ఒకప్పుడు బడ్జెట్ సినిమాలు కాస్త క్వాలిటీతో తీసేవిగా- క్వాలిటీ లేని నాసిరకం ‘బి’ గ్రేడ్ గా తీసేవిగా రెండు రకాలుండేవి. ఇప్పుడు బడ్జెట్ మూవీస్ కి అంతా కలిపి ఒకటే గ్రేడ్ కన్పిస్తోంది - నాసిరకం ‘బి’ గ్రేడ్! ఇందుకే వీటివైపు ఎవరూ కన్నెత్తి చూడ్డం లేదు. రివ్యూలకీ నోచుకోవడం లేదు. బ్యానర్లు కూడా ‘బి’ గ్రేడ్ కిందికి దిగజారిన బడ్జెట్ మూవీస్ నే ఇంకా తీస్తూ నష్టపోతున్నాయంటే రకరకాల కారణాలున్నాయి...హాబీ కోసమో, ఎంజాయ్ మెంటు కోసమో, మీడియాలో ఇమేజి బిల్డప్ కోసమో తీసి నష్టపోతే అది నష్టం కిందికి రాదు. ఇమేజి కోసం పెట్టుబడి కిందికి, జాయ్ రైడ్ జేబు ఖర్చుల కిందికి వస్తుంది. బ్లాక్ తో నష్ట పోతే అది వైట్ కిందికి మారిపోతుంది కనుక ఇది కూడా నష్టం కాదు. ఈ బ్యానర్లు తీసే ఆ ఒక్క ఫ్లాప్ తో వెళ్ళిపోతాయి. వీటి తోబాటు ఆ కొత్త దర్శకులూ ఇంటికెళ్ళి పోతారు. ఇలా కాక సిన్సియర్ గా వ్యాపారం కోసంవచ్చి అవగాహనా రాహిత్యంతో నష్టపోయే బ్యానర్స్ గురించే ఆలోచించాలి. ఓ నాల్గేళ్ళ క్రితం బడ్జెట్ మూవీస్ 60- 70 కి మించేవి కాదు. అవి కూడా ‘బి’ గ్రేడ్ కి దిగజారిన నష్ట జాతకాలే. బడ్జెట్ సినిమాలు చాలా పూర్వం కూడా వుండేవి. వాటి సక్సెస్ రేటు కూడా తక్కువే అయినా సక్సెస్ అయ్యాయంటే పది, ఇరవై రెట్లు లాభాలు తెచ్చి పెట్టేవి.
యాభై లక్షలతో ‘చిత్రం’ తీస్తే 10 కోట్లు, రెండు కోట్లతో ‘నువ్వే కావాలి’ తీస్తే 20 కోట్లు ఎలా వచ్చాయో ఇప్పుడాలోచిస్తే బుర్ర తిరుగుతుంది. ‘ఐతే’, ‘హేపీ డేస్’, ‘జయం’, ‘ఆనంద్’ లాంటివి కూడా మంచి ఆర్ధిక విజయాలు చవి చూసిన బడ్జెట్ మూవీసే.
అప్పట్లో బడ్జెట్ మూవీస్ నుంచి స్టార్లుగా, పోనీ పాపులర్ హీరో హీరోయిన్లుగా ఎదిగి వచ్చిన వాళ్ళుండే వాళ్ళు. ‘అల్లరి’ తో నరేష్, ‘చిత్రం’ తో ఉదయ్ కిరణ్, రీమా సేన్, ‘నువ్వే కావాలి’ తో తరుణ్, రిచా పల్లోడ్, సునీల్, ‘జయం’ తో నితిన్, సదా, గోపీచంద్, ‘ఐతే’ తో శశాంక్, సింధూ తులానీ, ‘ఆనంద్’ తో రాజా, కమలినీ ముఖర్జీ, ‘హేపీ డేస్’ తో తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్ లు...ఇలా లిస్టు థ్రిల్లింగ్ గా వుంటుంది. ఇప్పటి లిస్టులో చూడ్డాని కేమీ వుండదు. ఏ కొత్త హీరో ఎవరో, ఎవరొచ్చి పోతున్నాడో; ఏ కొత్త హీరోయిన్ ఎవరో, ఎవరొచ్చి పోతోందో అంతా ‘బి’ గ్రేడాట మాయ!
