రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

లెస్బియన్ లవ్ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
లెస్బియన్ లవ్ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

19, ఫిబ్రవరి 2022, శనివారం

1133 : రివ్యూ!

రచన - దర్శకత్వం : ప్రదీప్ బి అట్లూరి
తారాగణం : విక్రమ్ సహిదేవ్
, సౌమికా పాండియన్, రిషికా ఖన్నా, వినీత్ బవిశెట్టి, స్నేహల్, తాగుబోతు రమేష్, జీవా తదితరులు
సంగీతం : అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం : అనీష్ తరుణ్ కుమార్
బ్యానర్ : రామలక్ష్మి సినీ క్రియేషన్స్
నిర్మాతలు : శిరీషా లగడపాటి
, శ్రీధర్ లగడపాటి
విడుదల : ఫిబ్రవరి 18
, 2022

***
        గడపాటి శ్రీధర్ 2005 లో ఎవడి గోల వాడిదే నుంచి 2018 లో నా పేరు సూర్య వరకూ 7 సినిమాల నిర్మాత. కుమారుడు విక్రమ్ ని నటుడుగా ప్రవేశపెట్టి రెండు సినిమాల్లో (వకీల్ సాబ్, రౌడీ బాయ్స్) నటింపజేశాక, హీరోగా ప్రమోట్ చేస్తూ ఇప్పుడు వర్జిన్ స్టోరీ నిర్మించారు. అట్లూరి ప్రదీప్ ని దర్శకుడుగా పరిచయం చేశారు. ప్రదీప్ హిందీలో ఒక టీవీ సిరీస్ కీ, రెండు హిందీ సినిమాలకీ రచయితగా పనిచేసి, క్వికీ అనే ఓ హిందీ సినిమాకి దర్శకత్వం చేశాడు. వర్జిన్ స్టోరీ తో దర్శకుడుగా తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చాడు.

        దివరకు మల్టీ ప్లెక్స్ సినిమాలనేవి వచ్చేవి. ఇవి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడేవి కావు. ఇప్పుడు ఓటీటీ వచ్చాక మల్టీ ప్లెక్సుల్లో కూడా ఆడని సినిమాలు వస్తున్నాయి. రేపు ఓటీటీలో కూడా ఆడని సెల్ ఫోన్ సినిమా లొస్తాయేమో. ఆ తర్వాత మైక్రో స్కోపులో చూడగల్గే సినిమాలు. ఇంకా తర్వాత ఎక్కడా ఆచూకీ దొరకని సినిమాలు - చరిత్ర పరి సమాప్తం. ఇకప్పుడు తిరిగి నాటకాలూ వీధి నాటకాలూ బుర్ర కథలూ షురూ.

        మన వారసులకి దీనికి సిద్ధంచేస్తూ ఇప్పుడే ఓ బుర్ర కథ తీశారు. సినిమాగా ఇది 1 - 1.5 రేటింగ్ సంపాదిస్తే, బుర్ర కథగా ప్రదర్శిస్తే 10/10  రికార్డ్ రేటింగ్ గ్యారంటీగా సాధిస్తుందని చెప్పొచ్చు. చిన్న సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని థియేటర్లకి పోవడం లేదు కొమ్ములు తిరిగిన ప్రేక్షకులు. ఇక పైన బుర్ర కథగా వస్తే చూడొచ్చులే అనుకోవచ్చేమో. అయితే వర్జిన్ స్టోరీ బుర్ర కథనా, బుర్ర లేని కథనా తెలుసుకోవాల్సిన అవసరమెంతో వుంది...

కథ

ప్రియాంశీ (సౌమికా పాండియన్) తానెంతగానో ప్రేమిస్తున్న బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని తెలుసుకుంటుంది. అతడికి బ్రేకప్ చెప్పేసి బాధలో వుంటుంది. ఆమెకో ఫ్రెండ్ మీనాక్షీ (రిషికా ఖన్నా) వుంటుంది. ఈ బాధలోంచి బయటపడాలంటే, బాయ్ ఫ్రెండ్ మీద పగదీర్చుకోవాలంటే, ఒన్ నైట్ స్టాండ్ గా తెలియని వాడితో ఒక రాత్రి గడిపెయ్య మంటుంది. ప్రియాంశీ ఒప్పుకుంటుంది. ఇద్దరూ పబ్ కెళ్తారు. పబ్ లో విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) ని చూసి ట్రై చేద్దామనుకుంటుంది. విక్రమ్ ఇంకా వర్జిన్. వర్జీనిటీ కోల్పోవాలని ఉవ్వీళ్ళూరుతూంటాడు. ప్రియాంశీ అడగడంతో ఒప్పేసుకుంటాడు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ఈ రాత్రి గడిపేసి వెళ్ళి పోవాలనుకుంటారు. గడపడానికి ఒక చోటు కావాలి. ఆ చోటు ఎక్కడా దొరకదు. ప్రతీ చోటా ఏదో ఆటంకం ఎదురవుతూంటుంది. చివరికేమైంది? అనువైన చోటు దొరికిందా? అనుకున్నట్టు గడిపారా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇవ్వాళ సినిమా కథనేది ఒన్ నైట్ స్టాండే. ఒన్ షోతో మర్చిపోయేంత. రాశామా, తీశామా, డబ్బులు పంచుకుని ఓ షోతో ఇంటికెళ్ళి పోయామా, ఇంతే. ఫటా ఫట్ యూజ్ అండ్ థ్రో ఎసైన్ మెంట్, బస్టాండ్.

        ఈ కథతో - హేపీగా వుండాలంటే ఒన్ నైట్ స్టాండ్ కాదు, ఒన్ లైఫ్ స్టాండ్ కావాలని చెప్పదల్చారు. అసలు చెప్పాల్సింది- లైఫ్ అంటే ఎవడి మీదో పగతో ఇంకెవడితోనో పడుకుని వర్జీనిటీ కోల్పోవడం కాదని - దారి తప్పిన హీరోయిన్ పాత్రకి చెప్పాలి. ఏం చెప్పాలో తెలియక పోతే ఇలాటి కథ ఎందుకు రాయడం, తీయడం.

        అందుకని మొదట్నుంచీ ఈ కథ కథలా సాగదు. కాన్సెప్ట్ తెలియనప్పుడు కథెలా  సాగుతుంది. దీనికి మల్లాది నవలతో పోలిక తెస్తున్నారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల పెద్దలకు మాత్రమే´ఆధారంగా 1985 లో జంధ్యాల శ్రీవారి శోభనం తీశారు. నరేష్, అనితారెడ్డి, మనోచిత్ర నటీనటులు. ఇందులో పెళ్ళయిన హీరోకి శోభనం అంటే భయం. ఇందుకు మార్గరెట్ అనే అమ్మాయి హెల్ప్ తీసుకుంటాడు శోభనం నేర్చుకునేందుకు. ఈ నేర్చుకోవడానికి అనేక ఆటంకా లెదురవు తూంటాయి కామెడీగా. చివరికి ఇలా భార్యని మోసం చేయకూడదని తెలుసుకుని, తన మానసిక భయాల్ని మార్గరెట్ చేత కౌన్సెలింగ్ తో తొలగించుకుని, భార్య దగ్గరి కెళ్ళిపోతాడు.

        1985 కాలంలో ఇది ఒన్ నైట్ స్టాండ్ కథ కాదు. పైగా పెళ్ళయిన వాడు హీరో. కేవలం సెక్స్ కి ఆటంకా లెదురవడమనే కామెడీ ట్రాక్ తప్పితే, వర్జిన్ స్టోరీ కి పోలిక లేదు. ఈ స్టోరీ వేరు- ఈ కాలపు స్టోరీని స్టోరీ కాని స్టోరీగా తీశారు.

