రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 14, 2017

      గత వ్యాసంలో స్క్రిప్టు పరంగా బడ్జెట్ మూవీ పరిమితుల్ని తెలుసుకున్నాం. ఇక ప్రొడక్షన్ పరంగా పరిమితుల విషయానికొస్తే కొంత మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. శాస్త్రీయంగా బడ్జెట్ స్క్రిప్టు రాయడం కొత్త కావడం వల్ల  కావచ్చు అర్ధం జేసుకోలేకపోతున్నారు.  స్క్రిప్టుకి ప్రొడక్షన్ పరిమితులు అన్నప్పుడు మొత్తం సినిమాకి అయ్యే ప్రొడక్షన్ వ్యయం అనుకుంటున్నారు. భోజనాల ఖర్చు అదుపులో వుంచాలంటున్నారు.  షూటింగులో  భోజనాల ఖర్చు గురించి కథ రాస్తున్నప్పుడు  ఎలా ఆ లోచిస్తారు? అలాగే డబ్బింగో, డీటీఎస్సో తక్కువకి మాట్లాడుకోవాలంటున్నారు. దీంతో కథకేం సంబంధం?  ఇదే కన్ఫ్యూజను. అంటే హీరోతో ఒక సీను రాస్తున్నప్పుడు, ఈయనకి లంచ్ బ్రేక్ లో పులాస చేప పెట్టొద్దు, కొర్రమీను మాత్రమే పెట్టాలన్న దృష్టితో సీను రాస్తారా?  బయట ఆయన చేసే లంచ్ కీ, కథలో ఆయన సీనుకీ ఏం సంబంధం? కథకావల జరిగేదాంతో కథకేం సంబంధం? కథలో లంచ్ సీను వుంటే అప్పుడు పులాస తింటున్నట్టు రాయాలా వద్దా అని ఆలోచించ వచ్చు. నిరభ్యంతరంగా కథలో హీరో పులాస తింటున్నట్టు రాయవచ్చు- ప్రొడక్షన్ మేనేజర్ కొర్రమీనే తెచ్చిపెట్టినా అది పులాస అన్నట్టే డైలాగులు పలుకుతాయి కాబట్టి చెల్లిపోతుంది. కథలో కాకుండా హీరో బయట పులాస తింటూంటే అది పూర్తిగా నిర్మాత చూసుకునే విషయం. ఇలా కథ  కావల, కథలోపల  తేడాలు గ్రహించకపోతే  బడ్జెట్ స్క్రిప్టులు  రాయబోవడం అనవసరం.        

         
కథలోపల అయ్యే ప్రొడక్షన్ వ్యయాలు కథకి ఎన్ని లొకేషన్లు, ఎన్ని అవుట్ డోర్ సీన్లు, ఎన్ని ఇండోర్ సీన్లు, ఎన్ని ‘డే’ సీన్లు, ఎన్ని నైట్ ఎఫెక్ట్ సీన్లు, ఎన్ని పాటలు, ఎన్ని పోరాటాలు...ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని మాత్రమే  ప్రొడక్షన్ ఫ్రెండ్లీ స్క్రిప్టు రాయాల్సి వుంటుంది. ఒక కథా లోకంలో కథ ఎక్కడెక్కడ (ప్లేస్) ఎప్పుడెప్పుడు (టైం) కొనసాగాలో నియంత్రిస్తూ రాసేదే ప్రొడక్షన్ దృష్టిగల స్క్రిప్టు.

