రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query జస్టిస్ చౌదరి’. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query జస్టిస్ చౌదరి’. Sort by relevance Show all posts

Monday, March 24, 2025

1371 : స్క్రీన్ ప్లే అప్డేట్స్

 



సినిమాల్లోని సంఘటనలు ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రించుకోవాలంటే

రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించాల్సిందే...మూడు అనేది ఒక మ్యాజికల్ నంబర్.

ఏదైనా విషయం మూడుగా వుండడం మానసికావసరం. సినిమాల్లో,

టీవీ షోలలో సంఘటనలు మూడుగా జరిగి పూర్తవుతాయి.  మెదడు మూడుగా
జరిగే పాటర్న్ ని గుర్తుంచుకుంటుంది. సంఘటనల్లో ఈ పాటర్న్ ని
వెతుక్కుంటుంది. పాటర్న్ కనిపించలేదో ఆ సంఘటన
లేదా సీను సినిమాటిక్ గా విఫలమైనట్టే...


    సినిమా స్క్రిప్టుల్లో సీన్లు రాసేటప్పుడు, డైలాగులు రాసేటప్పుడు ఎంత ప్రామాణికంగా రాస్తున్నామన్న ప్రశ్న వస్తుంది. సీనంటే ఏమిటనే అర్ధం తెలుసుకోవడం దగ్గర్నుంచీ సీనుని ఎలా నడపాలన్న క్రమం వరకూ కొన్ని టూల్స్ లేదా సూత్రాలున్నాయి. ఒక సీను ప్రొడక్షన్ కాస్టు కొన్ని లక్షల రూపాయల వరకూ వుండొచ్చు. మరి ఇంత పెట్టుబడికి తగ్గ విషయం నిర్మాణాత్మకంగా సీన్లలో వుంటోందా అన్నది ఎవరికివారు ప్రశ్నించుకోవాల్సిన అంశం. అసలు స్క్రీన్ ప్లే అనేదే ఒక త్రి విధ అవస్థలతో కూడిన త్రయం. అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ లు కలిసి త్రయంగా ఏర్పడే అవస్థ. ఇవే అవస్థలు ఒక్కో సీనులోనూ వుంటాయి. ప్రతీ సీనూ దాని లోపల బిగింగ్ మిడిల్ ఎండ్ అనే త్రివిధ అవస్థల్ని అనుభవిస్తూ వుంటుంది. దీనికి ఉదాహరణగా ఇక్కడ క్లిక్ చేసి, 1982 నాటి జస్టిస్ చౌదరి సీను పోస్ట్ మార్టం చూడండి.  అంటే స్క్రీన్ ప్లేకి లాగే సీన్లు కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనే వుంటాయన్న మాట. ఇంకా చెప్పాలంటే ఒక కథకి ఐడియా పుట్టడంలోనూ ఈ త్రివిధ అవస్థలుంటాయి. అంటే మూడు వాక్యాల ఐడియా నిర్మాణంలోనూ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుంటుందన్న మాట. ఐడియా స్ట్రక్చర్ ప్రకారం లేకపోతే ఇక స్క్రీన్ ప్లే, అందులోని సీన్లు, సీన్లలోని డైలాగులూ దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఇదంతా స్ట్రక్చర్ లో త్రివిధ అవస్థల అవశ్యకత గురించి. మరి కంటెంట్ కూడా కొన్ని కీలక దశల్లో త్రివిధ అవస్థల్ని అనుభవిస్తూ వుంటుందని తెలుసా? దీన్ని రూల్ ఆఫ్ త్రీస్ అన్నారు. ఇదేమిటో ఈ క్రింద తెలుసుకుందాం...

        రూల్ ఆఫ్ త్రీస్ అనేది క్వాలిటీ స్క్రిప్టు రచనలో ఒక ముఖ్యమైన టూల్. స్క్రిప్టులో రాస్తున్న కథలో భాగమైన కాన్సెప్ట్ ని, సన్నివేశాల్ని, సన్నివేశాల్లో ప్రతిపాదించ దల్చుకున్న భావాన్నీ- ఓ మూడు సార్లు వల్లెవేస్తే బాగా రక్తి కడతాయని  పండితులు కనిపెట్టిన కిటుకు. తర్వాత ఆంత్రోపాలజిస్టులు కూడా ఈ కిటుకు నిజ జీవితంలో మనం పలికే వాక్యాల్లో, ఎదుర్కొనే ఆయా పరిస్థితుల్లో, చెప్పుకునే కథల్లో బాగా వర్కౌట్ అవుతోందని తేల్చారు. ఉదాహరణకి కింద చూడండి-
The Good, the Bad, and the Ugly

Lock, Stock and Two Smoking Barrels

Stop, Look and Listen

Sex, Lies and Videotape
కట్టె కొట్టె తెచ్చె
కథ -స్క్రీన్ ప్లే- దర్శకత్వం
జడ చూస్తి, మెడ చూస్తి, జబ్బల నునుపు చూస్తి
నీచ్ కమీనే కుత్తే
రెడీ, వన్ టూ త్రీ!

2. పరస్పర సంబంధం, ఆరోహణా క్రమం

    ఇక త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు ఒక త్రయం. త్రివిధ దళాల్లోని సైనిక- నావిక-వాయు దళాలు ఒక త్రయం. త్రికాలాల్లోని  గతం -వర్తమానం -భవిష్యత్తు ఒక త్రయం... ఇలా త్రయంగా వున్న మూడు అవస్థలే రూల్ ఆఫ్ త్రీస్. ఈ మూడు అవస్థలు పరస్పర సంబంధంతో వుంటాయి. పరస్పర సంబంధం లేకుండా సైనిక- నావిక- పోలీసు దళాలు త్రయం కాదు. కాబట్టి అవస్థ కాదు, దురవస్థ. పైన ఇచ్చిన ఉదాహరణలు చూస్తే అన్నీ పరస్పర సంబంధంతో వున్నాయి. అలాగే అవి ఆరోహణా క్రమంలో వున్నాయి. అంటే మొదటి అవస్థ తీవ్రత కంటే రెండో అవస్థ తీవ్రత, రెండో అవస్థ తీవ్రత కంటే మూడో అవస్థ తీవ్రత పెరుగుతూ వున్నాయి.
       
