రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 3, 2016

ప్రేమ'నిప్పు'ణులు!









దర్శకత్వం : రమేష్ వర్మ

తారాగణం : నాగ శౌర్య, పలక్  లల్వానీ, రావు రమేష్, బ్రహ్మానందం, ‘మౌనరాగం’ మోహన్, తులసి, ప్రగతి తదితరులు
సంగీతం : ఇళయరాజా, ఛాయాగ్రహణం : శ్యాం కె నాయుడు
బ్యానర్ : జె. జె .  ప్రొడక్షన్స్, కిరణ్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట
విడుదల : జనవరి 1, 2016


నిమిది సినిమాల వయసుగల నాగశౌర్య ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ అనే రెండు హిట్స్ మాత్రమే ఇవ్వగలిగి, ఆరు ఫ్లాప్స్ తో విజయవంతంగా కొనసాగడం రికార్డు. ఆరు ఫ్లాప్స్ జాబితాలో నూతన సంవత్సరారంభంలో  ‘అబ్బాయితో అమ్మాయి’ ని కూడా నూతనంగా చేర్చి, వినూత్నంగా  విన్యాసం చేయడం ఒక ప్రత్యేకత. కచ్చితంగా తన ఓటు బ్యాంకు ( అంటే ఆడియెన్స్ ) ఎవరో, ఫ్యాన్స్ ఎవరో టార్గెట్ లేకుండా నటించుకుపోవడం ఒకెత్తు.  ఏ ప్రాతిపదికన ఏ వర్గం ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకుంటునట్టో  ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీ. ప్రస్తుత ప్రయత్నం కూడా అలాటిదే- దీన్ని  యూత్ ని టార్గెట్ చేసిన ఆధునిక ప్రేమ కథ  అనాలా, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం చేసిన మెలోడ్రామా అనాలా అంతుచిక్కని పజిల్. తన కెరీర్ ని ప్లాన్ చేస్తున్నదెవరో గానీ దాన్ని సర్వనాశనం చేసిగానీ నిద్రపోయేట్టు  లేరు.  

ర్శకుడు రమేష్ వర్మ కూడా అమాయక ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుని ఈ క్రియేటివ్ వ్యాపకానికి పూనుకున్నట్టో పదివాక్యాల్లో రాయమని టెస్ట్ పెట్టి పదిలక్షలు బహుమతి  ప్రకటిస్తే, తను కూడా  టెస్టు రాసినా  ఆ బహుమతి  గెల్చుకోలేడని నిర్భయంగా బెట్ కట్టొచ్చు. నాగశౌర్యని నామరూపాల్లేకుండా చేయడానికి రమేష్ వర్మ సహా ఆరుగురు దర్శకులు జరిపిన అవిరళకృషి ఎంతైనా ప్రశంసనీయమైనది. అవార్డుకి అర్హమైనది. 

        ఇప్పుడు దేశంలో అత్యంత దిగువస్థాయి  ప్రేమకథలు తీసే  నైపుణ్యంగల దర్శకులెవరా అంటే దిక్సూచి తెలుగు దర్శకులవైపే చూపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో ప్రేమ కథల ఎక్స్ పర్ట్.  వాళ్లకి తెలిసినంతగా యువ ప్రేమికుల మనస్తత్వాలు, ప్రవర్తనలూ, సమస్యలూ, ఈ గ్లోబల్ యుగంలో వాళ్ళు  పడే సంఘర్షణా మరొకరికి అస్సలు తెలీవు. ఈ ఒక్కొక్క దర్శకుడిలో ఒక్కో  బాలచందర్, ఒక్కో  భారతీ రాజా, ఒక్కో  భాగ్యరాజా తొంగి చూస్తూంటారు  మరి.


వీళ్ళ స్వైరకల్పనల ప్రపంచానికి ఇంకో ప్రపంచం పక్కనే వుంది. అది షార్ట్ ఫిలిమ్స్ లోకం. అక్కడ అసలైన నేటి యూత్ అనుభవాలు కనిపిస్తాయి. వాళ్ళ ఆలోచనలు, స్వభా వాలు, వాస్తవిక సమస్యలూ  తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళ లోకం దశాబ్దం క్రితం కంటే ఎంత మారిపోయిందో కళ్ళకి కడతాయి. వాటి ముందు టాలీవుడ్ ప్రేమసినిమాలు ఇంకా పాతచింతకాయ దశలో ఉండిపోయిన సరుకులా వెలవెలబోతాయి. వేకప్ టాలీవుడ్ యూత్ ఫిలిం మేకర్స్! మీరిలా యూత్ కి కనెక్ట్ కాలేని అవగాహన లోపించిన ప్రేమ సబ్జెక్టులతో కాలక్షేపం చేయలేరు.