        2016 లో సన్నీ లియోన్, తనూజ్ విర్వాణీ, నైరా బెనర్జీ లతో ఒన్ నైట్ స్టాండ్ తీశారు హిందీలో. భవానీ అయ్యర్ రచనకి జాస్మిన్ మోజెస్ డిసౌజా దర్శకత్వం. ఇందులో కావాలని ఒన్ నైట్ స్టాండ్ కి పాల్పడరు హీరో హీరోయిన్లు (తనూజ్- లియోన్). అనుకోకుండా జరిగి పోతుంది. ఆ తర్వాత హీరో ఆమె వెంట పడతాడు భార్యని పట్టించుకో కుండా. పెళ్ళయిన హీరోయిన్ తిప్పి కొడుతుంది. హీరో అబ్సెషన్ వల్ల ఇరు వైపులా కాపురాలు కూలే పరిస్థితి ఏర్పడుతుంది.

      ఒన్ నైట్ స్టాండ్ లాంటి సింగిల్ సెక్సువల్ ఎన్ కౌంటర్ మానసిక సమస్యల్ని తెచ్చి పెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైనదని కూడా అంటున్నారు. అసలు వర్జిన్ స్టోరీ కథతో ఏ నీతీ చెప్పనవసరం లేదు. కథని కథలా చెప్పి రక్షిస్తే చాలు. కథకి బేసిక్స్ కూడా చూసుకోకుంటే తెల్ల కాగితాల మీదే కదా పెట్టుబడి పెడతారు.

నటనలు- సాంకేతికాలు

 రౌడీబాయ్స్ లో నెగెటివ్ పాత్ర వేసిన విక్రమ్ నటించగలడని నిరూపించుకున్నాడు. గ్లామరుంది, షేపుంది, ఎక్స్ ప్రెషన్స్ వున్నాయి. నిలదొక్కుకోవడానికి కంటెంట్ కావాలి. ఇది లోపించిందిప్పుడు. ఎక్కడా మొహంలో పలికించడానికి సీన్లలో ఎమోషన్లే లేవు. ఎమోషన్స్ అంటే సీరియస్ నెస్ అనే కాదు, కామెడీ కూడా ఎమోషనే. ఇది కూడా పలికించడానికి కామెడీ సైతం తీయలేక పోయాడు దర్శకుడు ఈ కామెడీ అనుకుని తీసిన కథలో.

        ఇక ప్రతీ సీనులో హీరోయిన్ తోనే వున్నా, ఆమెతో సెక్సువల్- రోమాంటిక్ టెన్షనే లేదు. ఫీలింగ్సే లేవు. హీరోయిన్ తో గడపడానికి ఏ చోటు చూసుకోవాలన్న గణితమే తప్ప, రసాయనమే లేదు ఆమెతో. తను వర్జిన్, ఇంకా వర్జినేమిటని ఫ్రెండ్స్ ఆటలు పట్టిస్తూ లూజర్ అనడం. అలాంటిది తను హీరోయిన్ తో విన్నర్ అవడానికింత అవకాశమొచ్చాక, ఆ వర్జీనిటీ కోల్పోయే తొలి అనుభవపు ఎక్సైట్ మెంటేమీ  కన్పించక పోతే, కథనమేం నడుస్తుంది. లగడపాటి విక్రమ్ సాహిదేవ్ పాత్రగా  ఈ కథ నడపలేకపోయాడు. తెలిసో తెలీకో ఓ పాసివ్ పాత్ర ఒప్పుకుని నొప్పించాడు ప్రేక్షకుల్ని.

        వయ్యారి ఓ వయ్యారీ నీ వూహాల్లోనే సవారీ అన్న హీరో క్యారక్టర్ ని తెలిపే టైటిల్ సాంగ్ లో, సాహిత్యం ప్రకారం హీరో క్యారక్టరే వుండదు. నా ఫ్యూజు లెగిరి పోయే నీ అందం చూడగానే (బూజు కూడా తొలగలేదు క్యారక్టర్ కి) రివ్వు మన్నది ప్రాణం తూనీగ లాగా (మన్ను తిన్న పాముతోనా?)…’నువ్వు నేను కలుపుకున్న చూపులు-నచ్చి నచ్చి పంచుకున్న మాటలు (చూపుల్లేవు, మాటల్లేవు)... కొత్తగా కొత్తగా రెక్కలొచ్చెనా (రెక్కలొచ్చి వుంటే కథ హిట్టయ్యేది)... ఓ వయ్యారీ వయ్యారీ మనసంతా నీదే కచేరీ (మనసంతా, బుర్రంతా ఖాళీ-  ఏమీ లేదు). కవి రాసిన ఏ లైను లాగా క్యారక్టర్ లేదు.

        ఇక హీరోయిన్ సౌమికా పాండియన్ డిటో. నో క్యారక్టర్, నో యాక్టింగ్. మాజీ లవర్ మీద పగదీర్చుకోవడానికి ఒన్ నైట్ స్టాండ్ గా దిగాక,  ఆ రివెంజీ ఫీలింగుని, ఆ ఆత్మ వినాశక కసినీ చూపించదు. ప్రేమ సినిమాల్లో లవ్ లో పడ్డ హీరోయిన్ లాగే వుంటుంది. అసలు మాజీ లవర్ మీద పగ దీర్చుకోవడం  ఇలా ఎలా జరుగుతుంది. ప్రేమ సినిమాల్లో లవర్ ని బాధించడానికి అతడి కళ్ళ ముందే ఇంకో లవర్ తో తిరగడం వుంటుంది. అలా మాజీ లవర్ చూసేలా ఇంకొకడితో సెక్స్ చేస్తే  మాజీ లవర్ మీద పగ దీర్చుకోవడంగా వుండొచ్చు. అతడికి దూరంగా ఏం చేస్తే అతడికేంటి? ఈ పగ సాధించి కూడా ఏం సాధిద్దామని? ఎవడితోనో వర్జీనిటీని డ్రైనేజిలో పారేసుకుని ఆనక ఏడ్వడమా? పైగా ఆ మాజీ లవర్ చివరి దాకా కనపడడు కూడా. ఏమిటో ఈ సినిమా!

        ఒన్ నైట్ స్టాండ్ గా పగ దీర్చుకోమనే మీనాక్షీ అనే పిచ్చిదీ (రిషికా ఖన్నా) ఇంకో వైపు. వాళ్ళ కెక్కడా చోటు దొరక్క పోతే తన రూమ్ కే  తీసుకెళ్ళి శుభకార్యం జరిపించొచ్చుగా? ఇక ఒక సబ్ ప్లాట్ గా కామెడీ ట్రాక్ వుంది. మీకీ నాకీ భాషతో ఆటో డ్రైవర్- అరవ తెలుగు భాషతో అమ్మమ్మ క్యారక్టర్లతో. వీళ్ళ లౌడ్ కామెడీకి నవ్వే రాక పోగా టార్చర్ పెట్టేస్తుంది. తాగుబోతు రమేష్ కానిస్టేబుల్ గా వచ్చే కామెడీ, రఘు కారుమంచి కామెడీ కూడా టార్చరే. ఇక అడపాడపా గే, లెస్బియన్, అన్ సెక్స్ క్యారక్టర్లతో కామెడీ చెప్పాల్సిన పనిలేదు.

        సంగీతం, సాహిత్యం పైన చెప్పుకున్న విధంగా అన్యాయమై పోయినా, ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి లగడపాటి రేంజిలో. కాస్ట్యూమ్స్, మేకప్, కళా దర్శకత్వపు విభాగాలూ బాగా పని చేశాయి. స్టయిలిష్ లుక్ కోసం పాటుబడిన దర్శకత్వం ఫర్వాలేదు గానీ, చేతిలో కథా కథనాల దస్తావేజే బాగా లేదు. 

చివరికేమిటి

అవార్డుల కమిటీయో, రివ్యూలు రాసేవాళ్ళో దీన్ని చివరిదాకా చూడక తప్పదేమోగానీ, ఈ పనీ పాటలు లేనివాళ్ళు చివరి దాకా కొన వూపిరితో వుండలేరు. చాలా ప్రాణయామం చేసి వుండాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళు అసలే పనికి రారు.