గొప్పవాళ్లు కూడా తమ ప్రసంగాల్లో ఈ రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించడం వల్లే అవి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి అంత ప్రఖ్యాత ప్రసంగాలయ్యాయి-
"I came, I saw, I conquered” (Julius Caesar),Government of  the people, by the people, for the people"  (Abraham Lincoln), Life, liberty, and the pursuit of happiness” (Thomas Jefferson)...మొదటి దానిలో I ని మూడు సార్లు వల్లె వేశాడు. అలా I తో మూడు అవస్థల్ని పేర్కొన్నాడు (came, saw, conquered). ఇలా కాకుండా డైరెక్టుగా  I conquered అని ఒకే అవస్థ అనేస్తే, రసోత్పత్తి వుండేది కాదు, ప్రసంగం ఆకట్టుకునేది కాదు. సర్లే వయ్యా, నీకు మాటాడ్డమే రాదు, రాయడం రాని తెలుగు నలుగు సినిమా డైలాగులా వుందనేసి వెళ్ళి పోయేవాళ్ళు జనాలు.
         
అలాగే రెండో దానిలో
people ని మూడు సార్లు వల్లె వేశాడు. people  తో మూడు అవస్థల్ని నొక్కి చెప్పాడు. మూడో ప్రసంగంలో Life, liberty, and the pursuit of happiness మూడూ పరస్పర సంబంధమున్న అవస్థలతో కూడిన త్రయం. త్రివిధ అవస్థలతో కూడిన పద త్రయం.
          
ఈ పద త్రయాన్ని సినిమాల్లో చూస్తే-   “నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికి వచ్చా”, “మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డపై కనుంటే, మీ అబ్బ మొలతాడు కట్టి వుంటే, నీ మూతి మీద వున్నది మొలిచిన మీసమే అయితే నన్ను చంపరా రా!”, “నాకు ఎమోషన్స్ వుండవ్, ఫీలింగ్స్ వుండవ్, కాలిక్యులేషన్స్ వుండవ్, మానిప్యులేషన్స్ వుండవ్'
         
కొందరు కొడితే ఎక్స్ రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది!”, “ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా!
        
ఇలా రూల్ ఆఫ్ త్రీస్ అనేది డైలాగుల్లో ఒక లయని, ఎఫెక్ట్ కోసం పునరుధ్ఘాటనని (వల్లె వేయడాన్ని) సృష్టిస్తుంది. పై డైలాగుల్లో దీన్ని గమనించ వచ్చు. ఎఫెక్ట్ కోసం పరస్పర సంబంధమున్న మూడు పాయింట్లతో మూడు అవస్థల్ని యాక్షన్ ఓరియెంటెడ్ గా క్రియేట్ చేసినప్పుడు, చప్పట్లు పడే పంచ్ లైనుగా ఆ డైలాగు హైలైటవచ్చు.  

3. ప్రేమ సంభాషణల్లో సీక్వెన్స్

    ప్రేమ సంభాషణలు చూస్తే- “ఐ...ఐ...ఐ...లవ్యూ!” (ఈ మూడో సారి పలికినప్పుడు ఎక్కువ ఎమోషన్ తో వొత్తి పలక్కపోతే, ఏడిశావ్ లే అని ఆమె జంప్ అయ్యే ఛాన్సు ఎక్కువుంటుంది).
       
    "నీతో మాటాడాలంటే భయపడ్డాను
, నెర్వస్ అయ్యాను, బట్ నిన్ను చూసి చాలా ఎక్సైట్ అయ్యాను” (రెండు నెగెటివ్ ఎమోషన్స్ దాటుకుని, బట్ చాలా ఎక్సైట్ అయ్యాను అన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ కొచ్చాడన్నమాట ఆమె మెచ్చుకునేలా. మూడోది కూడా నెగెటివే అనొచ్చు- “బట్ నిన్ను చూశాక చచ్చూరుకున్నాను” అని- ఇది కామెడీ కథ అయినప్పుడు).
       
“ప్లీజ్ ఆగుతావా
? రిక్వెస్ట్ చేస్తున్నా! నే చెప్పేది వింటావా?”  అని ఆమె అడ్డుపడినప్పుడు మూడో మాట తీవ్రత పెంచుతూ అనాల్సి వుంటుంది.
       
ఆమె అతడికి తలంటు పోస్తూ ఇలా అన్నప్పుడు- “ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో
, తర్వాత నీకు తగ్గదాన్ని చూసి ప్రేమించుకో, ఆ తర్వాత హేపీగా ఆమెతో గడపడం నేర్చుకో, గుడ్ బై!” ఇందులో చివరి మాటల్లో  సలహా పాజిటివ్ స్వరంలో అనాల్సి వుంటుంది.
       