          ప్లేస్ :  సాధ్యమైనంత తక్కువ లొకేషన్స్ నిర్ణయించాలి. ఈ లొకేషన్స్ ఇండోర్ కావొచ్చు, అవుట్  డోర్ కావొచ్చు. లొకేషన్స్ ఎన్ని ఎక్కువైతే అంత రవాణా ఖర్చు, సమయం వృధా అవుతాయి. ఒక బడ్జెట్ స్క్రిప్టులో ఒక ఆఫీసు, ఒక ఇల్లు ప్రధానంగా, ఇంకో రెండు ఇళ్ళు  అనుబంధంగా నిర్ణయించి ఇండోర్ సీన్లు రాశారు. అవుట్ డోర్స్ కి కొన్ని రోడ్లు, ఒక కాలనీ, ఒక డంప్ యార్డు, ఒక పార్కు నిర్ణయించి సీన్లు రాశారు. అమెరికాలో వుంటున్న హీరోయిన్ సీన్లకి అమెరికా చూపించనవసరం లేకుండా అపార్ట్ మెంట్ లో ఇండోర్ సీన్స్ మాత్రమే రాశారు. ఒక ఎస్సై పాత్రకోసం పోలీస్ స్టేషన్లో సీన్లు రాయకుండా, ఎస్సై –హీరోల మధ్య జనసమ్మర్ధం లేని రోడ్డు మీదే జరిగే సీన్లు రాశారు. బిజినెస్ చేసే పాత్రకి  అట్టహాసంగా ఆఫీసు లేకుండా, కూలిపోయేట్టున్న  పాత బిల్డింగు పెట్టుకుని దానిమీద జోకులతో కవర్ అయ్యేట్టు సీన్లు రాశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించేందుకు క్రియేటివ్ ఆలోచనలతో ఇలా సీన్లు రాయాల్సి వుంటుంది.  ప్రొడక్షన్లో సృజనాత్మకత అంటే ఇదే. రైటర్స్ చాలా మందే వుంటారు- ప్రొడక్షన్ ఫ్రెండ్లీ రైటర్లు కావాలి ఈ కాలంలో. ఇక తప్పని సరై  కాఫీ షాప్, రెస్టారెంట్, బార్ లలో ఒక్కో ఇండోర్ సీను నడిపారు. ఇవికూడా పేజీన్నర లోపే. 

          సీన్లు రాసే రచయిత చిత్రీకరణలో ఎప్పటి కప్పుడు అభివృద్ధి చెందుతున్నటెక్నాలజీ మీద కూడా కన్నేసి వుంచాలి. ఇదివరకు అవుట్ డోర్  సీన్లు రాయాలంటే బడ్జెట్ కి భయపడే వాళ్ళేమో  గానీ ఇప్పుడవసరం లేదు. ఓస్మోలాంటి  అత్యాధునిక కెమెరా లొచ్చాక  బడ్జెట్ మూవీస్ కి శృంఖలాలు తొలగిపోయాయి. యదేచ్ఛగా అవుట్ డోర్ సీన్లు రాసుకోవచ్చు. ట్రాఫిక్  లో కూడా రాసుకోవచ్చు. పాత్రలు  నడుచుకుంటూ, వాహనాల్లో  పోతూ మాట్లాడుకునే సీన్లు కూడా రాసుకోవచ్చు.  ఇవన్నీ ఓస్మో తో గెరిల్లా స్టయిల్ షూట్ తో తీయవచ్చు. 

          కొన్ని రద్దీ ప్రాంతాల్లో, కొన్ని లొకేషన్ ఫీజులు అధికంగా వుండే ఖరీదైన ప్రాంతాల్లో ఒస్మో తో గెరిల్లా షూట్ చేసుకు రావచ్చు. గెరిల్లా షూట్ తో  ఏఏ సీన్లు రాయ వచ్చో తెలుసుకోవాలంటే  ప్రొడక్షన్ ఫ్రెండ్లీ   రైటర్లు తమ దగ్గర  ‘ది గెరిల్లా ఫిలిం మేకర్స్ హేండ్ బుక్’ ని తప్పనిసరిగా వుంచుకోవాల్సిందే. ప్రధానంగా  ఓస్మో అనేది  యాక్షన్ కెమెరా. అలాగని ఇండోర్ లో టాకీ పార్టులు తీయలేరని కాదు. అన్నీ తీసుకోవచ్చు. 