     ఇది ఒక రాత్రంతా జరిగే కథ. పదేపదే పబ్ సీన్లు, అక్కడి హంగామా 7 సార్లు, ఓ 6 సార్లు వచ్చే సెక్స్ కోసం ప్రయత్నించే లొకేషన్లు, ఇతర రోడ్ సీన్లూ వగైరా. హీరోయిన్ ఇలా చోటు కోసం వూరు మీద పడి తిరగడ మెందుకో అర్ధం గాదు. రాత్రికి రాత్రే పేరెంట్స్ ఫ్లయిట్ ఎక్కి ఎక్కడికో వెళ్ళి పోయారుగా? ఈ వెళ్ళి పోవడం హీరోయిన్ రాత్రంతా బయట తిరగడాని కన్నట్టుగా సృష్టించాడేమో కథకుడు- కానీ పేరెంట్స్ ని అలా పంపేశాక ఆమె బయట ఎక్కడికీ తిరగనవసరం లేకుండా, ఏంచక్కా ఇంట్లో కూర్చుని - టిండర్ లోనో, గ్రిండర్ లోనో యాప్ లో హుకప్ అయి- అతడ్ని ఇంటికే రమ్మంటే సరిపోతుందిగా?

        ఓ పాతిక నిమిషాల రన్ టైంలో, పబ్ లో హీరోతో హీరోయిన్ ఒన్ నైట్ స్టాండ్ గా కనెక్ట్ అయ్యాక, మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ మూడూ వున్నాయి. లేనిది వీటితో ఏం చేయాలన్నదే.

        హీరోయిన్ వేరొకడి మీద ప్రతీకారంగా హీరోతో ఓ రాత్రి పడుకోవాలనుకుంది. దీనికి పణంగా ఏం పెడుతోందో తెలీదు. శ్రీవారి శోభనం లో వైవాహిక జీవితాన్ని పణంగా పెట్టి వేరే అమ్మాయితో తిరుగుతాడు హీరో. ఒన్ నైట్ స్టాండ్ హిందీలో ఇద్దరూ తమ వైవాహిక జీవితాల్ని పణంగా పెట్టేస్తారు. ప్రస్తుత సినిమాలో హీరోయిన్ కనీసం కన్యాత్వాన్నైనా పణంగా పెడుతున్న సబ్ టెక్స్ట్ ని ప్రేక్షకుల అవసరార్ధం, ఆదుర్దా కోసం సృష్టించలేదు కథకుడు. ఏదీ పణంగా లేక పోవడతో కాన్ఫ్లిక్ట్ లేకుండా పోయింది. కాన్ఫ్లిక్ట్ లేని కథగా సోదిలా మారింది.

        ఇటు లూజర్ స్టేటస్ తో వున్న హీరోకీ, ఈ రాత్రి వర్జీనిటీ వదులుకుని తొలి అనుభవమనే విన్నింగ్ సిట్యూయేషన్ని ఎంజాయ్ చేయాలన్న సోయి లేకుండా పోయింది. అంత క్లోజ్ గా మూవ్ అవుతున్న హీరోయిన్ తో ఎరోటిక్ ఫీలింగ్ గానీ, రోమాంటిక్ సస్పెన్స్ గానీ, ఎక్సైట్ మెంట్ గానీ, ఎక్కడా చోటు దొరక్కపోతే రోడ్డు మీదే కానిచ్చేయాలన్న  తెగింపూ తొందరపాటు గానీ లేకుండా పోయింది. ఇద్దరివీ రక్త మాంసాల్లేని పాత్ర చిత్రణలయ్యాయి. 

        ఫలితంగా ఒక్కో చోటుకి వెళ్ళడం, అక్కడేదో సిల్లీగా కుదరక పోవడమనే కామెడీ సీన్లే రిపీటవుతూ వుంటాయి ఫస్టాఫ్ సెకండాఫ్ రెండిట్లో. కథ డెవలప్ కాదు, ఇంకో స్థాయికీ  వెళ్ళదు. జరగాల్సింది పదేపదే ఆ చోట్లలో పడుకోడానికి  వీల్లేని కామెడీలు కాదు-  జరగాల్సింది పడుకుని ఫోర్ ప్లే దాకా వెళ్ళే - ఇక ఇంటర్ కోర్సు ప్రారంభమయ్యే పీక్ లో డిస్టర్బెన్స్. ఇంటర్ కోర్సు డిస్టర్బ్ అయ్యే ఎరోటిక్ సస్పెన్స్, టెన్షన్ కావాలి వేడి పుట్టిస్తూ.

        లేకపోతే చేతకాని పాత మూస సీన్లు - ఆ పేరుతో అర్ధం లేని, విషయం లేని  కామెడీలూ కాదు ఈ మోడరన్ కథకి కావాల్సింది. దీన్ని బుర్ర కథ చెపుతున్నట్టు తీయడమూ కాదు. బుర్రకథల్ని తక్కువ చేయడం లేదు. బుర్ర కథ దానికది ఒక సారస్వత వారసత్వ సంపద. బుర్ర కథని సినిమాలాగా చెప్పరు, సినిమాని బుర్ర కథలా తీయడమేమిటి?

—సికిందర్

 

18, మే 2020, సోమవారం

943 " స్క్రీన్ ప్లే సంగతులు


        (చదివే పని పెరగడంతో రాత పనికి వారంపాటు బ్రేక్ పడింది. నేటి నుంచి షరా మామూలే...)
       
టీవల హిందీలో టౌన్ కామెడీలనే కొత్త ట్రెండ్ రోమాంటిక్ కామెడీలు వస్తున్నట్టు, ఇదో కొత్త జానర్ అవుతున్నట్టూ గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. దీని జానర్ మర్యాదల గురించి కొందరు అడుగుతున్నారు. ఈ టౌన్ రోమాంటిక్ కామెడీలు రెండు రకాలు. లివ్ ఇన్ రిలేషన్ షిప్, గే లవ్, లెస్బియన్ లవ్ వంటి జీవన శైలుల్ని నగర సంస్కృతిలో చూపిస్తున్నవి కాస్తా, సాంప్రదాయంగా నిదానంగా వుండే టౌన్ సెటప్ లో చూపిస్తూ కొత్త ట్రెండ్ కి బాట వేయడం ఒక రకం కాగా; ఈ కాన్సెప్ట్స్ కాకుండా, సాధారణ రోమాంటిక్ కామెడీలనే ఇదే టౌన్ సెటప్ లో చూపించడం రెండో రకం. మన్మర్జియా, లుకా ఛుప్పీ, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా వంటివి మొదటి రకంలోకి వస్తే, బరేలీకీ బర్ఫీ, డ్రీంగర్ల్ వంటివి రెండో కోవకి చెందుతాయి. ఈ రెండు రకాల రోమాంటిక్ కామెడీల్ని సిటీ లైఫ్ లో చూపించడం మొనాటనీ అయిపోవడం వల్ల కావొచ్చు, వీటిని టౌన్లకి తీసికెళ్ళి నేపథ్య వైవిధ్యంతో కొత్తదనాన్ని సాధిస్తున్నారు. ఆ టౌన్ ఏదైతే వుంటుందో దానిదైన నేటివిటీని, మనుషుల్నీఅచ్చంగా చిత్రించి ఒక దగ్గరితనం ప్రేక్షకులు ఫీలయ్యేలా, ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు.

       
‘లుకా ఛుప్పీ’ (దాగుడు మూతలు) లివ్ ఇన్ రిలేషన్ షిప్ కథ. నగర నేపథ్యంలో చూపిస్తూ వచ్చిన ఈ ఆధునిక పోకడని ఇలా టౌన్లో చూపించడం వల్ల ఒనగూడే బాక్సాఫీసు లాభమేమిటంటే, ఇలాటి నగర పోకడలు టౌనులో అలజడి సృష్టించ వచ్చనే ఒక అంచనా. అక్కడి ప్రజలు (పాత్రలు) ఛీ థూ అని దీన్నో ఇష్యూగా చేసి హంగామా చేయ వచ్చన్న ఆలోచన. ఈ అల్లరి అలజడి లేదా కామిక్ కాన్ఫ్లిక్ట్ కొత్త వినోదాత్మక విలువగా మారి బాక్సాఫీసుకి తాజాదనాన్ని తీసుకు వస్తుందన్న వ్యూహం. టౌను జీవులు నగరాల కంటే కాలంతో ఒకడుగు వెనకుంటారనే అందరూ ఆమోదించే సినిమా సూత్రీకరణే ఈ జానర్ కి నేపథ్య బలాన్ని సమకూరుస్తోంది. 

