం చేసుకుంటూ- చివరికి క్లయిమాక్స్ లో ఇంకో నేస్తం రూపంలో విధి ఆదు కుంటే, సమస్య  పరిష్కారమై హేపీగా  హీరోన్ తో చెట్టపట్టా లేసుకుని బయటపడ్డాడు! 
వాస్తవంగా ఈ స్క్రీన్ ప్లే లో జరిగిందిది. ఇంకేం సమర్ధించుకున్నా అవేం చెల్లుబాటు కావు. అంతా విధి చేతిలో పెట్టేసి, విధి ఎలా నడిపిస్తే అలా నడిచే హీరో పాసివ్ హీరో. పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని తానుగా కథ నడిపించేవాడు కథానాయకుడు - కథా సారధి- యాక్టివ్ హీరో- ఎట్సెట్రా ఎట్సెట్రా.
కథ ఫస్టాఫ్ లో హీరోయిన్ ఎంట్రీ దగ్గరే ప్రారంభ మయ్యిందని తెలుసుకుని వుంటే,  దాని కొనసాగింపుగా వచ్చిన ఇంటర్వెల్ మలుపుని పక్కన పెట్టేసి సెకండాఫ్ కి అలా వెళ్ళిపోయే వాళ్ళు కాదు. అది కంటిన్యూ చేయాల్సిన హీరో స్ట్రగుల్ తాలూకు ట్రాకే. ఇంటర్వెల్లో ఆమె ‘నో’  అన్నదంటే, ఈమె కూడా అలా ఎందుకన్నదీ అన్న ప్రశ్నతోనే  హీరో సెకండాఫ్ లో కంటిన్యూ అవ్వాలి. మూల కూర్చోవడంకాదు. అదివరకు నో అన్న అమ్మాయిలందర్నీ మారు మాటాడకుండా వదిలేశాడు. హీరోయిన్ తో కూడా అలాగే చేస్తే ఇక కథెందుకు? ఇప్పుడైనా తను మారడా? ఆడియెన్స్ ని ఇన్స్పైర్ చేయడా
నో అన్న హీరోయిన్ సమస్యేమిటో తెలుకుని పరిష్కరించడమే హీరో అన్న వాడికి కథలో పని. ఆమెని వదిలేసి ఇంట్లో ఇంకేవేవో సమస్యలు పరిష్కరించడం కాదు. అసలీమె సమస్యేమిటో, మనసేమితో  ఆడియెన్స్ కి కూడా అంతు చిక్కదు. ఎక్కడో ముగింపు దగ్గరలో పడుతున్నప్పుడు ఆమె తండ్రికి చెప్పుకుంటే అప్పుడు తెలుస్తుంది- ఆడియెన్స్ కే,  హీరోకి కాదు! ఇంటర్వెల్ మలుపుకి కారణమైన హీరోయిన్ సమస్యేమిటో, ఆమె మనసేమిటో  హీరోకి తెలీకుండానే సినిమా ముగుస్తుంది! ప్రేక్షకులకి చెప్పాం కదా, చాలనుకున్నారేమో! పాపం అమాయకుడైన హీరో ఇంతకీ అసలు సంగతేంటో తెలియకుండానే హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకుని శుభం పలికాడు! కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో కథానాయకుడనే వాడికి తెలియకపోతే అతనొక  కథానాయకుడే కాదు. 
     చివరగా- 1999 లో రచయిత సంజయ్ చెల్ దర్శకుడిగా మారుతూ, సంజయ్ దత్- ఊర్మిళా మతోండ్కర్ లతో తీసిన అచ్చమైన సూపర్ హిట్ సున్నిత హాస్యపు కుటుంబ కథా చిత్రం ‘ఖూబ్ సూరత్’ లో,  సంజయ్ దత్ తనని బెదిరిస్తున్న వాడింట్లోనే మారు పేరుతో మకాం వేసి, అక్కడి పరమ నీచంగా వున్న కుటుంబ సంబంధాల్ని మరమ్మత్తు చేస్తూ- పనిలోపనిగా ఊర్మిళ మీద కన్నేస్తాడు. ఊర్మిళకి ఆత్మవిశ్వాసం, లోకజ్ఞానం లేక ఆమె పెళ్లి ఒక సమస్యలా తయారవుతుంది. అప్పుడు సంజయ్ దత్ కల్పించుకుని సింపుల్ గర్ల్ గా ఉండిపోయిన ఊర్మిళని బ్యూటిఫుల్ వుమన్ గా తీర్చిదిద్ది అందరి అంగీకారంతో ఆమెని గెల్చుకుంటాడు!
        చాలా టచింగ్, సెన్సిబుల్ లవ్ స్టోరీ ఇది
        ప్రేమకథ ఎప్పుడూ హీరో హీరోయిన్లదే అవుతుంది- వాళ్ళిద్దరి మధ్య సమస్యకి పరిష్కారంగానే వుంటుంది. హీరోయిన్ సమస్య హీరో పరిష్కరించడ మన్నవి  ఎప్పటికీ మాసిపోని, యూనివర్సల్ అప్పీల్ వుండే రోమాంటిక్ కథలు!  

-సికిందర్