       ఐతే ఓస్మో పట్టుకుని  గెరిల్లా  షూట్ తో ఏదైనా తీయవచ్చనుకుంటూ అవుట్ డోర్ లొకేషన్స్ ఎడాపెడా రాసేస్తే యూనిట్ తరలింపు ఖర్చులు, షూటింగ్ దినాలూ పెరిగిపోయి సగంలోనే బడ్జెట్ నిల్  అవుతుంది. బడ్జెట్ మూవీ కి అద్భుతమన్పించే ఓ మూడు అవుట్ డోర్ లొకేషన్స్ లో పొదుపుగా సీన్లు రాసుకుంటే సరిపోతుంది. 

          ఇక ఓ విలేజిలో జరిగే కథ రాసుకుంటే- బడ్జెట్ పెరుగుతుంది. నటీనటులు, యూనిట్ అందరూ అక్కడే వెళ్లి బసచేయాల్సిన పరిస్థితి వుంటుంది. యూనిట్ కి  డబుల్ బత్తాలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వీలైనన్ని  తక్కువ పాత్రలతో, వీలైనన్ని తక్కువ లొకేషన్స్ లో వేగంగా షూటింగ్ ముగించే కథ రాసుకోవాలి.  

          విలేజితో బడ్జెట్ స్క్రిప్టుకి చాలా పనుంటుంది. ప్రతీ గ్రామానికీ ఒక వ్యక్తిత్వం వుంటుంది, జీవితం వుంటుంది. వీటిని తప్పనిసరిగా కథలో  భాగం చేయాలి. విలేజి బ్యాక్ డ్రాప్ లో బడ్జెట్ మూవీ రాసేటప్పుడు విధిగా వూళ్ళు తిరిగి కథకి తగ్గ విలేజిని ఎంపిక చేసుకోవాలి. అక్కడి లొకేషన్స్ వీడియోలు తీసుకోవాలి. అక్కడి ప్రజల్ని, వాతావరణాన్ని, జీవన రీతుల్నీ చిత్రీకరించుకుని రావాలి.  ప్రతీ గ్రామానికి కొన్ని లాండ్ మార్క్ స్థలాలుంటాయి. వాటిని గుర్తించాలి. ఇంకా అవసరమైన రీసెర్చి అంతా చేసుకుని,  కథకి నప్పే ఐదారు లొకేషన్స్ ని మార్క్ చేసుకుని వాటి ప్రకారం కథ నడపాలి. 

          లాండ్ మార్క్ స్థలాలతో ప్రత్యేక శ్రద్ధ వహించి, వ్యూహాత్మకంగా  సీన్లు రాయాలి. ఏ సీను పడితే ఆ సీను ల్యాండ్ మార్క్ స్థలాల్లో పెట్టి రాయకూడదు. వాటి విలువ పోతుంది. లాండ్ మార్క్ స్థలాల  విజువల్ అప్పీల్ ని ఉన్నతీ కరించాలంటే  కేవలం థీమ్ ని ద్విగుణీకృతం చేసే కీలక సన్నివేశాలే అక్కడ పెట్టి రాయాలి. పతాక సన్నివేశాలు కూడా రాయవచ్చు. వేరే సీన్లు తీస్తున్నప్పుడు  ఈ ల్యాండ్ మార్క్ స్థలాలు వ్యూలో లేకుండా చూసుకోవాలని నోట్ రాయాలి.  ల్యాండ్ మార్క్ స్థలాల్ని  ఎంత తక్కువ చూపిస్తే అంత ఉన్నతంగా వుంటుంది బడ్జెట్ మూవీ.

          ఏదో విలేజికి వెళ్లాం, షెడ్యూల్ ముగించు కొచ్చాం అన్నట్టుగాక- విలేజియే కథ- కథే విలేజి అన్నట్టుగా క్రియేట్ చేయగల సత్తా వుంటే,  ఆ విలేజిలు టూరిస్టు స్పాట్స్ కాకుండా పోవు! బడ్జెట్ మూవీ మరింత పాపులర్ అవకుండా పోదు! 