ప్రేమ సంభాషణలు త్రివిధా వస్థలతో ఒక సీక్వెన్సు లో సూటిగా
, పాయింటుకొస్తూ, సంక్షిప్తంగా వున్నప్పుడే రూల్ ఆఫ్ త్రీస్ రాణిస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. తోచిందల్లా రాయడం, రాసి ఆనందించడం కాదు. సీక్వెన్సులో వున్న ఒక్కో అవస్థని స్ట్రాంగ్ యాక్షన్ తో, వర్ణనతో చెప్పినప్పుడు ఆ సీక్వెన్స్  బాగా హైలైటయ్యే అవకాశముంటుంది. ప్రేమ  సంభాషణాల్లో రూల్ ఆఫ్ త్రీస్ ని ఆచి తూచి వాడాలి- ఎక్కడ పడితే అక్కడ వాడితే రిపీటీషన్ అన్పించుకుంటుంది.

4. దృశ్య త్రయాల విక్రయాలు  

    శివ బిగినింగ్ విభాగంలో దృశ్యపరమైన రూల్ ఆఫ్ త్రీస్ విజాతీయాలతో అసహజంగా కన్పిస్తుంది. అదే ఒక్కడు బిగినింగ్ విభాగంలో దృశ్యపరమైన రూల్ ఆఫ్ త్రీస్ సజాతీయాలతో అతిగా కన్పిస్తుంది. వీటిని తర్వాత చర్చిద్దాం. ముందుగా హాలీవుడ్ సినిమాల్లో చూద్దాం... వెన్ హేరీ మెట్ సాలీ రోమాంటిక్ కామెడీ టైటిల్ చూస్తే ఒకసారే మీటయినట్టు వుంటుంది. కానీ సినిమాల్లో సాలీని హేరీ మూడు వేర్వేరు సందర్భాల్లో కలుస్తాడు. బిగినింగ్ విభాగాన్ని స్ట్రక్చర్ చేయడానికి రచయిత్రి నోరా ఎఫ్రాన్ రూల్ ఆఫ్ త్రీస్ ని ఎఫెక్టివ్ గా వాడుకున్న విధం తెర మీద కనపడుతుంది. తెర మీద రాసింది కనపడాలి- అంతేగానీ పెట్టిన ప్రతీ రూపాయీ తెర మీద కనపడిందని రివ్యూలు  రాయడం కాదు- ఎలా కనబడుతుంది- ఆడిటర్ జనరల్ ని పక్కన కూర్చోబెట్టుకుని లెక్కిస్తారా?
        
ముందుగా హేరీ
, సాలీ
 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యూయార్క్ కి కారులో వెళ్తూ కలుస్తారు. ఈ మొదటి కలయిక స్క్రీన్ టైమ్ 14 వ నిమిషంలో వస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరి విభిన్న వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, నమ్మకాలూ ప్రేక్షకులకి పరిచయం చేస్తుంది రచయిత్రి.
        
తర్వాత రెండేళ్ళకి అనుకోకుండా ఫ్లయిట్ లో కలుస్తారు. ఈ సీనులో హేరీతో ఫ్రెండ్ షిప్ సాలీ కిష్టం లేదని ఎస్టాబ్లిష్ చేస్తుంది రచయిత్రి. ఫైనల్ గా మూడోసారి బుక్ స్టోర్ లో కలుస్తారు. ఇక్కడ్నుంచే కథ టేకాఫ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.
       
ఇలాటి దృశ్యాలకి సంబంధించి రూల్ ఆఫ్ త్రీస్ ఒకటే ప్రతిపాదిస్తుంది- మొదటి సారి ఓ సంఘటనే కావొచ్చు
, రెండోసారి కాకతాళీయమే కావచ్చు, కానీ మూడోసారి కూడా ఇలాగే అనుకుని కొట్టి వేయలేం, మీనింగ్ వుంటుంది- అది ఆడ మగ అయినా, ఇద్దరు ఆడవాళ్ళయినా, ఇద్దరు మగవాళ్ళయినా, మున్ముందు తెలిసే ఏదో అర్ధం కోసమే కలిసి ట్రావెల్ చేయాలని యూనివర్స్ తీసుకున్న డెసిషన్ అయివుంటుందది. మనకిలాటివి జరుగుతూంటాయి.

    స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ లో ఆస్కార్ షిండ్లర్, ఐజాక్ స్టెర్న్ ల మధ్య సంబంధం బిగినింగ్, మిడిల్ విభాగాలు రెండిట్లో డెవలప్ అవుతూ, రెండు సార్లు షిండ్లర్ ఆఫర్ చేసే డ్రింక్ ని రెండుసార్లూ మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తాడు ఇజాక్.  ఎండ్ విభాగాని కొచ్చేసరికి, షిండ్లర్ వేలాది మంది యూదుల ప్రాణాల్ని కాపాడడానికి తన సంపద సర్వం త్యాగం చేశాక, ఐజాక్ షిండ్లర్ ఆఫర్ చేసిన డ్రింక్ ని అప్పుడు స్వీకరిస్తాడు. దీని అర్ధమేమిటి? సింబాలిజం. మొదటి రెండుసార్లు షిండ్లర్ అడిగినప్పుడు, ఐజాక్ తిరస్కరించడం షిండ్లర్ నైతిక స్థితికి ప్రతీక. అతను  డ్రింక్ షేర్ చేసుకునేంత మంచి వ్యక్తి కాదని నమ్మాడు ఐజాక్. కానీ మూడవ సీన్లో షిండ్లర్ సంపద సర్వం త్యాగం చేసి నైతికంగా ఎదిగాడని నమ్మిన తర్వాత సంతోషంగా కలిసి డ్రింక్ కొట్టాడు ఐజాక్. ఇదీ రూల్ ఆఫ్ త్రీస్ మ్యాజిక్!
        
