రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 2, 2016

అన్నిటికీ జిందాతిలిస్మాత్!



రచన- దర్శకత్వం : కిషోర్ తిరుమల

తారాగణం : రామ్, కీర్తీ సురేష్, ధన్యా బాలకృష్ణ, సత్యరాజ్, విజయ కుమార్, ప్రదీప్ రావత్, నరేష్, ప్రిన్స్. చైతన్య కృష్ణ, రోహిణి తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, కూర్పు : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : శ్రీస్రవంతి మూవీస్, నిర్మాత ; స్రవంతి రవికిషోర్
విడుదల జనవరి 1,  2016
***


మాస్ సినిమాలతో ఆశ నిరాశల మధ్య కొట్టు మిట్టాడుతున్న హీరో రామ్, ఈసారి  ప్రేమకథని ప్రయత్నించాడు. సక్సెస్ కోసం ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరయ్యేందుకు కుటుంబ కథ నేపధ్యంగా సాగే ప్రేమకథతో ముందుకు వచ్చాడు. గతంలో ‘సెకెండ్ హేండ్’ తీ సిన దర్శకుడు కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. ప్రసిద్ధ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మాత. రామ్ కి మాస్ సినిమాలు రొటీన్ అన్పించడం సహజమే, ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం. అయితే ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్ -  కమ్ – యూత్ లవ్ స్టోరీ కూడా అలాటి రొటీన్ బారిన పడకుండా ఏదైనా కొత్తదనంతో ఉందా లేదా తెలుసుకోవాలంటే రివ్యూ లో కెళ్లాల్సిందే


కథేమిటి  
     హరి ( రామ్ ) చిన్నప్పట్నించీ ప్రేమకోసం అమ్మాయిలని ప్రయత్నించే ఒక రొటీన్ ఆవారా. ఎవర్ని ప్రేమించబోయినా అమ్మాయిలు సారీ చెప్పేస్తూంటారు. కారణమేమిటో తెలీదు, లోపమేమిటో తెలీదు. ఓ శుభముహూర్తాన అస్సలు ప్రేమించనే కూడదని నిర్ణయించుకుంటాడు. అలాంటప్పుడు శైలజ ( కీర్తీ సురేష్ ) పరిచయమౌతుంది. ఈమెని ప్రయత్నించడానికి ధైర్యం చాలదు, ఈమె కూడా నో చెప్పేస్తుందేమోనన్న భయంకొద్దీ.  ఇంకో ఆమె ఫ్రెండ్ (ధన్యా బాలకృష్ణ) కి ఓ హెల్ప్ చేసి శైలజకి దగ్గరవుతాడు. ఈ క్రమంలో శైలజ తన చిన్ననాటి ఫ్రెండే  అని తెలుసుకుంటాడు. ఈ సంగతి ఆమె కూడా తెలుసుకుంటుంది. అప్పుడు ధైర్యంతో ప్రేమని  వ్యక్తం చేస్తాడు. ఆమె వెంటనే నో చెప్పేస్తుంది. హరి కథ మళ్ళీ మొదటి కొచ్చేస్తుంది. అసలామె ఎందుకు నో చెప్పింది, ఆమె ప్రేమని పొందడం కోసం హరి ఏం చేశాడు...అన్నవి ఇక్కడ సందేహాలు. మిగతా కథలో ఈ సందేహాలు తీరాతాయో లేదో ఎవరికివారు చూసి తెలుసుకోవాల్సిందే.

కథెలా వుంది

       ట్రెండీ లవ్ స్టోరీ మాత్రం కాదు.  పాతకాలపు హీరోయిన్ పాత్రతో, ఆమె కుటుంబంతో ఆమెకి వుండే సమస్యలతో ఇదొక పూర్తి స్థాయి శాడ్ సెంటిమెంటల్ డ్రామా. ఇలాటి కథలతో పాత సినిమాలు చాలావున్నాయి. తనని కాదన్న హీరోయిన్ని, ఆమె ఇంట్లో మారుపేరుతో హీరో చేరి-  ఆమె కుటుంబ సమస్యలు తీర్చడం, అందరిచేతా మంచివాడన్పించుకుని  ఆమెకి దగ్గరవడమూ..చూసి చూసి ఉన్నదే.  అయినా చూసిందే చూడాలనుకుంటే ఫస్టాఫ్ కి కనెక్ట్ అయ్యేంతగా సెకండాఫ్ కి కనెక్ట్ అవడం యూత్ మాటేమో గానీ, కుటుంబ ప్రేక్షకులకి కష్టం కాకపోవచ్చు.