ఫేస్ బుక్కయ్యింది!
      అతను- ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్స్. మారు  పేర్లతో ఆన్ లైన్ స్నేహం చేస్తూంటారు. ఇద్దరూ కలుసుకున్నా ఆ ఫ్రెండ్స్ తామే అని గుర్తు పట్టుకోరు. ప్రేమలో పడతారు. ఓనాడు ఈమే తన ఫేస్ బుక్ ఫ్రెండ్ అని అతను తెలుసుకుంటాడు. కానీ తన సంగతి చెప్పకుండా దాస్తాడు. ఒకరోజు ఆమె పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరూ పడక ఎక్కుతారు. పేరెంట్స్ పట్టుకుని ఇద్దర్నీ వెళ్ళగొడతారు. ఆమెని హీరో తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఆమె పేరెంట్స్ అతణ్ణి దువ్వడం ప్రారంభిస్తారు ఆమెతో బాగా లవ్ లో పడేట్టు...ఆమె తన కష్టాల్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ కి పోస్ట్ చేయడం ప్రారంభిస్తుంది...అతనెందుకు తనే ఆ ఫేస్ బుక్ ఫ్రెండ్ అన్న విషయం దాస్తున్నాడు, ఆమె పోస్టింగ్స్ కి ఏమని సమాధానాలిస్తున్నాడు, ఈ దాగుడుమూతలు ఎప్పుడు బయట  పడ్డాయి, అప్పుడేం జరిగిందీ..అనే వాటికి మిగతా సినిమా చూసి తెలుసుకోవాలి. 

        ఆధునికంగా ప్రారంభించి సెంటిమెంటల్ – మెలోడ్రామా లోకి దింపిన ఈ ‘ప్రేమకథ’ కథనంలో ఎక్కడో ట్రాకు తప్పింది, పాత్రచిత్రణల్లో అంతటా విఫలమైంది. మొదట ప్రేమలో ఆధునికత్వంలోనూ లాజిక్ లేదు. ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ లో లాజిక్ కి అందని ఎన్నో టెక్నికల్ లోపాలు. మెలో డ్రామాలోకి తిరిగేటప్పటికి  భరించలేని బోరు, సహనపరీక్ష. రోమాంటిక్ కామెడీలో ఫన్ కే ఎక్కువ ప్రాధాన్యముంటుంది. అందువల్లే ‘ప్యార్ కా పంచనామా’ అనే న్యూ ఏజ్ రోమాంటిక్ కామెడీ యూత్ నాడీని పట్టుకోగల్గి అంత హిట్టయ్యింది. ఎప్పుడైతే ఒక రోమాంటిక్ అడ్వెంచర్ కి సిద్ధపడిన హీరోయిన్నిఅలాగే కొనసాగనివ్వకుండా, పాత సినిమాల్లోని ‘పవిత్రమైన హీరోయిన్’ పాత్రకి  లాగా ఆమెని గిల్టీ ఫీలింగ్ తో కుదేస్తారో, అప్పుడా ఫన్ అంతాపోయి యూత్ అప్పీల్ నాశనమవుతుంది.

        ఇలాటి అర్ధంలేని సినిమాల్లో నటిస్తూ  నాగశౌర్య తన టాలెంట్ ని వృధా చేసుకుంటున్నాడు. ముందు తను నిబద్ధుడై ఉండాల్సిన టార్గెట్  ఆడియెన్స్ ఎవరో నిర్ణయించుకుని, వాళ్లకి కావలసిన సినిమాల్ని వాళ్ళ పద్ధతుల్లో అందించ గల్గినప్పుడే తను ప్రత్యేకంగా ప్రకాశించ గల్గుతాడు. లేకపోతే మాస్ సినిమాల మయమైపోయిన  తెలుగు చలన చిత్ర జగత్తులో తనలాంటి సాఫ్ట్ హీరో ఉనికి ప్రమాదంలో పడుతుంది.

ఇళయరాజా, శ్యాం కె నాయుడు, గౌతం రాజుల వంటి హేమీ హేమీలైన తెరవెనుక నిపుణులు మాత్రం ఏం చేయగలరు- దర్శకుడి  చేతిలో వున్నది దిగువస్థాయి కంటెంట్ అయినప్పుడు? బ్రహ్మానందం, పృథ్వీ, మౌనరాగం మోహన్, రావురమేష్ ల వంటి అగ్రతారాగణం వుండి మాత్రం ఏం చేస్తారు- చేయడానికి విషయం లేనప్పుడు?

తెలుగులో ఇంకెలాటి ప్రేమకథలు సమర్ధవంతంగా తీయగల్గుతారు? సక్సెస్ ఫుల్ రోమాంటిక్ కామెడీలు తీయలేరు, రోమాంటిక్ థ్రిల్లర్స్ తీయలేరు, ఎమోషనల్ ప్రేమలు అసలే తీయలేరు. కానీ తీస్తే కాలంతో, ప్రేక్షకులతో  సంబంధంలేని పాతమూస చాదస్త ప్రేమలు మాత్రం తీస్తారు. ఒకసారి సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘బాజీరావు మస్తానీ’ చూస్తే, చాదస్తాలకి దూరంగా ఇవ్వాళ్ళ ప్రేక్షకులకి- మాస్ కి కూడా – కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ప్రేమకథ ఎలా అర్ధవంతంగా, సున్నితంగా, ఏడ్పులూ పెడబొబ్బలకి దూరంగా, సింపుల్ గా తీయవచ్చో తెలుసుకోగల్గుతారు.

లేని పక్షంలో ప్రేమ కథల నిపుణులమనుకుని ఇంకా తీసే ఇలాటి సినిమాలకి హీరోలూ  ప్రేక్షకులూ బలైపోతారు.  

-సికిందర్