క్రిస్టఫర్ నోలన్ తీసిన 'ది డార్క్ నైట్' లో చూస్తే, డైలాగుల్లో రూల్ ఆఫ్ త్రీస్ నాట్యమాడుతుంది - సినిమాలో మూడుసార్లూ జోకర్ ఒకే లైను చెప్తాడు- "నా మొహం మీద ఈ గాయాలేంటో తెలుసుకో వాలనుందా?" అని.  మొదటి రెండు సార్లు, జోకర్ తన ముఖమ్మీద  గాయాల్ని వివరించడానికి వివిధ కథలు చెబుతూ, తనకు తానుగా సమాధానమిచ్చే అలంకారిక ప్రశ్నగా ఇది వుంటుంది.

    మూడోసారి షాకింగ్ గా వుండే క్రిస్టఫర్ నోలన్ క్రియేటివ్ ప్రతిభకి, సీట్లో మూర్ఛపోయి అంబులెన్స్ లో హాస్పిటల్ కి త్వరత్వరగా వెళ్ళి పోవాల్సిందే మనం- మూడోసారి జోకర్ శత్రువుకి అదే ప్రశ్న వేస్తాడు- "నా మొహం మీద ఈ గాయాలేంటో తెలుసుకోవా
లనుందా?" అని. ఈసారి ఇంకేం సమాధానం చెప్తాడో చెప్పే ముందే- "లేదురా, నాకు తెలుసుకోవాలని అస్సలు లేదు- నీ మోహమ్మీద ఆ గాయాలు నీకెలా అయ్యాయో నాకు తెలుసురా, తెలుసు!" అని కత్తులతో విరుచుకు పడి మొహం చెక్కి పారేస్తాడు బ్యాట్ మాన్ అనే వాడు! చాలా ఘోరం.
        
పై మూడు సందర్భాలతో కూడిన ఈ త్రివిధ అవస్థల రేంజి మేనేజి మెంటు ఒకదాన్ని మించొకటి ఎలా పెరిగిందో గమనించొచ్చు. మూడోది షాకింగ్ సంఘటన! అంటే రూల్ ఆఫ్ త్రీస్ కూడా మొత్తం స్క్రీన్ ప్లే లో వుండే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల లక్షణాలతోనే త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ కి లోబడి వుంటుందన్న మాట.

5. శివ కి ఒకటి తక్కువ - ఒక్కడు కి ఒకటి ఎక్కువ
    'శివ'లో దృశ్య త్రయం చూద్దాం- బిగినింగ్ విభాగంలో నాగార్జున ఎదురైనప్పుడల్లా జేడీ ఏదో గిల్లుతూ వుంటాడు. మొదటి సారి సైకిల్ స్టాండ్ దగ్గర తేడాగా మాట్లాడతాడు, రెండో సారి ఓ స్టూడెంట్ ని గర్ల్ ఫ్రెండ్ విషయంలో కొడతాడు, మూడో సారి హీరోయిన్ అమలకి డాష్ ఇస్తాడు. దీంతో నాగార్జున రెచ్చిపోయి సైకిలు ఛైను తెంపి కొట్టడం మొదలెడతాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్ సీను. అయితే వరసగా ఈ మూడు సీన్లూ సజాతి సీన్లు కాదు, అమలని డాష్ ఇచ్చే మూడో సీను మొదటి రెండిటితో సంబంధం లేని, సీక్వెన్సులో లేని విజాతి సీను. ఇలా రూల్ ఆఫ్ త్రీస్ ఏర్పాటుకి రసభంగం కలిగింది.
        
నిజానికి ఈ మూడు సీన్లూ అమలతోనే వుంటే వచ్చే నష్టమేమీ లేదు. పైగా మూడు సార్లూ హీరోయిన్ తో జేడీ చెలగాటానికి ఎక్కువ యూత్ అప్పీలుంటుంది, నాగార్జున లవ్ ఇంట్రెస్ట్ అయిన హీరోయిన్ని టార్గెట్ చేయడం  బ్యాడ్ క్యారక్టర్ అయిన జేడీకి బాగా సూటవుతుంది. ఇది వదిలేసి సైకిల్ స్టాండ్ దగ్గర నాగార్జునతో తేడాగా మాట్లాడడం, ఇంకెవరో స్టూడెంట్ ని కొట్టడం వంటివి దృశ్య త్రయం సూత్రానికే విరుద్ధం. మూడు సీన్లూ జేడీ హీరోయిన్ని టార్గెట్ చేస్తూ వుండే త్రి విధ అవస్థలతో వుంటే అది రూలాఫ్ త్రీస్.
        
'ఒక్కడు లో ఇలా కాదు, రూల్ ఆఫ్ త్రీస్ ని దాటి రూలాఫ్ ఫోర్ అయింది. బిగినింగ్ విభాగంలోమహేష్ బాబువర్గం, ప్రత్యర్హి వర్గం చిటికెలేసుకుంటూ కాలు దువ్వుతున్నప్పుడు, ప్రత్యర్ధి వర్గం గెలవలేమని పారిపోతుంది, రెండో సారీ ఇలాగే జరుగుతుంది. మూడో సారి ప్రత్యర్ధి వర్గం వాడు ఒకమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తే ఆమెతో చెంప దెబ్బ కొట్టిస్తాడు మహేష్ బాబు. వాడు వెళ్ళిపోయి ప్రతీకారంగా తన వర్గంతో వచ్చేసి పోరాటానికి తలపడతాడు.
        
ఇలా ఈ సీక్వెన్సులో నాల్గు సీన్లయ్యాయి- దృశ్య త్రయం గాక దృశ్య చతుష్టయం అన్నమాట. ఇందులో మొదటి రెండు సీన్ల తర్వాత మూడవది శివ లోలాగే విజాతీ సీను అన్పించవచ్చు- మధ్యలో అమ్మాయిని తేవడం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆమె శివ లోలాగా హీరోయిన్ కాదు- ఎవరో ఒకమ్మాయి. కాబట్టి ఈమెతోనే అన్ని సీన్లూ వుంటే అప్పుడు తప్పవుంతుంది. హీరోయిన్ గా భూమిక వుండగా వేరే ఈమెతో యూత్ అప్పీల్ కూడా వుండదు. ఈ దృశ్య చతుష్టయాన్ని దృశ్య త్రయంగా కుదించాలంటే- ఆ అమ్మాయితో చెంప దెబ్బ కొట్టించిన మూడో సీన్లోనే ఫైట్ మొదలై పోవాలి.
       