ఎవరెలా చేశారు?
     రామ్ రక్షించాడు. ఓవరాక్షన్ చేసే లవర్ బాయ్ గా  విపరీత చేష్టలు చేసే పాత్రలు వేసిన తనకి ఇది పూర్తిగా లైటర్ వీన్  క్యారక్టర్. సాత్విక పాత్ర. నామమాత్రంగా నైనా విలన్ వుండాలన్నట్టు పెట్టిన విలన్ గ్యాంగ్ తో కొన్ని యాక్షన్ సీన్లు, రెండు బీట్ సాంగులూ, కొన్ని డైలాగుల విసుర్లూ  మొదలైన గిమ్మిక్కులతో ప్రేక్షకుల నుంచి కేరింతలు రాబట్టుకుని కమర్షియల్ గా తనవరకూ లోపం లేకుండా చూసుకున్నాడు. కానీ తన పాత్రని మొత్తంగా చూస్తే అది ఇదివరకు ఇతర హీరోలు చేసేసిన పాత రొటీనే. కొత్తదనపు సువాసనలు గుబాళించ లేదు. 

        మళయాళ హీరోయిన్ కీర్తీ సురేష్ పాత్రే అణిగి మణిగి ఉండే పాత్ర కాబట్టి,  ఆమెనుంచి ఒక హీరోయిన్ తో ఉండాల్సిన  అల్లరి, చిలిపితనం, కవ్వింపూ లాంటి యూత్ అప్పీల్ కి అవసరమైన మసాలా దినుసులకి ప్రేక్షకులు నోచుకోలేరు. అసలే డైలాగులు తక్కువ అనుకుంటే,  సెకండాఫ్ లో మరీ మూగబోయి సీరియస్ గా కన్పిస్తుంది.  స్వభావం కొద్దీ ఆమె పాత్ర హీరోకి పోటా పోటీగా లేకపోవడంతో- రోమాంటిక్ అప్పీల్ కూడా మిస్సయ్యింది. 


        మిగతా పాత్రల్లో హీరోయిన్  తండ్రిగా సత్యరాజ్ ది పిల్లల భవిష్యత్తు కోసం ఊళ్ళు పట్టుకు తిరిగి సంపాదించాలనుకునే  – కుటుంబానికి దూరమైన విషాద పాత్ర. తగిన అవగాహనతో  దీన్ని పోషించాడు. ప్రత్యేకంగా ఇందులో కమెడియన్ లెవరూ లేకపోవడం ప్రత్యేకత. ఈ లోటుని భగ్న ప్రేమికుడి పాత్రలో పచ్చి విలన్ వేషాలు వేసే ప్రదీప్ రావత్ తీర్చడం ఒక వెరైటీ. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం,  సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు మొదలైనవన్నీ స్రవంతి స్టాండర్డ్ తోనే వున్నాయి. 