          మలయాళంలో ‘ప్రేమమ్’ ఈ పనే చేసింది. కేరళలోని అలవప్పుళ  గ్రామ అందచందాల్ని అది చూపించిన తీరుకి కాలేజీ స్టూడెంట్స్ ఫిదా అయిపోయారు. పొలోమని అక్కడికి వరసకట్టి, ఆ సినిమాలో హీరోయిన్ ని చూసి హీరో ప్రేమలో పడే  లొకేషన్ ని టూరిస్ట్ స్పాట్ గా చేసి పడేశారు. వర్ధమాన సినిమా రచయితలూ ఆ వూరికెళ్ళి ఇన్స్ పిరేషన్ కోసం విహరించడం మొదలెట్టారు. 

          ‘అనార్కలీ’ అనే మరో మలయాళ మూవీలో లక్షద్వీప్ లొకేషన్స్ ని చిత్రీకరించిన తీరుకి మలయాళీలు అక్కడికి విహారయాత్రలు మొదలెట్టారు. ఇంకో మలయాళ మూవీ ‘ఎన్ను నింతే మొయిదీన్’ విడుదలకి ముందు కేరళలోని ముక్కం అనే గ్రామం పెద్దగా ఎవరికీ తెలీదు.  సినిమా విడుదలయ్యాక అదొక ప్రేమికుల యాత్రా స్థలమైపోయింది. సినిమాలో పాత్రలైన ‘మొయిదీన్- కాంచన మాల’ లు జీవించిన ఆ  గ్రామానికి  వెళ్ళని ప్రేమికుల్లేరు. ఒక హాస్టల్ విద్యార్థినులంతా ఆ వూళ్ళో ‘కాంచనమాల’ ని చూడ్డానికి ప్రయాణం కట్టారు. ఆ వూళ్ళో ‘కాంచనమాల’  ఇల్లు, ‘మొయిదీన్; ఇల్లూ టూరిస్టు స్పాట్స్ గా మారిపోయాయి.

          బడ్జెట్ మూవీస్ లో  స్థలాలు పాత్రలు ఎంతగా ముద్ర వేయగలవో  పై సందర్భాలే తార్కాణాలు. కాబట్టి విలేజీని ఒక పాత్రగా  చేసి ప్రతిష్టించేలా సీన్లు రాయాలి. వ్యూహాత్మక స్క్రిప్టు రచనతోనే  బడ్జెట్ మూవీ  బడ్జెట్ లో వుంటూకూడా  నల్గురి నోళ్ళల్లో నానుతుందని తెలుసుకోవాలి. 

          బడ్జెట్ మూవీకి బ్యాంకాక్ లో కథ పెట్టి రాయనవసరం లేదు. విదేశీ షూటింగులే అవసరం లేదు. బ్యాంకాక్ ని చూడ్డానికి ప్రేక్షకులు బడ్జెట్ మూవీస్ కి రారు. సినిమాల్లో మిస్సైపోతున్న కథ కోసం బడ్జెట్ మూవీస్ కి వస్తారు ప్రేక్షకులు.
***
          టైం : డే టైం, నైట్ టైం లలో డే టైంతో ఇబ్బంది ఎప్పుడూ లేదు. నైట్ టైంతో అవుట్ డోర్ లోనే ఇదివరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమమని  జంకే వాళ్ళు.  అందుకని వీలైనంత బయటి నైట్ సీన్లు తగ్గించి, ఇండోర్ నైట్  సీన్స్ పెట్టుకునే వాళ్ళు. ఒస్మో కెమెరాతో ఈ పరిమితులు తొలిగాయి. బయట నైట్ సీన్స్ పెట్టి రాసుకోవచ్చు. ఒస్మో తో చిత్రీకరణకి యూనిట్, జనరేటర్ వగైరా హంగామా అక్కర్లేదు. స్ట్రీట్ లైట్లతోనే పనికానిచ్చేయొచ్చు. ట్రాఫిక్ లో కూడా పెట్టి సీన్లు రాయవచ్చు. కావలసినన్ని నగర దృశ్యాలు నైట్ లో పెట్టి రాసుకోవచ్చు. ఐతే రాయకూడదు. ఎందుకంటే, అన్నేసి లొకేషన్స్ కి రవాణా, పనిదినాలూ పెరిగిపోతాయి. డబుల్ బత్తాలు కూడా మీద పడతాయి. 