సినిమాల్లో పాత్రచిత్రణ పరంగా చూస్తే- ప్రధాన పాత్ర మూడు దశల డెవలప్ మెంటుకి నోచుకోవాల్సిందే. లేదా దాని జీవితంలో మూడు విశిష్ట మార్పులు సంభవించాల్సిందే. అప్పుడే పరిపూర్ణ పాత్రగా నిలబడుతుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్ (పౌరాణిక) స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగంలో ప్రధాన పాత్ర మూడు మార్పులకి లోనవుతుంది : గోల్ ని తిరస్కరించడం
, అప్పుడు గాడ్ ఫాదర్ పాత్ర వచ్చి మోటివేట్ చేయడం, ప్రధాన పాత్ర గోల్ ని స్వీకరించడం.
       
ఇలా రూల్ ఆఫ్ త్రీస్ తో దృశ్యాల్లో మంచి డ్రామానీ
, డైలాగుల్లో డెప్తునీ సృష్టించ వచ్చు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి -రాయడం మొదలెడితే ప్రతీ ఛోటా, ప్రతి అణువులోనూ  త్రీ యాక్ట్ స్ట్రక్చరే వుంటుందని, అదే స్క్రీన్ ప్లే అనే విశ్వాన్ని నడిపిస్తుందనీ. ఈ ఆర్టికల్ నచ్చితే, సినిమాల్లో మెటా కామెంటరీ అనే మరో స్క్రీన్ ప్లే అప్డేట్ ని గురించి తెలుసుకుందాం.

—సికిందర్

Tuesday, April 16, 2024

1424 : రివ్యూ



రచన-దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
తారాగణం : సూర్య తేజ ఏలే, మీనాక్షీ గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
విడుదల : ఏప్రిల్ 5, 2024
***
        తెలంగాణ పీరియడ్ సినిమా దొరసాని (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే ధని  కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ భరతనాట్యం అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన కీడాకోలా అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది. లాజిక్ ని కామెడీ చేసే మెంటల్ పాత్రలతో కొత్తదనం సంతరించుకుని ఓవర్సీస్ లో కూడా హిట్టయ్యింది. మరి ఈ క్రైమ్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వుంది? దీన్ని ఒకసారి చూడొచ్చా?  చాలా కాలం తర్వాత దర్శకుడి రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

రాజు సుందరం (సూర్యతేజ) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూంటాడు. రొటీన్ గానే ఇంట్లో కష్టాలకి, గర్ల్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) ని ఒప్పించడానికీ డబ్బులుండవు. డైరెక్టర్ అయిపోదామని కథలు చెప్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటాడు. కథల కోసం మైక్రోఫోన్లు ఏర్పాటు చేసి మనుషుల మాటలు రహస్యంగా వింటూ వాటిని కథలుగా రాస్తూంటాడు. మరోపక్క దివాకర్ (హర్షవర్ధన్) అనే పెద్ద క్రిమినల్ డ్రగ్స్ దందా చేస్తూంటాడు. ఓ రోజు రెండు కోట్ల దందా గురించి మైక్రోఫోన్లో విని, డబ్బు సంపాదనకి ఇదే మార్గమని వాళ్ళ అడ్డాకి వెళ్తాడు రాజు సుందరం. అక్కడ భగతనాట్యం అనే కోడ్ నేమ్ తో డ్రగ్స్ డీల్ జరుగుతూంటే బ్యాగు లాక్కుని పారిపోతాడు. ఆ బ్యాగులో డబ్బులుండవు, డ్రగ్స్ వుంటాయి. ఈ క్రమంలో శకుని (అజయ్ ఘోష్) అనే పోలీసు అధికారికి చిక్కుతాడు. ఇక్కడ్నుంచి బయటపడి డ్రగ్స్ తో ఏం చేశాడు, వాటిని తానే అమ్మి డబ్బు సంపాదించాడా, లేక ఇంకేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

తెలంగాణ ఫీల్ ఏం లేదు గానీ క్రైమ్ కామెడీకి పనికొచ్చే కథే. అయితే చేతిలో వున్నది కథలా భావించి తీయలేదు. ఏదో కాకరకాయ, ఎలా తీసినా క్రైమ్ కామెడీ అయిపోతుంద
నుకుని తీసినట్టుంది. ఇందుకే క్లయిమాక్స్ సహా విషయం ఆషామాషీగా వుంది. డ్రగ్స్ కి పెట్టిన పేరు భరతనాట్యం సెన్సారింగ్ లో భగత నాట్యం అని పలకడంగా మారిపోవడం ఈ కంటెంట్ కి తగిన న్యాయమే. ఫస్టాఫ్ అసలు కథేంటో ఎవరైనా చెప్పగలిగితే  ఈ సినిమా బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు.
       

ఫస్ట్ హాఫ్ అంతా హీరో సినిమా కథలు వినిపిస్తూ చేసే కొత్తదనం లేని కామెడీలు
, విలన్ దివాకర్, అతడి గ్యాంగ్ తో ఇబ్బంది పెట్టే కామెడీలూ సాగుతూ గంటపాటు ఓపికని పరీక్షిస్తూ- ఇంటర్వెల్ కి హీరో చేతికి డ్రగ్స్ రావడంతో ఆసక్తికర మలుపే వస్తుంది.
        