స్క్రీన్ ప్లే సంగతులు 
      ర్శకుడు కిశోర్ తిరుమల కుటుంబ కథకి కూడా ఏమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించకుండా ఇదివరకు వచ్చిన అనేక సినిమాలనే ఫాలో అయ్యాడు. దీంతో అవుట్ డేటెడ్ గా కన్పిస్తుంది. ఫస్టాఫ్ హీరో ప్రేమ పాట్లతో ఎలాగో నెట్టుకొచ్చినా- హీరోయిన్ ‘నో’ చెప్పాక- సెకండాఫ్ నుంచీ కుటుంబ కథగా మారిపోయే- వాళ్ళ ఒక్కొకరి సమస్య తీర్చే, మరమ్మత్తు చేసే రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. ఈ కోవలో సస్పెన్స్, ముందేం  జరుగుతుందన్న ఆత్రుత కరువై పోయాయి. హీరోయిన్ కుటుంబంలో తీర్చాల్సిన అసలు సమస్య వుండగా, దాన్ని వదిలేసి ఇంకేదో చేయడమనే ట్రాక్ వల్ల ఇది దర్శకుడు ఇష్టపడ్డ పాత బాట పట్టింది.  ఎప్పుడైనా ఒకే ఒక్క బలమైన సమస్య- దాన్ని ముప్పుతిప్పలు పడి హీరో పరిష్కరించే బలమైన ట్రాకు వుంటేనే అది కథలా వుంటుంది. హీరో ఎక్కడా సమస్యల్లో ఇరుక్కోకపోవడం, ఎవరినుంచీ ప్రతిఘటన కూడా లేకపోవడం, పేలవమైన ఏకపక్ష కథనంగా మార్చేసింది. ఏ కథలోనైనా సమస్య ని పరిష్కరించేటప్పుడు హీరోకి సమస్యలు కూడా ఎదురవుతాయి- అనేక చిక్కుల్లో పడిపోతాడు- ఈ ప్రాథమిక కథాలక్షణాల జోలికి పోకుండా- స్క్రీన్ ప్లే అనేది అసాధ్యం. సాధ్యమనుకుంటే అది అసంపూర్ణం. సూత్రప్రాయంగా ‘నేను  శైలజ’ దీన్ని అధిగమించి వుండాల్సింది.  


       ఫస్టాఫ్ లో కూడా  ఎందరో  అమ్మాయిల చేత ‘నో’ అన్పించుకునే హీరో,  హీరోయిన్ పరిచయమయ్యాక,  అదే ఫోబియాతో ప్రవర్తించడం కూడా ఇంకా పాత మూసే చిత్రణే. ప్రేమని  వ్యక్తం చేస్తే ఆమె ఎక్కడ  కాదంటుందోనన్న ఊహాజనిత  భయంతో ప్రవర్తించే హీరో పాత్రని ఎప్పుడో 2000 లో  ‘నువ్వేకావాలి’  అప్పట్నించీ చూస్తూనే ఉన్నాం. ఈ దశాబ్దంన్నర కాలం తర్వాత కూడా ఇంకా  రామ్ లాంటి క్రేజ్ వున్న హీరో కూడా అదే పాత్రచిత్రణలో పాసివ్ గా, ఇమ్మెచ్యూర్డ్ గా ఇరుక్కోవాలా? 


        అసలు ఏ అమ్మాయైనా ఎందుకు తిరస్కరిస్తోందో, తన లోపమేమిటో ఆత్మ పరిశీలనే  చేసుకోడు. కాదన్న  అమ్మాయిల్ని తిట్టుకోవడమేమిటి, ఓ అమ్మాయైతే ఓ రాత్రి గడపడానికీ  సిద్ధపడిందిగా? అప్పుడు ఆమెని తను కాదన్నప్పుడు తన పరువు తీసివుంటే? అసలు తనెలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తనకెలాటి అమ్మాయి కావాలో ఎలా తెలుస్తుంది? ఇది మాస్ సినిమా కాదుగా హీరో పాత్రచిత్రణ ఆషామాషీగా ఉండడానికి? మాస్ సినిమా పాత్ర, ప్రేమ సినిమా పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పాత్ర...అన్నీ ఒకలాగే ఉంటాయా? పేరుకే  ప్రేమకథ- పాత్ర మాత్రం అదే క్లాస్- మాస్- లవ్- థ్రిల్లర్- హార్రర్ – సినిమాలన్నిటికీ  కలిపి ఒకే గాటన కట్టి చూపించే తెలుగు మూస హీరో పాత్ర! సకల రోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు- అన్ని రకాల కథలకీ ఒకే జిందా తిలిస్మాత్ హీరో పాత్ర !