        ‘లుకా ఛుప్పీ’ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కూడా. మరాఠీలో రెండు సినిమాల దర్శకుడు. రచయిత రోహన్ శంకర్ ఈ కథ రాసుకొస్తే వెంటనే తిరస్కరించాడు. కారణం అది మథుర పట్టణ నేపథ్యంలో వుండడం. ఆ పట్టణమూ అక్కడి వాతావరణం తనకి తెలియవు. తెలియని వాటితో రిస్కు తీసుకోలేడు. అలాగని కథని ఫలానా వూరు అని కాకుండా ఫార్ములా సినిమాగా తీసేయడానికి మనసొప్పలేదు. తర్వాత్తర్వాత ఈ సబ్జెక్టుని చేపట్టేందుకు సిద్ధపడి, రచయితతో కలిసి ఏడాదిన్నర పాటూ మథురకి వెళ్ళివస్తూ అక్కడి నేటివిటీని అర్ధంజేసుకోవడానికి ప్రయత్నించాడు. మథుర పట్టణం పలికే ఆత్మని పట్టుకునే ప్రయత్నం చేశాడు. తదనుగుణంగా కథా రచనలో పాల్గొన్నాడు.

        ఈ కథకి పూర్వరంగం
       ఇలా ఏర్పాటవుతుంది - మథుర పట్టణాన్ని సందర్శించిన సినిమా స్టార్ నజీం ఖాన్ (అభినవ్ శుక్లా) తను లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో వున్నట్టు గొప్పగా ప్రకటించడంతో పెద్ద దుమారం లేస్తుంది. ప్రజలు అతడి పోస్టర్ల మీద పేడ కొడతారు. సినిమాలు నిషేధిస్తారు. పెళ్లి పవిత్రత గురించి ఓవరాక్షన్ చేస్తూ ఆందోళనకి దిగుతారు. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న యాంటీ నేషనల్ అని అతడి మీద ముద్ర వేస్తారు. ఇదంతా చూసి సంస్కృతీ రక్షా మంచ్ అనే లోకల్ పార్టీ రంగంలోకి దూకుతుంది. దీన్ని రాజకీయం చేసి ప్రేమికుల్ని ఉరికించి ఉరికించి కొడుతుంది. పార్టీకి చెందిన పేట రౌడీ కార్యకర్తలు హిందూ ధర్మ సంరక్షకులుగా మారిపోయి ఎడాపెడా వాయిస్తూంటారు. ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమని, లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ (ఎల్ ఆర్) కి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమనీ ధీరోదాత్త ప్రకటన చేస్తాడు పార్టీ అధ్యక్షుడు విష్ణు త్రివేదీ (వినయ్ పాఠక్). ఇతను ప్రతీసారీ ఎన్నికల్లో ఓడిపోతూంటాడు. ఇప్పుడు గెలవడానికి మంచి మసాలా దొరికింది.  


        ఈ పూర్వ రంగంలో కథ
        ఇలా ప్రారంభమవుతుంది- లోకల్ కేబుల్ టీవీ స్టార్ రిపోర్టర్ వినోద్ ‘గుడ్డూ’ కుమార్ శుక్లా (కార్తీక్ ఆర్యన్), అతడి కెమెరామాన్ అబ్బాస్ ( అపరాశక్తి ఖురానా) పనిచేస్తున్న ఆఫీసుకి కూతురు రేష్మీ (కృతీ సానన్) ని వెంటబెట్టుకుని  విష్ణు త్రివేదీ వస్తాడు. ఈమె జర్నలిజం చేసి ఇంటర్న్ షిప్ కోసం ఎదురు చూస్తోంది. కేబుల్ టీవీ చీఫ్ ఆమెని చేర్చుకుంటాడు. ఆమె గుడ్డూ, అబ్బాస్ లతో కలిసి టీంగా వుంటుంది. వీళ్ళు  టౌన్లో ఎల్ ఆర్ మీద అభిప్రాయ సేకరణ చేస్తూంటారు. ఎల్ ఆర్ చాలా మంచిదని, కాబోయే మొగుడు తాగుబోతో కాదో అప్పుడే తెలుస్తుందనీ, తాగుబోతు మొగుడితో అనుభవం గడించిన ఒక ముసలావిడ కెమెరా ముందు సంచలన కామెంట్ చేస్తుంది.

        ఇలా కలిసి పనిచేస్తూ ప్రేమలో పడతారు గుడ్డూ రేష్మీలు.  గుడ్డూ కుటుంబంలో తల్లిదండ్రులు, పెళ్ళయిన అన్న, వాళ్ళ కొడుకు, పెళ్ళికాని అన్న, ఇంకో బాబూలాల్ (పంకజ్ త్రిపాఠీ) అనే తుంటరి బంధువూ వుంటారు. వీళ్ళకో బట్టల షాపు వుంటుంది. ఈ బాబూలాల్ ఆడవాళ్ళ వెంటపడే రోమాంటిక్ అలవాటుతో వుంటాడు. ఇటు రేష్మీని ప్రేమిస్తున్న గుడ్డూ పెళ్ళికి పెళ్ళికాని అన్న అడ్డుగా వుంటాడు. మరోపక్క రేష్మీ అప్పుడే ప్రేమకి సిద్ధంగా వుండదు. మరికొంత కాలం అతణ్ణి తెలుసుకోవాలనుకుంటుంది. ఇందుకు ఎల్ ఆర్ ప్రపోజ్ చేస్తుంది. గుడ్డూ షాక్ తింటాడు. తప్పదంటుంది. ఉన్న వూళ్ళో అందరికీ తెలిసేలా ఎల్ ఆర్ కి భయపడతాడు. అబ్బాస్ ఒక ఐడియా చెప్తాడు. దూరంగా గ్వాలియర్ లో ఎసైన్ మెంట్ పెట్టుకుని ముగ్గురూ వెళ్తే, అక్కడ వాళ్ళిద్దరూ 20 రోజులు ఎల్ ఆర్ చేసుకో వచ్చంటాడు.

        అలా గ్వాలియర్ లో ఎల్ ఆర్ పెడ్తారు. వీళ్ళ మీద అదే భవనంలో వుండే మిసెస్ శ్రీవాస్తవ్ అనే ఆవిడ కన్నేసి వుంటుంది. వీళ్ళకి పెళ్లి కాలేదని పసిగట్టి అందర్నీ పిలుచుకు వచ్చి పట్టిస్తుంది. ఇలాటిదేదో జరుగుతుందని ముందే వూహించిన అబ్బాస్ ఐడియాతో, తమ నకిలీ పెళ్లి ఫోటో ఒకటి గోడకి పెట్టేస్తారు గుడ్డూ రేష్మీలు. ఈ పెళ్లి ఫోటో చూసి నమ్మేసి అందరూ మిసెస్ శ్రీవాస్తవ్ ని తిట్టేసి వెళ్ళిపోతారు.


            అలా గ్వాలియర్ లో ఎల్ ఆర్ పెడ్తారు. వీళ్ళ మీద అదే భవనంలో వుండే మిసెస్ శ్రీవాస్తవ్ అనే ఆవిడ కన్నేసి వుంటుంది. వీళ్ళకి పెళ్లి కాలేదని పసిగట్టి అందర్నీ పిలుచుకు వచ్చి పట్టిస్తుంది. ఇలాటిదేదో జరుగుతుందని ముందే వూహించిన అబ్బాస్ ఐడియాతో, తమ నకిలీ పెళ్లి ఫోటో ఒకటి గోడకి పెట్టేస్తారు గుడ్డూ రేష్మీలు. ఈ పెళ్లి ఫోటో చూసి నమ్మేసి అందరూ మిసెస్ శ్రీవాస్తవ్ ని తిట్టేసి వెళ్ళిపోతారు. 