అయితే సెకండాఫ్ లో ఆ డ్రగ్స్ తో హీరో ఏం గేమ్ ఆడుకోవాలో ప్లానింగ్ లేకపోవడంతో తిరిగి సహన పరీక్షగా మారిపోయి ఆశ వదులుకునేలా చేస్తుంది. ఇందులో విలనీలు కూడా పాత సినిమాల్లో సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలనీల్లా తీరుబడి డైలాగులతో వుంటాయి. పాత హిందీ సినిమాల్లో విలన్ అజిత్ అనుచరులు మోనా డార్లింగ్, రాబర్ట్ లతో వుండే కామెడీ చాలా పాపులరైంది. ఏ సినిమాలోనైనా విలన్ అజిత్ కి మోనా డార్లింగ్, రాబర్ట్ లు వుండాలల్సిందే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అజిత్- మోనా డార్లింగ్- రాబర్ట్ లతో కొత్త కొత్త జోకులు పుట్టిస్తున్నారు. వాళ్ళని సజీవంగా వుంచుతున్నారు.
       
ఇలాటి క్రియేటివిటీని ఈ క్రైమ్ కామెడీలో మిస్సయ్యారు.
ముత్యాలముగ్గు లో రావు గోపాలరావుని, జస్టిస్ చౌదరి లో సత్యనారాయణనీ తీసుకుని వాళ్ళ స్టయిల్ విలనీతో ఎంటర్ టైన్ చేసివుంటే ఈ కథ లేని సినిమాకి ఇదే పెద్ద ఆకర్షణ అయ్యేది.  కథ లేని సినిమాగా తీయాలనుకుని వుంటే, కథ లేకుండా  కేవలం క్యారక్టర్లతో ఎలా నడిపారో ఎల్ డొరాడో (1966) అనే కౌబాయ్ క్లాసిక్ చూసి తెలుసుకుని వుండొచ్చు.
        
ఇక షరా మామూలుగా సెకండ్ హాఫ్ ఆ డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం అందరూ వెంటబడడం చూసి చూసి వున్నఅరిగిపోయిన  సీన్లే. ఇంతకంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ హీరో పాత్రకి క్రియేటివిటీ తెలియకుండా పోయింది. క్వెంటిన్ టరాంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు కోసం వేట వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో పాత్రలకి తప్ప ప్రేక్షకులకి తెలీదు. చివరికా బ్రీఫ్ కేసు చేజిక్కుంచుకున్న పాత్ర మూత తెరిచి చూస్తే, బ్రీఫ్ కేసులోంచి అతడి మొహం మీద వెలుగు పడుతూంటుంది. తృప్తిగా చూస్తూంటాడు. ఆ ముగింపులో కూడా బ్రీఫ్ కేసులో ఏముందో ఆడియెన్స్ కి చూపించరు. చూపిస్తే డబ్బులో. డ్రగ్సో, వజ్రాలో వుంటే సర్ప్రైజ్ ఏముంటుంది? అందుకే ఇంకేదో గొప్పది వున్నట్టు ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు. ఇది కథనంలో ఉపయోగపడే ఒక ప్లాట్ డివైస్ అనీ, దీన్ని మెక్ గఫిన్ అనాలనీ, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టి చెప్పాడు.

మొత్తానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కథ ఇలా నడిపిస్తే, ఇక సినిమాలేం తీస్తాడో వూహించాల్సిందే. కొసమెరుపేమిటంటే,  దీనికి పార్ట్ 2 వుంటుందని సూచించారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరోగా సూర్యతేజ యాక్టింగ్ ఫర్వాలేదు, స్పీడుంది. స్పీడుతో ఓవరాక్షన్ చేయకుండా నిగ్రహింఛుకున్నాడు. హీఓయిన్ మీనాక్షి గోస్వామి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ హిందీ, తెలుగు కాలిపి మాట్లాడుతూంటుంది. షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ లా వుంది. సినిమా హీరో అవ్వాలనే పాత్రలో వైవా హర్ష తన అనుభవంతో కామెడీని బాగా హేండిల్ చేశాడు. పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, విలన్ గా హర్షవర్ధన్ లది పాత కాలపు విలనీ.
        
చాలా పరిమిత బడ్జెట్ తో తీసినట్టున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చూడకూడదు. పాటలు ఒక్కటి కూడా కనెక్ట్ కావు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు భరతనాట్యం చేయిస్తుందని చెప్పడం కవి హృదయమేమో.  దీన్ని సెన్సార్ ఖండించి, భగతనాట్యం గా పాత్రల చేత పలికించింది.
—సికిందర్