        హీరోయిన్ పరిచయమైనప్పుడైనా ఆ ఫోబియాతో తన రొటీన్ కి భిన్నంగా ఇంకేమైనా చేశాడా అంటే ఏమీ లేదు. మార్పు లేకుండా ఆ ఫోబియాతో అలాగే పాసివ్ క్యారక్టర్ గానే హీరోయిన్ తోనూ కొనసాగాడు.  అలా గంటపైబడి నడిచే ఫస్టాఫ్ లో ఆసక్తిని  అంతకంతకీ పెంచే డైనమిక్స్ ఎక్కడున్నాయి? క్యారక్టర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనప్పుడు క్యారక్టర్ ఆర్క్ ఎక్కడుంది?  క్యారక్టరూ కథనమూ ప్రారంభించింది లగాయత్తూ అదే నేలబారుగా ఉండిపోయిన ఫీల్ కలగడం లేదా?  హీరోయిన్ ప్రవేశంతోనైనా హీరో క్యారక్టర్ యాక్టివ్ గా మారకపోవడంతో కథనంలో ఫన్, టెన్షన్, సస్పెన్స్ అనేవి కూడా ఏర్పడకుండా పోయాయి. ఎప్పుడైనా కథల్లో వుండే అన్ని అవలక్షణాలకీ మూలం హీరో పాత్రచిత్రణలో వైఫల్యమే. హీరో పాత్రని సమగ్రంగా చెక్కగల్గితే కథని చెక్కినట్టే. హీరో పాత్రని చెక్కకుండా కథని చెక్కలేరు. హీరో పాత్రే కథ కాబట్టి.   
       