ఆనాటి బడ్జెట్ మూవీస్ తో వచ్చి పాపులరైన దర్శకుల్లో తేజ, శేఖర్ కమ్ముల, వీఎన్ ఆదిత్య, చంద్ర శేఖర్ ఏలేటి, విజయభాస్కర్, రవిబాబు లాంటి వాళ్ళు ఎందరో నిలదొక్కుకుని ఆపైన మరిన్ని తీస్తూ పోతే, ఇప్పుడు తీస్తున్న కొత్త దర్శకులందరూ ఆ మొదటి దాంతోనే అదృశ్యమైపోతున్నారు. ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా పేర్లు తెలీనంతగా. \
ఇలా ఓ సక్సెస్ ని గానీ, భావి హీరో హీరోయిన్లని గానీ, భావి దర్శకుల్ని గానీ అందించలేని దైన్యంతో ‘బి’ గ్రేడ్ కి దిగజార్చేశారు బడ్జెట్ మూవీస్ ని!
బడ్జెట్ మూవీస్ ని దేనికీ వుపయోగపడని ‘బి’ గ్రేడాటగా మార్చేశాక, బడ్జెట్లు పెంచెయ్యడం ఇంకో ఫ్యాషన్ గా మారిందిటీవల. కోటితో పోయే ‘బి’ గ్రేడ్ కి గ్రాండ్ గా రెండు కోట్లు, కాస్త ఆడితే తప్ప ఏ శాటిలైట్ హక్కులకీ గ్యారంటీ లేని ‘బి’ గ్రేడ్ కూడా కాని నాసిరకానికి కూడా, రెండూ ప్లస్ పబ్లిసిటీ ఇరవై = రెండూ ఇరవై అని ఫిగర్ చెప్పడం కొందరు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కొత్త దర్శకులకి ఫ్యాషన్ గా మారిపోయింది. వ్యాపారానికి కాక ఇంకోలా వాడుకోవడానికి వచ్చే బ్యానర్లకి ఐదు కోట్లకి గాలం వేసినా వేయాల్సిందే. ఒక కొత్త బ్యానర్ పుత్రరత్నమే హీరో అవాలనే దుగ్ధతో వుంటే, ఆ ‘బి’ గ్రేడ్ బడ్జెట్ ని ఏకంగా ఐదున్నర కోట్ల మెగా బడ్జెట్ కి పెంచేసి దుగ్ధ తీర్చిన కొత్త దర్శకుడు గొప్పోడే. ఎలాటి వాడికి అలాటి వాడే దొరుకుతాడు. అలాగని వున్న నాల్గు వ్యాపారాలకి తోడు ఇదింకో వ్యాపారమని వచ్చే సిన్సియర్ బ్యానర్స్ తో కొత్త దర్శకుడు ఇలా చేస్తే గొప్ప కాదు. అది గొయ్యి తవ్వడం- తనకీ, ఆ సిన్సియర్ బ్యానర్ కీ కూడా. ఇలా ఫ్యాన్సీ బడ్జెట్లు, స్టార్స్ తో అవకాశాలూ అనే పెద్ద కోరికలు పెట్టుకుని ఎక్కడేసిన గొంగళి అవుతున్న వాళ్ళూ లెక్కలేనంత మంది.
కోడి రామకృష్ణ కూడా బడ్జెట్ సినిమాల దర్శకుడుగా ప్రారంభంలో పేరు తెచ్చున్నారు. తక్కువ బడ్జెట్ తో ఆయన తో తీస్తే మంచి లాభాలొస్తాయనే నమ్మకం వుండేది. ఇవ్వాళ పరుగెత్తి పాలు తాగేయడానికి వీలిచ్చేంత సులభ టెక్నాలజీ అందుబాటులో కొచ్చాక, నిలబడి నీళ్ళేందుకు తాగాలనుకుంటున్నారు. ఒకవేళ ఓ బడ్జెట్ సినిమాకి కొత్త దర్శకుడు రూపాయి మీద హీన పక్షం పది పైసలు లాభం తెచ్చి పెట్టినా, మళ్ళీ ఇతర బడ్జెట్ నిర్మాతలకి అందుబాటులో వుంటాడన్న నమ్మకంలేదు. వెళ్ళిపోయి తనకి అందుబాటులో వుండని స్టార్స్ కోసం ప్రయత్నాల్లో వుంటాడు పది పైసల సక్సెస్ తో. ఆ స్టార్సూ దొరకరు, ఎందుకంటే అక్కడ రద్దీ ఎక్కువ. పైగా సీనియర్ దర్శకుల పోటీ. వాళ్ళని దాటుకుని పది పైసల కొత్త సక్సెస్ ఫుల్ దర్శకుడికి అవకాశం రావాలి. ఒకవేళ వచ్చినా వెంటనే ప్రారంభం కాదు. ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేసి వచ్చిన కొత్త దర్శకుడికి ఓ రేంజి స్టార్స్ అవకాశ మివ్వాలన్నా ఏంతో కాలం పడుతుంది.