Tuesday, April 26, 2022

సీన్ టెక్నిక్


 
సీనుకి కూడా స్ట్రక్చ వుంటుంది. మొత్తం కథ స్క్రీన్ ప్లేకి బిగినింగ్, మిడిల్, ఎండ్ లెలా వుంటాయో, అలా కథ లోపల సీన్లకీ బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో స్ట్రక్చర్ వుంటుంది. ఈ స్ట్రక్చర్ ని ‘జస్టిస్ చౌదరి’ లో ఎన్టీఆర్ - సత్యనారాయణలు నటించిన ఒక సీన్లో ఎలా వుందో చూద్దాం. సీను ఇలా ప్రారంభమవుతుంది...
        బిగినింగ్ విభాగం:
        చౌదరి : ఎవరు మీరుఎందుకు వచ్చారు? (1)
        పాపారావు : మా అమ్మ ముగ్గురు బిడ్డల్ని కన్నది. పెద్దవాడు ఇప్పుడు మీముందున్న నేను. రెండో వాడు రెండేళ్ళ  క్రితం మీరు లాయర్ గా వున్నప్పుడు మీ చలవ వల్ల ఉరికంబం ఎక్కాడు. మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదురేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను. (2)
          చౌదరి : మిస్టర్ పాపారావ్నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! (3)
          పాపారావు : నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినామీరు నిర్దోషియని తీర్పు చెప్పి...(4)
          చౌదరి :  గెటవుట్! ఐ సే గెటవుట్!! (5) - (ప్లాట్ పాయింట్ వన్, బిగినింగ్ విభాగం సమాప్తం) 
         మిడిల్ విభాగం :
        మళ్ళీ చౌదరి :  నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్!! (6)
          పాపారావు :  మిస్టర్ చౌదరీతొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...(7 )
          చౌదరి : ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి! (8)
          పాపారావు : చూడు మిస్టర్ చౌదరీత్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు! (9) (ప్లాట్ పాయింట్ టూ, మిడిల్ విభాగం సమాప్తం)
      ఎండ్ విభాగం:
        చౌదరి : మిస్టర్ పాపారావ్నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్నౌ గెటవుట్!! (10 )
          పాపారావు : ఆల్ రైట్. (11 )

       ఈ పై సీనుని విశ్లేషిస్తే, ఇందులో మొదటి 5 సంభాషణలు బిగినింగ్తర్వాతి 4 సంభాషణలు మిడిల్మిగిలిన 2 సంభాషణలు ఎండ్ లుగా వున్నాయి.  బిగినింగ్ బిజినెస్ అంటే పాత్రల పరిచయంనేపధ్య వాతావరణంసమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనసమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అని కదా

        బిగినింగ్ లో ఈ  5 సంభాషణలతో ఇవెలా జరిగాయో చూద్దాం. ఈ సీనుకొచ్చేసరికి జస్టిస్ చౌదరి పాత్ర మనకూ పాపారావుకీ తెలిసిందే. పాపారావు తనని చౌదరికి పరిచయం చేసుకున్నాడు రెండో సంభాషణతో. పాత్రల పరిచయాలు ముగిశాయి. నేపధ్య వాతవరణం తెలుస్తూనే వుంది- పాపారావు న్యాయాన్ని కొనడానికొచ్చిన వాతావరణం. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూస్తే - పాపారావు పరిచయ డైలాగులోనే – ‘మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదురేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను’ అనడంతో ప్రారంభమైంది.

        ఈ ప్రారంభం ఇలా కొనసాగింది -  3 వ డైలాగుతో చౌదరి : మిస్టర్ పాపారావ్నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! అని గద్దించడంతో,  4 వ డైలాగుతో పాపారావు -నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినామీరు నిర్దోషియని తీర్పు చెప్పి...  అనడంతో పరిస్థితి తీవ్రమైంది. కేసు విషయంలో పాపారావు ప్రలోభ పెట్టడానికి వచ్చాడని స్పష్టమైంది. ఇలా చౌదరికీపాపారావుకీ మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన 2 వ డైలాగుతో మొదలై4 వ డైలాగుతో ముగిసింది. 

        దీనికి మండిపోయి చౌదరి- గెటవుట్ఐ సే గెటవుట్’  అని 5వ డైలాగు పేల్చడంతో సమస్య ఏర్పాటై పోయిబిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న గోల్ ఏర్పడింది ప్రధాన పాత్రయిన చౌదరికి.

        ఇప్పుడు మిడిల్ చూద్దాం- మిడిల్ అంటే తలెత్తిన సమస్యతో రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్లే కాబట్టిఇక్కడ సమస్యేమిటో చెప్పి గోల్ ఏర్పాటు చేసిన నేపధ్యంలో మిడిల్ ఇలా నడిచింది – 6 వ సీనుతో చౌదరి సమస్యని డీల్ చేసే గోల్ తో అన్నాడు - నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్’  అని. ఇది యాక్షన్ తీసుకోవడం.  

        దీనికి  7 వ డైలాగులో  పాపారావు - మిస్టర్ చౌదరీతొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...  అనడం రియాక్షన్ చూపడం.  

        దీనికి 8 వ డైలాగులో  చౌదరి - ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి  అనడం మరో యాక్షన్ తీసుకోవడం. 

        దీనికి 9 వ డైలాగుతో పాపారావు  - చూడు మిస్టర్ చౌదరీత్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అనడం మరో రియాక్షన్ చూపడం. 

         మిడిల్లో యాక్షన్ రియాక్షన్లు - పోనుపోను సీరియస్ అయి మిడిల్ బిజినెస్ ని కొలిక్కి తెస్తాయి కదాఅలా ఇక్కడ పాపారావు మాటలతో కొలిక్కి వచ్చింది. రావడమే కాకుండా చూడు మిస్టర్ చౌదరీ’ అంటూ అతను ఏకవచన సంబోధనకి మారడం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాడని తెలుపుతోంది. తగ్గివున్న ప్రత్యర్ధి కోరలు చూపిస్తున్నాడు. మొత్తం కథకి స్క్రీన్ ప్లేలో మిడిల్ చివరి సీను ప్రత్యర్ధి చేతిలో వుండాలని రూలు కదాఇదే ఇక్కడ సీనుకీ వర్తిస్తోంది. 

        ప్రధాన పాత్ర చౌదరి వైపు నుంచి చూస్తేఅతను పతనా వస్థకి చేరాడు పాపారావు రియాక్షన్ తోచూడు మిస్టర్ చౌదరీ’ అని జస్టిస్ అయిన తనని అనడం ముమ్మాటికీ తలవొంపే. పైగా త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’ అని తన షరతులు విధిస్తున్నాడు. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అని పరోక్షంగా అల్టిమేటం ఇస్తున్నాడు. 