సినిమా విడుదలకి ముందు- కొత్త కథతో, చాలా సహజత్వంతో వచ్చానని రామ్ చెప్పాడు. తన దృష్టిలో కొత్త కథకీ, సహజత్వానికీ అర్ధమేమిటి? అలాగే  సినిమా ప్రారంభం రోజునుంచి పదే పదే ఈ  సినిమాని సహజంగా తీశామని టీమ్ చెప్పుకున్నారు. నిజానికి సహజంగా తీశామని వాళ్ళు అనుకుంటున్నది ఆర్ట్ సినిమా సహజత్వమే, డబ్బులు బాగా వచ్చే కమర్షియల్ సినిమా సహజత్వం కాదు. యాక్టివ్ పాత్రతో కమర్షియల్ సినిమా సహజత్వంతో  తీయడం నూటికి ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతోంది టాలీవుడ్ లో. మిగిలినవన్నీ పాసివ్  హీరో పాత్రలతో కమర్షియల్ అనుకుని పొరబడి తీస్తున్న ఆర్ట్ సినిమాలే! ఫండమెంటల్ గా చాలా కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. అసలు కన్ఫ్యూజన్ లో వున్నామనే తెలుసుకోవడం లేదు!
ఫోబియాతో హీరో, కొంపదీసి ఈ హీరోయిన్ కూడా ‘నో’ అనేస్తుందా లేదా ముందు పసిగడదామనుకుని- ఆడియెన్స్ ఊహకందని ఒక సీక్రెట్ ఆపరేషన్ కి తెర తీశాడనుకోండి...వినూత్నంగా ఫస్టాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. యూత్ ప్రవర్తన ఇలాగే వుంటుంది, మన్ను తిన్న పాములా పడివుండరు. పదేపదే అవమానాలకన్నా, ఈసారైనా ఎస్ అంటుందా నో అంటుందా ముందు పసి గట్టడానికి ఆమెకర్ధంగాని రకరకాల ట్రిక్కులు ప్రయోగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడనుకోండి- కథనంలో  ఛేంజోవర్ వచ్చి, కొత్త ఒరవొడిలో ఫన్ ఆకాశాన్నంటేది కాదా? ఇవ్వాళ కావలసింది ప్రేక్షకులతో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగే తప్ప, వాళ్ళని ఇన్వాల్వ్ చేయని ఏకపక్ష కథనాలు కావు. 
ఈ సినిమాలో కథ మిడిల్లోకి ఎప్పుడు ప్రవేశించింది? హీరోయిన్ రాకతో ఇంటర్వెల్ లోపే ప్రవేశించింది. ఈ కథకి ఇంటర్వెల్లో హీరోయిన్ ‘నో’ అన్నప్పుడు వచ్చిన మలుపు దగ్గర్నుంచీ మిడిల్ కాదు. ఇది గమనించాలి. హీరోయిన్ రాకపూర్వం హీరో తన రొటీన్ ప్రపంచంలో వున్నాడు. హీరోయిన్ రాకతో అతడికి అసాధారణ పరిస్థితి ఏర్పడింది. అసాధారణ పరిస్థితి ఏర్పడడమే మిడిల్. ఈ  అసాధారణ పరిస్థితుల్లో ఇక ఆమెతో స్ట్రగుల్ ప్రారంభించాడు. ఇలా ఇక్కడ పుట్టి కథ ప్రారంభమయ్యిందన్న మాట.   స్ట్రగుల్  పర్యవసానమే ఈ మిడిల్ లో వచ్చే ఒక మజిలీ,  ఇంటర్వెల్లో ఆమె ‘నో’ చెప్పడం. అంతేగానీ కథ ఇంటర్వెల్ దగ్గర్నుంచీ ప్రారంభమయినట్టు అర్ధం చేసుకోరాదు. లేకపోతే  స్క్రీన్ ప్లే రేఖా గణితమే మారిపోతుంది.  మారిపోయింది కూడా-
ఎలాగంటే- కథ ఇక్కడే ప్రారంభమయ్యిందని అర్ధం జేసుకుని, దీనికి ముందు జరిగిందంతా పక్కన పెట్టేశారు. జరిగిందాన్ని అందుకుని ముందుకు పోలేదు. ఇంటర్వెల్లో ఆమె ‘నో’ అనగానే ఆ వ్యవహారం పక్కన పడేసి, సెకండాఫ్ ప్రారంభంలో ఈసారి హీరోని విధి వంచితుడైన పాసివ్ పాత్రగా మార్చేసి, మూలకూర్చో బెట్టేశారు. అదే విధి ఇంకో పాత్రద్వారా వచ్చి, భుజం తట్టి తీసికెళ్తే, అప్పుడు వేరే వూళ్ళో హీరోయిన్ ఇంటికి వెళ్లి అక్కడ మకాం వేశాడు. అప్పుడు కూడా హీరోయిన్ కి ఎలా దగ్గరవ్వాలో ఒక వ్యూహం లేదు. అన్నీ విధి నడిపించే ప్రకారం నడిచే పాసివ్  పాత్ర లక్షణాల్ని పుణికి పుచ్చుకుని, తన చేతకాని తనాన్ని ఇంకా బలీయం చేసుకుంటూ- చివరికి క్లయిమాక్స్ లో ఇంకో నేస్తం రూపంలో విధి ఆదు కుంటే, సమస్య  పరిష్కారమై హేపీగా  హీరోన్ తో చెట్టపట్టా లేసుకుని బయటపడ్డాడు! 