        ఇక ఈ ఎల్ ఆర్ లో గుడ్డూ పెళ్ళికి తగిన వాడేనని సర్టిఫై చేస్తుంది రేష్మీ. ఇంతలో గ్వాలియర్ కొచ్చి, ఒక పెళ్ళయినావిడతో రోమాంటిక్ ఎపిసోడ్ వెలగబెడుతున్న బాబూలాల్ కంట పడిపోతారు గుడ్డూ రేష్మీలు. ఇక అతను కడుపులో దాచుకోలేక గుడ్డూ కుటుంబం మొత్తాన్నీ తీసుకొచ్చి చూపించేస్తాడు సీను. ఆ పెళ్లి ఫోటో చూసి గుడ్డూ కుటుంబం వీళ్ళకి పెళ్ళయిందనే నమ్ముతారు. కాకపోతే లేచిపోయి దొంగ పెళ్లి చేసుకుని పరువు తీసినందుకు తిడతారు. వెళ్లి రేష్మీ తండ్రికి విన్నవించుకుంటారు. అతను షాక్ తింటాడు. కూతురే ఇలా చేస్తే రేపు ఎన్నికల్లో ఏం పోరాడతానని తల పట్టుకుంటాడు. ఖర్మ అనుకుని పెళ్లి రిసెప్షన్ కి ఏర్పాట్లు చేస్తాడు. పెళ్ళికాని గుడ్డూ రేష్మీలు పెద్దల ముందు ఇంకోసారి పెళ్లి చేసుకుని రిసెప్షన్ పెట్టుకుంటామంటారు. వీల్లేదంటాడు. 

         ఇలా పెళ్లి కాలేదని నమ్మించలేని తాము పెళ్ళయిన జంటలాగా కాపురం పెట్టా ల్సివస్తుంది గుడ్డూ వాళ్ళింట్లో. ఇది మనసొప్పక రహస్యంగా నైనా పెళ్లి చేసుకుందామని పట్టుబడుతుంది రేష్మీ. ఇలా వీళ్ళ  రహస్య పెళ్లి ప్రయత్నాలు కూడా ఎలా విఫలమవుతూ  హాస్య ప్రహసనాలు సృష్టించాయన్నది మిగతా సెకండాఫ్ కథ.

జానర్ మర్యాదలు
      ముందుగా చెప్పుకోవాల్సిందేమిటంటే బ్యాక్ డ్రాప్. నగర బ్యాక్ డ్రాప్ లో కథని టౌన్ బ్యాక్  డ్రాప్ లో చూపించడం. ఆ టౌను వాతావరణాన్నీ, అక్కడి ప్రజల తీరు తెన్నుల్నీ, భాషనీ కథలో భాగం చేసి, ఆ టౌను కథా ప్రపంచాన్ని సృష్టించడం. ఈ కథ ఈ టౌనుకి వర్తించే  కథా ప్రపంచం. ఇదే కథని ఇంకో టౌనులో తీస్తే ఆ టౌనుకి వర్తించే కథా ప్రపంచంగా మార్పు చేర్పులు చేసుకోక తప్పదు. ఒక కథ పట్టుకుని ఏ టౌను కైనా ఇదే నా కథ, ఇదే నా కథనం, ఇవే నా పాత్రలు, ఇవే నా దృశ్యాలు, ఇవే నా డైలాగులూ  - ఎంతో కష్టపడి నా నా ముద్దొచ్చే స్క్రిప్టు నేను రాసుకున్నాను, మార్చమంటే మార్చనుగాక మార్చను - అని గుండుగుత్త బేరం పెట్టుకుంటే ఈ జానర్ జోలికి రానవసరం లేదు. 


       ఈ కథ ఎల్ ఆర్ కాన్సెప్ట్ తో తీశారు. ఒక్కో టౌనులో దీని పట్ల ఒక్కో రియాక్షన్ ప్రజల నుంచి వుండొచ్చు. కనుక ఒక టౌనుని దృష్టిలో పెట్టుకుని ఇలాటి కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఆ టౌను ప్రజల రియాక్షనేమిటో వెళ్లి అడిగి తెలుసుకోవాలి. ఆ రియాక్షన్స్ ని కథలో భాగం చేయాలి. 

        మాది వరంగల్, లేదా విజయవాడ- మాకు తెలిసిన వరంగల్ లేదా విజయవాడలో మేం బాగా తీసుకోగలమనుకుంటే తీసేది కథతో వుండక,  పనిగట్టుకుని అక్కడి చారిత్రక, పర్యాటక, తీర్థ స్థలాల ప్రదర్శన చేసే ప్రమాదముంది. తెలియని టౌన్లో తీస్తే దర్శకుడు కథతో వుంటాడు.  ఈ జానర్లో హిందీలో తీస్తున్న ఇలాటి టౌన్లు దర్శకులకి పరాయి ప్రాంతాలే. ‘లుకా ఛుప్పీ’ తీసిన మథురలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కటీ చూపించలేదు.   
    
రెండోది, తారాగణం కూర్పు
        ఈ జానర్లో తీస్తున్న హిందీ సినిమాల్లో పెద్ద స్టార్స్ వుండరు. పెద్ద విలన్లు, పెద్ద కమెడియన్లు, పెద్ద సహాయ నటులూ వుండరు. బాలీవుడ్ బిగ్ బడ్జెట్స్ తో పోలిస్తే ఇవి చాలా స్మాల్ బడ్జెట్ కామెడీలు. ఇలాటి వాటిలో నటిస్తూ గుర్తింపూ, ప్రేక్షకుల అభిమానమూ పొందుతున్న స్మాల్ నటీ నటులే ఈ జానర్ ని పెంచి పోషించుకుంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, అపరా శక్తి ఖురానా, అభినవ్ శుక్లా వంటి హీరోలు, కృతీ సానన్, నుస్రత్ బరూచా, భూమీ పట్నేకర్ వంటి హీరోయిన్లు, పంకజ్ త్రిపాఠీ, పియూష్ మిశ్రా వంటి కమెడియన్లు, వినయ్ పాఠక్, సీమా పహ్వా వంటి సహాయ నటులూ ఈ స్మాల్ మూవీస్ స్టార్లుగా తమదైన వినోదాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమాలు బాగా పాపులర్ అవడానికి వీటికి పరిమితమై పాపులర్ అవుతున్న ఈ నటులే కారణం. వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఈ స్మాల్ మూవీస్ కి క్యూలు కడుతున్నారు ప్రేక్షకులు. 


        తెలుగులో ఈ పరిస్థితి, ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఆలోచన, పరిశీలన, పరిజ్ఞానం  లేవు. ఇదంతా వదిలేసి ఇక సినిమాలకి భవిష్యత్తే లేదనీ, ఓటీటీయే టీకా మందు అనీ అటువైపు క్యూలు కట్టడం. స్మాల్ మూవీస్ తో పాపులరై స్మాల్ మూవీస్ కి ప్రేక్షకుల్ని ఆకర్షించే స్మాల్ హీరోహీరోయిన్లు గానీ, కమెడియన్లు గానీ, సహాయ నటులుగానీ తెలుగుకి లేకుండా చేశారు మొత్తానికి. అలా పెంచి పోషించుకోలేదు.  సినిమాకొక కొత్త హీరో, సినిమాకొక కొత్త హీరోయిన్ కావాలి. ఆ తర్వాత వాళ్ళేమైపోతారో తెలీదు. సినిమాకొక కొత్త బ్యాచి ఎవరూ ప్రేక్షకులకి తెలియడం లేదు. ఆ సినిమాలూ దృష్టిలో పడ్డం లేదు.        