          ఇక ఆరుబయట వెన్నెల్లో హాయిగా చందమామని  చూస్తూ హీరో హీరోయిన్లు సరస సంభాషణ  చేస్తున్నారని అద్భుత దృశ్య కావ్యం ముచ్చటపడి సృష్టించబోతే,  బడ్జెట్ అంతా సీజీ సఫా చేసేస్తుంది. బడ్జెట్ మూవీ కి సీజీ అవసరపడే ఒక్క సీను కూడా రాయకూడదు. అలాగే వర్షం సీన్లు కూడా రాయకూడదు. బయట వర్షం పడుతున్నట్టు కిటికీ అద్దం మీద నీళ్ళు  పడుతున్న ఎఫెక్ట్స్ అయితే ఫర్వాలేదు.
***
      ఇక పాటలు ఖర్చుతో కూడుకున్న పని. బడ్జెట్ మూవీకి ఆరేసి పాటలు ఇప్పుడెవరూ పెట్టడం లేదు. నాల్గుకూడా ఎక్కువే. పాటలకి డాన్సులు ఇప్పుడు పెట్టడం లేదు. మాంటేజ్ సాంగ్సే వుంటున్నాయి. డాన్సులుండే  పాటలతో రైటర్ కి సంబంధం లేదుగానీ, మాంటేజెస్ పాటలకి బిట్ సీన్లు రాయాల్సి వుంటుంది. ఒక్కోసారి ఈ మాంటేజ్ సాంగ్స్ కథని నడిపిస్తూ వుంటాయి. ఈ మాంటేజెస్ లో సాధ్యమైనంత   భావుకత  ఉట్టిపడేలా రాస్తే మంచిది. అంటే  డాన్సుల్లో వుండే భావుకతని  మాంటేజెస్ లో సీన్ల రూపంలో భర్తీ చేయడమన్నమాట.  పాటల్ని కవులు భావుకతతో రాస్తారు. ఇవి డాన్సు పాటలైతే రైటర్ తప్పించుకుంటాడు. నృత్యదర్శకుడు దాని భావుకత సంగతి చూసుకుంటాడు. కానీ కవి మాంటేజ్ సాంగ్ రాస్తే రైటర్ తప్పించుకోలేడు, అంతే భావుకత ఉట్టిపడే మాంటేజెస్ రాయాల్సిందే. ఐతే ఈ భావుకతని పదేసి రోజులు తీసేట్టు కాకుండా, రెండు కాల్షీట్లతో ముగించేలా రాయాలి.

          యాక్షన్ దృశ్యాల కొస్తే ఫైట్ మాస్టర్ తో ఇవి తప్పనిసరిగా బడ్జెట్ ని కోరుతాయి. ఒక కామెడీ కథలో ఛేజ్ సీన్ తీయాలన్నా అది ఫైట్ మాస్టర్ బరి. ఫైట్లు తీయాలన్నా ఇంతే. ఏది తీయాలన్నా, పేల్చివేతలు, సీజీ, వైర్ వర్క్ లాంటివి వూహిస్తూ సీన్లు రాయకూడదు. వాచిపోతుంది. ఒక బడ్జెట్ స్క్రిప్టులో క్లయిమాక్స్ ని  కేవలం విలన్ హీరోల పరుగులతోనే రాశారు. పరుగెత్తుకుని పారిపోతున్న విలన్ని పరుగెత్తీ పరుగెత్తీ పట్టుకుని గాయపర్చే  ఎనిమిది నిమిషాల సీనుని థ్రిల్లింగ్ గా రాశారు. కూటి కోసం కోటి విద్యలంటే ఇదే.