వాస్తవంగా ఈ స్క్రీన్ ప్లే లో జరిగిందిది. ఇంకేం సమర్ధించుకున్నా అవేం చెల్లుబాటు కావు. అంతా విధి చేతిలో పెట్టేసి, విధి ఎలా నడిపిస్తే అలా నడిచే హీరో పాసివ్ హీరో. పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని తానుగా కథ నడిపించేవాడు కథానాయకుడు - కథా సారధి- యాక్టివ్ హీరో- ఎట్సెట్రా ఎట్సెట్రా.
కథ ఫస్టాఫ్ లో హీరోయిన్ ఎంట్రీ దగ్గరే ప్రారంభ మయ్యిందని తెలుసుకుని వుంటే,  దాని కొనసాగింపుగా వచ్చిన ఇంటర్వెల్ మలుపుని పక్కన పెట్టేసి సెకండాఫ్ కి అలా వెళ్ళిపోయే వాళ్ళు కాదు. అది కంటిన్యూ చేయాల్సిన హీరో స్ట్రగుల్ తాలూకు ట్రాకే. ఇంటర్వెల్లో ఆమె ‘నో’  అన్నదంటే, ఈమె కూడా అలా ఎందుకన్నదీ అన్న ప్రశ్నతోనే  హీరో సెకండాఫ్ లో కంటిన్యూ అవ్వాలి. మూల కూర్చోవడంకాదు. అదివరకు నో అన్న అమ్మాయిలందర్నీ మారు మాటాడకుండా వదిలేశాడు. హీరోయిన్ తో కూడా అలాగే చేస్తే ఇక కథెందుకు? ఇప్పుడైనా తను మారడా? ఆడియెన్స్ ని ఇన్స్పైర్ చేయడా
నో అన్న హీరోయిన్ సమస్యేమిటో తెలుకుని పరిష్కరించడమే హీరో అన్న వాడికి కథలో పని. ఆమెని వదిలేసి ఇంట్లో ఇంకేవేవో సమస్యలు పరిష్కరించడం కాదు. అసలీమె సమస్యేమిటో, మనసేమితో  ఆడియెన్స్ కి కూడా అంతు చిక్కదు. ఎక్కడో ముగింపు దగ్గరలో పడుతున్నప్పుడు ఆమె తండ్రికి చెప్పుకుంటే అప్పుడు తెలుస్తుంది- ఆడియెన్స్ కే,  హీరోకి కాదు! ఇంటర్వెల్ మలుపుకి కారణమైన హీరోయిన్ సమస్యేమిటో, ఆమె మనసేమిటో  హీరోకి తెలీకుండానే సినిమా ముగుస్తుంది! ప్రేక్షకులకి చెప్పాం కదా, చాలనుకున్నారేమో! పాపం అమాయకుడైన హీరో ఇంతకీ అసలు సంగతేంటో తెలియకుండానే హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకుని శుభం పలికాడు! కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో కథానాయకుడనే వాడికి తెలియకపోతే అతనొక  కథానాయకుడే కాదు. 
     చివరగా- 1999 లో రచయిత సంజయ్ చెల్ దర్శకుడిగా మారుతూ, సంజయ్ దత్- ఊర్మిళా మతోండ్కర్ లతో తీసిన అచ్చమైన సూపర్ హిట్ సున్నిత హాస్యపు కుటుంబ కథా చిత్రం ‘ఖూబ్ సూరత్’ లో,  సంజయ్ దత్ తనని బెదిరిస్తున్న వాడింట్లోనే మారు పేరుతో మకాం వేసి, అక్కడి పరమ నీచంగా వున్న కుటుంబ సంబంధాల్ని మరమ్మత్తు చేస్తూ- పనిలోపనిగా ఊర్మిళ మీద కన్నేస్తాడు. ఊర్మిళకి ఆత్మవిశ్వాసం, లోకజ్ఞానం లేక ఆమె పెళ్లి ఒక సమస్యలా తయారవుతుంది. అప్పుడు సంజయ్ దత్ కల్పించుకుని సింపుల్ గర్ల్ గా ఉండిపోయిన ఊర్మిళని బ్యూటిఫుల్ వుమన్ గా తీర్చిదిద్ది అందరి అంగీకారంతో ఆమెని గెల్చుకుంటాడు!
        చాలా టచింగ్, సెన్సిబుల్ లవ్ స్టోరీ ఇది
        ప్రేమకథ ఎప్పుడూ హీరో హీరోయిన్లదే అవుతుంది- వాళ్ళిద్దరి మధ్య సమస్యకి పరిష్కారంగానే వుంటుంది. హీరోయిన్ సమస్య హీరో పరిష్కరించడ మన్నవి  ఎప్పటికీ మాసిపోని, యూనివర్సల్ అప్పీల్ వుండే రోమాంటిక్ కథలు!  

-సికిందర్