దీంతో ఎవరైనా కొత్త దర్శకులు సక్సెస్ ఫుల్ బడ్జెట్ సినిమా తీసినప్పటికీ, మళ్ళీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలకి అందుబాటులో వుండడం లేదు. దీంతో ఆ నిర్మాతలు ఇంకో ఫస్ట్ టైం దర్శకుణ్ణి నమ్మి మునిగిపోవాల్సి వస్తోంది. ఒక సక్సెస్ ఇచ్చిన బడ్జెట్ దర్శకుణ్ణి పట్టుకుందామంటే అతను స్టార్స్ వెయిటింగ్ రూములో వెయిట్ చేస్తూంటాడు. అటు స్టార్ తో తీయలేకా, ఇటు ఇంకో బడ్జెట్ నిర్మాతకి ఉపయోగపడకా త్రిశంకు స్వర్గంలో కొట్టు మిట్టాడుతూ వుంటాడు.
చాలా విచిత్రంగా వుంటుంది. ఒక కొత్త దర్శకుడుగా ఒకప్పుడు తను బడ్జెట్ మూవీ అవకాశం కోసం బ్యానర్స్ చుట్టూ తిరిగిన నిరుద్యోగపు రోజుల్ని, పడిన పడిగాపుల్నీ ఎలా మర్చిపోతాడో అర్ధం గాదు. ఇప్పుడు చూస్తే, కొత్త దర్శకుడిగా ఒక బడ్జెట్ మూవీ సక్సెస్ చేసి కూడా స్టార్స్ దగ్గర మళ్ళీ అవే వెయిటింగ్ బాధలు పడుతూంటాడు. అదే నిరుద్యోగం చేస్తూ టైం వృధా చేసుకుంటాడు. దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తను ఒంటరి వాడే. అయినా కనీసం పది మంది నిర్మాతల్ని కలుస్తూంటాడు అవకాశాల కోసం. ఏదో ఒక ఆశ, నల్గురితో సంబంధాలూ వుండి ఊరట లభిస్తుంది. అలా కొత్త దర్శకుడుగా ఒక బడ్జెట్ మూవీ పట్టుకుని సక్సెస్ ఇచ్చాడే అనుకుందాం, ఇక స్టార్ ముంగిట్లో వాలిపోయి మళ్ళీ ఒంటరి వాడైపోతాడు, మళ్ళీ నిరుద్యోగి అయిపోతాడు. తనని దర్శకుణ్ణి చేసిన బడ్జెట్ మూవీ సెగ్మెంట్ ని మర్చిపోతాడు. సక్సెస్ ఇచ్చిన ఇతడి కోసం బడ్జెట్ నిర్మాతలు ప్రయత్నిస్తే స్టార్ దగ్గర కన్పిస్తాడు. పైకెళ్ళి పోయినవాడు మన కెందు కొస్తాడులే అనుకుంటారు బడ్జెట్ నిర్మాతలు. ఇలా చుట్టూ నిర్మాతలతో సంబంధాలు కోల్పోయి, స్టార్ దగ్గర ఎటూ తేలక, ఒంటరి నిరుద్యోగపు వెతలు అనుభవిస్తూ వుంటాడు. కొంతకాలానికి ప్రేక్షకుల జ్ఞాపకాల్లోంచి కూడా చెరిగిపోతాడు.
ఒక బడ్జెట్ మూవీ సక్సెస్ చేసి ఆ సెగ్మెంట్ లో కింగ్ అన్పించుకున్నాక, వేరే కింగులున్న చోటికి ఛోటా కింగుగా ఎందుకెళ్ళాలో అర్ధంగాదు. ఢిల్లీ కింగ్ అన్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ముందు తన రాజ్యంలో తాను పూర్తిగా బలపడకుండా, అప్పుడే పంజాబ్ కీ, గోవాకీ వెళ్లి కంగు తిని- ఢిల్లీ గల్లీలు కూడా పోగొట్టుకున్న పరిస్థితే ఇదీ. సినేరియా మారవచ్చు- పాత్ర ప్రయాణం మాత్రం ఎక్కడైనా ఒకలాగే వుంటుంది- వుండాల్సిన తెలివితో వుండకపోతే. పరుగెత్తి పాలే తాగుదా మనుకుంటున్నారు. అయితే ఇలా ఎంత సేపు తాగుతామనే ఆందోళన కూడా లోలోపల పీకుతూనే వుంటుంది.