          బడ్జెట్ లో యాక్షన్ మూవీ రాయాలంటే, బిగ్ యాక్షన్ అంతా క్లయిమాక్స్ కి సేవ్ చేసుకుని, మిగిలిన సీన్లు డ్రామాతో, సస్పెన్స్ తో, టెంపోతో బలంగా నడపాలి. వీటిలో యాక్షన్ సీన్స్ పెట్టి బడ్జెట్ ఖర్చు చేసేస్తే క్లయిమాక్స్ కి పెద్దగా ఏమీ డబ్బులు మిగలకపోవచ్చు. కాబట్టి యాక్షన్ బడ్జెట్ అంతా  ఒకేసారి క్లయిమాక్స్ లో ఖర్చు అయ్యేలా, ప్రేక్షకులు వూహించని విధంగా భారీ ఎత్తున పేల్చివేతలూ, కాల్చివేతలతో బ్లాస్ట్ చేస్తూ సీన్లు రాసి  వదలితే, అల్లు అర్జున్ క్లయిమాక్స్ చూసినట్టు దూల తీరిపోతుంది. పైసా వసూల్ ఫీలింగుతో వెళ్ళిపోతారు. బడ్జెట్ మూవీకి వ్యూహాత్మక రైటింగే దిక్కు. 

          కేవలం 10 వేల  డాలర్లతో తీసిన రష్యన్ యాక్షన్ మూవీ ‘బ్రదర్స్’ (వసూళ్లు 20 వేల డాలర్లు), 7 వేల డాలర్లతో తీసిన అమెరికన్ యాక్షన్ మూవీ ‘ఎల్ మిరియాచీ’ (వసూళ్లు రెండు మిలియన్ డాలర్లు), 23 వేల డాలర్లతో తీసిన అమెరికన్ కామెడీ ‘స్లాకర్’ (వసూళ్లు మిలియన్ డాలర్లు),  27 వేల డాలర్లతో తీసిన అమెరికన్ బ్లాక్ కామెడీ ‘క్లర్క్స్’ (వసూళ్లు మూడు మిలయన్ డాలర్లు) వంటివి చూస్తే ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ మూవీస్ రాయడానికి అవగాహన ఏర్పడుతుంది.
***
           బడ్జెట్ మూవీకి ప్రొడక్షన్ డిజైన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని సీన్లు రాయాల్సి వుంటుంది. ఉన్న బడ్జెట్ తో కళ్ళు చెదిరే సెట్స్ వేసి అద్భుత దృశ్య వైభావాల్ని సృష్టించలేరు కాబట్టి, ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా అవసరం.  ఒక సీన్ని దట్టంగా వున్న పూలమొక్కల మధ్య పెట్టి రాసినప్పుడు విజువల్స్ రిచ్ గా వుంటాయి.  ఒక సీన్ని చెరువు హైలైట్ అయ్యేలా చేసి రాస్తే  థ్రిల్ చేస్తుంది. ఒక సీన్ని వీధిలో నడుస్తున్న మనుషుల కాళ్ళని మాత్రమే చూపిస్తూ సంభాషణలు రాస్తే , ఈ మూవ్ మెంట్స్ దృష్టి నాకర్షించి మిగతా డ్రై నెస్ ని మర్చిపోతారు ప్రేక్షకులు. చిత్రీకరణలో బడ్జెట్ మూవీస్ ని వెంటాడేది డ్రైనెస్సే. దీన్ని కవర్ చేస్తూ సీన్లు రాయాలి. ఎక్కువగా ఈ డ్రై నెస్ ని పాత్రల కదలికల మీదికి దృష్టి మళ్లిస్తూ కవర్ చేయాలి. ఇండోర్స్ లో  అన్ని గదుల్లో పెట్టి సీన్లు రాయకుండా, ఒకే డ్రాయింగు రూంలో  పెట్టి అందరూ అక్కడే కూడి మాట్లాడుకుంటున్నట్టు రాస్తే, సీనుకి విజువల్ రిచ్ నెస్ ని తీసుకు రావొచ్చు. ఎలాగంటే, ఇతర గదుల్లో కళాదర్శకత్వం పనీ, ఖర్చూ తప్పి- అదంతా డ్రాయింగు రూంకి బదలాయింపు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో విశాల మైన హాళ్ళల్లో సీన్లు రాయకూడదు. ఏ సీను రాసిణా  విజువల్ గా ఇది లో- బడ్జెట్ మూవీ అన్న ఫీల్ రాకుండా చూసుకోవాలి.  
***
          