       ఒకప్పుడు స్మాల్ మూవీస్ హీరోయిన్ గా గజలా వుంటూ ఆకర్షించేది. ఒక స్మాల్ మూవీ లో ఆకర్షించిన హీరోయిన్ ని మరో దర్శకుడు తీసుకోవడం లేదు. తనూ ముక్కూ మొహం తెలీని ఓ కొత్త హీరోయిన్నే తెచ్చుకుని ప్రేక్షకుల మీద రుద్ద బోతాడు. ప్రేక్షకులకి చీమ కుట్టి నట్టుండదు. వాళ్ళు మొహం తిప్పుకుని ఎటో చూస్తారు. ఆ కొత్త హీరోయిను ఎటో వెళ్ళిపోతుంది. ఏ కొత్త హీరోయినుకీ రెండో సినిమా నొసట రాసి పెట్టి వుండదు. చాలా బ్యాడ్ మార్కెటింగ్ సాంప్రదాయంతో వున్నారు తెలుగు స్మాల్ మేకర్లు. హిందీలో ఇలా లేదు. ఒక స్మాల్ మూవీలో ఆకర్షించిన కృతీ సాసన్, నుస్రత్ బరూచా, భూమీ పట్నేకర్ లని ఇతర స్మాల్ దర్శకులు తమ స్మాల్ మూవీస్ కి తీసుకుంటూ, అలాగే పైన చెప్పుకున్న లాంటి హీరోలనీ, కమెడియన్లనీ, క్యారక్టర్ ఆర్టిస్టులనీ తీసుకుంటూ, స్మాల్ మూవీస్ మార్కెట్ కంటూ ఒక స్మాల్ స్టార్ డమ్ ని సృష్టించుకున్నారు. ఇక ఈ సినిమాలకి గిరాకీయే గిరాకీ. వంద కోట్లకి పైనే వసూళ్లు. 

        ‘లుకా ఛుప్పీ’ లో కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో కన్పించే ఆర్టిస్టు లెవరూ లేరు. వుంటే జానర్ మర్యాద దెబ్బతింటుంది. తెలుగులో ఈ జానర్ ని ప్రయత్నించాలనుకుంటే ఈ క్యాస్టింగ్ నిగ్రహం పాటించాల్సిందే. ఒకటొకటిగా స్మాల్ మూవీ స్టార్ క్యాస్ట్ తో స్టార్ డమ్ ని సృష్టించాల్సిందే. రెగ్యులర్ సినిమాల తారాగణాన్ని పక్కన బెట్టాల్సిందే. వాళ్ళేం నష్టపోరు. 

       క్రియేటివ్ యాస్పెక్ట్ లో -
        కాన్సెప్ట్ బోల్డ్ అయినా ఇది రోమాంటిక్ కామెడీ. అందువల్ల హీరో హీరోయిన్లు విడిపోకుండా తమ బంధం కోసం కామిక్ పోరాటానికి తెరలేపారు. రోమాంటిక్ కామెడీ జానర్ మర్యాదల ప్రకారం అవి ఫస్టాఫ్ కామెడీగా, ఇంటర్వెల్లో ఇద్దర్నీ విడదీసి సెకండాఫ్ బాధాకర డ్రామాగా వుండవు. రోమాంటిక్ ప్రేమల్లో ప్రేమికులు ఏవో క్రేజీ పనులకి దిగుతారు, ఇరుక్కుంటారు, బయటపడేందుకు నానా కామిక్ ప్రయత్నాలూ చేస్తారు. ఈ జానర్ మర్యాదే ‘లుకా ఛుప్పీ’ లో వుంది. ఫస్టాఫ్ లో ఆమె ఎల్ ఆర్ ని ప్రపోజ్ చేసే దగ్గర ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది. సెకండాఫ్ లో సామూహిక వివాహాల ఘట్టంతో ప్లాట్ టూ ఏర్పడింది. ఆద్యంతం హాస్య ధోరణి బతికింది. అక్కడక్కడా పాత్రలు సీరియస్ అవుతాయి గానీ అది ధర్మాగ్రహమే. దీంతో కథ సీరియస్ అయిపోలేదు. 


        అలాగే హీరో హీరోయిన్ల పాత్రలు రెండూ యాక్టివ్ గానే వున్నాయి. రోమాంటిక్ కామెడీ అన్నాక ఉర్రూత లూగించాలి. అది హీరో ఒక్కడి వల్లే కాకూడదు, హీరోయిన్ ని నామమాత్రం చేయకూడదు. ఇక్కడ హీరో కాకుండా హీరోయిన్ కృతీ సానన్ ఎల్ ఆర్ ని ప్రపోజ్ చేయడం అతిపెద్ద యూత్ అప్పీలున్న క్రేజీ బీట్ అయింది. ఈ ప్లాట్ పాయింట్ వన్ న్యాయంగానే అరగంట సమయానికొస్తుంది. ఇక్కడ్నించే కాన్ఫ్లిక్ట్ మొదలయ్యింది. ఎల్ ఆర్ (సహజీవనం చేద్దాం) అనే పాయింటు తో ఈ కాన్ఫ్లిక్ట్ లో కావాల్సినంత యూత్ అప్పీల్ కూడా వచ్చేసింది. అలాగే పెళ్ళికాకుండా పెళ్ళైన వాళ్ళలా బతకలేక రహస్య పెళ్లి ప్రయత్నాలకి తెరలేపే ఇంటర్వెల్ మలుపులోనూ, ఆ తర్వాత సెకండాఫ్ సాంతం, యూత్ అప్పీల్ పరవళ్ళు తొక్కింది. ఐరనీ కామెడీని సృష్టిస్తుందని అంటాడు అరిస్టాటిల్. అరటి తొక్క మీద కాలేసి జారిపడ్డ వాడికి ఏడుపు, మనకి నవ్వు. అలాగే పెళ్లి లేకుండా కాపురం చేసి చూద్దామనుకుంటే, విరుద్ధంగా పెళ్ళయిన జంటలా కాపురం చేయాల్సి వస్తున్న డైనమిక్సే ఈ కథకి, కాన్ఫ్లిక్ట్ కి ఓ ఐరనీ సృష్టించాయి. 

        ఇంకో ప్రధాన డైనమిక్ ఏమిటంటే, ఎల్ ఆర్ మీద యుద్ధం ప్రకటించిన హీరోయిన్ తండ్రియే కూతురి ఎల్ ఆర్ తో కుక్కిన పేనయిపోవడం. అయితే అతడి నియోజక వర్గంలో యువ ఓటర్లు ఎక్కువ వున్నారనీ, అతను ఓడిపోతూ వుండాడానికి అతడి యూత్ వ్యతిరేక భావాలే కారణమనీ - హీరో అతడి కళ్ళు తెరిపించే ముగింపు బాగానే వుంది గానీ, మొత్తంగా చూస్తే ఈ కథ బలహీనమైనది. 

        ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ ఎల్ ఆర్ ప్రపోజల్ తో ముక్కోణం ఏర్పడింది. కానీ ఆమె ప్రపోజల్ కి హీరో కంగారు పడతాడే గానీ, అసలు స్టార్ నజీం ఖాన్ ఎల్ ఆర్ స్టేట్ మెంట్ తో వూరుని గడగడ లాడించిన నాయకుడే ఆమె తండ్రి అనీ, ఆమె తోనే ఎల్ ఆర్ అంటే ఇక చావే గతి అనీ రిస్కు ఫ్యాక్టర్ ని ఎస్టాబ్లిష్  చేయకుండా పైపైన కథ చేసేశారు. ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ ప్రపోజల్ తో హీరోయిన్ -హీరో- హీరోయిన్ తండ్రీ అన్న ముక్కోణం ఏర్పడింది. ఈ ముక్కోణంలో వుండాలి కథ. ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఎలిమెంట్స్ ని కలపకపోవడం వల్ల ఈ ఇబ్బంది. 