ఇలా కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరడంతో, స్టార్స్ తో అవకాశాలు ఆశించడంతో, కొత్త దర్శకుడిగా సక్సెస్ ఇచ్చినా మళ్ళీ బడ్జెట్ సెగ్మెంట్ కి దూరమవడంతో, బడ్జెట్ సినిమాలు ‘బి’ గ్రేడ్ అగ్నిగుండానికి ఆహుతవుతున్నాయి.
2. బడ్జెట్ సినిమాలు భావి హీరోహేరోయిన్లని అందించడం లేదు
3. బడ్జెట్ సినిమాలు భావి దర్శకులని తయారు చేయడం లేదు
4. బడ్జెట్ సినిమాలు ‘బి’ గ్రేడ్ కి దిగజారిపోయాయి.
5. కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరుతున్నారు.
6. కొత్త దర్శకులు స్టార్స్ తో అవకాశాలు ఆశిస్తున్నారు.
7. కొత్త దర్శకులు సక్సెస్ ఇచ్చి బడ్జెట్ నిర్మాతలకి దొరకడం లేదు.
8. కొత్త దర్శకులు బడ్జెట్ సినిమాల్ని ‘బి’ గ్రేడ్ అగ్నిగుండంలో పడేసి పోతున్నారు.
9. కొత్త బ్యానర్స్ వ్యాపారం కోసం రావడం లేదు.
10. కొత్త బ్యానర్స్ వ్యాపారం కోసం వచ్చినా ఏం తీయాలో తెలీడం లేదు.
11. కొత్త బ్యానర్స్ కొత్త దర్శకుల్ని తమ సారధిగా భావించడం లేదు.
12. కొత్త బ్యానర్స్ బడ్జెట్ మూవీస్ ని ‘బి’ గ్రేడ్ కి దించి వెళ్ళిపోతున్నాయి.
అరచేతిలో టెక్నాలజీతో ఉత్సాహపడి నేరుగా బిగ్ కమర్షియల్ కి గాలం వేసుకోవాలంటే నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అంతేగానీ కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్ దొరికినప్పుడు బిగ్ కమర్షియల్ కలల్ని మర్చిపోవడమే కాదు, అసలు చేతిలో వున్న కోటి బడ్జెట్ మూవీని కూడా బిగ్ బడ్జెట్ కొలమానాలతో చూడకూడదు. కానీ ఈ డిసిప్లిన్ ఎవరి కుంటుంది- ఇది ఏ రూల్సూ వర్తించని ఆట కదా! చేతిలో కలానికి వుండనట్టే బడ్జెట్ కీ రూల్స్ లేవు! బిగ్ కమర్షియల్స్ కీ, బడ్జెట్ మూవీస్ కీ దేనికీ – సినిమా అనే కళారూపానికి- అరచేతిలో టెక్నాలజీ అనే తేలిక భావపు మైండ్ సెట్ పనికి రాదని చెప్తే ఎవరు వింటారు? నాటకాల మైండ్ సెట్, సీరియల్స్ ల మైండ్ సెట్ సినిమాలకి పనికి రానట్టే, అరచేతిలో టెక్నాలజీ అల్ట్రా మోడరన్ మైండ్ సెట్ కూడా పనికిరాదు. ప్రపంచం వేగంగా పరిగెడుతున్నట్టే అన్పిస్తుంది, అంతే. మనం నేర్చుకుంటూ వెనకబడి పోతున్నామని అందిన పనిముట్టు అందుకుని ఒకడికంటే ముందుకు పరుగులు తీస్తూంటాం. కానీ ప్రపంచం ఎక్కడా వేగంగా పరిగెట్టడం లేదు.పని గంటలు అవే ఎనిమిది గంటలున్నాయి. భూమి ఇరవై నాలుగ్గంటలే తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. అదేం స్పీడు పెంచుకుని గిర్రున ప్రపంచాన్ని కూడా తిప్పడం లేదు మనం చెలరేగిపోవడానికి. పరిగెట్టాలనుకుంటే ఏమీ నేర్చుకోలేరు, తెలుసుకోలేరు.











.jpg)