‘పెళ్లి చూపులు’ బడ్జెట్ చిత్రం
     రైటర్ చేయగల్గేది స్క్రిప్టు పరంగా, ప్రొడక్షన్ పరంగా  ఆదా మాత్రమే. బయటి ఖర్చులతో అతడికి సంబంధం లేదు. పారితోషికాలు, షూటింగు, ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ ఆర్, డీటీఎస్, ఎఫెక్ట్స్, డీఐ మొదలైన వాటిలో పొదుపు చేసుకోవాల్సింది దర్శకుడే. 

       కోటి రూపాయల బడ్జెట్ మూవీ అనుకుని స్క్రిప్టుని ఎంత అదుపులో పెట్టుకుని రాసినా,  బయటి ఖర్చులు అదుపు తప్పి కోటిన్నరకి పోవచ్చు. ఇది మేకింగ్ ప్లానింగ్ ని బట్టి వుంటుంది. ఎంతగా  మేకింగ్ ని ప్లాన్ చేసినా ఏంతో  కొంత అనుకున్న దానికి బడ్జెట్ పెరగక మానదు. ఈ పెరుగుదల పెచ్చు మీరకుండా చూసుకున్నప్పుడే బడ్జెట్ మూవీని విజయవంతంగా నిర్మించినట్టు. 


      ‘పెళ్లి చూపులు’  మొదట అనుకున్న బడ్జెట్ 64 లక్షలు. పూర్తయ్యేసరికి 73.5  లక్షలకి వెళ్ళింది. అంటే 14.84 శాతం పెరిగిందన్న మాట. ఇది  50 కోట్లు వసూలు చేసింది. కాబట్టి బడ్జెట్లో  పెరుగుదల  లెక్కలోకి రాదు. కానీ అన్ని బడ్జెట్ మూవీస్ ఈ స్థాయిలో వసూళ్లు సాధించవు. బడ్జెట్ మూవీస్ కి వున్న ఇంకో దురదృష్టం ఏమిటంటే వీటికి ఓవర్ సీస్ బిజినెస్ వుండదు. ‘పెళ్లి చూపులు’,  ‘క్షణం’ లాంటివి క్వాలిటీతో వున్నబడ్జెట్ మూవీస్ మాత్రమే  విదేశాల్లో ఆడతాయి. ఈ రకంగా అసంఖ్యాక  బడ్జెట్ మూవీస్ ఈ గ్లోబల్ యుగంలో తెలుగు రాష్ట్రాలు దాటి ప్రపంచ మొహం చూడ్డం  లేదు. బడ్జెట్ మూవీస్ కోతి వేషాలేయడం వల్లే ఈ దుస్థితి. బడ్జెట్ మూవీస్ అంటే జీవితం. బిగ్ కమర్షియల్స్  జీవితాలకి భిన్నం. రెండూ భిన్న ధృవాలు. ఇవి వేటికవి విడి విడిగా వుండాలే గానీ, జీవితంలగా బిగ్ కమర్షియల్స్ వుండకూడదు, జీవితాలకి భిన్నంగా బడ్జెట్ మూవీస్ వుండకూడదు. వుంటే రెండూ అట్టర్ ఫ్లాపే!


                                                     (ఐపోయింది)
with inputs from :
Ghanshyam Sadashiv
K. Trinadh
J. Durga Swamy
PVT. Raju
-సికిందర్