        ఇంతకంటే దీనావస్థ లేదు చౌదరికి. స్క్రీన్ ప్లే మిడిల్ ముగింపు సీనుతో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడినప్పుడుఅది ప్రధాన పాత్రని పతనావస్థకి చేర్చే సీనుగా వుండాలని రూలు కదా?  ప్లాట్ పాయింట్ వన్ప్లాట్ పాయింట్ టూలు ఎదురెదురు అద్దాలుగానే వుంటాయిగాప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఏర్పడితేప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ గోల్ గల్లంతై కన్పిస్తుంది కదాఇదే కదా పాయింట్ వన్ కీప్లాట్ పాయింట్ టూకీ మధ్య వుండే మిడిల్లో జరిగే యాక్షన్ రియాక్షన్ల బిజినెస్ఇదే ఇక్కడ సీనులో ప్లాట్ పాయింట్ టూకీ వర్తిస్తోంది. ఈ మిడిల్ బిజినెస్ లో జస్టిస్ చౌదరి గోల్, ప్లాంట్ టూ దగ్గర గల్లంతైంది. ప్రత్యర్ధి పాపారావుది పై చేయి అయింది నియమాల ప్రకారం.  

        ఇక ఎండ్ - ఎండ్ అంటే స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింటూలో కుంగి పోయిన స్థితి నుంచి ప్రధాన పాత్ర పైకి లేవడం కదాలేచి దెబ్బ కొట్టడం కదా పట్టు వదలని గోల్ కోసంఎండ్ విభాగంలో ఇక యాక్షన్ రియాక్షన్ల కథనం వుండదు. పైచేయి ప్రధాన పాత్రదేపారిపోవడం ప్రత్యర్ధి పనే. 

        ఈ విధంగా ఇప్పుడు 10 వ డైలాగుతో చౌదరి -  మిస్టర్ పాపారావ్నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్నౌ గెటవుట్ అని పై చేయి సాధించాడు. 
        పాపారావు నోర్మూసుకుని ఆల్ రైట్ అని గెటవుటై పోయాడు.

        ఇదీ సీను స్ట్రక్చర్. మరి సీను ధర్మం పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమోలేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో  అయివుండాలని  కదామరి పై సీనులో ఏది జరిగింది?  మిడిల్ 9 వ డైలాగులో పాపారావు - త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’  అనడం ద్వారా కథని ముందుకి నడిపించే సమాచారమిచ్చారు. చౌదరిని ఎవరో కలుస్తారన్న మాటఎవరుఆ వచ్చే వ్యక్తి అడిగితే చౌదరి నిర్ణయం మార్చుకుంటాడన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు కూడా పాపారావు. ఇలా రాబోయే సీన్లలో ఏం జరగబోతోందన్న సస్పన్స్ ని సృష్టిస్తూకథని ముందుకు నడిపించే సమాచార మిచ్చారు. 
        సీనుకి ఇలా స్ట్రక్చర్ వల్ల అర్ధవంతమైన డ్రామా పుడుతుంది. సీనుకి స్ట్రక్చర్ వల్ల పాత్ర చిత్రణలు సవ్యంగా కూడా వుంటాయి. సీనుకి స్ట్రక్చర్ వల్ల సీక్వెన్సు స్ట్రక్చర్ లో వుంటుంది. సీక్వెన్సులకి స్ట్రక్చర్ వల్ల యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటాయి. యాక్ట్స్ కి స్ట్రక్చర్ వల్ల మొత్తం స్క్రీన్ ప్లేకి బలంగా చేకూరుతుంది. 

        ఇంకో సూక్షం కూడా తెలుసుకోవాలి. అసలు మొట్టమొదట స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ ఎక్కడ పుడుతుంది? కథకి అనుకున్నప్పుడు ఆ అయిడియా దగ్గర పుడుతుంది. ఆ కథ తాలూకు రెండు మూడు వాక్యాల ఐడియాలో బిగినింగ్ మిడిల్ ఎండ్ స్ట్రక్చర్ లేకపోతేఇక దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఆ కథకి సంబంధించిన అయిడియాలో ఎలా బిగినింగ్మిడిల్ఎండ్ విభాగాలుగా కథ కుదురుకుంటుందో, అదే కూర్పు తర్వాత సినాప్సిస్ లోఆ తర్వాత వన్ లైన్ ఆర్డర్లో, ఇంకా తర్వాత వరసగా సీక్వెన్స్ ట్రీట్ మెంట్చివరికి డైలాగ్ వెర్షన్లలో - ఈ ఐదంచెల ప్రక్రియలో ప్రస్ఫుట మవ్వాలి. డైలాగ్ వెర్షన్ అంటే సీన్లు క్రియేట్ చేయడమే. ఈ సీన్లు ఐడియా స్ట్రక్చర్ కి లోబడి అదే స్ట్రక్చర్ లో వున్నప్పుడే తెరమీద స్క్రీన్ ప్లేకి చైతన్యం వస్తుంది. ‘జస్టిస్ చౌదరి’ సీను రహస్యమిదే.

        కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1982 లో విడుదలైన ‘జస్టిస్ చౌదరి’ తారాగణం ఎన్టీఆర్, శ్రీదేవి, శారద, జయంతి, రావుగోపాలరావు, సత్య నారాయణ, అల్లురామలింగయ్య తదితరులు. కథ- సంభాషణలు సత్యానంద్, సంగీతం చక్రవర్తి, ఛాయగ్రాహణం కె. ఎస్. ప్రకాష్, నిర్మాత టి. త్రివిక్రమరావు.  

సికిందర్

(వీడియో ఎడిటింగ్ : విజయ్ కృష్ణ)