        అలాగే ఇరవై రోజుల ఎల్ ఆర్ లో కూడా డైనమిక్స్ లేవు. సహజీవనంలో అతను నచ్చితే, ఓకే అనుకుంటే అది కథెలా అవుతుంది? అతను నచ్చక తిరగబెడితే కథవుతుంది. నచ్చక దుకాణం కట్టేద్దామనుకునే లోపే గుట్టు బయటపడే పరిస్థితి వచ్చి, నచ్చని వాడు మొగుడుగా తగులుకున్న ఇరకాటంలో ఆమె పడితే -  బలహీన కథకి బలం చేకూరేది. కామిక్ కాన్ఫ్లిక్ట్ కి ఇంకో యాంగిల్ తోడయ్యేది.
 
సికిందర్


3, ఫిబ్రవరి 2019, ఆదివారం

734 : రివ్యూ



దర్శకత్వం ; షెల్లీ చోప్రా ధార్
తారాగణం : రాజ్ కుమార్ రావ్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్, జుహీ చావ్లా,  రేజీనా కాసాండ్రా తదితరులు
రచన : షెల్లీ చోప్రా ధార్, గజల్ దహీవాల్,  సంగీతం : రోచాక్ కోహ్లీ,  ఛాయాగ్రహణం : హిమాన్ ధమీజా, రంగరాజన్ రామ్ భద్రన్
బ్యానర్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్
నిర్మాత : విధు వినోద్ చోప్రా  
విడుదల : ఫిబ్రవరి 1, 2019

***
          రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు రొటీన్ అయిపోయిన ట్రెండ్ లో హోమోలవ్ చూపించే బోల్డ్ మూవీ వచ్చింది. అదికూడా స్టార్స్ తో. పైగా హోమ్లీగా. బోల్డేమిటి, హోమ్లీ ఏమిటీ అని డౌట్ రావచ్చు. ఇదే ప్రత్యేకత. బోల్డ్ తో చేసిన మెయిన్ స్ట్రీమ్ ప్రయోగం. ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’(ఒకమ్మాయిని చూస్తే నాకెలా అన్పించిందంటే) అని. ఈ టైటిల్ పాత పాట పల్లవే (‘1942 - ఏ లవ్ స్టోరీ’, 1994) అనిల్ కపూర్ హీరోగా, విధు వినోద్ చోప్రా  సినిమానే. మళ్ళీ ఇద్దరూ ఇప్పుడు సోనమ్ కపూర్ , రాజ్ కుమార్ రావ్ లతో, కొత్త దర్శకురాలితో, ఈ సాహస ప్రయోగం చేశారు. ఇదెలా  వుందో చూద్దాం...

కథ 
          స్వీటీ (సోనమ్) అనే అమ్మాయి పంజాబ్ లోని మోగాలో బల్బీర్ చౌదరి (అనిల్ కపూర్) అనే గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని కూతురు. బబ్లూ (అభిషేక్ దుహన్) ఆమె అన్న. ఇంకా ఇంట్లో నానమ్మ, ఇద్దరు పనివాళ్ళూ వుంటారు. ఆమె రహస్యంగా ఢిల్లీ వెళ్లి వస్తూంటుంది. బబ్లూ ఫాలో అయి కనిపెడుతూంటాడు.

          సాహిల్ మీర్జా (రాజ్ కుమార్ రావ్) ఒక సినిమా నిర్మాత కొడుకు. నాటకాల పిచ్చితో నాటక కంపెనీలో వుంటాడు. ఒక రోజు ఢిల్లీ వచ్చిన స్వీటీని బబ్లూ పట్టుకోబోతే తప్పించుకుని నాటక రిహార్సల్స్ లో దూరిపోతుంది. బబ్లూతో  పోరాడి ఆమెని రక్షిస్తాడు సాహిల్. ఆమె వూరెళ్ళి పోయాక, ఆమెని చూసి ప్రేమలో పడ్డ సాహిల్ ఆమె వూళ్ళో మకాం వేస్తాడు. సాహిల్ మతం వేరని బబ్లూ ఇంట్లో గొడవపడతాడు. తండ్రి బల్బీర్ చౌదరి స్వీటీకి సంబంధాలు చూడ్డం మొదలెడతాడు. పెళ్లి ఇష్టం లేని స్వీటీ ఈ విషయం సాహిల్ కి చెప్తుంది. తను లెస్బియన్ అనీ, ఢిల్లీలో కుహూ (రేజీనా) అనే అమ్మాయితో రిలేషన్ షిప్ లో వున్నాననీ అంటుంది.

          సాహిల్ బుర్ర తిరిగిపోతుంది. ఇక ఆమె మీద ప్రేమని చంపుకుని, ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. స్వీటీ లెస్బియన్ సమస్యని ఇంట్లో తీర్చి, ఆమెని కుహూతో అంగీరించేలా చేసేందుకు ఓ ప్లానేస్తాడు. ఏమిటా ప్లాను? ఈ సమస్యతో ఇంట్లో ఎలాటి సంక్షోభం ఏర్పడింది? ఈ సంక్షోభాన్ని నాటకాన్ని ప్రదర్శించి ఎలా పరిష్కరించాడు సాహిల్?...ఇవీ మిగతా కథలో తేలే విషయాలు. 

ఎలావుంది కథ 
      బోల్డ్ కథ ఉద్దేశపూర్వకంగా ఓల్డ్ గా వుంది. ఇలాటి  బోల్డ్ కథ ఇరవై ఏళ్ల  క్రితం దీపా మెహతా బోల్డ్ గానే తీసింది.         ‘ది ఫైర్’ అని షబనా అజ్మీ, నందితా దాస్ లు జంటగా నటించారు. దాన్ని ఆ లైంగిక ప్రవృత్తిని ప్రధానంగా చేసి అలాటి దృశ్యాలతో చూపించారు. దాంతో దాడులు జరిగాయి. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడీ బోల్డ్ తో దాడుల్లేవు, బేడీల్లేవు. అలాగని స్వలింగ సంపర్కాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది కదాని,  దీన్ని ‘ఎ’ సర్టిఫికేట్ సినిమాగా తీసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశం కనపడదు. దీనికి పెద్ద  ధైర్యం అవసరం లేదు. ఇలాటి బోల్డ్ కథని మెయిన్ స్ట్రీమ్ సినిమాగా తీసి, కుటుంబ సినిమాగా కుటుంబ ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళడానికే ధైర్యం కావాలి. 

          ఆ ధైర్యమే ఈ బోల్డ్ ఈజ్ ఓల్డ్ ఉద్దేశపూర్వక ప్రయోగం. స్వలింగ సంపర్కం చట్టబద్ధమయ్యాక ఇంకా ఆ లైంగిక ప్రవృత్తి వున్న ‘ఎల్జీబీటీక్యూ’ వర్గాలతో తిరుగుబాట్ల కథలు చూపించకుండా, ఈ తీర్పుతో ఇలాటి సమస్య నెదుర్కొంటున్న కుటుంబాల పరిస్థితేమిటన్నకోణంలో ఓ ప్రయత్నం చేసిందీ కొత్త దర్శకురాలు. అందుకని ఈ బోల్డ్ కథని కుటుంబాలకి దగ్గరయ్యేలా ఓల్డ్ ఫ్యాషన్డ్ గానే, సున్నితంగానే  చెప్పింది. 

          కానీ చివర్లో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు వుంది. అంతా సుఖాంతమయ్యాక - నువ్వీ నాటకాన్ని ఊరూరా తిప్పి, చిన్నప్పట్నుంచీ ఈ సమస్యతో సతమతమవుతున్న తన లాంటి వాళ్లకి ధైర్యం కల్పించమని హీరోయిన్ చెప్తుంది హీరోతో. ఈ కథలో హీరోయిన్ చిన్నప్పుడే తనలో మార్పు గమనిస్తుంది. ఇలాటి చిన్నపిల్లలు తనలాగా సిగ్గుపడకుండా బ్రతికేలా ఎడ్యుకేట్ చేయమని ఆమె ఉద్దేశం. 

          జనాభాలో 2 .5 శాతంతో అరుదుగా వుండే ఈ జీవనశైలిని నాటకాలేసి ఎడ్యుకేట్ చేస్తే, ఇదేదో బావుందని ఇలాటి బుద్ధిలేని బుల్లెమ్మలు కూడా బోల్డుగా ఇందులోకి దిగిపోతే? ధూమపానం మంచిదే, మీరు కూడా తాగొచ్చు అనడంలా వుందిది.  

 ఎవరెలా చేశారు 
      ఇందులో అసభ్యతకి, అశ్లీలానికీ చోటు లేదు. సోనమ్, రెజీనాల జోడీ ఫ్రెండ్స్ లాగానే కన్పిస్తారు. వాళ్ళు లెస్బియన్స్ అని ఒకసారి చెప్పి వదిలేస్తారు  అలాటి సీన్లుగానీ, డైలాగులు గానీ వాళ్ళ మధ్య వుండవు. మహా అంటే చేతులు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి కనిపించే సీన్లు కూడా అయిదారుకి మించి వుండవు. పాయింటు లెస్బియన్ కల్చర్ ని చూపించడం కాదు, ఈ పాయింటుతో కుటుంబపు రప్చర్ ని చూపించడమే. ఈ ఫోకస్ ని ఎక్కడా చెదరనివ్వలేదు. నటీమణులిద్దరూ ఈ ఫ్యామిలీ కథలో ప్రేక్షకుల్ని అఫెండ్ చేయకుండా, ఫ్యామిలీ కథల్లో ఇమిడిపోయే మెలో డ్రామాతో సానుభూతిని రాబట్టుకుంటారు. 

          నాటక దర్శకుడుగా రాజ్ కుమార్ రావ్ ఎప్పట్లానే ఫన్నీ యాక్టింగ్. ఇద్దరమ్మాయిల ప్రేమని కుటుంబ సభ్యులతోనే వూళ్ళో నాటకంగా వేయించి, ప్రేక్షకులందరి సమక్షంలో సమస్యని పరిష్కరించి పారేస్తాడు. హృదయాల్ని పిండేసే ఈ మెలోడ్రామాకి ప్రేక్షకులు కరిగిపోయి (అంటే వూళ్ళో జనం) ఇద్దరమ్మాయిల సహజీవనాన్ని కాదనలేకపోతారు. ఈ నాటకం రోమియో జూలియెట్ నాటకంలాగే వుంటుంది. అద్దాల గదిలో బందీ అయిన సోనమ్ కపూర్, తనని బయటికి తీయమని తండ్రిని వేడుకోవడం అనార్కలీ కథలా కూడా వుంటుంది. రాజ్ కుమార్ రావ్ బంపర్ నాటకాన్ని రచిస్తాడు. తనని కొట్టకుండా ముందే ప్రకటిస్తాడు - ఈ నాటకాన్ని హృదయంతో చూడాలనీ, బుర్రతో చూసి రెచ్చిపోయి రాళ్ళు చ్చుకోవద్దనీ.  

       ఈ మొత్తం ఫ్యామిలీ డ్రామాలో ఫార్ములా ప్రకారం అనిల్ కపూర్ తండ్రి పాత్రే (నిజజీవితంలో కూడా సోనమ్ తండ్రే) సంఘర్షణాత్మక పాత్ర. కూతుర్ని పల్లెత్తు మాటనకుండా, అర్ధంజేసుకునే ప్రయత్నంతో, తనే చాలా తప్పు చేశాడన్న అపరాధభావంతో, సమస్యతో సర్దుకు పోవాల్సిన అవసరంతో - ఇలా మూడు షేడ్స్ తో పాత్రని నిలబెడతాడు. చివరికి అన్నీ పక్కన బెట్టి - ఇదికూడా ప్రేమే కదా -  అని హుషారుగా అంగీకరిస్తాడు.

          రాజ్ కుమార్ రావ్ వెంట వచ్చే నాటక కంపెనీ కుక్ గా జుహీచావ్లాది హాస్య పాత్ర. తన బ్రాండ్ నవ్వు మొహంతో సీన్లని కాంతివంతం చేస్తూంటుంది. పనిలోపనిగా భార్య లేని అనిల్ కపూర్ తో ఫ్లర్టింగ్. తనకి భర్త విడాకులిచ్చాడు, పిల్లలు ఎదిగి వాళ్ళ ఇష్టప్రకారం జీవించడానికి వెళ్ళిపోయారు, ఇన్నాళ్ళూ వాళ్ళకోసం తను జీవించింది, ఇప్పుడు తన కోసం తాను జీవిస్తానని హల్చల్ చేస్తూంటుంది. పిల్లల్ని పట్టి వుంచకూడదని, వదిలెయ్యాలనీ ఆమె చెప్పే సూక్తి అనిల్ కపూర్ మీద బాగా పనిచేస్తుంది. చివరికిలా ముగుస్తుంది - నాతో  పార్టనర్ షిప్ చేస్తావా? -  అంటాడు. ఎలాటి పార్టనర్ షిప్, ప్రొఫెషనలా? పర్సనలా? -  అంటుంది.  

         హీరోయిన్ అన్న పాత్రలో కొత్త నటుడు అభిషేక్ దుహన్ పైకొచ్చే పోకడలున్నాయి. రాజ్ కుమార్ రావ్ ఇంట్లో చేరి భ్రష్టు పట్టిస్తున్నాడనే కోపంతో రెండుసార్లు అతణ్ణి  తన్నే పాత్రకూడా. నాటకాన్ని కూడా చెడగొట్ట బోతాడు. 

          ఫీల్ గుడ్ పాత్రలతో, ఫీల్ గుడ్ నటనలతో ఒక విషమ సమస్యని సానుకూల ధోరణికి మార్చేస్తుంది దర్శకురాలు.

 చివరికేమిటి 
          ఈ బోల్డ్ కాన్సెప్ట్ లో ఏ కోణం మీద ఫోకస్ చేయాలో ఆ కుటుంబ కోణం పట్టుకుని ఆ కుటుంబ ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళాలన్న మార్కెట్ యాస్పెక్ట్ మంచిదే. కానీ 1500 థియేటర్లలో రిలీజ్ చేసినా 3.30 కోట్లకి మించి రాలేదు మొదటి రోజు. మెయిన్ స్ట్రీమ్ సినిమాగా తీసినా ఆ ఫ్యామిలీ ప్రేక్షకులే లేరు. ఎంత  ఫ్యామిలీగా ఎంటర్ టైన్ చేసినా ఇలాటి  ప్రేమలు ఛీథూనే. 

          హీరోయిన్ చిన్నప్పటి జీవితం వుంటుంది. పిల్లలతో కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా వుంటూ, ఏవో భావాలు రాసుకుంటూ, అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు బొమ్మలేసుకుంటూ, పూర్తి ఇంట్రోవర్ట్ గా పెరుగుతుంది. తండ్రి తెలుసుకునేటప్పటికి చేయిదాటి పోతుంది. చిన్నప్పట్నుంచీ ఈమె మానసిక లోకాన్ని తను తరచి చూడలేదే అన్న అపరాధభావం వెన్నాడుతుంది. 

         ఇదే, ఈ ఛీథూ అన్పించే సినిమాతో  కళ్ళు తెరవాల్సిన నివురు గప్పిన నిజం. ఛీథూ అన్పించే పరిస్థితి ఇంట్లోనే మొలకెత్తుతోందేమో కన్నేసి వుంచుకోవాలి. మొక్కగా వున్నప్పుడు వంచొచ్చు, మానయ్యాక కరెంటు షాకులే షాకులు. ఈ సినిమాని ఛీథూ అనుకుని అనిల్ కపూర్ పాత్రలో హెచ్చరికని మిస్సయితే, రేపెప్పుడో ఇంట్లోనే ఛీథూ! అరుదైన 2.5 శాతమే కదాని కాదు. ఈ 2.5 శాతం మరణాలతో ఖాళీ అవుతూండగా మళ్ళీ జననాలతో భర్తీ అవుతూ వుంటుంది...అలాటి జననాలు ఎక్కడైనా సంభవించవచ్చు.

సికిందర్
Watched at Ramakrishna 70 mm, Abids
6pm, 2.2.19